(February,2021)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా రాధేయ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు" మొదలైన క్రమం గురించి చెప్పండి?
"ఉమ్మడిశెట్టి"మా ఇంటి పేరు. కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం గ్రామంలో ఓ సామాన్య దిగువ మధ్య తరగతి చేనేత కార్మిక కుటుంబం మాది. మా తల్లి దండ్రులకు నేను నాలుగవ కొడుకుని.మేం అయిదు మంది అన్నదమ్ములం.ఇద్దరు చెల్లెళ్ళు. మొత్తం మా కుటుంబ సభ్యులం తొమ్మిది మంది.
మా తల్లిదండ్రులు ఉమ్మడిశెట్టి గంగిశెట్టి ,నాగమ్మ గార్లు. ఇద్దరూ చేనేత కార్మికులే. ముఖ్యంగా మా అమ్మ జీవితాంతం ఈ వృత్తిలోనే బతికింది.
నేనూ, మా అన్నలు అమ్మకు పనిలో సాయం చేసే వాళ్ళం.మా నాన్నకు ఆరోగ్యం బాగోలేక మధ్యలోనే మగ్గం మానేశాడని అమ్మ చెప్పింది.
మా నాన్న ఆరోజుల్లో వీధి బడిలో చదువుకున్నాడు, సంస్కారవంతుడు. మంచి లౌకికుడు. పేదరికాన్ని అయినా భరిస్తాడు కానీ ఎవరి దగ్గర చేయి చాచి ఎరుగడు.
పిల్లలందరినీ బాగా చదివించు కోవాలని ఎవరిని ఈ రెక్కల కష్టం లో దించ కూడదని భావించేవాడు. శరీర కష్టం వాళ్లది చదువు కోవలసిన బాధ్యత మాది.
మా అన్నదమ్ములూ, చెల్లెళ్ళు అందరూ చదువు కున్నారు. అందరికీ ఉద్యోగాలు
వచ్చాయి. ఆ పల్లెటూళ్ళో ఒక పేద చేనేత కార్మిక కుటుంబంలో అందరూ ఇష్టపడి, క్రమశిక్షణతో కష్టపడి చదువు కోవడం, పైగా అందరూ ఉద్యోగస్తులు కావడం మా ఉరిలోనే గాక చుట్టుపట్ల మా కుటుంబమంటే ఎంతో గౌరవం ఏర్పడింది.
కేవలం మా తల్లి కష్టం తోనే ఇంత పెద్ద కుటుంబం బతుకు తెరువు కష్టం కదా.
మా ఊరికి దగ్గర్లో ముద్దనూరు మాకు చిన్న టౌన్. అక్కడ మరొక భాగస్వామిని కలుపుకొని చిన్న బట్టల అంగడి ప్రారంభించాడు నాన్న.
తను రోజు పల్లె నుండి సైకిల్లో ముద్దనూరు వెళ్లి సాయంత్రం దాకా వ్యాపారం చూసుకొని తిరిగి ఇంటికి వచ్చేవాడు. మేమంతా యామవరం లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశాము. ముద్దనూరుకు వెళ్ళి హై స్కూల్ విద్య పూర్తి చేశాము.
ఈ చేనేత కుటుంబాల్లోచదువు ఉండేది కాదు. వారికి పదేళ్ల వయస్సు రాగానే ప్రతినపిల్లవాన్ని మగ్గంగుంటలో దింపుతారు. ఇక ఆడపిల్లల కైతే పెళ్లికి అర్హత మగ్గం నేర్వడమే.
నాకు బాల్యం నుంచీ ప్రకృతి ఆరాధన చాలా ఇష్టం, తెలుగు భాషన్నా, తెలుగు మాస్టార్లన్నా చాలా చాలా ఇష్టం.రాను రాను నా వయసుతో పాటు తెలుగు కవిత్వం మీద అభిమానమే కాదు, ప్రవేశం కూడా కలిగింది.
మొదట్లో అనుభూతి కవితలు, ప్రేమ కవితలు రాసేవాణ్ణి. 1974 లో శ్రీశ్రీ గారిని చూశాక నా భావజాలంలో కొంత మార్పు అవసరం అనిపించింది అప్పటి నుంచి అభ్యుదయ కవిత్వం రాస్తూ వచ్చాను.
నాకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని ఎంచుకున్నాను నిరుద్యోగిగా ఉన్నప్పుడే నేను "మరోప్రపంచం కోసం" కవితా సంపుటి వేశాను నిరుద్యోగి గానే 79 లో నాకు పెళ్లి అయ్యింది.
నా జీవితంలోకి ఇల్లాలిగా సత్యా దేవి వచ్చింది ఆమె రాకతో నా జీవితం సాహిత్యం మరింతగా వికసించిందని చెప్పవచ్చు తను నాకు మంచి. ఉత్సాహాన్ని ఇచ్చింది
1982లో నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది ఉద్యోగంతో నేను పేదరికాన్ని జయించానన్న తృప్తి కలిగింది. తర్వాత కవిగా ఎదుగుతూ వచ్చాను. ఈ క్రమంలో నేను కవిత్వం రాయడమే కాకుండా మంచి కవిత్వం రాసిన కవుల్ని ప్రోత్సహిస్తూ వారిని ఒక అవార్డు పేరుతో గౌరవించాలని నా ఆశయం. ఈ విషయమే ఒకరోజు శ్రీమతి తో చర్చించాను ఆమె సంతోషంగా అంగీకరించింది. అంతేకాదు మేము పల్లెటూరిలోనే కాపురం ఉంటూ నిరాడంబరంగా బతకడం మాకుబాగా అలవాటైంది. తను కూడా ఎంతో పొదుపుగా కుటుంబాన్ని నిర్వహిస్తూనే అవార్డుకు తనవంతు సహకారం అందిస్తూ వచ్చింది.
అలా ఏర్పడిందే మా "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు". ఒక సామాన్య మధ్యతరగతి శ్రామిక కుటుంబ ఏర్పాటు చేసుకున్న ఒక పవిత్రమైన అవార్డు మాది.
2. అవార్డు కోసం కవితా సంపుటాల మధ్య తీవ్రమైన పోటీ ఎప్పుడైనా వచ్చిందా?
అప్పుడు న్యాయనిర్ణేతల అభిప్రాయం ఎలా ఉండేది? ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఎంత వరకు ఉంటుంది?
మొదట్లో అవార్డు పరిశీలన కోసం 3 సం వ్యవధిలో అచ్చయిన కవితా సంపుటాలను ఆహ్వానించే వాణ్ణి.అప్పట్లో 30 సంపుటాలదాకా వచ్చేవి ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు లాగా ఇన్ని పత్రికలులేవు. మొబైల్స్ గానీ, మీడియా గ్రూపులు గానీ లేవు గదా,అన్నీ ఉత్తరాల ద్వారానే జరగాలి. అప్పుడున్న ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఈనాడు, వార్త, ఉదయం పత్రికలు మా నోటిఫికేషన్ పట్టించుకోలేదు. ఎక్కడో మారుమూల పేజీలో ఓ చిన్న వార్త వేసేవారు. ఆ వార్తను చాలామంది కవులు గమనించే వాళ్లు కాదు. కానీ నేను ప్రతి ఆదివారం లైబ్రరీకి వెళ్లి కొత్త పుస్తకాలను వేసిన కవులను వారి చిరు నామాలను సేకరించుకుని వచ్చేవాణ్ణి.
ప్రతి రోజు స్కూల్ కి వెళ్లేటప్పుడు నా క్యారీ బ్యాగులో 100 పోస్టుకార్డుల ఎప్పటికీ పెట్టుకొని వెళ్లేవాణ్ణి. మా అవార్డు ప్రకటన సమాచారాన్ని కార్డు మీద రాసి ఆయా కవుల పోస్ట్ చేసేవాణ్ణి. కొత్త కదా, అలా చేస్తే కూడా నాకు అప్పట్లో వందమందికి రాస్తే 30 నుంచి 40 దాకా మాత్రమే వచ్చేవి. వాటినే మూడు సెట్లు గా చేసి న్యాయనిర్ణేతల పంపేవాణ్ణి. అలా పదేళ్లు వరకు ప్రతియేటా క్రమం తప్పకుండా కష్టపడి కార్డుల ద్వారా కవులకు సమాచారం చేరవేశాను. పుస్తకాలు అంతగానే అందినట్లు మళ్లీ కవులకు ఉత్తరం రాసే వాణ్ని. అవార్డులు ప్రకటించాక పత్రికలకు సమాచారం ఇస్తూ మళ్లీ ఈ సమాచారాన్ని ఉత్తరం ద్వారా పంపిన కవులందరికీ రాసి పంపేవాడిని.
ఈ పదేళ్లలో నా నిబద్ధతను, తెలుగు సాహిత్య లోకం అంతా గుర్తించింది.అవార్డు విజేతలను కూడా గమనిస్తూ వచ్చింది.అవార్డు ద్వారా మేం ఎలాంటి వివక్షాలేకుండా ఉత్తమ కవిత్వఎంపికలో న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని ప్రకటిస్తూ రావడం, కవిలోకమంతా గమనించింది. గుర్తించింది. తర్వాత వాళ్లే మా అవార్డు ప్రకటన కోసం ఎదురు చూసేవారు. దీన్ని తెలుగు కవులకు ప్రతిష్టాత్మక పురస్కారంగా గుర్తించి గౌరవిస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడగానే పుస్తకాలు పంపించడం అలవాటు చేసుకున్నారు. సాహిత్యలోకం గుర్తింపు కోసం, నాకు పది సంవత్సరాలు పట్టింది.
ఆవార్డు కోసం మొదట్లో ప్రతియేటా నగదు బహుమతి వెయ్యి రూపాయలు, షీల్డు, శాలువాతో సన్మానించుకోవాలని మేం నిర్ణయించుకున్నాము.
1988 లో ఈ అవార్డు ను ప్రారంభించక ముందు కుందుర్తి గారు స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ మాత్రమే ఉండేది. ఈ పురస్కారం కూడా కేవలం కవిత్వానికే అంకితమైన అవార్డు. నాకు కుందుర్తి గారితో పరిచయం, సాన్నిహిత్యం కూడా ఉండేది. మా అవార్డు స్థాపనకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి కూడా కారణమే..
మొదటి అవార్డు సభ 1989లో మా మండల కేంద్రమైన ముద్దనూరు లో ఏర్పాటు చేశాం.
తర్వాత్తర్వాత నేను పనిచేస్తున్న ప్రాంతాల్లోనే జరుపుతూ వచ్చాము. ప్రతి ఏటా ఈ అవార్డు ప్రదాన సభలు కోసం మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు పెట్టే వాళ్ళం.
ఈ మొత్తాన్ని మేము మాకొచ్చే జీవితంలోంచి పొదుపు చేసుకొని ఖర్చు పెట్టేవాళ్ళం.సభల నిర్వహణలో ఆడంబరం మాకు ఇష్టం లేదు.అలా చేసుకుంటూ పోతే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందుముందు భారమౌతుందని చాలా జాగ్రత్తగా వ్యవహరించే వాళ్ళం.
ప్రతి పదేళ్లకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చాము. ప్రస్తుతం ఈ విలువ అయిదు వేలు అయింది.సభా ఖర్చులు కూడా బాగా పెరిగి పోయి..ఇప్పుడు ఏడాదికి ఎంత నిరాడంరంగా జరుపుకున్నా ముప్ఫై నుంచీ నలభై వేలు అవుతోంది.
మా పిల్లలు పెరుగుతూ వస్తుంటే మా ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూవచ్చాము. ఆ సంవత్సరం అవార్డు సభ కష్టమయ్యేది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా అవార్డును నడపాలా? అని నిర్వేదం, ప్రసూతి వైరాగ్యం కలిగేది. మళ్లీ అంతలోనే ఉత్సాహం తెచ్చుకొని ముందుకు పోతూ ఉంటాను.
అవార్డు నిర్వహణ నాకు సంవత్సరంలో ఆరునెలలు ప్రాజెక్ట్ గా భావిస్తుంటాను. ప్రతియేటా నవంబరు లో మా వార్డు నోటిఫికేషన్ వెలువడుతుంది.
జనవరి 31 వరకు పరిశీలన కోసం ఎంట్రీలను స్వీకరిస్తాను.ఫిబ్రవరి నెలంతా జడ్జిమెంట్.ఈ క్రమంలోనే రాయలసీమ తెలంగాణా, ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల నుండి ముగ్గురు సీనియర్ కవులనుగానీ, విమర్శకులను గానీ న్యాయనిర్ణేతలుగా నిర్ణయించుకొని వారి నుండి అనుమతి తీసుకుంటాను.
వచ్చిన ఎంట్రీలను మూడు బండిల్స్ ప్యాక్ చేస్తాను.స్టూడెంట్స్ ఆన్సర్ పేపర్స్ ఎంత జాగ్రత్తగా సెంటర్స్ కు పంపుతారో నేనూ అలాగే న్యాయనిర్ణేతలకు పంపుతాను.ఈ పని అత్యంత గోప్యంగా జరుగుతుంది.
న్యాయనిర్ణేతలు ఎవరు ఉంటారనేది నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. ముందుగా నేను ఎంచుకున్న న్యాయ నిర్ణేతలను ఫోన్ ద్వారా సంప్రదించి అనుమతి తీసుకుంటాను.
మిగిలిన ఇద్దరు ఎవరు అనేవిషయాన్ని కూడా వారికి చెప్పను. అలా ముగ్గురి నుండి విడివిడిగా అనుమతి తీసుకుంటాను.
అవార్డు విజేతను ప్రకటనతోనే ముగ్గురు న్యాయ నిర్ణేతల పేర్లను కూడా ప్రకటించడం ఒక ఆనవాయితీ గా జరుగుతుంది.
ఇదంతా గోప్యంగా రహస్యంగా జరుగుతుంది. Judges ను ప్రాధాన్యత క్రమంలో వారిని మూడు పుస్తకాలను ఎంపిక చేసి, అందులోని ప్రత్యేకత గురించికొన్ని వాక్యాలు రాయమని కోరుతాను.
వారు ముగ్గురూ తొమ్మిది పుస్తకాలను సూచిస్తూ రాసి పంపిస్తారు. అందులో మొదటి స్థానం ఏ పుస్తకానికి వచ్చిందో చూస్తాను. అలా వచ్చిన పుస్తకాన్ని అవార్డు కోసం ఎంపిక చేస్తాను. స్థానాలు మారినప్పుడు కూడా ఒకే పుస్తకాన్ని ఎంతమంది సూచించారో మళ్ళీ చూస్తాను. అలా చూసి అంచనా వేసి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పుస్తకాన్ని ఎంపిక చేసుకుని అవార్డు విజేతగా ప్రకటిస్తాను.
ఫిబ్రవరి నెల అంతా కూడా జడ్జిమెంట్ కోసం కేటాయించి ఉంటాను. వారు తమ judgement నాకు పంపే వరకూ వారితో నేను మాట్లాడను. వారినుంచి రిపోర్ట్ వచ్చాక నిర్ణయాన్ని బట్టి మార్చి మొదటి వారంలో అవార్డు విజేతలను ప్రకటిస్తాను
ఒక వైపు ప్రవేటుగా నా చదువులు, పిల్లల చదువులు, కవిత్వం రాస్తూ పుస్తకాలు వెయ్యడం ఈ ఒక్క జీతంలోనే మాకు చాలా కష్టమయ్యేది.
అయినా సరే..
1982-94 మధ్య కాలం లో, తెలుగు బిఏ లిట్,ఎం.ఏ., చేశాను. 2008లో పిహెచ్,డి, సాధించాను.
2001 నేనెంతగానో ఇష్టపడే తెలుగు లెక్చరర్ గా ప్రమోషన్ పొందాను. నా కార్యరంగం కళాశాలకు మారింది. కడప జిల్లా నుండి ఆనంతపురం జిల్లాకు మారింది.
ఈ కాలం లోనే మేం అనేక ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకుల మధ్య అవార్డును కొనసాగిస్తూనే వచ్చాము. ఉత్తమ కవిత్వానికి అవార్డు ప్రకటించడంలో ఎక్కడా రాజీపడలేదు. న్యాయ నిర్ణేతల నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తూ వస్తున్నాను.
నాకు కవిత్వమే ప్రధానం. ప్రాంతాలూ, కవులూ కాదు. అలా భావించే వాణ్ణి అయితే నేను 32 మందిలో 15 మంది కవులు తెలంగాణ ప్రాంతం వారికే ఎందుకిస్తాను?. ముగ్గురే రాయల సీమ వారు. మీరొకసారి మా అవార్డు గ్రహీతల లిస్ట్ చూడండి. ఈ నాటి ప్రసిద్ధ కవులందరూ ఒకనాటి మా అవార్డు విజేతలే.
అవార్డు ఎంపికలో నా పాత్ర ఏమీఉండదు.ముగ్గురు న్యాయ నిర్ణేతల నిర్ణయమే కీలకం.
ఒక్కోసారి న్యాయనిర్ణేతల ప్రాధాన్యతా క్రమం లో కూడా సందిగ్ధత ఏర్పడిన సందర్భాలూ నాకు ఎదురైనాయి. అప్పుడు నేను స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు అయినా తీసుకొను. ఇలాంటి సందర్భాలు నాకు నాలుగైదు సార్లు ఎదురైంది.
మళ్లీ judges తోనే మాట్లాడి వారి ప్రాధాన్యతను పునః సమీక్షించమని కోరుతాను. మళ్లీ వారు సమయం కోరితే ఇస్తాను.వారి పునః సమీక్ష లో విజేతల్లో స్పష్టత వస్తుంది.
అప్పుడు విజేతను ప్రకటిస్తానే తప్ప,ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కలుగ జేసుకొను. అవార్డు విజేత విషయంలో నా ప్రమేయమంటూ ఉండదు. judges ను ప్రభావితం చెయ్యను. పురస్కారాల్లో "ఉమ్మడిశెట్టి"ఒక ట్రేడ్ మార్క్ గా ఉండాలనేదే నా ఆశయం.
3. కవిగా మీరు కవులకు అవార్డు ఇవ్వడం పట్ల ఎలాంటి సంతృప్తి కి లోనవుతున్నారు ?
నేను బేసికల్ గా కవిని.కవిత్వ మంటే ప్రాణం.పైగా మేం తరతరాలుగా నిరక్షరాస్యులం. మగ్గమే మా జీవన వేదం.అటువంటి శ్రమజీవుల కడుపున పుట్టాను. ఆ రోజుల్లో వీధి బడిలో అంతో ఇంతో అక్షరజ్ఞానం పొందిన తండ్రికి కొడుకుగా పుట్టడం. నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను.
నా తల్లి దండ్రీ,అన్నదమ్ములు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అందువల్లే నేను నిరుద్యోగి గా ఉన్నప్పుడే రెండు కవితా సంపుతాలు తెచ్చాను.ప్రాచీన,ప్రబంధ, అవధాన సాహిత్యమే రాజ్యమేలే రాయలసీమ గడపలో ధైర్యంగా 23 ఏళ్ల వయసులోనే 'మరోప్రపంచం కోసం' పేరుతో వచన కవిత్వసంపుటి తెచ్చి ప్రాచీన కవిపండితుల ఆగ్రహానికి గురయ్యాను. అప్పట్లోనే కడప జిల్లాలోని అభ్యుదయ కవులు గజ్జెల మల్లారెడ్డి, వైసివిరెడ్డి, రా రా, సోదుం జయరాం వంటి వారు నా భుజం తట్టి ప్రోత్సహించారు. తొలి కవితాసంపుటి తోనే కవిగా నా ఉనికిని చాటుకున్నాను.అదే ఉత్సాహం తో మళ్లీ 1981 లో "దివ్యదృష్టి"తెచ్చాను. ఈ పుస్తకానికి రెండు పురస్కారాలు రావడం తో కవి గా సాహిత్యలోకం లో గుర్తింపు వచ్చింది. నిరుద్యోగి గా ఈ రెండు పుస్తకాలు తేవడానికి మా కుటుంబ ప్రోత్సాహమే కారణం. 1982 లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది.
నాకూ, నా కవిత్వానికి, నా కుటుంబానికి ఒక ఆసరా దొరికింది.తర్వాత 84 లో జ్వలనమ్, 87లో తుఫాను ముందటి ప్రశాంతి వచ్చింది.
ఈ దశలో నేను కవిత్వం రాయడమే కాదు, ఉత్తమకవిత్వాన్ని ఎంపికచేసి, వారిని అవార్డుతో సత్కరించి,ఉత్తేజ పరుస్తూ,ఉత్తమ కవిత్వ నిర్మాణంలో "నేను సైతం" కృషి చేస్తున్న తృప్తి
నాకు మిగిలింది.
4. అవార్డు ఎంపికలు ఎప్పుడైనా అన్యాయం జరిగింది లేదా న్యాయం జరగలేదు అని మీకెప్పుడైనా అనిపించిందా?
లేదు లేదు నాకెప్పుడు అలా అనిపించలేదు. నూటికి 95 శాతం అన్యాయమే జరిగింది. కేవలం ఐదు శాతం కొంత అసంతృప్తి అనిపించినా ఎప్పుడూ నూటికి నూరు శాతం న్యాయం జరగక పోవచ్చు నని నా నమ్మకం.
అయితే ఇక్కడ నేనొక మాట చెప్పాలి. కవితా రంగం లోకి అడుగు పెట్టిన కవులు, తొలి కవితా సంపుటితోనే మా అవార్డు విజేతలైన కవులు 17 మంది దాకా వున్నారు.
వారిని చూసి నేనెంతో గర్వంగా చెప్పుకుంటాను. ఉదాహరణకు 30వ అవార్డు పొందిన శ్రీసుధ మోదుగు,గారిది తొలికవిత్వం"ఆమోహం".
ఇవాళ్టి ప్రామిసింగ్ పోయెట్ గా అందరి అభిమానం పొందుతున్న పుప్పాల శ్రీరామ్ గారి "అద్వంద్వం"తొలి
కవిత్వమే. ఇలా వివరించుకుంటూ పోతే 17 మంది దాకా ఉన్నారు.
మా అవార్డుతర్వాత అదే పుస్తకాలకు మరికొన్ని పురస్కారాలను పొందిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అలా తీసుకున్న వాళ్ళు 17 మంది దాకా ఉన్నారు. 88 నుంచీ 2019 వరకు 32 మందికి అవార్డులు ప్రదానం చేశారు.
ఈ క్రమం లో ప్రతి అవార్డుకు ముగ్గురు న్యాయనిర్ణేతల చొప్పున ఇప్పటికి 96 మందికి పైగా ప్రసిద్ధ సాహితీవేత్తలు విమర్శకులు కవులు మా అవార్డుకు జడ్జెస్ గా వ్యవహరించారు.
వారి నిర్ణయాన్ని కాదని స్వతంత్రించి ఎప్పుడు నా నిర్ణయాన్ని ప్రకటించుకోలేదు. అవార్డు పొందిన 33 కావ్యాలలో కేవలం రెండు లేదా మూడు ఇంటి మీద నాకు కొంత అసంతృప్తి ఉంది. పేర్లు చెప్పను కానీ న్యాయనిర్ణేత నిర్ణయాన్ని బట్టి వాటిని ప్రకటించాల్సి వచ్చింది.
తొలిసారి మా అవార్డు పొందిన వారికి సాహితీ లోకంలో తిరుగే ఉండదనే సెంటిమెంట్ తెలుగు కవుల్లో ఉంది. వర్తమాన తెలుగు కవులు మా అవార్డును ప్రతిష్టాత్మక పురస్కారంగా గౌరవిస్తున్నారు.మాకీ సంతృప్తి చాలు.
5. మీకవితా ప్రస్థానం గురించి,సుదీర్ఘమైన మీ సాహితీ ప్రస్థానం లోమైలు రాళ్ళను గురించి చెప్పండి?
నాకిప్పుడు అరవై ఐదేళ్ల వయసు. అధ్యాపకుడి గా ముప్ఫై ఐదేళ్లు. నా సాహితీ ప్రస్థానానికి యాభై ఏళ్ళు. మా అవార్డుకు ముప్పై మూడేళ్లు. నా జీవితంలో సగభాగం అవార్డులో భాగమైంది. 810 రూ,తో మొదలైన నా ఉద్యోగ జీవితంలో,అవార్డును స్థాపించుకున్నాం. పైసా,పైసా కూడబెట్టుకొని అవార్డు కోసం వెచ్చించాం. నా కవితా సంపుటాలు వేసుకున్నాం. 1988లో మేం ప్రారంభించిన అవార్డు ప్రతి ఏటా క్రమం తప్పకుండా 2017 నాటికి 30 ఏళ్ళు పూర్తి చేరుకోవడం.
మళ్ళీ 30 మంది కవులను ఆహ్వానించి త్రి దశాబ్ది కవితోత్సవాలను ఒక రోజంతా నిర్వహించడం ..
అవార్డు పొందిన 30 ఉత్తమ కావ్యాలను విశ్లేషిస్తూ నేను రాసిన పుస్తకం "మూడు పదులు, ముప్ఫై కావ్యాలు"అదే సభల్లో ఆవిష్కరించడం, ముప్ఫై ఏళ్ల నాటికి దాదాపు పదిహేనులక్షలు అవార్డుకోసం వెచ్చించాం, అయినాబాధ లేదు.
కోట్లవిలువచేసే గౌరవంతో పాటూ "ప్రతిష్టాత్మక పురస్కారం" అన్న కీర్తిని కూడా పొందడం, ఒక శ్రామిక మధ్యతరగతి కుటుంబం సాధించిన విజయంగామేం భావిస్తున్నాం.
అంతే కాదు ఒక సాధారణ బడిపంతులుగా మొదలైన నా జీవితం తెలుగులో ఎం.ఏ.,పిహెచ్,డి చేసి, డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు పనిచేసి రిటైర్ కావడం, 2008,09 లో ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్య పుస్తకాన్ని రూపొందించే ఎడిటోరియల్ కమిటీ లో స్థానం పొందడం,
2003 లో ప్రతియేటా ఆకాశవాణి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే సర్వ భాషాకవిసమ్మేళనం లో తెలుగు కవిగా పాల్గొనడం, బుక్కపట్నం డైట్ ఉపాధ్యాయ శిక్షణార్ధులుగా వచ్చిన ముగ్గురు యువకులు రెండేళ్లు నా వద్ద కవిత్వ శిక్షణ పొందిన పెళ్ళూరు సునీల్ , సుంకర గోపాలయ్య ,దోర్నాదుల సిద్దార్థ ఈ ముగ్గురూ తెలుగు కవులు గా గుర్తింపు పొందుతూ ఉండడం, వారే నామీద గౌరవం తో "డా. రాధేయ కవితా పురస్కారం" గత పదేళ్లకు పైగా విజయ వంతం గా నిర్వహిస్తూ ఉండడం, చేనేత కార్మికుల జీవన విషాదాన్ని చిత్రించిన తొలిసరిగా దీర్ఘ కావ్యం గా "మగ్గం బతుకు" రాయడం,. ఈ కావ్యం నాకు గొప్ప కీర్తిని సంపాదించి పెట్టడం, ఈ కావ్యం తెలుగు హిందీ భాషల్లో అనువాదం కావడం , ఈ కావ్యం మీదనే , ఎస్కేయు లో, ఎస్వీయు లోరెండు ఎం ఫిల్. లు రావడం, నా సమగ్ర కవిత్వం మీద ఎస్కేయు లో పిహెచ్.,డి చేయడం .. ..ఇవన్నీ నేను సాధించిన మైలు రాళ్లే..
6. సాహితీ విమర్శకుడిగా మీరు చాలా విలువైన పుస్తకాలు రచించారు కదా వాటి గురించి చెప్పండి.
1978 లో కవిగా తొలి కవితా సంపుటి "మరో ప్రపంచం కోసం" తో నా ప్రస్థానం మొదలైంది.
తరవాత ప్రతి మూడేళ్ళ వ్యవధిలో ఒక పుస్తకం తెచ్చాను.2009 నాటికీ ఎనిమిది కవితా సంపుటాలు తెచ్చాను.
తర్వాత కవిత్వవిమర్శకుడిగా,విశ్లేషకుడిగా,ఆధునిక కవిత్వం లో వస్తు, వైవిధ్య విశ్లేషణ లో భాగంగా వరుసగా నాలుగు సంపుటాలు తెచ్చాను.
అవి..
కవిత్వం ఓ సామాజిక స్వప్నం..2011
కవిత్వం ఓ సామాజిక సంస్కారం..2012
కవిత్వం ఓ సామాజిక సత్యం..2013
కవిత్వం ఓ సామాజిక చైతన్యం..2015
ఇది సరికొత్త ప్రయోగం..
ఈ నాలుగు సంపుటాల్లో ..విభిన్న వస్తు పరంగా 500 మంది కవులు రాసిన 1200 కవితల్ని , ఉదాహరణలతో విశ్లేషించాను.గతంలో విడి విడి గా కొన్ని వ్యాసాలైతే వచ్చాయి గానీ ఇంత విస్తృతంగా విశ్లేషణ జరగలేదు. మా అవార్డు కు వచ్చిన ప్రతి పుస్తకాన్ని చదవడమే ఈ పుస్తకాలు రాయడానికి దోహద పడ్డాయని చెప్పవచ్చు.
తర్వాత...వర్తమాన సీనియర్ కవుల కవయిత్రుల సమగ్ర కవితా ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ రెండు భాగాలు తెచ్చాను.
అవి...
అవగాహన..2017
వివేచన.......2020
విశ్లేషణ....రావాల్సి ఉంది
ఈ మూడు సంపుటాల్లో 50 దాకా సీనియర్ కవులు,కవయిత్రులు ఉంటారు.
మా అవార్డు పొందిన 30 ఉత్తమ కావ్యాలమీద నేను రాసిన విశ్లేషణాత్మక గ్రంథం..
మూడు పదులు ముప్ఫై కావ్యాలు 2018 లో వచ్చింది.
కవిత్వ విమర్శకుడిగా నేను రాసిన పుస్తకాలు ఇవి..
7. అవార్డు సభలు పెద్ద ఎత్తున. నిర్వహించడం, వెనుక గలమీస్నేహితులు కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి?
మా అవార్డు సభలు భారీగా ఉండవు పెద్ద ఎత్తున జరగవు ఆడంబరంగా జరగవు అవార్డు మీద ఉన్న అభిమానంతో అలా అనుకుంటారు , అంతేకానీ అది వాస్తవం కాదు ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అనగా పదేళ్లు,(దశాబ్ది సభ) ఇరవై ఏళ్ళు,(ద్వి దశాబ్ది) 25ఏళ్లకు( రజతోత్సవం) 30ఏళ్లకు(త్రి దశాబ్ది) ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వచ్చామే తప్ప ఆర్భాటం లేదు. త్రి దశాబ్ది ఉత్సవం మాత్రం ఒకరోజంతా ఒక చరిత్ర గా నిర్వహించాను. ఇందులో ప్రతి పైసా నాజీతం తో, 2013 నుంచీ నా పెన్షన్ తో.
ఇందులో స్నేహితుల,బంధువుల, అన్నదమ్ముల ఆర్థిక సహాయంగానీ నేను ఎవరి నుండీ ఏనాడూ ఆశించలేదు. ఇది కేవలం నా కుటుంబం పక్షాన్నే జరగాలి.అనే ఆశయమే పునాదిగా మా అవార్డు ఏర్పడింది. దీనికి వెనుకా ముందు నేనూ,మా శ్రీమతి ,మా పిల్లలు తప్ప వేరెవరూ లేరు.
నాకు బతుకు తెరువుకు ఉద్యోగముంది.
ఈ సమాజం రచయితగా నన్ను గుర్తించి గౌరవిస్తోంది.
ఈ సమాజానికి , సాహిత్యానికి, తోటి కవులకు నాకున్నంతలో నాకు చేతనైనంత ఏమైనా చెయ్యాలి. ఎవరికోసమోఎదురుచూడ కూడదు. ఎవరినుండి ఏమీ ఆశించ కూడదు.
ఇదీ నా ఆశయం. నా సంకల్పంతోనే మా పురస్కారం నడుస్తోంది.
ఈ నిబద్ధత దాటి వెళ్ళను. భవిష్యత్తులో అనుకోని విపత్కరస్థితిలో మా అవార్డు ఆగిపోయినా సరే. పురస్కారాల్లో ఒక చరిత్ర గానిల్చిపోవాలి.
8. మీ సాహితీ కుటుంబం చాలా పెద్దది కదా మీకు ఇంత మంది ఆత్మీయులతో అనుబంధం ఎట్లా ఏర్పడింది.?
మా పురస్కారం పొందిన ప్రతి కవినీ కవయిత్రిని మా కుటుంబ సభ్యులుగా, మా ఆడపడుచులుగా మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం.మొదట మేమిద్దరం, మాకు ముగ్గురు,ఇదీ మాకుటుంబం. ఇప్పుడు మా కుటుంబ సభ్యుల సంఖ్య మా అవార్డు గ్రహీతల తో కలిసి 5+33=38 మంది అయ్యారు అంతేకాదు ప్రతి ఏటా మా సభ్యుడు ఒకరు పెరుగుతూనే ఉంటారు వారికి మా గౌరవ మర్యాదలు ఎప్పుడూ ఉంటాయి ఇది ఇది మా దంపతులం చేసుకున్నా నిర్ణయం ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది.ఎందుకంటే అవార్డు ఇచ్చి వదిలేయం, వారిని మర్చిపోలేం, వారితో మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. రోజూ కనీసం ఒకరిద్దరైనా మాతో మాట్లాడుతూనే ఉంటారు. వారి ఆనందాలే కాదు కష్టాలూ, కన్నీళ్లూ మాతో
పంచుకుంటూనే ఉంటారు. ఓ సినీ కవి అన్నట్లు జగమంత కుటుంబం మాది. కవి లోక కుటుంబం మాది. వారూ అలాగే మమ్మల్ని గౌరవిస్తున్నారు,మేమూ వారిని అంతే ప్రేమిస్తున్నాం.
9. అవార్డు ప్రక్రియ కు సంబంధించి ఇటీవల 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు' గా మార్చారు కదా ఆ క్రమం గురించి చెప్పండి?
సత్యాదేవి నా భాగ స్వామిని.నేను నిరుద్యోగిగా పేదరికం అనుభవిస్తున్న కాలం లోనే తాను 1979 లో నా భార్యగా నాతో జీవితాన్ని పంచుకొంది. మా ఇంటి నాల్గవ కోడలిగా"ఉమ్మడిశెట్టి సత్యాదేవి" మారింది.
తాను హైస్కూల్ విద్య వరకే చదువుకుంది. సాహిత్యం పట్ల అవగాహన లేదు. కవిత్వమంటే తెలియదు. అప్పటికే యువకవిగా గుర్తింపు తెచ్చుకున్న నన్ను భర్తగా ప్రేమించినట్లే నా కవిత్వాన్నీ అంతగానే ప్రేమించింది.
నా నిరుద్యోగానికి దిగులు పడలేదు. మరో మూడేళ్ళ తర్వాత అంటే 1982 లో నాకు ఉపాధ్యాయునిగా ఉద్యోగ మొచ్చింది. దిగువ మధ్యతరగతి ఇల్లాలి గా నాతో పాటు పల్లె కాపురం చేసింది.
“1988 లో కవిత్వానికి మన కుటుంబం పక్షాన ఒక అవార్డు స్థాపించి ప్రతియేటా ఒక కవిని సత్కరించుకుందాం. నా భార్యగా నీ అనుమతి కావాలి ఇస్తావా?” అన్నప్పుడు మారు మాట్లాడకుండా సంతోషంగా అంగీకరించింది.
అంతే కాదు, సంసారంలో పొదుపు చేసుకొంటూనే తీరిక సమయంలో మిషన్ కుట్టి కూడా ఆర్థికంగా అవార్డు కోసం శ్రమపడింది. కవులకు ఆతిధ్యం ఇచ్చి నాకు తోడ్పడింది.
అంతే కాదు, నాకు 58 ఏళ్ళు వచ్చేసరికి అవార్డుకు 25 ఏళ్ళు వచ్చాయి. మా బతుకులోకి కష్టాలూ, కన్నీళ్లూ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, బాధ్యతల మధ్య తాను అనారోగ్యంతో ఎదురీదుతూనే నాకు సంపూర్ణంగా సహకారం అందిస్తూ వచ్చింది.
జీతంతో పాతి కేళ్లుగా అవార్డు నడిచింది. ఇకపై పెన్షనే మాకు ఏకైక ఆధారం. తనిప్పుడు కష్టపడ లేదు. అవార్డు రజతోత్సవసభ బాగా నిర్వహించాము. అదే ముగింపు సభ గా భావించి అవార్డు విరమణను ప్రకటించాను. ఊహించని విధంగా తాను సభ ముందుకొచ్చి,నా చేతిలోని మైకు అందుకొని, మా ఆయన చెప్పినట్లు మా కష్టాలెన్ని ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా మా అవార్డును ఇంకా కొంతకాలం కొన సాగిస్తామని నేను ప్రకటిస్తున్నాను.
మా ఆయన ఆనందమే నాకు కావాలి. ఆయనకు సహకరిస్తాను అని సభా ముఖంగా ప్రకటించడం సభ మొత్తాన్ని ఆశ్చర్యంతో, ఆనందంతోముంచెత్తింది.
ఒక సామాన్య ఇల్లాలిగా భర్త ఆశయం తన భర్తకోసం ఇంతగా పరితపించి, త్యాగం చెయ్యడం ముఖ్యంగా మధ్య తరగతి గృహిణుల్లోమనకు కనిపించరు.
ఈమెను నా అదృష్టదేవత గా భావిస్తున్నాను.
అలా మరో ఐదేళ్లు కొనసాగిన మా అవార్డుకు 30 ఏళ్ళునిండాయి..ఈ మధ్యకాలం లో మా శ్రీమతి బెంగుళూరు లో రోడ్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి గెలిచింది. కానీ ఆమె మెమరీ మీద తీవ్ర ప్రభావం చూపింది.
మా చెన్నైలో మా బాబు దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. నేనేమో అనంతపురం లో మా అమ్మాయి దగ్గర ఉండిపోయాను. ఇంతలోనే అవార్డు 30 ఏళ్ల సభ రానే వచ్చింది.
ఏం చేయాలిప్పుడు? ముందుగా అనుకున్న ప్రకారం 30 మంది అవార్డు గ్రహీతల్ని ఆహ్వానించి ఒక రోజంతా ఉత్సవాలు నిర్వహించి అంతటితో ముగిద్దామని నిర్ణయించుకన్నాం. అందర్నీ పిలిచి ఒక రోజంతా జరపడానికి మా దగ్గర ఆర్థిక వనరులు లేవు.ఇంతకాలం ఒంటి చేత్తో నిర్వహిస్తూ వచ్చాము. ఇంత భారీగా ముగింపు పల్కడం నాకు నచ్చలేదు.
ఏదో 30వ అవార్డు ప్రదానం చేసి, ముగింపు పలకాలని నేనంటే తను ఒప్పుకోలేదు. మన బిడ్డకు పెళ్లి చేశామనుకొని ఈ సారి చేద్ధాం.
మీరు రిటైర్ అయ్యాక కొంత అమౌంట్ బ్యాంక్ లో ఉందికదా. అందులో తీసి ఖర్చుపెట్టండి. ఈ సారికి నాకోసం పెట్టండి. ఇంక మనేద్దాం అనే సరికి నాకు మతి పోయింది.
“ఇదేమిటి సత్యా, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం .ఈ స్థితిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటే ..ఎలా?” అన్నాను.
“ఏం పర్వాలేదు. మీరింకేం ఆలోచించవద్దు నా కోసం చెయ్యండి..”అంది
త్యాగానికైనా ఒక హద్దంటూ ఉండాలి. తనకు మాలిన ధర్మం..సామెతయ్యింది. నాకు లోలోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం భయం భయంగానే ఏర్పాట్లు ప్రారంభించాను.
ఆ రోజు రానే వచ్చింది. సభలు ఉదయం నుండి రాత్రి వరకూ ఏకధాటిగా కొనసాగాయి. మధ్యలో లంచ్ బ్రేక్ తో.
ప్రారంభోత్సవ సభలో తాను ప్రసంగిస్తూ అవార్డు గ్రహీతలనందరిని మా కుటుంబ సభ్యులు గా సంభోదిస్తూ ఆనందంతో భోరున ఏడ్చింది. మొత్తం సభ అంతా కంటతడి పెట్టించింది.
“ఇంకమేం చేయ్యలేము, మమ్మల్ని క్షమించండి” అంది. ఆయన శిష్యులు ముగ్గురూ పూనుకుంటే మా అవార్డు కొనసాగుతుందని మరోవైపు ఆశాభావాన్ని ప్రకటించింది.
ఆ రోజు అందరూ తన గురించే మాట్లాడుకున్నారు. ఇంత గొప్ప త్యాగమూర్తిని భార్యగా పొందడం నిజంగా మన రాధేయ అదృష్టం అన్నారు.
అలా సభలు ఎంతోవైభవంగా, ఉత్సాహంగా జరిగిపోయాయి. మరో మూడు నెలలకు హార్ట్ అటాక్ తో తాను నాజీవితంచీ నిష్క్రమించింది. నన్ను ఒంటరిగా మిగిల్చింది.
39 ఏళ్ళు నన్నూ, నా కవిత్వాన్నీ,మా అవార్డును నడిపించి వెళ్లిపోయిన నా సహచరికి నేనేమివ్వగలను మీరే చెప్పండి? నన్ను నడిపిన నా సహచరి ఇకపైన తానే ఓ చరిత్రగా మిగలాలి.
అందుకే...31వ సభ నుంచీ మా అవార్డు 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు' గా తన స్మృతిలో కొనసాగిస్తున్నాను.
ఈ పేరు వెనుక ఇంతటి చరిత్ర ఉంది.
30 ఏళ్ల కవితోత్సవం నిర్వహించాక భవిష్యత్ లో ఈ అవార్డు ఒక ట్రస్ట్ కింద కొన సాగాలని నేను మా శ్రీమతి మరియు కుటుంబ సభ్యులు, మా శిష్యులు డా.పెళ్ళూరు సునీల్, సుంకర గోపాలయ్య, దోర్నాదుల సిద్దార్థ లతో కలిసి "ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్"( రి.నెం.23/2018) పేరుతో రిజిస్ట్రేషన్ చేశాము.
10. సాహిత్య జీవితంలో మీరు బాగా సంతృప్తికి లోనైన సందర్భం గురించి చెప్పండి?
ప్రతియేటా అవార్డు పేరుతో మేము ప్రమోట్ చేస్తున్న కవులంతాఈనాటి సమాజ ఈ పరిణామానికి ప్రతీకలు గా నిలిచి కవిత్వం రాస్తున్నారు ఈ కవులంతా ప్రజా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నారని పిస్తుంది.
మీరు ఒక్కసారి మా అవార్డు విజేతల లిస్టును పరిశీలించి చూడండి ఈనాడు బాగా కవిత్వం రాస్తూ సాహిత్యంలో గుర్తింపు పొందిన వారంతా ఒకనాటి మా అవార్డు గ్రహీతలు నని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.
వీరంతా మొదటి ప్రయత్నంలోనూ లేదా రెండో ప్రయత్నంలోనూ ప్రయత్నించి మా అవార్డులు పొందిన వారే. వీరి పట్ల నాకెంతో సంతృప్తిగా ఉందని తెలియజేస్తున్నాను.
అందరి పేర్లుఇక్కడ ఉటంకించ లేను గానీ, పాపినేని శివశంకర్ గారైతే నేమి, అఫ్సర్ గారైతే నేమి, నాళేశ్వరంశంకరం గారైతే నేమి, శిఖామణి గారైతే నేమి,దర్భశయనం గారైతే నేమి, కొండేపూడి నిర్మల గారైతే నేమి, ఇలా పేర్లు చెప్పుకుంటూపోతే చాలాపెద్ద లిస్టే ఉంది.
11. మిమ్ములను విచారానికి గురి చేసిన సాహిత్య సందర్భాల గురించి చెప్పండి?
నేను నా కవిత్వం పట్ల, మా అవార్డు పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నానో అంతే అసంతృప్తికి, విచారానికి గురి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే నాకు మిత్రుల సంఖ్య కంటే అనుకూల శత్రువుల, అసూయాపరుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోంది.
చాలా మంది కవులు పైకి బాగా సాఫ్ట్ గా,కనిపిస్తారు గానీ వాళ్ళ అంతర్ముఖాలు భిన్నంగా ఉంటాయి. నేనెంత నిష్పాక్షి కంగా, నిబద్ధతతో వ్యవహరిస్తున్నా ,నాలో,న్యాయనిర్ణేతల్లో లోపాలు ఆరా తీస్తూనే ఉంటారు.
ఎన్ని సార్లు పాల్గొన్నా మా అవార్డు వారికి రాలేదన్న అసంతృప్తిని ఏదో విధంగా పరోక్షంగా వ్యక్తం చేస్తూ ఉంటారు.
నేను వారి పేర్లను ప్రస్తావించను గానీ నన్ను బాగా వేదనకు గురిచేసిన వ్యక్తులు, సందర్భాలు చాలా ఉన్నాయి.పైకి చెప్పుకోలేను. ఎవరి సంస్కారం వారిది అని సమాధాన పడుతుంటాను.
నేను సీనియర్ కవిని కదా దాదాపు పదేళ్లుగా మీ అవార్డుకు నా పుస్తకాలు పంపిస్తున్నా మీరు నా వైపు చూడడం లేదు? ఎందుకు?
నా మీద ప్రేమ కలగాలంటే నేనేం చేయాలి? మీకు తెలంగాణ కవులు అంటేనే ఇష్టం, రాయలసీమ కవులను ఎందుకు పట్టించుకోరు? ఎందుకు? మీకు ప్రాంతీయ అభిమానం లేదా? మన సీమలో మంచి కవిత్వం లేదా? ఇలా అనేక విమర్శలు నన్ను చుట్టు ముడుతూ ఉంటాయి.
అప్పుడు నాకు బాగా నిరాశ కలుగుతూ ఉంటుంది. అయ్యో నేను ఎందుకు ఈ పురస్కారం పెట్టాను? మంచి మిత్రులంతా అనుకూల శత్రువులు గా మారిపోతున్నారు
ఈ విశ్రాంత జీవితం లో అన్నీ వదిలేసి హాయిగా కవిత్వం రాసుకుంటూ ఉంటే చాలు, ఎందుకు ఈ పురస్కారం పెట్టాను? అని చాలాసార్లు మథన పడ్డాను.
నా జీవితంలో సగ భాగం ఈ అవార్డు నిర్వహణ తోనే సరిపోయింది. మానసికంగా, ఆర్థికంగా, కూడా నేను చాలా నష్టపోయాను.
అవార్డు అందరూ ఆశిస్తారు కానీ నేను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇస్తాను కదా.
అవార్డు విజేతలను ప్రకటించిన ప్రతిసారీ కనీసం నాకు కనీసం పది మంది శత్రువులను పెరుగుతూ ఉంటారు.
అయితే కాంప్రమైజ్ కావడానికి నాలోని అంతరాత్మ అంగీకరించదు. నిందలైనా భరిస్తాను గానీ రాజీ పడలేను.
ఆర్థికంగా, శారీరకంగా అలసిపోయినప్పుడు అవార్డు నైనా ఆపేస్తాను గానీ కవిత్వ విలువలకు
అపఖ్యాతి రానివ్వను.
ఈ శత్రు బాధను భరించలేక 25 ఏళ్లకు విరమణ ప్రకటించాను. మా శ్రీమతి మరో ఐదేళ్లు చేద్దాం అంది. 30 ఏళ్ళు సభలోనే విరమణ ప్రకటించాను. కానీ తాను హఠాత్తుగా నా జీవితంలోంచీ నిష్క్రమించడంతో ఆమె స్మృతిలో కొనసాగిస్తూన్నాను.
మరి ఇలా ఎంతకాలం, నిర్వహించగలనో ఏమో? మున్ముందు అవార్డే తన భవిష్యత్తును తానే నిర్ణయించుకొంటుంది. అయితే ఈ అవార్డు ద్వారా నేను పొందిన గౌరవం అటుంచితే..
పొందిన అవమానాలు,నిరసనలు, కూడా ఎక్కువే..
35 ఏళ్లపాటు అధ్యాపక రంగంలో ఉండి గురువుగా పాఠాలు చెప్పి విద్యార్థుల్లో సాహిత్య స్ఫూర్తి నింపినా, ఏనాడూ ప్రభుత్వ మెప్పు పొందలేని శుద్ధ సాహిత్య జీవిని నేను.
కవిగా ,విమర్శకుడి గా విలువైన పదహారు పుస్తకాలు రాసిన కనీసం తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుకు నోచుకోలేక పోయిన కవిత్వ ప్రేమికుణ్ణి. అందుకు బాధలేదు జాలి తప్ప.
అన్ని గుర్తింపుల వెనుకా రాజకీయమే పనిచేస్తుంది. ఒక్క "ఉమ్మడిశెట్టి" మాత్రమే నూటికి నూట యాభై పాళ్లు ప్రతిభను గుర్తిస్తుంది, గెలిపిస్తుంది, విజేతగా ప్రకటిస్తుంది..
12. కవిత్వ రచనలో యువకవుల ప్రభావం ఎంతవరకు ఉంది? కొత్తగా రాస్తున్న వాళ్ళలో మహిళల పాత్ర ఎంత వరకు ఉంది?
వర్తమాన తరం లో నలభై శాతం మంది యువకవులు అద్భుతంగా కవిత్వం రాస్తున్నారని మాత్రం చెప్పగలను. అభివ్యక్తిలో కొత్త కొత్త కోణాల్ని దర్శింప జేస్తున్నారు.
అరవై శాతం మంది గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు. పూను స్పర్థలు విద్యలందే వైరములు వాణిజ్య మందే.. అన్నాడు కదా గురజాడ. అది మర్చి పోయారు ఈ యువకవులు.
వీరికి తక్షణ గుర్తింపుకావాలి. సీనియర్ల కవిత్వం చదివరు. కొత్త కోణాల్ని పట్టుకోలేరు. పైగా చాలా సంస్థలు
వీరికి బాగా ఆశలు కల్పించి ఉదారంగా బిరుదులు, పురస్కారాలు, ప్రశంసా పత్రాలతో ముంచేస్తున్నారు.
చాలామంది ఒక పుస్తకం కూడా రాయక ముందే శ్రీ శ్రీ లు, గురజాడలు, గిడుగులు అయ్యారు. వీరిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది .
మీరు ఎప్పుడూ గుర్తింపు కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.పైగాఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. కొంతమంది ఒకటి, రెండు పుస్తకాలు వేస్తూనే పేరుకు ముందు డాక్ట"రేట్లు"తగిలించుకుని ప్రచారం పొందడం చూస్తే జాలి కలుగుతూ ఉంటుంది. యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పరిశోధనలు పి,హెచ్,.డి లు చేసినవారుకూడా ఇంత గుర్తింపు కోరుకోరు.
ఒకవేళ నాలాంటి వారు ఎవరైనా యువకవుల కవిత్వం పట్ల ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని సహృదయంతో స్వీకరించ లేరు. పైగా నేనేమో అసూయతో కామెంట్ చేస్తున్నానని, యువకుల్ని ప్రోత్సహించడం మాని నిరుత్సాహ పరుస్తున్నానని బాధ పడిపోతుంటారు.
నా దృష్టిలో కవిత్వం ఇంకా మార్కెట్ కాలేదని నేను నమ్ముతున్నాను కానీ వీరివల్ల ముందు ముందు ఆ ప్రమాదం ఏర్పడుతుందేమో నని నా బాధ.
నిజం చెప్పనా.. మా అవార్డు పొందినవారిలో తొంభై శాతం మంది యువకవులేనని వీరికి తెలియదు కాబోలు.
నాకు యువతరం పట్ల పెద్ద ఆశలున్నాయ్. గొప్పగా రాస్తున్న కవులను చూసి ఎంతగానో గర్వపడు తుంటాను.
శ్రీ శ్రీ అన్నట్లు..
రావోయ్ యువకవీ
సైక్లోన్ లేదా వస్తావో
సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా వస్తావో
రావోయ్ యువకవీ...
నా దృష్టిలో...
ప్రతిభావంతులైన యువతరం
భవిష్యత్తరానికి గొప్ప వాగ్ధానం
యువతరం మహిళా రచయిత్రులు కూడా మంచి థీమ్ ,సరి కొత్త అభివ్యక్తి తో ముందుకొస్తున్నారు
మహిళలు స్త్రీ వాదాన్నే రాయాలి,అనే లక్ష్మణ రేఖ గీసు కోకుండా వినూత్న శైలిని అందిపుచ్చుకుని కవిత్వం రాస్తున్నారు,కథలు రాస్తున్నారు. అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటు న్నారు, నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం.
13. విద్యార్యులు కవిత్వం లో చేరువ కావాలంటే వారు ఏం చెయాలి?
వారికంటే ముందు వారికి తరగతి గది లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారిలో ముందుగా సాహిత్యంపట్ల అభిరుచి కల్గించాలి. సాహిత్య ప్రక్రియల పట్ల అవగాహన కల్గించాలి.ఆపైన వారికి కొన్ని కవితా, కథల వస్తువుల నిచ్చి వారిలోని సృజననాత్మకను ప్రోత్సహించి సరిదిద్దాలి.
ఈ పని ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి లో ఉన్న కవులు రచయితలు పూనుకోవాలి.పాఠ్యపుస్తకాంశాలతో
పాటు కవితలు,కథలు గురించి రచయితల గురించీ పరిచయం చేస్తూ వారిలో రచనాసక్తిని కలిగించాలి.
నా వరకు నేనెక్కడ పనిచేసినా అక్కడ కవులను తయారు చేశాను.వారు ఆగిపోలేదు.ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. వారిలో చాలా మంది తెలుగు పండితులు గా, అధ్యా పకులుగా కొనసాగుతున్నారు.ఈ భాధ్యతను ముఖ్యంగా మన రచయితలు తలకెత్తు కోవాలి.
14. కవిగా,సాహిత్య విమర్శకుడిగా,అవార్డు స్థాపకుడిగా మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?
నాకు గొప్ప గొప్ప ప్రణాళికలు ఆశయాలు ఏముంటాయి చెప్పండి? పేదరికం తో మొదలైన జీవితం నాది సామాన్య ఉపాధ్యాయుడిగా జీవితం గడుపుకుంటూ, కవిత్వం రాసుకుంటూ, పుస్తకాలు వేసుకుంటూ, ఉన్నంతలోనే ,నా శ్రీమతి తోడ్పాటుతో కవిత్వం కోసమే ఒక అవార్డును స్థాపించు కొని ఏ ఆటంకం లేకుండా గత 32 ఏళ్ల పైబడి నిర్వహిస్తూ వస్తున్నాను. ఇప్పుడేమో కేవలం పెన్షన్ తో జీవితాన్ని గడుపుతున్నాను.
నా కంటూ ప్రత్యేకమైన ఆర్థిక వనరులు ఏమీ లేవు ఉన్నంతలో ఏదో కవిత్వం రాసుకుంటూ ఈ అవార్డును కొనసాగిస్తాను.ఇలా ఒంటరిగా ఎంతకాలం కొనసాగించగలనో భవిష్యత్కాలమే నిర్ణయించాలి.
ఈ అవార్డు ద్వారా భవిష్యత్ తరానికి గొప్ప కవులను పరిచయం చేశానన్న సంతృపి నాకు చాలనుకుంటున్నాను.
ఒక కవిగా గుర్తింపు ఉంది.విమర్శకుడి గా కొంత పేరుంది. తెలుగు కవులకు "ఉమ్మడిశెట్టి" ఒక ప్రతిష్టాత్మక పురస్కా రం గా గొప్ప పేరుంది.ఇది కొనసాగినంత కాలం నా నిజాయితీ లో, నిబద్ధతలో
లోటు రానివ్వను.
15. ఇంకేమైనా చెప్పండి?
రచయితలకు గానీ,రచయితల్ని గుర్తించే సంస్థలకు గానీ, నిజాయితీ,నిబద్ధత, వ్యక్తిత్వ సంస్కారం అనివార్యం గా ఉండాలి.
ఈ నాడు తెలుగు నాట వందల సంఖ్యలో అవార్డులు,పురస్కారాలు, సంస్థలు ఉన్నాయి. తమ గుర్తింపు కోసంకాకుండా సాహిత్య లోకంలో గుర్తింపును పొందాలి. పారదర్శకంగా ఉండాలి. చాలా సంస్థలు ..ఇచ్చి పుచ్చుకోవడం లోనూ, రాజకీయ నేతల అభిమానం కోసమో,పనిచేస్తూ,ప్రచారంలో ముందుంటాయి.
ఇస్తి నమ్మా వాయినం...పుచ్చుకుంటి నమ్మా వాయినం.. అన్నతీరుగా ఉంటాయి...ఈ తీరు మారాలి. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా స్వతంత్రంగా, జవాబుదారీగా నడుచుకోవాలి.
ఈ పురస్కారం, ఈ గౌరవం, స్థాపన, నిర్వహణ అంతా వన్ మ్యాన్ ఆర్మీగా భావించినా నాకు అభ్యంతరం లేదు. చాలా మంది పెద్దలు, సాహితీ వేత్తలు ఈ సంస్థలో గౌరవ సభ్యులుగా ఉంటామని, అవార్డు బహుమతి మొత్తాన్ని పెంచేందుకు ఆర్థికంగా సపోర్టు ఇస్తామని , అందుకు అనుమతించమని కోరారు..నేను వారి అభ్యర్థనను సున్నితంగానే తిరస్కరించాను. ఒక కవి కుటుంబం మరొక కవిని గుర్తించి గౌరవించే సంస్థ ఇది. నిబద్ధత,నిజాయితీ, అంకిత భావంతో ఈ సంస్థ కోసాగుతుంది అని ధీమాగా ప్రకటిస్తున్నాను.
{రాధేయ జీవన రేఖలు:
డా.ఉమ్మడిశెట్టి రాధేయ .కవి,విమర్శకులు
01.05.1955 న కడపజిల్లా ముద్దనూరు
మండలం లోని యామవరం గ్రామంలో
ఒక సామాన్య దిగువ మధ్యతరగతి చేనేత కుటుంబంలో జన్మించారు.
వీరి తల్లి దండ్రులు ఉమ్మడిశెట్టి గంగిశెట్టి, శ్రీమతి నాగమ్మ.
తల్లి దండ్రులు ఇరువురూ చేనేతకార్మికులు.
వీరు ఐదు మంది అన్నదమ్ములు,ఇద్దరు చెల్లెండ్రు. అన్నదమ్ముల్లో ఈయన నాలుగవ వారు.
వీరికి బాల్యం నుంచే ప్రకృతి పట్ల,తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ.వాళ్ళ ఊరు కూడా చుట్టూ కొండ కోనల మధ్య ప్రకృతి రమణీయంగా కన్పిస్తూ ఉండేది.
బాల్యంలో 4వ తరగతి లోనే మాస్టారు చెప్పిన పోతన పద్యాలను మరుసటిరోజే
చక్కటి వాక్శుద్ధితో అప్పజెప్పి శహబాష్ అనిపించుకున్నారు.
హైస్కూల్ స్థాయిలోనే ప్రకృతి గీతాలు,ప్రణయ గీతాలు,అనుభూతి గీతాలు రాసుకునే వారు.
1972 లో అభ్యుదయ భావాలతో రాసిన తొలి కవిత అచ్చయింది.
1978 లో తొలి కవితా సంపుటి మరోప్రపంచం కోసం కవితా సంపుటిని
తెలుగు కవితా ప్రపంచంలో తనదైన ఉనికిని చాటుకున్నారు. అప్పటికే ఆంధ్రదేశంలో సుప్రసిద్దులైన కవులచేత ప్రశంసలు పొందారు.
ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల యూనివర్సిటీ చేరి చదువుకోలేక పోయారు.
1982 లో ఉపాధ్యాయ వృత్తి లో చేరిన తర్వాత స్వయం కృషి తో తెలుగు లో ఎం.ఏ., పి,హెచ్,డి చేశారు.
ఉపాధ్యాయుని గా,జూనియర్ లెక్చరర్ గా, డిగ్రీకళాశాల తెలుగు అధ్యాపకునిగా,
తెలుగు శాఖాధిపతిగా తెలుగు భాషకు సేవలందించి 2013 లో పదవీవిరమణ చేశారు.ప్రస్తుతం ఆనంతపురం లో స్థిర పడ్డారు.
1988 లో తన ఇంటిపేరు మీద ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ను స్థాపించి గత 33 ఏళ్లుగా,ప్రతి ఏటా క్రమం తప్పకుండా,నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.
ఈ అవార్డు తెలుగు కవులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.ఈ అవార్డు
రావాలని ప్రతి తెలుగు కవి కోరుకుంటాడు.
కవిత్వం రాయడం,కవిత్వం చదవడం,
కవులను గౌరవించడం వీరు తన ఆశయం పెట్టుకున్నారు. }
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు