మా రచయితలు

రచయిత పేరు:    గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రిక

ఇంటర్వ్యూలు

సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పని చేసింది స్త్రీవాద కవిత్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా ఇంద్రగంటి జానకీబాల గారు గోదావరి అంతర్జాల సాహిత్య మాస  పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? తద్వారా కలిగే ప్రయోజనాలు , ప్రేరణలు ఏమిటి?

రచయిత్రులు ఎవరి తన్న వాళ్ళు ఏవో రచనలు చేసుకుంటూ ప్రచురించుకుంటూ  ఉన్న సమయంలో మహిళా దినోత్సవం  ఒక సంఘీభావాన్ని ఒక ఎరుకను కలుగజేసిందనిపిస్తుంది.  రచయిత్రులే  కాదు అన్ని రంగాలలో పనిచేసే మహిళలందరూ తామంతా ఒకటేననే  భావస్ఫూర్తిని వారికి ఇచ్చింది మహిళా దినోత్సవం.

2.         స్త్రీ వాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

 స్త్రీలు తమ గురించి తాము ఆలోచించుకునే ఒక అవసరాన్ని గుర్తు చేసిందనిపిస్తుంది.  అందులోని భాగంగా మహిళా జనజీవన అధ్యయనం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.  అన్ని వర్గాల, స్థాయిల్లో  ఉన్న స్త్రీ గురించి వారి జీవితాల గురించి ఆలోచించేలా చేసింది. కుల మత వర్గ విభేదాలను పక్కనపెట్టి స్త్రీల జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది.

3.         స్త్రీ వాద భావజాలం తెలుగు సమాజాన్ని  ఎలా ప్రభావితం చేసింది? అందువల్ల వచ్చిన గుణాత్మక పరిణామాలు ఏమైనా ఉన్నాయా ? గతంలో అది వేసిన ప్రభావానికి  వర్తమానంలో దాని ప్రభావానికి మధ్య భేదం ఏమైనా గుర్తించారా

 స్త్రీవాద భావజాలం ముఖ్యంగా పురుషులు  ఉలిక్కిపడేలా చేసింది పురుషాధిక్య భావజాలంతో రూపుదిద్దుకున్న  స్త్రీల ఆలోచనల్లో కూడా మార్పు సూచించింది. వారు కంగారు పడ్డారని భావించవలసి ఉంది.

 

            ప్రతి రచయిత్రి రచయిత స్త్రీవాద భావజాలం వల్ల ప్రభావితులయ్యారు అని చెప్పుకోవచ్చు అందులోని కొన్ని ప్రశ్నలకు జవాబులు అన్వేషించడంలో పడ్డారు.  అందరి రచనల్లోనూ స్పష్టమైన మార్పు కనిపించింది.  న్యాయపరమైన ఆలోచన వైపు ధైర్యంగా నిలబడి రచనలు చేసే శక్తి స్త్రీవాదం ఇచ్చిందని తోస్తుంది.

            80 90 దశకంలో పాత కొత్తల సంధి యుగం గా అనిపిస్తుంది.  స్త్రీలు నెమ్మదిగా చైతన్యవంతులు అవుతున్న ఆ సమయంలో స్త్రీ వాదం ఎంతో స్ఫూర్తిని శక్తిని ఇచ్చిందనిపిస్తుంది.

            రచయిత్రులే కాదు రచయితలు కూడా గొప్ప స్త్రీవాద కథలు వ్రాసిన సందర్భాలున్నాయి.

            స్త్రీ వాదమంటే పురుషుల్ని ద్వేషించడం అనే తప్పుడు సంకేతాలు కూడా ఈ ఉద్యమ సమయంలో వచ్చాయి.

స్త్రీలే  కాదు పురుషులు కూడా స్త్రీవాదం మీద సరైన అవగాహన కలిగి ఉంటే గానీ  సమాజంలో మార్పు కష్టమనే ఆలోచన నెమ్మదిగా బలం పుంజుకుంది.

            స్త్రీ సమానత్వం, సాధికారికత లాంటివి ఉద్యమం బలోపేతం చేయడం వల్ల మాత్రమే సాధ్యం అని తెలుస్తుంది

 4.        నవల, కథ, విమర్శ, నాటకం వంటి  ప్రక్రియల కంటే స్త్రీ వాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే వెలువడింది. దీనికి కారణాలు ఏవంటారు?

 రచయిత్రులు కవిత్వం వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి ముఖ్యకారణం కవిత్వపు నిడివి  చిన్నది కావడం - చెప్పదలచుకున్న భావాన్ని క్లుప్తంగా, బలంగా సూటిగా చెప్పే అవకాశం కవిత్వంలో 

సాధించవచ్చునని అనిపించటం కారణాలు కావచ్చు.   నవల చాలా పెద్ద కాన్వాస్.  చాలా శక్తి ఓర్పు ప్లానింగ్ ఉండగానే ఈ నవలా రచన సాధ్యం కాదు.

 కథ నవలంతా  పెద్దది కాకపోవడం వల్ల, ఒక పాయింట్ సులువుగా ప్రతిపాదించి, ముగింపు ఇచ్చే వీలు కలిగే ప్రక్రియ కావడం వల్ల -  స్త్రీవాద సాహిత్యంలో కథ కూడా మంచి స్థానం సంపాదించుకుంది
5.         మీరు స్త్రీవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?


నేను స్త్రీ వాదం వైపు ఆకర్షితురాలిని  కావడానికి ఓల్గా రచనలు ప్రధాన కారణమని చెప్పగలను.  నా కథల్లో - జీవన రాజకీయం -  ధైర్యమే నీ కవచం -  మూడో పేజీ - లాంటి కొన్ని కథలు స్త్రీవాద కథలుగా గుర్తింపు కలిగి పేరు తీసుకొచ్చాయి.

6.         స్త్రీ వాద ఉద్యమం  బలహీన పడిందని భావిస్తున్నారా?

            స్త్రీవాద రచయితలలో  కూడా గ్రూపులు ఉండటం - వారిలో వారు కొంతమందికి స్త్రీవాద రచయిత్రిగా ముద్ర వేసి ప్రచారం చేయడం వల్ల కూడా ఉద్యమం బలహీన పడింది.  వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఉద్యమస్ఫూర్తితో పని చేస్తే  స్త్రీ వాద ఉద్యమం ఇంకా బలపడే  అవకాశాలు ఉన్నాయి.
 

7        కొత్తతరం రచయితలలో స్త్రీవాద స్పృహ ఎలా వ్యక్తమవుతున్నది? 

యువత రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి చూపుతున్నారు కానీ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపో కూడదని కొందరు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
8. స్త్రీ వాదంను  పురుషులను అంగీకరిచినట్లేనా?
స్త్రీ వాదాన్ని పూర్తిగా అంగీకరిస్తే పురుషులు కొన్ని సౌకర్యాలను కోల్పోవలసి వస్తుంది.  అందువల్ల కొందరు అటూ ఇటూ కాకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.

9.         తెలుగు లో  స్త్రీ వాద సాహిత్యం వెలువడడానికి  భూమిక ఏమిటి?


ఏ వాదాన్ని కైనా వ్యక్తి ప్రవర్తన -  స్వేచ్ఛ- ఆలోచన భూమికలు.  అందుకే మూలాల నుంచి మార్పు కోసం ప్రయత్నించాలి పైపైని ఎన్ని చేసినా ఆశించిన ఫలితాలు రావడం కష్టమే.

10.       ఏ వాద సాహిత్యమైన  ఎప్పుడు నిలబడుతుంది?

రచనలో ఏ వాదాన్ని రచించినా  సమర్థంగా జీవిత చిత్రణ చేయగలిగినప్పుడే అందులో ఉండే ఆలోచన పాఠకులక మనసుకి తాకుతుంది అదే ముఖ్యం. జీవం లేని రచనలు ఎన్ని చేసినా ఏ వాదమూ  నిలబడదు.

ప్రవాహ శీలతే స్త్రీవాదానికి ప్రధాన బలం - వి. ప్రతిమ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు వి. ప్రతిమ  గారు ఇచిన ఇంటర్వ్యూ 

1.     అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
    అంతర్జాతీయ మహిళా దినాన్ని శ్రామిక మహిళా పోరాట దినంగానే, మహిళా హక్కు పోరాట దినంగానే మనం అర్థం చేసుకోవసి వుంటుంది. అయితే 1975లో మార్చి 8 ని  అంతర్జాతీయ మహిళా దినంగా, ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించే నాటికి వాళ్ళు, వీళ్ళు ఆ వర్గమూ, ఈ కులమూ అన్న తేడా  లేకుండా చీకట్లలో వున్న స్త్రీలంతా తమ గాయాలను, కన్నీళ్ళనూ, అవమానాలను, అపజయాలను తడుముకుంటూ అసమానతలు  లేని ఒక దోపిడి పిడనలు  లేని సమాజాన్ని కలగంటూ ఆశావహంగా మహిళలంతా అంతర్జాతీయ మహిళాదినాన్ని స్వంతం చేసుకోవడం జరిగింది. కానీ క్రమంగా దాన్ని శ్రామిక మహిళకు ఏ మాత్రం సంబంధం  లేనట్లుగా, ఒక సరదా అయిన రోజుగా, ఒక ఉత్సవంలాగా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి స్త్రీలు  జరుపుకునేట్లుగా చేశాయి ప్రభుత్వాలూ, రాజ్యాంగేతర శక్తులూ, విజువల్  మీడియా కలిసి.  స్త్రీని స్వీయ ప్రగతి కోసం ఆలోచించనీయకుండా వారి  మీద రాజకీయ, ఆర్థిక, మతదాడులూ, హింసా అలా తమ పని తాము చేసుకుంటూ పోతు వుంటాయి... అధవా  ఎవరయినా ఒకరు మాట్లాడాలని ప్రయత్నించిన వారిని సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా అవమానాల పాలుచేసి, వ్యక్తిత్వ హననాలకు పాల్పడి  మిన్నకుండేట్టు చేస్తారు. స్త్రీ సమస్య గురించి మాట్లాడే వారినెవరినీ రాజ్యం సహించదు. నిలవరించదానికి వారిపై రకరకాల  దాడులను ప్రయోగిస్తున్నారు. మరీ దళిత, గిరిజన, ఆదివాసి మహిళల మీదయితే జీవించే హక్కును కూడ లేకుండా చేసి కరడుగట్టిన దౌర్జన్యాన్ని వారిపై ప్రకటిస్తుంది.
    దశాబ్ది చైతన్యం కావొచ్చు, నిరంతర హింస నుండి పొడసూపిన చైతన్యం కావచ్చు మధ్య తరగతి మహిళలే కాక, శ్రామిక మహిళలు  కూడ చిన్న చిన్న సముహాలుగా ఏర్పాడి ఎక్కడికక్కడ తమ హక్కుల కోసం ప్రయత్నిస్తూ చేస్తోన్న ఉధ్యమాలు, పోరాటాలు  మార్చి ఎనిమిదిని పదనెక్కిస్తున్నయని అర్థం చేసుకోవాలి.  ఆశను కలిగిస్తున్న షాహిన్‌ బాగ్  వంటి నిరంతర పోరాటాలే, యుద్దాలే మార్చి ఎనిమిదికి నిజమైన అర్ధాన్ని చెప్పగలవు.
    2.  స్త్రీవాదాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 
     ఈ పితృస్వామ్య సమాజం వేలయేళ్ళుగా పెంచి పోషిస్తోన్న పురుషుడి అధీకృత, స్త్రీ ఆధీన సంబంధాలను గుర్తించి, ఏ అంగీకృతమై పోయిన భావజాలాన్ని ఆమోదించడం వ్ల స్త్రీలు  తమకు తెలియుండానే తాము విలువల  గుప్పిట్లో,  సంకెళ్ళలో బందీలవుతూ వచ్చారో... స్త్రీలను నియంత్రిండం, పీడనకు గురిచేసి అణిచి వేయడమనే ప్రక్రియ ఎంత సార్వజనీనంగా సాగుతూ వచ్చిందో, అధ్యయనంచేసి, మొత్తంగా ఈ సమాజంలో స్త్రీ స్థానమేమిటి అన్నది అర్థం చేసుకోవసి వుంటుంది. స్వేచ్ఛ అన్నది నిజానికి ఒక కఠోరమైన బాధ్యత... అది ఎప్పటికప్పుడు తన విస్తృతిని పెంచుకుంటూ పోతుంది. మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త అణచివేతను, కొత్త హింసారూపాలను గుర్తిస్తూ, దానినుంచి బయటపడే, స్వేచ్ఛను పొందే యుద్ధం నిరంతరం చేసుకుంటూ పోవల్సిందే... ఈ ప్రవాహ శీలతే స్త్రీవాదానికి ప్రధాన బలం.
    3.  తెలుగులో స్త్రీవాద సాహిత్యం వెలువడ్డానికి భూమిక ఏమిటి? స్త్రీవాద సాహిత్య అవసరం ఈ నాటికీ వున్నదనుకుంటున్నారా?  80,90ల్లో బలంగా రావడానికి కారణాలేమిటి?
    పైన చెప్పుకున్న స్త్రీవాద సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నకు చెప్పుకున్న జవాబే స్త్రీవాద సాహిత్య ఆవిర్భవానికి భూమికగా మనం చెప్పుకోవచ్చు... ఐక్యరాజ్య సమితి 1975లో అంతర్జాతీయ మహిళ సంవత్సరాన్ని, ఆ తర్వాత మహిళా దశాబ్దాన్ని జరపాలని ప్రకటించడంలో మహిళకు తాము జీవిస్తోన్న జీవితం పట్ల ఒక అవగాహన, కొత్త వూపిరి పీల్చుకునే మార్పు పట్ల అభిలాష పదునెక్కడం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో మీదే స్త్రీలు  తమకు తెలీయకుండానే తమ జీవితాలు  ఎట్లా పురుషుడి  ప్రమేయంతో అల్లుకు  పోయివుంటాయో గుర్తించి  ఆ భ్రమన్నింటినీ చెదరగొడుతూ, శరీర రాజకీయాలను అర్థం చేసుకుంటూ స్త్రీలు  రాయడం మొదలు పెట్టారు... ఒక విధంగా స్త్రీవాద ఉద్యమానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా, ఒక వాహికగా చేసుకున్నారు  స్త్రీవాదులు.   రాయడం అన్నది రాయడం కోసంకాక, సమాజంలో స్త్రీ పరిస్థితి గుణాత్మకంగా మారడమే ధ్యేయంగా, ముఖ్యోద్దేశంగా సాగింది. అది 80, 90  నాటికి స్పస్టమైన రూపాన్ని తీసుకుని అస్తిత్వవాద ఉద్యమాల  నేపథ్యంలో నుండి బలమైన ఉద్యమంగా  ఎదిగిందని చెప్పవచ్చు.. ఆ క్రమంలో స్త్రీవాదులు  అధ్యయనం, రచయిత్రులను సమావేశపరచడం, ఉపన్యాసాలు, చర్చలు  సాధనాలుగా చేసుకుని అలా స్త్రీవాద ఉద్యమ నిర్మాణ క్రమంలో కార్యకర్తలే రచయిత్రులుగా, రచయిత్రులే కార్యకర్తలుగా పనిచేసిన సందర్భం అది.
    పితృస్వామ్యపు కుదుళ్ళను ఉత్తరించి, సన్నని వేర్లుకూడా మిగలకుండా ఏరివేయగలిగితేనే తప్ప స్త్రీవాద సాహిత్య అవసరం ఏనాటికయినా మిగిలే వుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోన్న హింసను గుర్తించి పోరాడాల్సిన అవసరం వున్నప్పుడు సాహిత్యం కూడా ఆ యుద్ధంలో భాగమే కదా... ఏమైన స్త్రీవాద సాహిత్య అవసరం లేకుండా పోయే రోజు కోసం ఎదురుచూద్దాం.
    4.  స్త్రీవాదానికి, మహిళా జన జీవన అధ్యయనాలకు వున్న సంబంధ మేమిటి?
     ఇవి రెండూ నిజానికి ఒక దానితో మరొకటి అనుసంధానించబడినివి... సమస్యను గుర్తించి లోతులకెళ్ళి అధ్యయనం చేయడం... నిజానికి  పరిమిత అధ్యయనం, వ్యక్తీకరణ ( ఏ రూపం లోనయినాగాని ) యివన్నీ ఒక దానితో ఒకటి మిళితమైన పోరాట సాధానాలు ... ఈ పితృస్వామిక వ్యవస్థలో పురుషుడు తన అధిక్యతను నిలుపుకోవడానికి స్త్రీలను ఎట్లా మెట్లుగా వాడుకున్నాడో... స్త్రీలను వస్తూత్పత్తి క్రములో ప్రత్యక్ష సంబంధం కోల్పోయేట్టు చేసి, సంతానోత్పత్తి ఇంటిపని వంటి స్త్రీలు  నిర్వహించే విధున్నింటినీ ప్రవేటీకరించి వాటిని వ్యక్తిగత సమస్యలుగా లేక కుటుంబ సమస్యలుగా ప్రక్కకి పెట్టడం, అంతే కాకుండా స్త్రీల అదనపు శ్రమని విస్మరించిన ఆర్థిక సూత్రాలు, స్త్రీ ఇంటి చాకిరీని మినహాయించిన మార్కెట్‌ నమూనా, వారిపై కుటుంబ హింస, వారి హోదా, స్థితి గతులపై ఆర్థిక విధానాల ప్రభావం, శ్రామిక స్త్రీల పై పేదరిక భారం యివన్నీ కూడ లోతుకెళ్ళి చర్చించగల  అవగాహనని అధ్యయనం కలిగించింది. స్త్రీలను వంటింటి  బానిసలుగా మార్చివేసిన క్రమం, ఆమె మొదలు పాచిపట్టి  పోవడం, ఇంటిచాకిరి కోసం స్త్రీలు  ఇరవై చేతులు  మొలిపించుకోడం యివన్నీ కూడా మహిళా జనజీవన అధ్యయనం లోంచి అవగాహన కొచ్చినవే... అధ్యయనంలోంచి అంకురించిందే ఉద్యమం...
    5.  స్త్రీవాద సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఎంతవరకూ ప్రభావితం చేసింది?
     స్త్రీవాద సాహిత్యం తెలుగు సాహిత్యపు ప్రధాన స్రవంతిలో  ధీటుగా నిలబడిందని  చెప్పకతప్పదు. ఆ క్రమంలో అనేక రకాల  దాడులను, ఆటుపోట్లను, అపవాదులనూ, అవమానాలను ఎదుర్కొని మరీ నిబడిరది. తొగు సాహిత్యన్నే కాదు, తెలుగు సమాజాన్ని కూడ ప్రభావితం చేసింది. వంద మంది పురుషులు  స్త్రీవాద సాహిత్యాన్ని చదివి స్త్రీ పురుష సంబంధాలను, సమాజంలో స్త్రీ హోదా, స్థితి గతులను లోతుగా అవగాహన చేసుకుని చైతన్య వంతుయిన సందర్భాలున్నాయి.  స్త్రీ ఉధ్యమపు అంతిమ ధ్యేయం అదేకదా.  స్త్రీల  స్థితి గతుల  పట్ల పురుషులని చైతన్యవంతుల్ని చేయడం స్త్రీ, పురుషలిరువురు శత్రువు కాదన్న అవగాహనని  కలిగించడం... నిజానికి పురుషుడు కూడ ఈ వ్యవస్థ గుప్పిట్లో బంధీగా వున్నాడన్న విషయాన్ని ఎరుకపరిచి స్త్రీ, పురుషులిరువురూ బంధనాలు  తెంచుకుని విముక్తి దిశగా సాగి కొత్త వ్యవస్థని నిర్మించుకోవాన్నదే స్త్రీవాద ఉధ్యమ ధ్యేయం, లక్ష్యం... అందుకోసం స్త్రీవాదులు  పురుషులని, తద్వారా సమజాన్ని చైతన్యపరిచే సాహిత్య భవంతులని నిర్మించివుంచారు. ఆ భవంతులు  తెలుగు సాహిత్యపు ప్రధాన స్రవంతికి ధీటుగా నిబడ్డాయనే చెప్పాలి.
    6.  ఇప్పుడు విధిగా,  ప్రత్యేకంగా, స్త్రీవాదం పేరిట ఉన్నతంగా రచనలు రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు?
పితృస్యామ్యం ఉత్పత్తి క్రమంలో, సమాజ సందర్భాలలో తమని  భాగస్వామ్యం చేయకుండా వంటిల్ల  లోకి నెట్టి వేసినప్పటికి, ఈ ప్రపంచం ఏ మాత్రం సిగ్గూలేకుండా తమ పడగ్గదుల్లోకి ప్రవేశించి, తమని శాసిస్తోన్న క్రమాన్ని స్త్రీలు  త్వరగా గుర్తించారు. రూపాలు  మార్చుకుంటూ తమని కబళిస్తోన్న కొత్త హింసల్ని గుర్తించి అటువైపుగా తమ పోరాటాన్ని విస్తరించారు. తాము సమాజంలో ఒక భాగం తమని  తాము నిలబెట్టుకుంటూ మారుతున్న చలన సూత్రాలతో పాటు అడుగులు వేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. తమని చెల్లాచెదురు చేయడానికి పెద్ద ప్రయత్నం చేసిన విశ్వకరణకి  వ్యతిరేకంగా తాము ఒక ఐక్యసంఘటనగా నిలబడ్డాం కాబట్టి వేగవంతమైన సమాజ మార్పుతో పాటు స్త్రీవాదం తన మార్గాన్ని మళ్ళించుకుందే  తప్ప ఉదృతంగా రచనలు  రావడం లేదని చెప్పలేం ...ఇవ్వాళ యువరచయితరులు  ఆ వేగవంతమైన సమాజ మార్పుల్ని పట్టుకుని స్త్రీ దృష్టికోణం నుండి సాహిత్యానికి చేర్పుచేయడం అభినందనీయం.    
    7.  స్త్రీ వాదం ఎక్కువగా తనకు మద్దతు యిచ్చే ఉద్యమాను, ఉద్యమ నాయకత్వాన్ని ప్రశ్నించింది. కాని పాలకులను ప్రశ్నించలేదని ఒక అభియోగం. దీని గురించి మీరేమంటారు?
     ప్రత్యక్షంగా పాలకులను ప్రశ్నించక పోయినప్పటికీ స్త్రీవాదపు సెగలు  ప్రభుత్వాలదాకా పాకాయనే చెప్పుకోవాలి. 1975 మహిళ సంవత్సరం, ఆ తర్వాత మహిళ దశాబ్ది నేపథ్యంలోంచి, ప్రాంతీయ మహిళ ఉద్యమాల  మూలంగా స్త్రీల  జీవితాలలో అభ్యుదయకరమైన మార్పు గురించి ప్రభుత్వాలు  పట్టించుకోక తప్పలేదు. ఫలితంగా మహిళా సాధికారత, స్వావంబన భావనలు బలంగా, స్పష్టంగా ప్రజల  విధానాలుగా ముందుకొచ్చాయని చెప్పాలి. మానవ జాతి అభివృద్దికి స్వాతంత్య్రం, సమానత్వం చాలా  అవసరమని, అసమానతలు  లేని స్త్రీ, పురుష సంబంధాలను ఏర్పరచుకోవాననీ,  స్త్రీలు  కూడ సమాజంలో పురుషులతో పాటు సమాన పాత్ర నిర్వాహించే అవకాశాలు  కల్పించాలనీ, స్త్రీ, పురుషులందరూ కలిసి నడుస్తూ సాధించే అభివృద్ధి మీదనే సమాజాభివృద్ధి ఆధారపడి వుంటుందని ప్రభుత్వాలకు అర్థం చేయించిన సందర్భం  అది.
    అక్షరాస్వతా కార్యక్రము మూలంగా గ్రామీణ స్త్రీలు చైతన్యవంతులయి సాగించిన సారా ఉద్యమం కేవలం స్త్రీల  ఆలోచనలో నుండి, వారి సంఘటిత శక్తులలో నుండి రూపొందించిబడిన ఉద్యమం ... మొత్తంగా సమాజాన్ని, ప్రభుత్వాలను ఎంతగా కదిలించిందో మనందరికీ తెలుసు. చెప్పుకుంటూ పోతే ఇటువంటి ఎన్నో ప్రాంతీయ మహిళా ఉద్యమాలు  సార్వజనీనమై పాలకులను ప్రశ్నించాయనే చెప్పుకోవాలి.
    8.  నవల, కథ, విమర్శ, నాటకం వంటి ప్రక్రియ కంటే స్త్రీవాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే వెలువడ్డానికి కారణాలేంటి?
    నిజమే స్త్రీల ధిక్కారస్వరం మొదటగా కవిత్వంలోనే పదునెక్కిన బాణంలా దూసుకుచ్చింది... తమ అసంతృప్తులను, ఆవేశ, కావేశాలను వ్యక్తం చేయడానికి, తమ స్థితి, గతుల్ని సమాజానికి ఎరుక పరచడానికి చాలా  దగ్గరి మార్గంగా కవిత్వాన్నే ఎన్నుకున్నారు. 
    ‘‘సారం ఒప్పచెప్పక పోతే పెళ్ళి చేస్తానని
    పంతుగారన్నప్పుడే భయమేసింది... 
ఆఫీసులో నా మొగుడున్నాడు 
అవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానమొచ్చింది.... అంటూ పెళ్ళి, మొగుడు అన్న పదాల  అర్థాలని విడమరుస్తూ మొత్తంగా ఈ వివాహా వ్యవస్థ ఎట్లా బందిపోట్లలా  స్త్రీలను పీడించుకు తింటోందో కేవలం  పదివాక్యాలలో శిల్ప రూపాలను మిళితం చేసి అర్థం చేయిస్తుంది ‘‘బందిపోట్లు’’ కవిత... ఖైదుమెట్లయిన వంటగదుల్లో ప్రేతాల్లా తేలుతుండే స్త్రీలు, నడుస్తున్న వంట గదుల్లా వుండే స్త్రీలు, లేబర్‌ రూములూ, సర్పపరిష్వంగాలు, అబార్షన్‌ స్టేట్‌మెంట్లూ, మెహందీ స్త్రీల  విజ్ఞప్తులూ, ఒంటి నిట్రాడి గుడిసెలు, అనార్కలి సమాధులు, మూడురాళ్ళ పొయ్యిలూ  యిలా మొత్తంగా కుటుంబ, సమాజ హింసమీద అల్పాక్షరాలలో అనల్ప  పోరాటాన్ని సాగించడానికి తక్షణ స్పందనగా స్త్రీవాదులు  కవిత్వాన్ని ఎన్నుకుని ఉండొచ్చు ... మారుతున్న విలువలకు అనుగుణంగా  ప్రతిస్పందిస్తూ సామాజిక చైతన్యపు వెలుగులోకి ప్రయాణించే  క్రమంలో తమ సమస్యలను చర్చించడానికి ఒక విస్తృతమైన కాన్వాస్‌ అవసరమనిపించి కథని, నవలని, నాటకాన్ని ఆశ్రయించారు.
    9.  స్త్రీవాదం పట్ల మీరెలా ఆకర్షితుయ్యారు?
     మీ అందరికీ తెలిసిందే...నాలుగ్గోడల  నడుమా వుంటూ వుంటూ సాహిత్యంతో స్నేహం చేసి మా సామాజిక  వర్గంలోని స్త్రీల  స్థానాన్ని ( ఈ సమాజంలో ) అంచనా వేస్తూ, అధ్యయనం చేస్తూ, అర్ధం చేసుకుంటూ వారి స్థితిగతుల్ని వ్యక్తం చేయడానికి సాహిత్యాన్ని ఒక వాహికగా, సాధనంగా చేసుకున్నానేమో  అన్పిస్తుంది... అందరివలె తొలుత కవిత్వంతో నా ఆలోచనల  విస్తృతి పెరిగేకొద్దీ కథని ఆలంబన చేసుకుని ఉండొచ్చు... మహిళ జనజీవన అధ్యయనంతోనే నేను స్త్రీవాదానికి దగ్గరయ్యాను. నా పరిమితుల్లో నుండి సాధ్యమైనంత పనిని స్త్రీవాద సాహిత్యానికి చేర్పు చేశానని భావిస్తున్నాను... కాలమే చెప్పాలి.
    10. దళిత స్త్రీవాదం గురించి చెప్పండి.
    అగ్రకుల  స్త్రీవాదం వెలివాడ స్త్రీల  జీవితాలను పట్టించుకోలేదనీ, మూడురాళ్ళ పొయ్యి గమ్యం తాకలేదనీ వచ్చిన ఆరోపణలతో స్త్రీవాదులు  తమని తాము విమర్శకి పెట్టుకోవసిన అవసరం ఏర్పడింది ...
    మనం ఎంతో నాగరీకమని భావిస్తోన్న ఈ సమాజానికి అంచున జీవిస్తోన్న ఒకానొక సామాజిక వర్గపు అణిచివేత గురించీ, అవమానాల  గురించీ, అక్కడ కూడా బానిసకు బానిసకు బనిసయిన స్త్రీల  జీవితాల  గురించి ఈ సభ్య సమాజానికి ఎరుక పరిచి వేలతరాలుగా మొద్దుబారి పోయిన చర్మాలను ములుగర్రతో పొడిచింది దళిత స్త్రీ సాహిత్యం...క్రిస్టియన్‌ మైనారిటీ, ముస్లిం మైనారిటీ  అయితేనేమి...కేవలం  కథలు  రాయడం కోసమో, పేరుకోసమో వాళ్ళు సాహిత్య సృజన చేయలేదు. వారికి సాహత్య సృజన అంటే కేవలం  బయటి విషయం కాదు. లోలోపలి అవసరం అనివార్యం... తమలోపలికి తాము తొంగి చూసుకుంటూ, ఒక గురుతర బాధ్యతతో దళిత స్త్రీకోణం నుండి సాహిత్యాన్ని వెలువరించారు. 
    లింగ వివక్ష మాత్రమే కాదు వర్గమూ, కులమూ, లింగమూ అన్న మూడు బండరాళ్ళను నెత్తిన మోస్తోన్న స్త్రీ జీవన విషాదాన్ని నగ్నంగా మన కళ్ళముందు పరిచి మనం ఉలిక్కిపడి తలలు  దించుకునేలా చేస్తుంది వారి సాహిత్యం.
    వేల  ఏళ్ళుగా ఈ సమాజపు నరనరాల్లోకి పాకిపోయి, జీర్ణించుకు పోయివున్న వర్గ, వర్ణాశ్రమ విలువలు, ఆ కేటాయింపుల  వెనుకనున్న మర్మం, కుట్ర, చతురత, సాధారణ మైనది కావన్న విషయాన్ని గుర్తెరిగి ఒక స్పష్టమైన సామాజిక ఎరుకని స్వంతం చేసుకుని రాయడం మొదు పెట్టారు వారు... పైన చెప్పుకున్న కేటాయింపుల్లో కూడ అట్టడుగు మెట్టుమీద నిల బడిపోయి, అస్సలేమీ దక్కకుండా ఒట్టి చేతులతో కేవలం  తమ శరీరాలతో మాత్రమే మిగిలిపోయిన  దళిత స్త్రీలు  అట్టడుగున పడిపోయి,  చైతన్యవంతుల  కంటికి కూడ కనీసం కనబడకుండా పోవడం ఒక సామాజిక విషాదం. అంటరాని స్త్రీల  తరతరాల  దు:ఖం కన్నీళ్ళు, ఆవేశం, ఆకలి, అవమానం అన్నింటినీ కూడ తమలోపలికి తీసుకుని అనుభవించి, ఆరాటపడి, ఆవేశంతో చేసిన ఆగ్రహ ప్రకటన దళిత స్త్రీ సాహిత్యం...
    తరాలుగా నిరక్షరాస్యులుగా, సామాజిక జ్ఞానంనుండి వెలివేయబడిన వారిలో వారిదయిన జీవన సంస్కృతి, వారిదైన నాగరికత, వారివైన చారిత్రక జీవనానుభవాలు  మొత్తంగా దళిత స్త్రీలు  అత్యంత శక్తివంతులన్న విషయం మనకి అవగాహనకొస్తుంది. నేను విడిగా దళిత స్త్రీ రచయితని గురించి కానీ, వారు పరిచయం చేసి అవాక్కు పరిచిన పాత్రని కానీ పేర్కొనడం లేదు గానీ రాయక్క, చిన్ని, చిదంబరం భార్య ( ఆమెకి పేరులేదు ) రామి, మరియ, ఎస్తేర్‌ వీళ్ళందరినీ ఎప్పటికీ మరిచిపోలేం.
    ముసుగు వేసుకున్నప్పటికీ మనందరికీ తెలుసు.  ఆధునిక అభివృద్ధి ఫలాలు  ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఫలాలు  కూడ అందరికీ సక్రమంగా, సమానంగా అందడంలేదని, ప్రభుత్వాలు  మారినా, సంస్కరణలు  జరిగినట్టు పైకి కన్పిస్తోన్న అట్టడుగు వర్గాల, వర్ణాల  వారి పరిస్థితి మెరుగు పడిరదేమీ లేదు... ఈ సామాజిక వర్గాల  పైన ముఖ్యంగా స్త్రీల  పైనా జరుగుతోన్న దాడులు, అణిచివేతలు, దోపిడీలు, అవమానాలు, అసమనతలు, అస్పృశ్యతలూ  ఏ మాత్రం మారకపోగా మరింత గట్టిగా, మరింత బలంగా నిర్మించబడుతోన్న ఆ గోడల్ని బద్దలు  కొట్టాల్సిన అవసరాన్ని చెప్తుంది దళిత స్త్రీవాదం...
    సాహిత్యమైనా, ఉద్యమమైనా అంకితభావంతో, ఆశయంతో ప్రయాణించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది... మహిళ విముక్తి శ్రామిక మహిళా విముక్తితో ముడిపడి వుందన్న విషయాన్ని గుర్తేరిగి ఆలోచనాపరుల  వద్దకు, మధ్యతరగతి, శ్రామిక  మహిళల  వద్దకు ఈ అంశాను తీసుకెళ్ళాల్సిన అవసరం వుంది.

సమస్య ఉన్నంతవరకూ ప్రశ్నించే గొంతులు వుంటాయి - శీలా సుభద్రాదేవి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా శీలా సుభాద్రాదేవి గారు  ‘గోదావరి’ అంతర్జాల సాహిత్య మాస పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూ

1.      అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మహిళా దశాబ్ది చైతన్యం ఏమిటి? 

          1910 మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతిపాదించబడింది. గత 110 సంవత్సరాలుగా సమస్యలు అనేక విధాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. ఒక సమస్యని పరిష్కరించేంతలో అదే సమస్య మరొకరూపం దాల్చి మహిళలని లక్ష్యం చేసుకొని బాధిస్తూనే ఉంది. ఉదాహరణకు కన్యాశుల్కం పోయి వరకట్నంగా మారటాన్నే చెప్పుకోవచ్చు. కొన్ని వర్గాలలో మహిళా దినోత్సవం అంటే కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడంతోనే ముగుస్తున్నాయి. నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలూ, మూర్ఖ సాంప్రదాయాలు స్త్రీలను అణచివేతకు గురిచేస్తూనే ఉన్నాయి. వీటిని పెంచి పోషించే సంస్కృతి ఉన్నంతకాలమూ మహిళా చైతన్యం సంపూర్తిగా ఉందని చెప్పలేము. ఈ ఉత్సవాలన్నీ కార్పొరేటు సంబురాలుగానే మిగిలిపోతున్నాయి.

2.       స్త్రీవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

          నేను స్త్రీవాదాన్ని స్త్రీ చైతన్యంగానే అభివర్ణించుకుంటాను. స్త్రీ చైతన్యవంతురాలయినప్పుడే కదా తనకేం కావాలో, తాను కోల్పోయినదేమిటో, తన హక్కులేమిటో, తాను పోరాడాల్సింది కుటుంబంతోనా సమాజంతోనా అనేది అర్థం చేసుకోగలుగుతుంది. నిజానికి స్త్రీ కోరుకునేది లైంగిక స్వేచ్ఛో, ఆర్థిక స్వేచ్ఛో కాదు ప్రధానంగా కావలసింది భావప్రకటన స్వేచ్ఛ. అది ఉన్నప్పుడు తద్వారా మిగతా హక్కులన్నీ సాకారం చేసుకునేందుకు ఒక లక్ష్యాన్ని సమకూర్చుకోగలుగుతుందని అనుకుంటాను. ఆ లక్ష్యసిద్ధికి అవరోధం ఏర్పడినప్పుడు హక్కుల కోసం పోరాటం చేస్తుంది.

3.       మహిళా జన జీవన అధ్యయనాలకు, స్త్రీవాదానికి ఉన్న సంబంధం ఏమిటి?

          సమాజంలోని స్త్రీలందరూ సమానం కాదు. కుల, మత, వర్గ ప్రాతిపదికను చూసుకుంటే స్త్రీల సమస్యలు కూడా వేరు వేరే. ఒక సమస్యకి ఒక కులంలోనో, ఒక మతంలో ఉన్నంత ప్రాతినిధ్యం మరో కులంలోనో మతంలోనో ఉండకపోవచ్చు. అందువలన స్త్రీల సమస్యలని కేటగరైజేషన్ చేయవలసి వస్తుంది. అవి తెలుసుకోవాలంటే మారుమూల పల్లెల్లోకో, బస్తీల్లోకో వెళ్ళి అధ్యయనం చేయక తప్పదు. అది సాధ్యం కానప్పుడు మన పరిసరాలలోని భిన్న తరగతుల, వర్గాల మహిళలనైనా సునిశితంగా పరిశీలిస్తే అర్థమౌతూనే ఉంటుంది.

4.       స్త్రీవాద భావజాలం తెలుగు సమాజాన్ని ఎలా ప్రభావితం చేసింది? అందువల్ల వచ్చిన గుణాత్మక పరిణామాలు ఏమైనా ఉన్నాయా? గతంలో అది వేసిన ప్రభావానికీ వర్తమానంలో దాని ప్రభావానికి మధ్య బేధం గుర్తించారా?

          స్త్రీ ఎప్పుడైతే చదువుకోటానికో, ఉద్యోగానికో బయటకు రావడం ప్రారంభమయ్యిందో అప్పటినుండే ఆమెలో మధనం ప్రారంభమయ్యిందనుకుంటాను. తనకి కావలసిన హక్కు కోసం ప్రశ్నించటం మొదలుపెట్టింది. ఎందుకంటే అరవై డెబ్భై ఏళ్ళ క్రితం నాటి రచయిత్రులు రచనలు చదువుతుంటే కొన్నింటిలో ఆ చైతన్యభావజాలం తెలుస్తూనే ఉంది. అప్పట్లో “Women’s Lib” అనే పేరుని వాడారనుకుంటాను. నేను కాలేజీలో చదివేరోజుల్లో సాధారణ మహిళలా కాకుండా భిన్నంగా ఆలోచించే, మాట్లాడే వారిని ఆ రకంగా ఎద్దేవా చేయటం కూడా తెలుసు. రంగనాయకమ్మ, పి. శ్రీదేవి వంటి వారి రచనలు, చలం, కుటుంబరావు రచనలు అప్పట్లో చదువరులైన మహిళల్లో సంచలనం కలిగించిన మాట వాస్తవం. కానీ సామాజిక, ఆర్థిక, కౌటుంబిక కట్టుబాట్లు కొంత గతంలో స్త్రీల ఆలోచనలకు కత్తెర వేసినదీ నిజమే. అందువల్లే బహుశా, ఆ రోజుల్లో స్త్రీవాద భావజాలం అతివాదంగా గాక మితవాదంగా ఆగిపోయింది. 80ల తర్వాత తీవ్రతరమై అతివాద స్త్రీవాదంగా ఎదిగింది. 

5.       స్త్రీవాద సాహిత్య అవసరం ఈనాటికీ ఉందనుకుంటున్నారా?

          కాలక్రమేణా సమస్యలు రూపాంతరం చెంది మరొక రూపంలోకి మారుతున్నాయి. సమస్య ఉన్నంతవరకూ ప్రశ్నించే గొంతులు వుంటాయి. అవి అక్షరరూపం కూడా దాలుస్తూనే ఉన్నాయి. ఉంటాయి. ఉండాలి.

6.       80, 90లలో స్త్రీవాద సాహిత్యం బలంగా వెలువడడానికి కారణాలు ఏమిటి?

          ఇంతకుముందు చెప్పినట్లే కొన్ని వర్గాలకు బాగా చదువుకొనే అవకాశమే కాక ఆర్థికంగా, సామాజికంగా కొంత వెసులుబాటు కూడా కలిగింది. దాంతో సమస్యల గురించి ఆలోచించి అధ్యయనం చేసి పరిష్కారం కనుగొనే దిశలో ధైర్యంగా తమ దృక్పథాన్ని, భావాల్నీ బలంగా ఎలుగెత్తి రాయగలిగారు. అయితే జండర్ వివక్ష, భావస్వేచ్ఛ, అణచివేతకు గురౌతున్న దేహ స్పృహ వీటిపై చర్చించినంతగా సామాజికంగా వెనుకబాటుతనంకి, మూఢనమ్మకాలకీ, సాంప్రదాయాల పేరిట కుటుంబాలలో శారీరక మానసిక హింసలకీ గురౌతున్న వారికి బాసటగా నిలిచే సాహిత్యం రాలేదని నా ఉద్దేశ్యం. అందువల్లనే తదనంతరం స్త్రీవాద సాహిత్యం అనేక పాయలుగా విడిపోయిందనీ, ఎవరి అస్థిత్వాన్ని వారు అంతకంతకూ సాహిత్యంలో బలంగా చోటు చేసుకోవటం మొదలయ్యింది.

7.       స్త్రీవాద సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఎంతమేరకూ ప్రభావితం చేసింది?

          అప్పట్లో చాలా సంచలనమే తెచ్చింది. చాలామంది సాహితీవేత్తలు ఉలికిపడి తమని తాము తడుముకునే పరిస్థితి వచ్చింది. స్త్రీవాద ముద్రకోసం రచయితలూ, కవులూ కూడా సంఘీభావంగా రాయటం మొదలుపెట్టారు. రాసేవాళ్ళకే కాక చదువరులకు కూడా ఒక స్పష్టమైన దృష్టి కోణం ఏర్పడటానికి దోహదం చేసింది.

8.       ఇప్పుడు విడిగా స్త్రీవాదం పేరిట ఉధృతంగా రచనలు రాకపోవటానికి కారణాలు ఏమిటనుకుంటున్నారు?

          రాకపోవటం ఏమిటి? ప్రశ్నించే గొంతులూ పెరిగాయి. తమ తమ అస్థిత్వాలకు మూల కారణాలను అన్వేషిస్తూ బలంగా నిలిచే విధంగానే రచనలు చేస్తూనే ఉన్నారు. స్త్రీవాద లేబుల్ లేకపోవచ్చును కానీ చాలావరకూ చైతన్యస్ఫూర్తితోనే సాహిత్యం వెలువడుతూనే ఉంది.

9.       నవల, కథ, విమర్శ, నాటకం వంటి ప్రక్రియలకంటే స్త్రీవాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే వెలువడుతుంది. దీనికి కారణం ఏమంటారు?

          ఒక చిన్న సూదిమొన అంత బాధ మనసుని తాకినప్పుడు చిన్న సంఘటనో, దృశ్యమో మనసుని కదిలించినప్పుడు తక్షణ స్పందనగా తన భావాన్నీ ఆలోచననీ, ఆవేదననీ, ఆక్రోశాన్నీ కవిత్వంలోనే బలంగా చెప్పగలుగుతాము. బహుశా అందువల్లనే కవిత్వం ఎక్కువగా వెలువడింది. కథలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా వెనుకబాటుకు గురైన కులాలు, అణగారిన కులమతాలకు చెందిన స్త్రీలలో కూడా చదువుకునే అవకాశాలు పెరిగి ఆలోచనలు విప్పుకొని తమ అనుభవాలను అక్షరీకరించే క్రమంలో కథలు బాగానే వచ్చాయి. నవలలు మాత్రం ఇంకా సాంప్రదాయ చట్రాన్ని దాటి ఎక్కువగా రావటం లేదు. నాటకం అసలు లేదనుకుంటాను. ఇంక స్త్రీవాద విమర్శ గురించి చెప్పుకోవాలంటే నీలిమేఘాలు దాటి ఏ విమర్శకులూ దృష్టి సారించటం లేదు. చెప్పిన వాళ్ళ గురించే చెప్తూ, చెప్పిన విషయమే చెప్పటంతో ఆ వ్యాసాలన్నింటా పునరుక్తి దోషం ఉంటుందనిపించుతోంది. స్త్రీవాద విమర్శ చేసేవాళ్ళు ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను.

10.     స్త్రీవాదం పాలకులను ప్రశ్నించలేదని ఒక అభియోగం. దీని గురించి ఏమంటారు?

          ప్రశ్నించటంతోనే మొదలైన స్త్రీవాదం ముందుగా కుటుంబాన్ని తన హక్కుల కోసం ప్రశ్నించింది. తర్వాత్తర్వాత అనేక అస్థిత్వ పాయలుగా విడిపోయిన తర్వాత తన అసహాయతకు, అణచివేతకు కారణమైన సమాజాన్నీ ప్రశ్నించింది. విభజించి పాలించే తత్వంతో మనుషుల్ని కులాలు, మతాలూ, ప్రాంతీయులుగా విడదీయటంతో గొంతులు మూగబోతున్నాయి.  ఒకటీ అరా గొంతు సవరించుకునే సమయానికి వారిపై డేగకళ్ళు దృష్టి సారిస్తున్నాయి. పురస్కారాల బిస్కట్లతో కొందర్ని కొనేసుకుంటున్న దశలో ఏమని ప్రశ్నిస్తారు.

11.     దళిత బహుజన మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు, సాహిత్యం స్త్రీవాద సాహిత్య విస్తరణకు అవరోధం అయ్యాయని భావిస్తున్నారా?

          ఎంతమాత్రం కాదు. అంతవరకూ చెప్పిన అగ్రకుల స్త్రీవాద ధోరణికి పూర్తిగా భిన్నమైన అస్తిత్వవాదాలు వచ్చి సాహిత్యానికి ఒక కొత్త చూపు, కొత్త రూపు ఇచ్చాయని నా ఉద్దేశ్యం. అంతవరకూ సాహిత్య రంగంలో వచ్చిన అన్ని రచనలకూ భిన్నమైన జీవితాన్ని, దుర్భర అణచివేతల్నీ విప్పి చూపి సమాజంలోని భిన్న పార్శ్వాలను పరిచయం చేసింది.

 

12.     సామాజిక ఉద్యమాలు బలహీనపడ్డాయి కనుక స్త్రీవాదం బలహీనపడింది అంటున్నారు. నిజమా కాదా? ఎందుకు?

          లేదనుకుంటాను. సామాజిక ఉద్యమాల వలనే ఇతరేతర అస్తిత్వవాద సాహిత్యం బలంగా వచ్చింది. నిజానికి ఇతర అస్తిత్వ ఉద్యమాలు స్త్రీవాదాన్ని బలోపేతం చేయాలి కదా! విరసం ప్రభావంతో వచ్చిన సాహిత్యంలోని పాయలే కదా ఇవన్నీ. స్త్రీవాద పరిధిలో ఉన్నవాళ్ళు ఆ పరిధిని విస్తరించుకోవటానికి ప్రయత్నించకపోవటం వలన, ఆ ముద్ర లేకపోయినా అదే దృక్పథంలో ఉన్నవారిని కలుపుకొని ప్రయాణించకుండా, ఆ పరిధిని దాటి ఇతరేతర సమస్యల పట్ల దృష్టి సారించకపోవటంవల్లా కొంతమంది తొలినాటి స్త్రీవాద ఛాయల్ని దాటి మారుతోన్న సమస్యల రూపాంతరాల జోలికిపోకుండా అవే పట్టుకువేలాడుతుండడంవల్లే అక్కడే ఆగిపోయారు.

13.     గ్లోబలైజేషన్ కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు స్థానం ఉందా?

          గ్లోబలైజేషన్ వల్ల స్త్రీల పరిస్థితులు బాగుపడ్డాయా అని ప్రశ్నించుకునే ముందు బస్తీల్లోకో, గ్రామాల్లోకో వెళ్ళి చూడాలి. అందరి చేతుల్లోకీ స్మార్టు ఫోన్లు, ఇళ్ళల్లోకి రంగుల కలల వలల్ని విసురుతున్న ఇడియట్ బాక్సులు వచ్చి కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాయ్. మహిళల మెదళ్ళని అర్థం లేని టీవీ కార్యక్రమాలు బూజుపట్టించి మరింత  మూర్ఖులుగా మార్చుతూ అంతకంతకూ భావజాలం మాత్రం వెనక్కే పరుగెడుతుంది. వాళ్ళని జాగృతపరచాల్సిన ఉద్యమాలు కొత్తగా రావాలేమో.

14.     మీరు స్త్రీవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

          మా అక్క పి. సరళాదేవి ప్రభావంతోనూ, అన్నయ్య కొడవంటి కాశీపతిరావు సేకరించిన పుస్తకాలు చాలా చిన్నప్పటినుండే చదవటంవల్ల మొదటి నుండీ నాలో భావతీవ్రత ఉండేది. బాల్యం నుండీ కుటుంబ పరిస్థితులు గొంతునొక్కేసినా అక్షరాలుగా నా మనసుని కాగితాలపై పెట్టటం మొదలుపెట్టిన దగ్గర నుండి అస్తిత్వం కోసం ఆరాటపడుతూనే ఉన్నాను.

 15.     స్త్రీవాద సాహిత్య అభివృద్ధిలో మీ పాత్రని ఎలా నిర్వచించుకుంటారు?

          తొమ్మిది కవితాసంపుటాలు మూడు కథల సంపుటాలు, ఒక నవలిక గత యాభై ఏళ్ళుగా నా సాహిత్య ఖాతాలో ఉన్నాయి. అందులో మూడొంతులపైగా స్త్రీ సమస్యలపైనే రాశాను. నా స్వభావరీత్యా నా వాక్యాలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అన్ని వర్గాల స్త్రీల సామాజిక, రాజకీయ, ఆర్థిక మూలాల్ని అన్వేషిస్తూనే విభిన్న అంశాల్ని నా కథ కవితాంశాలుగా తీసుకున్నాను. ఇంకా రాస్తూనే ఉన్నాను. నా కలం ఇంకా అలసిపోలేదు.

16.     స్త్రీవాద సాహిత్యం సాధించిన ప్రయోజనం ఏమిటి?

          స్త్రీలకే కాదు పురుషులకి కూడా ఒక కొత్త చూపుని ఇచ్చింది.

17.     తెలుగులో వచ్చిన స్త్రీవాద సాహిత్యంలో మీకు నచ్చినవి, మిమ్మల్ని ప్రభావితం చేసిన రచనలు ఏవి?

          నేను ఏడు, ఎనిమిది తరగతుల్లో నుంచీ రంగనాయకమ్మ పేకమేడలు, కూలిన గోడలు మొదలైన నవలలు మా అమ్మకి చదివి వినిపించేదాన్ని. బహుశా నా మీద ఆమె ప్రభావమే ఎక్కువగా ఉందనుకుంటాను. రావిశాస్త్రి, బీనాదేవి రచనలు కూడా ఎక్కువగా చదవటం వలన రాజకీయ దృక్కోణంలో స్త్రీ అస్తిత్వం గురించిన ఆలోచనలు కూడా నా రచనల్లో వ్యక్తమౌతాయి. 

18.     20, 30 ఏళ్ళ నాటి స్త్రీవాద సాహిత్యం ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉందని మీరు భావిస్తున్నారా?

          లేదనే చెప్పాలి. మహిళలకి తమ అస్తిత్వాన్ని గురించి ఆలోచనను నేర్పింది. కానీ పాయలుగా విడిపోయిన తర్వాత వచ్చిన దళిత, బహుజన, మైనారిటీ అస్తిత్వ వాదాలు వచ్చిన తర్వాతే అన్ని వర్గాల అణగారిన స్త్రీల అణచివేతలనన్నింటినీ బట్టబయలు చేసి సమస్యల తీవ్రత అందరికీ అర్థమయ్యేలా చేసిందనుకుంటున్నాను.

19.     స్త్రీవాదం గురించి మీ దృక్పథంలో మార్పు ఏమైనా వచ్చిందా?

          సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్నుండి స్త్రీ సమస్యల్ని చూడడం పరిశీలించడం, రాయటం మొదటి నుండి నా రచనా విధానం. ఇప్పటికీ నా దృక్పథం అదే.

20.     స్త్రీ వాద సాహిత్య సృజనకు స్వీయ జీవితానుభవాలు, అనుభూతులు సరిపోతాయా?

          స్వీయ జీవితానుభవాల నుండి సార్వజనీనం కావల్సి ఉంటుంది. సూక్ష్మ పరిశీలనాత్మక దృష్టిని అలవరచుకుని అనుభూతుల్ని ఇతరుల అనుభవాల్తో సాదృశ్యం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారి సమస్యల్ని, అంతరంగాల్నీ శోధించాలి. అప్పుడే ఆ రచన అందరిదీ అవుతుంది.

21.     మీ రచనలలో అచ్చమైన, గాఢమైన స్త్రీవాద రచనలుగా మీరు వేటిని పేర్కొంటారు. ఎందువల్ల?

          నా రచనల్లో మూడొంతులు స్త్రీపరంగా సాగినవే. అయితేబతుకుబాటలో అస్తిత్వరాగంఅనే దీర్ఘకవిత పూర్తిగా ఆడ శిశువు కళ్ళు తెరచిన దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ ఏడు ఛాప్టర్లుగా రాశాను. ఇందులో అన్ని వర్గాల స్త్రీల జీవితాల్నీ సంపూర్ణంగా చర్చించాననే అనుకుంటున్నాను. స్త్రీ జీవితంలోని అన్ని ఘట్టాల్నీ వాటి పూర్వాపరాల్నీ తెరిచి చూపటానికి ప్రయత్నించాను. అదేవిధంగాయుద్ధం ఒక గుండెకోతదీర్ఘకవిత సమకాలీన రాజకీయాలు, మతం, స్త్రీల జీవితాలలో కలిగించే కల్లోలాలను యుద్ధ నేపథ్యం మాతృహృదయ ప్రతిస్పందనగా రాశాను. ఇవి రెండూ నన్ను పూర్తిస్థాయి కవయిత్రిగా నిలిపాయని అనుకుంటున్నాను.

22.     స్త్రీవాద సాహిత్యం వచ్చినంతగా స్త్రీవాద సాహిత్య విమర్శ రాలేదన్న ఆరోపణ వినబడుతుంది. దానిపట్ల మీ అభిప్రాయం ఏమిటి?

          మనకి తెలుగులో విమర్శకులు తక్కువ. సాహిత్యాన్ని సంపూర్తిగా చదివి, అవగాహన చేసుకొని రాసే విమర్శకులు మరింత తక్కువ. చాలామంది రాసిన స్త్రీవాద విమర్శ వ్యాసాల్ని ఒక దగ్గర పెట్టి చూస్తే పునరుక్తి కనిపిస్తుంది. ఒరిజినల్ పుస్తకాలు అధ్యయనం చేసి, మూల్యాంకనం చేసుకొని, సారూప్యాలూ, సాదృశ్యాలు అవగాహన చేసుకొని రాసేంత ఓపిక, సావకాశం చాలామందికి లేదు. ఒక నాలుగు వ్యాసాలు పెట్టుకొని Cut, Paste చేసి తయారుచేసిన స్త్రీవాద వ్యాసాలే ఎక్కువగా ఉన్నాయి. విమర్శకులకి ప్రధానంగా కావలసినది అధ్యయనం. ఆ విధంగా అధ్యయనం చేయకుండా రాసిన విమర్శ వ్యాసాలు సమగ్రంగా ఉండవు.

23.     స్త్రీ సమానత్వం, స్త్రీ సాధికారతల సాధనకు ఈ రాజకీయాలు ఏమేరకు తోడ్పడతాయి?

            స్త్రీ సమానత్వ హక్కుల్నిగానీ, సాధికారతనుగాని సాధించుకోవాలనే లక్ష్యం ముందు స్త్రీలలో ఉండాలి. విభజించి పాలించాలనే దృక్పథం కలిగిన రాజకీయాలు తోడ్పడతాయని ఎలా అనుకుంటాం. అవకాశం ఉన్నంతవరకూ, లక్ష్య సాధనకు అవసరమైనంత వరకూ స్త్రీలు చదువుకోవాలి. తర్వాత సాహిత్యపఠనంకి ఏమాత్రమైన సమయం కేటాయించుకోగలిగితే సమకాలీన సమస్యల పట్ల అవగాహన కలుగుతే తమని తాము ఎలా మలచుకోవాలో తెలుస్తుంది. మార్పు మూలం నుండీ రావాలి. స్త్రీవాద దృక్పథంతో పనిచేసే కొన్ని సంస్థలు స్త్రీలని అనేక విషయాలలో జాగృతపరచటానికి పనిచేస్తున్నాయి.

స్త్రీవాదం కేవలం  లింగ వివక్షకే పరిమితం కాదు, కాలేదు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు ఓల్గా గారు ఇచిన ఇంటర్వ్యూ

1. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రేరణలు ఏమిటి?

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చారిత్రక ప్రాధాన్యతను మర్చిపోకుండా పోరాట స్ఫూర్తి, మహిళా ఐక్యతను, వాటి ప్రాముఖ్యతనూ గుర్తు చేసుకుంటూ వర్తమాన కాలంలో ఐక్య పోరాటాల  అవసరాన్ని అంచనా వేసుకుంటూ అర్థం చేసుకోవాలి.  చరిత్ర తెలుసుకుంటే ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ ఈ కాలంలో ఎంతో అవసరం. మహిళలపై హింస ఊహాతీతంగా పెరుగుతున్న వర్తమానంలో స్త్రీలు  పోరాటం చేయాలని,  ప్రతిఘటనకు పూనుకోవాలనీ, ఒకప్పుడు మహిళలు  అద్భుతమైన పోరాటాలు  చేసి అనేక హక్కులు  పొందారనీ తెలుసుకోవటం అవసరం. అదే ప్రయోజనం కూడా!

2. అంతర్జాతీయ మహిళా దశాబ్ది చైతన్యం ఏమిటి?

అంతర్జాతీయ మహిళా దశాబ్ది గడిచిపోయింది. ఆ కాలంలోని స్త్రీల  ఉద్యమాలు, వాటి ద్వారా  రూపొందిన స్త్రీవాద సిద్ధాంతాలు  ఈ నాటికీ స్త్రీలకు మార్గదర్శకంగా ఉన్నాయి. అంతర్జాతీయ సదస్సులలో అనేక కీలకాంశాలు  చర్చకు వచ్చాయి. స్త్రీల  పట్ల ప్రపంచమంతా ఉన్న వివక్షను, దాని వ్యతిరేక ఫలితాలను అన్ని దేశాలూ చర్చించాయి. ఆ చర్చలు సామాన్య  మహిళల  వరకూ చేరుకునే వీలు  కలిగింది.  మహిళల  హక్కులు  మానవ హక్కులనే నినాదం ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. మహిళలు  తమ హక్కుల గురించి ప్రశ్నించటం, పోరాడటం కొనసాగిస్తూనే ఉన్నారు.

3.  స్త్రీవాదాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

స్త్రీవాదం సమాజాన్ని అర్థం చేసుకునే ఒక విశ్లేషణా సిద్ధాంతం.  సమాజంలోని సమస్త అసమానతలనూ, వివక్షలనూ పరిశీలించి, అర్థం చేసుకుని, వాటిని నిర్మూలించేందుకై పోరాడాల ని చెప్పే ఒక దృక్పధం. స్త్రీ పురుషులిద్దరూ ఈ దృక్పధాన్ని కార్యాచరణలో పెట్టాలని చెప్పే సిద్ధాంతం. లింగ వివక్షకు మాత్రమే స్త్రీ వాదాన్ని  పరిమితం చేయలేము. కుల, మత, జాతి, వర్ణ, లైంగిక సంబంధిత అసమానతనన్నిటినీ స్త్రీ వాదం గుర్తిస్తుంది. పరిగణనలోకి తీసుకుంటుంది. పర్యావరణం గురించి మాట్లాడుతుంది. శాంతి ప్రాధాన్యతను గుర్తించమంటుంది. అభివృద్ధి అంటే అసలైన అర్థమేమిటో వివరిస్తుంది. వీటన్నిటినీ గమనించకుండా ఇంకా 30 సంవత్సరాల  క్రితం వేసిన పాత ప్రశ్నలోనే కూరుకుపోతే స్త్రీవాదాన్ని అర్థం చేసుకోలేము.

4.   మహిళా జన జీవన అధ్యయనాలకు,  స్త్రీవాదానికి వున్న సంబంధ మేమిటి?

అధ్యయనాలు , గణాంకాలు  సామాజిక అభివృద్ధిని, మహిళాభివృధ్ధినీ అంచనా వేసేందుకు ఉపయోగపడే పరిశోధనలో ముఖ్యమైన భాగం. మహిళల  స్థితి గతుల  గురించి తెలియటం సిద్ధాంతపు సమకాలీనతకు ఎప్పుడూ మంచిదే ఈ అధ్యయనాలు  స్త్రీవాద సిద్ధాంతపు పదునును పెంచుతాయి.

5.   స్త్రీ వాద భావజాలం తెలుగు సమాజాన్ని ఎలా ప్రభావితం చేసింది? అందువల్ల వచ్చిన గుణాత్మక పరిణామాలు ఏమైనా ఉన్నాయా? గతంలో అది వేసిన ప్రభావానికి వర్తమానంలో దాని ప్రభావానికి మధ్య భేదం ఏమైనా గుర్తించారా?

స్త్రీవాద భావజాలం  జండర్‌ దృక్పధాన్ని సమాజానికి పరిచయం చేసింది. ప్రతి విషయాన్నీ జండర్‌ దృష్టితో పరిశీలించటం, అర్ధం చేసుకోవటం ముఖ్యమని చాలా  వరకు తెలుగు సమాజం గుర్తించింది. మహిళలు  చేసిన, చేస్తున్న పోరాటాలలో స్త్రీవాద ప్రభావమెంతో ఉంది. పితృస్వామ్యం ఒక వ్యవస్థగా ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోలేకపోతే స్త్రీల  సమస్యలు  అర్థం చేసుకోలేమనే ఆలోచన ఇచ్చింది. పితృస్యామ్యం విధించే అణిచివేతల, ఆంక్షల  లోతును, సంక్లిష్టత్వాన్ని విప్పి చూడాలని తెలియజెప్పింది. ఈ విషయాలను అర్థం చేసుకున్నపుడు తమ అణచివేతలను గుర్తించటం సులభమవుతుంది.

                గతంలో ప్రభావం తరువాతి తరాలు  అందిపుచ్చుకున్నాయి. ఇప్పటి మహిళాఉద్యమాలలో, పోరాటాలలో స్త్రీవాద ఉద్యమ ప్రభావం లేదని ఎవరనగరు? అంటే అది చరిత్రను విస్మరించటమే.

6. తెలుగులో స్త్రీ వాద సాహిత్యం వెలువడడానికి భూమిక ఏమిటి? స్త్రీ వాద సాహిత్య అవసరం ఈనాటికి ఉన్నదనుకుంటున్నారా?

 స్త్రీలు  తమ పట్ల సమాజంలో అమలవుతున్న అణచివేతను, వివక్షను, వీటిని అము చేస్తున్న పితృస్వామ్య  భావజాలాన్ని అర్థం చేసుకునే క్రమంలోనే తెలుగు స్త్రీవాద సాహిత్య భూమిక యేర్పడిరది. స్త్రీవాద సాహిత్య  అవసరం ఉందా అనే ప్రశ్న హాస్యాస్పదం. ఇవాళ వస్తున్న సాహిత్యంలో స్రీవాద దృక్పధం లేకపోతే దానిని ప్రశ్నించటానికి పాఠకులు  సిద్ధంగా ఉన్నారు.  స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి ప్రశ్నలు  రేకెత్తించే సాహిత్య అవసరం ఉందా అని అడుగుతున్నారా?  అసమానత్వం ఉన్నంతకాలం  దానిని వివరించే,  ప్రశ్నించే సాహిత్యం వస్తుంది. ఇపుడు కూడా వస్తూనే ఉంది.

7. 80, 90 దశకాల్లో స్త్రీ వాద సాహిత్యం బలంగా వెలువడడానికి కారణాలు ఏమిటి?

80, 90 దశాబ్దాలలో స్త్రీవాద సాహిత్యం ఉధృతంగా ప్రారంభమై, ఇపుడు కూడా బలంగా వస్తున్నది. అది ప్రారంభం గనుక అందరూ గమనించేలా వచ్చింది. కొత్త చూపునిచ్చింది గనుక ఆ దశాబ్దాలకు ఒక ప్రాధాన్యత ఉంది. తర్వాత రచయితందరూ జండర్‌ దృక్పధాన్ని ఒంట బట్టించుకోవటం తప్పనిసరైంది. ఒక్క స్త్రీ పురుష అసమానతల  మీదే కేంద్రీకరించటం వల్ల  80, 90 దశకాలలో స్త్రీవాదం బలంగా వచ్చినట్లు అనిపించవచ్చు. క్రమంగా స్త్రీవాద పరిధి విస్తరించింది.

8. ఇప్పుడు విడిగా ప్రత్యేకముగా స్త్రీ వాదం పేరిట ఉధృతంగా రచనలు రాకపోవడానికి కారణాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు?

          రచనలు వస్తూనే ఉన్నాయి అని నేనంటున్నాను. రాకపోవటానికి కారణాలు  నన్నడిగి లాభం లేదు.

 

10. నవల, కథ, విమర్శ, నాటకం వంటి ప్రక్రియల కంటే స్త్రీ వాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే  వెలువడింది. దీనికి కారణాలు ఏవంటారు?

కవిత్వంతో పాటు కథ, విమర్శ ఈ రెండిరటిలో స్త్రీవాద సాహిత్యం వచ్చింది అనేక కథా సంకలనాలు వెలువడ్డాయి. వెలువడుతున్నాయి. నవల  ప్రచురణ కష్టం కావటం వల్ల  తక్కువ వెలువడ్డాయని నా అభిప్రాయం.

నాటకం స్త్రీవాదంలోనే కాదు ఏ వాదంలోనూ అంత బలంగా లేదు.

 

11.  స్త్రీ వాదం ఎక్కువగా తనకు మద్దతు ఇచ్చే ఉద్యమాలను, ఉద్యమ నాయకత్వాన్ని ప్రశ్నించింది  కానీ – పాలకులను ప్రశ్నించలేదని ఒక అభియోగం.  దీని గురించి మీరు ఏమంటారు?

 స్త్రీవాదం పితృస్వామ్య రాజకీయాలన్నిటినీ ప్రశ్నిస్తుంది. వామపక్ష ఉద్యమాలలో అసమానత్వాన్ని, వివక్షను ఎదుర్కొని వచ్చిన స్త్రీవాదులు  ఆ ఉద్యమ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అందులో ఆశ్చర్యపడవసిందేమీలేదు. ఎక్కడ సమానత్వం ఉంటుందని నమ్మారో అక్కడ లేకపోవటం స్త్రీవాదులను ప్రశ్నించేలా చేసింది. తమకు సగభాగం దక్కుతుదంని నమ్మకంతో వెళ్ళిన చోట కూడా వివక్షలు  ఎదురవటాన్ని స్త్రీ వాదులు  ప్రశ్నించారు.

                పాలకులను ప్రశ్నించక పోవటం ఏమిటి? స్త్రీవాద ఉద్యమాలు  ఎవరికి వ్యతిరేకంగా నిర్మించబడ్డాయి? వరకట్న హత్యలు, స్త్రీలపై లైంగిక అత్యాచారాలు, లింగ నిర్ధారణ పరిక్షలు, పనిచేసేచోట లైంగిక వేధింపులు - ఈ ప్రశ్నలు  లేవదీసింది,  పోరాటాలు, ఉద్యమాలు  చేసింది పాలక వర్గాలతోనే కదా! ఎంతోకొంత మార్పుతెచ్చే చట్టాల కోసం, వాటి అమలు  కోసం ప్రశ్నిస్తున్నది ఉద్యమిస్తున్నది పాలకులతో కాక మరెవరితో?

                పాలకులంటే కేవలం  అప్పుడు అధికారంలో ఉన్నవారే కాదు. పాలకవర్గం పూర్తిగా పితృస్వామ్య భావజాలాన్ని అమలు  చేసే పనిలో నిమగ్నమై ఉందని, పితృస్యామ్యం లేకుండా పాలకవర్గం మనలేదని స్త్రీవాదమే మొదటగా గుర్తించింది. స్త్రీవాద పోరాటమంతా పిత్రుస్వామ్య వ్యతిరేకపోరాటమే. సారాంశంలో పాక వర్గాల  వ్యతిరేక పోరాటమే.

12. దళిత బహుజన మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు, ఉద్యమ సాహిత్యం స్త్రీ వాద సాహిత్య విస్తరణకు అవరోధం అయ్యాయని భావిస్తున్నారా?

అసలు  భావించటం లేదు. ఆ అస్తిత్వ వాదాలన్నీ స్త్రీవాదానికి బలం  చేకూరుస్తాయి. అసమానతలు  ఎక్కడున్నా గుర్తించటం నేర్పింది స్త్రీవాదమే.

13. స్త్రీ వాదానికి ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో సహా దళిత బహుజన మైనారిటీ అస్తిత్త్వాలకు వైరుధ్యం ఉందని అనుకుంటున్నారా?

వైరుధ్యమేమీ లేదు.

14. స్త్రీవాద అస్తిత్వ ఉద్యమానికి మిగిలిన అస్తిత్వ వాద ఉద్యమాల కంటే భిన్నంగా ఉన్న ప్రత్యేకత ఏమిటి?

 ప్రత్యేకత ఏమో గానీ - స్త్రీవాదం కేవలం  లింగ వివక్షకే పరిమితం కాదు. కాలేదు. సమస్త అణచివేతను, అసమానతను గుర్తించే శక్తి, విశ్లేషణా పటిమ స్త్రీవాద సిద్ధాంతానికి ఉంది.

15. “సామాజిక ఉద్యమాలు బలహీనపడ్డాయి కనుక స్త్రీ వాదం బలహీనపడింది అంటున్నారు” ఇది నిజమా? ఎందుకు?

 స్త్రీవాదం బహీనపడలేదు. స్త్రీల గొంతులు  ముందెన్నటికన్నా బలంగా ఉన్నాయి. బలహీనపడిరదనుకుని సంతృప్తి చెంది కళ్ళూ, చెవులూ  మూసుకునే వారిని  ఏం చేయగలం? సామాజిక ఉద్యమాలకు ఆటు పోట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇది ఉద్యమ కాలం.

16. గ్లోబలైజేషన్  కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు స్థానం ఉన్నదంటారా?

ప్రపంచీకరణ కాలంలోనే గదా అస్తిత్వ ఉద్యమాలు  పుట్టి పెరుగుతున్నది.

 

సమాజంలో సంపూర్ణమైన మార్పు తీసుకువచ్చేది ఆర్థిక రాజకీయ శక్తులే – రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1          మీ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా చెప్పండి

మా ఊరు తిరుపతికి దక్షిణంగా ఆరు కిలోమీటర్ల దూరంలోని కుంట్రపాకం. మా నాయన రామిరెడ్డి, అమ్మ మంగమ్మ. మా అమ్మ నాన్నలకు నలుగురం సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మా అమ్మ నాకు రెండు రెండున్నర ఏళ్ళ వయసులో చనిపోయింది. ఆమె ఎలా ఉండేదో నాకు తెలియదు. అనివార్యంగా మా నాయన రెండో పెళ్ళి చేసుకున్నారు. ఆమె రాజమ్మ. ఆమె మమ్మల్ని అసలైన తల్లిలాగే పెంచి పెద్ద చేసింది.  సినిమాలో పిన్న తల్లిలాంటిది కాదు. ఆమెకు నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అలా మేము ఎనిమిది మందిమి.

మాది వ్యవసాయ కుటుంబం. మా నాయన కష్టజీవి. నన్ను వ్యవసాయంలో బాగా తీర్చిదిద్దారు. నాకు వ్యవసాయంలోని అన్ని ప్రక్రియలు తెలుసు. బి.. పాసయ్యేదాకా వ్యవసాయం చేస్తూనే చదువుకున్నాను. నా ప్రాథమిక విద్య మా గ్రామంలోనే. ఆరు, ఎస్ ఎస్ ఎల్ సి  తప్ప తక్కిన విద్య ఏడవ తరగతి నుండి పిహెచ్ డి దాకా తిరుపతిలోనే చదువుకున్నాను. ఉదయం అయిదుకు నిద్రలేచి పొలంలోకి పోయి పొలం పనులు చేసి ఏడుగంటలకు ఇంటికి వచ్చి, చద్దన్నం తిని, ఆ చద్దన్నాన్నే క్యారియర్ లో తీసుకొని తిరుపతికి నడుచుకుంటూ  పోయి, సాయంకాలం నాలుగు గంటలకు తిరుపతిలో బయలుదేరి ఊరికి వచ్చి, వెంటనే పొలంలోకి పోయి, కొంత పని చేసి, పశువులకు గడ్డి తీసుకొని వచ్చేవాడిని. కాలినడకన పొలాల మీదుగా స్వర్ణముఖి నదిలో నడిచిపోయి వచ్చేవాడిని.

నాకు 1974లో పెళ్ళైంది. లక్ష్మీకాంతమ్మ నా భార్య. మాకు ఇద్దరు సంతానం. ఆ యిద్దరు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారు. మా వియ్యంకులు అతిసామాన్యులే.

1977 ఆగష్టులో నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్చరర్‌గా చేరాను. 2008 అక్టోబర్ లో ఆచార్యుడిగా ఉద్యోగ విరమణ చేశాను. వెంటనే కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నన్ను ఆహ్వానించింది. అక్కడ ఏడేళ్ళు పనిచేశాను. ఇప్పుడు ఇంటిలోనే ఉన్నాను.

నేను ప్రభావతీ ప్రద్యుమ్న ప్రబంధం మీద పరిశోధన చేశాను. ఆ తర్వాత ఆధునిక సాహిత్యంలోకి ప్రవేశించాను. ఇప్పటిదాకా నేను 30 విమర్శగ్రంథాలు, నాలుగు కావ్యాలు, పది అనువాద గ్రంథాలు, ప్రచురించాను. ఇరవై గ్రంథాలకు సంపాదకత్వం వహించాను. ఆం.ప్ర. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షకుడిగా ఉన్నాను. నేషనల్ బుక్ ట్రస్ట్, కేంద్రసాహిత్య అకాడమీలలో తెలుగు సలహామండలి సభ్యుడిగా పని చేశాను. ఆం.ప్ర. అధికార భాషాసంఘంలో సభ్యుడిగా పనిచేశాను. ఇప్పుడు కేంద్రసాహిత్య అకాడమీ  జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాను. ప్రజాశక్తి బుక్ హౌస్ గౌరవ సంపాదకుడిగా ఉన్నాను.

నా పర్యవేక్షణలో 25 మంది పిహెచ్ డీలు, 20మంది ఎం.ఫిల్ లు  చేశారు. 1910 నుండి 2000 దాకా వచ్చిన కథల మీద దశల వారిగా పరిశోధన చేయించాను. యోగివేమన విశ్వవిద్యాలయంలో రాయలసీమ సాహిత్యం మీద ప్రక్రియల వారిగా, దశలవారిగా పరిశోధన చేయించే ప్రణాళికను అక్కడి అధ్యాపకులతో అమలు చేయించాను.   

విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ సాహిత్యాన్ని పాఠ్యాంశంగా చేర్పించడంలో కృషిచేశాను. నా సూచనను మొదట అమలు చేసింది కాత్యాయనీ విద్మహేగారు కాకతీయ విశ్వవిద్యాలయంలో. ఆ తర్వాత ఉస్మానియా, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, యోగివేమన విశ్వవిద్యాలయాలు అమలు చేశాయి. ఇటీవల శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా రాయలసీమ సాహిత్యాన్ని బోధిస్తున్నది.

అలాగే భారతీయ సాహిత్యం అనే పేరు కూడా దాదాపు నాలుగు విశ్వవిద్యాలయాలలో ప్రవేశపెట్టించాను.

నేను 16.10.1948న పుట్టాను. ఇప్పుడు నాకు 72వ ఏడాది జరుగుతున్నది.

2          మీరు సాహిత్య రంగంలోకి రాకముందు, వచ్చిన తర్వాత మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?

నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను గనుక సేద్యం చేస్తూనే చదువుకున్నాను. అందువల్ల అప్పుడు పాఠ్యాంశాలుగా ఉన్న సాహిత్యమే తప్ప, ప్రత్యేకంగా సాహిత్యం చదువుకునే అవకాశం రాలేదు. 1972లో ఎం.ఏ పాసయ్యేదాకా నేను సిలబస్ లోని సాహిత్యమే చదువుకున్నాను. 1977 ఫిబ్రవరిలో ప్రభావతీ ప్రద్యుమ్నం మీద పిహెచ్ డి  పూర్తి చేశాను. అప్పుడు కనీసం 20 విమర్శ గ్రంథాలు చదివాను. అవన్నీ సంప్రదాయ విమర్శ గ్రంథాలే. అప్పటికి నాకు ఏ సాహిత్య సంస్థతోనూ సంబంధం లేదు.

1977 ఆగష్టులో నేను అనంతపురం కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్ గా చేరాను. అప్పటికి నేను సాహిత్యంలోనే కాదూ, వ్యక్తిగతంగా కూడా సంప్రదాయవాదినే. అప్పటినుంచి నేను మంచి భక్తుడినే అనంతపురం వచ్చేదాకా. తిరుపతిలో భూమన్ బి.ఏలో నా సహవిద్యార్థి. ఆయన అప్పటికే భౌతికవాది.  త్రిపురనేని మధుసూదనరావు గారి ప్రసంగాలు కొన్ని అక్కడే విన్నాను. గోవింద రాజస్వామి కోనేటి కట్టమీద కమ్యూనిస్టు ప్రసంగాలు విని ఉన్నాను. ఇవన్నీ నాకు నచ్చేవికావు.

అనంతపురం వచ్చినాక నేను కన్యాశుల్కం నాటకం మా విద్యార్థులకు పాఠం చెప్పవలిసి వచ్చింది. అప్పటిదాకా నేను ఆ నాటకాన్ని చదవలేదు. పాఠం కోసం చదివితే అందులో భాష, జీవితం నాకు పరిచయం లేనివి. కెవి.రమణారెడ్డి గారి 'మహోదయం' సర్దేశాయి తిరుమలరావు గారి 'కన్యా శుల్క నాటక కళ’ ఇతర విమర్శ గ్రంథాలు కొన్ని చదివి, పాఠం చెప్పాను. రెండేళ్ళు చెప్పినాక గురజాడ సాహిత్యం మొత్తం పాఠం చెప్పాను. నాకు కొత్త ప్రపంచం కనిపించింది. కొత్త ఆలోచనలు కలిగాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వామ పక్ష  విద్యార్థి సంఘాల ప్రాభల్యం, అనంతపురంలోని ఆధునిక యువరచయితలు పరిచయం, వామపక్షాల ప్రభావం, హేతువాద సంఘ బాధ్యత, కత్తి పద్మారావు, రంగనాయకమ్మ, జ్వాలాముఖి వంటి వాళ్ళ సభలు, ఎన్.శేషయ్య పరిచయం, విశాలాంధ్ర బుక్ హౌస్ తో సంబంధం, అరుణతార పత్రిక, తెలంగాణ నుంచి మా దగ్గర చదువుతున్న జూలూరు గౌరీశంకర్, కె.నాగేశ్వరాచారి వంటి విద్యార్థుల పరిచయం - ఈ వాతావరణమంతా తోడై నన్ను కదిలించాయి. నాగేశ్వరాచారి నిరంతరం ప్రశ్నించేవాడు. గౌరీశంకర్ భగత్ సింగ్ వర్ధంతులలో వేదికలెక్కించే వాడు. కేతవరపు రామకోటిశాస్త్రి, కాత్యాయనీ విద్మహే గార్ల పరిచయం నా మార్పునకు మరింత దోహదం చేసింది. ఇంతలో అభ్యుదయ రచయితల సంఘంతో అనుబంధం ఏర్పడింది. విశాలాంధ్ర ద్వారా అనేక వామపక్ష గ్రంథాల పరిచయం కలిగింది. గురజాడ, అనంతపురం నా మార్పునకు మూలకారణాలు. చేరా, మహీధర రామమోహనరావుగారి ఈ దారి ఎక్కడికి? అనే నవల మీద మంచి వ్యాసం రాశారు. అది చదివి ఆయన నవలలన్నీ చదివాను. శ్రీశ్రీ, తిలక్, ఆరుద్ర, దాశరథి, కుందుర్తిలకు పాఠం చెప్పిన అనుభవం నా మార్పును వేగవంతం చేసింది. గుర్రం జాషువా శతజయంతి, బి.ఆర్ అంబేద్కర్ శతజయంతి సందర్భంగా అనేక సభలు నిర్వహించడం, వాళ్ళ రచనలను, ప్రచారం చేయడంతో కుల సమస్య తీవ్రత అవగాహన లోకి వచ్చింది. కొలకలూరి ఇనాక్ గారు నా సీనియర్. ఆయన పాఠ్య ప్రణాళికను ఆధునీకరించారు. మా విశ్వవిద్యాలయంలో ఆయన తర్వాత నేను కొంత ఆధునీకరించాను. రారా ‘సారస్వతి వివేచన’ చదివి నేను విమర్శ రాయడం కొంత కాలం ఆపేశాను. అలా రాయడం చేత కాదని, వివి సిద్ధాంత   గ్రంథపఠనం, ప్రజాసాహితి తెలంగాణ పోరాట కథల సంచిక వంటి వాటి పరిచయం నన్ను మరింతగా మార్పు వైపు నడిపించాయి. ఇలా ఎహైన్ బర్గ్ 'రచయితా శిల్పమూ', గోర్కీ సాహిత్య వ్యాసాలు, ప్రేంచంద్ సాహిత్య వ్యాసాలు నన్ను మార్చిన గ్రంథాలలో మరికొన్ని.

3          మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మీరు విమర్శకులుగా మారడానికి తోడ్పడ్డాయి?

నేను విమర్శకుడు కావడానికి మీరు చెప్పినంత పెద్ద నేపథ్యం ఉందనుకోను. తిరుపతిలో పి.హెచ్.డి చేస్తున్నప్పుడు నేను సర్దేశాయి తిరుమలరావు గారి "సాహిత్యతత్వము – శివభారత దర్శనముఅనే విమర్శా  గ్రంథం చదివాను. అప్పటికి ఆయనతో నాకు పరిచయం లేదు. ఉద్యోగం కోసం అనంతపురం వచ్చినప్పుడు, అక్కడ నేను ఆయన్ని కలుసుకొన్నాను. ఆ సమయంలో ఆయన తనకన్యాశుల్కనాటక కళగ్రంథాన్ని నాకు ఇచ్చారు. ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది. రూపనగుడి నారాయణరావు గారని ఒకాయన ఉండేవారు. ఆయనకావ్యవిదానము” అని ఒక విమర్శా  గ్రథం రాశారు. దానికి తిరుమల రావుగారు ముందు మాట రాశారు. అందులో “కోస్తా ప్రాంతం నుండి భావ కవిత్వం, అభ్యుదయ సాహిత్యం వచ్చాయి. తెలంగాణ నుండి అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు వచ్చాయి. రాయలసీమలో సాహిత్య విమర్శకులు ఎక్కుగా ఉన్నారని నేను భావిస్తాను” అని అన్నారు. ఈ మాట నా బుర్రకెక్కినట్లుంది. ఈయన ఎందుకిలా అన్నారని చూస్తే కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం వెంకటశేషశాస్త్రి, భూపతి లక్ష్మీనారాయణరావు, కుంటిమద్ది శేషశర్మ, కవిత్వవేది, చిలుకూరి నారాయణరావు, రారా, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సోదుం రామోహన్, ఆర్వీయార్, నూతలపాటి గంగాధరం, త్రిపురనేని మధుసుదనరావు, సర్దేశాయి తిరుమలరావు, ఆర్వీఎస్ సుదర్శనం, తిమ్మావజ్జుల కోదండరామయ్య, సముద్రాల నాగయ్య  వంటి సంప్రదాయ, ఆధునిక, అభ్యుదయ, విప్లవ సాహిత్య విమర్శకులంతా మదిలో మెదిలారు. అప్పుడు నేను సాహిత్య విమర్శ రాయాలి అనుకుని రాశాను. మా విద్యార్థులకు పాఠం చెప్పడంలో కలిగిన అనుభవాలను వ్యాసాలుగా రాయాలనిపించి విమర్శ రాయడం ఆరంభించాను.

4          మీ రచనల గురించి చెప్పండి?

నేను ఇప్పటిదాకా 30 విమర్శ గ్రంథాలు ప్రచురించాను. వాటిలోశిల్పప్రభావతి” (నా పరిశోధన గ్రంథం), "ప్రాచీనాంధ్ర కవుల సాహిత్యాభిప్రాయాలు - అభిరుచులు,తెలుగు కవిత్వం - నన్నయ్య ఒరవడిఈ మూడు ప్రాచీన సాహిత్య విమర్శలు. ఇవి 1980 - 95 మధ్యవచ్చాయి. ఆ తర్వాత కూడా  శ్రీనాధుడు, వేమన, నన్నయ్య, అన్నమయ్య వంటి వాళ్ల మీద మారిన దృక్పథంతో కొన్ని వ్యాసాలు రాశాను. ఇటీవల పోతులూరి వీరబ్రహ్మంగారి 'కాళికాంబాశప్తశతిలోని అ పద్యాలకు వ్యాఖ్యానం రాశాను. తక్కిన 26 గ్రంథాలు “ఆధునికాంధ్ర కవిత్వం - ఉద్యమాలు, సందర్భాలు, కొన్ని కావ్యాలు - కొందరు కవులు,ప్రతిఫలనం, "కవుల తెలంగాణం,కవిత్వావరణం”, “ఎన్.గోపి సాహిత్యానుశీలనం”, సినారె కవిత్వా శీలనం”, “గుర్రం జాషువ స్వప్నం - సందేశం”, “విశ్వనరుడు గుర్రం జాషువావంటి ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథాలుదీపదారి గురజాడ అన్నది గురజాడపైన విమర్శగ్రంథం,కథాంశం,గురజాడ తొలికొత్త తెలుగుకథలు” “మన నవలలు – మన కథానికలుతెలుగు కల్పన సాహిత్య విమర్శలు.  “చర్చ”, “మరోచర్చ” “విమర్శ 2009”, విమర్శ 2011” ఈ నాలుగు తెలుగు సాహిత్య విమర్శ మీద విమర్శ గ్రంథాలు. "తులనాత్మక దాక్షిణాత్య విమర్శ వ్యాసాలుఅన్నది తులనాత్మక విమర్శ గ్రంథం. నేను రాసిన పీఠికలురాచపాళెం పీలికలు”,రాచపాళెం ముందు మాటలుపేరుతో అచ్చయినాయి. "సాహిత్య పరిశోధన సూత్రాలుపేరుతో రిసర్చిమెథడాలజీ మీద ఒక పుస్తకం రాశాను.దరి - దాపుపేరుతో తొమ్మిది సాహిత్య సిద్ధాంత వ్యాసాలను జూలూరి గౌరీశంకర్ ప్రచురించాడు. అందులో రచయిత - నిబద్ధత, సమాజ చైతన్యం - సాహిత్య చైతన్యం, సామాజిక సమస్యలు - రచయితల పరిష్కారాలు, రచయిత - కంఠస్వరం వంటి మంచి వ్యాసాలున్నాయి.

నేను పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు తిరుపతి కోనేటికట్ట మీద విన్న కమ్యూనిస్టుల ప్రసంగాల ప్రభావంతో 'అంతరాలు' అనే కవిత రాశాను. బహుశ అది 1973 - 74 ప్రాంతాల్లో.  తర్వాత అనంతపురం వచ్చినాక ఇరాన్లో మతోన్మాదులు ప్రజలు సినిమా చూస్తుండగా ఒక థియేటరుకు  అగ్గి పెట్టేశారని వార్తా వచ్చింది. అప్పుడు 'ఆలోచించండి' అనే కవిత రాశాను. 1990 తర్వాత రాయలసీమలో విపరీతంగా ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. కరువు తీవ్రతరం అయింది. గుజరాత్ సంఘటన జరిగింది. రాయలసీమ కరువు కాటకాల మీద కొన్ని కవితలు రాశాను.స్వర్ణభారతి సాక్షిగాఅనే పేరుతో చిన్నపుస్తకం ప్రచురించాను. తర్వాత మరికొన్ని రాసిరెండు ప్రపంచాలుపేరుతో ప్రచురించాను.సీమ కన్నీల్లుఅన్న మరొక సంపుటం. మా నాయన జీవితం వస్తువుగాపొలిఅనే కావ్యం రాశాను. అదినాకు బాగా నచ్చిన కావ్యం. అది ఆంగ్లం, హిందీ భాషలలోకి  అనువాదమైంది. తా.పి. రమేశ్ నారాయణ, తాజూటరు షరీఫ్ దానిని అనువదించారు.

తెలుగు సాహిత్య విమర్శ మీద రాసిన 25 వ్యాసాలు, ముందుమాటలు మరో 50 పుస్తకాలుగా రావలసి ఉంది. అలాగే "రచయిత - రాజ్యంపేరుతో కొన్ని తెలుగు కవితలను తీసుకొని వర్తమాన దృక్పథంతో వ్యాఖ్యానించిన వ్యాసాలు 25 దాకా ఉన్నాయి.

నేను చేసిన అనువాదాలుకూడా ఉన్నాయి. 1. దేవుడే బాలుడైతే - కిషన్ చందర్ నవలిక  2. పున్నమిచంద్రుడు మరికొన్ని కథలు - కిషన్ చందర్  3. ఎన్నిక చేసిన కథలు - కర్తార్ సింగ్ దుగ్గల్            4. దేవుళ్ళు దెయ్యాలు భూతాలు - అబ్రకంటి కనపూర్ వ్యాసాలు  5. మహర్షి దేవేంద్రనాథ టాగూర్ సాహిత్య అకాడమీ మోనో గ్రాఫ్  6. నెత్తురునది - ఇందిరాపార్థసారధి నవల - తమిళం అనువాదం పూర్తయింది         7. రాజేంద్రసింగ్ బేడికథల్ని అనువాదం చేస్తున్నాను  8. గజ్జెల మల్లారెడ్డి  9. త్రిపురనేని మధుసూదన రావుల మీద మోనోగ్రాఫ్ లు రాస్తున్నాను.

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రను వర్తమాన దృక్పథంతో రాయించమని 70 శీర్షికలతో ఒక ప్రతిపాదన సమర్పించాను. తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు పేరుతో 50 మంది మీద విశ్లేషణ వ్యాసాలు రాద్దామని ప్రయత్నిస్తున్నాను.

తెలుగు కథానిక - స్త్రీ” “దక్షణ భారత నవలల మీద స్వాతంత్ర్యోద్యమ ప్రభావం - అన్న రెండు యు.జి.సి రిసెర్చి ప్రాజెక్టులు చేశాను.

5          రాయలసీమ సాహిత్యం తెలుగు సాహిత్యం మీద వేసిన ప్రభావం ఏమిటి?

ఈ ప్రశ్న ఆసక్తికరమైనదేగాక సమాధానం చెప్పడం కష్టమైనది కూడా.  ప్రాంతీయత అన్నది ఒక గౌరవనీయ కొలమానంగా గుర్తింపు పొందింది గనక ఈ ప్రశ్న వచ్చింది. ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో రాయలసీమది సింహభాగం. నేటి భాషలో గ్రేటర్ రాయలసీమ ఆనుకొని ప్రకాశం నెల్లూరు జిల్లాలను కలుపుకుంటే ప్రాచీన తెలుగు సాహిత్యంలో సగానికి సగం రాయలసీమదే అవుతుంది. నాలుగు జిల్లాలకే పరిమితమై మాట్లాడినా, రాయలసీమ నుండి వచ్చిన ప్రాచీన సాహిత్యం తక్కువైందేమీకాదు. కొన్ని విశిష్టతలను పేర్కొంటాను.

నన్నెచోడుడు  కుమారసంభవ కవి. ఈయన రాయలసీమవాసి. ఈయన నన్నయ్యకన్నా పూర్వీకుడని ప్రతిపాదిస్తూ బి.ఎన్.శాస్త్రిగారు, పరిశోధన చేశారని, పర్యవేక్షకుడు దానిని ఆమోదించకపోవడంతో ఆయన సిద్ధాంత  గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించలేదని విన్నాం. వాస్తవిక దృష్టిలేని పండితోధ్యాపకుల వల్ల ఆది కవి ( లభిస్తున్నంతలో) రాయలసీమ వాడు అనే విషయం మరుగున పడిపోయింది.

రాయలసీమ నుండి రాజాస్థాన, ఆస్థానేతర సాహిత్యాలలో రెండూ పోటీపడి వచ్చాయి. భూస్వామ్య, వర్గవ్యవస్థను చిత్రించే సాహిత్యం, దానిని ప్రతిఘటించే సాహిత్యం రెండు రాయలసీమ నుండి విశేషంగా వచ్చాయి. పాల్కురికి  సోమన, తాళ్ళపాక అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంలు ఆస్థానేతర కవులలో ప్రముఖులు. సోమన తెలంగాణవాసి. తక్కిన ముగ్గురు సీమవాళ్ళు ప్రాచీన కాలంలో కవయిత్రులు పరిమితంగా కనిపిస్తున్నారు. వాళ్ళలో సీమ వాళ్ళే అధికులు. శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె గంగాదేవి, మొల్ల, తాళ్ళపాక తిమ్మక్క, తరిగొండ వెంగమాంబ ప్రముఖులు.

ప్రబంధ సాహిత్యంలో రాయలసీమది ఎంత? తక్కిన ప్రాంతాలది ఎంత? రాయలు, పెద్దన, తిమ్మన, ధూర్జటి, రామరాజ భూషణుడు, కందుకూరు రుద్రకవి, సంకుసాల  నృసింహకవి, తెనాలి రామకృష్ణుడు వంటి వాళ్ళు సీమ నుండే ప్రబంధాలు రాశారు.

జాగ్రత్తగా పరిశీలిస్తే, బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వైరుధ్యాలు చాలా అంతర్లీనంగా వాటి సాహిత్యంలో ఎలా కొనసాగాయో ప్రాచీన రాయలసీమ సాహిత్యం రుజువు చేస్తుంది. ఈ విశిష్టతలను అలా ఉంచి ప్రభావం దగ్గరికి వస్తే 1980 తర్వాత ప్రాంతీయ అస్తిత్వ స్పృహకు రాయలసీమ పునాది వేసిందనుకుంటాను.సీమ కథలుసంకలనం ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో వచ్చిన తొలికథా సంకలనంగా చాలా మంది గుర్తించారు. అయితే తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం ముందు కొంత మరుగున పడింది. కరువు సాహిత్య రచనకు రాయల సీమ మార్గం చూపిందనుకుంటాను. 1956 నాటి 'పెన్నేటిపాట' కు (విద్వాన్ విశ్వం) రాళ్ళపల్లి అనంత కృష్ణశాస్త్రి రాసిన ముందు మాటలో సీమ అస్తిత్వ వేదన కనిపిస్తుంది. అయితే ఆంధ్రరాష్ట్రం 1953లో ఏర్పడినప్పుడు గుర్రం జాషువా  కావ్యం రాశారు. అందులో రాయలసీమ కరువును ప్రస్తావించి రాయలసీమ కరువును నివారించి ప్రవహించమని విజ్ఞప్తి చేశారు కృష్ణనదిపై. 1899నాటి కట్టమంచి రాసిన "ముసలమ్మ మరణంవిషాధాంత కావ్యం.  పైగా సమిష్టికోసం వ్యక్తి త్యాగం అనే స్పృహతో రాయబడిన తొలికావ్యం. 1914నాటి 'కవిత్వతత్వ  విచారం' (కట్టమంచి) ఆధునిక సాహిత్యం విమర్శ తొలి సాధికారక నమూనాగా పేరు పొందింది. ఈ గ్రంథం సాహిత్య విమర్శకు సంబంధించిన అనేక ఆరోగ్యకర సూత్రాలు అందించింది. సాహిత్యాన్ని వాస్తవిక దృక్పథంతో చూడడం ఇది నేర్పింది.దేశ చరిత్రమును భాషా చరిత్రమును నిత్య సంయోగములు,విషయము శైలి రెండునూ  ముఖ్యములు, "పాత్రములు వికల్పముగా ఉండవలెనుమొదలైన సూత్రాలను ఈ గ్రంథం అందించింది. 1914 తర్వాత తెలుగు మార్క్సిజం, అంబేద్కరిజం, ఫెమినిజం వంటి అనేక రాజకీయ సిద్ధాంతాలు తెలుగు సాహిత్య విమర్శ మీద ప్రభావం చూపినా, కట్టమంచి ప్రతిపాదించిన కొన్ని మౌలిక సాహిత్య సూత్రాలను అవి ఆమోదిస్తూనే వచ్చాయి. బహుశా రాయలసీమ తెలుగు సాహిత్య విమర్శ గమనాన్ని నిర్దేశించిందని చెప్పవచ్చు. (వెనక్కి నెట్టివేయబడిన మూడు తెలుగు ప్రాంతాల నుండి వ్యాపార సాహిత్యం గణనీయంగా రాకపోవడం గుర్తించవలిసిన అంశం) కట్టమంచి తర్వాత ఇద్దరు మార్క్సిస్టులు రా.రా, త్రిపురనేని మధుసూదనరావు గారలు అభ్యుదయ విప్లవ సాహిత్య విమర్శలకు ఒరవడిదిద్దారు. త్రిపురనేని పుట్టుకతో కృష్ణాజిల్లా వాసి అయినా, ఆయన జీవితమంతా తిరుపతిలోనే గడిచిపోయింది. అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత అస్తిత్వవాద సాహిత్య విమర్శలో నిబద్దత అనే ఒక కొత్త అంశాన్ని చేర్చిన వారు కొలకలూరి ఇనాక్ గారు. వీరు పుట్టుకతో గుంటూరు వాసి అయినా, సాహిత్య జీవితమంతా రాయలసీమలో గడిచిపోయింది. తెలుగు సాహిత్య చరిత్రలను రాజులపేరు మీద, కవుల పేరు మీద యుగవిభజన చేయడం ఒక సంప్రదాయంగా ఉన్న కాలంలో కల్లూరి వెంకట నారాయణరావు ( కవిత్వవేది ) అనే రాయలసీమ వాసి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించి ఒక శాస్త్రీయమైన మార్గం చూపించారు. ఇలాంటివన్నీ రాయలసీమ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.

6          బాలవ్యాకరణం సాహిత్య విమర్శలో ఏ మేరకు ఉపయోగపడుతుంది?

బాలవ్యాకరణం సంప్రదాయ కావ్యభాషకు చెందిన వ్యాకరణం. సంప్రదాయ సాహిత్య విమర్శలో కూడా బాలవ్యాకరణం పాత్ర అత్యల్పం. ప్రాచీన కావ్యభాషను వ్యాకరణ శాస్త్రం ప్రమాణాలతో విమర్శించే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అటువంటి విమర్శ తెలుగులో అరుదుగానే వచ్చింది. ప్రాచీన సాహిత్యాన్ని సామాజిక భాషాశాస్త్ర దృష్టితో పరిశీలించడానికి బాలవ్యాకరణం ఎంత వరకు ఉపయోగపడుతుందో భాషాశాస్త్రజ్ఞులు చెప్పాలి. ప్రాచీన సాహిత్యంలో గానీ, ఆధునిక సాహిత్యంలోగానీ, వస్తు, శిల్ప విమర్శకు బాలవ్యాకరణం ఉపయోగపడదు. ప్రాచీన కాలంలోనే ఒక శ్లోకం ఉంది.

నైవ వ్యాకరణజ్ఞ మేతి పిత‌రం ,సభ్రాతరమ్ తార్కికమ్.

దూరాతోసంకంచితీవ గచ్ఛతి వపుః ,చండాలవత్ ఛాందసాత్.

మీమాంసానిపుణం నపుంసకమితి ,జ్ఞాత్వానిరస్యాదంతో.

కావ్యాలంకరణజ్ఞ మేవ  కవితాకన్యావృణీతే స్వయమ్. ----దీనిని కాణాద పెద్దన తెలుగులోకి అనువాదించాడు.

 

తనరన్ వ్యాకరణజ్ఞు దండ్రియనుచుం ,దర్కజ్ఞునిన్ భ్రాతయం

చును ,మీమాంసకునిన్ నపుంసకుడటంచున్వీడి ,దూరంబునం

గని యస్పృశ్యునిబోలె ఛాందసుని ,వేడ్కం గావ్యలీలారస

జ్ఞు నిజేచ్ఛం గవితావధూమణి వరించున్ భావగర్భంబునన్ (ముకుందవిలాసం అవతారిక - 15)

ఈ పద్యంలో ఇవాళ మనం అభ్యుంతరం చెప్పే పదాలున్నాయి. ప్రాచీన కాలంలోనే కావ్యానికి వ్యాకరణానికి ఉండే సంబంధం ఎలాంటిదో ఇవి సూచిస్తున్నాయి.

7          అలంకార శాస్త్రం ఆధునిక విమర్శకులు అధ్యయనం చేయాలంటారా?

అధ్యయనానికి విధినిషేధాలు ఉండవలసిన అవసరం లేదు. రచయితలకు, విమర్శలకు తెలియకూడని విషయాలంటూ ఉండవు. ఆధునిక సాహిత్య విమర్శకులకు సామాజిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞానం, సాహిత్య చరిత్ర జ్ఞానం, సాహిత్య శాస్త్రజ్ఞానం, సాహిత్య విమర్శ శాస్త్రజ్ఞానం, సాహిత్య విమర్శ చరిత్రజ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అలంకార శాస్త్రజ్ఞానం ఉంటే, దానిని ఆమోదించడమో, తిరస్కరించడమో తర్వాతి విషయం. అసలు ఆ జ్ఞానమే లేకపోతే విమర్శకుల జ్ఞానంలో వెలితి ఉంటుంది.

అలంకారశాస్త్రం కావ్య, నాటకశాస్త్రం, సంస్కృత సాహిత్యం ఆధారంగా చేసుకొని వచ్చినవే అలంకార శాస్త్రాలు. తెలుగులో వచ్చిన అలంకార శాస్త్రాలు వాటి నీడలే. అలంకార శాస్త్రంకావ్యం ఎలా ఉండాలో చెబుతుంది. విమర్శ శాస్త్రం కావ్యం ఎలా ఉండాలో చెబుతుంది. విమర్శ శాస్త్రం కావ్యం ఎలా ఉందో చెబుతుంది. ప్రాచీన కాలంలోనూ, ఆధునిక కాలంలోనూ సంప్రదాయ సాహిత్య పరామర్శకు అలంకార శాస్త్రన్నే ఉపయోగించుకున్నారు. అద్దేపల్లి రామమోహనరావుగారు, మిరియాల రామకృష్ణగారు, ముదిగంటి సుజాతారెడ్డి గారు ఆధునిక సాహిత్యానికి సంప్రదాయ అలంకార శాస్త్రాలకు అన్వయించే ప్రయత్నం చేశారు. కాని వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు.నాటక లక్షణ కర్తలు శాసన కర్తల స్థాయిలో రచయితల్ని రాచరిక వ్యవస్థ చిత్రణకి నిర్బంధించారుఅన్నారు. త్రిపురనేని మధుసూదనరావుగారు నాటక ప్రయోజనం - అధ్యయన పద్ధతి. (సృజన, మార్చి1983)  సంస్కృత అలంకార శాస్త్రాలన్నీ సంస్కృత సాహిత్యం ఆధారంగా పుట్టినవే. అదంతా రాచరిక వ్యవస్థనే ప్రతిబింబించింది. సంస్కృత సాహిత్యాన్నిగానీ, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని గానీ ఆధునిక విమర్శకులు పరిశీలించే  పద్ధతి మారిపోయింది. ఈ మారిపోయిన పధ్ధతికి  అలంకార శాస్త్రం ఉపయోగపడదు. వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారువిమర్శాశిల్పంఅనే గ్రంథంలో అలంకారశాస్త్రాలను గురించి తీవ్రమైన అభిప్రాయాలు చెప్పారు. 1. మన ప్రాచీనాలంకారికులెవరూ సమాజానికి సాహిత్యానికి ఉన్న వివిధ సంబంధాలను గురించి చర్చించలేదు. 2. సమకాలీన వాస్తవిక జీవితంపట్ల అనాదరణ భారతీయ - ఆలంకారిక సంప్రదాయం . 3. అలంకార శాస్త్రాన్ని ఆలోచనా రహితంగా సృజనాత్మక సాహిత్యం మీద రుద్దడం చేత మన సాహిత్యానికి జరిగిన అపకారాన్ని సమీక్షించాలి. సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి, విలువ కట్టడానికి సహకరించవలిసిన అలంకార శాస్త్రం క్రమక్రమంగా రచయిత సృజన శక్తికి సంకెళ్లలగా తయారయింది. 4. అలంకార శాస్తా సాహిత్యం మార్గదర్శకంగా అంగీకరిచడం వల్ల రచయిత తనకు నచ్చిన కావ్యవస్తువును తీసుకొని, దాన్ని తనకు నచ్చిన వ్యక్తిగత దృష్టికోణం నుంచి పరిశీలించే స్వాతంత్ర్యం దాదాపు లేకుండా పోయింది. రచయిత సృజనశక్తి ఈ విధంగా మేకుబందీ అయిపోవటంచేత, తన వ్యుత్పత్తిని చాటుకోవటం తప్ప అతని కీర్తికి వేరే దారిలేకపోయింది. ఇవీ  ఆయన అభిప్రాయాలు. అదే సమయంలో వల్లంపాటి వారికి రస, ధ్వని  సిద్ధాంతాలలోని అనవసరమైన వర్గీకరణాలను విస్మరించి జాగ్రత్తగా ఉపయోగిస్తే ప్రాచీన సాహిత్యధ్యయనానికి ఇవి పరిమితంగా పనికి వస్తాయని కూడా అన్నారు. కాని త్రిపురనేనిగారు సంస్కృత సాహిత్యం ఆధారంగా వచ్చిన అలంకార శాస్త్రాలను ప్రాచీన తెలుగు సాహిత్యధ్యయనానికి ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకించారు.

అలంకార శాస్త్రం ప్రకారం నాయకుడు శ్రామిక వర్గానికి చెందినవాడు కారాదు. రసం ఆ నాయకుని చుట్టూ తిరుగుతుంది. అందువల్ల అధునిక సాహిత్యానికి అలంకార శాస్త్రం ఉపయోగపడదు. ప్రాచీన సాహిత్యంలో కూడా నాయికానాయకులు ఎవరు? వారు ఎలాంటివారు? ప్రధాన అప్రధాన రసాలు ఏవి వంటి పరిశీలనకే పనికి వస్తాయి. వస్తు  పరిశీలనకు పనికిరావు.           అయినప్పటికీ నేటి విమర్శకులకు అలంకారశాస్త్రజ్ఞానం ఉండడం మాత్రం అవసరం.

8)         విమర్శ బలంగా లేదు గనుక బలమైన సాహిత్యం వెలువడడం లేదు అంటున్నారు దీనినెట్లా చూడాలి?  సాహిత్యం బలహీనంగా ఉంది గనుక విమర్శకూడా బలహీనంగా ఉంది అంటున్నారు. నిజమేనా?

ఈ రెండు ప్రశ్నలనూ కలిపి ఆలోచిద్దాం. సాహిత్యంగానీ, సాహిత్య విమర్శగానీ ఏకాలంలోనూ నూటికి నూరు పాళ్ళు బలంగానూ, నూటికి నూరు పాళ్ళు బలహీనంగానూ వచ్చాయనడం శాస్త్రీయమైన అవగాహన కాదు. ఎప్పుడైనా బలమైన రచనలూ, బలహీనమైన రచనలూ తోడుగానే వస్తాయి. అలాగే సాహిత్య విమర్శ కూడా సాహిత్య విమర్శలో ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఒక కొత్త రకం  సాహిత్యం పుట్టినప్పుడూ, దానిని తూచడానికి కొత్త తూకపురాళ్ళు అవసరమౌతాయి. వాటిని సృష్టించుకోడానికి కొంత సమయం పట్టుతుంది. ఈ గ్రాఫ్  లో విమర్శ బలహీనపడినట్లు అనిపిస్తుంది. సాహిత్యం బలహీనపడినప్పుడు బలమైన విమర్శ రావడం వల్లనే తులసిదళాలు తగ్గిపోయాయనేది మనం గుర్తించాలి. వస్తున్న సాహిత్యంలోంచి బలమైన సాహిత్యాన్ని, వస్తున్న విమర్శలోంచి బలమైన విమర్శను మనం ఏరుకోవాలి తప్పదు.

9          సాహిత్య విమర్శకులు రాజకీయ అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉందా?

రాజకీయ అర్థశాస్త్రాన్ని సాహిత్య విద్యార్థులకు తప్పనిసరి అంశంగా చేరిస్తే ఎలా ఉంటుంది?

రాజకీయార్థిక శాస్త్రం గురించి, నేను నామిత్రుడు ఎస్. శేషయ్య మాట్లాడడం విన్నాను. వి.వి, త్రిపురనేని వంటి వాళ్ళ వ్యాసాలలో చదివాను. అయితే ఈ విషయంలో నేనింకా విద్యార్థినే. సాహిత్యం రాజకీయం లేకుండా ఉండదు. ఆర్థికాంశం సమాజానికి పునదిగా ఉంటుంది. గనుక రాజకీయార్థిక శాస్త్ర అధ్యయనం అవసరమే. సాహిత్య విమర్శ బలంగా రావడానికి అది ఉపయోగ పడుతుంది. అయితే ఈ అంశాన్ని సాహిత్య విద్యార్థులకు సిలబస్లో బోధించడం సాధ్యం కాకపోవచ్చు. సాహిత్య పాఠాలే కిటకిటలాడుతున్నాయి. విడిగా చదువుకోవలసిందే.

10        మార్క్సిజంలో ఖాళీలు ఉన్నాయంటున్నారు కదా! దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

మార్క్సిజం మార్పును ఆమోదించే వాదం, సిద్ధాంతం. ప్రతిదీ మారుతుందనే వాదం మార్క్సిజం. అది ప్రకృతికి, ప్రపంచనికేగాదు, తాత్విక వాదాలకు కూడా వర్తిస్తుంది. ఏ వాదమైనా స్థల కాల బద్ధంగానే పుడుతుంది. ఒక కాలం నుండి మరో కాలానికి, ఒక స్థలం నుండి మరో స్థలానికి వెళ్ళే సరికి ఆ వాదంలో మార్పులు అవసరమౌతాయి. ఈ సార్వజనీనమూ, సార్వకాలికమూ అయిన విలువ ఏదీ ఉండదని మార్క్సిస్టులు నమ్ముతారు. మార్క్సిజం కూడా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ రూపొందించిన మార్క్సిజం కూడా స్థలకాలాలను బట్టి అన్వయించుకోవాలి. ఆ అన్వయించుకోవడంలో జరిగిన ఆలస్యాన్ని ఖాళీ అని అంటున్నామా?  ప్రధానంగా యూరోపియన్ సమాజ పరిస్థితులు, చరిత్ర ఆధారంగా మార్క్సిజం రూపొందింది. వర్గసిద్ధాంతం పుట్టింది. భారతదేశానికి కూడా ఆ సిద్ధాంతం అన్వయించింది. అయితే భారతదేశంలోని కుల వ్యవస్థను పరిగణనలోకి తీసుకోకుండా, ఆర్థిక వర్గదృక్పథమే కలిగి ఉండడంవల్ల సమస్యలు ఏర్పడ్డాయి. అందువల్ల కుల వ్యవస్థను కలుపుకొని వర్గపోరాటం చేయడమే మార్క్సిజం లోని ఖాళీలను పూరించడమని భావిస్తున్నాను.

11        కళాసాహిత్యాల సృజనకు మూలం వ్యవస్థీకృతమైన వాస్తవమా? మరి ఇంకేదైనా ఉందా?

కళాసాహిత్యాలకు మూలం వాస్తవికత. సామాజిక వాస్తవికత. అది వ్యవస్థీకృతమైనా, కాకపోయినా అదే మూలం. దానిని కళగా మార్చే నైపుణ్యం కూడా అవసరం కల్పనా శక్తి వాస్తవికతను కళగా మారుస్తుంది. కేవలం వాస్తవికతే కళ అయిపోదు. వాస్తవికతను కల్పన తోడైతేనే కళ సంపూర్ణమౌతుంది. మానవాతీతమైనది అని అనుకోవలసిన అవసరం లేదు. కల్పన కూడా సమాజంలోంచే లభిస్తుంది. అందుకే వస్తువు, శిల్పం రెండూ సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలే అని మార్క్సిజం చెబుతుంది.

12        ప్రస్తుత తెలుగు సాహిత్యాన్ని ఒక విమర్శకుడిగా ఎలా చూస్తున్నారు?

తెలుగులోనే కాదు, ఏ భాషా సాహిత్యంలోనైనా రెండు పాయలు ప్రవహిస్తూ ఉంటాయి. 1. భావవాద సాహిత్య పాయ. 2. భౌతికవాద సాహిత్య పాయ. తెలుగు ప్రాచీన కాలంలో దాదాపు అంతా భావవాద సాహిత్యమే వచ్చింది. ఆధునిక కాలంలో ఈ రెండు పాయాలు మొదటినుంచి ప్రవహిస్తునే ఉన్నాయి. ఇవాల్టికీ కూడా అంతే ఇప్పుడే మన కళ్ళముందు కదలాడుతున్న కరోనా వైరస్ విషయం చూడండి కరోనా వైరస్ ను అర్థం చేసుకోవడంలో భావ, భౌతికవాదులు ఘర్షణ పడుతున్నారు. సాహిత్య రంగంలోనూ అంతే. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పద్యం, ఆదేశ్ రవిగారి పాట ఈ రెండు పాయలకూ ప్రతినిధులు.

13        సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనా? ఇంత వరకు మీ అనుభవం ఏమిటి?

సమాజంలో సంపూర్ణమైన మార్పు తీసుకువచ్చేది ఆర్థిక రాజకీయ శక్తులే. సాహిత్యం ఆ శక్తులు మార్పులు తీసుకొని రావడానికి అవసరమైన భావ ప్రచారం చేస్తుంది. సమాజంలో మార్పు రావలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. వస్తున్న మార్పులను ఆహ్వానిస్తుంది. మారకుండా మిగిలిపోయిన పార్శ్వా లను ఎత్తి చూపుతుంది. సామాజిక పరివర్తనకు సాహిత్యం విశ్వసనీయమైన ఆయుధం. సాహిత్యం తనంతట తానుగా సమాజాన్ని మార్చగలిగిన శక్తి కలిగుంటుంది. నా అనుభవమే చెబుతాను. 1977లో ఉద్యోగంలో చేరినప్పటి భావజాలం భావవాద భావజాలం. నాలుగేళ్ళు గురజాడను పాఠంగా చెప్పే క్రమంలో నా భావజాలం కదలబారింది. గురజాడ నన్ను మార్చారు. స్త్రీవాద సాహిత్యం మొదలైనాక స్త్రీల పట్ల మొగవాళ్ళ దృక్పథంలో, ఆచరణలో చాలా మార్పులు వచ్చాయి. ప్రగతి శీల మొగవాళ్ళకు సైతం స్త్రీపట్ల చిన్నచూపు ఉండేది. అది ఇవాళ తగ్గిపోయింది. దళితులపట్ల ఇంతకు ముందున్నంత చులకనభావాన్ని దళిత సాహిత్యం మార్చివేసింది. మార్క్సిస్ట్  సాహిత్యం పేదలు కూడా మనుషులే అనే అవగాహన కలిగించింది.

14        కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వచ్చిన తర్వాత మీ రచనల్లో ఏమైనా మార్పు వచ్చిందా?

ఇప్పటి దాకా నేనిచ్చిన సమాధానాల్లో గతంలోని రాచపాళెంకు, నేటి రాచపాళెంకు ఏమైనా తేడా కనిపిస్తున్నదా?  మనం వాట్సప్ గ్రూపులలో మాట్లాడుకుంటున్నాం. మీకేమైనా తేడా కనిపిస్తున్నదా? మనువాద పత్రికలలో నన్ను గురించి ఒకరిద్దరు దూషిస్తూ రాసిన రాతలే నేను నా మార్గం నుండి పక్కకు పోలేదని రుజువు చేస్తున్నాయి. నాకు తెలిసి నేనేమీ వెనక్కి పోలేదు. "సాహిత్య విమర్శ, పరిశోధనగ్రూవులో భోజరాజీయంలోని ఆవు - పులి కథ మీద నా అభిప్రాయం మీరు చదివే ఉంటారు.

15        సాహిత్య అకాడమీ తెలుగు సాహిత్యానికి తన కార్యక్రమాల ద్వారా చేస్తున్న కృషి గురించి తెలపండి?

కేంద్రసాహిత్య అకాడమీ తెలుగుతో పాటు 28 భారతియభాషలలో తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సాహిత్య అవార్డు మన తెలుగు సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడమనేది తెలుగు సలహామండలి చేసే ప్రయత్నాలమీద ఆధారపడి ఉంటుంది. గత పది పన్నెండేళ్ళుగా సాహిత్య అకాడమీ తెలుగుకు కూడా దగ్గరైంది. ఇందుకు కారణం తెలుగు సలహామండలి చురుకుగా పనిచేయడమే. ప్రతిభాషలోనూ ప్రసిద్ధులైన రచయితల మీద భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికలో అకాడమీ మోనోగ్రాఫ్లు ప్రచురిస్తుంది. తెలుగులో ఇప్పటి దాకా కనీసం 75 మోనోగ్రాఫ్లు  వచ్చి ఉంటాయి. తెలుగు మోనోగ్రాఫుల్లో  చాలా  వరకు ఇతర భారతీయ భాషలలోకి అనువాదం కూడా అవుతూ ఉంటాయి. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గ్రంథాలను అనుకూలతను బట్టి, అవసరాన్ని బట్టి, అకాడమీ ఇతర భారతీయ భాషలలోకి అనువదింప జేస్తుంది. అలా తెలుగు గ్రంథాలు చాలా వరకు ఇతర భారతీయ భాష పాఠకులకు చేరాయి. క్లాసికల్ టెక్స్ట్ ల పేరుతో ఒక్కొక్క భాషలో కొన్ని గ్రంథాలను, అకాడమీ, ఇతర భారతీయ భాషలలోకి అనువదింపజేస్తుంది. ఈ మార్గంలో కూడా కొన్ని తెలుగు రచనలు ఇతర భారతీయ భాషలలోకి వెళ్ళాయి. చాలా కాలం క్రితమే అకాడమీ, సాహిత్య చరిత్రలు ప్రచురించింది. గిడుగు సీతాపతి తెలుగు సాహిత్య చరిత్ర రాశారు. అది ఇతర భారతీయ భాషలలోకి వెళ్ళింది. ఆయన బహుశా 1950దాకా వచ్చిన సాహిత్య చరిత్ర రాశారు. ఆ తర్వాత భాగాన్ని ఇప్పుడు రాయించే ప్రయత్నం చేస్తున్నది. అకాడమీ 2013 - 17 మధ్య అయిదేండ్లలో అకాడమీ ద్వారా దాదాపు 200 తెలుగు సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత కూడా ఈ ఒరవడి కొనసాగుతున్నది. కరోనా అడ్డుపడింది. అకాడమీ ద్వారా కొన్ని కవిత్వ, కథా సంకలనాలు కూడా వచ్చాయి. సెమినార్ పేపర్లు కూడా పుస్తకాలుగా వస్తున్నాయి.

లిటరరీ ఫోరం అని ఒక కార్యక్రమం ఉంది. అయిదు మందితో ఒక కార్యక్రమం నిర్వహించడం. నేను గత ఏడేళ్ళలో దాదాపు 25 కార్యక్రమాలు నిర్వహించాను. కవిసంధి, కథాసంధి శీర్షిక మీద చాలా మంది కథకులు, కవులు తమ రచనలు చదివారు. వాటి పైన చర్చలు జరిగాయి. రచయితతో ముఖాముఖి, విమర్శకునితో సాయంకాలం శీర్షికల ద్వారా చాలా మంది తెలుగు రచయితలు వాళ్ళ రచనానుభవాలను చెప్పుకున్నారు. విమర్శకులు తమ విమర్శనానుభవాలను చెప్పారు.నా దృష్టిలోఅని  ఒక కార్యక్రమం ఉంది. ఒక పూర్వ రచయితను ఒక వర్తమాన విమర్శకుడు సమకాలీన దృక్పథంతో అంచనా కట్టే కార్యక్రమం. మధురాంతకం  రాజారాం అబ్బూరి ఛాయా దేవి మొదలైన వారిమీద ఈ కార్యక్రమాలు జరిగాయి. రచయితల శత జయంతులను సాహిత్య అకాడమీ విరివిగా నిర్వహిస్తుంది. నాకు తెలిసీ  శ్రీశ్రీ మొదలుకొని అనేక మంది తెలుగు రచయితల శతజయంతులు జరిగాయి. ఒక్కరచయిత మీద పదేసి ప్రసంగాలు ఉంటాయి. 40 ఏళ్ళలోపు వయసుగల రచయితలకు అకాడమీ ట్రావెల్ గ్రాంటు మంజూరు చేస్తుంది. వాళ్ళు ఇతర భాషా రచయితలతో వారం రోజులు ఉండి వాళ్ళ సాహిత్య విశేషాలను చిత్రించుకొని రావచ్చు. ఏడాదికి నలుగురు యువరచయితలు ఒక్కోభాష నుండి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే తక్కెడశిల జానీ అనే కవి కేరళకు వెళ్ళి వచ్చాడు. అక్కడి అనుభవాలను "మట్టినైపోతానుపేరుతో కవిత్వంగా రాసి ప్రచురించాడు. ఏడాదికి ఒకటి రెండు రోజుల సదస్సు ప్రతిభాషా నిర్వహించుకోవచ్చు. నేనుతెలుగు సాహిత్య విమర్శ - భావజాల అధ్యయనంఅనే అంశం మీద సదస్సు నిర్వహించాను.తెలుగులో వ్యవసాయ సాహిత్యంమీద సదస్సు నిర్వహించవలసి ఉంది. సాహిత్య అకాడమీని  మన సలహామండలి ఎంత వరకైనా ఉపయోగించుకోవచ్చు.  ఉపయోగించుకుంటున్నది.

16        ఇటీవలి కాలంలో విస్తృతంగా వస్తున్న అంతర్జాల పత్రికల్లోని సాహిత్యాన్ని గురించి విమర్శకులు పట్టించుకున్నారా?

దిన వార మాస పత్రికలలో కన్నా అంతర్జాలం మీద ఆధారపడిన మధ్యమాలలోనే ఎక్కువ సాహిత్యం వస్తున్నది ఇవాళ. అయితే ఈ అంతర్జాల సాహిత్యం మీద విమర్శకుల దృష్టి ఎంత వరకు పడిందన్నది పరిశీలించవలసింది. నాకు నేను ఈ అంతర్జాల విద్యలో అర్భకుణ్ణి. వాట్సప్ లో వచ్చే సాహిత్యం మీద ప్రశంసల జల్లు బాగా కురుస్తున్నది. గంభీరమైన చర్చ అయితే కొంత వరకు సాగుతున్నది. ఫేస్ బుక్, వెబ్ పత్రికలతో నాకు సంబంధంమే లేదు. అందువల్ల వాటిని గురించి నేనేమీ చెప్పలేను. యూట్యూబ్ లో కొన్ని ఫేస్ బుక్ విమర్శలు పెడుతుంటారు. పుట్ల హేమలతగారు తెలుగు అంతర్జాల సాహిత్యం మీద పరిశోధన చేశారు. ఇంకా కొందరు చేస్తూ ఉండవచ్చు.

17        అంతర్జాల పత్రికలు ప్రజాస్వామ్యబద్ధంగా విస్తృత ప్రాతిపదికన రచనల ఎంపికను చేయడం ద్వారా ఎంతో మంది రచయితులు వెలుగులోకి వస్తున్నారు. ఇంకా ఎందరో తమ రచనలను కొనసాగిస్తున్నారు.

ఈ పరిణామం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?

ఇంతకు ముందే చెప్పినట్లు నేను అంతర్జాల విమర్శలో ఆరితేరినవాడిని కాదు గనక, ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. అయితే అంతర్జాలంలో పేపరు ప్రసక్తి ఉండదు గనుక ఎక్కువ మంది రచనలు ఒకేసారి రావడానికి అవకాశముంది. అయితే అంతర్జాల సాహిత్యం అంతర్జాలంలో నైపుణ్యం ఉన్న వారికే చేరుతుంది.

18        మీ సాహిత్య విమర్శ జీవితంలో మీకు బాగా ఆనందం కలిగించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?

ఉన్నాయి. ప్రభావతీ ప్రద్యుమ్నం కావ్యం మీద పరిశోధన చేస్తున్న సమయంలో నాకు పర్యవేక్షకులు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావుగారు. ఆయన ప్రతి అధ్యాయాన్ని మూడేసి సార్లు రాయించే వారు. ఇప్పటి సాహిత్య పరిశోధకులు దీనిని గర్తుపెట్టుకోవాలి. అభ్యాసం కూసు  విద్య. రాసిన అధ్యాయాన్ని నేనే చదివి వినిపించాలి. అలా చదివే క్రమంలో నా వాక్య నిర్మాణం, నా వాదనా  పటిమ నాకర్థమౌతూ వస్తాయి. నా సిద్దాంత  గ్రంథంలో 'కథానిర్మాణం శిల్పం' అనేది ఒక అధ్యాయం. దానిని 50 పేజీలలో రాశాను. గరువుగారికి చదివి వినిపించాను. వినిన ప్రతిసారీ ఇంకో సారి ఆలోచించు అనేవారు. ఈ అధ్యాయన్నీ మారోసారి విన్నాక కూడా ఇంకో సారి ఆలోచించు అన్నారు. వారం రోజులు ఆలోచించాను. ఒక రోజు అర్ధరాత్రి పూట 'కథానిర్మాణంశిల్పం' అనే అధ్యాయంలో నేను కథానిర్మాణం, కథా కథనం - అనీ రెండు భాగాలను కలిపి రాసినట్లు అనిపించింది. ఇవి వేర్వేరు విషయాలు గనక రెండు అధ్యాయాలు చేయాలి అనిపించింది. అలా కథానిర్మాణ శిల్పం, కథా కథన శిల్పం అని రెండు అధ్యాయాలుగా రాసి గురువుగారికి చదివి వినిపించాను. నీ పరిశోధన పూర్తయింది అన్నారు.  ఆ రోజు నేను పొందిన ఆనందం అంతా ఇంతాకాదు.  “రచయిత - నిబద్ధతఅని నేను ఒక వ్యాసంగా రాశాను. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. ఆ వ్యాసం రాసేనాటికి ఆ అంశంమీద ఇంకెవరన్న రాశారా అనేది నాకు తెలియదు. తర్వాత చూస్తే చాలా మంది, కెవిఆర్, వేల్చేరు నారాయణరావు, త్రిపురనేని, రారా, కుందుర్తి, అద్దే పల్లి, ద్వానా శాస్త్రి, కతియాల వంటి వాళ్ళంతా నిబద్ధత గురించి మాట్లాడి ఉన్నారు. అదేమీ తెలియకుండానే అనేకులు ఆలోచించిన అంశాన్ని గురించి నేను కూడా ఆలోచించానని ఆనందం కలిగింది.తెలుగు కథానికా విమర్శఅని ఒక వ్యాసం రాశాను. చాలా పరిశోధన చేసి రాశాను. అది నాకు తృప్తినిచ్చింది. అలాగే తెలుగు కథానికా చరిత్రను సామాజిక ఉద్యమాల వెలుగులో పెద్ద వ్యాసంగా రాసినప్పుడు నేను చాలా తృప్తి పడ్డాను. ఇలాంటివి కొన్ని అనుభూతులు ఉన్నాయి. సర్దేశాయి తిరుమలరావు, చేకూరి రామారావు, పెనుగొండ లక్ష్మినారాయణ వంటి పెద్దలు, మిత్రులు నా విమర్శభాషా సౌందర్యాన్ని ప్రశంసించినప్పుడు ఆనందం కలిగింది.

19        సాహిత్య విమర్శ రాసే క్రమంలో లేదా అధ్యయనం చేసే క్రమంలో మాధ్యమాలలో సాధారాణంగా అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి కొన్ని సార్లు వాదోపవాదాలకు దారి తీస్తుంటాయి. మీ రచనా జీవితంలో అటువంటి సందర్భాలు ఉ న్నాయా? వివరించండి?

అలాంటి సందర్భాలు నా విమర్శ జీవితంలో చాలా సంభవించాయి. ఇతరుల అభిప్రాయాలు అసంబద్ధమైనవని అనిపించినప్పుడు నా అభిప్రాయాల మీద ఎవరైనా అసంబద్ధంగా మాట్లాడినప్పుడు నేను స్పందించిన సందర్భాలు ఉన్నాయి. 1989 సెప్టెంబర్ 2న ఆంధ్రపత్రిక 'సాహితి' పేజీలో ఇస్మాయిల్ గారిది ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆయన పేరు చెప్పకుండా వామపక్ష సాహిత్యం మీద విమర్శ పెట్టారు. రాజకీయాల ప్రభావంతో వచ్చేదంతా అకవిత్వమన్నట్లు మాట్లాడారు. 1980 తర్వాత మాత్రమే మంచి కవిత్వం వస్తున్నదన్నారు. రాజకీయాలకు కవిత్వానికీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. ఆయన అప్పటికీ పేరున్నకవి. నాకు అప్పటికి 40 ఏళ్ళు. విమర్శ రంగంలో అప్పటికి నావి తొలి అడుగులే కాని ఆయన అభిప్రాయాలు నచ్చలేదు.అన్యాయ మాటలుఅంటూ నా అభిప్రాయం రాశాను. అది 1989 అక్టోబర్ 9న అచ్చయింది ఆంధ్రపత్రికలో. కానీ, నేను చిన్నవాడని కదా, నా పేరు పెట్టుకోడానికి జంకి, 'సాగర్' అనే పేరుతో రాశాను. ఆ తర్వాత నేనేప్పుడు మారుపేరుతో గానీ దొంగ పేరుతో గానీ రాయలేదు. నా పేరుతోనే చర్చల్లో పాల్గొన్నాను. విశ్వనాథ సత్యనారాయణ, పి. కేశవరెడ్డి, వల్లభాచార్య, గంగాధర్ గాడ్జిల్, వసుమతి, ద్వానాశాస్త్రి, సిరంచ, సుధాకర్, వేల్చేరు నారాయణరావు, అక్కిరాజు రమాపతిరావు లాంటి అనేక మందితో చర్చల్లో పాల్గొన్నాను. ద్వానా శాస్త్రిగారితో 'నిబద్ధత' విషయంలో అనేక పర్యాయాలు ఢీకొన్నాను. అయితే ఎవరితో విభేదించినా నాగరికతా సరిహద్దులు దాటడం నా లక్షణం కాదు. ద్వానాకు వెటకారం చెయ్యడం అలవాటు. కాని ఆయన మీద ఉన్న గౌరవంతో దానిని నేను పట్టించుకోలేదు. శ్రీశ్రీ శతజయంతి, గురజాడ 150వ జయంతి సమీపిస్తున్న సమయంలో మనువాదులు వాళ్ళ మీద మరో సారి దాడికి పూనుకున్నారు. గురజాడ 'దేశభక్తి'లో ఏదేశం ఉంది. గురజాడ సంస్కృతీ విధ్వంసకుడు, గురజాడ ఈ నాటికి ఎందుకు అవసరం వంటి వ్యాసాలు వచ్చినప్పుడు నేను గట్టిగానే సమాధానం చెప్పాను. నవరసాల వంటి ముసుగు పేర్లతో రాసేవాళ్ళను నిలదీశాను.

ఈ సందర్భంలోనే శ్రీశ్రీ, గురజాడ  మీద మనువాదుల దాడి తిప్పికొట్టబడుతున్న సమయంలో అక్కిరాజు రామాపతిరావుగారుఅదికవి నన్నయ్య సహస్ర జయంతిని ఘనంగా నిర్వహించాలంటూ, పాఠకుల దృష్టిని మార్చే ప్రయత్నం చేశారు. నన్నయ్య 1050 - 60 మధ్య భారత రచన ప్రారంభించారని, అప్పటికి ఆయనకు 50ఏళ్ళ వయసు దాటి ఉండవచ్చని ఊహించారు. అంటే శ్రీశ్రీ(1910) శతజయంతికి సరిపోయేట్టుగా నన్నయ్య వెయ్యో జయంతిని కలిపారు. సరే నన్నయ్య జీవిత విశేషాలు చారిత్రక ఆధారాలతో లభిస్తే జరుపుకోవచ్చు. అప్పుడు  నేను 'నన్నయ్య గారి వెయ్యో పుట్టిన రోజు విగ్రహాత్సవమా? సామాజికోత్సవమా? అని రాశాను. అందులో 11వ శతాబ్దం నాటి  కవిని గురించి 21వ శతాబ్దంలో ఎలా ఉత్సవం జరుపుకోవాలో చెప్పండి అని కోరాను. ఆయన వర్ణ వ్యవస్థను కీర్తించిన కవి, మనం వర్ణవ్యవస్థ నిర్మూలనోద్యమం కాలంలో ఉన్నాం. ఎలా లింకు కుదురుతుందో చెప్పండి అని అడిగాను. అంతే, వెంటనే 'నిశాపతి' అనే ముసుగు పేరు ప్రవేశించింది. నన్నయ్యగారిపై రాద్ధంతోత్సవంఅనే వ్యాసం వచ్చింది. ఇద్దరు మిత్రుల వ్యంగ్య సంభాషణగా అది సాగింది. పేరు చెప్పుకోలేని వారితో మనకేమిలే అనుకున్నాను. ఆ తర్వాత అక్కిరాజుగారు విజృంభించి నువ్వు శ్రీవెంకటేశ్వర విశ్వద్యాలయంలో విద్యాభ్యాసం, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యలయంలో ఉద్యోగం ఎందుకు చేశావు? అవి మనువాద పేర్లు కాదా అని వాదించారు. ప్రశ్నకు సమాధానం లేనప్పుడే ఇలాంటి వాదాలు వస్తాయని మాకు తెలుసు. ఇంతలో ద్వానాశాస్త్రి గారురాచపాళం వితండవాదంఅంటూ దూకారు. అలాగే కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళైగారు చివరికి వి.చెంచయ్యగారు ఏ కాలపు నీతినయినా బాధితుల దృష్టితో చూడాలి అని రాశారు. దాంతో ఆ చర్చ  ముగిసింది.

అలాగే ఇంటర్మిడియేట్ విద్యార్థులకు కచుని వృత్తాంతాన్ని పాఠంగా పెట్టినప్పుడు, అది పెట్టకూడని పాఠం అని నేను వ్యాసం రాశాను. అప్పుడు పెద్ద చర్చే  జరిగింది. అక్కిరాజు గారు మొదలుకొని అందరూ నన్ను దబాయించారుగానీ, నా వాదాన్ని పూర్వపక్షం చేయకుండా ఏవేవో మాట్లాడారు.

సంఘమిత్రలాంటి ఒకటి రెండు పేర్లతో ఇటీవల నన్ను గురించి దుర్మార్గమైన వ్యాసాలు రాశాడు. కేంద్రసాహిత్య అకాడమీ అంతా నా గుప్పెట్లో ఉందని రాశారు. నన్నొక గ్యాంగ్ లీడర్ అని జుగుప్సావహమైన భాషలో రాశారు. నాకు తెలియని, నాకు లేని శక్తులన్నిటినీ ఆపాదించేశారు. సంఘమిత్ర, నవరసాల వంటి పేర్లతో ఎవరైనా సాహితీపరులు నాకెక్కడా  తారసపడలేదు. కాబట్టి అవి దొంగ పేర్లు, పిరికివాళ్ళతో మనకెందుకు? అని ఊరుకున్నాను. నాకు ఒకటి అర్థమైంది భావజాలమే మనకు మిత్రులనైనా, శత్రువులనైనా సృష్టిస్తుందన్నది  వాస్తవం నాకు మార్క్సిజం మీద నమ్మక ముంది. సంఘమిత్రకు లేదు. పోనీ ఏమైంది? దానికి నన్ను నిందించాలా? సంఘ మిత్రకు హిందుత్వం ఇష్టం. నేను అభ్యంతరం చెప్పను. సందర్భం వచ్చినప్పుడు అభిప్రాయం చెప్పడానికి వెనుకాడను. అభిప్రాయాలు వేరైనా చర్చలో అనాగరికమైన భాష, సంస్కారం లేనిభాష ఉపయోగించాల్సిన అవసరం లేదు. ప్రశ్నకు సమాధానం లేప్పుడే గలీజు భాష, దబాయింపు ఆయుధాలౌతాయి. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.

20        రాయలసీమలో విమర్శ రంగంతో మీ తర్వాత కృషి చేస్తున్న ఇప్పటి తరం గురించి చెప్పండి?

60 ఏళ్ళకు పైబడిన వారందరూ నా తరం విమర్శకులు. 60కి లోన ఉన్నవాళ్ళు నా తర్వాతి తరం, ఇప్పటి తరం అనుకుందాం. గంగిశెట్టి లక్ష్మినారాయణ, హెచ్.ఎస్. బ్రహ్మనంద, పి.కుసుమకుమారి, జి చలపతి, ఎస్. భక్తవత్సలరెడ్డి, పి. నరసింహారెడ్డి, వి.స్.జి.డి.చంద్రశేఖర్, జి. దామోదరనాయుడు, మూలవిజయలక్ష్మి, కె. దామోదరనాయుడు, చిట్రాజు గోవిందరాజు, టి.జి.ఆర్, ప్రసాద్, సింగమనేని నారాయణ, నందవరం లింగా రెడ్డి, ఎస్.రాజేశ్వరి, రాధేయ, బి.సూర్యసాగర్, పాణి, స్వామి  మొదలైన వాళ్ళంతా నా తరానికి చెందిన నా తరం సాహిత్య విమర్శకులు. ఇప్పటితరం వాళ్ళతో ఇప్పటికీ విమర్శ గ్రంథాలు ప్రచురించబడిన వాళ్ళు,              ఉపన్యాసాలు చేస్తూ, వ్యాసాలు రాస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొలకలూరి మధుజ్యోతి, కిన్నెర శ్రీదేవి, కొలకలూరి ఆశజ్యోతి, మేడిపల్లి రవికుమార్, ఆర్.రాజేశ్వరమ్మ, అప్పిరెడ్డి, హరినాథరెడ్డి, తవ్యా వెంకటయ్య, అంరె.శ్రీనివాస్, బి. రాఘవేంద్ర, కె.నాగేశ్వరాచారి, పాణి, జి. వెంకటకృష్ణ, ఎన్ ఈశ్వర్ రెడ్డి, ఎం.ఎం.వినోదిని, మూల మల్లికార్జునరెడ్డి, రాజారాం , జి.వి సాయిప్రసాద్, షమీవుల్లా, కె.లక్ష్మినారాయణ, వై.సుభాషిణి, ఆర్. శశికళ, పి.వరలక్ష్మి, పిళ్ళాను. కుమారస్వామి తక్కిడ శిల జాని, సి.న్. క్షాత్రపతిరెడ్డి, ఎల్.ఆర్.వెంకటరమణ, జిక్కి కృష్ణ, రాసాని వంటివాళ్ళు దాదాపు 50 మంది దాకా రాయలసీమ నుండి విమర్శ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో సంప్రదాయ వాదులు ఉన్నారు. మార్క్సిజం, అంబేద్కరిజం, స్త్రీవాదులూ ప్రాంతీయవాదులు ఉన్నారు. చాలా మంది పరిశోధనలు చేసి డిగ్రీలు సంపాదించి సరైన ఉపాధిలేక అలా ఉండిపోయారు. వాళ్ళకు ఒక ఉపాధి లభించి ఉంటే మంచి విమర్శకులయ్యే వాళ్ళు.

21        ఇప్పటి సాహిత్య విమర్శకులకు మీరు చేసే సూచనలు ఏవైనా ఉన్నాయా?

నా తర్వాతి తరం విమర్శకులలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నిర్దిష్టమైన దృక్పథం గలిగిన వాళ్ళున్నారు. వాళ్ళకు నేనేమీ సూచనలు ఇవ్వాల్సిన పనిలేదు.

మిగతా వాళ్ళు సాహిత్య విమర్శకులు గొప్పపాఠకులు కావాలి అని వల్లంపాటి, విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు. 'లోకములో గావ్యవిమర్శనము గడు నిష్టురపు పనిఅని వెన్నేటి రామచంద్రరావు రచనను వివరించడం రచన చేయడం కన్నా కష్టతరం అని త్రిపురనేని మధుసూదనరావు అన్నారు. నేటి విమర్శకులు ఈ అభిప్రాయాలను జీర్ణం చేసుకోవాలి. సాహిత్య విమర్శ నల్లేరు మీద బండి నడక కాదని, అది సంక్షేమ  కార్యక్రమం కాదని గుర్తుంచుకోవాలి. సాహిత్య విమర్శకూడా సామాజిక చర్చ, అది ఒక సామాజిక కర్తవ్యం అని తెలుసుకోవాలి. సాహితతీ  విమర్శ కాలక్షేప కార్యకలాపం కాదు. కత్తిమీద సాము అని గుర్తించాలి. సాహిత్య విమర్శకులకు సహనం ప్రాణభూతమైన లక్షణం. సాహిత్యంపట్ల, రచయితలపట్ల గౌరవం కలిగి ఉంటూనే విమర్శలో నిష్కర్షగా ఉండాలి. విమర్శకులకు "అందరిని మెప్పించెదనయ్యైంకుడలన్అనే ధోరణి పనికిరాదు. దానివల్ల సమాజానికి, సాహిత్యానికి నష్టమని తెలుసుకోవాలి. నిర్దాక్షిణ్యంగా, నిస్సంకోచంగా ఒక సైడ్ తీసుకోకతప్పదు. ఒక దృక్పథం ఏర్పరుచుకోక తప్పదు. సాహిత్య విమర్శ ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవాలి. విమర్శ రాసే క్రమంలో విమర్శకులకు ఇవన్నీ  తెలుస్తాయి.

22        రాయలసీమలో మీ ముందటి తరానికి చెందిన సాహిత్య విమర్శకులను గురించి తెలియ జేస్తారా?

నా ముందటి కాలానికి చెందిన సాహిత్య విమర్శకులలో రాయలసీమకు చెందినవారు కనీసం 40 మంది నాకు గుర్తున్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారి నుండి నూతలపాటి.గంగాధరం దాకా వీళ్ళందరూకలిసి కనీసం ఒక వంద విమర్శగ్రంథాలు రాసి ఉంటారు. వీళ్ళను నాలుగు తరాలుగా వింగడించుకోవచ్చు.

మొదటి తరం :

కట్టమంచి రామలింగారెడ్డి ( కవితృతత్వ విచారము వ్రాసమంజరి మొ||)

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ( సారస్వతాలోపము, వేమన, నాటకోపన్యాసములు మొ||)

కవిత్వవేది (ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహము కందూకురి వీరేశ లింగయుగము మొ||)

రూపనగుడి నారాయణరావు ( కావ్యనిదానము మొ||)

 

రెండవతరం:

పుట్టపర్తినారాయణచార్యులు ( ప్రబంధనాయికలు మొ||)

గడియారం వెంపటశేషశాస్త్రి (తిక్కనకావ్య శిల్పము మొ||)

భూపతి లక్ష్మినారాయణరావు ( సాహిత్యదర్శనము మొ||)

చిలుకూరి నారాయణరావు (గుజరాతీ సాహిత్య చరిత్ర మొ||)

కోరాడ రామకృష్ణయ్య (ఆంధ్రభారత కవితా విమర్శనము మొ||)  

కల్లూరు అహోబలరావు (రాయలసీమ రచయితల చరిత్ర మొ||)

 

మూడవతరం:

రాచమల్లు రామచంద్రారెడ్డి (సారస్వతి వివేచన మొ||)

మధురాంత కంరాజారం (కథనడి వచ్చిన దారి మొ||)

కోదాడమహదేవశాస్త్రి ( తెలుగు సాహిత్య చరిత్ర మొ||)

తిమ్మవజ్ఞల కోదండరామయ్య ( పాలవెల్లి, కవిరాజ శిఖముణి మొ||)

తూమాటి దొణప్ప (జానపద సంపద మొ||)

జాస్తి సూర్యనారాయణ ( తెలుగు వారికి సంస్కృతం మొ||)

సర్దేశాయి తిరుమలరావు (శివబరతదర్శనము, కన్యాశుల్కనాటకవళి మొ||)

 

నాల్గవతరం:

ఆర్ఎస్ సుదర్శనం ( సాహిత్యంలో దృక్పథాలు, సాహిత్యం - సమాజం మొ॥)

కేతువిశ్వనాథరెడ్డి ( కడప ఊర్ల పేర్లు, దృష్టి మొ||)

పి.వి. ఆరుణాచలం ( వ్యాసమంజూష మొ||)

జి. నాగయ్య ( తెలుగు సాహిత్య సమీక్ష, ద్విపదవాజ్మయం, తెలుగులో కావ్యావతారికలు, ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి మొ॥)

మద్దూరి సుబ్బరెడ్డి ( తెలుగులో జాతీయోద్యమ కవిత్వం, సాహిత్య వివేచన మొ||)

కొలకలూరి ఇవాక్ ( తెలుగు వ్యాసపరిణామం, ఆధునిక సాహిత్య విమర్శసూత్రం, విమర్శిని, శూద్రకవి శుభమూర్తి వసుచరిత్రపక్షం మొ||)

తిమ్మపుడి కోటిశ్వరరావు ( ఆముక్తమాల్యదా సౌందర్యము, శ్వేత చ్ఛత్రం, సాలభంజిక, పురణవిద్ర మొ||) శిలాపరఘనాథ శర్మ ( వ్యాసభారత వరివస్య, ఆంధ్రమహాభారతం - నిదర్శనం మొ||)

సోదుంరామ్మోహన్ ( సాహిత్యవలోపన, సాహిత్యంలో శిల్పం మొ||)

ఆర్వీయార్ ( సాహిత్యతత్వం మొ||)

త్రిపురనేని మధుసూదన రావు ( కవిత్వం - చైతన్యం, సాహిత్యంలో వస్తశిల్పాలు మొ॥)

వల్లంపాటి వెంకటసుబ్బయ్య ( నవలా శిల్పం, కథాశిల్పం, విమర్శాశిల్పం రాయలసీమ ఆధునిక సాహిత్యం మొ||)

డి. పద్మావతి ( దాశరథిరంగాచార్య నవలలు, ఆచార్య జి.ఎన్.రెడ్డి మొ||)

బి.భాస్కరచౌదరి ( జాషువకృతుల సమాలోచన, కృష్ణశాస్త్రి కవితాత్మ మొ||)

పి. సంజీవమ్మ ( తెలుగు నవల - సామాజిక చైతన్యం, సాహిత్య వ్యాసాలు మొ||)

తక్కోలు మాచిరెడ్డి ( చీకటి నుంచి స్వప్నం దాకా, రా రా మొ||)

ఎస్.గంగప్ప ( కోలాచలం శ్రీనివాసరావు నాటక సమాలోచనం, అన్నమయ్య ఇతర భారతీయ - కవులు మొ||) ఆశావాది ప్రకాశరావు ( భాగవత సౌరభం, సంప్రదాయ కవి తారీతి మొ||)

జె.ఎస్.ఆర్.కె.శర్మ ( భువనవిజయ ప్రబంధ సంక్షిప్త సంకలనం మొ||)

నూతల పాటి గంగాధరం ( గంగాధర లహరి మొ||)

వారాలకృష్ణమూర్తి ( తెలుగు, నాటకం - రాజకీయ సామాజిక సమస్యలు మొ||)

వీళ్ళలో విశ్వవిద్యాలయ ఆచార్యుల నుండి పాఠశాల అధ్యాపకులు దాకా ఉన్నారు. సంప్రదాయ వాదులూ, అభ్యుదాయ, విప్లవ, దళితవాదులు ఉన్నారు. ముగ్గురు నలుగురు సాహిత్య చరిత్రకారులు ఉన్నారు. భాషాశాస్త్ర పరిశోధకులున్నారు. నలుగురు వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. ( కట్టమంచి, జి.ఎన్.రెడ్డి, తూమాటి దొణప్ప, కొలకలూరి ఇనాక్) అనువాదకులున్నారు. అనువాద శాస్త్రవేత్తలున్నారు. అనేక మంది రచయితలకు పీఠికలు రాసినవాళ్ళున్నారు.

23        మీ తరం సాహిత్య విమర్శకులు రాయలసీమ వారిని గురించి తెలియజేస్తారా?

నా తరం విమర్శకులు కనీసం ఇరవై మందికి పైగా ఉన్నారు. పిహెచ్ డి  మాత్రోప జీవులను పక్కన బెట్టినా ఇంతమంది ఉ న్నారు.

సింగమనేని నారాయణ ( సమయమూ - సందర్భము, సంభాషణ, కవరణం తెలుగోవిందుకు, మధురాంతనం రాజారం మొ||)

హెచ్.ఎస్. బ్రహ్మనంద : ధృన్యాలోపం, తెలుగు కవిత్వం - నన్నయ్య ఒరవడి, విశిష్ట సాహిత్యం - జానపద ధోరణులు, తెలుగు సాహిత్య విమర్శ మీద సాహిత్య ప్రభవం, రాయలసీమలో హరికథా సంప్రదాయం,

రాయలసీమ భాష మొ||)

పి.కుసుమకుమారి ( సాహిత్యం - జండర్‌ స్పృహ మొ||)

జి. చలపతి ( వింశతి, కవికర్ణ రసాయనం - విశిష్టాద్యైవం మొ||)

భూమన్ (రాయలసీమ ముఖచిత్రం మొ||)

కావ్యా వతారిపి - తెలుగు తారిపి మొ||)

ఘట్టమ రాజు అశ్వర్థనారాయణ

పిఎల్. శ్రీనివాసరెడ్డి ( శ్రీనివాసాలు మొ||)

ఎం.కె.దేవకి ( తెలుగులో బాలగేయ సాహిత్యం , బాల సాహిత్యం మొ||)

ఎస్.జి. చంద్రశేఖర్ ( తెలుగు వచన కవిత్వం - కుందుర్తి మొ||)

ఎన్. భక్తవత్సలరెడ్డి ( స్వాతంత్ర్యోత్తరకాలాన తెలుగు కవిత, మొ||)

జి. దామోదరనాయుడు ( దశావతారతత్వం, మనుచరిత్ర - మనచరిత్ర, జయ మొ||)

కె. దామోదరనాయుడు ( మూలవిజలక్ష్మి తెలుగు జాతీయాలు, కడప జిల్లా భష, సిరిమల్లెలు మొ||)

టి. జిఆర్ ప్రసాద్ (చేతన మొ||) చిట్రాజు గోవిందరాజు ( కరుణకుమార, అన్నమయ్య పదాలలో ఉత్సవాలు తెలుగు సాహిత్యంలో మానవహక్కులు మొ||)

డి.బెంగారెడ్డి ( దౌపది, చిత్తూరు జిల్లా గ్రామ నామాలు మహాభారతంలో రాజనీతి మొ||)

ఎం. గోవిందస్వామి నాయుడు ( అనంతపురం జిల్లా గ్రామనామాలు, కాశనసోమన - అన్నమయ్య - తులనాత్మక పరిశీలన మొ||)

కె. సర్వోత్తమరావు (దాత్రిణాత్యదేవిబం దోరీతులు, అక్షరావలోపనం, రామదాసు - అన్నమయ్య, త్యాగరాజు మొ||)

. విశ్వనాధరెడ్డి ( వైదేహి, తమిళ తెలుగు భాషల్లో ఉర్దూపదాలు - తులనాత్మక పరిశీలన మొ||)

. చంద్రమౌళి ( దాశరథి కవితా సమాలోచన, తెలుగులో స్మృతి కవిత్వం మొ||)

అమళ్ళ దిన్నె వెంపటరమణప్రసాద్ ( తెలుగులో మృచ్ఛకటికం, అనంతపర్యం మొ||)

బండినారాయణస్వామి ( రాయలసీమ సమాజం - సాహిత్యం)

రాధేయ (అవగాహన, కవిత్వం - ఒక సామాజిక చైతన్యం, కవిత్యం - ఒక సామాజిక అవసరం, కవిత్వం - ఒక సామాజిక చైతన్యం మొ||)

గంగిశెట్టి లక్ష్మీనారాయణ ( ప్రాచీన శ్రేష్టభాషగా తెలుగు చరిత్ర మొ||)

హెచ్చార్కె  ( సంబంధం  మొ||)

బి. సూర్యసాగర్ ( శృతి సాహిత్యం - సౌందర్యం)

పి. రమేశ్ నారాయణ ( ఎర్రని ఆకాశం మొ||)

మక్కలూరి శ్రీరాములు ( పోతన భాగవతం, అయిదు వ్యాసాలు మొ||)

శశిశ్రీ ( రాయలసీమ సాహిత్యం , చూపు మొ||)

ఎన్. రామచంద్ర ( బెలం సాహిత్యం - సామాజిక చైతన్యం, పరిశోధన మొ||)

నా తరం వాళ్ళందరూ కలిసి నూటికి తక్కువ కాకుండా విమర్శ గ్రంథాలు ప్రచురించి ఉంటారు. నా తరం వాళ్లలో కూడా సంప్రదాయ వాదులూ, ఆధునికులూ ఉన్నారు. పుస్తకాలుగా రాకపోయినా, వ్యాసాలు అసంఖ్యకంగా రాసిన మధురాంతకం  నరేంద్ర, ఘట్టమరాజు లాంటి వాళ్ళు నా తరం విమర్శకులు ఉన్నారు. 

24        రాయలసీమ నుండి వచ్చిన విమర్శ గ్రంథాలలో ప్రామాణికమైనవిగా పేరుపొందిన వాటిని కొన్నింటిని పేర్కొంటారా?

తప్పకుండా కవిత్వతత్వ విచారం, వేమన, సారస్వతాలోకము, ఆంధ్రవాజ్మయ చరిత్ర సంగ్రహము, తెలుగు సాహిత్య సమీక్ష, సాహిత్యంలో దృక్పథాలు, తెలుగులో జాతీయోద్యమ కవిత్వం, సాహిత్యంలో వస్తు శిల్పాలు, కన్యాశుల్కనాటక కళ, జానపద కళాసంపద, కడప ఊర్ల పేర్లు, సాంస్కృత వివేచనం వంటివి కనీసం ఇరవై విమర్శ పరిశోధన గ్రంథాలు రాయలసీమ నుండి వచ్చిన ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి.

 

 

సాహిత్యం ప్రజలతోనే ఉంటుంది, ప్రజల దగ్గరే ఉంటుంది – మంచికంటి 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు మంచికంటి  గారు ఇచ్చిన ఇంటర్వ్యూ 

1. మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

పుట్టుకతో అందరు మనషులూ ఒకేలా పుట్టినా, పెరిగే క్రమంలో   అనేక ప్రభావాలకు లోనవుతూ ఉంటారు. అలాగే సాహిత్య అధ్యయనానికి పూర్వం అధ్యయనం తర్వాత  మనుషుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అధ్యయనం నుండి ఆచరణకు పూనుకున్న తర్వాత ఆ మార్పు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఒక క్రమ పరిణామం నాలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది.

మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర చిన్న పల్లెటూరు కలికివాయ గ్రామం. మా నాన్న నిశానీ రైతుకూలీ. మా అమ్మ అక్షరాలు కూడబలుక్కుని చదువుతూ ఉండేది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా గ్రామంలో మనుషుల్ని గమనిస్తూఉండేవాడిని.పని చేయడానికే వీళ్లు పుట్టారా అన్నట్టు ఉండేవాళ్ళు. నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు ఎవరూ లేకపోవడంతో చాలా ఒంటరిగా పెరిగాను. ఒంటరితనం పుస్తకాలకు బాగా దగ్గర చేసింది. ఆ పుస్తకాలే మా గ్రామానికి ఏమైనా చేయాలి అనే బలీయమైన కోరికను పెంచాయి. అప్పుడు గ్రామంలో ఒక వాతావరణం ఉండేది. యువజన సంఘం గ్రంథాలయం, ఆట పాటలు సాంఘిక, పౌరాణిక, సాంస్కృతిక నాటకాలు ఇవన్నీ మనిషి ఎదుగుదలకు అవసరమైన మేలైన వాతావరణం. ఆ వాతావరణం నుండి మానసికంగా ఎదుగుదల అనేది మొదలైంది. స్కూలు, కాలేజీ ప్రతి మజిలీ లోనూ పెద్దపెద్ద గ్రంథాలయాలు చూస్తూ పెరిగాను. విద్యాలయాల చదువుకంటే గ్రంధాలయాల చదువే మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దుతుంది.

మా ఊరు కలికివాయ నుండి సింగరాయకొండ, టంగుటూరు, ఏలూరుల మీదుగా బాల్యం నుండి కౌమార యవ్వన దశలన్నీ విద్యాభ్యాసంతో సాగిపోయాయి. అప్పటికి జీవితాన్ని గురించి గానీ జీవన సారాన్ని గురించి గానీ ఏమీ తెలియలేదు. కొత్తపట్నం లో ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పటి నుండి  సాహితీ జీవితం కొద్దిగా మొదలైంది. ఒంగోలు వచ్చిన తర్వాత పూర్తి సాహిత్యంలోనే మునిగిపోయాను. 

2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

అక్షర సాహితీసమితి ఎంవిఎస్ శాస్త్రి ,ప్రకాశం జిల్లా రచయితల సంఘం బి.హనుమారెడ్డి, నాగభైరవ కోటేశ్వరరావు, ప్రకృతి సాహితి శ్రీరామకవచం సాగర్, మూర్తి, కాట్రగడ్డ దయానంద్ వీళ్ళ సాహచర్యంతో ఒక్కొక్క మజిలీ దాటుకుంటూ సాహిత్యాన్ని చదవడం ఎలానో తెలుసుకున్నాను. తెలుసుకునే క్రమంలోనే కథ, కవిత్వం  రూపుదిద్దుకున్నాయి.

తరచుగా ఒంగోలు వచ్చే కె. శివారెడ్డి, డాక్టర్ వి.చంద్రశేఖరరావు, కాట్రగడ్డ దయానంద్ ఎక్కువగా నన్ను ప్రోత్సహించిన వారు, ప్రభావితం చేసిన వారు కూడా. ఒక దశలో విరసంలో సభ్యునిగా చేరడానికి కూడా ప్రయత్నించాను.

3. మీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?

ప్రతి కవి మహాప్రస్థానంతో మొదలైనట్టుగానే నేను కూడా అక్కడి నుండే మొదలయ్యాను.

గోపీచంద్, బుచ్చిబాబు, చలంలను చదువుతూ రష్యన్ సాహిత్యం వైపు వెళ్లాను. చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది రష్యన్ సాహిత్యం. 

మనిషి ఉనికి  సమాజంలోనే. అలాంటి సమాజాన్ని పరిశీలిస్తున్న క్రమంలో మనిషి అనేక మార్పులకు లోనవుతాడు.అలా సమాజంలో అసమానతలు, పీడన, దోపిడీ చూస్తూ పెరిగే క్రమంలో సామాజిక స్పృహ, ప్రజానుకూల దృక్పథం ఏర్పడుతూ వచ్చాయి.

ఒంగోలు సాహిత్య వాతావరణం అంతా కవిత్వం, నాటకం, పద్యం, అష్టావధానం, సినిమా చుట్టూ తిరుగుతూ ఉండేవి. నా జీవన నేపథ్యం కథ చుట్టూ తిరిగే వాతావరణం. వాస్తవానికి నా సాహితీ జీవితం కథలతో మొదలైంది కానీ సరైన దిశానిర్దేశం, వాతావరణం లేక కవిత్వంలోకి ప్రయాణించింది. కాట్రగడ్డ దయానంద్, మూర్తి, సాగర్ల సాహచర్యంతో మళ్లీ కథలోకి రాగలిగాను. కథలు రాయడానికి ప్రోత్సాహం కావాలి కదా ! అది కథల పోటీ ద్వారా పొందాను. అంతకు ముందు చిన్న చిన్న పత్రికలలో  కవితలు, కథలు వచ్చినా  తానా కథల పోటీలో  కథ గెలుపొందిన తర్వాత  మిత్తవ కథ నా స్థానాన్ని  సాహిత్య లోకంలో సుస్థిరం చేసింది. అలాగా కవిత్వం నుండి కథలు ,నవల ఇలా సాగింది నా సాహితీ ప్రయాణం.   ప్రతి రచయిత తనలో జరిగే సంఘర్షణను బయటకు చెప్పడానికి రచనను ఎంచుకుంటాడు. అలా మొదలైన నా రచన పోటీలు ప్రభావంతో మరింత ముందుకు సాగింది.

ఇలా రచయితగా మారే క్రమంలో చాలా ఘర్షణ చోటు చేసుకుంటూ వచ్చింది. నాలాగా ఎందరో ఘర్షణ పడుతూ ఉంటారు కదా! వాళ్ల కోసం పని చేద్దామని నిత్యం సభలు-సమావేశాలు వర్క్ షాపులు ఏర్పాటు చేస్తూ వచ్చాను.

4.  వారధి ఆగిపోయిందేమి?

ఇన్ని చేసినా ఏదో వెలితి కనిపిస్తుంది .సమాజం కోసమే రచనలు చేస్తుంది .మరి ఆ రచనలు చదివే పాఠకులు లేకుంటే మన రచనలు ఎవరి కోసం చేస్తున్నాం అనే ప్రశ్న వెంటాడేది.

ఆ సమయంలో తిరుపతి సభలో చాలా మంది మిత్రులం కలిశాము. అక్కడే వారధి పురుడుపోసుకుంది. సుంకోజి దేవేంద్రాచారి ,పలమనేరు బాలాజీ ,జి వెంకట కృష్ణ, కే.ఎన్ మల్లేశ్వరి, పెద్దింటి అశోక్ కుమార్, నేను కలిసి   సహకార పద్ధతిలో 26 మంది కథా రచయితల కథలతో నవతరం తెలుగు కథ ప్రచురించాము. ఇలా మొదలైన వారధి కథలతో పాఠకులను కలిసి  పుస్తకాలు విక్రయించాలనేది నియమం. అలా సాగిన ప్రయాణం సమిష్టిగా అక్కడితోనే ఆగినా ఒంగోలులో సాహితీమిత్రులు డాక్టర్ సుధాకర్ ను పరిచయం చేసింది. ఆ పరిచయమే శాంతివనం రూపుదిద్దుకోవడానికి బలాన్నిచ్చింది. సామూహికంగా మొదలైన వారధి ఆగిపోయింది కానీ, నావరకు నాకు శాంతివనం వారధి కొనసాగింపుగానే భావిస్తాను. ఎంతో మంది పిల్లల్ని పాఠకులుగా తయారు చేశాము. చాలా మంది పిల్లలు కవితలు కథలు రాస్తున్నారు. శాంతివనం ద్వారా ఎంతో సాహిత్య వాతావరణం ఏర్పాటు చేశాము. అలాగే వారధి ముఖ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక ఉద్యమంగా కొనసాగడం చూస్తూ ఉన్నాము. డాక్టర్ సుధాకర్ గారు కథలు బాగా చదువుతారు రచయితలతో మాట్లాడతారు ఇప్పుడు మంచి కథలను ఎంపిక చేసుకుని రికార్డు చేసి స్పోటిఫై యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు.

అప్పటిదాకా సాహిత్యమంటే చదవడం తిరిగి రచనలు చేయడం దగ్గరే ఉండే నేను తెలుసుకున్నది ఏమంటే ఈ రెండింటి కంటే ఆచరణ ముఖ్యమనేది. అంతేకాకుండా పాఠకులు ,రచయితలు పిల్లల నుండి రావాల్సి ఉంటుందని కూడా అర్థమైంది.

5.  శాంతివనం గురించి చెప్పండి?

అప్పటినుండి సాహిత్య లోకాన్ని వదిలి పిల్లల లోకంలోకి వచ్చేశాను. వాస్తవ లోకంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయ లోకం అస్తవ్యస్తంగా ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా ఉండటం తట్టుకోలేక పోయాను. సాహిత్య లోకమనే తెరను తొలగించుకొని వాస్తవ జీవితం లోకి వచ్చిన నా ఉపాధ్యాయ వృత్తి కి  పిల్లలే మెరుగులు దిద్దారు. 

వృత్తి పరంగా కూడా చైతన్యవంతమైన తర్వాత చూస్తూ కూర్చోవడం, విమర్శిస్తూ ఉండటం కంటే మన వంతుగా ఏమి చేయొచ్చు అని ఆలోచించి పూర్తిగా సమాజంతో మమేకం అయ్యాను. నా కృషికి తోడు డాక్టర్ సుధాకర్ గారు మరియు అనేకమంది మిత్రులు సహకారంతో శాంతివనాన్ని పి.నాయుడు పాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది.

మనిషి జీవితానికి ప్రారంభం బాల్యం. సమాజానికి పునాది గ్రామం. నిజమైన జీవితం గ్రామాల్లోనే ఉంటుంది. అలాంటి గ్రామాన్ని ఏ దశలోనూ నేను వదిలిపెట్టలేదు. గత పది సంవత్సరాలుగా పూర్తిగా గ్రామ జీవితంలోనే ఉండిపోయాను. కాబట్టే కార్యాచరణ సాధ్యమైంది.

నీ కసలే లక్ష్యంలేదు అని అనేక సందర్భాల్లో పెద్దల నోటి వెంట వింటూ ఉంటాం. అలాంటి లక్ష్యం ఏర్పడింది పిల్లల మధ్యకు వచ్చిన తర్వాతే. సాహిత్యం జీవితాన్ని ఆనందమయం చేస్తే, పిల్లలతో సహజీవనం లక్ష్యాన్ని ఏర్పరచింది. బాల్యంలో ఎవరైనా సహాయం చేస్తే బాగా చదువుకోవచ్చు అని ఒక అభిప్రాయం నాలో ఉండేది. అభిప్రాయం  నాతో పాటుగా అంతర్గతంగా ఉండి, వాతావరణం ఏర్పడిన తర్వాత, జీవితానికి లక్ష్యం ఏర్పడిన తర్వాత అది బహిర్గతమై శాంతివనం రూపంలోకి మారింది.

ఈ లక్ష్యాన్ని బలపరిచే అనేకమంది సాధించిన విజయాలు వాస్తవిక విజయగాథలు, వివేకానందుని యువతా మేలుకో ఇవన్నీ చాలా ప్రభావితం చేశాయి.

గొప్ప రచయితల రచనలను పిల్లలకు పాఠాలుగా చెప్పేటప్పుడు నాకు నేనుగా ముందు ప్రభావితుడను అయ్యేవాడిని. ఆ తరువాతే పిల్లలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే వాడిని.

6. మీ పుస్తకాల  శీర్షికలు విభిన్నంగా స్థానిక పేర్లతో ఉంటాయి.  అందుకు కారణం ఏమిటి?

నా కవిత్వం విషయానికొస్తే ప్రాథమికంగా రాసిన కవిత్వం లో అంత బలమైన అభివ్యక్తి లేదు. నా చుట్టూ ఏర్పడిన గందరగోళం కనిపిస్తుంది .కానీ పరిపక్వత వచ్చిన తర్వాత  కవిత్వంలో బలమైన అభివ్యక్తి తాత్వికత ఉంది. కథల విషయానికొస్తే నా కథల్లో  శైలి పల్లెటూరి జీవితం. శిల్పానికొస్తే భాషే శిల్పంగా భావిస్తాను. తర్వాత వచ్చే కథల్లో మార్పు కనిపించవచ్చు.

అందుకే కథల పేర్లు, కథాసంకలనాల పేర్లు, నవలల పేర్లు కూడా మాండలికం లోనే ఉంటాయి. నేను రాసింది గొప్ప సాహిత్యం అని ఎప్పుడూ భావించలేదు నన్ను నేను నిరంతరం పరిశీలించు కొంటూనే, మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను .మన ముందు తరాల గొప్ప రచయితల సంకల్పం ముందు మనం సృష్టించే సాహిత్యం ఏపాటిది.వాళ్ళ సాధన, ఆచరణ, మమేకత నుండి మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.

నా రచనల్ని నా చుట్టూ ఉన్న జీవితాల్ని రికార్డు చేయడంగానే భావిస్తాను. 

 

7.  మీరు  సైకిల్ యాత్ర  చేయాలని  ఎందుకు అనుకున్నారు? ఆ అనుభవాలు రికార్డు చేసారు కదా.  అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది?

 

లక్ష్య సాధన గురించి పిల్లలకు బోధించేటప్పుడు నాకు నేనుగా ఏమి సాధించాను అని ప్రశ్నించుకునేవాడిని. హిమాలయాల్లో, థార్ ఎడారిలో, అరకులోయలో ఇలా  ప్రకృతితో మమేకమయ్యే ఎన్నో ట్రెక్కింగ్స్ చేశాను. ఈ క్రమంలో మార్టూరు వసంత్ చెన్నై నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేస్తూ ఒంగోలు వచ్చారు. అతన్ని కలిసిన స్ఫూర్తి నా సైకిల్ యాత్రకు ప్రేరణ. 

ఎక్కడెక్కడో వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ప్రదేశాలు సందర్శించి వచ్చాను. మరి మన జిల్లా ఒకసారి చుట్టి వస్తే అనే ఆలోచన వచ్చింది. అదీగాక అప్పుడు బాలల హక్కుల మీద కూడా పనిచేస్తున్నాను. కాబట్టి బాలల హక్కులను ప్రచారం చేస్తూ ఈ యాత్ర సాగించాను. సమూహంతో జిల్లా అంతటా చేయాలనుకున్న యాత్ర ఒంటరిగా సగమే చేయగలిగాను. ఆ యాత్ర స్ఫూర్తి ఇప్పుడు రాష్ట్రమంతా గ్రంథాలయ ఉద్యమ యాత్ర కు నన్ను సన్నద్ధం చేస్తుంది.

8. కథకుడిగా కవిగా నవలాకారుడిగా ఉన్న మీరు  బాలసాహిత్యం వైపుకు ఎందుకు వెళ్ళారు?

పెద్దలు అందరమూ ఎన్నో విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. కానీ పిల్లల ఆలోచనలకు, అభిప్రాయాలకు, కోరికలకు, కలలకు ప్రాధాన్యత ఇవ్వం.  మొక్కై వంగనిది మానై వంగదు  అనేది సామెత కదా.   పిల్లలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళలోని శక్తిని గుర్తించి, వారిని ప్రోత్సహిస్తే ఆకాశపు అంచులను చూస్తారు. ఈ తాత్వికతో నడుస్తున్నది శాంతివనం 

ముక్కు మొఖము తెలియని ఒక గ్రామంలో విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా కేంద్రం ఉంటే పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దవచ్చో శాంతివనం ద్వారా నిరూపిస్తూ వస్తున్నాము. ఇక్కడ ఎంతోమంది బాల కవులున్నారు  పుస్తకాలను ఆబగా చదివే పిల్లలు ఉన్నారు. శాంతివనమే పెద్ద గ్రంథాలయం. పిల్లలకు కింద స్థాయి నుండి పుస్తకపఠనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో నేర్పించడం ఇక్కడ నిరంతర ప్రక్రియ. శాంతివనం నుండి కొంతమంది విద్యార్థులు విజయాన్ని సాధించి జీవితంలో స్థిరపడుతున్నారు.

పాఠశాల దశ నుండే పిల్లల్ని మూర్ఖులుగా, ఆలోచన లేని వారిగా, దుర్మార్గులుగా, మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లుగా పిల్లల్ని విడదీసి ఆలోచన లేని యంత్రాలుగా తయారుచేస్తున్న దుర్మార్గ వాతావరణంలో ఉన్నాము. ఈ వాతావరణం నుండి పిల్లల్ని ఆలోచనాపరులుగా, జ్ఞాన సంపన్నులుగా లక్ష్య సాధకులుగా మార్చాలన్న ప్రయత్నం పది సంవత్సరాలుగా జరుగుతుంది. 

ఈ క్రమంలో ఈ సంవత్సరం గ్రంథాలయ ఉద్యమాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహణ సన్నాహాల్లో ఉన్నాను.  ప్రముఖ సాహిత్యకారులు వాడ్రేవు చినవీరభద్రుడు గారు కమిషనర్ గా రావడం, బాల సాహిత్యం వైపు ఆలోచన చేయడం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ఆయన భుజాలకు ఎత్తుకోవడం జరిగింది.

అనేక మంది ఉపాధ్యాయులు రచయితలు పిల్లల కోసం వివిధ రకాల ప్రయోగాలు ప్రయత్నాలు  చేస్తున్నారు. వీళ్లందరినీ ఒక తాటి మీదకు తెచ్చి పిల్లలకు ఉపయోగపడే పుస్తక రచన చేయించడం, పాఠశాల గ్రంథాలయాలను బలోపేతం చేయడం, పిల్లలను పాఠకులుగా, రచయితులగా మార్చడం అనే ఆలోచన కార్యక్రమంతో చేస్తున్నదే బాల సాహిత్య కార్యక్రమం. నా సాహిత్య ప్రయాణంలో ఇదొక గొప్ప మజిలీ.

9. సమాజంలో మార్పు కొరకు సాహిత్యం ఎంత మేరకు పనికి వస్తుంది?

జీవితం వేరు. సాహిత్యం వేరు. ఆచరణ వేరు. ఆలోచన వేరు అయినప్పుడు ఏదీ సాధించడం సాధ్యం కాదు. అన్నీ ఒకటే అయినప్పుడు అది ఒక సాధన అవుతుంది. అన్నింటినీ ఒకటిగా చేసుకోడానికి చాలా సాధన కావాలి. గుండె నిబ్బరం కావాలి. ధైర్యం కావాలి. దీనిని సాధించడానికి చాలా సమయమే పట్టింది. ఒక్కొక్కసారి వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల్లో పడే ప్రమాదం ఏర్పడింది. ఒకటే జీవితం కదా! అనుకున్నవన్నీ ఇప్పుడే చేసుకుంటూ పోవాలి. ఇలా ప్రయాణించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. పట్టించుకోకూడదు. ముళ్ళు రాళ్లు ఏరివేసి కొత్త బాటలు ఏర్పరిచేటప్పుడు కొన్ని గాయాలవుతాయి. కొన్ని ఎదురుదెబ్బలు  తగులుతాయి. లెక్క పెట్టకూడదు .లక్ష్యం నీదైనది అయినప్పుడు ప్రతి దానికి నువ్వే బాధ్యుడవు అంటాడు వివేకానందుడు. అందుకే ఎన్ని పనులైనా ఒకేసారి చేయడం సాధ్యమే. వృధా చేసే సమయం తక్కువ అయినప్పుడు ఎన్ని పనులైనా చేయవచ్చు. ఒంటరిగా చేయలేని పనులు సమూహంతో చేయవచ్చు.

కాబట్టి నా సంకల్పం కృషి పట్టుదల అన్నీ సాహిత్యం నుండి వచ్చినవే .నా వంతుగా నేను పిసరంతయినా మార్పు తీసుకు రాగలిగాను అంటే అది సాహిత్యం వల్లనే. సాహిత్యం మనిషిలోకి ఇంకిపోతే ఎంతో మార్పు కు ప్రేరణ అవుతుంది. ఇది మనిషిలోని రాక్షసత్వాన్ని రూపుమాపడానికి ,సాధుతత్వాన్ని పెంపొందించడానికి సాహిత్యం ఖచ్చితంగా దోహదపడుతుంది. ఆ దిశగా ఆలోచించినా మనిషిలో మార్పుకు సాహిత్యమే కారణం కదా!మనిషే సమాజానికి మూల బిందువు కదా!సమాజంలో మార్పు కొరకు సాహిత్యం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అది నేటి తరాన్ని సాహిత్యంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే.

10.  ప్రకాశం జిల్లా సాహిత్య  వాతావరణం  ఎలా ఉంది?

 ప్రకాశం జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు. ఎప్పుడూ ఏదో రూపంలో చరిత్ర సృష్టిస్తూనే ఉంటుంది. ఇప్పుడు సాహిత్య వాతావరణం సుసంపన్నంగా ఉంది  జానుడి, శాంతివనం ,కథాప్రకాశం సంయుక్తంగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అనేక సంస్థలు రకరకాల కార్యక్రమాలు నిరంతరంగా జరుపుతూ ఉంటాయి. కొత్తగా వచ్చే తరం కోసం మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాము.

11.    ప్రస్తుతం వెలువడుతున్న సాహిత్యం ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్నదా?

సాహిత్యం ప్రజలకు దూరంగా జరిగిపోయింది. ప్రజలకే కాదు  రచయితలకు కూడా దూరమైపోయింది.  రచయితలు ప్రజలతో ప్రజా సమస్యలతో, ఉద్యమాలతో మమేకం అయినప్పుడు సమాజంతో సాన్నిహిత్యం కలిగి ఉన్నప్పుడు సాహిత్యం ప్రజలతోనే ఉంటుంది. ప్రజల దగ్గరే ఉంటుంది. 

సామాజిక మాధ్యమాలు ప్రబలి పోయినప్పుడు వ్యక్తిగత జీవితమే సాహిత్యం అవుతుంది. అదే సర్వస్వం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే . మనకు తెలియకుండానే దానిలోకి కూరుకు పోయాము. అధ్యయనం, ఆచరణ ,రచన ఇది వరుసక్రమం .రచన ప్రచురణ ఇదే ప్రధానాంశం ఇప్పుడు. సోషల్ మీడియా అందుబాటులో  ఉండడం వల్ల ఇలా రాయడం, అలా ప్రచురించుకోవడంలైకులు కొరకు ఎదురు చూడటం.  ఇది దుష్పరిణామం. వాస్తవం తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి .ఆచరణ ద్వారా  అనుభవించాలి. పరిశీలన ఉండాలి .ఆ తర్వాతే రచన. అప్పుడు అది ప్రామాణికంగా, అనుభూతి చెందేదిగా వుంటుంది.

మనకు తెలియకుండానే పెట్టుబడిదారీ సంస్కృతి, వస్తు వినిమయ సంస్కృతిని దాటి మాయాజాల సంస్కృతిలోకి జారిపోయిన విషాదకర సందర్భమిది.

12.  ఇవాల్టీ  రచయితల సాహిత్యం ఎలా ఉంటున్నది?

రాసే ప్రతి వాక్యము కవిత్వమనే అనుకుంటున్నారు. తాదాత్మ్యత లోపించింది. అనుభవైకవేద్యం లేదు. సాధన లేదు. అధ్యయనం ముగిసిపోయింది. నవలల విషయానికొస్తే కేవలం పోటీలకు పరిమితమైపోయాయి. అంటే అన్ని పేజీలు పుస్తకాలు చదివే సమయం లేదు. ఓపికా ఉండటం లేదు.

 కథ అంటే జీవితం కదా !సంఘర్షణకు లోనవుతున్న ఇప్పటి యువతరం జీవితం నుండి కథ సుసంపన్నం అవుతుంది. యువత చేతిలో కథ విరాజిల్లుతూ ఉంది. 

13.  సాహిత్యం జీవితంలో మిమ్ములను కదిలించిన అనుభవం చెప్పండి.

            జీవితంలో సాహిత్యకారులుగా ఉంటూ ఎన్నో దుర్మార్గాలు చేసిన వాళ్లని చూశాను. దుర్మార్గంగా ఎందరినో ఉపయోగించుకుని ఎదిగిన వాళ్లను చూశాను. సాహిత్యకారులుగా ఉంటూనే సమాజానికి వ్యతిరేకంగా పని చేసే వాళ్ళని చూశాను. సాహిత్యం కోసమే జీవితాలను పణంగా పెట్టిన వాళ్లను చూసాను.

14.  రచయితలు ప్రజలకు చేరువ కావాలంటే ఏం  చేయాలి

రచయితలు ప్రజలకు చేరువ కావాలంటే మనం చెప్పేది వాళ్లకి చేరాలి. వాళ్లకి చేరింది వాళ్లు నమ్మాలంటే వాళ్ల సాధకబాధలలో మనము భాగస్వాములం కావాలి. వాళ్ళను గురించి రాసిన రచన వాళ్లే చదువుకోగలిగే శక్తి సామర్ధ్యాలు వాళ్లకి ఇవ్వాలి. అంటే మనం వాళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తూనే ఉండాలి. కార్యాచరణ అంతా వాళ్ళ మధ్యనే జరుగుతూ ఉండాలి. యువతరాన్ని కదిలించే కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండాలి.

15.  ఇప్పటి రచయితలకు మీరిచ్చే సూచన ఏమిటి?

రాయడానికి ప్రాధాన్యం ఇవ్వడం కంటే అధ్యయనానికి ప్రాధాన్యతనివ్వాలి. సాహిత్యంలో కూరుకుపోవడం కంటే మన కళ్ళ ముందే  కాలిపోతున్న బతుకుల్ని నిలబెట్టడానికి ప్రాధాన్యతనివ్వాలి. సాహిత్యం అంటే కేవలం ప్రవచనాలు కాదు కదా !చెప్పే వాళ్ళు చేయడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి .ఎక్కడో ఉండి లైకులు కొట్టే సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత నివ్వడం అవివేకమే అవుతుంది. కళ్లకు కనిపించే    మాయంతా నిజం కాదుకదా!ఎవరో ఎవరి కోసమో సృష్టించిన మాయలో మైమరిచి పడిపోవడం ఇప్పటి తరం దురదృష్టం.

16.  సమాజం పట్ల రచయితల బాధ్యత ఎలా ఉండాలంటారు?

ఇవాల్టి విద్యావ్యవస్థ పిల్లల్ని అంధకారంలోకి తీసుకెళ్లి వదిలేసే విధంగా ఉంది. సాహిత్యం ద్వారా, పుస్తక పఠనం ద్వారా పిల్లల్ని ఆలోచనలోకి తీసుకెళ్లాలనేదే సంకల్పం. దానికోసం ఏమైనా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. 

బాలసాహిత్యంలోకి వచ్చాను కాబట్టి పిల్లల కోసం కథలు కూడా రాస్తున్నాను. అలాగని మిగిలిన సాహిత్యాన్ని వదిలిపెట్టింది లేదు కథలు రాస్తున్నాను. ఒక నవల రాసే ప్రయత్నంలో ఉన్నాను.

ఇవాళ ఎవరైనా చేయాల్సింది ఒక్కటే పని. చదువు పేరుతో పిల్లల్ని నిరక్షరాస్యులుగా తయారు చేస్తున్నాము. ఈ తరం కోసం అందరం సమిష్టిగా కృషి చేసి వాళ్లను ఆలోచనా విధానం లో కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రచయితలుగా మన పైన ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. 

17. మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు?

నాకు నేనుగా ప్రశాంతంగా ఉండటానికి కారణం సంగీతం వినడమే. హిందుస్తానీ కర్ణాటక శాస్త్రీయ సంగీత మంచి సినిమా సంగీతం వినడం వల్ల ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఆ ప్రశాంతత నుంచి మనం ఏదైనా సాధించవచ్చు. 

18. ఇటీవల సాహిత్యకారులకు పర్యావరణ స్పృహ ఉండాలంటున్నారు.  మీరు ఏమంటారు?

మనం తీసుకునే ఆహారం ఇవాళ ఎంతో కలుషితమై పోయింది. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి .అంటే మనం తీసుకునే ఆహారంలోనే వ్యాధులు సంక్రమించే గుణాలున్నాయి. ఇది అందరం స్పృహలో ఉంచుకోవలసిన విషయం. అలాగే పర్యావరణ స్పృహ కూడా సాహిత్యకారులకుండాల్సిన మరో ప్రధాన లక్షణం. ఎందుకంటే అందరి కంటే మనం గొప్పగా ఆలోచిస్తాం కదా!

19.  చివరిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

సుదూర లక్ష్యాలుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టే ఆలోచనతో ఉన్నాము. చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు చేస్తూ పోతూ ఉండడమే జీవితం డబ్బు చాలా మంది దగ్గర  ఉంటుంది. అది పదిమందికి ఉపయోగపడే టట్టు చేయాలి నా దృష్టిలో అయితే చాలామంది పిల్లలు కోసం, చదువుల కోసం ఖర్చు చేస్తే ఆ డబ్బుకు ఎంతో విలువ వస్తుంది. ఈ అంశాన్ని  కూడా ప్రచారం చేయాలనే ఆలోచనతో ఉన్నాము. ఆ వైపుగానే ప్రయత్నాలు చేస్తున్నాము.  అలాగే  పిల్లలు నిరంతరం  ప్రయోగాలు చేసుకుంటూ నేర్చుకుంటూ ఎదగడానికి  ఒక విశాలమైన వేదికను కల కంటూ ముందుకు సాగుతుంటాము. మొత్తంగా దాశరధి అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగం కోసం, శ్రీ శ్రీ పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల కోసమే కాలాన్ని కరగ దీస్తూ కరిగి పోవాలన్నది నా ముందున్న లక్ష్యం.

 

ఈ ప్రపంచంలో హింస తప్ప మరే పాపమూ లేదు – వి ఆర్ విద్యార్ధి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు వి ఆర్ విద్యార్ధి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1        మీ బాల్యం గురించి చెప్పండి

మాది వరంగల్ సమీప గ్రామమైన గవిచర్ల. అది ఒక చారిత్రక గ్రామం. కాకతీయుల నాటిది.  మా ఊర్లో కాకతీయుల కాలంలో నిర్మించిన శివుని గుడి, పాంచాలరాయ ఆలయము, గుండ బ్రహ్మయ్య గుడులు ఉన్నాయి.  ఊరిని ఆనుకొని పడమర దిక్కున ఒక పెద్ద స్తంభం ఉండేది ఊరిని

ఊరికి పడమర దిక్కున  వెర్రి  గుట్ట, తూర్పున తొర్ర గుట్ట, దక్షిణాన న్యాల బోళ్ళు  ఉన్నాయి.  ఈశాన్యాన ఊరికి దూరంగా  ఆర్లకుంట వాగు  ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా నాలుగు ఐదు రకాల పండ్ల చెట్లతో తోటలు ఉండేవి. ఇవన్నీ చిన్నతనంలో నాలో ప్రకృతి పట్ల మక్కువ పెంచాయి.

నేను అక్టోబర్ 08, 1945 లో జన్మించాను.  మా నాన్న వేలూరి నర్సయ్య (నరసింహారావు), అమ్మ కమలమ్మ. నాకు ముగ్గురు తమ్ములు, ముగ్గురు చెల్లెళ్లు. మాది వ్యవసాయ కుటుంబం. నా చిన్నతనం చాల పేదరికంలో గడిచింది.

మా నాన్నకు హిందూస్తానీ సంగీతంలో మంచి ప్రవేశము ఉంది. ప్రఖ్యాత హిందుస్థానీ సంగీతజ్ఞులు పోలవరపు నారాయణరావుకు మా నాన్న శిష్యుడు.  ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు కానీ పేదరికం వలన ప్రోత్సహించేవారు లేక  కచేరీలు చేసేవాడు  కాదు.  తంబూర, వీణ,  ఫ్లూట్  మా నాన్న బాగా వాయించేవారు. విలక్షణమైన గాత్రము మా నాన్నది.  మా నాన్న తన 73వ ఏట హఠాత్తుగా గుండె సమస్యతో మరణించడం వల్ల ఆయన గాత్రాన్ని రికార్డు చేయలేకపోయాం.

నా చిన్నతనపు అరుదైన సంఘటనలు ఇప్పటికీ నాకు గుర్తున్నవి.  నా మూడేళ్ళ వయసులో తుమ్మ చెట్టు పై లంబాడా పిట్టల అరుపులు నన్ను ఆకర్షించాయి.  సుమారు నాలుగేళ్ల వయసులో ఇండియన్ ఆర్మీ మా ఊర్లో క్యాంపు వేసి ఊర్లో ఫ్లాగ్ మార్చ్  చేయడం జ్ఞాపకం ఉంది.  అదే వయసులో ఇండియన్ యుద్ధ విమానాలు మా ఊరి పై చక్కర్లు కొట్టడం గుర్తుంది.  అప్పటికే నిజాం చెర నుండి హైదరాబాదు రాజ్యం విముక్తం అయ్యిందని తర్వాత నాకు తెలిసింది

నా ఆరేళ్ళ వయసులో ఒక సాయంకాలం ముసురు పడుతున్నప్పుడు మా పెసర చేనులో నేను పెసర కాయ తెంపుకుంటేంటే  పక్కనే ఉన్న బాటపై (అది  వరంగల్ - నెక్కొండ రహదారి) సుమారు ఏడెనిమిది  అడుగుల ఎత్తున, బాగా గడ్డం మీసాలు పెరిగి, జుబ్బా లాంటిది  వేసుకొని, రెండు చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్తూ ఉంటే చూసి భయపడి పెసర చేనులో దాక్కున్నాను.  కొద్ది క్షణాల్లోనే ఆయన మాయమైనట్టు అనిపించింది. ఆ తరువాత ఎన్నో ఏళ్లకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో చూసినప్పుడు నేను ఆ రోజు చూసిన వ్యక్తి లో ఠాగూర్ పోలికలు కనిపించాయి ఠాగూర్ నేను పుట్టకముందే  మరణించారు.

 నా చిన్నతనంలో చాలా పెద్ద కరువు వచ్చింది. అందరూ పెసళ్ళు  గుడారాలు వేసుకొని తిని ఆకలి తీర్చుకుంటున్నారు.  సంపన్నులు గూడా  రోజు గడక, పెసర గుడాలు తినవలసి వచ్చింది.  నేను కూడా గుడాలు తినలేక ఉపవాసం ఉండేవాన్ని కొన్నిసార్లు.  అందువల్ల బాగా బలహీనపడి ఒకరోజు స్పృహ  కోల్పోయాను.  అప్పుడు మా నాన్న మా ఊరికి కొంత దూరంలో ఉన్నపంథిని  గ్రామంలో ఒక పెద్ద భూస్వామి దగ్గర వడ్లు నాగుకు  తేగలిగాడు. మా అమ్మ వడ్లు  దంచి బియ్యపన్నం వండి నాకు పెట్టింది.  అప్పుడు కోలుకున్నాను.

మా పూర్వీకులు ఒకరిద్దరు పండిత కవులున్నా, ఆ విషయం నాకు తెలియదు. అందుకే నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ ఒకరూ కవుల  గురించి పాఠం చెబుతూ కవులు అంటే తెలుసా అని క్లాసు పిల్లల్ని అడిగాడు.  అప్పుడు నేను ఉత్సాహంగా లేచి ‘తెలుసు సార్, మా భూమిని కౌలుకు ఇచ్చినం  కదా. అదే కౌలు అంటే’ అన్నాను.  అప్పుడు మా టీచర్ నవ్వి కవులు అంటే స్వయంగా కవిత్వం రాసే వాళ్ళని చెప్పారు. అప్పుడు నా ఆశ్చర్యానికి అంతే లేదు.  స్వయంగా ఎట్లా రాస్తారు అని ఎన్ని  ఎన్నో రోజులు ఆలోచించేవాడిని.  జవాబు దొరికేది కాదు.  ఆ తర్వాత నేను నా పదకొండు  సంవత్సరాల వయసులో ఆరవ తరగతి చదువుతున్నప్పుడు రాయడం ఆరంభించాను.  రికార్డైన మొదటి కవిత “సైనికుడా ఓ సైనికుడా’ అనేది. మా మేనత్త భర్త జయసేన సైన్యంలో పనిచేస్తూ సెలవులపై వచ్చినప్పుడు సైనిక జీవితం గురించి చెప్పడం విని ప్రభావితుడై ఆ కవిత రాశాను అనుకుంటున్నాను.

2        మీ బాల్య జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా చెబుతారా?

తప్పక చెప్పాల్సిన దొకటి ఉంది.  మా ఊరి పోలీస్ ‘పటేల్ లింగా రెడ్డి’ గారు.  ఆయన ఆయనకు ఊరంతా భయపడే వారు.  వారి కుమారుడే జస్టిస్ నర్సింహారెడ్డి గారు. వాళ్ళ బంగళాలో కొంత మంది పిల్లలం  చదువుకునే వాళ్ళం.  ఒకసారి కేశవ రెడ్డి గారి దివాన్ ఖానాలో నేను నేల మీద కూర్చున్నది చూసి వేగంగా దగ్గరికొచ్చి నా భుజాలు పట్టి లేపి కుర్చీలో కూర్చోబెట్టి ‘నాయనా నీ స్థానం ఇది. దుర్మార్గులైన మీ పాలివాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూశారు. మీ కుటుంబాన్ని కించపరుస్తూ ప్రవర్తించారు’ అన్నారు.  అప్పుడు నాకు ఏడుపొచ్చింది. లేచి వారికి నమస్కరించాను. ఇది  నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంతటి కఠినమైన పోలీస్ పటేల్ నన్ను అలా గౌరవించడం సాధారణ విషయం కాదు.  అప్పుడు నాకు కేశవరెడ్డి గారి మహోన్నత వ్యక్తిత్వం  తెలిసి వచ్చింది.

 

 3       మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.

ప్రాథమిక విద్య గవిచర్లలో,  హైస్కూల్ చదువు మా పక్క  గ్రామమైన సంగెంలో, ఆ తర్వాత హనుమకొండలోని ఆర్ట్స్ అండ్  సైన్స్ కళాశాలలో సైన్స్ గ్రూప్ తీసుకొని పి యు సి లో చేరి అర్ధాంతరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాను.  ఆ తర్వాత అంతా సాంకేతిక విద్య.  ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు రేడియో కమ్యూనికేషన్ లో రాడార్, ఆ తర్వాత ఇతర ప్రాంతాలలో మిస్సైల్స్ ఎయిర్క్రాఫ్ట్ రాడార్ల లో ట్రైనింగ్.  ఆ చదువు కొంత కఠినమైనదే.  సాహిత్యపు  చదువంతా సొంతంగా చదువుకున్నదే,  సాహితి మిత్రుల సాంగత్యం వల్లనే.

 

 4 మీరు సైన్యం లో చేరడానికి కారణం?

మా మేనత్త భర్త దేవరాజు జయసేన ఆర్మీ లోని ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో పని చేసేవారు. వారి సైనిక జీవితం గురించి అనేక విషయాలు చెప్పడం వల్ల సైన్యం అంటే ఇష్టం ఏర్పడ్డది.  అందువల్ల దేశభక్తి ఏర్పడ్డది.  అయితే సైన్యం లో చేరమని ప్రోత్సహించింది మాత్రం లింగాల  కేశవ రెడ్డి గారి పెద్ద కుమారుడు  రామచంద్రా రెడ్డి గారు.  ఆయన బాగా చదువుకున్నవారు.  ఆర్ఎస్ఎస్ కు చెందిన వాడు. వాజ్పేయి, అద్వానీ లాంటి వారితో సంబంధాలు ఉన్న వాడు. జన సంఘ్  సభ్యులు కూడా.  ఆయనే నన్ను, తన తమ్ముడు శేషారెడ్డి ని సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. అప్పుడు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేక చదువుని వదిలివేసి ఎయిర్ పోర్స్ లో చేరాను. నాతోబాటు శేషారెడ్డి కూడా చేరిపోయాడు

5 మీ సైనిక జీవితం గురించి చెబుతారా?

నేను 1964 అక్టోబర్ 19న ఎయిర్ఫోర్స్ లో చేరాను. 1965 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నాను. 1965 లో ట్రైనింగ్ ముగించుకొని నాలుగున్నర  రోజులు ఒక టీమును  వెంటేసుకుని యుద్ధభూమిలో అడుగుపెట్టాను.  నాలుగున్నర రోజులు సరి అయిన తిండిలేక ప్రయాణం చేసి ఒక ఉదయం పూట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు  మాకు ఇచ్చింది మంచినీళ్ళో, టీనోమ  బ్రేక్ ఫాస్ట్ నో  కాదు. ఒక తుపాకీ, కొన్ని రౌండ్లు! అవి  ఇచ్చి మమ్మల్ని ఎయిర్ ఫీల్డ్ గార్డ్  చేయడానికి పంపించారు.  అప్పుడు ట్రెంచీలో పొజిషన్ తీసుకొని శత్రువు ఏ వైపు నుండి వచ్చిన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.  అది ఒక విచిత్రమైన అనుభవం.  కొన్ని గంటల తర్వాత మాకు భోజనం, నీళ్లు అందాయి.  యుద్ధంలో ఆకలిదప్పులు, చివరికి ప్రాణాలు కూడా ముఖ్యం కాదు.  1971 యుద్ధంలో నాది గుర్తుండిపోయే పాత్ర.  శత్రు విమానాల్ని రాడార్లపై గుర్తించి డేటా మా కమాండర్ కి ఇవ్వడంలో నేను సక్సెస్ అయ్యాను.  మా టీం లో నేను ఒక్కడినే ఆ పని చేయగలిగాను. మిగతా వారి స్కోప్ లు జామ్ అయ్యాయి.  ఆ డాటా  వల్ల శత్రు విమానాలను షాట్ డౌన్ చేయగలిగాం.  ఆ శత్రు విమానాలు మా రాడార్  స్టేషన్ ను ధ్వంసం చేయడానికి వస్తున్నాయి.  మా డైరెక్టర్ మిగతా టీమ్ మెంబర్స్ నన్ను బాగా మెచ్చుకున్నారు.  మా ఇంచార్జ్ కీ మెడల్  కూడా వచ్చింది.  ఆ రోజు ఆ మిషన్ సక్సెస్ కావడం వల్ల ఈ రోజు నేను మీ ముందు ఉన్నాను.  యుద్ధంలో కమాండర్ తో పాటు అందరిదీ ముఖ్యమైన పాత్రే.

విమానాల తోపాటు కమ్యూనికేషన్స్ కి సంబంధించిన అన్ని విభాగాల్లో పని చేశాను. అంతేకాదు దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగే అవకాశం లభించింది.  అన్ని భాషా సంస్కృతులకు చెందిన వారితో కలిసి జీవించే అవకాశం లభించింది.  సైనిక జీవితంలో మాకు  కులాలు మతాలు ప్రాంతాలు లేవు.  మా అందరిదీ  సైనిక కులం. భారత ప్రాంతం. నిజానికి సైనిక జీవితంలో  అనేక అనుభవాలు, అనుభూతులు నన్ను కవిగా సంపన్నుడని చేసాయి.

 నా జీవితంలో సైనికుడిగా నేను గడిచిన కాలం విశిష్టమైంది. సక్రియాత్మక మైనది. యుద్ధంలో ఎంతో కవిత్వం రాశాను.  సైనికుడిగా యుద్ధంలో ఎంతో  ఉద్విగ్నతకు లోనవుతాం.  భయం ఓటమిని ఆహ్వానిస్తుంది.  ధైర్యము గెలుపుని కౌగిలించుకుంది.  అయితే కవిగా నేను యుద్ధ వ్యతిరేకిని.   అందుకే “వద్దు వద్దు యుద్ధమని విలపించన వాడేవ్వడు? యుద్ధం కోసం నిధులను  కూర్చునన్న వాడేవ్వడు?” అన్నాను. ఈ ప్రశ్న యావత్ ప్రపంచానికి వేస్తాను.  మానవకోటికి వేస్తాను.

6        మీ కవితా ప్రస్థానం గురించి చెప్పండి

ఇంతకుముందే చెప్పినట్లు నేను నా 11 12 ఏళ్ల వయసులో కవిత్వాన్ని రికార్డు చేశాను.  ఆ తర్వాత అడపాదడపా రాస్తుండే వాడిని.  1966లో నేను బరోడా లో ఉన్నాను. మఖరపురా  ప్యాలెస్ లో ఉండేవాళ్ళం. ఒక రాత్రి కలలో ఒక స్త్రీ వచ్చి నాకు కవిత్వం డిక్టేట్ చేసింది. ఆమె సరస్వతీదేవి కాదు సుమా).  తెల్లవారి నుండి కవితల మీద కవితలు రాయడం ప్రారంభించాను.  ఆమె ఎవరో తెలియదు గానీ కొన్ని రోజుల తర్వాత ఆ రూపం ఒక కూలీ పని చేసే స్త్రీ ని పోలి ఉంది. ఆమె గుజరాతి స్త్రీ.  రాసిన కవితల్లో 18 కాళోజీ గారికి పంపించగా అందులో మూడు కవితల్ని మిత్రమండలి లో స్వయంగా వినిపించారు. మంచి స్పందన వచ్చిందని కాళోజీ గారు ఉత్తరం రాశారు. అప్పటి నుండి క్రమం తప్పకుండా మిత్రమండలికి  కవితలు పంపేవాడిని.  వాటిని కన్వీనర్లు నాగిళ్ల రామశాస్త్రి, జీడి, సంధ్య  రంగారావు ఇంకా ఎవరు కన్వీనర్ గా  ఉంటే వాళ్లు  చదివి వినిపించే వాళ్ళు.  అందుకే మిత్రమండలి నా మాతృ వేదిక అని  సగర్వంగా చెప్పుకుంటాను.  ఎయిర్ పోర్స్ లో ఉండగా నేను బెంగళూర్, ఖరగ్ పూర్ తెలుగు కవి సభల్లో కవిత్వం వినిపించాను.  ఉత్తర భారతదేశంలో ఇతర భాషా కవులతో కవితా చర్చ చేసేవాడిని.  కవిత్వం వినేవాడిని, వినిపించే వాడిని. తొలిసారి ఎయిర్ఫోర్స్ లో విమానయానం చేసినప్పుడు పైలెట్ పక్కన కూర్చుని మంచి కవితనల్లాను.  నా అపరిచితులు అనే కవితను పటాన్ కోట్ లో విరామసమయంలో విమానం రెక్కల కింద కూర్చొని రాశాను. హిమాలయాల్లో తిడుతూ ప్రేమలేఖ, స్మరణ మందిరం లాంటి కవితలకు పునాది వేసాను.  హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు రాసిన కవితలు ఎన్నో.

7         మీరు విప్లవాలకు కేంద్ర బిందువైన ఓరుగల్లుకు చెందిన కవి గదా!  అట్లాంటి మీరు మీ స్వంత మార్గంలో రాసి కాళోజీ చేత “వాడి కవిత్వం అలగ్” అని ఎలా అనిపించుకోగాలిగారు?

కాలానికి ఎప్పుడూ ఏది అవసరమో అది జరుగుతుంది.  విప్లవం అవసరమైనప్పుడు అట్లాంటి సాహిత్యమే ఉద్భవిస్తుంది.  అట్లాంటి రచనలు చేయడానికి ఎందఱో అంకితమయ్యారు.   వారికీ నమస్కారం.  నేను మొదటి నుండి మానవ జాతి రుగ్మతల గురించి ఆలోచిస్తూ వస్తున్నాను.  మానవ వికాసంలో తప్పిన బాటల గురించి  ఆలోచిస్తున్నాను.  మనిషి శాంతిమయ జీవితాన్ని గడపలేక పోవడం గురించి చింతిస్తున్నాను.  ఈ ప్రపంచంలో హింస తప్ప మరే పాపమూ లేదనే అభిప్రాయానికి వచ్చినవాన్ని.  స్వార్ధానికి మూలమేమిటని శోధిస్తున్న వాడిని.  ఆ ఆలోచనలే కవితల రూపంలో వచ్చాయి.  అంతే!

8        మీ సాహితీ మిత్రుల గురించి, మీకు సంబంధం ఉన్న సాహితీ సంస్థల గురించి వివరిస్తారా?

సాహితీ ప్రపంచంలో నాకెంతో మంది మిత్రులున్నారు.   ఎవరి పేరు చెప్పను?  కాళోజీ సోదరుల ఆశీర్వచనాలతో నేను సాహితీ రంగంలో నిలిచాననుకుంటున్నాను.  వేనరెడ్డి, వరవర రావు, అంపశయ్య నవీన్, కోవెల సుప్రసన్న, లోచన్, సి వి కృష్ణా రావు, అనుముల కృష్ణమూర్తి  లాంటి సాహితీ వేత్తల సాంగత్యం నాకు స్పూర్తినిచ్చింది.  ఇక సాహితీ సంస్థలంటారా? మిత్రమండలి, హన్మకొండ నా మాతృ వేదిక.   హైదరాబాద్, నల్గొండ కు చెందినా జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక గూడా నాకు ప్రధానమైన వేదిక.  వరంగల్ లోని పోతన విజ్ఞాన పీఠంలో నేను ఏడూ సంవత్సరాలు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాను.   అప్పుడు దాని కార్యదర్శి సుప్రసిద్ధ సాహితీ వేత్త ఆచార్య సుప్రసన్న గారు.  ఇంకా సృజనలోకం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం మొదడ్లగు సంస్థల వ్యవస్థాపకుల్లో ఒకడిని.  మిత్రమండలికి  గత పుష్కర కాలంగా కన్వీనర్ ని.  దీని మొదటి కన్వీనర్ వరవర రావు గారు.  రెండో కన్వీనర్ అంపశయ్య నవీన్ గారు.  కాళోజీ సోదరులు  మరో ముగ్గురు మిత్రులతో  కలిసి ఈ వేదికను 1957 లో స్థాపించారు.  దీనికి గతంలో నాగిళ్ళ రామశాస్త్రి గారు, సంధ్య రంగారావు గారు, జి డి  మొదలగువారు కన్వీనర్లు. కాళోజీ  ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శిని.

9.        అమెరికాకు అనేకసార్లు వెళ్లివచ్చారు గదా.  అక్కడ ఏమైనా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారా?

నాకు అమెరికాలో చాలా మంది సాహితీ మిత్రులున్నారు.  విన్నకోట రవిశంకర్ నాకు చాలా సన్నిహిత మిత్రులు. అయన నాకు  పెమ్మరాజు వేణుగోపాలరావు, వేలూరి వెంకటేశ్వరరావు, వెల్చేరు నారాయణరావు లాంటి సుప్రసిద్ధ సాహితీ వేత్తలను పరిచయం చేయడం జరిగింది.  ఇంకా అనేకులున్నారు. జంపాల చౌదరిగారు, డా క్రిష్ణ, అమర్ వేలూరి పరిచయం.  అక్కడ చాలా చోట్ల సభలు నిర్వహించి నా చేత ఉపన్యసలిప్పించారు.  కవితాగానం చేయించారు.  అమెరికాలో నేను చాలా కవిత్వం రాసాను.  వాటితో  రెండూ సంపుటాలు ప్రచురింపబడ్డాయి.  2005లో డెట్రాయిట్ లో నా ‘మంచు మైదానం ‘ కావ్యం ఆవిష్కరింపబడింది.  ఆ సభను సత్యనారాయణ రెడ్డి కర్ర, సుధాకర్ జి రెడ్డి  మరికొందరు  మిచిగాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు నిర్వహించారు.  2001 లో తానా సభలో నా సంపాదకత్వంలో వచ్చిన ‘దిక్కులు’ వీడియో కవితా సంకలనం ఆవిష్కరింపబడింది.

10.      మీ కవిత్వం ఇతర భాషల్లో వచ్చిందా?

అవును.  ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో నా కవితా సంపుటాలు వచ్చాయి.  ఇంగ్లీష్ లోకి డా. యన్ యస్ రాహుల్, హిందీ లోకి డా యం  రంగయ్య , ఉర్దూ లోకి డా. ఖుత్బ్ సర్ షార్  అనువదించారు. మలయాళం లోకి యల్ ఆర్ స్వామి అనువదిస్తానన్నారు.  కానీ ఆ పని పూర్తి కాలేదు.  ఉర్దూలో ప్రఖ్యాత సాహిత్య పత్రిక షాయర్ నా ముఖ చిత్రంతో  ప్రత్యేక సంచిక తెచ్చింది.   ఇతర భాషా కవుల గురించి ప్రత్యేక సంచిక  తేవడం అదే మొదటిసారట.  2012 లో ప్రఖ్యాత ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్, కవి, చిత్రకారులు బి నర్సింగరావు గారు పూనుకుని నా కవితా సర్వస్వాన్నీ అదీ 1966 నుండి 2011 వరకు ప్రచురింపబడ్డ నా కవిత్వాన్ని ప్రచురించారు.  నా కవిత్వ సమాలోచన జరిపించి అద్దంలో విద్యార్ధి  అనే వ్యాస సంపుటిని ప్రచురించారు.   దీని సంపాదకులుగా కె జితేంద్ర బాబు, అమ్మంగి వేణుగోపాల్, వేణు సంకోజు వ్యవహరించారు.  ఇవి గాకుండా నా గురించి పాలపిట్ట ప్రత్యేక సంచిక నా ముఖ చిత్రంతో వచ్చింది(20 19లో).  నా కవిత్వం గురించి నియోగి ‘ప్రేరణ’ అనే విమర్శనా గ్రంధం రాసారు.  డా పాతూరి రఘు రామయ్య ‘ఇలకు కలకు మధ్య’ అనే శతాధిక కవితల పుస్తకం రాసారు.  ఈ రెండూ ప్రచురింపబడినవి.

11.       ప్రచురింపబడిన మీ ఆరు కవిత సంపుటాలుగాక ఇంకా రావాల్సిన కవిత్వముందా? కథలు వ్రాసారా?

ఇంతవరకు అలలు (1987), పలకరింత (1996), ఘర్మ సముద్రం (2004), మంచు మైదానం(2005), ఖండాంతర(2007), ఇతర కవితలు (2012) ప్రచురితమైనవి.  ఇవిగాక అచ్చు గాని కవితలు చాలా ఉన్నవి.  నోట్ బుక్ ఆఫ్ వి ఆర్ విద్యార్ధి అనే పుస్తకం గూడ అచ్చు కావల్సి ఉన్నది.  మొదట్లో కొన్ని కథలు రాసాను గానీ కవిత్వంపైనే ఎక్కువ దృష్టి పెట్టాను.  వ్యాసాలు మాత్రం రాస్తుంటాను. 

12.      జిడ్డు కృష్ణమూర్తి గారితో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారా? ఏ విషయం ఫై చర్చ జరిగింది?

1970 జనవరి 5 న ఇంటర్వ్యూ జరిగింది.అప్పుడు నా వయసు ఇరవై నాలుగేళ్ళు.  ఆ రోజుకు ముందు వరం రోజులుగా మద్రాస్ లో ఉండి వారి ఉపన్యాసాలు విన్నాను.  తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ దొరికింది.  అప్పుడు అనేక విషయాలు చర్చలోకొచ్చాయి. ముఖ్యంగా యుద్ధం శాంతి గురించి, కవిత్వం గురించి గూడా.

13.        వేలూరి రాములు “వి ఆర్ విద్యార్ధి “ ఎలా అయ్యారు?

విద్యార్ధి కి మతం, కులం, ప్రాంతం ఉండవు.  నిరంతరం నేర్చుకుంటూ పోవడమే విద్యార్ధి పని.  “ఇక నేర్చుకునేదేమీ లేదు.  అంతా నాకు తెలుసు “ అని నేను అనుకోకుండా ఉండడానికి వేలూరి రాములు విద్యార్ధి అయ్యారు.  ఐతే ఈ విద్యార్ధికి మాత్రం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదనే చెప్పాలి!

14.       ఇప్పుడు వస్తున్న తెలుగు సాహిత్యాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ?

తెలుగులో రాసేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది.  ఐతే ఇప్పుడొస్తున్న సాహిత్యంలో బలం లేదు.  ఒక కాజ్  ల్ప్సం అంకితమైన కవులు, రచయితలు చాలా తక్కువయ్యారు.  సాహిత్యంలో కెరీరిజం పెరిగింది.  పత్రికల కోసం రాస్తున్నవారు ఎక్కువయ్యారు.  అవార్డులు తెచ్చుకోవడం కోసం, పాపులారిటీ కోసం రాస్తున్నారు.  ఇప్పటి కవుల్లో రచయితల్లో చాల మందికి అధ్యయనం లోపించింది.

15.  వరంగల్ సాహిత్య వాతావరణం ఎలా ఉంది?

చాలామంది రాస్తున్నారు.  అందుకు సంతోషం.  గతంతో పోల్చుకుంటే మాత్రం అసంతృప్తిగా ఉంది.  వరంగల్ తెలుగు సాహిత్య రాజధాని అనే విషయం ఈ తరం మరిచిపోవద్దు.  వరంగల్ పాల్కూరికి సోమన, బమ్మెర పోతన, కాళన్నల మాతృభూమి.  పి వి నరసింహారావు, సంపత్కుమార, సుప్రసన్న, వరవరరావు, అంపశయ్య నవీన్, అనుముల కృష్ణమూర్తి లాంటి ఉద్దండులకు అనుజులమనే స్పృహలో ఉండాలి.  ఆ స్పృహలో రచనలు చేయాలి.  విలువల కోసం నిలబడ్డది వరంగల్.  ఏ ఉద్యమమైనా  అది తాత్విక పరమైనదయినా, సామాజికపరమయినదయినా ఇక్కడే ఆరంభవమవుతుంది.  తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి సారిగా రచయితల ఐక్యవేదిక ఏర్పడ్డది వరంగల్ లోనే గదా!  ఈ తరం రచయితలు కొత్తగా చూడాలి.  ఆలోచించాలి.  రాయాలి.  కానీ మనం ఎవరికీ వారసులమో గుర్తుంచుకుని సాగాలి.

16.  వి ఆర్ విద్యార్ధి కవిత్వాన్ని సమాలోచన చేస్తూ స్ప్రసిద్దులు కొందరు వి ఆర్  విద్యార్ధిని స్థానిక విశ్వ మానవుడు, శుద్దమానవుడు, దార్శనికుడు, తాత్వికుడు, ఖండాంతర కవి,  గ్లోబల్ పోయెట్, ప్రపంచ కవి – ఇలా ఎన్నో కితాబులిచ్చారు.  ఇందుకు మీరెలా స్పందిస్తారు?

అట్లా అభిప్రాయపడడం ఆ సాహితీ వేత్తల ఔన్నత్యం.  వారికీ వినమ్రంగా శిరసు వంచి నమస్కరిస్తాను.  నా గురించి నేను ఎప్పుడూ అంచనా వేసుకోలేదు.  అందుకు సాహసించను  కూడా.

17   మీ కుటుంబం గురించి చెప్పనే లేదు ?

నా సహచరి పేరు రత్నమాల. జీవితంలో నా కష్ట సుఖాల్ని సమంగా  పంచుకున్నది.  ఆరోగ్యకరమైన మనస్తత్వం ఆమెది.  ఉన్నదాంట్లో తృప్తి పడుతుంది.  మాకు ఇద్దరు కుమారులు.  అమరేంద్ర, శైలేంద్ర.  అమరేంద్ర సహచరి ప్రణతి.  వాళ్ళకు ఇద్దరు కూతుళ్ళు.  శైలేంద్ర సహచరి కార్తి.  వాళ్ళకు ఇద్దరు కొడుకులు.   అమరేంద్ర పెద్ద కూతురు ఇంగ్లీష్ లో చిన్న వ్యాసాలు వ్రాసింది. రెండో కూతురు కథక్ డాన్సర్, హిందూస్థానీలో పాడుతుంది.   శైలేంద్ర పెద్దబ్బాయి వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ముఖ్యంగా పియానోలో బాగా ప్రవేశమున్నవాడు. కంపోజింగ్ చేస్తుంటాడు.  అమరేంద్ర ఇంగ్లీష్ లో తెలుగు రచనలు చేస్తుంటాడు. శైలేంద్రకు విమర్శనా రంగంలో ప్రవేశమున్నది.

18.  మీ ఆలోచన మార్గాన్ని తెలిపే కవితలను ప్రస్తావిస్తారా?

ఎన్నో ఉన్నవి.  అపరిచితులు, అమాయకం, యుద్ద శాంతి, హింసమత్తు, పునాది, ఒకడూ –ఇంకొకడూ,  పక్షి - ఇలా ఎన్నో...

19.  చివరిగా  ఒక ప్రశ్న – మీరు జీవితంలో  తెలుసికున్నదేమిటి?  ఈ తరానికి మీరిచ్చే సందేశం ఏమిటి?

ఈ ప్రపంచంలో హింస తప్ప మరే పాపమూ లేదని తెలుసుకున్నాను.  హింస రక్తపాతమే కాదు, అనేక విధాలుగా ఉంటుంది.  హింసకు మూలం మనిషిలో అస్పష్టత, అభద్రతాభావం.  వాటివల్లా స్వార్ధం పెరుగుతుంది.  స్వార్ధం అహంభావాన్ని పెంచుతుంది. 

ఇక సందేశామంటారా – ఎవరూ ఎవరికీ సందేశమివ్వలేరు!  ఎవరికీ వారు తమ మార్గాన్ని వెతుక్కోవడమే!  మనిషిలో స్పష్టత ఉన్నప్పుడు జీవితంలో మనకేమి కావాలో తెలిసినప్పుడు జీవితం సుఖంగా, శాంతియుతంగా సాగిపోతుంది.  అంతే..  

ఉత్తమ సాహిత్యమెప్పుడూ మనిషిని ఆరోగ్యవంతం  చేసే ఉత్తమ ఔషదమే-  రామా చంద్రమౌళి

ప్రసిద్ధ కవీ, కథా రచయితా, నవలాకారులు, విమర్శకులూ ఆచార్య రామా చంద్రమౌళి గారు గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు  ఇచ్చిన ఇంటర్వ్యూ                                                                     

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.   

      నేను వరంగల్లులో పుట్టి, పెరిగి చదువుకుని ఎదిగి.. ఎక్కువకాలం వరంగల్లులోనే ఉద్యోగించి.. ఇప్పుడు పదవీ విరమాణానంతరం వరంగల్లులోనే చరమజీవితాన్ని గడుపుతున్నవాణ్ణి. నా జన్మదినం 8 జూలై, 1950. అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న కనకయ్య. నిజాం కాలంలో వరంగల్లు నగరంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా విలసిల్లిన     'ఆజం-జాహి మిల్స్' లో కప్డా కాతాలో మొకద్దమా( సూపర్వైజర్ ) గా మా నాన్న పనిచేసేవాడు. అమ్మ బీడీలు చేసేది. చాలా పెద్ద కుటుంబం మాది. మేము ఆర్గురం అన్నదమ్ములం ముగ్గురు అక్కాచెల్లెల్లు. నేను పెద్దవాణ్ణి. చదువు అందరికీ అందుబాటులో లేదప్పుడు. నాల్గవ తరగతి వరకు ఒక వీధి పంతులు.. రాజయ్య సార్ అని.. పుణ్యాత్ముడు ఆశువుగా చెప్పిన పాఠాలు. నాల్గవ తరగతి ఐపోయిందంటే.. ఒక ప్రవేశ పరీక్ష రాసి వరంగల్లు నగరంలో ప్రముఖమైన 'మహబూబియా ఉన్నత పాఠశాల' లో ఆరవ తరగతిలో చేరిన. అదొక గొప్ప మహానుభూతి. ప్రసిద్ధ విద్యావేత్త బజారు హనుమంతరావు గారు మా ప్రధానోపాధ్యాయులు. నా విద్య, జ్ఞాన సముపార్జనకు పాఠశాలే పునాది. కాళోజీ గారి గురువు శ్రీ గార్లపాటి రాఘవరెడ్ది గారుకూడా మా పాఠశాలలో తెలుగు టీచర్ గా బోధన చేస్తూండేవారు. గంధపు చెక్కతో సంపర్కంవల్ల ఒట్టి కర్రముక్కకు కూడా కొంత అవశేష పరిమళం అబ్బినట్టు బహుశా మహనీయుని శిష్యరికంవల్ల కావచ్చు సాహిత్యం వైపు నా మనసు మళ్ళింది. మా తరగతికి హెచ్ ఎస్ సి వరకు నేనే క్లాస్ మానిటర్ గా ఉండేవాణ్ణి. అప్పుడు ప్రతి తరగతికి ఒక చిన్న గ్రంథాలయం ఉండేది కనీసం ఒక వంద పుస్తకాలతో. దాని నిర్వహణను నేనే చేయాలె. అందువల్ల ఒకటొకటిగా ఎన్నో పుస్తకాలను చదివే భాగ్యం కలిగింది నాకు.      

            హెచ్ ఎస్ సి తర్వాత పాలిటెక్నిక్. మెకానికల్ ఇంజనీరింగ్. అప్పుడు చదువే ఎంతో గొప్పది. తర్వాత కొంత కాలం ' భిలాయ్ స్టీల్ ప్లాంట్, మధ్యప్రదేశ్ ' లో 'చార్జ్ మ్యాన్ ' గా ఉద్యోగం. ఒక యేడాది తర్వాత  రాష్ట్రేతర ఉద్యోగులను తొలగించాలని అప్పుడు అక్కడ చెలరేగిన ఒక ఉద్యమం వల్ల ఉద్యోగం పోయింది. ఉన్నత పాఠశాలలో ప్రసిద్ధ రచయిత, కమ్యూనిస్ట్ మేధావి మన పూర్వ ప్రధానమంత్రి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు గారి సోదరులు శ్రీ పాములపర్తి సదాశివరావు పెద్ద కొడుకు శ్రీ నిరంజనరావు నాకు ఆరవ తరగతి నుండి హెచ్ ఎస్ సి వరకు, తర్వాత పాలిటెక్నిక్ లో కూడా సహపాఠి. నిరంజన్ రావు ద్వారా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పి వి నరసింహారావుగారి అనుగ్రహంవల్ల ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖలో నిర్వహించబడే పాలిటెక్నిక్, వరంగల్లు లో 'డిమాన్స్ట్రేటర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్' గా ఉద్యోగం 23-02-1970 . ఇక అక్కడినుండి జీవన పోరాటం మొదలు. చదువు అనేది అస్సలే అందుబాటులో లేని దైవ దినుసు. పైగా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలె. ఉద్యమాలు చేసి.. వరంగల్లు లో ఉన్న ' రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ' పార్ట్ టైం మొదటిబ్యాచ్ లో ఎంట్రన్స్ మొదటి ర్యాంక్ సాధించి.. బి టెక్ .. తర్వాత హైదరాబాద్ జె ఎన్ టి యు నుండి మొదటి బ్యాచ్ లో ఎం.ఎస్ డిగ్రీ. చివరికి పాలిటెక్నిక్ కాలేజ్ లో ' ప్రిన్స్పాల్ ( ఎఫ్ సి ) గా పదవీ విరమణ 31-01-2006 . అప్పటికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ గా పురస్కారాలు.. ఎన్నో ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలు రాయడం .. వేల వేల విద్యార్థులను తయ్యార్ చేయడం.. 2006 నుండి 2018 వరకు వరంగల్లు మహా నగరంలో వాగ్దేవి గ్రూప్ విద్యాసంస్థలలో ఒకటైన 'గణపతి ఇంజనీరింగ్ కాలేజ్' లో ప్రొఫెసర్ మరియు వైస్-ప్రిన్స్పాల్గా ఉద్యోగం చేయడం.. ఇదంతా నాకు అత్యంత ఇష్టమైన ఒక ఎడతెగని అధ్యాపక వ్యాపకం. మొత్తం కలిపి 50 సంవత్సరాల బోధనా వృత్తి.. తద్వారా మిగిలింది జన్మ సార్థకమైందన్న అనంతమైన తృప్తి.  

     నా మొట్టమొదటి రచన నేను తొమ్మిదవ తరగతిలో ఉండగా ' చందమామ ' పిల్లల మాసపత్రికలో వచ్చింది. దాని పేరు ' సువర్ణ శతదళ పుష్ప రహస్యం '. మహబూబియా పాఠశాలలోనే రాఘవరెడ్డి గారి వల్ల ఒకసారి కాళోజీ గారి మొదటి కవిత్వ సంపుటి 'నా గొడవ'ను మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించడం.. సభలో నెక్కర్లు తొడుక్కునే వయసులో మేమందరం పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో పాల్గొనడం.. అవన్నీ అద్భుతమైన మరుపురాని మధుర జ్ఞాపకాలు

2.         మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి 

            మహబూబియా ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుకుంటున్నపుడు సంవత్సర పరీక్షలు జరిగిన తర్వాత మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ బజారు హనుమంతరావు గారు సంవత్సరం పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి పేర్లను తానే స్వయంగా క్లాస్ క్లాస్కు వచ్చి ఒక్కొక్కరి పేరును గంభీరంగా చదివి వినిపించేవారు. అప్పుడు పిల్లల తండ్రులు క్లాస్ గది బయట ఎంతో ఉత్కంఠతో నిలబడి తన పిల్లవాని పేరు ఎప్పుడొస్తుందా అని గుండెలను అరచేతిలో పెట్టుకుని వినేవారు. విద్యార్థుల పరిస్థితైతే 'దేవుడా దేవుడా' నే. అప్పుడు 'డెటెన్షన్' విధానం ఉండేది. పేరు రాకుంటే 'ఫెయిల్' అని అర్థం. వాడిక అదే తరగతిని మళ్ళీ చదవాలన్నమాట. మా నాన్న తనూ, తన ఇద్దరు మిత్రులతో సహా వచ్చి.. చూడు మా వాని ఘనత అన్నట్టు వెనుక నిలబడి ఉన్నాడు. నాది ఐదవ పేరుగా చదివారు హనుమంతరావుగారు. ఇక సముద్రం పొంగింది నాలో. పట్టపగ్గాల్లేని ఆనందం. ఆరోజు విజయానికి చిహ్నంగా నాయిన నాకూ నాన్న మిత్రులందరికీ అప్పటి వరంగల్లో ప్రతిష్టాత్మకమైన ' రామా విలాస్' లో రవ్వా దోశ తినిపించి కానుకగా నాకు ఉత్పల సత్యనారాయణాచార్యులు రచించిన 'బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల మహాభారతం, బాలల బొమ్మల భాగవతం' కొనిచ్చారు. అంతే.. రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా.. ఎప్పుడెప్పుడు పుస్తకాలనూ. అక్షరాల అమృతపరిమళాలను ఆఘ్రాణిస్తానా అనే ఉత్కంఠ. పుస్తకాలు నా జీవితంలో మొట్టమొదట నాలో సాహిత్యం పట్ల ఇక ఏనాడూ వాడని ఒక మహానుబంధాన్ని ఏర్పర్చాయి. ప్రధానంగా 'మహాభారతం' ఒక భాషకందని ఆనందోద్వేగాలను నాలో స్థిరపర్చింది.           

              ఇప్పటికీ 'మహాభారతం' అనే భారతీయుల వ్యాస విరచిత మహాగ్రంథం నన్ను వివిధ దశల్లో ఆశ్చర్య చకితుణ్ణి చేస్తూనే ఉంది. బృహత్ నిర్మాణం, పాత్రల సృష్టి, నడక, ప్రతి పాత్ర వెనుక ఉన్న శ్రేష్టత, తాత్వికత, రాజనీతి సూత్రాలు, దాని ఔన్నత్యం ఇవన్నీ నన్ను గర్వపరుస్తూనే ఉన్నాయి. మొన్న మొన్న టి టి డి వాళ్ళు 15 సంపుటాలుగా ప్రచురించి వెలువరించిన నన్నయభట్టు ( కవిత్రయం ) రాసి వెలువరించిన నిజ మదాంధ్ర మహా భారతంను చదివాను.. ఉద్ధందుల వ్యాఖ్యా వివరణలతో. సమగ్ర కృతిని చదివిన తర్వాత ప్రపంచ సాహిత్యంలో భారతీయుల 'మహాభారతాన్ని' మించిన మహాద్భుత బృహత్ రచన మరొకటి లేదు అని బోధపడింది. బహుశా నేను వివిధ రచయితలతో రాయబడి వ్యాఖ్యానించబడ్డ పదిపదిహేను మహా భారతాలను చదివి ఉంటాను. ఐతే కథ, కథనం, పాత్రల సృష్టి.. చదరంగంలో పావులను ప్రజ్ఞతో కదుపుతున్నట్టు.. అబ్బో.. చదివిన ప్రతిసారీ అమృతపానమే. నన్ను పూర్తిగా ఆక్రమించి నన్ను రచయితగా, కవిగా, నవలాకారునిగా.. అన్నింటిని మించి సాహిత్య పఠితగా పరివర్తింపజేసిన మహాగ్రంథం ఒక్క 'మహాభారతమే'. మహాభారతం.. అనబడే ఒక అక్షరనిధి పుట్టిన పుణ్యభూమిలో నేను కూడా పుట్టినందుకే అనుక్షణం పులకించి పోతూంటాను. ఇక అక్కడినుండి నేను అక్షర సవ్యసాచిగా మారి తొమ్మిదవ తరగతినుండే రచయితగా శరపరంపరగా విస్తరిస్తూ పోయాను. చందమామ, బాలమిత్ర లతో మొదలుకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు వాళ్ళ ప్రామాణిక మాసపత్రిక 'భారతి' లో నా రచనలు ఒక ఝరిలా వచ్చే స్థాయికి ఎదిగి వెలిగాను. విజ్ఞులు 'బాలమిత్ర టు భారతి' రచయిత అని శ్లాఘించేవారు.      

            ఎదుగుతున్నకొద్దీ నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు.. కవిగా  ఒకే ఒక్కడు.. కాళోజీ, కథా రచయితగా.. రాచకొండ విశ్వనాథశాస్త్రి, డి.జయకాంతన్. ఒక  నవలాకారునిగా..నన్ను నేనే నిర్మించుకున్నా. నాపై ఎవరి ప్రభావమూ లేదు. విస్తృతంగా చదవడం, భారతీయ తెలుగేతర రచయితలనూ, కవులనూ అధ్యయనం చేయడం, అంతర్జాతీయ పోకడలను ఆకళింపు చేసుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను నేను ఉన్నతీకరించుకోవడం.. ఎప్పటికైనా నాదైన ఒక 'స్వంత గొంతు' ను సృష్టించుకోవడానికి కృషి చేస్తూండడం.. అనే దిశలో సాగినవాణ్ణి నేను. వృత్తి రీత్యా ఒక ఇంజనీర్నైన నేను తెలుగు భాషకు సంబంధించిన సంస్థలతోనూ సంబంధాన్ని కలిగిఉండే అవకాశం నాకు కలుగలేదు.       

            ఇక సంస్థలు.. సినిమా ఇండస్ట్రీ లో పనిచేయడం వల్ల అప్పుడు ఒకే ఒక సాహిత్య సంస్థగా ఒక వెలుగు వెలిగిన 'అభ్యుదయ రచయితల సంఘం' తో అనుబంధంగా ఉండేవాణ్ణి. వరంగల్లులో నేను ప్రధాన కార్యదర్శిగా, ఆచార్య పేర్వారం జగన్నాధం అధ్యక్షులుగా 'అభ్యుదయ రచయితల సంఘం కొన్నేళ్ళు పని చేసింది. ఒక సంవత్సరం చాలా భారీ ఎత్తున 'ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియం' లో సి. నారాయణరెడ్డి, గుమ్మడి, డా. ఆవంత్స సోమసుందర్ లతో సాహిత్య సభ, తర్వాత్తర్వాత గుంటూరు శేషేంద్రశర్మతో ఒకసారి భారీ సభలు ఏర్పాటు చేశాము. అప్పుడే 1971 లో నా మొదటి కవితా సంపుటి 'దీపశిఖ' వెలువడింది. ఇక పత్రికలు.. నా కథలు, కవితలు, నవలలు ప్రచురించని తెలుగు పత్రిక లేదు. 1970 నుండి 90 వరకు తెలుగు పత్రికా సాహిత్యానికి స్వర్ణయుగం. ప్రతి దీపావళికి ఐదారు ప్రత్యేక సంచికలు వెలువడేవి. వాటిలో తన కథో, కవితో రావడం ఒక రచయితకు ప్రత్యేక గుర్తింపుగా భావించబడేది. ఐతే.. అన్ని సంచికల్లోనూ తప్పనిసరిగా నా రచన ఉండేది. మహిళా రచయిత్రులు విజృంభించి ఒక వెలుగు వెలిగిన దశాబ్దాలు అవి. సాహిత్యానికీ, సినిమాలకూ ప్రధాన కేంద్రం 'విజయవాడ' అప్పుడు.  

            తుర్లపాటి కుటుంబరావు ( ఆంధ్రజ్యోతి ) , కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం ( ఆంధ్రప్రభ ), మద్దుకూరి చంద్రశేఖరరావు ( ప్రగతి ), శివలెంక రాధాకృష్ణ ( ఆంధ్రపత్రిక ).. వీళ్లు అప్పటి ఉన్నతస్థాయి పాత్రికేయ మిత్రులు నాకు. స్థానికంగా అప్పటి నా సన్నిహితులు శ్రీ సుప్రసన్న, డా. అంపశయ్య నవీన్, ఆచార్య మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, అనుమాండ్ల భూమయ్య తదితరులు. ఇప్పటి ప్రసిద్ధ  రచయితల్లో.. 'సృజనలోకం' వ్యవస్థాపక అధ్యక్షులు బహుముఖ ప్రజ్ఞాశాలి డా. లంకా శివరామప్రసాద్, ఆచార్య కాత్యాయనీ విద్మహే, ఆచార్య బన్న అయిలయ్య, జి. గిరిజామనోహరబాబు, వి.ఆర్.విద్యార్థి, చంద్, అన్వర్, పొట్లపల్లి శ్రీనివాసరావునెల్లుట్ల రమాదేవి, అనిశెట్టి రజిత తదితరులు నాకు సన్నిహితులు.  

             సవ్యాసాచిలా నేను పాఠకులకు అందించాలనుకున్న ఆలోచనలకు తగ్గట్టు ప్రక్రియను ఎన్నుకుని బహుముఖంగా రచనలను శరపరంపరగా వెలువరిస్తూ వచ్చాను.. మధ్య 1984 నుండి.. 2004 వరకు సాహిత్య అజ్ఞాతంలోకి (అంటే.. ఇరవై ఏండ్లు ) వెళ్ళి పూర్తిగా రాయడం మానేసి కూడా ఇప్పటిదాకా నేను మొత్తం 32 నవలలు, 483 కథలు, 14 కవిత్వ సంపుటాలు, 4 విమర్శా గ్రంథాలు, 3 నాటకాలు.. మొత్తం వెరసి ఇంతవరకు 63 పుస్తకాలు వెలువడ్డాయి నావి. అతి ఎక్కువ రచనలు నావి ఇంగ్లిష్ లోకి అనువదింపబడి అంతర్జాతీయ పాఠకులకు అందాయి. దాదాపు 19 మంది ప్రసిద్ధ అనువాదకులు నా రచనలను ఇంగ్లిష్ లోకి అనువదించారు. వాళ్ళు శ్రీశ్రీ, వేగుంట మోహనప్రసాద్, వి వి బి రామారావు, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి, ఆచార్య కె. పురుషోత్తం, డా.లంకా శివరామప్రసాద్, రామతీర్థ, ఆచార్య ఇందిరా బబ్బెల్లపాటి, యు.ఆత్రేయశర్మ, ఆర్.అనంతపద్మనాభరావు, రావెల పురుషోత్తమరావు, ఎం.వి.ఎస్ ప్రసాద్, మైదవోలు వెంకట శేష సత్యనారాయణ. ఆచార్య కె.శ్యామల, డా. దినకర్, డా.పి వి.లక్ష్మీప్రసాద్ వంటి అనేకులు.  

            తెలుగేతర భారతీయ భాషల్లోకి కూడా నా రచనలనేకం అనువాదం చేయబడి యా ప్రాంత పాఠకులకు పరిచయమయ్యాయి. మొత్తం మీద మన దేశ సాహిత్యకారులనేకమందికి నేను ఒక వరిష్ఠ సాహిత్యకారునిగా పరిచయమై నా స్థానాన్ని పదిలపరుచుకున్నాను. ఇది నాకు సంతృప్తిని మిగిల్చిన సాహిత్య జీవితమే.

              అనేకానేక కారణాలవల్ల, అవకాశాలవల్ల నేను చాలా అంతర్జాతీయ వేదికలపై 'భారత ప్రతినిధి' గా పాల్గొని సమకాలీన సాహిత్యకారునిగా దేశ 'గొంతు' ను వినిపించాను

            ఐతే.. సాహిత్య ప్రక్రియ ఏదైనా పాఠకులకు ప్రయోజనాన్ని కలిగిస్తూ వాళ్ళను ఉన్నతీకరించేదిగా ఉండాలని నా విస్పష్ట భావన

3.          మీ మొదటి రచన సందర్భంలో వచ్చింది. మీ రచనల గురించి చెప్పండి.  

      నిజం చెప్పాలంటే.. చాలా మంది రచయితలు ఆరంభ దశలో పత్రికల్లో తమ పేరును అచ్చులో చూచుకోవాలన్న తపనతోనే రాయడం మొదలు పెడ్తారు. నేను దానికి మినహాయింపు కాదు. మొట్టమొదట తొమ్మిదవ తరగతిలో ఉండగా ' చందమామ ' పత్రికలో నా మొదటి కథ అచ్చయినప్పుడు ఎన్నిసార్లు నా పేరు అచ్చయిన అక్షరాలను తడిమి తడిమి ఆనందపడ్డానో. తర్వాత్తర్వాత రచయితకు అవగాహనా, ఆత్మవిమర్శా, తనను తాను తెలుసుకునే తత్వం పెరుగుతూ సమాజంపట్ల ఒక పౌరునిగా తన బాధ్యత తెలుస్తూ.. పౌరులూ, దేశం.. దోపిడీ.. పేదరికం, పేదలు ఎలా, ఎందుకు తయారౌతున్నారో నుండి మొదలై.. అందరూ ఒకే రీతిగా జన్మిస్తున్న వాళ్ళు ఇట్లా భిన్న భిన్నంగా ఎందుకు ఎవరివల్ల, ఎవరిచేత ఎట్లా ధనికులుగా, పేదలుగా మారుతున్నారో తెలుస్తున్నకొద్దీ.. వివక్ష గురించీ, విచక్షణ గురించీ.. క్రమక్రమంగా అర్థమౌతూ.. రచయిత ఎప్పటికైనా పీడితులవైపు నిలబడి పోరాటం చేయాలనీ.. అందరికీ సమ న్యాయం జరగాలనీ.. అసమ సమాజాన్ని మరమ్మత్తు చేయాలనీ.. ఒక ' ఎరుక ' అక్షరకారునిలో ఉదయిస్తుంది. అది పెరిగి పెరిగి రచయితకు ఒక మార్గ 'నిర్దేశన' చేస్తుంది.  

              విధంగా  రచయిత బాధ్యత తెలుస్తున్న తొలి దశలో, 1971 లో నా మొట్టమొదటి కవిత్వ సంపుటి 'దీపశిఖ' వెలువడింది. పుస్తకం ధర.. రూపాయి ముప్పావలా. దాని ప్రచురణకైన ఖర్చు తొమ్మిది వందల రూపాయలు. నావి ఐదువందలు. నా బాల్య స్నేహితుడు ఆర్.గిరి ఇచ్చినవి మిగతా నాల్గు వందలు. అది విత్తనం రాతి నేలలోనుండి మొలకగా తలెత్తుకుని నిలబడ్తున్న దశ

            రచయితకు ధైర్యంతో కూడిన ఒక లక్ష్యం ఉండాలని తెలుసుకుంటున్న సందర్భం

 4.        మీరు రాసిన అతి పెద్ద నవల 'కాలనాళిక '. నవలను సందర్భంలోనుండి రాశారు

         నేను వరంగల్లులో పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం చేసి, ఉద్యోగం కూడా ఎక్కువ కాలం ఇక్కడే చేసి.. చాలా సుదీర్ఘ కాలం ఇక్కడి నేలతో, జీవితంతో, ఆచార వ్యవహారాలతో అనుబంధం కలిగి ఉన్నవాణ్ణి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇక్కడి పక్కా స్థానికుణ్ణి. అందువల్లనే 1969 లో జరిగిన తొలి ' ప్రత్యేక తెలంగాణ ' ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తిని కొద్ది రోజులు వాయిదాల పద్ధతిపై జైలుకెళ్ళి వచ్చినవాణ్ణి. విద్యార్థిగా అప్పటికే చైతన్యవంతమైన స్పృహ ఉన్న 'పాలిటెక్నిక్' కాలేజ్ విద్యార్థి సంఘ నాయకునిగా యువతను సమీకరిస్తూ ఉద్యమ బాటలో పయనిస్తున్నవాణ్ణి. దాదాపు అప్పటి తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్లమెంట్ స్థానాలను తెలంగాణ ప్రజా సమితికి ఓట్లేసి గెలిపిస్తే రాజకీయ ద్రోహులచేత  ఇక్కడి ప్రజలు వంచించబడి మహోగ్ర ఉద్యమం 369 మంది అమరులను కోల్పోయి మోసపోయిందో అర్థం కాలేని నిస్సహాయ పరిస్థితుల్లో.. నివురుగప్పిన నిప్పులా తెలంగాణ మిగిలి.. అంతఃచైతన్యంతో ఆలోచనాపరులైన యువత ' తీవ్రవాద ఉద్యమాల్లోకి ' తమ దారులను వేసుకుంటున్న సందిగ్ధ సమయం అది.. 1969 నుండి.. 1985 వరకు.. తెలంగాణ ఒక నిప్పుల సముద్రం.. కల్లోల కడలి.. హింస ప్రతిహింస తో కనలిపోతూ వసంత గర్జనతో లోలోపల ఉడికిపోయిన సమయం. అటు శ్రీకాకుల పోరాటాలు, ఇటు ఉత్తర తెలంగాణలో పీపుల్స్ వార్, అటు బి వి పి ప్రతిఘటనలు.. అంతా రక్తసిక్తమైన దశాబ్దిన్నర కాలం. మధ్యలో 'ఎమర్జన్సీ' దేశవ్యాప్త హక్కుల పోరాటాలు. అంతకు ముందు 1942 నుండి.. నిజాం ప్రభుత్వంలో రజాకార్ల నిత్య హింస.. మత మార్పిడులు. గ్రామాల్లో దొరల దోపిడీ పాలన. ఇక తట్టుకోలేని హింసలోనుండి పుట్టింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం' ( సంగం). రావి నారాయణరెడ్డి, డి వి కె తదితరుల నాయకత్వంలో 1947లో ఆవిర్భవించి చెప్పా పెట్టకుండా ఆంధ్రా కమ్యూనిస్ట్ నాయకత్వం మోసం చేసి 1951లో అనివార్య పోరాట విరమణ.. ఇక పోలీస్ చర్యతో వేలమంది నిరక్షరాస్య అసహాయ గ్రామీణ ప్రజల ఊచకోత.   

             ఇదంతా 1934 లో వరంగల్లులో నిజాం ఆరంభించిన 'ఆజం- జాహి- మిల్స్' నుండి మొదలై 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 'బంగారు తెలంగాణ' వైపు అడుగులను సంధించుకుంటున్న సంధి కాలం.. అంటే 2017 దాకా .. మొత్తం 80 సంవత్సరాల చరిత్ర కథాత్మక నవలను డాక్య్మెంట్ చేస్తూ భావి తరాలకు అందివ్వాలన్న సంకల్పంతో.. దాదాపు రెండు సంవత్సరాల సమాచార సేకరణతో కష్టపడి రాసిన బృహత్ నవల 'కాలనాళిక'. దీంట్లో ఎందరో ఇప్పటికీ జీవించిఉన్న  ఉద్యమకారుల వాస్తవ జీవితాలున్నై. మన కళ్ళముందే ఇంకా సజీవంగా ఉన్న మనుషులు కూడా పాత్రలుగా ఉన్న నవలను రాయడం ఒక సాహసోపేత క్రియ.