మా రచయితలు

రచయిత పేరు:    పద్మావతి రాంభక్త

కవితలు

పచ్చని చెట్టులా

నెత్తురోడుతున్న మొక్కకు

పూసిన ఎర్రని గాయంలా

 ఉంటుందామె

దిగులు మబ్బేసిన ఆకాశానికి

వేళ్ళాడే గుబులు మేఘంలా

ఉంటుందామె

తుపాను కమ్మేసిన కడలిలో

చిక్కిన విరిగిన పడవలా

ఉంటుందామె

ఉప్పెన ఊడ్చేసిన పంటపొలంలో

కొనఊపిరితో మిగిలిన

వరికంకిలా ఉంటుందామె

ఎలా ఉన్నా

ఎన్ని కల్లోలాలను 

సంక్షోభాలను మోస్తున్నా

తన పసిప్రమిదలలో

 వెలుగును నింపడానికై

ధైర్యపునీరు తాగుతూ

పిట్టలు వాలిన 

పచ్చని చెట్టులా నిలబడుతుందామె

.....................................

 

మొక్కను చూస్తే

ఒంటినిండా పూలతనంతో తుళ్ళిపడుతూ 

నవ్వుతున్న మొక్కను చూస్తే

లోపల కట్టుకున్న

దిగులుగూడు చెదిరిపోతుంది

లేలేతకొమ్మను 

తన బలమైన చేతులతో 

విరిచేసే గాలి శ్వాస నిండా

ప్రేమగానే పరిమళాలను ఒంపే మొక్క

మౌనంగా పాఠమేదో చెప్తున్నట్టే కనిపిస్తుంది

నిత్యం చీడపీడలతో తలపడుతూ

తలవంచక ఆకాశాన్నంటడానికి

అర్రులు చాచే మొక్కను చూస్తే

ఆశావాదాన్ని బోధించే

గురువులా అగుపిస్తుంది

వేవేల శిశిరాలు తాకిడికి

దుఃఖసముద్రంలో మునగకుండా

రాల్చుకున్న ఆకులను లెక్కగట్టకుండా

ఎప్పుడూ వసంతాలనే కలగంటూ

తనువంతా రంగుల నదులను

 ప్రవహింపజేసే మొక్క

ఎంతో ముచ్చటగొలుపుతుంది

వాననీటిలో తలారా స్నానించి

మురికిని వదిలించుకున్న మొక్కను ఊహిస్తే

మనసుకంటిన మలినాలను

ఎప్పుడు కడిగేసుకుంటావూ

అనే  ప్రశ్నను సంధించినట్టే

అనిపిస్తుంది

ఉదయాన్నే పచ్చగా కళకళలాడే మొక్కను

 కనుల  నిండా నింపుకుంటే

గంపెడు హరితాన్ని అద్దుకుని

రోజంతా హృదయంలో

అఖంతతేజస్సుతో ప్రాణదీపం

 వెలుగుతూనే  ఉంటుంది

 

 

ఆ ఇల్లు

అమ్మ నాకు చేదు నచ్చదని
మాటలన్నీ తేనెలో ముంచి
తియ్యగా అందించేది

కాళ్ళు నొప్పెడతాయని
భుజాల పల్లకి ఎక్కించి
ఊరేగించేవారు నాన్న

నా కళ్ళలో కాస్త నీరొస్తే
వారి కనులు జలపాతాలయి
కిందకు దూకేవి

నేను సీతాకోకై ఇల్లంతా
కలదిరుగుతుంటే
ఆ రంగులన్నీ గుండెలకద్దుకుని
కేరింతలు కొట్టేవారు

నా రెక్కలకు స్వేచ్ఛనిచ్చి
పావురంలా ఎగరేస్తూ
ముద్దు చేసి మురిసి పోయేవారు

నాకు నలతగా ఉంటే
కలత దుప్పటి చుట్టేసుకుని
నీరసపడి నలిగిపోయేవారు

చదువు సంధ్యలతో పాటు
చక్కని వ్యక్తిత్వాన్ని అందించి
ఆనందపుటంచులు తాకి
తెగ పొంగిపోయారు

నన్నొక ఆశాదీపాన్ని చేసి
ఇల్లంతా వెలిగించి మైమరచిపోయారు

కానీ ఇక్కడంతా
చీకటి చేదుతో నిండిపోయి
మనసంతా
ముళ్ళగాయాలతో రక్తమోడుతూ
బాధతో ప్రవహిస్తున్నా
ఇక అదే నీ ఇల్లంటూ
నిర్దయగా
వదలి పోయారెందుకు? 

యంత్రస్పర్శ

యంత్రస్పర్శ

పెదవులకు తాళాలు బిగించి

తాళంచెవులను

జేబులో వేసుకుని పారిపోతోంది

అటు చూడకండి

చూసినా చూసీ చూడనట్టే

మీ చీకటిగుహలలో దూరి

ముసుగుతన్ని గుర్రుపెట్టండి

పసిపిల్లాడి చేతులలో

పాలసీసా లాగేసి

నోటి నిండా

అర్జంటుగా టెక్నాలజీని కుక్కండి

లేకపోతే వాడు రేప్పొద్దున్న

 నదినీ ఈదలేడు

అయ్యో అలా వెనకపడి ఉన్నారేమిటి

అందరినీ అనుసరిస్తూ

పరుగుపందెంలో పాల్గొని

ప్రపంచపు అంచులపై

అడుగిడాలని లేదూ

అదేమిటి

చెట్టునూ కొమ్మలపై పిట్టలనూ

అమాయకత్వంతో 

తదేకంగా చూస్తున్నారు

అరచేతిలోని జానెడు గాజుపలకకు

చూపులను వేళ్ళాడదీసి

మునివేళ్ళతో ప్రయాణించి

తడిలేని తీరాలని

తాకాలని లేదూ

సముద్రాలూ నదులూ

పర్వతాలూ ఆకాశాలూ

అన్నిటినీ మీ గుప్పెట్లో బంధించి

లోకాన్ని జయిస్తూ

మురవాలి కదా

మీరింకా

పాతచింతకాయ పచ్చడిలా మిగిలితే

ఆదిమానవుడంటూ

వింత జంతువంటూ

జూలో బంధించేస్తారు జాగ్రత్త

మీలోని పూలతనాన్ని

మనిషితనాన్ని పాతేసి

త్వరగా మరబొమ్మ బట్టలు తొడుక్కుని

కన్నీళ్ళకూ ఆనందభాష్పాలకూ

ఒకే కవళికలను

ముఖమంతా పౌడరులా పూసుకోండి

నరనరాలలో రక్తాన్ని తోడేసి

సిగ్నళ్ళూ ఫైవ్ జీ లూ

సెలైన్ లా ఎక్కించుకోండి

మీరు పూర్తిగా

యంత్రస్పర్శతో వికసించాకే

మీకిక్కడ మనుగడ దొరుకుతుంది

మీ జీవితం

లేటెస్ట్ గా మెరుస్తుంది


 


 

 

 

ఆమెను చూసావా

నువ్వు ఉదయాన్నే పచ్చి శ్వాసకై

సముద్రపు ఒడ్డుకు వెళ్ళి ఉంటావు

 

రెక్కలు విప్పి హాయిగా 

నింగిలో గిరికీలు కొడుతున్న పక్షులు

కనపడ్డాయా నీకు

 

బంధించిన గదుల నుండి

బయటపడ్డాననుకుంటూ 

నీకున్న స్వేచ్ఛనే

మరింతగా  రుచి చూద్దామనే

ఆరాటం నీది

 

ఒకసారి చెవినొగ్గి విను

సముద్రం ఘోషిస్తూ 

తనదైన భాషలో

నీతో ఒంటరిగా

సంభాషించాలనుకుంటుంది

 

తన లోపల గుట్టుగా

దాచిన రహస్యాలను

నీకు చూపాలని

ఎంతో ఆరాటపడుతుంది

 

ఎన్నాళ్ళుగానో  

లోపల పోటెత్తుత్తున్న సునామీలతో

పోరాడిన వైనం

నీకు వివరించాలనుకునే

తపన తనది

 

ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతూ

నీకు చేరువవాలనే ప్రయత్నంలో

తలమునకలౌతున్న తనని చూస్తే

నీకు ఏమనిపిస్తోంది

 

తనపై నుండి తేలివచ్చే గాలి

తనలోని తడిని తెచ్చి

నీకు పూస్తోంది

గమనించావా అసలు

 

హోరున నవ్వుతున్నట్టే

అగుపిస్తున్న సముద్రం

నీటి చేతులతో

తీరంపై ఏదో దుఃఖలిపిని రచిస్తూ

మళ్ళీ తనే తుడిపేస్తోంది 

 

అలలను ఒకమారైనా

నువ్వు తిరగేసి ఉంటే

నీకు తెలియని కథ

వివరించి ఉండేది

 

నువ్వు ఒడ్డు వరకూ

వెళ్ళినట్టే వెళ్ళి

కనీసం కాళ్ళు తడుపుకోకుండా

వచ్చేయడం చూసి

నీకు బాగా దగ్గరకు

వచ్చేసిన సముద్రం

ఒక్కసారిగా వెనక్కి మళ్ళిపోయింది

 

నిరాశతో గుంభనంగా బిడియంగా

తనలోకి తాను

నీటిపువ్వులా ముడుచుకుపోయింది

 

ఒక్క క్షణమాగి

నువ్వు సరిగ్గా దృష్టి సారించి ఉంటే

సముద్రపు ముఖంలో

ఆమెను తప్పక

స్పష్టంగా చూసి ఉండేవాడివి

కెరటాల పుటలు తిప్పుతూ

ఆమె మనసును కాస్తైనా

తెలుసుకునే వాడివి కదా

 

 

 

ఈ సంచికలో...                     

Jan 2022

ఇతర పత్రికలు