గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు దాట్ల దేవదానం రాజు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1 మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి? వ్యవసాయ కుటుంబం లోంచి వచ్చాను. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకటపతిరాజు. 1954 మార్చి 20 తేదీన జన్మించాను. నా ముందు పదకొండు మంది పుట్టారు. నెల లోపే మరణించారట. 99 నెలల గర్భశోకం మా అమ్మది. ఎవరు ఎక్కడకు వెళ్ళి పురుడు పోసుకోమంటే అక్కడకు వెళ్ళి పురుడు పోసుకున్నారు. కడకు పిఠాపురం మిషనరీ ఆసుపత్రిలో డాక్టరు వైణింగమ్మ అమృత హస్తాలతో పురుడు పోస్తే నేను బతికి బట్ట కట్టాను. మా అమ్మ, బావజీ (క్షత్రియ కుటుంబాల్లో తండ్రిని బావజీ అంటారు) కృతజ్ఞతతో ఆవిడ పేరు పెట్టుకుంటామంటే వారించి నన్ను చేతుల్లోకి తీసుకుని ప్రార్థనలు చేసి దేవుడిచ్చిన దానం దేవదానం అన్నారు. చివర కులవాచకం తగిలించారు. లేక లేక కలిగినందున గారాబంగా పెంచారు. దిష్టి తగలకుండా ఒళ్ళంతా పూసల దండలు కట్టేవారంట మా అమ్మగారు. అందుకే చిన్నపుడు ‘ పూసలోడు ’ అని పిలిచేవారు. చదవడం ఇష్టం. నలభై ఏళ్ళు వచ్చే వరకు రాయడం చేయలేదు. భార్య ఉదయ భాస్కరమ్మ. ముగ్గురు పిల్లలు- డి.వి.యస్ .రాజు, శశికాంత వర్మ, శిరీష. అందరూ జీవితాల్లో స్థిరపడ్డారు.
2 మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పుస్తకాలు గురించి చెప్పండి.
కోలంక ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు పాఠశాల గ్రంథాలయంలో టామ్ సాయర్, అకిలుబెరిఫిన్, మౌంట్ ఆఫ్ కౌంటు క్రిష్టో వంటి పిల్లల సాహసకృత్యాల అనువాద పుస్తకాలు చదివాను. అవే గ్రంథ పఠనం పట్ల అభరుచిని కలిగించాయి. బాల్యంలో మా ఇంటికి వచ్చే గురువు గారి భార్య చేత చెప్పే కథలు, తరగతి గదిలో ఆఖరి పిరియడులో మాష్టారు చెప్పే కథలు నాకు కథల పట్ల ఇష్టాన్ని కలిగించాయి. క్రాంతి సాహితి ( కాకినాడు), ఆంధ్రీకుటీరం ( పల్లెపాలెం) వంటి సాహితీసంస్థలు, ఆద్దేపల్లి రామమోహనరావు, శిఖామణి కవులు నన్నెంతో ప్రోత్సహించారు.
3 మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని సాహిత్యం వైపు నడిపించాయి?
పిల్లల చదువుకోసం కోలంక గ్రామం నుండి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న యానాంకు మకాం మార్చడం నా జీవితం సాహిత్యం దిశగా పయనించడానికి అవకాశం కలిగించింది. 1992లో రాజమండ్రి కవిత్వ శిక్షణాతరగతులుకు వచ్చిన కె.శివారెడ్డి బృందం శిఖామణి ఆహ్వానం మీద యానాం వచ్చారు. ఆ బృందంలో ఈనాటి లబ్ధ ప్రతిష్టులైన అఫ్సర్, సీతారాం, దర్భశయనం శ్రీనివాసాచార్య, యాకూబ్, ఆశారాజు, మద్ధూరి నగేష్‍బాబు ఉన్నారు. మూడు రోజులు వారితో ఉండటం వల్ల కవిత్వం మత్తు ఆవహించింది. ఒక ఆకర్షణ ఏర్పడింది. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి స్మారక సభల్లో ప్రతినెలా కవితలు చదవడం, అద్దేపల్లి వారి కవిస్వరంలో కవితాపఠనం చేయడం ఆ కవితలు పత్రికలు ప్రచురించడంతో కవిగా గుర్తింపు వచ్చింది. ఇక కథలు రాయాలనే తపన ముందు నుంచీ ఉంది. కవిత్వం మోజుతో కొన్నాళ్ళు కథలు రాయడాన్ని తగ్గించాను.
4 మీ మొదటి రచన ఏది? అది కథా కవితా? ఏ సందర్భంలో వచ్చింది? మీ రచనలు గురించి చెప్పండి? పురస్కారాలు కూడా తెలియజేయండి.
ప్రచురింపబడిన నా మొదటి రచన కథే. ‘ పేకాట బాగోతం ’ కథ ఆంధ్రజ్యోతికి పంపాను. సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యం గారి దగ్గర్నుంచి ‘ మీ కథను స్వీకరించాం. వీలు వెంబడి ప్రచురిస్తాం ’ అని కార్డు వచ్చింది. అప్పట్లో అలాంటి సంప్రదాయాలు ఉండేవి. ఏడాది అయినా కథ ప్రచురించలేదు. కోపంతో ‘ నాలోని కథకుడ్ని చంపేస్తారా? ’అంటూ పురాణం వారికి ఉత్తరం రాసేను. వారంలో నా కథ ప్రచురించడం వల్ల నాలోని కథకుడు బతికాడు. నేనిప్పటి వరకు ఏడు కవితాసంపుటులు ( వానరాని కాలం, గుండె తెరచాప, మట్టికాళ్ళు, లోపలి దీపం, నది చుట్టూ నేను, పాఠం పూర్తయ్యాక.., దోసిలిలోనది), రెండు
దీర్ఘ కవితలు ( ముద్రబల్ల, నాలుగో పాదం), నాలుగు కథాసంపుటులు ( దాట్ట దేవదానం రాజు కథలు, యానాం కథలు, కళ్యాణపురం, కథల గోదారి) చరిత్ర గ్రంథం ( యానాం చరిత్ర), రాజకీయ వ్యంగ్య కథనం ( సరదాగా కాసేపు), యాత్రాకథనం ( చైనా యానం), ఆంధ్రపురాణకర్త చమత్కారాలు (మధు హాసం) . యానాం కథలు ఫ్రెంచి భాషలోకి డానియల్ నెజర్స్ అనువదించారు. వృద్ధాప్యం నేపథ్యంతో రాసిన నాలుగో పాదం దీర్ఘకవిత తమిళం, కన్నడం, మలయాళం, ఇంగీషు లోకి అనువాదం అయ్యాయి. అనేక కవితలు,కథలు ఇంగ్లీషు, ఫ్రెంచి, తమిళం, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. పుదుచ్చేరి ప్రభుత్వం నుండి కళైమామణి, తెలుగురత్న పురస్కారాలు అందుకున్నాను. వివిధ సాహిత్య సంస్థల ద్వారా కథాసంపుటులకు, కవితాసంపుటులకు రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందుకున్నాను.
5 యానాం ప్రత్యేకత ఏమిటి?
భౌగోళికంగా ఆంధప్రదేశ్‍లో తూర్పు గోదావరి జిల్లా అంతర్భాగంగా యానాం ఉంది. అనాదిగా తన ప్రత్యేకతల్ని నిలుపుకుంటున్న ప్రాంతం ఇది. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం వేర్వేరు ప్రాంతాల్తో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. తమిళ ప్రాబల్యం ఎక్కువ. రాజకీయంగా పుదుచ్చేరి లోని 30 నియోజక వర్గాల్లో యానాం ఒకటి. ఆర్థిక వనరులు కేంద్ర బడ్జెట్టు ద్వారా సమకూరుతాయి. సంక్షేమ పథకాలు బాగా అమలవుతాయి.
6 యానాం సంస్కృతికి తెలుగు సంస్కృతికి ఏమైనా తేడా ఉందా? ఉంటే ఆ తేడా మీ రచనల్లో ఏ మేరకు చిత్రించారు? లేకపోతే కారణాలేమిటి?
మంచి ప్రశ్న. యానాం ప్రజల సంబంధ బాంధవ్యాలన్నీ చుట్టూ ఉన్న ఆంధప్రదేశ్ తోనే. ఆచార వ్యవహారాలన్నీ సగటు తెలుగు వారివే. కాకపోతే పరిపాలనాపరంగా అంతా వేరే. ఫ్రెంచి వారు యానాంను స్థావరంగా ఏర్పరచుకున్నప్పటి చట్టాలు, పరిపాలనా పద్ధతులు...అలాగే నేడు పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం లోని యానాం ప్రత్యేకతలు నా ‘ యానాం కథలు’ ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. ‘ తీర్పు వెనుక’, ‘ కొత్త నది’, ‘ఒప్సియం’, ‘ ఔను నిజం’ కథల్లో చరిత్రకు సంబంధించిన ఒకనాటి ఫ్రెంచి వారి పాలనకు అక్షరరూపం ఇవ్వడం జరిగింది. నేటికాలంలో ఆంధప్రదేశ్‍కు భిన్నంగా అమలౌతున్న సంక్షేమ పథకాలు, ఫ్రెంచి వారి కాలంలో పనిచేసిన వారి జీవనసరళి, మానవసంబంధాల్లో వచ్చిన వైవిధ్యమైన బతుకు బాటలు, యానాంలో జరిగిన సంఘటనలు గురించి కథలు రాసాను. యానాం కథలు రెండు సంపుటాలుగా ‘యానాం కథలు’, ‘కళ్యాణపురం’ పేరుతో వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య సంబంధాలతో ఆంగ్లాంధ్ర కథలే ఉన్నాయి. కాని ఫ్రెంచి ఏలుబడిలో ఉన్న భారతీయులకు ఫ్రెంచి వారికి సంబంధించిన కథలు రాలేదని ఆ ఖాళీని యానాం కథలు పూరించాయని ప్రసిద్ధ సాహితీవేత్తలు చెప్పడం జరిగింది. ఇదొక గుర్తింపుగా భావిస్తున్నాను. ఇక పాలనాపరంగా ఎక్కడో 800 కి.మీ దూరంలో ఉన్న పుదుచ్చేరీ నుండి ఆదేశాలు...వినూత్న సంక్షేమ పథకాలు...రాయితీలు యానాం ప్రాంతం భిన్నమైన వాతావరణాన్ని కలిగి ఉంది. జీవన వాస్తవికత ప్రతిబింబించే కథలు రాయాలనీ బయటి ప్రపంచానికి తెలియని ఇక్కడి విషయాలు చెప్పాలనే... ఉద్దేశంతో యానాం కథలు రాయడం మొదలెట్టాను. స్థానికత ప్రతిబింబించే కథలు తెలుగులో వచ్చాయి. ఆ కథలకు వీటికి తేడా స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటుంటున్నాను. ఇందులో యానాం ప్రాంత భౌగోళిక పరిసరాలతో చరిత్రతో ముడివడిన ప్రజల జీవన పోరాటాల్నీ భావోద్వేగాల్నీ చిత్రించడానికి ప్రయత్నించాను. స్థానిక చరిత్రలు సామాజిక చరిత్రను అద్భుతంగా ప్రతిఫలిస్తాయని బలంగా నమ్ముతాను. యానాం సంస్కృతి తెలుగు సంస్కృతిఒకటే. పాలనాపరమైన వైవిధ్యాలున్నాయి. వాటినే చిత్రించాను.
7 కవిగా కథకుడిగా మీకు ఎదురైన అనుభవాలు చెప్పండి?
కథకుడిగా మరచిపోలేని అనుభవాలున్నాయండి. మొదటి కథ ‘ పేకాట బాగోతం’ నన్ను ఇబ్బందుల్లో పెట్టింది. ఆ కథ ఆ రోజుల్లో నా పేకాట (రమ్మీ ) అనుభవమే. అందులో పాత్రల పేర్లు నిజమైన వ్యక్తుల పేర్లు. జరిగిన సంఘటన వాస్తవమైనదే. అదే రాసాను. ఎవర్నీ కించపరచలేదు. అయినా అన్న వరసయిన ఒకాయన తన పేరు యథాతథంగా ప్రస్తావించినందుకు చాలా నొచ్చుకుని కోపం తెచ్చుకున్నాడు. ఆయన జీవితాంతం నాతో మాట్లాడటానికి కనీసం నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత ఎపుడూ అసలు పేర్లతో కథలు రాయలేదు. అలాగే పుష్కరాల సమయంలో యానాంలో జరిగిన సంఘటనకు అక్షరరూపంగా రాసిన ‘గొ(వు)దారి’ కథ వివాదాస్పదమైంది. ఇది నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో అచ్చయ్యింది. కథను తప్పుగా అర్థం చేసుకున్న ఒకావిడ పురోహిత వర్గాన్ని అవమానించాననీ అపహాస్యం చేసాననీ ఫేసుబుక్ మాధ్యమంగా రాద్ధాంతం చేసారు. అనేక మంది విరుచుకుపడ్డారు. సంపాదకుల కోరికపై వివరణ కథ మూల ఉద్దేశాన్ని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరొక కథ ‘చూపుడు వేలు’ ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. యానాంలో మా ఇంటికి దగ్గరలో జరగిన వాస్తవ సంఘటన ఇది.ఒక సామాజిక వర్గం వారు అర్థం చేసుకున్నవారు విపరీతంగా పొగిడినవారూ ఉన్నారు. అదే విధంగా అవగాహనా లోపం వల్ల తిట్టిన వారూ బెదిరించినవారూ ఉన్నారు. కథకుడిగా నాకెదురైన కొన్ని అనుభవాలు ఇవి. ఇవేమీ పెద్ద తీవ్రమైనవి కావు. కవిగా ఏ విధమైన సమస్యలు రాలేదు.
8 యానాంలో తెలుగు సాహిత్య వాతావరణం ఎలా ఉంది?
యానాంలో శిఖామణి పెళ్ళి పుస్తకం సమయంలోనూ నా కవితాసంపుటి ‘ వానరాని కాలం’ ఆవిష్కరణ సందర్భంలోనూ సాహిత్య సభ అంటే ఒక పండుగ వాతావరణం కనిపించేది. సాహిత్యం పట్ల పెద్దగా అవగాహన లేనివాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. ‘ స్ఫూర్తి సాహితీ సమాఖ్య ’ తరపున మా ఇంటిలో నెలనెలా సమామేశాలు జరిపేవాడిని. యువకులు చాలామంది ఉత్సాహంగా పాల్గొనేవారు. తర్వాత కాలంలో కవులుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత కాలంలో తక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. కవితాశిక్షణాశిబిరాలు వంటివి ఏర్పాటు చేసినపుడు మాత్రం దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వస్తున్నారు.
9 యానాం చరిత్రను రాయాలని ఎందుకనుకున్నారు?
నేను చరిత్ర ఉపాధ్యాయుడ్ని. చరిత్ర పట్ల ఆసక్తి ఉంది. యానాం చరిత్ర గురించి ఏవో చిన్న చిన్న వ్యాసాలు తప్ప పుస్తకరూపంలో రాలేదు. ప్రాంతీయ అధికారిగా యానాంలో పనిచేసిన కవి ఆకెళ్ళ రవిప్రకాష్ ‘ మీరు యానాం చరిత్ర రాస్తే బావుంటుంది ’ అని ఒక ఆలోచనను నా చెవిలో వేసారు. దేనికైనా ముందు ఆలోచన రావడమే ప్రధానం కదా. అది బలంగా మనసులో నాటుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. విషయ సేకరణకు చాలా శ్రమపడ్డాను. నేను చేస్తున్న పని పుదుచ్చేరీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు గారికి యథాలాపంగా చెప్పాను. ఆయన ఒక బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించి తను ప్రచురిస్తున్నానని చెప్పేసారు. దాంతో నాలో దడ ప్రవేశించింది. ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు కూడా పెట్టాను. దాని ఫలితం ఎంతో సంతృప్తికరం. గతం తాలూకు చరిత్ర ఇపుడెందుకనే ప్రభుత్వాధినేతలు ఉన్నారు. వర్తమానం నుంచి భవిష్యత్తు లోకి పయనించడానికి చరిత్ర పాఠాలు పునాదులుగా ఉపయోగిస్తుందని ఆలస్యంగా తెలుసుకుంటారు. సైన్సు గతం ఆవిష్కరణల ఆధారంగానే నూతన ద్వారాలు తెలుస్తుంది. ‘ యానాం చరిత్ర’ నా మొత్తం సాహీతీ జీవితంలో మరుపురాని ఘట్టంగా భావిస్తాను. దీని వల్ల అనేక చోట్ల గౌరవ ప్రతిష్టలు కలిగాయి. సత్కారాలు పొందాను. కొన్ని చరిత్ర సదస్సులకు హాజరయ్యాను. చరిత్ర కథలు రాయడానికి తగిన మానసిక స్థైర్యం కలిగింది.
10 యానాం నుండి వెలువడిన తెలుగు సాహిత్య ప్రత్యేకతను ఎలా అర్థం చేసుకోవాలి?
కవిగా లబ్ధ ప్రతిష్టుడైన శిఖామణి యానాంలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ విరమణ చేసారు. హైదరాబాదులో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ మూలాల్ని విస్మరించకుండా సాహిత్యపరంగా యానాం ప్రత్యేకతను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ‘ కవి సంధ్య ’ కవిత్వ పత్రికను తీసుకొస్తున్నారు. ఇక నేను చరిత్ర రచన, కథలు, కవితలు రాయడంతో బాటు సాహిత్య కార్యక్రమాల నిర్వహించడం ద్వారా సాహిత్యవేత్తల చూపును యానాం వైపు ప్రసరించేలా చేయడం ధ్యేయంగా పెట్టుకున్నాను. మా రచనలే యానాం ప్రత్యేకతలను తెలియజేస్తాయి.
11 గోదావరి నదిలో సాహితీ కార్యక్రమం నిర్వహించారు కదా అనుభవాలు చెప్పండి?
నా జీవితంలో సాధించుకున్న కలల సాకారం గోదావరి నదిలో నిర్వహించిన ‘ కథాయానం’. ఈ అద్భుత జ్ఞాపకాల విహారం 10 నవంబరు 2012లో జరిగింది. ఒక చారిత్రక సందర్భాన్ని సృష్టించినట్టుగా ద్వానాశాస్త్రి అభివర్ణించారు. తెలుగు కథ పడవ ప్రయాణం అన్నారు మరొకరు. ఉమ్మడి ఆంధప్రదేశ్‍లో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుండి నూటయాబై మంది కథకులు దూరప్రాంతాల నుంచి శ్రమకోర్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్తమాన కథపై అర్థవంతమైన ఆలోచనాత్మకమైన
విషయాల్ని ముచ్చటించారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాలేకపోయిన వారు ఇప్పటికీ బాధను వ్యక్తీకరిస్తుంటారు. పాల్గొన్నవారు మొత్తం కథాప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని తెలియజేస్తుంటారు. అదే రోజు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నా ‘ యానాం కథలు’ ఆవిష్కరణ జరిగింది. ‘ కథాయానం’ ఏదో సంస్థ తరపున కాకుండా నేనే నిర్వహించడం పట్ల చెప్పలేనంత సంతృప్తి ఉంది. ఆనాడు జరిగిన చర్చ సారాంశాన్ని వివరణాత్మకంగా చెప్పాలంటే పెద్ద వ్యాసమే అవుతుంది. ఈరోజు దాని గురించి స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
12 కవిగా, కథకుడిగా, చరిత్ర రచయితగా విభిన్న పక్రియల్లో రచనలు కొనసాగిస్తున్నారు. ఇందులో ఏ పక్రియ పట్ల మీకు ఆసక్తిని సంతోషాన్ని కలిగించింది?
పక్రియ ఏదైనా సృజనాత్మక కళే. కవిత్వం లోకి నా ప్రవేశం ఏక్సిడెంటల్ అని చెప్పిన అఫ్సర్ మాట ముమ్మాటికీ నిజమే. అలా జరిగిన నా ప్రవేశం తొమ్మిది కవితాసంపుటుల కవిత్వ సంపన్నుడ్ని చేసింది. కథ జోలికి వెళ్ళకుండా ఓ దశాబ్దం పాటు కవిత్వం లోనే మునకలేసాను. అయితే చిన్నప్పట్నుంచీ కథ పట్ల ఇష్టం, ఆపేక్ష ఎక్కువ. కథలు రాసి కథకుడిగా రాణించాలనే కోరిక మనసులో ఉండేది. కథే ఎక్కువ ఆసక్తినీ సంతోషాన్నీ కలిగించిందని చెప్పాలి. స్థానీయత మేళవించి రాసిన ‘ యానాం కథలు’ ‘ కథల గోదారి’ నాకెంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రయోగం అనను గానీ ‘కథల గోదారి’ కథలన్నీ పేరొందిన రచయితలు కథాశీర్షిక ఇస్తే రాసాను. దాని వల్ల నేను శీర్షికను బట్టి ఇతివృత్తాన్ని నిర్ణయించుకుని ఊహించని కథల్ని రాసాను.
చరిత్ర గురించి ఇంతకుముందే చెప్పాను. నా రచనలన్నీ కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా అన్నీ నాకు సంతోషం కలిగించినవే.
13 సాహిత్య అకాడమీకి సంబంధించి మీ బాధ్యతలు, అనుభవాలు, మీరు చేసిన కార్యక్రమాలు గురించి చెప్పండి?
మా ‘ స్ఫూర్తి సాహితీ సమాఖ్య ’ తరపున సాహిత్య అకాడమీ కార్యక్రమాలు నిర్వహించాం. తెలుగు-తమిళ కథల సదస్సు, తులనాత్మక అధ్యయనం వంటి సాహిత్య అకాడమీ కార్యక్రమంలో నేను కీలకోపన్యాసం ఇవ్వడం జరిగింది. పరిసర నగరాల కవులచే కవిసమ్మేళనం, కథకుల కథాపఠనం కార్యక్రమాలు జరిగాయి. పుదుచ్చేరి తమిళ రచయితలు అక్కడ సాహిత్య అకాడెమీ బాధ్యులతో మరో సదస్సు జరిగింది. మా ఊళ్ళో జరిగిన ఇవన్నీ నాకు అత్యంత ఆనందం కలిగించేవే.
14 ‘ దూరానికి దగ్గరగా ’ వంతెన కవితలు ప్రత్యేకంగా అచ్చు వేసారు కదా. ఆ విశేషాలు చెప్పండి?
వంతెన కవితలు ‘ దూరానికి దగ్గరగా ’ ఒక ప్రత్యేక సందర్భంగా వచ్చింది. కోనసీమ, యానాం వాసుల చిరకాల స్వప్నం యానాం-ఎదుర్లంక బ్రిడ్జి. కోనసీమకు వెళ్ళాలంటే పడవ, ఫంటులే ఆధారం. బోలెడంత సమయం పట్టేది. ఆనాటి లోక్‍సభ స్పీకరు జి.యం.సీ. బాలయోగి( వంతెనకు ఆయన పేరే పెట్టారు) పట్టుదలతో సాధించి సాకారం చేసారు. ‘అద్దరికీ ఇద్దరికీ ఇనాళ్ళూ పడవ ఆధారం ఇక నుంచి కాంక్రీటు రహదారి మీద ప్రయాణం చేయాలి మీ అనుభూతిని అనుభవాల్నీ కవిత్వీకరించండ’ని పత్రికాముఖంగా పిలుపు ఇచ్చాను. కవులు స్పందించి మంచి కవితలు పంపారు. మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు సహకారంతో వెలువడిందీ సంకలనం. వంతెన మధ్య సభ ఏర్పాటు చేసి ఆనాటి పుదుచ్చేరీ ముఖ్యమంత్రి రంగసామి చేతుల మీదుగా ఆవిష్కరించాం. ఈ సంకలనానికి ప్రశంసలతో కూడిన సమీక్షలొచ్చాయి. వంతెన కవితలు తీసుకు వచ్చి సంకలనం చేసి ఒక సందర్భాన్ని నమోదు చేయాలనే ఆలోచనే నాదే.
15 ముద్రణా సాహిత్యానికి అంతర్జాతీయ అంతర్జాల సాహిత్యానికి గీతలు చెరిగిపోతున్నాయా? అంతర్జాల సాహిత్యం స్థానం ఏమిటి?
గీతలు చెరపడానికి రెండింటి మధ్య సరిహద్దులు లాంటివి లేవు. పత్రికల్లో ప్రచురణ జరిగితేనే కవిత, కథకు సాఫల్యం అనుకుంటారు రచయితలు. ప్రింటు మీడియా సామాన్యుల దృష్టికి వెళుతుందని ఒక నమ్మకం దానికి కారణం. కాలం తెచ్చిన అనేక మార్పుల్ని మనం గమనిస్తున్నాం. అంతర్జాలం అనేది సాంకేతిక ప్రగతి ఫలం. నేడు రాసిందేదైనా బాగోగులుతో సంబంధం లేకుండా నిమిషాల్లో ప్రపంచానికి చేరిపోతోంది. మన రచనకు మనమే బాధ్యులం. మధ్యలో రచన ప్రామాణికతను నిర్ణయించే సంపాదకులు లేరు. ఫేసుబుక్, వాట్సప్‍ల ద్వారా ఇబ్బడిముబ్బడిగా రచనలు వచ్చేస్తున్నాయి. వాటి నాణ్యతల గురించి ఎవరికి వారే బేరీజు వేసుకోవాలి. ఇప్పటికీ సాహిత్య పేజీల్లో ప్రచురణను ప్రతి రచయిత కోరుకుంటాడు. అలా ముద్రణ అయినవాటిని సోషలు మాధ్యమాల్లో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. ఏమైనా గానీ అంతర్జాల సాహిత్యం వెబ్ పత్రికల ద్వారా బాగానే వస్తోంది.ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.
16 మీ కథలకు ఎక్కువ గుర్తింపు వచ్చిందా? కవితలకు ఎక్కువ గుర్తింపు వచ్చిందా?
ముందుగా సాహితీ లోకంలో కవిగా గుర్తింపు పొందాను. తీసుకున్న స్థానీయత వస్తువుతో కథలు రాసాను. కథల్లో మా ప్రాంతాన్ని ప్రతిఫలించాననే తృప్తి ఉంది. యానాం, గోదావరి ప్రత్యేక అంశాల ప్రాతిపదికగా కథలు రాసాను. కథలు అనువాదాల ద్వారా ఇతర భాషల్లోకి వెళ్ళడం కారణంగా నాకు కథారచయితగానే పేరొచ్చింది. కవిగా కూడా మంచి స్థానాన్నే పొందాను. పురస్కారాలూ స్వీకరించాను.
17 ఇపుడు వెలువడుతున్న సాహిత్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు?
కథలూ కవిత్వమూ రెండు పక్రియల్లోనూ రచనలు విస్తారంగా వస్తున్నాయి. అభిరుచితో సాహిత్యం పండించడం కాకుండా పురస్కారాల కుతి పెరిగిందనిపిస్తోంది. మనం ఏరుకోవాలి గానీ మేలైన రచనలతో సాహిత్యం ఆశాజనకంగా ఉంది. నాకు మాత్రం మేలే జరిగింది. సంపద్వంతమైన అపార స్నేహం ఈ సాహిత్యం ద్వారా లభించింది.
18 పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం మీరేం రాస్తున్నారు?
ఆధ్యయనం పెంపొందించుకోవాలంటాను. చదవాల్సిన గ్రంథాల జాబితా తయారు చేసుకుని విస్తృతంగా చదవాలంటాను. భాష పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేలా తల్లిదండ్రులు కృషి చేయాలంటాను. వెంపర్లాటలకు పోకూడదంటాను. మంచి సాహిత్యం పట్ల అవగాహన కలిగించాలంటాను.
ప్రస్తుతం నేను ఈ కరోనా కాలంలో నవల రాస్తున్నాను. చాల మటుక్కి అయింది. కరోనాకు ముందు 15 కథలు రాయడానికి ప్రణాళిక వేసుకుని సమాచారం సేకరించుకున్నాను. తర్వాత ఆత్మీయ మిత్రుల సలహా మేరకు కథలకు బదులుగా నవల రాస్తున్నాను. ఇంతవరకు తెలుగు సాహిత్యం స్పృశించని ఇతివృత్తం ఎన్నుకున్నాను. అదేమిటంటే కోడి పందేలు. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలెన్నో ఉన్నాయి. వాటిని నవల ద్వారా చెప్పదలుచుకున్నాను.
సంపత్‍రెడ్డి గారూ... నన్ను నేను విప్పుకోడానికి పునఃసమీక్ష చేసుకోడానికి నా గురించి చెప్పుకోడానికీ వీలు కల్పించిన మీకు ధన్యవాదాలు. మీ పత్రిక మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను.
చిరునామా:
దాట్ల దేవదానం రాజు
8-1-048, ఉదయిని,
జక్రియ నగర్,
యానాం- 533464
సెల్: 94401 05987
--
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు