ఇంటర్వ్యూలు

(May,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ప్రజలకు ఉపయోగపడే సాహిత్యం వ్రాయాలన్నదే నా అకాంక్ష – పి. చంద్‍

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు పి. చంద్‍ ఇచ్చిన ఇంటర్వ్యూ

1              మీ వక్తిగత జీవితం గురించి చెప్పండి?

                నేను 11-09-1954లో వరంగల్‍లోని ఉర్సు ప్రాంతంలో పుట్టాను. నా అసలు పేరు వూరుగొండ యాదగిరి. మా నాన్న మల్లయ్య అజాంజాహి మిల్లు కార్మికుడిగా పనిచేసారు. అమ్మ వీరమ్మ బీడి కార్మికురాలుగా పనిచేసేది. 1975లో డిగ్రీ తరువాత 1977లో సింగరేణిలో ఉద్యోగంలో చేరాను. దాదాపు మూడున్నర దశాబ్దాలు పనిచేసాను. ఆ విధంగా కార్మిక కుటుంబంలో పుట్టి కార్మికుల మధ్య పనిచేయటం వలన సహజంగానే అది నా అలోచనల మీద ప్రభావం చూపింది. కార్మికుల మీద ఎక్కువగా సాహిత్యం వ్రాయాటానికి కారణమైంది.

2              మీరు సింగరేణిలో ఉద్యోగం చేరునాటికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

                ఆ రోజుల్లో కార్మికుల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. మురికి కూపాల్లాంటి కార్మిక వాడల్లో ఏ కనీస అవసరాలు ఉండేవి కావు. పిల్లలు చదువుకోవటానికి స్కూళ్లు కాని, రోగమొస్తే మందులు కాని ఉండేవి కావు. మేనేజుమెంటు, కార్మికుల సంక్షేమం ఏ మాత్రం పట్టించుకునేది కాదు. రక్షణసూత్రాలు కూడా సరిగా అమలు జరపకపోవటం వలన నిత్యం బొగ్గు బావుల్లో ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగి కార్మికుల రక్తం చిందని రోజు ఉండేది కాదు. బాయి  దొరల (అధికారులు) దొరతనం ఎనకటి నిజాంకాలం నాటి ఫ్యూడల్‍ దొరల దొరతనం గుర్తుచేసేది. కార్మికులచే దొర అని పిలిపించుకుంటూ వారి మీద జులుం చెలాయించేవాళ్లు. కట్టు బానిసల్లా, ఇండ్లలో పని మనుషులుగా వాడుకునేవారు. కార్మికుల సంక్షేమం చూడాల్సిన కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పట్టించుకునే వాళ్ళుకాదు. మేనేజుమెంటుకు అమ్ముడుపోయి ఫక్తు పైరవీకారులుగా మారిపోయి, ప్రతి చిన్న పనికి కూడా కార్మికుల నుండి లంచాలు గుంజేవాళ్ళు. ఇందుకు కమ్యూనిస్టు యూనియన్స్ కూడా మినాహాయింపు కాదు. దాంతో మేనేజుమెంటు కార్మిక వ్యతిరేక చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దానికి తోడు బయట సామాజిక పరిస్థితులు కూడా అధ్వాన్నంగా ఉండేవి. వాడవాడన వెలిసిన సారా దుకాణాలు, బ్రాండిషాపులు, కల్లు దుకాణాలు కార్మికుల మూల్గుల్ని పీల్చాయి. కార్మికుల ఇల్లు, వొళ్ళు గుల్ల అయ్యేది. ఆ రోజుల్లో కాలరీ ప్రాంతంలో గూండాయిజం పెద్ద ఎత్తున కొనసాగింది. స్త్రీలపై అత్యాచారాలు, బెదిరించి డబ్బులు గుంజుకోవటం, కొట్టడం వంటివి యదేచ్చగా సాగినవి. గూండాల మధ్య తరుచు గ్యాంగ్‍ వార్‍లు జరిగి హత్యలు చేసుకొనేవాళ్ళు. గూండాలకు రాజకీయ నాయకుల, యూనియన్‍ నాయకుల అండదండలుండేవి. శాంతి భద్రతల రక్షణకు పోలీసులు ఉన్నమాటే కాని రాజకీయ జోక్యం వలన గూండాల జోలికి పోయేవాళ్ళు కాదు. దాంతో గూండాయిజం పెట్రేగి పోయింది. ఈ అస్తవ్యస్త సామాజిక పరిస్థితులే తదనంతరకాలంలో విప్లవ కార్మికోద్యమం ఆవిర్భవించటానికి కారణమైంది.

3              మీ సాహిత్యం ఎక్కువగా సింగరేణి కార్మికుల మీద వ్రాసారు. అందుకు కారణం ఏమిటి?

                నా జీవితంలో ముఖ్యమైన భాగం సింగరేణి కార్మికుల మధ్య గడిచింది. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఆరాట పోరాటాలు, విప్లవోద్యమం ఆవిర్బవం, ఎదుగుదల, చివరికి అణిచివేతకు గురి కావటం వరకు జరిగిన పరిణామాలకు నేను సజీవ సాక్షిని.

                ప్రజలు బ్రతుకలేని దుర్భర పరిస్థితుల నుండి పోరాటాలు పుడుతాయి. ఆ విధంగా విప్లవోద్యమం పుట్టుకొచ్చింది.1975 ఎమర్జెన్సీ కాలంలో కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. హక్కుల హరింపు, క్యాజువల్‍ వర్కర్స్, టెంపరరీ వర్కర్స్ పేర కార్మికులతో వెట్టిచారికి చేయించుకోవటం ఎక్కువైంది. అంతకు ముందు సాధించుకొన్న ‘బొనసు’ వంటి హక్కులు కోతకు గురైనవి. ఇట్లా అనేక రుపాల్లో కార్మికుల మీద తీవ్రమైన దాడి కొనసాగింది. అప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా చెలామణి అయిన ఏఐటియుసి, ఐయన్‍టియుసి రెండు కూడా ఎమర్జెన్సీని సమర్థించటంతో అడిగేవారు లేక కార్మికుల పరిస్థితి అధ్వానమైంది. బాయి దొరల జులుం పెరిగి పోయింది. చార్జీషీట్లు, డిస్మిస్‍లతో అనేక మందిని వేధించారు.  మరోవైపు బయిట గూండాయిజంతో కార్మికులను ఊపిరి సలుపనియ్యలేదు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి కేంద్రంగా రాడికల్స్ కార్మికుల సమస్యలు తీసుకొని పోరాడటం మొదలైంది.1981 ఏప్రిల్‍లో జరిగిన మస్టర్ల కొత చట్టం వ్యతిరేకంగా యాబై అరురోజులు సుదీర్ఘ సమ్మె పోరాటం చేసి విజయం సాధించారు. ఆ పోరాట క్రమంలోనే విప్లవ కార్మిక సంఘమైన ‘‘సింగరేణి కార్మిక సమాఖ్య’’ అవిర్భవించింది. అటు తరువాత కాలంలో ‘‘సికాస’’ దాదాపు పాతిక ఏండ్లు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించింది. జాతీయ సమస్యలైన ‘వేజుబోర్డులు’ వంటి వాటిని పరిష్కరించి సింగరేణిలో బలమైన విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మించింది. భారతదేశ కార్మికోద్యమ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించింది. సికాస కేవలం  కార్మికుల సమస్యలపైనే పోరాటాలు చేయలేదు. సారా వ్యతిరేక పోరాటం, ఇండ్ల స్థలాల కోసం, విద్య, వైద్య సౌకర్యాల మెరుగు కోసం, గూండాయిజంకు వ్యతిరేకం వంటి అనేక సామాజిక సమస్యలపై పోరాడింది. నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాలను ఎజండా మీదికి తెచ్చి వారిని చైతన్య పరిచింది. అందులో పాల్గోనెలా చేసింది.

                అయితే ఈ పోరాటాలు ఏవీ యాదృచ్చికంగా వచ్చినవి కావు. అమరుల త్యాగాల ఫలితంగా ఇదంతా సాధ్యమైంది. సింగరేణిలో మొగ్గతొడుగుతున్న విప్లవ కార్మికోద్యమాన్ని మొగ్గలోనే త్రుంచి వేయాలని పాలకులు కౄర నిర్భంధం అమలు జరిపారు. దేశంలోని సకల సాయుధ బలగాలను కోల్‍ బెల్ట్లో మోహరించి కవాతు చేయించారు. దాదాపు వందమంది విప్లవకారులను బూటకపు ఎన్‍కౌంటర్‍ పేర కాల్చి చంపి ‘నల్లనేల’ ను రక్తసిక్తం చేసి అణిచివేసారు.

                నా కండ్ల ముందు జరిగిన ఈ పరిణామాలు నన్ను బాగా కదిలించినవి. ఎప్పటికప్పుడు వాటిని రికార్డు చేసాను. అది కేవలం కథలు, నవలల రూపంలోనే కాదు వ్యాసాలుగా, పత్రిక రచనలుగా, కార్మిక ఉద్యమ చరిత్రగా అనేక రూపాల్లో ఆ చరిత్రను నమోదు చేసాను.

4              ఇంత వరదాక మీరు కథ నవలా రచయితగానే తెలుసు, మీరు వచన రచనలు కూడా చేసారని ఇప్పుడే తెలుస్తున్నది. మీ వచన రచనలు ఏమిటి?

                వచన రచనలు చాలానే చేసాను. అప్పుడున్న పరిస్థితుల వల్ల అవేవి నా పేరు మీద వచ్చినవి కావు. వివిధ మిత్రుల పేరు మీద, సంస్థల పేరు మీద వచ్చినవి. అందులో కొన్ని...

1. సికాస రెండవ మహసభ సందర్భంగా విడుదల చేసిన ‘‘సింగరేణి బొగు్గ గనుల్లో రగిలిన పోరాటాలు వర్దిల్లాలి’’

2. పరస్పెక్టివ్‍ వారు ప్రచురించిన ‘‘సింగరేణి వాస్తవ పరిస్థితి ఒక నివేదిక’’

3. వనరుల తరలింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సింగరేణి నేపథ్యంలో వచ్చిన ‘‘చర్చ తెలంగాణ వ్యాసాలు’’

4. చర్చ సింగరేణి వ్యాసాలు

                5. సంస్కరణలు వచ్చిన తరువాత ఒక ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో సంస్కరణలు ఎట్లా అమలు జరిపింది ఒక కేసు స్టడీలా తెలియచెప్పే ‘‘సింగరేణి సంస్కరణలు - ఒక పరిశీలన’’

                6. మయూరి పబ్లికేషన్‍ ప్రచురించిన ‘‘తరతరాలపోరు’’

                7. కోల్‍ పిల్లర్స్ అసోసియేషన్‍ మహసభల సందర్భంగా విడుదల చేసిన ‘‘నూతన స్టాడింగ్‍ అర్డర్‍ - ఒక పరిశీలన’’

                8. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రచురించిన ‘‘బొగ్గుగని కార్మికుల వేతనాలు - ఒక పరిశీలన’’

                9. ‘‘టిబియుకెయస్‍ పదేండ్ల ఉద్యమ ప్రస్థానం’’

                10. సింగరేణి నేపథ్యంలో ‘‘శీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టు’’

                11. హెచ్‍యంయస్‍ వాళ్లు ప్రచురించిన ‘‘వేజు బోర్డు ఒప్పందాలు ఒక పరిశీలన

పైన పేర్కొన్నవన్నీ పుస్తకాలుగా వచ్చినవి. ఇవి కాకుండా లోకల్‍ పత్రికలైన ‘న్యూస ఫోకస్‍’, ‘చర్చ’ ‘మావూరు’ వంటి పత్రికల్లో ‘లేబరోని గోడు’, ‘తుపాకి రామన్న కథలు’, ‘తట్టా - చమ్మాస్‍’ వంటి శీర్షికలు నిర్వహించాను. అనేక మంది పత్రికా విలేఖర్లకు ‘బినామి’ రైటర్‍గా వందలాది వ్యాసాలు వ్రాసి ఇచ్చాను.

5              మీ మొదటి కథ ఏ సందర్భంలో వచ్చింది?

                మస్టర్ల కోత చట్టంకు వ్యతిరేకంగా కార్మికులు యాబై అరు రోజులు సమ్మె చేసి విజయం సాధించారని చెప్పాను కదా. ఆ సమ్మె సందర్భంలో అసలు సమ్మె ఎలా అరంభమైందో తెలియ చేస్తూ వ్రాసిన ‘‘సమ్మె’’ కథ నా మొదటి కథ. అది ‘కార్మిక’ పేరు మీద సృజనలో అచ్చయింది.

6              ‘‘కార్మిక’’ అన్నకలం పేరుతో అనేక మంది వ్రాయాటానికి గల కారణం?

‘‘కార్మిక’’ అన్న కలంపేరు నిర్ధిష్టంగా అనుకొని ప్రారంభించింది కాదు. నేను నా మొదటి కథ ‘‘సమ్మె’’ వ్రాసినప్పుడు తీవ్ర నిర్భంధం కొనసాగుతుండే. దాంతో స్వంత పేరుతో పంపటం ఇష్టంలేక కార్మికుల మీద వ్రాసిన కాబట్టి ‘‘కార్మిక’’ అనే కలం పేరుతో సృజనకు పంపాను. అది అట్లా అచ్చయింది. అటు తరువాత ఆ సమ్మెకు నాయకత్వం వహించిన నల్లా అదిరెడ్డి, మహ్మద్‍ హుస్సేన్‍ కూడా అదే సమ్మె మీద వరుసగా ‘‘నిర్భంధం’’, ‘‘విస్తరణ’’ అనే కథలు వ్రాసారు. వాటిని కూడా ‘‘కార్మిక’’ పేరు మీద పంపించటం అదే పేరు మీద అచ్చుకావటం జరిగింది. నాలుగు భాగాలుగా సాగే ‘‘సమ్మె’’ కథలోని చివరిబాగమైన ‘‘విజయం మనదే’’ అనే కథను మళ్ళీ నేను వ్రాసాను. ఆ విధంగా ‘‘సమ్మె’’ కథ, కార్మిక కలం పేరు రూపుదిద్దుకున్నది. తదనంతర కాలంలో ‘కార్మిక’ పేరు మీద వచ్చిన కథల్లో  సగానికిపైగా నేను వ్రాసినవే  ఉన్నాయి. ఒకే కలం పేరుతో అనేక మంది రచయితలు వ్రాయటం వలన సాహిత్య చరిత్ర వ్రాసేటప్పుడు ఎవరు ఏ కథ వ్రాసారో తెలియక తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంది. ‘‘సమ్మె’’ కథ విషయంలోనూ అదే జరిగింది.

7              మీరు అనేక మారు పేర్లతో రచనలు చేయాటానికి కారణం ఏమిటి?

                వాస్తవాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. దోపిడీ పీడనలతో కూడుకున్న సమాజంలో ప్రజలు జరిపే ఏ న్యాయపోరాటమైన పాలక వర్గాలకు మింగుడు పడవు. అటువంటి పోరాటాలను, వాటికి నాయకత్వం వహించిన నాయకులను ప్రభుత్వం సహించదు. భౌతికంగా నిర్మూలించటానికైనా వెనుకాడదు. అలాగే ప్రజా పోరాటాలను ఎత్తి పట్టిన రచనలను, రచయితలను కూడా సహించదు. అందుకే దాదాపు ఇరవై మారు పేర్లతో వ్రాయాల్సి వచ్చింది.

8              ఇంతవరకు మీరు సింగరేణి కార్మికుల మీద వ్రాసని నవలలు ఏమిటి?

                సింగరేణి కార్మికుల మీద ఇంత వరకు పదమూడు నవలలు వ్రాసాను. అందులో ఎనిమిది నవలలు ప్రచురించబడినవి. మిగితావి ప్రచురించాల్సి ఉంది.

                ప్రచురించిన నవలలు

1. సింగరేణిలో తొలినాటి కార్మికోద్యమాన్ని తెలిపే ‘‘శేషగిరి’’ నవల

2. విప్లవ కార్మికోద్యమంలో తొలి అమరురాలు జిలాని బెగంపై ‘‘నెత్తుటి ధార’’

3. సింగరేణి విప్లవ కార్మికోద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన నాయకుడు నల్లా అదిరెడ్డి మీద ‘‘విప్లవాగ్ని’’

4. ఎన్‍కౌంటర్‍లో అమరుడైన ఏఐఎఫ్‍టియు నాయకుడు శ్రీదరి రాయమల్లు మీద ‘‘శ్రామిక యోధుడు’’

5. సింగరేణిలో రాజ్యహింసమ తెలియచెప్పే ‘‘హక్కుల యోధుడు బాలగోపాల్‍’’

6. గోదావరిఖని 8ఎ బొగ్గు గని ప్రమాదంలో ఒక సారి పదిమంది కార్మకులు చనిపోయిన విషాద సంఘటనను  ‘‘ఒక కన్నీరు’’

7. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సింగరేణి కార్మికులు జరిపిన ‘‘సకల జనుల సమ్మె’’

8. సింగరేణి ప్రాంతకవి మల్లావఝుల సదాశివుని జీవితంపై వ్రాసిన ‘‘తలాపున పారే పాట’’ ప్రచురించబడినవి.

సింగరేణి నేపథ్యంలో వ్రాసిన నవలలు ఇంకా ప్రచురించాల్సినవి.

1. విప్లవ కార్మికోద్యమ అవిర్భవాన్ని తెలిపే ‘‘బొగ్గులు’’ నవల

2. ఓపెన్‍కాస్టు నిర్వాసితుల ప్రజల కన్నీటి కథ ‘‘భూ దేవి’’ నవల

3. తీవ్ర నిర్భంధాల మధ్య వేజుబోర్డు సాధనకోసం కార్మికులు జరిపిన మూడు రోజుల సమ్మెపై ‘‘స్ట్రయిక్‍’’ నవల

4. అరాచకవాది

5. మావూరి కథ - నవలలు ప్రచురించాల్సి ఉంది.

9              సింగరేణి నేపథ్యం కాకుండా మీ ఇతర నవలలు ఏమిటి?

1. ప్రముఖ ట్రేడ్‍ యూనియన్‍ నాయకుడు కె.ఎల్‍. మహింద్ర జీవిత అధారంగా ‘‘అంతర్జాతీయ శ్రామిమ యోధుడు’’

2. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ‘‘బండ్రు నర్సింహులు’’ జీవిత కథ

3. కేంద్ర మాజీమంత్రి జి. వెంకటస్వామి జీవిత చరిత్ర ‘‘మేరా సఫర్‍’’

4. ప్రముఖ బిసి నాయకుడు తెలంగాణవాది ముచర్ల సత్యనారణ మీద ‘‘ధిక్కార కెరటం’’

5. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వ్రాసిన నవలిక ‘‘తెలంగాణ తల్లి’’

6. నల్లమల విప్లవోద్యమాన్ని చిత్రించిన ‘‘నల్లమల’’ నవలలు ప్రచురిచంబడ్డాయి.

ఇంకా  గ్రానైట్‍ క్వారీలకు వ్యతిరేకంగా వ్రాసిన ‘‘దేవుని గుట్ట’’ వంటి నవలలు ప్రచురించాల్సి ఉంది.

10           మీ రచనల్లో ఎక్కువ భాగం జీవిత చరిత్రలున్నాయి. వాటిని ఎట్లా అర్థంచేసుకోవాలి?

                నిజమే నేను వ్రాసిన వాటిలో ముప్పాతిక భాగం జీవిత చరిత్రలే ఉన్నాయి. అయితే ఆ జీవిత చరిత్రలు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావు. వివిధ సందర్భాల్లో ప్రజలు జరిపిన పోరాటాలు, ఆ పోరాటాల్లో పాల్గొని వాటికి నాయకత్వం వహించిన వ్యక్తుల జీవితం అధారంగా ఆ పోరాటాల చరిత్రను ముందు తరాలకు అందించాలనే తాపత్రయంలో వ్రాసాను.

11           ‘‘శేషగిరి’’ నవల ఎందుకు వ్రాసారు? అక్రమంలో ఎదురైన సాధకబాదకాలు ఏమిటి?

                ప్రజా పోరాటాలు ముందుకు వచ్చినప్పుడు, ప్రజలు తమ గత పోరాటాల మంచి చెడ్డలను మననం చేసుకుంటారు. చరిత్ర మరుగున పడిపోయిన ప్రజా పోరాట యోధులను గుర్తు చేసుకుంటారు. మరోమాటలో చెప్పాలంటే ప్రజలు తమ చరిత్రను తామే తవ్వి తీసుకుంటారు. తద్వారా తమ పోరాటాలను మరింత పదును పెట్టుకుంటారు. అట్లా సింగరేణిలో   విప్లవ కార్మికోద్యమ నేపథ్యంలోనే ‘‘శేషగిరి’’ నవల వచ్చింది.

                1886లో సింగరేణి బొగ్గు గనులు ప్రారంభం జరిగినప్పటికీ 1940 వరకు ఎటువంటి యూనియన్‍ కార్యకలాపాలు లేవు. నాటి బ్రిటిష్‍ వలస వాద దోపిడి, నిజాం ప్యూడల్‍ దోపిడి కలగలిసి పోయి కార్మికుల్లో ఎటువంటి యూనియన్‍ కార్యకలాపాలు జరుగకుండా అణిచివేసారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో కా।। దేవూరి శేషగిరి రావు నాయకత్వంలో కమ్యూనిస్టులు తీవ్ర నిర్భంధాల మధ్య సింగరేణిలో యూనియన్‍ కార్యకలాపాలు ప్రారంభించి కార్మికులను సంఘటిత పరిచి తమ హక్కుల కోసం పోరాడే యోధులుగా తీర్చిదిద్దారు. 1948 మే 15న కా।। శేషగిరిరావు అతని ఇద్దరు అనుచరులను నిజాం పోలీసులు కాల్చిచంపారు. మహోజ్వలమైన ఆ పోరాటం గురించి చరిత్రలో పెద్దగా నమోదు కాలేదు. కాని కార్మికుల్లో శేషగిరిరావుకున్న పలుకుబడి అరాధన భావం నన్ను అశ్చర్యచకితున్ని చేసింది. ఆయన గురించి వ్రాయాలన్న పట్టుదలను పెంచింది. 1990 ప్రాంతంలో నేను నా ప్రయత్నం మొదలు పెట్టాను. ఆయనతో పనిచేసివారు అప్పటికింకా బ్రతికి ఉన్న వారిని అనేక మందిని కలిసాను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారిచ్చిన సమాచారాన్ని దాదాపు ఐదారు వందల పేజీల సమాచారాన్ని సేకరించాను. అనాటి పని పరిస్థితులు, మేనేజుమెంటు విధానం, సామాజిక పరిస్థితులు, యూనియన్‍ జరిపిన పోరాటాలు గురించి సమగ్రమైన సమాచారం సేకరించాను. దాంతో పాటు ఆనాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాట క్రమాన్ని మొత్తంగా అధ్యయనం చేసి ఒక అవగాహనకు వచ్చిన తరువాత దాన్ని నవల రూపం ఇవ్వటానికి మొత్తంగా ఐదు సంవత్సరాలు పట్టింది. ఆ నవల మొదట స్థానికంగా వెలువడే ‘చర్చ’ అనే దిన పత్రికలో సీరియల్‍గా వచ్చినప్పుడు కార్మికులు బావుల మీద, ఇండ్లల్లో గుంపులు గుంపులుగా చదువుకున్నారు. పత్రిక సర్క్య్లేషన్‍ అమాంతం రెండింతలైంది. కార్మికుల నుండి వచ్చిన అదరణ నా శ్రమను మరిపించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో అనేక నవలలు వచ్చాయి కాని కార్మిక నేపథ్యంలో వచ్చిన నవలగా ‘‘శేషగిరి’’ నవల ప్రత్యేక స్థానం పొందింది.

12           మీ నల్లమల నవలను ఏ సందర్భములో నుండి చూడాలి?

                విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుంది. వారి శక్తి యుక్తులను బయిటికి తీసి చారిత్రక పురుషులుగా చేస్తుంది. అందుకు సజీవ ఉదాహరణ ‘‘బుర్ర చిన్నన్న’’ జీవితం. పెద్దపల్లి తాలుకా మంగపేట కునారం గ్రామంలో ఒక సామాన్య గౌడ కులంలో పుట్టిన చిన్నన్న ఎడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. 1980 ప్రాంతంలో  ‘పీపుల్స్వార్‍’  ఉద్యమంలోకి వచ్చి 2006లో ఎన్‍కౌంటర్‍లో చనిపోయే నాటికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ‘మాధవ్‍’ గా పనిచేసాడు ఆధ్యంతం త్యాగపూరితమైన ఆయన జీవితం నన్ను ప్రభావితం చేసింది. నల్లమల నవల వ్రాయటానికి కారణమైంది. ఆయన, ఆయనతో పాటు పనిచేసిన ఆయన జీవిత సహచరి ‘శాంతక్క’ ద్వారా, ఇంకా ఆయనతో కలిసి పనిచేసిన   ఉద్యమ సహచరుల ద్వారా సమాచారం సేకరించాను. అదొక్కటే సరిపోదని నల్లమల భౌగోళిక, ప్రాకృతిక పరిస్థితులను, నల్లమల్లో నివసించే ప్రజల, ముఖ్యంగా చెంచుల జీవితాలను, ఉద్యమం సాగిన తీరుతెన్నులను మొత్తంగా అధ్యయనం చేసాను. ఆ ఉద్యమంలో పాల్గొని అమరులైన వందలాది మంది విప్లవ కారుల త్యాగాలను అధ్యయనం చేసాను. నవల వ్రాయాటానికి మూడు సంవత్సరాలు పట్టింది. విరసం ద్వారా ఆ నవల ప్రచురింపబడి జనాదరణ పొందింది.

13           మీ కథల గురించి వివరించండి?

                దాదాపు వంద దాక కథలు వ్రాసాను. అందులో ఎక్కవ భాగం సింగరేణి కార్మికుల మీదే వ్రాసాను. అవి కాకుండా ఇంకా భూనిర్వాసితుల మీద పర్యావరణ విధ్వంసం మీద, గిరిజన పోరాటాల మీద, సారా వ్యతిరేక పోరాటం వంటి సామాజిక సమస్యల మీద వ్రాసాను.

ఇప్పటి వరకు

1. భూనిర్వాసితులు

2. జులుం

3. సమ్మెకథ

4. గుమ్మన్‍ ఎగ్లాస్‍పూర్‍ గ్రామస్థుడు - కథా సంపుటాలు వచ్చాయి. ఇంకా ఐదారు సంపుటాలుగా రావల్సిన కథలు మిగిలే ఉన్నాయి.

14           సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా?

తప్పకుండా సాధ్యమే. అద్దంలో మన ముఖం మనమే చూసుకొని మెరుగు పరుచుకున్నట్టుగా సాహిత్యం మానవ జీవితాన్ని, వాళ్ళ అలోచనలను ఉన్నతీకరిస్తుంది. ఎందుకంటే సాహిత్యం మనిషిని పట్టించుకుంటుంది. దేశ కాలాలకు అతీతంగా మానవ జీవితం మౌళికంగా ఒక్క తీరుగానే ఉంటుంది. మనిషి అకలి, దు:ఖం, సంతోషం, కోపం, అరాట పోరాటాలు ఒక్కతీరుగానే ఉంటాయి. అందుకే  ప్రంపంచంలోని ఉత్తమ సాహిత్యమంతా ‘మనిషి’ కేంద్రంగా సాగిందే. అందుకే మనం వాటిని ఆస్వాదించగలుగుతాం. అనుభూతి చెందగలుగుతాం.  మన అలోచనలు మెరుగు పరుచుకొని చైతన్యవంతమౌతాం. సాహిత్యకారుడు జీవితాన్ని ఎంతగా పట్టించుకుంటే సాహిత్యం అంత ఉత్తమంగా ఉపయోగకరంగా ఉంటుంది.

15           ప్రస్థుతం సింగరేణి కార్మికోద్యం ఎలా ఉంది?  కార్మిక ఉద్యమంలోకి యువతరం ఎందుకు రాలేకపోతుంది?

                ఇవ్వాళ ఒక్క సింగరేణి అనే కాదు. మొత్తం భారత దేశ కార్మిక ఉద్యమమే చాలా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటుంది. ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రజల మీద ఒక ప్రణాళిక బద్దమైన భౌతిక  మానసికమైన తీవ్రదాడి కొనసాగుతున్నది. ఆ దాడి కార్మిక వర్గం మీద కూడా సాగుతున్నది. కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తున్నారు. కార్మికుల రక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. కంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ పెరిగిపోయింది. ఆ   మేరకు పర్మినెంటు కార్మికులను తొలగించి వారి స్థానంలో ఏ హక్కులు లేని కంట్రాక్టు కార్మికులను తీసుకువచ్చిండ్లు. దోపిడి అణిచివేత తీవ్రరూపంలో  సాగుతున్నది. ఈ తలక్రిందుల అన్యాయపురితమైన సమాజాన్ని చక్కదిద్దె శక్తి యువతరంకు ఉంది. కాని గ్లోబల్‍కల్చర్‍ యువతరాన్ని, వారి శక్తు యుక్తులను ఒక పద్దతి ప్రకారం నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ గ్లోబల్‍ కుట్రలను అర్థం చేసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడవలిసిన కర్తవ్యం యువతరం ముందు ఉన్నది. యువతరం మేల్కొని తప్పక తమ లక్ష్యం సాధిస్తారనే నమ్మకం ఉంది.

16           తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం వలన రైతులుగా బ్రతకాల్సిన వారు సింగరేణి కార్మికులుగా మారారు...ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?

                నాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం విఫలం చెందటంతో భూమి సమస్య పరిష్కరించబడలేదు. భూస్వాముల చేతిలోనే భూమి కేంద్రీకృతమై ఉంది. రూపం మార్చుకున్నది తప్ప గ్రామాల్లో దొరల దోపిడి యధాతధంగా ఉండి పోయింది. దానికి తోడు ఉమ్మడి అంధప్రదేశ్‍లో ఆంధ్ర పాలకుల వివక్ష వలన నీటి పారుదల సౌకర్యం మెరుగు పడలేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేక గ్రామాల్లో బ్రతకటం కష్టమైంది. దాంతో చాలా మంది గ్రామాలు వదిలి, పొట్ట చేత పట్టుకొని వచ్చి సింగరేణి కార్మికులుగా చేరారు. ఈ పరిస్థితి 1990లో సంస్కరణలు  ఆరంభమయ్యే వరకు కొనసాగింది. కాని తదనంతర కాలంలో పరిస్థితులు మారాయి. ప్రంపచీకరణ, కంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ సింగరేణిలో ప్రవేశించి ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది. ఒకప్పుడు లక్షాపదహరువేల మంది కార్మికులు పనిచేసిన సింగరేణిలో ఇప్పుడు నలబై వేల మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి నాల్గింతలు పెరిగింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో బ్రతుకు ఎల్లక వలస వచ్చిన వారికి ఉపాధి కల్పించి అక్కున చేర్చుకున్న సింగరేణిలో ఇప్పుడు ఉన్న కార్మికులనే రకరకాల పేరుతో తొలిగిస్తుంటే బ్రతుకు తెరువు కానరాక కార్మికులు మళ్ళీ పల్లెబాట పడుతున్న విషాద పరిస్థితి నెలకొన్నది.

17           కొత్తగా మీరు ఏం వ్రాసారు. ఇంకేమివ్రాయబోతున్నారు?

                రచనలు చేయాటానికి నేను ఎంతగా ‘అడిక్ట్’ అయ్యానంటే ఉద్యోగ ఒత్తిడిలో పడి రచన సాగటంలేదని ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసాను. వ్రాయాటానికి చాలా విషయాలున్నాయి. కాని సమయం సరిపోవటం లేదు. వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడే సాహిత్యం వ్రాయాలన్నదే నా అకాంక్ష. ఆ ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతున్నది. కొత్తగా రెండు నవలలు వ్రాసాను. అవింకా ప్రచురణకు సిద్దం చేయాల్సి ఉంది.

18           మా గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా యువ రచయితలకు ఇచ్చే సందేశం ఏమిటి?

                నిత్యం రెక్కలు ముక్కలు చేసుకొనే ప్రజలకు తిండికి కరువై అకలిచావులు చస్తున్నారు.ఏ కష్టం చేయని వారు కొట్లు సంపాదిస్తూ భోగలాలస జీవితం గడుపుతున్నారు. ఈ తలక్రిందుల, అన్యాయపురితమైన సమాజాన్ని మార్చవలిసి ఉంది. 

                కొత్తగా వ్రాస్తున్న వారు ప్రజల జీవితాన్ని లోతుగా పరిశిలించాలి. ఉత్తమ పాహిత్యన్ని అధ్యయనం చేయాలి, నిరంతరం వ్రాయటం ద్వారా ఎవరైనా మంచి సాహిత్యం సృష్టించవచ్చు


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు