ఇంటర్వ్యూలు

(January,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

విరసం కాలాన్ని జయించింది - నందిని సిధారెడ్డి

విరసం యాబై ఏళ్ళ సందర్భంగా నందిని సిదారెడ్డి గారు గోదావరి పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ 

1.                మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది?

నా సాహిత్య ప్రస్థానం సంప్రదాయ కవిత్వంతోనే మొదలైంది.  ఒక విధంగా చెప్పాలంటే పద్యరచనతో మొదలైంది.   తరువాత వచన కవిత్వం, పాట, జానపద  గీతాలు నా సాహిత్య ప్రస్థానంలో చేరాయి. 

పాఠశాలలో లైబ్రరీ ఉండేది.  దాదాపు 1000 పుస్తకాలు ఉన్నాయి.  చిన్న పిల్లల కథలు చదివాను. అందరూ అంటుంటే జంద్యాల ఉదయశ్రీ చదివాను.  పదవ తరగతిలో ఉన్నప్పుడు మా గ్రామపంచాయితీకి లైబ్రరీ పేరుతో  దాదాపు 300 పుస్తకాలు వచ్చాయి. అర్థం కాలేదుగాని చలం ఆనందం విషాదం చదివాను. తాళ్ళూరి నాగేశ్వరరావు రాసిన 'మా ఊరి కథలు' చదివాను.  అందులో ''మిఠాయి పంపకం'' అనే కథ ఉంది.  ఆ కథ నన్ను ఆకర్షించింది. ఆ కథను నాటకంగా రాసాను.  ఇదే నా మొదటి రచన. 15 ఆగస్టుకు, 26 జనవరికి పాఠశాలలో నాటకాలు వేసే సంప్రదాయం ఉంది. అందువల్లనే ''మిఠాయి పంపకం'' కథను నాటకంగా రాసాను. 

అష్టకాల నరసింహరామశర్మ అనే తెలుగు ఉపాధ్యాయుడు బదిలీ మీద వచ్చాడు. ఆయన ప్రభావం వల్ల పద్యాలు రాయడం మొదలు పెట్టాను.  ఆయన ''శిథిల విపంచి'' అనే పద్య కవితా సంపుటిని ప్రచురించాడు.  దాని వెల చారాన. విద్యార్థులం అందరం కొన్నాం, చదువుకున్నాం. పద్యాల పట్ల నా ఆసక్తిని చూసి ఆయన ''ఋత చేతన'' వచన కవిత్వం ఇచ్చాడు.  సిద్దిపేటలోని నలుగురు కవుల వేసిన వచన కవిత్వం అది. కథలు, కవిత్వం, నాటకాలు, పద్యం, జానపదగీతాలు రాయాలనే తలంపు పాఠశాలలో తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే నాలో ప్రవేశించింది.

2.                 మీ సాహిత్య ప్రస్థానం మొదలైన తొలినాళ్ళలో సాహిత్య వాతావరణాన్ని ప్రభావితం చేసిన సాహిత్యసంస్థలు  ఏవి?

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో  అష్టకాల నరసింహరామశర్మగారి ద్వారా 'యువభారతి' అనే సాహిత్య సంస్థ  పరిచయమైంది. యువభారతిలో మెంబర్‌ షిప్‌ చేయించారు.  'సాహితీ మిత్ర' పథకంలో చేరాను.  అందువల్ల నాకు కొన్ని పుస్తకాలు వారి నుండి వచ్చేవి.  ఇంటర్మీడియట్‌లోనే సాహితీ వికాస మండలి అనే సంస్థతో పరిచయమైంది.

డిగ్రీ మొదటి సంవత్సరంలో గ్రంథాలయ సంస్థ నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలలో జరిగిన సాహిత్య కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాను. ఈ వారోత్సవాలు నాలో సాహిత్య రచన పట్ల ప్రేరణ కలగడానికి             ఉపయోగపడ్డాయి. గ్రంథాలయంలో రోజులకు రోజులు గడిపేవాడిని.  అప్పుడే శ్రీ శ్రీ మహాప్రస్థానం దొరికింది.

డిగ్రీ రెండవ సంవత్సరంలో ''నవసాహితి'' అనే సంస్థ కళాశాలలో కవి సమ్మేళనం పెట్టింది.  ఈ కవి సమ్మేళనంలో పాల్గొని కవిత చదివాను.  ఈ పరిణామం నా సాహిత్య ప్రయాణం వేగంగా నడవడానికి కారణమైంది. డిగ్రీ మూడవ సంవత్సరంలోకి వచ్చేసరికి నవసాహితి బాధ్యుడిగా సభలు నిర్వహించాను. దీని ద్వారా సంస్థలు నడపడం తెలిసింది. 

నవసాహితి ఆధ్వర్యంలో సభ జరుగుతుండగా ఎ బి వి పి విద్యార్థులు కొందరు సభను అడ్డుకునే ప్రయత్నం చేసారు. కిటికీ బమటనుండి రాళ్ళు వేసారు.  కాని మేము చాకచక్యంగా వ్యవహరించి సభను నడిపాము. దీనిద్వారా సభ నిర్వహణ, చాకచక్యంగా వ్యవహరించే నేర్పు అలవడింది. ఆ రోజుల్లో నెహ్రూ యువక కేంద్ర కూడా యువకవి సమ్మేళనాలు పెట్టేది.

3..                  మీ సాహిత్య ప్రస్థానంలో మీకు విరసం ఎప్పుడు ఎలా పరిచయం అయింది?

1974 ఫిబ్రవరిలో మొదట విరసం పరిచయం జరిగింది. అప్పటికింకా నవసాహితి పరిచయం కాలేదు.  హైదరాబాదులో సి.టి.ఐ. ( సెంట్రల్‌ ట్రయినింగ్‌ ఇనిస్ట్యూట్‌) లో నా స్నేహితుడు సత్తయ్య ఉండేవాడు. సత్యయ్యకు ఒక ఆర్గనైజర్‌తో పరిచయమయింది.  ఒకానొక సందర్బంలో నా గురించి సత్తయ్య ఆ ఆర్గనైజర్‌కు చెప్పాడట.  ఆ ఆర్గనైజర్‌ నా ఆడ్రస్‌ తీసుకొని నాకు ఉత్తరం రాసాడు.  ఆ ఉత్తరంలో   విరసం గురించి వ్రాసాడు.  ఆ ఉత్తరం ద్వారానే నాకు విరసం  పరిచయం జరిగింది.

సిద్దిపేటలో భగవంతరెడ్డి ఉండేవాడు. ఆవేశపరుడు.  ''అగ్నిజ్వాల'' పేరుతో  కవిత్వం రాసేవాడు. సృజన, జీవనాడి, విరసంల గురించి చెప్పాడు. దిగంబర కవులు, విరసం రచయితలు మారుపేర్లతో కవిత్వం వ్రాస్తారని చెప్పాడు.

నవసాహితి పరిచయం అయిన తరువాత సరిపల్లి కృష్ణారెడ్డితో  పరిచయం  ఏర్పడింది.  ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారింది.  ఆ క్రమంలో మేము విరివిగా కలుసుకుంటుండేవాళ్ళం.  ఆయనే నాకు విరసం ప్రాపంచిక అవగాహనను , విరసం కార్యకలాపాలను, నిర్వహణను, నిర్మాణాన్ని గురించి చెప్పాడు.

నిజామాబాదులో బెడిద రాజేశ్వర్‌ అనే స్నేహితుడు ఉండేవాడు.  అతను విరసం గురించి ఉత్తరాల్లో రాసేవాడు.  విరసం సాహిత్యంలో చాలా మార్పులు తీసుకొచ్చిందని రాసేవాడు.  విరసంలో చేరవద్దని, సంస్థకు పరిమితం కావద్దని కూడా రాసేవాడు.  ఒక సంస్థకు పరిమితమైతే ఆ సంస్థ నియమావళికి కట్టుబడి ఉండాలని, అలా కవులు ఉండడం సరికాదని అభిప్రాయపడేవాడు.  అయితే విరసం నిబద్దత, నిమగ్నతను  గురించి తన ఉత్తరాలలో చర్చించేవాడు.

4  విరసం పరిచయమైర తరువాత మీ సాహిత్య వ్యక్తిత్వలో వచ్చిన మార్పులు ఏమిటి?

విరసం పరిచయం కాకముందు పద్యాలు, వచన కవితలు, జానపద గీతాలు రాసేవాన్ని. అప్పటివరకు సినారె కవిత్వంతో ప్రభావితం అయ్యాను. ''మంటలూ-మానవుడూ'' చదివాను.  సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా ఉంది.    అందువల్ల సినారెలాగా సినిమా పాటలు రాయాలని  అనుకునేవాన్ని. ప్రాక్టీసు కోసం 200 నుండి 300 వరకు  పాటలు  రాసుకున్నాను. శ్రీ శ్రీ మహా ప్రస్థానం  చదివిన తరువాత, శ్రీ శ్రీ కి విరసంకి ఉన్న సంబంధం తెలిసిన తరువాత కవిత్వం ప్రజాప్రయోజనాల కోసమేనని నిర్ధారించుకున్నాను.  

కృష్ణారెడ్డికి గోపులింగారెడ్డి బావ. గోపు లింగారెడ్డిది సభా వివాహం. సిద్దిపేటలో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  అప్పుడు గోపు లింగారెడ్డి విరసం సిటీ కన్వీనర్‌గా ఉన్నట్టు తెలిసింది.   కృష్ణారెడ్డి, తదితరుల ద్వారా విరసం గురించి లోతుగా వినడం  ద్వారా విరసం ప్రభావానికి లోనయ్యాను. 

1974 నవంబర్‌లో కందుకూరి  శ్రీరాములు, కర్ణాల బాలరాజు, నేను ( నందిని సిధారెడ్డి) కలిసి ''దివిటి'' అనే  మినీ కవితా సంపుటిని త్రిమూర్తుల పేరుతో వెలువరించాము.

విరసం ప్రభావంతో నేను రాసిన మొదటి కవిత ''బందూక్‌''.  సాహిత్యాన్ని అలవోకగా తీసుకునే స్వభావం నుంచి కవిత్వం ప్రయోజనాన్ని తెలుసుకొని ఆ దిశగా కవిత్వం రాయడానికి, కవిత్వాన్ని  సీరియస్‌గా తీసుకోవడానికి, కవిగా సీరియస్‌గా, బాధ్యతాయుతంగా ఉండడానికి విరసం దోహదపడింది. నా వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని  బలంగా ప్రభావితం చేసింది.  నిబద్దంగా ఉండడాన్ని పరిచయం చేసింది.

విరసం, నవసాహితి రాజకీయాలు పరిచయమైన తరువాత  ''దున్నేవాడిదే భూమి'' అని మా బాపు పదే పదే  చెప్పే విషయానికి లింక్‌ కుదిరింది. అందువల్ల మరింత ఆసక్తితో, అభిమానంతో, నిబద్దతతో ఆశయం వైపు కదలాలని నిశ్చయించుకున్నాను.

5..                 విరసం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు?

తెలుగు సాహిత్యంలో విరసం ఏర్పాటు పెద్ద సంచలనం.  యం.ఏ. లో క్యాంపస్‌లోకి ప్రవేశించిన తరువాత విరసం గూర్చి లోతుగా అధ్యయనం చేసాను. విరసం ఏర్పాటు తదనంతర పరిణామాలు అన్నీ అవగాహనకు తెచ్చుకున్నాను. 

 తెలుగు సాహిత్యంలో నెలకొన్న స్తబ్దతను  దిగంబర కవులు చేధిస్తే, అవసరమైన దిశానిర్ధేశాన్ని రాజకీయ దృక్పథాన్ని జోడించి తెలుగు సాహిత్యానికి విరసం దిక్సూచిగా నిలిచింది. ఆ తరువాత ప్రతికవి విప్లవ కవిత్వ ధోరణిలో రాయాలని తపన పడేవాడు.

నీరసదశ నుంచి సాహిత్యం క్రొత్త రక్తంతో సరిక్రొత్త భావాలతో పరవళ్ళు తొక్కింది. అన్ని ప్రక్రియలలో క్రొత్త పరిణామాలు సంభవించాయి.  సాహిత్యం ప్రజలకు చేరువగా వచ్చింది.  పాట విశేష ప్రక్రియగా ఆదరణ పొందింది.

6..                  విరసం లాంటి సంస్థ 50 సంవత్సరాలు మనగలగడం వెనుక గల పరిస్థితులు, కారణాలు తెలుపగలరు?

సమాజంలో నెలకొన్న అసమానతలు. రాజ్యాంగ అమలులో కొనసాగుతున్న అవకతవకలు, తీవ్రమైన నిరుద్యోగం,  ప్రజల పేదరికం. వ్యవస్థలో ఒదగలేక వ్యక్తులు పడే సంక్షోభం, వ్యాపార సాహిత్యం, యాంత్రిక సన్మానాల సంస్థలు - అన్నీ పరిణామాలు విరసం మాబై ఏళ్ళ చరిత్రకు భూమికగా నిలిచాయి. 

సాహిత్యంలో వ్యక్తివాదం, కళా విలువలు తప్ప మరేమి అక్కరలేదనే సౌందర్యవాదం, కొత్త రచయితల పట్ల నిర్లక్ష్య వైఖరి, పద్యం కన్నా, వినోద గేయాల కన్నా, ప్రజల్ని నడిపించే సాహిత్య ఆవశ్యకతే విరసం యాబై ఏళ్ళుగా నిలదొక్కుకోవడానికి యాబై ఏళ్ళుగా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేయడానికి కారణమైంది

వివిధ అస్తిత్వవాదాల ఆవిర్భావ వికాసాలను అర్థం చేసుకుని  ఆహ్వానించే విశాలమైన స్వభావం వల్ల విరసం యాబై ఏళ్ళు ప్రభావవంతంగా ఉండగలిగింది.

7..                 విరసం అవసరం ప్రస్తుత తెలుగు సాహిత్య సామాజిక రంగంలో ఎంత వరకు ఉన్నది?

సాహిత్యం మరొకసారి సీరియస్‌నెస్‌ కోల్పోతున్న దశ.  ఎంత విస్త ృతంగా, వరదలా సాహిత్యం వెలువడుతున్నా  స్సష్టమైన సామాజిక దృక్పథం లోపిస్తున్నది. అన్ని అస్తిత్వ వాదాలను అనుసంధానం చేయగలిగిన ప్రజాస్వామిక విధానం కొరవడింది.  భిన్నత్వంలో ఏకత్వం అనే వాదనను తలమానికంగా భావించిన వ్యవస్థలో ''ఏకత్వంలో ఏకత్వం, ఏకత్వమే సమస్తం''గా రుద్దబడుతున్న చోట, వాటన్నిటిని సరిగ్గా అర్థం చేసుకుని  నడిపించగలిగే క్రియాశీల సంస్థగా విరసం పాత్ర పోషించాల్సిన కర్తవ్యం మిగిలి ఉంది,  ఆ పని విరసం చేస్తే సమాజానికి , సాహిత్యానికి, ప్రజాస్వామిక విలువలకు మేలు జరుగుతుంది.

మనుషులు చిన్నచిన్న సమూహాలుగా విడిపోతూ ప్రత్యామ్నాయ ఆలోచనావిధానాన్ని నిలబెట్టలేని స్థితిలో విరసం బాధ్యత మరింతగా ఉందేమో!

8.                విప్లవ సాహిత్యంలో వచ్చిన పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు?

రాజకీయాలు సూటిగా చెప్పడం, వ్యక్తీకరణలో సిద్ధాంతానికి, కార్యాచరణకు ఎక్కువ చోటివ్వడం అనే లక్షణాలతో తొలిదశ విప్లవ సాహిత్యం వెలువడింది.

తదనంతర దశలో సాంద్ర కవిత్వం, లోతైన అవగాహన. సృజనాత్మక విలువలతో ప్రభావశీలిగా విప్లవ సాహిత్యం వచ్చింది. రాజకీయాల అవగాహనను పెంచింది. అస్తిత్వ రాజకీయాల, అస్తిత్వ సాహిత్య నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసే నాయకత్వాన్ని  విరసం అందించింది.

9 .                సాహిత్య పరిశోధన మీద విమర్శ రంగం మీద విరసం ప్రభావాన్ని ఎలా అంచనా వేయాలి? 

విమర్శలో చాలా బలమైన ప్రభావం ఉంది.  త్రిపురనేని మధుసూదనరావు, చెంచయ్య, వరవరరావు, కె వి రమణారెడి, ఒక మేరలో వేల్చేరు నారాయణరావు లాంటి వారు విప్లవ సాహిత్య విమర్శ రంగంలో పనిచేసారు. విమర్శ రంగంలో కొనసాగాలనుకున్నవాళ్ళు తప్పనిసరిగా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసే స్థితిని సృష్టించింది.

విశ్వవిద్యాలయాలల్లో పరిశోధన కూడా తనను తాను సవరించుకున్నది.  పాత సంప్రదాయిక అంశాల మీద పున:పున: పరిశోధనలను దాటి విశ్వవిద్యాలయాలు పరిశోధనలను ఆధునికరించడంలో విప్లవ రచయితల పాత్ర ఉంది.  కాత్యాయనీ, కె కె ఆర్‌, రాచపాళెం వంటివారు విప్లవ సూత్రాలను కూడా దృష్టిలో పెట్టుకొని విమర్శ సాగిస్తున్నారు.

10.                కొత్త రచయితలను కవులను తయారుచేయడంలో విరసం పాత్ర ఎంత వరకు ఉన్నదని మీరు భావిస్తున్నారు?

కొంతమేరకు ఉన్నది. వర్క్‌షాపులను, సాహిత్య పాఠశాలలను నిర్వహించి. అరుణతార పత్రిక ద్వారా కొత్త కవులను గుర్తించి వారి రచనలను ప్రచురించడం వల్ల ఒక మేరకు కవులు రచయితలు తయారయ్యారు.

11.                యాబై ఏళ్ళ విరసం సందర్భాన్ని మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు?

ఒక సంస్థ అర్థ శతాబ్ధం  క్రియాశీలకంగా జీవించడం చాలా కష్టసాధ్యం. అయినా విరసం లాంటి సంస్థ కాలాన్ని జయించింది, నిలబడింది. యాబై ఏండ్ల సంస్థలు ఉండొచ్చు.  కార్యదీక్షతో నడిచింది, జనస్వరమై నిలిచింది విరసం ఒక్కటే.

యాబై సంవత్సరాల సందర్భంగా పునరుత్సాహాన్ని సంతరించుకుని తెలుగు సాహిత్య రంగంలోని లోటుపాట్లను సవరిస్తూ ప్రజాభిముఖంగా ప్రయాణించాలని ఆకాంక్షిస్తున్నాను.

12 .                యువతరం సాహిత్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని మీరు భావిస్తున్నారా? యువతరాన్ని సాహిత్యానికి దగ్గర చేయడంలో  విరసం పాత్ర ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? 

యువతరం సాహిత్యం పట్ల ఆసక్తితో ఉన్నారు.  సాంఘీక మాధ్యమాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.  తెలుగు సాహిత్యంలో కొత్తగా సృష్టించబడుతున్న కవితా ప్రక్రియలు ఒక సూచిక.

అవార్డులు కోసం, రికార్డుల కోసం రూపొందించబడుతున్న కార్యక్రమాలు, సభలు మరొక ఋజువు. కానీ అక్షరం ఆయు:ప్రమాణం తగ్గిపోతున్నది. ఈ ధోరణుల్లో ఎటూ తేల్చుకోలేని రచయితలల్లో ఒక అయోమయస్థితి నెలకొని ఉన్నది.  ఇలాంటి ఒక విచిత్ర స్థితి నుంచి స్పష్టమైన రచనా లక్ష్యాల వైపు, జీవనమూల్యాల వైపు నడిపించటం విరసం బాధ్యత, కర్తవ్యం.