ఇంటర్వ్యూలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ప్రతి ఆదివాసీ ‘’నా భాష నా బాధ్యత’’ అని అనుకోవాలి – మల్లిపురం జగదీశ్  

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు మల్లిపురం జగదీశ్  గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.         మీ వ్యక్తి గత జీవితం గురించి చెప్పండి.

గుమ్మలక్ష్మీపురం మండలం, విజయనగరం జిల్లాలోగల ఆదివాసీ గ్రామమైన పి. ఆమిటిలో పుట్టేను. సుబ్బలక్ష్మీ రామారావులు అమ్మానాన్నలు. ముగ్గురు సంతానంలో మధ్యవాణ్ణి. శ్రీమతి శ్రీదేవి, ఇద్దరు పిల్లలు విష్ణుప్రియ, హర్షవర్ధన్. ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుల్లో వున్నారు. నాది మారు మూల ఆదివాసీ గ్రామ జీవితం. ప్రస్తుతం ఆంగ్ల సహోపాధ్యాయునిగా గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల, టిక్కబాయి లో పని చేస్తున్నాను. అది నేను చదువుకున్న స్కూలే.

2.         మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

నేను చదువుకునే స్కూల్లోనే ఉపాధ్యాయుడు (SGT) గా టిక్కబాయిలో చేరే సమయానికి గంటేడ గౌరునాయుడు మాష్టారు అక్కడే వుండడం... అప్పటికి ఆయన కథలు ఒకటి రెండు చదివుండడం, వాటి మీద నా సందేహాలూ...ఆయన సమాధానాలు, అసలు రచయితలు ఎలా వుంటారు? వాళ్ళెలా కధలు రాస్తారు? కధంటే ఏమిటి లాంటి చర్చలూ... ఆ సాన్నిహిత్యం నన్ను రచయితగా మార్చేయి.

మాష్టారి రచనా శైలి నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. సాహిత్య సంస్థల విషయానికొస్తే స్నేహ కళా సాహితి ప్రొడక్ట్ ని నేను. అది తొలి అడుగు వేసినప్పటి నుండి నేటిదాక ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను. శ్రీకాకుళ సాహితి, సాహితి స్రవంతి, అరసం సంస్థలు నేనిలా నిలబడడానికి దోహదపడ్డాయి. ”ఏడు తరాలు’, ’అమృత సంతానం” పుస్తకాలు నా కళ్ళ ముందే కదలాడుతుంటాయి... అవి నాకో సవాల్ విసురుతున్నట్టుగానే భావిస్తుంటాను... అలాంటి రచనలు చేయగలవా అని అంటున్నట్టు.

3.         మీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?

నా హైస్కూలింగ్ లో తరగతి గుర్తులేదు... ఒక తెలుగుపాఠం... అదీ గుర్తులేదు. అందులో రచయిత చెప్పిన విషయంలో ”అదెలా కుదురుతుందండీ?” అని మా తెలుగు మాష్టారు కాటమ రాజు గారికి అడ్దుతగిలాను. ’అది రచయిత భావన’ అన్నారు. ”దానికి నేనెందుకు ఒప్పుకోవాలి?’ అని వాదిస్తే...నీ వాదన ఎవడిక్కావాలి. శతకోటి లింగాల్లో బోడిలింగానివి. నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే మార్కులు రావు, రచయిత చెప్పినట్టు రాస్తేనే మార్కు వస్తుంది అని చెప్తూ ”నీక్కావాలంటే వేరేగా రాసుకోవచ్చు. కానీ అది జనంతో పాటు ఈ పాఠ రచయిత కూడా ఒప్పుకునేలా వుంటేనే” అని చెప్పారు. (ఇప్పటిలా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అప్పుడు లేవు). బహుశా అప్పటి నుండి నేను ఆలోచిస్తున్నానేమో... రాయడం గురించి.

ఆ తరువాత మాష్టారి సాంగత్యంలో చాలా పుస్తకాలు చదివడంతో నా అడుగులు సాహిత్యం వైపు పడ్డాయి.

4.         మీ రచనల గురించి చెప్పండి

రెండు కథా సంపుటులు వచ్చాయి. మొదటిది ”శిలకోల” రెండోది ”గురి”.

5.         మీ మొదటి రచన ఏ సందర్భంలో వచ్చింది?

అచ్చయిన అక్షరాల బట్టి అయితే నా తొలి రచన ”తప్పదేమో...!” అన్న కవిత్వం. అది నాకు తెలీకుండా మా మాష్టారు కోకిల అనే పత్రికకు పంపించారు. అది అచ్చయి మా ఇంటి పెణక మీద వాలింది. రెండు రోజుల తర్వాత తెరిచి చూస్తే నా కవిత అందులో నా పేరున. అవొక ఉద్విగ్న క్షణాలు.

కథ విషయానికొస్తే...”అక్షరాల దారిలో...” ’అరణ్యరోదన” అనే రెండు కథలు మే 2000  లో ఒకే సారి అచ్చయ్యాయి. ఉత్తారాంధ్ర, ప్రజాసాహితి ల్లో. అక్షరాల దారిలో కథ నా స్వీయానుభవం. సన్నాయి అనే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విధ్యార్ధి బడి నచ్చక ఇంటికి పారిపోతాడు. వాడు తిరిగి రావడమే కథ. ఈ కథలో సన్నాయి నేనే.  రెండోకథ ”అరణ్య రోదన” పోడు కొండమీద ఒంటరిగా నెలల బిడ్దతో నివశిస్తున్న ఒక ఆదివాసీ స్త్రీ పోలీసులు, మావోయిష్టుల ఎదురుకాల్పుల్లో మరణిస్తుంది. కాల్పులు జరిపిన ఇద్దరికీ అన్నం పెట్టి దాహం తీర్చిన ఆమె మరణంతో బాలుడు అనాధ అవుతాడు.  సంఘటనా స్థలంలో వాడి రోదన ఇద్దరికీ ప్రశ్నిస్తూ కథ ముగుస్తుంది. ఈ కథ అటు పోలీసులకి, ఇటు మావోయిష్టులకీ మధ్య నలిగిపోతున్న గిరిజనుల స్థితిని చెప్పడానికి రాసినది.

6.         తెలుగు సాహిత్యంలో ఆదివాసీ సాహిత్య స్థానం ఎక్కడ వుంది?

ఇంకా ప్రాధమిక దశలోనే వుంది.

7.         గిరిజనులుగా వుంటూ గిరిజన సాహిత్యాన్ని రాస్తున్న తెలుగు వర్ధమాన రచయితలు, కవులు ఎవరెవరు? ఒక ప్రత్యేకమైన పరిస్థితులను రికార్డు చేస్తున్న ఈ సాహిత్యకారుల మధ్య ఒక చక్కటి వేదిక వుండాలి కదా ఉన్నదా?

గిరిజనులుగా వుంటూ గిరిజన సాహిత్యాన్ని రాస్తున్న తెలుగు వర్ధమాన రచయితలు, కవులు వేళ్ళ మీద లెక్కపెట్టినంత మందే వున్నారు. ఇక్కడ నేనూ, తిమ్మక రామ్ ప్రసాద్, పాల్వంచ నుంచి పద్దం అనసూయ, కుంజా కళ్యాణి, చిత్తూరు నుంచి పలమనేరు బాలాజీ, తెలంగాణ నుంచి వూకే రామకృష్ణ, రమేష్, కృష్ణ గుగ్గులోత్ లు మాత్రమే సృజనాత్మక రచనల్లో వున్నారు. గుమ్మడి లక్ష్మీనారాయణ, మైపాటి అరుణ్ కుమార్, నెహ్రు, రామారావు దొర లు వ్యాస రచయితలుగానూ ఆదివాసీ రచనలు చేస్తున్నారు. సుమన్ కొలామి కొలామీ భాషలో కవిత్వం రాస్తున్నాడు. ఈ సాహిత్యకారుల కోసం ”ఆదివాసీ రచయితల సంఘం” (ఆరసం) వుంది. రాష్ట్ర విభజనానంతరం చిన్న స్థబ్దత ఏర్పడింది. కార్యక్రమాలు వేగవంతానికి ఒక ప్రణాళిక వుంది.

8.         గిరిజన చరిత్ర సంస్కృతి గిరించిన మీ పరిశీలనలు, పరిశోధనలు ఏమిటి?

సమాజ చరిత్రంతా ఆదివాసుల నుంచే అడవి దగ్గర మొదలయ్యింది. అడవుల్ని వదిలి నడిచిపోయిన వాళ్లు నాగరీకులుగానూ, అక్కడే వుండిపోయిన వాళ్ళు నేటి ఆదివాసులుగానూ మిగిలిపోయారు.  సమాజ పరిణామ క్రమంలో ఎప్పుడూ ముందుకెళ్ళిపోయిన వాడు వెనకనున్నవాణ్ణి చిన్న చూపు చూడ్డమే జరుగుతున్నది.

సంస్కృతి మాటకొస్తే...వివిధ ఆదివాసీ తెగల భాషా, ఆచారాలూ, సంప్రదాయాలూ, పండుగల్లో  వివిధ రూపాల్లో సజీవంగా వుండాలి. కానీ ప్రపంచీకరణ, నగరీకరణ దెబ్బకు వాటి మనుగడ ప్రశ్నార్ధకం అయికూచుంది. అవి పురాతనమైనవే కాక ప్రకృతి సంబంధ మరియు మానవీయమైన విలువలతో కూడుకున్నవని నా అభిప్రాయం. వీటి వెనుక మూఢ నమ్మకాలుంటే విస్మరించాల్సిందే. అది వేరే విషయం. మనం మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థకు పరిణామం చెందిన వాళ్ళం. ఆదివాసీ తెగల్లోని స్త్రీ పురుషుని కంటే ఎక్కువగా శ్రమిస్తుంది ఇప్పటికీ. ఆదివాసీ స్త్రీ ఆదివాసేతర స్త్రీ కంటే స్వేచ్చగా వుండగలుగుతుంది, నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. ఈ లక్షణాలన్నీ ఒకప్పటి మాతృస్వామిక శిలాజ స్వరూపాలని నా విశ్వాసం. మా వూళ్ళో ఆవు, గేదెలకు పాలు తియ్యరు ఇప్పటికీ. ఎందుకంటే దూడ హక్కుని మనం కాజేయడం అన్యాయం కాబట్టి. కంది కొత్తల పండుగలో గొడ్డలిని పూజిస్తాం. గొడ్డలి శ్రమకు సంబంధించిన ఆయుధం. అంటే పండుగ పేరుతో శ్రమను గౌరవించడం అని అర్ధం.  ఇవన్నీ నా పరిశీలనలే, ఇంకా పరిశోధిస్తే మరిన్ని విషయాలు రూఢి అవుతాయి.

9.         గిరిజన జీవితాన్ని సాహిత్యంలోకి బలంగా తీసుకువచ్చిన రచయితగా మీ భవిష్యత్ రచనలు ఏమిటి?

ఒక నవల రాస్తున్నాను. కథకు అలవాటు పడిపోయాను కదా నవల రాతలో ఇబ్బందులెదుర్కొంటున్నా.

10.         గిరిజన కళారూపాలకు సంబంధించి ఏమైనా చెబుతారా?

థింసా ఒక్కటే వెలుగులోకొచ్చింది. వెలుగులోకి రాని గిరిజన కళారూపాలు ఎన్నో వున్నాయి.  కెరగా నృత్యం, నెమలి నాట్యం, నెయ్యి గుర్రం...లాంటి నృత్య రూపాలే కాకుండా లొల్లూచి పాటలు, నందెన్న పాటలు, ఉడుపుల పాటలు, సవర పాటలు, జాతాపు గీతాలు లాంటి ఆలాపనలు కూడా ఎన్నో వున్నాయి. కిన్నెర, టిల్లకాయ, గొగోయ్, తుడుము...డప్పు, సన్నాయి, కొమ్ము బూర, తుంబ బూర లాంటి ఆదివాసీ వాద్య నాదాలు మూగబోకుండా చూసుకోవాల్సి వుంది.  ఆ కళాకారులు ప్రస్తుతం నిర్లిప్తంగా ప్రదర్శనా రహితంగా మౌనంగా వున్నారు వేదికలు లేక. వీటిని భద్రపరచాల్సివుంది.

11.        కొన్ని గిరిజన భాషలు అంతరించి పోతున్నాయి కదా దాని గురించి ఏమంటారు?

ఇది ఖచ్చితంగా నేటి తరం వైఫల్యమే. ఏ భాష మనుగడ బాధ్యత ఆ తెగలదే. ఒకరి భాషని మరొకరు ఉద్ధరించలేరు. ప్రభుత్వం లాంటి ఇతరులు ప్రోత్సాహం ఇవ్వగలవు కానీ భాషని బ్రతికించాల్సింది వక్తలే. మన ప్రయత్నం మనం చేసిన తరువాత ప్రభుత్వాలని డిమాండ్ చేయగలం.  ప్రతి ఆదివాసీ ‘’నా భాష నా బాధ్యత’’ అని అనుకోవాలి. అప్పుడే ఆయా భాషలు మనగలుగుతాయి. 

12.         గిరిజనులకు గిరిజన భాషలో చదువుకునేందుకు లిఖిత సహిత్యం అందుబాటులో ఉందంటారా?

చదువుకునేందుకు ”మౌఖికం” ఎంత ముఖ్యమో ”లేఖనం” కూడా అంతే అవసరం. అన్ని గిరిజన భాషలకు లిపి లేదు. కొన్నింటికే లిపి అందుబాటులో వుంది. ఇటీవల విధ్యాశాఖ సవర, కోయ లాంటి స్థానిక గిరిజన భాషల్లో పాఠ్యపుస్తకాల ప్రచురణ చేపట్టింది. దీనివల్ల చాలా ఉపయోగం వుంది. తమ మాట పుస్తక రూపంలో వుందంటేనే ఒక ఆకర్షణ కదా! మాతృభాషలో విద్యాభ్యాసం మంచి ఫలితాలనిస్తుంది. ఇది మినహా లిఖిత సాహిత్యం ఎక్కువగా అందుబాటులో లేదు.

13.         దళిత వాదం, స్త్రీవాదం, ముస్లిం మైనారిటీ, బీసీ వాదాలు తెలుగులో ప్రభావితం చూపించినంతగా గిరిజనులకు ప్రత్యేక వాదంగా ఎందుకు ప్రభావితం చూపించలేకపోయింది?

గిరిజన వాదం ఇంకా పునాదుల స్థాయిలోనే వుంది. గిరిజన పోరాటాల లక్ష్యం హక్కుల సాధన. అందులో నాణ్యమైన విద్య కూడ ఒకటి.  ఇదే రచయితల్ని తయారు చేసుకునే దిశ గా నడవాల్సి వుంది. మొత్తంగా చెప్పాలంటే  వాదంగా వినిపడేంత మంది గిరిజన రచయితలు లేరు.

14.         మీరు భావిస్తున్న ఆదివాసీ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి?

స్వయం పాలన. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆదివాసీల్ని ఓటర్లు గానే చూస్తున్నాయి తప్ప సమాజంలో ఒక భాగమని గుర్తించడం లేదు. ఆదివాసుల కోసం ప్రత్యేకమైన చట్టాలున్నాయి... సమస్యల్లా వాటి అమల్లోనే. ఎక్కడైనా అమలు చేస్తున్నారూ అంటే అక్కడ నకిలీల రూపంలోనూ, అడ్డ దారుల్లోనూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఉదాహరణకు పీసా, వన్నాఫ్ సెవంటీ, అటవీ హక్కులు... ఇవన్నీ ఆదివాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డవే. కానీ ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కారణం ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలన లేకపోవడమే. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాకారం ఏర్పడ్డ ఆదివాసీ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ కలిపి ఒకే ఆదివాసీ రాష్ట్రంగా ఏర్పాటు చేసి 6వ షెడ్యూల్ లో కలిపితే స్వయం పాలన సాధ్యమవుతుందనేది మా వాదన. డిమాండ్ కూడా.  అప్పటికి గాని ఆదివాసీ సమస్యలకు పరిష్కారం దొరకదు.

15.         తెలుగులో గిరిజన జీవితం ఇంకా రావాల్సినంతగా రాలేదు అని ఒక విమర్శ వున్నది. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

నిజమే. గిరిజన జీవితం రికార్డు కావల్సినంతగా కాలేదు.  ఈ రోజు సాహిత్యంలో ఎవరి గోడు వాళ్ళు చెప్పుకుంటున్న స్థితి. స్త్రీలు, దళితులు, ముస్లిమ్ మైనారిటీ, బహుజన... వాదాలుగా.  ఎక్కడా ఆదివాసుల గురించి కనిపించదు. ఎక్కడైనా కనిపిస్తే అది అవుట్ సైడర్ వ్యూ. మరి మా గురించి ఎవరు రాస్తారు? ఆదివాసీల గిరించి అంటే అభివృద్ధి... దాని నిర్వచనం... ఆ వెనకే విధ్వంసం... నిరక్ష్యరాశ్యత... మూఢ నమ్మకాలు... ఉన్న వూళ్ళో పని లేకపోవడం... వలసలు... నిర్నైపుణ్యత... నిర్ధయ నగరీకరణ... మరో పక్క సౌకర్యాలు లేకపోవడం... మతమూ దాని వికృత రూపం... మావోయిష్టు సమస్య... ఎన్ కౌంటర్లూ... అడవి నుండి ఆదివాసుల్ని ఖాళీ చేయించడాలు...అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి, పోరాటాలు సాహిత్యంగా ఎప్పుడు మారుతాయి? ఇవన్నీ రికార్డు చెయ్యడానికి జగదీష్ ఒక్కడు చాలడు.  మాలోంచి ఉద్యమ స్థాయిలో రచయితలు తయారైతే ముందన్నట్టు అది వాదంగా బలపడి సాహిత్యంలో రికార్డు స్థాయిలో రికార్డ్ అవుతుంది.

16.         కథలే కాకుండా కవితలూ పాటలు కూడా రాసారు కదా... కథకుడిగా కవిగా రెండు ప్రక్రియల్లో రచనలు చేస్తున్నపుడు ఈ రచన ఈ ప్రక్రియలో చేయటానికి ఎలా ప్రక్రియను ముందుగా మీరు నిర్ణయించుకుంటారు?

నేను ప్రాధమికంగా కథకుడిని. కవినని చెప్పుకోవడానికి ధైర్యం చాలడం లేదు ఇంకా. కానీ కవిత్వం అంటే ఇష్టంగా చదువుతాను. పాటలు పాడుతాను కానీ రాయలేదు...ఒకటీ అరా తప్ప.  కథ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. కవిత్వం మాత్రం వన్ సిటింగ్ లో పూర్తి చేస్తాను. ఇన్ స్టంట్ ఎక్స్ ప్రెషన్ కోసం కవిత్వాన్ని ఎంచుకుంటాను. కథ నన్ను డిమాండ్ చేస్తూ... కూర్చోబెడితే తప్ప కథను ముట్టుకోను.

17.         కవిగా పాఠకుడుగా మీ ప్రస్థానం ఏమిటి?

నా ప్రస్థానం ఇదీ అని ఎప్పుడూ ప్రశ్నించు కోలేదు. చిన్నవో పెద్దవో లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం ముందుకు పోవడమే నా పని. వెనక్కి ఎప్పుడూ చూసుకోలేదు.

18.         గిరిజన సాహిత్యం కోసం ఇంకా ఏమి చెయ్యాల్సి వుంది?

చాలా వుంది. మౌఖిక రూపంలో వున్న ఆదివాసి సాహిత్యాన్ని రికార్డు చేయాలి. కొన్ని డాక్యుమెంటరీ లను తాయారు చేసుకోవాల్సి వుంది. కొత్త రచయితల్ని తయారు చేసుకోవాలి.

19.         కొత్తగా గిరిజన రచయితలు రాకపోవడానికి కారణం ఏమిటి? ఆదివాసీ సాహిత్యం అంటే ఆదివాసేతరులు రాసిన సాహిత్యాన్నే రెఫర్ చేస్తారు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది?

కొత్తగా గిరిజన రచయితలు రాకపోవడానికి కారణం గిరిజన విద్యార్ధుల్లో సాహిత్య వాతావరణం లేకపోవడం ఒక కారణం అయితే మరొకటి విధ్యలో నాణ్యత లేకపోవడం. (నాణ్యత’ విషయం ఒప్పుకున్నా లేకున్నా ఇది నిజం) ఇక ఆదివాసీ సాహిత్యం అంటే ఎవరు రాసినా అది ఆదివాసీ జీవితమై వుంటేనే అది ఆదివాసీ సాహిత్యంగా గుర్తించాలి కానీ రాసింది ఆదివాసీనా ఆదివాసేతరుడా అనేది ముఖ్యం కాదు. ఒక్కొక్క సారి గ్రామీణ కథని గిరిజన కథగా పొరబడుతుంటారు. ఆదివాసీ పేర్లున్నంత మాత్రాన ఆ కథ ఆదివాసీ కథ అయిపోదు.

20.         కొమరం భీం, రాగో నవలలను ఆదివాసీ నవలలుగా చూడవచ్చా?

కొమరం భీం... ఆదివాసీ నవలే. రాగో నవల నేను చదవలేదు.

21.         ఇప్పుదు వెలువడుతున్న ఆదివాసీ సాహిత్యం ప్రత్యేకతలు ఏమిటి?

ప్రస్తుతం తన అస్థిత్వాన్ని వెతుక్కునే పనిలో వుంది.

22.         ఉత్తరాంధ్ర సాహిత్యంలో ఉన్న జీవత్వంకు గల కారణాలు ఏమిటి?

ఇక్కడి జీవితమే ఈ సాహిత్య జీవత్వానికి ప్రధాన కారణం. ఇక్కడ మాండలికం, భాషా ప్రత్యేకత సాహితీ వనరు.  నదులూ, అడవులూ, తీర, మైదాన, ఏజెన్సీ ప్రాంతం వున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో వుంది ఉత్తరాంధ్ర. ఈ వనరులున్న ఏ ప్రాంతమైనా అభివృద్ధి లో ముందుంటుంది. ఈ వెనుక బాటుకి కారణం పాలకులే. ఈ నిర్లక్ష్య ధోరణిని సాహితీ కారులు పట్టుకోవడం వల్లే ఈ సాహిత్యానికి ఈ గుర్తింపు లభిస్తోందని నా అభిప్రాయం.

23.         ఒక రచయితగా ప్రస్తుతం సాహిత్యాన్ని సాహిత్య విమర్శను ఎలా చూస్తున్నారు?

సాహిత్యం వస్తున్నంతగా సాహిత్య విమర్శ రావడం లేదనేది నా అవగాహన. సీనియర్ విమర్శకులను మినహాయిస్తే విమర్శలో కొత్త తరం రావడం లేదు. ఒక రచయిత విమర్శకుడిని అడిగి తన పుస్తకం మీద రాయించుకునే పరిస్థితి వుందనిపిస్తోంది. అప్పుడు ప్లస్సులే వస్తాయి తప్ప మైనస్సులు విమర్శలోకి రావు. ఇది సాహిత్యానికి మంచిది కాదు.

24.         సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా?

సాధ్యమేనని నమ్ముతాను. ఆ మార్పు కాస్త ఆలస్యమైతే అవ్వొచ్చు గాని మార్పుకి సాహిత్యమే మూల కారణం.

25.         సాహిత్య జీవితంలో మిమ్ములను కదిలించిన అనుభవం గురించి చెప్పండి

రాస్తున్నందుకు రచయితగా గుర్తింపు రావడం ఆనందమే. కానీ ఆదివాసీ జీవితం రాస్తున్నందుకు ఆదివాసిగా వివక్షనెదుర్కోవడం అక్కడక్కడా ఇబ్బంది పడ్డాను. వివరాలు అడగొద్దు కానీ...ఒక సంఘటన మీతో పంచుకుంటాను.  అది గిడుగు రామ్మూర్తి పంతులుగారి జన్మదిన ఉత్సవం. 'మీకు సన్మానం చెయ్యలకుంటున్నాం' అని పిలుపొచ్చింది ఓ రోజు. వెళ్ళాను. ఆ సభలో మొత్తం పది మంది వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు సన్మానం చేస్తున్నారని తెలిసింది. అందులో తొమ్మిది మందికి పదివేల రుపాయలు, మెమెంటోలతో సత్కరిస్తే... నాకొక్కడికి మాత్రం మెమెంటోతోనే సరిపెట్టారు. దీన్ని నేను వివక్షగానే పరిగణిస్తాను. ఆ రోజు యాంకర్లు, మిమిక్రి ఆర్టిస్ట్ లు, పద్య కవులు వున్నారు ఆ తొమ్మిది మందిలో. ఆ ప్రత్యేక రోజు నిర్వహిస్తున్న ఆ సభలో... ఎవరూ ఆయన స్పూర్తికి గాని, ఆశయాలకు గాని దగ్గరగా వున్నవారు కాదు. ఆ రోజు ప్రాతిపదిక కులమే అని గ్రహించాను. ఏ సవరల మీద గిడుగు వారు కృషి చేసారో ఆ సమాజం నుంచి వచ్చిన వాణ్ణి. ఏ వ్యవహారిక భాష గురించి పాటు పడ్డారో ఆ వ్యవహారిక భాషలో రచనలు చేస్తున్న వాణ్ణి.  నన్ను అలా మినహాయించడం చాలా ఇబ్బంది పడ్డాను. ఈ సంఘటన సాదా సీదా సభల్లో జరిగివుంటే పట్టించుకునే వాడిని కాదు గానీ... అది ఒక విశ్వవిద్యాలయం నిర్వహించిన సభ కాబట్టి ఎక్కువ గా కలచి వేసింది.

26.         పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలచుకున్నారు. లేదు?

సందేశాలివ్వగలిగినంతటి వాణ్ణైతే కాదు. అందరికీ నమస్కారం.


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు