(July,2020)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు వి ఆర్ విద్యార్ధి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1 మీ బాల్యం గురించి చెప్పండి
మాది వరంగల్ సమీప గ్రామమైన గవిచర్ల. అది ఒక చారిత్రక గ్రామం. కాకతీయుల నాటిది. మా ఊర్లో కాకతీయుల కాలంలో నిర్మించిన శివుని గుడి, పాంచాలరాయ ఆలయము, గుండ బ్రహ్మయ్య గుడులు ఉన్నాయి. ఊరిని ఆనుకొని పడమర దిక్కున ఒక పెద్ద స్తంభం ఉండేది ఊరిని
ఊరికి పడమర దిక్కున వెర్రి గుట్ట, తూర్పున తొర్ర గుట్ట, దక్షిణాన న్యాల బోళ్ళు ఉన్నాయి. ఈశాన్యాన ఊరికి దూరంగా ఆర్లకుంట వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా నాలుగు ఐదు రకాల పండ్ల చెట్లతో తోటలు ఉండేవి. ఇవన్నీ చిన్నతనంలో నాలో ప్రకృతి పట్ల మక్కువ పెంచాయి.
నేను అక్టోబర్ 08, 1945 లో జన్మించాను. మా నాన్న వేలూరి నర్సయ్య (నరసింహారావు), అమ్మ కమలమ్మ. నాకు ముగ్గురు తమ్ములు, ముగ్గురు చెల్లెళ్లు. మాది వ్యవసాయ కుటుంబం. నా చిన్నతనం చాల పేదరికంలో గడిచింది.
మా నాన్నకు హిందూస్తానీ సంగీతంలో మంచి ప్రవేశము ఉంది. ప్రఖ్యాత హిందుస్థానీ సంగీతజ్ఞులు పోలవరపు నారాయణరావుకు మా నాన్న శిష్యుడు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు కానీ పేదరికం వలన ప్రోత్సహించేవారు లేక కచేరీలు చేసేవాడు కాదు. తంబూర, వీణ, ఫ్లూట్ మా నాన్న బాగా వాయించేవారు. విలక్షణమైన గాత్రము మా నాన్నది. మా నాన్న తన 73వ ఏట హఠాత్తుగా గుండె సమస్యతో మరణించడం వల్ల ఆయన గాత్రాన్ని రికార్డు చేయలేకపోయాం.
నా చిన్నతనపు అరుదైన సంఘటనలు ఇప్పటికీ నాకు గుర్తున్నవి. నా మూడేళ్ళ వయసులో తుమ్మ చెట్టు పై లంబాడా పిట్టల అరుపులు నన్ను ఆకర్షించాయి. సుమారు నాలుగేళ్ల వయసులో ఇండియన్ ఆర్మీ మా ఊర్లో క్యాంపు వేసి ఊర్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జ్ఞాపకం ఉంది. అదే వయసులో ఇండియన్ యుద్ధ విమానాలు మా ఊరి పై చక్కర్లు కొట్టడం గుర్తుంది. అప్పటికే నిజాం చెర నుండి హైదరాబాదు రాజ్యం విముక్తం అయ్యిందని తర్వాత నాకు తెలిసింది
నా ఆరేళ్ళ వయసులో ఒక సాయంకాలం ముసురు పడుతున్నప్పుడు మా పెసర చేనులో నేను పెసర కాయ తెంపుకుంటేంటే పక్కనే ఉన్న బాటపై (అది వరంగల్ - నెక్కొండ రహదారి) సుమారు ఏడెనిమిది అడుగుల ఎత్తున, బాగా గడ్డం మీసాలు పెరిగి, జుబ్బా లాంటిది వేసుకొని, రెండు చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్తూ ఉంటే చూసి భయపడి పెసర చేనులో దాక్కున్నాను. కొద్ది క్షణాల్లోనే ఆయన మాయమైనట్టు అనిపించింది. ఆ తరువాత ఎన్నో ఏళ్లకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో చూసినప్పుడు నేను ఆ రోజు చూసిన వ్యక్తి లో ఠాగూర్ పోలికలు కనిపించాయి ఠాగూర్ నేను పుట్టకముందే మరణించారు.
నా చిన్నతనంలో చాలా పెద్ద కరువు వచ్చింది. అందరూ పెసళ్ళు గుడారాలు వేసుకొని తిని ఆకలి తీర్చుకుంటున్నారు. సంపన్నులు గూడా రోజు గడక, పెసర గుడాలు తినవలసి వచ్చింది. నేను కూడా గుడాలు తినలేక ఉపవాసం ఉండేవాన్ని కొన్నిసార్లు. అందువల్ల బాగా బలహీనపడి ఒకరోజు స్పృహ కోల్పోయాను. అప్పుడు మా నాన్న మా ఊరికి కొంత దూరంలో ఉన్నపంథిని గ్రామంలో ఒక పెద్ద భూస్వామి దగ్గర వడ్లు నాగుకు తేగలిగాడు. మా అమ్మ వడ్లు దంచి బియ్యపన్నం వండి నాకు పెట్టింది. అప్పుడు కోలుకున్నాను.
మా పూర్వీకులు ఒకరిద్దరు పండిత కవులున్నా, ఆ విషయం నాకు తెలియదు. అందుకే నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ ఒకరూ కవుల గురించి పాఠం చెబుతూ కవులు అంటే తెలుసా అని క్లాసు పిల్లల్ని అడిగాడు. అప్పుడు నేను ఉత్సాహంగా లేచి ‘తెలుసు సార్, మా భూమిని కౌలుకు ఇచ్చినం కదా. అదే కౌలు అంటే’ అన్నాను. అప్పుడు మా టీచర్ నవ్వి కవులు అంటే స్వయంగా కవిత్వం రాసే వాళ్ళని చెప్పారు. అప్పుడు నా ఆశ్చర్యానికి అంతే లేదు. స్వయంగా ఎట్లా రాస్తారు అని ఎన్ని ఎన్నో రోజులు ఆలోచించేవాడిని. జవాబు దొరికేది కాదు. ఆ తర్వాత నేను నా పదకొండు సంవత్సరాల వయసులో ఆరవ తరగతి చదువుతున్నప్పుడు రాయడం ఆరంభించాను. రికార్డైన మొదటి కవిత “సైనికుడా ఓ సైనికుడా’ అనేది. మా మేనత్త భర్త జయసేన సైన్యంలో పనిచేస్తూ సెలవులపై వచ్చినప్పుడు సైనిక జీవితం గురించి చెప్పడం విని ప్రభావితుడై ఆ కవిత రాశాను అనుకుంటున్నాను.
2 మీ బాల్య జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా చెబుతారా?
తప్పక చెప్పాల్సిన దొకటి ఉంది. మా ఊరి పోలీస్ ‘పటేల్ లింగా రెడ్డి’ గారు. ఆయన ఆయనకు ఊరంతా భయపడే వారు. వారి కుమారుడే జస్టిస్ నర్సింహారెడ్డి గారు. వాళ్ళ బంగళాలో కొంత మంది పిల్లలం చదువుకునే వాళ్ళం. ఒకసారి కేశవ రెడ్డి గారి దివాన్ ఖానాలో నేను నేల మీద కూర్చున్నది చూసి వేగంగా దగ్గరికొచ్చి నా భుజాలు పట్టి లేపి కుర్చీలో కూర్చోబెట్టి ‘నాయనా నీ స్థానం ఇది. దుర్మార్గులైన మీ పాలివాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూశారు. మీ కుటుంబాన్ని కించపరుస్తూ ప్రవర్తించారు’ అన్నారు. అప్పుడు నాకు ఏడుపొచ్చింది. లేచి వారికి నమస్కరించాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంతటి కఠినమైన పోలీస్ పటేల్ నన్ను అలా గౌరవించడం సాధారణ విషయం కాదు. అప్పుడు నాకు కేశవరెడ్డి గారి మహోన్నత వ్యక్తిత్వం తెలిసి వచ్చింది.
3 మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
ప్రాథమిక విద్య గవిచర్లలో, హైస్కూల్ చదువు మా పక్క గ్రామమైన సంగెంలో, ఆ తర్వాత హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సైన్స్ గ్రూప్ తీసుకొని పి యు సి లో చేరి అర్ధాంతరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాను. ఆ తర్వాత అంతా సాంకేతిక విద్య. ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు రేడియో కమ్యూనికేషన్ లో రాడార్, ఆ తర్వాత ఇతర ప్రాంతాలలో మిస్సైల్స్ ఎయిర్క్రాఫ్ట్ రాడార్ల లో ట్రైనింగ్. ఆ చదువు కొంత కఠినమైనదే. సాహిత్యపు చదువంతా సొంతంగా చదువుకున్నదే, సాహితి మిత్రుల సాంగత్యం వల్లనే.
4 మీరు సైన్యం లో చేరడానికి కారణం?
మా మేనత్త భర్త దేవరాజు జయసేన ఆర్మీ లోని ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో పని చేసేవారు. వారి సైనిక జీవితం గురించి అనేక విషయాలు చెప్పడం వల్ల సైన్యం అంటే ఇష్టం ఏర్పడ్డది. అందువల్ల దేశభక్తి ఏర్పడ్డది. అయితే సైన్యం లో చేరమని ప్రోత్సహించింది మాత్రం లింగాల కేశవ రెడ్డి గారి పెద్ద కుమారుడు రామచంద్రా రెడ్డి గారు. ఆయన బాగా చదువుకున్నవారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన వాడు. వాజ్పేయి, అద్వానీ లాంటి వారితో సంబంధాలు ఉన్న వాడు. జన సంఘ్ సభ్యులు కూడా. ఆయనే నన్ను, తన తమ్ముడు శేషారెడ్డి ని సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. అప్పుడు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేక చదువుని వదిలివేసి ఎయిర్ పోర్స్ లో చేరాను. నాతోబాటు శేషారెడ్డి కూడా చేరిపోయాడు
5 మీ సైనిక జీవితం గురించి చెబుతారా?
నేను 1964 అక్టోబర్ 19న ఎయిర్ఫోర్స్ లో చేరాను. 1965 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నాను. 1965 లో ట్రైనింగ్ ముగించుకొని నాలుగున్నర రోజులు ఒక టీమును వెంటేసుకుని యుద్ధభూమిలో అడుగుపెట్టాను. నాలుగున్నర రోజులు సరి అయిన తిండిలేక ప్రయాణం చేసి ఒక ఉదయం పూట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చింది మంచినీళ్ళో, టీనోమ బ్రేక్ ఫాస్ట్ నో కాదు. ఒక తుపాకీ, కొన్ని రౌండ్లు! అవి ఇచ్చి మమ్మల్ని ఎయిర్ ఫీల్డ్ గార్డ్ చేయడానికి పంపించారు. అప్పుడు ట్రెంచీలో పొజిషన్ తీసుకొని శత్రువు ఏ వైపు నుండి వచ్చిన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఒక విచిత్రమైన అనుభవం. కొన్ని గంటల తర్వాత మాకు భోజనం, నీళ్లు అందాయి. యుద్ధంలో ఆకలిదప్పులు, చివరికి ప్రాణాలు కూడా ముఖ్యం కాదు. 1971 యుద్ధంలో నాది గుర్తుండిపోయే పాత్ర. శత్రు విమానాల్ని రాడార్లపై గుర్తించి డేటా మా కమాండర్ కి ఇవ్వడంలో నేను సక్సెస్ అయ్యాను. మా టీం లో నేను ఒక్కడినే ఆ పని చేయగలిగాను. మిగతా వారి స్కోప్ లు జామ్ అయ్యాయి. ఆ డాటా వల్ల శత్రు విమానాలను షాట్ డౌన్ చేయగలిగాం. ఆ శత్రు విమానాలు మా రాడార్ స్టేషన్ ను ధ్వంసం చేయడానికి వస్తున్నాయి. మా డైరెక్టర్ మిగతా టీమ్ మెంబర్స్ నన్ను బాగా మెచ్చుకున్నారు. మా ఇంచార్జ్ కీ మెడల్ కూడా వచ్చింది. ఆ రోజు ఆ మిషన్ సక్సెస్ కావడం వల్ల ఈ రోజు నేను మీ ముందు ఉన్నాను. యుద్ధంలో కమాండర్ తో పాటు అందరిదీ ముఖ్యమైన పాత్రే.
విమానాల తోపాటు కమ్యూనికేషన్స్ కి సంబంధించిన అన్ని విభాగాల్లో పని చేశాను. అంతేకాదు దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగే అవకాశం లభించింది. అన్ని భాషా సంస్కృతులకు చెందిన వారితో కలిసి జీవించే అవకాశం లభించింది. సైనిక జీవితంలో మాకు కులాలు మతాలు ప్రాంతాలు లేవు. మా అందరిదీ సైనిక కులం. భారత ప్రాంతం. నిజానికి సైనిక జీవితంలో అనేక అనుభవాలు, అనుభూతులు నన్ను కవిగా సంపన్నుడని చేసాయి.
నా జీవితంలో సైనికుడిగా నేను గడిచిన కాలం విశిష్టమైంది. సక్రియాత్మక మైనది. యుద్ధంలో ఎంతో కవిత్వం రాశాను. సైనికుడిగా యుద్ధంలో ఎంతో ఉద్విగ్నతకు లోనవుతాం. భయం ఓటమిని ఆహ్వానిస్తుంది. ధైర్యము గెలుపుని కౌగిలించుకుంది. అయితే కవిగా నేను యుద్ధ వ్యతిరేకిని. అందుకే “వద్దు వద్దు యుద్ధమని విలపించన వాడేవ్వడు? యుద్ధం కోసం నిధులను కూర్చునన్న వాడేవ్వడు?” అన్నాను. ఈ ప్రశ్న యావత్ ప్రపంచానికి వేస్తాను. మానవకోటికి వేస్తాను.
6 మీ కవితా ప్రస్థానం గురించి చెప్పండి
ఇంతకుముందే చెప్పినట్లు నేను నా 11 12 ఏళ్ల వయసులో కవిత్వాన్ని రికార్డు చేశాను. ఆ తర్వాత అడపాదడపా రాస్తుండే వాడిని. 1966లో నేను బరోడా లో ఉన్నాను. మఖరపురా ప్యాలెస్ లో ఉండేవాళ్ళం. ఒక రాత్రి కలలో ఒక స్త్రీ వచ్చి నాకు కవిత్వం డిక్టేట్ చేసింది. ఆమె సరస్వతీదేవి కాదు సుమా). తెల్లవారి నుండి కవితల మీద కవితలు రాయడం ప్రారంభించాను. ఆమె ఎవరో తెలియదు గానీ కొన్ని రోజుల తర్వాత ఆ రూపం ఒక కూలీ పని చేసే స్త్రీ ని పోలి ఉంది. ఆమె గుజరాతి స్త్రీ. రాసిన కవితల్లో 18 కాళోజీ గారికి పంపించగా అందులో మూడు కవితల్ని మిత్రమండలి లో స్వయంగా వినిపించారు. మంచి స్పందన వచ్చిందని కాళోజీ గారు ఉత్తరం రాశారు. అప్పటి నుండి క్రమం తప్పకుండా మిత్రమండలికి కవితలు పంపేవాడిని. వాటిని కన్వీనర్లు నాగిళ్ల రామశాస్త్రి, జీడి, సంధ్య రంగారావు ఇంకా ఎవరు కన్వీనర్ గా ఉంటే వాళ్లు చదివి వినిపించే వాళ్ళు. అందుకే మిత్రమండలి నా మాతృ వేదిక అని సగర్వంగా చెప్పుకుంటాను. ఎయిర్ పోర్స్ లో ఉండగా నేను బెంగళూర్, ఖరగ్ పూర్ తెలుగు కవి సభల్లో కవిత్వం వినిపించాను. ఉత్తర భారతదేశంలో ఇతర భాషా కవులతో కవితా చర్చ చేసేవాడిని. కవిత్వం వినేవాడిని, వినిపించే వాడిని. తొలిసారి ఎయిర్ఫోర్స్ లో విమానయానం చేసినప్పుడు పైలెట్ పక్కన కూర్చుని మంచి కవితనల్లాను. నా అపరిచితులు అనే కవితను పటాన్ కోట్ లో విరామసమయంలో విమానం రెక్కల కింద కూర్చొని రాశాను. హిమాలయాల్లో తిడుతూ ప్రేమలేఖ, స్మరణ మందిరం లాంటి కవితలకు పునాది వేసాను. హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు రాసిన కవితలు ఎన్నో.
7 మీరు విప్లవాలకు కేంద్ర బిందువైన ఓరుగల్లుకు చెందిన కవి గదా! అట్లాంటి మీరు మీ స్వంత మార్గంలో రాసి కాళోజీ చేత “వాడి కవిత్వం అలగ్” అని ఎలా అనిపించుకోగాలిగారు?
కాలానికి ఎప్పుడూ ఏది అవసరమో అది జరుగుతుంది. విప్లవం అవసరమైనప్పుడు అట్లాంటి సాహిత్యమే ఉద్భవిస్తుంది. అట్లాంటి రచనలు చేయడానికి ఎందఱో అంకితమయ్యారు. వారికీ నమస్కారం. నేను మొదటి నుండి మానవ జాతి రుగ్మతల గురించి ఆలోచిస్తూ వస్తున్నాను. మానవ వికాసంలో తప్పిన బాటల గురించి ఆలోచిస్తున్నాను. మనిషి శాంతిమయ జీవితాన్ని గడపలేక పోవడం గురించి చింతిస్తున్నాను. ఈ ప్రపంచంలో హింస తప్ప మరే పాపమూ లేదనే అభిప్రాయానికి వచ్చినవాన్ని. స్వార్ధానికి మూలమేమిటని శోధిస్తున్న వాడిని. ఆ ఆలోచనలే కవితల రూపంలో వచ్చాయి. అంతే!
8 మీ సాహితీ మిత్రుల గురించి, మీకు సంబంధం ఉన్న సాహితీ సంస్థల గురించి వివరిస్తారా?
సాహితీ ప్రపంచంలో నాకెంతో మంది మిత్రులున్నారు. ఎవరి పేరు చెప్పను? కాళోజీ సోదరుల ఆశీర్వచనాలతో నేను సాహితీ రంగంలో నిలిచాననుకుంటున్నాను. వేనరెడ్డి, వరవర రావు, అంపశయ్య నవీన్, కోవెల సుప్రసన్న, లోచన్, సి వి కృష్ణా రావు, అనుముల కృష్ణమూర్తి లాంటి సాహితీ వేత్తల సాంగత్యం నాకు స్పూర్తినిచ్చింది. ఇక సాహితీ సంస్థలంటారా? మిత్రమండలి, హన్మకొండ నా మాతృ వేదిక. హైదరాబాద్, నల్గొండ కు చెందినా జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక గూడా నాకు ప్రధానమైన వేదిక. వరంగల్ లోని పోతన విజ్ఞాన పీఠంలో నేను ఏడూ సంవత్సరాలు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాను. అప్పుడు దాని కార్యదర్శి సుప్రసిద్ధ సాహితీ వేత్త ఆచార్య సుప్రసన్న గారు. ఇంకా సృజనలోకం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం మొదడ్లగు సంస్థల వ్యవస్థాపకుల్లో ఒకడిని. మిత్రమండలికి గత పుష్కర కాలంగా కన్వీనర్ ని. దీని మొదటి కన్వీనర్ వరవర రావు గారు. రెండో కన్వీనర్ అంపశయ్య నవీన్ గారు. కాళోజీ సోదరులు మరో ముగ్గురు మిత్రులతో కలిసి ఈ వేదికను 1957 లో స్థాపించారు. దీనికి గతంలో నాగిళ్ళ రామశాస్త్రి గారు, సంధ్య రంగారావు గారు, జి డి మొదలగువారు కన్వీనర్లు. కాళోజీ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శిని.
9. అమెరికాకు అనేకసార్లు వెళ్లివచ్చారు గదా. అక్కడ ఏమైనా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారా?
నాకు అమెరికాలో చాలా మంది సాహితీ మిత్రులున్నారు. విన్నకోట రవిశంకర్ నాకు చాలా సన్నిహిత మిత్రులు. అయన నాకు పెమ్మరాజు వేణుగోపాలరావు, వేలూరి వెంకటేశ్వరరావు, వెల్చేరు నారాయణరావు లాంటి సుప్రసిద్ధ సాహితీ వేత్తలను పరిచయం చేయడం జరిగింది. ఇంకా అనేకులున్నారు. జంపాల చౌదరిగారు, డా క్రిష్ణ, అమర్ వేలూరి పరిచయం. అక్కడ చాలా చోట్ల సభలు నిర్వహించి నా చేత ఉపన్యసలిప్పించారు. కవితాగానం చేయించారు. అమెరికాలో నేను చాలా కవిత్వం రాసాను. వాటితో రెండూ సంపుటాలు ప్రచురింపబడ్డాయి. 2005లో డెట్రాయిట్ లో నా ‘మంచు మైదానం ‘ కావ్యం ఆవిష్కరింపబడింది. ఆ సభను సత్యనారాయణ రెడ్డి కర్ర, సుధాకర్ జి రెడ్డి మరికొందరు మిచిగాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు నిర్వహించారు. 2001 లో తానా సభలో నా సంపాదకత్వంలో వచ్చిన ‘దిక్కులు’ వీడియో కవితా సంకలనం ఆవిష్కరింపబడింది.
10. మీ కవిత్వం ఇతర భాషల్లో వచ్చిందా?
అవును. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో నా కవితా సంపుటాలు వచ్చాయి. ఇంగ్లీష్ లోకి డా. యన్ యస్ రాహుల్, హిందీ లోకి డా యం రంగయ్య , ఉర్దూ లోకి డా. ఖుత్బ్ సర్ షార్ అనువదించారు. మలయాళం లోకి యల్ ఆర్ స్వామి అనువదిస్తానన్నారు. కానీ ఆ పని పూర్తి కాలేదు. ఉర్దూలో ప్రఖ్యాత సాహిత్య పత్రిక షాయర్ నా ముఖ చిత్రంతో ప్రత్యేక సంచిక తెచ్చింది. ఇతర భాషా కవుల గురించి ప్రత్యేక సంచిక తేవడం అదే మొదటిసారట. 2012 లో ప్రఖ్యాత ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్, కవి, చిత్రకారులు బి నర్సింగరావు గారు పూనుకుని నా కవితా సర్వస్వాన్నీ అదీ 1966 నుండి 2011 వరకు ప్రచురింపబడ్డ నా కవిత్వాన్ని ప్రచురించారు. నా కవిత్వ సమాలోచన జరిపించి అద్దంలో విద్యార్ధి అనే వ్యాస సంపుటిని ప్రచురించారు. దీని సంపాదకులుగా కె జితేంద్ర బాబు, అమ్మంగి వేణుగోపాల్, వేణు సంకోజు వ్యవహరించారు. ఇవి గాకుండా నా గురించి పాలపిట్ట ప్రత్యేక సంచిక నా ముఖ చిత్రంతో వచ్చింది(20 19లో). నా కవిత్వం గురించి నియోగి ‘ప్రేరణ’ అనే విమర్శనా గ్రంధం రాసారు. డా పాతూరి రఘు రామయ్య ‘ఇలకు కలకు మధ్య’ అనే శతాధిక కవితల పుస్తకం రాసారు. ఈ రెండూ ప్రచురింపబడినవి.
11. ప్రచురింపబడిన మీ ఆరు కవిత సంపుటాలుగాక ఇంకా రావాల్సిన కవిత్వముందా? కథలు వ్రాసారా?
ఇంతవరకు అలలు (1987), పలకరింత (1996), ఘర్మ సముద్రం (2004), మంచు మైదానం(2005), ఖండాంతర(2007), ఇతర కవితలు (2012) ప్రచురితమైనవి. ఇవిగాక అచ్చు గాని కవితలు చాలా ఉన్నవి. నోట్ బుక్ ఆఫ్ వి ఆర్ విద్యార్ధి అనే పుస్తకం గూడ అచ్చు కావల్సి ఉన్నది. మొదట్లో కొన్ని కథలు రాసాను గానీ కవిత్వంపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. వ్యాసాలు మాత్రం రాస్తుంటాను.
12. జిడ్డు కృష్ణమూర్తి గారితో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారా? ఏ విషయం ఫై చర్చ జరిగింది?
1970 జనవరి 5 న ఇంటర్వ్యూ జరిగింది.అప్పుడు నా వయసు ఇరవై నాలుగేళ్ళు. ఆ రోజుకు ముందు వరం రోజులుగా మద్రాస్ లో ఉండి వారి ఉపన్యాసాలు విన్నాను. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ దొరికింది. అప్పుడు అనేక విషయాలు చర్చలోకొచ్చాయి. ముఖ్యంగా యుద్ధం శాంతి గురించి, కవిత్వం గురించి గూడా.
13. వేలూరి రాములు “వి ఆర్ విద్యార్ధి “ ఎలా అయ్యారు?
విద్యార్ధి కి మతం, కులం, ప్రాంతం ఉండవు. నిరంతరం నేర్చుకుంటూ పోవడమే విద్యార్ధి పని. “ఇక నేర్చుకునేదేమీ లేదు. అంతా నాకు తెలుసు “ అని నేను అనుకోకుండా ఉండడానికి వేలూరి రాములు విద్యార్ధి అయ్యారు. ఐతే ఈ విద్యార్ధికి మాత్రం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదనే చెప్పాలి!
14. ఇప్పుడు వస్తున్న తెలుగు సాహిత్యాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ?
తెలుగులో రాసేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఐతే ఇప్పుడొస్తున్న సాహిత్యంలో బలం లేదు. ఒక కాజ్ ల్ప్సం అంకితమైన కవులు, రచయితలు చాలా తక్కువయ్యారు. సాహిత్యంలో కెరీరిజం పెరిగింది. పత్రికల కోసం రాస్తున్నవారు ఎక్కువయ్యారు. అవార్డులు తెచ్చుకోవడం కోసం, పాపులారిటీ కోసం రాస్తున్నారు. ఇప్పటి కవుల్లో రచయితల్లో చాల మందికి అధ్యయనం లోపించింది.
15. వరంగల్ సాహిత్య వాతావరణం ఎలా ఉంది?
చాలామంది రాస్తున్నారు. అందుకు సంతోషం. గతంతో పోల్చుకుంటే మాత్రం అసంతృప్తిగా ఉంది. వరంగల్ తెలుగు సాహిత్య రాజధాని అనే విషయం ఈ తరం మరిచిపోవద్దు. వరంగల్ పాల్కూరికి సోమన, బమ్మెర పోతన, కాళన్నల మాతృభూమి. పి వి నరసింహారావు, సంపత్కుమార, సుప్రసన్న, వరవరరావు, అంపశయ్య నవీన్, అనుముల కృష్ణమూర్తి లాంటి ఉద్దండులకు అనుజులమనే స్పృహలో ఉండాలి. ఆ స్పృహలో రచనలు చేయాలి. విలువల కోసం నిలబడ్డది వరంగల్. ఏ ఉద్యమమైనా అది తాత్విక పరమైనదయినా, సామాజికపరమయినదయినా ఇక్కడే ఆరంభవమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి సారిగా రచయితల ఐక్యవేదిక ఏర్పడ్డది వరంగల్ లోనే గదా! ఈ తరం రచయితలు కొత్తగా చూడాలి. ఆలోచించాలి. రాయాలి. కానీ మనం ఎవరికీ వారసులమో గుర్తుంచుకుని సాగాలి.
16. వి ఆర్ విద్యార్ధి కవిత్వాన్ని సమాలోచన చేస్తూ స్ప్రసిద్దులు కొందరు వి ఆర్ విద్యార్ధిని స్థానిక విశ్వ మానవుడు, శుద్దమానవుడు, దార్శనికుడు, తాత్వికుడు, ఖండాంతర కవి, గ్లోబల్ పోయెట్, ప్రపంచ కవి – ఇలా ఎన్నో కితాబులిచ్చారు. ఇందుకు మీరెలా స్పందిస్తారు?
అట్లా అభిప్రాయపడడం ఆ సాహితీ వేత్తల ఔన్నత్యం. వారికీ వినమ్రంగా శిరసు వంచి నమస్కరిస్తాను. నా గురించి నేను ఎప్పుడూ అంచనా వేసుకోలేదు. అందుకు సాహసించను కూడా.
17 మీ కుటుంబం గురించి చెప్పనే లేదు ?
నా సహచరి పేరు రత్నమాల. జీవితంలో నా కష్ట సుఖాల్ని సమంగా పంచుకున్నది. ఆరోగ్యకరమైన మనస్తత్వం ఆమెది. ఉన్నదాంట్లో తృప్తి పడుతుంది. మాకు ఇద్దరు కుమారులు. అమరేంద్ర, శైలేంద్ర. అమరేంద్ర సహచరి ప్రణతి. వాళ్ళకు ఇద్దరు కూతుళ్ళు. శైలేంద్ర సహచరి కార్తి. వాళ్ళకు ఇద్దరు కొడుకులు. అమరేంద్ర పెద్ద కూతురు ఇంగ్లీష్ లో చిన్న వ్యాసాలు వ్రాసింది. రెండో కూతురు కథక్ డాన్సర్, హిందూస్థానీలో పాడుతుంది. శైలేంద్ర పెద్దబ్బాయి వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ముఖ్యంగా పియానోలో బాగా ప్రవేశమున్నవాడు. కంపోజింగ్ చేస్తుంటాడు. అమరేంద్ర ఇంగ్లీష్ లో తెలుగు రచనలు చేస్తుంటాడు. శైలేంద్రకు విమర్శనా రంగంలో ప్రవేశమున్నది.
18. మీ ఆలోచన మార్గాన్ని తెలిపే కవితలను ప్రస్తావిస్తారా?
ఎన్నో ఉన్నవి. అపరిచితులు, అమాయకం, యుద్ద శాంతి, హింసమత్తు, పునాది, ఒకడూ –ఇంకొకడూ, పక్షి - ఇలా ఎన్నో...
19. చివరిగా ఒక ప్రశ్న – మీరు జీవితంలో తెలుసికున్నదేమిటి? ఈ తరానికి మీరిచ్చే సందేశం ఏమిటి?
ఈ ప్రపంచంలో హింస తప్ప మరే పాపమూ లేదని తెలుసుకున్నాను. హింస రక్తపాతమే కాదు, అనేక విధాలుగా ఉంటుంది. హింసకు మూలం మనిషిలో అస్పష్టత, అభద్రతాభావం. వాటివల్లా స్వార్ధం పెరుగుతుంది. స్వార్ధం అహంభావాన్ని పెంచుతుంది.
ఇక సందేశామంటారా – ఎవరూ ఎవరికీ సందేశమివ్వలేరు! ఎవరికీ వారు తమ మార్గాన్ని వెతుక్కోవడమే! మనిషిలో స్పష్టత ఉన్నప్పుడు జీవితంలో మనకేమి కావాలో తెలిసినప్పుడు జీవితం సుఖంగా, శాంతియుతంగా సాగిపోతుంది. అంతే..
Sep 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు