మా రచయితలు

రచయిత పేరు:    కందుకూరి అంజయ్య

కవితలు

జమిడిక

ఊరంతా ఉసికై ఉడికి

కక్కుడు పారుడు కల్లోలం లేపితే

పోచమ్మతల్లి కన్నెర్ర జేసిందని

సల్లపరుసుటానికి

జబ్బకు జమిడిక ఏసుకుంటడు

దప్పుదర్వులతోని

జతకట్టిన జమిడిక జతులకు

చచ్చుబడ్డ కాళ్ళకు ప్రాణమొస్తది

కఠినశిలలు కాల్పనిక జగత్తులో విహరిస్తయి

 

సలిబోనం ఎత్తుకొని

సల్ల గురిగి పట్టుకొని

వేప రిమ్మలు కంఠహారంగా ధరించిన

కల్లు బింకుల కావడినెత్తుకొని

వెయ్యి కండ్ల తల్లికి వేడ్క చేయ

చిల్లుల కుండలు 

చిరునవ్వులొలుకుతుంటే

సల్లపరుస్తరు

 

మాపటేల మంత్ర ముగ్దులను చేసే

వాయిద్యాల విన్యాసాలు

నెత్తిమీద బోనం

బోనం మీద మండుతున్న గండ జిరుక

సుట్టబట్ట మీద సుతారంగా కొలువైతయి

గావుపిల్ల యాటపిల్ల 

పిల్లపాపలతోనే కలిసి నడుస్తయి

తల్లి సుట్టు తిరిగి 

సురాముప్పై మూడు కోట్ల దేవతలను తలుసుకొని

డప్పు మీద కూసుండి

పెయినిండ బండారి పూసుకొని

నుదుటికి ఎర్రబొట్టు పెట్టుకొని

చెటిల్ చెటిల్ అని ఈరగోల ఉరుముతుంటే

పెద్ద పెద్ద కండ్లు తెరుసుకుంట

అడుగులో అడుగేసి నడిస్తే

పూనకం వచ్చిన పోతలింగాన్ని చూసి

పెయిపొన్న ముండ్లు నిక్కపొడుస్తయి

 

నాలుగడుగులేసి 

రెండు చెక్కిళ్ళను

చిటికెలో చీల్చి

కింది పెదవిని అందుకొని

గొంతు కాడికి తెంపితే

గిలగిల కొట్టుకొనే గావుపిల్ల

చిలచిల చిమ్మే రక్తం

ఊదు మైసాక్షి ఉసి గొల్పుతుంటే

రక్షించుమమ్మా పోచమ్మా!

నిన్ను రాసవారలు గొల్తురమ్మా!

పాటపాడితే

కో అంటే ఓ అని పలుకుతది పోచమ్మ

 

ఎల్లమ్మ కథ చెప్పితే 

ఏరుపారినట్టు 

తడబడని నుడుగుల అడుగులు

తరగలెత్తుతయి

జమదగ్ని పరశురాముని

పౌరుషం చెప్పి

లందల దాగిన చందమామ

ఎల్లమ్మను కండ్లకు చూపుతరు

కాటమరాజు కొలుపుకు

కావడిబద్దలు సలాం చేస్తయి

ముంజల పండుగ

మురిపెం నింపుతది

ఊరు కొలుపు

చుట్టూళ్ళ బైండ్లకు పిలుపు

తలా ఒక పని ఆసరైతరు

రాత్రి రచ్చబండ కాడ కొలుపు

దొబ్బను నోట్లెపెట్టుకొని 

పేగులను మెడకు సుట్టుకొని

ఊరి చుట్టూ సర్వు చల్లుకుంట తిరిగితే

దుష్ట శక్తులు దూరమైతయి

 

జడిసిన కలలో ఉలికిపడ్డా

కోర్నాలు కోరినా

సందులు తలిగినా

పోయిలోని బూడిద పెద్ద మందైతది

మంత్రించి ఇస్తే 

మటుమాయమయ్యే ఆపదలు 

 

గ్రామ దేవతలను కొలిసే

ఊరిగొడుగులు

ఊట చెలిమెలు

జమిడికలు

కథలు

తేడా చూపు

పొద్దు పొడిసి బారెడెక్కింది. సుక్క పొంటెకు  మోట కట్టినోళ్ళు, నీళ్ళు దంగినాక, పొలం దిగింది  చూసుకొని, ఎడ్లను ఇడిసి వరిగడ్డకు కట్టేసి  ఇంటికి చేరుకొంటున్నారు.  యాతంకు పోయిన వాళ్ళు నీళ్ళు ఓడగొట్టి, గడ్డకెక్కి  నీళ్ళు పట్టిన  పొలాన్ని చూసుకొంటున్నారు. గూడేసేటోల్లు  గుండ్రాతి  తేలినంక అలిసిపోయి ఒడ్డెక్కి ఇంటి దారి పట్టిండ్రు.

మస్కుల లేసిన వాడ ఆడవాళ్ళు, పెండ  నీళ్ళు బకెట్ల కలుపుకొని అలుకు చల్లి ముత్యాల  ముగ్గులు పెడుతున్నరు. పాచి పని అయిన వాళ్ళు పొయి మీద ఎసర్లు పెట్టిండ్రు.   పొయి మీద ఎసులల్ల  గుటుక తుకతుక ఉడుకుతంది.

పువ్వుల మీదికి సీతాకోకచిలుకలు వచ్చి వాలినట్టు,  రంగురంగుల వస్త్ర ధారణతోని పిల్లలు. రెండు వరుసల్లో  నిలబడి వాడకు వస్తున్నరు. ఆ వరుస భూమి మీద నడుస్తున్న సింగిడి తీరుంది. అంతా ఒకే మాట, ఒకే  ఆట.... ‘వందేమాతరం’, భారత మాతకు జై , మహాత్మ గాంధీకి జై,  జవహర్ లాల్ కు జై అని ఒకరంటే  మిగతా  పిల్లలు అంటున్నరు. పిల్లలు ప్రభాత భేరితోని వాడను పలకరించ వచ్చినట్టుంది. పిల్లలను నియంత్రించే పంతుళ్ళు,  వాళ్ళ చేతుల్లో  వాయిలి  బరిగెలు.

" ఎత్తండీ ఎత్తండీ స్వాతంత్యపు జండా

  ఎత్త వోయి ఎత్తు ఎత్తు ఆకాశంనిండా”  పాటలకు,  నినాదాలకు దిక్కులు మారుమోగుతున్నయి. వాడ ఉలికిపడింది.
అది చెబ్బీస్ జనవరి రోజు . పిల్లలను చూసి నాకు ఉత్సాహం కట్టలు తెంచుకున్నది.  ఒక  ఉన్మాదం ఆవహిస్తే  సోయి దప్పినట్లు , ఆ పిల్లల బారుల నేను  నడుస్తున్న. మెల్లమెల్లగా వాళ్ళు ఇచ్చే నినాదాలు అర్థం చేసుకొని, గొంతు కలుపుతున్న.

నాలుగు పానాదులు తిరిగే  వరకు బడి  రానే వచ్చింది .
అక్కడ జండా ఎగురవేసి వందనం చేసిండ్రు . ఏవేవో మాట్లాడిండ్రు.  చివరకు చప్రాసి  ‘బరివాత  భామ’ అనుకుంట వచ్చి నాకు  కొబ్బరి బెల్లం పెట్టిండు . అది రెండు చేతుల్లో  తీసుకొని తిన్న.
అప్పటి నుండి ఆ పిల్లల్లో  నేను  కూడా ఉండాలనుకొన్న.  బడికి పోవాలనే కోర్కె  పుట్టింది.  పల్క  పట్టుకొని బడికి పాయిన.  అది శిశుతరగతి.   దానికి సారు భాస్కరరావు.   ఆ  రోజుల్లో  బడి చెప్పే  పంతులు బడి ఉన్న ఊళ్ళేనే ఉండెటోళ్ళు.  భాస్కరరావుకు కూడా అట్లనే చెర్లపల్లెల ఉంటుండు. మంచి చమత్కారి.  సంధ్యావళిని సందెలవడి అని చమత్కరించెటోడు.
ఆ తరగతిలో యాబైమంది పిల్లలుంటరు.  అందరూ  భాస్కరరావు అంటే గజగజ వణికిపోతరు.  ఎప్పుడు కొడుతడో ఎప్పుడు  మెచ్చుకుంటడో  ఎవరికి అర్థం కాదు.
నేను పొద్దున చెప్పిన అక్షరాలు దిద్దుకొని మధ్యాహ్నం  అప్పజెప్పుతున్న.  మధ్యాహ్నం పెట్టిచ్చిన అక్షరాలను సాయంత్రం అప్పజెప్పుతున్న.  

గుణింతాలు అయినంక బాలశిక్ష.  ‘అమ్మా , ఆవు’ తోని మొదలైతది.  నల్లబల్ల మీద అమ్మ ఆవు బొమ్మ వేసి వాటి కింద అమ్మ  అవు అని రాసి ఒక్కొక్కరితోని చెప్పించేవాడు సారు.  అట్లా  అందరికి    గుణింతాలతో   సహ నోటికి వచ్చేది.

 ఒక రోజు బడి చుట్టి అయింది అని ఎవరో అంటే అందరం దీ!   అని    అరుస్తూ   బయటకు వచ్చినం.  అప్పుడు భాస్కరరావు సారు పెద్దసారు దగ్గర ఉన్నడు.  అల్లరి విని వచ్చి అందాని పశువులను కొట్టినట్టు చింత బరిగెతోని కొట్టిండు.  ఆ దెబ్బలకు కొందరికి  పెయి మీద దద్దులు తేలినయి.  ఆ దద్దులను  పునికి చూసుకుంట సారు ఏడ్చిండు. మేమందరం ఏడ్చినం.

*  *   *   *   *

మేమంతా ఏడవ తరగతి చదువుతున్నం. బడికి ఎవరో పెద్దసారు వచ్చిండు . ఆయనకు అందరు భయపడుతున్నరు. మా క్లాసుకు వచ్చి కూచున్నడు.  బోర్డు మీద లెక్క వేసి అందరిని తీయమన్నడు.  తీసిన వాళ్ళ నోటు బుక్ చూసి రైట్ గుర్తు వేసిండు. ఎన్నో ప్రశ్నలు అడిగిండు.  చెప్పిన వాళ్ళను మెచ్చుకున్నడు . మినిష్టర్ అంటే అర్థం చెప్పమని అడిగిండు.  నేను వెంటనే తడబడకుండ మంత్రి అని సమాధానం చెప్పిన.  నాకు సారు ఒక పెన్ను  బహుమతి ఇచ్చిండు.  తనిఖీ సవ్యంగా సాగినందుకు అందరు ఊపిరి పీల్చుకున్నరు. తెల్లవారి క్లాసుల నన్ను నిలబెట్టి భాస్కరరావు సారు “కమ్మరోడు  మంత్రి,  కుమ్మరోడు మంత్రి, చాకలోడు  మంత్రి, శాలోడు మంత్రి , మాదిగోడు  మంత్రి,  మాలోడు మంత్రి” అన్నడు. ఆ మాటలు సారు ఎందుకన్నడో ఎవరికి అర్ధంకాలేదు

*  *   *   *   *

నేను దేవేందర్  మంచి స్నేహితులం.   బడికి పోయింది మొదలు ఇంటికి వచ్చిదాకా  కలిసి ఉండేటోళ్ళం.  ఓనగాయలు,  జామ పండ్లు , రేగి పండ్లు తినుకుంటూ బడి చుట్టూ దానికి  దగ్గర ఉన్న గుడి చుట్టూ ఆడుకునేటోళ్ళం .  ఒకరోజు దేవేందర్ ను, నన్నుసారు ఇంటికి పిలిసిండు.  అమ్మకు పైసలు లేవట ఇద్దరు పోయి ఇచ్చి రావాలె అన్నడు.  దేవేందర్ చేతిలో పైసలు పెట్టి అమ్మకు ఇయ్యమని ఒక ఉత్తరం ఇచ్చిండు . దేవేందర్ నేను కలిసి చెందోళికి బయలుదేరినం.  ఆడుకుంటూ పాడుకుంటూ కాలిబాటల వెంట, కచ్చురాల తొవ్వల వెంట, ఒడ్ల  మీది కెల్లి మల్లె చెందోళి చేరే వరకు ఒంటి గంటయింది.  పోయే వరకు అమ్మమా కొరకు చూస్తుంది.  దేవేందర్ ఇంట్లకు పోయి ఫైసలు, ఉత్తరం చేతికిచ్చిండు. అమ్మ ఉత్తరం చదువుకున్నది.  ఆయనకు ఇంట్ల అన్నం పెట్టింది.  నాకు వాకిట్ల పెట్టింది. ఆకలి  దంచి కొడుతుంది.  విస్తర్లోని ని అన్నం  మొత్తం తిన్న.   నీళ్ళు తాగుటానికి  దొడ్డికి  పోయే చెంబుల నీళ్ళు పెట్టింది.  ఆ ముంత పెయి అంతా మురికి పట్టి ఉన్నది.  ఎక్కిల్లు వస్తున్నయి, నీళ్ళు తాగుదామంటే  తిన్న తిండి  బయట పడేటట్టు ఉంది.  ఏదో విధంగా ఎక్కిల్లను ఆపుకొని దేవెందర్, నేను బయలుదేరినం. తొవ్వల వాగుల చెలిమె  చల్లుకొని కడుపు నిండ నీళ్ళు తాగిన.   చల్లని చెలమెల నీళ్ళు తాగినంక ప్రాణం నిమ్మలమయింది. ముచ్చట్లల్ల పడి ఊరు చేరింది తెల్వలేదు.   సారు ఇంటికి పోయినం. లోపలి  ఇంట్లకు పోయి ఆడ జరిగినదంతా దేవేందర్ సారుకు చెప్పిండు.  అనుకున్నది అనుకున్నట్టు జరిగినందుకు సారు ఊపిరి పీల్చుకొన్నడు.  సారు పని చేసిన సంతోషంతోని నేను ఇంటి దారి పట్టిన. ఈ తేడా చూపులెందుకని  ఆలోచిస్తూ.

చెదిరిన కల

    పొధ్ధాటి కల్లు వాసన కమ్మగా వోత్తాన, ఏ పుర్గు పుట్రో అచ్చి కుడ్తదన్న భయంతో, సలిని కప్పుకున్న శీకట్ని సూత్తు ఒక్కడే కంకిశేను కాడ వన్కుతూ కూసోని ఎదుర్సూత్త ఉండు జోసఫ్. సెకను ముల్లుల తన గుండె సప్పుడు ఒక్కటే కల్వరింత, పూర్ణ ఎప్పుడొత్తదా అని. ఈ ఎదురుసూపులు కొత్తేం కాదు, అయ్న ఆళ్ళు కల్శిన ప్రతిసారి ఒక కొత్త కలలా ఉంటది. సుట్టు శీకట్లో ఈదర గాలులు ఉక్కిరిబిక్కిరి సెత్తుంటే, డిశంబర్ నెలలో అచ్చె తూర్పు దిక్కు సుక్కలోలే, అంత సీకట్లో కుతం ఎన్నెల ఎల్తురొలే వొత్తాన పూర్ణను సూత్తు జోసెఫ్ "ఏమైంది ఇంతశేపైంది, ఇగ రావేమో అనుకున్న" అని అన్నడు.  తన మాటల్ని పట్కోకుండా పూర్ణ అచ్చి జోసెఫ్ పక్కపొంటి కూసోని తన కొంగును ఇద్దర్కి కప్పుకుంటూ కండ్లల్ల నీల్లు నింపుకొని జోసెఫ్ని అల్లుకపోయింది.

పూర్ణ సుట్టూరా శేతులు పోనిచ్చి తనకి ఇంకా దగ్గర్గా లాక్కొని, "ఏమైంది" అని అడ్గిండు జోసెఫ్.

"మా మామ శెట్టుమించెలి జారిండే" అని తన లోపలున్న బాధనన్సుకుంటు సమ్దానమిచ్చింది పూర్ణ.

అవునా..! అసలు ఏమైంది నర్సి బాబాయ్కి అని అచ్చెరంతో మల్ల అడ్గిండు జోసెఫ్.

"సాయింకాలం మామ శెట్టెక్కి కల్లు లొట్టి దించ్తుంటే మోకు జారిందట, ఐతే ఎంబటే తాటిశెట్టును కర్సుక పట్టిన కుతం జర్ర జర్ర జారిపడి, మామ చాత్పొంటి, కొంకుల్పొంటి మల్ల జబ్బలపొంటి తాటిపేడ్లు గీర్కపోయి ఎర్రగా ఐంది అని ఏడ్తూ జెప్పింది.

తన శంపలపొంటి కార్తున్న నీల్లను తుడ్సుకుంటా జోసెఫ్ మరింత్గా పూర్ణను అముల్కొని తన నొసల్పై ముద్దునిత్తు, "ఇప్పుడైతే మంచిగనైతే ఉండు కద అని అన్నడు.

"హ కానీ, మా అవ్వ సచ్చిన్కానుండి నన్ను దెచ్చుకొని బిడ్డలెక్క సాత్తాండు, కన్నబిడ్డ అమ్ముల్ని గూడట్ల జూశ్కోలే. అయిన మా మామ శెట్లెక్కితే గాని మాయిల్లు గడ్వదు. అద్గాక రికాం లేకుండా ఏ పని దొర్కితే ఆ పన్కిబోతడు. అట్లాంటిది మావోనికేమన్నైతే ఏంగాను మా బత్కు" అని బదులిచ్చింది పూర్ణ.

జోసెఫ్ ఒక్కశార్గ పూర్ణలోని బాధను మర్శెలా గట్టిగా అముల్కొని పూర్ణ వొల్లంత తడ్ముతూ, ముద్దుల్తో తడ్పేశాడు. ఎచ్చగా జోసెఫ్ శేతులు తాకేసరికి పూర్ణ వొల్లంత అదిరి, తన ఆలోచలన్లన్ని దెంకపోయాయి. ఆ రాత్రిలో ఏకమయ్యి ఇద్దరు కల్శి మరో కొత్త కల కన్నరు. సూట్టురా ఎన్నో ఇసపు పురుగులు పూశున్న, ఆ కంకిశేను చీకట్లను మిన్గురేల్గులు శీర్తుంటే, ఊపిరి తీశ్నట్లైతున్న సలిలో ఈదర గాడ్పులు గూడ ఎచ్చగా అనిపిత్తాంది యిద్దరికిప్పుడు. ఆ కలయ్క రేపిన ఆయితో పూర్ణ "బావ మనం మన కులాల్ని కాదని కల్తానం కద, రేపీళ్ళు మనల్ని ఒప్పుకుంటరంటవా" ? అని అడ్గింది.

"అస్సలు ఒప్పుకోరే"

"మరి ఏం జేద్దామే, నేనైతే నిన్ను ఒదిలి బత్కలేను బావ, ఎటైనబోయి బత్కుదామా"

"నాగ్గుత అట్లనే అనిపిత్తాంది గానీ, మా ముసల్లోలను సూత్తనే బయమేత్తాంది. మా అవ్వాయ్య లేకున్నా నన్ను ఇంతటోన్ని జేశిర్రు, నే ఏటన్నబోతే ఆళ్ళేం గావలే అని గొంతులో గుట్కెత్తు జోసెఫ్ మొఖం మాడ్చిండు.

పూర్ణ, మాడ్చిన జోసెఫ్ మొఖాన్ని శేతుల్తో తుడ్తూ తన చెంపల్పొంటి ముద్దిచ్చి, "కొన్ని దినాలెలే మల్ల ఇటే అద్దాం.

సరే మరి నేన్బోనా అచ్చి చాలా సేపైతంది" అని అన్నది.

"సరే మంచపో"

*

ఊళ్లే పొద్దెక్కగానే పనారాటంతో ఎక్కడోళ్ళు అక్కడ్కి బోయిండ్రు. అట్లనే గొర్లను కొట్టుకుంటూ బాషి, జోసెఫ్ని ఎంబడెట్టుకొని ఊర్దాటి శాన దూరమచ్చిండ్రు. నెత్తి మీద ఎండ సుర్రుమంటు ఎన్ను తాక్తుంటే జోసెఫ్ శిరాక్తో "ఏమే బాషన్న మంచ పన్నోన్ని ఈ ఎండల తిప్పబడ్తివి".

"ఏమ్రా అయ్సు పొరడు పొద్దెక్కేదాక పంటర్రా" అని ఎక్కిరిచ్చిండు బాషి.

"గదంత గాద్గాని గిప్పుడు నీ గొర్లతోబాటు నన్నెంద్కు దోల్కచ్చినవో గద్జెప్పు" అని మల్ల గదే శిరాక్తో అన్నడు జోసెఫ్.

"ఉచ్చాగ్దార , జేప్పెదాక ఇనవ్ ఇటిను మొదాలు, మీ అయ్య నేను సొంత అన్నదమ్ముల్లెక్క ఊళ్లే తిరిగేటోళ్లం, తాగేటోళ్లం. కానీ, మీవోడు కొత్వాల్ దొరోడి బాయి పన్కిబోయి సచ్చిన్కానుండి నాకు నిమ్మలం లేద్రా. ఆరోజు మస్త్ లొల్లి జెశ్నగనీ, ఆడి దొరతనం ముందు నేచెల్లలేద్రా" అంటు కండ్లకత్తాన నీల్లను తుడ్శుకుంటూ "ఐతే ఇయ్యాల కోన్ని కోశ్నరా, మీ అయ్యకు పెట్టలేన్గా, కనీసం నీకైనా ఇంత పెడ్దామని దిస్కచ్చినరా" అని సద్దిని జూపిత్తు అన్నడు.

బాషి మాటల్కి జోసెఫ్ కత్తాన బాధనన్సుకుంటు, "ఊకోయే బాషన్న బోయినోళ్లు మల్లాత్తర" అని సమ్దాయిత్తు "సరే దిందాంబ" అంటూ పక్కనే ఉన్న తుమ్మశెట్టు కిందకు దిస్కపోయిండు.

యిద్దరి నెత్తికున్న తువ్వాల్నిప్పి తన శెమట మోకాన్ని తుడ్తుంటే అత్తాన వేడి గాడ్పులు కుతం దాక్గానే ఒళ్ళంతా ఆయిగనిపించి ఎన్కకు ఒర్గి కండ్లు ముస్కుండ్రు. గప్పుడు జోసెఫ్ పక్కకి బాషి దిర్గుతూ "అరె చిన్న ఒక పాట పాడ్రాదురా" అని అడ్గిండు.

"నీకెట్ల ఎర్కనే నే పాడ్తని" మూశున్న కండ్లను తెర్తు అడ్గిండు జోసెఫ్.

"ఎహే నాకెంద్కు దెల్వదురా ఆరోజు మీ కిస్మస్ పండ్గరోజు బీరు సాయిబోళ్ల యింటి కాడ స్టేజేశి అది.., అది,

దాన్నేమంటార్రా" ?

"అదానే, గిటార్".

ఆ అదే దాన్ని వాయించ్కుంటా స్టేజి మీద నువ్వు పాడ్తాంటే సిన్మాలా హీరో లెక్క కొట్టినవ్ పో" అని మస్త్ సంబ్రపడ్డాడు బాషి.

ఒర్గినోడు లేశి సకులం ముకులం పెట్కొని "అవునానే అన్న" అని అడ్గిండు జోసెఫ్.

"అవున్రా, ఆ మీటింగ్ నడ్తాంటే మొత్తం ఆడపొరగాళ్ల కండ్లల్లా మొత్తం నువ్వే మెదిలినవ్. అది జూశి ఊళ్లే ఎంత మంది కుల్లుక సచ్చిండ్రో" అని అంటూ "నాకోసం ఓ పాట పాడ్రా" అని మల్ల అడ్గిండు బాషి.

ముశి ముశి నవ్వుకుంటా "సరే అన్నం దిన్నంక పాడ్తలే" అని జోసఫ్ లేశి ఎంటదెచ్చుకున్న బాటిల్ నీల్లతో శేతులు కడ్కుండ్రు ఇద్దరు.

*

"అరే జోసెఫ్ గిప్పుడన్న పాడ్రా" అని బాషి అయిపోయ్న సద్ది డబ్బను డొల్లేక్క కోడ్తుంటే "జీవనదిని నా హృదయములో" అంటూ ప్రభువు పాటనెత్తుకుండు జోసెఫ్.

ఇంతకు మున్పు డోలు కొట్టిన అన్భవంతో బాషి మార్శి మార్శి కొడ్తుంటే, జోసెఫ్ పాటలు మార్సుకుంటబోతూ యిద్దరు పాటల్లో మునిగిబోయిండ్రు.

"దెలికుండానే శాన సేపయ్తాంది, ఇగబోదాంబ" అని లేశి గొర్లను మల్లెశిర్రు యిద్దరు. ఎన్నో ముచ్చట్లు ఎట్టుకుంటూ, నవ్వుకుంటా, చూశేటోళ్లకు ఒక్కింట్లోల్ల లెక్కకొడ్తు బోతావుంటే, శేరువు కట్ట మీద పోడ ఎండ సొగసుకు శెమట సుక్కలద్దినట్లు ఈపంత మెర్తుంటే కట్టెల మోపెత్తుకొని, పిల్లకాలువంకోలే నడుమంకను తిప్పుతూ నడ్తాంది పూర్ణ.

ఆళ్ల మాటలిని పూర్ణ ఎన్కకు ఒక్కశార్గ తిర్గి జోసెఫ్ని జూత్తు ఓ నవ్వు నవ్వి ముంద్కుబోతుంటే, జోసెఫ్, పూర్ణ కండ్లాంకలను, నడుమంకను జూశి తన కాళ్ళ అడుగుల్కి వంకలు పడ్డాయి. ఇందంత జూత్తాన బాషి "ఏడిదాకచ్చిందిరా మీ కత" అని అడ్గిండు.

జోసెఫ్ అదిర్బడి పూర్ణ మత్తులోంచి బయటకత్తు "నీకెట్ల దెల్సునే" అని అచ్చెరంతో మల్లదిర్గి అడ్గిండు.

బాషి పక్కకు బోతున్న గొర్లను మర్రెత్తు "నాకు బోనాలప్పుడే దెల్సుర వారి, మా పండుగల్కి నేనెప్పుడు పిల్శిన రానోడివి, ఆరోజు ఆపోరి చిల్కల బోనమెత్తుకొని వొత్తాంటే ఎన్కేన్క నువ్వు ఎగిరేగిరి జూశినప్పుడే సమజైంది నాకు" అని జేప్పిండు.

బాషి మాటల్కి జోసెఫ్ శిగ్గుపడుతూ, నవ్వుకుంటా బాషిని హత్తుకుండు. ఎంబటే "భయంగల్ల కోడాట బదాట్ల గుడ్డెట్టినట్టు, శేశిందంత శేశి గిప్పుడు శిగ్గుపడ్తానవారా" అని నవ్వుకుంటా అండు బాషి.

"అద్గాదే బాషన్న అసలు ముచ్చట, మా పెళ్లి ఐతదా ? అని బయమైతందే" అని నవ్వుతున్న మోకాన్ని మాడ్శి జెప్పిండు జోసెఫ్.

"నీకేందక్కువరా, మంచ సదువ్కున్నావ్, రేపో మాపో నౌకరైతది. వాళ్ళోళ్ళు ఒప్పుకోకపోతెం మీరే ఏటన్నబోయి పెళ్లి జేసుకోనచ్చి, పోలీస్ స్టేషన్లో కూసొండ్రి" అని సలయిచ్చిండు బాషి.

బాషి మాట్లాడుతాంటే గమ్మునుండి సోచాయిత్తు నడ్త ఉండు జోసెఫ్. పర్తితి బాష్కి సమజై జోసెఫ్ కాడ్కిబోయి ఎన్కనుంచి ఎన్నుమీద నేనున్న అన్నట్లు రెండు దెబ్బలేశి "బోయి ఆ పిల్లతో ఏమన్నా మాట్లాడుబో" అని ముంద్కు దోశిండు బాషి.

గొర్లను దాట్కుంటూ జోసెఫ్, పూర్ణ కాడ్కి రాంగానే పూర్ణ ఒక్కశార్గ అదిర్పడి "అబ్బా..! నువ్వుబోయే బావ ఎవల్లన్న జూత్తరు" అని బయంతో అన్నది.

"అద్గాదే నే జెప్పేదీను" అని ఏదో జెప్పబోయిండు జోసెఫ్.

"జెప్పేదేంలే, చీకటైనాక కల్దాం గాని మొదలూ ఈన్నుంచిబో" అని ముంద్కు దన్న దన్న బోయింది  పూర్ణ.

బాషి ఆళ్ళిద్దరిని సూత్తు "అరేయ్ గిట్ల బయపడ్తే, రేపు మీ రెండు కులాల పెద్దమనుషుల్ని ఎట్ల ఎదుర్కుంటరు, మీ పెళ్లెట్ల జేసుకుంటరు" అని నవ్వుతుండు.

"అట్లేం లేదే, ఆళ్ల మామ సూత్తడన్న భయం తప్ప, నేనంటే మస్త్ ఇష్టమే ఆ పిల్లకి, నాగోసం ఏమైన జేత్తది" అని అన్నడు జోసెఫ్.

"సరే ఊకే గదె సోయిలుండకు, ఎట్లాయ్యేది గట్లనైతది గాని ఇగ నువ్వు ఇంటికిబో పొద్దుబోయింది" అని జోసెఫ్ ధైర్నం జెప్పుతూ పంపిండు బాషి.

మాపటెండ కుంకుమ్బుసుకోని సన్నగా ఒంటిమీద పడ్తాంటే, రూమల్సుట్టుకొని ఇంటికెళ్తున్నా జోసెఫ్ని జూత్తు "ఈ పొరగాళ్ళు కులాలు కాదన్న కలలా బత్కుతాళ్ళు, రేపీల్లా ముచ్చట ఊళ్లే తెల్తే ఎంత పెద్దలొల్లయింతదో" అని బాషి మెదడ్ల దిర్గుతూ, ఏమైనగాన్ని గానీ పొరగాన్కి ఏం గాకుండా కాపాడ్కోవాలే" అని మన్సుల అన్కుంటూ గొర్లను ఇంటికి తోల్కబోయిండు.

*

జోసెఫ్ ఇంటికచ్చి గోలెంకాడ కాల్శేతులు కడ్కోని ఇంట్ల అడ్గెట్టెశరికి, సలికాలం పొద్దునచ్చె పొగమబ్బులా ఇల్లంత సుట్టపోగతో నిండుంది. "ఓ ముసల్లచ్చి, నువ్వన్న నీ మొగన్కి జెప్పాల్సిందిబోయి, ఇద్దరు కల్శి గుప్పు గుప్పుమంటూ సుట్టతాగుతాల్లా? ఇగ సూడు ఇల్లంత మీ సుట్టపోగతో అసలేం అవుపడ్తలే" అని మొత్తుకుండు.

ఇద్దరు ముసలోళ్లు ముశి ముశి నవ్వుకుంటా "ఇట్రారా అయ్యా" అని శేతుల్శాశి జోసెఫ్ని పిల్శింది లచ్చి.

జోసెఫ్, లచ్చి కాడ్కి రాంగానే తన రెండు శేతుల్తో జోసెఫ్ మోకాన్ని దీస్కొని ముద్దునిత్తు "అరయ్య నీ అవ్వయ్యలు కాలం జేశినాక నిన్నే కండ్లల్లబెట్టుకోన్ని బతుక్తున్నంరాయ్యా" అని నీల్లు దెచ్చుకుంది.

"ఇగ ఊకొయే అవ్వ, ఏదో సుట్టవాసోనోచ్చి అన్న మల్లగిట్ల ఏడ్వకు" అని అన్నడు జోసెఫ్.

"సరే బిడ్డ ఏడ్వనుగాని సుట్ట ఆరిపోయ్నట్టుంది, ఇంత నుప్పు దెచ్చియ్యారయ్యా" అడ్గింది లచ్చి.

"దోశ్ బో, మీరు మారారే ఇగ" అంటూ జోసెఫ్ బయటిక్తాంటే "అరే పిలగా నీగోసమని వట్టితున్కల కూర అండిన్రాయ్యా  ఎటుబోతనవ్, ఇంతదింద్వురా" అని పిల్శింది లచ్చి.

"దెహె బో మీ సుట్టపొగ బోయేదాక నే తిన" అన్కుంటూ యింటి ముందు కూసుండు జోసెఫ్.

సాటింపు జెప్పే పెద్దమనిషి కట్టన్న సైకిల్ మీద జోసెఫ్ కాడ్కి ఆగమాగం వొత్తాంటే "ఏమే పెద్దయ్య ఇట్గిట్ల బాట పట్టినవ్ ఏమన్నా అయింద ఏంది" అని అడ్గిండు జోసెఫ్.

"అవునాయ్య కొత్వాల్ సారోత్తండట, మన నాల్గువాడల పెద్దమనుషుల్ని, జనాల్ని, అందర్ని గిన్నెశెట్టు కాడ్కి రమ్మన్నరు. అందరు ఆన్నే ఉన్నరు, మిగిలినోళ్ళకు జెప్పుకుంటా నీదాకచ్చిన ఆడ్కిబా" అని అన్నడు కట్టన్న.

"సరే వత్తనబాయే" అని జోసెఫ్ జెప్పగానే కట్టన్న ఆడ్నుండి బోయిండు.

"కొత్వాల్ దొరంటే ఈ సుట్టుపక్కల ఆయిన్ను కాదని ఏ పనిగాదు, ఏ కాంట్రాక్ట్ ఐన అయినే పట్టాలి, ఏ ఇక్కటోచ్చినా అయినే తీర్వాలి. ఊళ్లేగూడ ఏ కులన్కి పెద్దమన్శి ఎవడున్న పెద్దరికమైతే కొత్వాల్దె. ఆయిన్ను కాదని ఏ కులపొడు ఏపని జెయ్యడు, కాదన్నోన్ని జూశిన దాకల్లేవు గూడ. ఒకేలుంటే ఆడి సంగతేందో జెప్పేదాక ఊకోడు. అందేందోగాని కొత్వాల్ ఇన్నిజెత్తున్న ఒక్క కేసుగూడ కాలేదు. అయిన అచ్చిన ప్రతాఫీసర్లు, పోలిసొళ్ళు కొత్వాలిచ్చే దావత్లా మున్గుంతాంటే ఎట్లా ఐతది. అసోటోండు మా వాడక్తాండంటే ఏదో పెద్దపనే ఉంటది" అని మన్సుల అన్కుంటూ గిన్నెశెట్టు కాడ్కి నడ్తాండు జోసెఫ్.

*

(ఇంకా ఉంది)

 

ఇంటర్వ్యూలు

బొత్త కొమురయ్యనే నా గురువు

జనవరి నెలలో  కరీంనగర్ వచ్చిన ప్రముఖ రచయిత అల్లం రాజయ్య గారితో కవి, విమర్శకులు కందుకూరి అంజయ్య జరిపిన ముఖాముఖి. 

1.      మీరు రచనలు చేయాలని ఎందుకు అనుకున్నారు?

మా కుటుంబంలో పూర్వం ఎవరూ రచయితలు కారు. మా పాలేరు మాదిగ  గడ్డం రాజయ్య, ఆయన హీరో. ప్రపంచం గురించి మనుషుల ప్రవర్తన గురించి చెప్పేటోడు. నేను గాంధీని చదివి మరిన్ని పుస్తకాలు  చదివి మా ఊరి బతుకులు మారడం గురించి రంధి పడేటోన్ని. 1970-71 కి వచ్చే వరకు 1972 ఎన్నికల సభ P.V.నరసింహారావు పెట్టిండు.  ఆ సభలో బొంత కొమురయ్య పి.వి.ని నిలదీసిండు. “ఊరంతటికీ కరెంటచ్చింది మాదిగావాడకు ఎందుకు రాలేదని”  గాజుల పల్లెలో కరెంటు వచ్చింది. మాదిగవాడలో కరెంటు బుగ్గ వెలిగింది. అప్పుడుఎదురు తిరిగితే?” కథ బొత్త కొమురయ్య మీద రాసిన. మార్పు మా వూల్లెనే మనుషుల్లనే ఉన్నదని అర్థమయ్యింది.  గురి చూసి కొట్టగల మొనగాడు కొమురయ్య. 

మా గ్రామాల్లో పాలేర్లు చాల దారుణమైన పరిస్థితుల్లో ఉండేవారు. నాలుగు కుంచాల జీతం (50కిలోల ధాన్యానికి) నెల రోజులు పని చేయాలి. పాలేర్ల సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ జీతం పెరగాలని పోరాటం చేసినం. ఇగట్ల మొదలైనయ్  రైతు కూలీ సంఘాలు.

2.     మార్క్సిజం యూరోపు సమాజాన్ని సాధారణీకరణ చేసి వచ్చిన సిద్ధాంతం! ఇది భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు ఎలా వర్తిస్తుంది?

అన్ని దేశాల తత్వ శాస్త్రాన్ని, ప్రకృతిని, సామజిక, పరిణామ క్రమ, శాస్త్రీయ ఆవిష్కరణల  అధ్యయనం చేసి వచ్చిన సిద్ధాంతం మార్క్సిజం. భారతీయ బ్రాహ్మణీయ భూస్వామ్య సమాజం మిగతా యూరప్ దేశాల కంటే భిన్నమైనది కనకా, భారతదేశంలో ఆస్తి మిగతాదేశాల్లోలా కాకుండా కుల ప్రాతిపదికగా పంపకం జరిగింది కనక, మార్క్సిజం భారతీయ సమాజాన్ని అంచనా వేయటంలో సరియైన ప్రాతిపదిక గతంలో తీసుకోలేదు. మార్క్సిజం ఆయా దేశాల భౌతిక పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేసే, అంచనా వేసే శాస్త్రం. అది స్థల కాలాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలను గతి తార్కిక చారిత్రికంగా  అర్థం చేసుకునే శాస్త్రం.

3.   యస్.ఏ.డాంగేప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరిఅనే పుస్తకం రాసిండు. దీన్ని D.D కోశాంబి తీవ్రంగా ఖండించిండు. భారతదేశంలో యూరోపు నమూనా బానిసత్వం లేదని తేల్చి చెప్పిండు కదా! దీని మీద మీ అభిప్రాయం?

యస్.ఏ.డాంగే చరిత్రను ఆర్యుల పరంగా, బ్రాహ్మణీయ సిద్ధాంతం ప్రకారం తప్పుడు వ్యాఖ్యానం చేసిండు. ఆర్యులకంటే ముందు ఈ దేశంలో అనేక మంది భూమి పుత్రుల, అసురుల (లోకాయతులు, చార్వాకులు) సామ్రాజ్యాలు ఉన్నాయి. వీళ్ళకంటే అనాగరికులు, అశాస్త్రీయులు, హేతు విరుద్ధమైనవారు ఆర్యులు.

4.   వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు వాటిలో ఉన్న సామాజిక విలువలు ప్రజల్లో ప్రచారం చేసి, వాటిని కింది స్థాయి వరకు తీసుకపోయి, వాటిని ప్రజలు అనుసరించే విధంగా చేసిన బ్రాహ్మణీయ భావజాలాన్ని, ఈనాడు దళిత బహుజనులు ఎలా ఎదుర్కోవాలి?

రాజ్యం భాషను, భావజాలాన్ని ప్రజల మీద రుద్దింది. కానీ, ప్రజలు హేతు విరుద్ధమైన పుక్కిటి పురాణాలను ఎన్నడూ నమ్మలేదు. ఉత్పత్తికి సంబంధించిన జ్ఞానం శాస్త్రీయమైంది. ఉత్పతిని, శాస్త్రీయ జ్ఞానాన్ని పుక్కిటి పురాణాలతో ఉత్పత్తి చేయలేం. ప్రజలు ఎప్పుడూ ఉత్పత్తి, శాస్త్రీయ జ్ఞానంతోనే ఉన్నరు. బౌద్ధం నుంచి ఈనాటి వరకు ప్రజలు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కాపాడుకుంటూ వస్తున్నరు. It is a wonderful scientific experience of the people. 1860 వరకు భారతదేశం ప్రపంచంలో ధనిక దేశం. ఇప్పుడు పేద దేశం. అయితే – అలాంటి అభివృద్ధి క్రమాన్ని, ప్రజల చరిత్రను నాశనం చేశారు. తిరిగి ప్రజల చరిత్రను నిర్మించవలసి ఉన్నది.

5.       నక్సల్బరి, శ్రీకాకుళం, తెలంగాణ రైతాంగ పోరాటాల నుండి ఉద్యమం ఇప్పుడు దండకారణ్యానికి చేరుకుంది. దండకారణ్యం లోపల అదనపు విలువ దోసేవాడు లేడు. ఇది భారతదేశానికి సాధారణీకరణ ఎట్ల అయితది?

దండకారణ్యంలో  దోపిడీ స్వరూపాలు వేరైనా దోపిడీ ఉంది. భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు వర్గ, కుల సంబంధాలు లేకున్నా, ఎత్తుగడల రీత్యా, వ్యూహం రీత్యా ఉద్యమం వేళ్ళూనుకుంది. కానీ, అదే భారతదేశానికి విప్లవోద్యమం కాదు. భారతదేశంలో ఉండే నిరుపేదలైన దళితులు, సగభాగమైన మహిళలు, మతపరమైన మైనార్టీలు, బహుజనులు మొత్తంగా భారతదేశంలోని అనేక రకాలుగా నిరుపయోగంగా ఉన్న ఉత్పత్తి వనరుల పంపకం, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి సంబంధాల్లో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించకుండా ఈ దేశం ఒక అడుగు కూడా ముందుకు పోలేదు.ఈ ఎదుగుదలను, దుర్మార్గమైన బ్రాహ్మణీయ హిందుత్వ భూస్వామ్యం, దళారీ పెట్టుబడిదారీ వర్గం అడ్డుకొంటున్నాయి. అన్నిటికంటే అమానవీయంగా, అశాస్త్రీయంగా భారతదేశం ఉండటానికి కారణం ఇదే. అయితే ఈ మార్పులేవి కూడా సాధించజాలము. ప్రజల పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన అనే మూడు ఆయుధాలతో – రాజ్యాధికారం ప్రజలు సాధించే దిశలో యభైయేండ్లు, మూడు తరాలు పోరాడి నిలుపుకున్న ప్రజాయుద్ధభూమి.

6.         1980ల తర్వాత స్త్రీ వాదం, దళిత వాదం, మైనార్టీ వాదం, బహుజన వాదం సారాంశంలో అస్తిత్వ ఉద్యమాలు. ఇవి తమకు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల్లో (ముఖ్యంగా రిజర్వేషన్లు) ఎక్కువ భాగం కావాలని డిమాండు చేస్తున్నాయి. కానీ, ఇవేవీ ప్రజలకు దక్కకుండా చేస్తున్న నయా ఉదార వాద ఆర్ధిక విధానాన్ని వీరు ఎందుకు ప్రశ్నించడం లేదు?

భారతదేశంలోని వైరుద్ధ్యాలను వాడుకొని సర్వం కొల్లగొట్టాలని, దోపిడీ  కొనసాగించాలని ప్రపంచ ఆర్ధిక సంస్థలు పనిచేస్తున్నయి. ఆర్ధిక భాగస్వామ్య డిమాండ్ ను వాయిదా వేయడానికి ఇవి పని చేస్తున్నయి.  అస్తిత్వ ఉద్యమాలు వ్యక్తిగత, సామూహిక ఉద్యమాలు – అవి గతి తార్కికంగా అభివృద్ధి చెంది సామాజిక ఉద్యమాలుగా మారుతున్నాయి.

7.         పౌరసత్వ సవరణ చట్టంలాంటిది ప్రజలను విడదీస్తుందా? ఏం చేస్తుంది?

భారతీయ పాలక వర్గం ఎవరితోనైనా సఖ్యతగా ఉంటుంది. కానీ ఇక్కడ దళితులను మహిళలను ముస్లింలను కలవకుండా చేస్తుంది. అందుకోసం నెహ్రూ మార్క్ సోషలిజం  ముసుగు తీసి – తమ కనుగుణంగా రాజ్యాంగం సవరణలు చేయాలనుకుంటోంది.

8.         భారతదేశంలో ప్రజలకు ప్రత్యామ్నాయం ఏంటిది?

ఈ దేశ సంపద దేశ మూలవాసులైన దళితులు, ఆదివాసులు, మహిళలకు చెందవలసిందే. అందుకోసం తగిన ఎత్తుగడలతో ప్రజలు పోరాటములో తర్ఫీదు చెంది – వ్యూహాత్మకంగా కార్మిక కర్షక రాజ్యం గెలుచుకోవాల్సిందే.

9.         దీర్ఘ కాలిక ప్రజా యుద్ధ పంథా అని అన్నరు. దీన్ని కొందరు ఎన్ని తరాలు త్యాగాలు చేయాలి.విప్లవ విధికివదిలివేద్దామా అంటున్నరు. మీ సమాధానం?

ఈ దేశంలోపల ఏ మార్పు రావాలన్నా దళితులు, మహిళల మీద ఆధారపడి ఉన్నది. 55 శాతం మహిళలు ఇప్పుడు విప్లవోద్యమంలో ఉన్నరు.  దళితులు విప్లవోద్యమాల నాయకత్వంలోకి వస్తున్నారు.

10.      విరసం ప్రజా సంఘం ప్రణాళికలో మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం గీటురాయిగా ఉండాలని చెప్పుతుంది. ప్రజా సంఘానికి ఇది అవసరమా!

ఒక ప్రజా సంఘానికి ఇది అవసరం లేదు. ఒక చారిత్రిక సమయములో విరసం అనేక కర్తవ్యాలు నిర్వహించింది.... ఏ ప్రజా సంఘానికైనా అంతిమ కర్తవ్యం అదే అయినా – అది ఇంకో రూపం.

11.       భారతదేశంలో మార్పు రావాలంటే ఏం జరగాలి?

ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి వనరుల పంపిణీ జరగాలి. ఉత్పత్తి సంబంధాల ప్రజాస్వామ్యీకరణ జరగాలి.

12.       బహుజన సమాజ్ పార్టీ ఆచరణ మీద మీ అభిప్రాయం

ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడాలా, వ్యతిరేకంగా పోరాడాలా అన్నది సమస్య. రాజ్యాంగ పద్ధతుల్లో ఉత్పత్తి సంబంధాల్లో మార్పు రాదు. ఉత్పత్తి వనరుల పంపిణీ కాదు. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి కావు. UP లో BSP అధికారంలోకి వచ్చింది. బ్రాహ్మణీయ భూస్వామ్యాన్ని నిరోధించడం, దళారీ పెట్టుబడిదారి విధానాన్ని ఎదుర్కోవడం ముఖ్యమైన సమస్య.  విప్లవ పార్టీలన్నీ  కులమే ప్రధానమని తీర్మాణించుకున్నాయి. అంబేద్కర్ ను  ఈ దేశంలో చాలా ప్రమాదకారిగా బ్రాహ్మణీయ భూస్వామ్యం భావిస్తుంది. ఈ దేశాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారు.  అయితే అయన కాలం నాటికి ప్రజలను విప్లవ పోరాటాలల్లో  సమీకరించడానికి చాలా పరిమితులున్నాయి.  ఆయనకు ఉన్నాయి.

13.       ఈ రోజు తెలంగాణ ఆంధ్రలో వస్తున్న సాహిత్యంపై మీ అభిప్రాయం?

ప్రజలకంటే రచయితలు వెనుకబడి ఉన్నరు. ప్రజలను, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం లేదు.

14.       భారతదేశంలోపల కుల సమస్య ఎట్లా పరిష్కరించాలి?

యూరప్ లాంటి దేశాల్లో భూస్వామ్యం అవశేషాలను నిర్మూలించి, పెట్టుబడిదారి సమాజం ఏర్పడింది. భారతదేశంలో బ్రాహ్మణీయ భూస్వామ్యం పెట్టుబడిదారులతోని మిలాఖత్ అయింది. కింది కులాల శ్రామిక ప్రజల్ని కులాల పేరుతోని విడదీసింది. అంబేద్కర్ అన్నట్టుగా అదనపు విలువ కుల ప్రాతిపదిక మీద సమీకరించబడ్డది. ఈ దేశంలో సంపదంతా అగ్రకులాల చేతిలోనే ఉంది. కింది కులాల నుండి దోపిడీ చేసి అగ్రకులాలు పంచుకున్నయి.

బ్రాహ్మణీయ భూస్వామ్య వర్గం బయటనుండి వచ్చిన ఎవరితోనైనా మిలాఖత్ అవడానికి సిద్ధమే! కానీ, శ్రామిక కులాలైన దళితుల పట్ల, మహిళల పట్ల, ఆదివాసుల పట్ల హింసాత్మకంగా క్రూరంగా వ్యవహరిస్తూ వస్తున్నది. కనుక, భారతీయ భూస్వామ్యం ద్వంద్వ స్వభావం కలిగి ఉంది. అంబేద్కర్ అన్నట్టుగా వేరు తొలిచే పురుగైన కులాన్ని నిర్మూలించకుంటే ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాదు.

ఆ ప్రయత్నం మొదలైంది కనుకనే మునుపెన్నడూ లేనంతగా పాలక వర్గాలు, అగ్రకులాలు, సామ్రాజ్యవాద దేశాలు భారతీయ ప్రజల మీద అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు.  ఒక పక్క లోపాయికారిగా అనేక ఎన్ జి వో సంస్థలు పెట్టి – కోట్లాది రూపాయలు వాళ్ళకిచ్చి తప్పుడు ఉద్యమాలతో ప్రజలను చీలుస్తున్నారు. శ్రమశక్తిని, ఖనిజ వనరులను కొల్లకొడుతూ – లోపాయికారిగా ప్రజలను తైలాలతో లబ్దిదారులను చేస్తున్నారు. ఆదివాసులు, దళితులు, మహిళలు, మేధావులు, యువకుల మీద తీవ్ర నిర్భందం ప్రయోగిస్తున్నారు.  రాజ్యాంగాన్ని ప్రజలకు చూయిస్తూ – మధ్య యుగాల భుస్వామిక  పరిపాలన గ్రామాలల్లో –  అయితే  మునుపెన్నడూ లేని విధంగా, వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతిని దాదాపు ముప్పై కోట్ల మంది యువకులు నిరుద్యోగులుగా – పేలబోయే అగ్ని పర్వతంలాగున్నారు. ఇలాంటి పరిస్థితులను నిర్మాణయుతమయిన  పోరాటాలుగా మలుచుకోగలగాలి.

సాహిత్యమూ జీవితము వేరువేరు కాదు – అన్నవరం దేవేందర్‍

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు అన్నవరం దేవేందర్‍ గారు  ఇచ్చిన ఇంటర్వ్యూ

అన్నవరం దేవేందర్‍ నిరంతరకవి. ఆయన కవిత్వంలో తెలంగాణ జీవితం, భాష తొణికిసలాడతాయి. ‘‘మంకమ్మతోట లేబర్‍ అడ్డ ’’ ప్రపంచీకరణ నేపథ్యాన్ని, చితికిన పల్లెలు పట్టణాలకు వలసపోవడం చిత్రించింది. ఇప్పటివరకు (11) కవితా సంకలనాలు తెలుగులో (2) ఆంగ్ల కవితా సంకలనాలు Farmland Fragrance, unyielding sky వచ్చినాయి. ‘‘ఊరి దస్తూరి’’ కాలమ్‍ గత యాబై సంవత్సరాలుగా గ్రామాలలో చోటు చేసుకున్న పరిణామాలను కళ్ళకు కట్టింది. ‘‘మరోకోణం’’ సామాజిక వ్యాసాలు వెలువడినాయి. ఇంత సుధీర్ఘ సాహితీ ప్రస్థానం ఉన్న కవి అరవయవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జరిపిన ఇష్టాగోష్ఠి ఇది.

1.         కవిత్వం రాయాలనే బలమైన కోరిక ఎట్లా పుట్టింది. ఏ కవుల నుండి మీరు ప్రేరణ పొంది కవిత్వం రాస్తున్నారు. మిమ్ములను కదిలించిన కవితా సంకలనాలు ఏవి?

జ.    1980వ దశకంలో కవిత్వాన్ని ఆసక్తిగా చదువుతున్న సందర్భంలో 1990 తర్వాత నాకు కవిత్వం రాయాలనిపించింది. ముఖ్యంగా శ్రీశ్రీ, శివ సాగర్‍, చెరబండరాజు, గోపి, వరవరరావు, శివారెడ్డి,                   సి. నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్‍ కవిత్వం చదవడం వల్ల ప్రేరణ లభించింది. జూకంటి జగన్నాథం, నందిని సిధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య వీళ్ళ కవిత్వం ఇష్టం అనిపించేది. నాకు వ్రాయాలనే ఆసక్తి కలిగించింది.

2.         కవికి వ్యక్తిగత జీవితం, సాహిత్య జీవితం రెండూ ఉంటాయంటారు. కవిత్వంలో ప్రతిపాదించిన విలువలను జీవతంలో ఆచరించవలసి ఉందా? సాహిత్యాన్ని జీవితాన్ని వేరుగా చూస్తారా?

జ.       కవి యొక్క సామాజిక వ్యక్తిగత ఆలోచనల ప్రతిఫలనాలే కవిత్వం. కవిత్వం, కవి జీవితం  ఆచరణల ప్రతిబింబం కావాలి. ఆచరణ లేకుండా రాసే చిలుక పలుకులు ప్రజలు గమనిస్తారు. ఎవరికైనా సాహిత్యమూ జీవితము వేరువేరు కాదు.

3.         ఇటీవల ఫేస్‍బుక్‍, వాట్సప్‍ వచ్చినంక కవిత్వానికి ఎక్కువ ప్రాచుర్యం దొరికింది. రోజూ ప్రచారంలో ఉండాలనే యావ కవిత్వాన్ని పలుచన చేయదా? బలమైన కవిత్వం వస్తలేదనే విమర్శ ఉంది. మీ అభిప్రాయం చెప్పండి?

జ.       ఫేసుబుక్‍, వాట్సాప్‍,సోషల్‍ మీడియాలో కవిత్వం విస్తతంగా వస్తుంది. దాన్ని ఆహ్వానించాల్సిందే. నవతరం కవులు ఆ మాధ్యమాలు ఉపయోగిస్తున్నారు, వీటినీ వాడుకుంటున్నారు. కవిత్వం పలచన అవ్వడం ఎప్పుడూ ఉన్నదే. ఈ తరంలోనూ గొప్ప కవిత్వం మరింత చిక్కగా వస్తుంది.

4.         సాహిత్య సమూహాలు ఎవరి గుంపులోని వారిని వారు ఆకాశానికి ఎత్తుతున్నారు. దానిలో సాహితీ విలువలు ఉన్నా లేకున్నా అనే విమర్శ ఉంది. వివరిస్తారా?

జ.       ఇదంతా విలువలు పతనం అవుతున్న ప్రచారపు దశ. సమూహాలు ఎవరికి వారివే ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఆకాశానికి ఎత్తుకున్న అందులో పస లేకుంటే రాలిపోవుడే కదా.

5.         ఈనాడు సాహిత్య విమర్శ అంటే ఆహా! ఓహో అని పొగడడమే అని స్థిరపడిపోయింది. ఏదైనా విమర్శనాత్మకంగా అంచనా వేస్తే ఓర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏమంటారు?

జ.       ముందు తరం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం నేర్చుకోవడం తగ్గిపోయింది నిజమే. నాలుగు కవితలు రాసి నలుగురు మెచ్చుకోవాలనే యావ కూడా పెరిగింది. అయితే ఇందులో కవిత్వం విలువలు లేవు, వచనమే తేలియాడుతూ ఉంది అంటే చిన్నబుచ్చుకుంటున్నారు కూడా. నిజానికి నికార్సయిన మంచి విమర్శకులు కూడా లేని కాలం ఇది.

6.         మీరు కవిత్వం రాయడానికి కుటుంబ నేపథ్యం ఏమైనా ఉపయోగపడిందా?

జ.       కవిత్వం రాయడానికి కుటుంబ నేపథ్యం ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబము కులవృత్తి, సామాజిక నేపథ్యం, పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న చదువు, స్నేహాలు ఇవన్నీ మన ఆలోచనలను ఒక అధ్యయన దృక్పథం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఇంటిలో కవికి ఒక ఒంటరి వాతావరణం ఉండాలి. తన ఆలోచనాసరళికి గాని, రాతకోతలకు గాని తనకు ఒక సొంత స్పేస్‍  ఉండాల్సిన అవసరం ఉంటది. రాస్తున్న కవి ప్రభావం ఆ కుటుంబం మీదా పడుతుంది. ఇప్పుడు నా సహచరి ఏదునూరి రాజేశ్వరి కథలు రాస్తుంది

7.         అన్నవరం శ్రీనివాస్‍ (మీ తమ్ముడు) మీ ప్రతి పుస్తకానికి ముఖచిత్రం వేసినాడు. ఇది ఆయనకు కూడ కీర్తి సముపార్జించిందనుకొంటున్నారా?

జ.       నేను కవిత్వం ఎట్లా రాస్తానో మా తమ్ముడు బొమ్మలు అట్లా గీస్తాడు. నా పుస్తకాలతోపాటు ఇప్పటికే వందలాది పుస్తకాలకు ముఖచిత్రాలు వేశాడు. ఎన్నో చిత్ర ప్రదర్శనలలో తన బొమ్మలు ప్రదర్శించారు. మాది ఒకరిది కవిత్వం మరొకరిది చిత్రం.

8.         ఈనాటి కవిత్వం సమాజానికి దూరమై వైయక్తిక అనుభూతులకు పెద్దపీట వేసిందనే విమర్శ ఉంది. మీరేమంటారు?

జ.       సమాజానికి దూరమైందని భావన ఏమీ లేదు కానీ, సాహిత్యం ఉద్యమానికి ఆయువు ఎలానో ఉద్యమాలు కూడా సాహిత్యానికి ఆక్సిజన్‍ లాంటివి. ఉద్యమాల వెలుగులోనే అభ్యుదయ విప్లవ కవిత్వం వచ్చింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం నుంచి తెలంగాణ కవిత్వం వచ్చింది. అట్లాగే దళిత స్త్రీవాద సాహిత్యం కూడా సృష్టించబడింది. ఇప్పుడు సమాజంలో ఒక ఫోర్స్గా ఉండాల్సినంతగా ఉద్యమ వాతావరణం లేదు. అందుకే వైయక్తిక అనుభవాలు కవిత్వాలు అవుతున్నాయేమో...

9.         తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ గత వైభవాన్ని కీర్తించి, ఆంధ్ర వలస పాలకుల దోపిడీని ఎండగట్టిన కవులు తెలంగాణ వచ్చినంక గొంతుకలు మూగపోవడానికి కారణం? ఎలాంటి పీడన లేని సమాజం వచ్చిందంటారా?

జ.       దోపిడీ పీడన లేని సమాజం ఎక్కడ వచ్చింది. ఏర్పడకుండా చాపకింద నీరులా పీడన అనచివేత కొనసాగుతూనే ఉంది. కానీ ఇది బానిస భావజాలం అని తెలుస్తలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గత వైభవం, అప్పటి వలసాంధ్ర ఆధిపత్యం సాహిత్య వస్తువులయ్యాయి. ఇప్పుడు అడపా దడపా సాహిత్య సృష్టి జరుగుతుంది. నిజమే కానీ రావాల్సినంత రావడం లేదు.

10.       తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ కోసం ఆడిపాడిన కళాకారులను ‘‘సాంస్కతిక సారథి’’లో జీతగాళ్ళుగా తీసుకొన్ని ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఉపయోగించు కోవడం వలన ప్రజల పాట చచ్చిపోయింది అనే ఒక వాదన ఉంది. మీ వివరణ ఏమిటి?

జ.       తెలంగాణ కళాకారులు సాంస్కతిక సారథిలో వేతనజీవులుగా నియమింపబడటం పెద్ద తప్పు పట్టాల్సినది ఏమీ లేదు. ఎందుకంటే ఉదర పోషణార్థం అందరూ ఉద్యోగాలు చేయాల్సిందే. మనమందరం అట్లా చేస్తున్న వాళ్ళమే. అయితే పోరాటాల పాట తిరిగి పుట్టాల్సిందే.

11.       తెలంగాణలోని వాగ్గేయకారులు తాము నడిచి వచ్చిన దారిని మరిసి ప్రకృతి కవులుగా మారి, ప్రభుత్వ ప్రచార సారథులుగా మారి పదవుల గండ పెండేరాలను తొడుక్కొన్నారు అన్న విమర్శ ఉంది? మీరేమంటారు?

జ.       కవి ఎటువైపు నిలబడాలో కవి నిర్ణయించుకోవాల్సిందే. ప్రభుత్వంలో కవి, రచయిభాగమై పనిచేయడం మంచిదే కదా. కవి రచయిత  నడపాల్సిన సంస్థను ఇంకెవరో అనామకునికి అప్పగిస్తే ఎలా ఉంటుంది. అయితే ప్రభుత్వంలో నిలబడ్డ కవి, రచయిత, కళాకారుడు తన ప్రజా దృక్పథానికి మాత్రమే అనుగుణంగా ఉండాలి. ఒక జడ్జిలాగా స్వతంత్రంగా వ్యవహరించాలి.

12.       ప్రజల కోసం పని చేసే మేధావులు ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని సంపాదించి, ప్రజలను మరచిపోవడం వలన పౌర సమాజం లుప్తమయింది అంటారు. పౌర సమాజం క్రీయాశీలంగా ఉంటేనే చట్టబద్ధ పాలన ఉంటుందంటారు? మీ స్పందన తెలపండి?

జ.       పౌర సమాజం, ప్రజాసంఘాలు క్రయాశీలంగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వానికి కూడా మంచిది. ప్రభుత్వం నడిపే రాజకీయ పార్టీలకు ఎదురు లేకుండా, ఎదురు చెప్పకుండా                                  ఉండాలనుకుంటారు. కానీ అంతిమంగా అది నియంతృత్వం వైపు దారి తీస్తుంది. మనం చూస్తున్నాం. ప్రజా చైతన్యం జాగరూకతతో ఉండాలి. లేకుంటే సమాజం నిర్వీర్యమై పోతుంది.

13.       ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయి. భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వారిని శత్రువులుగా పరిగణించి అణచి వేస్తున్నారు. ఈ పరిణామం సాహిత్యంలో ఎంతవరకు చిత్రితమవుతుంది?

జ.       ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం అధికారంలో పైచేయిగా ఉంది నిజమే. దానితో పాటే మార్కెట్‍ శక్తులు చేతులు కలిపాయి. ఇప్పుడు రాజ్యాలను మార్కెట్లు బడా పెట్టుబడిదారులు తమ వ్యూహాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ఆయా సంస్కతులు  మార్కెట్‍ అనుగుణంగా మార్చుకుంటున్నాయు. ఈ పరిణామాలు సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో స్వల్పంగా చోటు చేసుకుంటున్నాయి. గ్లోబలైజేషన్‍ తర్వాత ఈ విష పరిణామాలు విస్తతమై పోతున్నాయి.

14.       రాజు కరుణిస్తే విలాసం, రాజు కరుణించకుంటే విలాపం.  ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సృజనకారులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ?

జ.       ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళుగానే అర్థం చేసుకుంటాం, ఇట్లాంటి వారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు.  సాహిత్య సృజన చేస్తున్నది ప్రజల కోసమా, ప్రభువుల కోసమా అనే ఎరుక నిరంతరం ఉండాలి.

15.       మీకు ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు, మీరు రావాలని కోరుకుని రాకపోయిన అవార్డులు ఏమైనా ఉన్నాయా ? అసలు అవార్డుల మీద మీ అభిప్రాయం ?

జ.       అవార్డులు పురస్కారాలు సాహిత్య సృజనకు ఒక చిరు ప్రోత్సాహమే తప్ప గీటురాళ్లు కావు.  నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, తెలంగాన సారస్వత పరిషత్‍ పురస్కారంతో పాటు మరెన్నో బాగానే వచ్చాయి.  కోరుకుని రాకపోయిన అవార్డులు అని అడిగారు అట్లాంటివి పెద్దగా ఏమీ లేవు.  అయితే కవులు ఎవరూ పురస్కారాల కోసం రాయరు.  అవార్డు సృజనను సృష్టించలేదు.

16.       మీ కవిత్వంలో మీకు నచ్చిన సంకలనం ఏది ? కారణాలు వివరిస్తారా ?

జ.       నా కవిత్వంలో నాకు నచ్చింది అని ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ 2005 లోని నా మూడవ కవితాసంపుటి ‘‘ మంకమ్మతోట లేబర్‍అడ్డా ’’ నా సిగ్నేచర్‍ పోయెట్రీ.  అందులో తెలంగాణా ఉద్యమము, రైతులు, కూలీల వలసలు, ప్రపంచీకరణ దుష్పరిణామాలు కవిత్వీకరించబడ్డాయి.

17.       ప్రపంచ వ్యాప్తంగా కొద్దిమంది దగ్గర సంపద పోగుపడే అభివృద్ధి నమూనా కొనసాగుతుంది కదా ! ఈ పరిస్థితి మారి అందరి కోసం ఒక్కరు, ఒక్కరికోసం అందరు అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ?

జ.       ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు మహా సంపన్నులవుతున్నారు.  ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతున్నది.  దీనికి దోపిడీ పీడన లేని సోషలిస్ట్ సమాజ నిర్మాణమే అవసరం.  అయితే పెట్టుబడిదారీ విధానం బహు జాగ్రత్త, అది రాకుండా దూరదృష్టితో అడ్డుకుంటుంది.

18.       తెలంగాణ వచ్చినంక కూడా ప్రకృతి వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతుంది.  కారణం ఏమిటి?

జ.       తెలంగాణ రావడం అంటే ఏదైనా సోషలిస్టు సమాజం వచ్చినట్టా, కాదు కదా ! పాలకులు వారే పార్టీల పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయి.  రాజ్య యంత్రాంగం, చట్టాలు, లోగుట్టులు, స్వభావాలు, ప్రభావాలు అవే కదా

సాహిత్య వ్యాసలు

ఊరి దస్తూరి- గ్రామ పరిణామం

గ్రామాన్ని ఎందుకు అధ్యయనం చేయాలె. దాన్ని మనుషుల సమూహంగా చూడాలెనా? లేక రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశంగా చూడాలెనా అన్నది ప్రశ్న.

గ్రామ అధ్యయనాలు అనేకులు తమ అవసరాల రీత్యా చేసినారు.బ్రిటిషు వలస పాలకులు వారి పరిపాలన అవసరాల కోసం గ్రామాల్లోని సంస్కృతిని అధ్యయనం చేసినారు.సంస్కృతిని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రజలను పరిపాలించ వచ్చని భావించినారు. వలస పాలన పోయి దేశానికి స్వాతంత్రం వచ్చినంక అభివృద్ధి ప్రణాళికల అవసరం కోసం గ్రామాల అధ్యయనాలు జరిగినాయి. విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు వారి అధ్యయన అంశంలో భాగంగా గ్రామాలు అధ్యయనం చేసినారు. మార్క్సిస్టు సిద్ధాంత ఆచరణ లో భాగంగా గ్రామాల అధ్యయనం జరిగింది. ఇప్పుడు మార్కెట్ అవసరాల కోసం తమ వినియోగదారులను వెతికే వేటలో భాగంగా గ్రామాల అధ్యయనం జరుగుతున్నది.

అన్నవరం దేవేందర్ "ఊరి దస్తూరి- తెలంగాణ సాంస్కృతిక చిత్రణ" గ్రామానికి సంబంధించిన అధ్యయనమే. మన తెలంగాణ దినపత్రికలో ఆదివారం అనుబంధం,"హరివిల్లు", "దునియా" శీర్షిక కింద ఫిబ్రవరి 2015 నుండి డిసెంబర్ 2018 వరకు రాసిన కాలమ్స్ పుస్తకరూపంలో వచ్చింది.

రచయిత అనుభవ జ్ఞానం(Empirical knowledge) నుండి గ్రామాన్ని చూసినా, దీనిలో 1960 నుండి ఇప్పటి వరకు జరిగిన గ్రామ పరిణామాలు కనబడతాయి. "ఇదంతా కొత్త తరం కోసం గతం ముచ్చెట"(పుట 242) అని రచయిత చెప్పుకున్నాడు. వాటిని వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

మానవుడు ఆహార సేకరణ, వేటాడి జీవించే దశలు దాటి వ్యవసాయం నేర్చుకున్నంకనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. గ్రామం ఒక ఎత్తైన ప్రాంతంలో ఉంటే పల్లపు ప్రాంతాల్లో పంట భూములు ఉంటాయి. భారతీయ వర్ణ వ్యవస్థ ప్రకారం వైశ్యులు, శూద్రులు వ్యవసాయం చేసేవారు. రాన్రాను వైశ్యులు కేవలం వ్యాపారం మీదనే కేంద్రీకరించిన తర్వాత శూద్రులు వ్యవసాయం చేసి పంటలు పండించినారు. శిస్తు పంటలో ఆరవ భాగం వసూలు చేసేది. ఒక్కొక్కసారి పండిన పంట లో సగభాగం వరకు ఉండేది.

తెలంగాణలో ఎక్కువగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి భూస్వాములు ఉండేవారు. అక్కడక్కడ వెనుకబడిన కులాలు కూడా ఎక్కువ భూకమతాలు కలిగి ఉన్నారు.గ్రామంలో ఆధిపత్యం భూములు ఉన్నవారిదే. "దొరలు పటెండ్లు ఊరును ఏలుడు వాళ్లకే భూములు, జాగలు, పంటలు ఉంటయి" (పుట 102). గ్రామాల్లో పూర్వం జాజ్ మనీ(jajmani) లేక యజమాని ఆర్థిక వ్యవస్థ అమలులో ఉండేది. కింది కులాల వారు పై కులాల వారికి చేసిన అనేక పనులకు ప్రతిఫలంగా ధాన్యం చెల్లించేవారు. ఇది పెట్టుబడిదారీ పూర్వ దశ.

ఈ దశలో వ్యవసాయంలో మోటలు,యాతాలు,గూడలు ఉండేవి. వీటి ఆధారంగా బావుల నుండి వాగుల నుండి నీటిని పారించుకునేది. వ్యవసాయానికి అవసరమైన అనేక పరికరాలు అనేక కుల వృత్తుల వారు సరఫరా చేసేది.

మాదిగలు తాళ్లు, తనుగులు, దండేడలు, తొండపు తాళ్లు, పగ్గాలు, ముగుదాళ్ళు, నులక, చేంతాడు, చెప్పులు, తొండాలు చేసి ఇచ్చేది.

వడ్రంగులు నాగండ్లు, గుంటుకలు, జంబు, మోటా, బండి మొదలైనవి చేసేవారు.

కమ్మరలు కొడవండ్లు, గోడ్డండ్లు,కురిపెలు,నాగలి కర్రు మొదలైన వస్తువులు చేసేవారు.

మేదర్లు గంపలు, చాట్లు, గుమ్ములూ,కచ్చురానికి పోనుకలు చేసి ఇచ్చేది. ఇట్లా చేసిన పనికి ప్రతిఫలంగా పంట సమయంలో కొంత ధాన్యం పెట్టేది. దీనినే "బాపతు"(పుట 293) అంటరు.

ఈ విధంగా రైతు పండించిన పంట వినిమయానికి మాత్రమే. మార్కెట్లో అమ్మకానికి కాదు. మిగులు లేని తొలిదశ ఇది. వస్తువులు సరుకుగా మారని ఉమ్మడి సమాజం. స్త్రీ-పురుష కూలీలకు ధాన్యం రూపంలో కూలి చెల్లించేది. పాలేరు లకు జీతం కూడా ధాన్యమే. గొంగడి చెప్పులు  అదనం.

సామూహిక ఉత్పత్తికి అవసరమైన సహాయక అనుబంధ వృత్తులను గ్రామీణ సమాజం తయారు చేసుకుంది. వాటిని నిర్బంధం చేసింది. కూలీలు స్వేచ్ఛగా తమ శ్రమను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే స్వేచ్ఛ లేని ఫ్యూడల్ నిర్బంధ సమాజం అది. దాదాపుగా ఆ కాలంలో వస్తు మార్పిడి అమల్లో ఉండేది. "సోలెడు వడ్లకు తక్కెడు జామ పండ్లు ఇచ్చే వీరమల్లవ్వలు" (పుట 32) ఉన్న కాలం.

భూమి సారాన్ని పెంచడానికి గొర్రె మేకల మందులు పెట్టించే వారు. "ఎండిపోయిన ర్యాగడి  మన్ను పొలాలకు ఎరువుగా వాడతరు"(పుట 38). వేసవికాలంలో చెరువు ఎండిపోయినంక చెరువు మట్టిని పంట భూముల్లో వేసేవారు.ఈ మెత్తని మట్టి భూమి లోపలి తేమను పట్టి ఉంచడంతో పాటు భూమిని సారవంతం చేసేది. ఇది ఎరుపు గా ఉపయోగపడి ఉత్పాదకతను పెంచేది. ఇట్లా లోతైన చెరువులో ఎక్కువ నీటి నిల్వకు అవకాశం ఏర్పడేది.

ప్రతి రైతు "ఇంటికి ఒక పెంట బొంద"(పుట 96) ఉండేది.అయిటి పూనంగానే ఎడ్లబండి తోని జారగొట్టి పంట భూమిలో పోసేది. "అవి సహజ ఎరువులు"(పుట 97).

పండించిన పంట నుండి "ఇత్తునం"(పుట 99) దాచి పెట్టేవారు. విత్తనాన్ని అమావాస్య రోజు ఎండబెట్టి దాచుకోవడం అలవాటు. ఆరోజు రైతుల ఇళ్ల ముందు విత్తనాలు దర్శనమిస్తాయి.అది మారకం కోసం కాకుండా వినియోగం కోసం పంటలు పండించిన కాలం. "కాపు దనపొల్ల తోటలకుపోతే సంబరంగా (కూరగాయలు) తెంపి ఇచ్చేది"(పుట 178)

1860-1900 వరకు గ్రామసీమల్లో కరువు రాజ్యమేలింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు రచించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నాలు జరిగినయి. కానీ మళ్లీ కరువులు రావడం తోని, విదేశాల నుండి ఆహారధాన్యాలు తెచ్చే ఓడల కోసం ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ సంకట పరిస్థితులలో స్వయం సమృద్ధిని సాధించడానికి 1966లో దేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టడం జరిగింది.

ఎక్కువ దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు,రసాయనిక ఎరువులు, పురుగుమందులు వ్యవసాయం లోకి ప్రవేశించినయి. తక్కువ కూలి, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామీణ ధనిక రైతాంగాన్ని మరింత సంపన్నులను చేసింది.

హరిత విప్లవం అందించిన మిగులుతో  ధనిక రైతులు పట్టణాల్లో వ్యాపారాలు పెట్టుకున్నారు. ఈ సంపన్న వర్గం నుంచి వచ్చిన వారు ఉన్నత చదువులు చదివి చదువును సామాజిక పెట్టుబడిగా మార్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి వ్యవసాయానికి పెట్టుబడి సమకూర్చే వనరుగా మారినారు. అమెరికా లాంటి విదేశాలకి పోయి డాలర్లు సంపాదించినారు.

ట్రాక్టర్ వచ్చినంక నాగలి మూలకు పడ్డది. ఎడ్లబండి అవసరం తీరింది. "సకలం పనులకు కూడా యంత్రాలే వచ్చినయి" (పుట 87). స్తోమత ఉన్నవారు ట్రాక్టర్, బోరు యంత్రం,కోత యంత్రం (హార్వెస్టర్) వరి గడ్డి కట్టలు కట్టే యంత్రం మొదలైనవి  కొని వాటిలోని  వాటితోని వ్యవసాయ పనులు చేయిస్తున్నారు.

వ్యవసాయం యంత్రికరణ వలన కూలీలకు పనులు దొరకక పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలసలు పోతున్నరు. ఈ విధంగా గ్రామాలు తరుగుతున్నయి. పట్టణాలు పెరుగుతున్నయి. ఇది హరిత విప్లవం తీసుకు వచ్చిన అసమ అభివృద్ధి.

హరిత విప్లవం తర్వాత గ్రామాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది తెల్ల విప్లవం లేక ఆపరేషన్ ఫ్లడ్. దీన్ని పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రవేశపెట్టారు. వ్యవసాయంలో సంకరజాతి విత్తనాలు వచ్చినట్లే సంకరజాతి పశువులు వచ్చినవి. "మంచి ఇత్తునం కావాలని సంపర్కం లేకుండా ఎదకు వచ్చిన లేగదూడలకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు.(పుట 55). దేశవాళి పశువులు అయినా ఆవు, బర్రెలకు ఎక్కువ పాలు రావు. అదే జెర్సీ ఆవు, ముర్రా జాతి బర్రెలు ఎక్కువ పాలు ఇస్తయి.ఈ జాతుల స్వచ్ఛతను కాపాడటానికి పశువుల మందలకు పంపకుండా దొడ్డి లోనే పెంచుతరు. ఒకవేళ ఎదకు వస్తే ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ కోసం విత్తనపు కోడె/పోతు వీర్యాన్ని ఎక్కిస్తారు. ఈ విధంగా కృత్రిమ గర్భధారణ తోటి వాటి సంతతి పెరుగుతుంది. ఎక్కువ పాలను ఇస్తయి.ఇట్ల వచ్చినవే కోళ్ల పరిశ్రమలు, డైరీ ఫామ్ లు, చేపల పెంపకం. చేపల్లో "రవు" (పుట 56) కృత్రిమంగా అభివృద్ధి చేసిన జాతి. దీనిలో పోషక విలువలు (ప్రొటీన్లు) అధికంగా ఉంటాయి.

పరిపాలన సంస్కరణల్లో భాగంగా మండల వ్యవస్థ ఏర్పడింది. గ్రామాలలోని ఆధిపత్య కులాలు రాజకీయ పదవులను చేజిక్కించుకున్నారు. ఒకవేళ ఈ అవకాశం లేని పరిస్థితుల్లో తమ దగ్గరి మనుషుల గెలిపించుకున్నారు. తమ పలుకుబడితో  కాంట్రాక్టు ,రాజకీయ పైరవీలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నారు.

వ్యవసాయం తర్వాత గృహ యాంత్రీకరణం జరిగింది. రోలు,రోకలి,ఇసుర్రాయి, పొత్తురం వస్తువుల స్థానంలో రైస్ మిల్, పిండి మిల్, గ్రైండర్, వాషింగ్ మిషన్, ప్రెషర్ కుక్కర్, వ్యాక్యూమ్ క్లీనర్, గీజర్, టీవీ, కూలర్, రిఫ్రిజిరేటర్ మొదలైన వస్తువులు ఇంటిని పూర్తిగా యంత్రికరణ చేసింది.  (పుటలు71,72,118,119,123,143,156).

శుభ్రం చేయకుండా నీళ్లు తాగితే కలరా లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వ్యాపార సంస్థలు ఒక ప్రచారం మొదలుపెడతాయి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు లేకుండా చేసే ఫిల్టర్లు మొదలు వచ్చినయి. ఇప్పుడు గ్రామ గ్రామానికి ఇంటింటికి ఫిల్టర్లు వచ్చినయి. గ్రామంలో ఫిల్టర్ నీరు కొనుక్కొని తాగుతున్నారు. ఉచితంగా దొరికే నీరు ఇప్పుడు వ్యాపార సరుకు అయింది.నీళ్ల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు ఇట్లా వ్యాపారం పెరిగింది. "మంచినీళ్లు సుత ప్యాకెట్లు గా మారుతున్నాయి"( పుట 36).

1991లో ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత గ్రామం పూర్తిగా మార్కెట్ కు    అనుసంధానం అయింది. రహదారులు ఏర్పడ్డయి. సరుకుల రవాణా కొరకు ఆటోలు, టాటా ఏసీలు ప్రతి ఊరుకు రవాణా అందుబాటుకు తెచ్చినయి. గ్రామంలోని ప్రతి ఇంటికి రంగు రంగుల టెలివిజన్లు వచ్చినయి.(పుట 156 ) వినోదంతో పాటు సరుకుల వ్యాపార ప్రకటనలు తెచ్చింది. సినిమా, సీరియల్ పావుగంట, వ్యాపార ప్రకటనలు పదినిమిషాలు. వినోదం కంటే వ్యాపారమే మెదట్ల నిండిపోతది. తెల్లవారి ఏ వస్తువు కొనాలన్నా అవే వ్యాపార ప్రకటనలు మెదట్ల మెసులుతయి.   ఇల్లు పెట్టుబడిదారులు తమ సరుకులను అమ్ముకునే వేదిక అయింది టీవీ. సీరియల్స్ చూడాలంటే డిష్ కనెక్షన్ కావాలి. దానికి నెల నెలకు డబ్బు కట్టాలి. పొరుగు వాళ్లతోని మాట లేదు ముచ్చట లేదు. ఇంటిలోనే కుటుంబ సభ్యులు ఒకరితోనొకరు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేసింది టీవీ."టీవీల ముందటనే తలెలు పట్టుకుని తినుకుంట సూస్థన్రు" (పుట 245- 46) ఇది మనుషుల మధ్యన ఉండే సామూహికతను దెబ్బతీసింది.

దీని తర్వాత సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ లకు నిరంతరాయంగా సిగ్నల్స్ అందించడానికి సెల్టవర్లు వచ్చినయి. ఫోన్ లో బ్యాలెన్స్ కోసం రీఛార్జి వచ్చింది. ఇప్పుడు ప్రపంచం పిడికిట్లోనే "స్మార్ట్ ఫోన్ వచ్చినంక అంతా నాశనం అవుతుంది"(పుట 344) ఫోన్ లో కాలక్షేపం కోసం వీడియోలు, చాట్ లు, పబ్జి గేమ్ లు వచ్చినయి. ఈ ఆటలో ఒక వ్యసనంగా మార్చేస్తున్నాయి. అది చూసి ఆడి ప్రపంచాన్ని మరిచి పోతున్నారు.సోయి లేని మనషులు తయారవుతున్నరు.

గ్రామాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చింది. ఎకరాలు కొని గజాల కొద్ది అమ్మె పద్ధతి వచ్చింది. సంపన్నులు ఈ వ్యాపారం చేసి ఇంకా సంపన్నులు అవుతున్నారు. భూమి కబ్జాలు, దందాలు పెరిగిపోతున్నాయి.అల్కగ  సంపాదించుడు"(పుట 246) నేర్చుకున్నారు.

రియల్ ఎస్టేట్ తో పాటు నిర్మాణ రంగం పెరిగింది. ప్లాట్లు కట్టి అమ్ముడు, అపార్ట్మెంట్లు కట్టి అమ్ముడు జరుగుతుంది. ఈ నిర్మాణ రంగానికి ఇసుక,మొరం, రాయి, కలప అక్రమ రవాణాలు పెరిగిపోయినయి. ఈ విధంగా సహజ వనరులను కొల్లగొట్టి సొమ్ము చేసుకోవడం మామూలు విషయం అయిపోయింది. గ్రామాల్లోని గుట్టలు పచ్చ నోట్ల కట్టలు గా మారుతున్నయి. "ఏ గుట్టనన్న గ్రానైట్ కు అక్కరకు వచ్చిందంటే సాలు దాన్ని కొనుక్కొని బయటి దేశాలకు అమ్మ వట్టిరి"(పుట 171)

గ్రామాల్లో సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ పెరిగిపోయింది. బ్రాహ్మణుల ఆచారవ్యవహారాలను అనుసరించడం సంస్కృతీకరణ అంటారు. పాశ్చాత్యుల ను అనుకరించడం పాశ్చాత్యీకరణ. ఇవి రెండు గ్రామాల్లో జమిలిగా అమలు జరుగుతున్నాయి. పిల్లలు పుడితే "కొత్త నామకరణాలు"(పుట 89) సంస్కృతీకరణ లో ఒక అంశం.దోతులు కట్టుకోవడం పూర్తిగా తగ్గిపోయింది. ప్యాంటు షర్టు వేస్తున్నారు. మొదలు సమాజంలోని బ్రిటిష్ వారిని అనుకరించి ప్యాంటు టీషర్ట్ వేసుకున్నారు. అదే అనుకరణ తోని యువతరం అంతా జీన్స్ మీది కెళ్ళి టీషర్ట్ వాడుతున్నారు (పుట 332)

ఇప్పుడు గ్రామాలు పూర్తిగా పట్టణాలను అనుసరిస్తున్నాయి. కొత్త కొత్త పద్ధతులు ఏవి వచ్చినా గ్రామానికి చేరుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు వేదిక పూలతోని అలంకరణ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి అనేక అంశాల్లో పట్టణాలను అనుకరిస్తున్నారు. స్తోమత ఉన్నా లేకున్నా అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు. గ్రామం మొత్తం వినిమయ సంస్కృతిలో భాగం అయింది.

గ్రామంలోని మిగులును లిక్కర్ వ్యాపారం,బార్లు,మాల్స్ పట్టణాల్లో ప్లాట్లు, విందులు వినోదాలు,పండగలు పబ్బాలకు ఖర్చు పెడుతున్నారు.

ఎన్ని ఆధునిక సౌకర్యాలు వచ్చిన కట్టు బొట్టు, ఆహారం, ఆహార్యం మారిన గ్రామం మూల ధాతువు మారలేదు. ఎలాంటి సడలింపులు లేవు. నిచ్చెన మీద పెద్ద కులపాయన కూకుంటే కింది మెట్టు మీద ఆయనకన్నా తక్కువ కులపాయన ఆ కింది మెట్టుమీద అ చేతిపనోళ్లు, ఇంకా కింది మెట్టుమీద దళితులు కూకుంటారు.( పుట 3)

"భారతీయ పల్లెలే అభివృద్ధికి పట్టు  గొమ్మలు" అని గాంధీ అన్నాడు. అంబేద్కర్ దృష్టిలో గ్రామాలు "హిందూ సామాజిక వ్యవస్థ నమూనాలు. గ్రామాలు రెండు భిన్నమైన సమాజాల సమ్మేళనం. గ్రామంలో నివసించే సవర్ణులు, గ్రామం బయట నివసించే అంటరానివారు ఈ రెండు భిన్నమైన సమాజాలు"

"స్వయం సమృద్ధ గ్రామీణ సమాజాలు భారత దేశాన్ని నాశనం చేసినవి. గ్రామం లో ఏముంది? మురిగిపోయిన స్థానిక త్వం, అజ్ఞాన అంధకారం, సంకుచితత్వం, మతోన్మాదం" అన్నాడు అంబేద్కర్.

"ఎన్ని కులాలన్న ఉండనియ్యి ఊరంతా చుట్టాలు లెక్కనే వరుసతోనే పిలుసుకుంటారు. (పుట 31) ఇది గ్రామం సాధించిన కృత్రిమ సామరస్యం. గీత దాటితే కింది కులాల వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అందుకే వాళ్లు కూడా అనిగిమనిగి బతుకుతారు.

ఊరి దస్తూరి చాలా కాలం రాసిన కాలమ్స్ సమాహారం కావడం వలన కొన్ని పునరుక్తులు చోటుచేసుకున్నవి. గ్రానైట్ పరిశ్రమ గురించి (పుటల్లో 155, 171,240)ఉంది. "అరుగుల మీద కూకొని ముచ్చట్లు" (పుటలు 321,335)కనబడతాయి.

రైతు వృత్తి పనివారికి వస్తు రూపంలో చెల్లించే కూలిని "బాపతు" (పుట 293) అదే దాన్యం రూపంలోని కూలీని 'బిచ్చం" (పుటలు 320,337) అంటాడు.

అంబటాళ్ల సమయం గురించి ఒక చోట 11 గంటలకు (పుట 146) మరోచోట పన్నెండు గొట్టంగా (పుట 189) అంటాడు.

వాన కాలంలో బొడ్డు మల్లె చెట్టు పూస్తుందని (పుటలు 112, 256) చెపుతాడు, కానీ అది చలికాలం లో పూస్తుంది.

జొన్నలు మక్కలు ఇసురురాయి లో పోసి ఇసిరినంక వచ్చేదాన్ని తాల్చి పిండిని గటుకను వేరు చేస్తరు. మళ్లీ గటుకను కోడి పొట్టును వేరు చేస్తే గటుక వస్తది దాన్ని ఎసట్ల వేసి ఉడికించినంక గటుక తయారు అయితది. ఇదే గటుక క్రమం."ఇసిరి పిండి చేసి ఆ పిండిని ఉడకబెడితే మక్క గటుక అయితది" (పుట 306) అంటాడు.

అన్నవరం దేవేందర్ ఇప్పటి తరం వారికి గ్రామంలో చోటు చేసుకున్న మార్పులను వివరించాలని ఊరి దస్తూరి రాసిండు. సామాజిక శాస్త్రవేత్తలు చేయవలసిన పనిని ఒక కవి చేయడం అభినందనీయం. మలి ముద్రణలో పైన సూచించిన వాటిని సవరిస్తాడని ఆశిద్దాం.

 

సంప్రదించిన పుస్తకాలు

 1. విద్యాసాగర్  ఎస్.ఎ 2013 పల్లెను మింగిన పెట్టుబడి గ్రామీణ ఆర్థికం- ఒక పరిశీలన పికాక్ బుక్స్ హైదరాబాద్

2.వేణుగోపాల్.యన్ 2013 ఊరి దారి, గ్రామ అధ్యయనాల పరిచయం, వీక్షణం పబ్లికేషన్స్ హైదరాబాద్

3.పురేంద్ర ప్రసాద్ 2015 సమకాలీన భారత దేశంలో గ్రామీణ అధ్యయనాలు అవసరమా?(13- 26) మారుతున్న గ్రామీణ జీవితం ఒక అధ్యయనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్

4. బాలగోపాల్ .కె 2018  కరువు వ్యవసాయ సంబంధాలు మానవ హక్కుల వేదిక ప్రచురణలు హైదరాబాద్

5. నరసింహారెడ్డి డి 2018 తెలంగాణ పల్లెలు వర్గ సామాజిక విశ్లేషణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్

 6.Srinivas.M.N 1994, caste in modern india and other essays,india promoters and publishers pvt.ltd Bombay.

జాతీయోద్యమం - తెలుగు నవల - దళిత జనోద్ధరణ

పశ్చిమ దేశాలలో వచ్చిన జాతీయోద్యమానికి, భారతదేశంలో వచ్చిన జాతీయోద్యమానికి స్వరూప స్వభావాల్లో స్పష్టమైన తేడా ఉంది. ఇంగ్లాండు మొదలైన దేశాల్లో భూస్వామ్య పీడనను చర్చి ఆధిపత్యాన్ని అక్కడి జాతీయోద్యమం ప్రశ్నించింది. యూరప్లో పెట్టుబడిదారి వ్యవస్థ ఎదుగుదలకు భూస్వామ్య వ్యవస్థ, మత ఛాందస భావజాలం అడ్డంకిగా నిలిచాయి. ఈ ప్రతిబంధకాలను జాతీయోద్యమం తొలగించి పెట్టుబడిదారి వ్యవస్థ ఎదుగుదలకు మార్గం సుగమం చేసింది.

భారతదేశంలో జాతీయోద్యమం వలస పాలనకు వ్యతిరేకంగా వచ్చింది. భూస్వామ్య వ్యవస్థను మత భావజాలాన్ని ఇక్కడి జాతీయోద్యమం తిరస్కరించలేదు. బాలగంగాధర్ తిలక్ నుండి గాంధీ వరకు గతం నుండి మతం నుండి ప్రేరణ పొందారు. హిందూమతం నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమ నాయకత్వం, హిందూమతం నుండి ఉత్పన్నమైన అస్పృశ్యత సమస్యను పట్టించుకోవడం ఒక వైరుధ్యంగా కనబడినా, అస్పృశ్యత సమస్యను ఒక చారిత్రక అవసరంగా జాతీయోద్యమ నాయకత్వం తన కార్యక్రమంలో అంతర్భాగం చేసుకొంది.

దళిత సమస్యను కాంగ్రెసు నాయకత్వం పట్టించుకున్న తీరు, దాన్ని తన కార్యక్రమంలో అంతర్భాగం చేసుకున్న తీరు, దానికి తెలుగు నవలలు స్పందించిన తీరును ఈ వ్యాసంలో పరిశీలించడం జరుగుతుంది.

1917 సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన కలకత్తాలో కాంగ్రెసు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతదేశంలోని అస్పృశ్యులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను రూపుమాపటానికి కాంగ్రెసు పార్టీ చర్యలు తీసుకొంటున్నట్టు సురేంద్రనాథ్ బెనర్జీ ప్రకటించాడు. 37 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంగ్రెసు పార్టీ మొట్టమొదటిసారి అస్పృశ్యుల గురించి ఒక ప్రకటన చేసింది. కాంగ్రెసు పార్టీకి అంటరానివారి సమస్యలు గుర్తుకు రావటానికి కారణం ఉంది.

1917 సంవత్సరంలో బొంబాయిలో అణగారిన కులాల సంఘం మహాసభ జరిగింది. ఈ సభ అణగారిన కులాల ఉద్ధరణకు కొన్ని తీర్మానాలు చేసింది. 1917లో సర్నారాయణ చందావర్కర్ అధ్యక్షతన జరిగిన అణగారిన వర్గాల సంఘం మొట్టమొదటి సమావేశం తీర్మానాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఈ సమావేశం బ్రిటీషు ప్రభుత్వానికి విధేయతను ప్రకటించింది. ప్రభుత్వ నిర్వహణలో రావలసిన సంస్కరణల గురించి భారత జాతీయ కాంగ్రెసు అఖిల భారత ముస్లిం లీగు చేసిన సిఫారసులను ఈ సమావేశం ఆమోదించింది. భారతదేశంలో అణగారిన కులాలవారు అంటరానివారుగా పరిగణింపబడుతున్నారు. వారి సామాజిక స్థితి హీనంగా ఉంది. విద్యలో వారు వెనకబడి ఉన్నారు. వారు తమ అభివృద్ధికి అవసరమైన పరిస్థితులను కల్పించుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ దుస్థితి నుండి వారు బయట పడటానికి వారికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ సమావేశం కోరింది. భారత ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్యను అస్పృశ్యులకు అమలు చేయాలని, సార్వత్రిక విద్యావిధానం వల్లనే అణగారిన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సమావేశం అభిప్రాయపడింది. అణగారిన వర్గాలపైన మతం. సంప్రదాయం విధిస్తున్న అనర్హతలను తొలగించటానికి త్వరలో జరగన్ను కాంగ్రెసు మహాసభలో ఒక తీర్మానాన్ని చేయాలని ఈ సమావేశం కాంగ్రెసు పార్టీకి విజ్ఞప్తి చేసింది. అగ్రకులాల వారు అణగారిన కులాలను ఉద్ధరించటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే అణగారిన వర్గాల రెండవ సమావేశం బ్రాహ్మణేతర పార్టీ నాయకుడు బాపూజీ నామవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం కూడా అణగారిన కులాల ఉద్ధరణకు తీర్మానాలు చేసింది. బొంబాయిలో నారాయణ చందావర్కర్ అధ్యక్షత జరిగిన అణగారిన వర్గాల సమావేశం చేసిన తీర్మానానికి ప్రతిస్పందిస్తూ 1917 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెసులో సురేంద్రనాథ్ బెనర్జీ అణగారిన కులాల అభివృద్ధికి కాంగ్రెసు పార్టీ కృషి చేస్తుందని ప్రకటించాడు. 1917 సంవత్సరంలో బ్రిటీషు సామ్రాజ్యంలో భాగంగా భారతదేశంలో స్వపరిపాలన సంస్థలను, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని మెల్లమెల్లగా ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నట్టు బ్రిటీషు కామన్స్ సభలో మాంటెగ్యూ (Secretory of state for India) ప్రకటించాడు. 1916 సంవత్సరంలో 19 మంది ఇంపీరియల్ కౌన్సిల్ సభ్యులు భారతదేశంలో ప్రాతినిధ్య ప్రభుత్వం, డొమీనియన్ ప్రతిపత్తి కావాలని వైస్రాయికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ డిమాండును అనుసరించి అందులో భాగంగానే మాంటెగ్యూ ప్రకటన వెలువడింది. కాంగ్రెసు, ముస్లింలీగు పథకాన్ని జాతీయ డిమాండుగ చేయటానికి కాంగ్రెసు పార్టీ ప్రయత్నించింది. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఇవ్వటానికి కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలకు సీట్లను కేటాయించారు. ఈ పథకాన్ని కాంగ్రెసు లీగు పథకం లేక లక్నో ఒప్పందం అంటారు.

ఈ ఒప్పందం ప్రకారం ముస్లింలు కాంగ్రెసుకు మద్దతు ప్రకటించారు. ఇక మిగిలింది అస్పృశ్యులు, అస్పృశ్యుల మద్దతు కూడా కూడగట్టితే కాంగ్రెసు పార్టీ దేశంలోని ప్రజలందరి పార్టీగా గుర్తింపు పొందుతుంది. అణగారిన కులాల సంఘం అధ్యక్షుడైన సర్ నారాయణ చందావర్కర్ను తమకు మద్దతు ప్రకటించవలసిందిగా కాంగ్రెసు పార్టీ కోరింది. అణగారిన కులాల సంఘం కాంగ్రెసు లీగు పథకాన్ని కొన్ని షరతులతో అంగీకరించింది. "అంటరాని కులాల సాంఘిక అనర్హతల నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానాన్ని చేస్తే తాము కూడా కాంగ్రెసు-లీగు పథకాన్ని ఆమోదిస్తామని అణగారిన వర్గాల సంఘం ప్రకటించింది". ఈ ఒప్పందం ప్రకారం 1917 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెసు సమావేశంలో సురేంద్రనాథ్ బెనర్జీ అణగారిన వర్గాల గురించి ప్రకటన చేశాడు. ఈ విధంగా అస్పృశ్యత సమస్య కాంగ్రెసు పార్టీ కార్యక్రమంలో అంతర్భాగమయింది. ఇదంతా గాంధీ కాంగ్రెసు నాయకత్వానికి రాకముందు జరిగిన చరిత్ర. నిమ్నవర్ణాల నుండి ఒత్తిడి రావటం వలన ఆ వర్గాలను వలస పాలకులకు వ్యతిరేకంగా కూడగట్ట వలసిన అవసరం ఏర్పడటం వలన అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెసు అస్పృశ్యత సమస్యను తన కార్యక్రమంలో భాగం చేసుకొంది.

దళిత జనోద్ధరణకు కాంగ్రెసు పార్టీ చేసిన కృషి :

గాంధీ 1919 సంవత్సరంలో కాంగ్రెసు పార్టీ నాయకత్వాన్ని స్వీకరించాడు. అప్పటివరకు మధ్యతరగతి మేధావులకు మాత్రమే పరిమితమైన కాంగ్రెసు పార్టీని గాంధీ సామాన్య ప్రజల వరకు విస్తరింప చేశాడు. 1922లో బార్డోలి కాంగ్రెస్ సమావేశంలో అస్పృశ్యులను సామాజికంగా, మానసికంగా, నైతికంగా అభివృద్ధి చేయటానికి నిర్ణయించారు. పంచముల పిల్లలను జాతీయ పాఠశాలల్లో చేర్పించాలని, అగ్రవర్ణాల పిల్లలతో సమానమైన సౌకర్యాలను వారికి కూడా కల్పించాలని తీర్మానించారు.

1922 సంవత్సరం జూన్లో జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అంటరాని వాళ్ళను ఉద్ధరించటానికి స్వామి శ్రద్ధానంద జీ, సరోజిని నాయుడు, యాగ్నిక్ మరియు దేశపాండే సభ్యులుగా ఒక కమిటీని నియమించారు. ఈ సభ్యులను దేశంలోని అంటరాని కులాల ఉద్ధరణకు ఆచరణాత్మకమైన కార్యక్రమం రూపొందించవలసిందిగా కాంగ్రెసు పార్టీ కోరింది. ఈ కార్యక్రమానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 1922 సంవత్సరంలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో ఈ నిధిని రెండు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచారు. నిధుల సమీకరణకు ఒక ఉపకమిటీని కూడా నియమించారు.

 

ఈ కమిటీకి స్వామి శ్రద్ధానందజీ రాజీనామా చేశాడు. తరువాత ఈ కమిటీని పునరుద్ధరించ లేదు. 1923 సంవత్సరంలో బొంబాయిలో జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశం అస్పృశ్యతను రూపుమాపటానికి కృషి చేయవలసిందిగా హిందూ మహాసభను కోరింది. హిందూ మహాసభ క్రియాశీలమైన హిందూ మతతత్వ సంస్థ. "మతపరంగా, సాంస్కృతికంగా హిందూ వ్యవస్థను కాపాడటమే హిందూ మహాసభ ప్రధాన లక్ష్యం". అస్పృశ్యత సమస్య హిందూ మత వ్యవస్థ నుండి ఆవిర్భవించింది. అస్పృశ్యతను రూపుమాపాలంటే హిందూమత వ్యవస్థ తాత్విక భూమికను హేతుబద్ధంగా తిరస్కరించాలి. ఈ పని హిందూ మహాసభ చేయదు. కాంగ్రెసు పార్టీ అంటరానితనాన్ని రూపుమాపటానికి హిందూ మహాసభకు బాధ్యతను అప్పగించి చేతులు దులుపుకుంది. అస్పృశ్యుల సమస్య అలాగే మిగిలి పోయింది. కాంగ్రెసు పార్టీ తీసుకొన్న కార్యక్రమాలపైన ఖర్చు చేసిన నిధులను బట్టి చూస్తే, అంటరానితనాన్ని రూపుమాపటానికి ఆ పార్టీ ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేదన్న విషయం సులభంగా అర్థమవుతుంది. తిలక్ స్వరాజ్యనిధికి కాంగ్రెసు పార్టీ కోటి ముప్పై లక్షల నిధి వసూలు చేసింది. 1921 నుండి 1923 వరకు నిర్మాణ కార్యక్రమానికి 45 లక్షల 50 వేలను ఖర్చు చేసింది. అస్పృశ్యత నిర్మూలనకు 43 వేల 381 రూపాయలను మాత్రమే కాంగ్రెసు పార్టీ ఖర్చు చేసింది. ఇది కాంగ్రెసు పార్టీ అంటరానితనాన్ని నిర్మూలించటంలో చూపిన ఉదాసీన వైఖరిని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా అస్పృశ్యత సమస్య పైన గాంధీ అవగాహనను తెలుసుకోవటం అవసరం.

గాంధీ - అస్పృశ్యత నిర్మూలన

అస్పృశ్యత సమస్యను గాంధీ హిందూయిజంలో భాగంగా పరిష్కరించాలనుకున్నాడు. అంటరానితనానికి తాత్విక పునాదియైన హిందూమతాన్ని ఆయన ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాంధీ అంటరాని వారిని హరిజనులని పేరుపెట్టాడు. హరిజనులంటే దేవుని బిడ్డలు అని ఆయన వివరించారు. దేవుని బిడ్డలను అందరు ముట్టుకోవచ్చు. అస్పృశ్యులకు హరిజనులని పేరుపెట్టి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి హిందూసమాజం నుండి వీరిని శాశ్వతంగా దూరం చేశాడు. హిందూ సమాజం కులవ్యవస్థపైన నిర్మించటం వలన అది మనగలుగుతుంది. కులవ్యవస్థ సహజమైనది (నాచురల్) అంటాడు గాంధీ. కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు మనిషిని ఆధ్యాత్మికంగా దిగజారుస్తాయి. మోక్షానికి దూరం చేస్తాయి అన్నాడు. వర్ణవ్యవస్థపైన ఆయనకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. చిల్లర కులాలు అన్ని కలిసి శూద్రవర్ణంగా ఏర్పడితే పూర్వకాలం నాటి చాతుర్వర్ణ్య వ్యవస్థను పునఃస్థాపించవచ్చు. అప్పుడు అస్పృశ్యత సమసి పోతుందని ఆయన భావించాడు. "The best remedy is that small castes should fuse themselves into one big caste. There should be four such big castes through that we may reproduce the old system of four varnas" గాంధీ వేద ప్రామణ్యాన్ని అంగీకరించాడు. కర్మ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. అనువంశికంగా కులాలకు సంక్రమించిన వృత్తుల మార్పును ఆయన వ్యతిరేకించాడు. "In the verna system no man has any liberty to choose his occupation. His occupation is determined for him by heridity" దళితులు శుచి, శుభ్రతలు నేర్చుకోవాలి. వారి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోవాలి. అంటరాని వారిని దేవాలయాల్లో ప్రవేశించనీయాలని గాంధీ చెప్పాడు. కులవ్యవస్థను పదిలంగా కాపాడుతున్న అంతర వివాహాన్ని (Endogamy) గాంధీ గుర్తించలేదు. అంటరాని వారిలోని పేదరిక నిర్మూలనకు గాంధీ ధర్మ కర్తృత్వ సిద్ధాంతాన్ని (Trusteeship) ప్రతిపాదించారు. అగ్రకులాల్లోని సంపన్నులు అంటరానివారి అభివృద్ధికి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయాన్ని అందచేయాలని ఆయన కోరాడు. గాంధీ భావాలు సారంలో హిందూయిజమే. ఈ సందర్భంగా గాంధీ సమకాలికుడైన అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించటానికి చేసిన సైద్ధాంతిక కృషిని తెలుసుకోవటం అవసరం.

అంబేద్కర్ · - కుల నిర్మూలన :

బ్రిటీషు వలస పాలకుల నుండి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం కాంగ్రెసు పార్టీ చేస్తున్నది. రాజ్యాధికారం విదేశీయుల నుండి స్వదేశీయులకు మార్పిడి జరిగితే అంటరాని కులాల పరిస్థితి ఏమాత్రం మారదు. పరిపాలనలో భాగస్వామ్యం లేని జాతులు పరిపాలన ఫలితాలను అనుభవించలేవు. అస్పృశ్యుల సామాజిక స్థితి బాగుపడాలంటే వారికి చట్టసభల్లో, విద్యా సంస్థల్లో, పరిపాలనా యంత్రాంగంలో తగిన ప్రాతినిధ్యం ఉండాలని అంబేద్కర్ భావించాడు. ఆయనభారతదేశంలోని కుల సమస్యను ప్రధాన సామాజిక సమ6 / 14 కుల వ్యవస్థలో వ్యక్తుల సహజసిద్ధమైన శక్తి సామర్థ్యాలను బట్టి కాకుండా ఎం తల్లిదండ్రులు అనువంశికంగా చేస్తూ వస్తున్న వృత్తిని మాత్రమే చేయాలి. "హిందువులలో కులం అనేది ఒక భావన, ఒక విశ్వాసం, ఒక మానసిక స్థితి. కుల నిర్మూలన అంటే భౌతికంగా ఉన్న ఒక అడ్డంకిని తొలగించటం కాదు. మనోభావనలోనే ఒక మార్పును సాధించగలగటం". కులం అంతర వివాహం (Endogamy) అనుకరణ (Imitation) వలన బతుకుతుంది. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు మాత్రమే సరిపోవని, కులానికి తాత్విక పునాదిగా నిలిచిన హిందూమత భావజాలాన్ని తార్కికంగా ఖండించిననాడే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డాడు.

దళిత జనోద్ధరణను చిత్రించిన నవలలు :

ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి', రంగా 'హరిజన నాయకుడు', మహీధర రామరామోన రావు "కొల్లాయి గట్టితేనేమి?”; ఉప్పల లక్ష్మణరావు "అతడు-ఆమెనవలలు దళిత జనోద్ధరణ సమస్యను చిత్రించాయి. ఈ నలుగురు రచయితల్లో ఉన్నవ, రంగా కాంగ్రెసు భావజాలానికి చెందినవారు. మహీధర రామమోహనరావు, ఉప్పల లక్ష్మణరావు వామపక్ష భావజాలానికి చెందినవారు. మహీధర, ఉప్పల వర్గ దృక్పథంతో దళిత సమస్యను చూడలేదు. ఆనాటి ఆధిపత్య భావజాలం (Dominent Ideology) అయిన గాంధీ భావజాలానికి మహీధర, ఉప్పల స్పందించారు.

ఉన్నవ 'మాలపల్లి'లో శుచి, శుభ్రత, ధర్మ కర్తృత్వ సిద్ధాంతం (Trusteeship), మతమార్పిడి వ్యతిరేకత, మత సమ్మె మొదలైన అంశాలు కనబడతాయి. రంగా 'హరిజన నాయకుడు' నవలలో అంటరాని వారు పాఠశాల, దేవాలయ ప్రవేశం, మతమార్పిడి వ్యతిరేకత, సైమన్ కమీషన్ మొదలైన అంశాలను చిత్రించాడు. మహీధర కొల్లాయి గట్టితేనేమి?”, ఉప్పల అతడు-ఆమెనవలలు గాంధీ ప్రతిపాదించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని చిత్రించాయి.

ఉన్నవ లక్ష్మీనారాయణ సంఘ సంస్కర్త. సంఘ సంస్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. వితంతు వివాహాలను జరిపించి గుంటూరు వీరేశలింగంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించి జైలుకు పోయాడు. వెల్లూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆయన మాలపల్లి నవల రాశాడు. మాలపల్లి నవలలో నాయకుడు రామదాసు. ఆయన దళితుల్లో మాలదాసరి కులానికి చెందినవాడు. మాలపల్లెలను మునిపల్లెలను చేయాలన్న తపన ఉన్నవాడు.

దళితుల్లో లేని శుచి, శుభ్రతల గురించి రామదాసు మాటల్లో తెలుస్తుంది. "మాల మాదిగ పల్లెల చుట్టు పారవేయబడ్డ యెముకల నుండీ, పసు కళేబరాలను కోసిన స్థలములో విడువబడ్డ మురికి నుండీ, తోళ్ళూనడానికి నానవేసే గాబుల నుండీ, దండెముల మీద ఆరవేసిన కుళ్ళు మాంసపు వరుగుల నుండీ, గౌలు బయలుదేరి నలుదిక్కులా వ్యాపిస్తున్నది. ఈ గబ్బుకు

చిన్నప్పటినుండి అలవాటు పడ్డ రామదాసుకు కూడా కష్టంగా వున్నది. ఇందుకోసమే కావాలె. మనవాళ్ళను ఊళ్ళో ఉండవద్దన్నారు. ఈ చండాలము వల్లనే వీండ్లకు చండాలురు అన్న పేరు వచ్చి ఉంటుంది. వీండ్లు చాలామంది నీళ్ళే పోసుకోరు. శాచ పద్ధతే యెరుగరు".

గాంధీ ప్రతిపాదించిన self purification భావనకు అనుకూలంగా ఉన్నాయి రామదాసు మాటలు. అంటరానివారు పరిశుభ్రత నేర్చుకోవటానికి అగ్రకులాల వారు తోడ్పడాలని గాంధీ సూచించాడు. అంటరానివారి జీవిత విధానమే దుర్గంధపూరితం కావటం వలన అగ్రకులాల వారు వారిని దగ్గరికి రానియ్యటం లేదు. వారిని అంటుకోవటం లేదు. వారు పరిశుభ్రతను నేర్చుకుంటే సవర్ణులు వారిని అంటుకోవటానికి, వారు గ్రామ మధ్యభాగంలో నివసించటానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు అని రామదాసు అభిప్రాయపడ్డాడు. ఈ ఆలోచనే గాంధీకి ఉంది. గాంధీ అనుచరుడు ఉన్నవ, గాంధీ అభిప్రాయాలకు అక్షరరూపం ఇచ్చాడు. అగ్రకులాల వారు దళితులను దగ్గరికి రానీయకుండా ఉంచటానికి మరొక కారణం రామానాయుడు మాటల్లో కనబడుతుంది. రామానాయుడు సంగదాసుతో హరిజనులు "మురికి మాంసము తినకూడదు. ఆ సంగతి నీవు వాండ్లకు గట్టిగా చెప్పాలె" అంటాడు. రామానాయుడు ఉదార భావాలు గల భూస్వామ్య కుటుంబ ప్రతినిధి. ఇంగ్లీషు విద్యవలన అబ్బిన ఉదారభావాలతో పాటు ఆయనపైన గాంధీ భావాల ప్రభావం ఉంది. ఆనాటి ఉదారవాదులు, గాంధీ అనుయాయులు దళితుల్లో ఈ సంస్కణలనే ఆశించారు. దారిద్ర్యాన్ని రూపుమాపే కార్యక్రమం లేకుండా కేవలం సంస్కరణలతో దళితులను ఉద్ధరించాలనుకున్న కాంగ్రెసు పార్టీకి సంగదాసు సరియైన సమాధానం ఇచ్చాడు.. "మాల, మాదిగ పల్లెల్లో నాలుగు నెలలు పూర్తైన భోజనమంటే జొన్నన్నం, గోంగూరకారం యివి కడుపునిండా తినడము, నాలుగు నెలలు అర్ధభోజనము, మిగిలిన రోజులు కటిక వుపవాసము" ఆకలితో అలమటించే జనం నాగజెముడు పండ్లు, బొద్దాకులు, చచ్చిన పశువుల మాంసం తింటారు. వారి ఆర్థిక పరిస్థితి బాగుపడితే శుభ్రమైన బట్టలు వేసుకొంటారు. రోజు స్నానం చేస్తారు. పరిశుభ్రమైన భోజనం తింటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొంటారు. ఈనాడు అభివృద్ధి చెందిన దళితులు అన్నింటిలో అగ్రవర్ణాలతో సమానంగా ఉన్నారు. అయినా వివక్ష పోలేదు.

అగ్రకులాలవారు దళితుల పట్ల అనుసరిస్తున్న వివక్ష ధోరణికి దృష్టాంతం ఒకటి మాలపల్లి నవలలో రచయిత చిత్రించాడు. పశువుల మేపటానికి పోయిన వారంతా మధ్యాహ్నం భోజనానికి ఒక్కదగ్గర చేరతారు. వెంకటదాసు "నా అన్నం పెడతా నీ రొట్టె ఇయ్యమని" సాయెబుతో అంటాడు. "మాలవాండ్ల అన్నంకి తినమంటావు" అంటాడు సాయెబు. ఇస్లాం మతంలో కులపట్టింపు లేదు. ఈ మతం సోదరత్వానికి పెద్దపీఠ వేసింది. భారతదేశంలో ఇస్లాం మతంపైన కులవ్యవస్థ ప్రభావం పడింది. సాయెబు వెంకటదాసును అంటరానివాడుగా పరిగణించాడు. ఈ విధంగానే భారతదేశంలోని క్రైస్తవమతంపైన కూడ కులవ్యవస్థ ప్రభావం పడింది.

గాంధీ భావజాల ప్రభావంతో ఉన్నవ మాలపల్లి నవల రాసారు. ఆయన ఈ నవలలో గాంధీ భావజాలాన్ని పూర్తి అనుకరించలేదు. సహపంక్తి భోజనాలను గాంధీ పూర్తిగా వ్యతిరేకించాడు. ఉన్నవ తన నవల మాలపల్లిలో సహపంక్తి భోజనాలను సమర్థించాడు. 1917వ సంవత్సరంలో విజయవాడలో ఆది ఆంధ్రమహాసభకు రామానాయడు, సంగదాసు హాజరయ్యారు. రైల్వే స్టేషనులో ఇద్దరు కలిసి భోజనం చేశారు. రామానాయుడు, సంగదాసు కలిసి భోజనం చేయటాన్ని చూసిన మంగళాపురం గ్రామస్థులు పెద్ద రాద్ధాంతం చేశారు. వడ్డించేవాడు మతంలో కలిసిన మాదిగే, పంక్తిన భోజనం చేసేవాడు పచ్చి మాల. కాబట్టి ఇది మాదిగన్నంఅన్నారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన విషయంలో ఉన్నవ లక్ష్మీనారాయణ అభిప్రాయాలు గమనార్హం. "కులాలు నశించాలంటే సహపంక్తి భోజనాలు ప్రజాదరణ పొందాలి" అంటాడు. ఉన్నవ. ఈ భావానికి అనుకూలంగా రచయిత పై సంఘటనను చిత్రించాడు.

విజయవాడలో జరిగిన ఆది ఆంధ్రమహాసభలో వెంకటరెడ్డి ప్రసంగించాడు. ఈ సభలో పంచముల అభివృద్ధికి కొన్ని తీర్మానాలు చేశారు. విద్య. శుచి, శుభ్రత, తాగడం మానటం, పంచములకు వృత్తులను నేర్పటం, సంఘమందిర నిర్మాణం మొదలైన తీర్మానాలు చేశారు. ఈ సభ భాగ్యరెడ్డివర్మ నాయకత్వంలో విజయవాడలో జరిగిన ఆది ఆంధ్రమహాసభను గుర్తుకు తెస్తుంది. భాగ్యరెడ్డివర్మ సభను దృష్టిలో ఉంచుకొని రచయిత విజయవాడ సభను చిత్రించాడు.

రామదాసును క్రైస్తవమతంలో చేర్పించటానికి ప్రయత్నాలు జరిగాయి. రామదాసు క్రైస్తవ మతం స్వీకరిస్తే తన కూతురుకు, అల్లునికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. "హిందూమతం పనికిరాదని, క్రైస్తవ మతమే మంచిదని ఒప్పిస్తే తాను నిరభ్యంతరంగా కలుస్తానన్నాడు" రామదాసు. "ప్రాచీన సంస్కృతి అన్నా, సంప్రదాయం అన్నా ఉన్నవకు ఎనలేని ప్రేమ. క్రైస్తవ మిషనరీల మతాంతరీకరణలు ఉన్నవకు బాధ కలిగించాయి”. రామదాసు పాత్ర ద్వారా రచయిత మతమార్పిడిని వ్యతిరేకింపచేశాడు. క్రైస్తవ మిషనరీలు దళితులకు ఎంతో సేవ చేశాయి. మిషనరీల పుణ్యమా అని దళితులు ఆంగ్లవిద్యను నేర్చుకున్నారు. గాంధీ ఆశించిన శుచి, శుభ్రతలు నేర్చుకున్నారు. సాంఘిక అణచివేత తగ్గకున్నా, కనీసం ఆర్థికంగానైనా దళితులు అభివృద్ధి చెందారు. కోస్తా ప్రాంతంలో నిర్మించిన ఆనకట్టలు భూస్వాములకు ఉపయోగపడ్డాయి. ధనిక రైతులు కూడా ఆనకట్టల వలన లబ్ది పొందారు. ఈ ఆనకట్టలు దళితులకు ఉపయోగపడలేదు. ఎందుకంటే దళితులకు భూములు లేవు. క్రైస్తవ మిషనరీలు దళితుల పట్ల చూపించిన అనుకూల వైఖరిని రచయిత గుర్తించలేదు.

మంగళాపురం దొంగలకూ, కూలీలకు రామదాసు గురువని ఆయనను భార్య కూతుళ్ళతో సహా సెటిల్మెంటులో పెట్టారు. రామదాసు చెల్లెను బసివిరెడ్డి కొట్టి చంపినప్పుడు "మాల మాదిగలంటే అంత చౌకా" అని బాధపడతాడు. సంగదాసును చౌదరయ్య చంపినప్పుడు "సద్గురూ నీ దయ యిట్లా వచ్చిందా?" అంటాడు. రామదాసు భూమిపైన చౌదరయ్య వ్యాజ్యం తెచ్చినప్పుడు "మా సొమ్మయితే మాకుండేదే. విచారించి యేమి ప్రయోజనం?" అంటూ వేదాంతం వల్లిస్తాడు. తన కుటుంబానికి ఎన్ని అన్యాయాలు జరిగినా నిర్లిప్తత ప్రదర్శించిన రామదాసు సెటిల్మెంటులో క్రైస్తవ మతబోధకు వ్యతిరేకంగా మత సమ్మె చేయిస్తాడు. "రేపటినుంచీ వినదల్చుకున్న వాండ్లకు హిందూమతం నేను బోధిస్తాను" అంటాడు. పౌలు అనే ఒక క్రైస్తవ పాత్రను సృష్టించి వాని యొక్క వెకిలి చేష్టల ద్వారా క్రైస్తవ మతాన్ని రచయిత అపహాస్యం పాలు చేశాడు. దళితులు క్రైస్తవులుగా మారకుండా ఉండటానికి రచయిత పౌలు పాత్రను ఉపయోగించాడు. గుడిలోనికి, బడిలోనికి, బావి దగ్గరికి రానీయని మతాన్ని విడిచి క్రైస్తవ మతాన్ని స్వీకరించే బదులు రామదాసు హిందూ మతాన్ని గట్టిగా బలపరుస్తాడు. ఈ విధంగా రచయిత దళితులను హిందూమతంలోనే ఉంచే ప్రయత్నం చేశాడు. రామదాసు సమాజంలో అట్టడుగు స్థానాన్ని అంగీకరించిన వాడు. చౌదరయ్య రామదాసు భూమి మీద వ్యాజ్యం తెచ్చినపుడు నారాయణరావు అనే న్యాయవాదిని కలుస్తాడు రామదాసు. నారాయణరావుతో "మేము చెప్పరానివాండ్లమండి" అంటాడు.

సహపంక్తి భోజనాలను సమర్థించిన రచయిత వృత్తి విషయంలో గాంధీ సిద్ధాంతాన్నే అనుసరించాడు. సంగదాసు వృత్తి మార్పిడిని వ్యతిరేకించాడు. "హిందూ ప్రభువులు ఆర్థిక సంబంధమైన వృత్తి విభజనంలో జోక్యం కలిగించుకొన్నారు. దేశం యొక్క విత్త రక్షణ కొరకు వృత్తి రక్షా, వృత్తి రక్షణ కొరకు వృత్తి విభజనం జరిగినవి. ప్రభునొకనిని వొక వృత్తిలో వుండవలసిందని ఆజ్ఞ చేసి తక్కినవాండ్లను ఆ వృత్తిలో ప్రవేశించడానికి స్వాతంత్ర్యమిస్తే మొదటి వాడికి అన్యాయం చేసిన వాడౌతాడు. వొకనిని వృత్తిని విడువవద్దని రాజు యెప్పుడు శాసిస్తాడో రెండవ వాణ్ణి దాంట్లో ప్రవేశించవద్దని శాసించక తప్పదు. కనుక ధర్మశాస్త్రాలు వృత్తి సాంకర్యం చేసిన వాండ్లకు కఠినంగా శిక్షిస్తవి". ఇలా వృత్తి సాంకర్యం జరగకుండా కఠిన నియమాలు విధించటం వలన అనువంశిక ఆధిపత్యాన్ని కొన్ని కులాలు కాపాడుకున్నాయి. వృత్తి సాంకర్యాన్ని గాంధీ కూడా వ్యతిరేకించాడు. ఏ వృత్తిలో పుట్టినవాడు ఆ వృత్తిని విధిగా ఆచరించాలి అన్నాడు. గాంధీ, మాలపల్లి నవల గాంధీ సామాజిక సిద్ధాంతానికి సాహిత్య రూపం. ఈ నవలలోని ప్రధాన పాత్రలు, ఘటనలు గాంధీ సిద్ధాంతాల పరిధిని దాటి పోలేదు. సంగదాసు రగిలించిన జ్వాల చౌదరయ్య మరణించేవరకు మండుతూనే ఉంది. చౌదరయ్య మరణించిన తరువాత ఆయన కుమారుడు రామానాయుడు తన భూమిని సంఘపీఠానికి ఇచ్చి తన కుటుంబ సభ్యులందరూ దళిత జనోద్ధరణకు పాటుపడ్డారు. ఈ విధంగా సామాజిక సంఘర్షణ శాంతియుతంగా పరిష్కారమైనట్టు రచయిత చిత్రీకరించాడు.

నవల చివర రచయిత అగ్రవర్ణాల వారికి ఒక విజ్ఞప్తి చేశాడు. "మనము కలిసిమెలిసి యుండినచో ఉభయులకును లాభదాయకమే" అంటాడు. ఇది రచయిత ఆశించిన ప్రయోజనం. అగ్రవర్ణాల వారు దళితులు కలిస్తే వలస పాలకులను భారతదేశం నుండి తరిమి వేయవచ్చు. ఈ కలయిక కొరకు దళితుల్లో సంస్కరణలను ఆశించాడు రచయిత. ఈ సంస్కరణకు అగ్రవర్ణాల వారు ఉదారంగా తోడ్పడాలి. దళితులను దేవాలయాల్లోకి, పాఠశాలల్లోకి, వీధి బావుల దగ్గరికి రానీయాలని కాంగ్రెసు పార్టీ తీర్మానించింది. గాంధీ భావజాలాన్ని, కాంగ్రెసు కార్యక్రమాన్ని తీసుకొని రచయిత మాలపల్లి నవల రాశాడు.

గాంధీ దళిత జనోద్ధరణ సమస్యను తీసుకొని రంగా "హరిజన నాయకుడు" నవల రాశాడు. రంగా జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. రైతు ఉద్యమాన్ని నిర్మించాడు. ఈయన మాలపల్లి నవలలోని వెంకటదాసు పాత్రకు ప్రతిస్పందనగా హరిజన నాయకుడు నవల రాసినట్టు కనబడుతుంది. రంగాకు వెంకటదాసు పాత్ర తిరుగుబాటు ధోరణి రుచించలేదు. అగ్రవర్ణాల సహకారంతో దళితులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్న అభిప్రాయం రచయిత ఈ నవలలో వ్యక్తం చేశాడు.

మాలపల్లి నవలలో నాయకుడు మాలదాసరి అయితే, హరిజన నాయకుడు నవలలో నాయకుడు మాదిగ కులానికి చెందినవాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ, రంగా ఇద్దరు రచయితల్లోని భావసారూప్యత ఒక్కటే. ఇద్దరూ గాంధీ భావజాల ప్రభావంతో నవలలు రాశారు. ఇద్దరు రచయితలూ హిందూయిజం పరిధిలోనే అస్పృశ్యత సమస్యకు పరిష్కారాన్ని వెతికారు. దళితులు పాఠశాల, దేవాలయ ప్రవేశం, మతమార్పిడి వ్యతిరేకత, శుచి శుభ్రత, సైమన్ కమీషన్ మొదలైన వాటిని గురించి రచయిత నవలలో చిత్రీకరించాడు. దళితులు వెంకటదాసు వలె తిరుగుబాటు ధోరణి అనుసరిస్తారేమోనన్న భయం రంగాను పట్టి పీడించింది. అందువలన అగ్రవర్ణాల వారితో కలిసి, వారి సహకారంతోనే దళితులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్న భావనకు ప్రతినిధిగా బసవ లింగయ్య పాత్రను రచయిత సృష్టించాడు.

పంచముల పిల్లలను పాఠశాలలోకి అగ్రవర్ణాల వారు రానీయలేదు. పంచముల పిల్లలను పాఠశాలలోకి రానీయాలని బసవ లింగయ్య వినతి పత్రాలు సమర్పించాడు. పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు, ప్రభుత్వం పంచములు పిల్లలను పాఠశాలలోకి రానీయకుంటే గ్రాంటు నిలిపి వేస్తామని హెచ్చరించారు. పంచముల పిల్లలకు చదువు చెప్పటానికి నిరాకరించే ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఊడిపోతాయని చెప్పారు. అందువలన కమ్మవారు పంచముల పిల్లలను పాఠశాలలోకి రానిచ్చారు. ఇది బసవ లింగయ్య విజ్ఞాపనల ద్వారా సాధించిన తొలి విజయం. ఇక్కడ సంఘర్షణ లేకుండా  నవలలో బసవ లింగయ్య మతమార్పిడిని వ్యతిరేకించాడు. అరుంధతి క్రైస్తవ మతం స్వీకరించటం వలన ఆమెను పెళ్ళి చేసుకోనని బసవ లింగయ్య చెప్పాడు. సుందరి బందరు మిషనరీ పాఠశాలలో చదివింది. ఆధునిక నాగరికతను అలవరుచకొంది. దళితులను అసహ్యించుకుంది. తరవాత బస్తీ గుడ్డలు కట్టను చిన్నకోక చిన్నరవిక చాలు" అంటుంది. ఈ విధంగా రచయిత యధాస్థితి వాదాన్ని హరిజన నాయకుడు నవలలో సమర్థించాడు. రంగా హరిజన నాయకుడు నవల గాంధీ ప్రతిపాదించిన అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణికి అనుకూలంగా ఉంది. రచయిత హరిజన నాయకుడు నవల ద్వార జగ్గడి లాంటి తిరుగుబాటు ధోరణిని తిరస్కరించాడు. అగ్రకులాల వారు హరిజనుల అభివృద్ధికి కృషి చేస్తారని ప్రతిపాదించాడు.

మహీధర రామమోహనరావు తెలుగులో ఎక్కువగా రాజకీయ నవలలు రాశాడు. ఈయన కొల్లాయి గట్టితేనేమి?” నవలను జాతీయోద్యమ ప్రభావంతో రాశాడు. ఈ నవలలో నాయకుడు రామనాథం గాంధీ పిలుపునందుకొని సహాయ నిరాకరణ చేశాడు. కళాశాలను బహిష్కరించి ముంగండ గ్రామం చేరుకొంటాడు. ఆ గ్రామం సనాతన ఆచారాలు గల గ్రామం. నోరు ఎండిపోతున్నా సరే దళితులు ఆ ఊరి చెరువు నీళ్ళు తాకరాదు. గ్రామంలో దళితుల నీటి సమస్య రామనాథాన్ని దళిత జనోద్ధరణ కార్యక్రమాన్ని రూపొందించుకునే విధంగా చేసింది.

"దేశమంతా తగలబడి పోనీ మా కంఠంలో ప్రాణముండగా అనాచారం మనవూళ్ళో అడుగు పెట్టడానికి వీలులేదు" అంటారు ముంగండ బ్రాహ్మణులు. ఆనాడు దళితులు ఎంత దయనీయ స్థితిలో బతుకున్నారో, సామాజికంగా ఎంత నీచంగా చూడబడుతున్నారో, అస్పృశ్యత అనేది మనుషుల్లో ఒక వర్గాన్ని అవమాన పరచటానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో రచయిత ముంగండలోని పంచముల నికృష్ట పరిస్థితిని చిత్రించటం ద్వారా నిరూపించాడు. ఊరి చెరువులో దళితులు నీరు తోడుకోవటం నిషిద్ధం. వీధులగుండా వారు నడవకూడదు. ఇంత కఠోర నియమాలు విధించినా, దళితులు కష్టపడనిదే చెరువులోనికి నీరు రాదు "వాళ్ళ కాళ్ళ మీదుగా దొర్లిన నీరు చెరువులో పడగానే వాళ్ళు ముట్టుకుంటే మైలపడి పోతుందాఅనుకుంటాడు రామనాథం. ఆయన కొద్దిరోజులు దళితులకు చెరువులోని నీరు తోడిపోస్తాడు. ఎంతకాలం ఇలా నీరు పోయటం అనుకుంటాడు. ఆయన తోటలోని బావిని దళితులకు ఇస్తాడు. గాంధీ ప్రతిపాదించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతం కూడా ఇదే. తన తోటలోని బావిని దళితులకు ఇవ్వటం వలన అగ్రకులాలలోని సంపన్నులు దళితులకు ఉదారంగా దానం చేయాలన్న సిద్ధాంతానికి అనుకూలంగా ఉంది ఈ చర్య.

ఉప్పల లక్ష్మణరావు "అతడు-ఆమె" నవలలో జాతీయోద్యమాన్ని సవిమర్శకంగా చిత్రించాడు. ఈ నవల దినచర్య కథనంలో నడుస్తుంది. ఈ నవలలో రచయిత కాంగ్రెసు పార్టీ దళిత జనోద్ధరణకు చేసిన కృషిని సవిమర్శకంగా చిత్రించాడు.

శాంతం జాతీయోద్యమంలో చిత్తశుద్ధితో పాల్గొంటుంది. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మనసుపూర్తిగా చేస్తుంది. గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెసు దళిత జనోద్ధరణకు పూనుకొంటుంది. దళిత జనోద్ధరణ కాంగ్రెసు పార్టీ సభ్యుల ఇళ్ళ నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. కాంగ్రెసు పార్టీ సభ్యుల ఇళ్ళలోని బావుల నుండి దళితుల చేత నీళ్ళు తోడించాలి. ఈ కార్యక్రమం విజయవంతం కాలేదు. వివిధ కాంగ్రెసు సభ్యులు అనేక సాకులు చూపించి తప్పించుకున్నారు. "మా తల్లి ముసలావిడ ఒప్పుకోదండి" అంటాడు సుందరరామన్. "మా ఆవిడ మాలాడు నూతిగోడ ముట్టుకుంటే నూతిలో పడిచస్తానని ఒకటే బెదిరింపు, నన్ను మాత్రం ఇందులోకి లాక్కురాకండి" అని రంగనాథరావు అన్నాడు. "మాతోట నూతిలో చేదవేస్తే నాకేం అభ్యంతరం లేదు. వంటింటి పెరట్లో వున్న నుయ్యి మాత్రం వదిలిపెట్టండి" అన్నాడు మాధవరావు. ఈ విషయం నాకెంత మాత్రం ఇష్టం లేదు" అన్నాడు భగవాన్దాసు. ఈయన దళిత జనోద్ధరణకు పాతికవేల రూపాయల విరాళం ఇచ్చాడు. సభవారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమస్య

సాఫీగా సాగటానికి ఒక ఉపకమిటీని వేసి వచ్చే సంవత్సరానికి కార్యక్రమాన్ని వాయిదా వేద్దామని నిర్ణయించారు.

అగ్రకులాలలో మానసిక పరివర్తన, అస్పృశ్యుల్లో సంస్కరణ కోరింది కాంగ్రెసు పార్టీ. దళిత జనోద్ధరణ కొన్ని సంస్కరణలతో సమసి పోతుందని భావించారు. శుచి శుభ్రతలు నేర్చుకొంటే సమస్య పరిష్కారం కాదు. సంపన్నులు దళితుల కొరకు ఆర్థిక సహాయం చేయటం అయ్యే పని కాదు.

దళిత జనోద్ధరణ సామాజిక, ఆర్థిక, మానసిక సమస్య. ఈ సమస్యను కాంగ్రెసు పార్టీ సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి సరియైన పరిష్కారం చూపలేకపోయింది. ఉన్నవ 'మాలపల్లి', రంగా 'హరిజన నాయకుడు' నవలలు గాంధీ ప్రతిపాదించిన శుచి శుభ్రత, ధర్మ కర్తృత్వ సిద్ధాంతం, గుడి, బడి, బావి మొదలైన వాటిలోకి హరిజనుల ప్రవేశం గురించి చర్చించాయి.

మహీధర, ఉప్పల వామపక్ష భావజాలానికి చెందినవారు. వలసపాలనకు దేశప్రజలకు వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగానూ మిగతా వైరుధ్యాలు అప్రధానమైనవిగానూ వీరు భావించినారు. ఇది ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అవగాహన. కమ్యూనిస్టు పార్టీ కుల నిర్మూలన కొరకు ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోలేదు. ఆనాటి ఆధిపత్య భావజాలం అయిన గాంధీయిజాన్ని కమ్యూనిస్టులు అనుసరించారు. కాంగ్రెసు పార్టీ, జాతీయోద్యమ నాయకత్వం, అస్పృశ్యత సమస్యను రూపుమాపటానికి అరకొర ప్రయత్నాలు చేసిన స్థితినే పై నవలల్లో చిత్రితమైంది.

ప్రత్యామ్నాయ సంస్కృతి  నిర్మాణమే ఫెమినిజం లక్ష్యం కావాలి ! <

        పెనుగొండ సరసిజ ‘‘ కాగితాన్ని ముద్దాడిన కల’’ కవితా సంకలనంతోని కవితా క్షేత్రంలో అడుగుపెట్టింది.  ఇప్పుడు ‘‘ మారాల్సింది నువ్వే ’’ కవితా సంకలనంతో ఒక స్పష్టమైన పెమినిస్టు దృక్పథంతో ముందుకు వచ్చింది.

            స్త్రీ, పురుష సంబంధాల విషయంలో పాశ్చాత్య సమాజాలకు, భారతీయ సమాజానికి తేడా ఉంది. అక్కడ సామాజిక అంతరాలు లేవు. ఆర్థిక అంతరాలు తప్ప. అమెరికన్‍ సమాజంలో జాతివివక్ష ఉంది. భారతదేశంలో స్త్రీలు, దళితులు సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు.

            భారతదేశంలో మనుషులు ఏదో ఒక కులంలో పుడతారు. కులంలోనే పెరుగుతారు. కులంలోనే తుది శ్వాస విడుస్తారు. కులం, పితృస్వామ్యం మనదేశంలో సామాజిక మార్పు జరగకుండా, సామాజిక సమానత ఏర్పడకుండా కట్టడి చేస్తున్నాయి.

            పుట్టిన పిల్లలకు సామాజికీకరణ (Socialization) లో భాగంగా కులాచారాలు, కట్టుబాట్లలో శిక్షణ ఇస్తారు.  ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనే ఎరుకను కలిగిస్తారు. కింది కులాలవారితో, పై కులాల వారితో ఏ విధంగా మెదులుకోవాలో వివరిస్తారు. చిన్నప్పుడే ‘‘ మనం’’ ‘‘వాళ్ళు’’ అనే భావన తలకెక్కుతుంది. సాధారణంగా తమకులంలోనే పెండ్లి చేసుకుంటారు. కుల కట్టుబాట్లను ఎదిరించినవారు కుల బహిష్కరణకు గురి అవుతారు. కులబహిష్కరణకు గురి అయిన వారికి చావులకు, పెండ్లీలకు తమ కులం నుండి ఎలాంటి సహకారం దొరకదు. అందుకే ‘‘ కులం విడిచిన పక్షి, వనం విడిచిన కోతి’’ అన్న సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.

            మన సమాజంలోని స్త్రీలందరిలో ఏకరూపత లేదు. సంపన్న, అగ్రకుల స్త్రీలు కింది కులాల స్త్రీలను అణచివేస్తారు, దోపిడి చేస్తారు, చిన్న చూపు చూస్తారు. వివక్షకు గురిచేస్తారు. మధ్యతరగతి విద్యావంతులైన స్త్రీలు, శ్రామిక స్త్రీలు ఒకటి కాదు. వాళ్ళ సమస్యలు, ఆకాంక్షలు, అనుభూతులు వేరు. కిందికులాల శ్రామిక స్త్రీలకు తాము వివక్షకు, దోపిడీకి గురి అవుతున్నామనే సోయి ఉండదు. వాళ్ళకు నిత్యం పని కల్పించిన వారినే ఆరాధనా భావంతో చూస్తారు. పని ప్రదేశంలో దళిత, బి.సి. కులాల స్త్రీల సద్దులు ఇప్పటికీ వేరువేరుగా పెట్టుకొంటున్నారు. దళిత మహిళలకు నీళ్ళు బి.సి. మహిళలతో పోయిస్తారు. ఇదంతా సద్దులు, నీళ్ళు మైలపడకుండా చూడటంలో భాగమే.

            మన ధర్మ సూత్రాలు, ధర్మ శాస్త్రాలు స్త్రీలకు కొన్ని నిషేధాలు విధించినవి.  వాటినే మన పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు అదర్శీకరించినాయి.  వాటిలో ప్రబోధించిన విలువలనే సమాజం ఈనాటికీ అనుసరిస్తుంది.  ఈ విలువలే సామాజిక మానసిక స్థితిలో భాగంగా ఉన్నాయి.

            మన దేశంలో భూస్వామ్య శిథిలాల మీద పెట్టుబడిదారి వ్యవస్థ ఏర్పడలేదు.  భూస్వాములను ప్రోత్సహించి పెట్టుబడిదారులుగా ఎదగడానికి మన ప్రభుత్వాలు ప్రోత్సహించినాయి. భూస్వామ్య భావజాలం నుండి పెట్టుబడిదారులు పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు. భూస్వామ్య పెట్టుబడి దారి భావాల సాంకర్యంగా మన దేశంలో పెట్టుబడిదారి విధానం కొనసాగుతుంది.  దీన్ని                         Reactionary  Transition అన్నారు.

            ఈనాటి వినియోగదారి సంస్కృతిలో మనిషికి విలువలేదు. మనిషికి ఎన్నో విలువైన వస్తువులు ఉంటే అంత విలువ. ఆపిల్‍ గడియారం, సెల్‍పోన్‍, వేళ్ళకు ఉంగరాలు, మెడలో చైన్‍, చేతికి బ్రాస్‍లెట్‍, కారు, బైక్‍, బంగ్లా దానిలో విలువైన టి.వి. వగైరాలు.   వీటితోనే మనిషికి విలువ. ఇది పెట్టుబడిదారి సంస్కృతి కల్పించిన విలువ. ఈ వస్తువుల్లో భార్య, పిల్లలు వస్తువులే. పిల్లలు ఐ.ఐ.టి లో చదివి అమెరికాలో సెటిల్‍ అయి డాలర్లు సంపాదిస్తే ఆ తల్లిదండ్రులకు విలువ.

            అందమైన భార్య కావాలని అందరు కోరుకుంటారు. అట్లాంటి వారు సౌందర్య ఆరాధకులు కారు. భార్యను అందంగా అలంకరించుకొని బజార్లు తిప్పడం వినిమయదారి సంస్కృతే.

            ‘‘అందంతో నీకేంపని’’ కవిత వినిమయదారి సంస్కృతిని ప్రశ్నిస్తుంది. అందం ప్రదర్శనకే కదా అని  కవయత్రి అంటుంది.

            స్త్రీలకు దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సంప్రదాయ పద్ధతులు పాటించే కుటుంబాలలో మరీ ఎక్కువగా సమస్యలు ఉంటాయి. స్త్రీకి సహజంగా జరిగే రుతుక్రమానికి నియంత్రణలు ఉంటాయి. వ్రతాలు, పూజలు చేసుకోవడానికి ముహూర్తాలు నిర్ణయించుకొన్న సమయంలో పీరియడ్‍ రాకుండా ‘‘ ప్రిమోలేట్‍ ’’ మాత్రలు వేసుకుంటారు. వాయిదా కవిత ఈ అంశాన్ని వర్ణిస్తుంది.

                                    ‘‘ రుతు చక్రం రూటు మార్చి

                                    వాయిదావేసిన  సంగతి ’’

ఆధునిక మహిళలు చదువుకొని సంపాదిస్తున్నారు. అయినా జీతం భర్త చేతిలో పెట్టవలసిందే. అవసరాలకు చేయిసాపి అడగవలసిందే. ఇంటిలో పని మామూలే. ‘‘కిటికీ’’ కవిత ఇంటి పనిని చిత్రిస్తుంది.

                                    ‘‘ మసి గిన్నెలను మెరిపిస్తున్న మట్టి గాజులు

                                    రేపటి మెరుగులకై మురికితో తలపడుతున్న

                                    తల్లుల తపనలు ’’

            ‘ బలం లేని బలం కూడ ఇంటిపని మీద రాసిందే. మధ్య తరగతి కుటుంబాలలో వంటగది యంత్రీకరణ జరిగింది. అయినా ఆ యంత్రాలను స్త్రీలే నడిపించాలి.

                                    ‘‘ గిర్ని, మిక్సి, వాషింగ్‍ మెషిన్‍

                                    ఇన్ని ఇసిరెలు ఆమె ముందు ఓడిపోయినమో !

                                    ఆమెను జూత్తే పని పారిపోయేట్టు........... ఆమె పని’’ 

‘‘ వట్టిహౌజ్‍వైఫ్‍ ’’ కూడ ఇంటి మని మీద రాసిందే. ఆమెను ఇంటిముందు వాకిట్లో కూర్చోబెడితే ‘‘అన్నం మూతనుండి రాలే ఆవిరిచుక్కల్లా, ఆమె నుదుటిపై చెమటలు’’ కనబడతాయి.

                                                            క్షణం తీరిక లేకుండా

                                                            పనికి మాలిన పనో   

                                                            పని కొచ్చెపనో

                                                            పని మాత్రముంటుంది’’

ఆడవాళ్ళు చేసే ఇంటిపనికి ఇంత అంత అని కొలమానాలు ఉండవు. పొద్దంతా ఒడువని పని చేసినా తీరా ఏ పని చేసినవంటే చూపించడానికి ఏది ఉండదు. House Makers మీద ఒక రకమైన చులకన భావం ఉంటుంది. ‘‘మామూలు మనిషి’’ కూడ ఇంటి పనిమీద రాసిందే.

            స్త్రీపురుష సంబంధాలు ప్రజాస్వామికమైనపుడు ఎలాంటి అరమరికలు ఉండవు. చిన్న చిన్న బేధాభిప్రాయాలు వస్తే మాట్లాడి చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటే ఎలాంటి పొరపొచ్చాలు ఉండవు. నిజానికి ఇది ప్రజాస్వామిక పద్ధతి ‘‘మాట్లాడుకుందామా’’ కవితలో మాటే కదా మనలను కలిపేది. కళ్ళు కలిస్తేనే కదా కలతలు దూరమైపోతాయి ప్రాణమున్నంతవరకే పంతాలు పట్టింపులు. శ్వాస ఆగినంక వెతికే చోటు                            ఉండదు అంటుంది కవయిత్రి.     

‘‘కలుసుకోవాలి’’ కవితలో ‘‘మనం కలిస్తే మననవ్వులు నదులై నాట్యమాడతాయి. కళ్ళు కంచికి చేరని కథలు చెప్పుకుంటాయి. ఆలింగనాలు ఆత్మను స్పృశిస్తాయి’’ అంటుంది.

            ఒక అత్యాచారానికి గురియైన కూతురును, ఆమె తల్లిని ఊహించి వారి మధ్యన జరిగిన సంభాషణగా ‘‘శీలమంటే’’ కవిత రాసింది. శీలమంటే శరీరంలోని అవయవాలేనా అని కూతురు ప్రశ్నిసుంది. చెడిపోయిన పండ్లను బయట పారేసినట్టు, చెడిపోయిన నన్ను బయట పారేస్తావా! అని ఆందోళన పడుతుంది. ‘‘రక్తస్రావం జరిగే ఆ ఒక్క భాగమే శీలమైతే’’ గాయపడ్డ రక్తం కారుతున్న పెదవులను, బుగ్గలను, చేతులను శరీరంలోని అన్ని అవయవాలను ఏమంటారని ప్రశ్నిస్తుంది.

            ఒక తల్లి తన కడుపున పుట్టిన మగవాడిని ‘‘ నువ్వు వెంటుండే తోడువనుకున్న, కాని, నన్ను వేటాడే తోడేలు వైనావు’’ లోపం ఎక్కడ జరిగింది అని తర్కిస్తూ  నీ పుట్టుకనే ఆపేయాలా, నా శ్వాసనే ఆపేయాలా అంటుంది.

            ‘‘ స్నానం కవిత స్త్రీ జననేంద్రియం గురించి మాట్లాడుతుంది.

                                                      ‘‘ వాడిపుట్టుకే

                                                           పుణ్యక్షేత్రమని

                                                            కొత్త పాఠాలతో వాడికి

                                                            సరికొత్త జన్మ నివ్వాల్సిందే ’’

ఈ వ్యక్తీకరణ ‘‘ ప్రతిఘటన ’’ సినిమాలోని వేటూరి పాటను గుర్తుకు తెస్తుంది.

‘‘ మర్మస్థానం కాదది నీ జన్మస్థానంమానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం’’.

‘‘తెల్లరక్తం’’ (Fungus infection) గురించి రాస్తుంది.

                                                      ‘‘ ఉల్లిపాయ పొరలు

                                                            ఒలిచినట్టు

                                                            చిట్లుతున్న చర్మం

                                                            ప్రమాదమని

                                                            పసిగట్టలేని తెల్లరక్తం ’’

రుతుక్రమంలో అనుభవించే భాధను ‘‘ విస్పర్‍ ’’ కవిత కళ్ళకు కడుతుంది.

                                                            ‘‘ గునపాలు గుచ్చుతున్నా

                                                            నా అవస్థ ఎప్పుడు

                                                            అక్కకు రానిదే ’’

స్థూల దృష్టితో చూసినప్పుడు స్త్రీలు ఎదుర్కొనే బాధలకు అణచివేతకు, వివక్షకు, అసమానతలకు పురుషుడే కారణంగా కనిపిస్తాడు. ‘‘ అందరూ అంతే ’’ కవిత అదే చెప్పుతుంది. సమాజంలోని చట్టాలు, సామాజిక సంస్థలు (Social Institutions) అన్నీ పురుషాధిక్యతను నిలబెట్టేవే అని తీర్మాణిస్తుంది కవయిత్రి.

            ‘‘ నీతులన్నీ నీకోసమే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి

            ధర్మాలన్నీ నీకోసమే దారి కాచుక్కూసుంటాయి ’’

            అందుకే ఇక, మారాల్సింది, నువ్వే అని తీర్మాణిస్తుంది కవయిత్రి.

            సాంకేతికంగా చూసినప్పుడు మనం ఆధునిక ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము. కాని సమాజంలో ఆధునిక పూర్వ, భూస్వామ్య భావజాలం రాజ్యమేలుతుంది. ఈ వైరుధ్యాలు తొలగిపోవలసి ఉంది. ఎన్ని ప్రగతిశీల చట్టాలు చేసినా, వాటిని  అమలు చేసేవారు అదే భూస్వామ్య విలువలతో కూడిన భావజాలం నుంచే ఎదిగి వస్తున్నారు.  సెల్‍పోన్‍, ఫేస్‍బుక్‍, ఇన్‍స్టాగ్రామ్‍ లాంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన మనిషి భావజాలపరంగా భూస్వామ్య యుగంలోనే జీవిస్తున్నాడు. సమాజం చట్టం, సామాజిక విలువలు ఒకే దారిలో నడిచినపుడు సమస్త అంతరాలు పోతాయి.

            సమాజంలో ఏ మార్పు రావాలన్నా స్త్రీ, పురుషులు ఇద్దరు కలిసి కృషి చేయవలసిందే. ఇది ఇద్దరికి అవసరం. స్త్రీ, పురుష సంబంధాలు శత్రువైరుధ్యం కాదు. మిత్రవైరుధ్యం. ఐక్యత ఉంటుంది. ఘర్షణ ఉంటుంది.

            తమ జీవితావసరాలను తీర్చుకొనే ఉత్పత్తిని, తమ సంతతిని కొనసాగించే పునరుత్పత్తిని కలిసి కొనసాగిస్తారు. ఇవి రెండూ లేకుంటే మానవ సమాజం లేదు.

            సమాజంలోని స్త్రీ పురుషులు సమానం అనే విలువలు పాదుకొనాలంటే ఒక ప్రత్యామ్యాయ సంస్కృతి  నిర్మాణం అవసరం. ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి  కొరకు మార్పును ఆశించే వారంతా కలిసి పని చేయవలసి ఉంది. అప్పుడే

            ‘‘ స్త్రీలు పురుషులు మనుషులు అందరు

            సమానమన్నా సమాజ ముండాలే ’’ అని ప్రబోధించిన కలెకూరి ప్రసాదు.

            కల నిజమవుతుంది.

ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు