ఇంటర్వ్యూలు

(January,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

కవిత్వం రాయడమే విరసం ప్రభావం తో మొదలైంది - అద్దేపల్లి ప్రభు

విరసం యాబై ఏళ్ళ సందర్భంగా అద్దేపల్లి ప్రభు గారు  గోదావరి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.                మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది?

జ.                దాదాపు నాలుగవ తరగతి నించీ చందమామ, బొమ్మరిల్లు లాంటివి బాగా చదివే అలవాటు ఉండేది.బాలసాహిత్యం ముఖ్యంగా సోవియట్ రష్యా  పుస్తకాలు బాగా చదివే వాళ్ళం. హైస్కూలులో ఉండగా మాగజైన్ కోసం కథ రాశాను. చిన్న నాటిక ఒకటి రాసి వేశాం. ఇంట్లో ఎలాగూ సాహిత్య వాతావరణం ఉంది.

మా అన్నయ్య కథలు బాగా రాసేవాడు.అలా నేనూ రాయాలనుకునే వాణ్ణి.కాకినాడలో జరిగే సభల్లో, ఇంట్లో ఇప్పుడు బాగా పేరున్న రచయితలూ, కొత్తగా రాస్తున్నవాళ్ళూ చాలా మందిని చూసేవాళ్ళం.అమలాపురంలో మినీ కవిత మీద ఒక సదస్సు జరిగింది.ఆ సదస్సులో అలిశెట్టి ప్రభాకర్ వంటి చాలా మందిని కలిశాం. అలా కవిత్వం కధలు రాయడం మొదలైంది.

 

2.                మీ సాహిత్య ప్రస్థానం మొదలైన తొలినాళ్లలో సాహిత్య వాతావరణాన్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు ఏవి?

జ.                విరసమే.కవిత్వం రాయడమే విరసం ప్రభావం తో మొదలైంది. చెరబండరాజు, శివసాగర్, అల్లం రాజయ్య, లాంటి వాళ్ళ కవిత్వం, కధలు బాగా ప్రభావం చూపేవి.కుటుంబరావు బాగా ఆకట్టుకునే వారు.విరసం లాగానే కాలేజీ లో కవిత్వం రాసే కొంతమందిమి చైతన్యప్రవాహం అనే గ్రూప్ పెట్టుకుని ఒక రాత పత్రిక నడిపేవాళ్ళం. కొన్నాళ్ళు సైక్లోస్టైల్ పత్రిక గా కూడా నడిపాం.

 

3.                మీ సాహిత్య ప్రస్థానంలో మీకు విరసం ఎప్పుడు ఎలా పరిచయం అయింది

జ.                మొదట్లో ప్రత్యక్షంగా పరిచయం లేదు కానీ సృజన అరుణతార వంటి పత్రికలు ద్వారా పరిచయమే. మొదటి సారి 1982లో విజయవాడలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలలో హాజరు కావడం ప్రత్యక్ష పరిచయం.విరసం రచయితలు చాలా మందిని అక్కడ కలిశాం. త్రిపురనేని,కేవీఆర్,వివి,చలసాని, బాలగోపాల్... చాలా మందిని అక్కడ చూశాం, విన్నాం.

 

4.                విరసం పరిచయమైన తరువాత మీ సాహిత్య వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు ఏమిటి

జ.                మా సాహిత్య ప్రస్థానమే విరసం ప్రభావం తో మొదలైంది కాబట్టి మార్పులు అనేవి రచనా సంవిధానానికీ సంబంధించిన వే అనుకుంటున్నాను. ముఖ్యంగా సాహిత్యం లో వర్గ దృక్పథం లోతుగా పెంచుకోవడం, కళాత్మక అభివ్యక్తి సాధన చేయడం విరసం ప్రభావం తో వచ్చాయి.చెరబండరాజులా కథ,పాట, కవిత్వం రాయాలని అలా జీవించాలనే తపన బాగా ఉండేది.

 

5.                విరసం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు

జ.                విరసం ఏర్పడిన తరువాత ప్రజాసాహిత్యం ఒక స్పష్టమైన, నిర్దుష్టమైన రూపం తీసుకుందని నా భావన.అంతకు ముందు లేని ఒక సాహిత్య నిబద్ధత ని విరసం తీసుకువచ్చింది.

 

6.                కవిగా రచయితగా సృజన కారుడిగా  మీ పరిణామం వెనుక విరసం ప్రభావం ఏమైనా ఉందా

జ.                అవును.పూర్తిగా.

 

7.                విరసం లాంటి సంస్థ 50 సంవత్సరాలు మనగలగడం వెనుక గల పరిస్థితులు కారణాలు తెలుపగలరు

జ.                గత యాభై ఏళ్లుగా తెలుగు సమాజంలో వచ్చిన అన్ని ఉద్యమాలనీ విరసం ప్రతిబింబించింది.ప్రతిఫలించింది. ఏ సందర్భంలోనూ ప్రజల్ని విడిచి పెట్టలేదు.అదే విరసం మనుగడకి కారణం. 

 

8.                విరసం అవసరం ప్రస్తుత తెలుగు సాహిత్య సామాజిక రంగంలో ఎంత వరకు ఉన్నది.

జ.                విరసం లాంటి ఒక సాహిత్య సంస్థ లేకపోతే సాహిత్య రంగమంతా అభివృద్ధి నిరోధకులతో నిండిపోతుంది. ఎంతో కొంత మేరకు సాహిత్యాన్ని ప్రజల మధ్య కి తీసుకెళ్ళింది విరసమే. సాహిత్య రంగంలో కవిత్వం,కథ,నవల,పాట, నాటిక, వ్యాసం లాంటి అన్ని ప్రక్రియలనీ విరసం బాగా అభివృద్ధి చేసింది.సామాజిక, తాత్త్విక, పర్యావరణానికి సంబంధించిన అనేక విశ్లేషణ లనీ చర్చలనీ విరసం నిర్వహించింది.ప్రస్తుత తెలుగు సాహిత్యంలో ఉన్న భిన్న దృక్పథాలని ప్రజాస్వామికంగా అర్థం చేసుకోవాలి అందుకు విరసం లాంటి సంస్థ చేయాల్సింది చాలా ఉంది.

 

9.                విప్లవ సాహిత్యం లో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు

జ.                విప్లవ సాహిత్యం లో విరసం ఒక భాగమే తప్ప అదే విప్లవ సాహిత్యం కాదు.ప్రజాస్వామిక చైతన్యం నెలకొల్పడానికి ప్రజలకి సంబంధించిన అనేక దృక్పథాలలోంచి సాహిత్యం రావాలి. స్త్రీవాదం, దళితవాదం, బహుజన వాదం లాంటి అన్ని దృక్పథాలూ విప్లవ ప్రజాస్వామిక సాహిత్యం లో భాగమే నని నా అభిప్రాయం.రివిజనిస్టు ఉదారవాద సాహిత్యం పైన తిరుగుబాటు గా వచ్చిన విరసం మొదట్లో కొంత అతికి పోయినా క్రమంగా తన తాత్త్విక చింతన ని మెరుగు పరుచుకుంది. అది నిరంతరం ప్రజల పక్షాన ఉంది అది ప్రధానం.

 

10.                కొత్త రచయితలను కవులను తయారుచేయడంలో విరసం పాత్ర ఎంత వరకు ఉన్నదని మీరు భావిస్తున్నారు

జ.                విరసం ఏర్పడిన తరువాత దాని ప్రభావం సోకని తెలుగు రచయితలు ఉండరు. కొత్త రచయితలని తయారు చేయడం లో విరసం కృషి గణనీయమైనదే. అనేక దశాబ్దాలుగా విరసం నిర్వహించిన సాహిత్య పాఠశాలలు వస్తుశిల్పాల గురించి చాలా అవగాహన కల్పించాయి.

 

11.                తెలుగు   ముద్రణ మరియు అంతర్జాల  పత్రికారంగంలోవిరసం పత్రికలు మరియు అంతర్జాల పత్రిక ప్రభావం ఏ రకంగా ఉందని మీరు అంచనా వేస్తున్నారు

జ.                అరుణతార,అంతర్జాల పత్రికల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సమాజం పట్ల తపన చెందే రచయితలు ఆలోచనలు, సృజన పాఠకుల్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయి.

 

12.                దళిత స్త్రీవాద మైనారిటీ బహుజన పోరాటాల పరిణామాలను విరసం ఎంత మాత్రం ప్రభావితం చేయగలిగింది

జ.                విప్లవ సాహిత్యం  స్త్రీవాద,దళిత బహుజన సాహిత్యాన్ని సరిగ్గానే స్వీకరించింది. మొదట్లో ఈ వాదాల పట్లా వాళ్ళ మార్క్సిస్టు వ్యతిరేకత పట్లా అనుమానం ఉండేది.కానీ ప్రజాస్వామిక విప్లవ సంస్క్రుతిలో భాగంగా చూసి నప్పుడు ఈ వాదాలు మన్ని చాలా ఎడ్యుకేట్ చేశాయి.విరసం ఈ ఆలోచనల్ని స్వీకరించింది.పెంపొందించుకుంది.ఇది గొప్పగా అని పిస్తుంది. దళితవాదం ప్రభావం తో నే అంబేద్కర్ నీ, ఫూలే నీ కొత్తగా అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం మొదలు పెట్టాం.

 

13.                50 ఏళ్ల విరసం సందర్భాన్ని మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు 

జ.                జీవితంలోనూ సాహిత్యం లోనూ తిరోగమన శక్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ప్రగతిశీలత పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది.మతమౌఢ్యం, కులం,మూఢనమ్మకాలు సంప్రదాయం, సంస్కృతి పేరుతో ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతున్నాయి.ఇలాంటి సందర్భంలో విరసం 50 ఏళ్ళ సభలు జరుగుతున్నాయి. చాలా కొత్త కర్తవ్యాలను ఎత్తుకోవల్సిన సందర్భం ఇది. విరసం కాక పోతే ఇంకెవరు తీసుకుంటారు.

 

14.                యువతరం సాహిత్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్న అని మీరు భావిస్తున్నారా.

జ.                అవును.యువతరం సాహిత్యం పట్ల ఆసక్తి గానే ఉన్నారు. కవిత్వం రాస్తున్నారు.కధలు రాస్తున్నారు. సాహిత్యం చదువుతున్నారు.

 

15.                యువతరాన్ని సాహిత్యానికి దగ్గర చేయడంలో విరసం పాత్ర ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?

జ.                విప్లవ సాహిత్య విస్తృతిని పెంచడానికి కృషి చేయాలని అనుకుంటున్నాను.అటు సైద్ధాంతికంగానూ యిటు సాహిత్య కార్యాచరణ లోనూ కొత్త ఆలోచనలనీ ప్రయోగాలనీ ప్రోత్సహించడం అవసరం.