ఇంటర్వ్యూలు

(January,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నలిమెల భాస్కర్ గారితో ఇంటర్వ్యూ

గోదావరి పత్రిక  ప్రారంభ సంచిక కోసం నలిమెల భాస్కర్ గారితో  బూర్ల వెంకటేశ్వర్లు చేసిన ఇంటర్వ్యూ

డా.నలిమెల భాస్కర్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొద్దిమంది భాషా వేత్తల్లో ఒకరు. విశ్వవిద్యాలయాల్లో ప్రత్యక్ష విద్యాభ్యాసం చేయకపోయినా స్వీయ అధ్యయన, అభ్యాస, పరిశోధనలతో పద్నాలుగుకు పైగా భారతీయ భాషలను ఔపోసన పట్టారు. గుర్తింపు పొందిన అన్ని భారతీయ భాషల నుండి కథలు, నవలలు, కవిత్వం అనువాదం చేశారు. స్వంత గేయాలు, నానీలు, వచన కవిత్వం, కథలు, నవలలు రాశారు. అధ్యాపక వృత్తిలో ఎందరో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ భాషకు తొలిగా పదకోశాన్ని రూపొందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. వారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ముఖాముఖి ఇది.

1.           నమస్కారం సార్! మీరు సాహిత్యం పట్ల ఆకర్షితులు కావడానికి, గేయ రచనలు చేయడానికి ప్రేరణ ఎలా కలిగింది?

నమస్కారం! సాహిత్యం పట్ల ఆకర్షణ కల్గడానికి నాకు ఎల్లారెడ్డి పేట హైస్కూల్ లో ఆరవతరగతికి ఆంగ్లం బోధించిన లక్ష్మీ రాజం సార్ అని చెప్పొచ్చు. ఆయన ఆ రోజుల్లో మాతో “ఆంధ్రప్రదేశ్” పత్రిక చదివించేవారు. పైగాఅదే స్కూల్ లోని గ్రంథాలయం ఇంచార్జిగా వున్న కృష్ణమాచారి గురించి కూడా చెప్పాలి. ఆయన చాలాఓపిగ్గా మాకు బాల సాహిత్య పుస్తకాలు ఇచ్చేవారు. గాంధీ, బోస్ మొదలైన నాయకులు, జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రవేత్తలు అట్లా పరిచయమయ్యారు. సాహిత్యం పట్ల ఆకర్షణ అనడం కన్నా పుస్తక పఠనం పట్ల ఆకర్షణ అంటే బాగుంటుందేమో! ఆ పఠనాసక్తి క్రమేణా సాహిత్యం వైపు తీసుకెళ్ళింది. మా ఇంటి ముందరే మా కన్నా స్కూల్లో బాగా సీనియర్ అయిన నారాయణ గారు ఉండిరి. ఆయన నా చేత బలిపీఠం నవల చదివించారు నా చేత కన్నీళ్లు పెట్టించి నన్ను బాగా ప్రభావితం చేసిన నవలా మణి అది. ఈలోపు 1968-69 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పుడు నేను తొమ్మిదో తరగతి లో ఉన్నాను.విద్యాలయాలు ఏడాదిపాటు మూతపడ్డాయి నాకు కాలక్షేపం పెద్ద సమస్యగా మారింది. మా ఊరు నారాయణపురంలో శ్రీరామా చందాదారుల గ్రంథాలయం ఉంది. అక్కడ చందమామలు, డిటెక్టివ్ నవలలు కాల్పనిక సాహిత్యం చదివాను. ఆ లైబ్రరీలో ఉన్న డిటెక్టివ్ నవలలన్నీ చదివి అప్పుడే “కాలు కదిపావో కాల్చేస్తా” అని ఓ నవల రాశాను. అది నా మొదటి రచన. ఏడో తరగతిలో ఓ గేయం రాశాను. మా గురువుగారు నందగిరి అనంతరాజ శర్మ వారికి చూపించాను. ఇంకా బాగా రాయాలి అని సలహా యిచ్చారు.

ఇంటర్ కామారెడ్డి కళాశాలలో జాయినయ్యాను. అక్కడ మా గురువుగారు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు,  డాక్టర్ గుండె వేంకటాచార్యులు గార్లు. ఇద్దరూ ఉద్దండులు. నాకు కసిరెడ్డి గారితో బాగా సాన్నిహిత్యం,  వారి గేయాలు మా ఊరి తిరుమల శ్రీనివాసాచారి గారి గేయాలు, సినారె గేయాలు, కనపర్తి గారి గేయాలు, వడ్డేపల్లి కృష్ణ గారి గేయాలు నన్ను గేయరచయితగా మలిచాయి. ఇంటర్ నుండి గేయాలు రాస్తూ నిజామాబాద్ జిల్లా నుండి వచ్చే పత్రికలకు పంపేవాణ్ణి. అవన్నీ అచ్చయి వచ్చేవి. ముఖ్యంగా మొన్న చనిపోయిన ఎస్ వి ఎల్ నరసింహారావు గారి “అగ్నివీణ” లో చాలా గేయాలు వచ్చినై. బిఎస్సి రెండవ సంవత్సరంలో అంటే 1974లో “మానవుడా” అన్న గేయసంపుటి అచ్చయింది.నేను చిన్నప్పుడు బాగా పాటలు పాడే వాణ్ణి. సినిమాపాటల బాణీలో పాటలు రాసేవాణ్ణి. ఈ స్వభావం సైతం గేయ రచనకు ప్రేరణ అని ఉంటుంది ఆనాటికే నా గేయాలు “మానవుడా”,“మానవత్వపు చెట్టుకొమ్మలు” లలిత సంగీతంలో ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.

2.           గేయ రచనలు చేసిన మీరు భాషల అధ్యయనం వైపు ఎలా మళ్ళారు? దాని వెనుక ఉన్న పరిశ్రమ ఏమిటి?

          1979లో నేను పెద్దపెల్లి జిల్లా కొలనూరు హైస్కూల్లో టీచర్గా నియుక్తుణ్ణి అయ్యాను. అప్పటికే నేను గేయ రచనలు, కథలు, వ్యాసాలు మూడు సాంఘిక నవలలు (ఇవి అచ్చు కాలేదు) వచన కవితలూ రాశాను. చదవడం బాగా అలవాటు.  నేను పనిచేసే ఊరికి ఏ దినపత్రికా రాదు - లైబ్రరీ లేదు మరలా నాకు కాలక్షేపం పెద్ద సమస్య. అందుకని 30 రోజుల్లో ఫలానా భాష నేర్చుకోండి అనే మద్రాస్ బాలాజీ పబ్లికేషన్స్ వారి పుస్తకాలు కొన్నాను. ముందు కన్నడం నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను మరి? ముందు వర్ణమాల, పిదప గుణింతం, తదుపరి ఒత్తులు(ద్విత్వ సంయుక్తాలు) నేర్చాను. ఇంకేం! చదవగలుగుతున్నాను. చదవడం వచ్చిందంటే భాష అర్థం అవుతుంది. పైగా కన్నడం లిపి పరంగానే కాకుండా భాషా పరంగానూ తెలుగుకు దగ్గర. అంతకు మునుపే ఉస్మానియా నుండి ఎక్స్ టర్నల్ గా ఎమ్మే తెలుగు చేశాను. ఫైనల్ ఇయర్లో ఒక పేపర్ ద్రావిడ భాషా శాస్త్రం కనుక కొంత పరిచయం వుంది. నా టార్గెట్ ఏమిటంటే ఒక సంవత్సరానికి ఒక భాష నేర్చుకోవాలి అని. ముఖ్యంగా సంవత్సరం అంటే విద్యా సంవత్సరంలో వచ్చే 40 రోజుల వేసవి సెలవులు. సెలవుల్లో వర్ణమాల, గుణింతం, ఒత్తులు నేర్చుకొని, మిగిలిన ఏడాదంతా ఆ భాషను లోతుగా అధ్యయనం చేయడం. కన్నడం తర్వాత తమిళాది భాషలు పట్టాను. చందమామలు అన్ని భాషల్లో తెప్పించుకున్నాను. రెపిడెక్స్ లు  అన్ని భాషల్లోవి కొన్నాను. (రెపిడెక్స్లో ఆయా భారతీయ భాషలు మాతృభాషలుగా కల్గిన వారు ఆంగ్లం నేర్చుకోవడానికి పాఠాలుంటాయి. నేను తెలుగేతర భాషల్ని ఆంగ్ల వాక్యాల ద్వారా ఉల్టా భాషలు నేర్చుకున్నాను) తర్వాత ఏకకాలంలో లో కంపారేటివ్ గా భాషలు నేర్చాను.  క్రియా పదాలన్నీ కాపీలో రాసుకున్నాను.  రాయడం రావడం కొరకు నోట్ బుక్ లోని కాగితాన్ని నాలుగు భాగాలు చేసి నాలుగు పరభాష అక్షరాలు రాసి పెన్సిల్ తో ప్రాక్టీస్ కోసం ఊరకే దిద్దేవాణ్ణి. తర్వాత్తర్వాత నిఘంటువులు, పత్రికలు, ఆయా రాష్ట్రాల పర్యటనలు, పరిశోధనలు అనువాదాలు...... అదో ప్రస్థానం.

3.           మీ ఎం.ఫిల్, పి.హెచ్ డి ల పరిశోధనలు భాషా నేపథ్యంగానే సాగినాయి కదా! వాటి గురించి వివరిస్తారా? 

          ఓసారి ఇ కన్నడ-ఇంగ్లీషు నిఘంటువు కొన్నాను. అందులో చివరికి కొన్ని కన్నడ సామెతలున్నాయి. అవి చదివి ఆశ్చర్యపోయాను దాదాపు తెలుగు సామెతల్లాగే ఉన్నాయి. ఉదాహరణకు “మొరిగే కుక్క కరవదు” కన్నడంలో “బొగళువ నాయి కచ్చువుదిల్ల”. అట్లాగే “రెక్కాడితే గానీ డొక్కాడదు” సామెతకు “కై కెసరాధరె బాయి మొసరు”(చేయి బురద అవుతేనే నోరు పెరుగు) అనేది సమానార్థకం. ఈ సామెత భావం ఒకటే అయినా అభివ్యక్తి వేరు. అలాగే “అల్పునికి ఐశ్వర్యం వస్తే అర్థ రాత్రి గొడుగు పట్టమన్నాడట” కు  సమానంగా “అల్పనిగె ఐశ్వర్యం బందరె అర్ధరాత్రి కొడ హిడిదు కొండ (అల్పునికి ఐశ్వర్యం వస్తే అర్దరాత్రి గొడుగు పట్టుకొన్నాడు) అని. కన్నడంలో అల్పుడే గొడుగు పట్టుకున్నాడు. తెలుగులో మాత్రం మరొకరిని పట్టమన్నాడు. అంటే తెలుగు వాడికి ఠీవీ, దర్పం, టెక్కు ఇంకా ఎక్కువ అన్నమాట.తెలుగు సామెతలో వ్యంగ్యం ఉంది.

ఇట్లా ద్రావిడ ముఖ్య భాషల్లోని సామెతల మీద ఎం.ఫిల్ చేస్తే బాగుంటుందని 1983లో జాయిన్ అయి 1985లో పూర్తి చేశాను. అయితే నాలుగు ద్రావిడ భాషల్లో నాకు దాదాపు 40వేల సామెతలు దొరికాయి. ఎం.ఫిల్ కు వున్న పరిమితి తక్కువ. అందుకని“తెలుగు మలయాళ సామెతలు-కుటుంబ జీవన చిత్రణ”అని 1990లో పీహెచ్డీ పూర్తి చేసాను. రెండు భాషల్లోని కుటుంబ సామెతలకే పరిమితమైనందువల్ల లోతుగా పరిశోధన చేసే వీలు ఏర్పడింది. మరో ముఖ్య విషయం....... కంపారిటివ్ రిసెర్చ్ లో తెలుగు మలయాళాల మీద జరిగిన పరిశోధనల్లో నాదే మొదటిది.నా గైడ్ ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు. ఇలా ఉస్మానియా నుండి ఎం.ఫిల్, హెచ్ డి పూర్తి చేశాను. భాషల అధ్యయనం నా పరిశోధనకు బాగా ఉపయోగపడింది.

4.        దాదాపు గుర్తింపు పొందిన భారతీయ భాషలన్నిటి నుండి కథానువాదాలు, నవలానువాదాలు చేసినట్టున్నారు? మీ అనువాద అనుభవాలలో సంతృప్తిని గుర్తింపును ఇచ్చినవి ఏమున్నాయి?

                అనువాదాలలో నేను చేసినవి ఉన్నాయి నాతో ఇతరులు చేయించుకున్నవి ఉన్నాయి. నేను చేసిన అనువాదాలు నాకు ఇష్టమైతేనే చేసాను. అవన్నీ నాకు నచ్చిన వేగాక సంతృప్తినిచ్చినవి ఇతరులు నాతో చేయించుకున్న వాటిలో ఒకటీ అరా నచ్చలేదు. ఉదాహరణకు ఆంధ్రజ్యోతి గ్రూప్ వారు కొంతకాలం “మనీ బిజినెస్” అనే పత్రికను నడిపారు. వాళ్లు నా చేత మలయాళం నుండి కే ఎల్ మోహన వర్మ రాసిన“మనీ మేకర్స్” నవలను అనువదింపజేశారు. అది నాకు అంతగా నచ్చలేదు. ప్రప్రధమంగా ప్రస్తుతం తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు మిత్రుడు నందిని సిధారెడ్డి గారు ఒక మలయాళ నవలను సంక్షిప్తంగా అనువదించమన్నారు. ఆ నవల పేరు “తోట్టియుడె మగన్” రాసిన వారు తగళిశివ శంకర పిళ్ళై. నేను దాన్ని “పాకీ మనిషి కొడుకు”గా అనువదించాను. అది 1986 ప్రాంతాల్లో సిధారెడ్డి గారి సంపాదకత్వంలోని ‘మంజీర’ పత్రికలో వచ్చింది. నాకు నచ్చిన నవలానువాదం అది. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ వారి పునత్తిల్ కుంజబ్దుల్లగారి మళయాళ నవల “స్మారక శిలగళ్”నన్ను అనువదించామన్నారు. నేను దాన్ని “స్మారక శిలలు”గా అనువదిస్తే 2011లో దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు వచ్చింది. ఇది సంతృప్తి కన్నా గుర్తింపు నిచ్చిన అనువాదం.“అద్దంలో గాంధారి మరి 11 కథలు” అనే ఆరు భాషల్లోని 12 కథల అనువాద గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద సాహిత్య పురస్కారం లభించింది. ‘చతుర’ కు చేసిన నారాయణ మొగసాతే గారి “కుండీ” నవల అయినా, నా ఇతర అనువాదాలు అయినా దాదాపు నాకు నచ్చితేనే చేశాను. నిజానికి “నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథల్లో” కూడా నాకు నచ్చినవి అయిదు అయినా మలయాళం పాఠకులకు నచ్చిన కథలు కనుక నా ఇష్టాయిష్టాలతో పని ఏమిటి అని జూకంటి, సేతులు వేసిన ప్రశ్న కారణంగా పదీ అనువదించాను.

5.      మీరు “తెలంగాణ పదకోశం”, “బాణం” (తెలంగాణ భాషా సాహిత్య వ్యాస సంపుటి), “తెలంగాణ భాష-దేశ్య పదాలు” లాంటి విలువైన గ్రంథాలు వేశారు. వాటి కంట్రిబ్యూషన్ ని, తెలంగాణ భాష విషయంలో ఇంకా జరగవలసిన కృషిని వివరిస్తారా?

2003లో తెలంగాణ ఉద్యమ అవసరం కొరకు తెలంగాణ పదకోశం వేశాను. అదిప్పటికి నాలుగు ముద్రణలు పొందింది. మూడో ముద్రణ బూర్లవేంకటేశ్వర్లు సహకారంతో పది వేల పదాలు కూర్చాను. మిత్రుడు జూలూరు గౌరీశంకర్ ప్రచురించిన ఈ పరివర్దిత ముద్రణలో మూడువేల ప్రతులను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. “బాణం”లో తెలంగాణ భాషా వ్యాసాలున్నాయి. తెలంగాణలో మాట్లాడుతున్నది మాండలికం కాదనీ, ఆది భాషేననీ, పైగా తెలుగు భాషకూ తెలంగాణ భాషకు చాలా సాజాత్య సారూప్య సామీప్యాలున్నాయనీ చెప్పాను. అయినా తెలంగాణ వారికి తెలంగాణలో మాట్లాడుతున్నది భాషే కానీ అది మాండలికమో, యాసో ఎందుకు అవుతుందని ప్రశ్నించాను.

ఇక ‘తెలంగాణ భాష-దేశ్య పదాలు’ గురించి... బహుజనపల్లి వారి శబ్దరత్నాకరంలో “దే” అనే సంకేతాక్షరంతో సూచించబడిన దేశ్య పదాలను గుర్తించి, వీలైనన్ని ఆ దేశ్య పదాలు ఇప్పటికీ తెలంగాణ పల్లీయుల భాషా వ్యవహారంలో ఎంత సజీవంగా ఉన్నాయో నిరూపించాను.అట్లాగే ఇప్పుడు వస్తున్న ‘తెలంగాణ భాష-సంస్కృత పదాలు’ గ్రంథంలో తెలంగాణ గ్రామీణుల నిత్య సంభాషణ లోని సంస్కృత శబ్దాలు చూపాను.

అయినా తెలంగాణ భాష విషయంలో చాలా కృషి జరగవలసిన అవసరం ఉంది. తెలంగాణ పొడుపు కథలు, తెలంగాణ సామెతలు చైతన్య ప్రకాష్ కొంతమేరకు చేశారు. తెలంగాణ వాక్య విధానాలు, ప్రాచీన తెలంగాణ కవుల కావ్యాలకు, పురాణాలకు పదప్రయోగ సూచికలు (పాల్కురికి సోమన బసవ పురాణ పద ప్రయోగ సూచిక నలిమెల భాస్కర్ తదితరుల సంపాదకత్వంలో వచ్చింది) తెలుగుకూ తెలంగాణ తెలుగుకూ ఉన్న సంబంధ బాంధవ్యాలు,  ప్రాచీన గ్రంథాల్లోని భాషకు తెలంగాణ తెలుగుకూ ఉన్న సంబంధాలు ఇట్లా అనేక అనేకానేక పనులు ఉన్నాయి.

6.        భారతీయ సాహితీ మూర్తులపై వ్యాసాలు రాశారు కదా? వీరి రచనల్లో, ఆలోచనల్లో మీరు గమనించిన ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా?

          చాలా ఉన్నాయి. మనవి మూస పద్ధతులు. ఇతరుల్లో కొత్తదనం ఉంటుంది. సృజనాత్మకత ఉంటుంది. తెలుగులో కవిత్వం, కథలు బాగా వస్తున్నాయి, రాశి పరంగానే కాదు వాసి పరంగానూ కొంతమేరకు నవలలు. కానీ, ఇతర భాషల్లో దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. తమిళంలో ఇప్పటికీ చారిత్రక నవలలు చదువుతారు. గుజరాతీలో డిటెక్టివ్ సాహిత్యం ఉంది. దళిత సాహిత్యం మన కన్నా ముందే మరాఠీ, కన్నడ, గుజరాతీల్లో వచ్చింది. వామపక్ష సాహిత్యం మన దగ్గరే ముందుంది. కన్నడం, మరాఠీల్లో హాస్య రచనలకు చాలా ఆదరణ ఉంది.బాల సాహిత్యం ఇతర భారతీయ భాషల్లో చాలా గొప్పగా ఉంది. మలయాళంలో కథా శిల్పంలో కొత్త విన్యాసాలు కనిపిస్తాయి. ఇటీవలి తమిళ కథలపై మాత్రం బాగా సినిమాటిక్, డ్రమెటిక్ ప్రభావాలు పడ్డాయి (ఇది మంచి పరిణామం కాదనుకోండి). ఇంకో విషయం... ఇతర భాషల్లోని చాలామంది రచయితలు ఆంగ్లంలోనూ రచనలు చేస్తారు, అనువాదాలు చేస్తారు. అనువాదాలు చదువుతారు. అధ్యయనశీలురు ఇతర భాషల్లోనే ఎక్కువ.

7.            కవిగా మీ ప్రస్థానం ఎలా సాగింది?

చెప్పానుగా పదో తరగతిలో గేయం, ఇంటర్ నుండే వరుసగా గేయ రచన, బిఎస్సి రెండో సంవత్సరంలో “మానవుడా గేయసంపుటి”1976 లో “భాస్కరోక్తులు”అనే పద్య శతకం. 1985లో గోదావరీ హ్రాదినీ” పేరుతో పద్యాలు, అనేక వచన కవితలు, 1979 నాటికే ఆంధ్రజ్యోతి, భారతి, ఆంధ్రభూమి తదితర మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో వచ్చాయి. “సుద్దముక్క” అని ఓ కవితా సంపుటి,“మట్టి ముత్యాలు” పేరుతో నానీలు ప్రచురించాను. పిల్లలకు పాటలు రాసాను.సుద్దముక్కలోని ‘అక్షరప్రాశన’ పోయెమ్ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది తెలుగు అధ్యాపకులకు పరిచయమైంది.‘వంతెనలు’ అనే పోయెమ్ అనువాద ప్రాశస్త్యాన్ని తెలియచెప్పింది.మొన్నీమధ్య చనిపోయిన జగద్ధాత్రి ఆ పద్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘మొసాయిక్’ లో ప్రచురించింది. ఇప్పుడు మళ్ళీ ఓ కవితాసంపుటి వేయబోతున్నాను. “మట్టి ముత్యాలు” నానీల సంపుటి కి అనకాపల్లి వారి రాష్ట్రస్థాయి పురస్కారం వచ్చింది.

8.            ఉపాధ్యాయునిగా మీ అనుభవాలు, ఆలోచనలు వివరిస్తారా?

నేను మొదట కామారెడ్డిప్రాచ్య విద్యా నికేతన్ ఓరియంటల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాను. అది ఫుల్ ప్లెడ్జుడ్ ఎయిడెడ్ పాఠశాల. అక్కడ ముఖ్యంగా సైన్స్ పాఠాలు బోధించాను. చాలా సంతృప్తినిచ్చిన బోధనానుభవం అది. ఆ తర్వాత కొలనూరు హైస్కూల్లో ఐదేళ్లు సైన్స్ చెప్పాను ఆక్సిజన్ హైడ్రోజన్ క్లోరిన్ హైడ్రోజన్ సల్ఫైడ్ సల్ఫర్ డయాక్సైడ్ వాయువుల తయారీని ప్రాక్టికల్గా చేసి చూపించాను వాటి భౌతిక రసాయనిక ధర్మాలు పిల్లలతో గుర్తింప చేశాను విద్యార్థులు ప్రయోగశాలలు బేరియం క్లోరైడ్ మొదలైన సంయోగ పదార్థాలు తెమ్మంటే తీసుకువచ్చేవారు వాళ్లకు అలాంటి ప్రాక్టీస్ ఇచ్చాను. తర్వాత గంభీర్ పూర్ స్కూల్లో ఏడాదిపాటు సైన్సు బోధన మొత్తం ఏడున్నర సంవత్సరాలు సైన్స్ టీచర్ గా పని చేశాను భద్రాచలం జూనియర్ కాలేజీలో మొదట తెలుగు లెక్చరర్ గా నియామకం దాదాపు 22 సంవత్సరాలు జూనియర్ లెక్చరర్ గా పనిచేసి పదోన్నతి పై కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల వెళ్లాను అక్కడ ఐదేళ్లు పనిచేశాను నాకు ఉపాధ్యాయ వృత్తి చాలా ఇష్టం నేను ఈ ఉద్యోగం కోరుకొని వచ్చాను మొత్తం 34 సంవత్సరాల నాది రెండున్నర ఏళ్లు ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను నిజం చెప్పాలంటే టీచర్ సాహితీ నాకు సంతృప్తిని ఇచ్చింది ఉపాధ్యాయ వృత్తి

ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రమైంది టీచర్ చాలా ఆదర్శంగా వుండాలి. విషయావగాహన అవసరం. విస్తృత అధ్యయనం తప్పనిసరి. వృత్తిని ప్రేమించాలి. కర్తవ్యనిష్ఠ చాలా అవసరం. ఈ సమాజం ఉపాధ్యాయుల నుండి ఎంతో ఆశిస్తున్నది. సమాజంలోని మంచీచెడు రెండూ ఎంతోకొంత ఉపాధ్యాయ వర్గాలపై కూడా ప్రభావం చూపినా ఉపాధ్యాయులు నిజాయితీగా పాఠాలు చెప్పాలి. సంసిద్ధత తర్వాతే పాఠం బోధించాలి. నిరంతర మూల్యాంకనం చేయాలి. సమయపాలన పాటించాలి

9.           * రచయితగా, పరిశోధకునిగా, భాషా వేత్తగా, అనువాదకునిగా రాబోయే వారికి మీరిచ్చే సలహాలు ఏమిటి?

రచయిత కాదల్చుకున్న వారి ఆలోచనా ఆచరణా ఒకటే కావాలి. ప్రాచీన సాహిత్యం, సమకాలీన తెలుగు సాహిత్యం, భారతీయ సాహిత్యం, ప్రపంచ సాహిత్యం బాగా చదవాలి. సృజనాత్మకతను కాపాడుకోవాలి కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాలి. పరిశోధన విషయంలో సైతం కొత్తదనం ఉండాలి. చాలావరకు అనుకరణలు. కొటేషన్లు కొట్టేసెన్లు, అందులోంచి ఇందులోంచి తీసి రాసే థీసిస్సులు నిజమైన పరిశోధనలు కావు. ఆలోచనల్లోంచి ఏదో ఒక నూతన విషయావిష్కరణ జరగాలి.

భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఒక భారతీయ భాషను నేర్చుకోవాలి. నిజమైన భారత దేశ సభ్యతా సంస్కృతులు అలవడాలంటే కొన్ని భాషల అధ్యయనం అవసరం.

అనువాదకుని నేను ఇచ్చే సలహా.... అనువాదం లేకపోతే సమాచార రంగం లేదు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రాదు. వ్యాస వాల్మీకాదులు, గోర్కీ లూషన్లూ అపరిచితులే. సంప్రదాయ సాహిత్యమైనా, అభ్యుదయ సాహిత్యమైనా అందాలంటే అనువాదాలే అవసరం. అనువాదాలు చదవాలి-అనువాదాలు చేయాలి.


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు