మా రచయితలు

రచయిత పేరు:    కాత్యాయనీ విద్మహే

సాహిత్య వ్యాసలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర 

 

ఆధునిక తెలుగు  స్త్రీల సాహిత్య చరిత్రలో రచయితల పూర్వాపర నిర్ణయానికి వాళ్ళ పుట్టిన తేదీలు కాదు ప్రమాణం. ఎందుకంటే చరిత్రలో విస్మృతికి గురి అయిన స్త్రీల  సాహిత్యం లభించటమే కష్టం అయిన పరిస్థితులలో వాళ్ళు పుట్టిన తేదీలు, పెరిగిన తీరూ, జీవిత విశేషాలు తెలుసుకొనటం మరీ కష్టం. అందువల్ల ఆయారచయితల రచనల ప్రచురణ కాలమే ప్రమాణంగా తీసుకోవాలి. ఆ రకంగా చూసినప్పుడు గుండు అచ్చమాంబ తరువాత రచయిత్రి పులుగుర్త లక్ష్మీ నరసమాంబ. 1898జూన్ (విళంబి ,జ్యేష్టం ) చింతామణి పత్రికలోమహిళా కళాబోధినిఅనే శీర్షిక గల ఆమె పుస్తకం ఒకటి సమీక్షించబడింది. చింతామణి పత్రిక తొలుత 1874 అక్టోబర్ లో వీరేశలింగం ప్రారంభించిన వివేకవర్ధని పత్రికకు అనుబంధంగా మొదలై, మధ్యలో ఆగిపోయి, మళ్ళీ 1891-92 న్యాపతి సుబ్బారావు నిర్వహణలో పునరుద్ధరించబడి 1898 వరకూ కొనసాగింది. (పొత్తూరివెంకటేశ్వర రావు, తెలుగుపత్రికలు, 2004) ఆ పత్రికకు సమీక్షార్థం  పులుగుర్త లక్ష్మీనరసమాంబ పుస్తకం వచ్చిందంటే అది సమీప కాలపు రచనే అయివుంటుంది. నూరు పద్యాలుగల ఆ పుస్తకం  స్త్రీల ఉపయోగార్థం వ్రాయబడిందని సమీక్షకులు పేర్కొన్నదానిని బట్టి స్త్రీలు రచయితలు కావటంలో తెలుగునాట  స్త్రీవిద్య కేంద్రకం గా వికసించిన సంఘసంస్కరణ  ఉద్యమం  ప్రభావం కాదనలేనిది అని స్పష్టం అవుతున్నది.

పులగుర్తలక్ష్మీనరసమాంబ 1878 లో జన్మించింది. తల్లి అగ్గమాంబ, తండ్రి చింతలపూడి నీలాచలం. తల్లి వైపు తాత నడకుదుటి రామన్న కవి.  మేనమామ నడకుదుటి వీరరాజు కూడా కవి, విమర్శకుడు. ఈ వారసత్వం లక్ష్మీ నరసమాంబది. భర్త పులగుర్త వెంకటరత్నం.  కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి శిష్యురాలు ఆమె.   ( ఊటుకూరి  లక్ష్మీకాంతమ్మ ,ఆంధ్ర కవయిత్రులు). సంస్కరణ ఉద్యమంలో ఆయన వీరేశలింగం గారి ప్రత్యర్థి. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా స్త్రీవిద్య, స్త్రీల సామాజిక పాత్ర వంటి విషయాలలో మాత్రం ఆమె సంస్కరణ ఉద్యమకాలపు ఆధునిక భావాలను అందిపుచ్చుకొన్నది. ఆ మాటకు వస్తే సంస్కరణోద్యమం మార్పును ఎంతంగా ఆశించిందో అంతగా స్త్రీల విషయంలో  గృహిణీధర్మాలు, పాతివ్రత్యం మొదలైన సంప్రదాయ భావాలను అంతగా అంటిపెట్టుకొనే  ఉందన్నది వేరేవిషయం.

1898 నాటికి నూరుపద్యాలమహిళా కళాబోధిని, వ్రాసిందంటే 20 ఏళ్ళవయసులో లక్ష్మీ నరసమాంబ సాహిత్య జీవితం మొదలైందన్నమాట. 1902 నుండి హిందూసుందరి పత్రికలో ఆమె రచనలు కనిపిస్తాయి. 1904 లో సంపాదకురాలుగా సావిత్రి అనే మాసపత్రికను ప్రారంభించిన నాటి నుండి ఆమె రచనలకు ఆ పత్రిక వేదిక అయింది.భారతి పత్రికలో కూడా ఆమె రచనలు కనబడతాయి.

 

                                                1

 

పులగుర్త లక్ష్మీనరసమాంబ  వాజ్ఞ్మయ పరిశీలనకు ముందుగా  ఆమె సామాజిక నిర్మాణ నిర్వహణ సామర్ధ్యాల పరిచయం అవసరం.అవి ఒకటి సావిత్రి పత్రికానిర్వహణ. రెండు శ్రీ విద్యాభివర్ధనీ సమాజ నిర్మాణ నిర్వహణ. మూడు ఆంద్ర మహిళాసభ నిర్మాణ నిర్వహణ. 

 స్త్రీవిద్యావల్లికకు పాదు పత్రికలేనని, పత్రికాధి పత్య భారవహన సామర్ధ్యం తనలో లేకపోయినా  స్వజాత్యభివృద్ధికి  మూలాధారమైన పత్రికాధిపత్య బాధ్యత తీసుకున్నానని సావిత్రి పత్రికను ప్రారంభిస్తూ వినయంతో చెప్పుకొన్నది .  జ్ఞానవిద్యా ధనములు చెలులకు పంచి ఇచ్చుటకు, చెలులు ఒసగేవాటిని స్వీకరించటానికి అసమాన సాధనం పత్రిక అని పేర్కొన్నది. ఆంధ్రదేశంలో చదువను, వ్రాయను శక్తిగల సతీమతల్లులు ఉన్నా తమ శక్తిని లోకముకొరకు ఉపయోగించటానికి ప్రధానసాధనాలైన పత్రికలకు అధిపతులు పురుషులే ఉండటం అవరోధంగా ఉందని -- స్త్రీవాద ఉద్యమం వల్ల తెలుగుసమాజంలో 1970 లతరువాత కల్గిన ఒక అవగాహనను  ఆమె ఆనాడే  కనబరచటం  ఆశ్ఛర్యం కలిగిస్తుంది. సోదరీమణులు ఇంతవరకు తమ హృదయా లలో కాపురమున్న జంకుగొంకులను వెడలగొట్టి ధైర్యోత్సాహాలతో మంచి వ్యాసాలు వ్రాసి పంపమని విజ్ఞాపన చేసింది. ( సావిత్రి ,జనవరి, 1904).ఒడిదుడుకులను తట్టుకొంటూ  ఆరేడేళ్ళపాటు పత్రికను నడిపింది. 

సావిత్రి పత్రిక1904 జనవరి లో  ప్రారంభమైతేమార్చ్ సంచికలోనే  పులగుర్త లక్ష్మీ నరసమాంబ  కార్యదర్శినిగా వున్న  శ్రీ విద్యార్ధినీ సమాజము ప్రప్రథమ వత్సర విషయ జ్ఞాపనము(నివేదిక ) ప్రచురించబడింది. అప్పటికి అయిదారు సంవత్సరాల నుండే స్త్రీలు ఒక సమాజంగా కూడి వారానికి ఒకటిరెండుసార్లు కలుసుకొంటూ విద్యాభివృద్ధిని, జ్ఞానాభివృద్ధిని కలిగించే మంచివిషయాలు మాట్లాడుకొంటుంటే బాగుంటుంది అని  తనకు అనిపిస్తూ ఉండేదని అందులో ఆమె చెప్పింది.  సత్కార్యాచరణకు సంఘం ఆవసరం అన్న భావం ఆమెలో  ‘మహిళాకళాబోధినిరచనాకాలానికే  బలపడిందన్నమాట.  భండారు అచ్చమాంబ ఆంధ్రదేశంలో పర్యటిస్తూ సంఘాలు  మహిళలను సమీకరించి సంఘాలు పెట్టిస్తున్న సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు పులగుర్త లక్ష్మీనరసమాంబ చొరవతో   1903 జనవరి 30 వతేదీన  శ్రీ విద్యార్థినీ సమాజం ఏర్పడినట్లు ఆ నివేదిక వల్ల తెలుస్తున్నది. ముప్ఫయిమందికి పైగా సభ్యులతో సమావేశాలు  ప్రతిశుక్రవారం  లక్ష్మీ నరసమాంబ ఇంట్లో జరిగాయి. ఆగస్టు తరువాత దుగ్గిరాల రమణమ్మ ఇంట్లోనూ , బాలాంత్రపు శేషమ్మ ఇంట్లోనూ మంగళవారాలలో జరుగుతూ వచ్చాయి. కాశీభట్ల సూరమ్మ ఇంట్లో ఆదివారం జరిగేవి. ఈ సమావేశాలలో పులగుర్త తో పాటు బాలాంత్రపు శేషమ్మ, దేవగుప్తాపు మహాలక్ష్మమ్మ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. పుస్తకాలు చదువుకొనటం కూడా ఒక కార్యక్రమమే. ఈ సంస్థ కొంతకాలం పనిచేసి ఆగిపోయింది. 

శ్రీ విద్యార్థినీ సమాజం 1910 ఏప్రిల్ 8  పునరుద్ధరించబడింది. లక్ష్మీ నరసమాంబ అధ్యక్షులుగా, దామెర్ల సీతమ్మ  కార్యదర్శిగా, బాలాంత్రపు శేషమ్మ సహాయకార్యదర్శిగా తిరిగి ప్రారంభమైన ఈ సంస్థ ప్రధానోద్దేశం దేశోద్ధరణకు ముఖ్యముగా కావలసినట్టి విద్యాధనం తెలుగుదేశపు స్త్రీలకు లభింప చేస్తూ వారిని నీతివిద్యాసంపన్నులుగా సత్కార్యాచరణ పరాయణులుగా, దేశోపకార ధురీణులుగా చేయటం. ప్రతిశుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి నాల్గుగంటలవరకు సభ్యులు సమావేశమై సాహిత్య సద్గోష్ఠి చేయటం, స్వీయ రచనలు చదువుకొనటం, లోకజ్ఞాన విషయాలు మాట్లాడుకొనటం, స్త్రీనీతిగీతాలు, మంగళహారతులు పాడుకొనటం, హార్మోనియం వంటి వాయిద్యాలను వాడుతూ పాడటం- చివరకు కుంకుమ తాంబూలాలు ఇచ్చి సభను ముగించటం - ఇది వారం వారం కార్యక్రమం. సమాజ సభ్యుల ఉపయోగం కొరకు గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచటం, చందాలు వసూలుచేసి ధనికుల సహాయంతీసుకొని స్త్రీలకు విద్యాలయాలు ఏర్పరచి వేదశాస్త్ర పురాణాలు, దేశచరిత్రలు, భూగోళ గణితశాస్త్రాలు, సంగీతం మొదలైనవి బోధించటం, అందుకు స్త్రీలనే ఉపాధ్యాయులుగా నియమించటం, అనాధలకు అన్న వస్త్రాలు ఇచ్చి విద్య చెప్పించటం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా ప్రకటించబడ్డాయి. ఇవన్నీ ఆనాటి సంస్కరణోద్యమ సాధారణ లక్ష్యాలే. స్త్రీలను గృహిణీధర్మకోవిదులుగా చేయటం, వితంతుకాంతలకు వైరాగ్య బోధచేయటం, పవిత్రచారిత్రలుగా సుశిక్షితులను చేయటం వంటివి ఆ సమాజం కార్యక్రమాలలో ఉండటం స్త్రీల విద్యకు సంస్కరణోద్యమం ఇచ్చిన నిర్వచనాన్ని, లక్ష్యాన్ని ప్రతిఫలిస్తాయి. వీటిని ఆ సంస్థ ఎంతవరకు సాధించగలిగింది అన్నది ఇంకా శోధించవలసే  ఉన్నది. 

ఈ సంస్థ గురించి 1911 జులై సావిత్రి పత్రికలో ఒక ప్రకటన  ప్రచురించబడింది. దీనిని బట్టి  ప్రారంభమైనప్పుడు ఏర్పరచుకొన్న సమాజ నిబంధనలప్రకారం  పునర్వివాహం చేసుకొన్నస్త్రీలకు ఇందులో ప్రవేశం లేదనీ, పునరుద్ధరణ తరువాత నిర్వాహకులు కొందరు ఆ నిబంధనను వ్యతిరే కించి   పునర్వివాహిత స్త్రీలను చేర్చుకొనటం వలన చాలామంది సమాజ సమావేశాలకు  రావటం మానేశారని,సమాజం ఇలా క్షీణదశకు రావటం చూసి సహించలేక  అధ్యక్షురాలైన లక్ష్మీ నరస మాంబ  దామెర్ల సీతమ్మను , బాలాంత్రపు శేషమ్మను కార్యదర్శి సహాయకార్యదర్శి పదవులనుండి తొలగించి  సమాజాకార్యక్రమాలను చక్కబెట్టే బాధ్యత తీసుకొనాలని  జులై 2 వతేదీనాడు జరిగిన సభలో  నిర్ణయించినట్లు ఈ ప్రకటన ద్వారా తెలుస్తున్నది. ఆ తరువాత ఈ సంఘం ఎంతకాలం పనిచేసిందో తెలియదు. 

ఆంధ్ర మహిళాసభ ఎప్పుడు ఏర్పాటయిందో ఖచ్చితంగా తెలియటంలేదు కానీ, దానికి కార్యదర్శి అయిన పులుగుర్త లక్ష్మీనరసమాంబ 1911 ఏప్రిల్ నెలలో కాకినాడలో జరగనున్న ఆంధ్రమహిళాసభ సమావేశాల గురించి చేసిన ప్రకటన ఒకటి 1911 మార్చ్ సావిత్రిలో ప్రచురించబడింది. దానిని బట్టి 1910జూన్ 2 వతేదీన గుంటూరులో స్త్రీ సనాతన ధర్మమండలి ఆధ్వర్యంలో ఇలాంటి సభను నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఆ సభకు అగ్రాసనాధిపురాలిగా లక్ష్మీనరసమాంబ ఇచ్చిన ఉపన్యాసం సావిత్రి 1910 జులై  సంచికలో ప్రచురించబడింది కూడా. ఈ ప్రకటనలో లక్ష్మీనరసమాంబ స్త్రీవిద్యాభివృద్ధికి అక్కడక్కడా సమాజాలు ఏర్పడుతున్నప్పటికీ  ఆంధ్రదేశ స్త్రీలందరూ ఏకగ్రీవంగా పనిచేయ గలిగినప్పుడే దేశస్త్రీలలో విద్యాభివృద్ధి, సద్ధర్మాభివృద్ధి బలపడజాలవు అని అభిప్రాయపడింది. ఈ సందర్భంలో ఆమె అప్పటికి ఐదారేళ్లుగా దేశీయమహాసభలతోపాటు జరుగుతూ వచ్చిన హిందూదేశ స్త్రీల మహా సభలను ప్రస్తావించి,వేరువేరు ప్రాంతాలకు, భాషలకు సంబంధించిన ఆ మహిళలమధ్య ఒకరు చెప్పినది ఒకరికి అర్ధం కాకుండా పోతున్నదనిచెప్పింది. 1907 లో 1906 డిసెంబర్ 29 వతేదీన కలకత్తా లో జరిగిన హిందూదేశస్త్రీల సభలో పాల్గొని సంఘము యెడలను, ఇరుగు పొరుగు యెడలను మనమునెరవేర్చవలసిన విధులెవ్వి అన్న అంశం మీద ప్రసంగించివచ్చిన అనుభవం నుండి ఆమె అలా చెప్పి ఉంటుంది.   ఆంధ్రదేశ మహిళల సభలు విరివిగా జరుగు తూ అవగాహన పెంచుకొనే క్రమంలో స్పష్టం, నిర్దుష్టం అయిన కార్యక్రమంతో సాగినప్పుడే జాతీయ స్థాయిలో జరిగే హిందూదేశస్త్రీల సభ వలన ప్రయోజనం నెరవేరుతుందని పేర్కొన్నది. ఇక్కడి నుండి ఆంధ్రమహిళాసభలను పెద్దఎత్తున నిర్వహించు కోవాలన్నది తన ఆలోచన గా ఆమె చెప్పటాన్నిబట్టిఆంధ్రమహిళాసభపేరుతో జరిగిన మహాసభలకు కాకినాడ మహాసభే మొదటిది అనుకోవలసి ఉంది. 

విద్యా విష యము, సంఘవిషయము, గృహవిషయము అనే మూడుశీర్షికలకింద వేరువేరుగా ప్రసంగాంశాలు  ఇచ్చి వాటిలో తమకు ఇష్టమైన అంశము మీద మాట్లాడవచ్చని కూడా పేర్కొనటం జరిగింది. మే నెల సంచికలో వచ్చిన మహాసభ నివేదికను బట్టి కళ్లేపల్లి వెంకటరమణమ్మ అగ్రాసనా ధిపత్యంలో ఆ సభ జరిగిందని తెలుస్తున్నది. ఆ సభలో పులగుర్త లక్షీనరసమాంబ ఆధ్యాత్మ విద్యకును మనదేశప్రకృతికిని గల సంబంధము అనే అంశం మీద చేసిన ప్రసంగ పాఠం కూడా   ఈ సంచికలో ప్రచురించబడింది. 

ఈ సభకు ఆంధ్రదేశపు చాతుర్వర్ణ్యములలోని కులాంగనలగు ప్రియ సోదరీమణులను ఆదరణ పూర్వకంగా ఆహ్వానం చేస్తున్నామని చెప్పటం, వారు తమరాకను తెలియచేస్తూ  తమతమ వర్ణాన్ని సైతం  తెలియచేస్తే అందుకు అనుకూలంగా సదుపాయాలు జరిపిస్తామని పేర్కొనటం గమనించదగిన అంశాలు. కులాంగనలు అనే విషయం మీద తరువాత పెద్దవిమర్శే వచ్చిందని   పులగుర్త లక్ష్మీనరసమాంబ దానికి సమాధానంగా జూన్ సంచికలో ప్రచురించిన వివరణను బట్టి తెలుస్తున్నది. పెద్దగా విద్యాబలంలేని స్త్రీల ప్రధమప్రయత్నం కాకినాడ మహాసభ అని చెప్పి లక్ష్మీనరసమాంబ దానిలో లోపాలు ఏమైనా ఉంటే చెప్పి నివారణోపాయాలు సూచించటం కాక పరిహాసంచేస్తూ, నిందిస్తూ, అపవాదాలు వేస్తూ వ్రాసినదానికి నొచ్చుకొంటూ ఇవి కొత్తగా  ప్రారంభ మైన ఉద్యమానికి భంగం కలిగిస్తాయని, కులాంగనలు సభలుచేయరాదు అనేవాళ్లకు బలం చేకూరుస్తాయని, ఉద్యమశీలురైన స్త్రీలను భయపెడతాయని కనుక ఉపేక్ష చేయక ఆక్షేపణలకు సమాధానాలు ఇస్తున్నానని పేర్కొన్నది. 

వాటిలో  ముఖ్యమైంది  పునర్వివాహితలైన స్త్రీలకుగానీ, ఆంధ్ర క్రైస్తవ స్త్రీలకుగానీ స్థానం లేని సంఘానికి ఆంధ్రమహిళామహాసభ అనే పేరు పెట్టిఉండకూడదని పునర్వివాహా స్త్రీనిషేధ ఆంద్ర బ్రాహ్మణ స్త్రీ సభ అని పెట్టుకొంటే సరిపోయేది అన్న ఆక్షేపణ. ఈ సభకు బ్రహ్మణస్త్రీలతో పాటు వైశ్య శూద్ర మహిళలు కూడా వచ్చారు కదా ఆంధ్ర బ్రాహ్మణ స్త్రీ సభ అని పెట్టటం ఎంత వరకు లక్షణంగా ఉన్నట్లు అని సవాల్ చేసింది. ఆంధ్రులు అంటే ఆంధ్రదేశంలో ఉన్న హిందూస్త్రీలే కానీ ఇరుతరులు కాదని అనేక ఉదాహరణద్వారా వాదించింది. ఆ క్షేపణలు ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డాయి కనుక అసలు ఆ పత్రిక  ఆంధ్రదేశంలో గానీ ఆంధ్రులచేతగానీ ప్రచురించబడటం లేదు కనుక     (అది బొంబాయి నుండి ప్రచురించబడేది)  దానికి ఆంధ్రపత్రిక అనే పేరు చెల్లదని ప్రతివాదానికి దిగింది. దానికి       “ఆంగ్లేయ భాషా సంస్కార సంకలిత సంఘ సంస్కార ప్రియామృతాంజన పత్రికఅంటే సరిపోయేదికాదా అని ఎద్దేవా చేసింది. ఇక కులాంగనలకు ఆహ్వానం అన్నమాటను పట్టుకొని పునర్వివాహితలకు ఆహ్వానం ఇవ్వలేదని విమర్శించారుకదా! శృతి స్మృతి పురాణేతిహాస నిదర్శనాలతోస్త్రీ పునర్వివాహం కులస్త్రీ ధర్మం కాదని వితంతుస్త్రీలకు బ్రహ్మచర్యమే ఉత్క్రుష్ట ధర్మమని సుదీర్ఘంగా చర్చించింది. సాంఘిక నిబంధనలకు లక్ష్మీ నరసమాంబ స్త్రీవిద్యా విషయ  సంస్కరణ అభిలాషి మాత్రమే కానీ పునర్వివాహ విషయంతో   ఆమెకు ఆమోదంలేదన్నది స్పష్టం. అయితే సాంఘిక నిబంధనలకు మీరి సంఘముకొరకు పాటుపడుటవలన ప్రయోజనంలేదని నమ్మినవారమగుటచే మేము కులాంగనలను మాత్రమే ఆహ్వానించాము కానీ పునర్వివాహితల పొడగిట్టక కాదు అని వివరణ కూడాఇచ్చింది. ఇదంతా చెప్పటం ఎందుకంటే ఆ నాటి సంఘసంస్కరణోద్యమం ఎన్ని పరిమితులమధ్య విస్తరించిందో తెలుసుకొనటానికి. లక్ష్మీ నరసమాంబ అభిప్రాయాలతో అందరికీ ఏకీ భావం ఉండనవసరంలేదుకానీ ఏ అభిప్రాయాలనైనా కలిగి ఉండటానికి, వాటికి సమాజంలో ప్రచారంచేయటానికి సంఘాలు పెట్టుకొని బయటకువచ్చే స్త్రీలు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కో వలసి ఉంటుందో, తట్టుకొని నిలబడటానికి ఎంత తర్కబలం అవసరమో సూచించటానికి.  

            1911 ఏప్రిల్ లోకాకినాడలో సభలు జరిగిన తరువాత వార్షిక సభలు ఎక్కడెక్కడ జరిగాయో తెలియదు కానీ 1914 ఏప్రిల్ 11, 12   తేదీలలో విజయవాడలో జరిగిన అయిదవ ఆంధ్ర మహిళా సభల  పూర్తి సమాచారం లభిస్తున్నది. కానీ ఆ సభలలో పులగుర్త ప్రమేయం ఏమీ కనిపించదు. ఆ సభలో  బృందావనపుర స్త్రీ సమాజం కార్యదర్శి మోటుపల్లి రాజాబాయమ్మస్త్రీ యున్నతవిద్యఅన్న అంశం మీద చేసిన ప్రసంగంలో  స్త్రీల సాహిత్యకృషి గురించి చెబుతూ పులగుర్త లక్ష్మీ నరసమమాంబ సావిత్రి పత్రికాధిపురాలిగా, స్త్రీవిద్యాభివృద్ధికొరకు పట్టుదలతో పనిచేస్తున్న మహిళగా, మహిళా కళాబోధిని కావ్యకర్తగా ప్రశంశించబడింది. అంతే. 

పులగుర్త లక్ష్మీ నరసమాంబ రచనలను పద్యకవిత్వం- పాటలు, వచనరచనలు, వ్యాసాలు అని మూడు రకాలుగా వర్గీకరించి పరిశీలించవచ్చు. 

 

                                                2

 

పద్య కవిత్వం - పాటలు 

మహిళకళాబోధినితో ఆమె కవితావ్యాసంగం మొదలైంది. కథాప్రధానమైన కవిత్వంకన్నా నీతిప్రధానమైన ముక్తకాలే ఎక్కువ. వేరువేరు శీర్షికలతో వచ్చిన ఖండికలు. ప్రారంభ ఖండకావ్యం  నూరుపద్యాల మహిళాకళాబోధిని. . ఈ  పుస్తక సమీక్షకులు ఆమె కవిత్వం మృదువు, మధురం, సుబోధకం, నిర్దుష్టం అని చెప్పి నిదర్శనంగా  ఒక పద్యాన్ని ఉదహరించారు. 

 “పూనికతోడ నింట గల బోటులపై  బడద్రోయకుండ నా 

మేనును వంచి యెల్లరును మెచ్చుగతిన్ గృహకృత్యముల్తగన్  

బూని సుకీర్తి సౌఖ్యముల  బొందెద నంచుఁ దలంపనీని య 

జ్ఞాన దివాంధరాజమును జాటున నుంచెడి వెల్గు విద్యగా “   

1898 నాటి ఈ పద్యాన్ని ఆ నాటి  సంస్కరణోద్యమ నేపధ్యం నుండి చూడాలి. సంస్కరణో ద్యమానికి కేంద్రం స్త్రీ. భావజాలపరమైన సంఘర్షణ అయినా, సామాజికమైన కొత్త నిర్మాణాల గురించిన ప్రయత్నాలైనా, ప్రభుత్వ పరమైన చట్టాల కోసం ప్రయత్నమైనా ప్రధానంగా   సతీ సహగమనం, బాల్యవివాహం, స్త్రీవిద్య, స్త్రీ పునర్విహం వంటి విషయాలను చుట్టుకొనే  సాగాయి. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం స్త్రీవిద్య, వితంతువివాహం అనే రెండు అంశాలలో ఈ సమాజాన్ని సంస్కరించి ఆధునికం చేయటానికి పూనిక వహించాడు. స్త్రీవిద్య కోసం   బాలికలకు పాఠశాలలు  ఏర్పాటుచేయటమే కాదు, స్త్రీవిద్యకు అనుకూలభావజాలాన్ని అభి వృద్ధి చే య టానికి పత్రికలు స్థాపించాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. వ్యాసాలు ప్రచురించాడు. 1885 నాటికి  ఆయన వ్రాసిన వ్యాసాలు స్త్రీవిద్య ప్రయోజనాలుగా మూడింటిని నిర్ధారిం చాయి. అవి 1. స్త్రీలు విద్యా వంతులైతే ఇంట్లో తోటి స్త్రీలతో కలహాలు పెట్టుకొనటం మానుతారు.  2. పతివ్రతల కథలు చదివి తాముకూడా అట్లా ఉండటానికి ప్రయత్నిస్తారు. 3.  ఇతర ప్రాంతాలలో ఉన్న భర్తలు వ్రాసే ఉత్తరాలు చదువుకోగలుగు తారు.  అందువల్ల ఇంటిగుట్టు కాపాడబడుతుంది. ఆ సంస్కరణో ద్యమాన్నీ, ఈ రకమైన వ్యాసాలను పరిశీలిస్తూ, చదువుతూ పెరిగింది పులుగుర్త లక్ష్మీ నరసమాంబ. ఆ ప్రభావాల నుండి వచ్చింది ఈ పద్యం.  

వీరేశలింగం స్త్రీవిద్య ప్రయోజనాలుగా చెప్పినవాటిలో   మొదటిది స్త్రీలు ఇంట్లో తోటి స్త్రీలతో కలహాలు పెట్టుకొనటం మానేస్తారని. ఇంట్లో స్త్రీల మధ్య కలహాలు ఎలాఉంటాయి? అత్త, ఆడబడుచులు, తోడికోడళ్లు ఇదీ ఒక ఇంట్లో వుండే స్త్రీ సమూహం. వీళ్ళ మధ్యకలహాలు ఎందుకు వస్తాయి? వాళ్ళ సాధారణ ప్రపంచం ఇల్లు, ఇంటిపనులు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ చేస్తున్న ప్పుడు కలిగే అసహనం తరచు వాళ్ళ మధ్య కలహాలకు కారణం అవుతుంది. స్త్రీవిద్య దానికి పరి ష్కారం చూపిస్తుంది అన్నది ఈ పద్యం సూచిస్తుంది.  కుటుంబంలో ఇతర  స్త్రీలమీదకు తోసెయ్య కుండా  ఒళ్ళువంచి అందరూ మెచ్చుకొనేట్లు ఇంటిపనులు చక్కబెట్టుకొనటం స్త్రీధర్మం అని సంప్రదాయం చెబుతుంది. ఆ ధర్మమే స్త్రీలకు కీర్తిని, సౌఖ్యాన్ని ఇస్తుంది. అయితే స్త్రీలు వాటిని పొందకుండా అడ్డుపడే అజ్ఞానం ఒకటి ఉంది. అది సోమరితనం కావచ్చు, ఈర్ష్య అసూయలు కావచ్చు. ఆ అజ్ఞానం అనే చీకటిని అభావం చేసే వెలుగు విద్య అని ఈ పద్యం తాత్పర్యం.

గృహకృత్య నిర్వహణ  స్త్రీ ధర్మమని, అది   తప్పరాదని సంప్రదాయం  శాసించగా స్త్రీలు తరతరాలుగా దానిని అనుసరిస్తూనే ఉన్నారు. ఎవరో శాసించారని మనసులో ఇష్టం లేకున్నా, కష్టంగా ఉన్నాఇన్నాళ్లు  గృహ కృత్యములను చేసుకొంటూ పోయిన వాళ్ళు  ఇప్పుడు తమకు తామే గృహ కృత్యములకు నిబద్ధులయ్యే జ్ఞానం విద్య అనే వెలుగువల్ల లభిస్తుందని చెప్పినట్లయింది.  వ్యక్తులుగా  వాళ్లలో  ఉండాటానికి వీలున్న పని ఎగ్గొట్టటం అనే బలహీనత ను సంస్కరించు కొనటానికి  విద్య ఉపయోగ పడుతుందన్నమాట.  ఇది ఆనాటి సంస్కరణోద్యమ చైతన్యస్థాయిలో భాగమే. స్త్రీలు విద్యావంతులు కావాలనటం వరకు అది అభ్యుదయ ఉద్యమం. మళ్ళీ ఆ విద్య స్త్రీల సాంప్రదాయ పాత్రను వివేకవంతంగా పోషించ టానికే అని అందరూ నమ్మారు. నమ్మింది చెప్పారు. అది తెలుగునాట సంస్కరణోద్య మానికి వీరేశలింగం  పెట్టిన ఒరవడి. మహిళా కళాబోధిని కావ్యం లభించినట్లయితే ఆ విషయం  మీద మరింత స్పష్టమైన నిర్ధారణకు రాగలం. 

 హిందూసుందరి పత్రికలో లభించిన ఖండికలు అయిదు. మొదటిదిప్రార్ధనాపద్యాలు (1902,మే) ఇవి మూడు కంద పద్యాలు. హిందూ సుందరి పత్రికను  , స్థాపకులను  భగవంతుడు  దయాళువై కాపాడాలని ప్రార్ధించే పద్యాలూ ఇవి.అనయాంధ కూపపతమగు వనితా సంఘంబు బయటపడ నూతగనున్నదని ఈ పత్రికను అభివర్ణించింది. హిందూ సుందరి ఏడాది పసికూన అయిన సందర్భంలో (1903,ఏప్రిల్)శ్రీహిందూ సుందరీ జండిన మహోత్సవ సమయాశీర్వాదముఅనే శీర్షికతో వ్రాసిన నాలుగు సీసపద్యాలు, ఒక మత్తేభం, ఒక ఉత్సాహంతో కూడినగజసుమాలలో    భగవంతుడు పూర్ణకరుణతో దానిని కాపాడాలని ప్రార్ధనాయుత ఆకాంక్షను వ్యక్తం చేసింది.  పద్య రచనను ప్రోత్సహించటానికి సమస్యలు ఇయ్యటం, వాటిని ఉపయోగిస్తూ పద్యాలూ అల్లటం రెండూ ఆమెకు తెలుసు. 

ఈ సంచికలోనేస్త్రీవిద్యావిజయవార్త’ - A SUCCESS FULL NEWS OF FEMALE EDUCATION అనే ఆంగ్ల శీర్షికతో సహా  - అనే ఖండిక ప్రచురించబడింది. ఇందులో అయిదు పద్యాలు ఉన్నాయి. కాకినాడలో లోయర్ సెకండరీ గ్రేడ్ పరీక్షలో విజయంసాధించిన ఒక స్త్రీని ప్రశంశిస్తూ వ్రాసింది. ఆమె పెద్దిభట్ల వెంకటప్పయ్య కూతురు. పేరు వెంకట సుబ్బమాంబ.లోకోపకారకార్యాకర చణుడైన జనకుకీర్తిజ్యోతిచమురనంగ / గార్హస్త్య సౌఖ్య మార్గప్రదర్శక నిజపతి సదుద్యమ వృక్షఫలమనంగఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలైందని    ’అతివలు మందబుద్ధులను నందులకు నిజదర్శనంబిడసరస్వతీదేవి ఆమెతో చెలిమి చేసిందని అంటుంది లక్ష్మీనరసమాంబ.  

            సతీ ప్రార్ధన ఆమె వ్రాసిన 20 పద్యాల  ఖండిక. (అక్టోబర్ 1902). ఆత్మశ్రయం. నేను అంటూ ఉత్తమపురుషలో ఒకస్త్రీ భగవంతుడిని ఉద్దేశించి చేసే ప్రార్ధన అంతా సతికి ఇహలోక దైవమైన భర్త చిరాయువు కలిగి నిరంతరం ఉన్నతిని పొందటమేఅతివకపారమై చెలగునైహిక సౌఖ్యసుధాబ్ధికనుక తనభర్తను అట్లా చేయమని కోరుకొనటమే. అయిదవతనం ఇమ్మని, భర్త ఏ పాపాలు చేసినా పోగొట్టమని, ఏ పాడుపనులు చేసినా, చేయుచున్నా, చేయనున్నా వాటినుండి  తొలగింపచేయమని, పరస్త్రీలు  సహోదరులనే భావం  అతని  మనసులో ఉండేట్లు కరుణించమని, ఎప్పుడూ సత్పథంలోనే ప్రయాణిస్తూ ఉండేట్లు, భగవద్భక్తి కలిగివుండేట్లు తన భర్తను దయచూడమని   ప్రార్ధించింది. అంతేకాదు, భగవద్భక్తి , పతిపాదసేవ తన బుద్ధిని వదలకుండా సతతం ఉండేట్లు చూడమని కూడా కోరింది. పరపురుషులు సహోదరులు, భర్త దైవం అనే భావాన్ని సదా తన అంతరంగంలో ఉండేట్లు చేయమని అడిగింది. పతిభక్తి, దైవభక్తి తనహృదయవీధులలో సదా సంచరించేట్లు చేయమని భగవంతుడిని ప్రార్ధించింది. సతి ప్రార్ధన భర్తకోసమైనా, తనకోసమైనా అంతిమమంగా భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలను,అభివృద్ధిని కోరుకొనేవే కావటం, స్త్రీలు  భర్త ఆధిక్యతను అంగీకరించి పాతివ్రత్య  నిబద్ధతను ప్రదర్శించేదే కావటం గమనించదగినది. ఇన్నాళ్లు మనుధర్మమో, మగప్రపంచమో స్త్రీ ఎలా వుండాలని నిర్దేశిస్తూ వచ్చిందో దానినే చదవటం, వ్రా యటం వచ్చిన స్త్రీలు తమ మాటగా, తమ ఆదర్శంగా  చేసుకొని చెప్పే విచిత్ర సందర్భం ఇది. 

            శ్రీ విద్యార్థినీ సమాజ సభ్యురాలైన పోచిరాజు మహాలక్ష్మమ్మ భర్తకు రాజమండ్రిలో ఉద్యోగం వచ్చి కాకినాడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు జరిపిన వీడ్కోలు సమావేశంలో ఆమెతో స్నేహాన్ని గురించి లక్ష్మీనరసమాంబగజమాలఅనే శీర్షికతో ఎనిమిది సీస పద్యాలు వ్రాసింది.  “అట్టిమైత్రికి నాటపట్టై సఖులను / బ్రాణములకన్న మిన్నగ ( గాన నేర్చు / మనదు చెలి మహాలక్ష్మ్యాబ మనలవిడిచి /యన్య పట్టణమునకేగ నయ్యె నయోయోఅన్నపాదాలు  చిన్నచిన్న మార్పులతో  నాలుగైదు పద్యాలలో ఆవృతమవుతాయి.అట్టిమైత్రికి ఆటపట్టైఅని ప్రారంభమయ్యే ఈ భాగానికి ముందున్న  సీసపద్య పాదాలలో ఆ మైత్రి ఎటువంటిదో వర్ణించటం ఉంది. మొదటి పద్యంలో అది    కనిపెంచిన తల్లిదండ్రులను, తోడబుట్టినవాళ్లను, చుట్టాలను, చివరికి కన్నపిల్లలను మరిపించగల మైత్రి. మరొక పద్యంలో శక్తినిమించిన ఘనకార్యాలు చేయటానికైనా, దుష్టజనుల అపవాదులను చీల్చి చెండాడగలగటమైనా, మనసు చెడుదారులకు మళ్లినప్పుడు చిటికలో తిప్పెయ్యటానికైనా, సత్కార్యాలు చేయటానికి భయపడే జబ్బుకు ఔషధ మైనా స్నేహాబలమే అని  నొక్కిచెప్పింది.

రెండవపద్యంలో కష్ట సాగరంలో ఉన్నప్పుడు ఆదుకొనే ఓడ, దిగులుమేఘాలు కమ్మినప్పుడు చెదరగొట్టే గాలి, పాపాలు బాధిస్తున్నప్పుడు సద్ధర్మ బోధ, పీడలనే చీకట్లు కమ్మినప్పుడు వెన్నెల ప్రసరించే చందమామ- అని ఆమె స్నేహాన్ని రూపకాలతో వర్ణించింది. మరొక పద్యంలో చిత్రవస్తువులు చూడాలన్న కుతూహలానికి సూర్యుడు, మనసులోని రహస్యాలను దాచుకొనగల రాతి పెట్టె, గ్రంథపఠన ఆనందం అనే పాలకు పంచదార, ఇష్టవిహారం వాళ్ళ కలిగే సంతోషం అనే బంగారానికి వాసన చెలిమి అని వర్ణించటంలోనూ రూపకాలతో చెప్పటమే కనబడుతుంది.

వర్ణనీయ వస్తుప్రాధాన్యతను స్థాపించటంలో వాటిని పోలిన ఉత్క్రుష్ట అంశాలను తక్కువ చేసి చెప్పటం మరొక పద్ధతి. స్నేహితుల మాటలు కలిగించే సుఖం చిలకపలుకులు ఇస్తాయా? స్నేహితులతో మాట్లాడటం కన్నా నాలుకకు అమృతం రుచిగా ఉంటుందా?, స్నేహితు రాలిని చూసినప్పుడు కలిగే ఆనందం వెన్నెల కలిగిస్తుందా? స్నేహితురాలి స్పర్శ సుఖం మలయా నిలం ఇయ్యగలగదా? స్నేహితురాలి తలను వాసనచూడటంలో ఉన్న సుఖం పూలవాసన సమకూర్చ గలదా అన్న వరస ప్రశ్నలలో  కాదు అనే సమాధానం గర్భితమయ్యే వుంది. అంతే కాదు చెవి, నాలుక ,కళ్ళు,చర్మం, ముక్కు అన్న పంచేద్రియాల ప్రస్తావన ద్వారాసఖులు పంచేంద్రియా నంద జనకులుఅని స్థాపించింది కవయిత్రి. సంపదలు ఎన్నయినా పొందవచ్చుగానీసఖ్యంబు బడయుట చాలనరిదిఅని స్నేహం యొక్క ఔన్నత్యాన్ని వర్ణించిన ఈ పద్యాలలో  లక్ష్మీ నరసమాంబ భావుకశక్తి ని చూడవచ్చు. 

సావిత్రి పత్రిక ప్రారంభ సంచికలోనే(1904 జనవరి)  ‘దైవప్రార్ధనముఅనే శీర్షిక క్రింద మూడు పద్యాలు వ్రాసింది లక్ష్మీ నరసమాంబ. సావిత్రి పత్రికను ఈశుండు ప్రేమగా చూడాలని, సావిత్రి అనే తీగపై  కరుణాసుధారసం కురిపించాలనివిద్యాకల్పాభంబై ప్రకాశించేట్లు పెంచి పోషించాలని దైవాన్ని ప్రార్ధించడం ఇందులో విషయం. మొదటి పద్యం   సావిత్రీవృత్తము. రెండవది   జలధరమాలావృత్తం. మూడవది   విద్యున్మాలావృత్తం. ఇవి మార్గఛందస్సులో విశేష వృత్తాలు. ఛందస్సుపై ఆమె సాధించిన సాధికారతకు ఇవి గుర్తు. 

ఆ తరువాత ఉత్తమపద్ధతి, మాధ్యమపద్ధతి, అధమపద్ధతి అని మూడు శీర్షికలతో మూడు పద్యాలు  వ్రాసింది.అవి  మార్గ ఛందస్సులో ఉన్నాయి. పరనిందచేసేవారి మాటలు చెవిన పెట్టకుండా, ఆధైర్యానికి చోటీయక , సందేహాలకు తావియ్యక, ఆటంకాలకు జంకక కార్యఫలం పొందేవాళ్ళు ఉత్తములు అనిపెద్దకార్యాలు తలకెత్తుకొని కీర్తి వస్తే  పొంగిపోయి, జననింద కలిగితే జడిసిపోయి వెనుకంజ వేసేవాళ్ళు మార్గం తప్పి ఫలం పొందలేనివాళ్ళు మధ్యములుఅనిముందు ఉత్సాహపడి ఆ తరువాత అసలాపని గురించే పట్టించుకోనివాళ్ళు పైగా పనిలో ఉన్నవాళ్లను పక్కకు లాగేవాళ్ళు అధములు అని ఆ పద్యాలలో ఆమె ఉత్తమమధ్యమ అధమ మానవ స్వభావాలను నిర్వచించింది.    

సావిత్రి పత్రిక ప్రారంభ సంచికనుండేనీతి పదములు’, ‘సతీ ధర్మములుఅనే రెండు శీర్షికలకింద ద్విపద  కవిత్వం వ్రాసింది లక్ష్మీనరసమాంబ. రెండు పాదాల ముక్తకాలు ఇవి. ఏ ద్విపదకు ఆ ద్విపద అర్ధవంతంగా ఉంటుంది. తరువాతి ద్విపదతో దానికేమీ కథాసంబంధం, భావసంబంధం ఉండదు. 1904 జనవరి నుండి ఏప్రిల్ వరకు నాలుగు సంచికలలో ఇవి వరుసగా వచ్చాయి.మళ్ళీ సెప్టెంబర్ సంచికలో వచ్చాయి. నాలుగు సంచికలు కలిపినీతిపదములులో  55 ద్విపదలు, ‘సతీధర్మములులో 53 ద్విపదలు వున్నాయి.సూది లేకుండఁగ రాదుగా కుట్టు/ సాధనములు లేక  సాగునే పనులువంటి లౌకిక వివేక జ్ఞానం కలిగించే నీతి వాక్యాలు సరళ సుందరంగా నీతిపదములు ద్విపదలలో ఒదిగిపోయాయి.కత్తిఁ బోలే భువిని గలముఁ కాగితముఁ   / గుత్తుకల నొకప్డు కోయఁ గాఁ జాలు” , “ఎవరి మాటయ వారి హృదయంబు( జూపు / ధవళ ముకుర

మనఁ దగియుండు సుమ్మువంటి ద్విపదలు  నిశిత లోకాపరిశీలనా శక్తి నుండి  వికసించిన బుద్ధి చాతుర్యాన్ని సూచిస్తాయి.పాతివ్రత్యముఁ బూను నాతికెల్లప్పుడుఁ / జేతిలోనె యభీష్ట సిద్ధులుండుఁ గఁదవంటి స్త్రీధర్మ ప్రబోధ ద్విపదలు కూడా ఇందులో అక్కడక్కడా ఉన్నాయి. 

సతీధర్మములు శీర్షిక కింద ద్విపదలనుశ్రీమల్లొక జనక! నే / నేమంబునఁ జిత్తసీమ నిల్పుకొనిన నీ / క్షేమంకర పాదయుగళి /కై మ్రొక్కి కడంగు దానఁ  గార్యంబునకున్అనే ప్రార్ధనా పద్యంతో ప్రారంభించింది లక్ష్మీనరసమాంబ.  స్త్రీలు అనుసరించదగు ధర్మములను క్రోడీకరించిన  ద్విపదలివి.  స్త్రీ భర్తకు సగం శరీరం అన్నట్లుగా ఉండాలి, సేవలలో దాసిగా ఉండాలి, ఆలోచనలో మంత్రిలాగా ఉండాలి, పాతివ్రత్యంకన్నా సౌఖ్యమిచ్చే వ్రతం లేదు ఇలాంటి ధర్మాలు ప్రబోధించ బడ్డాయి. భర్త చేసిన నేరాలు కంటపడ్డా బయటపెట్టకపోవటం, భర్త మీద నేరాలు ఎవరుచెప్పినా వినకపోవడం, భర్తను ఇతరులు నిందిస్తుంటే అక్కడ నిలబడకపోవటం, భర్త తప్పుపడితే మారు మాటాడకపోవటం, కోపగించి దెప్పకపోవటం స్త్రీధర్మాలుగా చెప్పటం చూస్తే లక్ష్మీనరసమాంబ దృక్పథం మనుధర్మనీతి కన్నా భిన్నంకాదని అనిపిస్తుంది. భర్త ఇంటికివస్తున్నప్పుడు సంతోషం కనబరిచే ముఖంతో ఎదురువెళ్ళమని, రాగానే ఇరుగుపొరుగు వారి కయ్యాలను చెప్పవద్దని, చికాకులో ఉన్నప్పుడు సంసారపు బాధలు చెప్పవద్దని, భర్తచేప్పే పనులు ఆలస్యం లేకుండా చేయమని హితవు పలికిన తీరు స్త్రీ జీవితం భర్తకు ఎంతగా అంకితమై ఉండాలో నిర్దేశిస్తుంది. 

నగలకై  భర్తను వేధించటం నేరం. పతి అనాకారి అయినా మన్మథుడిగా భావించాలి. భర్త కోపాగ్నిని  మాటలనే అమృతంతో ఆర్పాలి. భర్తను వశం చేసుకొనటానికి మందులు పెట్టవద్దు. - స్త్రీ ప్రవర్తన మీద ఇలాంటి నిషేధాలు ఎన్నో ఈ ద్విపదలలో చెప్పబడ్డాయి. భర్త మరొకరిని ప్రేమించినా , తనను నిర్లక్ష్యం చేసినా, ఆగ్రహించి మాట్లాడకపోయినా, తిట్టినా, కొట్టినా, కష్టాలు పెట్టినాభార్యకు కోపం రాకూడదు. వినయంతో సేవలు చేయవలసినదే. సతుల చరిత్రలు స్మరించుకొంటూ కాలం గడపవలసినదే. ఇదీ  సతీధర్మం అని ఈ ద్విపదలలో నొక్కిచెప్పింది కవయిత్రి. 

లక్ష్మీ నరసమాంబ కు ఆంగ్లభాషాసాహిత్యజ్ఞానం కూడా ఉన్నది. ఆంగ్లంలో లాంగ్ ఫెలో అనే కవి వ్రాసిన సామ్ ఆఫ్ లైఫ్ అనే శీర్షికగల పద్యాలను అనుకరించి తెలుగులో మార్గఛందస్సులో పద్యాలు వ్రాయటమే అందుకు నిదర్శనం. ఇవి తొమ్మిది పద్యాలు. పద్యాలకు తాత్పర్యం కూడా ఇచ్చింది. ఆత్మకు నాశనంలేదని, జీవితమంటే సుఖదుఃఖాలను అనుభవించటం మాత్రమే కాదని, ఈశ్వర సాన్నిధ్యానికి చేరువచేయగల సన్మార్గంలో కష్టసుఖాలను లెక్కచేయకుండా పోవటమే అని, యుద్ధవీరులవలె కామక్రోధదశత్రువులను జయించాలని, సత్కార్య సాధనలో కాలం గడపాలని ఈ పద్యాలు స్థూలంగా ప్రబోధిస్తాయి. 

1904 మే  సంచికలోసరస్వతీపరిదేవనమఅనే శీర్షికతో తొమ్మిది పద్యాల ఖండిక ఒకటి రచయిత పేరు లేకుండా ప్రచురించబడింది. 1907 జులై సావిత్రి వెనుకపేజీలో సావిత్రి కార్య స్థానమున వెలకొరకు దొరుకు పుస్తకాల జాబితాలో సుజ్ఞాననవరత్నములు తోపాటు అమూల్యము, మధుపద్వయము, సరస్వతీ పరిదేవనము కలిపి ఒక పుస్తకంగా లభిస్తున్న సమాచారం ఉంది. దానిని బట్టి ఈ సరస్వతీ పరిదేవనము లక్ష్మీనరసమాంబ రచనే అని నిర్ధారణ అవుతున్నది. 

పరిదేవనము అంటే దుఃఖంతోటి మాట. సరస్వతి దుఃఖంతో మాట్లాడే మాటలు ఈ పద్యాలన్న మాట. సరస్వతికి దుఃఖం ఎందుకు? సరస్వతి విద్యకు,జ్ఞానానికి అధిదేవత అంటారు. ఈ సమాజంలో విద్యావంతులు, జ్ఞాననవంతులు అందరూ పురుషులే. సరస్వతికి స్నేహితులు, సన్నిహితులు  అందరూ పురుషులలో స్త్రీలు లేరు. అదే ఆమె దుఃఖానికి కారణం.ఏ నిటులెంత కాలమని యీద( గ ( జాలుదు నొడ్డు గానఁగా రాని సఖీ వియోగ జలరాశిఅన్నది ఆమె బాధ. బ్రహ్మ ముఖంలో నివాసమున్న సుఖం, వైభవం, కళా స్పదమైన పండితులసేవ అన్నీ ఉన్నా జీవితం అసలేమీ బాగాలేదంటుంది సరస్వతి.  “…. కళాయి లేని ముకురంబటు తోఁచెడు నా వయశ్యలౌ/ శృతివిదుషల్ సతీమహిమ శోభితలున్ నానుబాయనక్కటాఅని వాపోయింది. సఖీవియోగం అంటే కేవలం స్నేహితుల ఎడబాటు అన్న సాధారణార్ధం కాదిక్కడ. ఆ సఖులు  శృతి స్మృతి శాస్త్ర జ్ఞానులు.సతీ ధర్మం కలిగిన వాళ్ళు. రెండూ కలిసి గొప్ప సృజనకారులు. ఇదివరకు అలాంటి స్త్రీలతో తనకు సహవాసం ఉంది. ఇప్పుడు లేదు.  లేకపోవటంవలన ఆమెకు జీవితం కళాయి లేని అద్దంలాగ అర్ధరహితమై తోస్తున్నది.ఎన్నడు కూడి యాడితినో ఇష్టసఖీ నికరంబు తొడ’  అన్న పద్యంలో క్రీడాస్థలాలుగా పేర్కొన్న ఉన్నత శయ్యలు, అలంకారాలుగా పేర్కొన్న శ్రేష్టము, ఉచితమూ అయిన వృత్తులు, హారరీతులు, అలంకారాలు అన్నీ సాహిత్య శాస్త్ర సంబంధ పరికరాలే. స్త్రీలకు సహజ అలంకారాలుగా వాటిని చెప్పటం ద్వారా స్త్రీల సహజ సాహిత్య సృజన శక్తి ని అలవోకగా సూచించింది లక్ష్మీనర్సమ్మ. అయితే అలాంటి స్త్రీలు, వాళ్ళతో తన ఆటపాటలు ఎప్పుడు ఎక్కడ ఎలా మాయమయ్యారు? “ మూర్ఖజనైక వంచనన్ఇదంతా జరిగిందని సరస్వతి స్పష్టంగా చెప్పింది. ఆ వంచన స్వరూప స్వభావాలు అర్ధం చేసుకొంటూ కోల్పోయిన దానిని తిరిగి పొందటానికి స్త్రీలు ప్రయత్నపరులవుతున్న సందర్భం నుండి వచ్చిన కవిత ఖండిక ఇది. 

మధుపద్వయము 49 పద్యాల నీతికథ (సావిత్రి,1904,అక్టోబర్). మొదటి పద్యం ఇష్టదేవతాస్తుతి.గోగణంబులు గృహంబుల జేరువేళ కథ మొదలవుతుంది. శారద అనే అమ్మాయి కమలాంబ అనే తనస్నేహితురాలి దగ్గరకు వెళ్లి సూర్యాస్తమయ సౌందర్యం చూడటానికి తోటకు తీసుకొని వెళ్తుంది.వాళ్లిద్దరూ  “దివిఁ జంద్రుఁ డొకండె, భూమిపై గనఁగ సుధాకరద్వయము గన్ప డెనంచు భ్రమించునట్లుగన్ఉన్నారని వర్ణిస్తుంది లక్ష్మీనరసమాంబ. తోటంతా తిరుగుతూ తుమ్మెదలు చెలరేగి రొదపెడుతుండటం చూస్తారు. వాటిలో రెండు తుమ్మెదలు కేతకీ ప్రసవం మీద వాలి బయటకురాలేక అక్కడేఅటూఇటూ తిరుగుతూ బాధతో రొదపెట్టటం చూచి శారద వాటిస్థితికి కారణాన్ని ఊహించి చెప్పటం ఇందులో విషయం. మల్లియ మీద జీవించే తుమ్మెదలు కొన్ని మరొకచోటికి పోవటానికి బయలుదేరగా వాటిలో రెండుమిగిలిన తుమ్మెదలు అది పద్మం వాలే తేనె ఉన్న పువ్వు కాదని వారిస్తున్నా వినక  కేతకీ పుష్పం పై ఆకర్షణ తో వాలాయని, మొగిలిరేకల ముళ్ళకు చిక్కి బయటకురాలేకపోతున్నాయని ముందుగతి తెలుసుకోక గర్వించి చేసిన పనికి ఫలితం అలాగే ఉంటుందని ఆమె కథనం. 

ఇలబుధులెన్ను నీతి నిరసించుటయున్, దన దానిమేలుతాఁ  

దలఁచి గ్రహింపలేకెదుటి దానికై భ్రమఁ  బొందుచుంటయున్ 

గలిగి చరించువారలకుఁ  గాంచన కేతకిఁ  గాంచినట్టి య 

య్యళుల  యవస్థ చేకురు నటంచు నెఱింగి మెలంగఁ గావలెన్ --  ఇది ఫలితార్ధం అని లక్ష్మీ నరసమాంబ ఈ నీతికథను పూర్తి చేసింది. 1907 జులై సావిత్రి వెనుక పేజీలో పేర్కొనబడిన నరసమాంబ కవిత్వ సంకలనం లో ఈ మధుపద్వయం కూడా ఉంది.  

1905 నవంబర్ - డిసెంబర్ సంచికలో అమూల్యము అనే శీర్షికతో 279 పంక్తుల తేటగీతి మాలిక  ప్రచురించబడింది. తేటగీతులను దండవలె ఒకదాని సంబంధంలో మరొకటి కూర్చు కొంటూ పోవటం తేటగీతి మాలిక అనబడుతుంది. పద్యరచనలో లక్ష్మీనరసమాంబ సాధించిన పరిణితికి , ధారాళతకు ప్రతీక ఇది.  రచయిత పేరు లేని ఈ కావ్యఖండిక   సుజ్ఞాననవరత్నములు తో పాటు ప్రచురించబడిన  లక్ష్మీనరసమాంబ ఖండికల సంకలనంలో  పేర్కొనబడింది కనుక  దానిని బట్టి ( 1907,జులై, సావిత్రి)అమూల్యముఆమె రచనే అని నిర్ధారించవచ్చు. ఇది  కూడా నీతి కథే. 

ఒక సంధ్యాసమయంలో నది ఒడ్డున ఒక బిడ్డ ప్రశ్నకు తల్లి ఇచ్చిన సమాధానంగా సాగే కథనం ఇది. పక్షులు, పంటలు, పక్షులు, మృగాలు, కీటకాలు, కొండలుభూమి, అగ్ని, ఆకాశం, మైదానాలు, గాలి, నీరు మొదలైన అణువు నుండి బ్రహ్మానందం వరకు దైవ సృష్టిలోగల పదార్ధాలు అన్నీ ఒకటిని మించి ఒకటి ఎక్కువ ఉపయోగం వూన్నవిగా కనిపిస్తున్నాయి. వాటన్నిటిలో అమూల్యమైనది ఏదో తేల్చుకోలేకపోతున్నాను. తెలియచెప్పవా అని కూతురు అడిగితే తల్లికాలమునకంటెనుపయోగకరములేదు / కాలమె యమూల్య   మన్నిఁటి కంటే జగతిఅని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఎన్నో  చేయటానికి, సంపాదించటానికి వీలయిన కాలం  ఎప్పుడూ వ్యర్థం చేయరానిదని, తిరిగిరాని కాలాన్ని సద్వినియోగం చేసు కొనటానికి  మనుషులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలని నిరూపించిన  కమల విమల అనే అక్కాచెల్లెళ్ల కథను ఉదాహరణగా చెప్పి అందువల్లజగతినమూల్యంబు-కాలమెసుమఅని నిర్ధారించి ఆతల్లి చెప్పటంతో ఈ ఖండిక ముగుస్తుంది. 

ఇవికాక బందరులోని  బృందావనపుర స్త్రీ సమాజము ఆరవ వార్షిక సభలకు హాజరైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆశీర్వాదపద్యాలు( 1911,జనవరి,ఫిబ్రవరి) విక్టోరియా రాణి మనుమడైన పంచమ జార్జిచక్రవర్తికి  ఢిల్లీ లో పట్టాభిషేకం జరిగిన సందర్భంగా ఢిల్లీ పట్టాభిషేక పద్యాలు (1911, అక్టోబర్,నవంబర్, డిసెంబర్) కూడా ఆమె వ్రాసింది. 

లక్ష్మీ నరసమాంబ చేసిన మరొక ప్రక్రియా ప్రయోగం పాట. పాట స్త్రీల విద్య. స్త్రీల సాంస్కృతిక భావజాలాన్ని తీర్చిదిద్దే నోములు,వ్రతాలకు అవి అనుబంధాలు. పూజ అంతా అయ్యాక భగవంతుడికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు , పేరంటాలలో స్త్రీలు మంగళహారతులు పాడుకొనటం సంప్రదాయంగా వస్తున్నది.స్త్రీలు  సంఘాలు పెట్టుకొని సమావేశాలు జరుపు కొం టున్న ఆ తొలిదశలో స్త్రీల సమావేశాలు శుక్రవారం నాడు ఏర్పాటు చేసుకొనటం, భక్తి గీతాలు, మంగళహారతులు పాడుకొనటం, పసుపు కుంకుమలు, పండూ తాంబూలం ఇచ్చుకొనటం జరిగేది అంటే ఇప్పుడు ఆశ్ఛర్యంగా ఉంటుంది కానీ అదొక సామాజిక వాస్తవం.  హిందూ సుందరి, సావిత్రి వంటి స్త్రీల పత్రికలు ప్రారంభమై  స్త్రీలు రచనలు చేయటం మొదలుపెట్టిన ఆ కాలంలో  స్త్రీలు చాలామంది  మంగళ హారతులు వ్రాయటం కూడా ఆ సంస్కృతిలో భాగమే. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసమాంబ పాటలు వ్రాసింది. 

హిందూ సుందరిలో ప్రారంభమైన ఆమె పాటల రచన (1902,జూన్ & 1903, జులై) సావిత్రి పత్రికలో(1904, జనవరి  మంగళహారతుల శతక రచన సంకల్పంగా  మొదలై  రెండుమూడేళ్లపాటు పత్రికలో వరుసగా ప్రచురితమవుతూ వచ్చాయి.  పల్లవి చరణాలు -పాడుకోవలసిన బాణీ ఒకొకసారి రాగ తాళ సూచన ఇదీ పాత సరళి. ఒకపంక్తి తో , ఒకటిరెండు చరణాలతో ముగిసే చిన్న పాటల నుండి మూడునాలుగు పంక్తులతో కూడిన  అయిదారు చరణాలతో  ముగిసే పెద్దపాటలు కూడా ఉన్నాయి. చివరిచరణం  ‘నరసాంబనామ ముద్ర ఉంటుంది. పాటలు  చాలావరకు స్త్రీదేవతా సంబంధమైనవి. ఇవి ఆ తరువాతమంగళహారతులశతకముపుస్తకంగా కూడా వచ్చింది.పూజాతత్పరులగు సఖీమణుల విశేషోపయోగమునుద్దేశించి’  తాను ఆ శతకం వ్రాసానని, ఆమె చెప్పుకొన్నది (1910, జులై) ఆ  పాటలు అనేకమంది స్త్రీలు, బాలికలు ఆ పాటలను విరివిగా పాడుకొనటం, హార్మోనియం వాడుతూ పాడటం తనకు ఇచ్చిన  ప్రోత్సాహం తో  ఇతరసమయాలలో పాడుకొనటానికి అనువగు గీతాలు  వ్రాయాలన్న ఉత్సాహం కలిగి 1910 జులై లోస్త్రీనీతి గీతములుఅనే శీర్షికతో పాటలు ప్రచురించింది.నీతివిషయములుగాని, భక్తివిషయములుగాని గీతములు మూలమున జనసామాన్యము యొక్క హృదయానికెక్కినట్లు మఱి యేయితర సాధనములచేతను సులభముగా నెక్కఁ  జాలవు అనిఆమె అభిప్రాయం.  ఆత్మాభివృద్ధికరములైన భక్తి, శాంతం, భూతదయ, సత్యము, వినయము మొదలైన సుగుణాల గురించి మొదటి భాగంలో శరీర ఆరోగ్య గృహ విషయ సంబంధమైన అంశాలను రెండవభాగంలోనూ తెలిపానని ఆమె పేర్కొన్నది. ఇవి కూడా సావిత్రి పత్రికలో వరుసగా ప్రకటించబడ్డాయి. అన్నీ ప్రకటించబడ్డాయో లేదో తెలీదు. స్త్రీధర్మములు ఏవి ఇంతకు పూర్వం ఆమె ద్విపదల రూపంలో చెప్పిందో దాదాపు వాటినే  స్త్రీనీతిగీతాలలో కూడా చెప్పటం  గమనించవచ్చు. 

                                                                              (ఇంకావుంది)

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర 

భండారు అచ్చమాంబ గురించి ఆమె మరణానికి ( 1905 జనవరి 18 ) ముందూ ( సెప్టెంబర్- అక్టోబర్ 1903) తరువాత (డిసెంబర్- జనవరి 1905 ) కూడా  హిందూ సుందరి పత్రికలో  భండారు అచ్చమాంబ గురించిన పరిచయ వ్యాసాలు వచ్చాయి. మరణానంతరం సావిత్రి పత్రికలో కూడా  (మార్చ్- ఏప్రిల్ 1905) ఒక వ్యాసం వచ్చింది.  హిందూ సుందరి  పత్రిక  అబలా సచ్చరిత్ర రత్న మాల, మరికొన్ని వ్యాసాలు అచ్చమాంబ రచనలు అని పేర్కొన్నాయి కానీ అప్పటికే హిందూ సుందరిలో ఆమె కథలు వచ్చినప్పటికీ కథా రచయితగా ఆమెను పేర్కొనలేదు. కథ  అప్పుడప్పుడే పరిచయం అవుతున్న ప్రక్రియ కావటం వల్ల దానిని ప్రత్యేకంగా గుర్తించలేక పోయి ఉంటారు.  అందువల్లనే  వాళ్ళు కథలను కూడా వ్యాసాలు అనే పేరుతోనే ప్రస్తావించి ఉండవచ్చు. సావిత్రి పత్రిక కూడా అబలా సచ్చరిత్ర రత్నమాల తో పాటు ఒక శతకాన్ని, క్రోషా అల్లిక, ఊలు అల్లిక ల పద్ధతిని తెలిపే పుస్తకాలను పేర్కొన్నదే కానీ కథలను గురించి ఏమీ చెప్పలేదు. దీనిని బట్టి అప్పటికి కథ అనే  ప్రక్రియ వాళ్లకు ఇంకా పూర్తిగా  పరిచయం లేనిదే అనుకోవలసి వస్తుంది. అందువల్ల భండారు అచ్చమాంబ కథలను ప్రత్యేకం పరిశీలించవలసి ఉంది.  

తెలుగునాట స్త్రీలు తమను తాము తెలుసుకొనటానికి, తమను తాము నిర్వచించుకొనటానికిఇన్నాళ్లూ తమకు తెలియని తమ చరిత్రను, సాహిత్య చరిత్రను కూడా తవ్వి తలకెత్తుకొనటానికి అవసరమైన కొత్త చైతన్యం వికసించిన 1990 వ దశకపు ఆవిష్కరణ లలో  భాగం- తెలుగులో కథా సాహిత్యచరిత్ర  1910 లో వచ్చిన గురజాడఅప్పారావు దిద్దుబాటు కథతో కాదు మొదలైంది, అంతకు ఎనిమిదేళ్ల క్రితమే భండారు అచ్చమాంబ వ్రాసినధనత్రయోదశికథతో అన్న ఒకకొత్తప్రతిపాదన. ( కె.లలిత, 1998,కొండవీటి సత్యవతి 2006) వేరువేరు సందర్భాలలో తొలికథలుగాప్రస్తావించబడిన ఏడు కథలను- నిదర్శనాలతో సహా   ‘తొలితెలుగుకథ- ఏడు అభిప్రాయాలు’  అనే శీర్షికతో కథా నిలయం( శ్రీకాకుళం, 2006) ప్రచురించింది. ఈ ఏడు కథలలో కాలక్రమ వరుసలో మొదటిది, రెండవది కూడా భండారు అచ్చమాంబ వ్రాసినవే. అందువల్ల తొలి తెలుగు కథధనత్రయోదశిఅన్నది స్థిరమైంది.

            1910 లో సంగిశెట్టి శ్రీనివాస్ భండారు అచ్చమాంబ  కథలు  పది  సేకరించి తొలి తెలుగు కథలు అనే శీర్షికతో ప్రచురించటంతో తొలి కథ ధనత్రయోదశి కి బదులు అంతకన్నా ఏడాది ముందు వచ్చినగుణవతియగు స్త్రీఅయింది. ఆ కథ  తరువాత ధనత్రయోదశి కన్నా ముందు  వ అచ్చమాంబ వ్రాసిన  కథలు మరో అయిదు ఉన్నాయని తేలింది.

 దిద్దుబాటు కథ కన్నా ముందు కథలు ఉన్నాయని తెలుస్తూ ఏది తొలి కథ అన్న చర్చ సాహిత్య ప్రపంచంలో జరుగుతుండగా కుతూహలంతో పాత పత్రికలను వెతుకుతూ వచ్చిన వివినమూర్తి దిద్దుబాటు కన్నా ముందు 92 కథలు ప్రచురించబడ్డాయని గుర్తించటం, ‘దిద్దుబాటలుఅనే పేరుతో ఆ కథలతో ఒక సంకలనం 2015 లో ప్రచురించటమూ జరిగింది. దీనివల్ల అచ్చమాంబ వ్రాసిన గుణవతియగు స్త్రీ అనే కథకన్నా ముందు ముప్ఫయి నాలుగు కథలు ఉన్నట్లు తెలుస్తున్నా , మహిళా కథకురాలుగా  అయినా సరే భండారు అచ్చమాంబ తొలి  స్థానం అలాగే ఉంటుంది. 

                                                            1

అంతవరకు దేశీయ స్త్రీల ప్రతిభా ప్రత్యేకతలను చెప్పే కథనాలు వ్రాస్తున్నభండారు అచ్చమాంబచిన్నసొంతకథలల్లుటకుఆరంభంప్రేమ పరీక్షణముకథ. అది  తెలుగు జనానా పత్రికలో 1898 జులై సంచికలో అచ్చయింది.ఆతరువాత ఆమె వ్రాసినఎరువు సొమ్ము పఱువు చేటుఅదే పత్రికలో సెప్టెంబర్ సంచికలో ప్రచురించబడింది. మిగుల రమ్యమైన కథగా రాయసం వెంకట శివుడి ప్రశంసకు పాత్రమైన కథ అది. (తెలుగుతల్లి, కొమర్రాజు లక్ష్మణ రాయ వర్ధంతి సంచిక, 21వ వర్ధంతి, 1944,పు;15 ) కానీ ఇప్పుడు ఆ రెండు కథలూ అలభ్యాలు. లభిస్తున్న కథలలో మొదటిదిగుణవతి యగు స్త్రీ’  1901 మే నాటి తెలుగు జనానా పత్రికలో ప్రచురించబడింది. పొదుపుగా సంసారం చేయగల స్త్రీ నేర్పు గురించి దశకుమార చరిత్రలో వున్నఒక  కథకు చక్కని  వచన కథనం ఈ కథ. స్త్రీలదేముంది వండిపెట్టటమే కదా అని తేలిగ్గా అంటుంటారు.నిజానికి  ఆహారం తయారుచేయటం, కుటుంబంలో అందరికీ పంపిణీ చేయటం అనేవి చిన్న విషయాలు కాదు. అందుబాటులో ఉన్న వనరులను  ఉపయోగించటం, లేని వాటిని సమకూర్చుకొనే  మార్గాలు తెలుసుకొనటం ఈ రెండూ సమర్ధవంతంగా  చేయ గలిగి నప్పుడే  ఇంటిల్లిపాది ఆకలిని తీర్చి అలజడి లేకుండా సంసారం నడపగలుగుతుంది స్త్రీ .వేట, పశుపోషణ దశలలో తల్లి గుంపుల మనుగడకు ఆహారాన్ని పంపిణీ చేయటమే తొలి అధికారంగా ప్రారంభమైన ఆ విధమైన  స్త్రీల సామర్ధ్యమే నానాటికీ పదునెక్కుతూ వచ్చిందన్న విషయం గుర్తించాలి. ఆ సామర్ధ్య  నిరూపణకు   పాతకథలైనా సరే సరి కొత్తగా చెప్పుకోవలసి వస్తుంది. భండారు అచ్చమాంబ ఆ పనే చేసింది. 

రెండవదిలలితా శారదలుమూడవదిజానకమ్మ’   ఈ రెండూ  తెలుగు జనానా లోనే ప్రచురించబడ్డాయి. మొదటిది 1901 సెప్టెంబర్ సంచికలో వస్తే రెండవది 1902 మే సంచికలో వచ్చింది. ఈ రెండు కథలలో సాధారణాంశం పిల్లల పెంపకం పట్ల ఉండవలసిన దృష్టి. సంపద అధికారం ఉన్న కుటుంబాలలో  పిల్లల పెంపకం అధికార దౌర్జన్య లక్షణాలను పెంచి పోషించేదిగా ఉండటం గురించి లలితా శారదలు కథ హెచ్చరిస్తుంది. అతి చిన్న వయసులో తన ఈడు ఆట పాటల పిల్లలపై  పెత్తనం చేస్తూ  దండించే  లలితకు ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందితహసీల్దారు అయిన తండ్రి  పెంపకంలోని గారాబం నుండి వచ్చింది. తండ్రి ఉన్నోతోద్యోగం సంపాదించిన ధనం, పెంపకం ఆ పిల్ల జీవితాన్నిఆడింది ఆట, పాడింది పాట చేసిఉండవచ్చు గానీ, తోటిపిల్లలు ఆ అమ్మాయిని చూసి భయపడి పారిపోయేంతగా ఒంటరిని కూడా చేసిందన్నది వాస్తవం. శారద తటస్థపడి ఉండకపోతే ఆ పిల్ల జీవితం ఎలా పరిణమించి ఉండేదో అనూహ్యం. శారద తనను బాధించిన వాళ్ల పట్ల సహనంతో ప్రవర్తించేట్లు పెంచబడిన బిడ్డ.అందువల్లనే తనను కొడుతూ పక్కన ఉన్న గులాబీ చెట్టు మీద పడి ముళ్ళు గుచ్చుకొని చెయ్యంతా  గాయమైన లలితకు  రక్తం  కడిగి ఓదార్చి సేద తీర్చింది, అదే లలితను తన తప్పు తెలుసుకొని మంచికి మారేట్లు చేయ గలిగింది. ఈ నాటి సమాజంలో నేరచరిత్రులు అయిన అధికారవర్గాల, సంపన్నవర్గాల పిల్లలు శారద స్నేహ గుణం వల్ల మంచికి మారగలిగిన 120 ఏళ్ల నాటి లలితలోని  సున్నితత్వాన్నిఏమైనా మిగుల్చుకొన్నదా అన్నదే ఇప్పటి ప్రశ్న.

వివేకవంతులైన తల్లిదండ్రుల పెంపకంలోని సహజమైన ప్రేమ, శ్రద్ధ పిల్లలను ఎంత సంస్కా రవంతులను చేస్తుందో జానకమ్మ కథచూపిస్తుంది. ఈకథ నాటికి కథ ప్రవర్తించటానికి  నిర్దిష్ట దేశ కాలాలు ఉండాలన్న స్పృహ అచ్చమాంబకు కలిగింది. ఆడపిల్లల పెంపకం, అందు లోనూ విద్య  గురించిన వస్తువు కనుకనో ఏమో సంఘసంస్కరణ అనగానే గుర్తుకువచ్చే  గోదావరి జిల్లాల లో ఒక  లంక గ్రామాన్ని కథా స్థలం చేసింది. బాలికలను పాఠశాలకు పంపుట ఏమో ఎరుగని కాలాన్ని , పైగా అలా పంపటం వింత తప్పుగా భావించే కాలాన్ని కథా కాలం గా చేసింది . ఈ కాలానికి ఎదురీది కూతురిని కొడుకులతో పాటు బడికి పంపి చదివించిన తండ్రి రంగరాజు ఈ కథలో ఆదర్శ వ్యక్తి .బిడ్డ  జానకమ్మని ఆయన కూడా గారాబం చేస్తాడు . దాని రూపం  దగ్గర కూర్చో బెట్టుకొని నీతి కథలు చెప్పటంగా  ,            దాన దయా గుణాలను అభ్యాసం చేయించటంగా , తనకు కావలసిన చిన్న చిన్న పనులు చేయించుకొనటంగానిర్మల ప్రేమతో ,తియ్యని మాటలతో బుద్ధి గరపటంగా  రకరకాలుగా ఉండేది . ఆ శిక్షణ తల్లికి ఇంటిపనులలో సహాయంచేయటం , ఇరుగు పొరుగు పేదవారికి సహాయం చేయటం జానకమ్మ సహజ గుణాలుగా చేసింది . పెంపకపు పద్ధతి పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దేటట్లు ఉండాలని , చక్కగా పెంచబడ్డ బిడ్డలకు అభ్యుదయాలు సమకూరుతాయని చెప్పటం అచ్చమాంబ ఉద్దేశం . జానకమ్మ కు యోగ్యుడైన వరుడు కట్నం ఆశించకుండా వచ్చాడంటే ఆమె అంత కోరదగిన గుణవతి అయిన స్త్రీగా తీర్చి దిద్దబడటం వల్లనే అన్నది ఈ కథ అంతరార్ధం . 

పరోపకారం పిల్లలకు నేర్పవలసిన విలువ. జానకమ్మ తండ్రి ఆమెకు అది తెలియ చెప్పగలిగాడు. మాటగా చెప్పటం ఒకటి . తమ ఆచరణ ద్వారా నేర్చుకోవలసింది ఏదో పిల్లలకు అర్ధమయ్యేట్లు చేయటం మరొకటి . జానకమ్మ విషయంలో ఈ రెండు పద్ధతులు పనిచేసాయి.  సత్పాత్ర దానము ( హిందూ సుందరి , ఆగస్ట్ 1902) కథ దానికి పొడిగింపుగా కనబడుతుంది. ఈ కథలో బడి చదువుల పిల్లవాడు కేశవుడికి కూడా తల్లి పెంపకంలో పరోపకార బుద్ధి అలవడింది. బుద్ధి అలవాడగానే సరిపోదు. ఎవరికి ఎప్పుడు ఏరకమైన ఉపకారం చేయాలో దానికి సంబంధించిన యుక్తాయుక్త  వివేకం పిల్లలో వికసించేట్లు చూడ టం కూడా మంచి పెంపకం లక్షణం. దారిన బోతున్న గుడ్డివాడికి పావలా దానం చేద్దామని కొడుకు వచ్చి అడిగితే తల్లి ఆ గుడ్డి బిచ్చగాడికి పిలిచి అన్నం పెట్టి అతని వివరాలు అడిగి తెలుసుకొని కొడుకుల కుటుంబ పోషణకు అడుక్కొని డబ్బు సంపాదించే ప్రవర్తన ప్రోత్సహించదగినది కాదని, అతనికి ఇయ్యదలచిన పావలా తమ ఇంటికి వచ్చే వారాల కుర్రవాడికి ఇస్తే బడి ఫీజు చెల్లించి చదువుకోగలుగుతాడని తల్లి కేశవుడికి ఎరుక పరచిన తీరు బహు ఆర్ద్రమైనది.  

 జానకమ్మకు కట్నం ఆశించని సంబంధం లభించిన విషయం వంటిదే  బీదకుటుంబము  (సావిత్రి, ఫిబ్రవరి  1904) కథలోనూ కనబడుతుంది. ఆకథలో భర్త చనిపోయిన ఒక స్త్రీ గోధుమలు, జొన్నలు మొదలైనవి విసరి వచ్చేకూలీ డబ్బుతో ఆరుగురు పిల్లలను పెంచిపెద్ద చేసింది. కూటికి పేద కావచ్చు, గుణానికి కాదు అనే సామెత తెలిసిందే. శ్రమ చేయకుండా ఎవరిదగ్గరా దేనికీ చేయిజాచని ఆత్మాభిమానం, దానిని పిల్లల చేత కూడా అభ్యాసంచేయించిన పెంపకం ఆమెది. అదే అందరినీ గుణ సంపన్నులను చేసింది. ఆ గుణ సంపన్నత కారణంగానే కొడుకులు చదువుకొని ఉద్యోగస్థులయ్యారు. కూతురిని పొరుగింటి వారు కోరి వాళ్ళబ్బాయికి  చేసుకొన్నారు. ఈకథా స్థలం మహారాష్ట్ర.గోధుమలు,జొన్నలుసజ్జలు పిండిగా విసిరి రొట్టెలు చేసుకొనే మహారాష్ట్రలో ఒకరి ఇంట్లో పనిగత్తెలుగా ఉండటానికి ఇష్టపడని అభిమానధనులు ఈపిండ్లు విసరాటాన్నే జీవనా ధారంగా చేసుకొని బతుకుతుంటారు. అలాంటి స్త్రీయే ఈ కథలోని వెంకమ్మ. స్థిరచిత్తం, గంభీరమైన  వివేకవంతమైన వ్యక్తిత్వం గల స్త్రీలు  పేదరికం వంటి ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూనే విలువలకోసం నిలబడగలరు. సద్గ్రంథ పఠనం అందుకు సహాయకారి. వెంకమ్మ పాత్ర ఆరకంగా నిర్మితమైనదే. 

ధనత్రయోదశి (హిందూసుందరి, నవంబర్1902)  కథలో విజయలక్ష్మమ్మ కూడా వెంకమ్మ వంటిస్త్రీయే. ఈ కథ ప్రవర్తించే దేశం కూడా మహారాష్ట్ర లో బొంబాయి. పేదరికం దుఃఖ కారణంగా ఉన్నా ప్రలోభాలకు లొంగక  భర్తను లొంగనీయక హెచ్చరికగా ప్రవర్తించిన వ్యక్తిత్వం ఆమెది. ఆకలిగొన్నవాడు చేయని నేరం లేదు అన్నది వాస్తవం. ఎంత సద్గుణ సంపన్నులైనా లేమి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళను తప్పుదోవకు మళ్లించవచ్చు. ఈ కథలో  వెంకటరత్నం పరిస్థితి అదే. నెలకు  పది  రూపాయల జీతానికి  గుమస్తాగా పని చేస్తూ  దానితో  భార్యాబిడ్డల అవసరాలు పూర్తిగా తీర్చలేకపోతున్నానే అన్న అసంతృప్తిని లోలోపల అణుచుకున్నవాడు. పెద్ద గుమస్తా శెట్టిగారి సంపదలో మనం కొంత కొట్టేసినా తెలియదు అని చెప్పిన మాటలు అణచి పెట్టుకొన్న అసంతృప్తిని రెచ్చగొట్టాయామో ఏమో అతను ఇచ్చిన వంద రూపాయలు ఇంటికి తీసుకొని వచ్చాడు. కానీ  తాను చేస్తున్న పని సరైనది కాదన్న హెచ్చరిక అంతరాత్మ వినిపిస్తూనే ఉంది . ఆ  సంఘర్షణలో నిదురలేక  వేదన పడుతున్న అతని స్థితిని కనిపెట్టి భార్య అసలు విషయం తెలుసుకొని  అతడు అది చేయవలసిన పని కానేకాదని పరిపరి విధాలా చెప్పి ఒప్పించి పతనం కాకుండా  ఆతడిని  కాపాడుకొన్నది. గురజాడ దిద్దుబాటు కథలో వేశ్యా గృహాలకు  వెళ్తున్న భర్త ప్రవర్తనను చక్కదిద్దటానికి చొరవ చూపిన కమలిని కన్నా భండారు అచ్చమాంబ ధనత్రయోదశి కథలో అన్యాయార్జితం కూడదని తనను తాను దిద్దుకొనటానికి  భర్తకు ప్రేరణ శక్తిగా నిలిచిన విజయలక్ష్మమ్మ ఎనిమిదేళ్ళ పెద్దది.

అద్దమును సత్యవతియును ఒక చక్కని కథ.మూడునాలుగేళ్ల పసిపిల్ల అద్దంలో తననుతాను చూచుకొని మరొక పిల్ల అక్కడ ఉన్నదని తనను వెక్కిరిస్తున్నదని భ్రమపడిఅమ్మమ్మ చెబితే అది అద్దంలో తన ప్రతిబింబమేనని, తాను ఏది చేస్తే ఆపిల్ల అదేచేసిందని తెలుసుకొనటం ఇందులో విషయం.ఒక బాల్యాంక విచేష్టను మనోహరంగా కథనంచేయటంతో ముగిస్తే సాధారణకథ అయ్యేది. అక్కడ ఆగక  ఆ పిల్ల ఆ అనుభవాన్నిపెద్దయ్యేటప్పటికి ఒక విలువగా పరివర్తింప చేసుకొనటాన్ని కూడా చెప్పటం వలన మంచి కథ అయింది.ఏమిటి ఆవిలువ? “ ఈజగమంతయు నొక యద్దమనియు మనము దాని వైపున కోపముగా చూచిన బ్రతిబింబము కోపముగా, సంతోషముగా దానింగనిన ప్రతిబింబము సంతోషముగాను కనిపించును.ఈ కొసమెరుపు వాక్యంతో లోకంతో మన సంబంధాలను ఎలా నిర్వచించుకోవాలో, ఎలా నిర్మించుకోవాలో సూచింది అచ్చమాంబ.

ఇక మిగిలిన మూడు కథలు భార్యాభర్తల సంవాదాలకు, సంఘర్షణలకు సంబంధించినవి. సంవాదం ప్రధానమైన కథలు రెండు. రెండింటి శీర్షికలుభార్యాభర్తలసంవాదముఅనిఉన్నప్పటికీ వాటిలో ఒకటి స్త్రీవిద్యకు మరొకటి నగలకు సంబంధించినది. పై చదువులకోసం చెన్నపట్నం  (మద్రాసు) వెళుతున్న భర్తకు భార్యకు మధ్య వీడ్కోలు సన్నివేశం మొదటి కథ ( హిందూ సుందరి , డిసెంబర్ 1902) లో చూస్తాం. మూడు నాలుగు రోజులకు ఒకసారి ఉత్తరం వ్రాయాలని ఆమె అడిగినప్పుడు మరి నీ క్షేమ సమాచారాలు నేను తెలుసుకొనటం ఎలా అని అతను అడిగితేమీ వలె  చదువు వచ్చి యుండినను నిత్యమును సంతోషముగా నుత్తరములు వ్రాసి యుందునుఅని ఆమె సమాధానం ఇచ్చింది. అప్పుడప్పుడు తమ్ముడిచేత వ్రాయించి పంపుతానని అంటుంది .అక్కడి నుండి  అసలు కథ మొదలవుతుంది. నీకు చదువు వచ్చి వుంటే ఈతిప్పలు ఉండేవి కాదుగా అంటూ అతను , పెళ్లయినప్పటి నుండి ఎన్నిరకాలుగా చెప్పినా చదువు నేర్చుకోకపోతివి అని నిష్టూరమాడటంతో మాటకు మాటగా కొనసాగిన ఆ దంపతుల సంభాషణ స్త్రీవిద్య అవసరంప్రయోజనాలు, దానిపట్ల ఉన్న సాంప్రదాయక అభ్యంతరాలు మొదలైన అంశాల చర్చగా సాగింది. 

ఈ కథను స్త్రీవిద్య గురించి కందుకూరి వీరేశలింగం ప్రచారం చేసిన భావజాల సంబంధం లో పరిశీలించాలి.  అచ్చమాంబ పుట్టేనాటికే  -1874- వీరేశలింగం స్త్రీ విద్యా నిషేధ వాదుల ప్రతి పక్షం పూని స్త్రీవిద్యకు అనుకూలంగా పురుషార్థప్రదాయిని వంటి పత్రికలకు వ్రాస్తున్నాడు. అదే సంవత్సరం తాను వివేకవర్ధని పత్రిక పెట్టాడు.1875 ఫిబ్రవరి వివేకవర్ధని సంచిక నుండి స్త్రీవిద్య గురించి ఆయన వ్యాసాలు వ్రాస్తూనే ఉన్నాడు.  స్త్రీలకు విద్య అనర్ధహేతువు అనిచెప్పే ఏ వాదాన్న యినా తర్కబద్ధంగా ఖండించటం, వేద స్మృతి శాస్త్రాలన్నీస్త్రీవిద్యకు అనుకూలంగానే ఉన్నాయని  నిరూపించటం, స్త్రీవిద్యకు చరిత్రలో ఉన్నస్థానాన్ని వివరించటం, స్త్రీవిద్యా ప్రయోజ నాలను క్రోడీకరించటం ఆవ్యాసాలలో చూస్తాం.  పదిపన్నెండేళ్ల వయసుకేసాహిత్య అధ్యయన ఆసక్తులను అభివృద్ధి చేసుకొన్నఅచ్చమాంబ తనతో పాటు పెరుగుతున్న సమకాలపు సంస్కరణోద్యమ  గమనాన్ని, భావ జాలాన్ని  అర్ధం చేసుకొనే పనిలో ఎంత నిమగ్నమైందో ఈ కథను బట్టి తెలుసు కోవచ్చు. ఆభావజాల సంస్కృతిని సృజనాత్మక రూపంలో స్త్రీలలోకి తీసుకువెళ్ళటానికి ఆమె వ్రాసినకథఇది.

 స్త్రీ విద్యకు ప్రయోజనాలుగా ఇంటిపనులు, పిల్లల పోషణ చక్కగా చేసుకొనటం, పూర్వపుణ్యసతుల చరిత్రలు చదువుకొని వారివలె జీవించటానికి ప్రేరణ పొందటం , వివేకవంతులై వ్యర్ధ కలహాలు మాని తోటిస్త్రీలతో స్నేహంగా ఉండటం, పరాయి దేశాలకు చదువులకోసమో, ఉద్యోగం కోసమో వెళ్లిన భర్తలకు ఉత్తరాలు వ్రాయగలిగి సంసారాన్ని గుట్టుగా నడుపుకొనటం వంటి ప్రయోజనాలను వీరేశలింగంచెప్పాడు. అచ్చమాంబ వ్రాసిన ఈ  కథ  భార్య చదువుకొంటే పై చదువుకు చెన్నపట్నం వెళ్తున్న భర్తకు ఎడబాటు కాలంలో  ఉత్తరం వ్రాయగలిగేది అన్న ప్రస్తావన తోనే ప్రారంభం అవుతుంది. అదేప్రయోజనం అయితే  అతను రెండేళ్లలో చదువు పూర్తి చేసుకొని వస్తాడు కనుక , ఆతరువాత ఉత్తరాల అవసరం ఉండదు  కదా అన్నది భార్య అభిప్రాయం.ఆడది ఉద్యోగం కూడా చెయ్యాల్సిన అవసరం లేదు కనుక చదువు  అవసరం ఏమున్నది అన్నది ఆమె ప్రశ్న.  సద్గ్రంధాలు చదివి బుద్ధిని వికసింప చేసుకొనటం విద్యకు అసలైన ప్రయోజనం అన్నది అతని సమాధానం. వీరేశలింగం చెప్పిన ఇంటిపనులు తెలివిగా  , పిల్లలపోషణ వివేకవంతంగా చేసుకొనటానికి కూడా స్త్రీలకు  చదువు ఉపయోగ పడుతుందన్న విషయం కూడా ఈ కథలో ప్రస్తావనకు వచ్చింది . అంతే కాదు , చదువు   అంటే అక్షరజ్ఞానం మాత్రమే కాదు, లౌకిక జీవితాన్నిసౌకర్యవంతంగా గడుపుకొనటానికి పనికివచ్చే జ్ఞానం.మెదడుకు మేత.హృదయానికి ఆనందం. అట్లాగే అతను ఆడవాళ్లు చదువుకోకూడదని శాస్త్రాలలో వ్రాసిలేదని అయినా చదువుకొంటే స్త్రీలే ఆ శాస్త్రాలు చదివి ఆ విషయం ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతారని కూడా చెప్పాడు. ఈసంభాషణ అంతా చదువుకు ఆమె  సంసిద్ధమై   ఐదునెలలో స్వయంగా అతనికి ఉత్తరం వ్రాస్తానని  వాగ్దానం  చేయటం  దగ్గర ముగిసింది. కథ ముగింపు కూడా అదే . ఆ భార్యాభర్తలు ఏ అవగాహనకు వచ్చారో , అది ఏ భార్యాభర్తలైనా అభివృద్ధి చేసుకొనవలసిన అవగహన అన్నది తాత్పర్యం . ఈ కథలో భార్యా భర్తలకు పేర్లు లేకపోవటం దానినే సూచిస్తుంది.  

ఈ వరుసలో రెండవకథ ( భార్యాభర్తల సంవాదము, నగలను గూర్చి , హిందూ సుందరి , ఆగస్టు 1903) లోనూ పాత్రలు మొదటి కథలోని దంపతులే. చదువుకు చెన్నపట్నం వెళ్లిన భర్త మూడునెలలకు ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంభాషణ ఇది. మొదటి కథ చివరిలో ఆమె భర్తను దీపావళి పండుగకు తప్పక రావాలని చెబుతుంది. దీపావళికే వచ్చాడో ఏమో .. ! అన్న మాట ప్రకారం ఆమె చదువు మొదలైంది. అతను పుస్తకాలు పంపటమూ మొదలైంది. అతను పంపిన పుస్తకాలలో సత్యవతీ చరిత్ర ఉన్నది. ఇది వీరేశలింగం వ్రాసిన నవలే అయివుంటుంది. మాడ్రసు నుండి తనకేమీ తెచ్చాడో చెప్పమని భార్య భర్తను అడగటంఆమె కోరిన చీర ఇప్పుడు తీసుకురావటం వీలు పడలేదని చెప్తూ ఈ సారి వచ్చేటప్పుడు తెల్ల జరీ చీరె తెస్తానని అతడంటే  అది కాదు  నా మీద అపేక్ష ఉంటే రవ్వల దుద్దులు తెమ్మని ఆమె ఒక సవాల్ విసరటం తో అసలు కథ ప్రారంభం అవుతుంది. స్త్రీకి  వినయం, నమ్రత , సౌశీల్యం, శాంతం, సత్యం , దయ  మొదలైన సుగుణాలే అసలైన నగలని వాటికీ ఎప్పటికప్పుడు మెరుగులు పెట్టుకొంటూ ధరించే స్త్రీలను మించిన సౌందర్యవతులు ఉండరని చెప్పి అతడు ఆమెను ఒప్పించటం ఇందులోని ఇతివృత్తం. 

ఇకదంపతుల ప్రథమ కలహంకథ (హిందూ సుందరి , జూన్ 1902)  మొదలు కావటమేనేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను వివాహమాడుట  వలనను భర్తకు దాసినగుదునా యేమి?”  అన్న ఒక యువతి ధిక్కార స్వరంతో మొదలవుతుంది.పెండ్లి భార్యాభర్తల సంబంధాలను బానిస యజమాని సంబంధాలుగా   చేస్తున్నాయన్న అవగహనఆ చట్రంలో ఒదిగిపోవటానికి నిరాకరించే  చైతన్యం 1902 నాటి కథలో కనిపించటం ఆశ్చర్యం కలిగించక మానదు.  బానిసగా ఉండటానికి ఇష్టపడక పోవటం అనేది  సమానత్వం గురించిన ఆకాంక్షలో భాగం. అయితే ఆ ఆకాంక్ష ఎవరిమాట వాళ్ళు చెల్లించుకొనటానికి పంతంతో  ప్రవర్తించటంగా  కాక  పరస్పర భావ వినిమయంతో, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకొంటూ, మిత్ర వైరుధ్యాల వల్ల వచ్చే సంఘర్షణను   సామరస్యంగా మలచుకొంటూ  జీవించటంగా ఉండాలని సూచించే కథ ఇది. ఈ  కథ కూడా గోదావరీ తీర ప్రాంతం లో ఒక వూళ్ళో ప్రవర్తిస్తుంది. 

ధనత్రయోదశి, బీద కుటుంబము కథలను   తాను జీవించిన మహారాష్ట్ర దేశంలో నడిపించినా , జానకమ్మ , దంపతుల ప్రథమ కలహము వంటి కథలను తాను తరచు పర్యటించి స్త్రీలతో సంభాషించిన గోదావరి జిల్లాలలో నడిపింది. సత్పాత్రదానము కథలో తన బాల్యం లో తాను ఉండిన తెలంగాణకు సంబంధించిన హైద్రాబాదు నగరాన్ని ప్రస్తావించింది. ఆ కథలో కొడుకులు ఇంటిదగ్గర వ్యవసాయం చేసుకొంటుంటే తిండికి గడుస్తుంది కానీ బట్ట మొదలైనవి కొనటానికి డబ్బు ఉండదు కనుక తండ్రి పల్లె వదిలి బిచ్చమెత్తి వచ్చిన డబ్బు ను కొడుకులకు పంపుతుండటాన్ని నిరసించిన ఇల్లాలు ఆ కొడుకులు  హైద్రాబాదు వంటి పట్నాలకు వెళ్లి కూలి చేసుకొని  బ్రతకవచ్చునే అంటుంది. భాగ్యనగరం ఎందరికో బ్రతుకు తెరువు అయింది అని దాని ప్రత్యేకతను తరచు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో చెప్పుకొనటం మనకు తెలిసిందే. 1902 లో అచ్చమాంబ హైద్రాబాదు కు వున్న బ్రతుకుతెరువులు కల్పించగల శక్తి ని, సామర్ధ్యాన్ని గుర్తించ గలగటం విశేషం. హైద్రాబాదులో కూలీ పనికి వెళ్ళక ఆ గుడ్డి ముసలి వాని పిల్లలు స్వగ్రామం లోనే ఎందుకుండిపోయారు అన్న ప్రశ్న కొడుకు వేసినప్పుడు  ఆ తల్లి ఇచ్చిన సమాధానం కూడా గమనించదగినది.  కొన్ని పశువులు గడ్డి లేక నోటికి మన్ను తగులుతున్నా అక్కడే గరికపోచలకు వెతుక్కుంటాయి గానీ కొంచం దూరంలో పచ్చని పసరిక ఉన్నాఅటు వెళ్లాలనుకోవు .. కొందరు మనుషులు కూడా అంతే . తమ తెలివి తక్కువ వల్ల తమకే కీడు చేసుకొంటారు .. అని ఆమె చెప్పింది. కృష్ణా జిల్లా నుండి  తెలంగాణకు, తెలంగాణ నుండి నాగపూరుకు జీవితం తనను నడిపితే నడిచిన మనిషిగా బ్రతుకు తెరువు వనరులను వెతుక్కొంటూ ప్రస్థానం సాగించటమే తెలివిగా, అభ్యుదయ హేతువుగా అచ్చమాంబ భావించి ఉంటుంది. అది ఈ కథలో ఇలా వ్యక్తమైంది. మహారాష్ట్రలో  స్థిరపడి  అప్పుడప్పుడే తెలుగురాష్ట్రానికి  రాకపోకలు ప్రారంభించిన అచ్చమాంబ మూడు నాలుగేళ్లు తిరగకుండానే 31 వ ఏట  మరణించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో సాంస్కృతిక మూలలను అన్వేషించుకొనే క్రమంలో  భండారు అచ్చమాంబ తెలంగాణ రచయితల జాబితాలో చేరి పోయింది . అందుకు ఆమె చరిత్రకారుడు, తెలంగాణ వైతాళికుడు అయిన  కొమర్రాజు లక్షణారావుకు అక్క కావటం ఎంత కారణమోఆమె పెళ్లి వల్ల నాగపూర్ కు భర్తతో వెళ్లే వరకు నల్లగొండ జిల్లా దేవరకొండలోనే ఉంది  కనుక తెలంగాణ ఆడపడుచు అవుతుందన్న వాదం కూడా అంత కారణం. ఆ రకంగా అచ్చమాంబ వల్ల తెలుగు  కథా చరిత్రకు తొలి కథలు అందించిన నేల తెలంగాణ అయింది. 

2

 

భండారు అచ్చమాంబ వ్యాసాలు హిందూసుందరి పత్రికలో 1902 మే సంచిక నుండి 1903 జులై సంచికవరకు పదిహేను నెలల్లో మొత్తం తొమ్మిది వచ్చాయి. అన్నీస్త్రీలనుగురించి, స్త్రీలను సంబోధించినవి.వీటిలో మొదటిది విక్టోరియా మాహారాణి . రెండవది పర్షియా దేశపు  బాలికల స్థితి. రెండూ మే 1902 హిందూ సుందరి లో ప్రచురించబడ్డాయి. 

 1837 నుండి 1901 లోమరణించే వరకు బ్రిటన్ కుమహారాణిగా ఉన్న విక్టోరియా పాలనా కాలంలోనే భారత దేశం బ్రిటిష్ ఇండియాగా మారిపోయింది. దానితో విక్టోరియా భారతదేశానికి కూడా మహారాణి కావటంతో  ఆమె జీవించి ఉన్నప్పుడు, మరణించాక కూడా ఆమె పట్లగౌరవాన్ని ప్రకటిస్తూప్రశంసిస్తూ  తెలుగులో పద్యాలు వ్రాసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. భండారు అచ్చమాంబ విక్టోరియా మహారాణి మరణానంతరం భార్యగా తల్లిగా ఆమె జీవించిన తీరు ను ప్రశంసిస్తూ వ్యాసం వ్రాసింది.  పిల్లలను ఒకకంటకనిపెడుతూ సత్ప్రవర్తన అలవడేట్లు శిక్షణ ఇచ్చిందని, పతిని భూలోక దైవముగా భావించి ప్రవర్తించిందని ఈవిషయాలన్నీ తలచినప్పుడు పురాతన హిందూ సాధ్వులు అయిన సీతా సావిత్రి వంటి వాళ్లు గుర్తుకు వస్తారని అంటుంది. ఆమె వ్రాసుకొన్న దినచర్య రచనలు, బంధువులకు వ్రాసిన ఉత్తరాలను ప్రస్తావిస్తూ, వాటి నుండి వాక్యాలను ఉటంకిస్తూ  సాధికారికంగా వ్రాసింది. భర్తను సుఖపెట్టటంలో ఆమె పొందిన సంతోషం హిందూ స్త్రీలలో గాక మరెక్కడ ఉండదని, హిందూ గృహాలలో తప్ప అటువంటి సర్వసమర్పణ లక్షణం మరెక్కడా కనబడదని చెప్తూ అచ్చమాంబ విక్టోరియా మహారాణిని భారతీయ సతుల సరసన నిలబెట్టింది.

రెండవ వ్యాసంలో పర్షియా దేశంలో ఆడపిల్లలు పుడితే చిన్న బోయి ఏదో గొప్ప ఆపద సంభవించినట్లు ఉంటారని, పిల్లలు ఎంతమందో చెప్పేటప్పుడు ఆడ పిల్ల లను కలిపి చెప్పరనిపేరు పెట్టే  ఉత్సవాల దగ్గర నుండి పెంపకంలో ఆడపిల్లలు వివక్షకు గురిఅవుతారని, ఆరేడేళ్ల వయసునుండే వాళ్ళకు ఘోషా అమలవుతుందని, ఇంటిపనితో పాటు బట్టలపై పూవులు,తీగెలు కుట్టే శిక్షణ వాళ్లకుఇస్తారని ఈవ్యాసంలో ఆమెవివరించింది. అక్కడస్త్రీలకు విద్యావకాశాలు లేకపోవటం గురించి చెప్పిపారసీకదేశం లోనూ, మన దేశంలోనూ స్త్రీ విద్యాస్థితి ఒకేరీతిగా దుస్థితి లో ఉన్నదని దేశీయ పరిస్థితుల వైపు పాఠకుల ఆలోచనను మళ్ళిస్తుంది అచ్చమాంబ.పర్షియాలో పురుషులు కూడా విశేష విద్వాంసులు కాకపోవటం వల్ల అక్కడి స్త్రీలకు విద్య లేకపోవటాన్ని అర్ధంచేసుకోవచ్చు కానీ అనేకమంది పండితోత్తములు ఉన్న మనదేశంలో స్త్రీలవిద్యగురించి పట్టింపులేకపోవటం ఏమిటని బాధపడుతుంది ఆమె.

            తరువాతి రెండు వ్యాసాలుపరోపకారచింత’, ‘పరులయెడ సౌమ్యత’ ( హిందూ సుందరి, సెప్టెంబర్,1902)  పత్రిక  విషయ సూచికలో ఇవి రెండు వేరువేరు వ్యాసాలుగా  పేర్కొనబడ్డాయి కానీ విషయం దృష్ట్యా మొదటిదానికి రెండవది కొనసాగింపుగానే కనబడుతుంది.స్వసుఖమే చూసు కొంటూ ఇతర జనులకు ఉపయోగపడని మానవజన్మ నిరర్ధకం అంటుంది అచ్చమాంబ. పరోపకార చింత మనోశాంతికి కారణం అవుతుంది కనుక ఎదుటివాళ్ళకే కాక మనకు కూడా అది ప్రయోజనకారి అని ఆమె అభిప్రాయం. అలాగే మనుషుల స్వభావాన్నితెలుసుకొని వారికేవి సమ్మతములో తెలుసు కొని అనుకూలంగా నడుచుకొనటం ద్వారా వాళ్ళను సంతోషపెట్టటం కూడా పరోపకారంలో భాగం గానే  ఆమె భావించినట్లు కనబడుతుంది. 

మనకు ఒకరి యెడల అసూయ కలిగితే నిత్యం వాళ్లకు ఏదో ఒక ఉపకారం చేసే పని పెట్టుకొనటం ద్వారా దానిని జయించవచ్చునని అంటుంది. మన అసంతృప్తులు అయిష్టతలు ఇతరులకు తెలియ చేయకుండా ఉండటం ద్వారా వాళ్లకు సంతోషం కలిగించాలని అది మనకు కూడా సంతోషకారణమే అవుతుందని అచ్చమాంబఅభిప్రాయం.క్షమ, దయ, సమదృష్టి అలవరచు కొనటం ద్వారా  సంఘర్షణ, ద్వేషము లేని జీవితవిధానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నది ఆమె అభిలాష. ఈప్రక్రియలో ఒకవ్యక్తి పూర్తిగా తనను తాను కోల్పోవటం ఉంటుంది కదా అని ఈ నాటి వాళ్లకు అనిపించవచ్చు. నిజమే. 

 సహనం, శాంతం, క్షమ, దయ, వినయం మొదలైన గుణాలు మనుషులు ఎవరైనా అలవరచుకొని అభ్యసించవలసినవే. కానీ పితృ స్వామ్య సాపేక్షతలో అవి  స్త్రీలకు అసలైన అలంకారాలుగా పదేపదే చెప్పబడ్డాయి. ఆభావజాల సంస్కృతికి  సంస్కరణోద్యమ తొలిదశ లో స్త్రీలు తమకు తెలియకుండానే ప్రచారకులుఅయ్యారు. బండారు అచ్చమాంబ భార్యాభర్తల సంవాదం కథ ( ఆగస్టు1903) ఈ సందర్భం నుండే వచ్చిందనుకోవాలి. ఈ వ్యాసంలోమనంఅన్నఉత్తమ పురుష బహువచన కథనంఉంది. ఆమనంఅనే సంబోధన మాత్రం  స్త్రీలకు సంబంధించినదే .అచ్చమాంబ ఒకస్త్రీగా తోటిస్త్రీలను కలుపుకొని ఒక సమిష్టి కార్యాచరణ నుప్రతిపాదిస్తున్నట్లు అనుకోవచ్చు.పరులుఅని ప్రస్తావించ బడే వాళ్లలో స్త్రీలు ఉండవచ్చు. పురుషులు ఉండవచ్చు. స్త్రీలు అచ్చమాంబ చెప్పిన విధంగా తమ జీవిత శైలిని తీర్చిదిద్దుకుంటే దానివల్ల ప్రధమ ప్రయోజనం భర్తదే అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇక తరువాతి అయిదు వ్యాసాలూ ఉపన్యాస పాఠాలే. వీటిలో మొదటిది హిందూసుందరి 1903 జులై సంచికలో  ‘అచ్చమాంబ గారు బందరులో ఇచ్చిన ఉపన్యాసము’  అనే శీర్షికతో ప్రచురించబడింది. ఆ వ్యాసం ప్రారంభంలో అది ఆమె మచిలీపట్నంలో గత సంవత్సరం డిసెంబర్ 24 వతేదీన జరిగిన స్త్రీల సభలో చేసిన ఉపన్యాసం అనిపేర్కొనబడింది. అంటే అది అచ్చమాంబ 1902 డిసెంబర్ 24 నాడు బందరులో బృందావన పుర స్త్రీ సమాజము ప్రారంభోత్సవ సభలో చేసిన ఉపన్యాసం.  

అచ్చమాంబఅబలాసచ్చరిత్ర రత్నమాలకూర్చే క్రమంలో తెలుగు సమాజంలో విద్యావంతులవుతూ , రచనలుచేస్తూ, పత్రికలు నడుపుతున్న స్త్రీలగురించి తెలుసుకొంటూ వచ్చింది. 1901 లో ప్రచురించినఅబలా సచ్చరిత్ర రత్నమాలపీఠికలో ప్రస్తావించిన పులుగుర్త లక్ష్మీ నరసమాంబ , కోటికలపూడి సీతమ్మ లతో పరిచయాలు కూడా పెంచుకొన్నది. స్నేహసంబంధాలు కొనసాగించింది. అబలా సచ్చరిత్ర రత్నమాల రచయితగా ఆమె వాళ్లందరికీ ప్రేమపాత్రురాలు అయింది. 1903 లో కుటుంబ సహితంగా దేశాటన చేస్తూ ఆంధ్రదేశంలో ఆయా మిత్రుల ఇంట బస కూడా చేసినట్లు పులుగుర్త లక్ష్మీ నరసమాంబ వ్రాసిన సంస్మరణ వ్యాసాన్ని బట్టి తెలుస్తున్నది. ఆ పర్యటనలో అచ్చమాంబ ఆయా చోట్ల స్త్రీలను కలిసి ఐకమత్యం మొదలైన ధర్మాల గురించి ప్రసంగించినట్లు కూడా లక్ష్మీనరసమ్మ వ్యాసం సూచిస్తున్నది. అటువంటి ప్రసంగాలకు మొదటిది బందరు లో ఆమెచేసిన ఈ ఉపన్యాసం ఈ విధమైన ప్రసంగాలే ఆతరువాత హిందూసుందరి పత్రికలో ఒకటొకటిగా  ప్రచురించబడి ఉంటాయి. 

బృందావనపుర స్త్రీ సమాజ స్థాపకురాలిగా భండారు అచ్చమాంబను గురించి చాలా సమా చారం నమోదైంది.  ఈ వ్యాసం గీటురాయిగా పరిశీలిస్తే చారిత్రక వాస్తవం నిగ్గు తేలుతుంది. ( షేక్ మహ బూబ్ పాషా- భండారు అచ్చమాంబ స్త్రీ సమాజాన్నిస్థాపించిందా? , ఆంధ్రజ్యోతి 22 జూన్ 2020)  బందరులో మిస్ హానా  కృష్ణమ్మ  అధ్యక్షతన జరిగిన ఆసభలో ప్రసంగిస్తూ అచ్చమాంబ  ఊరిలోని కొందరు సోదరుల ప్రోత్సాహం తనకుగల స్త్రీజనాభిమానం కారణంగా తాను ఈసభలో ప్రసంగించటానికి వచ్చానని చెప్పింది. అంటే ఆ సభకు ఆమె అతిధే కానీ నిర్వాహకు రాలు కాదు. బయటి నుండి వచ్చిన స్త్రీ తానున్న అతి కొద్దికాలంలో అక్కడ స్త్రీలను సమీకరించి సంఘం పెట్ట టం సాధ్యం అయ్యే పని కాదు. అప్పటికే ఆఊళ్లో స్త్రీల సంఘం ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలు అచ్చమాంబ అక్కడ ఉన్న కాలంలో ఫలించటంతో స్త్రీల చరిత్రలు వ్రాసిన రచయిత్రిగా ప్రారంభ సభలో మాట్లాడే గౌరవం ఆమెకు దక్కింది.నేనీ గ్రామమునకు వచ్చిన పిదప విద్యా విశారద యగు మిస్ హ్యాన్నా రత్నము గారీయూర సతీ సమాజమునొకదాని నేర్పరచుటకై యత్నింపుచున్నారని నాకు తెలిసే. విద్య సంపన్నులగు వారలకు జేయరాని కార్యములు గలవా ?” అన్న  అచ్చమాంబ మాటలే ఆమె ఈ సమాజ స్థాపకురాలు కాదు అన్న సత్యాన్ని చెబుతున్నాయి. అంతే కాదు ఆమె ఈ సమాజము నేర్పరుప నుత్సహించిన మిస్ . రత్నముగారి పట్ల మనము కృతజ్ఞులమై ఉండ వలయును అని కూడా అన్నది. ఆ హ్యాన్నా రత్నమే ఓరుగంటి సుందరి రత్నమాంబ. 

ఆంద్ర సోదరీమణులారా ! అని సంబోధించి ప్రసంగం ప్రారంభించిన అచ్చమాంబ స్త్రీలచే ఏర్పడే ఇలాంటి సమాజాలు స్త్రీవిద్యను ప్రోత్సహిస్తాయని , స్త్రీలకు విద్య హెచ్చే కొలది సమాజాల ను ఏర్పరచుకొని ఇతర వనితలను కలుపుకొంటూ స్వదేశంలోని దురాచార నిర్మూలనకు ప్రయ త్నించే మంచి రోజులు వస్తాయని ఆమె  పేర్కొన్నది. అమెరికా లో స్త్రీ సమాజాలు ఏర్పడి దేశహిత కార్యాలను చేస్తున్నట్లు కూడా ఆమె చెప్పింది.  ఇలాంటి సమాజాలు స్త్రీలలో ఐకమత్యాన్ని అభి వృద్ధి చేస్తాయని వివరించింది. ఒంటరి గా నేనేమి చెయ్యగలను అని స్త్రీలు నిరాశ చెందకుండా ఇలాంటి సమాజాలు తోడ్పడతాయని అన్నది. స్త్రీలు కలహకారకులు అన్న అపవాదును పోగొట్టే సంస్కారాల అభివృద్ధిని ఆశించింది. లోహమయ భూషణములకు ఆశపడక  స్త్రీలు సద్గుణ భూషి తలు కావాలని చెప్పింది. ఐకమత్యానికి సాధనం సఖ్యం కనుక సమాజాలు స్త్రీలలో దానిని పెంచేట్లు వుండాలని సూచించింది. కల్పనా కథలు, శతకాలు చదవటంతో తృప్తిపడక స్త్రీలు భూగోళశాస్త్రం, చరిత్ర మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాలని చెప్పింది. స్త్రీలంతా ఒక చోట చేరి మంచి ప్రసంగాలతో కాలం గడపటం వల్ల స్త్రీలలో విద్యా వినయ  వివేకాది సద్గుణాలు వికసిస్తాయని విశ్వాసం ప్రకటించింది. 

1903 ఫిబ్రవరి హిందూ సుందరి పత్రిక అదే నెల 19 వతేదీనాడు ఏలూరులో అచ్చమాంబ ఉపన్యసించిన ఒక సభను గురించిన నివేదికను, అచ్చమాంబ ఉపన్యాసపు సంక్షిప్త పాఠాన్ని ప్రచురించింది. అచ్చమాంబ సకుటుంబంగా చేస్తున్నపర్యటనలో ఫిబ్రవరి 17 నాటికి ఏలూరు వెళ్ళింది. ఏలూరు నుండే హిందూ సుందరి పత్రిక వచ్చేది. అచ్చమాంబ పత్రిక  కార్యాలయం చూసింది.19 వతేదీ సోమవారం రోజు పత్రికా కార్యస్థానంలోనే జరిగిన ఆసభకు రెండు వందల మంది స్త్రీలు హాజరయ్యారుట. ఆసభలో చేసిన ప్రసంగంలో అచ్చమాంబ స్త్రీలువారానికో, నెలకో ఒకసారి సమావేశమై విద్యావిషయాలు మాట్లాడుకొంటే బాగుంటుందని సూచించింది. మహారాష్ట్రలో స్త్రీలు విద్యావంతులై పత్రికలు ప్రచురిస్తున్నారని, తెలుగు సమాజంలో స్త్రీలు ఆస్థితికి ఎదగాలని ఆశించింది. స్త్రీలకొరకు స్థాపించబడిన పత్రికలకు వ్రాయటానికైనా స్త్రీలు ముందుకు రావాలని కోరింది. విద్యావంతులు కావటంతో పాటు స్త్రీలుఇల్లుచక్కదిద్దుకొనే పనిలో శ్రద్ధ చూపాలని సూచిం చింది. ఎంత చదివినా ఆచారాలను వదల వద్దని హితవు చెప్పింది. ఒక సమాజంగా ఏర్పడి చదువులతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్చరించింది. 

ఈ ఏలూరు సభా నివేదిక లో అచ్చమాంబ కుటుంబం ఏలూరు నుండి రాజమహేంద్రవరం, కాకినాడ మొదలైన పట్టణాల మీదుగా కాశీకి ప్రయాణం చేస్తుందని పేర్కొన్నది. ఆమెనుచూస్తేమన స్త్రీలను బానిసల వలే యణగ ద్రొక్కి వారికి గల తెలివితేటలను భస్మీభూతం చేసియుచుంటిమి గదాఅన్న ఆలోచన కలుగుతున్నదని కూడా ఈనివేదిక చెప్పింది. అచ్చమాంబ భర్త మాధవరావు తొమ్మిది నెలల సెలవులో ఉన్నాడని, ఈతొమ్మిది మాసములలో రెండు మాసములు ఆమె తన ఇష్టప్రకారం ఉపన్యాసాలు ఇయ్యటానికి, ఆమెకోరినచోటికి తాము కూడా వెళ్ళటానికి సమ్మతించాడని ఈనివేదిక మరొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా పేర్కొంది. ఆరకంగా 1902 డిసెంబర్ లో బందరులో మొదలుపెట్టి ఏలూరు, కాకినాడ రాజమండ్రి మొదలైనచోట్ల అచ్చమాంబ చేసిన ప్రసంగ పరంపర ను హిందూసుందరి పత్రిక ప్రచురిస్తూ వచ్చింది.  

బాలికా పాఠశాలల లోని లోపములు తన్నివారణోపాయములు’, ‘బాల్య వివాహములు’  ఈ రెండు వ్యాసాలు  హిందూ సుందరి 1903,  మార్చ్  సంచికలో ప్రచురించబడ్డాయి. మత్స్సఖీ రత్న ములారా అన్న సంబోధనతో ప్రసంగాన్ని మొదలుపెట్టటంలో  అచ్చమాంబ  సోదరత్వం కన్నా స్నేహం గొప్పది అని భావించినట్లు కనబడుతుంది. ఈ ఉపన్యాసంలో పులుగుర్త లక్ష్మీ నరసమాంబ ను ప్రస్తావించి ఆమె అనుగ్రహమున మీ బోటివారిని చూచి ఆనందించే భాగ్యం, మాట్లాడే అవకాశం దొరికాయని చెప్పింది. దీనిని బట్టి  1903 జనవరిలో పులగుర్త లక్ష్మీ నరసమాంబ చొరవతో కాకినాడ లో ఏర్పడిన శ్రీ విద్యార్థినీ సమాజ సమావేశమే అయివుండాలి అది. బాలికా పాఠశాలలో అచ్చ మాంబ  గుర్తించిన లోపాలు ప్రధానంగా పాఠ్యప్రణాళికకు సంబంధించినవి. ప్రస్తుత కాలంలో దేశం లో స్త్రీవిద్య ప్రధమోద్దేశం మంచిపత్నులను నిర్మించటమే కనుక వాళ్లకు చెప్పే విద్యలో గృహ నిర్వాహణ ఉండాలంటుంది అచ్చమాంబ. స్త్రీవిద్య సంసార నిర్వహణ కు విముఖులను చేస్తున్న దన్న స్త్రీవిద్యా వ్యతిరేకుల వాదనను తిప్పికొట్టటానికి అదే మార్గమని ఆమె భావం. ఐరోపా దేశాల లోనుఅమెరికాలోను స్త్రీలు విశేష విద్యలు నేర్చి పరీక్షలలో కృతార్థులై కూడా  ఇంటిపనిలో దక్షులై పిల్లలను చక్కగా పెంచగలిగి సంసారాన్నిచాతుర్యంతో నడుపుతుంటారని చెప్పి కనుక బడిలో బాలికలకు చదువుతో పాటు పాకశాస్త్రం, వృక్షశాస్త్రం, బాలవైద్యశాస్త్రం మొదలైనవి నేర్పాలన్నది.

బాల్యవివాహాల గురించి మాట్లాడుతూ సంస్కరణ ఉద్యమ పురోగమనానికి అవరోధం  బాల్య వివాహాలే అంటుంది అచ్చమాంబ. చిన్నతనంలో పెళ్లి విద్యకు దూరం చేస్తుంది కనుక  భర్త లు చేసే పనులు సత్కార్యాలని తెలుసుకోలేక స్త్రీలు వాళ్ళను నిరుత్సాహ పరుస్తారు అని ఆమె భావం.

బాల్య వివాహాలు దేహం దృఢపడక ముందే ఆడపిల్లలను తల్లులను చేయటంవలన బలహీనమైన సంతతికి కారణం అవుతాయని అంటుంది. బాల్యవివాహాలు శాస్త్రానుకూలాలు కనుకఎన్నినష్టాలు కలిగినా ధర్మశాస్త్ర  విరుద్ధంగా ప్రవర్తించకూడదు అన్న వాదనను ఆమెమనకాలానికి దేశానికి సరి పడని వాటిని వదిలేయటం అవసరం  అని నొక్కిచెప్పింది. వేదాలను శృతి స్మృతులను ప్రస్తావిస్తూ విస్తృతంగా ఉదహరిస్తూ వివరిస్తూ అన్నీఇంచు మించు కన్య యుక్తవయస్కురాలై ఉండాలనే చెప్తున్నాయని స్పష్టం చేసింది. బాల్యవివాహాలు లేకపోతే బాలవితంతువులు కూడా ఉండరని అభిప్రాయపడింది.

            గృహిణీధర్మములు అనే ఉపన్యాసం( హిందూసుందరి,1903 ఏప్రిల్) లో కోటికలపూడి సీతమ్మను ప్రాణసఖిగా సంభావిస్తూ ఆమెవ్యాధి బాధిత అయి ఉండటం వలన తనకు సభలో మాట్లాడటానికి ఉత్సాహం  లేదని  చెప్పటాన్నిబట్టి  ఇది రాజమహేంద్రవరంలో చేసిన ప్రసంగం అనుకొనటానికి వీలుంది. వ్యాధిబాధిత కనుక ఆమె ఈ సమావేశానికి రాలేకపోయి ఉండాలి. అది అచ్చమాంబ మనసునుబాగానే కలతపెట్టింది.ఉపన్యాసాన్నిముగిస్తూ మనస్థిమితంలేకపోవటం వలన చెప్పవలసిన విషయాలు ఇంకా ఉన్నా చెప్పలేకపోతున్నాని అనటం  దానినే సూచిస్తుంది.

( ఆ సందర్భంలోనే సీతమ్మ చికిత్స నిమిత్తం మద్రాస్ వెళ్లి కందుకూరివీరేశలింగం గారింట దాదాపు ఏడాది ఉండి 1904 మార్చి నాటికి తిరిగివచ్చింది).  కందుకూరి వీరేశలింగం రచించినసత్యా ద్రౌపదీసంవాదం’  చదివి స్త్రీలు అందరూ అందులో ద్రౌపది చెప్పినట్లు నడుచుకోవాలి అని సూచిస్తూ ప్రసంగాన్నికొనసాగించింది. స్త్రీపురుషులిద్దరూ సమానస్వాతంత్య్రం కలవాళ్లే  అయిన ప్పటికీ ఒండొరుల సౌఖ్యమును కోరి ఒకరికొకరు లోబడి ఉండక తప్పదని, భార్య తన ప్రపంచ సుఖానికి మూలకారణుడగు భర్తను ఎల్లప్పుడూ సంతుష్టిపరిచే ప్రవర్తన కలిగిఉండాలని చెప్పింది. అయితే భర్తల ఆజ్ఞ  దైవాజ్ఞ అన్నట్లు వాళ్ళుతప్పుచేస్తున్నా నివారించకుండా ఉండటం, తమను అటువంటి పనికి నియమిస్తే నిరాకరించకుండా ఉండటం  ఉత్తమ గృహిణీ లక్షణం కాదంటుంది అచ్చమాంబ. అంటే భర్త మాటకుఎదురాడకుండా ఉండటం అన్నివేళలా మంచిది కాదని ఆమె అభిప్రాయం. ధర్మాలలో కాలానుగుణమైన మార్పులు ఆమె అభిమతం.

            ‘ఆనందము’  సతీమణులారా! అన్నసంబోధనతో మొదలై ముగింపులో అక్కలారా అన్న సంబోధన ఉంది కనుక ఉపన్యాసమే.( హిందూసుందరి, మే 1903) ఆనందం అందరూ కోరదగినది అని అది స్త్రీలకు కూడా కావలసినదే  కనుక అందుకు ప్రయత్నపరులు కావాలంటుంది అచ్చమాంబ. స్త్రీలుసంతోషంగా ఉంటే అది కుటుంబంలో అందరికి, వచ్చిపోయే అతిధులకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పింది.స్త్రీల ఆనందం మీద ఇంతమంది ఆనందం ఆధారపడి ఉందంటే తప్పనిసరిగా వాళ్లంతా స్త్రీల ఆనందం కోసం కొంత పూచీ పడవలసి ఉంటుంది.కానీ అచ్చమాంబకు ఆఅవగాహన ఉన్నట్లు కనిపించదు.అందువల్లనే మనం ఏస్థితిలో ఉన్నా ఆప్తబంధువగు ఆనందాన్నివీడక మనకు మనకుటుంబానికి సౌఖ్యం కలుగచేసికొనటానికి ప్రయత్నించాలని స్త్రీలకు సందేశం ఇస్తూ ప్రసంగం ముగించింది.

            విద్యావంతులగు యువతులకొక విన్నపము ( హిందూసుందరి, జూన్ 1903) అచ్చమాంబ ఉపన్యాసాలలో చివరిది. స్త్రీవిద్యకు ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు ఎన్నిజరుగుతున్నా ప్రయో జనం పెద్దగా కనిపించటం లేదని అందుకు కారణం స్త్రీల ఉపేక్షేనని ఈ ప్రసంగాన్ని ప్రారంభిం చింది. చిన్నప్పుడు కొద్ది  కాలమే  బడికిపంపి పెళ్లిళ్లు చేయటం వలన వాళ్ళునేర్చుకొన్నస్వల్ప విద్య ఎందుకూ పనికిరాకుండా పోతున్నదని, పెళ్లయిన ఆడపిల్లలను పురుషులు అధ్యాపకులుగా వుండే బడులకు పంపలేకపోతున్నారని స్త్రీవిద్యకు ఉన్నఅవాంతరాలను ప్రస్తావించింది. అతి బాల్యవివాహాలు స్త్రీవిద్యకు విఘాతంగా ఉన్నసంగతిని కూడా పేర్కొన్నది. 

            తమ చదువును బడివిడిచాక కూడా అభివృద్ధి చేసుకోనాలన్నఇచ్ఛ ఆడపిల్లల్లో కలగక పోవటానికి వాళ్ళచిన్నవయసు కారణం అయితే తల్లివిద్య నేర్చింది కాకపోవటంవల్ల బిడ్డకు సహా యకారి కాలేకపోతున్నది అని నిర్ధారించింది అచ్చమాంబ.ఇటువంటి పరిస్థితులలో  బాలికలను, వాళ్ళ తల్లులను విద్యావంతులను కావించే మార్గాలను విద్యనేర్చిన స్త్రీలు వెతకాలని చెప్పింది. పాఠశాల లో మహిళా ఉపాధ్యాయులను నియమించటం, బాలికలను పెళ్లి తరువాత కూడా బడికి పంపటం, చదువు పూర్తయ్యేవరకు పెళ్ళిచేయకుండా ఉండటం ఈ మూడే మార్గాలైనా అవి ఇప్పు డప్పుడే సాధ్యమయ్యేవి కావు కనుక  ప్రత్యామ్నాయాలను వెతుక్కోవలసిందేనని  అంటుం దామె. ఆమె సూచించిన మార్గం విదుషీ స్త్రీలందరూ కలిసి కుల స్త్రీల కొరకు ఒక పాఠశాలను స్థాపించటం. 

సాధారణంగా ఆడవారికి పగలు రెండు గంటల నుండి సాయంత్రం నాలుగైదు గంటల వరకు తీరికగా ఉంటుందని, ఆ సమయంలో పాఠశాలను నడపాలని, విద్యావంతులైన స్త్రీలు కొందరు వంతులవారీగా పాఠశాలకు వచ్చి బోధన చేయాలని సూచించింది. ఇలాంటి బడికి తమ పిల్లలను పంపటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదని కూడా చెప్పింది. తోటివాళ్లను విద్యావంతులను చేయటం వలన మీ ఆనందం కూడా హెచ్చు అవుతుందని చెప్పి అక్కడ సమావేశమైన స్త్రీలను కర్తవ్యోన్ముఖులు కమ్మని హెచ్చరించింది. 

                        ఇటువంటి పర్యటన సందర్భాలు, ప్రసంగాలు  మళ్ళీ మళ్ళీ జీవితంలో సంభవం అయితే తెలుగునాట సంస్కరణోద్యమంలో అచ్చమాంబ నిస్సందేహంగా ఒక ప్రభావ శీలమైన పాత్రను పోషించగలిగి ఉండేది. కానీ మరొక ఏడాదిన్నరకే ఆమె అకాల మరణానికి గురైంది. అచ్చమాంబ  స్త్రీల చరిత్రలునిర్మించినా, కథలు వ్రాసినా, ఉపన్యాసాలు ఇచ్చినా స్త్రీవిద్యను , లింగ వివక్ష లేని సమాజాన్ని, సహనం ప్రాతిపదికగా ఈర్ష్యాద్వేషాలు లేని మానవీయ సంబంధాలను ఆకాంక్షించింది.స్త్రీలు  సమీకృతులై సమాజాలు పెట్టుకొని స్వీయ జాతిఅభ్యుదయానికి కృషి చేయాలని ఆశించింది. స్త్రీలలో అందుకు అనుకూలమైన చైతన్యాన్ని కూడగట్టటానికి  ప్రయత్నించింది. ఆ నాటి సంఘసంస్కరణోద్యమ ఆశయాలకు  తనను తాను ఒక ప్రతినిధి గా  సిద్ధం చేసుకొన్నది. తన రచనా కళను, వాజ్నైపుణ్యాలను కూడా అందుకే అంకితం చేసింది. 

ఆమె మరణించిన మూడునాలుగు నెలలోపే  మునగాల జమిందార్ నెలకు పన్నెండు రూపాయలతో రెండు  ఉపకారవేతనాలు  ‘అచ్చమాంబా  జ్ఞాపక విద్యార్థి వేతనాలుఅనే పేరుతో  మెట్రిక్యూలేషన్ పరీక్షకు చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు ఇస్తామని ప్రకటించటం  స్త్రీవిద్య పట్ల ఆమెకు ఉన్న అభినివేశాన్ని గౌరవించటమే.( సావిత్రి , మార్చి - ఏప్రిల్ 1905 ). 

                       

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర - 5

           కొటికలపూడి సీతమ్మ  రచనలు 1902 నాటికే హిందూసుందరి పత్రికలో కనిపిస్తాయి. ఆ పత్రికలోనే 1904 ఫిబ్రవరి సంచికలో  జయంతి సూరమ్మ, మార్చ్ సంచికలో కందుకూరి రాజ్య లక్ష్మమ్మ, స్వీయచరిత్రలో కందుకూరి వీరేశలింగం,ఆంధ్రకవయిత్రులులో ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ వ్రాసిన వాటినిబట్టి కొటికలపూడి సీతమ్మ సాహిత్యజీవిత విశేషాలు తెలుస్తున్నాయి. 1876లో కృష్ణాజిల్లా రేపల్లె తాలుకా లోని పెదపులివర్రు అనే గ్రామంలో సీతమ్మ జన్మించింది. తండ్రి అబ్బూరి రాఘవయ్య. నర్సాపురం లో పోస్టుమాస్టర్. ( పుట్టినవూరు జెవుడుపాడు అని తండ్రి సుబ్బా రావు  అని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ) ఆరేడేళ్ళవయసుకే సీతమ్మకు  చదువుకోవాలన్న అభిలాష కలిగింది. ఆడపిల్లలను బడికిపంపే  అలవాటు లేని సమాజం కనుక తండ్రి దగ్గర, అన్నల దగ్గర, ఇరుగు పొరుగు బాలల దగ్గర అడిగి,అడిగి  చదువుకోవలసివచ్చింది. సంసార సమస్యల మధ్య ప్రాధాన్యతలలో చివరిది అయిన ఆమె చదువు ఆగుతూ, సాగుతూ  చిన్నచిన్నపద్యాలు చదివి అర్ధం చేసుకొనే వరకూ వచ్చింది. 

      పదేళ్ల వయసులో ఆమెకు పెళ్లయింది. భర్త కొటికలపూడి రామారావు. రాజమహేంద్రవరంలో న్యాయస్థానంలో  ఉద్యోగి. పదిహేనుపదహారేళ్ళ వయసులో మొదలైన రాజమహేంద్రవరం కాపురం ఆమెను వీరేశలింగం ప్రభావంలోకి తెచ్చింది. గురువై ఆయన సాహిత్యమూ, సంఘ సంస్కరణము, బ్రహ్మసమాజ మతము మూడింటినీ ఉపదేశించాడు. వీరేశలింగం పంతులు  రాజ్యలక్ష్మమ్మగారి కోరికను అనుసరించి  స్త్రీలకోసం కట్టించిన  ప్రార్ధనా సమాజం నిర్వహణ బాధ్యతను ప్రారంభం నుండి (1901) కొటికలపూడి సీతమ్మకు అప్పగించారంటే ఆమె వీరేశలింగం దంపతులకు ఎంత సన్నిహితురాలో, ఆమె విద్యాజ్ఞానం పట్ల వాళ్లకు ఎంత విశ్వాసమో అర్ధం అవుతుంది. సీతమ్మకు ఆరోగ్యం బాగులేనప్పుడు దాదాపు ఏడాదిపాటు మద్రాస్ లో తమ దగ్గర ఉంచుకొని వైద్యం చేయిం చిన(1903) పుత్రికావాత్సల్యం  వాళ్ళది. అలాగే సికింద్రాబాద్ లో సీతమ్మ అన్నగారింట అతిధులుగా ఉండగలిగిన స్వతంత్రం కూడా వాళ్లకు ఉన్నది.(1909,వీరేశలింగం స్వీయచరిత్ర)  మొత్తంమీద సీతమ్మ ఒక్కతే కాదు ఆమె కుటుంబమంతా వీరేశలింగం దంపతులకు కావాల్సిన వాళ్ళే అయినారు. మద్రాస్ లో చికిత్స చేయించుకొంటూ ఉన్న పది నెలల కాలం వీరేశలింగం వద్ద భాషాసాహిత్య విషయ శిక్షణపొందటానికి చక్కగా వినియోగించుకొన్నది సీతమ్మ. ఆ రకంగా బాల్యం లోనే ఆమెలో చిగురించిన అభిలాషకు  వీరేశలింగం పంతులు ఆలంబనం అయినాడు. ఆయన  సాహిత్య ఆస్తిక సంస్కరణ ఆదర్శాలకు అసలైన వారసురాలిగా ఆమె అభివృద్ధి చెందింది.  

     కొటికలపూడి సీతమ్మ సాహిత్యాన్ని పద్యం, వచనం అని రెండు భాగాలుగా వర్గీకరించి పరిశీలించవచ్చు. 

                                                  1

పద్యసాహిత్యం :

            ‘భక్తిమార్గముఆమె మొదటి పద్యకావ్యం.  1902 మే హిందూసుందరి పత్రికలో అది సమీ క్షించబడింది. సమీక్షకురాలు జలుమూరుకు చెందిన భుక్త లక్ష్మీదేవమ్మ.  పుస్తకంలోని 110 పద్యాలూ నూటపది వెలగల రత్నములు అని చెప్పి వెనువెంటనే తప్పు సరిచేసుకొంటున్నట్లు ఈ పద్యాలకు వెలకట్టుట ఎవరితరం అని అంటుంది. బాలికా పాఠశాలలో నాలుగైదు తరగతుల విద్యార్థులకు పఠనీయగ్రంధంగా దానిని  పెట్టవచ్చునని అభిప్రాయపడింది.నిండుగ లోపల వెలి(దా నుండి నిరాకారు(డన(గ నొప్పారుచు బ్ర హ్మాండము లేలెడు దేవుని నిండుమనంబునను దలఁతు నిశ్చలభక్తిన్వంటి పద్యాలను ఉదాహరించింది. 1902 లో సమీక్ష వచ్చిందంటే అది 1901 చివరిభాగంలోనో 1902 జనవరి ఫిబ్రవరి మాసాలలోనో ప్రచురించబడి ఉండాలి. 

అదే సంవత్సరం హిందూసుందరి జూన్ సంచికలోచిన్నబాలికలకు( గఱపు పద్యములుఅనే శీర్షిక క్రింద సీతమ్మ వ్రాసిన పది ఆటవెలది పద్యాలు ప్రచురించబడ్డాయి. 

శ్రీకరుండ నేను చిన్న నా(టనె మంచి / గుణములెల్ల నేర్చుకొనుచునెపుడు 

నీతి మార్గముననె నిలుచునట్లొనరించి  కావుమయ్య నన్నుఁ గరుణ తొడ “  అని మొదలుబెట్టి పెద్దవాళ్ళమాట విని వాళ్లకు సంతోషం కలిగించేరీతిలో ప్రవర్తించే వివేకాన్ని, తల్లితండ్రులు తెచ్చి పెట్టినవి ఎంతవరకు ఉంటే అంతవరకే తిని తృప్తిపడే స్వభావాన్ని,తల్లిదండ్రులు చెప్పిన పనిని వెంటనే చేసే బుద్ధిని, తోటివాళ్లపట్ల సమభావం, సఖ్యత అనే గుణాలను, నీతివర్తనను ప్రసాదించ మని భగవంతుడిని కోరుకొంటూ పిల్లలకోణంనుండి వ్రాసిన పద్యాలవి. చిన్నపిల్లలకు నేర్పించ వలసిన నీతిని ప్రభోదించే పద్యాలు  ఇవి. ముఖ్యంగా బాలికలను ఉద్దేశించిన  నీతులు ఇవి. 

1902 ఆగస్ట్ నాటికి సీతమ్మ కావ్యాలు మరి రెండు వచ్చాయి. అవి 1. అహల్యాబాయి 2. లేడీ జెన్ గ్రే. కవిత్వం నిర్దుష్టంగానూ, బాలలకు కూడా అర్ధమయ్యేరీతిలో ఉందని, లోవర్ సెకండరీ పరీక్ష లకుపాఠ్యగ్రంధాలుగా పెట్టదగినవి అనిసమీక్షకురాలు భుక్త లక్ష్మీదేవమ్మ అభిప్రాయపడింది.  

            అహల్యాబాయి 265 పద్యాల కావ్యం. పగలంతా ఇంటిపనులతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఆ పనులమధ్యలోనే మనసులో జరిగే పద్యరచనను పక్కనే పలక మీదనో ,ఏదో చిన్న కాగితం మీద పెన్సిల్ ముక్కతోనో వ్రాసిపెట్టుకొని, రాత్రి పనులన్నీతీరిన తరువాత  సరిచూసుకుని కాగితం మీదికి ఎక్కించుకొంటూ ఈ కావ్యం పూర్తిచేయటానికి   ఆరునెలలు పట్టిందట సీతమ్మకు.  1725- 1795 సంవత్సరాలలో  మరాఠాదేశపు మాళ్వ రాజ్యంలో హోల్కర్ వంశంలో రాణి అహల్యాదేవి. భర్త మరణించినా మామగారి సలహా మీద సహగమనం మాని రాజ్యవ్యవహారాలలో ఆయనకు  అండగా నిలబడిన మహిళ ఆమె. మామగారి మరణం తరువాత కొడుకు పక్షాన కొంతకాలం, ఆ కొడుకు కూడా మరణించటంతో స్వతంత్రంగా మాళ్వ రాజ్యాన్ని పరిపాలించింది అహల్యాబాయి. ఆమె రాజకీయ చాతుర్యం పాండిత్యం, దేవాలయ పునరుద్ధరణలు శివభక్తి మహారాష్ట్ర సమాజం మీద, సంస్కృతి మీద వేసిన ప్రభావం తక్కువది కాదు. మహిళల రంగం కాని రాజకీయాలలోకి వచ్చి పురుష రాజకీయాలను ఎదుర్కొని జీవించిన ఆహల్యబాయిని  ఒక ఆదర్శ నమూనాగా స్వీకరించి సీతమ్మ ఈ కావ్యం వ్రాసింది.స్త్రీలు విద్యనేర్వ జెడిపోదురనుమాట 

                              కల్ల యనుచు దోప నెల్లరకును 

                              విశదపరతు నొక్క విద్యావతి చరిత్ర 

      సంగ్రహంబు గాగ చదువుడయ్య”   --  అని స్త్రీ విద్యావతి అయితే  ఎంత సాధించ

 గలదో, రాజ్యాలనేఎలానిలబెట్టగలుగుతుందో చూపించటమే ఉద్దేశంగావ్రాసిన కావ్యం ఇది.  

            లేడీ జేన్ గ్రే 1536 లో పుట్టి పదహారు పదిహేడేళ్ల వయసులో తొమ్మిదిరోజులకు రాణి అయి ఆతరువాత రాజద్రోహ నేరం కింద మరణశిక్షలో ప్రాణం కోల్పోయిన  ఆంగ్లవనిత. అందం, అమాయ కత్వం, విద్య, మానవీయత, ప్రేమ, విషాదం  మొదలైన గుణాలకు, భావోద్వేగాలకు  ప్రతీకగా ఆమెను చిత్రిస్తూ ఎంతో  సాహిత్యం వచ్చింది. కొటికలపూడి సీతమ్మ వ్రాసిన  లేడీ జేన్ గ్రే పద్య కావ్యం వాటిలో ఒక దానికి అనువాదం. అది ఆమె పరభాషా సాహిత్య పరిజ్ఞానానికి కూడా నిదర్శనం. 

            కొటికలపూడి సీతమ్మ రచనలలోసాధురక్షక శతకంఒకటి. హిందూసుందరి 1903 జూన్ సంచికలో ఇదే శీర్షిక కింద ఎనిమిది పద్యాలు మాత్రం ప్రచురించబడ్డాయి. పుస్తకం ఎప్పుడు అచ్చు  అయిందో తెలియదు.శరణాగత సాధురక్షకాఅన్న మకుటంతో ఉత్పలమాల వృత్తాలలో  భగవత్ స్తుతి ఈ పద్యాలకు విషయం. భగవంతుడు సర్వనామమే కానీ నిర్దిష్ట నామరూపాలకు ఒదిగిన శక్తి  కాదు.ఎల్లెడనిండి యుండి పరికింపఁగ రూపము లేక సర్వదా 

 చల్లని దృష్టితో సుజన సంపతి వర్ధిల( జేయు దీవు ని

 న్నెల్లపుడున్తలంతుమది నెంతయుఁ బాయని భక్తి తోడ నా 

యుల్లముశుద్ధిచేయ ( గదె యో శరణాగత సాధురక్షకా”  -------  వంటి  పద్యాలు ఆ విషయాన్నే స్పష్టం చేస్తాయి. ప్రపంచమంతా భగవంతుడి విలాసమేనని, తన హృదయాన్ని, పనులను పవిత్రంగా ఉంచేలా దయచూడమని, అరిషడ్వర్గాల నుండి కాపాడమని వేడుకొనటంగా ఈ పద్యాలు ఉన్నాయి.

1904 ఆగస్టు సావిత్రి సంచికలో  “ప్రియ సఖీబృంద సందర్శనోత్సవ నవరత్నమాలఅనేశీర్షికతో సీతమ్మ వ్రాసిన పద్యాలు ఉన్నాయి.ఓ సఖులారా! నేటికి/ మీసరసన గూరుచుండి మించిన ప్రీతిన్ / దోషముల నడచు దేవుని / భాసురగతి గొలుచునట్టి భాగ్యము గంటిన్అన్నది మొదటి పద్యం. ఇన్నిరోజులకు మిమ్మల్నిచూసాను అంటున్నది అంటే దీర్ఘ వియోగం తరువాత కలయిక అన్నమాట అది.పదియాఱు నెలలుగడచెను / సదమలరగు మిమ్ముఁ బాసి చనినేనకటాఅని ప్రారంభమయ్యే తరువాతి పద్యాన్నిబట్టి ఆ కాలం 1903 లో వైద్యం కోసం మద్రాసుకు వెళ్లి వీరేశలింగం గారి ఇంట వుండిన కాలం అయివుంటుందని ఊహించవచ్చు. తిరిగి వచ్చాక స్త్రీల ప్రార్ధనా సమాజ సమావేశంలో ఆఎడబాటు కాలాన్ని అలా ప్రస్తావించిందనుకోవచ్చు.ప్రేమాస్పదులగు మీతో సేమమం బున గూడి సంతోషంగా కాలంగడపటంసంతోషంగా ఉందని చెప్పటం దానిని బలపరిచేదిగానే ఉంది.   చెడు గుణాలు అణగద్రొక్కి సద్గుణ సమితిని అభివృద్ధి చేసుకొనటం మానినుల ధర్మం అని, ఒకరి పట్ల ఒకరు సద్భావం కలిగి వుండాలని, పరమేశ్వరుని మరువక భక్తి కలిగి వుండాలని, ఇట్లా ప్రతివారం కలుస్తూ నీతిని, సత్యాన్ని సోదరులకు బోధించా లని, పరమసతీ ధర్మములు సఖులకు స్నేహం కూర్చమని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లుగా వున్న  తరువాతి ఆరు పద్యాలు ప్రార్ధనా సమాజం సమావేశంలో తన సఖీ బృందాన్నికలుసుకున్నప్పటి సంతోష సందర్భంలోనివే కావాలి.

స్త్రీలస్థితులుతొమ్మిది గీతపద్యముల ఖండిక షేక్స్ పియర్ భావాలను అనుసరించి వ్రాయబడిన పద్యాలు. ( అనసూయ ,జనవరి 1923) నాటకశాల అనే ప్రపంచంలో సూత్రధారి అయిన సర్వేశుడి ఆజ్ఞను అనుసరించి వనిత జీవితంలో బహుప్రదర్శనలు ఉంటాయని ప్రారంభించి శైశవం, బాల్యం, యవ్వనం, సంసారం అనే భిన్న దశలను దృశ్యాలుగా వర్ణింస్తుంది. బాల్యదశను వర్ణిస్తూజ్ఞాన దేహంబు పోషించు / కాంక్షనొంది చదువ గోరెడు దృశ్యంబు ముదము ( గూర్చుఅని చెప్పటంలో ఆడ వాళ్ళ విద్యపట్ల ఆమె కు ఉన్న శ్రద్ధ కనబడుతుంది. యవ్వనం అంటేఒక పురుషుని చేపెట్టి / సతీత్వంబు గఱచుట’. సంసారంలో  అత్తమామల సేవించు దృశ్యమే కాదు, కష్టనష్టాలకు ఓర్చుకొంటూ పిల్లలను కనీ పెంచే దృశ్యం, పిల్లలకు పెళ్ళిళ్ళుచేసికోడళ్లను దయతో పాలించే దృశ్యంసర్వసుఖాలపై నాస సన్నగిల్ల ( జేయువృద్ధాప్యంలో చిన్మయాత్ము( జిత్తమున నిల్పి సేవజేసి మోక్షంబు కోరే దృశ్యం  ఉంటాయని చూపుతుంది. ఈ దృశ్యాలను సక్రమంగా చూపిన సకియ మిన్న అని తీర్మానిస్తుంది కూడా. 

ఒక మహమ్మదీయ వనితఅనే 75 పద్యాల ఖండకావ్యం  ( అనసూయ, మార్చ్ , ఏప్రిల్ 1924)మరొకటి ఉన్నది. రాబియా అనే ఒక భక్తురాలి కథను పత్రికా ముఖంగా తెలుసుకొనితత్కథామృతమొక కొంత తనివి దీఱ /జెలులకును బంచి పెట్టంగ దలఁచి’  వ్రాసిన కావ్యం  ఇది. టర్కీదేశంలో బాస్కోరా పురంలో ఒక పేద ఇంట పుట్టిన అమ్మాయి రాబియా. నాలగవ పిల్ల కనుక ఆ పేరు పెట్టారుట. పర్షియా భాషలో రాబియా అంటే నాలుగు అని అర్ధం కనుక అలా పెట్టారట పేరు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. కరువుకాటకాలు. ఎవరో ఆమెను ఎత్తుకుపోయి ఎవరికో అమ్మారు. హుస్సేన్ అనే యజమానికి బానిసగా అష్టకష్టాలు పడ్డది. అతని నుండి పారిపోవటానికి ప్రయత్నిస్తూ కిందపడి చేయి విరగ్గొట్టుకున్నది. కష్టాలలో భక్తిమార్గం పట్టింది. యజమాని ఇంటికి తిరిగివచ్చి యథాప్రకారం సేవకావృత్తి కొనసాగించింది. ఒకనాడు రాత్రి ఆ యజమాని భగవంతుడితో ఆమె సంభాషణను విన్నాడు, ఆమె పారవశ్యాన్ని, ఆర్తిని చూసాడు. ప్రతినిమిషం  భగవత్ సేవ చెయ్యాలని వున్నా   ఉదర పోషణ కోసం చేసే ఇంటిపనులవలన పగలు సేవకు దూరమవుతున్నానని ఆమె వాపోవటం గమనించాడు. 

 “ నిన్ను మదినిల్పి సేవించు నిమిషములను 

               గడు నమూల్యంబుగా నెంతు ( గద మహాత్మ 

               ధరణి నీ కంటె సంతోషదాయకమగు 

               వస్తువొకటియు లేదు సర్వాత్మనాకుఅన్న ఆమె సర్వ సమర్పణకు యజమాని ముగ్ధుడయ్యాడు. తన తప్పు తెలుసుకొని ఆమె పట్ల కోపం తగ్గి అతను పవిత్రుడయ్యాడు. ఆమెను సేవించటం మొదలుపెట్టాడు. ఆమె మక్కాకు పోయివచ్చి, నిత్యం ఖురాన్ పఠిస్తూ , మత సంబంధమైన ఉపన్యాసాలు చేస్తూ కాలం గడిపింది. తనదేహాత్మలు పరమాత్ముడికే కనుక తనకు పెళ్లి అవసరం లేదన్నది.ఘోర నరకాగ్ని( బడలేక చేరి నిన్నుఁ గొలుతునేని మాహాత్మ యా /ఘోరనరక/ వహ్నిలో ( బడద్రోయుము స్వర్గమందు ( / జేరగాంక్షింతునేని నాచిత్తమందు / స్వర్గ సౌధముఖద్వార భాగమపుడె మూసివేయుము దేవా మోమోటపడకవంటి పద్యాలలో నిష్కామ భక్తి తత్వం బహు చమత్కారంగా ఆవిష్కృతమైంది. నరక బాధ పడలేక కాదు నా ఆరాధనఅట్లా అనిపిస్తే వెంటనే నన్ను నరకానికి పంపు.. స్వర్గం కోసం ఆరాధిస్తున్నానని అనుకుంటున్నావేమో .. అట్లా అనిపిస్తే వెంటనే స్వర్గద్వారాలు మూసెయ్యి అని సవాల్ చేస్తున్నట్లుగా చెప్పటంలో దానినే చూస్తాం. 

            సీతమ్మ అనసూయ పత్రికను ఆశీర్వదిస్తూ వ్రాసిన అయిదు కంద పద్యాలు కూడా ఉన్నాయి. ( అనసూయ, ఆగస్ట్, 1924 ) . సమకాలపు మహిళా రచయితలవలెనే ఆమె కూడా కీర్తనలు ( హిందూసుందరి, జులై ,1902) మంగళహారతులు ( నవంబర్ 1902) వ్రాసింది. కీర్తనలు ప్రార్ధనా సమాజ సూత్రాలకు అనుగుణంగా ఉండటం చూస్తాం. ప్రతివారం స్త్రీల  ప్రార్ధనా సమాజపు సమావేశాలలో ఉపన్యసిస్తూ పాడటానికి వీలుగా ఇవి వ్రాసి ఉంటుంది.సర్వసముడగు స్వామి’  గురించి సంభావించటం, ‘అక్కలార మాహానుభావుండొక్కడే సుండీఅని సంబోధించటం, ‘యిక్కడకాదక్కడ మఱి యెక్కడని దేశములు తిరుగక / మక్కువతో మనమునందు ( జక్కంగా ధ్యానింతమమ్మా అని చెప్పటం -మొదలైనవి అందుకు నిదర్శనం.శ్రీకరుని నుతి యింతము’     అని స్త్రీలందరినీ కలుపుకొని ఒక సామూహిక ప్రార్థనకు ప్రోత్సహిస్తుంది. ఏ శ్రీకరుని నుతియింతము అని చెప్తున్నదో ఆ శ్రీకరుడికి ఒక ప్రత్యేకత ఉంది.జాలి హృదయుఁడు కందుకూరి మహాన్వయా కలోబ్ధిచంద్రుడుఅయిన వీరేశలింగకవిచేత నుతించబడిన వాడు. అట్లా ఆయన స్తుతించిన  ‘శ్రీకరునుతియింతముఅని పాటను ముగించటం ద్వారా ఆయన మార్గం అందరికీ అనుసరణీయం అని చెప్పినట్లయింది.కొటికలపూడి సీతమ్మకు ఆయనపట్ల ఉన్న గురుత్వం అటువంటిది.

   మంగళ హారతి ఆడపిల్లను ఉద్దేశించి భగవంతుడు ఆమెకు నిత్య శుభమంగళములు సమకూర్చాలని ఆకాంక్షిస్తూ పాడటానికి వీలుగా వ్రాసినది. ఆడపిల్లకు తల్లిదండ్రుల మాటవినాలని, నీతిగా, ధర్మంగా బతకాలని, భక్తికలిగి ఉండాలని పరోక్షంగా ప్రబోధిస్తుంది ఈ పాట. 

మొత్తం మీద సీతమ్మ కవిత్వంలో  స్త్రీ ధర్మాల ప్రబోధం, భక్తి తాత్విక ప్రచారం పోటాపోటీగా ప్రాధాన్యం వహించాయన్నది స్పష్టం. సీతమ్మ భక్తి తత్వమైనా స్త్రీ ధర్మ దృక్పథమైనా మరింత నిర్దుష్టంగా నిగ్గు తేల్చుకొనటానికి అసలైన వనరు ఆమె వచనసాహిత్యమే.

        .                                                   2

వచనసాహిత్యం: 

            కొటికలపూడి సీతమ్మ వచన సాహిత్యం అంటే అన్నీ వ్యాసాలే. సంఘ సంస్కరణ సభలలో 1904 నాటికే ఆమె మంచి ఉపన్యాసకురాలిగా పేరు తెచ్చుకొన్నది.ఆ ఉపన్యాసాలలోని వచనా రచనా కౌశల్యం ప్రశంసకు పాత్రమైంది. (జయంతి సూరమ్మ ,ఫిబ్రవరి 1904) కందుకూరి వీరేశలింగంపంతులుగారి సంఘసంస్కరణ భావాల వారసత్వం నుండి స్త్రీవిద్య గురించి, స్త్రీ ప్రార్ధనా సమాజ నిర్వహణ బాధ్యతల నేపధ్యం నుండి    నీతి, సత్యం, సత్య వర్తనం, ప్రేమ, పరోప కారం, భక్తి మొదలైన విషయాలగురించి ఆమె చేసిన ఉపన్యాసాలు హిందూ సుందరి పత్రికలో ప్రచురించబడుతూ వచ్చాయి.విషయం ఏదైనా  విద్య తో ముడిపెట్టి వివరించటం  ఆమె ప్రత్యేకత. 

            స్త్రీవిద్యపట్ల సమాజంలో ఉన్న వ్యతిరేకతను, స్త్రీలు విద్యావిహీనులుగా ఉండటాన్ని ప్రస్తా విస్తూ విద్యాలక్ష్మి కొంతమంది పురుషుల హృదయాలలో చేరి స్త్రీల దుస్థితికి పరితపించునట్లు చేసి వాళ్ళ ద్వారా స్త్రీలతో స్నేహం చేయటానికి సిద్ధంగా ఉందని సంస్కరణఉద్యమంలో స్త్రీవిద్య కోసం జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తుంది. అందువల్ల గృహకృత్యాలు నిర్వహించగా మిగిలిన కాలాన్ని వ్యర్ధపరచకుండా స్త్రీలు విద్య పొందటానికి సంసిద్ధులు కావాలని పిలుపు ఇచ్చింది. పది గంటల నుండి నాలుగు గంటల వరకు దొరికే తీరికను ఇతరుల దోషాలు ఎంచటంలో వృధాచేయక విద్యాభివృద్ధికి వినియోగించాలని హితవు చెప్పింది. భండారు అచ్చమాంబ వ్రాసిన అబలా సచ్చ రిత్ర రత్నమాల అందరూ చదవదగిన పుస్తకం అని ఆ సందర్భంలోనే ఆమె పేర్కొన్నది. ( జులై 1902). 

            ఆడపిల్లల చదువుకు బాల్య వివాహాలు ఆటంకంగా మారాయని సీతమ్మ అభిప్రాయం.  ఆడపిల్లలకు అసలు చదువు చెప్పించాలన్న అభిలాషే లోకంలో లేకపోవటం,వున్నా అయిదేళ్ల  వయసు నుండే ఆడపిల్లలలో విద్యాసక్తులను పెంచవలసిన   తల్లులకు విద్యలేకపోవటం, విద్యా వంతులైన తండ్రులకు, అన్నదమ్ములకు- లోకవ్యవహారమగ్నులుకనుక- తీరికలేకపోవటం స్త్రీవిద్య కు ఆటంకాలుగా గుర్తించింది. అన్నిటికన్నా స్త్రీవిద్యకు అసలు సవాలు బాల్యవివాహమే అని సీతమ్మ అభిప్రాయం.  ఆరేడేళ్ల వయసుకు బాలికలను బడికి పంపిన వాళ్ళు కూడా రెండుమూడేళ్లకే పెళ్ళిచేసి,అత్తవారేమనుకుంటారో అని ఆడపిల్లను బడికి పంపటం మానేస్తున్నారనిమరో రెండు మూడేళ్లకు కాపురానికి వెళ్లి సంసారలో చిక్కుకుపోయే  ఆడవాళ్లకు ఇక చదువెక్కడ అని ఆవేదన పడింది. (ఆగస్టు, 1902) 

చెన్నపురిలో జరిగిన దేశీయ మహాసభలో స్త్రీవిద్య గురించి ప్రసంగిస్తూహిందూ స్త్రీలు విద్యా స్వాతంత్య్రములయందు దారిద్య్రదశను అనుభవిస్తున్నారని చెప్పింది. సహధర్మ చారిణిగా  చెప్పబడే  భార్య విద్యావిహీన అయితే పురుషుల సత్కార్యచింత ఆచరణవాస్తవం కాలేదు అని హెచ్చరించింది. కందుకూరి వీరేశలింగం పంతులు వంటివారి కృషి ఫలించి బాలికా పాఠశాలలు ఏర్పడినప్పటికీఆచారదేవతకు అత్యంత ప్రియభక్తులగు మనవారు తమ బాలికలకక్షర   జ్ఞానము కలుగఁగానే మూఢజనులకు వెఱచిబిడ్డలను బడికిపంపటం మానేస్తున్నారని  బాధపడింది. సంసార స్త్రీలు పోయి చదువుకొనటానికి అనుకూలంగా పాఠశాలలను నిర్మించాలని ఆకాంక్షించింది. గతంతోపోల్చి అప్పటికి స్త్రీవిద్య విషయంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూనేమా గౌరవ భాగమును మాకు పంచి ఇచ్చుటకువెనుదీయవద్దని కోరింది. ( మార్చ్, 1904)

ఇందుకు భిన్నంగా స్త్రీలకు ఈశ్వరభక్తి, పతిభక్తి ముఖ్యధర్మములు అంటుంది సీతమ్మ సతీధర్మములు (సావిత్రి, 1904, జనవరి.) వ్యాసంలో.  బలహీనమైన వస్తువు బలమైన వస్తువుకు లోబడి ఉండుట సహజం అని నమ్మటం, దానికి అనుగుణంగా  స్త్రీలు పురుషులకు లోబడి ఉండి మన్ననలను పొందాలని చెప్పటం కొంత వైరుధ్యంగా  కనబడుతుంది.  

1905 లో కావచ్చు, సీతమ్మ నైజాము రాజ్యంలో ఒక స్త్రీల సభలో స్త్రీవిద్య గురించి మాట్లాడింది.       (డిసెంబర్- జనవరి 1906) ఆసభ ఏర్పాటు ఆంధ్రభాషానిలయపు కార్యదర్శి అయిన టి.నారాయణాచార్యుల వారి చొరవతో జరిగినట్లు ఉపన్యాసం ప్రారంభంలోఆమె అన్నగారు సికింద్రాబాద్ వాసి అని వీరేశలింగం స్వీయ చరిత్ర చెప్తుంది. అందువల్ల అన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆ సమావేశం ఏర్పాటు చేశారో ఏమో!...అలా ఏర్పాటు చేశారనుకున్నా  కవి, స్సంస్కరణ ఉద్యమంలో భాగస్వామి అని సీతమ్మ ప్రఖ్యాతి తెలియకుండా అదిసాధ్యమయ్యే పనికాదు.ఏమన్నా తెలంగాణాలో మాట్లాడింది అన్నది వాస్తవం. ఈఉపన్యాసంలో ఆమె కృష్ణాగోదావరి మండల ప్రాంతాలలో స్త్రీవిద్యావిషయమై ఇంచుమించుగా ముప్ఫది వత్సరాల నుండి వాదప్రతివాదాలు జరుగుతుం డటం వల్ల విద్య అక్కడ నానాటికీ అభివృద్ధి చెందుతున్నదని, స్త్రీలు విద్యావంతులై విదుషీమణులై కొందరు పత్రికలుపెట్టి, మరికొందరు సమాజాలు పెట్టి, ఇంకాకొందరుఉపాధ్యాయినులు అయి స్వజాతి వృద్ధికి తోడ్పడుతున్నారనిఅక్కడ స్త్రీలకూఉన్నతవిద్యకావాలా సామాన్యంగా ఉత్తరాలువ్రాసి పుస్తకాలు చదువుకొనే విద్యఉంటే సరిపోతుందా అన్నవిచికిత్స అక్కడ సాగుతుండగా ఇక ఈప్రాంతాలలో  స్త్రీవిద్యాభివృద్ధి సూచకములంతగా కనబడక పోవటంవల్ల నేడు చర్చించవలసిన విషయం స్త్రీలకు చదువు అవసరమా కాదా అన్నవిషయమే అంటుంది ఆమె. కోస్తా ఆంధ్ర ,తెలంగాణాలను ఆ ప్రాంతం ఈప్రాంతం అని విడదీసి వాటివాటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడి సంస్కరణ ఉద్యమాల స్థితిని, స్థాయిని  అంచనావేస్తున్నట్లుగా ఉపన్యాసాన్నిప్రారంభించిందన్నమాట. 

స్త్రీపురుషులలో జాతిలక్షణాన్ని తెలిపే కొంత ఆకారభేదమే ఉంది తప్ప జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఫలితాలు ఇద్దరూ ఒకేరీతిగా పొందుతారని ఆనాడు ఆమెచెప్పిన మాట సెక్స్  కు జండర్ కుఉన్నభేదాన్ని స్పష్టాస్పష్టంగా సూచిస్తుంది. ఈశ్వరుడు జ్ఞానాదిసమస్త విషయాలలో స్త్రీపురుషులను ఏమాత్రంభేదం లేనివాళ్లుగానే  సృష్టించాడని సీతమ్మ ఈవ్యాసంలో నొక్కిచెప్పింది.విద్యనేర్చుకోని స్త్రీలకు నష్టంఏమిటి? విద్యనేర్చిన వాళ్లకు ఒరిగేదేమిటి అన్నప్రశ్నను చర్చిస్తూ  విద్యలేకపోతే భర్తల పట్ల స్త్రీలు నిర్వహించవలసినవిగా  మనుస్మృతి చెప్పిన షట్కర్మలను( సేవచేసే దాసీ, ఆలోచన చెప్పేమంత్రి, పోషణచేసే తల్లి, పడకలో రంభ, రూపంలోలక్ష్మి, సహనంలో భూదేవి)   ఆచరించ సమర్థులు కాలేరు అని తర్కించింది. అసత్యం, పరుషత్వంపరనిందా, స్వార్ధం అనే అవలక్షణాలనుండి  బయటపడటానికి విద్య ఇచ్చే వివేకం పనికి వస్తుందని వివరించింది.

మనుషులు ఎంత గొప్ప వాళ్ళయినా నీతి అనేది లేకపోతే ఇహపరాలకు గౌరవాహార్హులు కారంటుంది సీతమ్మ. నీతి యెల్ల దేశముల, ఎల్ల వేళల మార్పుచెందని మహోన్నత సత్వము కలది అంటూనే  నీతిని ద్వంద్వ లైంగిక విలువ ప్రాతిపదికగా వ్యాఖ్యానించటం విచిత్రం.  నీతిని అనుసరించి ప్రవర్తించటానికి పురుషులకంటే స్త్రీలకు ఎక్కువ వెసులుబాటు ఉంటుందన్నది ఆమె అవగాహన. పురుషులు కుటుంబ పోషణలో ప్రతిసారీ నీతిమార్గానికి బద్ధులై నిలిచి ఉండటం కష్టం అంటుంది. నీతి మార్గంలో నిలిచి స్వకార్యములు నిర్వహించుకొనుట పొసగదు అని చెప్పటం  వల్ల   నీతి తప్పి ప్రవర్తించటానికి  పురుషులకు లోక ఆమోదాన్ని స్థిరీకరించినట్లైనది.  దేవుడి దయవల్ల స్త్రీలకు అలాంటి ధనార్జన భారం లేదు కనుక నీతిగా ఉండటం సులభం అని తీర్మానించింది. పెద్ద అవసరాలు లేకుండానే స్త్రీలు అసత్యాలు ఆడి నీతి తప్పటం సరి కాదని అంటుంది. నీతిమార్గంలో అభివృద్ధిచెందటానికి విద్య సహాయపడుతుందని, కనుక స్త్రీలు విద్యను అభివృద్ధి చేసుకొనటానికి ప్రయత్నపరులు కావాలి అని చెప్పింది. ప్రతిదినమూ ఒక పుస్తకంలో ఇంతభాగం  చదవాలని నియమం పెట్టుకొని చదవాలని, సంసారంలో ఆ కృషికి భంగకారణాలు అనేకం ఎదురవుతున్నా విద్యా కల్పతరువును విడువవద్దని సూచించింది. దురభిమానం వదిలించుకొనటం, విమర్శవివేకం పెంచుకొనటం, సత్యాన్ని గ్రహించటం, ఐకమత్యంతో ఉండటం నీతి మార్గ సాధనలో మైలు రాళ్ళని చెప్పింది.నీతిలేకయున్న నిఖిలంబు చెడిపోవు 

     నీతిగలుగు సతికి నిఖిలముండు 

     నీ ధరిత్రిలోనిదేది యెట్లయినను 

   నీతివిడువరాదు నెలఁత యెపుడు”  వీరేశలింగం పంతులు వ్రాసిన పద్యాన్ని ఎల్లప్పుడూ స్మరణలో  ఉంచుకోవాలని హితవు పలికింది. (  మే,1902)

సత్యము అనే ఉపన్యాసాన్ని(సెప్టెంబర్, 1902) ఆమె విద్య ప్రశస్తితోనే ప్రారంభించింది. కాస్తో కూస్తో విద్యను అభ్యసించటంవల్లనేవంటయిండ్లయందడగి యుండెడిస్త్రీలు బ్రహ్మసమాజమందిరాల వరకు నడచి రాగలిగారని, పుణ్య స్త్రీల సచ్చరిత్రలు చదివి ఆనందించ గలుగుతున్నారని చెప్తూనే విద్య కు తోడు వినయాది సద్గుణాలు ఉంటేనే అభివృద్ధి అని పేర్కొన్నది. దైవభక్తి, పతిభక్తి , గృహకృత్య నిర్వహణ స్త్రీలకు విధాయకమని చెప్పికాలాన్ని లోకాభిరామాయణాలతో వృధాచేయక జ్ఞానాభి వృద్ధికై చదువుకొనటం, చదువెరుగని స్త్రీలకు బోధించటం, సర్వసమానబుద్ధిని అలవరచుకొనటం ఆవశ్యకర్తవ్యం అని చెప్పింది. ఆ క్రమంలో సత్యము అలవరచుకొనవలసిన ఉత్తమగుణం అని పేర్కొన్నది. కుటుంబపోషణకై పురుషులవలె పాట్లుపడవలసిన భారం లేని స్త్రీలు తమభర్తలు సత్యవ్రత శీలురై వర్ధిల్లుటకు తోడ్పడాలని సూచించింది. సత్యప్రవర్తన గొప్ప జీవిత విలువ అని ఫ్రాన్స్ దేశపు కథను ఒకదానిని ఉదహరిస్తూ నిరూపించి చెప్పటం చూడవచ్చు. (సత్యప్రవర్తనసెప్టెంబర్ & అక్టోబర్ 1903), 

            దైవభక్తి ( అక్టోబర్, 1902),ప్రేమ (మార్చ్ 1903),పరోపకారము ( ఆగస్ట్ , 1904) మొదలైన అంశాల మీద సీతమ్మ ఇచ్చిన ఉపన్యాసాలు ఉన్నాయి. బ్రహ్మసమాజ మతానుయాయిగా ఆమెకు దైవభక్తి అంటేసృష్టిస్థితిలయకారణభూతుఁడై, సర్వాంత ర్యామియైనిత్యుడై, నిరాకరుఁడై జనన మరణ రహితుడైన’  పరమాత్ముని యందు మనస్సు నిలపటం. దానినే వీరేశలింగం మానసిక పూజ అని చెప్పాడు. పూజా పద్ధతి ఏదైనా కావచ్చు అసలు ఉండవలసినది దైవభక్తి అని ఆమెభావం. 

హృదయక్షేత్రం ప్రేమజలంతో తడిసినప్పుడే నీతి అనే వృక్షం చక్కగా పెరుగుతుంది అంటుంది సీతమ్మ. ప్రకృతిలో, పశుపక్ష్యాదులలో, మనుషుల సంబంధాలలో ప్రేమ ఎంత సహజ మైన జీవధాతువో వివరించి దానిని సజీవం చేసుకొనటంలోనే సకలార్ధ సాధన సాధ్యమని చెప్పింది. 

ఉపకారచింత మానవ జీవనానికి గొప్ప అలంకారం అని సీతమ్మ విశ్వాసం. ఉపకార ధర్మాన్ని నిర్వహించటానికి ధనబలం, దేహబలం అవసరంలేదని, సత్యబలం, బుద్ధిబలం ఉంటె సరిపోతుందని బడికిపోయే ఒక బాలిక యందలి పరోపకార చింతా సౌందర్యాన్ని చూపించే ఒక కథను చెప్పి నిరూపించింది సీతమ్మ. 

స్త్రీవిద్యకు సానుకూలసంస్కృతిక వాతావరణాన్ని సమాజంలో నిర్మించటానికి నిబద్ధురాలై పనిచేసింది సీతమ్మ. బృందావనపుర స్త్రీ సమాజము వారి చొరవతో 1914 ఏప్రిల్ 11,12 తేదీలలో బెజవాడలో జరిగిన  అయిదవ ఆంధ్ర మహిళాసభ లో  అగ్రాసనాసీనురాలిగా ఉపన్యసిస్తూమనవారిలో నాటుకొనియున్న స్త్రీవిద్యాద్వేషము నశింపజేయుటకీ మహిళాసభలే కొంత వరకుప యోగ కరములుఅని చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. సమాజాన్ని నూతనపద్ధతులలో నిర్మించవలసిన ధర్మాచరణలో విద్యావంతులైన స్త్రీలు ఎక్కువభారం వహించవలసినవారు అంటుందామె. ఈ వ్యాసంలో విషయాన్ని రెండు కోణాలనుండి చర్చింది సీతమ్మ.  ఒకటి మతకోణం. కామక్రోధాది గుణాలను పరిమార్చి ఈశ్వరభక్తి, సత్యానురక్తి, వంటి సద్గుణాలను అల వరచు కొనటానికి నిరంతర ప్రయత్నం ఉండాలంటుంది . నీతి, సత్యం, దైవభక్తి, ప్రేమ మొదలైన వ్యాసాలలో చెప్పిన దాని  కొనసాగింపు ఇది. 

ఇక సంఘంలోని లోపాలను కనిపెట్టి వాటి విషయంలో ఆచరింపవలసిన ధర్మ నిర్దేశనం ఇందులో మరొక కోణం. స్త్రీవిద్యతో మొదలుపెట్టి చరిత్రలో అచేతన పదార్ధాలైన యంత్రాల స్థాయికి దిగజార్చబడిన స్త్రీల అవమాన దుఃఖానికి సరైన పరిహారం విద్య అని చెప్పిన సీతమ్మ బాల్యవివాహ పిశాచాన్ని వెళ్లగొడితేగానీ విద్య స్త్రీలకు అందుబాటులోకి రాదు అని చెప్తుంది. 1902 నాటికే ఆమెకు ఈ అభిప్రాయం ఉంది. దానిమీద అభివృద్ధి ప్రౌఢవివాహాలను సమర్ధిస్తూ మాట్లాడటం. బాల్యవివాహాలవల్ల జరిగే అకాలప్రసవాలు, కల్లోల కాపురం లేకపోతే స్త్రీలు విద్యారంగంలో సాధించే అభివృద్ధి గురించిన సీతమ్మ కలలు ఇందులో కనబడతాయి. స్త్రీలు ఉపాధ్యాయులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు అయి స్వతంత్రజీవనం చేయగలుగుతారని, దేశాభివృద్ధికి తోడ్పడతారని, కన్యాశుల్కం, వరకట్నం వంటి సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోగలుగుతారని అభిప్రాయపడింది. ఈ సందర్భంలో ఆమె వరశుల్క దురాచారానికి నిరసనగా ఆత్మాహుతి చేసుకొన్నస్నేహలతాదేవి ని ప్రస్తావించింది. ఇది బెంగాల్ లో అప్పుడే జరిగిన ఘటన. ఆత్మహత్య తప్పా,ఒప్పా,తొందరపాటా అన్న చర్చజోలికి పోకుండా చదువుకొని యుక్తవయస్కులైన ఆడపిల్లలు  వివాహవిషయంలో స్వతంత్రంగా ఆలోచించి కార్యోన్ముఖులు కావటానికి అవకాశం ఉన్నదని చెప్పటం వరకే సీతమ్మ ఉద్దేశం. (ఈ  ఘటన వస్తువుగా  రాయప్రోలు సుబ్బారావు స్నేహలత అనే కావ్యం వ్రాశాడు) అంతేకాదు బాలవితంతు సమస్య పరిష్కారానికి అదే మార్గమని ఆమె అభిప్రాయం. అదేవిధంగా ఆమె భ్రూణహత్యలు, శిశుహత్యలు లేని సమాజం స్త్రీలకు పునర్వి వాహాన్నిఆమోదించటంవల్ల మాత్రమే సాధ్యమని నొక్కి చెప్పింది.విద్య మృగత్వంనుండి మాన వత్వం వైపుకు జాతిని నడిపించగల  శక్తి అని సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించింది. అంతకు ముందు   పదునాల్గు ఏళ్లక్రితం నుండి ఆమె చేస్తున్న ఉపన్యాసాలకు  ఒక సమగ్రమైన, అభివృద్ధి కరమైన  కొనసాగింపు ఈ వ్యాసంలో కనబడుతుంది. 

ఇవి కాక కొటికలపూడి సీతమ్మ వ్యాసాలు మరొక ఆరు ఉన్నాయి. వాటిలో ఒకటిఅబలా సచ్చ రిత్ర రత్నమాల’  సమీక్ష( హిందూ సుందరి, జులై 1902). గ్రంధకర్త భండారు అచ్చమాంబ.  మధ్యపరగణాలకు చెందిన పచమరి గ్రామంలో సబ్ డివిజన్  ఆఫీసరుగా ఉన్న భండారు మాధవరావు భార్య.  ఆ పుస్తకాన్ని ఆమె భర్తకే అంకితం ఇచ్చింది అని చెప్పి అందువల్ల గ్రంధకర్త్రి యొక్క పతిభక్తి తేటతెల్లం అవుతున్నదని సమీక్షకురాలు అభిప్రాయపడింది. శౌర్యధైర్య సాహసాలు, పాతివ్రత్యం, దైవభక్తి, విద్యాసంపత్తి, పరోపకారనిరతి గల స్త్రీల సచ్చరిత్రలు అందులో కూర్చబడినాయని, మూడుభాగాలుగా రచించటానికి ఉద్దేశించిన గ్రంధంలో ఇది మొదటి భాగమని, వెయ్యిసంవత్సరాల చరిత్ర మీద తమతమ వ్యక్తిత్వాలతో ముద్ర వేసిన వాళ్ళ చరిత్రలు వ్రాయబడినవని, మిగిలిన స్త్రీలచరిత్రలను చదవాలని కుతూహలంగా ఉందని పేర్కొన్నది సీతమ్మ. ఈ పుస్తకం  ఆమెను ఎంతగా ప్రభావితం చేసిందంటే ఇతరత్రా సందర్భం వచ్చినప్పుడల్లా ఏ వ్యాసంలోనైనా సరే ఆమె దానిని ప్రస్తావించకుండా ఉండలేనంత.  

రెండు రచనలు  హిందూసుందరి పత్రికకు వ్రాసిన దీర్ఘలేఖలు. మొదటిలేఖ తనతో పాటు ఆ పత్రిక చదివే స్త్రీలను ఉద్దేశించి వ్రాసినది. ( పత్రికా సహపాఠినులకొక విజ్ఞాపనము, ఏప్రిల్, 1903) రెండవలేఖ హిందూసుందరి పత్రిక సంపాదకురాలు మొసలికంటి రామాబాయమ్మ గారికి సహాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంపలి శాంతాబాయమ్మ మరణానికి సానుభూతిని ప్రకటిస్తూ, ఆమెతో తనకున్న స్నేహ సంబంధాలను స్మరించుకొంటూ, రామాబాయమ్మకు సానుభూతి తెలియచేస్తూ వ్రాసినది. పత్రికారచనకు సంబంధించి స్త్రీలకు అనుసరించదగిన సూత్రాలను ప్రతిపాదించిన రచనగా మొదటి లేఖకు ఒక సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నది. స్త్రీలకు ఒక పత్రికను పెట్టి ఇచ్చిన సత్తిరాజు సీతారామయ్యను ప్రశంసించి, దొరికిన ఒక విలువైన అవకాశంగా భావించి స్త్రీలు దానిని ఎలా వాడుకోవాలో చెప్పింది. పుస్తకాలను పుత్రికలుగా, భార్యలుగా సంభావించే సంప్రదాయం ఉంది. పుస్తక రచయిత తండ్రి. అంకితం తీసుకొన్నవాడు భర్త. ఈ వ్యాసంలో సీతమ్మ పత్రికను పాఠకులకు కోడలుగా సంభావించింది. ఇది కొత్తకల్పన. బహుశా స్త్రీల ఊహకు మాత్రమే అందగల పోలిక ఇది. పత్రికపై విమర్శల పేరు మీద కఠిన వాక్కులతో విరుచుకుపడే పద్ధతి తగదు అని చెప్పటానికి సీతమ్మ ఈ ఉపమానం తెచ్చింది. దానిని చివరివరకు అన్వయిస్తూనే ఉంది. అత్తలవలె ఇంటిపని చేయించుకొనక దూతికగా భావించుకొని సాటి స్త్రీలతో స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పింది. పత్రికకు వ్రాసేవిషయాలు స్త్రీలలోని లోపాలను విమర్శిస్తూనే వాటిని చక్కదిద్దుకొనే మంచిమార్గాలను వినయవాక్యాలతో చెప్పేవిగా ఉండాలని  సూచించింది. 

స్త్రీలు పత్రికకు వ్రాసే విషయాలు  స్త్రీల అభివృద్ధికి సంబంధించినవిగానే ఉండాలి తప్ప స్త్రీలను అనాదరణ చేశారన్న ద్వేషంతో  పురుషులను నిందిస్తూ మాత్రం వ్రాయకూడదు అని చెప్తూ అనాదరణ చేశారన్న కోపం వాళ్ళ మీద ఉన్నా సరే వాళ్ళను అత్యంత వినయవిధేయలతో వేడుకోవలసినదే కానీ నొప్పించే మాటలు మాటాడరాదు అని చెప్పింది.మనకు ప్రభువులై యున్న పురుషులయెడ మనము వినయశీలలమై యుండకున్న మనకపఖ్యాతియే సంభవించునని స్త్రీలను హెచ్చరించింది. లోకవ్యవహారంలో వారికెంత లోబడి ఉండవలసిన వాళ్ళైనా స్త్రీలు ఆత్మానందదాయకమగు విద్యాధనమార్జించుటలో పురుషులతో సమనార్హత కలిగిఉన్నారని ఆమె అభిప్రాయం. సహనంతో వ్రాసే వ్రాతలే ఎప్పటికైనా పురుషులను స్త్రీపురుషసమానత్వ సత్య పక్షం వైపుకు మళ్లిస్తాయని   సీతమ్మ విశ్వాసం. స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలన్న సంప్రదాయ భావాన్ని సంపూర్ణంగా నమ్ముతూనే ఆధునిక సమానత్వ సూత్రాన్ని విద్య విషయంలో సర్వాత్మనా అంగీకరించటంలో ఉన్న వైరుధ్యం ఈ వ్యాసంలో స్పష్టంగా కనిపిస్తుంది. సంస్కరణోద్యమ పరిమితి అది. అయితే సీతమ్మ ఆ సంస్కరణోద్యమం నుండే  గతానుగతికత్వంనుండి బయటపడే బలాన్ని సంపాదించుకొని ,ఎట్టి ఆచారమైనా పూర్వులు ఆచరించినది అంతా మంచి, కొత్తగా కనుగొనబడినది ఎంత యుక్తియుక్తంగా ఉన్నా చెడ్డది అని భావించే మూఢత్వాన్నిఏవగించుకొని  ‘వృద్ధి స్వావిభావికముఅని నమ్మటం నేర్చుకొన్న విషయం గమనించాలి.( ప్రార్ధనా మందిర ప్రవేశ శుభదినోత్సవము, హిందూసుందరి, సెప్టెంబర్ 1904)  

కొటికలపూడి సీతమ్మకు వీరేశలింగం పంతులు పట్ల గౌరవం, ఆరాధన. వీరేశలింగం ప్రస్తావన లేని ఉపన్యాసాలు ,వ్యాసాలు అరుదు. ప్రసంగ విషయానికి, సందర్భానికి తగినట్లు వీరేశలింగం రచనలను, పద్యాలనూ ఉటంకించటం చూస్తాం. స్త్రీవిద్యా విషయకమైన ఆయన కృషిపట్ల స్త్రీలోకమంతా ఆయనకు కృతజ్ఞతతో  వుండాలని ఆమె భావిస్తుంది. అటువంటి వీరేశలింగం పంతులు యాభైఆరవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించికొని చేసిన ప్రసంగంలో ( హిందూ సుందరి , మే,1904) ఆమె పంతులుగారి సర్వ సుగుణములలో దయాగుణం నాయకమణి అని, సత్కార్య శూరత రెండవ సుగుణమని, ఓర్పు మూడవ సుగుణమని ఈ మూడు గుణాలను ఆశ్రయించుకొని ఉన్న ఆయన సంస్కరణోద్యమ విశిష్టతను సూచించింది. వీరేశలింగ పంతులు గురించి అల్లిన సీసపద్యంతో ఈ వ్యాసాన్ని ముగించింది. 

సత్యమే జయమును సద్వాక్యమును నమ్మి సతము వర్తించునే సజ్జనుండు 

పతిబాసినట్టి యాపదగుండు సతులకు ( బతిభిక్ష పెట్టెనే పండితుండు 

జనుల మూఢత్వంబు సంసిపోజేయంగ సమకట్టుచుండు నే సత్యధనుడు 

హిందూవితంతువులెల్లవిద్యనలనంద నాలయంబొసఁగె నే యమాలగుణుడు 

అట్టి వీరేశలింగాఖ్యు ననవరతము 

నాయురారోగ్య భాగ్యంబులంద( జేసి  

తోడునీడగనుండి కాపాడుమయ్య 

దీనరక్షక యమలాత్మ దేవదేవ “  ఆశీస్సు రూపకమైన గుణవర్ణనతో కూడిన ప్రార్ధనా పద్యం ఇది. ఇట్లా వ్యాసం చివర ఒక పద్యం వ్రాయటం సీతమ్మ పద్ధతి. ఆయా వ్యాసాల సారాన్ని సూచించే విగా, సందేశరూపంలో ఉండే ఆ పద్యాలు ఆమె ఉపన్యాస శిల్పంలో ఒక భాగం. ఆమెలోని కవిత్వ ఆసక్తికి, శక్తికి అవి నిదర్శనం కూడా. ప్రాచీన తెలుగు సంస్కృత సాహిత్య ప్రస్తావనలుచెప్తున్న విషయాన్ని సుబోధకం చేసేందుకు చెప్పే జనవ్యవహార గాధలు ఆమె ఉపన్యాసాలకు అలంకారాలు. 

లభిస్తున్నంతవరకు సీతమ్మ చివరి వ్యాసం దామరాజు సుందరమ్మ గురించి వ్రాసినది ( అనసూయ, సెప్టెంబర్ , 1924)  దామరాజు సుందరమ్మ 1875 లో రాజమండ్రిలో పుట్టి, పాఠశాలకు వెళ్లి చదువుకొని, పురాణ  పఠనంలో , దేశచరిత్ర జ్ఞానం లో ఆసక్తిని కనబరచి, వీరేశలింగం పంతులు సాహిత్యమంతా చక్కగా చదువుకొన్న బాలిక. తండ్రి వీరేశలింగం స్నేహితుడై కూడా ఆయన మాట వినక ఆమెకు బాల్యంలోనే పెళ్ళిచేసాడు. వేశ్యాలోలుడైన భర్తతో ఆమెకు సుఖం లేదు. 1910 లో  అతను ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆమె చిత్తచాంచల్యానికి లోనయింది. ఇందులో కథ ఏమీలేదు. ఉన్నది ఒక వాస్తవం. సాధారణంగా ఆనాటి స్త్రీల జీవిత విషాదం ఇది. స్త్రీల అనుభవాలను, కథలను గుదిగుచ్చినఅబలాసచ్చరిత్ర రత్నమాలఉన్నప్పటికీ అందులోని స్త్రీలు ప్రధానంగా  మహారాష్ట్ర ప్రాంతపు వాళ్ళు గనుక   చెందినవి కనుక ఆంధ్రదేశపు స్త్రీల గురించి తమ పత్రికలో వ్రాయించాలని అనసూయ పత్రిక సంపాదకురాలు స్వయంగా తెలిసిఉన్న స్త్రీ గురించి వ్రాయమని అడిగితే కొటికలపూడి సీతమ్మ తనకు బాగా పరిచితురాలు అయిన సుందరమ్మ గురించి వ్రాసింది. 

సుందరమ్మ రచయిత్రి కాదు, సంఘసంస్కరణ ఉద్యమంలో ఉన్నది కాదు. ఒక సాధారణ హిందూ వితంతువు. ఆమె లాంటి వాళ్ళు అనేకులున్నారు. ఈ రకమైన సాధారణ స్త్రీల విషాదం వెనుక అసాధారణ సామాజిక దుర్మార్గం ఉంది. దానివైపు చూపు తిప్పటమే ఈ వ్యాసం ఉద్దేశం. బాలికలకు చదువుకొనే అవకాశాలు లేవు. అవకాశం లభించిన వాళ్ళ చదువుకు సార్ధకత లేకుండా చేసే బాల్యవివాహాలు. వరుల గుణగణాల గ్రహింపుకే అవకాశం లేక ఆడదాని అదృష్టం మీద ఆధారపడిన ఆ పెళ్లి స్త్రీలకు పెద్ద హింస. ఆ హింస భరించలేక చిత్తచాంచల్యాలు. ఆడవాళ్ళ దైహికమానసిక ఆరోగ్యానికి అవకాశంలేని పెళ్లిళ్ల పైన, సంసారాలు పైన ఆలోచనలను ప్రసరింప చేయటం ఈ వ్యాసం ప్రయోజనం. ఇతిహాసపు చీకటికోణంలో పడి  కనిపించని  ఇలాంటి సమకాలీన వాస్తవ ప్రపంచపు స్త్రీల జీవితాలను కొటికలపూడి సీతమ్మ ఎన్నింటిని చెప్పాలనుకున్నదో , చెప్పిందో తెలియదు. 1924 తరువాత ఆమె రచనలగురించి కానీ, ఆమె జీవిత విశేషాల గురించికానీ సమాచారం ఏమీ తెలియ రావటం లేదు. 

             --------------------------------------------------------------------------

     

 

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర - 6

 “హర్షదాయక చిత్ర కథాళి తోడ నవ్యగతిహిందూ సుందరినడిపి మిగుల 

  ఖ్యాతి గనిన శేషమ్మ(కు గడు బ్రియముగ గరమునం దొడ్జి నాడను గంకణమ్ము” 

1928 నుండి స్త్రీలకోసం గృహలక్ష్మి పత్రికను నడుపుతూ 1934 లో సాహిత్య సామాజిక రంగా లలో విశేషకృషి చేస్తున్న మహిళలను సన్మానించి గౌరవించటానికి  గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని ఏర్పరచి ప్రతియేడూ ఒకరికి  ఇస్తూ వస్తున్న డాక్టర్ కె.ఎన్ కేసరి గంటి కృష్ణవేణమ్మకు ఇస్తున్న సందర్భంలో ( 1949 -1950)  మొదటి నుండి అప్పటి వరకు స్వర్ణకంకణం ఎవరెవరికి ఇచ్చాడో ఆయన మాటల్లోనే చెప్తున్నట్లుగా ఎవరో వ్రాసిన పద్యాలలో ఒకటి ఇది.  కర్త ఎవరో తెలియదు. కానీ హిందూ సుందరి పత్రిక నడిపినందుకు గృహలక్ష్మి స్వర్ణకంకణం పొందిన ఈ శేషమ్మ ఎవరు

శేషమ్మకు గృహలక్ష్మి స్వర్ణకంకణం లభించింది 1939లో. గృహలక్ష్మి పత్రిక కార్యాలయం అయిన మద్రాసు లోని కేసరికుటీరంలో జరిగిన ఆ సభలో కాంచనపల్లి కనకాంబ స్వాగత వాక్యాలు పలుకుతూ శేషమ్మ నుషష్టిపూర్తి ముత్తయిదువఅని ప్రస్తావించింది. శేషమ్మ 1878 బహుధాన్య సంవత్సర జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు తణుకు తాలూకా వేలవెన్ను గ్రామంలో జన్మించింది. తల్లి మహలక్ష్మమ్మ. తండ్రి సత్తిరాజు వెంకటరామకృష్ణయ్య పంతులు. పది నెలల వయసులోనే తండ్రిని కోల్పోయింది. అక్క బావల దగ్గర కొంతకాలం పెరిగింది. తరువాత మేనమామ వెలిచేటి భద్రాచలం ఆమె బాధ్యత తీసుకొన్నాడు. ఆయన అమలాపురం బాలికా పాఠశాల ప్రధానో పాధ్యాయుడు. మేనగోడలిని బడిలో చేర్చి చదవనూ వ్రాయనూ నేర్పించాడు. ఆయన శిక్షణలో శేషమ్మకు భారత భాగవతాది గ్రంధాల జ్ఞానం అబ్బింది. పదకొండవ ఏట బాలాంత్రపు సుందర రామయ్యతో పెళ్లి అయింది. అక్కడినుండి ఆమె బాలాంత్రపు శేషమ్మ. 

రాజమండ్రిలో భర్తతో కలిసి జీవిస్తున్న కాలంలో  ఆమె విద్యను అభివృద్ధి చేసుకొన్నది. దేవగుప్తాపు మహలక్ష్మమ్మతో సాహచర్యం కావ్యప్రబంధ పరిజ్ఞానాన్ని పెంచింది. ఆ కాలంలో విజ్ఞానచంద్రికా పరిషత్తు వారు స్త్రీలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించేవాళ్ళు. నరసాపురం లోనూ అటువంటి పరీక్షలు నిర్వహించేవాళ్ళు. శేషమ్మ ఆ పరీక్షలకు చదివి ఉత్తీర్ణురాలయింది. కందాళ నరసింహాచార్యులుగారి దగ్గర సంస్కృతం నేర్చుకొన్నది. 1903 లో కాకినాడలో విద్యార్థినీ సమాజ స్థాపనలో పులుగుర్త లక్ష్మీ నరసమాంబతో పాటు శేషమాంబ కూడా ఉన్నది. ఆమె దగ్గర కావ్యాలు కూడా చదువుకున్నది. కాకినాడ విద్యార్థినీ సమాజానికి అనుబంధంగా స్థాపించబడిన రాజ్యలక్ష్మీ పుస్తక భా0డాగారాన్ని నిర్వహించింది. హిందూసుందరి పత్రికకు మూలధనం, చందాలు సేకరించి పంపటం నుండి, విద్యార్ధినీ సమాజ పునర్నిర్మాణం, దానికి అనుబంధంగా   మహిళా విద్యాలయం నిర్వహణ, హిందూసుందరి సంపాదకత్వం వరకు అన్నీకూడా బాలాంత్రపు శేషమ్మ కార్య కర్తృత్వ లక్షణానికి, కార్యదీక్షకు, నిర్వహణ సామర్ధ్యానికి గీటురాళ్ళు.

 1904 నాటి  విద్యార్థినీ సమాజం కొద్దికాలంలోనే మూతబడితే చిన్నచిన్న పట్టణాలలోనే  స్త్రీ సమాజములు ఎన్నో అభివృద్ధి చెందుతుండగా కాకినాడ వంటి పెద్ద పట్టణంలో  స్త్రీ సమాజం లేకపోవటం ఏమిటని దామెర్ల సీతమ్మతో కలిసి 1910 లో దానిని పునరుద్ధరించింది శేషమ్మ. శ్రీ కాకినాడ విద్యార్థినీ సమాజంగా 1911 సెప్టెంబర్ 27న ఇది రిజిస్టర్  చేయబడింది.  శేషమ్మ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం తనశక్తి యుక్తులను ఆ సంస్థ అభివృద్ధికి వినియోగ పరిచింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం సమావేశాలు నిర్వహించటం, స్వామి విద్యానంద పరమహంస స్వాములు,   ఆంద్రయోగినీ మణులుమొదలైన వారి  ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించటం, విద్యార్థినీ సమాజం స్వంత భవనం, సభాభవనం మొదలైన వాటి నిర్మాణాలకు శ్రీశ్రీ పిఠాపురం మహారాణి, లక్ష్మీ నరసాపురం జమిందారిణి శ్రీశ్రీ రావు రామయ్యమ్మ బహద్దూర్ మొదలైన వారిని కలిసి   విరాళాలు సేకరించటం, వార్షిక సభలు నిర్వహించటం, నివేదికలు సమర్పించటం వంటి పనులలో తలమునకలైంది ఆమె. శ్రీకాకినాడ విద్యార్థినీ సమాజం వార్షిక నివేదికలు ఆమె చారిత్రక దృష్టికి నిదర్శనాలు.1916 లో ప్రచురించిన ఆరవ వార్షిక నివేదిక అందుకు ఒకఉదాహరణ.మొట్టమొదటి సంవత్సరపు వార్షిక సభకు బుర్రా బుచ్చిసుందరమ్మ, రెండవ వార్షికసభకు కాంచనపల్లి కనకాంబ, మూడవ వార్షికసభకు వల్లూరిరాజేశ్వరమ్మ, నాలుగవ వార్షికసభకు ఆచంట రుక్మిణమ్మ, అయిదవసభకు కొటికలపూడి సీతమ్మ అధిపతులుగా వుండి విజయవంతం చేసిన విషయాన్ని ఈనివేదికలో నమోదుచేసింది. 

1910లో గుంటూరులో,1911 లో కాకినాడలో ఆంధ్రమహిళాసభ ప్రధమ ద్వితీయ మహాసభలు జరుగగా శేషమ్మ ఆహ్వానసంఘ అధ్యక్షులుగా 1912 మే నెలలో తృతీయ ఆంధ్రమహిళాసభ నిడదవోలులో నిర్వహించబడింది. 1913లో బందరులోను, 1914లో విజయవాడలోను, నిర్వహించ బడిన చతుర్థ  పంచమ ఆంధ్ర మహిళా సభలలో, 1916 లో జరిగిన  సప్తమ ఆంధ్రమహిళా సభ మొదలైన  అన్నిటిలోనూ ఆమె చురుకైన భాగస్వామ్యం ఉంది. అవసరాలకు తగిన తీర్మానాలను ప్రవేశ పెట్టటం,ఆమోదింప చేయటం చూస్తాం.  స్త్రీల విద్యకు, గౌరవకరమైన జీవనోపాధుల ఏర్పాటుకు తీర్మానాలు ఉండటం విశేషం. నరసాపురపు తాలూకాభివృద్ధి సంఘపు పరీక్షలో, విజ్ఞానచంద్రికా మండలి నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణతను  మహిళలను  బాలికా పాఠశాలలో  ఉపాధ్యాయులుగా  నియమించటానికి అర్హతగా గుర్తించాలని ప్రభుత్వ విద్యాశాఖ కు సిఫారసు చేస్తూ తీర్మానం చేయటం అటువంటి వాటిలో ఒకటి.

 ఇక విద్యార్ధినీ సమాజానికి అనుబంధంగా మహిళా విద్యాలయాన్ని నిర్వహించటంలో కూడా శేషమ్మ కృషి చెప్పుకోతగినది. 1928 జులై హిందూసుందరి లో కాకనాడ విద్యార్థినీ సమాజం కార్యదర్శిగా శేషమ్మ చేసిన విన్నపం సంపాదకీయం స్థానంలో ప్రచురించబడింది. బాలికలకు, యువతులకు జాతీయ విద్యనేర్పటానికి  మహిళా విద్యాలయం ఏర్పరచి అప్పటికి నాలుగేళ్లు అయినట్లు దానివలన తెలుస్తున్నది. శిరోమణి పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ గుర్తింపును పొంది ప్రభుత్వ నిర్దేశిత పాఠ్య ప్రణాళికతో  నిర్వహించ బడుతున్న సంస్థ అని కార్యదర్శి ప్రకటన( హిందూసుందరి, 1928, మే) వల్ల స్పష్టం అవుతున్నది. పన్నెండేళ్ళు వచ్చేసరికి బాలికలకు పెళ్లిళ్లు చేయటం, విద్యాప్రతిబంధకమైన సాంసారిక కృత్యాలు మీదపడిన ఆ పిల్లలు అర్ధాంతరంగా విద్యను విడిచి వెళ్ళటం జరుగుతున్నందున వితంతు యువతుల చదువు మీద కేంద్రీకరించింది ఈ విద్యాలయం. 18 ఏళ్ల నుండి 20 ఏళ్ల లోపు బాలవితంతువులకు ఐదేళ్లు అగ్రిమెంట్ వ్రాసినవాళ్లకు నెలకు 8 రూపాయల చొప్పున, మూడేళ్లు అగ్రిమెంట్ వ్రాసినవాళ్లకు నెలకు 5 రూపాయల చొప్పున ఉపకారవేతనం ఇచ్చి ఉచిత వసతి కల్పించి విద్వాన్, శిరోమణి మొదలైన పరీక్షలకు సిద్ధంచేసే శిక్షణ ఇప్పించటం, గౌరవపూర్వక జీవనం ఏర్పరచుకొనటానికి సహాయపడటం ఈ విద్యాలయం పెట్టుకొన్న కార్యక్రమం. 

 శేషమ్మ సంస్కరణాభిలాషి. స్త్రీలు చదువుకొనాలని ఆశించింది. అందుకోసం మాట్లాడి  వ్రాసి ఊరుకోలేదామె. బాలవితంతువులను చేరదీసి ప్రోత్సహించి విద్య చెప్పించింది. అలా ఆమె  చదువు చెప్పించిన ఇరగపరపు  వెంకటరత్న మద్రాసు క్షయ వైద్యశాలలో మేట్రన్ గా వైద్యసహాయం అందిస్తూ, భావరాజు రంగనాయకమ్మ ఉభయభాషాప్రవీణ అయి బెంగుళూరు ఉన్నత పాఠశాలలో అధ్యాపకురాలుగానూ స్వతంత్ర జీవనం సాగిస్తున్నట్లు  కాంచనపల్లి  కనకాంబ పేర్కొన్నది. ( గృహలక్ష్మి, 1939, ఏప్రిల్ )  

 మొసలికంటి రామాబాయమ్మ సంపాదకత్వంలో సత్తిరాజు సీతారామయ్యనడుపుతున్న హిందూ సుందరి పత్రికను కాకినాడ విద్యార్థినీ సమాజం పక్షాన నడపటానికి  ఆ విద్యార్థినీ సమాజ కార్యదర్శిగా చొరవ తీసుకున్నది శేషమ్మ. ఫలితంగా  1913 లో విద్యార్థినీ సమాజం యాజమాన్యం లోకి వచ్చిన ఆ పత్రికకు దాదాపు పదిపన్నెండేళ్ళు  కళ్లేపల్లి  వెంకట రమణమ్మ, మాడభూషి చూడమ్మ సంపాదకులుగా ఉన్నప్పటికీ బాలాంత్రపు శేషమ్మ కుదానితో నిత్యసంబంధం .1925 తరువాత ఆమే సంపాదకురాలు. ఆపత్రికకు ఆమెవ్రాసిన సంపాదకీయాలు సమకాలీన సమస్యలను సంబోధిస్తూ ఉండేవి. 1940 జనవరి సంచికకు కృతజ్ఞత అనే శీర్షికతో వ్రాసిన సంపాదకీయం చాలా విలువైనది.1939 సంవత్సరంలో పత్రికకు రచనలను ఇచ్చినవాళ్ళను ప్రస్తావిస్తూ వాళ్ళగురించి ఆమె ఇచ్చిన సమాచారం ప్రత్యేకించి స్త్రీల సాహిత్య చరిత్ర నిర్మాణానికి దిక్సూచిగా ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కాంచపల్లి కనకాంబ,పులుగుర్తలక్ష్మీనరసమాంబ, చిల్కపాటి సీతాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, పొణకాకనకమ్మ, సత్తిరాజుశ్యామలాంబ, కాళ్ళకూరి మహాలక్ష్మీ సుందరమ్మ, సమయమంత్రి రాజ్యలక్ష్మి, కావలిసుబ్బలక్ష్మి పిశుపాటి అనసూయాదేవి, చల్లమాణిక్యాంబ,సి.వి.మీనాక్షి, జి.వి.శాంతరత్నం, బుర్రా కమలాదేవికొలిచినపద్మిని, విద్వాన్ రామరత్నమ్మ,కొత్తపల్లి వెంకట రత్నమ్మ, పి.వెంకటసూరమ్మ, భువనగిరి లక్ష్మీకాంతమ్మ, అల్లం రాజు వెంకటసుబ్బమ్మ, కౌ.చంద్రమతి, దివాకర్ల సూర్యకాంతమ్మ, కావలిశేషమ్మ, ఎ .స్వరాజ్యలక్ష్మి, చె .వెం .ర.జగదీశ్వరి, ద.సీతాసుందరమ్మ, గుడిపూడి ఇందుమతీదేవి, వారణాసి సుభద్రమ్మ-  1939 లో హిందూసుందరికి వ్రాసిన 29 మంది మహిళల పేర్లు ఇట్లా  ఒక చోట నమోదు చేసి వాళ్ళ రచనలు సేకరించి చదవటానికి ప్రేరణ ఇస్తున్నది బాలాంత్రపు శేషమ్మ.   

 

బాలాంత్రపు శేషమ్మ కాంగ్రెస్ రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసింది. 1923లో బొంబాయి లో జరిగిన అఖిల భారత మహిళా సభకు ఆంధ్రదేశ ప్రతినిధిగా వెళ్ళింది. కాకినాడ కాంగ్రెస్ మహిళా సభాకార్యదర్శిగా సభలను చక్కగా నిర్వహించింది.1928 లో మద్రాస్ లో జరిగిన జాతీయ మహాసభలో స్వచ్ఛందంగా సేవలు అందించింది. కాకినాడలో ఉప్పుసత్యాగ్రహ ప్రారంభ కురాలు. కాకినాడ పురపాలక సంఘానికి మహిళాప్రతినిధిగా ఎంపిక అయి నాలుగేళ్లు పనిచేసింది. కాంగ్రెస్ సభలు  కలకత్తా, బెల్గామ్ వంటి చోట్ల ఎక్కడికైనా ఉత్సాహంగా  వెళ్ళేది. ( గృహలక్ష్మి, 1939, ఏప్రిల్) కానీ అందుకు సంబంధించిన వార్తలు గానీ, ఆమె రచనలు గానీ ఏమీ లభించటం లేదు. 

            శేషమ్మకు లేక లేక కలిగిన కూతురు మహాలక్ష్మీసుందరమ్మ. ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ హిందూసుందరి మిత్రులు అనేకులు పద్యాలు వ్రాసారు. తన సంఘసంస్కరణ ఆదర్శానికి దీటుగా కూతురిని  సంస్కృతంలో ఉన్నత విద్యావంతురాలిని చేసింది శేషమ్మ. తనతో పాటు కాంగ్రెస్ మహిళా సభలకు తీసుకువెళ్లేది. ఉప్పుసత్యాగ్రాహంలో పాల్గొనటానికి కూతురిని కూడా ప్రోత్సహిం చింది. భాగస్వామి అయ్యేట్లు ప్రోత్సహించింది. రజస్వల పూర్వ వివాహపద్ధతిని కాదని పదహారేళ్లు వచ్చాక కూతరుకి పెళ్లిచేసిన ( 1932, మార్చ్) ఆచరణ వాది బాలాంత్రపు శేషమ్మ. ( గృహలక్ష్మి, 1932, మార్చ్)  పాతికేళ్ల వయసులోనే  ( 19 - 7- 41)    కూతురు మరణించటం శేషమ్మ జీవితంలో పెద్ద విషాదం. ఆ తరువాత శేషమ్మ రచనలు, ప్రస్తావన పెద్దగా తెలియరావడం లేదు. 

                                                            1 

            బాలాంత్రపు శేషమ్మ జీవితంలో  ప్రధానభాగం కాకినాడ విద్యార్థినీ సమాజంతో  దానికి అను బంధంగా నడిచే మహిళా విద్యాలయంతో, హిందూసుందరి పత్రికతో పెనవేసుకొని పోయింది. ఏ   మహిళాభ్యుదయాన్నికాంక్షించిందో దాని  ప్రచారానికి ఉపన్యాసాలు  ఇవ్వటం, వ్యాసాలు వ్రాయటం ఆమె జీవితంలో మరొక భాగం. ఆమె రచనావ్యాసంగంలో సృజన సాహిత్యం పాలు తక్కువే. 

            1903 లోకాకినాడ విద్యార్థినీ సమాజం ఏర్పడి వారంవారం జరిగే సమావేశాలలో ఉపన్యాసాలు ఇయ్యటాని కంటే ముందే శేషమ్మ హిందూసుందరి పత్రికకు వ్రాయటం మొదలు పెట్టింది. హిందూసుందరి పత్రిక 1902 జనవరి సంచికలోస్త్రీవిద్యాభిమానులకు ఒక విన్నపముఅనేశీర్షికతో శేషమ్మ వ్రాసిన వ్యాసం ప్రచురించబడింది. హిందూసుందరి పత్రికలో స్త్రీలు వ్రాసిన సంగతులు చూచుటచేత ఉత్సాహము కలిగి తాను ఇలావ్రాయటానికి సాహసిస్తున్నాని ప్రారంభంలో పేర్కొన్న మాటలు గమనించదగినవి.ఈ 1902 జనవరి  హిందూసుందరి మొదటి టైటిల్ పేజీపై సంపుటి 1 సంచిక 10 అని ఉన్నది. అంటే అప్పటికి పదినెలలుగా ఈపత్రిక వస్తున్నదన్నమాట. ఆ పత్రికను  బాలాంత్రపు శేషమ్మ చదువుతూ తన భావాలు పంచుకొనటానికి ఒకవేదికగా భావించి తొలిప్రయత్నంగా వ్రాసిన వ్యాసం ఇది. అక్కడి నుండి ప్రారంభించి శేషమ్మ రచనలలో  వ్యాసాలు, ఉపన్యాసాలు తో పాటు సంస్థలకు, సమావేశాలకు సంబంధించిన నివేదికలు ప్రకటనలు కూడా ఉన్నాయి.

            ఈ సందర్భంలో ప్రస్తావించవలసిన విషయం మరొకటి ఉంది. 1902 జనవరికి 10   సంచిక వచ్చిందంటే అది 1901 లోనే ప్రారంభించబడి ఉంటుంది. కానీ ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు (పొత్తూరి వెంకటేశ్వర రావు, 2004) పుస్తకంలో హిందూ సుందరి 1902 ఏప్రిల్ లో మొదలైనట్లు ఉన్నది.1904 ఏప్రిల్ సంచికలో స్వవిషయము అనే శీర్షిక తో పత్రికాధిపతులు వ్రాసిన విషయాలను బట్టి, అంతకు ముందరి సంచికలు ఏవీ దొరకకపోవటాన్నిబట్టి ఇలా పొరపడి ఉండవచ్చు.పత్రిక ఉద్దేశాలను, విధానాలను పేర్కొంటూఈ మాసపత్రికను వెలువరించ ప్రారంభిం చినాముఅని పత్రికాధిపతి వ్రాసిన వాక్యంఅప్పుడేప్రారంభమైనట్లు అర్ధంచేసుకొనటానికి వీలిచ్చేదిగా ఉంది.అప్పటికి ఏడాది అయింది పత్రిక ప్రారంభమై. ఏడాది అయిన సందర్భంగా తన అనుభవాలను చెప్పుకొంటున్నట్లుగా వ్రాసిన స్వవిషయం ఇది. 

            స్త్రీ విద్య బాలాంత్రపు శేషమ్మకు ప్రాధాన్య అంశం. దాదాపు ఆమె వ్యాసాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్త్రీవిద్యను చర్చించాయి. ఆ క్రమంలో స్త్రీపురుషుల మధ్య అసమానతలను, స్త్రీల పట్ల అమలవుతున్న వివక్షను ఆమె నిరసించింది. స్త్రీల అభ్యుదయాన్ని ఆశించి ఆధునిక పురుష ప్రపంచం సంస్కరణ ఉద్యమాలకు పూనుకొనటాన్ని అభినందించింది.స్త్రీవిద్యాభిమానులకొక విన్నపముఅనే వ్యాసాన్నిస్త్రీలమగు మనయెడల ఆర్యులు విధించిన కట్టుబాట్లు తలచుకొన్న నొడలుకంపమెత్తి వడకసాగెనుఅనిప్రారంభించింది శేషమ్మ. ఈ వ్యాసంలో ఆమె పురుషులను రెండు రకాలుగా విభజించింది. స్త్రీలు పాటలు పడకూడదు, అట్లా పాడేవాళ్లు వేశ్యలు కానీ సంసార స్త్రీలు కారు అని, స్త్రీలు స్వతంత్రులు కారు, గౌరవపాత్రులు కారు, వాళ్ళ మాట వింటే చెడిపోతారు ఇలాంటి విధి నిషేధాలతో, స్త్రీలను బుద్ధిహీనులుగా చేసి చూపిన వెనుకటి పురుషులు ఒకరకం. ఈ కట్టుబాట్లు వట్టి పిచ్చివి అని, స్త్రీల యెడ గౌరవం కలిగి వారివిద్యాభ్యాసాలకు ఏర్పాట్లు చేస్తున్న సమకాలీన సంస్కర్తలైన పురుషులు మరొకరకం. వెనుకటిపురుషులు భార్యలను తమకు లోకువవారని తలచి అహంకరించిన దానిఫలితం స్త్రీలు విద్యావిహీనులు, జ్ఞానశూన్యులు కావటం. పురుషులు స్త్రీలు సమమనే భావం పెంపొందాలని, విద్యా ధనం  పక్షపాతం లేక  సమంగా భాగించి పంచాలని ఆమె ఆకాంక్షించింది. 

            1904 జనవరి నుండి పులగుర్త లక్ష్మీనరసమాంబ కాకినాడలో సావిత్రి పత్రికను ప్రారంభించింది. మార్చ్ సంచికలో ఆప్రయత్నాన్ని అభినందిస్తూ బాలాంత్రపు శేషమ్మ వ్రాసినతెలుగుదేశమందలి స్త్రీల విద్యఅనే ఒక రచన ప్రచురితమైంది. స్త్రీలు స్త్రీలకొరకు ఒకపత్రికను ప్రారంభించటం ఉన్నతవిద్యాభివృద్ధికి సూచికగా భావిస్తూ ఆమె ఈ వ్యాసం వ్రాసింది. స్త్రీలలో ఉన్నతవిద్యాభివృద్ధి కొత్తగా పొందినదా పూర్వము ఉన్నదేనా అనిఒక ప్రశ్న వేసుకొని పురాతన గ్రంధాలవలన స్త్రీలు రాజ్యాలు ఏలి, యోగులై జ్ఞానబోధ చేసి , ఉద్గ్రంధాలు రచించి కీర్తి పొందిన విషయం తెలుస్తున్నది కనుక స్త్రీలు ప్రాచీనకాలం నుండి ఔన్నత్యం కలిగిఉన్నారనేది నిర్వివాదం అంటుంది. ముస్లిముల దాడులతో స్త్రీలకు జరుగుతున్నమానహానిని సహించలేక ఘోషా విధించటం తోమొదలై క్రమంగా చదువు, స్వేచ్ఛ స్వాతంత్య్రం మొదలైనవి వాళ్లకు నిషేధించబడ్డాయి అన్న వాదాన్ని శేషమ్మ కూడా నమ్మి మాట్లాడటం కనిపిస్తుంది.హూణుల రాజ్యపాలన మొదలైన తరువాత స్త్రీపురుష సమానత్వాన్నిప్రచారం చేస్తూ స్త్రీవిద్యాభివృద్ధికి దోహదం చేశారని అభిప్రాయపడింది. స్త్రీవిద్యకు కందుకూరి వీరేశలింగం చేసిన కృషిని ప్రస్తావించి స్త్రీల కోసం రాయసం వెంకటశివుడు, సత్తిరాజు సీతారామయ్య జనానా , హిందూసుందరి పత్రికలను ఏర్పరచిన విషయం కూడా చెప్పి పురుషులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుటకు సందేహించి వ్రాయ సామర్ధ్యం గల స్త్రీలు కూడా వ్రాయటం మానేస్తున్నారని దానిని పరిష్కరించటానికి పులుగుర్త లక్ష్మీనరసమాంబ సావిత్రి పత్రికను ప్రారంభించిందని ఆమె ఈవ్యాసంలోపేర్కొన్నది.

ఉత్తరాంధ్ర సరిహద్దులలోని గంజాం జిల్లాలో ఆసికా అనే పట్టణం లో బుర్రబుచ్చిబంగారమ్మ స్థాపించిన ఆసికా స్త్రీసమాజం ఏర్పాటు చేసిన సభలో చేసిన ప్రసంగాన్ని( హిందూ సుందరి,1907, జనవరి) శేషమ్మకారణాంతరల చేత అంతరించిన స్త్రీస్వాతంత్య్రమును దిరుగ మనకొసంగి స్వేచ్ఛనిచ్చుటకు గాను కొందరు పుణ్యపురుషులను సృజించాడని భగవంతుడిని కొనియాడుతూ ప్రారంభించింది. ఆ పుణ్యపురుషులవలనే వంట పొయిలు తప్ప వేఱుస్థలమెరుంగని స్త్రీలు సమాజాలు పెట్టుకొని సమావేశం కాగలుగుతున్నారని ఆనందపడింది. స్త్రీలకు విద్య ఆవశ్యకమని అది ఎంతవరకు సాధ్యం? ఎట్టి విద్య స్త్రీలకు తగినది? విద్యాస్వాతంత్య్రం ఎంత వుంది? అన్నమూడు ప్రశ్నలను వేసి చర్చింది శేషమ్మ. వేదఋక్కులు, వివాహమంత్రాలు వ్రాసిన వేదకాలపు స్త్రీల శక్తి సామర్ధ్యాలు, సులభ మొదలైన పురాణకాలపు స్త్రీల శక్తిసామర్ధ్యాలు ప్రస్తావిస్తూ స్త్రీలు ఎట్టివిద్య సంపాదించాలని ఎంత కృషిచేస్తే అంత పొందగలుగుతారనటంలో సందేహం ఏమాత్రం లేదని చెప్పింది. భాగవత కథలను, ఉత్తర రామ చరిత్ర నాటకాన్నిదేవహూతి, ఆత్రేయి  మొదలైన స్త్రీలను ప్రస్తావిస్తూ వేదాంత విద్య యందు స్త్రీల ఆసక్తిని, కృషిని పేర్కొని స్త్రీలకు ఈవిద్య తగును, ఈవిద్య తగదు అనే వివాదమే అవసరం లేదంటుంది శేషమ్మ. భాగవత సత్యభామ ను ప్రస్తావిస్తూ స్త్రీలుయుద్ధవిద్యలు కూడా నేర్చిన విషయాన్ని గుర్తుచేసింది.భండారు అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాల లో యుద్ధము మొదలైన ఘనకార్యాలు నిర్వహించిన స్త్రీల సంగతి విశేషంగా వ్రాసిన సంగతిని కూడా పేర్కొన్నది. ఇక స్వాతంత్య్రం విషయానికి వస్తే సమాజాలుగా ఏర్పడే స్వాతంత్య్రం పొందటం లోనే స్త్రీలకు ఉన్నతవిద్యను పొందే స్వాతంత్య్రం, బాధ్యత సమకూడాయని అభిప్రాయపడింది.

ఆదిభాష, జ్ఞానమూలము అయిన సంస్కృతం, ప్రస్తుత రాజభాష అయిన ఇంగ్లీషు, దేశభాష అయిన తెలుగు స్త్రీలు నేర్చుకోవాలని, సజ్జన సహవాసం, పరస్పర సహకారం స్త్రీలకు ఉన్నత విద్యావంతులు కావటానికి మార్గం సుగమం చేస్తాయని చెప్పింది శేషమ్మ.

            ‘నవీనోద్యమముఅనే ఉపన్యాసంలో ( హిందూసుందరి, 1914, మార్చ్)  బాలాంత్రపు శేషమ్మ నూతన ధర్మములగు కార్యములచేతను,తత్ఫలములచేతను, భావములచేతను, ఉద్యమములచేతను ఉద్విగ్నంగా ఉన్నకాలాన్ని గురించి ప్రస్తావించింది.స్త్రీలు సమాజములు స్థాపించటం, విద్యను వ్యాపింపచేయటం, బాలికా పాఠశాలలు ఏర్పరచటం, వాటినిర్వహణకు దానం ఇయ్యటం, గ్రామగ్రామాలు తిరిగి విరాళాలు సేకరించటం , స్త్రీలకు వృత్తి నైపుణ్యాలు అలవరచే పనులు చేయటం మొదలైన కొత్తఉద్యమాలకుదిగారని, పురుషులు కూడా స్త్రీవిద్యాభిమానులై తోడ్పాటును అందిస్తున్నారని పేర్కొన్నది. ఆనాటి లెక్కలప్రకారం ఒకకోటి ఎనిమిది లక్షలు మించిన బాలురలో ప్రయిమరీవిద్యలో ముప్ఫయి లక్షలమంది మాత్రమే ఉన్నారంటే ఇక ఆడపిల్లల చదువు ఎంత అధ్వానస్థితిలో ఉందో వూహించునంటుంది శేషమ్మ.విద్యావతియగు తల్లిగల బిడ్డ మాత్రమే బడికిపోతుంది గానీ తక్కిన బాలికలుఎందరో ఇంటిపనిపాటలకే బందీలైపోతారని బాధపడింది. బాలికల పరిస్థితి ఇలావుంటే ఇక వితంతు స్త్రీలకు విద్యావకాశాలు ఎంతగా మూసివేయ బడతాయోకదా  అని వేదన పడింది. వాళ్ళకోసం జాతీయ విద్యాలయాల ఏర్పాటు అవసరాన్నిసూచించింది. ఆవిధంగా వేటపాలెంలో కొండ వెంకటప్పయ్య నడుపుతున్నశారదా నికేతనం గురించి కూడాపేర్కొన్నది.

1911 ఏప్రిల్ ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు శేషమ్మమనకు గావలసినదేది? పరార్ధపరత్వముఅనే వ్యాసం వ్రాసింది.పరార్ధతత్వము అంటే పరుల ప్రయోజనములందు ఆసక్తి కలిగిఉండటం అనినిర్వచించి, మిత్రలక్షణం, సోదరప్రేమ మనుషులయందు ఉండవలసిన గుణాలుగా పేర్కొన్నది.పదార్ధపరత్వం పలురకాలుగా ఉంటుందని చెప్పి ఆబాలసచ్చరిత్ర రత్నమాలను ఆంద్రస్త్రీలకు కానుకగా ఇచ్చిన  బండారు అచ్చమాంబలో అది గ్రంధరూపంలో ఉందని, డొక్కాసీతమ్మలో అది అన్నదానరూపంలోఉంటే పోలవరం జమీందారు స్త్రీలు అత్తాకోడళ్లు అయిన కామాయమ్మ బంగారమ్మలలో అది దానదయా వితరణ గుణాల రూపంలోఉన్నాయని కొన్నిఉదారణలతో చెప్పింది.

శేషమ్మ వ్రాసిన మరిరెండు వ్యాసాలు స్నేహానికి, ఐకమత్యానికి సంబంధించినవి. స్త్రీలు అభివృద్ధిలోకి తేగలిగినది స్నేహం ఒక్కటే అంటుంది. జీవితంలో స్నేహం యొక్క ప్రాధాన్యతను రకరకాలుగా వర్ణించి స్త్రీలపట్ల స్నేహభావంతో నీతిదాయకములైన సంగతులు అనేకం వ్యాసాలుగా వ్రాస్తున్న కొటికలపూడి సీతమ్మ, భండారు అచ్చమాంబ, పులుగుర్త లక్ష్మీ నర్సమాంబ మొదలైన స్త్రీలను ఆదర్శంగా చూపి స్త్రీలు పరస్పరం స్నేహంగా ఉండాలని దానికి మూలాధారం సమాజమేనని ప్రబోధించింది. (హిందూసుందరి,సెప్టెంబర్& అక్టోబర్ 1903) భగవంతుడు, విక్టోరియా మహారాణి , కందుకూరి వీరేశలింగం వంటి వారిని ప్రస్తావిస్తూ స్త్రీవిద్యకు దేశంలో ఏర్పడుతున్న అనుకూల వాతావరణాన్ని గురించి చెప్పి ఈ సందర్భంలో స్త్రీలు ముఖ్యముగా నేర్చుకోవలసినది ఐకమత్యము అంటుంది శేషమ్మ. ఇదివరకు పదిమందితో కలిసి తిరుగుట, పదిమందితో ఏకభావంతో ఒక ఘనకార్యం చేయటం మొదలైన పనులు స్త్రీలకు అలవాటు లేకపోవటం వలన ఐకమత్యం గురించి పట్టించుకోలేదని కానీ కొత్తగా సమాజాలు పెట్టుకొని విద్యాసామాజిక సాహిత్య రంగాలలో అభివృద్ధి చెందాలన్న తలంపుతో ఉన్న స్త్రీలకు ఐకమత్యమే అనుసరణీయం అని ఈ వ్యాసంలో వివరించింది శేషమ్మ ( హిందూ సుందరి, సెప్టెంబర్ 1906). దానిని జీవితాచరణ వాస్తవం నుండి నిరూపిస్తున్నట్లుగా ఉంది ఆమె 1938  ఫిబ్రవరి హిందూసుందరి సంచికకు సంపాదకీయం స్థానంలో మాడభూషి చూడమ్మ గురించి వ్రాసిన సంస్మరణ వ్యాసం. 

మాడభూషి చూడమ్మ హిందూసుందరి పత్రికకు కొన్నేళ్ల పాటు కళ్లేపల్లి వెంకటరమణమ్మతో కలిసి సంపాదకురాలిగా వ్యవహరించింది. ఉన్న 1938 జనవరిలో ఆమె మరణించింది.అప్పుడు సంపాదకురాలిగా  బాలాంత్రపు శేషమ్మ వ్రాసిన వ్యాసం చూడమ్మ గురించే కాదు శేషమ్మ గురించి కూడా చెప్తుంది.స్నేహం యొక్క విలువకు వ్యాఖ్యానం అది. బాల వింతతువు అయిన చూడమ్మ తానూ కందాళ నరసింహాచార్యులు వద్ద కలిసి కావ్యాలు చదువుకొనటం, కలిసి విజ్ఞానచంద్రికా పరిషత్తు వారు, నరసాపురం వారు నిర్వహించిన పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు కావటం, ఇద్దరూ కలిసి కాకినాడ విద్యార్థినీ సమాజాన్నిపునరుద్ధరించడం, కలిసి యాత్రలుచేయటం, కలిసి హిందూ సుందరి పత్రికను నడపటం, తానుకన్నకూతురిని ఆమెపెంచి పెద్దచేయటం వంటి విషయాలను ఎన్నింటినో ఇందులో ప్రస్తావించింది శేషమ్మ. విద్యా సామాజిక సాంస్కృతిక రంగాలలో పనిచేసే స్త్రీలమధ్య ఉండవలసినవిగా శేషమ్మ పదేపదే చెప్తూ వచ్చిన సహకారానికి, ఐక్యతకు నమూనా చూడమ్మతో శేషమ్మ స్నేహ సాహచర్యాలు. 

                                                  2

బాలాంత్రపు శేషమ్మ సృజన రచన ఒకటి మాత్రమే కనబడుతున్నది.అదిధైర్య స్థైర్యములు’  సంభాషణాత్మక కథనం. ధైర్యవతి, పార్వతి బడికివెళ్ళేపిల్లలు. చదువుపట్ల వాళ్ళశ్రద్ధ, వాళ్ళలోని మంచిగుణాలను వర్ణించటం ఈకథనానికి లక్ష్యం. పిల్లలకు ధైర్యంస్థిరప్రవృత్తి రెండూ ఉండవలసిన గుణాలు అని ఆరెండింటినీ ఈఇద్దరు బాలికల యందు నిరూపిస్తూ చేసిన రచన ఇది. ధైర్యవతి పొద్దున్నేచద్ది అన్నం తిని పలక పుస్తకాలు తీసుకొని బడికి బయలుదేరుతూ పార్వతివాళ్ళంటికి వెళ్లి తనను తీసుకొని బడికి వెళతానని తల్లిని పిలిచి చెప్పి వీధి తలుపు వేసుకోమని చెప్పటం దగ్గర మొదలై పార్వతి ఇంటికివెళ్ళే లోపల ఆమెఎంతధైర్యవంతురాలో నిరూపించబడుతుంది. ధైర్యవతి వాకిట్లోకి వస్తూనే ఎదురింటి ఆమె కొడుకును రెక్కపట్టుకొని లాక్కువచ్చి బడికిపొమ్మని కోప్పడటం చూస్తుంది. బడికి పోవాలంటే ఏడ్చే కొడుకును విసుక్కొంటూ ఆతల్లిపనికిమాలిన యాడుదైనా ఇప్పుడు చదువుకొనుచున్నదిమగవాడివి కూడా , పెళ్ళానికి తిండి అయినా పెట్టాలికదా రెండుముక్కలు చదువుకోకపోతే ఎలాబ్రతుకుతావురాఅని మందలించటం గమనించవలసిన విషయం. మగవాళ్ళు పెళ్ళాన్నిపోషించుకొనటానికి చదువుకోవాలి. ఆడపిల్లలు పోషింపబడేవాళ్లు కనుక వాళ్లకు చదువుఅక్కరలేదు.ఇది అప్పటివరకు ఉన్నస్థితి.ఇప్పుడు దానిలో చలనం తెస్తున్నారు ఆడపిల్లలు ఉత్సాహం గా చదువులకు ముందుకువస్తూ. అందుకే ఆతల్లి ధైర్యవతిని చూపిస్తూ చూడు నీఈడుపిల్ల ఎంతచక్కగా బడికివెళుతున్నదో అనిచెప్పి కొడుకును ప్రోద్బలంచేస్తుంది. బడికి వెళ్లే వీధిలో కాట్లాడుకుంటున్నకుక్కలు కరుస్తాయి నేనుపోను ఆపిల్లవాడు మొరాయిస్తుంటాడు.

ధైర్యవతి ఆమెను వారిస్తూ మాట్లాడినమాటలు పిల్లలలో లేనిపోనిభయాలు కల్పించేది తల్లిదండ్రులే అని చెప్పకనే చెప్తాయి.కుక్కలు కరుస్తాయిఅన్నది ఒక బెదిరింపు మాట గా వాడేటప్పుడు ఆతల్లిదండ్రులు ఆమాట పిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్న విషయం విస్మరిస్తారు. ధైర్యవతి అప్పారావు కు కుక్కలాభయంలేకుండా బడి వరకు తోడువస్తా పదమని  మొరాయించే ఆపిల్లవాడితోస్నేహంగా మాట్లాడి తీసుకు వెళుతుంది. ధైర్యం లేకపోతే  ప్రాణంలేని చెట్లుకూడా మనలను భయపెడతాయి అంటూ మనతోపాటు ఈ ప్రపంచంలో ఉండే జీవరాసులతో మనం ఏరకంగా ప్రవర్తించాలో చెపుతూ ఆపిల్లవాడినే కాదు మరికొందరినికూడా బడిదగ్గర విడిచి వెళ్తుంది ధైర్యవతి. పార్వతి ఇంటికి వెళ్ళేలోపల ఒక అపరిచితుడు ఆమెను మాటలలో పెట్టి మేడలో గొలుసు కాజేయాలని చూస్తే చాకచక్యంగా అతని నుండి తప్పించుకొనటంలో కూడా కీలకమైనది ధైర్యం , అందువల్ల కలిగిన వివేకం. ఆడపిల్లలలో చదువు ధైర్యం అనే సద్గుణాన్నిపాదు కొల్పుతుందని చెప్పటం శేషమ్మ ఉద్దేశం.

ఇక పార్వతి సంగతి. చక్కగా చదువుకొనే అమ్మాయి. ఆరోజు కూడా చేయవలసిన లెక్కలు, నేర్వవలసిన పాఠాలు నేర్చుకొన్నది. వాళ్ళ అక్కగారింట్లోదొంగలుపడి, ఇల్లుకాలిపోయిందని తల్లిఏడుస్తున్నా ఆమెనుపరామర్శించటానికి ఎవరెవరో వచ్చి పోతున్నా అవేవీ ఆమెచదువుకు ఆటంకాలుకాలేదు. కాకుండా చూసుకొన్నది. అదిఎలాసాధ్యమైంది? ఏడుస్తూ కూర్చొనటం వృధా పని.చదువును మించిన సంపద మరొకటి లేదు అన్నతత్వం ఒంటపట్టించుకొనటంవలన అదిసాధ్యమైంది. ఆతత్వం బడిలో ఉపాధ్యాయులు చెప్పే మంచిసంగతులవలన, హిందూ సుందరి వంటి పత్రికలు చదవటం వలన, బండారు అచ్చమాంబ వంటి స్త్రీలను ఆదర్శంగా తీసుకొనటం వలన. ఆ తత్వం స్థిరసంకల్పానికి కారణమవుతుంది. మేనమామ ఇచ్చిపోయిన రూపాయి ఇల్లుకాలి బట్టలు కాలిపోయిన అక్క కూతురికి పరికిణీలు కుట్టించటానికి తల్లి ఇమ్మంటే తనకొత్తపరికిణీలలో రెండింటిని ఇయ్యటానికైనా సిద్ధపడింది కానీ ఆ రూపాయిని సావిత్రి పత్రికకు చందా కట్టటానికి తప్పమరిదేనికీ ఖర్చుపెట్టనని తల్లితో వాదించి ఒప్పించ గలిగింది. అందుకే ఆమెస్థిరచిత్త. విద్యావిజ్ణాన సాధనకు అవసరమైన గుణం అది. స్త్రీల చేత స్త్రీల కొరకు నిర్వహించబడే పత్రికలకు స్త్రీలు తప్పనిసరిగా పాఠకులు కావటం అనే విలువ స్త్రీల మధ్య ఒక ఐక్యతకు దారితీస్తుందన్న  శేషమ్మ అవగాహనను కూడా ఈ సంభాషణ లో గుర్తించవచ్చు. 

శేషమ్మ శేష జీవిత వివరాలు ఇంకా లభించవలసే ఉంది. 

                                                           

 

 




 

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర – 7

స్త్రీలలో  సాహిత్య వ్యవసాయం ఏ కొద్దిమందికో  తప్ప నిరంతరాయంగా సాగేది కాదు. శ్రావణమాసపు జల్లులా కురిసి ఆగిపోయే వాళ్ళే ఎక్కువ. 1902 లో అలా రచనా రంగంలోకి వచ్చి మెరుపులా మెరిసి వెళ్లిన ముగ్గురు  స్త్రీలు వడ్లమన్నాటి సుందరమ్మ, మండపాక జోహానమ్మ, ఓరుగంటి ఆదెమ్మ. 

వడ్లమన్నాటి  సుందరమ్మ రచనలు రెండు. ఒకటి సతీమణి అనే కథ. 1902 జనవరి హిందూ సుందరి పత్రికలో అచ్చయింది. రెండవది ఆచారము.  ఇది ఉపన్యాసం. మొదటి రచన వచ్చిన తొమ్మిదేళ్లకు ( మార్చ్ 1911) హిందూ సుందరి పత్రికలోనే ఇది ప్రచురించబడింది. మండపాక జోహానమ్మ రచనలు కూడా రెండే. 1902 హిందూ సుందరి పత్రికలో ఏప్రిల్ సంచికలో ఒకటి, జూన్ సంచికలో ఒకటి వచ్చాయి. పేరును బట్టి  జోహానమ్మ దళిత క్రైస్తవ స్త్రీ అయివుండాలి. ఆరకంగా ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్రలో ఈమె మొదటి దళిత రచయిత్రి అవుతుంది. ఓరుగంటి ఆదెమ్మ రచనలు ఆరు. వాటిలో అయిదు జూన్ 1902 నుండి 1903 ఏప్రిల్ వరకు హిందూ సుందరి పత్రికలో వచ్చాయి.  చివరిది కూడా హిందూ సుందరి పత్రికలోనే వచ్చింది కానీ, అది 1911 ఏప్రిల్ సంచికలో. 

వడ్లమన్నాటి సుందరమ్మ కథ సతీమణి ఆధునిక పద్ధతిలో కథ కాదు. రూపంలో అది అనగనగా ఒకరాజు పద్ధతిలో పిల్లలకు చెప్పే కల్పిత కథ. కానీ లోపలి విషయాలు ఆ నాటి మహిళా ఉద్యమ ఆకాంక్షలలో భాగమైనవే. స్త్రీల విద్యా వివేకాలగురించి, స్త్రీలధర్మాల గురించి ఆనాటి తోటి మహిళా రచయితల భావాలు అభిప్రాయాలు, అవగాహనే ఈ రచనలోనూ కనిపిస్తుంది. రత్నపురి అనే పట్టణనాన్నిపరిపాలించే రాజుకుపతియాజ్ఞ నతిక్రమించి వర్తించని అనుకూలవతి అయిన భార్య.వారికి లేకలేక కలిగిన కూతురు. ఆ కూతురి పేరే సతీమణి. ఆబిడ్డను చతుషష్టి విద్యలలోప్రవీణురాలిని చేయదలచి విద్వాంసులను పిలిపించి వేతనమిచ్చి విద్యాభ్యాసం చేయించారు. విద్యావంతురాలైన కూతురిని చూసి సంతోషిస్తూ తల్లి చేసిన సంభాషణ ఇందులో ముఖ్యమైంది.స్త్రీలకు విద్య భూషణము.విద్యవలన సకల గుణములు రాణించును. తండ్రి ఎంతగొప్పవాడయినా బిడ్డకువిద్యలేనిదే కీర్తి రాదు.జ్ఞానాభివృద్ధికి విద్యయే మూలముఅని ఆతల్లి చెప్పిన మాటలన్నీ ఆకాలంలోస్త్రీవిద్యావ్యాప్తికి రకరకాలుగా జరుగుతున్న భావప్రచార ప్రతిధ్వనులే.

అలాగే ఆనాడు మహిళలు చదువు కోవాలి, తోటిస్త్రీలను విద్యాభ్యాసానికై ప్రోత్సహించాలి, అందుకు సమాజాలు పెట్టుకొని కృషి చెయ్యాలి, పత్రికలకు వ్రాయాలి అన్నఆకాంక్ష ఎంత బలంగా వ్యక్తమైందో అదే సమయంలో వాళ్లలో ఆత్మానందందయ, దైవభక్తి మొదలైన గుణాలను పాదుకొల్పే నైతిక ప్రబోధం కూడా రకరకాలుగా సాగింది.సతీమణి కథలో తల్లి బిడ్డకు అటువంటి ప్రబోధం చేయటం చూస్తాం. ఆత్మకు సంతోషాన్నికలిగించేవి సుగుణములని దుఃఖాన్నికలిగించేవి దుర్గుణాలని ఆతల్లి నిర్వచనం. సత్యముశాంతము, ధైర్యము, వినయము, దయ, తృప్తి, మొదలైనవి మనస్సుకు సంతోషాన్ని వీటికి వ్యతిరేకమైన అనృతముకోపము, దీనత, గర్వము, క్రూరత్వము, ఆశ మొదలైనవి దుఃఖాన్నికలిగిస్తాయని వివరించింది. విద్య ముఖ్యసూత్రం సుగుణపుంజములను అలవాటు చేసు కొనటమే అని కూడా చెప్పింది.

స్త్రీ విద్యా చైతన్యాల గురించి ఒకవైపు బోధిస్తూనే మరొకవైపుస్త్రీలను ఒక అధికార వ్యవస్థకు లోబడి జీవించటానికి శిక్షణ ఇయ్యటం కూడా 1900 నాటి స్త్రీల రచనలలో ప్రస్ఫుటంగా  కనిపిస్తుంది . పుట్టుకకు కారణమైన తల్లిదండ్రుల, పరిపాలించే రాజుల ఆజ్ఞకు లోబడి నడుచుకోవలయునని  నీవెరుగుదువు కదా అని కూతురిని హెచ్చరిస్తూనే తల్లి అట్లాగే మన అందరి జన్మలకు ఆది కారణుడై పుణ్యపాపములనెఱిఁగి న్యాయము తీర్చి సుఖమోసగి రక్షించు భగవంతునికి  కూడా లోబడి నడుచుకోవాలని కూతురికి బోధిస్తుంది. తల్లిదండ్రులు ,ఆ పై రాజు, ఆపై భగవంతుడు మూడు అంతరువుల అధికారానికి లోబడి జీవించాలన్నమాట. ఈ నిచ్చెన మెట్ల అధికార వ్యవస్థ   మగపిల్లలకైనా వర్తించేదే కదా ఆడపిల్లలకు ఇచ్చే ప్రత్యేక శిక్షణ ఏముంది ? అనాలని అనటం తప్ప అని ఎవరైనా ఆక్షేపించవచ్చు.  పెళ్లయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సుగుణమణికి తల్లి అత్తవారింట మెలగవలసిన పద్ధతి గురించి చేసిన  బోధను దానికి సమాధానంగా చూపించవచ్చు . 

రాజుకంటె ప్రజలొకవేళ బుద్ధిమంతులయినను రాజునకు లోబడి నడచుకొనుట యెట్లు విధాయక కృత్యమో , అట్లే భార్య యొకవేళ  భర్తకంటె బుద్ధిమంతురాలుగాను, విద్యావంతురాలుగా ను  ఉండుట తటస్థించినను పెనిమిటి కణగియే యుండవలయునుఇది సుగుణ మణికి తల్లి చెప్పిన నీతి. స్త్రీలు అదనంగా భర్త అధికారానికి లోబడి జీవించాలి. ఆ క్రమం లో తమకు ఉన్న శక్తి సామర్ధ్యాలు లేనట్లుగా నటించటం నేర్చుకోవాలి. వాటిని లోలోపలే కుక్కుకొని అన్నిటా న్యూనంగా  కనబడుతూ అధీన పాత్రలలో ఒదిగిపోవాలి. చదువులు చదివినా, సమాజాలు పెట్టినా, ఉపన్యాసాలు ఇచ్చినా, పత్రికలను నడిపినా, పత్రికలకు వ్రాసినా స్త్రీల అంతిమ గమ్యం  అధీన తగా, గృహనిర్వాహణగా స్థిరీకరించిన విలువనే  నమ్మి చెప్పిన తల్లి మాట  1902 నాటిదే కానీ  శతాబ్దం గడిచిపోయినా సంస్కృతిగా, సంప్రదాయంగా కొనసాగి రావటమే విషాదం. 

ఆచారము  వ్యాసం విజయనగరంలో సత్యసంవర్ధనీ సమాజం సమావేశంలో చేసిన ప్రసంగ పాఠం  అని అంతర్గత సాక్ష్యాలు చెప్తున్నాయి. సుందరమ్మ నివాసం ఎక్కడో కానీ విజయనగరానికి ఏ బంధుత్వ కారణాలవల్లనో ఆమె తరచుగా వచ్చేది. అలా వచ్చిన ఒక సందర్భంలో ఆమె చేసిన ఉపన్యాసం ఇది.  “ నలువకు పత్నివైతి వల నారద సంయమి తల్లివైతివో!

                   పలుకులభామ నిన్నెపుడు పల్కగ శక్యమె పామరాళికిన్ !

                   బిలువగ నైన శక్యమె మహీధర కిన్నెర దేవతాళికిన్ !

                గొలిచెద నిన్ను నాకు గల కోర్కె లొసంగుము వాణి శారదా!” - అనే పద్యంతో ప్రారంభించింది సుందరమ్మ ఈ ఉపన్యాసాన్ని. ఆచారాలు సదాచారములు , దురాచారములు అని రెండు రకాలని చెప్పి మనసు, కట్టుకొనే బట్ట, ఉండే ఇల్లు, ఉపయోగించే పాత్రలు, తినే తిండి శుభ్రమంగా ఉండటం సదాచారం అని మురికి దైనా తడిబట్ట కట్టుకొనటం, ఇల్లు బూజులు పట్టి ఉండటం, వంటగిన్నెలు పాచి, మసి పట్టి ఉండటం వంటివి దురాచారాలని వివరించింది.  “ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల! / పాత్రశుద్ధిలేని పాకమేల!/ చిత్తశుద్దిలేని శివపూజ లేటికి/అని సందర్భోచితంగా వేమన పద్యాన్ని ఉదాహరించి తన వాదాన్ని గట్టిగా వినిపించింది. ఆచారం వ్యాధికారకం కాకూడదని నొక్కి చెప్పింది. ఉపన్యాసం కూడా ఒక పద్యంతోనే ముగించింది. 

సత్యసంవర్ధనీ సమాజ సతులార! సర్వజ్ఞు సేవలు సలుపరమ్మ 

   స్త్రీ రత్నముల గూడి శీఘ్ర కాలంబులో స్త్రీ విద్య అభివృద్ధి సేయరమ్మ 

   పణతులందరు గూడి బాలికామణులకు భక్తి మార్గము బోధ పరుపరమ్మ 

   వివిధ దేశంబుల వింత చారిత్రముల్ వేవేగ తెప్పించి వెలదులార

అందుగల నీతి మార్గములరయరమ్మ 

సుందరీ రత్నములు సొంపు గాంచరమ్మ 

ఐకమత్యముతో మీరలతివలార 

వేళ తప్పక ఇటకు వేంచేయరమ్మఅని స్త్రీల విషయంలో ఆనాటి సంస్కర ణోద్యమ ఆదర్శాలను ప్రతిధ్వనించే పద్యం ఇది. 

మండపాక జోహనమ్మ మొదటి రచనసంభాషణను గూర్చినాప్రియ స్వదేశీ సోదరీలారా అన్నసంబోధనతో ప్రారంభం కావటం ఇది ఉపన్యాసం అని సూచిస్తున్నది. ప్రపంచంలో కొంతకాలం నివసించటానికి ఇయ్యబడిన జీవితాన్నిఎట్లా సద్వినియోగం చేసుకోవాలో చాలామందికి తెలియదంటుంది జోహానమ్మ. పదిమంది స్త్రీలు ఒకదగ్గర కూడినప్పుడు, ఇరుగుపొరుగుల గురించి దుర్భాషలాడుతూ వ్యర్ధప్రసంగాలతో పొద్దుపుచ్చరాదని చెబుతుంది. నాలుక బహువిచిత్రమైన అవయవం , దానిని బహుభంగుల వాడవచ్చని చెప్తూ ఇతరులకు విద్యనేర్పటానికి, ఆకార్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడటానికి ఉపయోగించటం సముచితం అని చెప్పటం ఆమె స్త్రీవిద్యాభిమానాన్ని, స్త్రీవిద్యాప్రచార ఆదర్శాన్నిసూచిస్తున్నాయి. సంభాషణ ఎప్పుడూ జ్ఞానాభివృద్ధి సాధకంగా, ప్రయోజనకరంగా ఉండాలని అభిప్రాయపడింది జోహానమ్మ. విద్యగలవారి సహవాసం వల్ల విద్య వల్ల వాళ్లకు కలిగిన లాభాలేమిటో తెలుసుకొని మనము కూడా పొందటానికి ప్రయత్నించ వచ్చు కదా అన్నది  ఆమె వాదం. సత్యం మాట్లాడటం, సంయమనంగా మాట్లాడటం అవసరం అంటుంది. మంచిసహవాసం, మంచి సంభాషణ జీవితాధార విలువలని చెప్పి స్త్రీలు కాలాన్నివ్యర్ధపుచ్చక తమ  జ్ఞానాన్నితోటి స్త్రీలకు పంచటానికి వీలుగా వాటిని వినియోగించుకోవాలని చెప్తూ ఈ ఉపన్యాసాన్నిముగించింది జోహానమ్మ.

ఆమె రెండవ రచన రెండు సంచులను గూర్చిన కథ. ది స్టోరీ ఆఫ్ టు బాగ్స్ అని ఇంగ్లీషు శీర్షిక కూడా ఉంది. ముగ్గురు ముసలివాళ్ళు వెనుకకు ఒకసంచి, ముందుకు ఒక సంచి వేసుకొని ఉంటారు..ఒకరికొకరు తటస్థపడతారు.వారి అవస్థ, సంభాషణ కథా విషయం.మొదటివాడు తనస్నేహితుల సత్క్రియలు వెనుక సంచీలో వేసుకొని ముందు సంచీలో ఇతరులుచేసిన తప్పిదాలు వేసుకొని తిరుగుతున్నాడు.స్నేహితుల సత్క్రియల సంచీ వెనకవైపు ఉందికనుక అవి అతనికి అసలు కనబడవు. ముందుసంచీ లోని ఇతరుల తప్పిదాలే కనబడుతుంటాయి. రెండవవాడు ముందు సంచీ లో తన సత్క్రియలను, వెనక సంచీలో తప్పులను వేసుకొని తిరుగుతూ తన సత్క్రియలుఅందరికీ ప్రదర్శిస్తూ తిరుగుతుంటాడు. మూడవ వాడు ముందు సంచీలో ఇతరులు చేసిన సత్క్రియలు , వెనక వేలాడే రంధ్రం గల సంచిలో ఇతరుల గురించి తాను వినే చెడు మాటలు వేసుకొని తిరుగుతుంటాడు. ఈముగ్గురిని చూపి ఇతరుల మంచిని విస్మరించి, చెడును స్మరించుకొంటూ తిరగటం కానీ, తన చెడును దాచుకొని మంచిని ప్రదర్శించుకొంటూ తిరగటం కానీ మంచి విలువలు కావని ఇతరుల గురించిన మంచి విషయాలకు సంతోషపడుతూ స్మరించటం, ఇతరుల గురించి వినపడే చేదు మాటలను అప్పటికప్పుడే జారవిడవటం అవసరమైన , అభిలషణీయమైన విలువ అని చెప్పటం ఈ కథ ప్రయోజనం. మొదటి రచనలో  ఇతరుల అవగుణాలగురించి మాట్లాడుకొంటూ కాలం వ్యర్థం చేయవద్దని చెప్పిన జోహానమ్మ ఈ కథలో దానిని ఒక ప్రధాన విలువగా ప్రతిపాదించింది .   

ఇక ఓరుగంటి ఆదెమ్మ రచనలు ప్రధానంగా వ్యాసాలు. మొదటిది స్త్రీవిద్య( జూన్ 1902) ఓ సోదరీ రత్నములారా అన్నసంబోధనతో మొదలయ్యే ఈ వ్యాసం ఒకచోట సమావేశమైన స్త్రీ సమూహం ముందు చేసిన ఉపన్యాసం.కృష్ణవేణమ్మ మొదలైన స్త్రీల ప్రొత్సాహంతో చేసిన  మొదటి ప్రయత్నం. ఆ కృష్ణవేణమ్మ ఎవరో తెలుసుకోవలసి ఉంది. వ్యాసం ముగిశాక రచయిత్రి పేరుతో పాటు విజయనగరం అని ఉండటాన్ని బట్టి అదే ఆదెమ్మ నివాసం అయివుంటుందని అనుకోవచ్చు. సాంప్రదాయక ఆలోచన వల్ల కొందరు స్త్రీలు ఇంటివద్ద ఇతర స్త్రీలను గౌరవంగా చూడలేకపోతున్నారని అందుకు విద్యాలోపమే కారణం అంటుంది. స్త్రీలకు పురుషులవలెనే విద్యాభ్యాసం ఆవశ్యకమని , ఎవరెంత ప్రోత్సహిస్తున్నా హిందూ స్త్రీలలో నూటికి పదిమందైనా చదువుకొన్న వాళ్ళులేరని, వారిలోనూ మూడవవంతులు వానకాలపుచదువులవాళ్లేనని విచారంవ్యక్తంచేస్తుంది. స్త్రీలను పుత్రికల యందు కనికరము కలవాళ్ళై విద్యాచెప్పించవల్సినదిగా ప్రార్ధించింది. సమావే శాలు పెట్టుకొని సంఘ లోపములు జ్ఞాపకం తెచ్చుకొనటం వలన వాటినుండి బయటపడే అవకాశాలు కనుక్కొనే ప్రయోజనం ఉంటుందని సూచించింది. స్వజాతి వాత్సల్యం గురించిన హెచ్చరికతో ఈవ్యాసాన్ని ముగించింది.

రెండవ వ్యాసందక్షిణదేశపు మనదేశపుస్త్రీల తారతమ్యము’ ( అక్టోబర్ 1902) దక్షిణదేశం అంటే చెన్నపట్నం ( మద్రాస్). ప్రెసిడెన్సీ రాజధానిగా అది అభివృద్ధి చెందిన నగరం. విద్యా ఉద్యోగ సాంస్కృతిక రంగాలలో ప్రభావం తమిళులది గా ఉన్న ఆనాటి స్థితిగతుల గురించిన అవగాహన నుండి ఆప్రాంతపు స్త్రీల తో పోలిస్తే మనదేశపు - అంటే తెలుగు దేశపు స్త్రీలు ఎంత వెనకబడి ఉన్నారో అర్ధమై ఆదెమ్మ ఈవ్యాసం వ్రాసింది.సంఘ లోపములు,కొరతలు దాచుటకన్నా వెల్లడిచేయటంవల్ల మనస్సులు శుభ్రమై సుఖపడే మార్గాలు తెరుచుకుంటాయని నమ్మే ఆదెమ్మ ( స్త్రీవిద్య) ఈ వ్యాసం కూడా ఆ ఉద్దేశంతోనే వ్రాసింది. చెన్నపట్నపు స్త్రీల విద్యావైభవాన్ని, వారి సాంఘిక పద్ధతుల ప్రత్యేకతను ప్రస్తావిస్తూ తెలుగు దేశంలో అందువలన లాభాలను పరిగణించకుండా వాళ్ళ పట్ల మూఢం గా ప్రవర్తించే వాళ్ళు అధికంగా ఉన్నారని ఆమె అంటుంది. స్త్రీలకు స్వాతంత్య్రం లేకపోవటం వల్లనే పురుషులు స్త్రీలు సుఖంగా వున్నారని మనవాళ్ళు అనుకొంటున్నారని ఎత్తి చూపింది. స్త్రీలకు విద్య వలన జ్ఞానం తద్వారా స్వాతంత్రం చేకూరుతుందన్న భయంతోనే అల్పబుద్ధులు తమ బాలికలకు అక్షరాలు రాగానే చా లు చాలని విద్యాగంధం లేకుండా చేస్తూ స్త్రీల దైన్యస్థితికి కారణమవుతున్నారని ఇట్లాటి వాళ్లంతా విద్యానిధియగు దక్షిణ దేశాన్ని చూసి నేర్చుకోవలసినది ఎంతో ఉందంటుంది ఆదెమ్మ.

 దక్షిణదేశంలోవలే తెలుగుదేశంలో భార్యాభర్తలు కలిసి చల్లగాలిలో సుఖ సంభాషణ  చేయటంకానీ, షికారుకు పోవటంకానీ, గానకళా సౌందర్యాన్ని ఆస్వాదించటం కానీ లేవని గుర్తించిచెప్పింది.పాటలు పాడే మగవాళ్ళను పోకిరీలు అని ఆడవాళ్లను భోగం వాళ్ళని తక్కువచేసే కుసంస్కృతిని వేలెత్తి చూపింది. సంగీతం నేర్చుకొని పడగలిగిన బాలికల కళాశక్తులు పెళ్లి అయ్యాక అత్తవారింట భర్త పెత్తనం కింద అణగి పోవటం గురించి ప్రస్తావించి చెన్నపట్నం  కాంతామణులవలె గాత్రాన్ని, వాయిద్యాలను స్వేచ్ఛగా ఉపయోగిస్తూ సంగీత కళను ప్రదర్శించే భాగ్యం తెలుగుదేశపు స్త్రీలకు ఎప్పుడు కలుగుతుందో కదా అని ఆవేదన చెందింది.పంజరములో చిలుక వలె కారా గృహము లనదగు గృహములకు మనలను ముడిపెట్టి పురుషులకు పెద్ద దాసీలవలె మనలను చేసినకొలది మన యవివేకము వృద్ధి యగుచున్నది”  అని చెప్పిన మాట ఆనాటికి విప్లవాత్మకమైన వ్యక్తీ కరణే.  సంసార స్త్రీల అవివేకం కుటుంబానికే అరిష్టదాయకమని చెప్పి సంగీత సాహిత్యాలు నేర్పించటం ద్వారా దానిని అధిగమించవచ్చని, పురుషులలో    ఉత్తమాభిరుచులు  పెంపొందించి  భోగము వారిండ్లు చేరకుండా ఆపగల శక్తి దానికి ఉన్నదన్న సూచనతో ఈ వ్యాసాన్ని ముగించింది ఆదెమ్మ. 

పిల్లలను పెంచవలసిన మార్గములు ( 1903 ఫిబ్రవరి ) అనే వ్యాసంలో తప్పులు చేసినప్పుడు పిల్లలను శిక్షింపక దయ చూపే తల్లి తనం, అలాగే ఏడ్చినప్పుడల్లా చిరు తిండ్లు పెట్టి ముద్దు చేసే లక్షణం  పిల్లల మానసిక శారీరక ఆరోగ్యానికి భంగకరమని చెప్పింది. ఆడపిల్ల జన్మిస్తే ఖేదపడే దుష్ట సంస్కృతిలో ఆడపిల్లల పెంపకం మరీ నిర్లక్షానికి గురవుతుందని గుర్తించి  చెప్పటం విశేషం. వేళకు తినటం, నిద్రపోవటం అలవాటు చేయాలని, ఏడుస్తున్నారని ఎత్తుకునే అలవాటు మంచిది కాదని, నమ్రత , నీతి, దయ, సత్యం మొదలైన గుణాలను చిన్నప్పటి నుండే అలవాటు చేయాలని,వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనటం నేర్పించాలని, చదువుపట్ల శ్రద్ధ వహించాలని, ప్రత్యేకించి ఆడపిల్లలకు చదువు చెప్పించాలని సూచనలు చేసింది.హిందూదేశపు స్త్రీలకు  విద్య లేక మూఢ దశలో నున్నంత కాలం మన దేశము అనాగరిక దేశములలో మొదటిదిగా నెంచబడును.”  అని  ఆనాడు చెప్పినమాట ఇప్పటికీ ఆలోచించవలసిన అంశమే.

దంపతుల సుఖ మార్గములు’ ( 1903 ఏప్రిల్) అనేవ్యాసంలో భార్యాభర్తల మధ్యఉండవలసిన అన్యోన్య స్నేహం గురించి ఒకరినొకరు సుఖపెట్టుట యందు ఉండవలసిన శ్రద్ధ గురించి చెప్పి తనవారందరినీ వదిలి సమస్తమూ భర్తయే అని నమ్మివచ్చిన స్త్రీయందు భర్త  చూపవలసిన కరుణాదరణ ల గురించి ఆదెమ్మఈవ్యాసంలో చర్చించింది.చాకిరీచేయుటకు, సంభోగ సౌఖ్యమునకును తప్ప మరెందుకూ కొరగాని బానిసలు గా చేసి భార్యలనును చిన్నచూపు చూడటాన్ని గర్హించింది. భార్యలను కొట్టటం వంటి భర్తల దుష్చేష్టలు మానుకొనవలసినవి అనిపేర్కొన్నది.అన్నిటికంటే ముఖ్యము భర్తలు భార్యల పట్లనిజమైన ప్రేమకలిగి ఉండటం అంటుంది. నిజమైన ప్రేమ అంటే వేరొక స్త్రీమీదనో మనసు నిలపక సంపూర్ణంగా భార్యకు ఇయ్యటం.దానితో పాటు భార్యలను అనుక్షణం అనుమానించక నిర్మలమైన హృదయంతో ఉండటం అని ఆమె వ్యాఖ్యానించింది కూడా. భార్యలను నిర్బంధంలో ఉంచక ప్రేమతో బంధించి చేసే కాపురాలవల్లనే హిందూ సమాజానికి క్షేమముఅభివృద్ధి అని అభిప్రాయపడింది.అంతేకాదు, స్త్రీలను ప్రత్యేకంగా సంబోధించి భర్తలను సుఖపెట్టటానికి ప్రయత్నించమని ప్రబోధించింది. భర్త పనులు తీర్చుకొని ఇల్లు చేరే సమయానికి సంసార సమస్యలను ఏకరువుపెట్టవద్దని, నగల కోసం వేధించవద్దని, ఉన్నంతలో సంసారం చక్కదిద్దుకొమ్మని, శుభ్రంగా ఉండమని, శాంతంగా ఉండమని చెప్పింది.దంపతులమధ్య బంధాన్ని దృఢతరం చేసేది సంతానమే నని, వాళ్ళు విద్యావంతులు కావటం మరీ ముఖ్యమని, ఆడపిల్లల విద్య మరీ ఆవశ్యకమని చెప్తూ చదువుకొన్నస్త్రీ భర్తకు కష్టసుఖ ములలో మంచి సహచరి కాగలుతుందని అభిప్రాయపడింది ఓరుగంటి ఆదెమ్మ.

స్త్రీల విద్యావిజ్ఞానాలకు కుటుంబనిర్వహణలో  ఉన్న ప్రాధాన్యతను నొక్కిచెప్పటం సంస్కరణోద్యమంలో ఒక భాగం.కందుకూరి వీరేశలింగం స్త్రీల శరీర ఆరోగ్య ధర్మబోధిని రచించి అందుకు దారి తీసాడు. దానిని అందిపుచ్చుకున్నదా అన్నట్లుగా ఆదెమ్మ స్త్రీలకు ఆరోగ్య జ్ఞానం ఆవశ్యకతను నిర్ధారిస్తూ చేసిన రచనఆరోగ్యము’( 1911 ఏప్రిల్) తల్లీ పిల్లల సంభాషణ గా చేసిన ఈ కాల్పనిక రచన లో ఒంటి శుభ్రతవాయు శుభ్రత,మొదలైన విషయాలను, వాయుకాలుష్య కారణాలనుధారాళంగా ఇంటిలోకి స్వచ్చమైన గాలీ , వెలుతురూ వచ్చే మార్గాలను గురించి  సాగిన ఈ  సంభాషణ ఆరోగ్య పరిరక్షణ మనచేతిలో పని అని సూచిస్తుంది .  

ఓరుగంటి ఆదెమ్మ వ్రాసిన పద్యాలు మూడే కనబడుతున్నాయి.అవి హిందూ సుందరి పత్రిక జన్మదిన సందర్భంగా వ్రాసినవి ( 1903 ఏప్రిల్ ) ఒక సీస పద్యం. రెండు కంద పద్యాలు . తెలివి విద్య కలిగిన జవ్వనులకు మానస పుత్రిక అని , మగువలు ఇష్టపడేమొగమున శ్రీ గల ముదితఅని , మగువలకు ఠీవిని మప్పగలది అని హిందూసుందరి పత్రికను ప్రశంసిస్తూ వర్ధిల్లమని  సీస పద్యంలో ఆశీర్వదించింది. ఆ పత్రిక వస్తున్న ఏలూరు ప్రశంస మరొక పద్యంలో చేసి మూడవ  పద్యంలో ఆ పత్రికలో  ప్రచురించబడే తన కవిత్వ చాతుర్యాన్ని గురించి చెబుతుంది . 

ఆదెమ్మ బంపు పద్యము / లాదరమున జూచి చదివి- యతివలు హృదయా / 

మోదమున తనివి చానకా / స్వాదింతురు గాక కవన చాతురి నెపుడున్ “ -   అతివల హృదయానికి  సంతోషం కలిగించి ఆస్వాదనాపరులను చేయగల కవిత్వ శక్తి తనది అని ఇంత ఆత్మ విశ్వాసం తో ప్రకటించగలిగిన ఆదెమ్మ ఆ తరువాత ఎంత కవిత్వం వ్రాసిందో, ఎందుకు వ్రాయలేక పోయిందో అన్వేషించవలసే వుంది. 

           

                        --------------------------------------------------------------------

 

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర – 8  

కందుకూరి రాజ్యలక్ష్మమమ్మ కందుకూరి వీరేశలింగం పంతులు గారి భార్య అని చాలా మందికి తెలుసు. ఆయన నిర్మించి కొనసాగించిన  సంఘ సంస్కరణ ఉద్యమానికి చేదోడై నిలిచిన సంగతి కూడా తెలుసు. భార్యా ధర్మంగా ఆమె ఆపని చేసిందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది అర్ధ సత్యమే.  దుష్ట సంప్రదాయాల వల్ల బాధితులైన  స్త్రీల పట్ల సహజ  సానుభూతి లక్షణం వల్ల ఒక స్త్రీగా స్పందించి , మానవీయ చైతన్యంతో  స్వతంత్రంగా సంస్కరణ  ఉద్యమంలో ఆమె  భాగ మైందని అనటం సబబు. ఆ విషయం వీరేశలింగం కూడా గుర్తించాడు. స్వీయ చరిత్రలో ఆమె గురించి ఆయన  చాలా సమాచారమే ఇచ్చాడు.  

రాజ్యలక్ష్మమ్మ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు బాపమ్మ. తల్లి  అద్దంకి కొండమాంబ, తండ్రి అద్దంకి పట్టాభిరామయ్య. 1851 నవంబర్ లో రాజమహేంద్రవరానికి  సమీపంలో ఉన్న కాతేరు గ్రామంలో  పుట్టింది. తల్లి మరణించటంతో కాతేరులో మేనమామ వెన్నెటి వెంకటరత్నం గారి దగ్గర పెరిగింది. మేనమామ ఆమెను బడికి పంపి చదివించాడు. ఎనిమిదేళ్ల వయసులో పన్నెండేళ్ల వీరేశలింగం తో వివాహం జరిపించాడు. కాపురానికి వచ్చినతరువాత వీరేశలింగం తల్లి కోడలిని తన తల్లి రాజ్యలక్ష్మి పేరుతో పిలవటం సాగించింది. ఆ రకంగా బాపమ్మ రాజ్యలక్ష్మి అయింది. వితంతు వివాహాలకై నడుము కట్టిన భర్తకు చేదోడు , వాదోడై నిలిచింది. వితంతు వివాహాలు జరిపించే ఇంట పని చేయమని వంటవాళ్లు, నీళ్లు తెచ్చేవాళ్ళు బహిష్కరించి పనులుమానేసినా చేయవల్సివచ్చిన పనికి వెరవని మనిషి.ఆతనిని ఆ పని నుండి విరమింప చేయటానికి ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా   తొణకని బెణకని వ్యక్తిత్వం ఆమెది. వీరేశలింగం వితంతువివాహాలు చేస్తున్నాడని తెలిసి ఎక్కడెక్కడి నుండో వచ్చే స్త్రీలను చేరదీసి ఆదరించి విద్యాబుద్ధులు నేర్పేది. పెళ్ళై వెళ్లినవాళ్ళతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ క్షేమసమాచారాలు తెలుసుకొనేది. పురుళ్ళు పోసి వాళ్లకుపుట్టిల్లు లేని లోటు తీర్చేది. పురుషుల వంచనకు బలి అయినస్త్రీల కోసంపతిత యువతీరక్షణ శాలను స్థాపించి నిర్వహణ భారం వహించింది . గర్భవతులను పోషించి  ప్రసవాలు చేయించింది. ఒక స్త్రీ వదిలి వెళ్లిన బాలిక పెంపకపు బాధ్యత కూడా స్వీకరించింది.  వేశ్యాస్త్రీల సమస్యల పట్ల కూడా సానుభూతి చూపగలిగిన సంస్కారి. ఆకొన్నవారిని , ఆపదలో ఉన్నవాళ్లను కుల లింగభేదాలు లేక ఆదుకొన్నమానవీయ మూర్తిమత్వం రాజ్యలక్ష్మమ్మ.

పూర్వ విశ్వాసాలు మారుతూ బ్రహ్మసమాజ ప్రభావాలకు లోనవుతూ వీరేశలింగం పంతులు మిత్రులతో కలిసి మానసికంగా ఈశ్వరోపాసన చేయటానికి 1878 లో ప్రార్ధనా సమాజం ఏర్పరిచాడు. వీరేశలింగం గారి ఇంటనే నలుగురు మిత్రులు చేరి ప్రార్ధనలు జరుపుకొని, కీర్తనలు పాడుకొని , ధార్మిక విషయాలు ప్రసంగించుకొంటూ గడపటాన్ని చూసిన రాజ్యలక్ష్మమ్మ స్త్రీలకు కూడా అటువంటి ప్రార్ధనాసమాజం ఒకటి ఉండాలని భావించింది. చుట్టుపక్కల స్త్రీలను వారానికి ఒకరోజు తన ఇంట్లోనే గుమిగూర్చి ఏకేశ్వరోపాసనకు పురికొల్పింది. ఆరకంగా తొలి స్త్రీప్రార్ధనా సమాజం స్థాపకురాలైంది రాజ్యలక్ష్మమ్మ. ఆ సమాజ సమావేశాల కోసం కీర్తనలు రచించి పాడేది. ఈవిధమైన ప్రార్ధనా సమాజాల సంస్కృతి స్త్రీలను అనేకులను కీర్తనా కారులను చేసింది. ఇంటిపని, వితంతు శరణాలయ స్త్రీల క్షేమం విచారించటం, మిగిలిన సమయంలో చదువుకొనటం, వ్రాయటం - ఇదీ ఆమె జీవన శైలి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆంధ్రకవయిత్రులు లో ఆమెను కీర్తనల రచయితగా గుర్తించింది.

పువ్వులంటే ఆమెకు చాలా ఇష్టం అని ప్రతిరోజూ తాను తలలో పూలు పెట్టుకొనటమే కాక శరణాలయం లోని బాల వితంతువులందరికీ ఒక్కొక్క పువ్వు తలలో పెడుతుండేదని వీరేశలింగం స్వీయ చరిత్రలో చెప్పాడు. ఆమె తలపువ్వు వాడకుండా 1910 ఆగస్టు 12 వతేదీ తెల్లవారుఝామున నిద్రలోనే అనాయాస మరణం పొందింది. కందుకూరి వీరేశలింగంతో పాటు రాజ్యలక్ష్మమ్మను కూడా పాత్రలుగా చేసి 1927 లో నిడమర్తి సత్యనారాయణ మూర్తి వ్రాసిన సుశీల నవల( ప్రచురణ,1967) లో ఆమె జీవిత  కార్యాచరణ తీరు, మరణ ఘట్టం కూడా నమోదు అయ్యాయి. రచయిత 1906 లో రాజమండ్రిలో వీరేశలింగంగారి ఆస్తికోన్నత పాఠశాలలో చదువుకొంటూ  వీరేశలింగం పంతులుగారి తో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడు కావటం వల్ల 1905 నుండి 1919 లోపల నాలుగు సంవత్సరాల కాలం మీద సంఘసంస్కరణ ఉద్యమ నేపథ్యంలో దాని పరిణామాలు, ఫలితాలు అంచనావేస్తున్నాడా అన్నట్లుగా ఈ నవల ఇతివృత్తాన్ని ఇలా నిర్మించగలిగాడు.

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ ప్రార్ధనా సమాజ స్థాపకురాలుగా , నిర్వాహకురాలిగా అనివార్యంగా ఉపన్యాసకురాలైంది. బ్రహ్మ మతానుయాయులై పురుషులు ప్రతి ఆదివారం ప్రార్ధనా మందిరంలో చేరి ఉపన్యాసాలు చేస్తూ , పాటలు పాడుతూ గడుపుతున్నప్పుడు స్త్రీలు ఆ పని చేయకుండుట ఏమిటి అన్న ప్రశ్నతో ఆమె స్త్రీలను కొందరిని సమావేశ పరిచి అందుకు ప్రేరేపిస్తూ చేసిన ఉపన్యాసంఈశ్వర భక్తిఅనే శీర్షికతో 1902  జులై హిందూ సుందరిలో ప్రచురించబడింది. అప్పటివరకు స్త్రీవిద్యాభిమానులై పుణ్యపురుషులు స్త్రీలను విద్యావంతులను చేయటానికి జరిపిన కృషిని ప్రస్తావించి విద్య వల్ల వినయాది సద్గుణాలు, దైవభక్తి , పతిభక్తి, పెద్దలయందు ప్రేమ, దీనుల యందు దయ కలగాలని , అందుకు పరమాత్మునియందు భక్తివిశ్వాసాలే మూల కారణం అవుతుందని చెప్పింది. పరమాత్ముడు అంటే ఆమె దృష్టిలో బ్రహ్మ మతం చెప్పే నిరాకారుడైన ఈశ్వరుడు ఒక్కడే.  ఆ ఈశ్వరుడినిమనతండ్రి’  అని  సంబోధించి చెప్పటం దానినే సూచిస్తుంది.స్త్రీలుఉదయం నుండి సాయంత్రం వరకుసంసారసాగరంలో పడి ఈదులాడటం కాక వారానికి ఒక్కనాడైనా ఈశ్వర ప్రార్థనకు సమయం కేటాయించాలని పేర్కొన్నది. 

విద్యనేర్చిన స్త్రీలు పని పాటలు తీరిన తరువాత ఇరుగుపొరుగుల వారి ఇళ్లకువెళ్లి వృధా కాలక్షేపము లోనో, నిద్రలోనో గడపటం శ్రేయస్కరం కాదని మంచి పుస్తకాలు చదివి తాము సంతోషపడటమే కాక ఇతరులకు వినిపించి వాళ్ళను కూడా సంతోష పెట్టటం ధర్మమని చెప్పింది. భర్తలుచేసే ధర్మకార్యాలకు సహాయులుగా ఉండటం భార్యల ధర్మం అని పేర్కొన్నది. మంచి నడవడిక, సత్య బుద్ధి, సన్మార్గ గమనం ధర్మం అనుకొని జీవితాన్నిగడిపే వారిని చేయిపట్టి నడిపించే ఈశ్వరుడి ప్రార్ధన ఆవశ్యకం అనిచెప్పి ప్రతి శనివారం అట్టి సామూహిక ప్రార్ధనకు స్త్రీలు సమావేశం అయితే బాగుంటుందని ప్రతిపాదించింది రాజ్యలక్ష్మమ్మ ఈ ఉపన్యాసంలో.  

1902 నాటికి కందుకూరి వీరేశలింగం పంతులు గారితో పాటు రాజ్యలక్ష్మమ్మ మకాం మద్రాసు కు మారింది అందువల్ల ప్రార్ధనా సమాజం బాధ్యతను కొటికలపూడి సీతమ్మకు అప్పగించారు.మళ్ళీ వాళ్ళు 1905 నాటికి కానీ రాజమండ్రికి చేరుకోలేదు. అయితే ఇప్పడు లభించిన రాజ్యలక్ష్మమ్మ రచనలన్నీ 1904 సంవత్సరంలో వచ్చినవే. అంటే మద్రాసులో ఉన్నకాలానివే.వీటిలో రెండు ఉపన్యాసాలు.స్నేహముఅనే ఉపన్యాసం( హిందూసుందరి , జనవరి 1904)  రాజమండ్రి  ప్రార్ధనా సమాజంలో ఇచ్చినది అని అంతర్గత విషయాలను బట్టి తెలుస్తున్నది. బహుశా మద్రాసు నుండి రాజమండ్రికి వచ్చిపోతూ ఉన్నప్పుడు ఎప్పుడో చేసినదై ఉంటుంది. ముప్పది సంవత్సరాల క్రితం బ్రాహ్మమతం  ప్రారంభమైన మొదలు స్త్రీలు విద్యావంతులై సభలకు వస్తూ మంచి విషయాలు నేర్చుకొంటున్నా తోటి స్త్రీలకు బోధిస్తూ మంచి మార్గం చూపుతున్నా ప్రార్ధనా సమాజంలో ఇంత ఎక్కువమంది స్త్రీలు సమావేశం కావటం ఇంతకుముందెప్పుడూ జరగలేదని హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైనది స్నేహమే అంటుంది ఆమె.స్నేహం మనుషులను మంచివాళ్లను చేస్తుందని, ఒకరినుండి ఒకరు నేర్చుకొనటానికి ఉపయోగపడుతుందని బండారు అచ్చమాంబ వచ్చి ఇక్కడ అనేక ఉపన్యాసాలిచ్చి స్త్రీలకు మంచిమార్గం చూపింది ఆస్నేహంవల్లనే అని నిర్ధారించింది. ఆమె అబలాసచ్చరిత్ర రత్నమాల వ్రాయటమైనా, కొటికలపూడి సీతమ్మ పుస్తకాలు వ్రాయటమైనా స్త్రీలపట్ల వాళ్లకుఉన్నస్నేహం వల్లనే అన్నది ఆమె అభిప్రాయం. స్త్రీల మధ్య స్నేహం, తరచు కలుసుకొని మాట్లాడు కొనటం, నీతి మత విద్యావిషయాలలో,దేశాచార విషయాలలో ఐకమత్యంతో పనిచేయటానికి దారితీస్తుందని ఆమె అభిప్రాయపడింది. స్త్రీలమధ్యస్నేహానికి దేశక్షేమానికి మధ్య సంబంధాన్ని సంభావించింది. ప్రసంగం ముగిస్తూ ఒక సీస పద్యం చెప్పింది. అది భగవత్ప్రార్ధనా పద్యం. భక్తి కలుగచేయమని,దానధర్మాలుచేసి బీదలను ఆదుకొనేట్లు చేయమని తామసవృత్తి దరిచేరకుండా చూడమనికాచి రక్షించమని  కోరుతూ చేసిన ప్రార్ధన అది.

 కొటికలపూడి సీతమ్మ గురించి చేసిన ప్రసంగం( మార్చ్, 1904, హిందూసుందరి)  మద్రాస్ నుండి చేసినదే.సీతమ్మ వైద్యం నిమిత్తం బిడ్డతో సహా మద్రాస్ వచ్చి వీరేశలింగంగారింటనే పదినెలలు ఉండి స్వస్థత చేకూరి తిరిగివెళ్తున్నప్పుడు కొంత మంది స్త్రీలను పిలిచి ఏర్పరచిన వీడ్కోలు సమావేశంలో  చేసిన ఉపన్యాసం అది. సీతమ్మ పతిభక్తిదైవభక్తి, అత్త మామల ఎడ గౌరవం, స్నేహ లక్షణం మొదలైన సద్గుణాలను పేర్కొంటూ ప్రార్ధనా సమాజం ఒప్పచెప్పి వచ్చినది మొదలు సమావేశాలు ఏర్పరచి ఉపన్యాసాలు ఇచ్చి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నదని చెప్పింది. మతవిషయమునను , విద్యావిషయమునను స్త్రీలకు ఉపయోగపడే పుస్తకాలు చదువుతూ, వ్రాస్తూ స్త్రీలను ప్రోత్సహిస్తూ వస్తున్నదని సీతమ్మ పట్ల తన అభిమానాన్ని ప్రకటించింది. ఈ ఉపన్యాసాన్నిసీతయనునామమీమెకు/ చేతో మోదంబు తోడ చేకూరినట్టే /పాతివ్రత్యాదులనీ/ నాతికి దేవుండొసంగె నయమొప్పంగన్అనే ఒక కంద పద్యంతో ముగించింది. 

బ్రహ్మసమాజ ప్రార్ధనా పద్ధతికి ఒక నమూనా భగవత్ప్రార్ధన. భక్త వత్సలుడవగు పరమాత్ముడా అన్న సంబోధనతో ప్రారంభించి దయతో కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేసి, భర్తను అనారోగ్యం నుండి కాపాడినందుకు స్తుతులు చెల్లించి,అనాథ బాలవితంతువులను ఆదుకొని సౌభాగ్యవతులను, విద్యావంతులను చేసిన ఘనత ను ఈశ్వరమహిమగా ప్రస్తుతించి, భర్తకుతనకు ఆరోగ్యాన్నిఐకమత్యాన్ని అభివృద్ధిచేసి దేశక్షేమానికి పాటుపడేట్లు అనుగ్రహించమని, నీతిమార్గంలో చరించేట్లు చూడమని, అందరిపట్ల సమబుద్ధితో ప్రవర్తించేట్లు అనుగ్రహించమని కోరుతూ భక్తిపూర్వక నమస్కరాలు సమర్పించింది. వచనంలోసాగిన ఈ సుదీర్ఘ  ప్రార్ధన క్రైస్తవ మత ప్రార్ధనా పద్ధతిలో  సాగింది. దీనిని కూడానోములు వ్రతములు మానితి/ నామానసమున వసించి నాకెల్లపుడున్ / నీ మీద( జెడ ని భక్తిని/ స్వామీ/ దయసేయుమయ్య! సత్క్రుప తోడన్అనే కంద పద్యంతో ముగించింది.

            రాజ్యలక్ష్మమ్మ చిన్నచిన్నకథలుకూడా వ్రాసింది. అనగనగ ఒకరాజు వంటి పిల్లలకు చెప్పేమౌఖిక కథల పద్దతిలో వ్రాసిన కథలు ఇవి. ఒకరకంగా ఇవినీతి కథల వంటివి. కథాసారమైన నీతి చివరిలో పద్యంరూపంలో చెప్పబడుతుంది.కష్టకాలంలో ఆదుకోగలిగినవాడు భగవంతుడే అనిచెప్పేభక్తుడైన రాజుకథభావమందుననిజమైన భక్తితొడఅనిప్రారంభం అయ్యేగీత పద్యంతో ముగుస్తుంది. అంగవైకల్యాన్నిఅలుసుగా తీసుకొని మనిషిపై ఆధిక్యత సాధించాలనుకొనటం తప్పు అనిఒక గుడ్డివాడుకథ హెచ్చరిస్తుంది.పరులయంగ హీనత( గాంచి’  పరిహసించే.. హీనులకు గర్వభంగం తప్పదని కథ చివర గీతపద్యం చెప్తుంది. పంది దొంగ కథ పరులసొత్తును ఆశించేవాళ్లకు శిక్షఅనివార్యం అని సూచిస్తుంది.ముగ్గురుదారి దోపుడు కాండ్రుకథ సంపదల పట్ల దురాశ ఆత్మహత్యా సదృశం అని సూచిస్తుంది. మాయవైద్యుడు కథను యోగ్యతా యోగ్యతలు ఎరుగక ఎవరో ఇచ్చిన మందులు తీసుకొంటే డబ్బునష్టమే కాక శారీరక  హానికూడా అని చెప్పే వీరేశలింగం పంతులుగారి పద్యాన్నిఉటంకించింది. ఆవ్యాసాలకు, ఈరకమైన కథలకు రాజ్యలక్ష్మమ్మ వ్రాసిన పద్యాలు ఆమెకవిత్వరచనాభ్యాస ఆసక్తులను ప్రతిఫలిస్తాయి.ప్రత్యేకమైన ఖండిక, కావ్యం ఏమీ వ్రాయకపోయినా ఆరకంగా ఆమె కవి అవుతుంది.

ప్రార్ధనా సమాజ సమావేశాలలో పాడటానికి  మహిళలుకీర్తనలు వ్రాసిన కాలం అది.పెళ్లిళ్లు పేరంటాలలో సందర్భానికి తగిన మంగళహారతులు సేకరించుకొనటం, రచించటం , పాడుకొనటం అనే సాంస్కృతిక సంప్రదాయంలో ఉన్న స్త్రీలకు ఈ కొత్త సందర్భానికి కీర్తనలు వ్రాయటం అలవోకగా అబ్బిన విద్య అయివుంటుంది. రాజ్యలక్ష్మమ్మ ఆ రకంగా వ్రాసిన కీర్తనలు అనేకం ఉన్నాయి.ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆమెను కీర్తన వాజ్మయ స్రష్టగా పేర్కొన్నది.మార్చ్ 1904 హిందూసుందరి లో ప్రచురితమైన కీర్తన ఆంధ్రకవయిత్రులలో  ఉదహరించబడిన కీర్తన కొద్దీమార్పులతో ఒకేరకంగా ఉన్నాయి.తల్లితండ్రివనుచు నమ్మితి దేవాదిదేవా తనయను రక్షింప వేడితిఅన్నప్రారంభమే రెండింటిలో కొద్దీమార్పులతో కనబడతాయి. కీర్తన ముగింపు రచయిత నామాంకితంగా ఉంటుంది.కరుణజూచి కందుకూరిరాజ్యలక్ష్మి నేలవరిఅనిఈకీర్తన ముగియటం గమనించవచ్చు. 

కాపాడగ నీకన్న ఘనులెవ్వరున్నారు కరుణాతో బ్రోవుమయ్యాపల్లవిగా  “దీనపోషకయీ దీనురాలిని జూచి జాలి లేదా దేవాఅని మొదలయ్యే చరణాలతో కూడిన కీర్తన  “ వర రాజ మహేంద్ర  వరముననున్నట్టి - గరిమను కందుకూరి రాజ్యలక్ష్మిని బ్రోవుఅని ముగుస్తుంది. ( జూన్ 1904) సెప్టెంబర్ సంచికలో మరొకరెండు కీర్తనలు ఉన్నాయి.పరమాత్ముని మదిని భజియింపు మెల్లప్పుడు, భక్తితో మనసాపల్లవిగా అయిదు చరణాల కీర్తన ఆమె ఆధ్యాత్మిక తాత్విక దృష్టికి అడ్డం పడుతుంది. హిందూ సుందరి పత్రికను ప్రశంశిస్తూ వ్రాసిన కీర్తన కూడా ఒకటి ఉంది. కీర్తన అనేది ఆధ్యాత్మిక భావ ప్రపంచం గురించి కీర్తించటానికే కాదు, భౌతిక లౌకిక జీవితాన్ని మునుముందుకు నడిపించే శక్తుల సంకీర్తనకు కూడా వాడవచ్చు అని రాజ్యలక్ష్మమ్మ నిరూపించింది. సుందరీ! మా ప్రియ సుఖ సుందరీ ! అన్న సంబోధన తో మొదలై ఏడు చరణాలలో విస్తరించిన ఈ కీర్తన సుందరులు పొందుగా వ్రాసిన వ్యాసములంది తెచ్చి ఆనందపరుస్తున్నదని వ్యక్తీకరణకు సంబంధించిన సంకోచాలు, సంప్రదాయ పరిధులు దాటి వివరముగ తమ అభిమతాలు తెలియచేయటానికి సిద్ధమవుతున్న స్థితికి స్త్రీలు చేరుకొంటున్నారని ఆనందపడ్డది. అయితే ఈ విధంగా వ్రాసే స్వేచ్ఛ కు భర్త ఆజ్ఞ ఒక షరతు అనే వాస్తవాన్ని కూడా ఈ కీర్తనలో ఆమె నమోదు చేసింది.  

స్వీయ పుస్తక ప్రచురణలో అంత శ్రద్ధగా పని చేసిన వీరేశలింగం , అందుకే మద్రాసు మకాం మార్చి స్వంత ప్రెస్ కూడా పెట్టుకొన్న వీరేశలింగం  1910 లో రాజ్యలక్ష్మమ్మ మరణించాక అయినా ఆమె రచనలను ఉన్నంతవరకు ఒక దగ్గరకు తెచ్చి పుస్తకం ప్రచురించే పని చేయకపోవటం విచిత్రమే. 

-----------------------------------------------------------------------------------------

 

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర – 9

భుక్త లక్ష్మీ దేవమ్మ ఎవరు? ఎక్కడపుట్టి పెరిగింది ? సాహిత్య రంగంలోకి ఎలా ప్రవేశిం చింది?ఎందుకు నిష్క్రమించింది? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే . హిందూ సుందరి పత్రికలో 1902 జులై సంచిక నుండి 1904 జూన్ సంచిక వరకు  సరిగ్గా రెండేళ్ల కాలంలో  ఆమె రచనలు చేసిం దన్నది వాస్తవం. చదువనూ,వ్రాయనూ నేర్చి స్త్రీలు తమ మనోభావాలను వ్యక్తీకరించే అవకాశాలు ఉండాలన్న నాటి సంఘ సంస్కరణ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా స్త్రీల కోసం వచ్చిన  తొలి పత్రిక హిందూ సుందరి, మలి పత్రిక సావిత్రి ఇలా ఎందరో స్త్రీలను రచయితలుగా రంగం మీదికి తీసుకురావటానికి కృషిచేశాయి.అయితే  అలా రచనారంగంలోకి ప్రవేశించిన  స్త్రీలను   చివరివరకు కొనసాగేట్లు చేయగల భౌతిక వాతావరణ నిర్మాణం ఈ నాటికీ  పూర్తిగా వాస్తవీకరించబడలేదంటే నూట ఇరవై ఏళ్ల నాటి పరిస్థితి ఎలాంటిదో ఊహించుకోవచ్చు.  జ్ఞానసంపాదనావకాశాల లేమి వస్తు శిల్ప ప్రక్రియ ల  ఎంపికకు ఒక  పరిమితి కాగా, పితృస్వామిక    సామాజిక కౌటుంబిక    సంప్రదాయా లు, నియంత్రణలు అభ్యాసానికి అవరోధం అవుతుంటే ప్రతిభ వికసించే వీలులేక నిస్సహాయంగా నిశ్శబ్దంగా రచనా రంగం నుండి స్త్రీలు తప్పుకున్నారా అనిపిస్తుంది.అలా ప్రవేశించి ఇలా నిష్క్రమించిన ఎందరో మహిళా రచయితలలో భుక్త లక్ష్మీ దేవమ్మ ఒకరు.

భుక్త లక్ష్మీదేవమ్మ జలుమూరు వాసి అన్నసమాచారం ఒక్కటే ఆమె జీవితం గురించి తెలిపే చిన్నఆధారం.జలుమూరు శ్రీకాకుళం కు 35 కిలోమీటర్ల దూరంలోపల ఉన్నవూరు. అంటే భుక్త లక్ష్మీదేవమ్మ ఉత్తరాంధ్ర రచయిత్రి అన్నమాట. ఆమె వ్రాసిన పద్య రచన ఒక్కటే. మిగిలినవి వచన రచనలు. ఆ పద్య రచన ద్విపద. దాని శీర్షికపతివ్రతా ధర్మము ద్విపద’. “శ్రీకరంబుగ మంచి చేడెల విధము / నీకెరిగించెద నెలతరో వినుము / బద్ధకంబునసోకు  బారంగదోలి / పొద్దున్న లేచి దేవుని తోల్త దలచి / పతి బ్రోవుమనుచు బ్రార్ధనల్ సేసి /అని మొదలుపెట్టి , స్త్రీలు భర్త కంటికి, మనసుకు ఇంపుగా ఎట్లా వర్తించాలో చెప్పింది. స్త్రీ ధర్మం బోధించే ప్రసిద్ధ శ్లోకంకార్యేషు దాసి,కరణేశు మంత్రి / భోజ్యేషు మాత, శయనేషు రంభ/ క్షమయేషు ధరిత్రీ, రూపేషు లక్ష్మి/ షట్కర్మయుక్తా, కుల ధర్మపత్ని” .అందులోని కార్యేషు దాసి , భోజ్యేషు మాత, శయనేషు రంభ అన్న మూడు ధర్మాలను ఈ ద్విపదలో నొక్కి చెప్పింది. బూతు పాటల నేర్చ బోవద్దని, నీతులుగల పాటలేనేర్చవలయునని చెప్పటం విశేషం. ద్విపద పాడుకొనటానికి అనువైన ప్రక్రియ.తనకాలపు స్త్రీలు  ఈపతివ్రతా ధర్మాలనే అయితే పద్యరూపంలోనో, కాకపోతే వ్యాస రూపంలోనో ప్రబోధిస్తుండగా ఈమె వాటిని పాడుకొనటానికి వీలుగా ద్విపదలో చెప్పింది. స్త్రీలు బూతు పాటలు కాక నీతి పాటలు నేర్వాలని చెప్పిన లక్ష్మీదేవమ్మ వాళ్ళకోసం వ్రాసిన నీతి పాట ఇది అనుకోవచ్చు.

స్త్రీనీతి కథామంజరి అనే శీర్షికతో హిందూసుందరి (1902 జూన్,ఆగస్టు, 1904 జనవరి , జూన్) సంచికలలో లక్ష్మీదేవమ్మ వ్రాసిన చిట్టిపొట్టి కథలు వున్నాయి. పంచ తంత్రం కథల తరహాలో పక్షులు, జంతువులు పాత్రలుగా చెప్పిన కథలు ఇవి. కథ చివర దాని నుండి స్త్రీలు నేర్చుకోవలసిన నీతి ఏమిటో చెప్పటం అన్నికథలకు సామాన్యం.పావురము -డేగ - బోయవాడుకథ చెప్పి కష్టాలు సంభవించినా, సాటివారు వంచించ చూసినా దిగులు చెందక  భగవంతుడిని తలచుకొంటే ఆపదలు తొలగి పోతాయని చెప్పి భక్తి మార్గ ప్రబోధం చేస్తుంది రచయిత్రి. పిల్లి పశువుల దొడ్డి కథ స్త్రీలకు బోధించే నీతి ఏమిటంటె- గృహకృత్య భారం వహించే స్త్రీలకు లెక్కకు ఎక్కువైన చిక్కులు ఎదురవుతుంటాయి.అందుకు మీభర్తలు మీమీద కోపిస్తుండవచ్చు..ఆసమయంలో మీకోపాన్ని బిడ్డలపై మాత్రం చూపకండి అని . కోపాన్ని తమ కంటే నిస్సహాయులైన ప్రాణులమీద చూపే అవకాశం ఉన్న అసమసమాజంలో  అత్తలపై కోపం దుత్తలపైన, భర్తపై కోపం పిల్లలను చావబాదటం పైనా చూపే సంస్కృతిని గుర్తించి దానిని నిరసించడం ఇందులోకనిపిస్తుంది. అలాగే తల్లి లేడి హెచ్చరిక వినక మందనుండి విడిపోయి పులిబారిన బడిన లేడిపిల్ల కథ చెప్పి పెద్దలమాట వినమని పిల్లలకు ప్రబోధించింది రచయిత్రి.

 ఒకరి సుఖానికి, సౌకర్యాలకు అసూయపడి చెరుపదలచిన దుష్టులు ఎలా నష్టపోతారో చెప్పటానికిచిలుక-  కాకికథను చెప్పిన రచయిత్రి అత్తమామల, భర్తల మన్ననలు పొంది సుఖ సంసార లాభం పొందుతున్న స్త్రీలపట్ల అసూయతో నేరాలు చెప్పి కలహాలు పెట్టె వారి గురించిన హెచ్చరికను కథ ఫలితార్థంగా పేర్కొన్నది. ఇరుగుపొరుగుల తగాదాలను వినోదంగా తిలకించడం కూడా ప్రమాదాకరణమేనని చెప్పి వ్యర్ధ కలహాసక్తిని వదులుకోవాలని స్త్రీలను హెచ్చరించటానికి కాకి- కోవెల- గోరువంక పాత్రలుగా ఒక కథఅల్లి చెప్పింది లక్ష్మీ దేవమ్మ.సాంఘిక వస్తు కేంద్ర ఆధునిక కథ దిశగా సాగవలసిన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోవటం విషాదం.

తెలుగులో కృతి విమర్శన కు మొదటి స్త్రీ భుక్త లక్ష్మీదేవమ్మ. 1902  మే హిందూ సుందరి పత్రికలో కొటికలపూడి సీతమ్మ వ్రాసిన భక్తి మార్గము అనే పద్యరచన సమీక్ష ఇది.పుస్తకంలో 110 పద్యాలుఉన్నాయని, శైలి మృదు మధురంగా చదువుటకు సొంపుగా ఉంటుందని పేర్కొన్నది. ఆమె వ్రాసిన మరొక సమీక్ష కూడా  కోటికలపూడి సీతమ్మ రచనలపైనే.1902 ఆగస్టు హిందూసుందరిలో ఇది ప్రచురితమైన ఈసమీక్షలో సీతమ్మ వ్రాసిన లేడీజన్ గ్రే, అహల్యాబాయి అన్నరెండు గ్రంధాలను ప్రస్తావిస్తూ కవిత్వమునిర్దుష్టముగాను, బాలబోధగాను ఉన్నందుకుహర్షం వ్యక్తంచేసింది.శ్రీరాముని భార్య అయిన సీతాదేవి స్త్రీ నీతి గ్రంధాలను ఆనాడు వ్రాయలేకపోయిన కొరతను తీర్చుకొనటానికి ఇప్పుడు సీతమ్మ గారై జన్మించి ఉంటుందని చమత్కరించింది. సాహిత్య విమర్శకురాలు కావలసిన విదుషి అభ్యాసం ప్రారంభ దశలోనే ముగియటం ఒక విషాదం.

విన్నకోట లక్ష్మీ జోగమ్మ కూడా  లక్ష్మీ దేవమ్మ వలెనె హిందూ సుందరీ సాహిత్యాకాశంలో  ఒక ఏడాది పాటు వెలిగి మరి కనిపించకుండా పోయిన  నక్షత్రం. 1902 లో ఆమె రచనలు  వచ్చాయి. ఆమె ప్రధానంగా వచన రచయిత్రి. ఒక నాటిక, ఒక వ్యాసంఒక పాట   లభిస్తున్నవి. ఆమె వ్రాసిన పాట పూజ పాట.పూజాలు జేతును/ పూబోడిరొ నేడుపొందూగ శ్రీలక్ష్మీ సుంద రికి/  మంగాళ గౌరికి మాహేషురాణికి మల్లెలుమొల్లాల మరి విరజాజుల”  అనేపల్లవితో ప్రారంభమైన ఈపాటకు  చరణాలు మూడు.  “బాగూగ జోగాంబ  పాలన జేసెడు వరలక్షి నీకిదె వందనమిడెదను”  అంటూ  మూడవ చరణం స్వీయ నామాంకితంగా వ్రాసింది.

ఇక  విన్నకోట లక్ష్మీ జోగమ్మ వ్రాసిన నాటికఅవివేకపు వెంకమ్మ’ ( 1902 జులై & సెప్టెంబర్ సంచికలు)  ఆహ్లాదకరమైన  వ్యావహారిక వచనంలో సమకాలీన సాంఘిక  వాస్తవం వస్తువుగా వ్రాసిన మూడు రంగాల నాటిక ఇది. స్త్రీ విద్యా ప్రాధాన్యతను నొక్కి చెప్పే ఈ నాటకం అందుకు అవరోధంగా స్త్రీలలో ఉన్నఅవివేకాన్నితొలగింపచేయటాన్ని ఉద్దేశించింది. ఈనాటిక కథ ప్రవర్తించేది ఒకబ్రాహ్మణాగ్రహారంలో. దానిపేరు అవివేకాగ్రహారం. అవివేకం నాటకంపేరులో ఉండటమే కాదు అది ప్రవర్తించే స్థ లానికి   కూడా పేరు కావటం కొంత అతిశయోక్తి గా కనిపించినప్పటికీ అది ఆనాడు సామాజిక దుర్మార్గాలపట్ల రచయితలకు ఉన్న ఆగ్రహానికి సంకేతంగా భావించాలి.వీరేశలింగం పంతులు నుండి గురజాడ వరకు ప్రహసనాలలో, నాటకాలలో ఆనాడు అదే పద్ధతి కనబడుతుంది.విన్నకోట లక్ష్మీజోగమ్మను ఆ సామాజిక సాహిత్య  సంప్రదాయంలో భాగంగానే చూడాలి.

అవివేకాగ్రహారంలో అవివేకపు వెంకమాంబ ఇంటి ముందు వరండాలో ఒక మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీధిలోనుండి వచ్చినలక్ష్మిదేవమ్మకు వెంకమాంబకు మధ్య సంభాషణగా  మొదలైంది. వెంకమాంబ తనకొడుకు నారాయణ మామగారు పెళ్లయినా కూతురికి చదువు, సంగీతము చెప్పిస్తున్నాడని అది తనను నలుగురిలో తలెత్తుకోనీకుండా చేస్తున్నదని లక్ష్మీదేవమ్మ తో చెప్పుకొని బాధపడుతుంది. దానికి ఆజ్యం పోస్తున్నట్లుగా లక్ష్మీదేవమ్మ కొన్నేనగలు పెట్టుకొనటం, చిన్నబొట్టుపెట్టుకొనటం, పుస్తకం చదువుకొంటూ కూర్చోటం ఆ పిల్ల దోషాలుగా చెప్పి ఆలాంటి పిల్లే దొరికిందా నీకొడుక్కు చేసుకొనటానికి అని అడుగుతుంది. వాళ్ళిద్దరి సంభాషణలో అన్న కూతురిని కొడుక్కు చేసుకోవాలనుకున్న వెంకమాంబ మాట కాదని ఆమె భర్త ఈసంబంధం చేసినట్లు తెలుస్తుంది.ఇంట్లోతాను ఒంటరిని అయిపోయానని వెంకమాంబ దుఃఖపడుతుంది.

 ఆ సమయానికి వెంకమాంబ పినతల్లి కూతురు జానికమ్మ వాకిట ముందర బండిదిగుతుంది. అక్కగారి దుఃఖంచూసి ఆందోళన పడి అందరూ క్షేమం గాఉన్నారని తెలుసుకొని అయిన దానికి, కానీదానికి ఏడవటం ఏమిటని మందలిస్తుంది. చేసుకొన్న కోడలు తెలివైనదని, ఆమె తల్లి కూడా చదువుకున్నది కావటాన ఇంటివద్ద పంతులును పెట్టి చదివిస్తున్నారని మెప్పుకోలుగా అంటుంది. బిఎ పాసయిన జానికమ్మ భర్త స్వయంగా ఆమెకు ఇంటివద్ద  చదువు చెప్పిన విషయం నేరంగా ప్రస్తావించిన వెంకమాంబ మాటలకు నొచ్చుకొని చదువుకొని ఎవరైనా నీకు చేసేఅపచారం ఏముందని మందలిస్తుంది.చదువుకున్న ఆడవాళ్లు ఇంటిపనులు చేయరు అన్న అక్కగారి మాట తప్పని వాదిస్తుంది. రాత్రివంట ప్రయత్నాలకు ఇద్దరూ లోపలికివెళ్లటంతో మొదటిరంగం ముగుస్తుంది.

రెండవరంగంలో వెంకమాంబ భర్త భైరవరావు రావటం, కూతురికి మంగళగౌరీ వ్రతం చేయిస్తున్న వియ్యపురాలు పిలవటానికి వచ్చిందా అని ఆయన వేసిన ప్రశ్నకు ఆమె విరసపు సమాధానం ఇయ్యటం,దానికి తోడు  కోడలు వీధివాకిట్లో కుర్చీలో కూర్చుని చదువుకోవటం గురించిన ఆమె ఫిర్యాదులు అతనికి చికాకు కలిగించాయి. కోడలి నోముకు కూతుర్నితీసుకొని పొద్దున్నే వెళ్ళమని ఆయన చెప్పినమాట ఆమెనిరాకరించటం, కూతురు వచ్చి భోజనానికి రమ్మనటం ఒక ఘట్టం అయితే, అలిగి పడుకున్న ఆక్కగారిని జానికమ్మ వచ్చి తగుమాటలాడి భోజనానికి లేవదీయటం మరొక ఘట్టం.

మూడవ రంగంలో జానికమ్మ అటుబావగారికి, ఇటు అక్కగారికి సర్ది చెప్పేప్రయత్నం చేస్తుంది.ఆడవాళ్ళకు చదువు చెప్పించకపోవటం వల్ల అవివేకులై ప్రవర్తిస్తున్నారని అందువల్ల తప్పు ఆడవాళ్లది కాదు అని అక్కను వెనకేసుకొని వస్తున్నట్లుగా  బావగారితో మాట్లాడుతుంది. చెల్లెలు తనవైపే మాట్లాడుతున్నా చదువు అనే మాట చెవినబడేసరికి వెంకమాంబ చిరచిరలాడుతుంది. ఆమె మాట్లాడిన మాటలకు విసుక్కొంటూ భర్త ఈవిధమైన కాపురం కంటే సన్యాసం మేలు అంటూ అక్కడి నుండి  వెళ్ళిపోతాడు. భర్తల పట్ల భార్యలు మెలగ వలసిన పద్ధతి గురించి జానికమ్మ అక్కగారికి బోధిస్తుండగా వియ్యపురాలిని గౌరీవ్రతానికి పిలవటానికి విజయలక్ష్మి వస్తుంది. జానికమ్మ విజయలక్ష్మి కోడలి  చదువు, సంగీతాల  గురించి మాట్లాడుతుంటే కోపంతో వెంకమాంబఆట ఒకటి తరువాయిఅని ఈసడించుకొన్నది. చదువుకున్న వాళ్ళందరూ పాడావు తారనుకొనటం వెనకటికి అరిశెల కుండతో ఐశ్వర్యం వస్తుంది అని నమ్మిన దుర్మార్గపు దుర్గమ్మ కథలాగున్నది అని జానికమ్మ అన్నమాటకు విజయలక్ష్మి ఆకథ చెప్పమని వినటానికి ఉత్సాహ పడింది. ఈకథ నాకొరకేనా ఏమిటి ? అని  సాధిస్తున్నట్లుగా వెంక మాంబ అన్నమాటకు జానికమ్మ లోకంలోనీవుఒక్కదానివే కాదు, నీలాంటి వారు ఇంకా చాలా మంది అని సమాధానం చెబుతూ కథ చెప్పటానికి ఉపక్రమించింది.

 రాజాశ్రయం పొంది తన దారిద్య్రానికి ఒక పరిష్కారం కనుక్కోవాలని ఒకబీద బ్రాహ్మడు రాజుగారికి కానుకగా ఇమ్మని ఇచ్చిన అరిసెలకుండతో అడవి  మార్గాన పోతూ ఒకచోట విశ్రమించగా ఆమార్గాన పోతున్న రాజు ఆకలి బాధకు ఆకొత్తకుండలోని అరిసెలు తీసుకొని తిని కానుకగా అందులో ఉంచి పోయిన పచ్చల హారం అంతిమంగా వారిజీవనానికి ఏలోటులేని ఏర్పాటుగా ఫలితం ఇచ్చింది. ఇది తెలుసుకొని తాను కూడా అటువంటి ప్రయోజనం పొందాలని ఒక దురాశాపరురాలు భర్తకు అరిసెల కుండ ఇచ్చి అడవికి పంపితే అతను ఇంట లేడని దొంగలు పడి సర్వం దోచుకొనిపోవటం ,అడవిలో పాము కరిచి అతను మరణించటం రెండు విషపరిణామాలు ఏకకాలంలో సంభవించాయి అని కథచెప్పి ఇంగితజ్ఞానం లేకభర్త మాటలు వినక స్త్రీలు అవస్థలు పడతారని సారం విప్పిచెప్పి ముగించింది జానికమ్మ . నిజానికి ఈనాటికలో ఈకథ అనవసర ప్రసంగమే. స్త్రీలకు ఏవోనీతులు బోధించాలన్నతపనతో భుక్తలక్ష్మీదేవమ్మ వంటివాళ్ళు విడిగా కథలు వ్రాస్తే ఈమె నాటిక లో అంతర్గత  కథా కల్పన ద్వారా ఆప్రయోజనాన్నిసాధించింది అనుకోవాలి.

 ‘ఎన్నికథలుచెప్పినా దూషించినా నన్నేకదా చదువుకొన్నవాళ్ళతో సమానంగాకబుర్లు చెప్పటం ఎవరితరం’  అని నిష్టూరమాడుతున్న అక్కగారితో జానికమ్మఅదేకదా చెప్పేది! నువ్వుచదువుకోక, నీకూతురికి చదువుచెప్పించక , పైగా చదువుకొంటున్న కోడలి చదువుకూడా పాడు చేయాలను కుంటున్నావు అది న్యాయంకాదు అన్నట్లుగా హెచ్చరించింది. అది నీకు ప్రయోజనకారి కాదు అని సూచించింది. అచ్చమాంబగారి ప్రస్తావన తెచ్చి ఆమెచదువుకొనటం వల్లనే కదా స్త్రీల మన్ననలను అందుకొంటున్నది అని చెప్పింది. అచ్చమాంబ మాటరాగానే వెంకమాంబ నిష్టుర వాక్యాలు మానిసాధు స్వరంతో అవును ఆమెను చూచినప్పటినుండి స్త్రీవిద్య అంటేముచ్చట కలుగుతున్నది అంటూ కోడలి చదువుకు సమ్మతి తెలిపింది.కూతురిని బడికి పంపటానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. వెంకమాంబ పాత్ర లో ఈమార్పు హఠాత్పరిణామంగా అనిపించినా స్త్రీలను సహనంతో స్త్రీవిద్యానుకూలురిని చెయ్యాలన్నలక్ష్యానికి అనుగుణమైన ముగింపులు ఇలా తప్ప మరొకలా ఉండవు. 

            స్త్రీల అవివేకానికి , మూర్ఖత్వానికి మూల కారణం వాళ్లకు చదువు లేకపోవటమే అని ఈ నాటికలో గట్టిగానే చెప్పింది రచయిత్రి. ఆడవాళ్ళ అవివేకానికి చదువులు చెప్పించని మగవాళ్ళు , వాళ్ళను నడిపే సమాజం కారణం అని ఎత్తి చూపగల వివేకం గల స్త్రీగా  జానికమ్మపాత్రను సృష్టించింది. చదువుకొన్న స్త్రీలు అత్తమాట వినక, ఇంటిపని చేయక చెడిపోతారన్న అభిప్రాయం ఆనాటి సమాజంలో ఏదైతే ఉందో దానికి ప్రతినిధిగా వెంకమాంబ ను నిలిపి ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించే పని జానికమ్మ పాత్రద్వారా పూర్తి చేసింది. జానికమ్మ చదువుకున్నది. అయినా ఇంటి చాకిరీ అంతా ఆమె చేస్తుంది. ఆ మాట చెప్పి చదువుకున్న కోడలి గురించిన ఆక్కగారి సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది.  ఆ జానికమ్మ చేతనే పెనిమిటితో పోట్లాడే స్త్రీకి సుఖం లేదని సూచించింది రచయిత్రి. మగువల సర్వ సుఖాలకు కారణభూతులు మగడెనని , కార్యేషు దాసీ శ్లోకాన్ని పేర్కొంటూ స్త్రీ భర్తను ఎలా సేవించాలో బోధపరిచే పని కూడా చేయించింది. అంటే చదువుకొన్న స్త్రీలు భర్తను మరింత తెలిసి సేవిస్తారని అందువల్ల వాళ్ళ చదువులకు అభ్యంతర పెట్టనక్కరలేదన్న భరోసా కల్పించిందన్నమాట. స్త్రీలు చదువుకొంటే పతివ్రతల కథలు చదివి తామూ పతివ్రతలగా మెలగాలన్న ఆదర్శం పెంపొందించు కొంటారు అన్న వీరేశ లింగం గారి అభిప్రాయాన్ని ఆ రకంగా ఆకాలపు స్త్రీల సాహిత్యం బాగానే ప్రచారంలో పెట్టింది. 

            అలాగే ఆనాటి స్త్రీల సాహిత్యంలో సమకాలీకురాలైన భండారు అచ్చమాంబ స్త్రీవిద్య కు ఒక ఆదర్శ నమూనాగా ప్రస్తావించబడటం, స్త్రీవిద్యా ప్రబోధకాలైన ఆమె ప్రసంగాల ప్రభావాన్ని నొక్కి చెప్పటం తరచు కనిపిస్తుంది. ఈనాటికలోనూ విన్నకోట లక్ష్మీ జోగమ్మ అచ్చమాంబ ను ప్రస్తావించటం గమనించవచ్చు. స్త్రీవిద్య అంటే మండిపడే వెంకమాంబ అచ్చమాంబ పేరు ప్రస్తావనకు రాగానే, ఆమెపట్ల గౌరవాన్నిప్రకటించిస్త్రీవిద్యకు అనుకూలంగా మారినట్లు నాటికను ముగించటం ద్వారా సమకాలపు స్త్రీవిద్యా ఉద్యమాన్ని, అందులో అచ్చమాంబ వంటివారి ఆచరణను సాహిత్యచరిత్రలో నమోదు చేసినట్లయింది.

            విన్నకోట లక్ష్మీ జోగమ్మ వ్రాసిన వ్యాసంస్త్రీమూర్ఖత’.భర్త నగలు చేయించలేదని, అత్తామామామల వల్ల సుఖంలేదని స్త్రీలు ఏదో ఒక చింతతో జీవితాన్ని వృధాచేసుకొనటానికి  విద్య లేకపోవటమే కారణమని ఈవ్యాసంలోనూ ఆమెపేర్కొన్నది. ఇరుగు పొరుగుతో అధికప్రసంగాలతో పొద్దుపుచ్చటం కంటే భక్తి కలిగి భగవత్ సంబంధ గ్రంధాలను చదవటం, విద్యావంతులైన స్త్రీల చరిత్రలు చదివటం స్త్రీలకు ఉపయోగకరమని సూచించింది.దుర్గుణాలు నశించటానికి విద్యను మించిన మందు లేదని చెప్పింది. స్త్రీకి మంచిగుణము సత్ప్రవర్తన, ఖ్యాతి విద్యవల్లనే సమకూరుతాయని నొక్కిచెప్పింది.సర్వజనాళికిని నేకాభిమతంబున వర్తింపఁ జేయగలందులకు సరస్వతినే అనేక విధంబుల ప్రార్ధించెదనుఅని వ్యాసాన్ని ముగించిఅందరికీ సమంగా విద్యఅన్నభావనను జెండాగా ఎగురవేసింది విన్నకోట లక్ష్మీ జోగమ్మ.

 

--------------------------------------------------------------------------------------

 

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -11

1902 ప్రారంభమైన హిందూ సుందరి పత్రిక మధ్యతరగతి తెలుగు గృహిణులను ఎందరినో రచయితలను చేసింది. అలా రచయితలు అయినవాళ్ళల్లో కిడాంబి కనకమ్మ, గంటి జోగమ్మ,ఆ.  లక్ష్మీ కాంతమ్మ ఉన్నారు. వంటల నుండి సామాజిక సంబంధాల వరకు అన్నీవాళ్లకు రచనా వస్తువులు అయినాయి. ముగ్గురూ 1902 నుండే రచనలు ప్రారంభించినా కిడాంబి కనకమ్మ ఒక్కతే 1910 వరకు రచనా వ్యాసంగంలో కొనసాగింది.

కిడాంబి కనకమ్మ సాహిత్య సృజన వ్యాసంగం మంగళహారతి రచనతో మొదలైంది.మంగళమని పాడి మందయానలుగూడి పొంగుచు హారతులెత్తరేఅంటూ మాధవుని గురించి వ్రాసిన (హిందూసుందరి, నవంబర్  1902) మంగళ హారతి ఇది. పొంగలి చేసే రెండు విధానాలగురించి కూడా ఆమె వ్రాసింది( సెప్టెంబర్ - అక్టోబర్ 1903). ఇవి కాక ఈమె వ్రాసిన వ్యాసాలు మూడు లభిస్తున్నాయి. వాటిలో రెండు సింహాచల క్షేత్రము ను గురించినవి.మరొకటి ఐకమత్యం గురించిన వ్యాసం. స్త్రీలందరికీ ఆనాడు ఐకమత్యం గురించి చింతన సామాన్యాంశం. స్త్రీలకు అభ్యుదయాన్ని కూర్చే సంస్కరణ విషయాలపట్ల స్త్రీలందరికీ ఒక అంగీకారం కుదిరితే తప్ప సంస్కరణోద్యమ గతిక్రమం వేగాన్నిఅందుకోలేదు .ఆ విషయం తెలిసిన సంస్కరణోద్యమ నాయకులు స్త్రీలు సంఘటితమై సమావేశాలు పెట్టుకొని ఏక కంఠంతో సంస్కరణలను ఆహ్వానించగల చైతన్యం పొందాలి అని ఆశించారు.దానికి అనుగుణంగా స్త్రీలు కార్యరంగంలోకి ప్రవేశించనూ ప్రవేశించారు. ఆ క్రమంలో వ్రాయ నేర్చిన ప్రతిస్త్రీ ఐకమత్యం ఎంతఅవసరమో ప్రబోధిస్తూ వ్రాసారు. కిడాంబి కనకమ్మ కూడా అలాగే వ్రాసింది.( సెప్టెంబర్ 1910) 

బాలికల యొక్క వచ్చీ రాని  మాటలకు సంతోష పడినట్లుగా కొద్దిలో కొద్దిగా చదివి తాను వ్రాస్తున్న చిన్న వ్యాసంలోని తప్పులను మన్నించి దయతో చదవమని పండితులను కోరుతూ కనకమ్మ ఈ వ్యాసం ప్రారంభించింది. ఒకరి కంటే ఎక్కువగా వుండే మనుషులలో ఐకమత్యం లేకపోతే సుఖంలేదని, ఐకమత్యం అంటేఒకరితోఒకరు అనుకూలంగా చేరటం అని, కలుపుకోలు మనుషులలో ఉండవలసిన లక్షణం అని పేర్కొన్నది. రెండు పదార్ధాల చేరిక వల్లనే నూతన కార్యం ఏర్పడుతుందని ఐకమత్యం విశిష్టతను తార్కికంగా నిరూపించే ప్రయత్నంచేసింది. వస్తుజ్ఞానం ఒక్క ఇంద్రియంవల్ల సమకూడదు అని, ఒకటికంటే ఎక్కువ సాధనాలు లేకుండాఏకార్యమూ సిద్ధించదని చెబుతూ వ్రాయటం అనే కార్యానికి చేతివేళ్ళు కలం, కాగితం, మసి( సిరా) అనే బహుళసాధనాలు కావాలి కదా అని ఉదాహారణలతో ఐకమత్యం యొక్క అవసరాన్ని నొక్కిచెప్పింది. అనుకూలాభిప్రాయాలు కల స్త్రీ పురుషుల మధ్య ఐకమత్యం అభిలషణీయం అనిఅభిప్రాయపడింది.ప్రత్యేకించిఅబలత్వం జన్మసిద్ధమైనస్త్రీలు”  ఐక్యంగా ఉండాల్సిన అవసరం మరింత ఉందని అభిప్రాయపడుతూ ఎంతపనికిమాలిన వస్తువులైనా  కలిసి మెలిసి ఉన్నప్పుడు కొంత శక్తిని పొందుతాయి కదా అని తన అభిప్రాయాన్ని సమర్ధించుకొన్నది.

 “ చేరి యుండుటగదా చేయును కార్యములు కై వ్రేలులయిదును

   కాంతలార, చిన్నిచీమల బారు చేరి పూనికతోడ నడచిన సంద్రం

   బు గడచు ( గాదె, కన్నుల కనరాని కడుచిన్ని యణవులు కొండ 

   యై గన్పట్టు  చుండు గాదె ,చులకన యగు దూది కలిసి దారంబయి

   పెనగొని పగ్గమై పెద్ద తేజి /గీ  / బట్టి బంధించుటది కూర్పు పనియె  

    కాదె, నెలతలట్లన తలపుల గలిసికొనిన , విద్దె సుగుణంబువినయం 

    బు వీరి కరయ( , గలిగి సత్కీతిన్ పాత్రలై , మెలగరాదెఅని ఒక సీస పద్యంలో  ఐక్యతా లక్షణాన్ని, ఐక్యతా ఫలితాన్ని నిరూపించి చెబుతూ స్త్రీలను ప్రబోధించింది కనకమ్మ. 

దైహిక యాత్ర దైన్యం లేకుండా సాగించాలంటే చెడ్డ తలపులు ఎప్పుడూ కలుగకూడదు. ఆలోచనలు మంచివై ఉంది కీర్తి కరమైన కార్యాలకు ప్రేరణగా ఉండాలి. ఐహిక ధర్మవర్తనం అలవడి ఉండాలి . అట్లా చేయమని శ్రీహరిని వేడుకొనే ఒక ఉత్పలమాల పద్యంతో ఆమె ఈ వ్యాసాన్ని పూర్తి చేసింది. ఐక్యతా తత్వాన్ని ఇంత సరళ సుందరంగా  నిరూపించిన వ్యాసం మరొకటి కనబడదు. 

మిగిలిన రెండు వ్యాసాలు సింహాచల క్షేత్రాన్ని గురించి వ్రాసినవి. వాటిలో మొదటి వ్యాసం 1903 ఫిబ్రవరి సంచికలో వస్తే రెండవది మూడేళ్ళ ఎనిమిది నెలలకు 1906 నవంబర్ సంచికలో వచ్చింది. సింహాచల క్షేత్రం గురించి వివరంగా వ్రాయాలన్న ఉద్దేశంతో కనకమ్మ పని ప్రారంభించింది. సింహాచల  క్షేత్ర మహత్త్యము అనే మొదటి వ్యాసంలో దాని పౌరాణిక చారిత్రక విశేషాలను వివరించింది. ప్రహ్లాదుని రక్షించటానికి  నరసింహుడు ఈ కొండమీదే ఉద్భవించాడని, ఆ తరువాత ప్రహ్లాదుడు చేసే పూజలు అందుకొంటూ నరసింహ స్వామి ఇక్కడే ఉండిపోయాడని, ఎందుకనోఅవి ఆగిపోయి అక్కడ పెరిగిన అడవిలో దేవుడు మరుగునపడిపోయాడని పురూరవ చక్రవర్తి దానిని పునరుద్ధరించాడని ఒకఐతిహ్యం ఉంది.దానిని గురించి చెప్పి ఊరుకోలేదు ఆమె.శాసనాధారాలతో పోల్చి ఆ పౌరాణిక కథాంశంలోని సత్యాసత్యాలను నిగ్గుతేల్చే ప్రయత్నం చేసింది.ఇక్కడ కనకమ్మ అచ్చమైన చరిత్రకారుల పద్ధతిని అనుసరించింది.అది పురూరవ చక్రవర్తి కట్టించిన గుడి అనటానికి నిదర్శనాలు ఏవీ లేవంటుంది.

పురూరవుడు వేదకాలపు వాడుఅని చెప్తారు.వేదాలు, పురాణేతిహాసాలలో అతని ప్రస్తావన ఉంది.అతని పుట్టుక గురించి ,తల్లిదండ్రుల గురించి ,రకరకాల  ఐతిహ్యాలు ఉన్నాయి. ఊర్వశికి అతనికి మధ్య సంబంధం సాహిత్యవస్తువైంది. అది అలా ఉంచితే సింహాచల క్షేత్రం అంత ప్రాచీనమైనది అనటానికి శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేకపోవటం కనకమ్మ గుర్తించింది. దేవాలయ ప్రాంగణంలోని శిలాశాసనం ప్రమాణంగా అందులో పేర్కొనబడిన శ్రీకృష్ణదేవరాయల తండ్రి అయిన నృసింహదేవరాయల కాలంలో నిర్మించబడి, నిర్వహణకు గాను భూమి దానం చేయబడిన విషయాలను బట్టి ఆనాటికి ఆ ఆలయం కట్టి 900 సంవత్సరాలు గడిచినట్లు పేర్కొన్నది. వ్యాసాన్ని ముగిస్తూ ఇక్కడ జరిగే ఉత్సవాదుల వైభవాల గురించి ముందు ముందు వ్రాస్తానని చెప్పినదానిని బట్టి సింహాచల క్షేత్రంగురించి సమగ్రంగా వ్రాసే బృహత్ ప్రణాళిక ఏదో ఆమె వేసుకున్నట్లు కనబడుతుంది. కానీ 1906 నవంబర్ సంచిక వరకు ఎందుకో దానికి కొనసాగింపు వ్యాసం ఏదీ కనబడదు. అందుకు సమాధానం ఆ వ్యాసం చివర దొరుకుతుంది.

ఈరెండవ వ్యాసంలో కనకమ్మ విశాఖ పట్టణపు మండలంలోని సింహాచలానికి రైల్వేస్టేషన్ నుండి బండిపై ఊళ్లోకి వెళ్ళగానే ప్రభుత్వం వారు కట్టించిన హవేలీ, దానికి దక్షిణాన పెద్ద పూలతోట, దానికి తూర్పు దక్షిణాలలో పండ్ల తోటలు, హవేలీకి తూర్పున కొండపైకి వెళ్లే మెట్లు కనిపిస్తాయని ఆలయంలో ప్రవేశించే పర్యంతం అడుగడునా కనబడే దేవాలయాలు, స్నానఘట్టాలు, తోటలు వాటి మధ్య  దూరాన్ని  గజాలలో, ఎక్కవలసిన  మెట్ల సంఖ్యను  కూడా  చెబుతూ  ఆమె వ్రాసిన తీరు చేయిపట్టి  మనలను ఆ మార్గం గుండా, ఆ మెట్ల మీదుగా  తీసుకువెళుతూ చుట్టుపక్కల దృశ్యాలను చూపిస్తూ చెప్తున్నట్లుగా ఉంటుంది.ఆ క్షేత్రానికి వచ్చేవాళ్ళు  సౌకర్యవంతంగా దర్శనం చేసుకొని తీర్ధప్రసాదాలు సేవించటానికి మార్గదర్శకంగా వుండే సూచనలు కూడా అందులో ఉన్నాయి. యాత్రా చరిత్ర రచనలకు చక్కని నమూనా గా చెప్పుకోదగిన రచన ఇది. 

ఈ వ్యాసం ముగింపులో స్వామివారికి జరిగే నిత్యోత్సవ,పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్స రోత్సవాల గురించి తాను ఇదివరలో వ్రాసి పంపిన వ్యాసం కూడా ప్రచురించవల్సినదిగా కోరింది. ఆలయం చుట్టూ ఉండే శాసనాలను ఎత్తి వ్రాసి పంపుతున్నాను అని వాటిని కూడా ప్రచురించమని కోరింది. అక్కడ స్వామివారికి చేసే ప్రసాదాల తయారీ పద్ధతి గురించి కూడా వ్రాసి పంపుతానని చెప్పింది. ముగింపులో చెప్పిన ఈ వాక్యాలు చాలా ముఖ్యమైనవి. ఒక ఆలయం గురించి మూడు నాలుగేళ్లు ఒక లక్ష్యంతో శోధన చేయటం, సమాచారం సేకరించటం ఆనాటి ఆడవాళ్లకు అంత సులభమైన పని కాదు. సులభం కాని పనిని చేపట్టింది అంటే అది ఆ పని పట్ల ఆమె ఆసక్తికి, ఇష్టానికి నిదర్శనం. మూడు నాలుగేళ్లు ఆలయానికి పదే పదే వెళ్లి విషయాలు తెలుసుకొనే వెసులుబాటు ఉన్నదంటే ఆమె విశాఖ మండలానికి చెంది, ఆ సమీప ప్రాంతాలలో నివసిస్తున్నదని అనుకోవచ్చు. శాసనాలు ఎత్తి వ్రాసుకొని వాటిని వ్యాఖ్యానించగల జ్ఞానం ఆమెను మేధావుల కోవకు చేరుస్తుంది. బహుశా తెలుగునాట తొలి శాసన పరిశోధకురాలు కిడాంబి కనకమ్మే కావాలి. 

1902 లో పాటల రచనతో ప్రారంభించిన గంటి  జోగమాంబ విశాఖ పట్టణ వాసి. రామరామ నన్ను బ్రోవరారా, నన్ను బ్రోవరావా నారదాదినూత, సమయము మంచిదిరా నను బ్రోవరా అనే మూడు పాటలు వ్రాసింది (జనవరి 1902? 1903? ) జోగమాంబ అని స్వీయ నామాంకిత ముద్రతో ముగుస్తాయి ఈ పాటలు. ప్రతి పాటలోనూ ఆమె తనను ధర వైశాఖ పురీ వాసురాలిగా చెప్పుకొన్నది. ఆ రకంగా ఇటువంటి పాటలవల్ల స్త్రీల గురించిన స్వల్పమైన సమాచారం అయినా లభించింది. అదే సంతోషం. 

హిందూ స్త్రీల గుట్టు ( ఏప్రిల్ 1903) కథ లాగా మొదలై వ్యాసం వలె ముగిసిన రచన. ఆడవాళ్ళ చాపలత్వాన్ని కనిపెట్టాలని ఒక బ్రాహ్మణుడు నల్లకాకికి తెల్ల కాకి పుట్టిందని అందువల్ల రాజుగారికి ప్రాణాపాయమని చెప్పిన మాటను భార్య నీలాటిరేవు దగ్గర స్త్రీలకు చెబితే అది ఆనోటా ఈ నోటా పడి చివరకు రాజుగారి దగ్గరకు వచ్చిందని ఆయన అలా చెప్పిన ఆ బ్రాహ్మణుడిని పిలిపించి తక్షణం పరిహారం చెప్పకపోతే తలతీయిస్తానని హెచ్చరించాడని అందులో నిజం లేదని , స్త్రీల మనస్తత్వం తెలుసుకొనటానికి తానే అట్లా కల్పించి చెప్పానని రాజుగారికి చెప్పి ఒప్పించాడని ఆ కథను చెప్పి రచయిత్రి బుద్ధిబలం వల్ల బ్రాహ్మణుడు ప్రాణాపాయం తప్పించుకున్నాడని, అది లేకపోవటం వల్లనే అతని భార్య ముందువెనుకలు చూడక భర్త ప్రాణానికి ఆపద తెచ్చే పని చేసిందని వ్యాఖ్యానించి చెప్పింది. మనిషికి మంచి ఏదో, చెడు ఏదో తెలియటానికి శిక్షణ అవసరం అని అది స్త్రీ పురుషులిద్దరికీ అవసరమేనని విద్యాప్రాధాన్యతను ప్రతిపాదించింది. విద్య లక్ష్య డబ్బు సంపాదన అనుకొనటం తప్పని జ్ఞానం నిరంతరం పొందవలసినదే అన్న ఎరుక కలిగి ఉండాలని స్త్రీ విద్య ను ప్రోత్సహిస్తూ వ్యాసం ముగించింది. తాను చెప్పదలచుకొన్న విషయానికి తగిన దృష్టాంతాలు సమకూర్చుకొని ఒప్పించేట్లు రచన చేయటం జోగమాంబ పద్ధతి. 

గంటి జోగమాంబ సుగుణవతి - దుర్గుణవతి అనే కథను వ్రాసింది ( 1903 సెప్టెంబర్ & అక్టోబర్ ) పేరమ్మ వితంతువు. భర్త ఇచ్చిపోయిన ఆస్తితో బతుకుతూ ఇద్దరు కూతుళ్లను పెంచింది.  సుగుణవతి  దుర్గుణవతి ఇద్దరూ తన పిల్లలే అయినా దుర్గుణవతిని గారాబం చేసి సుగుణవతిని తిడుతుండేది. పనులన్నీ సుగుణవతివే. బావికి నీళ్లు తేవటానికి వెళ్ళినప్పుడు దాహమడిగిన అవ్వకు నీలతోడి పోసిన ఆమె మంచితనానికి ప్రతిఫలంగా నోరు విప్పి మాట్లాడినప్పుడల్లా మాటకొక వజ్రం, ముత్యం రాలుతాయని వరం పొందింది. దుర్గుణవతి కూడా అటువంటి లాభంపొందాలని తల్లి బతిమాలి మర్నాడు బావికి నీళ్లు తేను ఆమెను పంపింది. ఆమె అవినయ రీతికి దక్కిన వరం మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక పాము, ఒక తేలు నెల రాలటం. దీనికంతటికీ కారణం సుగుణవతి అని ఆమెను దండించబోతే అడవులలోకి పారిపోయిందని అక్కడ ఒక రాజపుత్రుడు ఆమెను చూసి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని, ఇక్కడ దుర్గుణవతి తల్లి వెళ్లగొడితే అడవులు పట్టి పోయిందని కథ. ఇది చెప్పి సుగుణములు కలిగి ఉండటందుర్గుణాలు కలిగి ఉండటం ఎటువంటి వ్యత్యాస ఫలితాలను ఇస్తాయో చూడండని హెచ్చరించింది రచయిత్రి. ఇది ఆధునిక కథ కాదు. అద్భుత కాల్పనిక కథ. మంచి గుణములను అభివృద్ధి చేసుకోనాలని ఎవరికైనా చెప్పటం అవసరమే. తల్లుల మూర్ఖత్వం, పెంపకపు తీరు కూడా పిల్లలు సద్గుణాలు అలవరచుకొనటానికి అవరోధం అవుతుందని ఈ కథ మరొక నీతిని కూడా సూచిస్తున్నది. అదలా ఉంచితే ఎవరయినా పిల్లలకు సుగుణ అని పేరుపెట్టుకోవచ్చు కానీ దుర్గుణ అని చూస్తూ చూస్తూ పెట్టరు. సుగుణవతి పేరుకు తగ్గట్టు మంచిది కావటం, దుర్గుణవతి పేరుకు తగ్గట్టు చెడ్డది కావటం అతిశయోక్తి తప్ప వాస్తవం కాదు.  

ఆ. లక్ష్మీ కాంతమ్మ రచనలు రెండు మాత్రమే లభించాయి. రెండూ వ్యాసాలే. ఒకటి స్త్రీవిద్య గురించి ( 1902 నవంబర్ ). జ్ఞానం విద్యామూలం అనిచెప్పి దేశంలో స్త్రీవిద్య పట్ల పట్టింపు లేకపోవటాన్ని గురించి బాధపడింది. విద్యలేని స్త్రీలు జ్ఞాన శూన్యులై భర్తలను సంతోషపెట్టే విధం తెలియక సంసారాలు పాడు చేసుకొంటారని చెప్పింది. విద్యలేని స్త్రీలు కన్నపిల్లల కు కూడా మేలు చేయలేరని స్త్రీలు విద్యాధనం సంపాదిస్తే ఇంటికీ బంధుమిత్రులకు కూడా కీర్తి తెస్తుందని అభిప్రాయపడింది. స్త్రీలు అలంకారాలమీద మోజు వదులుకోవాలని కూడా హెచ్చరించింది. మనుషులకు నిజమైన అలంకారాలు నగలు జుట్టు చక్కగా సంస్కరించుకొనటం కాదు మంచి మాట నిజమైన అలంకారం అని వాగ్భూషణమే అసలు భూషణం అని చెప్పే సంప్రదాయ హితోక్తిని ఉటంకిస్తూ స్త్రీలు చదువు కోవాలని ఆకాంక్షించింది. రాజమండ్రిలో కొటికలపూడి సీతమ్మ స్త్రీవిద్యా వ్యాప్తికి చేస్తున్న కృషిని గౌరవంతో ప్రస్తావించి  ఈ వ్యాసాన్ని ముగించింది. 

గంజాం జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్న ఓడ్రస్త్రీల గురించి వ్రాసిన వ్యాసం మరొకటి (1903, ఏప్రిల్) చదువు, నాగరికత లేనివాళ్ళని వాళ్ళ వేష భాషలను, ఆహారపుటలవాట్లను తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళవల్ల ఆజిల్లాలో తెలుగు స్త్రీలకు కూడా గౌరవంలేకుండా పోతున్నదని ఈవ్యాసంలో ఆమె పేర్కొన్నది. భిన్న సంస్కృతుల పట్ల అసహనం, ప్రాంతీయ దురభిమానం, ఆధిక్యతా భావన బీజరూపంలో కనబడతాయి ఈవ్యాసంలో. స్త్రీల ఐక్యతను గురించి పదేపదే అనేకులు చెప్తున్న ఆ కాలపు సంస్కృతికి భిన్నమైన వ్యక్తీకరణ ఇది.

 

                                                   ----------------------------------

 

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -12 

ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఆనవాళ్లు లేకుండా మరుగున పడిన మహిళలు వంద సంవత్సరాల నాటి  పాత పత్రికలు తిరగేస్తే  కొద్దిపాటి రచనలతో తమ  ఉనికిని చాటుకొంటూ  మనలను పలకరిస్తారు. ఆలోచన మనిషి అస్తిత్వానికి గుర్తు. మేము ఆలోచిస్తున్నాం అని చెప్పే వాళ్ళ రచనలు అపురూపమైనవి.అటువంటి ఇద్దరు రచయితలు పి .కౌసల్య, వెంపల శాంతాబాయి. వాళ్ళ రచనలను గురించి మాట్లాడుకొందాం. 

పి .కౌసల్య అంటే పుల్లాభొట్ల కౌసల్య. ఆఇంటిపేరు పుట్టింటిదో అత్తింటిదో తెలియదు. ఆమె ఊరి పేరు కూడా ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఆమెవి మూడు వ్యాసాలూ , ఒక కథ లభిస్తున్నాయి. మొదటి వ్యాసం 1901 నాటిది. జూన్ నెల జనానా పత్రికలో అచ్చు అయిన ఆవ్యాసం పేరుఆహా స్త్రీవిద్యకెంత గతి పట్టినది’.దేశాభివృద్ధి కొరకు, జ్ఞానాభివృద్ధికొరకు చేయవలసిన ప్రయత్నాలలో స్త్రీలకు విద్య నేర్పటం ప్రధానం అంటుంది ఈవ్యాసంలో కౌసల్య.ప్రధమ పట్టపరీక్షలలో ఉత్తీర్ణులైన బాలురు ప్రతిజిల్లాలోనూ లెక్కకు మిక్కిలిగా ఉండగా రాజధానిమొత్తంలో బాలికలు ఒకరిద్దరు కూడా లేకపోవటం గురించి, బాలురపాఠశాలలు వేలలో ఉండగా వాటిలో బాలికా పాటశాలలు నూరోవంతు కూడా లేకపోవటాన్ని గురించి ఆందోళన పడింది. విద్యారంగంలో స్త్రీపురుష వివక్షను అంత నిశితంగా గమనించి చెప్పటం ఆ నాటికి విశేషమే. స్త్రీవిద్య హీన దశలో ఉండటానికి రెండు కారణాలను ఆమె గుర్తించింది. అవి 1. చదువుకొన్న మగపిల్లలవలె చదువుకొన్న ఆడపిల్లలు ద్రవ్యం సంపాదించి సహాయం చేయలేకపోవటం. 2. స్త్రీలు చిన్న వయసులోనే పాఠశాలలను విడువవలసి రావటం. రెండవ కారణం బలీయంగా ఉన్నదని ఇట్టి పరిస్థితులలో జనానా పాఠశాలలు స్థాపించి స్త్రీలకు విద్య నేర్పించవలసి ఉన్నదని అభిప్రాయపడింది. అవి ఇప్పుడు ఎన్ని బాలికా పాఠశాలలు ఉన్నాయో అన్ని జనానా పాఠశాలలు కూడా ఉండాలని దేశాభిమానులు , విద్యావంతులైన ధనికులు అందుకు పూనుకోవాలని పిలుపు ఇచ్చింది.  ఇది తప్ప ఆమె మిగిలిన రచనలు అన్నీ హిందూసుందరి పత్రికలో ప్రచురితం అయినవే. 

కాలమునుసద్వినియోగమునకు దెచ్చుట ( ఫిబ్రవరి 1903) అనేవ్యాసంలో కాలం బంగారం కంటేవిలువైనదని, ఉపయుక్తమని అంటారు ఆమె. కాలాన్ని శ్రమతో సద్వినియోగం చేస్తే శరీర దారుఢ్యం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతాయని చెప్పి  అవయవాలను శ్రమజీవనంతో శక్తిమంతం చేసుకొనటం వివేకం అంటుంది. ఇది చెప్పి కాలాన్ని సద్వినియోగం చేయటం లో పుస్తకాలు చదవటం ఒకటని చెప్పింది. చెడు గ్రంధాలను దరికి రానీయక పుణ్యస్త్రీలచరిత్రలను, సంఘక్షేమానికి , దేశక్షేమానికి ఉపకరించే పుస్తకాలు చదవాలని సూచించింది.వినోద హాస్య ప్రధాన రచనలు చదవవచ్చు కానీ ఎక్కువకాలం వినోదాలతో పొద్దుపుచ్చటం సరి కాదు అన్నది. కొక్కోకము  మొదలైన శృంగార గ్రంధాలను పాడు గ్రంధములు అనిపేర్కొని వాటిని  అసలే చదవకూడదని చెప్పింది.అవి మనస్సులను చెడు వర్తనముల వైపు మళ్లిస్తాయి కనుక పరిహరించదగినవి అనిఅభిప్రాయపడింది.చేయాలనుకొన్న పనిని వాయిదా వేయకుండా చేయటం మంచి పద్ధతి అని ప్రబోధించింది.

దైవకారుణ్యము( నవంబర్, 1903) అనే వ్యాసంలో ప్రపంచమందంతటా భగవంతుని కారుణ్యం పరచుకొని వున్నదని ఉత్పత్తి శక్తి అయిన భూమి, సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన నీరు , అది ఆవిరై కురిసే వర్షం , ప్రాణశక్తి అయిన వాయువు , నాగరికతకు మూలమైన అగ్ని అన్నీ ఆ కారుణ్య రూపాలే అని చెప్పింది. అగోచరుడైన భగవంతుడి గురించి గోచరమైన ప్రకృతి విలాస ప్రయోజనాలను వివరించటం వలన ఇది భావుకత్వం తో పాటు శాస్త్రీయ దృష్టి కూడా కలిగిన రచన అయింది. 

కౌసల్య మరొక రచన సాధు వర్తనము. ( మే 1903) ఇది కథ. వివినమూర్తి గారి సంపాదకత్వంలో 2015 లో తానా ప్రచురణగా వచ్చిన దిద్దుబాటలు - గురజాడ దిద్దుబాటుకు ముందు 1879 నుండి వచ్చిన బృహత్ కథల సంకలనం లో ఎందువల్లనో ఇది చేరలేదు.ఆహా కొన్నినెలలక్రితము నెలలననేల  దినముల క్రితము మహదైశ్వర్యము ననుభవించుచు సంతోష సాగరమున నీదులాడు నా  విప్రపుంగవునకిప్పుడెంత యాంధకారబంధురమైనదిఅని ఉత్సుకతను  కలిగించే వాక్యంతో ప్రారంభించి ఆయన భార్య మరణించిందని , ఆ దుఃఖాన్ని అణచుకొంటూ కొడుకును పెంచుకొంటున్నాడని క్రమంగా అతని జీవితం తో పరిచయం ఏర్పరచింది. ఆ విప్రుడి కొడుకైన   భద్రుడు- బలభద్ర మూర్తి - ఈ కథకు నాయకుడు. భద్రుడి తండ్రి కూడా మరణించాడు. ధైర్యం చెదరక చదువు కొనసాగించాడు. పట్టణాధికార పదవిలో ఉన్న శ్రీహరి రావు తనకూతురికి తగిన వరుడిగా భద్రుడిని ఎంచుకొని పిలిచి పిల్లనిచ్చి తన ఇంటనే ఉంచుకొన్నాడు. శ్రీహరి రావు చిన్ననాట నుండి స్త్రీ విద్యాభిమాని యగుటచేత తన కూతురికి కూడా కొడుకులతో పాటు సమానంగా చదువు చెప్పించాడని చెప్పటం రచయిత్రి స్త్రీవిద్యాఉద్యమ ఆకాంక్షల ప్రతిఫలనమే. 

పట్ట  పరీక్షలలో ఉత్తీర్ణుడైన భద్రుడికి తాలూకా తహశీల్దార్ ఉద్యోగం లభించటం న్యాయవర్తనతో మంచి పేరు తెచ్చుకొనటం , అది గిట్టని వాళ్ళుకుట్రలు పన్ని తాలూకా లెక్కలలో తప్పులు ఉన్నాయని  చేసిన ఆరోపణలతో  పై  అధికారి అతనిని అటవీ ప్రాంతానికి బదిలీ  చేసి  లెక్కలు తప్పు అని తేలితే ఉద్యోగం లో నుండి తీసెయ్యటానికి సిద్ధపడ్డాడు. అదే సమయంలో పురిటికి పుట్టింటికి వెళ్లిన భార్య ప్రసవించినా చూసి రావటానికి అతనికి సెలవు దొరకలేదు. అయినప్పటికీ అతను తన  ఉద్యోగ ధర్మాన్ని యధావిధిగా నిర్వర్తిస్తూనే ఉన్నాడు. రాజధాని కార్యాలయ అధికారికి అతను పెట్టుకొన్న విన్నపం , విచారణల తరువాత బలభద్రమూర్తి తప్పు ఏమీ లేదని తెలియటం , విషయం విచారించకుండానే ఆరోపణలు విని చర్యలు తీసుకొన్న అధికారిని శిక్షించటం , భద్రుడికి పదోన్నతి కల్పించటం జరిగాయి. భార్యను, కొడుకును చూసుకొనే అవకాశం లభించింది.కథ సుఖాంతం అయింది. నీతి, న్యాయం కలవాళ్ళు ఎన్నికష్టాలుఎదురైనా స్థిరచిత్తంతో వ్యవహరిస్తారని అదే వాళ్లకు సర్వ సౌఖ్యాలు సమకూరుస్తుందని భద్రుడి జీవితపరిణామాల ద్వారా సూచించింది రచయిత్రి.

            వెంపలి శాంతాబాయి మొసలికంటి రామాబాయమ్మ తో పాటు 1903 డిసెంబర్ నుండి హిందూసుందరి పత్రిక సంపాదకురాలు. ఆపత్రికను పెట్టిన సత్తిరాజు సీతారామయ్య అదే నెల హిందూ సుందరి పత్రికలోస్వవిషయముఅనే శీర్షికతో వాళ్ళను పత్రికా సంపాదకులుగా పరిచయం చేస్తూ వ్రాసిన సంపాదకీయం వల్ల శాంతాబాయి కి సంబంధించిన వివరాలు కొన్నితెలుస్తున్నాయి. దొరతనము వారిచే విశేష గౌరవం పొందిన తండ్రికి కూతురు.ఆతండ్రి పేరేమో , వూరేమో పేర్కొనలేదు.  మొత్తనికి వారిది ఘోషా కుటుంబం.బాల్యంలోనే భర్తను కోల్పోయింది. విద్యావివేకము లన్నిటిలో రామాబాయమ్మ కు సహచారిణి . దీనిని బట్టి శాంతాబాయి కూడా రాజము ప్రాంతం మహిళ అనుకోవచ్చు. అంతే కాదు, ‘బాల వితంతువుఅనే  నవీన నవలను ప్రచురించిందని కూడా సీతారామయ్యగారి పరిచయం వల్ల తెలుస్తున్నది.   ఆ నవల  లభిస్తే తొలి  తెలుగు మహిళా నవల  అదే అవుతుంది.  

            ఈ డిసెంబర్ సంచికలోనే హిందూ సుందరి పత్రికా సంపాదకత్వానికి అంగీకరిస్తూ మొసలికంటి రామాబాయమ్మ తో కలిసి వ్రాసిన విజ్ఞాపనము ప్రకటించబడింది. మళ్ళీ ఏడాదికి ( జనవరి & ఫిబ్రవరి 1903 సంచికలు)   ఇద్దరూ కలిసి మరొక ప్రకటన ఇచ్చారు. పురుష పెంపకానికి ,    స్త్రీల పెంపకానికి తేడా లేకపోతే అది స్త్రీజాతికే అవమానం అన్నారు. ఇద్దరు స్త్రీలము ఈపత్రిక బాధ్యత తీసుకొన్నతరువాత ఆ తేడా కనబడి తీరాలి అని భావించి  హిందూ సుందరి పత్రికను మరింత బలం గలదానిగా చేయటానికి రాబోయే సంవత్సరంలో చేయదగిన , చేయాలనుకొంటున్న మార్పుల గురించి ఈ ప్రకటనలో  చెప్పారు. సంవత్సరాది సంచిక నుండి 40 పుటలతో ఈ  పత్రిక వస్తుందని , కాగితం కూడా దళసరిది వాడుతామని చెప్పారు. ప్రతినెలా బండారు అచ్చమాంబ గారితో ఊలు అల్లిక పనుల గురించి వ్రా యిస్తామనిప్రత్యక్షానుభవం కోసం అల్లిక లో దశలను సూచించే బొమ్మల ప్రచురణ కూడా ఉంటుందని చెప్పారు. అందుకు అయ్యే ఖర్చుకు జంకక పని తలపెట్టటం లో  హిందూ సుందరి పత్రికను ప్రతి స్త్రీకి  ఒక తల్లి వంటి , బిడ్డ వంటి, తోబుట్టువు వంటి, అత్తవంటి , కోడలి వంటి  ఆత్మీయ సంబంధంలోకి తీసుకురావాలన్న లక్ష్యమే ప్రధానమని చెప్పారు. విద్యావంతులైన  సోదరీమణులు ఈ పత్రికకు విశేష ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  చందాలు కట్టి పత్రికను  నిలబెట్టమన్నారు. చందాదారుల సంఖ్యను బట్టే ప్రతుల ప్రచురణ ఉంటుందని చెప్పారు. అప్పటికి ఎనిమిదివందల మంది చందాదారులు ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. 

            వెంపలి శాంతాబాయి రచనలు హిందూసుందరి లో ఆమె దానికి సంపాదకురాలు కాకముందు నుండే కనిపిస్తున్నాయి. రాజాము జానానా సభలో ఆమెచేసిన ఉపన్యాస పాఠం1903 జులై సంచికలో ప్రచురించబడింది.అది లభిస్తున్న ఆమె మొదటి  రచన. స్త్రీవిద్యను అడుగంట చేసి స్త్రీలను మూఢురాండ్రను చేసిన హిందూ సమాజాన్ని గర్హిస్తూనే ఆ మూఢతను పాపుకొనవలెనన్నప్రయత్నములు ప్రారంభం కావటాన్నిగురించి హర్షం వ్యక్తం చేస్తూ తనఉపన్యాసాన్నిప్రారంభించింది . స్త్రీ అనుష్టించదగిన ధర్మాలు మూడు అనిమొదటి రెండు పతిభక్తి, దైవభక్తి కాగా మూడవది విద్యాకృషి అని పేర్కొన్నది. విద్యా గర్వంతో స్త్రీలు దైవ సమానుడైన భర్తను తిరస్కరించి చెడు  గుణాలకు లోనవుతారని నెపంతో  స్త్రీలను కూపస్థమండూకాలను చేస్తున్నారని చెప్పింది.విద్యయొసగును వినయంబు వినయమునను/ బడయు బాత్రత బాత్రత  వలన ధనము/ ధనము వలను ధర్మంబు దానివల / నైహికాముష్మిక సుఖంబు లందు నరుడుఅనే పద్యాన్ని ప్రస్తావించి  నిజమైన విద్యావంతుల లక్షణం ఏమిటో సూచించింది . అందువలన వైకుంఠపాళి , అష్టాచెమ్మా వంటి ఆటలతో  సమయం వృధాచేయక ఆడవాళ్లు సాధ్యమైనంతవరకు  తాము చదువుకొంటూ తోటి స్త్రీలకు చెప్తూ హిందూసుందరుల విద్యాభివృద్ధికి పాటు పడితే మేలని చెప్పింది. విద్య కేవలము జ్ఞానార్జనకే కానీ ధనార్జనకు గాదని చెప్తూ అట్టి విద్యవలన కలుగు జ్ఞానం పురుషులకే గాని స్త్రీలకు కూడదనటం నీచం అని అభిప్రాయపడింది . చదువు నేర్చిన చెడునడత కలుగుతుంది అనే వాదాన్ని అట్లయిన విద్య నేర్చిన పురుషులు కూడా అటువంటి వాళ్ళే అయివుంటారు అన్న ఎదురుదాడితో తిప్పికొట్టింది.   స్త్రీవిద్యా ద్వేషులు పన్నే కుతంత్రాలకు లోను కాకుండా స్త్రీలు విద్యాదానం ఆర్జించటానికి పూనుకోవాలని ప్రబోధిస్తూ ఈ ఉపన్యాసం ముగించింది. 

            సమాజ లాభము అను వ్యాసం ( నవంబర్ 1903 , హిందూ సుందరి) కూడా ఉపన్యాసపాఠమే. ఆడవాళ్లు సమాజములు పెట్టుకొనటం ఎందుకు అవసరమో , ప్రయోజనం ఏమిటో ఈ ఉపన్యాసంలో వివరించింది. మొసలికంటి రామాబాయి ఏర్పరచిన సమాజం లోకి సందేహాలు మాని స్త్రీలు సమీకృతం కావాలని సూచిస్తూ శాంతాబాయి ఈ ఉపన్యాసం చేసింది. పురుషులలో స్త్రీవిద్యా ద్వేషులు ఉండవచ్చు గాక , స్త్రీలు స్వీయ అభివృద్ధికై ఏర్పాటు చేయబడిన సంస్థల లోకే రావటానికి , వారానికి ఒక సారి సమావేశం కావటానికి వెనుకంజ వేయటం సరికాదని చెప్పింది. ఇలాంటి సమాజాలకు ఎవరు ఏ రకమైన  బట్టలు కట్టుకున్నారు , నగలు పెట్టుకొన్నారు అని తరచి చూడటం కోసం కాదు రావలసినది, ఎవరు చదువుకున్నారో వారి హృదయాలంకారాలు  ఎట్లా ప్రకాశిస్తున్నాయో గమనించి ఒకరికి తెలిసిన దానిని మనం గ్రహించటం , మనకు తెలిసింది పరులకు ఎరిగించటం తద్వారా విద్యావంతులం కావటంజరగవలసిన పని అని హితవు చెప్పింది. సభలకు వెళ్లి అక్కడ చెప్పే నీతులను మనసులో నాటించుకొని జ్ఞానవంతులు కావటం సమాజముల వల్ల  సమకూరే  ప్రయోజనం అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. సమాజలత విస్తరణ ఒక్కరివల్ల సాధ్యం కాదని చీమలకున్న ఐక్య భావంతో స్త్రీలందరూ కలిసి పని చేయాలని సఙ్గహబలం కొత్త ఊహలకు కారణం అవుతుందని చెప్పింది. నోములని , పెళ్లి పేరేంటాలని తోటి స్త్రీలను పిలవటానికి మేళతాళాలతో బజారులలో వూరేగటానికి లేని తప్పు ఎవరో ఒకరి ఇంట్లో ఒక గదిలో మగవాళ్ళు ఇంట లేని సమయంలో చేసుకొనే జనానా సంఘ సమావేశాలకు హాజరవటంలో ఎందుకు అవుతుంది ? అని తర్కించింది. 

            సద్భక్తి ( డిసెంబర్ 1903, హిందూ సుందరి ) అనే వ్యాసంలో శాంతాబాయి బహు దేవతారాధనను , ధూపదీప నైవేద్యాది క్రియాకలాపంతో కూడుకొన్న అర్చనా పద్ధతిని కాదని ఏకేశ్వరోపాసన వలన జన్మ ధన్యమవుతుందని పేర్కొన్నది. మనకు సంతోష కారణమైన సకల ప్రకృతిని సృష్టించిన ఈశ్వరుడు ఒక్కడే నని , ఇతర దైవముల కొలుచుట మాని లోకైక రక్షకుడైన ఆ ఒక్కడిని సేవించాలని చెప్పింది . ఆత్మసౌఖ్యాన్ని, దేహసౌఖ్యాన్నిచెడగొట్టుకొనే ఉపవాసాలు , నోములు ఆచరించ తగనివి అని హితవు పలికింది. సత్యధర్మ జ్ఞానాభివృద్ధులే వ్రతంగా జీవితంసాగించాలని అవే నిత్య సత్య వ్రతాలని ప్రబోధించింది. బ్రహ్మసమాజ భావజాలం సంస్కరణ ఉద్యమాలలో అంతర్భాగమై స్త్రీలలోనికి ఎంతగా చొచ్చుకొని పోయి ఎంత ఆమోదాన్ని పొందిందో అందుకు నిదర్శనం ఈ వ్యాసం. 

             నీతి అనే వ్యాసంలో ( జనవరి,1904 , హిందూసుందరి) నీతి ఒక సార్వకాలిక సార్వజనీన విలువ అని ప్రతిపాదించి కుటుంబపోషణ కైన లౌకిక వ్యవహారాల నిమిత్తం పురుషులు ఎప్పుడైనా నీతిని వదులుకోవలసిన సందర్భాలు రావచ్చు కానీ స్త్రీలకు నీతి విడువవలసిన అవసరమే ఉండదని పేర్కొన్నది శాంతాబాయి.స్త్రీలు మూఢులు, అవిశ్వాస పాత్రులు, అబద్ధాలాడుతారు , కప టులు , నీతిలేనివాళ్లు అని నానా రకాలుగా స్త్రీల గురించి వినబడే మాటలు ఒట్టి అపవాదులు అని తేల్చటానికి నీతిని నిరంతర ఆచరణగా అభ్యాసం చేయాలని సూచించింది. ఏదినీతి అన్నవివేకాన్నిఇచ్చే జ్ఞానమూలం విద్యకనుక స్త్రీలు చదువుకోవాలనే అనుభవజ్ఞులైన స్త్రీలతో స్నేహంచేసివారుచెప్పినవిషయాలను మనసులో విమర్శించుకొనిశ్రేయోదాయకమైన మార్గం అవలంబించాలని అది నీతి గీటురాయిగా ఉండాలని చెప్పుకొచ్చింది.

            ఇవి కాక వెంపల శాంతాబాయి వ్రాసిన రెండు కీర్తనలు లభించాయి. రెండూ రఘురాముడిని స్తుతించేవే.రెండింటిలోనూ శ్రీరాముడు విజయనగర విగ్రహ రూపమే.ఆవిజయనగరమే రచయిత్రి నివాసమై ఉంటుంది. రెండుపాటల చివరి వాక్యాలు శాంతాబాయి అన్నకవయిత్రి స్వీయ నామాంకితంగా ఉంటాయి.నన్ను విడనాడ న్యాయమా శ్రీరామా / నిన్నేనమ్మినార నీరజాక్ష వేగాఅనేపల్లవితో నాలుగుచరణాలతో వున్న  కీర్తన( జూన్ 1903) ఒకటి. తేరే పుష్పమూలు - రారే రఘువీరు పూజశాయూటకూ ..అనేపల్లవితోమొదలై నాలుగు చరణాల రచనగా సాగిన కీర్తన రెండవది.  చరణాలన్నీ పూజకుతేవాల్సిన పువ్వుల పేర్లతో ఉంటాయి కాబట్టి దీనికి పువ్వులపాట అనేపేరు కూడా ఉంది.

            జనవరి 1904 హిందూసుందరి పత్రికలో వచ్చిన నీతి అన్నవ్యాసమే శాంతాబాయి రచనలలో చివరిది. మే 1904 నాటికి ఆమెమరణించింది. అదే సంచికలో ప్రచురించబడిన కొటికలపూడి సీతమ్మ ఉత్తరాన్ని బట్టిఅలాఅనుకోవలసి వస్తుంది. సఖీ వియోగ బాధిత అయిన మొసలికంటి రామాబాయమ్మ గారిని ఓదారుస్తూ , పరామర్శిస్తూ సీతమ్మ వ్రాసిన ఉత్తరం అది. ఆ ఉత్తరంలో ఆమె శాంతాబాయితనకు వ్రాసిన ఒకఉత్తరాన్ని ప్రస్తావిస్తుంది. దానినిబట్టి శాంతాబాయి బ్రహ్మసమాజ మతావలంబకురాలు కావటంలో సీతమ్మ ప్రభావమే ఉందని తెలుస్తుంది . తనకూ రామాబాయమ్మగారికి వచ్చినఅభిప్రాయ భేదాలవల్ల సంస్కరణ ప్రబోధం సరిగా చేయలేక పోయినట్లు ఆమె సీతమ్మకువ్రాసిన ఉత్తరంలోపేర్కొన్నది.పరిశుద్ధ ఆస్తికమత వ్యాప్తికి నడుము కట్టటమూ తెలుస్తుంది. అందుకోసం ప్రతివారం సభలు జరుపుతున్నా పరిశుద్ధాభిప్రాయాలు ఎన్నటికి ఆస్త్రీల హృదయాలలో నాటుకొని దురాచారాలుతొలగించటానికి సాయపడతారో అని ఆఉత్తరంలో ఆమె సందేహాన్నివ్యక్తంచేసింది. ఆవిషయాలు పేర్కొంటూ ఆమెమరణం అందరికీ దుఃఖ కారణమేనని అంటుంది.

            ఆసికా పుర స్త్రీ సమాజం వారు శాంతాబాయమ్మగారి అకాల మరణానికి చింతిస్తూ సం 1904 మే 28 న సమావేశమై చేసిన సంతాప తీర్మానాన్ని జూన్ 1904 హిందూ సుందరిలో చూడవచ్చు. ఆమె మరణం  ‘స్త్రీ లోకాంబునకెల్ల నమిత దుఃఖదాయకం’  అన్నారు. మొసలికంటి రమాబాయికి  సంతాపాన్ని తెలియ చేశారు.  ఆ సందర్భంగా  లక్ష్మీ నరసమాంబ చదివిన వ్యాసాన్ని కూడా  హిందూసుందరి ప్రచురించింది.ఏ యమ్మ సద్విద్యా విభూషణయై యజ్ఞాన తిమిరంబు దరిదాటి తన నైపుణ్యంబున డాడీ జవరాండ్ర విద్యావంతులుగా జేయ ప్రయతినించి పాటుపడుచు సుందరీ పత్రికారత్నంబునకు సహా పత్రికాధిపురాలై యీ యాంధ్ర దేశంబున దన నామము వెల్లడి చేసి యుండెనోఅట్టి మన శాంత పరలోక గతురాలై మనలను విచార సాగరంలో ముంచిందని ఆ సంతాప తీర్మానంలో పేర్కొన్నది లక్ష్మీ నరసమాంబ. 

1903 జులై నుండి 1904 జనవరి సంచిక వరకు ఏడూ నెలల కాలమే  శాంతాబాయి రచనాకాలం. స్త్రీ సమాజాల నిర్వహణ , బ్రహ్మసమాజ మతప్రచారం , తోటి స్త్రీలను విద్యావంతులను చేయాలని ప్రారంభించిన పనిని , హిందూ సుందరిని  గుణాత్మకంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలను అన్నిటినీ వదిలేసి రమ్మని ఆకాల మృత్యువు ఆమెను వెంట తీసుకుపోయింది. ఉపయోగానికి రావలసిన మహిళా శక్తి ఆ రకంగా దట్టించబడి అర్ధాంతరంగా ఉపసంహరించబడటాన్ని మించిన విషాదం ఏముంది

 

------------------------------------------------------------------------------------

 

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర- 10

మొసలిగంటి రామాబాయమ్మ  తెలుగు పత్రికారంగ చరిత్రలో తొలి మహిళా సంపాదకురాలు. 1830 లలో తెలుగు పత్రికల ప్రచురణవృత్తాంతితో మొదలైంది. ఆ తరువాత అర్ధ శతాబ్దికి  సంస్కరణోద్యమ అవసరాలనుండి స్త్రీల కొరకు ప్రత్యేకంగా పత్రికలు రావటం మొదలైంది. దానికి ఆద్యుడు స్త్రీ విద్య గురించి తహతహ లాడిన  కందుకూరి వీరేశలింగం.  ‘స్త్రీలు చదువుటకు  తెలుగులో మంచి పుస్తకములు లేవని భావించి ఆలోపాన్ని తీర్చటానికి  ‘సతీహితబోధినిపత్రికను 1883లోప్రారంభించాడాయన.  ఆ తరువాత పది పన్నెండు ఏళ్లకు మరో మూడు పత్రికలు దానికి  జత కూడాయి. అవి తెలుగు జనానా పత్రిక, స్త్రీ హిత బోధిని , శ్రీబాలిక. కొత్త శతాబ్ది ప్రారంభం లో స్త్రీల కొరకు స్త్రీలచే నడపబడే పత్రికా సంప్రదాయానికి త్రోవలు చేస్తూ హిందూసుందరి పత్రిక 1902 ఏప్రిల్ లో మొదలైంది. దానికి సంపాదకురాలు మొసలిగంటి  రామాబాయమ్మ . ఆమెకు తోడు వెంపలి శాంతాబాయి. 

అసలీ పత్రిక ప్రారంభకులు సత్తిరాజు సీతారామయ్య. ఏలూరు నుండి స్త్రీల ప్రయోజానాపేక్షతో ఆయన ఈ పత్రికను ప్రచురించసాగాడు.  1903 డిసెంబర్ వరకు ఆయనే సంపాదకుడు. కానీ స్త్రీల కొరకు నడపబడే పత్రికకు స్త్రీలే సంపాదకత్వం వహించటం సముచితం అన్నది తొలి నుండి ఆయన అభిప్రాయం. పత్రికను ఒక కాంతామణి ఆధిపత్యం కింద ప్రచురించాలన్న ప్రయత్నం ఫలించకపోవటమే కాదు, కనీసం ఒకళ్ళిద్దరు స్త్రీల రచనలైనా పత్రికలో ప్రచురించే అవకాశం కొంతకాలం వరకు రాలేదు అని డిసెంబర్  1903,  హిందూసుందరి  సంపాదకీయంలో చెప్పాడు ఆయన. రెండేళ్ల కాలంలో హిందూసుందరికి వ్రాసే స్త్రీలు ముప్ఫయి మందివరకు పెరిగారని పేర్కొంటూ ఇన్నాళ్లకు సంపాదకత్వ బాధ్యత తీసుకొనటానికి  మొసలిగంటి రామా బాయమ్మ, వెంపలి శాంతాబాయి అంగీకరించారని హర్షం ప్రకటించాడు. ఆ రకంగా  హిందూసుందరికి మొసలిగంటి రామాబాయమ్మ  ఆ సంచికనుండే సంపాదకురాలు. అంతవరకు పత్రికాధిపతి అన్న హోదాను ప్రకటిస్తూ వ్రాసిన సీతారామయ్యస్వవిషయముఅనే శీర్షికతో వ్రాసిన  ఈ సంపాదకీయం లో ఇక తనది  కార్యనిర్వాహకుడి  హోదా అని ప్రకటించుకొనటం, ఈ సంచికలోనే సంపాదకత్వ బాధ్యతను స్వీకరిస్తూ మొసలిగంటి రామాబాయమ్మ, వెంపలి శాంతాబాయి కలిసి చేసినవిజ్ఞాపనము’ ‘పత్రికాధిపతులుఅన్న హోదా తో ప్రచురించబడటం దానినే నిర్ధరిస్తాయి.   

ఈ సంపాదకీయం లోనే ఆడవాళ్లు సంపాదకత్వ బాధ్యతలు తీసుకొనటంలో ఎదురయ్యే ఒక సమస్యను ప్రస్తావించి దానిని సీతారామయ్య పరిష్కరించిన తీరు ఆసక్తికరంగా కనబడుతుంది. స్త్రీలు నిలకడగా ఒకగ్రామంలో వుండరు. కొంతకాలం అత్తగారింట్లో వుంటారు. పుట్టిళ్లకు వెళుతుంటారు అని  చెప్పి అందువల్ల సంపాదకులకు ప్రత్యేకంగా వ్రాయదలచిన వాళ్ళు, చందాలు పంపే వాళ్లు ఏలూరులోని పత్రికా కార్యాలయానికే వ్రాయాలని, ప్రత్యేకంగా సంపాదకులే జవాబు ఇయ్యవలసిన లేఖలను వాళ్లకు పంపటం జరుగుతుందని ఒక ఏర్పాటు చేసాడాయన. స్త్రీలపేరుమీద ఉత్తరాలు రావటమే విడ్డూరం అయిన ఆకాలంలో  తాము పత్రికలకు వ్రాస్తున్నామని తెలియటం తమ గ్రామాలలో  విమర్శకు ,హేళనకు కారణం అవుతుందన్న జంకుతో  స్త్రీలుఒక సోదరివంటి సర్వ నామాలతోనో, మారు పేర్లతోనో వ్రాస్తున్న వంద సంవత్సరాల వెనుకటి కాలపు సామాజిక స్థితిలో  ఇలాంటి ఏర్పాటు అవసరమై ఉంటుంది. 

మొసలిగంటి రామాబాయి, వెంపలి శాంతాబాయి వ్రాసిన విజ్ఞాపనము లో కూడా   ఆడవాళ్లు కుటుంబ పరిధి దాటి సామాజిక రంగాలలోకి  ప్రవేశించటానికి ఉన్న ఇలాంటి అవరోధాల గురించిన  ప్రస్తావన వుంది. పత్రికాధిపతులు మగవాళ్ళు కావటం వల్ల భర్తల అనుజ్ఞ లేక పత్రికలకు వ్రాయటానికి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి స్త్రీలు సందేహిస్తున్నారని - ఇటువంటి పరిస్థితులలో స్త్రీలు పత్రికాధిపతులుగా ఉంటే జంకు విడిచి  రచనలు చేసి పత్రికలకు పంపటానికి వీలవుతుందని సీతారామయ్య తమను పత్రికా సంపాదకత్వానికి అంగీకరింపచేశారని సంపాదక ద్వయం పేర్కొన్నారు.మేమెల్ల కాల మొక్కచో నుండు వారము గాముఅని చెప్పి పత్రికకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏలూరులోని పత్రికా కార్యాలయం ద్వారానే జరుగుతాయని చెప్పటం - స్త్రీల  చిరునామాలను అందరికీ తెలిసేలా బహిర్గత పరచటం అనైతికం అన్న విలువ పొందిన  సామాజిక సమ్మతి ఫలితమే అయివుంటుంది.  

1902 నాటికే రచనలు చేసి పత్రికలలో ప్రచురిస్తూ, 1904 నుండి హిందూసుందరి పత్రికకు సంపాదకురాలిగా ఉంటూ వచ్చిన మొసలిగంటి రామాబాయమ్మ గురించి కూడా  పెద్దగా  సమాచారం లేదు. ఆమెను సంపాదకురాలిగా పరిచయం చేస్తూ సీతారామయ్య వ్రాసిన స్వవిషయము ఒక్కటే ఇప్పటికి ఆమె వ్యక్తిగత జీవితం తెలుసుకొనటానికి ఆధారం. రాజాములోను, తరువాత చోడవరంలోను జిల్లా మునసబుగా ఉన్న నాభి రామమూర్తి   పంతులు ఆమె తండ్రి . అప్పటికే ఆమె మీరాబాయి మొదలైన గ్రంధాలను రచించింది. గ్రామంలో ఉన్నప్పటికీకుల స్త్రీలను</