మా రచయితలు

రచయిత పేరు:    వంగల సంతోష్

కవితలు

ఇప్పుడు కాసింత మనోధైర్యం కావాలి

ఎప్పుడు

ఎక్కడ

ఏం జరుగుతుందో

అర్థం కాని పాడు కాలం వచ్చింది.

 

ఎవరిని

ఎలా

కోల్పోవాల్సి వస్తుందో

తెలియని స్థితి నెలకొంది.

 

ఇప్పుడు

మనసుకు కొంత  హాయి

ప్రశాంతత

మనో ధైర్యం కావాలి.

****

మనుషిని మనిషి

కలవలేని రోజులొచ్చిన

మనసుకు కాసింత

మనోధైర్యం చెప్పే

మానవత్వం ఉన్న

మనిషితనం కావాలి

*****

ఇప్పుడు కాసింత

మనోధైర్యం కావాలి

 

అమ్మలా

లాలించె

ఆప్యాయత

 

నాన్నలా

వెన్నుతట్టి లేపే

ధైర్యం

 

స్నేహితులా

ఏదైనా

కడ దాకా

తోడుంటామని

చెప్పేవాళ్ళు  కావాలి.

 

స్వస్థత సాధించడానికి

ఏలికలకు కనువిప్పు కలిగించే

కదణరంగం ఒకటి నిర్మాణమై ఉండాలి.

 

(కరోనా రేపిన కల్లోలంలో మనుషులకు కాసింత మనోధైర్యం కావాలని వారికి అండగా ఉన్నదామని.....)

కొడుకా...

కొడుకా...

ఎట్లున్నవో.

మీ అమ్మ

కంటికి పుట్టెడు దారలు కారుతున్నాయి

నీ జాడ కోసం.

 

కొడుకా.. ఓ కొడుకా

కండ్లల్ల నీరూపే మెదులుతుంది

కాళ్ళల్ల చేతుల్లో తిరిగినట్లున్నది

చాత కానీ ముసలి దాన్ని

కండ్లు లేవు

కాళ్ళు లేవు

నువ్వు యాడ ఉన్నవో చూద్దామన్నా.

 

ఏ యమ కింకర్ల చెరలో చేరితో

ఏ చిత్ర హింసల కొలిమిలో

కాగుతున్న వాడివో కొడుకా.!

 

కొడుకా

అవ్వకు చిన్నొడివి

బుద్దులు నేర్చినొడివు

అందరిలో కలుపుగోలుపుతనము ఉన్నోడి

నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు

కన్నీళ్ళ బాటను తెస్తివా కొడుకా

 

ఏ గ్రహణం వెంటాడింది నిన్ను

అమ్మకు కొడుకు యెడ బాటు

చెరసాలనే నీన్ను బందీని చేసేనా

కొడుకా...!!

 

కొడుకా

నీ ప్రేమగల్ల మాటను

నీ రూపును

నేను కన్ను మూసే లోపు చూస్తానా..!?

అవ్వ అన్న పిలుపు

అమ్మమ్మ అనే నీ ఆప్యాయతను

నా గుండెలకు హత్తుకొని

నా కండ్ల నిండా నీ రూపాన్ని

మీ అమ్మతోడు చూసుకొని

మా అమ్మ చెంతకు పోతాను కొడుకా..

 

కొడుకా

రాళ్ళ మీద పూలు పూసే రోజులు రావాలి

మీరు చల్లగ బతుకుండ్రి కొడుకా..

 

(అమ్మమ్మ గంగవ్వ బాధను చూడలేక, అక్రమంగా అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైళ్లలో ఉన్నప్పుడు అమ్మ ములాఖాతుకు వచ్చిన సందర్భంతో (feb 8,2019)పాటు,చివరగా (Feb 17,2022) అమ్మమ్మను చూసి అప్పటి జ్ఞాపకాన్ని ఇప్పటి తల పోతాను కలుపుకొని అమ్మమ్మ మాటనే ఇలా రాసుకున్నది......)

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు