ఇంటర్వ్యూలు

(March,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సమస్య ఉన్నంతవరకూ ప్రశ్నించే గొంతులు వుంటాయి - శీలా సుభద్రాదేవి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా శీలా సుభాద్రాదేవి గారు  ‘గోదావరి’ అంతర్జాల సాహిత్య మాస పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూ

1.      అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మహిళా దశాబ్ది చైతన్యం ఏమిటి? 

          1910 మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతిపాదించబడింది. గత 110 సంవత్సరాలుగా సమస్యలు అనేక విధాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. ఒక సమస్యని పరిష్కరించేంతలో అదే సమస్య మరొకరూపం దాల్చి మహిళలని లక్ష్యం చేసుకొని బాధిస్తూనే ఉంది. ఉదాహరణకు కన్యాశుల్కం పోయి వరకట్నంగా మారటాన్నే చెప్పుకోవచ్చు. కొన్ని వర్గాలలో మహిళా దినోత్సవం అంటే కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడంతోనే ముగుస్తున్నాయి. నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలూ, మూర్ఖ సాంప్రదాయాలు స్త్రీలను అణచివేతకు గురిచేస్తూనే ఉన్నాయి. వీటిని పెంచి పోషించే సంస్కృతి ఉన్నంతకాలమూ మహిళా చైతన్యం సంపూర్తిగా ఉందని చెప్పలేము. ఈ ఉత్సవాలన్నీ కార్పొరేటు సంబురాలుగానే మిగిలిపోతున్నాయి.

2.       స్త్రీవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

          నేను స్త్రీవాదాన్ని స్త్రీ చైతన్యంగానే అభివర్ణించుకుంటాను. స్త్రీ చైతన్యవంతురాలయినప్పుడే కదా తనకేం కావాలో, తాను కోల్పోయినదేమిటో, తన హక్కులేమిటో, తాను పోరాడాల్సింది కుటుంబంతోనా సమాజంతోనా అనేది అర్థం చేసుకోగలుగుతుంది. నిజానికి స్త్రీ కోరుకునేది లైంగిక స్వేచ్ఛో, ఆర్థిక స్వేచ్ఛో కాదు ప్రధానంగా కావలసింది భావప్రకటన స్వేచ్ఛ. అది ఉన్నప్పుడు తద్వారా మిగతా హక్కులన్నీ సాకారం చేసుకునేందుకు ఒక లక్ష్యాన్ని సమకూర్చుకోగలుగుతుందని అనుకుంటాను. ఆ లక్ష్యసిద్ధికి అవరోధం ఏర్పడినప్పుడు హక్కుల కోసం పోరాటం చేస్తుంది.

3.       మహిళా జన జీవన అధ్యయనాలకు, స్త్రీవాదానికి ఉన్న సంబంధం ఏమిటి?

          సమాజంలోని స్త్రీలందరూ సమానం కాదు. కుల, మత, వర్గ ప్రాతిపదికను చూసుకుంటే స్త్రీల సమస్యలు కూడా వేరు వేరే. ఒక సమస్యకి ఒక కులంలోనో, ఒక మతంలో ఉన్నంత ప్రాతినిధ్యం మరో కులంలోనో మతంలోనో ఉండకపోవచ్చు. అందువలన స్త్రీల సమస్యలని కేటగరైజేషన్ చేయవలసి వస్తుంది. అవి తెలుసుకోవాలంటే మారుమూల పల్లెల్లోకో, బస్తీల్లోకో వెళ్ళి అధ్యయనం చేయక తప్పదు. అది సాధ్యం కానప్పుడు మన పరిసరాలలోని భిన్న తరగతుల, వర్గాల మహిళలనైనా సునిశితంగా పరిశీలిస్తే అర్థమౌతూనే ఉంటుంది.

4.       స్త్రీవాద భావజాలం తెలుగు సమాజాన్ని ఎలా ప్రభావితం చేసింది? అందువల్ల వచ్చిన గుణాత్మక పరిణామాలు ఏమైనా ఉన్నాయా? గతంలో అది వేసిన ప్రభావానికీ వర్తమానంలో దాని ప్రభావానికి మధ్య బేధం గుర్తించారా?

          స్త్రీ ఎప్పుడైతే చదువుకోటానికో, ఉద్యోగానికో బయటకు రావడం ప్రారంభమయ్యిందో అప్పటినుండే ఆమెలో మధనం ప్రారంభమయ్యిందనుకుంటాను. తనకి కావలసిన హక్కు కోసం ప్రశ్నించటం మొదలుపెట్టింది. ఎందుకంటే అరవై డెబ్భై ఏళ్ళ క్రితం నాటి రచయిత్రులు రచనలు చదువుతుంటే కొన్నింటిలో ఆ చైతన్యభావజాలం తెలుస్తూనే ఉంది. అప్పట్లో “Women’s Lib” అనే పేరుని వాడారనుకుంటాను. నేను కాలేజీలో చదివేరోజుల్లో సాధారణ మహిళలా కాకుండా భిన్నంగా ఆలోచించే, మాట్లాడే వారిని ఆ రకంగా ఎద్దేవా చేయటం కూడా తెలుసు. రంగనాయకమ్మ, పి. శ్రీదేవి వంటి వారి రచనలు, చలం, కుటుంబరావు రచనలు అప్పట్లో చదువరులైన మహిళల్లో సంచలనం కలిగించిన మాట వాస్తవం. కానీ సామాజిక, ఆర్థిక, కౌటుంబిక కట్టుబాట్లు కొంత గతంలో స్త్రీల ఆలోచనలకు కత్తెర వేసినదీ నిజమే. అందువల్లే బహుశా, ఆ రోజుల్లో స్త్రీవాద భావజాలం అతివాదంగా గాక మితవాదంగా ఆగిపోయింది. 80ల తర్వాత తీవ్రతరమై అతివాద స్త్రీవాదంగా ఎదిగింది. 

5.       స్త్రీవాద సాహిత్య అవసరం ఈనాటికీ ఉందనుకుంటున్నారా?

          కాలక్రమేణా సమస్యలు రూపాంతరం చెంది మరొక రూపంలోకి మారుతున్నాయి. సమస్య ఉన్నంతవరకూ ప్రశ్నించే గొంతులు వుంటాయి. అవి అక్షరరూపం కూడా దాలుస్తూనే ఉన్నాయి. ఉంటాయి. ఉండాలి.

6.       80, 90లలో స్త్రీవాద సాహిత్యం బలంగా వెలువడడానికి కారణాలు ఏమిటి?

          ఇంతకుముందు చెప్పినట్లే కొన్ని వర్గాలకు బాగా చదువుకొనే అవకాశమే కాక ఆర్థికంగా, సామాజికంగా కొంత వెసులుబాటు కూడా కలిగింది. దాంతో సమస్యల గురించి ఆలోచించి అధ్యయనం చేసి పరిష్కారం కనుగొనే దిశలో ధైర్యంగా తమ దృక్పథాన్ని, భావాల్నీ బలంగా ఎలుగెత్తి రాయగలిగారు. అయితే జండర్ వివక్ష, భావస్వేచ్ఛ, అణచివేతకు గురౌతున్న దేహ స్పృహ వీటిపై చర్చించినంతగా సామాజికంగా వెనుకబాటుతనంకి, మూఢనమ్మకాలకీ, సాంప్రదాయాల పేరిట కుటుంబాలలో శారీరక మానసిక హింసలకీ గురౌతున్న వారికి బాసటగా నిలిచే సాహిత్యం రాలేదని నా ఉద్దేశ్యం. అందువల్లనే తదనంతరం స్త్రీవాద సాహిత్యం అనేక పాయలుగా విడిపోయిందనీ, ఎవరి అస్థిత్వాన్ని వారు అంతకంతకూ సాహిత్యంలో బలంగా చోటు చేసుకోవటం మొదలయ్యింది.

7.       స్త్రీవాద సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఎంతమేరకూ ప్రభావితం చేసింది?

          అప్పట్లో చాలా సంచలనమే తెచ్చింది. చాలామంది సాహితీవేత్తలు ఉలికిపడి తమని తాము తడుముకునే పరిస్థితి వచ్చింది. స్త్రీవాద ముద్రకోసం రచయితలూ, కవులూ కూడా సంఘీభావంగా రాయటం మొదలుపెట్టారు. రాసేవాళ్ళకే కాక చదువరులకు కూడా ఒక స్పష్టమైన దృష్టి కోణం ఏర్పడటానికి దోహదం చేసింది.

8.       ఇప్పుడు విడిగా స్త్రీవాదం పేరిట ఉధృతంగా రచనలు రాకపోవటానికి కారణాలు ఏమిటనుకుంటున్నారు?

          రాకపోవటం ఏమిటి? ప్రశ్నించే గొంతులూ పెరిగాయి. తమ తమ అస్థిత్వాలకు మూల కారణాలను అన్వేషిస్తూ బలంగా నిలిచే విధంగానే రచనలు చేస్తూనే ఉన్నారు. స్త్రీవాద లేబుల్ లేకపోవచ్చును కానీ చాలావరకూ చైతన్యస్ఫూర్తితోనే సాహిత్యం వెలువడుతూనే ఉంది.

9.       నవల, కథ, విమర్శ, నాటకం వంటి ప్రక్రియలకంటే స్త్రీవాద సాహిత్యం ఎక్కువగా కవిత్వంలోనే వెలువడుతుంది. దీనికి కారణం ఏమంటారు?

          ఒక చిన్న సూదిమొన అంత బాధ మనసుని తాకినప్పుడు చిన్న సంఘటనో, దృశ్యమో మనసుని కదిలించినప్పుడు తక్షణ స్పందనగా తన భావాన్నీ ఆలోచననీ, ఆవేదననీ, ఆక్రోశాన్నీ కవిత్వంలోనే బలంగా చెప్పగలుగుతాము. బహుశా అందువల్లనే కవిత్వం ఎక్కువగా వెలువడింది. కథలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా వెనుకబాటుకు గురైన కులాలు, అణగారిన కులమతాలకు చెందిన స్త్రీలలో కూడా చదువుకునే అవకాశాలు పెరిగి ఆలోచనలు విప్పుకొని తమ అనుభవాలను అక్షరీకరించే క్రమంలో కథలు బాగానే వచ్చాయి. నవలలు మాత్రం ఇంకా సాంప్రదాయ చట్రాన్ని దాటి ఎక్కువగా రావటం లేదు. నాటకం అసలు లేదనుకుంటాను. ఇంక స్త్రీవాద విమర్శ గురించి చెప్పుకోవాలంటే నీలిమేఘాలు దాటి ఏ విమర్శకులూ దృష్టి సారించటం లేదు. చెప్పిన వాళ్ళ గురించే చెప్తూ, చెప్పిన విషయమే చెప్పటంతో ఆ వ్యాసాలన్నింటా పునరుక్తి దోషం ఉంటుందనిపించుతోంది. స్త్రీవాద విమర్శ చేసేవాళ్ళు ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను.

10.     స్త్రీవాదం పాలకులను ప్రశ్నించలేదని ఒక అభియోగం. దీని గురించి ఏమంటారు?

          ప్రశ్నించటంతోనే మొదలైన స్త్రీవాదం ముందుగా కుటుంబాన్ని తన హక్కుల కోసం ప్రశ్నించింది. తర్వాత్తర్వాత అనేక అస్థిత్వ పాయలుగా విడిపోయిన తర్వాత తన అసహాయతకు, అణచివేతకు కారణమైన సమాజాన్నీ ప్రశ్నించింది. విభజించి పాలించే తత్వంతో మనుషుల్ని కులాలు, మతాలూ, ప్రాంతీయులుగా విడదీయటంతో గొంతులు మూగబోతున్నాయి.  ఒకటీ అరా గొంతు సవరించుకునే సమయానికి వారిపై డేగకళ్ళు దృష్టి సారిస్తున్నాయి. పురస్కారాల బిస్కట్లతో కొందర్ని కొనేసుకుంటున్న దశలో ఏమని ప్రశ్నిస్తారు.

11.     దళిత బహుజన మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు, సాహిత్యం స్త్రీవాద సాహిత్య విస్తరణకు అవరోధం అయ్యాయని భావిస్తున్నారా?

          ఎంతమాత్రం కాదు. అంతవరకూ చెప్పిన అగ్రకుల స్త్రీవాద ధోరణికి పూర్తిగా భిన్నమైన అస్తిత్వవాదాలు వచ్చి సాహిత్యానికి ఒక కొత్త చూపు, కొత్త రూపు ఇచ్చాయని నా ఉద్దేశ్యం. అంతవరకూ సాహిత్య రంగంలో వచ్చిన అన్ని రచనలకూ భిన్నమైన జీవితాన్ని, దుర్భర అణచివేతల్నీ విప్పి చూపి సమాజంలోని భిన్న పార్శ్వాలను పరిచయం చేసింది.

 

12.     సామాజిక ఉద్యమాలు బలహీనపడ్డాయి కనుక స్త్రీవాదం బలహీనపడింది అంటున్నారు. నిజమా కాదా? ఎందుకు?

          లేదనుకుంటాను. సామాజిక ఉద్యమాల వలనే ఇతరేతర అస్తిత్వవాద సాహిత్యం బలంగా వచ్చింది. నిజానికి ఇతర అస్తిత్వ ఉద్యమాలు స్త్రీవాదాన్ని బలోపేతం చేయాలి కదా! విరసం ప్రభావంతో వచ్చిన సాహిత్యంలోని పాయలే కదా ఇవన్నీ. స్త్రీవాద పరిధిలో ఉన్నవాళ్ళు ఆ పరిధిని విస్తరించుకోవటానికి ప్రయత్నించకపోవటం వలన, ఆ ముద్ర లేకపోయినా అదే దృక్పథంలో ఉన్నవారిని కలుపుకొని ప్రయాణించకుండా, ఆ పరిధిని దాటి ఇతరేతర సమస్యల పట్ల దృష్టి సారించకపోవటంవల్లా కొంతమంది తొలినాటి స్త్రీవాద ఛాయల్ని దాటి మారుతోన్న సమస్యల రూపాంతరాల జోలికిపోకుండా అవే పట్టుకువేలాడుతుండడంవల్లే అక్కడే ఆగిపోయారు.

13.     గ్లోబలైజేషన్ కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు స్థానం ఉందా?

          గ్లోబలైజేషన్ వల్ల స్త్రీల పరిస్థితులు బాగుపడ్డాయా అని ప్రశ్నించుకునే ముందు బస్తీల్లోకో, గ్రామాల్లోకో వెళ్ళి చూడాలి. అందరి చేతుల్లోకీ స్మార్టు ఫోన్లు, ఇళ్ళల్లోకి రంగుల కలల వలల్ని విసురుతున్న ఇడియట్ బాక్సులు వచ్చి కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాయ్. మహిళల మెదళ్ళని అర్థం లేని టీవీ కార్యక్రమాలు బూజుపట్టించి మరింత  మూర్ఖులుగా మార్చుతూ అంతకంతకూ భావజాలం మాత్రం వెనక్కే పరుగెడుతుంది. వాళ్ళని జాగృతపరచాల్సిన ఉద్యమాలు కొత్తగా రావాలేమో.

14.     మీరు స్త్రీవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యారు?

          మా అక్క పి. సరళాదేవి ప్రభావంతోనూ, అన్నయ్య కొడవంటి కాశీపతిరావు సేకరించిన పుస్తకాలు చాలా చిన్నప్పటినుండే చదవటంవల్ల మొదటి నుండీ నాలో భావతీవ్రత ఉండేది. బాల్యం నుండీ కుటుంబ పరిస్థితులు గొంతునొక్కేసినా అక్షరాలుగా నా మనసుని కాగితాలపై పెట్టటం మొదలుపెట్టిన దగ్గర నుండి అస్తిత్వం కోసం ఆరాటపడుతూనే ఉన్నాను.

 15.     స్త్రీవాద సాహిత్య అభివృద్ధిలో మీ పాత్రని ఎలా నిర్వచించుకుంటారు?

          తొమ్మిది కవితాసంపుటాలు మూడు కథల సంపుటాలు, ఒక నవలిక గత యాభై ఏళ్ళుగా నా సాహిత్య ఖాతాలో ఉన్నాయి. అందులో మూడొంతులపైగా స్త్రీ సమస్యలపైనే రాశాను. నా స్వభావరీత్యా నా వాక్యాలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అన్ని వర్గాల స్త్రీల సామాజిక, రాజకీయ, ఆర్థిక మూలాల్ని అన్వేషిస్తూనే విభిన్న అంశాల్ని నా కథ కవితాంశాలుగా తీసుకున్నాను. ఇంకా రాస్తూనే ఉన్నాను. నా కలం ఇంకా అలసిపోలేదు.

16.     స్త్రీవాద సాహిత్యం సాధించిన ప్రయోజనం ఏమిటి?

          స్త్రీలకే కాదు పురుషులకి కూడా ఒక కొత్త చూపుని ఇచ్చింది.

17.     తెలుగులో వచ్చిన స్త్రీవాద సాహిత్యంలో మీకు నచ్చినవి, మిమ్మల్ని ప్రభావితం చేసిన రచనలు ఏవి?

          నేను ఏడు, ఎనిమిది తరగతుల్లో నుంచీ రంగనాయకమ్మ పేకమేడలు, కూలిన గోడలు మొదలైన నవలలు మా అమ్మకి చదివి వినిపించేదాన్ని. బహుశా నా మీద ఆమె ప్రభావమే ఎక్కువగా ఉందనుకుంటాను. రావిశాస్త్రి, బీనాదేవి రచనలు కూడా ఎక్కువగా చదవటం వలన రాజకీయ దృక్కోణంలో స్త్రీ అస్తిత్వం గురించిన ఆలోచనలు కూడా నా రచనల్లో వ్యక్తమౌతాయి. 

18.     20, 30 ఏళ్ళ నాటి స్త్రీవాద సాహిత్యం ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉందని మీరు భావిస్తున్నారా?

          లేదనే చెప్పాలి. మహిళలకి తమ అస్తిత్వాన్ని గురించి ఆలోచనను నేర్పింది. కానీ పాయలుగా విడిపోయిన తర్వాత వచ్చిన దళిత, బహుజన, మైనారిటీ అస్తిత్వ వాదాలు వచ్చిన తర్వాతే అన్ని వర్గాల అణగారిన స్త్రీల అణచివేతలనన్నింటినీ బట్టబయలు చేసి సమస్యల తీవ్రత అందరికీ అర్థమయ్యేలా చేసిందనుకుంటున్నాను.

19.     స్త్రీవాదం గురించి మీ దృక్పథంలో మార్పు ఏమైనా వచ్చిందా?

          సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్నుండి స్త్రీ సమస్యల్ని చూడడం పరిశీలించడం, రాయటం మొదటి నుండి నా రచనా విధానం. ఇప్పటికీ నా దృక్పథం అదే.

20.     స్త్రీ వాద సాహిత్య సృజనకు స్వీయ జీవితానుభవాలు, అనుభూతులు సరిపోతాయా?

          స్వీయ జీవితానుభవాల నుండి సార్వజనీనం కావల్సి ఉంటుంది. సూక్ష్మ పరిశీలనాత్మక దృష్టిని అలవరచుకుని అనుభూతుల్ని ఇతరుల అనుభవాల్తో సాదృశ్యం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారి సమస్యల్ని, అంతరంగాల్నీ శోధించాలి. అప్పుడే ఆ రచన అందరిదీ అవుతుంది.

21.     మీ రచనలలో అచ్చమైన, గాఢమైన స్త్రీవాద రచనలుగా మీరు వేటిని పేర్కొంటారు. ఎందువల్ల?

          నా రచనల్లో మూడొంతులు స్త్రీపరంగా సాగినవే. అయితేబతుకుబాటలో అస్తిత్వరాగంఅనే దీర్ఘకవిత పూర్తిగా ఆడ శిశువు కళ్ళు తెరచిన దగ్గర నుండి వృద్ధాప్యం వరకూ ఏడు ఛాప్టర్లుగా రాశాను. ఇందులో అన్ని వర్గాల స్త్రీల జీవితాల్నీ సంపూర్ణంగా చర్చించాననే అనుకుంటున్నాను. స్త్రీ జీవితంలోని అన్ని ఘట్టాల్నీ వాటి పూర్వాపరాల్నీ తెరిచి చూపటానికి ప్రయత్నించాను. అదేవిధంగాయుద్ధం ఒక గుండెకోతదీర్ఘకవిత సమకాలీన రాజకీయాలు, మతం, స్త్రీల జీవితాలలో కలిగించే కల్లోలాలను యుద్ధ నేపథ్యం మాతృహృదయ ప్రతిస్పందనగా రాశాను. ఇవి రెండూ నన్ను పూర్తిస్థాయి కవయిత్రిగా నిలిపాయని అనుకుంటున్నాను.

22.     స్త్రీవాద సాహిత్యం వచ్చినంతగా స్త్రీవాద సాహిత్య విమర్శ రాలేదన్న ఆరోపణ వినబడుతుంది. దానిపట్ల మీ అభిప్రాయం ఏమిటి?

          మనకి తెలుగులో విమర్శకులు తక్కువ. సాహిత్యాన్ని సంపూర్తిగా చదివి, అవగాహన చేసుకొని రాసే విమర్శకులు మరింత తక్కువ. చాలామంది రాసిన స్త్రీవాద విమర్శ వ్యాసాల్ని ఒక దగ్గర పెట్టి చూస్తే పునరుక్తి కనిపిస్తుంది. ఒరిజినల్ పుస్తకాలు అధ్యయనం చేసి, మూల్యాంకనం చేసుకొని, సారూప్యాలూ, సాదృశ్యాలు అవగాహన చేసుకొని రాసేంత ఓపిక, సావకాశం చాలామందికి లేదు. ఒక నాలుగు వ్యాసాలు పెట్టుకొని Cut, Paste చేసి తయారుచేసిన స్త్రీవాద వ్యాసాలే ఎక్కువగా ఉన్నాయి. విమర్శకులకి ప్రధానంగా కావలసినది అధ్యయనం. ఆ విధంగా అధ్యయనం చేయకుండా రాసిన విమర్శ వ్యాసాలు సమగ్రంగా ఉండవు.

23.     స్త్రీ సమానత్వం, స్త్రీ సాధికారతల సాధనకు ఈ రాజకీయాలు ఏమేరకు తోడ్పడతాయి?

            స్త్రీ సమానత్వ హక్కుల్నిగానీ, సాధికారతనుగాని సాధించుకోవాలనే లక్ష్యం ముందు స్త్రీలలో ఉండాలి. విభజించి పాలించాలనే దృక్పథం కలిగిన రాజకీయాలు తోడ్పడతాయని ఎలా అనుకుంటాం. అవకాశం ఉన్నంతవరకూ, లక్ష్య సాధనకు అవసరమైనంత వరకూ స్త్రీలు చదువుకోవాలి. తర్వాత సాహిత్యపఠనంకి ఏమాత్రమైన సమయం కేటాయించుకోగలిగితే సమకాలీన సమస్యల పట్ల అవగాహన కలుగుతే తమని తాము ఎలా మలచుకోవాలో తెలుస్తుంది. మార్పు మూలం నుండీ రావాలి. స్త్రీవాద దృక్పథంతో పనిచేసే కొన్ని సంస్థలు స్త్రీలని అనేక విషయాలలో జాగృతపరచటానికి పనిచేస్తున్నాయి.


ఈ సంచికలో...                     

Jul 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు