ఇంటర్వ్యూలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఉత్తమ సాహిత్యమెప్పుడూ మనిషిని ఆరోగ్యవంతం  చేసే ఉత్తమ ఔషదమే-  రామా చంద్రమౌళి

ప్రసిద్ధ కవీ, కథా రచయితా, నవలాకారులు, విమర్శకులూ ఆచార్య రామా చంద్రమౌళి గారు గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు  ఇచ్చిన ఇంటర్వ్యూ                                                                     

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.   

      నేను వరంగల్లులో పుట్టి, పెరిగి చదువుకుని ఎదిగి.. ఎక్కువకాలం వరంగల్లులోనే ఉద్యోగించి.. ఇప్పుడు పదవీ విరమాణానంతరం వరంగల్లులోనే చరమజీవితాన్ని గడుపుతున్నవాణ్ణి. నా జన్మదినం 8 జూలై, 1950. అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న కనకయ్య. నిజాం కాలంలో వరంగల్లు నగరంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా విలసిల్లిన     'ఆజం-జాహి మిల్స్' లో కప్డా కాతాలో మొకద్దమా( సూపర్వైజర్ ) గా మా నాన్న పనిచేసేవాడు. అమ్మ బీడీలు చేసేది. చాలా పెద్ద కుటుంబం మాది. మేము ఆర్గురం అన్నదమ్ములం ముగ్గురు అక్కాచెల్లెల్లు. నేను పెద్దవాణ్ణి. చదువు అందరికీ అందుబాటులో లేదప్పుడు. నాల్గవ తరగతి వరకు ఒక వీధి పంతులు.. రాజయ్య సార్ అని.. పుణ్యాత్ముడు ఆశువుగా చెప్పిన పాఠాలు. నాల్గవ తరగతి ఐపోయిందంటే.. ఒక ప్రవేశ పరీక్ష రాసి వరంగల్లు నగరంలో ప్రముఖమైన 'మహబూబియా ఉన్నత పాఠశాల' లో ఆరవ తరగతిలో చేరిన. అదొక గొప్ప మహానుభూతి. ప్రసిద్ధ విద్యావేత్త బజారు హనుమంతరావు గారు మా ప్రధానోపాధ్యాయులు. నా విద్య, జ్ఞాన సముపార్జనకు పాఠశాలే పునాది. కాళోజీ గారి గురువు శ్రీ గార్లపాటి రాఘవరెడ్ది గారుకూడా మా పాఠశాలలో తెలుగు టీచర్ గా బోధన చేస్తూండేవారు. గంధపు చెక్కతో సంపర్కంవల్ల ఒట్టి కర్రముక్కకు కూడా కొంత అవశేష పరిమళం అబ్బినట్టు బహుశా మహనీయుని శిష్యరికంవల్ల కావచ్చు సాహిత్యం వైపు నా మనసు మళ్ళింది. మా తరగతికి హెచ్ ఎస్ సి వరకు నేనే క్లాస్ మానిటర్ గా ఉండేవాణ్ణి. అప్పుడు ప్రతి తరగతికి ఒక చిన్న గ్రంథాలయం ఉండేది కనీసం ఒక వంద పుస్తకాలతో. దాని నిర్వహణను నేనే చేయాలె. అందువల్ల ఒకటొకటిగా ఎన్నో పుస్తకాలను చదివే భాగ్యం కలిగింది నాకు.      

            హెచ్ ఎస్ సి తర్వాత పాలిటెక్నిక్. మెకానికల్ ఇంజనీరింగ్. అప్పుడు చదువే ఎంతో గొప్పది. తర్వాత కొంత కాలం ' భిలాయ్ స్టీల్ ప్లాంట్, మధ్యప్రదేశ్ ' లో 'చార్జ్ మ్యాన్ ' గా ఉద్యోగం. ఒక యేడాది తర్వాత  రాష్ట్రేతర ఉద్యోగులను తొలగించాలని అప్పుడు అక్కడ చెలరేగిన ఒక ఉద్యమం వల్ల ఉద్యోగం పోయింది. ఉన్నత పాఠశాలలో ప్రసిద్ధ రచయిత, కమ్యూనిస్ట్ మేధావి మన పూర్వ ప్రధానమంత్రి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు గారి సోదరులు శ్రీ పాములపర్తి సదాశివరావు పెద్ద కొడుకు శ్రీ నిరంజనరావు నాకు ఆరవ తరగతి నుండి హెచ్ ఎస్ సి వరకు, తర్వాత పాలిటెక్నిక్ లో కూడా సహపాఠి. నిరంజన్ రావు ద్వారా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పి వి నరసింహారావుగారి అనుగ్రహంవల్ల ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖలో నిర్వహించబడే పాలిటెక్నిక్, వరంగల్లు లో 'డిమాన్స్ట్రేటర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్' గా ఉద్యోగం 23-02-1970 . ఇక అక్కడినుండి జీవన పోరాటం మొదలు. చదువు అనేది అస్సలే అందుబాటులో లేని దైవ దినుసు. పైగా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలె. ఉద్యమాలు చేసి.. వరంగల్లు లో ఉన్న ' రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ' పార్ట్ టైం మొదటిబ్యాచ్ లో ఎంట్రన్స్ మొదటి ర్యాంక్ సాధించి.. బి టెక్ .. తర్వాత హైదరాబాద్ జె ఎన్ టి యు నుండి మొదటి బ్యాచ్ లో ఎం.ఎస్ డిగ్రీ. చివరికి పాలిటెక్నిక్ కాలేజ్ లో ' ప్రిన్స్‌పాల్ ( ఎఫ్ సి ) గా పదవీ విరమణ 31-01-2006 . అప్పటికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ గా పురస్కారాలు.. ఎన్నో ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలు రాయడం .. వేల వేల విద్యార్థులను తయ్యార్ చేయడం.. 2006 నుండి 2018 వరకు వరంగల్లు మహా నగరంలో వాగ్దేవి గ్రూప్ విద్యాసంస్థలలో ఒకటైన 'గణపతి ఇంజనీరింగ్ కాలేజ్' లో ప్రొఫెసర్ మరియు వైస్-ప్రిన్స్‌పాల్‌గా ఉద్యోగం చేయడం.. ఇదంతా నాకు అత్యంత ఇష్టమైన ఒక ఎడతెగని అధ్యాపక వ్యాపకం. మొత్తం కలిపి 50 సంవత్సరాల బోధనా వృత్తి.. తద్వారా మిగిలింది జన్మ సార్థకమైందన్న అనంతమైన తృప్తి.  

     నా మొట్టమొదటి రచన నేను తొమ్మిదవ తరగతిలో ఉండగా ' చందమామ ' పిల్లల మాసపత్రికలో వచ్చింది. దాని పేరు ' సువర్ణ శతదళ పుష్ప రహస్యం '. మహబూబియా పాఠశాలలోనే రాఘవరెడ్డి గారి వల్ల ఒకసారి కాళోజీ గారి మొదటి కవిత్వ సంపుటి 'నా గొడవ'ను మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించడం.. సభలో నెక్కర్లు తొడుక్కునే వయసులో మేమందరం పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో పాల్గొనడం.. అవన్నీ అద్భుతమైన మరుపురాని మధుర జ్ఞాపకాలు

2.         మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి 

            మహబూబియా ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుకుంటున్నపుడు సంవత్సర పరీక్షలు జరిగిన తర్వాత మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ బజారు హనుమంతరావు గారు సంవత్సరం పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి పేర్లను తానే స్వయంగా క్లాస్ క్లాస్‌కు వచ్చి ఒక్కొక్కరి పేరును గంభీరంగా చదివి వినిపించేవారు. అప్పుడు పిల్లల తండ్రులు క్లాస్ గది బయట ఎంతో ఉత్కంఠతో నిలబడి తన పిల్లవాని పేరు ఎప్పుడొస్తుందా అని గుండెలను అరచేతిలో పెట్టుకుని వినేవారు. విద్యార్థుల పరిస్థితైతే 'దేవుడా దేవుడా' నే. అప్పుడు 'డెటెన్షన్' విధానం ఉండేది. పేరు రాకుంటే 'ఫెయిల్' అని అర్థం. వాడిక అదే తరగతిని మళ్ళీ చదవాలన్నమాట. మా నాన్న తనూ, తన ఇద్దరు మిత్రులతో సహా వచ్చి.. చూడు మా వాని ఘనత అన్నట్టు వెనుక నిలబడి ఉన్నాడు. నాది ఐదవ పేరుగా చదివారు హనుమంతరావుగారు. ఇక సముద్రం పొంగింది నాలో. పట్టపగ్గాల్లేని ఆనందం. ఆరోజు విజయానికి చిహ్నంగా నాయిన నాకూ నాన్న మిత్రులందరికీ అప్పటి వరంగల్‌లో ప్రతిష్టాత్మకమైన ' రామా విలాస్' లో రవ్వా దోశ తినిపించి కానుకగా నాకు ఉత్పల సత్యనారాయణాచార్యులు రచించిన 'బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల మహాభారతం, బాలల బొమ్మల భాగవతం' కొనిచ్చారు. అంతే.. రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా.. ఎప్పుడెప్పుడు పుస్తకాలనూ. అక్షరాల అమృతపరిమళాలను ఆఘ్రాణిస్తానా అనే ఉత్కంఠ. పుస్తకాలు నా జీవితంలో మొట్టమొదట నాలో సాహిత్యం పట్ల ఇక ఏనాడూ వాడని ఒక మహానుబంధాన్ని ఏర్పర్చాయి. ప్రధానంగా 'మహాభారతం' ఒక భాషకందని ఆనందోద్వేగాలను నాలో స్థిరపర్చింది.           

              ఇప్పటికీ 'మహాభారతం' అనే భారతీయుల వ్యాస విరచిత మహాగ్రంథం నన్ను వివిధ దశల్లో ఆశ్చర్య చకితుణ్ణి చేస్తూనే ఉంది. బృహత్ నిర్మాణం, పాత్రల సృష్టి, నడక, ప్రతి పాత్ర వెనుక ఉన్న శ్రేష్టత, తాత్వికత, రాజనీతి సూత్రాలు, దాని ఔన్నత్యం ఇవన్నీ నన్ను గర్వపరుస్తూనే ఉన్నాయి. మొన్న మొన్న టి టి డి వాళ్ళు 15 సంపుటాలుగా ప్రచురించి వెలువరించిన నన్నయభట్టు ( కవిత్రయం ) రాసి వెలువరించిన నిజ మదాంధ్ర మహా భారతంను చదివాను.. ఉద్ధందుల వ్యాఖ్యా వివరణలతో. సమగ్ర కృతిని చదివిన తర్వాత ప్రపంచ సాహిత్యంలో భారతీయుల 'మహాభారతాన్ని' మించిన మహాద్భుత బృహత్ రచన మరొకటి లేదు అని బోధపడింది. బహుశా నేను వివిధ రచయితలతో రాయబడి వ్యాఖ్యానించబడ్డ పదిపదిహేను మహా భారతాలను చదివి ఉంటాను. ఐతే కథ, కథనం, పాత్రల సృష్టి.. చదరంగంలో పావులను ప్రజ్ఞతో కదుపుతున్నట్టు.. అబ్బో.. చదివిన ప్రతిసారీ అమృతపానమే. నన్ను పూర్తిగా ఆక్రమించి నన్ను రచయితగా, కవిగా, నవలాకారునిగా.. అన్నింటిని మించి సాహిత్య పఠితగా పరివర్తింపజేసిన మహాగ్రంథం ఒక్క 'మహాభారతమే'. మహాభారతం.. అనబడే ఒక అక్షరనిధి పుట్టిన పుణ్యభూమిలో నేను కూడా పుట్టినందుకే అనుక్షణం పులకించి పోతూంటాను. ఇక అక్కడినుండి నేను అక్షర సవ్యసాచిగా మారి తొమ్మిదవ తరగతినుండే రచయితగా శరపరంపరగా విస్తరిస్తూ పోయాను. చందమామ, బాలమిత్ర లతో మొదలుకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు వాళ్ళ ప్రామాణిక మాసపత్రిక 'భారతి' లో నా రచనలు ఒక ఝరిలా వచ్చే స్థాయికి ఎదిగి వెలిగాను. విజ్ఞులు 'బాలమిత్ర టు భారతి' రచయిత అని శ్లాఘించేవారు.      

            ఎదుగుతున్నకొద్దీ నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు.. కవిగా  ఒకే ఒక్కడు.. కాళోజీ, కథా రచయితగా.. రాచకొండ విశ్వనాథశాస్త్రి, డి.జయకాంతన్. ఒక  నవలాకారునిగా..నన్ను నేనే నిర్మించుకున్నా. నాపై ఎవరి ప్రభావమూ లేదు. విస్తృతంగా చదవడం, భారతీయ తెలుగేతర రచయితలనూ, కవులనూ అధ్యయనం చేయడం, అంతర్జాతీయ పోకడలను ఆకళింపు చేసుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను నేను ఉన్నతీకరించుకోవడం.. ఎప్పటికైనా నాదైన ఒక 'స్వంత గొంతు' ను సృష్టించుకోవడానికి కృషి చేస్తూండడం.. అనే దిశలో సాగినవాణ్ణి నేను. వృత్తి రీత్యా ఒక ఇంజనీర్నైన నేను తెలుగు భాషకు సంబంధించిన సంస్థలతోనూ సంబంధాన్ని కలిగిఉండే అవకాశం నాకు కలుగలేదు.       

            ఇక సంస్థలు.. సినిమా ఇండస్ట్రీ లో పనిచేయడం వల్ల అప్పుడు ఒకే ఒక సాహిత్య సంస్థగా ఒక వెలుగు వెలిగిన 'అభ్యుదయ రచయితల సంఘం' తో అనుబంధంగా ఉండేవాణ్ణి. వరంగల్లులో నేను ప్రధాన కార్యదర్శిగా, ఆచార్య పేర్వారం జగన్నాధం అధ్యక్షులుగా 'అభ్యుదయ రచయితల సంఘం కొన్నేళ్ళు పని చేసింది. ఒక సంవత్సరం చాలా భారీ ఎత్తున 'ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియం' లో సి. నారాయణరెడ్డి, గుమ్మడి, డా. ఆవంత్స సోమసుందర్ లతో సాహిత్య సభ, తర్వాత్తర్వాత గుంటూరు శేషేంద్రశర్మతో ఒకసారి భారీ సభలు ఏర్పాటు చేశాము. అప్పుడే 1971 లో నా మొదటి కవితా సంపుటి 'దీపశిఖ' వెలువడింది. ఇక పత్రికలు.. నా కథలు, కవితలు, నవలలు ప్రచురించని తెలుగు పత్రిక లేదు. 1970 నుండి 90 వరకు తెలుగు పత్రికా సాహిత్యానికి స్వర్ణయుగం. ప్రతి దీపావళికి ఐదారు ప్రత్యేక సంచికలు వెలువడేవి. వాటిలో తన కథో, కవితో రావడం ఒక రచయితకు ప్రత్యేక గుర్తింపుగా భావించబడేది. ఐతే.. అన్ని సంచికల్లోనూ తప్పనిసరిగా నా రచన ఉండేది. మహిళా రచయిత్రులు విజృంభించి ఒక వెలుగు వెలిగిన దశాబ్దాలు అవి. సాహిత్యానికీ, సినిమాలకూ ప్రధాన కేంద్రం 'విజయవాడ' అప్పుడు.  

            తుర్లపాటి కుటుంబరావు ( ఆంధ్రజ్యోతి ) , కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం ( ఆంధ్రప్రభ ), మద్దుకూరి చంద్రశేఖరరావు ( ప్రగతి ), శివలెంక రాధాకృష్ణ ( ఆంధ్రపత్రిక ).. వీళ్లు అప్పటి ఉన్నతస్థాయి పాత్రికేయ మిత్రులు నాకు. స్థానికంగా అప్పటి నా సన్నిహితులు శ్రీ సుప్రసన్న, డా. అంపశయ్య నవీన్, ఆచార్య మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, అనుమాండ్ల భూమయ్య తదితరులు. ఇప్పటి ప్రసిద్ధ  రచయితల్లో.. 'సృజనలోకం' వ్యవస్థాపక అధ్యక్షులు బహుముఖ ప్రజ్ఞాశాలి డా. లంకా శివరామప్రసాద్, ఆచార్య కాత్యాయనీ విద్మహే, ఆచార్య బన్న అయిలయ్య, జి. గిరిజామనోహరబాబు, వి.ఆర్.విద్యార్థి, చంద్, అన్వర్, పొట్లపల్లి శ్రీనివాసరావునెల్లుట్ల రమాదేవి, అనిశెట్టి రజిత తదితరులు నాకు సన్నిహితులు.  

             సవ్యాసాచిలా నేను పాఠకులకు అందించాలనుకున్న ఆలోచనలకు తగ్గట్టు ప్రక్రియను ఎన్నుకుని బహుముఖంగా రచనలను శరపరంపరగా వెలువరిస్తూ వచ్చాను.. మధ్య 1984 నుండి.. 2004 వరకు సాహిత్య అజ్ఞాతంలోకి (అంటే.. ఇరవై ఏండ్లు ) వెళ్ళి పూర్తిగా రాయడం మానేసి కూడా ఇప్పటిదాకా నేను మొత్తం 32 నవలలు, 483 కథలు, 14 కవిత్వ సంపుటాలు, 4 విమర్శా గ్రంథాలు, 3 నాటకాలు.. మొత్తం వెరసి ఇంతవరకు 63 పుస్తకాలు వెలువడ్డాయి నావి. అతి ఎక్కువ రచనలు నావి ఇంగ్లిష్ లోకి అనువదింపబడి అంతర్జాతీయ పాఠకులకు అందాయి. దాదాపు 19 మంది ప్రసిద్ధ అనువాదకులు నా రచనలను ఇంగ్లిష్ లోకి అనువదించారు. వాళ్ళు శ్రీశ్రీ, వేగుంట మోహనప్రసాద్, వి వి బి రామారావు, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి, ఆచార్య కె. పురుషోత్తం, డా.లంకా శివరామప్రసాద్, రామతీర్థ, ఆచార్య ఇందిరా బబ్బెల్లపాటి, యు.ఆత్రేయశర్మ, ఆర్.అనంతపద్మనాభరావు, రావెల పురుషోత్తమరావు, ఎం.వి.ఎస్ ప్రసాద్, మైదవోలు వెంకట శేష సత్యనారాయణ. ఆచార్య కె.శ్యామల, డా. దినకర్, డా.పి వి.లక్ష్మీప్రసాద్ వంటి అనేకులు.  

            తెలుగేతర భారతీయ భాషల్లోకి కూడా నా రచనలనేకం అనువాదం చేయబడి యా ప్రాంత పాఠకులకు పరిచయమయ్యాయి. మొత్తం మీద మన దేశ సాహిత్యకారులనేకమందికి నేను ఒక వరిష్ఠ సాహిత్యకారునిగా పరిచయమై నా స్థానాన్ని పదిలపరుచుకున్నాను. ఇది నాకు సంతృప్తిని మిగిల్చిన సాహిత్య జీవితమే.

              అనేకానేక కారణాలవల్ల, అవకాశాలవల్ల నేను చాలా అంతర్జాతీయ వేదికలపై 'భారత ప్రతినిధి' గా పాల్గొని సమకాలీన సాహిత్యకారునిగా దేశ 'గొంతు' ను వినిపించాను

            ఐతే.. సాహిత్య ప్రక్రియ ఏదైనా పాఠకులకు ప్రయోజనాన్ని కలిగిస్తూ వాళ్ళను ఉన్నతీకరించేదిగా ఉండాలని నా విస్పష్ట భావన

3.          మీ మొదటి రచన సందర్భంలో వచ్చింది. మీ రచనల గురించి చెప్పండి.  

      నిజం చెప్పాలంటే.. చాలా మంది రచయితలు ఆరంభ దశలో పత్రికల్లో తమ పేరును అచ్చులో చూచుకోవాలన్న తపనతోనే రాయడం మొదలు పెడ్తారు. నేను దానికి మినహాయింపు కాదు. మొట్టమొదట తొమ్మిదవ తరగతిలో ఉండగా ' చందమామ ' పత్రికలో నా మొదటి కథ అచ్చయినప్పుడు ఎన్నిసార్లు నా పేరు అచ్చయిన అక్షరాలను తడిమి తడిమి ఆనందపడ్డానో. తర్వాత్తర్వాత రచయితకు అవగాహనా, ఆత్మవిమర్శా, తనను తాను తెలుసుకునే తత్వం పెరుగుతూ సమాజంపట్ల ఒక పౌరునిగా తన బాధ్యత తెలుస్తూ.. పౌరులూ, దేశం.. దోపిడీ.. పేదరికం, పేదలు ఎలా, ఎందుకు తయారౌతున్నారో నుండి మొదలై.. అందరూ ఒకే రీతిగా జన్మిస్తున్న వాళ్ళు ఇట్లా భిన్న భిన్నంగా ఎందుకు ఎవరివల్ల, ఎవరిచేత ఎట్లా ధనికులుగా, పేదలుగా మారుతున్నారో తెలుస్తున్నకొద్దీ.. వివక్ష గురించీ, విచక్షణ గురించీ.. క్రమక్రమంగా అర్థమౌతూ.. రచయిత ఎప్పటికైనా పీడితులవైపు నిలబడి పోరాటం చేయాలనీ.. అందరికీ సమ న్యాయం జరగాలనీ.. అసమ సమాజాన్ని మరమ్మత్తు చేయాలనీ.. ఒక ' ఎరుక ' అక్షరకారునిలో ఉదయిస్తుంది. అది పెరిగి పెరిగి రచయితకు ఒక మార్గ 'నిర్దేశన' చేస్తుంది.  

              విధంగా  రచయిత బాధ్యత తెలుస్తున్న తొలి దశలో, 1971 లో నా మొట్టమొదటి కవిత్వ సంపుటి 'దీపశిఖ' వెలువడింది. పుస్తకం ధర.. రూపాయి ముప్పావలా. దాని ప్రచురణకైన ఖర్చు తొమ్మిది వందల రూపాయలు. నావి ఐదువందలు. నా బాల్య స్నేహితుడు ఆర్.గిరి ఇచ్చినవి మిగతా నాల్గు వందలు. అది విత్తనం రాతి నేలలోనుండి మొలకగా తలెత్తుకుని నిలబడ్తున్న దశ

            రచయితకు ధైర్యంతో కూడిన ఒక లక్ష్యం ఉండాలని తెలుసుకుంటున్న సందర్భం

 4.        మీరు రాసిన అతి పెద్ద నవల 'కాలనాళిక '. నవలను సందర్భంలోనుండి రాశారు

         నేను వరంగల్లులో పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం చేసి, ఉద్యోగం కూడా ఎక్కువ కాలం ఇక్కడే చేసి.. చాలా సుదీర్ఘ కాలం ఇక్కడి నేలతో, జీవితంతో, ఆచార వ్యవహారాలతో అనుబంధం కలిగి ఉన్నవాణ్ణి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇక్కడి పక్కా స్థానికుణ్ణి. అందువల్లనే 1969 లో జరిగిన తొలి ' ప్రత్యేక తెలంగాణ ' ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తిని కొద్ది రోజులు వాయిదాల పద్ధతిపై జైలుకెళ్ళి వచ్చినవాణ్ణి. విద్యార్థిగా అప్పటికే చైతన్యవంతమైన స్పృహ ఉన్న 'పాలిటెక్నిక్' కాలేజ్ విద్యార్థి సంఘ నాయకునిగా యువతను సమీకరిస్తూ ఉద్యమ బాటలో పయనిస్తున్నవాణ్ణి. దాదాపు అప్పటి తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్లమెంట్ స్థానాలను తెలంగాణ ప్రజా సమితికి ఓట్లేసి గెలిపిస్తే రాజకీయ ద్రోహులచేత  ఇక్కడి ప్రజలు వంచించబడి మహోగ్ర ఉద్యమం 369 మంది అమరులను కోల్పోయి మోసపోయిందో అర్థం కాలేని నిస్సహాయ పరిస్థితుల్లో.. నివురుగప్పిన నిప్పులా తెలంగాణ మిగిలి.. అంతఃచైతన్యంతో ఆలోచనాపరులైన యువత ' తీవ్రవాద ఉద్యమాల్లోకి ' తమ దారులను వేసుకుంటున్న సందిగ్ధ సమయం అది.. 1969 నుండి.. 1985 వరకు.. తెలంగాణ ఒక నిప్పుల సముద్రం.. కల్లోల కడలి.. హింస ప్రతిహింస తో కనలిపోతూ వసంత గర్జనతో లోలోపల ఉడికిపోయిన సమయం. అటు శ్రీకాకుల పోరాటాలు, ఇటు ఉత్తర తెలంగాణలో పీపుల్స్ వార్, అటు బి వి పి ప్రతిఘటనలు.. అంతా రక్తసిక్తమైన దశాబ్దిన్నర కాలం. మధ్యలో 'ఎమర్జన్సీ' దేశవ్యాప్త హక్కుల పోరాటాలు. అంతకు ముందు 1942 నుండి.. నిజాం ప్రభుత్వంలో రజాకార్ల నిత్య హింస.. మత మార్పిడులు. గ్రామాల్లో దొరల దోపిడీ పాలన. ఇక తట్టుకోలేని హింసలోనుండి పుట్టింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం' ( సంగం). రావి నారాయణరెడ్డి, డి వి కె తదితరుల నాయకత్వంలో 1947లో ఆవిర్భవించి చెప్పా పెట్టకుండా ఆంధ్రా కమ్యూనిస్ట్ నాయకత్వం మోసం చేసి 1951లో అనివార్య పోరాట విరమణ.. ఇక పోలీస్ చర్యతో వేలమంది నిరక్షరాస్య అసహాయ గ్రామీణ ప్రజల ఊచకోత.   

             ఇదంతా 1934 లో వరంగల్లులో నిజాం ఆరంభించిన 'ఆజం- జాహి- మిల్స్' నుండి మొదలై 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 'బంగారు తెలంగాణ' వైపు అడుగులను సంధించుకుంటున్న సంధి కాలం.. అంటే 2017 దాకా .. మొత్తం 80 సంవత్సరాల చరిత్ర కథాత్మక నవలను డాక్య్మెంట్ చేస్తూ భావి తరాలకు అందివ్వాలన్న సంకల్పంతో.. దాదాపు రెండు సంవత్సరాల సమాచార సేకరణతో కష్టపడి రాసిన బృహత్ నవల 'కాలనాళిక'. దీంట్లో ఎందరో ఇప్పటికీ జీవించిఉన్న  ఉద్యమకారుల వాస్తవ జీవితాలున్నై. మన కళ్ళముందే ఇంకా సజీవంగా ఉన్న మనుషులు కూడా పాత్రలుగా ఉన్న నవలను రాయడం ఒక సాహసోపేత క్రియ. అందుకే దీన్ని ఒక వర్తమాన ' ఇతిహాసంగా ' అభివర్ణించారు విజ్ఞులైన విమర్శకులు

            ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక అసాధారణ రచన. దీన్ని రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.   

5.         అనేక నవలలు, కథలు, కవితలు రాశారుగదా.. వీటికి అన్ని వస్తువులు ఎలా దొరుకుతాయి ?

          నిజమైన, హృదయమున్న, బాధ్యత తెలిసిన రచయిత సమాజాన్నీ, తన చుట్టూ ఉన్న మానవ ప్రవర్తనలనూ, మనుషులను నిద్రబుచ్చుతూ , ప్రజలను పనికిరాని సోమరిపోతులుగా మార్చుతున్న పాలకులనూ డేగకళ్ళతో గమనిస్తూ.. అత్యంత సునిశితంగా స్పందిస్తూ రచయితంటే ఒక సాంస్కృతిక సేనానిగా ఆలోచనాపరులైన పాఠకులను చైతన్యపరుస్తూ నాయకత్వం వహిస్తుంటాడు. అఫ్కోర్స్.. ఒట్టి కాలక్షేప సాహిత్యాన్ని సృష్టించే రచయితల గురించి మనకు పేచీయే వద్దు

            కోణంలో బాధ్యతాయుతంగా చూచినపుడు రచయిత యొక్క సామాజిక పాత్ర చాలా గురుతరమైంది. నేనెప్పుడూ రచనను ఒక పౌర బాధ్యతగా భావించే రాస్తాను నవలైనా, కథైనా.. కవితైనా. అట్లా స్వీకరిస్తున్నపుడు ప్రతి నిత్యం ఎదురయ్యే అనేక సందర్భాలన్నీ సాహిత్య వస్తువులుగానే కనిపిస్తాయి. తగు ప్రతిభగల సృజనాత్మకత ఉంటే అవి మంచి శ్రేష్ఠమైన రచనలుగాకూడా పాఠకుల మనసుల్లో మిగిలిపోతాయి. ఐతే ఇక్కడ ఒక ప్రాసంగికమైన విషయం కూడా ఉంది. రచయిత యొక్క వృత్తి కూడా అవ్యక్తంగానే రచయితయొక్క రచనల్లో వస్తువుగా చొరబడి వర్థిల్లుతూంటుంది. ఉదాహరణకు మంచి కథా రచయితలైన రా.వి శాస్త్రి, బీనాదేవి కథల్లో వాళ్ళిద్దరూ న్యాయవాద వృత్తిలో ఉండడంవల్ల చాలా కోర్ట్ కథలే వస్తువులుగా దర్శనమిస్తాయి.

            నేను ఇంజనీరింగ్ కాలేజ్‌లలో పనిచేసిన ప్రొఫెసర్‌ను కావడం వల్ల ఇంజనీరింగ్ విద్యా రంగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు జరిపే దోపిడీ గురించి ఎన్నో కథలు రాశాను. క్షుణ్ణంగా తనకు తెలిసిన విషయం గురించే సాధికారికంగా రాయడం రచయిత యొక్క నిజాయితీని కూడా తెలియపరుస్తుంది.

6.         'సృజనలోకం'   సందర్భంలో వచ్చింది?

             2004 లో నాకు ఒక తీవ్రమైన వెన్నెముక యాక్సి్డెంట్ జరిగింది. అప్పుడు మన వరంగల్లు శివనగర్ లో ఉంటూ ప్రజావైద్యునిగా మంచిపేరున్న డా. లంకా శివరామప్రసాద్ గారు అప్పటికే నగరంలో ప్రసిద్ధులైన సాహిత్యకారులు డా. అంపశయ్య నవీన్, వి.ఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, డా. నేరెళ్ళ వేణుమాధవ్, ఆచార్య కోవెల సుప్రసన్న గార్లను సంప్రదించి వాళ్ళ ఆశీస్సులతో ఒక సాహిత్య సంస్థ 'సృజనలోకం' ను హోటల్ రత్న లో ఆవిష్కరించి డా.ప్రసాద్ రాసిన ఆరు పుస్తకాలను వెలువరించారు. తర్వాత నన్ను కూడా సంప్రదించినపుడు.. సంస్థకు ఒక చురుకైన రూపమిద్దామని అనుకుని కార్యాచరణకు పూనుకున్నాం. ఏదో కొత్త సాహిత్య వాతావరణాన్ని వరంగల్లు మహానగరంలో ఆవిర్భవింపజేయాలన్నది ఆనాటి సంకల్పం.

            శివరామప్రసాద్  ఒక అసాధారణమైన సాహిత్యకారుడు

7.         మీరు వేసిన ' కవితా వార్షిక ' గురించి చెప్పండి. సందర్భంలో ఒక ప్రధాన సంపాదకుడిగా మీ  అనుభవాలు కూడా చెప్పండి.

           ఇప్పుడే చెప్పినట్టు 2004 లో 'సృజనలోకం' ఆరంభమైన తర్వాత ఒక విలక్షణమైన నిరంతర సాహిత్య కార్యక్రమమేదన్నా మొదలుపెడ్దామన్న ఆలోచనలోనుండి 'కవితా వార్షిక' పుట్టింది. ఏమిటంటే.. ఏడాదికా ఏడాది తెలుగు పత్రికల్లో వెలువడ్తున్న వచన కవిత్వాన్ని సేకరించి అందులోనుండి చిక్కని కవిత్వంతో పరిపుష్టమైన కవితల్ని ఎంపిక చేసి, వాటిని అంతర్జాతీయ స్థాయిలో చదివి దాచుకోదగ్గ విధంగా వార్షికలను 'సృజనలోకం' ప్రచురించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. అందుకు డా. అంపశయ్య నవీన్ గౌరవ సంపాదకులుగా, నేను ప్రధాన సంపాదకులుగా, వి ఆర్. విద్యార్థి, డా. లంకా శివరామ ప్రసాద్పొట్లపల్లి శ్రీనివాసరావు, శ్రీమతి నెల్లుట్ల రమాదేవి సంపాదకులుగా ఒక సంపాదక వర్గం వెన్వెంటనే ఏర్పడి చాలా క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో ప్రతి సంవత్సరం మార్చ్ మూడవ ఆదివారం నాడు ఉదయం 11.00 గంటలకు సంవత్సరపు 'కవితా వార్షిక' సంచికను ఆవిష్కరింపజేయాలని నిర్ణయించి మొదటి సంపుటి 'కవితా వార్షిక- 2004' ను  20-03-2004 వరంగల్లులో 80 మంది కవుల కవితలతో ఘనంగా అంతర్జాతీయ స్థాయిలో డా. నందిని సిద్ధారెడ్ది గారిచే ఆవిష్కరింపజేశాం. అదే విధంగా 19-03-2005 99 మంది కవుల కవితలతో 'కవితా వార్షిక - 2005' ను డా.ఎన్.గోపి గారు ఆవిష్కరించారు. 92 మంది కవితలతో 'కవితా వార్షిక- 2006' ను 18-03-2006 డా.పి.వరవరరావు ఆవిష్కరించారు. విధంగా 2007, 2008, 2009..మొత్తం 6 సంపుటాలు వెలువడి కవులకు ఎంతో కవిత్వ గౌరవంతో కూడిన ఒక ఆకర్షణగా స్థిరపడింది. ప్రతి సంపుటిలోనూ 'ప్రస్తావన' శీర్షికన ప్రధాన సంపాదకులు సంవత్సరం జరిగిన విశేష విషయాలను విశ్లేషించడం, 'సమాలోచన' శీర్షికన ఒక సీనియర్ కవి చేత విశేష అంశంపై లోతైన వ్యాసాన్ని ప్రచురించడం, తర్వాత 'కవితా గోష్ఠి' శీర్షికలో 'కవిత్వానువాదం' వంటి సంక్లిష్ట విషయం పై ప్రసిద్ధ అనువాదకులతో ఒక గోష్టిని ఆన్ లైన్ లో నిర్వహించి మొత్తం చర్చను అచ్చు వేయడం.. తర్వాత వరుసగా ఎంపిక చేయబడ్ద కవితలను హుందాగా ప్రచురించడం జరుగుతూ వచ్చింది.    

            ఐతే ప్రచురణ ఎంత గౌరవ చిహ్నంగా మారిందంటే.. సంవత్సరం 'కవితా వార్షిక' సంపుటిలో తమ కవిత ఎంపిక కాకుంటే కవులు నొచ్చుకునేవారు. అచ్చయితే కవులు పొంగిపోయేవాళ్ళు.  

            ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నపుడు ప్రత్యేకంగా ఉద్యమ కవితల తో 'కవితా వార్షిక- 2009' ని వెలువరించాం

            ఇతే పోనూ పోనూ కవిత్వాన్ని ఎంపిక చేయవలసిన సందర్భంలో.. నానాటికి వస్తున్న వచన కవిత్వం ఆశించిన స్థాయిలో తగు సంఖ్యలో కవితలు పరిపుష్టంగా రావడలేదనీ, తక్కువ సంఖ్యలో వస్తున్న ఉత్తమ కవితలతో ఇన్ని వ్యయప్రయాసలకోర్చి 'వార్షిక' లను వెలువరించడం అంత సంతృప్తికరంగా అనిపించక సంపాదకవర్గం  2009 తర్వాత వార్షికల ప్రచురణను నిలిపివేసింది.

            ఐతే.. ఆరు సంచికలూ విజ్ఞులైన పెద్దల, అకడమీషియెన్స్ యొక్క ప్రశంసలకు నోచుకుని ఒక ప్రత్యేక గుర్తింపును పొందాయి. వీటిపై కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎం.ఫిల్ లు, డాక్టరేట్ పరిశోధనలూ కూడా జరిగాయి.  

8 .        వరంగల్ సాహిత్య వాతావరణం ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత మీ సాహిత్యంపై చూపిన ప్రభావం ఎలాంటిది ?

           ఆదికవి పాలకుర్తి సోమనాథుడు పుట్టిన ఓరుగల్లు పుణ్యభూమిపై జన్మించడమే జన్మతః ఒక అదృష్టం. పుట్టుకతోనే మహాకవి బమ్మెర పోతన, కాకతీయ మహోన్నత సాంస్కృతిక వైభవం తదాదిగా అత్యంతాధునికులైన వానమామలై వరదాచార్యులు, కాళోజీ, సుప్రసన్న, విప్లవకవి వరవరరావు వంటి ఉద్ధండులకు చెందిన నేలపై ప్రభవించడమే నాకు ఒక వారసత్వంగా లభించిన గొప్ప వరం. ఇక్కడ శ్వాసిస్తూండడమే ఒక సుకృతం. వీళ్ళలో ద్విపద వంటి అత్యాధునికమైన ప్రక్రియను కనిపెట్టి జాను తెలుగు భాషతో నాట్యమాడించిన బసవపురాణ కర్త సోమనాథుడైతే.. తెలుగు ఇంటింట 'ఆంధ్ర మహా భాగవత' పద్యాలతో అక్షర పరీమళాలను గుబాళింపజేస్తూ దశదిశలను సంపన్నం చేసినవాడు పోతన. అందువల్ల ఇక్కడి ప్రతి వ్యక్తిలోనూ అజ్ఞాత సాహిత్య అభినివేశం గుప్తమై ఉంటుంది. అనేక భావజాలాలు, అనేకానేక ఆలోచనలు, భిన్న విభిన్న పదప్రయోగాలు జరిగి గొప్ప సాహిత్య సంపదతో తులతూగిన మట్టి ఇది. ఇక్కడినుండే 'నేనుకూడా' అన్న భావనే ఒక మహత్తర యోగ్యత నాకు.

            చిన్నప్పుడు.. నాతోపాటు జీవించి ఉన్న ప్రత్యక్ష సాహిత్య సంపద కాళోజీ, కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న, తెలుగు నవలకు అందమైన ముఖచిత్రంగా భాసిల్లే డా. అంపశయ్య నవీన్, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అనేకసార్లు జైలు జీవితాన్ననుభవిస్తూ నమ్మిన సిద్ధాంత ఆచరణలో 'గాంధీ' తో సమానుడైన విప్లవకవి వరవరరావు .. ప్రపంచ ప్రఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్.. పత్రికా రంగ ప్రథముడు 'జనధర్మఎం.ఎస్ ఆచార్య..  వీళ్ళందరితో కలిసి జీవించడం నాకు సంక్రమించిన  ఆజన్మ సుకృతం. నేపథ్యంతో మొదలైంది నా సాహిత్య జీవితం.    

              అనుక్షణం  నాకు కరదీపికలుగా దారిచూపే మహనీయుల వారసునిగా బాధ్యతాయుతంగా ఒక విలక్షణ సృజన చేయాలె అన్న అంతఃభావన సరియైన దారిలోనే నన్ను నడిపిస్తూ వచ్చింది ఇన్నాళ్ళూ.. యాభై ఏళ్ళూ. అందువల్లనే నాదైన ఒక ప్రత్యేక గుర్తింపు గలిగి తలెత్తుకుని చెప్పుకోగల రచనలనే చేస్తూ వచ్చాను ఇన్నాళ్ళూ. నాపై వీళ్ళందరి ప్రభావమూ, ప్రేరణ ఉంది నిరంతర అంతఃజ్వలనగా

9.         ప్రస్తుతం వరంగల్ సాహిత్య వాతావరణంను ఎలా చూస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలో రావలసిన మార్పులు ఏమైనా ఉన్నాయా

        వరంగల్లు మహానగరం తన సహజ సాహిత్య వారసత్వ వైభవాన్ని కాపాడుకుంటూ వస్తూనే ఉంది. కాళోజీ తర్వాత జాతీయ స్థాయిలో అనేక ప్రత్యేక గుర్తింపును సాధిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ వంటి అత్యున్నత స్థాయి పురస్కారాలను హస్తగతం చేసుకుంటూ డా. అంపశయ్య నవీన్, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి, ఆచార్య కాత్యాయనీ విద్మహే, అచార్య కోవెల సుప్రసన్న, మహావక్తలు పి.వరవరరావు, నెల్లుట్ల వేణుగోపాల్, వరంగల్లు నగరానికి మొట్టమొదటిసారి ప్రభుత్వ 'స్వర్ణ నందిని  నడిపించుకుని తెచ్చిన, అనేక అంతర్జాతీయ వేదికలపై వరంగల్లు స్వరాన్ని వినిపిస్తున్న రామా చంద్రమౌళి, సాహిత్య విరించి, మంచి వక్త జి.గిరిజామనోహరబాబు, కళాప్రపూర్ణ నేరెళ్ళ వేణుమాధవ్.. తనదైన ఒక ప్రత్యేక కవిత్వ పంథా కలిగి ఉన్న ప్రపంచ స్థాయి కవి వి ఆర్. విద్యార్థి.. కాళోజీ పురస్కార గ్రహీత, ఉత్తమశ్రేణి పరిశోధకులు ఆచార్య బన్న అయిలయ్య, తనదైన విలక్షణ చూపుతో అద్భుత వచన రచనలు చేసిన పి.చంద్.. వీళ్ళందరూ ఇప్పటి తరపు అక్షర విజేతలు. ఇక పర్తమాన రెండవ తరం ప్రతినిధులుగా వారసత్వాన్ని భుజాలపై మోస్తూ ప్రయాణం కొనసాగిస్తున్న వాళ్ళు అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, నెల్లుట్ల రమాదేవి, సిరాజుద్దీన్, కోడూరి విజయకుమార్, అన్వర్, డా.పసునూరి రవీందర్, బిల్లా మహేందర్, బండారి రాజ్‌కుమార్, నందకిశోర్, బాలబోయిన రమాదేవి, దేవనపల్లి వీణావాణి, సింగరాజు రమాదేవి. పాత్రికేయ అక్షరధారులు గుండెబోయిన శ్రీనివాస్, శెంకేశి శంకరరావు, నూరా శ్రీనివాస్, వంగాల సంపత్‌రెడ్డి, సుధాకర్, పందిళ్ళ అశోక్‌కుమార్, డా.పాతూరి రఘురామయ్య తదితరులు. వీళ్ళు చేస్తున్న నిరంతర కృషి గణనీయమైంది. తెర వెనుక ఉన్న మరో సాహిత్యవేత్త , నడుస్తున్న ఎన్సైక్లోపీడియా నాగిళ్ళ రామశాస్త్రి. సినిమా రంగంలో గీత రచయితలుగా వరంగల్లు కుసుమాలుగా పరిఢవిల్లుతున్నవాళ్ళు చంద్రబోస్, డా. కందికొండ.         

             ఐతే.. వరంగల్లు నగరానికి చెంది వరంగల్ ఔన్నత్యాన్ని నగర సాహిత్య ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై నిరంతరం ధ్వనింపజేస్తూ.. అతున్నత స్థాయిలో బహుముఖ గుణాత్మక ప్రతిభను చాటి చెబుతున్నవాడు డా. లంకా శివరామప్రసాద్. ఆయన 'సృజనలోకం' వ్యవస్థాపకులు.. ఇప్పటిదాకా అనన్యసాధ్యమైన 160 విలక్షణ గ్రంథాలను విశ్వసాహిత్యానికి అందించినవాడు. తెలుగులో మొట్టమొదట పోతన విరచిత 'ఆంధ్ర మహా భాగవతాన్ని', ఆది శంకరాచార్య కృత 'సౌందర్య లహరి'ని, మొత్తం 'గ్రీకు' సాహిత్యాన్ని ఒక గుచ్ఛంగా అనువదించి. 'ఫ్రెండ్ ఆఫ్ గ్రీస్' పురస్కారాన్ని గ్రీక్ ప్రభుత్వంచే పొందిన వాడు, విశ్వవిఖ్యాత కవులైన షేక్స్పియర్, వర్జిల్, జాన్ మిల్టన్, గోథె, ఎమిలీ డికెన్సన్, దాంటే, బ్లేక్, ఇట్లా ఎందరివో రచనలను తెలుగులోకి అనువదించి పుస్తకాలను ప్రపంచదేశాలకు అందించినవాడు. మొన్నకు మొన్న 'కోవిడ్- 19' పైన సీరీస్ వెలువరించినవాడు. యమ ట్రెమండస్ వేగంతో పుస్తకాలను ప్రామాణికంగా వెలువరిస్తూ అందర్నీ చకితుల్ని చేస్తున్నవాడు. వేగం, నాణ్యత, ఉత్తమత అతని విలక్షణ లక్షణాలు. వేరే ఎవరికీ సాధ్యం కాని అసమాన ప్రతిభ ఆయనది.

            వీళ్ళుగాక అనువాద రంగంలోనూ, స్వయం ఆంగ్ల రచనల్లోనూ వరంగల్లు ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ప్రసిద్ధులు ఆచార్య కె. పురుషోత్తం, ఆచార్య ఎం. దామోదర్‌రావు, ఆచార్య మిట్టపల్లి దామోదర్, డా. పాలకుర్తి దినకర్. వీల్లందరు తరం వరంగల్లు సాహిత్య వారసులు.. విజయదీపికను మోస్తూ పరుగెత్తుతున్నవాళ్ళు.

            ముందే చెప్పినట్టు వరంగల్లు కవులూ, రచయితలూ ఆదినుండీ ఎవరికివారు తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. సాహిత్య వస్తువు ఎంపిక, దాన్ని ఉత్తమంగా వ్యక్తీకరించే స్వంత గొంతు, భిన్నమైన శైలి, రూపంలోనూ, సారంలోనూ, సామాజిక స్పృహలోనూ స్థానిక జనసామాన్యుల సమస్యలను ప్రస్తుతించే బాధ్యత.. వీటివిషయంగా అసమాన ప్రతిభను చూపుతూ వచ్చారు. కోణంలో వర్తమాన యువరచయితలు కేవలం శుద్ధ వచనాన్ని ఒక పోలీస్ రిపోర్ట్‌లా కుప్పబోస్తున్నరు తప్పితే ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణ భిన్నత గురించి పట్టించుకోవడం లేదు. ఇక కవిత్వ విషయంగా చిక్కదనం కోల్పోతూ కొన్నిసార్లు వచన వాక్యాలను విరిచి పేర్చినట్టుగా ఉంటున్నాయి. తరం  మనసుపెట్టి సృజన కార్యాన్ని నిర్వహిస్తూ మనదైన స్వంత గొంతును వృద్ధి పర్చుకోవాలె.

10.       అభివృద్ధి పేరుతో జరుగుతున్న వనరుల విధ్వంసంను తెలంగాణ సాహిత్యం ఎలా ఎత్తిపట్టింది.

       1991 తర్వాత ప్రపంచాన్ని కబళించి వేస్తున్న ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటైజేషన్ ఉప్పెన సకల దేశాలపై మహోధృత దాడి చేయడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారిగా వ్యాపార శైలి అంతా 'దోపిడి' కి మారుపేరుగా రూపు దిద్దుకుంది. దురదృష్టవశాత్తు అన్ని ప్రపంచ దేశాలూ కార్యంలో పాలు పంచుకుంటూ 'అభివృద్ధి' పేర వనరులనూ, ప్రజలనూ, సకల సామాజిక సంపదలనూ దోచుకుని మోసం చేయడం మొదలుపెట్టినై. దీనికి అంతు అంటూ లేకుండా.. ప్రజలు దోచుకునేవారు, దోచుకోబడేవారు గా విడిపోయారు. ప్రజా సంక్షేమ పథకాల పేర ప్రభుత్వాలు ఓటర్లకు బహిరంగ లంచాన్ని ఇవ్వడం నేర్చుకున్నారు. రాజకీయాల్లో పూర్తిగా అనైతికత, నిస్సిగ్గుతనం ప్రబలిపోయి రాజకీయ వ్యభిచారం మొదలైంది. వీటి ఫలితంగా 135 కోట్ల మందికి చెందిన మన దేశ సంపదంతా కేవలం పదిరవై మంది కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రధానంగా ఒక దేశ ప్రధాన ప్రజా రంగాలైన విద్య, ఆరోగ్యం, రవాణా వ్యవస్థలు పూర్తి అవినీతి రంగాలై జనాలను జలగల్లా పట్టిపీడిస్తూంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. దీనిక్కారణం అప్రత్యక్షంగా ప్రభుత్వాలే దోపిడీదారులుగా మారడం.

          అంశంపై నేను దాదాపు ఇరవై ఐదు కథలూ, ఏడు నవలలూ రాశాను. ఎంతో కవిత్వం వెలువరించాను. నా సహచర రచయితలు కూడ స్పృహతో దిక్కుమాలిన అభివృద్ధిని నిరసిస్తూ విపులంగా రాశారు. ఐతే స్థితి ప్రభుత్వాలు మాత్రమే తలుచుకుంటే ప్రక్షాళన ఔతుంది తప్ప అన్యధా కాదు. ఇప్పుడు 'కరోనా' మహమ్మారి ప్రపంచ దేశాలను మృత్యు గర్భంలోకి తోసుకుపోతూంటే.. విచక్షణా, బాధ్యతా లేకుండా ' తెలంగాణ సర్కార్ ' పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రక్క తెలుగు రాష్ట్రంలో చక్కని ప్రశంసనీయ చర్యలు ప్రజోపయోగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు 'ఎప్పటికెయ్యది ప్రస్తుతమో.. అప్పుడు పనిని తక్షణం చేపట్టకుంటే ' ఇట్లనే జనం అనాధలైపోతరు. దేశ నేలపైనుండి వందల గుట్టలను కబళిస్తూ రోజుకు వందల నౌకల నిండా గ్రానైట్ ను చైనాకూ ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్న ఇక్కడి మనుషులూ, ఇసుక దొంగలూ, మట్టి, బొగ్గు, కలప, ఇతర ప్రకృతి వనరుల దొంగలందరూ ఇక్కడి ప్రభుత్వాలేప్రజలు ఇంటి దొంగల భరతం పట్టనంత కాలం ఇదింతే. దోపిడీ ఇంతే.

11.       ప్రస్తుతం వెలువడ్తున్న సాహిత్యం ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్నదా ?

         ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. అసలు రచయితలందరికీ ప్రజల గురించీ, ప్రజల ఆకాంక్షల గురించీ శ్రద్ధ ఉండదు. అనేకానేక కోణాల్లో వ్యక్తులు జీవితాన్ని దర్శిస్తూంటారు. కాలక్షేప వ్యాపకంగా, వినోద ప్రధానంగా, ఏవేవో అవార్డ్ లను ఆశించి వాటికనుగుణమైన పద్ధతిలో రాస్తూ.. ఒక స్వంత నడక అని ఏదీ లేకుండా గాలివాటమైపోతూ.. తను ఎవరికోసం.. ఎందుకు రాయాలో కాకుండా.. పత్రికవాడో ' విధంగా రాయడి.. దాన్ని అచ్చేస్తాం.. డబ్బుకూడా ఇస్తం' అంటే వాడికి కావలసినట్టు అమ్ముడుబోయి రాయడం.. ఇట్లా రకరకాలుగా చాలా మందికి స్వంత వ్యక్తిత్వం అని ఒకటుండదు. అంతా గాలివాటం వ్యవహారమే. అది వ్యాపార, నిష్ప్రయోజన సాహిత్యం. అది మఖలో పుట్టి పుబ్బలో అంతరించి పోతుంది. వాళ్ళు చరిత్రకెక్కరు. కాని కొందరు ఒక కాళోజీ, వరవరరావు వంటివాళ్ళు ప్రజా రచయితలు. వాళ్ళకు ప్రజల కష్టాలే వాళ్ళ కష్టాలు. ప్రజల ప్రతినిధులుగా వాళ్ళు ప్రజోపయోగ అక్షరకారులుగా జీవిస్తూ ప్రజలకోసమే మరణిస్తారు. ప్రజల గుండెల్లో చిరంజీవులుగా మిగిలిపోతారు.  

            మన వరంగల్లు అదృష్టమేమిటంటే.. ఇక్కడి రచయితలు చాలా మంది ప్రజలకోసం రాస్తున్నవాళ్ళే. ఇక్కడి కళాకారుల రక్తంలో జన్మతః ధిక్కారంతో పాటు ప్రజా చింతన ఉంది.

             నల్లెల రాజయ్య వంటి కవులు నిరంతరం ప్రజా కార్యాల్లోపలే నిమగ్నమై ఉంటారు.

            అందరినీ నిశితంగా గమనిస్తున్న పాఠకులు, ప్రజలు ఎవరెవరో నిజాయితీగా బేరీజు వేసుకుని వాళ్ళ స్థానాన్ని స్థిరపరుస్తారు. రచయితలు కొందరు జీవిస్తూకూడా మరణిస్తూనే ఉంటారు ప్రతిరోజూ.. మరికొందరు మరణించికూడా శాశ్వతులై జీవిస్తూనే ఉంటారు జనహృదయాల్లో. వాళ్ళు ప్రజా సంపదగా మిగిలిపోతారు చరిత్రలో

 

12.       ఒక రచయితగా ప్రస్తుత కవిత్వాన్ని, కథా సాహిత్యాన్ని, నవలనూ ఎలా చూస్తున్నారు ?  

         ముందే చెప్పాను.. 'కవితా వార్షిక' ను కొన్ని ఏండ్లు వెలువరించిన అనుభవంలో ప్రధాన సంపాదకునిగా, అన్యధా కూడా గమనించిన సున్నితమైన విషయం ఏమిటంటే..'కవితా వార్షికలో తన కవిత అచ్చయినప్పుడు కవి.. చాలా బాగా రాసినం కాబట్టి వాళ్ళు వేసిండ్లు.. వేయక చస్తరా.. అని.. ఇక ఎంపిక కాబడని కవి.. అబ్బో మాత్రం నాల్గు లైన్లను మేం మాత్రం గీకలేదా. అన్నీ పైరవీలు' అని మమ్మల్ని గాయపర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రచయితకు ప్రధానంగా సంయమనంతో కూడిన సంస్కారం ఉండాలె. నిగ్రహం కూడా ఉండాలె. మన చుట్టూ ప్రపంచ వ్యాప్తంగా జరుగున్న మానవ సంక్షోభాలూ, విపరిణామాలూ, అమానవీయ ఘటనలూ.. ఇవన్నిటిపట్ల సహానుభూతి వ్యక్తపర్చగల, కనీసం నేనున్నాను అని సంఘీభావాన్ని ప్రకటించగల సహృదయత ఉండాలె. అది ఇప్పటి తరంలో అంతగా కనిపించడంలేదు. దానిక్కారణం.. జీవితం, జీవావరణం కలుషితమౌతున్న నేపథ్యంలో  సినిమా, మీడియా, ఈజీ గోయింగ్ తత్వం, స్వస్పృహ, క్విక్ మనీ ఎర్నింగ్ తత్వం.. రుగ్మతలన్నీ యువతరాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పటి యువకులూ, పెద్దలుకూడా అతి సేచ్ఛనూ, మితిమీరిన స్వతంత్రాన్ని అనుభవిస్తూ 'విచ్చలవిడి' గా తయారౌతున్నారు

            క్రమంలో దారి తప్పుతున్న యువత గురించి చాలా సాహిత్యాన్నే సృజించాను నేను.'ఎక్కడినుండి?.. ఎక్కడిదాకా ?', 'సూర్యుని నీడ', ‘పరంపర', ‘ఎటు.?', 'మనిషి పరిచయం', 'అంతిమం' వంటి నవలలు, దాదాపు 25 దాకా కథలు, వందకు మించిన కవితలు.. ఇవన్నీ వచ్చినై అంతర్ఘర్షణలోనుండి. 'ఎందుకు సార్ మీకు ప్రజల బాధలు' అని ఎందరో పాఠకులు నన్ను కలిసినపుడు అడుగుతూంటారు

            అదంతే.. రచయితకు ఒక నిర్దిష్టమైన సాహిత్య వ్యక్తిత్వం తప్పనిసరిగా ఉండాలెనని బలంగా విశ్వసిస్తాను నేను.    

             ఐతే.. ప్రస్తుతమొస్తున్న కొంతమంది రచనలు మాత్రం.. అవి కథైనా, నవలైనా, కవిత్వమైనా ప్రజా జీవిత ఉన్నతీకరణకోసం. మానవీయ విలువల పునఃస్థాపనకోసం సృజించబడ్తున్నాయి. ఆనందదాయకమే స్థితి.                                                                

13.       సమాజం లేకుండా సాహిత్యం లేదుకదా.. మరి అలాంటప్పుదు సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా ?

          ఈ ప్రశ్న చాలా కాలంగా అన్ని సమాజాల్లో నలుగుతున్నదే

            సకల సాహిత్య ప్రక్రియలన్నింటిలో అతి శక్తివంతమూ, ప్రభావవంతమూ ఐన ప్రక్రియ ' పాట '. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చారిత్రక ఘటనల్లో అత్యంత శక్తివంతంగా పనిచేసి మనుషుల్ని కార్యోన్ముఖుల్ని చేసింది పాటే. తన ప్రమేయం లేకున్నా మనిషి హృదయంపై ఉధృతమైన రీతిలో అనుభూతింపజేసి ఒక స్టెరాయిడ్ వలె పనిచేసేదీ పాటే. కాబట్టి సాహిత్య రూపాల్లో ఒకటైన పాట వల్ల మానవ గతిలో ఘననీయమైన మార్పూ, పరివర్తనా వస్తుందని బల్లగుద్ది చెప్పొచ్చు. ఇక ఇతర సాహిత్య రూపాల్లో.. వచన మహా గ్రంథమైన 'మహాభారతం' తరతరాలుగా మనుషులను అతి శక్తివంతంగా ప్రభావితం చేస్తూనే ఉంది. పౌరాణికులు శతాబ్దాలుగా మహాభారత రామాయణాలను, భాగవతాన్ని ప్రజలకు ప్రవచిస్తూనే ఉన్నారు. అది వ్యక్తులను పరివర్తిస్తూనే ఉంది. అనేక తాత్విక, ఆధ్యాత్మిక గ్రంథాలు.. భగవద్గీత వంటి వాటి ప్రభావం అనన్యం. మహాభారతాన్ని ఎందరో ఎన్నో  సినిమాలూ, వందల సంఖ్యలో టి వి సీరియల్లూ ప్రపంచ వ్యాప్తంగా తీస్తూ వస్తున్నా అది ఒడవడంలేదు. మళ్ళీ మళ్ళీ ఔత్సాహికులు మహాభారత ఘట్టాలను ఇంకా అద్భుతంగా తీద్దామని ఉవ్విళ్ళూరుతూనే ఉన్నారు. కథా నిర్మాణం అంత ఉన్నతమైంది మరి.     

         ఇక కాల్పనిక సాహిత్యమైన కథలు, నవలలు, కవిత్వం వంటి ప్రక్రియలు అతి తేలికపాటి అనుభూతులను మాత్రమే రగిల్చి మిగులుస్తాయి. కాని అవి ఉత్తమమైనవైతే కొంతకాలం పాటు పాఠకుణ్ణి వెంటాడ్తాయి. ఇది సాహిత్యాభిమానులకు అనుభవమున్న విషయమే.

            ఉదాహరణకు.. మలి దశ ' ప్రత్యేక తెలంగాణ ' ఉద్యమంలో ఉప్పెనవంటి ఉద్యమ గీతాలూ, రక్తాన్ని మరిగించే జానపద పాటలూ వహించిన పాత్ర చాలా గొప్పది. పరిగణించదగ్గది. అప్పుడు వందల సంఖ్యలో వెలువడ్డ ఉద్యమ అనుకూల వచన కవితా పుస్తకాలు కూడా అతి కీలక పాత్రను వహించాయి రాష్ట్ర సాధనలో.

            సాహిత్య ప్రయోజనాలను కోణంలో విపులంగా విశ్లేషించవలసి ఉంది. ఉత్తమ సాహిత్యమెప్పుడూ మనిషిని ఆరోగ్యవంతం  చేసే ఉత్తమ ఔషదమే

14.       సాహిత్య జీవితంలో మిమ్మలను కదిలించిన అనుభవం చెప్పండి.

         అవి వరంగల్లు మహబూబియా ఉన్నత పాఠశాలలో నేను 9 తరగతి చదువుతున్న రోజులు. అప్పటికే చాలా పుస్తకాలను చదివే అలవాటు కలిగి ఉన్నందువల్ల ఏదైనా రాయాలనీ, అచ్చులో నా పేరును చూచుకోవాలనీ తపించిపోతున్న రోజులవి. అప్పుడే మా బడిలో కాళోజీ గారి మొట్టమొదటి కవిత్వ పుస్తకం ' నా గొడవ ' శ్రీశ్రీ చేత ఆవిష్కరించబడ్డ రోజులు

             ఒకరోజు.. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నా ప్రక్కనే కూర్చునే సీతారాంగాడు మెల్లగా నా చెవిలో 'అరే చంద్రమౌళీ నెల చందమామలో నీ కథ అచ్చయిందిగాదుర' అని గుసగుసగా చెప్పిండు. అంతే.. మహానందంతో మాటలకందని పులకింత నాలో. 'ఏందిరా మళ్ళ చెప్పు' అని ప్రాధేయత. వాడు మళ్ళీ చెప్పి.. 'ఆగు చూపిస్తా.. మా నాన్న తెచ్చిండు లంచ్ ' అని మెల్లగా వాని సంచీ నుండి కొత్త చందమామను బయటికి తీసిండు. వాళ్ళ నాన్న డాక్టర్. సంబరాన్ని దాచుకోలేని ఉత్సుకత. ఇద్దరం మెల్లగా పేజీలు వెదుకుతూ 'ఎహె.. ఆగుర నలభై రెండవ పేజి.. నేను చదివినరా బువ్వ తిన్నంక.. ఇంట్ల. భలేగుందిరా కథ  'అని పేజీని తీసి నా చేతుల పెట్టిండు. అంతే.. నా వీపు చళ్ళుమంది. వెనక్కి తిరిగి చూస్తే..ఇంగ్లీష్ చెప్పే సుబ్బరావు సార్..' ఏందిరా.. క్లాస్ లొల్లి జేస్తాండ్లు.' అని బెత్తెంతో ఒక్కటేసిండు.

            సీతారాం గాడు దెబ్బలను తప్పించుకోడానికి " సార్.. చందమామ బుక్ వీడు రాసిన కథ పడ్డది సార్ " అని గడ గడ చెప్పిండు.     

      "ఏందిరో.. వీడు కథ రాయడమేందిర. అది అచ్చు కావడమేందిర .. వెధవ" అని గద్దిస్తూంటే..సీతారాంగాడు చందమామ పుస్తకాన్ని సార్ చేతుల్లో పెట్టిండు. సుబ్బరావు సార్ దాన్ని తీసుకుని వెళ్ళి తన కుర్చీల కూర్చుని.. " ఐతే, అరే చంద్రమౌళిగా నువ్వు కథ రాసినావ్రా.. నాకే కథలు చెప్తానావ్. రా ఇక్కడికి " అని పిలిచిండు బోర్డ్ దగ్గరికి. నాకు భయంతో గడగడ.. ' ఇగ కొడ్తడ్ ' అని.

            " ఒక పని చెయ్.. కథను నువ్వే రాసినౌగదా. ఐతే కథను చెప్పు చేతులు కట్టుకొని ఇక్కడ నిలబడి " అన్నడు.

            నేను సరిగ్గా నిలబడే లోపలే సార్ పుస్తకం విప్పి కథను తీసి చదవడం మొదలు పెట్టిండు.

             " ఏందిరో ..కథ పేరు బడే జోర్ పెట్టినౌ.. సువర్ణ శతదళ పుష్ప రహస్యం.. అంటే ఏందిర "

             " వంద రేకులున్న పువ్వు రహస్యం సార్ " అన్న వణుక్కుంట.

             " సరేగని.. కథ చెప్పు "

            ఇక కథ చెప్పుడు మొదలు పెట్టిన గడ గడ.

             పది నిముషాల్లో కథ చెప్పుడైపోయింది. లోగా సార్ కథ చదివిండు.

              " బాగుందిరా కథ. సరేగాని నువ్ పోయి నీ బెంచెక్కుపో " అని పురమాయించిండు సార్.

             ఇగ నా పనైపోయింది.. సార్ వాయించుడే బెత్తెంతోని అనుకున్న.

            అప్పుడు నెక్కరేసుకునేది. చిన్న పర్సనాలిటీ.

            సుబ్బారావు సార్ గొప్ప టీచర్. ఇంగ్లిష్  బడే చెప్పేటోడు.

             దగ్గరికొచ్చి "అరే చంద్రమౌళిగా.. బడే రాసినౌరా కథ. నాకు ఎత్తు అందవని బెంచీ ఎక్కుమన్న. దా." అని సార్ గట్టిగా, శిష్య వాత్సల్యంతో గుండెలకు హత్తుకుని.. తలమీద రెండు చేతులూ పెట్టి.. " ఇట్లనే రాసుకుంట పోరా. నీకు సరస్వతీ కటాక్షమున్నది. మంచి రచయితవైతౌ బిడ్డా " అని ఆశీర్వదించిండు.

             నాకు కళ్ళనిండా నీళ్ళు

15. పాఠకులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరు ఏమి చెప్పదలుచుకున్నారు.

         ముందు సాహిత్య విలువలకు పట్టంకడ్తూ గత కొంత కాలంగా ఉత్తమమైన రచనలను ఎంపిక చేసిన రచయితలనుండీ, కవులనుండీ సేకరిస్తూ ప్రచురిస్తున్న మీ అభిరుచిని నేను అభినందిస్తున్నాను. పత్రికా నిర్వాహకులకు తమదైన ఒక భావజాలం, విలువలతో కూడిన లక్ష్యం, తరానికి ఆరోగ్యవంతమైన సాహిత్యాన్ని అందించాలనే ఆకాంక్ష ఉండాలని నా స్థిరభావన. దిశలో నడుస్తున్నందుకు కూడా మీ సంపాదక వర్గానికి నా అభినందనలు.

         'గోదావరి' వంటి మంచి పత్రికను ఆదరిస్తూ అండగా ఉంటున్న యువతరపు పాఠకులందరికీ నా శుభాకాక్షలు. ఆచార్య కాత్యాయనీ విద్మహే వంటి అభ్యుదయ భావాలున్న విదుషీమణి యువ పత్రిక సారథుల వెనుక ఉన్నట్టు తెలుసు. అందువల్ల ఎక్కడా పత్రిక దారి తప్పకుండా మార్గదర్శనం జరుగుతూంటుందని విశ్వసిస్తున్నాను. గమనిస్తున్నాను నేను.. సంపాదకులు చాలా అరోగ్యవంతమైన రచనలను మాత్రమే సేకరించి వెలువరిస్తున్నారు. సాహిత్య విలువల పరిపుష్టతకు కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. పత్రికకు మంచి భవిష్యత్తు ఉంది. వరంగల్లు వంటి ( సాహిత్య రాజధాని అని వ్యవహరిస్తూంటారు పెద్దలు ) ఒక గొప్ప నేపథ్యమున్న ప్రాంతంనుండి వెలువడ్తూ భావి రచయితలకూ, కవులకూ 'గోదావరి' నెలవుగా ఇంకా ఉజ్జ్వలంగా ఎదుగుతుందనీ, వెలుగుతుందనీ ఆశంసిస్తున్నాను.  

    సంపత్రెడ్ది గారు నన్ను తట్టి నా హృదయాన్ని ఆవిష్కరింపజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.                    

       

                 

         

                                                                                                            


ఈ సంచికలో...                     

Sep 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు