ఇంటర్వ్యూలు

(April,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సాహిత్యమన్నది ఒక పెద్ద కాన్వాస్ - జిల్లేళ్ళ బాలాజీ

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కథ, నవలా రచయిత, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ జిల్లేళ్ళ బాలాజీగారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీ వ్యక్తిగత జీవితం గురించి కొంచెం చెప్పండి?

శ్రీకాళహస్తిలో పుట్టానని, శనివారం పుట్టినందువల్ల మా కులదేవుడైన వేంకటేశ్వరస్వామి పేరుమీద బాలాజీ అని నాకు పేరు పెట్టారని మా తాతయ్య అప్పుడప్పుడూ చెబుతుండేవాడు. మా బంధువులందరూ తిరుత్తణిలో ఉంటారు కనుక అదే మా సొంతూరుగా భావిస్తున్నాను. మంగలి కులంలో పుట్టినందువల్ల ఆర్థిక స్తోమతలేక ఆరోజుల్లో మానాన్న ఎలాగో ఎస్సెస్సెల్సీ పూర్తిచేశాడు. ఉద్యోగం దొరక్క కులవృత్తి పై ఆధారపడి మా కుటుంబాన్ని పోషించేవాడు. చనిపోయిన వాళ్లు పోను చివరకు ఇద్దరు అక్కలూ, నేనూ మిగిలాం. అమ్మతో కలిసి మొత్తం అయిదుగుర్ని నాన్న ఒక్కడే పోషించాలంటే చాలా కష్టమయ్యేది. చివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎలాగో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు నాన్న. .

అప్పటి ఉమ్మడి తమిళనాడు రాష్ట్రం నుండి ఉద్యోగరీత్యా మేము చిత్తూరుకు మారవలసి వచ్చింది. కులవృత్తిని నమ్ముకుంటే ఎదగలేమని, మేము బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తేనే బాగా బ్రతగ్గలమని ఎంతో దూరాలోచన చేసి మా నాన్న మమ్మల్ని చదివించాడు. పెద్దక్క పి.యు.సి. వరకూ చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం సంపాదించింది. కానీ నేను మాత్రం చదువులో కొంత వెనకబడి ఉండటంతో ఎలాగో బి.కాం డిగ్రీని పూర్తిచేశాను. కానీ నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని మాత్రం సంపాదించలేకపోయాను..

ఖాళీగా ఉండటంతో గ్రంథాలయంలో గంటలు గంటలు గడిపేవాణ్ణి. ఏది పడితే అది చదివేవాణ్ణి. ఆ ప్రభావంతో నేనూ కథలు రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రాయటం మొదలు పెట్టి అడపా దడపా కథలు రాస్తుండేవాణ్ణి.

కానీ అవి జాగ్రత్తగా నాకే వెనక్కి తిరిగొచ్చేవి. 1984లో మూడు రోజుల వ్యవధిలో నా మొట్టమొదటి కథ, కవిత ప్రచురితమయ్యా యి. అప్పటినుండి ఏదో ఒకటీ అరా కధలు ప్రచురితమవుతుండేవి. నిరుద్యోగిగా అదొక్కటే నాకు ఆనందాన్నిచ్చే విషయమైంది.

బతకలేక బడిపంతులైనట్టు అన్న సామెత నా విషయంలోనూ నిజమైంది. 1993న మరోదారి తెలియక రెండువందల యాభై రూపాయల జీతానికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నా జీవితాన్ని ప్రారంభించాను. 1వ తరగతి నుండి మొదలు పెట్టి మెల్లమెల్లగా పై తరగతులకు పాఠాలు చెప్పే అవశాకం కల్పించారు. ఆ క్రమంలో నాకు బి.ఇడి. పట్టా లేకపోవటంతో కనీసం ఎమ్మే అయినా ఉంటేకానీ హైస్కూలుకు చెప్పే అవకాశం రాదని తెలుసుకున్నాను. కనుక ఎలాగైనా పిజి పూర్తి చేయాలనుకుని, కఠినమైన గ్రూపులు కాక సులభంగా ఉంటుంది కదాని ఎమ్మే తెలుగు కరస్పాండెన్స్ కోర్సులో చేరాను.

ఆ రెండేళ్లలో భాషాశాస్త్రం, వ్యాకరణంతో పాటుగా ప్రాచీన, ఆధునిక సాహిత్య సంబంధ పాఠాలు కూడా చదివే అవకాశం కలిగింది. ఆ రకంగా నాకు తెలుగుభాష పట్లా, తెలుగు సాహిత్యం పట్లా మరింత మక్కువా, ఇష్టమూ ఏర్పడ్డాయి. సాహిత్యం పై అభిరుచిని మరింత పెంచుకునేందుకు వీలు చిక్కింది.

మంచి ఉద్యోగం లేక జీవితంలో విసిగి వేసారిపోయి, ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి వివాహమే వద్దనుకున్న నేను మా నాన్న మరణానంతరం 1995లో నా 35వ ఏట వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత నా సంసారాన్ని తిరుపతికి మార్చవలసి వచ్చింది. ప్రారంభంలో ఇద్దరమూ ఉపాధ్యాయులుగా కొంతకాలం పనిచేశాం.

పిల్లలు పుట్టుకురావటంతో ఆమె గృహిణిగా ఉండిపోవలసి వచ్చింది. ప్రస్తుతం నేనొక ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ 10వ తరగతికి కూడా పాఠాలు చెప్పే అవకాశాన్ని దక్కించుకున్నాను. నాకిద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి బి.ఫార్మశీ పూర్తిచేసింది. చిన్నమ్మాయి బయో టెక్నాలజీ డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతోంది.

2.         మిమ్మల్ని ప్రభావితం చేసిన సాహిత్యం గురించి తెల్పండి?

ప్రారంభంలో ఒక పద్ధతీ పాడు లేకుండా ఏది పడితే అది చదివాను. ఏ ఒక్క గొప్ప రచయిత సాహిత్యాన్ని నేను పూర్తిగా చదవలేదు. అయితే ఆనాడు పత్రికల్లో సీరియల్స్ గా వచ్చేవాటిల్లో నేను ఇష్టపడి చదివింది మాత్రం యండమూరినీ, మల్లాదినీ! అలాగే అప్పటి వారి సమకాలీన రచయితలైన కొమ్మనాపల్లి గణపతిరావు, గండికోట బ్రహ్మాజీరావు, కొమ్మూరి వేణుగోపాలరావ్, లల్లాదేవి, మొ!! వాళ్లు ఏ సీరియల్ రాసినా అప్పటి ప్రధాన పత్రికల్లో వాటిని చదివాను.

క్రమంగా నేను రాసిన రచనలు పత్రికలలో అడపా దడపా ప్రచురితమవుతున్నప్పుడు నామిని, కేశవరెడ్డి గార్లను బాగా ఇష్టపడ్డాను. వాళ్ల రచనలు నన్ను అమితంగా ఆకర్షించాయి. వాటిని నేనొక కథా రచయితగా కాక ఒక మామూలు పాఠకుడిగానే వాళ్లను అభిమానించాను. అలాగే చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బాలభారతం వంటి పుస్తకాలు విరివిగా చదివాను. బుజ్జాయి బొమ్మల కథలంటే ఎంతిష్టమో చెప్పలేను. అలాగే రష్యన్ అనువాద కథలంటే కూడా ఇష్టంగా చదివాను. ఆ పుస్తకాలు అప్పట్లో ఎంతో నాణ్యతగా ఉండేవి. అవి నాకు చాలా ఇష్టం.

కోడూరి కౌసల్యాదేవి, ముప్పాళ రంగనాయకమ్మ, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి వంటి రచయిత్రుల నవలలు సీరియల్ గా వచ్చిన వాటిని మానాన్న బౌండుచేసి భద్రపరిచేవారు. ఆ పుస్తకాలను ఎన్ని వేలసార్లు తిరగేసి చూసుకుని చదివేవాడ్లో చెప్పలేను.

3.         ఏ పరిస్థితులు మీరు అనువాదకుడిగా మారటానికి తోడ్పడ్డాయి?

నేను తెలుగుణే. నా మాతృభాష తెలుగే. మా బంధువులందరూ తిరుత్తణిలో ఉండటం మూలాన, సెలవుల్లో చిత్తూరు నుండి తిరుత్తణికి వెళ్లి బంధువులతో గడపాల్సి వచ్చేది. అప్పుడు ఆ ఊరి వాళ్లతో తమిళంలో మాట్లాడవలసి వచ్చేది. అలా మెల్లమెల్లగా తమిళం మాట్లాడ్డం అలవాటు చేసుకున్నాను. అంతేకాక ఎస్ఎఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జయశంకర్ వంటి హీరోల సినిమాలను బాగా చూసేవాణ్ణి. దాంతో తమిళం బాగా అర్థం కాసాగింది. అలాగే దినత్తంది, దినమలర్, దినకరన్ వంటి వార్తాపత్రికలు, ఆనంద విగడన్, రాణి, కుముదం, కల్కి, కుంగుమం వంటి వారపత్రికలను లైబ్రరీకి వెళ్లినపుడు కూడి కూడి చదువుతూ అర్థం చేసుకునేవాణ్ణి.

ఒక విషయం గమనించాలి - అప్పట్లో సినిమాలు, పత్రికలు, రేడియో ఇవే మాకు కాలక్షేపాలు. ఇప్పటిలా టి.వి.లు, మొబైల్ ఫోన్లు, అంతర్జాలం, ఫేస్ బుక్కు యూట్యూబు, కంప్యూటర్లు, పార్కులు, పబ్బులు వంటివేవీ లేవు. అసలు మా ఇంట్లో టివి కూడా ఎంతోకాలం తర్వాతే వచ్చి చేరింది. అలా నేను తమిళభాషను బాగానే నేర్చుకున్నాను. నేను తమిళభాషను ఏ బక్లోనూ చదువుకోలేదు, ఏ గురువుగారి దగ్గరా తర్ఫీదు తీసుకోలేదు. అది కాలానుగుణంగా నాకు ఒంటబట్టింది. అంతే!

ఇక మా పెద్దక్క చిత్తూరులో ఉద్యోగం చేస్తున్నా, ఆమె అత్తగారిల్లు తిరుత్తణే కావటంతో ఎక్కువ రోజులు అక్కడికి వెళ్లవలసి వచ్చేది. దాంతో ఆమె తమిళ నవలల్ని బాగా చదువుతుండేది. ముఖ్యంగా డిటెక్టివ్ రచయిత రాజేష్ కుమార్ నవలల్ని భోజనం చేస్తున్నప్పుడు కూడా వదిలి పెట్టకుండా చదువుతుండేది. అలా ఆమె చదివిన డిటెక్టివ్, సస్పెన్స్ నవలల్ని మాకు చెబుతుండేది. నేను అప్పుడప్పుడే కథలు రాస్తుండటంతో నన్నూ అలాంటి కథల్ని రాయమని కోరేది. కానీ నేను ఆ ప్రయత్నం చెయ్యలేదు. ప్రారంభంలోనే నాకు అలాంటి కథల్ని రాయాలనిపించలేదు. ఆ విషయాన్ని పెడ చెవిన పెట్టాను.

కానీ మా అక్క నన్ను వదిలి పెట్టక "పోనీ ఈ నవలనే నువ్వు తెలుగులోకి రాయి...అంటూ సలహా ఇచ్చింది. సరే, ఇదేదో బాగుంది. మనం కష్టపడి ఆలోచించి రాయాల్సిన పన్లేదు, రెడీమేడ్ గా ఉన్నదాన్ని తెలుగులోకి రాస్తే సరిపోతుంది. పైగా తమిళభాష మనకు ఎటూ వచ్చు. అనుకొని మొదట ఒక డిటెక్టివ్ నవలను తెలుగులోకి అనువదించాను. అది చతురలో ప్రచురితమైంది. అలా నేను అనువాదకుడిగా మారాను. ప్రారంభంలో కొన్ని డిటెక్టివ్ నవలలు అనువదించాను.

 

4.         మీ రచనల గురించి చెప్పండి?

ముందే చెప్పానుగా 1984లో నా మొదటి కథ ప్రచురితమైందని. ప్రారంభంలో నా కథలు నాకంత గొప్ప పేరునేమీ తెచ్చి పెట్టలేదు. అవి పత్రికలలో ప్రచురితమవుతున్నాయి అంతే! ఎప్పుడైతే నేను కాపురాన్ని తిరుపతికి మార్చానో ఆ మార్పు నా రచనా సాహిత్యంపై కూడా మలుపు తిప్పిందనే చెప్పాలి. కొందరు పేరున్న స్థానిక రచయితలతో సాన్నిహిత్యం, వాళ్ల రచనలు నన్ను సీరియస్ సాహిత్యం వైపు మళ్లేలా చేశాయి. కాలక్షేపం కథలు కాక, మన జీవితానుభవాలు, మన సంఘర్షణలు, మన పోరాటం, ఇత్యాదివన్నీ కథలుగా మలిస్తే ప్రయోజనం ఉంటుందనీ, అవి నలుగురికీ చేరుతాయనీ, వాటిని గుర్తుంచుకుంటారనీ, అవి నాలుగు కాలాలపాటు నిలుస్తాయనీ గ్రహించాను.

విద్యార్థిగా ఉన్నప్పుడు మంగలి కులంలో పుట్టినందున నేనెంతో అవమానానికీ, ఆత్మన్యూనతా భావానికి గురయ్యాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగం రాక ఒక నిరుద్యోగిగా నేనెంతో సంఘర్షణను అనుభవించాను. నేనెంతో కుమిలిపోయేవాణ్ణి. అలా జీవితంలో నేను పడ్డ ఆవేదనను, వివిధ ఘట్టాలను కథలుగా మలిచే ప్రయత్నం చేశాను. కొన్ని వాస్తవాలు, కొన్ని కల్పితాలు. అయినా యథార్థ జీవిత కథలుగా రాసే ప్రయత్నం చేశాను. అలా రాసినవే సిక్కెంటిక, కొలువు, వొంతు, జ్వలనం, సజీవం, వాడు, తమ్ముడి మరణం, తోబుట్టువు, బూబూ, పంజా, రాచబాట, గుండెలేని మనిషి, ముఖాముఖం, ఆప్తహస్తం, అమ్మ డైరీ ఇత్యాది కథలు. అలా మొత్తం 200కు పైగా రాసిన డైరెక్టు కథలలో 13 కథలకు బహుమతులను కూడా అందుకున్నాను.

కథలు రాసుకుంటూ పోతున్నానే కానీ వాటిని పుస్తక రూపంలో తీసుకురాకపోతే ప్రయోజనం లేదని మిత్రులు సెలవిచ్చారు. ఒక ప్రైవేటు స్కూలు టీచరునైన నేను పాతికవేలకు పైగా ఖర్చు పెట్టి కథల సంపుటిని ఎలా తీసుకురాను? కష్టసాధ్యమైంది. ప్రారంభంలో కొంత బాలసాహిత్యం రాశాను. వాటిని విశాలాంధ్రకు పంపితే 'మాట్లాడే పక్షి' పేరుతో 2011లో ప్రచురించారు. అదే నా మొదటి కథల పుస్తకం. ఆ తర్వాత మేం ముగ్గురు స్నేహితులం కలిసి (నేనూ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రమణ్యం) భాగస్వాములై మా ముగ్గురు కథలతో 'మై 'శ్రీ' వనం' అన్న పేరుతో వినూత్నమైన ఒక కథల సంపుటిని తీసుకొచ్చాం. అయినా తృప్తి కలగలేదు నాకు. బాలసాహిత్యం కాక నా కథలతోటే ఒక పుస్తకాన్ని తేవాలని ఎంతో ప్రయత్నించి చివరకు 2013లో నా మొదటి కథల సంపుటిని (సిక్కెంటిక) అతి కష్టమ్మీద తీసుకురాగలిగాను. (దీనికి కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం(చిత్తూరు), గురజాడ కథా పురస్కారం(కడప) పొందాను). దీని తర్వాత మరో కథా సంపుటి(వొంతు) 2016లో తీసుకొచ్చాను. కాస్త మార్పుగా ఉండాలని గత సంవత్సరం నా తర్వాతి కథల సంపుటిని (ఉండు నాయనా దిష్టి తీస్తా.... హాస్య,సరసమైన కథలు) తీసుకొచ్చాను.

5.         ఇటీవల ఏ భాషల నుండి ఎక్కువ సాహిత్యం తెలుగులోకి అనువాదం అవుతున్నది?

నిజానికి అనువాదం ఒక క్లిష్టమైన ప్రక్రియ. దాన్ని అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. మొదట్లో నేను విరివిగా చేస్తున్న అనువాదాలను చూసి... "ఆ ఏముందీ, అనువాదం అంటే చూసి కాపీ కొట్టటమేగా...అన్న ఎవరివో మాటలు విన్నప్పుడు ఎంత బాధపడ్డానో చెప్పలేను! అనువాదం గురించి ఒక మహానుభావుడేమన్నాడంటే 'ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ లేషన్... ఇట్స్ ఎ ట్రాన్స్ క్రియేషన్...' ఎంత చక్కటి భావన. మూల రచయిత భావాలను పట్టుకొని రాయటం అంత సులభం కాదు. మూలభాషపై పట్టు అనువాదానికి మొదటి మెట్టు. మూల భాష రాకుండా అనువాదం చేయటం అపచారం. నాకు తమిళం వచ్చు కనుకనే నేను తమిళం నుండి రచనలను అనువదిస్తున్నాను. లేకపోయుంటే చేసేవాణ్ణి కాను.

కానీ ఇవ్వాళ ప్రపంచం నలుమూలలున్న భాషల నుండీ అనువాదం అవుతున్నది. వినటానికి బాగుంది. కానీ.... నేనొక విషయం చెబుతాను. నాకు తెలిసిన ఒక అనువాదకుడు హంగేరీ, రష్యన్, లాటిన్, కాశ్మీరీ, తుళు అంటూ వివిధ భాషల నుండి అనువాదాలు ఎడాపెడా చేసేస్తున్నాడు. ఒకసారి అతను ఎదురుపడ్డప్పుడు...అబ్బ ఎన్ని భాషలు నీకొచ్చు!అన్నాను.నాకా? వచ్చా, పాడా. ఇంగ్లీషులో నుండి చదివి రాసేస్తున్నాను.అన్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి. మూల భాషలో నుండి ఇంగ్లీషులోకి వచ్చేటప్పటికి 10 శాతం, ఇంగ్లీషు నుండి తెలుగులోకి వచ్చేసరికి మరో 10 శాతం పలచబడితే మనకందేది 80 శాతమే. అదే మూలభాష వచ్చి ఉన్నట్టయితే దాన్ని వందకు వంద శాతమూ అందించ వచ్చుగా.

ఏది ఏమైనా ప్రపంచ భాషల నుండి అనువాదాలు వస్తున్నాయి కానీ, అవి అంత ప్రయోజనం లేవన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వాళ్ల జీవన విధానాలు, పద్ధతులు, సంస్కృతీ సంప్రదాయాలు వేరు. వాటిని గురించి తెలుసుకోవచ్చును అంతే! ప్రయోజనం అంతగా ఉండదు. కానీ అదే మన భారతీయ భాషా కథల అనువాదం మనకెంతో మేలును చేస్తాయి. భారతీయ భాషల సాహిత్యం మనకు అవసరం కూడానూ.

అనువాదకుడిగా నామీద ఇతర తెలుగు రచయితల ఫిర్యాదు ఒకటుంది. అదేంటంటే 'అటు నుండి ఇటు తెలుగులోకి చేస్తున్నావు కదా, అలాగే ఇటు నుండి కూడా అటు చెయ్యి' అన్నారు. మొదట ప్రయత్నం చేశాను. కానీ అది ఎంతో పేలవంగా తయారైంది. కారణం తమిళం కాక తెలుగు నా మాతృభాష కావటం! తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు ఒక్కో పదానికి ఎన్నో పర్యాయపదాలు, సమానార్థక పదాలు ఊటలా ఉబికి వస్తాయి. కానీ ఇటు నుండి అటు తమిళంలోకి రాయాలనుకున్నప్పుడు నేను తమిళ పదాలకోసం బాగా తడుముకోవలసి వచ్చేది. అందిన పదాలు వాడినప్పుడు అవి పేలవమైన రచనగా బయటికొచ్చేది. పైగా నేను తమిళం విని అర్థంచేసుకోగలను, మాట్లాడగలను, చదవగలను కానీ లిపి అంత బాగా రాయలేను. ఈ కారణాలచేత నేను తెలుగునుండి తమిళంలోకి అనువాదం చెయ్యకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. వాళ్లు నా మీద కినుక వహించటానికి అదే అసలు కారణం. అంతెందుకు నా కథల్ని నేనే తమిళంలోకి తీసుకెళ్లలేదుగా. అది నాకు తెలియని పని. దాన్ని మరొకరు చెయ్యాల్సిందే. నా పని తమిళం నుండి తెలుగులోకి అనువదించటమే!

నాకు తెలిసీ ఇంగ్లీషు భాష నుండే ఎక్కువమంది తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆ తర్వాత హిందీనే! దక్షిణాది భాషలు తీసుకున్నట్టయితే కన్నడ భాషా సాహిత్యం తర్వాతే తమిళ భాషా సాహిత్యం తెలుగులోకి వస్తోందని అనుకుంటున్నాను.

6.         ఇటీవల తెలుగు నుండి ఇతర భాషలలోకి అనువాదం అయ్యే సాహిత్యం ఏ మేరకు ఉంది?

ఈ విషయంలో చాలా చాలా తక్కువనే చెప్పాలి. అసలు ఈ ప్రక్రియను ఎవరు చేపట్టాలి. ప్రభుత్వమా? సాహిత్య సంస్థలా? అకాడెమీలా? పత్రికలా? సాహిత్యా భిమానులా? ఎవరు? ఎవరు మటుకు వాళ్లు ఇతరులు చేస్తారులే అని మిన్నకుండిపోతున్నారు. అసలు ఈ విషయంలో ఒక విజన్ అంటూ ఉన్నదా అన్నది కూడా అనుమానమే. ముందుగా మన విలువైన సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చెయ్యించాలి. అటు తర్వాత దాన్ని వివిధ భాషల్లోకి ఆయా భాషల అనువాదకుల చేత రాయించే ప్రయత్నం జరగాలి. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఖర్చుతో కూడుకున్నది. అనువాదకులను ప్రోత్సహించాలి. వాళ్లకు చక్కటి పారితోషికం ఇచ్చి రాయించే ప్రయత్నం జరగాలి. డబ్బుతో ముడిపడ్డ వ్యవహారం కనుక ప్రభుత్వం అకాడెమీల ద్వారా చేయించాలి. ప్రస్తుతం మన ప్రభుత్వాలు సాహిత్యం పై అంతటి శ్రద్ధాసక్తుల్ని కనబరిచే పరిస్థితుల్లో లేవు. భవిష్యత్తులో చేస్తాయని ఆశిద్దాం.

ఎప్పుడైతే మన తెలుగు సాహిత్యం ఇంగ్లీషులోకి తర్జుమా అవుతుందో అప్పుడది అంతర్జాతీయ భాషల్లోకి వెళ్లే మార్గమూ సుగమమవుతుంది. ప్రాంతీయ భాషల్లోనూ వచ్చే అవకాశం ఉంది.

7.         ద్రావిడ విశ్వవిద్యాలయం అనువాద సాహిత్య రంగంలో చేస్తున్న కృషిని ఎలా చూడాలి?

ప్రస్తుతం ఆ విశ్వవిద్యాలయం అనువాద సాహిత్య రంగంలో ఏం చేస్తోందో నాకు తెలియదు. తెలియని విషయాలు మాట్లాడ్డం తప్పు. కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం.

కానీ ఆ విషయంలో కొంతలో కొంత సాహిత్య అకాడెమీ చేస్తున్న సేవలు మేలనిపిస్తోంది. సాహిత్య అకాడమీ 2018లో మూడు రోజులపాటు సేలంలో అనువాదం పై ఒక వ షాపు ఏరాటుచేసింది. ముఖ్యంగా తమిళమూ, తెలుగులో అనువాదం చేస్తున్న ఒక పదిమంది అనువాదకులను పిలిపించి వాళ్లచేత తమిళంలోనుండి అలాగే తెలుగులో నుండి కొన్ని గొప్ప కథలను అనువదింపచేసే కార్యక్రమం చేపట్టింది. అందులో నేనూ పాల్గొన్నాను. ఆ మూడు రోజుల్లో ఒక్కొక్కరు 5 కథలను అనువదించాం. ఎంతో ఉపయోగకరమైన వర్క్ షాప్ అది. అందుకు సేలంలోని పెరియార్ యూనివర్సిటీ ఎంతగానో సహకరించింది. ముఖ్యంగా తమిళ డిపార్టుమెంటు మా కందించిన తోడ్పాటు జీవితాంతం మరువలేనిది.

8.         అనువాద సాహిత్యం గతంతో పోలిస్తే ఏ విధంగా ఉంది?

ఏం చెప్పమంటారు? అసలు అనువాద సాహిత్యాన్ని ఎవరు ప్రోత్సహించాలి? ముందుగా పత్రికలు. ఔనా! మరి అన్ని పత్రికలూ అనువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయా? తెలుగులో టాప్ త్రీలో ఉన్న మేగజైన్లను ఒకసారి గమనించండి. అందులో అనువాద రచనలు ఎన్నుంటాయి? మీకస్సలు కనిపించదు. ఎందుకో వాళ్లకు అనువాదాలంటే చీదర. తేళ్లు జెర్రులూ పాకుతున్నట్టు ఉంటాయేమో? ఏదో చతుర, విపుల లాంటి మేగజైన్ల వల్ల నాలాంటివాళ్లు ఇంకా అనువాదాలు చేస్తున్నాము కానీ, లేకపోతే ఏనాడో మానేసేవాళ్లం. అసలు అనువాదకులు ఎక్కడున్నారండీ. చాలామటుకు తగ్గిపోయారు. ఇంగ్లీషులో నుండి అనువదించేవాళ్లను పక్కన పెట్టండి, ప్రాంతీయ భాషల్లోనుండి అనువదించేవాళ్లు ఎంతమంది ఉన్నారో చూడండి. ఉన్న ఒకళ్లిద్దరు అనువాదకులనైనా ఉపయోగించుకుంటేగా! అసలు ఎక్కడ చావుదెబ్బ తీస్తున్నారంటే, ఎంతో కష్టపడి అనువదించిన రచనలను వారపత్రికల్లో వెయ్యరు. దినపత్రికలే గతి. అదీ ఒకటో రెండో ఉన్నాయి, అంతే!

9.         ప్రస్తుతం అనువాద సాహిత్యానికి కాలం చెల్లిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మీరు ఏమనుకుంటున్నారు?

అంతేగా మరి! అనువాదమే కాదు, అసలు డైరెక్టుగా రాసిన కథా, నవలా సాహిత్యాన్ని మాత్రం ఏ అందలం ఎక్కిస్తున్నారనీ. వాటి పరిస్థితీ అంతే! ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఎన్ని పత్రికలు ఉండేవండి. అన్ని పత్రికలనూ చదివేవాళ్లం. మాకు ఇంకే కాలక్షేపాలూ లేవు. పుస్తక పఠనమే నన్ను రచయితను చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

ఇప్పుడు... మొబైళ్లు అందుబాటులోకి వచ్చాక ఈ కాలం యువతరానికి అసలు ఆ అలవాటు ఏర్పడిందా? ఎంత సేపూ అంతర్జాలాలు, యూట్యూబులు, ఫేస్ బుక్కులూ, వీడియోలు, చాటింగ్లూ ఇలాంటివి ఏడిస్తే ఇంకెక్కడినించి పఠనానికి అవకాశం ఉంటుంది చెప్పండి. ప్రభుత్వాలు బలవంతంగానైనా వీటిని నియత్రించిన నాడే యువతరం పుస్తకాలకు అలవాటు పడతారు. లేదంటే ఇంతే! ఇంటర్నెట్ లో ఫ్రీగా పుస్తకాలు దొరుకుతాయంట. మొబైళ్లలో డౌన్ లోడ్ చేసుకుని చదువుకోవచ్చట. యువతరమంతా అలాగే చదువుకుంటున్నారట. ఏంటండీ ఇది? పుస్తకం హస్త భూషణం. హాయిగా కుర్చీలో కూర్చునో, ఈజీ చైర్లో వాలో, బోర్లాపడుకునో పుస్తకాన్ని చదువుతుంటే వచ్చే ఆనందం ముందు ఇవి ఎంత?

ఏదైనా చదివే పాఠకులు ఉంటేనేనండీ సాహిత్యం బ్రతకటం. రాసీ రాసీ అచ్చేసి ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం?

10.       రాయలసీమ సాహిత్య ప్రత్యేకత ఏమిటి?

ఇదో పెద్ద టాపిక్. దీనిమీద ఒక పెద్ద గ్రంధం రాయొచ్చు. సరే, అసలు రాయలసీమ అంటేనే సాగునీరు, తాగునీరు, దుర్భిక్షం, ముఠా కక్షలు, ఆత్మహత్యలు, హత్యా రాజకీయాలు, వలసలు, వివక్షలు మొదలైనవన్నీ మన కళ్లముందు కదలాడుతాయి. ఈ ప్రాంతంలోని రచయితలకు చేదు అనుభవాలు, విషాద దృశ్యాలు తప్పనిసరి. ఇవే ఈ ప్రాంత కథలకు ముడిసరుకులు. అందుకే ఇతర ప్రాంత ప్రజలకు ఇక్కడి కథలు బరువుగానూ, బాధగానూ, వేదనగానూ కనిపిస్తాయి.ఈ ప్రాంత కథా రచయితలలో ఆద్యుడిగా చెప్పబడే కె.సభా రచనల్లో సామాన్య ప్రజలే కనిపిస్తారు. వాళ్ల కష్టాలు కన్నీళ్లు, అలాగే సన్నకారు రైతుల వ్యధలు వేదనలు ఆయన కథల నిండా కనిపిస్తాయి.

రాయలసీమకే ఒక గుర్తింపు తెచ్చిన రచయిత మధురాంతకం రాజారాం. ఈయన కథల నిండుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాల కోపతాపాలు, ఆశ నిరాశలు, అసూయాద్వేషాలు, ఆదర్శాలు, త్యాగాలు ఇవన్నీ విభిన్న కోణాలలో చూపించటం జరిగింది. ఇక ప్రాంతీయ జీవిత చిత్రణకు పెద్దపీట వేసిన రచయిత కేతు విశ్వనాధరెడ్డి. ఈయన రచనల్లో స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన రాయలసీమ పరిణామాలు, జీవితాలు అద్దం పడతాయి. అలాగే సింగమనేని నారాయణ రైతు జీవితాలను తన కథల నిండుగా చెప్పారు. మన కళ్లముందరే ఛిద్రమైపోయే పల్లెలు గ్రామ ప్రజల ఆవేదనలను చూపించారు. వీరేకాక పులికంటి కృష్ణారెడ్డి రాయలసీమ మాండలికాన్ని సొగసుగా కథల్లో పొందుపరిచిన రచయిత. అలాగే కలువకొలను సదానంద, రాసాని, స్వామి, దేవపుత్ర, మధురాంతకం నరేంద్ర, శాంతినారాయణ, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, గోపిని కరుణాకర్, పలమనేరు బాలాజీ, సుంకోజి దేవేంద్రాచారి వంటి కథకుల కథల్లో రాయలసీమ వాసన గుభాళిస్తుంటుంది.

ఇక కథలుకాని కథలు రాసినా అందులోనూ రాయలసీమ ప్రాంత జీవితాలను అద్భుతంగా మలిచినవారు ఇద్దరున్నారు. ఒకరు పెన్నేటి కథలు రాసిన పి.రామకృష్ణారెడ్డి గారైతే మరొకరు పచ్చనాకు సాక్షిగా, మిట్టూరోడి కతల రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాయలసీమ ప్రత్యేకత చేదబావి చేంతాడంత ఉంటుంది.

11.       మీ సాహిత్య వ్యక్తిత్వము రూపుదిద్దుకున్న విధానాన్ని వివరించండి?

చిన్నప్పుడు మా నాన్న ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి వంటి పత్రికలను ఇంటికే వేయించుకునేవారు. వాటిని మా అక్కలు, నేను తలా ఒక పుస్తకాన్ని చేత పట్టుకొని ఒక్కో చోట కూర్చుని చదువుకునేవాళ్లం. అంతేకాక వాటిలో వచ్చే సీరియళ్లను బౌండు చేయించి భద్రపరిచేవాడు నాన్న. ఆయన చనిపోయాక ఆ అలవాటు నాకొచ్చింది. నేను కొనసాగించాను. అలా పుస్తక పఠనం అన్నది మా కుటుంబంలో ఒక అలవాటుగా మారిపోయింది.

దాని ప్రభావమేమో నేను డిగ్రీలో ఉండగా నాకూ కథలు రాయాలన్న బుద్ధి పుట్టింది. అడపాదడపా రాస్తూ వచ్చాను. కానీ నామిని గారి పచ్చనాకు సాక్షిగా, మిట్టూరోడి కతలు, సిన్నబ్బ కతలు పత్రికలో సీరియల్ గా వస్తున్న రోజుల్లో వాటిని నేను మా కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని చదివి వినిపించినపుడు నేను పొందిన అనుభూతి, ఆనందం అపారం. అలాగే కేశవరెడ్డి గారి అతడు అడివిని జయించాడు, చివరి గుడిసె, సిటీ బ్యూటిఫుల్, రాముడుండాడు రాజ్యం ఉండాది వంటి నవలలు చదివాక కథలను సీరియస్ గా రాయాలన్న దృక్పథం కలిగింది. అంతేకాక స్థానిక రచయితల సాన్నిహిత్యం నన్ను పదును పెట్టాయని అనుకుంటున్నాను.

దాని ప్రభావంతో అనుకుంటా 'సజీవం' అన్న కథ నుండి జీవితపు లోతుల్ని తడమటం మొదలు పెట్టాను. ఆ కథకు ఈనాడు బహుమతిని కూడా ఇచ్చింది. ఆ వరుసలోనే 'సిక్కెంటిక' కథను రాస్తే- వందేళ్ళ మన తెలుగు సాహిత్యంలో తల వెంట్రుకలపైన రాసిన మొదటి కథ అని ప్రశంసించారు. ఆ కథకూ బహుమతి వచ్చింది. అలాగే 'కొలువు, వొంతు, కథలను నేను మాత్రమే రాయగలనని చెప్పారు. కావచ్చు, ఎందుకంటే ఆ జీవితాన్ని అనుభవించిన వాణ్ణి కనుక. అలాగే రాచబాట, జ్వలనం, వాడు, తమ్ముడి మరణం, అమ్మడైరీ, బూబూ, ఆప్తహస్తం వంటి ఎన్నో కథలు నాకు పేరును తెచ్చిపెట్టాయి.

ఇక అనువాదంలోనూ మార్పు చేశాను. ప్రారంభంలో కొన్ని డిటెక్టివ్ నవలల్ని అనువదించిన నేను, మిత్రులు మధురాంతకం నరేంద్రగారి సలహాతో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ జయకాంతన్ నవలను అనువదించే అవకాశం కలిగింది. నేను మొదట అనువదించిన ఆయన నవల 'కల్యాణి వెడ్స్ దివాకర్' పేరుతో ఆంధ్రజ్యోతి డైలీలో సీరియల్ గా రావటమే కాక, అది నాకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని సైతం అందుకునేలా చేసింది. అప్పుడు ఆయన నవలల్ని మరింత విరివిగా చదవసాగాను. ఆయన నవలల్లోని మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలు, మానవీయత ఉట్టి పడే కథలు, మనిషి మనిషిగా బ్రతకగలిగే కథనాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆలోచింపచేశాయి. వాటిని అనువదించే క్రమంలో ఇప్పటివరకూ నేను 'ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం, ఎదురు చూపులు, గతించిన కాలాలు, ప్యారిస్కు పో, గంగ ఎక్కడికెళుతోంది' మొదలైన నవలల్ని తర్జుమా చేశాను. ఆయన నవలలు నన్ను పూర్తిగా మార్చివేశాయి. ఏ రచన చేసినా గాఢంగా, లోతుగా, ఆలోచనాత్మకంగా రాయాలన్న పాఠాన్ని నేర్పాయి.

అలా నేను ఇప్పటి వరకూ మొత్తం వంద రచనలకు పైగా తెలుగులోకి అనువదించాను. అవన్నీ కూడా నన్ను ఒక చక్కటి అనువాద రచయితగా గుర్తింపు తెచ్చుకోవటానికి ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను.

12.       సాహిత్యంలో భావజాలాలకు స్థానం ఉంటుందా? విభిన్న భావజాలాలు అనువాద సాహిత్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి?

సాహిత్యమన్నది ఒక పెద్ద కాన్వాస్. దేన్నైనా మనం చిత్రీకరించుకోవచ్చు. మంచినైనా సరే, చెడునైనా సరే! ఒక ఆలోచనను, ఐడియాలజీని, భావజాలాన్ని కథ ద్వారా వ్యక్తీకరిస్తున్నప్పుడు అది అందరికీ ఆంగీకారయోగ్యం కావాలన్న రూలేమీ లేదు. ఎవరైతే సదరు భావజాలానికి స్పందిస్తారో, ఇష్టపడతారో, ఆకర్షితులవుతారో వాళ్లు ఆ భావజాలాన్ని చదువుతారు, అనుసరిస్తారు. తక్కినవాళ్లు దాన్ని ఇష్టపడక వదిలేస్తారు. ఇది సర్వసాధారణం. అంతమాత్రాన సాహిత్యంలో అలాంటి వాటికి స్థానం ఉండకూడదు అని ఎవరైనా అన్నారంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. కనీసం ఇలాంటి భావజాలం ఒకటుంది, ఇది అంగీకారమూ అనుసరణీయమూ కాదు అని చెప్పటానికైనా అది ఉండాలిగా. కాకపోతే అలాంటి భావజాలాలు సాహిత్యంలో ఏ స్థానాన్ని ఆక్రమిస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. వాటికి అసలు సాహిత్యంలో స్థానం ఉంటుందో ఉండదో కూడా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. మొదట భావజాలంగా ప్రారంభమయ్యేవి చివరకు వాదాలుగా కూడా పరిణామం చెందవచ్చు. మరి ఇవ్వాళ సాహిత్యంలో అనేక వాదాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయిగా. దీన్నేమనాలి? కనుక ఎవరి భావజాలం వాళ్లది. ఎవరి వాదాలు వాళ్లవి. ఈ విషయంలో అనువాదానికి మినహాయింపు ఏమీ లేదు. ఎవరికి ఇష్టమైనవి వాళ్లు అనువదిస్తారు. అంతే!

13.       అనువాద సాహిత్యానికి సంబంధించి సాహిత్య సంస్థల, పాలక వర్గాల కర్తవ్యం ఏమిటి?

ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్లు చెబితేనే బాగుంటుంది. ఇంకొకళ్లు చెబితే బాగుండదేమో? ఈ విషయంలో నా ఆలోచనను మాత్రం చెబుతాను. ఎందుకోగానీ మనం మొదటినుండి- సాహిత్యం నుండి అనువాద సాహిత్యాన్ని వేరుచేసి చూస్తున్నాం. అది అంత మంచిది కాదు. ఏదైనా సాహిత్యమే. దానిపట్ల చిన్నచూపు అవసరం లేదు. ఒక్కసారి మన తెలుగు సాహిత్యం ప్రారంభాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మనం పంచమ వేదంగా పిలుచుకుంటున్న మహాభారత రచనను 'ఆంద్రీకరణం' అని చెప్పుకున్నాం కదా. అంటే అది స్వేచ్ఛానువాదం కాదా? అందులో అనువాదం లేదా? మహాభారత రచనలోనే అనువాదం మిళితమై ఉన్నప్పుడు... ఇప్పుడు దాన్ని వేరుగా చూడ్డమెందుకు?

మీ ప్రశ్నలో- 'అసలు సాహిత్యానికి' ఏ ఇబ్బందీ లేదనీ, అనువాద సాహిత్యానికే ప్రమాదం వచ్చి పడిందన్న ధ్వని వినిపిస్తోంది. చూడండీ, అసలు సాహిత్యానికి మాత్రం ఆదరణ, ప్రోత్సాహం ఎక్కడుందండీ? అదీ అంతంత మాత్రమేగా. కనుక ముందు అసలు సాహిత్యానికి విలువ పెరిగే విధంగా సాహిత్య సంస్థలు కృషి చేసినపుడు మన తెలుగు సాహిత్యం మరింత వెల్లివిరుస్తుంది. నిష్పక్షపాతమైన సాహిత్య సంస్థల కృషికి పాలక వర్గాలు ఎప్పుడూ బాసటగా నిలుస్తాయని నేను భావిస్తున్నాను.

14.       ప్రస్తుతం తెలుగు సాహిత్యాన్ని ఒక అనువాదకుడిగా ఎలా చూస్తున్నారు?

ఏమీ చెయ్యలేనివాడిగా, చేతకానివాడిగా చూస్తున్నాను. తమిళ సాహిత్యాన్ని నేను ఎలాగైతే తెలుగులోకి అనువాదం చెయ్యాలని తహతహలాడుతున్నానో, తపిస్తున్నానో అలా మన సాహిత్యాన్ని కూడా ఎవరైనా ఇతర భాషల్లోకి అనువాదం చేస్తే ఎంతో బావుణ్ణని కలలు కంటున్నాను. నిజానికి నాకూ తమిళ రచయితలెవరూ ఏ సాయమూ చెయ్యటం లేదు. నాకు తెలిసిన తమిళ రచయితలను 'తమిళం నుండి తెలుగు భాషలోకి వెళ్లవలసిన సాహిత్యం గురించి తెలియజేయండి, కథలైనా సరే నవలలైనా సరే...అని అడిగితే ఒక్కరూ చెప్పనంటారు. పైగా వాళ్ల కథలనే అనువదించమని అడుగుతారు. వాళ్లవైనా అన్నీ చదివి ఏది బావుంటుందో నిర్ణయించుకోవటానికి సమయం పడుతుంది కదా. అందుకని వాళ్ల రచనల్లోనే బాగుండే వాటిని సూచించండి అన్నా ఆ పనీ చెయ్యనంటారు. ఎందుకో ఈ విషయంలో వాళ్లు ఇలా ఉన్నారు.

అందుకే ఎవరైనా ప్రముఖులు ఏదైనా రచనను సూచిస్తేనే దాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను. అలా ఒక తమిళ పత్రికాధిపతి సూచించిన 'యామం' అన్న ఒక గొప్ప పెద్దనవలను తెలుగులోకి అనువదించాను. కానీ దాని ప్రచురణకు ఎన్నిఅవస్తలు పడాలో అన్నీ పడ్డాను. చివరకు అది 2014లో చతురలో ప్రచురితమయ్యింది కానీ దాన్ని బాగా కుదించి ప్రచురించటం జరిగింది. పూర్తి నవలను పుస్తకంగా తీసుకురావాలని ఆనాటి నుండి ప్రయత్నిస్తున్నా వీలుకాలేదు. చివరకు ఆ తమిళ రచయితే దాన్ని కొద్ది కాపీలు ప్రచురించి మద్రాసులో తన పుస్తకాలతో పాటు దీన్ని ఆవిష్కరించి, నన్ను సత్కరించటం జరిగింది. ఆ పత్రికాధిపతే సూచించిన కొన్ని తమిళ దళిత కథలతో ఒక పుస్తకం త్వరలో నవచేతన వాళ్లు తీసుకురానున్నారు.

ఇక నేను రెండు భాషల రచనలనూ చదవుతుండటం చేత ప్రస్తుతం మన తెలుగు కథల స్థాయి కొంత తగ్గినట్టుగా అనిపిస్తున్నది. విభిన్న అంశాలమీద తమిళంలో ఎన్నో రకాల ప్రయోగాలతో కథలు రాస్తున్నారు. ప్రశంసలు అందుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితిలోనే మన తెలుగులోని ఆణిముత్యాలవంటి సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను.

15.       యువతరం అనువాద సాహిత్యం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణాలను ఎలా చూడాలి? అనువాద రంగంలోకి యువతరాన్ని ఆకర్షించాలంటే ఏం చెయ్యాలంటారు?

నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. మా తర్వాత ఎవరు? అసలు యువతరం కథలు రాయటానికి ఉత్సాహం చూపిస్తేగా. కథా రచనకే ముందుకు రానివాళ్లు ఇక అనువాదం వైపు మొగ్గుచూపిస్తారా? ఎంతసేపూ అంతర్జాలంలో మునిగి తేలుతుంటే ఇక కథాసృజనకు, సాహిత్య సృష్టికీ ఎక్కడ అవకాశం.

అందుకే కథా సృజనపై యువతరానికి, ముఖ్యంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు కార్యశాలలు నిర్వహించాలి. కొత్త తరాన్ని వీలైనంతగా ప్రోత్సహించాలి. మేము ప్రారంభంలో ఎలాగైతే కాస్త పేలవంగా ఉన్న కథలు రాసినా పత్రికలు ప్రచురించాయో అలాగే ఈనాటి యువతరాన్ని కూడా పత్రికలు ప్రోత్సహించాలి. అంతేకాదు, పత్రికలు తమ బాధ్యతలను, పద్ధతులను చక్కగా నిర్వహించాలి. కథలు పంపితే వీలైనంత త్వరలో ఏ విషయమూ వ్యక్తిగతంగా తెలపాలి. రచన ప్రచురితమైతే కాంప్లిమెంటరీ కాపీ పంపాలి. పారితోషికాన్ని కాలానుగుణంగా తప్పనిసరిగా ఇవ్వాలి. కొత్త పత్రికలు రావాలి. పాఠకులు పెరగాలి. మన సాహిత్యం విస్తరించాలి. పదికాలాల పాటు నిలబడాలి.

ఇదే నా వాంఛ, ఆకాంక్ష!!

 

 

 


ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు