అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా ఇంద్రగంటి జానకీబాల గారు గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? తద్వారా కలిగే ప్రయోజనాలు , ప్రేరణలు ఏమిటి?
రచయిత్రులు ఎవరి తన్న వాళ్ళు ఏవో రచనలు చేసుకుంటూ ప్రచురించుకుంటూ ఉన్న సమయంలో మహిళా దినోత్సవం ఒక సంఘీభావాన్ని ఒక ఎరుకను కలుగజేసిందనిపిస్తుంది. రచయిత్రులే కాదు అన్ని రంగాలలో పనిచేసే మహిళలందరూ తామంతా ఒకటేననే భావస్ఫూర్తిని వారికి ఇచ్చింది మహిళా దినోత్సవం.
2. స్త్రీ వాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
స్త్రీలు తమ గురించి తాము ఆలోచించుకునే ఒక అవసరాన్ని గుర్తు చేసిందనిపిస్తుంది. అందులోని భాగంగా మహిళా జనజీవన అధ్యయనం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని వర్గాల, స్థాయిల్లో ఉన్న స్త్రీ గురించి వారి జీవితాల గురించి ఆలోచించేలా చేసింది. కుల మత వర్గ విభేదాలను పక్కనపెట్టి స్త్రీల జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది.
3. స్త్రీ వాద భావజాలం తెలుగు సమాజాన్ని ఎలా ప్రభావితం చేసింది? అందువల్ల వచ్చిన గుణాత్మక పరిణామాలు ఏమైనా ఉన్నాయా ? గతంలో అది వేసిన ప్రభావానికి వర్తమానంలో దాని ప్రభావానికి మధ్య భేదం ఏమైనా గుర్తించారా?
స్త్రీవాద భావజాలం ముఖ్యంగా పురుషులు ఉలిక్కిపడేలా చేసింది పురుషాధిక్య భావజాలంతో రూపుదిద్దుకున్న స్త్రీల ఆలోచనల్లో కూడా మార్పు సూచించింది. వారు కంగారు పడ్డారని భావించవలసి ఉంది.
ప్రతి రచయిత్రి రచయిత స్త్రీవాద భావజాలం వల్ల ప్రభావితులయ్యారు అని చెప్పుకోవచ్చు అందులోని కొన్ని ప్రశ్నలకు జవాబులు అన్వేషించడంలో పడ్డారు. అందరి రచనల్లోనూ స్పష్టమైన మార్పు కనిపించింది. న్యాయపరమైన ఆలోచన వైపు ధైర్యంగా నిలబడి రచనలు చేసే శక్తి స్త్రీవాదం ఇచ్చిందని తోస్తుంది.
80 90 దశకంలో పాత కొత్తల సంధి యుగం గా అనిపిస్తుంది. స్త్రీలు నెమ్మదిగా చైతన్యవంతులు అవుతున్న ఆ సమయంలో స్త్రీ వాదం ఎంతో స్ఫూర్తిని శక్తిని ఇచ్చిందనిపిస్తుంది.
రచయిత్రులే కాదు రచయితలు కూడా గొప్ప స్త్రీవాద కథలు వ్రాసిన సందర్భాలున్నాయి.
స్త్రీ వాదమంటే పురుషుల్ని ద్వేషించడం అనే తప్పుడు సంకేతాలు కూడా ఈ ఉద్యమ సమయంలో వచ్చాయి.
స్త్రీలే కాదు పురుషులు కూడా స్త్రీవాదం మీద సరైన అవగాహన కలిగి ఉంటే గానీ సమాజంలో మార్పు కష్టమనే ఆలోచన నెమ్మదిగా బలం పుంజుకుంది.
స్త్రీ సమానత్వం, సాధికారికత లాంటివి ఉద్యమం బలోపేతం చేయడం వల్ల మాత్రమే సాధ్యం అని తెలుస్తుంది
4. నవల, కథ, విమర్శ, నాటకం వంటి ప్రక్రియల కంటే స్త్రీ వాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే వెలువడింది. దీనికి కారణాలు ఏవంటారు?
రచయిత్రులు కవిత్వం వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి ముఖ్యకారణం కవిత్వపు నిడివి చిన్నది కావడం - చెప్పదలచుకున్న భావాన్ని క్లుప్తంగా, బలంగా సూటిగా చెప్పే అవకాశం కవిత్వంలో
సాధించవచ్చునని అనిపించటం కారణాలు కావచ్చు. నవల చాలా పెద్ద కాన్వాస్. చాలా శక్తి ఓర్పు ప్లానింగ్ ఉండగానే ఈ నవలా రచన సాధ్యం కాదు.
కథ నవలంతా పెద్దది కాకపోవడం వల్ల, ఒక పాయింట్ సులువుగా ప్రతిపాదించి, ముగింపు ఇచ్చే వీలు కలిగే ప్రక్రియ కావడం వల్ల - స్త్రీవాద సాహిత్యంలో కథ కూడా మంచి స్థానం సంపాదించుకుంది
5. మీరు స్త్రీవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?
నేను స్త్రీ వాదం వైపు ఆకర్షితురాలిని కావడానికి ఓల్గా రచనలు ప్రధాన కారణమని చెప్పగలను. నా కథల్లో - జీవన రాజకీయం - ధైర్యమే నీ కవచం - మూడో పేజీ - లాంటి కొన్ని కథలు స్త్రీవాద కథలుగా గుర్తింపు కలిగి పేరు తీసుకొచ్చాయి.
6. స్త్రీ వాద ఉద్యమం బలహీన పడిందని భావిస్తున్నారా?
స్త్రీవాద రచయితలలో కూడా గ్రూపులు ఉండటం - వారిలో వారు కొంతమందికి స్త్రీవాద రచయిత్రిగా ముద్ర వేసి ప్రచారం చేయడం వల్ల కూడా ఉద్యమం బలహీన పడింది. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఉద్యమస్ఫూర్తితో పని చేస్తే స్త్రీ వాద ఉద్యమం ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయి.
7. కొత్తతరం రచయితలలో స్త్రీవాద స్పృహ ఎలా వ్యక్తమవుతున్నది?
యువత రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి చూపుతున్నారు కానీ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపో కూడదని కొందరు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
8. స్త్రీ వాదంను పురుషులను అంగీకరిచినట్లేనా?
స్త్రీ వాదాన్ని పూర్తిగా అంగీకరిస్తే పురుషులు కొన్ని సౌకర్యాలను కోల్పోవలసి వస్తుంది. అందువల్ల కొందరు అటూ ఇటూ కాకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
9. తెలుగు లో స్త్రీ వాద సాహిత్యం వెలువడడానికి భూమిక ఏమిటి?
ఏ వాదాన్ని కైనా వ్యక్తి ప్రవర్తన - స్వేచ్ఛ- ఆలోచన భూమికలు. అందుకే మూలాల నుంచి మార్పు కోసం ప్రయత్నించాలి పైపైని ఎన్ని చేసినా ఆశించిన ఫలితాలు రావడం కష్టమే.
10. ఏ వాద సాహిత్యమైన ఎప్పుడు నిలబడుతుంది?
రచనలో ఏ వాదాన్ని రచించినా సమర్థంగా జీవిత చిత్రణ చేయగలిగినప్పుడే అందులో ఉండే ఆలోచన పాఠకులక మనసుకి తాకుతుంది అదే ముఖ్యం. జీవం లేని రచనలు ఎన్ని చేసినా ఏ వాదమూ నిలబడదు.