ఇంటర్వ్యూలు

ఇంటర్వ్యూలు

సాహిత్యమూ జీవితము వేరువేరు కాదు – అన్నవరం దేవేందర్‍

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు అన్నవరం దేవేందర్‍ గారు  ఇచ్చిన ఇంటర్వ్యూ

అన్నవరం దేవేందర్‍ నిరంతరకవి. ఆయన కవిత్వంలో తెలంగాణ జీవితం, భాష తొణికిసలాడతాయి. ‘‘మంకమ్మతోట లేబర్‍ అడ్డ ’’ ప్రపంచీకరణ నేపథ్యాన్ని, చితికిన పల్లెలు పట్టణాలకు వలసపోవడం చిత్రించింది. ఇప్పటివరకు (11) కవితా సంకలనాలు తెలుగులో (2) ఆంగ్ల కవితా సంకలనాలు Farmland Fragrance, unyielding sky వచ్చినాయి. ‘‘ఊరి దస్తూరి’’ కాలమ్‍ గత యాబై సంవత్సరాలుగా గ్రామాలలో చోటు చేసుకున్న పరిణామాలను కళ్ళకు కట్టింది. ‘‘మరోకోణం’’ సామాజిక వ్యాసాలు వెలువడినాయి. ఇంత సుధీర్ఘ సాహితీ ప్రస్థానం ఉన్న కవి అరవయవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జరిపిన ఇష్టాగోష్ఠి ఇది.

1.         కవిత్వం రాయాలనే బలమైన కోరిక ఎట్లా పుట్టింది. ఏ కవుల నుండి మీరు ప్రేరణ పొంది కవిత్వం రాస్తున్నారు. మిమ్ములను కదిలించిన కవితా సంకలనాలు ఏవి?

జ.    1980వ దశకంలో కవిత్వాన్ని ఆసక్తిగా చదువుతున్న సందర్భంలో 1990 తర్వాత నాకు కవిత్వం రాయాలనిపించింది. ముఖ్యంగా శ్రీశ్రీ, శివ సాగర్‍, చెరబండరాజు, గోపి, వరవరరావు, శివారెడ్డి,                   సి. నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్‍ కవిత్వం చదవడం వల్ల ప్రేరణ లభించింది. జూకంటి జగన్నాథం, నందిని సిధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య వీళ్ళ కవిత్వం ఇష్టం అనిపించేది. నాకు వ్రాయాలనే ఆసక్తి కలిగించింది.

2.         కవికి వ్యక్తిగత జీవితం, సాహిత్య జీవితం రెండూ ఉంటాయంటారు. కవిత్వంలో ప్రతిపాదించిన విలువలను జీవతంలో ఆచరించవలసి ఉందా? సాహిత్యాన్ని జీవితాన్ని వేరుగా చూస్తారా?

జ.       కవి యొక్క సామాజిక వ్యక్తిగత ఆలోచనల ప్రతిఫలనాలే కవిత్వం. కవిత్వం, కవి జీవితం  ఆచరణల ప్రతిబింబం కావాలి. ఆచరణ లేకుండా రాసే చిలుక పలుకులు ప్రజలు గమనిస్తారు. ఎవరికైనా సాహిత్యమూ జీవితము వేరువేరు కాదు.

3.         ఇటీవల ఫేస్‍బుక్‍, వాట్సప్‍ వచ్చినంక కవిత్వానికి ఎక్కువ ప్రాచుర్యం దొరికింది. రోజూ ప్రచారంలో ఉండాలనే యావ కవిత్వాన్ని పలుచన చేయదా? బలమైన కవిత్వం వస్తలేదనే విమర్శ ఉంది. మీ అభిప్రాయం చెప్పండి?

జ.       ఫేసుబుక్‍, వాట్సాప్‍,సోషల్‍ మీడియాలో కవిత్వం విస్తతంగా వస్తుంది. దాన్ని ఆహ్వానించాల్సిందే. నవతరం కవులు ఆ మాధ్యమాలు ఉపయోగిస్తున్నారు, వీటినీ వాడుకుంటున్నారు. కవిత్వం పలచన అవ్వడం ఎప్పుడూ ఉన్నదే. ఈ తరంలోనూ గొప్ప కవిత్వం మరింత చిక్కగా వస్తుంది.

4.         సాహిత్య సమూహాలు ఎవరి గుంపులోని వారిని వారు ఆకాశానికి ఎత్తుతున్నారు. దానిలో సాహితీ విలువలు ఉన్నా లేకున్నా అనే విమర్శ ఉంది. వివరిస్తారా?

జ.       ఇదంతా విలువలు పతనం అవుతున్న ప్రచారపు దశ. సమూహాలు ఎవరికి వారివే ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఆకాశానికి ఎత్తుకున్న అందులో పస లేకుంటే రాలిపోవుడే కదా.

5.         ఈనాడు సాహిత్య విమర్శ అంటే ఆహా! ఓహో అని పొగడడమే అని స్థిరపడిపోయింది. ఏదైనా విమర్శనాత్మకంగా అంచనా వేస్తే ఓర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏమంటారు?

జ.       ముందు తరం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం నేర్చుకోవడం తగ్గిపోయింది నిజమే. నాలుగు కవితలు రాసి నలుగురు మెచ్చుకోవాలనే యావ కూడా పెరిగింది. అయితే ఇందులో కవిత్వం విలువలు లేవు, వచనమే తేలియాడుతూ ఉంది అంటే చిన్నబుచ్చుకుంటున్నారు కూడా. నిజానికి నికార్సయిన మంచి విమర్శకులు కూడా లేని కాలం ఇది.

6.         మీరు కవిత్వం రాయడానికి కుటుంబ నేపథ్యం ఏమైనా ఉపయోగపడిందా?

జ.       కవిత్వం రాయడానికి కుటుంబ నేపథ్యం ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబము కులవృత్తి, సామాజిక నేపథ్యం, పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న చదువు, స్నేహాలు ఇవన్నీ మన ఆలోచనలను ఒక అధ్యయన దృక్పథం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఇంటిలో కవికి ఒక ఒంటరి వాతావరణం ఉండాలి. తన ఆలోచనాసరళికి గాని, రాతకోతలకు గాని తనకు ఒక సొంత స్పేస్‍  ఉండాల్సిన అవసరం ఉంటది. రాస్తున్న కవి ప్రభావం ఆ కుటుంబం మీదా పడుతుంది. ఇప్పుడు నా సహచరి ఏదునూరి రాజేశ్వరి కథలు రాస్తుంది

7.         అన్నవరం శ్రీనివాస్‍ (మీ తమ్ముడు) మీ ప్రతి పుస్తకానికి ముఖచిత్రం వేసినాడు. ఇది ఆయనకు కూడ కీర్తి సముపార్జించిందనుకొంటున్నారా?

జ.       నేను కవిత్వం ఎట్లా రాస్తానో మా తమ్ముడు బొమ్మలు అట్లా గీస్తాడు. నా పుస్తకాలతోపాటు ఇప్పటికే వందలాది పుస్తకాలకు ముఖచిత్రాలు వేశాడు. ఎన్నో చిత్ర ప్రదర్శనలలో తన బొమ్మలు ప్రదర్శించారు. మాది ఒకరిది కవిత్వం మరొకరిది చిత్రం.

8.         ఈనాటి కవిత్వం సమాజానికి దూరమై వైయక్తిక అనుభూతులకు పెద్దపీట వేసిందనే విమర్శ ఉంది. మీరేమంటారు?

జ.       సమాజానికి దూరమైందని భావన ఏమీ లేదు కానీ, సాహిత్యం ఉద్యమానికి ఆయువు ఎలానో ఉద్యమాలు కూడా సాహిత్యానికి ఆక్సిజన్‍ లాంటివి. ఉద్యమాల వెలుగులోనే అభ్యుదయ విప్లవ కవిత్వం వచ్చింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం నుంచి తెలంగాణ కవిత్వం వచ్చింది. అట్లాగే దళిత స్త్రీవాద సాహిత్యం కూడా సృష్టించబడింది. ఇప్పుడు సమాజంలో ఒక ఫోర్స్గా ఉండాల్సినంతగా ఉద్యమ వాతావరణం లేదు. అందుకే వైయక్తిక అనుభవాలు కవిత్వాలు అవుతున్నాయేమో...

9.         తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ గత వైభవాన్ని కీర్తించి, ఆంధ్ర వలస పాలకుల దోపిడీని ఎండగట్టిన కవులు తెలంగాణ వచ్చినంక గొంతుకలు మూగపోవడానికి కారణం? ఎలాంటి పీడన లేని సమాజం వచ్చిందంటారా?

జ.       దోపిడీ పీడన లేని సమాజం ఎక్కడ వచ్చింది. ఏర్పడకుండా చాపకింద నీరులా పీడన అనచివేత కొనసాగుతూనే ఉంది. కానీ ఇది బానిస భావజాలం అని తెలుస్తలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గత వైభవం, అప్పటి వలసాంధ్ర ఆధిపత్యం సాహిత్య వస్తువులయ్యాయి. ఇప్పుడు అడపా దడపా సాహిత్య సృష్టి జరుగుతుంది. నిజమే కానీ రావాల్సినంత రావడం లేదు.

10.       తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ కోసం ఆడిపాడిన కళాకారులను ‘‘సాంస్కతిక సారథి’’లో జీతగాళ్ళుగా తీసుకొన్ని ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఉపయోగించు కోవడం వలన ప్రజల పాట చచ్చిపోయింది అనే ఒక వాదన ఉంది. మీ వివరణ ఏమిటి?

జ.       తెలంగాణ కళాకారులు సాంస్కతిక సారథిలో వేతనజీవులుగా నియమింపబడటం పెద్ద తప్పు పట్టాల్సినది ఏమీ లేదు. ఎందుకంటే ఉదర పోషణార్థం అందరూ ఉద్యోగాలు చేయాల్సిందే. మనమందరం అట్లా చేస్తున్న వాళ్ళమే. అయితే పోరాటాల పాట తిరిగి పుట్టాల్సిందే.

11.       తెలంగాణలోని వాగ్గేయకారులు తాము నడిచి వచ్చిన దారిని మరిసి ప్రకృతి కవులుగా మారి, ప్రభుత్వ ప్రచార సారథులుగా మారి పదవుల గండ పెండేరాలను తొడుక్కొన్నారు అన్న విమర్శ ఉంది? మీరేమంటారు?

జ.       కవి ఎటువైపు నిలబడాలో కవి నిర్ణయించుకోవాల్సిందే. ప్రభుత్వంలో కవి, రచయిభాగమై పనిచేయడం మంచిదే కదా. కవి రచయిత  నడపాల్సిన సంస్థను ఇంకెవరో అనామకునికి అప్పగిస్తే ఎలా ఉంటుంది. అయితే ప్రభుత్వంలో నిలబడ్డ కవి, రచయిత, కళాకారుడు తన ప్రజా దృక్పథానికి మాత్రమే అనుగుణంగా ఉండాలి. ఒక జడ్జిలాగా స్వతంత్రంగా వ్యవహరించాలి.

12.       ప్రజల కోసం పని చేసే మేధావులు ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని సంపాదించి, ప్రజలను మరచిపోవడం వలన పౌర సమాజం లుప్తమయింది అంటారు. పౌర సమాజం క్రీయాశీలంగా ఉంటేనే చట్టబద్ధ పాలన ఉంటుందంటారు? మీ స్పందన తెలపండి?

జ.       పౌర సమాజం, ప్రజాసంఘాలు క్రయాశీలంగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వానికి కూడా మంచిది. ప్రభుత్వం నడిపే రాజకీయ పార్టీలకు ఎదురు లేకుండా, ఎదురు చెప్పకుండా                                  ఉండాలనుకుంటారు. కానీ అంతిమంగా అది నియంతృత్వం వైపు దారి తీస్తుంది. మనం చూస్తున్నాం. ప్రజా చైతన్యం జాగరూకతతో ఉండాలి. లేకుంటే సమాజం నిర్వీర్యమై పోతుంది.

13.       ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయి. భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వారిని శత్రువులుగా పరిగణించి అణచి వేస్తున్నారు. ఈ పరిణామం సాహిత్యంలో ఎంతవరకు చిత్రితమవుతుంది?

జ.       ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం అధికారంలో పైచేయిగా ఉంది నిజమే. దానితో పాటే మార్కెట్‍ శక్తులు చేతులు కలిపాయి. ఇప్పుడు రాజ్యాలను మార్కెట్లు బడా పెట్టుబడిదారులు తమ వ్యూహాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ఆయా సంస్కతులు  మార్కెట్‍ అనుగుణంగా మార్చుకుంటున్నాయు. ఈ పరిణామాలు సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో స్వల్పంగా చోటు చేసుకుంటున్నాయి. గ్లోబలైజేషన్‍ తర్వాత ఈ విష పరిణామాలు విస్తతమై పోతున్నాయి.

14.       రాజు కరుణిస్తే విలాసం, రాజు కరుణించకుంటే విలాపం.  ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సృజనకారులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ?

జ.       ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళుగానే అర్థం చేసుకుంటాం, ఇట్లాంటి వారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు.  సాహిత్య సృజన చేస్తున్నది ప్రజల కోసమా, ప్రభువుల కోసమా అనే ఎరుక నిరంతరం ఉండాలి.

15.       మీకు ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు, మీరు రావాలని కోరుకుని రాకపోయిన అవార్డులు ఏమైనా ఉన్నాయా ? అసలు అవార్డుల మీద మీ అభిప్రాయం ?

జ.       అవార్డులు పురస్కారాలు సాహిత్య సృజనకు ఒక చిరు ప్రోత్సాహమే తప్ప గీటురాళ్లు కావు.  నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, తెలంగాన సారస్వత పరిషత్‍ పురస్కారంతో పాటు మరెన్నో బాగానే వచ్చాయి.  కోరుకుని రాకపోయిన అవార్డులు అని అడిగారు అట్లాంటివి పెద్దగా ఏమీ లేవు.  అయితే కవులు ఎవరూ పురస్కారాల కోసం రాయరు.  అవార్డు సృజనను సృష్టించలేదు.

16.       మీ కవిత్వంలో మీకు నచ్చిన సంకలనం ఏది ? కారణాలు వివరిస్తారా ?

జ.       నా కవిత్వంలో నాకు నచ్చింది అని ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ 2005 లోని నా మూడవ కవితాసంపుటి ‘‘ మంకమ్మతోట లేబర్‍అడ్డా ’’ నా సిగ్నేచర్‍ పోయెట్రీ.  అందులో తెలంగాణా ఉద్యమము, రైతులు, కూలీల వలసలు, ప్రపంచీకరణ దుష్పరిణామాలు కవిత్వీకరించబడ్డాయి.

17.       ప్రపంచ వ్యాప్తంగా కొద్దిమంది దగ్గర సంపద పోగుపడే అభివృద్ధి నమూనా కొనసాగుతుంది కదా ! ఈ పరిస్థితి మారి అందరి కోసం ఒక్కరు, ఒక్కరికోసం అందరు అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ?

జ.       ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు మహా సంపన్నులవుతున్నారు.  ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతున్నది.  దీనికి దోపిడీ పీడన లేని సోషలిస్ట్ సమాజ నిర్మాణమే అవసరం.  అయితే పెట్టుబడిదారీ విధానం బహు జాగ్రత్త, అది రాకుండా దూరదృష్టితో అడ్డుకుంటుంది.

18.       తెలంగాణ వచ్చినంక కూడా ప్రకృతి వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతుంది.  కారణం ఏమిటి?

జ.       తెలంగాణ రావడం అంటే ఏదైనా సోషలిస్టు సమాజం వచ్చినట్టా, కాదు కదా ! పాలకులు వారే పార్టీల పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయి.  రాజ్య యంత్రాంగం, చట్టాలు, లోగుట్టులు, స్వభావాలు, ప్రభావాలు అవే కదా

ఇంటర్వ్యూలు

నిజమైన సాహిత్య విమర్శ, సాహిత్యాన్ని మెరుగు పరుస్తుంది – కిరణ్ విభావరి 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కిరణ్ విభావరి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.. మీ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని మాటలు.....

నా పేరు కిరణ్. విభావరి అనేది నా కలం పేరు.

మా స్వస్థలం విశాఖ. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాం. వృత్తి పరంగా నేనో అధ్యాపకురాలిని. ఐఐటీ ఫౌండేషన్ (మాథ్స్) కోచింగ్ ఇస్తూ ఉంటాను. వందలాది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది, వారికి మంచి శిక్షణ ఇచ్చానన్న ఆత్మ సంతృప్తి ఉంది.

2.. మీ సాహిత్య ప్రస్థానం

2020 కరోనా మూలంగా నా కోచింగ్ ఆపివెయ్యాల్సి వచ్చింది. అంతకు ముందు, ఒకటి రెండు కథలు రాసి పత్రికకు పంపాను కానీ సమయాభావం వల్ల సీరియస్ సాహిత్యం వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కరోనా లాక్ డౌన్ నాకు బోల్డంత సమయాన్ని మిగిల్చింది. అప్పుడే ఫేస్ బుక్ ఖాతా తెరిచాను. సృజనశీలుల పరిచయం ఏర్పడింది. Whatsapp లో సాహిత్య గ్రూపుల్లో చేరి, కథలు, కవితలు వాటి  పోటీలు వంటి వివరాలు తెలుసుకున్నాను. అంతకు ముందు వరకు ఏవేవో వార పత్రికల్లో వచ్చే కథల్నే తెలుగు సాహిత్యం అని భ్రమించిన నాకు, ఈ సాహిత్య సమాచారం చాలా కొత్తగా తోచింది. ఎన్నో పుస్తకాలు , రచయితలు వారి రచనలు వ్యాసాలు...ఇలా ఎన్నో పరిచయం అయ్యాయి. పరిచయాలూ పెరిగాయి. తెలియని విషయాలు తెలిశాయి.

నాకు కవిత్వం చదవడం మీదున్న ఆసక్తి రాయడం మీద అస్సలు లేదు. రాసి కన్నా వాసి ముఖ్యం అని నా అభిప్రాయం. నాలాంటి భావజాలం కలిగిన మిత్రులతో అప్పుడప్పుడు సాహిత్య గోష్టి చేస్తూ ఉండేదాన్ని. అలాంటి సమయంలో నా మిత్రురాలు శ్రావణి గుమ్మరాజు ప్రోద్భలంతో మొదటి సారి కవిత రాసి, ఆఖరి నిమిషంలో NATS పోటీకి పంపాను.  ఆ పోటీ గురించి ఆ తర్వాత ఇక ఆలోచన చెయ్యలేదు. అయితే కొన్ని రోజుల్లో మీరు ఫైనల్ కాబడ్డారని NATS నిర్వాహకుల నుండి మెసేజ్ చూడగానే నా ఆనందానికి అవధుల్లేవు. అదో అద్వితీయమైన అనుభవం. సినీ కవుల సమక్షంలో నా కవితని వినిపించడం, వారు తిలక్ గారి కవితతో నా కవితని పోల్చడం నిజంగా ఒక మధురమైన అనుభూతి.

ఆ తర్వాత, అదే ఊపులో NATA పోటీకి కూడా కవిత పంపాను. అందులోనూ విజేతగా నిలిచాను. నాకు కవిత్వ భాష తెలియదు కానీ కవిత్వ ఆత్మను పట్టుకోగలిగాను. నేను చెప్పాలి అనుకున్న బలమైన అంశాలను నాదైన శైలిలో చెప్పాను. అయితే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మాత్రం అఫ్సర్ గారు మాత్రమే. ఆయన కవితలు యూ ట్యూబ్ లో విని, నేను నా భావాల్ని అక్షరికరించాను. విజయం సాధించాను. ఒకరకంగా నేను ఆయనకు ఏకలవ్య శిష్యురాలిని.

ఈ రెండు పోటీలూ నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎటువంటి సాహిత్య వారసత్వం లేకున్నా, కేవలం ఈ విజయాలే నన్నూ ఒక రచయిత్రిగా నిలబెట్టాయి. ఆ తర్వాత కథల పోటీలో పాల్గొని, స్వెరో టైమ్స్ వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి అందుకున్నాను. మొమ్స్ప్రెస్సో వారు నిర్వహించిన కథల పోటీలో కూడా ప్రథమ బహుమతి అందుకున్నాను.

సాహిత్యం ఒక వ్యసనం అని కొందరు రైటర్స్ చెబుతూ ఉంటారు. నిజమే.. అయితే ఈ విజయాలు అంత కన్నా ఎక్కువ మత్తునిస్తాయి. ఇక అప్పటి నుండి ఏడాది పాటు కేవలం పోటీలకు మాత్రమే రాయడం మొదలు పెట్టాను. ఏ పోటీకి రాసినా ఏదో ఒక బహుమతి అందుకున్నాను. కానీ ఏదో వెలితి. అందరికన్నా ఉత్తమంగా నిలవాలనే నా తపన నన్ను ఎక్కడా ఆగనివ్వలేదు. ఆ క్రమంలోనే ఎన్నో పుస్తకాలు చదివాను. నాలో పరిణితి పెరిగింది. మొదట్లో ఉన్నంత ఉబలాటం ఇప్పుడు లేదు. పరుగులు ఆపి ప్రశాంతంగా సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను నేను మెరుగు పరుచుకుని, కలకాలం నిలిచిపోయే ఉత్తమ సాహిత్యం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాను.

3.         మీకు బాగా గుర్తింపు తెచ్చిన మీ రచన

కిరణ్ విభావరి అనగానే కాఫీ పెట్టవు కథ అందరికీ గుర్తుకు వస్తుంది. ఒక ఫేస్ బుక్ గ్రూపు వారు నిర్వహించిన పోటికై ఆ కథ రాశాను. ఒక గంటలో రాసేసిన కథ. కానీ ఆ కథ వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. నా పేరు లేకుండా, వేరే రచయితల పేరుతో ఎన్నో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆ కథ నేనున్న ఒక వాట్సప్ గ్రూపులో వేరే వారి పేరుతో రావడం నిజంగా చాలా బాధ వేసింది. దాంతో సారంగ ఎడిటర్ అఫ్సర్ గారిని అభ్యర్థిస్తే, నా వేదనను పాఠకులకు చేరేలా ఆయన అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సాక్షి పత్రికలో కూడా ప్రచురితం అయ్యింది. ఎందరో పాఠకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆస్ట్రేలియా, UK వంటి దేశాల నుండి పాఠకులు, కొందరు రచయితలు నా నంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చెయ్యడం మరిచిపోలేని అనుభవం. వారంతా ఇప్పుడు నాకు మంచి మిత్రులు అయ్యారు.  ఒక యూ ట్యూబ్ చానెల్ వారు ఆడియో కథగా ప్రసారం చేసిన నెలలోనే లక్షన్నర వీక్షకుల ఆదరణకు నోచుకుంది.

4.         తపన రచయితల కర్మాగారం అనే గ్రూపు యెందుకు మొదలు పెట్టారు?

గ్రూపు మొదలుపెట్టి ఏడాది పూర్తి అయ్యింది.  దాదాపు 6 వేల మంది ఔత్సాహిక యువ రచయితలతో పాటు లబ్ద ప్రతిష్ట రచయితలూ ఉన్నారు. పిల్లల పెద్దల మేలుకలయికతో వారి అనుభవాలు సూచనలు సలహాలతో గ్రూపు నుండి ఎందరో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. సాహిత్యం గురించి తెలుసుకునే పరంలో నేను ఏదైతే అనుభవించానో అది మరొకరు అనుభవించకుండా ఉండేందుకు ఈ గ్రూపును ఏర్పాటు చేశాను. ఎటువంటి సాహిత్యపరమైన సందేహం అడిగినా చిటికెలో సమాధానం దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? కొత్తగా రాయాలి అనుకున్నవారు, రాస్తున్నవారు ఎవరైనా సరే, సీనియర్ రచయితల భిన్న అనుభవాల నుండి ఎంతో కొంత తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చు. ఇబ్బడిముబ్బడిగా ఉన్న రచయితల్లో రచన సామర్థ్యం కొరతగా ఉంది. వారిలో  కొత్త కొత్త ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వడంలో కాస్త తడబడుతున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చే విధంగా ప్రతి వారం, కొన్ని కొత్త పాఠాల్ని చెబుతూ కొందరు మార్గదర్శకులు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.

5.         ఉత్తమ రచన అంటే ఏమిటి? దానిని. నిర్దేశించే వారు ఎవరు?

నేను రచయిత కన్నా ముందు ఒక పాఠకురాలిని. నా దృష్టిలో పాఠకులే ఉత్తమ రచనల్ని గుర్తిస్తారు. ఈరోజు చదివి రేపు మర్చిపోయే రచనల్ని సాహిత్యం అనరు. ఆలోచన రేకెత్తించాలి. పదికాలాల వరకూ గుర్తు పెట్టుకోవాలి. సమాజంలోని కుళ్ళును ప్రక్షాళన చేయకున్నా, కనీసం స్వేచ్చగా స్వరం వినిపించాలి.  ఏ వాదాలనో సిద్ధాంతాలనో బలవంతంగా పాఠకుడి మీద రుద్దకుండా, పాఠకుడికి ఆలోచించగలిగే అవకాశం కల్పించాలి. ఏ వర్గానికో, సమూహానికో కొమ్ము కాయకుండాసమాజ స్వభావాన్ని నిష్పక్షపాతంతో సమర్ధవంతంగా  తెలియజేయాలి.

6.         మీకు బాగా నచ్చిన రచనలూ, రచయితలూ

ఒక రచయిత రాసిన అన్నీ రచనలు అద్భుతంగా ఉండాలనెం లేదు. కాకపోతే కొందరి రచనలు మాత్రం ఎక్కడ కనిపించినా వదలకుండా చదువుతాను.  అఫ్సర్, అనిల్ డాని, పి. సుష్మ, వెంకటేష్ పువ్వాడ, తగుళ్ళ గోపాల్ గారి కవితలు ఇష్టంగా చదువుతాను. బాగున్నవి దాచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. ఇక రచయితల్లో నాకు బాగా నచ్చిన రచయితలు చాలా మంది ఉన్నారు. వివేకానంద మూర్తి గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, సన్నపురెడ్డి గారు, సలీం గారు సింహ ప్రసాద్ గారు, సుంకోజి దేవేంద్రాచారి గారు, వెంకట మణి ఈశ్వర్ గారు, మల్లీశ్వరి గారు, కుప్పిలి పద్మ గారు, సమ్మెట ఉమాదేవి గారు, గీతాంజలి గారి రచనలు చాలా నచ్చాయి.

అయితే వ్యక్తిగతంగా మాత్రం, సాహిత్య ప్రస్థానపు తొలినాళ్ళలో ఉండవల్లి గారు, శరత్ చంద్ర గారు అందించిన ప్రోత్సాహం మరువలేనిది.

ఇక ఈ మధ్యే నవలలు చదవడం మొదలు పెట్టాను. నేను చదివిన తొలి నవల, సలీం గారి కాలుతున్న పూల తోట. అది చదివాక కొన్ని క్షణాలు పాటు ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని కూర్చుండి పోయాను. అంత హృద్యంగా ఉందా నవల. అదే నవల మీద సమీక్ష రాసి ఒక పోటీకి పంపిస్తే నాకు ఉత్తమ బహుమతిని తెచ్చిపెట్టింది. ఇక పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి, కేశవ రెడ్డి గారి అతడు అడవిని జయించాడు, సన్నపురెడ్డి గారి కొండ పొలం నాకెంతో ఇష్టమైన నవలలు.

7.         మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత

రచనా పరంగా ప్రభావితం చేసిన వారు చాలా మంది ఉన్నారు కానీ తమ ఆదర్శనీయమైన వ్యక్తిగత జీవితంతో ప్రభావితం చేసినవారు మాత్రం సింహ ప్రసాద్ గారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకుని, నేనూ ఎంత సంపాదించినా అందులో కొంత సమాజం కోసం వెచ్చించాలి అనే నియమం పెట్టుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం కూడా నేనాయన దగ్గరే నేర్చుకున్నాను. 

ఇకపోతే, నా కథలన్నిటికి తొలి పాఠకులు, సమీక్షకులు డా. వివేకానంద మూర్తి గారు. ఆయన కూడా ఎన్నో గుప్త దానాలు చేస్తూ, ఎందరికో అండగా నిలిచారు. నాకు ఆదర్శ ప్రాయులు అయ్యారు. నేనెప్పుడైనా నిరాశకు, నిర్లిప్తతకు గురైనా నాకు కొండంత ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని అందించే నా ప్రియతమ మిత్రులు ఆయన.

8.         మీ కథా సంపుటి గురించి..

మా నాన్న గారి కోరిక మేరకు కేవలం కొందరు సన్నిహితులకు పంపడానికి లిమిటెడ్ కాపీలతో నఖాబ్ అనే కథల సంపుటి ప్రచురించాను. నిర్మొహమాటంగా వాస్తవం చెప్పాలంటే, ప్రమోషన్ లేనిదే పుస్తకాలు అమ్ముకోవడం చాలా కష్టం. వాణిజ్య ప్రకటనలు తిమ్మిని బమ్మి చేయగలవు. అలా కొన్న కొన్ని పుస్తకాల కుప్పలు నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. నేను అడిగితే నా పుస్తకాల గురించి మాట్లాడే రచయితలు చాలా మంది ఉన్నారు. కానీ పాఠకుడే నా వాక్యాన్ని ప్రేమించి, దాచుకోవాలనే బలమైన కోరికతో నా పుస్తకం కొనాలి. అంత వరకూ నేను పుస్తకాలు ప్రచురించదలుచుకోలేదు.

9.         యువత సాహిత్యంలో వెనుక బడ్డారు అనే విషయం మీద మీ అభిప్రాయం

తెలుగు సరిగ్గా రాయడం రాకున్నా, విరామ చిహ్నాలు ఎలా పెట్టాలో తెలియకున్నా డైరెక్ట్ గా బుక్స్ వేసి, అవే ఉత్తమ కథలుగా దండోరా వేయించి వేలల్లో పుస్తకాలు అమ్ముకుంటున్న కొందరు యువ రచయితలను చూసి, యువ కలాలకు పదును లేదు అనే భావనలో చాలా మంది ఉన్నారు.  కానీ

ఇది కేవలం అపోహ మాత్రమే. ఈ మధ్య కాలంలో ఎందరో యువ రచయితలు తమ వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి రచనలు చేస్తున్నారు. బహుశా వేణుగోపాల్, ఇండ్ల చంద్ర శేఖర్, చరణ్ పరిమి, స్పూర్తి కందివనం, అరుణ్ కుమార్ ఆలూరి, రవి మంత్రిఇలా చాలా మంది యువ రచయితలు ఉత్తమ సాహిత్యం అందిస్తున్నారు. అయితే  యువ రచయితల అక్షరం అందరికీ చేరడం లేదు. కేవలం కొందర్ని మాత్రమే వెనకేసుకు వస్తున్న సాహిత్య పెద్దలు కూడా ఇందుకు కారణమే. ఈ విషయంలో నేను కొంత అదృష్ట వంతురాలినే. ఇందూ రమణ గారు, జయంతి ప్రకాష్ శర్మ గారు, ప్రభాకర్ జైనీ గారుఈత కోట సుబ్బారావు గారి లాంటి పెద్దలు నాకా అవకాశం ఇచ్చారు.

అయితే , ఎంతో మంచి రచనలు చేస్తున్నా గుర్తింపు లేని రచయితలు ఎందరో ఉన్నారు. వారినీ గుర్తించాలి. వారిని ఉత్తమ సాహిత్యం అందించే దిశగా ప్రోత్సహించాలి. 

10.       విమర్శకుల గురించి మీ అభిప్రాయం

నిజమైన సాహిత్య విమర్శ, సాహిత్యాన్ని మెరుగు పరుస్తుంది. రచయిత ఇంకొన్ని ఉత్తమ రచనలు చేసేలా ప్రోత్సహిస్తుంది. కానీ నేటి కాలంలో అలాంటి విమర్శకులు కద్దు. కేవలం కొన్ని సమూహాల ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. తాను చూసిందే రంభ అన్నట్టు, తమ వారి రచనలు మాత్రమే గొప్పవి అని ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ఉత్తమ రచన పాఠకుడి దృష్టికి రావడం లేదు.

11.       కొత్తగా కథలు కవితలు రాస్తున్న మహిళలకు అందించాల్సిన ప్రోత్సాహం గురించి మీరేమనుకుంటున్నారు?

కేవలం మహిళలు అనే కాదు. తగిన సాహిత్య వారసత్వమో లేదా పలుకుబడి లేకపోతే ఏ కొత్త రచయితకూ తగిన ప్రోత్సాహం దొరకడం లేదు. కేవలం తమ వర్గానికో, సమూహానికో లేదా తమకు అనుకూలంగా ఉన్న రచయితల రచనలు తప్పా మిగతా వారి రచనల్ని సీనియర్ రచయితలు పట్టించుకోవడం లేదు. కనీసం ఈ రచన బాగుంది/ చదవండి అనే చిన్న పరిచయ వాక్యం కూడా పొరపాటున మాట్లాడరు. ఈ పరిస్థితి మారాలి.

12.        20,30 ఏళ్లనాటి స్త్రీవాద సాహిత్యం  ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉన్నదని  మీరు భావిస్తున్నారా?

ఓల్గా  గారు రాసిన స్వేచ్ఛ నవల ఇప్పటికీ ఈనాటి సమాజాన్ని అద్దం పడుతోంది.  స్ర్తీల గృహిణిత్వానికి, పౌరసత్వానికి మధ్య నిరంతరమైన ఉద్రిక్తత 19వ శతాబ్దంలో ప్రారంభమై ఈరోజుకీ కొనసాగుతూనే ఉంది. ఆమె రాసిన అయోని కథలోని చిన్నారి జీవితం నేటికీ మారలేదు. ఎందరో చిట్టి తల్లులు లైంగిక వేధింపులకు వికృతాలకు గురి అవుతున్నారు. ఇక గీతాంజలి భారతి గారి పెహచాన్ కథలు ఇప్పటికీ వెతలు అనుభవిస్తున్న ముస్లిం స్త్రీల జీవితాలను మనకు గుర్తుకు తెస్తుంది.

సత్యవతి గారి సూపర్ మాం సిండ్రోం చదివి ఇప్పటికీ అనురాధలో తమని తాము చూసుకునే ఇల్లాల్లు ఎందరో!

రంగనాయకమ్మ గారి కల్యాణిలు ఇప్పటికీ మనకు ఎదురవుతూనే ఉన్నారు.

1984 లో సావిత్రి గారు బంది పోట్లు అనే కవిత రాసారు.

పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని

పంతులు గారన్నప్పుడే భయమేసింది !

ఆఫీసులో నా మొగుడున్నాడు

అవసరమొచ్చినా సెలవివ్వడని

అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది!

వాడికేం ? మగమహారాజని

ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది

పెళ్ళంటే పెద్ద శిక్ష అని

మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే

మమ్మల్ని విభజించి పాలిస్తోందని!

ఈ కవిత ప్రస్తుత సామాజిక పరిస్థితిని అద్దం పట్టడం లేదూ!

సాహిత్యం ఒక పరిణామ క్రమంలో భాగం. వెనువెంటనే మార్పులు ఆశించకపోయినా ఆలోచనా సరళిలో తప్పక మార్పు వస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ మాత్రం స్వేచ్ఛ కూడా నాటి స్త్రీ వాదుల, ఉద్యమకారుల కృషి ఫలితమే కదా. కన్యాశుల్కం, సతీ సహగమనం వంటివి పారద్రోలబడ్డా, వంటింటికే పరిమితం అయిన ఆడవారికి విద్యా, ఆస్తి హక్కులు  అందించబడినా అందుకు కారణం సమాజాన్ని ప్రభావితం చేసిన సాహిత్యమే

ఇంటర్వ్యూలు

మనిషిని మనిషిగా గుర్తించేలా చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే - సుంకోజి దేవేంద్రాచారి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సుంకోజి దేవేంద్రాచారి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ                                                 

1.         మీ బాల్యం మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి

మా అమ్మానాన్న సుంకోజి ఈశ్వరమ్మ, సుంకోజి రెడ్డెప్పాచారి. స్వస్థలం చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం గుడ్రెడ్డిగారిపల్లె. మా నాన్న నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మను, ఐదేళ్ల వయసులో నాన్నను కోల్పోయాడు. అమ్మమ్మ ఇంట పెరిగాడు. పెళ్లయ్యాక బతుకుతెరువు వెతుక్కుంటూ కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ చెరువుముందరపల్లెకు చేరుకున్నారు. నేను, మా అక్క అక్కడే పుట్టాం. తీవ్ర కరువు నేపథ్యంలో నాకు రెండేళ్ల వయసులో తిరిగి సొంతూరు వచ్చేశారు. నాన్న బాల్యంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఉన్న ఆస్తులన్నీ పోయాయి. తర్వాత సొంతూరులోనే కౌలుకు సేద్యం చేస్తూ కొయ్యపనితో జీవిత నౌక నడిపారు. నాకు అక్క, ఇద్దరు తమ్ముళ్లు. అందరికీ వివాహాలయ్యాయి.

నా బాల్యమంతా పల్లెటూరులోనే సాగింది. నా చిన్నప్పుడు మా ఊరికి దగ్గరలోని బంజరుభూమిలో రాళ్లు తొలగించి, కంపచెట్లు కొట్టి కాస్త నేలను సాగుయోగ్యంగా మలిచారు అమ్మానాన్న. అందులో మేము చాలా రకాల పంటలు పండించాం. వేరుశనగ, వరి, రాగులు, నువ్వులు, ధనియాలు, మిరప, సజ్జ, టమాటా, ఎర్రగడ్డలు, అలసంద, కంది.. ఇలా. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు చేస్తూ పెరిగాను. విత్తనం విత్తడం దగ్గర నుంచి కోతలు కోయడం వరకు.. మడకతో దున్నడం మొదలు ఎడ్లబండి తోలడం వరకు.. వ్యవసాయంలో అన్ని పనులూ చేశాను. నాన్నతో పాటు స్కూలు రోజుల్లోనే కొయ్యలు కోసేదానికి వెళ్లేవాడిని. పదమూడేళ్ల వయసులోనే పాతికేళ్ల యువకుడు చేయగలిగినంత శారీరక శ్రమ చేసేవాడిని. నాకు కొండలు గుట్టలు ఎక్కడం అంటే ఇష్టం. ఈత కొట్టడం చాలా సరదా. ఇంట్లో ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులున్నా.. బాల్యమంతా సరదాగానే గడిచిపోయింది. ఆ వయసు అలాంటిది.

2.         మీకు సాహిత్యం అంటే ఆసక్తి ఎప్పుడు ఎలా ఏర్పడింది?

మా అమ్మ చదువుకోలేదు. కానీ తను అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి అద్భుతమైన కథకులు. మా ఊర్లో కాదరిల్లి (ఖాదర్‍ వల్లి) తాత, బడేసాబ్‍ ఉండేవారు. వీళ్లిద్దరూ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి వచ్చేవాళ్లు. ఇంటి ముందు అరుగుమీద కూర్చుని వారి జీవితానుభవాలను కథలుగా చెప్పేవాళ్లు. అవి బాల్యంలో వినడం చాలా బాగుండేది. (వారు చెప్పేవాటిలో కొన్ని అతిశయోక్తులని నాకు పెద్దయ్యాక తెలిసింది. అయినా ఆ కథలు చాలా గొప్పేగా చెప్పేవారు). బడేసాబ్‍ భార్యను అవ్వ అని పిలిచేవాడిని. ఆమె ముగ్గురు మరాఠీలు, సాసవల చిన్నమ్మ, మాయలఫకీరు.. కథలు చెప్పేది. మా పక్కింటిలో ఉండే చోటీ ఒకే కథను రోజూ చెప్పేది. అది హాస్య కథ. కాదరిల్లి తాత కొడుకు పీరాంసాబ్‍ మంచి జానపద కథలు చెప్పేవాడు. పొలంలో వేరుశనగ కాయలు ఒలిచేదానికి వెళ్లామంటే రోజంతా కథ చెప్పేవాడు. ఒక్కోసారి ఆ కథ రోజంతా చెప్పినా అయిపోయేది కాదు. తరచూ మా ఇంటికి రాత్రి వేళ మా వీధిలో ఉండేవాళ్లు.. ముఖ్యంగా సాయుబులు ఆడామగా అనే తేడా లేకుండా వచ్చేవాళ్లు. అర్ధరాత్రి దాకా కథలతో సందడిగా ఉండేది.

చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణంలో పెరగడం వలనేమో నాకు బాల్యంలోనే కథలంలే ఆసక్తి ఏర్పడింది. వినడం, నేనూ నా తోటి పిల్లలకు చెప్పడం వలన నాకు పదేళ్ల వయసుకే.. దాదాపు వందకు పైగా కథలు వచ్చేటివి. మా పక్కన ఇంటిలో సురేంద్రరెడ్డి అనే అతను ఉండేవాడు. నాకంటే ఏడెనిమిదేళ్లు పెద్దవాడు. తను పుస్తకాలు బాగా చదివేవాడు. తన వద్ద ట్రంకుపెట్టె నిండుకు పుస్తకాలుండేవి. వాటిని చూస్తే నాకు పెద్ద నిధిలా అనిపించేది. నేను తరచూ వాటిని చదివేవాడిని. అతని దగ్గరే అసమర్థుని జీవయాత్రనవల మొదటిసారి చదివాను. ఇంట్లో బడిపుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివితే నాన్న అరిచేవాడు. ఇలా ఒకసారి అసమర్థుని జీవయాత్ర చదువుతూ నాన్నకు దొరికిపోయి దెబ్బలు తిన్నా. చెప్తే ఆశ్చర్యపోతారు.. నేను రెండో తరగతి సెలవుల్లో చదివిన మొట్టమొదటి నవల బాటసారి’. ఆ వయసులో అర్థం కాకపోయినా.. నన్నెందుకో అక్షరాలు పిచ్చెక్కించేవి. పుస్తకాల వెంట పరుగులు తీయించేవి. బహుశా.. పేదరికం కారణంగా ఇంట్లో పుస్తకాలను కొనలేని స్థితి కూడా ఈ పుస్తకాల పిచ్చికి ఒక కారణమేమో. ఇప్పుడు మా ఇంట్లో వేల పుస్తకాలున్నాయి. నెలలో ఇప్పటికీ కనీసం వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా పుస్తకాలు కొంటుంటాను.

నేను ఆరో తరగతి చదివే రోజుల్లో మా కేవీపల్లెలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులోని పుస్తకాలను చూడగానే నాకు పెద్ద నిధి దొరికినట్టు అయింది. 15 రూపాయల మెంబర్‍ షిప్‍ కడితే ఇంటికి పుస్తకాలు ఇచ్చేవాళ్లు. మెంబర్‍ షిప్‍ కట్టే పరిస్థితి మాకు లేదు. దీంతో సెలవు ఉందంటే చాలు నా కేరాఫ్‍ అడ్రస్‍ లైబ్రరీగా మార్చేసుకున్నా. మాకు సాయంకాలం గంటసేపు ఇంటర్వెల్‍ ఉండేది. పీఈటీ లేరు. దీంతో రోజూ ఆ గంట సేపు లైబ్రరీలో గడిపేవాడిని. అందులోని పుస్తకాలన్నీ రెండుసార్లు చదివేశా. ఇవన్నీ కూడా నాకు తెలీకుండానే నాలో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచాయి.

3.         మీ సాహిత్య ప్రస్థానం గురించి...

నేను ఐదో తరగతిలో ఉండగా గడ్డిపరకఅనే కథ రాసి చందమామకు పంపాను. ఆ కథ చేరిందో లేదో కూడా తెలీదు. నేను ఐదో తరగతిలో ఉండగా చదివిన మొట్టమొదటి డిటెక్టివ్‍ నవల ఆపరేషన్‍ ఇన్‍ చైనా’. మధుబాబు నవలలు విపరీతంగా చదివేవాడిని. అందులోని షాడో పాత్ర అంటే అప్పట్లో విపరీతమైన క్రేజ్‍. దాంతో నేనే ఏడో తరగతిలో ఉండగా నా హీరోకు డబుల్‍ షాడో’ (షాడోకన్నా రెండింతలు బలవంతుడని అర్థం నా ఉద్దేశంలో) అని పేరు పెట్టి ఒక డిటెక్టివ్‍ నవల రాసే ప్రయత్నం చేశాను. నేను ఏడో తరగతి ఫస్ట్క్లాస్‍లో పాసయ్యాక ఇతర పుస్తకాలు చదివే విషయంలో ఇంట్లో ఆంక్షలు తొలగిపోయాయి.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మా తాతగారు ముగ్గురు. పెద్ద తాత, రెండో తాత నాటకాలు వేసేవారు. సేద్యం చేసేవాళ్లు. రెండో తాత పెళ్లి కూడా చేసుకోలేదట. నాటకాలే లోకంగా బతికాడు. మా నాన్న నాన్న చివరి వాడు. ఆయన వైద్యం చేసేవాడు. ఉస్తికాయలపెంట అనే ఊరికి కరణంగానూ పనిచేశాడట. మానాన్నకు ఐదేళ్ల వయసు వచ్చేప్పటికే వీళ్లందరూ చనిపోయారు. అంటే నేను చెప్తున్నది సుమారు 70ఏళ్ల నాటి సంగతి. మా తాతల వారసత్వం నాకూ వచ్చిందని ఇంట్లో అంటుంటారు. ఇక మానాన్న మంచి పాటగాడు.

నా మొదటి కథ భూమి గుండ్రంగా ఉంది’ 1998 మార్చి నెలలో స్వాతి వారపత్రికలో వచ్చింది. అయితే దీనికంటే ముందుగా బంగారు పంజరంఅనే కథం 17 మార్చి 1997 వార్త దినపత్రికలోని సోమవారం నాటి చెలిఅనుబంధంలో వచ్చింది.

4.         ఇప్పటి వరకు వెలువడిన మీ రచనలు, అముద్రిత రచనల గురించి...

ఇప్పటి వరకూ దాదాపు వంద కథలు రాశాను. కవితలు కూడా కొన్ని రాశాను.  పల్లెల్లో ఆడుకునే ఆటలను (ముప్పై ఏళ్ల క్రితం ఆటలు. ఇప్పుడు ఈ ఆటలు పల్లెల్లో కూడా దాదాపు అడటం లేదు). ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో 2005లో సీరియల్‍గా రాశాను. అవి విశాలాంధ్రవారు మనమంచి ఆటలుపేరుతో పుస్తకంగా తెచ్చారు. అదే నా మొదటి పుస్తకం. తర్వాత 13 కథలతో అన్నంగుడ్డ’, మరో 13 కథలతో దృశ్యాలుమూడు ఒక ఆవిష్కరణ’, 18 కథలతో ఒక మేఘం కథసంపుటాలుగా వచ్చాయి. నీరు నేల మనిషి’, ‘రెక్కాడినంత కాలంనవలలూ పుస్తకాలుగా వచ్చాయి.  మొత్తం ఆరు పుస్తకాలు. వీటిలో మూడు పుస్తకాలను విశాలాంధ్రవారు ప్రచురించారు.

ఆంధ్రభూమి దినపత్రికలో వెన్నెముక’, ‘అమ్మానాన్నకుఅనే నవలలు సీరియల్‍గా వచ్చాయి. ఆంధ్రభూమి మాసపత్రికలో రెండు సంచికల్లో వచ్చిన మిస్సింగ్‍ అనే నవల ఉంది. ఇవన్నీ పుస్తకాలుగా రావాల్సి ఉంది. ఇక పుస్తకంగా వేయదగ్గ కథలు సుమారు 30దాకా ఉన్నాయి. వీటిలో పదికి పైగా కథలకు బహుమతులు వచ్చాయి. ఇక రాసి అచ్చుకాని నవలలు మరో రెండు ఉన్నాయి.

5.         వడ్రంగి వృత్తికి. పాత్రికేయ జీవితానికి, రచయితగా కొనసాగటానికి మధ్య ఎలా సమన్వయం కుదిరింది..?

తిరుపతిలో 1994 నుంచి 2002 వరకు ఎనిమిదేళ్లకు పైగా వడ్రంగి వృత్తితో జీవినం సాగించా. ఏ వృత్తిలో ఉన్నా చదవడం, రాయడం అనేవి నాకు ఇష్టమైన వ్యాపకాలుగా ఉండేవి. దీంతో వడ్రంగిగా ఉన్నప్పుడే కొంతకాలం తిరుపతిలో కళాదీపికఅనే పక్షపత్రికలో వ్యాసాలు రాసేవాడిని. తిరుపతిలో జరిగే కల్చరల్‍ కార్యక్రమాలను రిపోర్ట్ చేసేవాడిని. నా పాత్రికేయ జీవితం అలా మొదలైంది. నా చేతిరాతలో ఒక పేజీ రాసి ఇస్తే ఆ పత్రిక ఎడిటర్‍ వి.ఎస్‍.రాఘవాచారి గారు నాకు రూ.50 ఇచ్చేవారు. వారు డబ్బు ఇస్తున్నారు కదా అని నేను ఏవంటే అవి రాసేవాడిని కాదు. ముఖ్యంగా ఆ పుస్తకంలో సంగీత, సాహిత్య, నాటక రంగాలవారిని పరిచయం చేస్తూ వ్యాసాలు రాసేవాడిని. బయోడేటా ఎడిటర్‍కు పంపేవారు. నేను దానిని వ్యాసంగా మలిచేవాడిని. అప్పట్లో నేను రాసిన వ్యాసాల్లోని వ్యక్తులు తర్వాత ఆ యా రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు.

 వడ్రంగి వృత్తికి, పాత్రికేయ జీవితానికి మధ్య..  నాలో ఉండే విపరీతంగా పుస్తకాలు చదవడం, రాయడం అనే పిచ్చి ఒక వంతెనలా నిలిచింది. అయితే.. 2002 సెప్టెంబర్‍లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‍-ఎడిటర్‍గా కొత్త జీవితం మొదలు పెట్టాక వడ్రంగం వృత్తిని వదిలేశాను. కుల వృత్తిని వదిలేసి కొత్త వృత్తిలోకి అడుగు పెట్టడానికి ప్రధానకారణం అనారోగ్యం. నిజానికి నేను వడ్రంగిగా ఉన్నప్పుడే ఎక్కువ పుస్తకాలు చదివే వీలున్నింది. నా జీవితం నా చేతుల్లో ఉండేది. ఇప్పుడలా కాదు..

6.         ముక్కుసూటి మనిషి అని మీకు పేరుంది. ఎందుకు..?

 తప్పును తప్పు అని చెబుతాను. తప్పు చేసిన వ్యక్తి చాలా పెద్దమనిషిఅయినా భయపడను. ఆ వ్యక్తి నా భవిష్యత్తుకు అడ్డంపడతాడని, నాకు అవార్డులు లేదా బహుమతులు రాకుండా చేస్తాడని తెలిసినా.. మౌనంగా ఉండను. వ్యక్తిగత జీవితంలోనే కాదు... సాహిత్య పయనంలోనూ ఇలాంటివి నా జీవితంలో చాలా ఉన్నాయి. చాలా పేరున్న వ్యక్తులను నిలదీశాను. ఫలితంగా ఇబ్బందులు పడ్డాను. కొన్ని కోల్పోయాను. కోల్పోవడం కాదు.. నాకు రావలసినవి రాకుండా పోయాయి. వాళ్లను ప్రశ్నించినందుకు ఇవి నాకు రాలేదని తెలుసు. దీనికి నేనేమీ బాధపడ్డం లేదు. వాళ్లను ప్రశ్నించినందుకు పశ్చాత్తాప పడ్డమూ లేదు. కాలం (వయసు)తో పాటు నాలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు ముందంత అగ్రెసివ్‍గా ముఖాన్నే మాట్లాడ్డం లేదు కానీ.. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం అలవాటు చేసుకుంటున్నా. పాతికేళ్ల క్రితం రచయితలంటే విపరీతమైన క్రేజ్‍ ఉండేది. వాళ్లు అసాధారణ వ్యక్తులని అనుకునేవాన్ని. అనుభవంతో అర్థమయింది ఏమంటే చాలామంది రచయితలకంటే సాధారణ వ్యక్తులు చాలా ఉన్నతులని. ఇది తెలిశాక రచయితలను ప్రశ్నించాల్సిన అవసరం లేదనిపించింది.

7.         కథలు, నవలలు కవితలు రాస్తున్నారు కదా.. మీకు ఏ పక్రియ అంటే ఎక్కువ ఇష్టం?

ప్రారంభంలో కవితలు రాసేవాడిని. ఇప్పటికీ నా దగ్గర కవితలు రాసి పెట్టుకున్న నోట్‍బుక్స్ నాలుగున్నాయి. కొన్ని కవితలకు బహుమతులు కూడా అందుకున్నా. మూడుసార్లు రంజని కుందుర్తి యోగ్యతాపత్రాలు అందుకున్నాను. తర్వాత కథల్లోకి అడుగుపెట్టాను. కథలు రాస్తూనే నవలలు రాయడం మొదలు పెట్టాను.

కవిత మెరుపులాంటిది. కథ వర్షంలాంటిది. నవల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన గాలివాన లాంటిది. నేను ప్రారంభంలో కవిత్వం ఎక్కువ చదివేవాడిని. తర్వాత కథలు ఎక్కువ చదివాను. ఆ తర్వాత నవలలు ఎక్కువ చదివాను. ఈ మూడు పక్రియల్లోనూ రాశాను. నా మటుకు నాకు నవల ఇష్టమైన పక్రియగా మారింది. మంచి నవలలోనే కవిత్వమూ ఉంటుంది. కథా ఉంటుంది. మనం చెప్పాలనుకున్న విషయాన్ని సవివరంగా చెప్పగలిగే అవకాశమూ ఉంటుంది.

8.         సాహిత్యంలో మీకు స్ఫూర్తి కలిగించిన వాళ్లు..?

సాహిత్యం అనేది మనం తినే ఆహారం లాంటిది. బాల్యం నుంచి పెరిగే వయసుతో పాటు.. తినే ఆహారంలో ఇష్టాయిష్టాలు మారుతుంటాయి. లేదూ ఇష్టపడే ఆహార పదార్థాలు పెరుగుతుంటాయి. సాహిత్యంలో స్ఫూర్తికూడా అలాంటిదే.. కాలేజీ రోజుల్లో శ్రీశ్రీ, తిలక్‍ కవిత్వం పిచ్చిగా చదివేవాడిని. వారిని ఇమిటేట్‍ చేస్తూ ప్రారంభంలో కొన్ని కవితలు కూడా రాశాను. తర్వాత కె.శివారెడ్డి, ఎండ్లూరి సుధాకర్‍, శిఖామణి, కొప్పర్తి, ఆశారాజు, పాటిబండ్ల రజని, మందరపు హైమవతి, కొండేపూడి నిర్మల కవితలు ఇష్టంగా చదివా. కథకుల్లో కొకు, ఇనాక్‍, మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డిసింగమనేని  నారాయణ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కారా, మునిపల్లె రాజు, ఓల్గా, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బండి నారాయణస్వామి, ఆర్‍.ఎం.ఉమామహేశ్వరరావు, డాక్టర్‍ వి.చంద్రశేఖరరావు కథలు ఎక్కువ చదివా. ఇక నవలలంటే బాల్యంలో త్రిపురనేని గోపీచంద్‍, బుచ్చిబాబు, రావిశాస్త్రి, కొకు, వడ్డెర చండీదాస్‍ నవలలు చదివా. తర్వాత డాక్టర్‍ కేశవరెడ్డి నవలలు. నా దృష్టిలో కేశవరెడ్డిని మించిన నవలా రచయిత తెలుగులో ఇప్పటి వరకూ లేరు. పైన చెప్పిన వీళ్లే కాదు.. నేను చదివిన ఎన్నో పుస్తకాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు కారకులైన వారంతా నాకు స్ఫూర్తి కలిగించిన వారే..

9.         మీరు అనువాద రచనలను ఇష్టంగా చదువుతారు కదా.. ఆ ఆసక్తి ఎలా ఏర్పడింది?

 తిరుపతిలో విశాలాంధ్ర బుక్‍ హౌస్‍ ఉంది. అక్కడికి 1995 నుంచి వెళుతున్నాను. అప్పట్లో పుస్తకాలు కొనేదానికి డబ్బులు ఉండేవి కావు. అప్పుడప్పుడు వాళ్లు క్లియరెన్స్ సేల్‍ పెట్టేవాళ్లు. అందులో కొన్ని పుస్తకాలు 50 శాతం డిస్కౌంట్‍తో ఇచ్చేవారు. అలా కొన్ని రష్యన్‍ అనువాదాలు కొన్నాను. టాల్‍స్టా•••• ‘కొసక్కులు’, కుప్రీన్‍ రాళ్లవంకీఅప్పుడు కొన్నవే. మధురాంతకం నరేంద్రగారు తరచూ అనువాద నవలల గురించి చెప్పేవారు. చదవమని ఇచ్చేవారు. అన్నాకరేనినా, శరత్‍ శ్రీకాంత్‍ నవలలు, జయకాంతన్‍ కథలు వారు ఇచ్చి చదవమన్నారు. రెండేళ్లు హైదరాబాదులో ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో పనిచేశాను. ఆ సమయంలో హెచ్‍బీటీ వారు వేసిన బిభూతి భూషణ్‍ బంధోపాధ్యాయ వనవాసినవల వేమన వసంతలక్ష్మిగారు ఇచ్చి కొనుక్కోమని చెప్పారు. ఆ నవల నన్ను దిగ్భ్రమకు గురిచేసింది. చదివాక కొన్ని కాపీలు కొని మిత్రులకు ఇచ్చాను. హైదరాబాదులో జరిగే కేంద్రసాహిత్య అకాడమీ మీటింగుల్లో వారి ప్రచురణలు కొనుక్కునేవాడిని. అలా మొదలైంది. ఇప్పుడు నా దగ్గర అనువాద సాహిత్యం చాలానే ఉంది. శరత్‍ సమగ్ర సాహిత్యం ఈమధ్యే కొని చదివాను. బిభూతి వనవాసి’, బి.వసిల్యేవ్‍ హంసలను వేటాడొద్దు’, చెంగిజ్‍ ఐత్‍మాతోవ్‍ తల్లి భూదేవినేను మళ్లీ మళ్లీ చదివిన నవలలు.

10.       మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు, పుస్తకాలు?

 ప్రభావం చూపిన పుస్తకాలు చాలానే ఉన్నాయి. మన వయసు, ఆలోచనా తీరు ఎదిగే కొద్దీ ఇవీ మారుతుంటాయి. మనుషులు కూడా అంతే.

నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటివారు ఆర్‍.ఎం.ఉమామహేశ్వరరావు, విష్ణుప్రియగారు. 1999లో వీరి పరిచయం మొదటి సారి అయింది. అప్పటికి నేను కార్పెంటర్‍ (వడ్రంగి)గా జీవనం సాగిస్తున్నా. నేను చాలా ఇళ్లకు పనిచేశాను. పనిచేసినంత వరకే. తర్వాత తిరుపతిలో కార్పెంటర్లను చాలామంది సాటి మనుషులుగా గుర్తించరు. వాళ్ల ఇళ్లకు వెళితే టచ్‍మీ నాట్‍ అన్నట్టుంటారు. అలాంటి రోజుల్లో ఒకసారి విష్ణుప్రియ అమ్మ వాళ్ల ఇంటిలో రెండురోజులు వుడ్‍ వర్క్ చేశాను. మొదటి రోజు పనికి వెళ్లినప్పుడు ఉమాగారు నాతోపాటు ఉన్నారు. మధ్యాహ్నం అక్కడే భోజనమని చెప్పారు. కాళ్లు చేతులు కడుక్కుని భోజానికి వెళితే డైనింగ్‍ టేబుల్‍ వద్ద భోజనం. నేనూ, ఉమాగారు ఎదురెదురుగా కూర్చున్నాం. విష్ణుప్రియగారు స్టవ్‍ దగ్గర ఆమ్లెట్‍ వేసి వేడివేడిగా పెట్టారు. ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మరచిపోలేను. చేసే పనిని, కులాన్ని, ఆర్థిక స్థితిని కాకుండా.. మనిషిని మనిషిగా చూసిన వ్యక్తులను నా జీవితంలో నేను మొదటిసారి చూసింది అప్పుడే. ఇక రచనల పరంగానూ ఉమాగారి ప్రభావం నాపైన చాలా ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం చేస్తున్నానంటే అది వారి చలవే.

మధురాంతకం నరేంద్రగారు, బండి నారాయణస్వామి, అల్లం రాజయ్య, పులికంటి కృష్ణారెడ్డి, డాక్టర్‍ వి.ఆర్‍.రాసాని.. నేను సాహిత్యంవైపు అడుగులు వేసిన తొలిరోజుల్లో వీరి సూచనలు నాకు చాలా ఉపకరించాయి.

సీరియస్‍ సాహిత్యంలో ఎవరి స్థానం వారికి ఎప్పుడూ ఖాళీగా ఉంటుందని, దానిని పూరించుకుంటూ వెళ్లడమే మనం చేయాల్సిన పని అని మధురాంతకం నరేంద్రగారు అన్నారు. నేను రచయితగా ఎటువైపు ఉండాలో నిర్ణయించుకోవడానికి వీరి మాటలు దోహదం చేశాయి.

మనం ఏ కథ రాసినా, అందులో ఏ పాత్రను సృష్టించినా.. మన జీవితంలోంచే తీసుకోవాలని, మనం సృష్టించే పాత్రకు మన జీవితంలో పరిచయం ఉన్న వ్యక్తులను ఊహించుకుంటే దానికి సహజత్వం వస్తుందని ఉమాగారు అన్నారు. అందరి జీవితం స్వల్ప మార్పులతో ఒకేలా ఉంటుందని, అయితే వారి ఆలోచనా తీరు చదివిన పుస్తకాలు చూసే దృష్టికోణం.. కథను కొత్తగా మలుస్తుందని చెప్పారు. అంటే.. కథను ఎలా రాయాలో చెప్పారు.

అప్పటికే కొన్ని కథలు ప్రచురణ అయ్యాయి. రెండు కథలకు బహుమతులు వచ్చాయి. ఆ సమయంలోనే.. నా జీవితాన్ని నేను కథలుగా మలచాల్సిన అవసరాన్ని బండి నారాయణస్వామిగారు చెప్పారు.

తొలిరోజుల్లో నాకు మాండలికం అంటే ఏంటో తెలీదు. తెలంగాణ, కోస్తాంధ్ర, కళింగాధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల మాండలికాలు కలిపి ఒక కథ రాశాను. ఆ కథ స్క్రిప్ట్ డాక్టర్‍ వి.ఆర్‍.రాసానిగారు చదివి మాండలికాల గురించి వివరించారు. ఒక పేజీని కరెక్షన్‍ చేసి ఏ పదం ఏ ప్రాంతానిదో చెప్పారు. నా జీవభాష ఏదో నాకు తెలిసేలా చేశారు. అప్పటి వరకూ నాకు ఆ భేదం తెలీదు.

11.       అంతర్జాల సాహిత్యం గురించి మీ అభిప్రాయం?

 అంతర్జాల సాహిత్యం నేను ఎక్కువగా ఫాలో కావడం లేదు. నాకు పుస్తకం చేతిలో పట్టుకుని చదువుకోవడమే ఇష్టం. ఇంగ్లీషుమీడియం చదువుల నుంచి వచ్చిన రచయితలు ఇప్పుడు ఎక్కువమంది అంతర్జాలంలో తెలుగుసాహిత్యం రాస్తున్నారు. వీరిలో చాలామందికి వాక్యం రాసేది సరిగా రాదు. చదవగలరు. టెక్నాలజీ పెరిగింది. రాసే అవసరం లేకుండా చెప్తుంటే టెక్సట్ టైప్‍ అయ్యే సాఫ్ట్వేర్‍ వచ్చింది. కొంతమంది దీనిని ఉపయోగించి కథలు రాస్తున్నారు. చాలా అంతర్జాల పత్రికలు కూడా యూనికోడ్‍ ఫాంట్‍లోనే కథలు కోరుతున్నాయి. అలా లేదంటే పంపొద్దు అంటున్నాయి. అంటే యూనికోడ్‍ ఫాంట్‍లోనే రాయాల్సిన ఒక అనివార్యతను తెచ్చాయి. దీంతో  భవిష్యత్తులో ఇలా రాయగలిగేంత తెలుగైనా వచ్చేవారు ఉండకపోవచ్చు.

12.       మీ కవితా సంపుటి ఇంతవరకు రాలేదు కదా..! ఎప్పుడు తెస్తున్నారు?

 తొలిరోజుల్లో రాసిన కవితలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కవితలకు పోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి. పదేళ్ల క్రితం అయితే ఆ కవితలతో పుస్తకం తెచ్చి ఉండచ్చు. ఇక వాటిని పుస్తకంగా తేవాల్సిన అవసరం లేదనుకుంటున్నా.

13.       చాలా రచనలకు మీకు బహుమతులు, అవార్డులు వచ్చాయి కదా.. అవార్డులు బహుమతులకోసం మీరు ప్రత్యేకంగా రాస్తారా..?

 నేను మొదట్లోనే చెప్పాను కదా. చాలా లేమి నుంచి వచ్చాను. జీవితంలో డబ్బు  ప్రధానం కాకపోయినా చాలా వాటికి డబ్బే ప్రధానం. కనీస అవసరాలు తీరాలన్నా డబ్బు ఉండాల్సిందే. ఆ డబ్బు కూడా నా దగ్గర ఉండేది కాదు. అలాంటి సమయంలో నన్ను కథల పోటీలు ఆకర్షించాయి. నేను ఇంటర్మీడియట్‍ చదివేరోజుల్లోనే స్వాతి, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో పోటీలకు కథలు రాశాను. కేవలం డబ్బు వస్తుందని ఆశతోనే. తర్వాత తర్వాత కూడా నేను డబ్బు అవసరం అయ్యే పోటీలకు కథలు, నవలలు రాశాను. అలా అని బహుమతి రావాలని నా పాత్రలను చంపేయడమో, విపరీతమైన కష్టాలకు గురిచేయడమో చేయలేదు. అంటే.. బహుమతికోసం నేల విడిచి సాముచేసే కథలు, సినిమాటిక్‍ కష్టాల కథలు ఎప్పుడూ రాయలేదు.

బహుమతి కథలకు / నవలలకు గుర్తింపు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది పాఠకులు చదువుతారు. ఇది కూడా పోటీలకు రాయడానికి మరో కారణం.

పోటీకి రాయడం వేరు. బహుమతుల కోసం ప్రత్యేకంగా రాయడం వేరు. నేను బహుమతుల కోసం ప్రత్యేకంగా ఎప్పుడూ రాయలేదు. ఎప్పుడూ రాయను.

14.       పాఠకుల నుండి మీకు ఎదురైన అనుభవాలు, మీకు లభించిన ప్రోత్సాహం.. గురించి..

 ‘గాలిపేరుతో ఒక కథ రాశాను. అది 2004లో నవ్య వీక్లీలో వచ్చింది. రిజర్వేషన్‍ కింద ఎస్సీఎస్టీలు సర్పంచ్‍, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేస్తుంటారు. పేరుకు సర్పంచ్‍ ఎస్సీ అయినా వారిని నడిపించేదంతా అక్కడి పెత్తందారే. తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చి, తర్వాత తమ కులంవారి మధ్య ప్రిస్టేజ్‍ సమస్యగా మారి గెలుపుకోసం ప్రయత్నం చేసి.. ఆ ప్రయత్నంలో అప్పులయ్యి.. చివరికి తమను నిలబెట్టిన పెద్దమనిషిసాయం చేయకపోవడంతో.. ఎంపీటీసీగా గెల్చిన ఓ మహిళ అప్పులు తీర్చేదానికి కువైత్‍ వెళ్లారు. రిజర్వేషన్ల పేరుతో ఎస్సీఎస్టీలను పెత్తందార్లు ఎలా ఆడుకుంటారనేది గాలికథలో చెప్పాను. అప్పుడు నేను తిరుపతి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఒకతను వచ్చి తలుపు తీసి మెళ్లిగా దేవేంద్ర సార్‍ అని పిల్చాడు. తిరిగి చూస్తే ఓ పెద్దాయన. మా ఆఫీసులోనే అటెండర్‍గా పనిచేస్తుంటాడు. అతను మిషన్‍ సెక్షన్‍లో ఉంటాడు. చూశాను కానీ పరిచయం లేదు. లేచి అతని వద్దకు వెళ్లాను. ‘‘కత ఏం రాసినారు సార్‍.. ఇంగన్న మా మాల నాకొడకలకు బుద్దిరావాల’’ అన్నాడు. ఇది నాకు పెద్ద మెచ్చుకోలు.

నీరు నేల మనిషి’ 2006లో చతురలో వచ్చింది. మా వెనక వీధిలో ఉండే కవిత అనే ఆవిడ తరచూ మా ఇంటికి వచ్చేది. మా దేవితో కాసేపు మాట్లాడి వెళ్లేది. ఆమె ఈ నవల చదివాక మా ఇంటికొచ్చి ‘‘అనా.. నువ్వు మా కతే రాసినావు.. అంతా మా నాయక కతేన్నా’’ అంది. రచయితలు, సాహిత్యకారుల స్పందన గురించి నేను చెప్పడం లేదు. నేను కథలు రాయడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో టెక్నాలజీ ఇంత ఎక్కువ లేదు. అప్పుడు కమ్యూనికేషన్‍ అంటే ఉత్తరాలే. ఆ రోజులే బాగుండేవి.

15.       కొత్తగా రచయితలు పెద్దగా రాకపోవడానికి కారణం ఏమిటి?

 కొత్త రచయితలు పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. అయితే వారు ఎక్కువ కాలం రచయితలుగా కొనసాగలేకపోతున్నారు. ఒకటి రెండు పుస్తకాలకే పరిమితం అవుతున్నారు. మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేదే ఏ రంగంలో అయినా మనం ఎంతకాలం ఎంతబాగా రాణించగలం అనేది నిర్ణయిస్తుంది. వెయ్యి పేజీలు చదివితే గాని రెండుమూడు పేజీలు రాయగలిగేంత శక్తి రాదు. ఇప్పటి వరకు నేను సుమారు 2,500 పేజీల రచనలు చేశాను. వేల పుస్తకాలు చదివాను. కొత్త రచయితలు చాలామంది ఇతరుల రచనలు ఒక్క పేజీ కూడా చదవరు. ఎక్కువకాలం రచయితలుగా కొనసాగాలంటే ఎక్కువగా చదవాలి.

16.       మీ దృష్టిలో ఉత్తమ సాహిత్యం అంటే ఏమిటి?

 మనిషిని మూఢత్వం వైపు కాకుండా వెలుగువైపు పయనింప చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే. సంప్రదాయాల పేరుతో ఆగిపోకుండా కాలంతో పాటు పయనించేలా మనిషిని ప్రోత్సహించేదీ ఉత్తమ సాహిత్యమే. మనిషిని మనిషిగా గుర్తించేలా చేసే ప్రతిదీ ఉత్తమ సాహిత్యమే.

17.       సాహిత్యంలో రావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా?

 సాహిత్యంలో మార్పులను కాలమాన పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆ మేరకు మనకు తెలీకుండానే మార్పునకు గురవుతూ ఉంటాం. మీరు గమనించే ఉంటారు. ఇప్పటికే సాహిత్యంలో చాలా మార్పులు వచ్చాయి. యాభై అరవై పేజీల కథ నుంచి ఇప్పుడు ఐదారు వాక్యాల మైక్రో కథలుగా కథ మార్పు చెందింది. రచయిత పనిగట్టుకుని సాహిత్యంలో మార్పుకోసం ప్రయత్నించినా.. అప్పటి సమాజానికి ఏది అవసరమో అదే నిలబడుతుంది.

18.       సమాజంలో రావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా?

 సమాజంలో మార్పులు చాలా రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పులు అవసరం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున సాహిత్యం వచ్చేది కాదు. వచ్చే సాహిత్యంలో ఎక్కువ భాగం సమాజంలో మార్పు కోరేదే కదా..

19.       సమాజంలో రావాల్సిన మార్పులకు సాహిత్యం ఏ విధంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు?

 సమాజం సాహిత్యం పరస్పర ప్రేరకాలు. అయితే సమాజ గమనంలో వేగం పెరిగింది. ప్రాధాన్యాలు పెరిగాయి. సమాజంలోని మనుషులే కదా రచయితలు కూడా. వీరి ఆలోచల్లోనూ రచనల్లోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు సమాజానికి సాహిత్యం గాలిబుడగలా కనిపిస్తోంది. సాహిత్యంలో తమ ప్రతిబింబాలను చూసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడ్డం లేదు. ఎవరి గాలిబుడగలను వాళ్లే సృష్టించుకుని ఎవరిలోకంలో వాళ్లున్నారు. అందువలన సమాజంపై సాహిత్యం ప్రభావం చాలాచాలా స్వల్పమైపోయింది. అచ్చులో వచ్చే సాహిత్యం ప్రభావం నామమాత్రమే.

20.       కొత్తరా రాయాలనుకుంటున్న వాళ్లకోసం మీ సూచనలు..

మీ అమాయకత్వంగానీ.. కొత్తగా రాసేవాళ్లు ఎవ్వరూ ఎవ్వరి సూచనలూ పాటించరు. ఇప్పుడొచ్చే కొత్త రచయితల్లో చాలామంది స్వయం ప్రకాశకులు. ఇతర్ల రచనలు చదవరు. పుస్తకాలు అస్సలు కొనరు.

21.       ఇప్పుడేం రాస్తున్నారు..?

నేను తిరుపతిలో చాలాకాలం ఉన్నాను. తిరుపతి మా సొంతూరులా మారిపోయింది. ఎర్రచందనం శేషాచల అడవుల్లో మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన వార్త పేపర్‍లో రోజూ తప్పకుండా ఒక్కటైనా ఉంటుంది. ఎర్రచందనం నేపథ్యంలో నేను హత్యఅనే కథ 2014లో రాశాను. ఎర్రచందనంపై వచ్చిన మొదటి కథ ఇదే. చాలా ఏళ్లుగా ఎర్రచందనం నేపథ్యంతో నవల రాయాలని ప్రయత్నిస్తున్నాను. దానికి సంబంధించి చాలా సమాచారం సేకరించాను. దాదాపు ఏడాదిగా ఆ నవల రాస్తున్నా.

 

22.       మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?

మన ఇతిహాసాలు, పురాణాలలో విశ్వకర్మ / మయబ్రహ్మ ప్రస్తావన ఉంది. దేశంలో ఏ మూలకు పోయినా విశ్వకర్మలు పనిచేసిన ఆలయాలు, కోటలు ఉన్నాయి. వేల ఏళ్లుగా ఈ దేశ అభ్యున్నతికి విశ్వకర్మలు చేసిన కృషిని విపులంగా నవల రాయాలనుంది.

 

ఇంటర్వ్యూలు

సాహిత్యం లోకి వచ్చాక  మానసిక దృఢత్వం పెరిగింది – సదయ్య ఉప్పులేటి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సదయ్య ఉప్పులేటిగారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.

నాపేరు సదయ్య అవ్వ పోసమ్మ, బాపు రాయ పోచయ్య.మాది తెలంగాణలోని కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లోని పొట్యాల గ్రామం.మా గ్రామం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతం.నాకు ఒక చెల్ల ఒక తమ్ముడు.మా ముగ్గురిని కూలి పని చేస్తూనే ఉన్నత చదువులు చదివించారు మా అవ్వ బాపులు. మా పాఠశాల విద్యాభ్యాసం అంతా మా ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. నిజానికి నేను చదువురాని ఒక మొద్దును. చిన్ననాటి నుంచే నాకు ఆత్మవిమర్శ ఎక్కువ అనుకుంటా. తొమ్మిదో తరగతి కి రాగానే నా లోపాన్ని నేను గుర్తించి చదువు మానేస్తా అనంగానే నా మిత్రుడు తొమ్మిది దాకా వచ్చావు కదా ఆయింత పదవ తరగతి చదువు అని సలహా ఇవ్వటం. తర్వాత కష్టపడి చదవడం నా గురువులు నాకు చదువు మీద ఆసక్తి పెంచడం వల్ల నేను పీజీ దాకా చదవగలిగాను.ఈ మద్యే 29.01.2017 నాడు మా బాపు మిషన్ భగీరథ పైప్ లైన్ల పడి మెడలు విరిగి మంచాన పడడం వల్ల మా బాపును చూసుకుంటూ, ఉన్న ఎకరం పొలం చేసుకుంటూ దొరికినప్పుడు కూలి పనికి పోతాను.మా అవ్వ, నా సహచరి హేమలత లు కైకిల్ పనికి పోతే ఇల్లు గడుస్తుంది. మొన్ననే మా తమ్మునికి ఎస్ ఎస్ సి లో జాబ్ వచ్చింది. కొంతవరకు సంతోషం.

2.మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు,రచయితలు,పత్రికలు,పుస్తకాల గురించి తెలపండి.

నేను డిగ్రీ చేస్తున్నప్పుడు వరంగల్ లో ఉన్న "గోదావరి సాహితీ మిత్రులు" ఆవిష్కరించిన మా భూమికోసం, మా హైదరాబాద్ కోసంఅనే కవితాసంపుటి రిలీజ్ కార్యక్రమానికి నేను నా మిత్రులు కలిసి పోయినం. అక్కడ చాలామంది పేరుమోసిన కవులు రచయితలను చూసి ఆనందించాను.తర్వాత నేను వరంగల్లో యం.ఏ తెలుగు చేస్తున్నప్పుడు మాకు నాలుగు సెమిస్టర్లో కలిపి స్త్రీ,వాదం దళిత వాదం, అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం అన్ని రకాల కవిత్వ వాదాలు వుండేటివి.అందులో భాగంగానే నందిని సిద్ధారెడ్డి గారి ప్రాణహితకవిత్వం చదివి సార్ తో మాట్లాడాను. సార్ చాలా అనుకూలంగా స్పందించి నా సందేహాలు తీర్చాడు. “భవిష్యత్ చిత్రపటంవివి సార్ ది సిలబస్లో చదివాక అనుకోకుండా విరసం సభలు జరగటం అక్కడ వివి సార్ ని చూసి ఆనందానికి గురి కావడం జరిగింది. “కొలిమి అంటుకున్నదినవల కూడా మా సిలబస్లో భాగమే. అల్లం రాజయ్య గారిని కలిసి మాట్లాడినప్పుడు నవల గురించి చెబుతూ రాయటం లో మెలుకువలు చెప్పిండ్లు.“జానకి విముక్తినవల చదివి మా చుట్టుపక్కల ఆడవాళ్లకు జరుగుతున్న ఒత్తిడిలు పోల్చుకుని చాలా బాధపడ్డాను. సిలబస్లో భాగంగానే దిగంబర కవిత్వం చదవడం జరిగింది. అట్లాగే చంగిజ్ ఖాన్,రెయిన్ బో, నల్ల నరసింహులు నా అనుభవాలు, కొమురం భీం దొరికిన ప్రతి పుస్తకం చదవడం జరిగింది. ఇట్లా అనేక రకాల రచయితలు సంస్థలు పుస్తకాలు నా మీద ప్రభావం చూపించాయి అని నేను గర్వంగా చెబుతాను

3.    మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను  సాహిత్యం వైపు నడిపించాయి.?

నా తల్లి సంకలో ఉన్నప్పుడో, నాకు తెలిసి తెలియని వయసులో జరిగిన సంఘటనలో కానీ స్త్రీలపై అణిచివేత దళితుల మీద ఒత్తిడి, దొరల దోపిడీతనం వల్ల దళిత కుటుంబాలైన మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది.దొరల ఇళ్లల్లో పొలాల్లో ఎట్టి చాకిరి చేసిన అనుభవం మా అవ్వకు బాపుకు ఉన్నది. వారు ఏదో ఒక్క సమయం లో పడ్డ కష్టాలు వేరే వాళ్ళతో నెమరు వేసుకున్న సందర్భంలో నేను విని చాలా చలించిపోయాను. దొరల ఆగడాలు చూడలేక వారికి వ్యతిరేకంగా కొట్లాడిన వారిని అవ్వ సంకలో ఉండి కొంత చూసిన. ఈ చరిత్ర పరిచయం ఉన్నవారు ప్రత్యక్షంగా పాల్గొన్న వారు చెప్పినప్పుడు విన్నాను.ఇవన్నీ నేను పీజీ చేస్తున్నప్పుడు ఆయా రచయితలు చెప్పిన పద్ధతులు ఇని మనం కూడా రాయవచ్చు కదా అనే ఆలోచన వచ్చి విన్నవి , కన్నవి కథలు రాయడం ప్రారంభించాను.

4.    మీరు సాహిత్యంలోకి రాకముందు, సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తారు.

నా సాహిత్య ప్రవేశం గమ్మత్తుగా ఉంటది.నేను ఇంతకు ముందు చెప్పినట్టు నా పాఠశాల వయసులో చదువులో మొద్దును. అయితే మా గురువుగారు నాకు ఎనిమిదో తరగతిలోనే ప్రపంచ రాజ్యాల సంగ్రహ చరిత్ర, కన్యాశుల్కం, అసమర్ధుని జీవయాత్ర,మహాప్రస్థానం పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. పాఠ్య పుస్తకాలు పక్కన పారేసి ఈ పుస్తకాలు చదవడం మొదలైంది. అసలే చదువంటే ఇష్టం లేని నేను చాలా ఆసక్తిగా చదవడం జరిగింది. నిజానికి నాకు సాహిత్యం అంటే పీజీ లోకి వచ్చేవరకు ఏంటో తెల్వదు.బీఈడీ చేస్తున్నప్పుడు ద్రావిడ విశ్వవిద్యాలయంలో తుని నుంచి మిత్రుడు గణేష్ మీ తెలంగాణ సాహిత్యం బాగుంటది సదా. తెలంగాణ పాట పాడమని అడిగితే దరువు ఏస్తూ తెలంగాణ పాటలు పాడే వాడిని.అప్పుడంటే 2011లో తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా జరుగుతున్నది. నాకు అప్పటికే ధూమ్ దాం ప్రోగ్రాం చేసిన అనుభవం ఉన్నది.అయితే చాలా అమాయకంగా గణేష్ ని సాహిత్యం అంటే ఏంటిదని అడిగేవాడిని. తాను అన్ని చెప్పేది. కానీ నాకు అర్థం అయ్యేది కాదు. వరంగల్ ckmకాలేజీలో యం. ఏ తెలుగు చేస్తున్నప్పుడు సాహిత్యం అంటే పూర్తిగా అర్థం అయింది.

సాహిత్యం లోకి వచ్చినంక, సాహిత్యం పరిచయం అయినంక మానసిక దృఢత్వం పెరిగింది. ఏ బలం లేనోళ్లు, అన్నం లేని వాళ్ళు అంత పెద్ద రాజ్యంతో తలపడుతున్నారు అంటే అది కేవలం సాహిత్యం అందించిన మానసిక బలమే అనుకుంటాను.

5.    సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

నేను రాసినవి చాలా తక్కువ. గోదావరి సాహిత్య పత్రిక, నేను రచయితగా ఒకేసారి పుట్టినం. నేను రాసిన మొట్టమొదటి కథ నిప్పు కణికగోదావరి ప్రారంభ సంచికలో వచ్చింది. అదే విధంగా నా కథలు, కవితలు అన్నీ గోదావరి పత్రికలనే వచ్చినయ్. “దొరల పంచాతుకథ చదివి కేతిరెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడారు."ఉడో"కథ చదివి పి. చందు సార్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. “నక్క తోక,”సంఘర్షణకథలు చదివి మిత్రులు అల్లం రాజయ్య సాహిత్యం మీకు ఇష్టమా అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే నేను గుర్తింపు కోసం మాత్రం రాయలేదు. నేను రాస్తాను అని కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

6.    ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారు?

ఇప్పటి జనరేషన్ మీద సినిమా ప్రభావం పడటం మూలంగా కొంత సాహిత్యం చదివేంత టైం కేటాయించడం లేదని నేను అనుకుంటున్న. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక దాని మీద స్పందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం జరుగుతుంది.వారంతా సీరియస్ గా చదివి రాస్తే మాత్రం చాలామంది మంచి కవులు, రచయితలు బయటికి వస్తారు. ఇప్పటికే పేరుమోసిన వారి గురించి పక్కన పెడితే కొత్తగా రాస్తున్న యువకుల కొంతమంది రచనలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటున్నాయి.చెప్పే విషయాన్ని కొత్త కొత్త కోణాలలో చెపుతున్నారు.మన ముందు సాహిత్యం చదువుతూ మన రచనలకు దారులు వేసుకోవాలి. మనం నివసిస్తున్న సమాజంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అదే సమాజంలో నుంచి వస్తువులు తీసుకుని అదే సమాజానికి చెప్పాలి.

 

 

ఇంటర్వ్యూలు

సాహిత్యాన్ని కాపాడుకోవాలంటే విశాల ప్రజా పోరాటాలే శరణ్యం - రాజు దొగ్గల

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకురాజు దొగ్గలగారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.      మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

నా పేరు రాజు మాది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం,నాన్న పేరు సుధాకర్, అమ్మ పేరు స్వరూప, నాకు తోడు అక్క ఉంది,వ్యవసాయ మరియు శ్రమ ఆధారిత కుటుంబం నాకు తోడు అక్క తనకి పెండ్లి అయ్యింది.చిన్ననాటి నుండి విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే జరిగింది ప్రస్తుతం కరీంనగర్ లోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామాజిక శాస్త్రాలవిభాగంలో డిగ్రీ చేస్తున్న..

2.      మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

నాకు మొట్టమొదట బాగా ప్రభావితం చేసిన వాటిలో ప్రథమ పాత్ర TVV విద్యార్థి సంగం యొక్క "స్టూడెంట్ మార్చ్" అనే పత్రిక.అందులో అచ్చు అయిన వ్యాసాలు కవితలు నన్ను సాహిత్యం దిక్కు ప్రభావితం అయ్యేలా చేసాయి. పాలకులు ప్రజలను చేస్తున్న దోపిడీ దానికి వ్యతిరేకంగా ప్రజలు నిర్మించుకుంటున్న పోరాటాలు నాకు ముందుగా తెలిసింది స్టూడెంట్ మార్చ్ వల్లనే.అలాగే స్పార్టాకస్, అంటరాని వసంతం,ఏడు తరాలు,ఎర్ర నక్షత్రం,అమ్మ,సరిహద్దు లాంటి నవలలు నన్ను బాగా ప్రభావితం చేశాయి, "భగతసింగ్ వీలునామా" అనే పుస్తకం నాకు నిరంతర నూతన ఉత్తేజం. విరసం,వీక్షణం,శ్రామిక వర్గ ప్రచురుణలు లాంటి సాహిత్య సంస్థల ప్రభావం నా మీద ఉంది,అలాగే అలిశెట్టి ప్రభాకర్,శ్రీ శ్రీ ,వరవరరావు, శివ సాగర్,గుఱ్ఱం జాషువా, లాంటి కవుల రచనలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చాలా తోడ్పడ్డాయి.సమాజంలో స్త్రీ లు ఎదుర్కొంటున్నా సమస్యల మీద చాలా మంది రచనలు చేశారు.అలా స్త్రీల మీద వచ్చిన రచనల్లో నన్ను చాలా ఆకర్షించింది హైమావతి అక్క రాసిన "జోలే విలువ".ఆ పుస్తకంలో అక్క పితృస్వామిక పురాషాధిపత్య సమాజం స్త్రీని ఎలా దోపిడీకి గురి చేస్తుందో క్షుణ్ణంగా చెప్పింది.నన్ను కవిత్వం,వ్యాసాలు రాయడంలో ప్రతి క్షణం ప్రోత్సాహించిన ప్రియమైన TVV సహచరులకు,మరియు నా స్నేహితులకు ముఖ్యంగా స్నేహితురాలు మానసకి నన్ను వెన్నంటి ఉండి నా సాహిత్యాన్ని ఆదరించే సాహిత్య ప్రేమికులకు హృదయపూర్వక ప్రేమతో కూడుకున్న కృతజ్ఞతలు...

3.    మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.

ముఖ్యంగా ఇంత ఆధునిక కాలంలో కూడా సమాజంలో వివక్షలుదోపిడీ,అణిచివేతలు, అసమానతలు ఉంటాయా..? అని చాలా మంది ఉన్నత అధికారుల్లో ఉన్న మేధావుల నుండి ప్రపంచ బ్యాంకు సామ్రాజ్యవాద దోపిడీకి గురి అవుతున్న ప్రజలు కూడా ఇప్పటికి అలాగే అనుకుంటున్నారు.పాలక వర్గాల ప్రజలను ఆ భ్రమల్లో ఉంచడంలో ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి.అలా అనుకున్న వాడిలో నేను ఒక్కడిని. కానీ 2016 సంవత్సరంలో నాకు TVV విద్యార్థి సంగంతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయంతో నేను విద్యార్థి ఉద్యమంతో పాటు,సమాజంలో ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. ఆ క్రమంలో సాహిత్యం పై కూడా దృష్టి సారించాను.ఈ క్రమంలోనే రక్త సంబంధం కన్నా వర్గ సంబందం ఉన్నతమైంది అనే భావన నాలో బలంగా నాటుకుంది.క్రమ క్రమంగా ప్రజా ఉద్యమాలలో భాగమవుతున్న క్రమంలో పీడిత ప్రజల జీవిన స్థితి గతులు,నన్ను ఆలోచింప చేశాయి ఆ ఆలోచనలు నన్ను ప్రజల పక్షాన రచనలు చేసే విధంగా తోడ్పడ్డాయి.

4.        మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

నాకు స్కూల్ లో ఉన్న సమయం నుండే పుస్తకాలు చదవడం అలవాటుగా ఉండేది.మా నాన్న నా చిన్నప్పటి నుండే ఇంటికి పేపర్ తీసుకొచ్చేవాడు తప్పకుండా పేపర్ లో వచ్చే కొన్ని కొన్ని కథలు చదివే వాడిని.కానీ అందులో ఏది పాలకుల సాహిత్యం..? ఏది ప్రజల సాహిత్యం అని నిర్ధారించే జ్ఞానం నాకు ప్రజాఉద్యమాలు పరిచయం అయ్యే వరకు తెలియదు. అప్పుడు నేను అవి చదివిన కూడా ప్రతి చిన్న సమస్యకి మానసిక ఒత్తిడులను అధిగమించలేకపోయాను కానీ ప్రజల వైపు నిలబడ్డ సాహిత్యాన్ని చదవడం అలవాటు పడ్డాక ప్రతి సమస్యని మానసికంగా అధిగమించే ధైర్యం వచ్చింది, నాకు విద్యార్థి,ప్రజా ఉద్యమాల గురించి చదవడానికి సమాచారం దొరికింది సాహిత్యం వల్లనే. క్రమంగా ఆ సాహిత్యం చదవడం వల్లనే నాకు సమాజం మీద బాధ్యత పెరిగింది.

5.         మీ సాహిత్యం  మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

నేను నా సాహిత్యం ఇచ్చే గుర్తింపు గురించి ఎప్పుడు ఆలోచించలేదు.కేవలం నా సాహిత్యం నా కవిత్వం,రచనలు పీడిత ప్రజల పక్షాన, వాళ్ళ కష్టాల గురించి, ప్రజా ఉద్యమాల పక్షాన  ఉండేలా జాగ్రత్త పడుతూ ఆ రాసే క్రమంలో ప్రజల నుండి నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ.ఆ నేర్చుకున్నది  మళ్ళీ ప్రజల గురించి రాసినప్పుడు ప్రజలు ఆదరించే విధానమే నా గుర్తింపు అనుకుంటా...

6.      ఒక  రచయితగా ప్రస్తుత  సాహిత్యాన్ని   ఎలా అర్థం చేసుకుంటున్నారు?

ముఖ్యంగా ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా కాలం,యువత పుస్తకాల కన్నా ఫోన్ లోనే ఎక్కువ గడుపుతున్నారు.అందుకు నేను అతిథుణ్ణి ఏమి కాదు.ప్రశ్నించే సమాజం కన్నా సోషల్ మీడియాలో ఉండే సమాజం ఎక్కువ అయిపోయింది.ఇది పాలక వర్గాలు పన్నినా కుట్రలో భాగమే సమాజాన్నీ ఆలోచింప చేయడం మానేసి పూర్తిగా బానిసలుగా తయారు చేస్తున్నారు.ఇదే అదునుగా ప్రజా ఉద్యమాలపై నిషేధాలు కూడా విదిస్తున్నారు అందులో భాగంగా ప్రజా పక్ష మేధావులను,కవులను,నిర్బంధంలో కి గురి చేస్తున్నారు ఈ ప్రక్రియ కు ప్రజా పోరాటాల ద్వారా ముగింపు పలకకపోతే ప్రజలపై నిర్బంధం రోజు రోజుకి తీవ్రమవుతుంది కాబట్టి సాహిత్యాన్ని కాపాడుకోవలంటే విశాల ప్రజా పోరాటాలే శరణ్యం..

అలాగే విద్యార్థులు చదువుతున్న చదువులు,పాఠ్య పుస్తకాలు సంస్కరించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు చాలా మంది  ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.మరి ఆత్మహత్యను ప్రేరేపించే చదువులు ఎందుకోసం చదువుతున్నామో అవి మనకు అవసరమా..?లేదా మరి వాటి స్థానంలో ఎటువంటి చదువులు చదువాలి.వాటి కోసం పాఠ్య పుస్తకాల్లో పాఠాల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అనేది సమాజంలో చర్చ జరగాలి...

 

ఇంటర్వ్యూలు

ప్రజల భాషలో  రచనలు చేస్తే బాగుంటుంది – అనిల్ కుమార్

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుఅనిల్ కుమార్గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.      మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

నా పేరు అనిల్ కుమార్ నా చిన్నతనంలోనే మా అమ్మానాన్న నాకు దూరమైనరు. భూమి భుక్తి విముక్తి పోరులో సాగిన మా అమ్మానాన్నలు అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు.నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మానాన్నలు పార్టీ నుండి బయటకి వచ్చి బతుకుతున్న సమయాన ఆ విషయం తెలుసుకున్న మా తాత (మా అమ్మ వాళ్ళ నాన్న) కుల దురహంకారంతో రగిలిపోతూ వారిని ఏదోలా కనిపెట్టి జైలు పాలు చేశాడు. నేను అక్కడే పుట్టాను ఏ తప్పు చేయకుండానే సంవత్సర కాలంలోనే జైలు జీవితం అనుభవించాను.అదే క్రమంలో అమ్మకు కామ్రేడ్ భారతక్క కలవడం వల్ల వాళ్ళ మధ్య చిగురించిన స్నేహమే భారతక్కను అమ్మని పిలిచేలా చేశాయి. అయితే అమ్మానాన్నలు జైలు జీవితం గడిపి బెయిలు పై వచ్చిన తర్వాత కుల దురహంకారంతో రగిలిపోతున్న మా తాత వల్ల మా నాన్న చనిపోయాడు.ఈ దేశంలో ఉన్న మనువాద బ్రాహ్మణీయ భావజాలం ఎలా అయితే ఆడవాళ్ళని బానిసలా చేసిందో ఆ అసమానతల వల్లనే ఈ సమాజంలో నా తల్లి బ్రతుకలేక నన్ను మా నానమ్మ దగ్గర వదిలేసి అండర్గ్రౌండ్ వెళ్ళిపోయింది.అమ్మ కూడా 2000 సంవత్సరంలో ఒక ఎన్కౌంటర్ లో అమరురాలైంది. అప్పటినుంచి భారతక్క నా మంచి చెడ్డలు చూస్తూ చదివిస్తూ ఇంతవాన్ని చేసింది. నిజంగా వర్గ సంబంధం లో ఏర్పడిన ప్రేమైనా స్నేహమైన చాలా గొప్పది ప్రస్తుతం నేను ఎల్ ఎల్ బి సెకండ్ ఇయర్ చదువుతున్నాను.

2.      మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

ముందుగా విప్లవ సాహిత్యం అయిన దళిత సాహిత్యం అయిన దానికి రాజకీయ అవగాహన ఉండాలి.అలా ఒక రాజకీయ అవగాహన మొట్టమొదటిసారిగా నాకు పరిచయం చేసిన సంస్థ అమరవీరుల బంధుమిత్రుల సంఘం. అప్పటికీ ఆ సంస్థ నా బాధ్యతలు తీసుకొని మంచిచెడ్డలు చూస్తున్న క్రమంలో మీటింగ్ లోకి వెళ్లడం దగ్గర నుంచి విప్లవ రాజకీయ అవగాహన నాలో మొదలైంది. ఆ తరువాత డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పరిచయమైన దగ్గర్నుంచి కుల వర్గ రాజకీయాలు తెలుసుకున్న. ఇవి రెండు సంస్థలు విప్లవ దళిత రాజకీయాలు నేర్పించాయి. డీ ఎస్ యూ లో కార్యకర్తగా కొనసాగుతున్న క్రమంలో వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల మీటింగ్ లకు హాజరు కావడం అన్నిరకాల సాహిత్య సంస్థల మీటింగ్ లకు హాజరు కావడం దొరికిన పుస్తకాలు సేకరించడం మరియు మిత్రుల దగ్గర దొరికిన పుస్తకాలు చదవడంతో భాగంగా శివసాగర్ కవిత్వం, శ్రీశ్రీ కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం, జాషువా విశ్వనరుడు కవిత్వం, పాణి రాసిన కలిసి పాడవలసిన గీతమొక్కటే నన్ను సాహిత్యం వైపు ఆకర్షించాయి.

3.      మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.

ప్రస్తుతం సమాజంలో పేరుకుపోయినటువంటి పెట్టుబడిదారీవిధానం కులవివక్షత, మతోన్మాదం మన ప్రజలు పడుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇబ్బందులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి.

4.      మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

సాహిత్యం లోకి రాకముందు సాహిత్యాన్ని అభ్యసిస్తున్న క్రమంలో నేను నేర్చుకున్న సాహిత్యాన్ని ఒక కొత్త తరహా పద్ధతిలో చెప్పదలుచుకున్నాను అందులో భాగంగానే విప్లవానికి ప్రేమను జోడిస్తూ విప్లవకారులు తమ తల్లి,తండ్రి,కుటుంబం, స్నేహితులను వదిలి ప్రజల కోసమే నమ్ముకున్న పంథాలో సాగిపోతున్న క్రమంలో వారు చేసే ప్రాణత్యాగం ప్రజలపై సొంత ప్రేమను కనబరిచింది. ఆ ప్రేమనే సాహిత్య రూపంలో చెప్పాలనుకున్న.

5.      మీ సాహిత్యం  మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

నేను గుర్తింపు అయితే కోరుకోలేదు కానీ నా కవిత చదివిన చాలా మంది ప్రశంసించిన కవిత్వం మాత్రం ఆ రోజులు వస్తాయి. దానివల్లనే ఇంకా రాయాలని ఆసక్తి కలిగింది.

6.      ఒక  రచయితగా ప్రస్తుత  సాహిత్యాన్ని   ఎలా అర్థం చేసుకుంటున్నారు?

ఒకప్పుడు కవిత్వం రచనలలో గ్రాంధిక పదాలు ఎక్కువగా ఉండేవి.పోను పోను ప్రజల భాషలోకి మారుతూ వచ్చిన క్రమంలో సాహిత్యం కూడా ప్రజలకు ప్రజల భాషలో చెప్పదలిచే పదాలను ఉపయోగిస్తూ రచనలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ కొన్ని సాహిత్య సంస్థలు ఆ దిశగా రాస్తున్నాయి.

 

ఇంటర్వ్యూలు

సమాజ మార్పు పట్ల నా బాద్యతను మరింత పెంచింది-నూతనగంటి పవన్ కుమార్

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు నూతనగంటి పవన్ కుమార్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.      మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

నేను నూతనగంటి పవన్ కుమార్. మాది వరంగల్ జిల్లాలోని కటాక్షపూర్ గ్రామం.

నిరుపేద బీసీ కుటుంబం మా నాన్న గారి పేరు నర్సయ్య, అమ్మ పేరు సరోజన. అమ్మ ప్రతిరోజూ నెత్తిమీద గాజుల గంపతో  ఊరూరా తిరుగుతూ గాజులు అమ్ముతూ నన్ను ఎమ్మెస్సీ ఫిజిక్స్,బి.ఏడ్. వరకు తమ్ముడు సాంబరాజుని ఎంటెక్ వరకు చదివించింది.ఇంటర్ విద్య మినహా నా విద్యాబ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాల,

కళాశాలలోనే జరిగింది.ఇక ప్రస్తుతం నేను ఉపాధ్యాయ విద్యనభ్యసించిన పాతికేళ్ల నిరుద్యోగిని..

2.      మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

నా పై మిత్రుడు కవి,రచయిత అమృత రాజ్  ప్రభావం చాలా ఉంది. అతను ఎల్లప్పుడూ అన్యాయాలపై తన కలాన్ని సందిస్తున్నాడు.అతని ప్రోత్సాహంతోనే శ్రీశ్రీ కవిత్వం,భాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి,అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదివి ఎంతో ప్రేరణ పొందాను.ఆ ప్రేరణ తోనే సాహిత్య విత్తులను సమాజ మార్పుకై చల్లుతున్నాను.ప్రముఖ వార్త పత్రికల్లో వచ్చే విశ్లేషణలు కూడా నాలోని ఆలోచనలకు మరింత పదును పెట్టాయి.

3.      మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.

నేను ఏ రోజు అనుకోలేదు సాహిత్యం వైపు నా అడుగులు పడతాయని మొదటిసారిగా ఓ అందమైన అమ్మాయి అందాన్ని వర్ణించడానికి కలం పట్టాను నిజం చెప్పాలి అంటే ఆమెతో మాట్లాడే దైర్యం లేక అక్షరాలతో అందమైన కవితలు రాసాను.ఆ తర్వాత నిజాన్ని,పేద ప్రజల భాదను నలుగురికి తెలియజేయడమే సాహిత్యమని తెలుసుకున్నాను.ఇంకా సామాజిక అసమానతల పెరుగుదలను చూసి.

అందిన కాడికి దోచుకుతింటున్న కొందరు అవినీతి రాజకీయ నాయకుల ప్రసంగాలను గమనించి, రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి వ్యక్తిత్వాన్ని,అధికారాన్ని నోట్ల కట్టలకి తాకట్టు పెట్టిన కొందరు అధికారులను కళ్ళారా చూసి అసహ్యమేసింది.ఇది మారాలనేభాద్యతగా రాయడం మొదలుపెట్టాను.దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకి జరుగుతున్న అన్యాయం చూసి నా గుండె బరువెక్కింది "తప్పదు ప్రతిఘటన" అనే కవితతో రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాను.ధరల పెరుగుదలవలన సామాన్యుడు అనుభవిస్తున్న బాధలను "సతమతం" అనే కవిత ద్వారా వివరించాను.

4.      మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

సాహిత్యం ఎల్లప్పుడూ  ప్రజా పక్షాన వుంటున్నది కవులు రచయితలు తమ జీవితాలను, అక్షరాలను ప్రజా శ్రేయస్సు కొరకు అంకితం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.ఇదంతా నాకు సాహిత్యంలోకి వచ్చాకే అర్దమైంది.ఇంకా నేర్చుకుంటున్నా.

5.      మీ సాహిత్యం  మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

చాలా సంతోషాన్ని కలిగించింది.సమాజ మార్పు పట్ల నా బాద్యతను మరింత పెంచింది

ప్రజా పక్షాన పోరాడటానికి ప్రేరణ కలిగించింది.

6.      ఒక  రచయితగా ప్రస్తుత  సాహిత్యాన్ని   ఎలా అర్థం చేసుకుంటున్నారు?

ప్రస్తుత సాహిత్యం నేటి సమాజం లోని అస్పృశ్యత లను అసమానతలను సమాజం నుండి వేరుచేయుటకు ఎంతగానో ప్రయత్నిస్తున్నది.లింగ బేదాన్ని వ్యతిరేకిస్తూసామాజిక సమానత్వం కొరకు పాటుపడుతున్నది.పాలకుల అవినీతిని ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నది..!నాలాంటి యువత ఎంతో మంది సీరియస్ గా రాస్తున్నారు అని భావిస్తున్నాను.వారందరికీ నా తరపున శుభాకాంక్షలు.

 

 

 

ఇంటర్వ్యూలు

మనిషిని నిత్యం చైతన్యపరిచేది సాహిత్యం -  అమృత రాజు

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు అమృత రాజు   గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

నా పేరు అమృతరాజ్.మాది ములుగు జిల్లా,అదే ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామానికి ఆమ్లెట్ గ్రామమైన కుమ్మరిపల్లి.మా కుటుంబంలో ముగ్గురు అక్కల తోడ నేను ఒక్కడిని.నేను పాఠశాల విద్య మల్లంపల్లి లోని శ్రీ సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో,ఆ తర్వాత పాలిటెక్నిక్ రామాంతపూర్ లోని JNGP కాలేజ్ లో చేశాను.వరంగల్ లోని వాగ్దేవి కాలేజ్ లో B.TECH చేశాను.ఆంగ్ల సాహిత్యం చదువుదామని పీజీ(M.A ENGLISH)చేశాను.చివరగా టీచింగ్ మీద వున్న ఆసక్తితో ప్రస్తుతం బీ.ఎడ్ చదువుతున్నాను.నాకు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ లోనే పెళ్లయింది.నా సహచరి అనిత టైలరింగ్ చేస్తది.మాకొక పాప తన పేరు జీతన.

2.    మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

నన్ను ప్రభావితం చేసిన మొట్ట మొదటి పుస్తకం "అంటరాని వసంతం",నాకిష్టమైన రచయిత ‘కళ్యాణరావు’.పీడిత ప్రజల జీవితాలను సామాజిక,ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక,చారిత్రక కోణంలో సరళమైన పదజాలంతో కామ్రేడ్ కళ్యాణరావు ఆ నవలను రాసిన తీరు అద్భుతం.ఇంకా దిగంబర కవిత్వం,చెరబండరాజు కవిత్వం,పాటలు, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం,శివసాగర్ కవిత్వం, కలేకూరి ప్రసాద్ కవితలు,మిత్ర పాటలు ఇంకా కుల నిర్మూలన పత్రికలు, నడుస్తున్న తెలంగాణ,వీక్షణం పత్రికల ప్రభావం,విరసం,గోదావరి  మాసపత్రిక ప్రభావం నాపై ఉంది.ఇంకా నాకు పాట రాయడంలో సిద్ధాంత భూమికనిచ్చిన భూరం.అభినవ్ సర్ కి,నన్ను నడిపించిన డి.యస్.యూ కినా సాహిత్యాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసిన సాహితీ మిత్రులకు  కృతజ్ఞతలు.

3.    మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం,డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్(DSU) లో క్రియాశీలకంగా పనిచేసినంత కాలం ఈ సమాజం కులం వర్గం అనే అసమానతలతో పెట్రేగిన తీరును అర్థం చేసుకున్నాను. దానివల్లనే సమాజంలోని ప్రతీ రంగంలో ముఖ్యంగా విద్యా రంగంలో వివక్ష,అణిచివేత కొనసాగడం దానివల్ల గొప్ప గొప్ప స్కాలర్స్ ప్రాణాలు కోల్పోవడం, విద్యను ముడి సరుకు చేసి చదువును అమ్మే కార్పొరేటీకరణను ప్రభుత్వాలే పెంచి పోషించడం గమనించాను.సమాజంలో మనుషులంతా సమానంగా లేరు,కుల,మత,లింగ,ప్రాంత,జాతి భేదాలతో విడగొట్టబడి వున్నారు. అయితే వీటి మూలాలు అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలం,మనువాద పితృస్వామ్యం, పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాయని,ఇదంతా గుప్పెడు దోపిడీ శక్తులు స్వార్థం కోసం చేస్తున్న కుట్రలని గ్రహించాను.అందుకు క్రియాశీల శక్తుల కదిలించడానికి సాహిత్యం సరైన మందు అని నమ్మాను.ఆ నమ్మకమే నన్ను తన వైపు నడిపించింది.

4.    మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

నేను సాహిత్యంలోకి రాకముందు ఎవరు చదువుతారు ఈ పుస్తకాలు  అనుకున్నాను.కానీ ప్రకృతిలో మనిషిని నిత్యం చైతన్యపరిచేది సాహిత్యం.సాహిత్యమే ప్రపంచ విప్లవాలను రికార్డ్ చేసింది,ప్రగతిశీల పోరాటాలను నడిపించిందని,తరతరాలుగా ప్రజల్లో మమేకమై తమ జీవితాల్ని యవ్వనంగా ఉంచడంలో ఉపకరించిందని తెలుసుకున్నాను. అందుకే చదవడం,రాయడం అలవాటు చేసుకున్నాను.నేనే కాదు నాకు తెలిసిన మిత్రులను కూడా రాయమని చెప్తున్నాను.ఈ సాహిత్య వాతావరణం స్వేచ్ఛగా నా అభిప్రాయాల్ని చెప్పడానికి వెసులుబాటు కల్పిస్తున్నది.

5.    మీ సాహిత్యం  మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

నేను ఇప్పటి వరకు మహిళలు-అత్యాచార హత్యలు-ఆత్మగౌరవ పోరాటాలు;రాజ్య నిర్బంధం;మహనీయుల యాది;రైతు పోరాటాలు;విద్యారంగం;కరోనా;దళిత,ఆదివాసీ పోరాటాలు వంటి అంశాలపై కవిత్వం రాశాను.ప్రో.డా.వినోదిని  రాసిన “దాహం” నాటకంపై,హెచ్చార్కే రాసిన “రెబెల్” నవలపై,నందిని సిద్దారెడ్డి రాసిన “అనిమేష” కావ్యం పై,వి ఆర్ విద్యార్థి రాసిన “దృశ్యం నుండి దృశ్యానికి” కవిత్వంపై,అట్టాడ అప్పల్నాయుడు రాసిన “బహుళ” నవల పై;యోచన రాసిన “ఆళ్లకోస” పాటల పుస్తకంపై నా అభిప్రాయాలను రాశాను. “వెతుకుతున్న పాట”,”జరగబోయే కథ”,“రైతు బంధు”,”మీటింగ్ ఆగమాగమాయే అని నాలుగు కథలని రాశాను.ఇవన్నీ మిత్రులు కొందరు పెద్దలు బాగున్నాయని చెప్పడం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.గుర్తింపు తర్వాత విషయం అనుకుంటాను.

6.    ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?

సోషల్ మీడియా ప్రభావం వల్ల సాహిత్యం ఇప్పుడు అందరి చేతుల్లో ఉంది.చదవకుండానే రాసేవాళ్ళ సంఖ్య పెరిగింది. అందుకే అసంపూర్ణమైన సాహిత్యం వెలువడుతున్నది.మరో పక్క ప్రజా రాజకీయాలను చెప్పే సాహిత్యం తగ్గింది.అందుకే పాలక వర్గాలు సాహితీ సంస్థలపై నిషేధాలు ప్రకటిస్తున్నాయి.ఆచరణ లేని రచయితలు బయటపడుతున్నారు.సరికొత్త వాదాలు సృష్టించబడుతున్నాయి.

అందుకే ఆచరణ తో కూడిన ప్రజారాజకీయాలను ప్రతిభింబించి ప్రజల్ని నిత్య చైతన్యవంతులుగా నిలబెట్టడంలో సాహిత్యం ఉపయోగపడాలని,అందుకు చేరాల్సిన వారందరికీ ఆ సాహిత్యం చేరేవిధంగా బాధ్యత పడాలని సాహితీ ప్రియులకు విజ్ఞప్తి.

 

 

ఇంటర్వ్యూలు

జీవితంలో ఖాళీలను పూరించడానికే సాహిత్యం – దిలీప్.వి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు దిలీప్.విగారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1     మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.

మాది కొత్తగా ఏర్పడ్డ ములుగు జిల్లాలోని ములుగు మండలానికి చెందిన మల్లంపల్లి గ్రామం. నిరుపేద దళిత కుటుంబం. అమ్మానాన్నలు రవి లలిత లకు ముగ్గురు పిల్లలం. ఇద్దరు చెల్లెళ్ళు, నేను. మా చిన్నతనంలో అమ్మ నాన్న ఇద్దరు ఎర్ర మట్టి గుట్టల్లో లారీలు నింపడానికి పోయేవారు. నాన్న ముఠా మేస్త్రీగా ఉండేవారు. యాంత్రికరణ చాలా మంది జీవితాలను రోడ్డున పడేసినట్టే క్వారీలలో యంత్రాలు వచ్చి మా గ్రామంలో చాలా కుటుంబాలను రోడ్డున పడేసింది.ఆ రోడ్డున పడ్డ కుటుంబాలలో మాది ఒక కుటుంబం. అట్లా రోడ్డున పడ్డ అమ్మనాన్నలు మమ్ములను,కుటుంబాన్ని సాధడానికి నాన్న ఆటో డ్రైవర్ గా,అమ్మా వ్యవసాయ కూలీగా కొత్త అవతారం ఎత్తారు.ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లో అయినా ఉన్నత  పాఠశాల విద్యా స్టేషన్ ఘన్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ నర్సంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అయిపోయింది. పరకాల లో ఉపాధ్యాయ విద్యా ట్రైనింగ్ చేసి 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా నియమితుడనై వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లీ మండలంలోని  ముచ్చిoపుల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న.

 

2.    మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు,రచయితలు,పత్రికలు,పుస్తకాల గురించి తెలపండి.

ఘన్పూర్ గురుకులంలో ఉన్నపుడు లైబ్రరీలో తెలుగు వెలుగు మాసపత్రిక,కథల పుస్తకాలు చదివేవాడిని. ఆ తర్వాత సామజిక స్పృహ కలిగిన తర్వాత ఏది పడితే అదే చదివేవాడిని. నా సామాజిక రాజకీయ గురువు హరికృష్ణ గారి పరిచయం తర్వాత వారు పరిచయం చేసిన తాపి ధర్మారావు గారి "దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు?" పుస్తకం నాలో కొత్త ఆలోచనలు, నూతన ప్రశ్నలను ,అధ్యయన ఆసక్తిని పెంచింది. ఆ తర్వాత భిన్నమైన సామాజిక సాహిత్యాన్ని చదివాను. చలం నవలలు, ఓల్గా కథలు,

రాహుల్ సంకృత్యాన్ రచనలు,శ్రీ శ్రీ ,కలేకూరి,బహుజన కవుల కవితలు ఇంకా అనేకమంది కవితలు, బాలగోపాల్ సామాజిక తాత్విక రచనలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయి.

 

3.    మీ చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను  సాహిత్యం వైపు నడిపించాయి.?

దళితులు అంటేనే నూటికి 90శాతం పేదలు .అందుకే పేదలకు పర్యాయపదంగా దళితులు అని చెప్పుకోవచ్చు అనుకుంట. ఇప్పటివరకు పుట్టిన సామాజిక సాహిత్యం మొత్తం కూడా పేదలు,దళితులు బహుజనుల నుండే పుట్టింది. అట్లా నా పుట్టుకతో నా ఉనికిని గుర్తించే సమాజంలో నేను పడ్డ అవమానాల నుండే నన్ను నేను నూతన మానవుడిగా నిర్మించుకోడానికి  నా చుట్టూ పరిస్థితులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి.

4.    మీరు సాహిత్యంలోకి రాకముందు, సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తారు.

నేను సాహిత్యం అనేది ఒకటి ఉంటుందని తెలియకముందే నా జీవిత అనుభవాలు, నా మది ఆలోచనలతో రాయడం మొదలు పెట్టా. అట్లా...9వ తరగతిలో ఉన్నపుడు

"పదునులేని కత్తి పనికి రాదు

చెల్లని పైసకు విలువ లేదు

నీటిలో నడవని పడవ అక్కరకు రాదు అలాగే...

విద్యలేని మానవునికి

సమాజంలో విలువ లేదు" అని విద్యా నాకు ఎంత అవసరమో నాకు నేను రాసుకున్న. అట్లా రాసుకుంటూ రాసుకుంటూ మిగతా సాహిత్యాలను చదువుకుంటూ ఈ సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన నాకు ఒకప్పుడు చాలామంది నూతన రచయితలకు సీనియర్ రచయితల సలహాలు, మెళకువలు, లభించేవి. అందుకు తగ్గ వాతావరణం కూడా ఉండింది ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితులు లేకపోవడమే కాకా రాసే వారిపై నిర్బంధం కూడా కొత్త రచయితలు రాయకుండా చేస్తుంది. బలమైన సామాజిక, ప్రజా సాహిత్యం రాకపోవడానికి ఇది ఒక కారణం.ఒకప్పుడు విప్లవ సాహిత్యం సమాజంలో బలంగా దూసుకువస్తే నేడు అస్తిత్వవాద సాహిత్యం బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నది. కొత్తతరం చాలామంది కవులు, రచయితలు వీటినుండే రావడం మనం గమనించవచ్చు.

5.    5          సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

సాహిత్యం నాకు తెచ్చిన గుర్తింపుకంటే కూడా నా సామాజిక బాధ్యతను మరింత  పెంచినది అనుకుంటున్నా. నా కవితలు,వ్యాసాలు చదివి నన్ను ఫోన్లో అభినందించడానికి కాల్ చేసే చాలామంది మరిన్ని సామాజిక రచనలు చేయాలనీ కోరేవారు.ఇదే నాకు సాహిత్యం ఇచ్చిన గుర్తింపు. నా కవితలు,వ్యాసాలు చదివిన వారిని నాకు ఫోన్ చేసేలా స్పందింప చేసిందంటేనే సాహిత్యం నాకు ఎంతటి గుర్తింపును తెచ్చిoదో అర్ధం చేసుకోవచ్చు.

 

6.    ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకుంటున్నారు?

 

ఏ సాహిత్యమైన అది వెలువడ్డనాటి కాలమాన పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచం ముందు ఉంచినపుడే అది నిజమైన సాహిత్యం అనిపించుకుంటుంది. సాహిత్యం ఇట్లానే ఉండాలని అనే వాదనను ఇట్లా రాస్తేనే సాహిత్యం అవుతుంది అనే వాదనను రెండింటిని ఒప్పుకోలేను. ఈ విషయంలో "సాహిత్యం అంటే జీవితంలో ఖాళీలను పూరించడం" అన్న బాలగోపాల్ మాటలు..మరియు "ఎవడో చెప్పినట్టుగా కాక నీకు నచ్చినట్టుగా రాయి"అన్న కలేకూరి మాటలు నా రచనకు స్పూర్తి. ఏ సాహిత్యం ఐన బాలగోపాల్ అన్నట్టు ఆయా వ్యక్తుల , ఆయా సమాజాల జీవితంలో ఖాళీలను పూరించడానికి తోఢ్పడినపుడే ఆ సాహిత్యానికి ఒక అర్ధం ఏర్పడినట్టు. ప్రస్తుత సాహిత్యంలో అట్లాంటి వాటా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఓల్గా "ప్రయోగం" కథ చదివిన నాకు అన్ని సంవత్సరాల క్రితం అంత ఆధునికంగా యెట్లా ఆలోచించినదా? అని నాకు నేనె ఇప్పటికీ అనుకుంట. నా జీవితంలో ఆలోచనలకు అద్దం పట్టిన కథ. రిజర్వేషన్స్ గురించి వచ్చే వాదనలు విన్న ప్రతిసారి బలమైన ప్రతిపాదన యెట్లా పెట్టాలా అని ఆలోచించే నాకు బాలగోపాల్ "రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం" చదివిన తర్వాత "ప్రతిభ" యొక్క తార్కిక నిర్వచనం నాలో చాలా అనుమానాలను నివృత్తి చేసింది. బలమైన వాదన పెట్టడానికి తోఢ్పఢ్ఢది. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇట్లా ఆయా సందర్భాలలో మానవ జీవితంలో ఏర్పడ్డ ఖాళీలను పూరించే సాహిత్యం ప్రస్తుత పరిస్థితిలో రావలసినంత, ఆశించినమేర రావడం లేదు.

 

ఖాళీలను పూరించడానికి...

 

కవిత్వం చిటికెలు, చప్పట్లు చరిపించుకోవడానికి కాదు

సాహిత్యం సత్కారాలు సన్మానాల కోసం కాదు

 

అంటరాని బ్రతుకుల ఆవేదనను

అనగారిన వర్గాల ఆక్రోశాన్ని

పేద వారి వెతలను

బడుగు బలహీన వర్గాల బాధలను

'సిరా' సుక్కలుగా మార్చి

కళ్ళు మూసినట్టుగా నటించే నాయకుల

కనుల ముందు వాస్తవాల వెలుగులు పరుచడానికి

 

 

ఆకలి దప్పులు లేవని

జాతి మత కుల లింగ వివక్షలు లేవని

పుచ్చు మాటలు పలికే చచ్చు మూకల పై

అక్ష"రాళ్ళెత్తి" దండ యాత్రలు చేయడానికి

 

 

కవిత్వం, సాహిత్యం

సమత, సౌభ్రాతృత్వం

స్వేచ్ఛా ,స్వాతంత్రం సాధించడానికి

జీవితంలో ఖాళీలను పూరించడానికి

 

సాహిత్యం పట్లా సూక్ష్మoగా ఇది  నా అభిప్రాయం.

ఇంటర్వ్యూలు

గొప్ప గొప్ప కలాలన్నీ మూగబోయాయే అన్పిస్తుంది - అనిల్ కర్ణ

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుఅనిల్ కర్ణగారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

నా పేరు అనిల్ కర్ణ. మా గ్రామం  పోలేపల్లి తొర్రూరు మండలం  మానుకోట జిల్లా.  తండ్రి, వెంకటయ్య, సుతారి మేస్త్రి.  తల్లి , ఎల్లమ్మ దినసరి కూలీ.  మాది ఒక నిరుపేద కుటుంబం.  ముగ్గురు అన్నదమ్ములం.

2.    మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

ప్రభావితం చేసిన రచయితలు,పుస్తకాలు అంటే అయాన్ రాండ్ రాసిన "ఫౌంటెన్ హెడ్" పుస్తకం అందులో రోర్క్ పాత్ర నాకు బాగా నచ్చింది.  అలాగని అతని ప్రభావం ఉందని చెప్పను.  సినీ డైరెక్టర్రామ్ గోపాల్ వర్మ  "రాముఇజం" ప్రభావం ఉందని మాత్రం నిర్మొహమాటంగా చెప్తాను.

3.    మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?

సమాజంలో ఉన్నటువంటి అసమానతల మూలానే మొదట నాలో కవిత్వం గానీ పాట గానీ పుట్టింది అని చెప్తాను.  ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఏదో రాసేద్దాం లే అని కూర్చుంటే వచ్చేది కాదు అది. ఏదో  ఒక భావావేశానికి లోనైనప్పుడే అది బయటపడుతుంది.

4.    మీరు సాహిత్యం లోకి రాకముందు, సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

రాకముందు నా ముందు తరాలను చూసి స్ఫూర్తి పొందిన వాన్ని.  వచ్చాక వాళ్లు ఇప్పుడు    పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అంతా commercial అయిపోయి పక్క దారి పట్టారు. గొప్ప గొప్ప కలాలన్నీ మూగబోయాయే అన్పిస్తుంది.

5.    మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

సమాజంలో బతికే యే మనిషైనా తన ఉనికి ని తెలియపరుచుకోడానికి,తన గుర్తింపు కోసమే ఆరాట పడుతుంటాడు.  అలా చూస్తే నా సాహిత్యంలో నా సాధన మేరకే గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను.

6.    ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?

ఇప్పుడంతా డిజిటల్ మీడియా కాబట్టి పెద్ద పాత్ర సోషల్ మీడియాదనే చెప్పాలి.  తర్వాత విప్లవ సాహిత్యం, టీవీ ఛానల్, నవలలు,పత్రికలు వాటి పాత్ర అవి పోషిస్తూనే ఉన్నాయి.

ఇంటర్వ్యూలు

సాహిత్యం నాకు నేనే వెతుకున్నేలా చేసింది- గుండేటి సుధీర్

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుగుండేటి సుధీర్గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.

నా పేరు గుండేటి సుధీర్.  అమ్మ జయ, నాన్న బాబురావు. నాన్న చనిపోయి ఐదేళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఊళ్ళో నాన్న పెట్టిన చిన్న చెప్పుల షాప్ ని నడుపుకుంటూ, చదువు కొనసాగిస్తున్నాను.

2.    మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

సాహిత్య సంస్థలకన్నా ముఖ్యంగా కళ్యాణ్ రావు పుస్తకాలు, కలేకురి, శివసాగర్ కవితలు నన్ను ఎంతోగాను ప్రభావితం చేసినవి. వాళ్ళ రాతలల్లో మా బతుకులు, బతుకుల పోరాటాలు కనబడ్డవి. అప్పుడే పుస్తకాలతో సాహిత్యాన్ని ప్రేమించాను, అందులో దళిత సాహిత్యం మరింతగా నాకు హత్తుకుంది.

3.    మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?

నా చిన్నప్పటినుండి మేము ఎన్నో రకాల పరిస్థితులను ఎదురుకుంటూనే ఉన్నాము. ఐనప్పటికీ వాటిని రాయాలని, మాట్లాడలని సాహిత్యం పరిచయం అయ్యే వరకు, ఏ రోజు నాకు అనిపియ్యలేదు. కానీ బూడిద పళ్ళెంలో బువ్వ తిన్న, తింటున్న బతుకులను, ఆగిపోయిన చిక్కేంటికల  కలలను, అలసిపోయిన ఆశలను, బతుకు పోరుజేసీ పోయిన పానాలను ఇప్పుడు రాయకుండా ఉండలేను. నేను ఇప్పటి వరకు రాసిన ఏ రాతలైన ఊహించుకొని రాయలేదు. నాకు అలా రాయడం తెలీదు. ఐనా నేను రాసిన అన్ని రాతలు కూడ జరిగిన, జరుగుతున్న వాటికి నా అక్షరాలను దిష్టి సుక్కలా అద్దాను అంతే.

4.    మీరు సాహిత్యం లోకి రాకముందు,సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

నేను సాహిత్యంలోకి రాకముందు సాహిత్యం అంటే  ఏమిటో తెలిదు. వచ్చాక కూడ నాకేమి సరిగా అర్ధంకాక పోయేది. అప్పుడే అనిపించింది సాహిత్యాన్ని ఇంకింత సామాన్య ప్రజలకు చేరువ చేసే సులభతరంగా ఉండాలి అని. ఇది నా అభిప్రాయం మాత్రమే.

5.    మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

సాహిత్యం నాకు నేనే వెతుకున్నేలా చేసింది. మనుషులను, వాళ్ళ బతుకులను ఒక శాస్త్రీయ కోణంలో చూసేలా చేసేది. ఇక గుర్తింపు అంటరా, నా కలం పీడితుల పక్షం నిలబడ్డ ప్రతిసారి, అంతకన్నా గొప్ప గుర్తింపు లేదనిపిస్తుంది.

6.    ఒక రచయితగా ప్రస్తుత సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు?

ఆధునిక సాహిత్యమంత రోజు రోజుకి సమాజంలో కొత్తగా పూస్తుంటుంది. కానీ ఆ సాహిత్యమంత ప్రజల పక్షమై చైతన్యాన్ని తెచ్చే దిశగా ప్రస్తుత సాహిత్యం సాగాలని కోరుకుంటున్నాను.

 

ఇంటర్వ్యూలు

సమాజంలో సమస్యలన్నీ అర్థం చేసుకుంటే సాహిత్యాన్ని అర్థం చేసుకున్నట్లే - కుసుమ రవళి 
 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకుకుసుమ రవళి విల్లూరిగారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.

నా పేరు కుసుమ రవళి.నేను విశాఖపట్నం జిల్లాలో దేవీపురం అనే గ్రామంలో  నవంబర్ 26 1999 లో జన్మించాను.నాన్న వ్యవసాయ రంగంలో ఉండగా అమ్మ గ్రుహిణి. అక్క ,అన్నయ్య చదువు పూర్తయి ఉన్నారు.

2.    మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

నన్ను బాగా ప్రభావితం చేసిన రచయిత అన్వర్ గారు.  ఆయనతో మాట్లాడింది కొన్ని సార్లు అయినా ఎన్నో నేర్చుకున్నా. ఎలా రాయాలో ఎలా సాగాలో ఎలా ఎదుర్కోవాలి అని ఆయన మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.  ఆయన ఇచ్చిన ధైర్యంతో ఉండే సాహిత్యం వైపు అడుగులు వేయగలిగాను...

3.    మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?

నా ఎనిమిదవ తరగతి నుంచి రచనలు చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టాను.  మొట్టమొదట నేను రాసిన కవిత “ఒక రైతు కోసం”.  మొదట అయితే ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక ఆలోచిస్తూ ఆరుబయట నక్షత్రాలను చూస్తూ ఒక్కొక్క అక్షరం రాయసాగాను.అలా నా మొదటి కవిత పూర్తి అయ్యింది

4.    మీరు సాహిత్యం లోకి రాకముందు,సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

సాహిత్యం లోకి రాకముందు  వరకు రచనలు, కవితలు, కథలు మీద నాకు అంతగా పట్టు లేదు. కానీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. కానీ నేను రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి నా మాటలతో పదాలతో సమాజంలో ఒక్కరైనా మారిస్తే చాలు అని అనుకున్నా.  మార్పు వస్తుందో లేదో చెప్పలేకపోవచ్చు కానీ మార్పు నా నుంచే మొదలవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా.

5.    మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?

సాహిత్యం తో వచ్చిన గుర్తింపు నన్ను ఎంతో ఆనందింప చేసింది.  ఎవరైనా వచ్చి మేడం బాగా రాశారు అని నాతో అన్నప్పుడు మనసుకి ఎంతో హాయిగా అనిపించేది.  ఎందుకంటే నా అక్షరాలు మీ ముందుకి నడిపించేది ఆ మాటలే కాబట్టి..

6.    ఒక రచయితగా ప్రస్తుత  సాహిత్యాన్ని  ఎలా అర్థం చేసుకుంటున్నారు?

ఒక విషయం లో మార్పు రావాలి అంటే ముందు మనలో మార్పు రావాలి అన్నాడు ఒక మహానుభావుడు.  ఒక రచయితగా నా భావన కూడా అదే.  సమాజంలో సమస్యలన్నీ అర్థం చేసుకుంటే సాహిత్యాన్ని అర్థం చేసుకున్నట్లే అని నా అభిప్రాయం....

 

ఇంటర్వ్యూలు

తుపాకీ విప్లవం కన్నా బౌద్ధ  విప్లవం  మానవీయమైనది  -  ఇంద్రవెల్లి రమేష్‍

  • విరసంపై తిరుగుబాటు విఫలమైనా, ప్రశ్నలు అలాగే ఉన్నాయి.
  • బుద్దుడు దేవుడు కాదు, మానవోన్నతుడు.  బౌద్ధం మతం కాదు, ధమ్మం.
  • బౌద్ధాన్ని మతంగా అనుసరిస్తున్న దేశాలు, సంస్థలు, వ్యక్తులు తొలి బౌద్ధానికి దూరమైనవారు, అంధులైనవారు.
  • కరోనాకు మనోధైర్యమే తొలి ఔషధం.
  • ప్రజాస్వామిక, మానవీయ సమాజ నిర్మాణమే మొదటి షరతు.
  • నిశ్చేతనులుగా ఉన్న బి సీ లు చరిత్రలోని బుద్ధుడు మొదలు...పూలే - అంబేద్కర్ లను స్పూర్తిగా తీసుకుని, ఐక్యంగా ముందడుగు వేయాలి.  ఓ దేశవ్యాప్త రాజకీయ శక్తిగా మారాలి.  ఇతర మనువాద వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయాలి.

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కవి, సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇంద్రవెల్లి రమేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ                                                 

1.       రమేష్‍, ఇంద్రవెల్లి రమేష్ గా ఎలా మారాడు?

1990 సంవత్సరం.  నా మొదటి పుస్తకం “ప్రమాద సంగీతం’పుస్తకం వేస్తున్న  సందర్భం. విప్లవ రచయితల సంఘం చిత్తూరుజిల్లా  యూనిట్‍ ప్రచురణగా వచ్చిన కవిత్వ పుస్తకం అది.

పుస్తకం పేరైతే “ప్రమాదసంగీతంఅని  సౌదా  ఖరారు చేసాడు. ఆ పుస్తకాన్ని  అందంగా తీర్చిదిద్దిన ఆర్‍.ఎం. ఉమామహాశ్వరరావు టైటిల్‍ కు మద్దతు తెలిపాడు. ఇక కవి పేరు సంగతేమిటి? అదే ప్రశ్న  ఆ మిత్రులిద్దరూ వేసారు.  స్కూలు రికార్డులలోని  కొత్తపల్లి రమేష్‍ బాబు అనే పేరును కవిపేరుగా వేసుకోవడం నాకు  అసలు నచ్చలేదు. అది ఓ సంప్రదాయంగా వచ్చిన పేరు,  రిజిస్టర్డు పేరు.  అది నా సృజనకు, ఆలోచనలకు, నా తరంలోని  నావైన ఆశయాలకు  సంబంధం లేని పేరు ..కనుకనా తాతముత్తాతల పరంపరతో సంబంధం లేకుండా   నాకు    నేనుగా ‘యింద్రవెల్లి రమేష్‍ గా  అపుడే ప్రకటించుకున్నాను.  అదే మొదటిసారిగా  బహిరంగంగా  “ ప్రమాదసంగీతం” ద్వారా  వెల్లడైన పేరు.

ఎన్నో  పేర్లుండగా “యింద్రవెల్లి” అని .. కవిపేరులో సగంగా  ఎందుకు   శాశ్వతం చేసుకున్నానన్నది చెబితే మీ ప్రశ్నకు  సమగ్ర సమాధానం ఇచ్చిన వాణ్ణవుతాను.

తిరుపతిలో అప్పట్లో రాడికల్‍ విద్యార్థి ఉద్యమం  బలంగా ఉండేది. నేను ఆ    సంఘానికి 1985లో చిత్తూరు జిల్లా ప్రఃధాన కార్యదర్శిగా  ఉండేవాడిని. 1985 .. నాటి  ఉమ్మడి ఆంధప్రదేశ్‍లో  ఓ  అప్రకటిత నిర్బంధ నామ సంవత్సరంగా అనుకుంటే, తెలుగుప్రాంతం ఆ మూలనుంచి ఈ మూల వరకూ   కనిపించిన రాడికల్‍ విద్యార్థినల్లా  రాజ్యం  వెంటాడింది.  అబద్ధపు కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టింది. అందులో నేనొక్కణ్ణి.  అవే జైళ్లు మాకు   పాఠశాలలయ్యాయి. విప్లవ సాహిత్యం అధ్యయనం చేసాము. చర్చలు చేసాము. పాటలు పాడుకున్నాం. ఆగస్టు 15  స్వాతంత్ర్య దినోత్సవాన్ని  బహిష్కరించి,   తోటి ఖైదీలను ఉత్తేజపరిచాము.     సమీప గతంలోని ఇంద్రవెల్లి ఘటన పట్ల నిరసనలను ఆవాహన చేసుకున్నాం.   బహుశా త్రిపురనేని  శ్రీనివాస్‍, సౌదా, నేను విప్లవ కవులుగా అప్పుడే  పురుడు పోసుకున్నట్టే. బయటికొస్తూనే మా పుస్తకాలు.. ముందు, వెనుకలుగా విరసం ప్రచురణలుగా వచ్చాయి.

మరొక విషయం, మేము అలా జైలుకెళ్లడానికి ముందు తిరుపతి పట్టణంలో   “ఇంద్రవెల్లి “ పేరుతో  తిరుపతి నడిబొడ్డున ఓ బుక్‍స్టాల్‍ పెట్టాము. చిత్తూర్ జిల్లా నాటి  విరసం కన్వీనర్ చక్రవేణు  అనే కథకుడు, శ్రీనివాస్‍ అనే మా  సీనియర్‍ విద్యార్థి దానిని  నడిపేవారు. కాలేజీ   అయ్యాక, నేను అపుడపుడు వెళ్లి కూర్చునేవాడిని. కొన్ని  నెలలైందో లేదో పోలీసు ట్రక్కులు వచ్చి ఆ పుస్తకాల షాపును సీజ్‍ చేసి, ఆ కూర్చున్న  ఇద్దరిని  తీసుకెళ్లాయి. ఆలస్యంగా  వెళ్లడంతో నాకు ఆ వాతావరణం అర్థమైంది. మిగిలిన వాళ్లం అజ్ఞాతంలోకి వెళ్లాము. జరుగుతున్న  వరుస అరెస్టులను ఖండిస్తూ, అర్ధరాత్రివేళ  పోస్టర్లు వేస్తుండగా పోలీసులు మమ్మల్నీ పట్టుకెళ్లారు.  పుస్తకాల షాపునకు  పేరు పెట్టుకుంటేనే, ఆ పేరు వెంట పోలీసులు పడ్డారు అంటే, అది ఎంత శక్తివంతమైనది?

 ఈ నేపథ్యంలో యింద్రవెల్లి మీద, ఆదివాసీ గోండుల జీవితసరళి మీద ప్రత్యేక  ఆకర్షణ ఏర్పడింది.  కవి పేరు అలా పెట్టుకోవడంలో బహుశా నా బుర్రలో   ఆ విధముగా బీజం పడివుండవచ్చు. అదే నా  వ్యావహారిక నామంలా స్థిరపడింది. అది తప్ప నాకు  మరో ఆస్తిత్వం లేదు. ఆ  పేరుతోనే  30 ఏళ్లగా రచనలు చేసాను, చేస్తున్నాను, చేయబోతాను.  అందువల్ల కూడా నిర్భంధాలు  పడ్డాను, పడుతున్నాను.  ఈ విషయాలు సంక్షిప్తంగా మొదట ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్రాసాను (సందర్భం - 2011 ఏప్రిల్, 20 -  ‘ఆ గాయానికి ముప్పైళ్ళు’ ఇంద్రవెల్లి సభ).  మళ్ళీ 2018లో ఇంద్రవెల్లి స్మారక స్థూపాల పరిరక్షణ కమిటీ తరపున జానపద పరిశోధకులు జయధీర్ తిరుమలరావు,  శాంతి చర్చల ప్రతినిధి  ఎస్ సుధాకర్  ప్రచురించిన   ‘జ్ఞాపకాల్లో ఇంద్రవెల్లి’  పుస్తకంలో  వివరంగా వ్రాసాను. అందులో పొత్తూరి వెంకటేశ్వరావు గారు, గోపీనాథ్ తదితరుల వ్యాసాలు కూడా ఉన్నాయి.

2.       మీ చుట్టూ  ఉన్న  ఏ సామాజిక - ఆర్థిక- రాజకీయ పరిస్థితులు మిమ్ములను సాహిత్యం  వైపు నడిపించాయి?

నాకు కుటుంబ సాహిత్య నేపథ్యం  లేదు. రాడికల్‍ విద్యార్థి  ఉద్యమంలోంచి నేను  కవిగా రూపాంతరం చెందాను. అనంతరం విప్లవ రచయితల సంఘంలో     చేరాను.

తెలంగాణలాగే రాయలసీమ కూడా వెనుకబడ్డ ప్రాంతం.( ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా). తెలంగాణ కన్నా బాగా వెనుకబడ్డ ప్రాంతం. రాయలసీమజిల్లాల్లోకి  చిత్తూరుజిల్లా  కొంచెం అభివృద్ధిలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆ జిల్లాలో నేను పుట్టి పెరిగిన మదనపల్లి ప్రాంతం  ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా.. వెనుకబడ్డ ప్రాంతమే.  రాయలసీమలోమొదటి కాలేజీ మదనపల్లి  బిసెంట్  థియోసాఫికల్ కాలేజీ కనుక, కొంచెం విద్యాపరంగా ఆ ప్రాంతం ముందుభాగాన  ఉండొచ్చు.

అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా  విప్లవోద్యమాలకు  కొంచెం స్పేస్‍ ఇచ్చేవి.  అందువల్ల  ఆ ప్రాంతంలో  పెల్లుబికిన పోరాటాల ప్రభావంతో కూడా    నేను విద్యార్థి దశనుంచి సాహిత్యంలోకి వచ్చానని  చెప్పవచ్చు.

3.       విరసం వైపు మీ ప్రయాణం, విరసం నుండి మీ ప్రయాణం గురించి...

విరసం వైపు ప్రయాణం  త్రిపురనేని  మధుసూదనరావు గారి వల్ల జరిగింది.   ఆయన నాకు  అప్పట్లో గురుతుల్యులు. ప్రతి విషయాన్నీ  ఆయనతో చెప్పేవాన్ని. సందేహాలు ఆయనే నాకు నివృత్తి చేసేవారు.  నేను  జైలునుంచి వచ్చిన      తరువాత అరుణతారలో ‘సన్‍రే’ పేరుతో, ‘సూర్యం’  పేరుతో కవితలు రాసాను.   అవి   చూసినన్ను  విరసంలో చేరమని  ప్రోత్సహించారు .  దరఖాస్తు చేయడం తెలీదంటే, అయన ఇంట్లో ఆయన చెబుతూ ఉండగా నేను రాస్తూ వచ్చింది ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లే ఉంది. సంతకం చేసి ఇచ్చాను.  చీరాలలో(?) జరిగిన  విరసం సర్వసభ్య  సమావేశం నన్ను సభ్యుడిగా ఆమోదించింది. విశేషమేమిటంటే, దాదాపు అదే సందర్భంలోనే త్రిపురనేని  శ్రీనివాస్‍ బహిష్కరణ జరిగినట్లు గుర్తు.

అప్పట్లో విరసం బయట దళిత - స్త్రీవాద సాహిత్యాల ప్రభంజనం వీచేది. అవి నేరుగా  విప్లవోద్యమసాహిత్యోద్యమం మీద చాలా ప్రశ్నలను సు గుప్పించేవి. వాటికి విరసం నుంచి బదులు లేదు. అరాకొరా బదుళ్ళు  సంతృప్తికరంగా లేవు.  అందుకే, విరసం బయట శ్రీనివాస్‍ , లోపల మేము కొంతమంది రచయితలం  ఆ  ప్రశ్నల  వైపు నిలబడ్డాము.. రచనలు చేసాము. తిరుపతి కోనేటికట్ట ప్రచురణగా  “వేలిముద్ర “  అనే 7 గురు  కవులతో కూడిన కవిత్వ పుస్తకం తెచ్చాము.     “ అంబేడ్కర్‍ను  పూడ్చివపెట్టిన జెండాలెందుకు ? చలాన్ని  పాతిపెట్టిన జెండాలెందుకు ? అని  ప్రశ్నించాం. ఇవి గాక,  “దామూ- మునికృష్ణ  ప్రవాహగానం పై చర్చల సర్వస్వం” అనే పుస్తకాన్ని  చిత్తూరుజిల్లా విరసం యూనిట్‍ తరఫున ప్రచురించాము. సెక్స్ ,  మద్యం  ..తదితర అంశాలమీద విప్లవసాహిత్యం  చర్చించవచ్చా లేదా  అని  ఆ పుస్తకం వేసిన ప్రశ్న. అందులో .. సంవత్సరంపాటు ప్రధాన  తెలుగుపత్రికల్లో  అనేకమంది సాహితీపరులు పాల్గొన్న  చర్చలున్నాయి.

అప్పటికి మిగిలిన సభ్యుడిని - జిల్లా కన్వీనర్‍ను కూడా-  నేనే గనుక నా   మీద వేటుకు  విరసంలో రంగం సిద్ధమైంది. నోటీసులు పంపారు. దానికి  రాసిన బదులు వివిధయూనిట్లలోని ఓ ఏడుగురు రచయితలం - నాతో పాటు రాప్తాడు గోపాల క్రిష్ణ, శ్రీఁవాసమూర్తి , దగ్గుమాటి పద్మాకర్‍, రాణి శివశంకర్‍, అరుణ, భానుమతి- కలిసి  ఇచ్చాము.  విరసంలో ప్రజాస్వామ్యం  లేదని, అది పేరుకు  రచయితల సంఘమైనా ,   సంఖ్యాబలం కోసం అరచయితలతో నిండిపోయిందని ఎలుగెత్తాం.  భిన్నాభిప్రాయం చెబితే బహిష్కరించే సంస్కృతి  నుంచి   బయట పడాలని, అస్తిత్వవాదాల సాహిత్యం  వేస్తున్న   ప్రశ్నలను  పట్టించుకొని, వాటికి సమాధానాలువిరసం  అన్వేషించాలని  కోరాము. ..  ఇలాంటి  కారణాలతో మరిన్నీ  కలిపి నన్ను బహిష్కరించారు. మిత్రులు కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా   తలో దారిన వెళ్లిపోయారు. విరసంపై  ఏడుగురం చేసిన తిరుగుబాటు అతి కొద్ది కాలంలో ఓడిపోయింది.  మా ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.

ఇక అక్కడి నుంచి అస్తిత్వ వాదాలతో స్నేహం పెరిగింది. దళిత, ఆదివాసీ,    మైనారిటీ, బీసీ, ప్రాంతీయ, సంచారజాతుల. స్త్రీల, పర్యావరణ వాదులతో...  కలిసి  ప్రయాణం చేస్తూనే ఉన్నాను. కొంగ్రొత్త దారుల్లో సంచరిస్తూనే  ఉన్నాను. ప్రస్తుతం బౌద్ధం వైపు అడుగులేస్తున్నాను.

4.       మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి   చెప్ప్డండి..

మొదట్లో విరసం ప్రభావం అనే కన్నా  విప్లవోద్యమం ప్రభావం ప్రబలంగా  ఉండేది. “లేలేత చిగుళ్లన్నా, ఎదిగిన ఎర్రపూలన్నా  నాకెంతో ఇష్టం “ అని  ఒక కవితలో రాసుకున్నాను. జీవితం యుద్ధమయం అని రాసుకున్నాను.  ప్రభుత్వం  ముందర లొంగినవాడూ, జీవితం ముందర లొంగినవాడూ ఒకటే అని  ప్రమాద సంగీతంలో రాసాను.

అనంతరం   అస్తిత్వవాదాలకు  ప్రాతినిధ్యం  వహించిన  సంస్థలతో, వ్యక్తులతో... దాదాపు అన్నింటితో కలిసి అడుగులేసాను.

కవులు అజంతా, శివసాగర్‍, మహాస్వప్నత్రిపురనేని  శ్రీనివాస్‍, సౌదా.  వచన రచయితలు - చెలం, వడ్డెర చండీదాస్‍,  కేశవరెడ్డి, పతంజలి, రష్యా  సాహిత్యం, త్రిపురనేని  మధుసూదనరావు ఉపన్యాసాలు, నాటి దిన, వారపత్రికల సాహిత్య పేజీలు, సృజన పత్రిక నుంచి ఎంతో   ఉత్తేజం పొందాను.

 

5.   మీ తరం మీద తిరుపతి సామాజిక రాజకీయ వాతావరణం చూపిన ప్రభావం ఎలాంటిది?

తిరుపతి అంటే మాకు   మొదట గుర్తుకొచ్చేది త్రిపురనేని  మధుసూదనరావు మాస్టారు.  ఆయనను తిరుపతి మావో అని  విప్లవాభిమానులు పిలుచుకునేవారు.  విప్లవ సాహిత్యోద్యమ  జీవితం అక్కడే గడిచింది.  గద్దర్‍, బాలగోపాల్‍, వరవరరావు, వంగపండు ప్రసాదరావులను కారఁక్రమాలకు  పిలిచేవారం. తిరుపతి కోనేటికట్టమీద వారి ప్రసంగాలు, ప్రదర్శనలు ఉత్తేజభరితంగా సాగేవి. మరోవైపు వెంకటేశ్వరా యూనివర్సిటీలో, కాలేజిల్లో విద్యార్ధి  సంఘాలు శక్తివంతంగా ఉండేవి.  దళిత మహాసభ  కారఁక్రమాలు కూడా జోరుగా సాగేవి. 

6.       త్రిపురనేని  మధుసూదన రావు గారితో మీ అనుబంధం?

చెప్పాను గదా  ఆయన నాకు  గురుతుల్యులు. ఆయన ప్రోత్సాహం వల్లే విరసంలోకి వెళ్లాను. చిత్తూరుజిల్లాలో జరిగిన దాదాపు వంద అంబేడ్కర్‍ సమావేశాలకు  ఆయన ప్రధాన వక్త గా పాల్గొనడం ఓ రికార్డుగా అక్కడి దళితమిత్రులు ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాంటివారు నేను అస్తిత్వవాదులతో కలిసిమెలిసి ఉండడం ఆయనకు  నచ్చలేదు. మేము తిరుపతిలో    “హో” ( త్రిపురనేని  శ్రీఁవాస్‍ మరణానంతరం మిత్రులుగా మేం తెచ్చిన అతడి మరో పుస్తకం) సభకు  పిలిస్తే గైర్హాజరయాఁరు.

బహుశా బొజ్టాతారకం రాసిన  “కులం - వర్గం“ పుస్తకావిష్కరణ సభలో  అంబేడ్కర్‍ భావజాలం పరంగా (తిరుపతి అంబేడ్కర్‍ భవన్‍లో) సభికులసాక్షిగా ఆయనకూ, మాకూ దాదాపు ద్వంద్వ  యద్ధం లాంటిదే జరిగింది.  దళిత, స్త్రీవాదాలు  సామ్రాజఁవాద వికృత వికలాంగ శిశువులని, ఆ వాదాలు చేసే వారికి  నేను మద్దతుగా ఉండడం తాను ఆమోదించలేనని  నాకు  లేఖ రాసారు.

దళిత రచయతల కళాకారుల మేధావుల ఐక్యవేదిక (దరకమే వేదిక) ప్రచురించిన  ‘గబ్బిలంఆవిష్కరణ, ప్రజాసాహితి, వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ తదితర  కారఁక్రమాలు ముందుండి నడిపించాను. ఎన్ని  అభిప్రాయభేదాలున్నా  అందరితో కలిసి పనిచేయాలని  అలా చేసాను.  ఇవి అన్నీ  మాస్టారుకు అభ్యంతరం కలిగించిన విషయాలు. అయినా, ఆఖరువరకు  ఆయనతో సజీవ సంబంధంలోనే  ఉన్నాను. చివరిదశలో .. నాకు  ప్రేమగా, నిర్మొహమాటంగా ఓ సుదీర్ఘమైన ఆడియో   ఇంటర్వ్యూ  కూడా ఇచ్చారు.  అది మొదట తిరుపతి స్థానిక పత్రిక ‘కలియుగ నారద లో, తరువాత నా ‘ వెల్లడిపుస్తకంలో, ఆపై  విరసం ప్రచురించిన త్రిపురనేని  మధుసూదనరావు సాహిత్య సంపుటాలలో ప్రచురితమైంది. ఆయన మరణిచించిన రోజు ఎంతో దూరాన ఉన్నందున ఆయన అంతఁక్రియలకు హాజరుకాలేకపోవడం నాకు లోటుగా మిగిలిపోయింది. బాధ కలిగింది. మాస్టారు స్మృతిలో అరుణతార లో ప్రచురణకు  రచన ఇమ్మని (కృష్ణాబాయి గారు అనుకుంటా) ఫోన్‍ చేసి అడిగారు. ‘ మాకు  గద్దర్‍ పాట ఎంతో, మాస్టారు మాటా అంతే అని  రాసి పంపాను. వారు ప్రచురించలేదు.  ఆ రచన పంపేముందుపక్కనే ఉన్న  శివసాగర్‍ ‘వారు ప్రచురించరు బాబూఅని  అన్నారు. ఆఖరికి అదే జరిగింది.

7.       వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారి ప్రభావం  మీపైన  ఏమైనా  ఉందా?

ప్రభావం లేదు గానీఆయనతో అనుబంధం ఉంది. మా  పెళ్లి సమావేశంలో ప్రధాన వక్తగా పాల్గొని, బ్రాహ్మణుల అర్థంగాని  పెళ్లి శ్లోకాలలో ఏముంటుందో వివరించారు. విరసం సభలకు  వక్తగా వచ్చేవారు.    తిరుపతిలో మేం నడిపిన ‘శనివారం సాహితికి వచ్చేవారు. ఒకసారి ఆ సంస్థ తరఫున యూనివర్సిటీ  ఆర్ట్సు బ్లాక్‍ఆడిటోరియంలో  ఓ సమావేశం జరిగింది. అందులో వల్లంపాటి గారిని  శాలువాతో  సత్కరించాలని నాకు   మిత్రబృందం పని అప్పగించారు. ఆ పని  చేయలేకపోయాను.  అది ఆయనలో ఎలాంటి ఫీలింగ్‍ కలిగించిందో తెలీదు. మదనపల్లిలో బిటీకాలేజి క్వార్టర్స్లో వారి నివాసానికి వెళ్లేవాడిని. వారి ముందు తాజా  కవితలు వినిపించేవాడిని. మార్క్సిస్టు ఈస్తటిక్స్  మీద నాకు  కొన్ని పుస్తకాలు ఇచ్చేవారు. తన దోస్తు  ప్రముఖ కథకులు వివినమూర్తి గారి గురించి చెప్పేవారు. ఆయన ఉన్న  ఇంట్లో గోడమీద ‘రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ చేతిరాతతో జనగణమనగీతం ఉండేది. అది నాకు  సంబరంగా చూపించేవారు.

మరణానికి ముందు హైదరాబాదు గ్లోబల్‍ ఆసుపత్రిలో పలమనేరు బాలాజీ తో ఆయనను కలిసాను. ఆయనతో అనుబంధాన్ని   ‘మా మేస్టారు అని  అప్పట్లో ఆంధప్రభ  సాహితీ పేజీలో పంచుకున్నాను.

8.       కవిగామీ కవిత్వం గురించి, మీ కవిత్వ సంపుటుల గురించి చెప్పండి

నాలుగు పుస్తకాలు రాసాను.  “ప్రమాదసంగీతం”, “తరువాత “, “ఒంటరి యుద్ధమే జీవితోత్సవం”  కవిత్వం, ఇతర పుస్తకాలు “ వెల్లడి “, “బుద్ధ : కొన్ని  ఆలోచనలు”. ( ఇవి గాక, బహుజనుల సంక్షిప్త చరిత్రలు ఇతర రచనలు ) కవిత్వం అయితే రాయాలని  బలంగా అనిపించినపుడే రాసాను. సంవత్సరాల కొద్దీ కూడా రాయలేదు. కవి శివారెడ్డి నుంచిప్రముఖ సంపాదకుడు కె.శ్రీనివాస్‍, కొందరుమిత్రుల  నుంచి ఆ విషయమై ఫిరాఁదులున్నాయి. ఏదో ఒకటి రాయాలనే తలంపు లేనందున ఆ విషయంలో నా వైఖరి అంతే. పత్రికల్లో పనిచేసినపుడే మామూలుకన్నా  ఇంకా తక్కువ రాసాను.

9.       “వెల్లడి” అనే వినూత్నమైన పుస్తకాన్ని  తీసుకొచ్చారు కదా.  మీ అనుభవాలు ఏమిటి?

వెల్లడిలో కవితలు, వ్యసాలు, బుక్‍రివ్యూలు, సినిమారివ్యూలు.. అన్నీ  కలిపి  ఉంటాయి. ఎక్కువగా అస్తిత్వవాదాల అంశ, తెలంగాణ  ఉద్యమ  విషయాలు. కొన్ని  రేఖామాత్రమైన ఆత్మకథాంశాలు ఉంటాయి.

రాష్ట్ర విభజన జరుగుతున్న  ఉద్విగ్న వాతావరణంలో ‘ వెల్లడి ఆవిష్కరణ జరిగింది.  మే 30 న ‘వెల్లడిఆవిష్కరణ, జూన్‍ 2న రాష్ట్ర విభజన.  దానికి  ప్రముఖ సంపాదకులు, సినిమాదర్శకులు, మేధావులు.. ఉపన్యాసకులు. (కె.శ్రీనివాస్‍, అల్లం నారాయణ, కవి -  ఐఎఎస్‍  ఎ.విద్యాసాగర్‍, జయధీర్‍ తిరుమలరావు, ఖాదర్‍ మొహియుద్దీన్‍, అల్లాణి్  శ్రీధర్‍, జూలూరు గౌరీశంకర్‍,  విమలక్క, గోరటి ఎంకన్న తదితరులు ) కొద్దికాలం ముందే మరణించిన మా అమ్మ గారి చిత్రపటానికి పూలమాలవేసి సభను ప్రారంభించాము.

 రాయలసీమ మిత్రులు ‘అంతా తెలంగాణ పుస్తకం అన్నారు. ఇక్కడ తెలంగాణ స్నేహితులు ‘వినూత్నమైనదిఅని  కొందరంటేఆంధ్ర ప్రాంత రచయితలకు  ప్రాధాన్యం  ఇచ్చిన పుస్తకం అని  ఒకరిద్దరు కెరీరిస్టుల ఉవాచ. ఆ కెరీరిస్టుల  అంధత్వానికి నేను బాధ్యుడిని కాదు గదా.

10.     “ప్రమాద సంగీతం” ఏ సందర్భంలో వెలువడింది?

విప్లవోద్యమం మీద విరుచుకుపడిన రాజ్య నిర్బంధంపీపుల్స్వార్‍ పార్టీ నిషేధం, రష్యా పతనం, తూర్పు యూరప్‍ దేశాల్లో ‘కమ్యూనిస్టు ప్రభుత్వాల’ పతనం, అస్తిత్వవాదాల విజృంభణ... మండల్ - కమండల్  దేశ వ్యాప్త ఉద్వేగ రాజకీయ ఘటనలు...

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన కవిత్వం.  దానిని  విరసం బహిరంగ వేదిక మీద గుంటూరు సభల్లో (తొలిసారి, ఆఖరిసారి కూడా ఆ వేదిక ఎక్కిన ? ) మహాకవి శివసాగర్‍ ఆవిష్కరించడం నాకు మహదానందం. అది రాష్ట్రవార్తగా కూడా పత్రికల్లో చోటు చేసుకుంది.  ఆ క్రెడిట్‍ అంతా  సౌదాకే ద్కతుంది. ఆవిష్కరణ సమయంలో నేను లేను. ఆ తరువాతి రోజు వెళ్లాను. శివపార్వతులను( శివసాగర్‍ సహచరి పార్వతి ) కూడా జంటగా మొదటిసారి అక్కడే చూసాను.

ప్రమాదసంగీతం కవిత్వాన్నీ  వరవరరావు గారు ఎంతగానో ప్రోత్సహించారు. ఎన్‍ వేణుగోపాల్‍ అరుణతారలో మంచి పెద్ద సమీక్ష రాసి ప్రోత్సహించారు.   ఆంధ్ర జ్యోతి వీక్లీ లో రామ్మోహన్ రాయ్ సమీక్ష చేసారు. పాఠకుల నుండి అనేక ఉత్తరాలు వచ్చాయి. కేవిఅర్, ఆరుద్ర,, ఆవంత్స సోమసుందర్, కాకరాల, శివారెడ్డి వంటి పెద్దలు తమ  స్పందనలు లేఖల్లో  తెలిపారు.

11.      తెలుగు సాహిత్యంలో వెల్లడి ప్రాధాన్యతను విమర్శకులు సరిగా అంచనా వేసారనుకుంటున్నారా ?

దాదాపు అన్నీ  పత్రికల్లో సమీక్షలు వచ్చాయి.  ఆవిష్కరణ సభలో సంపాదకు  లు కె.శ్రీఁవాస్‍  మెరుపులు, ఉరుములు ఉన్నాయి  గానీ, ఇందులోని  చాలా రచనలకు ఓ విస్తృత  సిద్దాంత  ప్రాతిపదిక ఏర్పరచుకుని ఉంటేఓ విమర్శగా అవి గట్టిగా నిలదొక్కునేవి అన్నట్టు  వ్యాఖ్యానించారు. ఎన్నో చర్చనీయమైన పుస్తకాలు ప్రచురించిన  పరిస్పెక్టివ్స్ రామకృషః గారు సభ అయిన తరువాత అమెరికాకు వెళ్లారుఅక్కడినుంచి ‘వెల్లడిమీద ఓ ఫుల్‍ పేజీ లేఖ మెయిల్‍ చేసారు.  ‘తెలుగులో నేను ఇప్పటివరకు చదివిన పుస్తకాల్లో ఇంత వైవిధ్యం  గలది లేదుఅని  రాసారు.

‘వెల్లడి రెండు ప్రచురణలు వెంట వెంటనే  అమ్ముడుపోయాయి. ఇపుడు ఫైల్‍ కాపీలే  ఉన్నాయి. ( ఇతర పుస్తకాల కాపీలు అంతే)

 12. త్రిపురనేనితో మీరు చేసిన సుదీర్ఘ ఇంటర్వూ అనుభవం గురించి చెప్పండి.

అనేక సార్లు  ఉద్యోగాలు, నిరుద్యోగాలు నాకు  మామూలే. అలాంటి ఓ నిరుద్యోగం చేసే కాలంలోనే ఆయనతో ఇంటర్వ్యూ   చాలా లీజర్లీగా చేసాను. ఆయన కూడా చాలా ఓపికగా, దాపెరికం లేకుండా జవాబులు తెలిపారు. ఆడియో రికార్డు చేసాను. ఆయన ఆమోదంతోనే ప్రచురించాను.  కొండపల్లి సీతారామయ్య  గారితో సంభాషణలు ..అలాంటివి ఒకటి రెండు మాత్రమే అందులోంచి ఆయన కోర్కె మేరకు తొలగించాను, మిగిలినదంతా యధాతథం.  తొలుత ‘కలియుగ నారద’ అనే పత్రికలో , ఆపై నా ‘వెల్లడిపుస్తకం లో ప్రచురించాను.   విరసం ప్రచురించాలనుకున్న  త్రిపురనేని సాహిత్య సంపుటాలకోసం చెంచయ్య గారు అడగడంతో ఆయనకు  పంపాను. హెడ్డింగ్‍ మార్చవలసిందిగా కోరారు. అందుకు  నేను ఒప్పుకోలేదు. ఆఖరికి  ‘విప్లవం ఆరంభమే కాలేదు, జరిగింది తిరుగుబాటేఅనే అసలు శీర్షికతోనే విరసం సాహిత్య  సంపుటాలలో ఆ ఇంటర్వ్యూ  ను పునర్ముద్రించారు.

 13.     ఇపుడు వెలువడుతున్న  కవిత్వం ఎలా ఉందనుకుంటున్నారు?

కొందరు ప్రతిభావంతంగా బాగా రాస్తున్నారు. సమయాభావం వల్ల  వారి కవిత్వం గురించి  రాయలేకపోతున్నా. రాయాలి. ఏ కాలంలోనైనా ఒరిజినల్‍ కవిత్వం కొంతే ఉంటుంది. కదిలేదీ, కదిలించేదీ కవిత్వం. అధికారాలను, అల్పత్వాలను , ప్రలోభాలను,, స్థాపిత విలువల లోకాలను తోసుకుంటూ వెళ్లిపోయేది కవిత్వం. అప్పటికప్పుడు ప్రవహించేది కవిత్వం. కవి గుణం కవిత్వం. కవితలో గుణం కవిత్వం. ఇంకా..ఇంకా..    ఫేస్‍బుక్‍ కవిత్వం పేరుతో  ఫేక్‍ కవిత్వం ఎక్కువ అని  మాత్రం చెప్పగలను.

14. ఇపుడు వెలువడుతున్న  సాహిత్యం  విమర్శమీద మీ అభిప్రాయం ఏమిటి?

దాదాపు విమర్శ లేదు . దాదాపు విమర్శకులు లేరు. సాహిత్యంలో ఓనమాల దశలో  ఉన్నపుడు తిరుపతిలో  ఓ సభలో ... కవి శివారెడ్డి గారు కూడా వచ్చారనుకుంటా..  ‘తిట్టడమే విమర్శగా ఉంది ‘ అని సభలో అన్నాను.  విమర్శ అంటే ఏమిటో ఆయన కొంచెం వివరించారు. ఇపుడు ‘ఆ తిట్టడం కాదు గదా... జుగుప్ప కలిగించే ప్రశంసే మిగిలివుంది. రాచపాళెం చంద్రశేఖర్‍ రెడ్డి గారిని  గతంలో ఓ  ఇంటర్వూఁ చేసాను. ఆయన అన్నదీ అదే.  ‘ ప్రశంసే విమర్శగా చలామణి ‘ అన్నారు. ఆ హెడ్డింగ్‍తోనే ఆ ఇంటర్వూ   ప్రచురించాము.

15. భిన్న అస్తిత్వాలతో వెలువడే సాహిత్యం  తెలుగు సాహిత్యాన్ని  ఎలా సుసంపన్నం  చేస్తోంది?

ఓనాడు విప్లవ కవిత్వం జోరు తగ్గుతున్న  సందర్భంలో ఆ అస్తిత్వవాద కవిత్వం బలంగా ముందుకొచ్చింది. ఇపుడు అదీ లేదు. నలుగురైదుగురిది తప్పా మిగిలినంతా కెరీరిస్టు కవిత్వమే. అటు విప్లవం లేదు, ఇటు అస్తిత్వం లేదు. శాలువాలకోసం, సోషల్‍ మీడియాలో కవులు గా వెలిగిపోవడం కోసం, అవార్డులకోసం ఎగబడుతూ రాస్తున్న  కవిత్వమే  ఉంది. ఇతర పక్రియల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. నిజాయతీ లోపించినపుడు ఎలాంటి సాహిత్యం  వస్తుంది. అలాంటిదే వస్తోంది. సాహిత్యంలో ఇపుడు నడుస్తున్నది  అస్తిత్వానంతర దశ.

16.      ఇటీవల మీరు బౌద్దాన్ని  విరివిగా ప్రచారం చేస్తున్నారు. కారణాలు ఏమిటి?

ప్రజాస్వామిక, మానవీయ సమాజ నిర్మాణమే  మొదటి షరతు అనంటే, ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.  ఆ లక్ష్యం బౌద్ధం ద్వారా సాధ్యమౌనని  రూడీగా చెప్ప్పవచ్చు.

అందరికీ .. యావత్‍ ప్రపంచానికి బౌద్ధమే శరణ్యం. ముఖ్యంగా .. కమ్యూనిస్టులు, అజ్ఞాత విప్లవకారులు బౌద్దం  తెలుసుకోవలసి  ఉంది, అధ్యయనం చేయవలసి  ఉంది, లోతుగా చర్చలు చేపట్టవలసి  ఉంది.

అది ఓ మానసిక విప్లవం. భారతీయమైనది. నన్నెంతగానో ఆదుకున్నది. సమసమాజం  ఓ సుదూర స్వప్నం.  అది.. భారతదేశంలో హింస ద్వారా సాధ్యమవుతుందని   ఇప్పట్లో నేను ఏ కోశానా అనుకోలేను. ‘ఆధునిక సమాజాలుఏర్పడ్డాక ఇపుడు ‘ ప్రజాస్వామ్యమేశరణ్యం. సమాజం ప్రజాస్వామికంగా లేనపుడు, ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా ఉండవు అని  అంబేడ్కర్‍ అన్నమాట ఎంతో విలువైనది. మొదట సమాజం ప్రజాస్వామికం కావాలి. అందుకు  అందరూ పని చేయాలి. ఆపై మానవీయ సమాజం ఏర్పడాలి. అందుకు  ప్రతిఒక్కరూ మానవీయంగా ఉండే ప్రయత్నం  చేయాలి. ఎవరికి వారుగా మారాలి. అదే బౌద్ధం మౌలికాంశం.   ఏకైక తెలుగు బౌద్ద పత్రిక ‘బుద్ధభూమిలో సమకాలీన అంశాలను జోడిస్తూ రెండేళ్లగా కాలమ్‍ రాసున్నాను.

బ్రిటీష్‍ వారి పాలనలో బౌద్ధం  మీద ఎంతో పరిశోధన మొదలైంది. డాక్టర్‍ బిఆర్‍ అంబేడ్కర్  చివరిదశలో లక్షలాదిమందితో బౌద్ధదీక్ష చేపట్టడంతో బౌద్ధంమీద చర్చలు కూడా విస్తృతమయ్యాయి.  

ప్రపంచం బాగా లేదు. సమాజం బాగ లేదు. నేను బాగలేను.  అందుకే.. బౌద్ధమే శరణ్యం  అంటున్నాను.  అందవికారంగా మారుతున్న  ప్రపంచాన్ని  అందంగా మలుచుకోవాలి.  బౌద్ధంలోను సమస్యలున్నాయి, సవాళ్లున్నాయి. అందులో కాఠిన్యం ఉంది. విప్లవం కన్నా  కష్టమైన ఆచరణ బుద్ధుడు చెప్పిన పంచశీల, అష్టాంగమార్గం. ఐనా వాటి విలువ గొప్పది.  అటువైపు వెళ్లాలి.. లేకుంటే, నేటి విప్లవకారులు, కమ్యూనిస్టులు, ప్రగతిశీలురు ..కూడా జీవితమంతా విప్లవాలు, తిరుగుబాట్లు చేసి  తీరా  చావులప్పుడు ‘హిందూశ్మశాన వాటికల్లోనో ఇతర మతాల శ్మశానవాటికల్లోనో శవాలుగా చేరుతారు ఈ మాట నేనన్నది కాదు. సుందరయ్య  విజ్ఞానకేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో కంచె ఐలయ్య గారు అన్నది. ( అందుకు ఉదాహరణలు నా వద్ద చాలా  ఉన్నాయి) ఆ సమావేశంలో నాతో పాటు, సిపిఎం రాములు గారు, సామాజిక కార్యకర్త , హైకోర్టు  లాయర్‍ వెంకట్‍ రమేష్‍  ఉన్నారు.

ఒక విషయాన్ని అనేకమంది అనేకసార్లు సమగ్రంగా చర్చిస్తే, అందులోంచి సత్యం వెలుగు చూడక మానదు.  అలంటి సత్యం – ‘భారతదేశ కమ్యూనిస్ట్ లు, విప్లవకారులు మార్క్సిజాన్ని దేశ, కాల పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించలేకపోయారన్న’ది.

అలాగే, తొలి బౌద్ధాన్ని కూడా తవ్వి, నేటి భారతదేశ కాలమాన పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించుకోవలసి ఉంది.  అందుకు డి డి కోశాంబి, రాహుల్ సాంకృత్యాయన్ తదితరుల  అనేక అధ్యయనాలు చాలా వరకు ఉపయోగపడుతాయి.

బుద్దుడి ఆలోచనలు ప్రపంచ సాంస్కృతిక సంపద.  అవి అదిమమూ, అత్యంత ఆధునికమూ.  తొలి బౌద్ధం ఆలోచనల్లోని మూలానికి అపకారం జరుగకుండా ఎవరికీ వారు – సంస్థలు గానీ, వ్యక్తులు గానీ – కృషి చేయవలసి ఉంటుంది.  ప్రపంచానికి, వివిధ సమాజాలకు, మానవ జీవితానికి వాటిని సృజనాత్మకంగా అన్వయించుకోవలసి ఉంది.  అలాంటి  ప్రయత్నాల వల్ల ‘ అంద వికారంగా మారుతున్న ఈ ప్రపంచం అందంగా మారుతుంద’ని  నా విశ్వాసం.   

బుద్దుడు దేవుడు కాడు, మానవోన్నతుడు.  గౌతముడు... సత్యాన్వేషణలో తనకు తాను జీవితాన్ని దగ్ధం  చేసుకున్నాడు.  ‘బుద్ధ’ స్థానం పొందాడు.  మనకు ‘బౌద్ద ధమ్మాన్ని’ అందించాడు.  బౌద్ధం మతం కాదు, ధమ్మం.  బౌద్ధం శాంతిని, మానవ విలువలను, సంస్కారాన్ని, మానసిక వికాసాన్ని, స్వీయ నియంత్రణను, జీవితోత్సవాన్ని విస్తృతంగా చాటింది.  నేటి ప్రపంచానికి ఇది ఎంతో అవసరం.  బౌద్ధం లో హింసకు, ద్వేషానికి తావు లేదు.  ఆ పేరుతో కొన్ని దేశాలు, కొన్ని సిద్దాంతాలు  కూడా తప్పుదోవ పడుతుంటే అది అసలు బౌద్ధం కాదు.  కొన్ని ప్రసిద్ధమైన సూక్తులు బుద్దుడి పేరిట ఉన్నవి, ఇతరుల సూక్తులుగా కూడా  చలామణిలో ఉన్నాయి.  అవి అన్నీ పరిశోధనల ద్వారా నిగ్గు తేలే అవకాశాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.  స్వార్ధకూపంగా,   హింసా పూరితంగా, సంకుచితంగా, మనవతారహితంగా మారిపోయిన ఈ ప్రపంచానికి ప్రకృతి ఔషధం...నిఖార్సైన తొలి బౌద్దమే.  

బుద్ధం శరణం గచ్చామి

ధమ్మం శరణం గచ్చామి

సంఘం శరణం గచ్చామి

17.      వెనుకబడిన వర్గాలకోసం  రచయితగా మీరు ఏమి చేస్తున్నారు?

బీసీ సాధికారత సంస్థ తరఫున 24  పుస్తకాలు వేసాము. సంపాదకుడు నేనే. పెద్దలు, సీఁయర్‍ రాజకీయనాయకులు, మాజీ హోం-రెవెన్యూ  మంత్రి దేవేందర్‍ గౌడ్‍గారి సాయంతో అవి ప్రచురిస్తున్నాము. ఆ పుస్తకాలు అన్నీ.. సమాజం ఓ మూలకు నెట్టేసిన వారి గురించిన సంక్షిప్త చరిత్రలు.  వాటి ప్రచురణ  యూనివర్సిటీలు,  ప్రభుత్వాలు చేయవలసిన పని. ఎన్నో సాధకబాధకాల మధ్య   ప్రచురించాము. ప్రచురించి ఊరుకోకరెండు రాష్ట్రాల్లో విస్తృతంగా   ప్రజల్లోకి తీసుకుపోతున్నాము. నాలుగు వందల సంవత్సరాల క్రితమే కుల నిర్మూలన కోసం పని చేసిన వీరబ్రహ్మేంద్రస్వామి గురించి, దిక్కూ మొక్కూ లేక దయనీయ జీవనం సాగిస్తున్న   సంచారజాతుల గురించి .. పుస్తకాలు వేసాము. సమాంతర దృక్పథంతో రాసిన ఆ పుస్తకాలు బయట   కూడా ఎక్కువగా దొరకనివి.  ఏ తెలుగు ప్రచురణ సంస్థా ఒక్కుమ్మడిగా ఇప్పటివరకు ప్రచురించనివి.

బీసీలు  బాగా బ్యాక్‍ వార్డ్   అని  అర్థమైంది. చాలా పట్టించుకోవలసిన అతి పెద్ద సమూహం.  జనాభాలో సగం పైన  ఉన్నారు  మహిళల్లాగే.  ఆ సామాజిక వర్గంలో కనీసం రాజకీయంగా అయినా మార్పు వస్తే  భారతదేశానికి చాలా మేలు జరుగుతుంది కానీ వారు నిశ్చేతనులై  ఉన్నారు. సమాజ ఉత్పత్తిలో గణనీయమైన భాగస్వామ్యం  కలిగి, ఎంతో నైపుణ్యం ఉండి నిస్సహాయులుగా  ఉన్నారు. తమ  జనాభా దామాషాకు  సంబంధం లేకుండా  అతి తక్కువగా 27 శాతం రిజర్వేషన్‍ కేటాయింపు జరిగీ, కనీసం అందులోనూ 10 శాతం రిజర్వేషన్‍ కూడా అందుకోలేని, అడగలేని  పరిస్థితుల్లో  ఉన్నారు వారు. బీసీలకు  మండల్‍ కమిషన్‍ పకడ్బందీగా అమలుపరుస్తూనే, ఈలోగా మూడో కమిషన్‍ వేయవలసిందిగా  రెండేళ్ల క్రితం   ప్రధానిని కలవడాఁకి వెళ్లాము...ప్రయత్నం  విజయవంతం కాకపోయినాపిఎంఓ ( ప్రధానమంత్రి) కార్యాలయానికి  డిమాండ్‍పత్రం అందజేసి వచ్చాము.  నిశ్చేతనులుగా ఉన్న బి సీ లు చరిత్రలోని బుద్ధుడు మొదలు...పూలే - అంబేద్కర్ లను స్పూర్తిగా తీసుకుని, ఐక్యంగా ముందడుగు వేయాలి.  ఓ దేశవ్యాప్త రాజకీయ శక్తిగా మారాలి.  ఇతర మనువాద వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయాలి.

18 . భవిషఁత్తులో మీ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి?

మనసులో చాలా పుస్తకాలున్నాయి. కవిత్వం, కథలు, సవలలు, చరిత్రలు...  అవి బయటకు  తేవాలనుంది.  నా పుస్తకాలు ఏవీ కాపీలు లేవు. అవి పునర్ముద్రణ చేయవలసి  ఉంది.

19.      సాహిత్యంలోను, సామాజిక కారఁక్రమాల్లోను ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. అంతర్జాలంలో ఉపన్యాసాలు ఇచ్చారు. కొవిడ్‍ అనంతరం మీ ఆలోచనల్లో , మీ సాహిత్యంలో ఏమైనా మార్పు వచ్చిందా ?

కేరోనాకు మనో ధైర్యమే తొలి  ఔషధం. నేనైతే ఇప్పటివరకు  కొవిడ్‍ బారిన పడలేదు.  కంటికి కనిపించని  ఆ వైరస్‍  ప్రపంచాన్ని  భయపెట్టింది, భయపెడుతోంది. కరోనాకాలంలో వలసకార్మికుల దు:ఖం భరించలేనిది. వారి బాగోగుల గురించి, మొత్తం  ప్రజల ఆరోగ్య బాధ్యత గురించి హైకోర్టులు, సుప్రీంకోర్టు ఎన్నో  సార్లు మందలించి, ఆదేశిస్తేనే ప్రభుత్వాలు గుడ్డిలో మెల్లగా పనిచేస్తున్నాయి. ఇది దారుణం. ఇవి అన్నీ వీలైన మేరకు  సోషల్‍మీడియాలో రాస్తున్నాను. మనం ప్రజలకు భయం పోగొట్టి ధైర్యం  చెప్పవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కుప్పకూలిన ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి కనీసం ఇరవైఏళ్లయినా పట్టొచ్చఁని నివేదికలున్నాయి.  ఈ సమయంలోనే డిప్రెషన్‍కు  లోనుకాకుండా అందరూ కోలుకోవాల, మేలుకోవాల.

ఇకఎన్నడూ లేనంత విశ్రాంతి దొరికింది గనుక చదవగలిగినది చదువుతున్నా,  రాయవలసిందానికి సిద్ధమవుతున్నా. ఇది రచయితలకు  ఓ మహదవకాశం.

ఆరోగ్య  స్పహ మరింత పెరిగింది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం...ఎన్నడో చేసి మరిచిన వంటలు మళ్లీ  నేర్చుకుంటున్నాను, వండుకుని, తిని, అవి ఆస్వాదిస్తున్నాను.

20.     యింద్రవెల్లి ఒక చారిత్రక సంఘటన. ఆ సందర్భం మీలో కలిగించిన స్పందన ఏమిటి?

ఇంద్రవెల్లి ఎపుడూ నాతోనే ఉంది, నేనెపుడూ ఇంద్రవెల్లితోనే ఉన్నా.  1981 ఏప్ల్రిల్‍ 20 నాటి  అలాంటి సంఘటనలను పోలినవి ఇంకా జరుగుతూనే  ఉన్నాయి. ఆదివాసిల  రక్షే మనకు  రక్ష అని  సమాజం గ్రహిస్తేనే ...లేకుంటే ఉత్పాతమే...కనులముందున్న  కాచుకుని ఉన్న ఉత్పాతాలు చూస్తూనే ఉన్నాం  కదా. భూగోళం ఉషోఃగ్రత 2 డిగ్రీలు తగ్గించడంకోసం దేశదేశాలు  ఎంతగా తలకిందులవుతున్నాయో చూస్తున్నాం  కదా.  అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, రుతువులు మారిపోవడం, కరవు కాటకాలు, సముద్రాలు ఉప్పొంగడం చూస్తూనే ఉన్నాం కదా. ఇదంతా అభివృద్ధి పేరుతో గనులకోసం, ఖనిజాల కోసం అడవులను ప్రకృతి బిడ్డలైన  ఆదివాసీలను బలిపెట్టడం వల్లే.   కొద్ది కాలం క్రితమే కన్ను మూసిన ఖగోళ శాస్త్రవేత్త  స్టీఫెన్‍ హాకింగ్‍ , ‘వందేళ్లకు  మించి భూమి నివాసయోగ్యంగా ఉండబోదుఅని  ఊరకే అనలేదు. అది అక్షరాలా నమ్ముతున్నా. పలుచోట్ల అదే మాట నేనూ అంటున్నా.  సభల్లో చెబుతున్నా.

21.      త్రిపురనేని  శ్రీనివాస్‍తో  మీకున్న  అనుబంధం గురించి... ఆయన సాహిత్యం సంచలనం గురించి..

నా జీవితంలో  ఓ అరుదైన వఁక్తి, నా ఎదుగుదలలో అతడి పాత్ర  ఉంది.  అతడితో ఎంతో ఉత్తేజం పొందాను. ఓ సంవత్సరంలోనే 12(?) ఆణిముత్యాల వంటి పుస్తకాలు తెచ్చాడు. అఁన్నీటినీ చాలా ప్రతిభావంతంగా తెలుగు సాహిత్య సమాజంలో పంపిణీ చేసాడు. అందులోనూ అతడినుంచే ఉత్తేజం అతడిలోని  అనార్కిజం నాకు  నచ్చుతుంది.

అతడు మరణించి 12 ఏళ్ల అయిన సందర్భంగా వార్త పత్రికలో నేను, సీఁయర్‍ జర్నలిస్టు రామకృషః, అంబటి సురేందర్‍ రాజు సంస్మరణ రచనలు చేసాము ‘చనిపోయి బతికింది నీవు, బతికి చనిపోయింది మేముఅని అందులో రాసాను.

21.      పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు  గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా  మీరేం చెప్పదలుచుకున్నారు ?

చాలా నిజాయతీగా, ప్రజాస్వామికంగా, దీక్షగా  గోదావరి అంతర్జాల పత్రిక నడుపుతున్న  సంపాదక మిత్రులు సంపత్‍ గారికి అభినందనలు.

పాఠకులు మంచి సాహిత్యం  కోసం వేయికళ్ల తో వేచి ఉన్నారు. అది అందివ్వడం రచయితల పని. ఇపుడున్న  కవులు, రచయితలకు  చాలా వరకు లోతైన అధ్యయనం లేదు.  దాని నుంచి బయటపడాలి. కెరీరిజం నుంచి బయటపడాలి. నిజాయతీ గల సాహిత్యం  వెలువరించాలి. అంటే వారు మొదట నిజాయతీ గలవారుగా మారాలి.  గోదావరి వంటి ప్రజాస్వామికమైన అంతర్జాల పత్రిక అలాంటి రచనలు వచ్చేందుకు దోహదపడుతోందని  అనుకుంటున్నాను.

ఇతరాలు:

- డాక్టర్‍  కేశవరెడ్డి గారితో నాకు  మంచి అనుబంధం ఉంది. ఆయన కన్ను మూసేవరకు  రెగ్యులర్‍ గా సుదీర్ఘ  ఫోన్‍ సంభాషణలు చేసుకున్నాం. ఎన్నో  విషయాలు మాట్లాడుకునేవారం. ఆయన చిత్తూరుజిల్లా నుంచి తెలంగాణకు   వచ్చి స్థిరపడి , ఇక్కడే గొప్ప సాహిత్యాన్ని  సృజించారు. ఆయన గురించి, ఆయన సాహిత్యం  గురించి మరోసారి వివరంగా రాయవలసి  ఉంది.

- రుంజ అనే సంస్థ ను ఏర్పరచి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలోచనా విధానం  మీద  హైదరాబాద్‍ లో చాలా కార్యక్రమాలు నిర్వహించాము.  నగ్నముని, వివిల్‍ నరసింహారావుగారు, జ్ఞానపీఠ గ్రహీత రావూరి భరద్వాజ వక్తలుగా వచ్చారు.  వివిధ అస్తిత్వాల వారితో సంభాషణలు జరిపాము. 400 ఏళ్ల క్రితమే కులనిర్మూలన కోసం బ్రహ్మంగారి కృషి గురించి ప్రచారం నిర్శహించాము.

- ఆ గాయానికి ముప్ప యేళ్లు అని  హైదరాబాద్‍, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో   2011 ఏప్రిల్‍ 20న  ఇందవ్రెల్లిసభను  గోండుల ఆధ్వర్యంలో ప్రారంభించి జరిపాము  సభకి  మాభూమి దర్శకులు నరసింగరావు , కొమురంభీం మనుమడు సోనేరావు సహా వివిధ పత్రికల సంపాదకులు, మేధావులు విచ్చేసి మాట్లాడారు. 1981 తరువాత ప్రతిఏటా ఏప్రిల్‍ 20 న ఇంద్రవెల్లిలో  ప్రభుత్వాలన్నీ  విధిస్తున్న  ఆంక్షలు తెలంగాణ వచ్చిన తరువాత నైనా ఎత్తివేయాలని  అందరం డిమాండ్‍ చేసాము.

- సమాంతర బహుజన చరిత్రలుగా మేము తీసుకొచ్చిన 24 పుస్తకాల ఆవిష్కరణలు రెండు రాష్ట్రాల్లో  చేపట్టాము. ఇలాంటి అనేక కారఁక్రమాల గురించి వివరంగా రాయవలసి  ఉంది.

గోదావరి కి ధన్యావాదాలతో...

 

గమనిక :

ఇందులో ప్రశ్నలకు  ఒక్కొక్క ప్రశ్నకీ పెద్దవ్యాసం  రాయవలసినంత అవసరం ఉంది. సమయాభావం వల్ల సూటిగా రాయగలిగింది రాసాను. ఎవరి మీద  శత్రుభావంతో ఏదీ రాయలేదు.  ఉన్నవి ఉన్నట్టు  రాసాను. ఇందులోని  అంశాలకు   ఎపుడైనా సహేతుకమైన చర్చలకు సిద్ధమే

 

యిందవ్రెల్లి రమేష్‍

9704116160 ( వాట్సాప్‍ )

indravelliramesh@gmail.com                                                                                                            

facebook: indravelliramesh

 

 

                                                                                

 

 

 

 

 

 

 

 

 

ఇంటర్వ్యూలు

ఒక సందర్భం - ముగ్గురు కవులు 

పెళ్లూరు సునీల్, సుంకర గోపాల్ మరియు దోర్నాదుల సిద్దార్థ గార్లు   గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ 

1.         మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

పెళ్లూరు సునిల్: మాది నెల్లూరు జిల్లా కోట గ్రామం.  పెళ్ళూరు శేషయ్య సుదర్శనమ్మ నా తల్లిదండ్రులు.  ముగ్గురు అక్కల తర్వాత నేను నాలుగో సంతానం. ఎంఏ తెలుగు, బియిడి చేశాను.  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో     పి హెచ్ డి  చేశాను. ప్రస్తుతం  కోటలోని బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను.  నాశ్రీమతి సుప్రజ ఉపాధ్యాయురాలు. చంద్రశేఖరేంద్ర సుస్వర్ కుమారుడు. సాయి సుభిక్ష కుమార్తె. నాకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం. కానీ అందులోని మూఢాచారాలు, చాందస భావాలకు నేను వ్యతిరేకిని.

సుంకర గోపాల్: మాఊరు ఓజిలి రాచపాలెం. నెల్లూరు జిల్లాపల్లె కావడం తో బాల్యం లో  అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయ్. దూరదర్శన్ కాలం. చదువులో ఎప్పుడూ ముందే. తెలుగులో  పీజీ చేసాను. కొద్ది రోజుల్లో పి.హెచ్ డి పూర్తి అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు  రెగ్యులర్ విద్య. మిగతా అంతా దూరవిద్య. అమ్మ నారాయణమ్మ. నాన్న కృష్ణయ్య.

దోర్నాదుల సిద్దార్థ: మాది చిత్తూరు జిల్లా పలమనేరు. ప్రస్తుతం నేను తెలుగు ఉపాధ్యాయుడు పెద్దపంజాణి పాఠశాల నందు పని చేస్తున్నాను. మా అమ్మ భువనేశ్వరి  నాన్న ప్రసాదరావు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే వాడిని. ఆటలలో లేకపోయినా వ్యాసరచన , వక్తృత్వ పోటీలలో పాల్గొనేవాడిని 2005లో లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గా ఉద్యోగ జీవితం ప్రారంభించాను.

బీఎస్సీ చదివాక తెలుగు మీద ఉన్న ఆసక్తి వలన ఎమ్మే చేసి  తెలుగు ఉపాధ్యాయునిగా 2012లో నియమించబడ్డాను. ప్రస్తుతం ద్రవిడ విశ్వవిద్యాలయములో PhD చేస్తున్నాను.

2015లో వివాహం అయింది ప్రస్తుతం ఒక పాప, బాబు.

ఖాళీ సమయాలలో కవిత్వం చదవడం, రాయడం, కథలు చదవడం చాలా ఆసక్తి.

2.         మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

పెళ్లూరు సునిల్: చిన్నప్పటి నుంచి చదవడం ఇష్టం. తరగతిలో అందరికంటే ముందే ఉండేవాడిని. సాహిత్య,ఆధ్యాత్మిక గ్రంథాలను ఎన్నింటినో చదివాను. చదివిన ప్రతి పుస్తకం నన్ను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. నా గురువుల నుంచి నేను ఎంతగానో స్ఫూర్తి పొందాను. సాహిత్యరంగంలో రాధేయ గారు, ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు,ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అద్దేపల్లి గారు,ఆశారాజు ,భగవాన్ కొప్పర్తి ఇలా ఎందరో నన్ను ప్రభావితం చేశారు, చేస్తూనే ఉన్నారు. నా కులాన్ని గాక నాలోని భక్తిని చూసి శ్రీవిద్యను నాకు ఉపదేశించిన నా గురువు చంద్రశేఖర స్వామి గారు అనుక్షణం నాకు స్ఫూర్తి. భగవద్గీత , కవిసేన మేనిఫెస్టో, కొయ్యగుర్రం ఇష్టమైన పుస్తకాలు. ఎప్పటికైనా మగ్గం బతుకు లాంటి గొప్ప కావ్యం రాయాలనీ,మేడిపల్లి గారిలాగా జలపాతం లాంటి ప్రసంగం చేయాలనీ అలవికాని కోరికలు నావి.

సుంకర గోపాల్: మొదటిలోకవిత్వం విపరీతంగా చదివానుదొరికిన  ప్రతి కవితాసంపుటి ఇష్టంగా  చదివానుఆధునిక  కవులను ఎవరిని వదిలిపెట్టలేదుశివారెడ్డి అభిమాన కవి. ఆశారాజు కవిత్వం కూడా  చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కువగా కథలు చదువుతూ ఉన్నానుకవిత్వంకథ  రెండు  నన్నుబాగా  ప్రభావితం  చేశాయి.   సామాజిక చింతనమానవ  సంబంధాల ఆవిష్కరణను  నేను  ఆవిష్కరించే  ప్రయత్నం  చేసానుచేస్తున్నాను.     ఒక్కరో  ప్రభావితం  చేశారు  అని  చెప్పలేముగానీచదివిన  ప్రతీకవి  ప్రభావితం  చేసినవారే.

దోర్నాదుల సిద్దార్థ: చిన్నప్పట్నుంచి తెలుగు మీద అభిమానం తో చిన్నచిన్న ప్రాస పదాలతో తో ఏదో కవిత్వం రాసే వాడిని.  కానీ మొట్టమొదట రాధేయ గారి వలన అసలైన కవిత్వంతో నాకు పరిచయం ఏర్పడింది. కాబట్టి నేను ఆయనను నా కవి గురువుగా చెప్తాను. శ్రీ శ్రీ , తిలక్ నుండి నేటి శివారెడ్డి కొప్పర్తి ప్రసాదమూర్తి ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా నన్ను ప్రేరేపించిన వారే. ప్రత్యేకించి ఒక్కరి ప్రభావమే అని నేను చెప్పలేను. ఇక పలమనేరులో పలమనేరు బాలాజీ గారి ప్రభావం కూడా కొంత ఉంది.  నా వెంట ఎప్పుడూ ఉండి  ప్రోత్సహిస్తున్నారు.

3.         మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.?

పెళ్లూరు సునిల్: నాకు ప్రత్యేకంగా సాహిత్య వారసత్వం అంటూ ఏమీ లేదు చిన్నప్పట్నుంచి నా చుట్టూ ఉన్న సమాజాన్ని నాలకి ఒంపుకుంటూ వెళుతున్న వాడిని. చిన్నప్పట్నుంచి ఎదుర్కొన్న పేదరికం కష్టాలు కన్నీళ్లు అనారోగ్యాలు లు ఆప్యాయతలు అనుబంధాలు నన్ను సున్నితమైన వ్యక్తిగా మార్చాయి. అందుకేనేమో నా కవితల్లో ఎక్కువ  మానవసంబంధాల పట్ల ప్రాకులాట కనిపిస్తుంది. ముక్కుసూటితనం నిజాయితీగా పని చేయడం నా వ్యక్తిత్వం.వాటితోనే నా అక్షరాలకు పదును పెట్టుకుంటుంటాను.

సుంకర గోపాల్:  మా నాన్న వీధీభాగవతం ఆడేవారు. నాకు బాగా తెలిసే నాటికి వాటి ప్రభావం తగ్గింది. ఏప్పుడైన తాగి వచ్చినప్పుడు కొన్ని దరువులు పాడేవారు. ప్రభావం నా మీద ఉందిసామాజిక చింతనే నా రచనలకు నేపధ్యంగా  చెబతాను.

ఉడుకు రక్తం లో ఉన్నప్పుడు సమాజం పరిస్థితులు చూసి ఆవేశం గా ఏదో చేయాలి అనే ఆలోచన ఉండేది. అది కాస్త ఆలోచన గా మారడానికి చదివిన పుస్తకాలు ఉపయోగపడ్డాయి. పేదరికం నుండే వచ్చాము. కానీ  చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటం వలన పెద్దగా ఇబ్బంది లేదు. రాజకీయం గా జరిగే మార్పుల పట్ల ఎరుక ఉంది.

దోర్నాదుల సిద్దార్థ: మాది మధ్య తరగతి కుటుంబం నాన్నగారు బాగా చదువుకున్న వారైనప్పటికీ సినిమా వ్యాపారంలో ప్రవేశించి నష్టపోయారు తర్వాత వ్యాపారం చేసిన కలిసిరాక చాలా నష్టపోయి అనేక ఊర్లు మారవలసి వచ్చింది. మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ఆయన అప్పులకు భయపడి ఇల్లు విడిచి వెళ్లి పోయేవారు దానితో కుటుంబ పరిస్థితులు బాగా దిగజారింది బంధువుల సహాయంతో చదువు కూడా ఇంటర్మీడియట్ వరకు కొనసాగింది ఇలా అనేక ఊర్లు తిరగడం ఇంటి ఆర్థిక పరిస్థితి సమాజంలోని అసమానతలు  నన్ను సహజంగానే కవిత్వం వైపు నడిపింది కొన్ని సందర్భాలలో డబ్బు లేకపోవడం అన్నిటికన్నా పెద్ద గురువు అది మనల్ని సమాజాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది.

4.         కవిగా, మీ కవిత్వం గురించి, మీ కవిత్వ సంపుటుల గురించి  చెప్పండి?

పెళ్లూరు సునిల్: ఇప్పటివరకు చాలా కవితలు రాశాను.వాటిలో చాలా మటుకు జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు అనేకం పొందాయి. కవితా సంపుటి మాత్రం ఇంకా తీసుకురాలేదు. ఏడేళ్ల పాటు నేను చేసిన పరిశోధన "దీర్ఘకవితా వికాసం" అనే పేరుతో పుస్తకంగా వెలువరించాను. ఈ పుస్తకం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఎంతో మంది పెద్దల ఆశీస్సులు అభినందనలు అందేలా చేసింది. శ్రమకు తగ్గ గుర్తింపు అంటారే అలాంటిది అన్నమాట. ఎప్పటికప్పుడు నా పాత కవితలు నాకే నచ్చక పోవడం వల్ల పుస్తకం తీసుకు రావడం ఆలస్యం అవుతోంది.

సుంకర గోపాల్: మొదట  ప్రాస పదాల తో ఏవో రాసే వాడినిఅనంతపురం వెళ్ళాక ప్రాసతో  పాటు భావానికి ప్రాధాన్యం  ఇవ్వడం తెలిసింది.

కవి కాకి కోగిర జయ సీతారాం జయంతి సభ నవంబర్14,2002 లో పెనుగొండ వినాయక మైదానం లో ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది సభకు హాజరయ్యారు సభలో బాల్యం మీద రాసిన కవిత చదివాను. మంచి స్పందన వచ్చింది. అది నా మొదట రచనగా  చెప్పుకుంటున్నాను.

నేను మొదట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయడి గా ఉద్యోగం పొందానుసాహిత్యం చదవడం బాగా అలవాటు. క్రమంలో తెలుగు లో పి.జి చేయాలని  ఆలోచన వచ్చింది. అధ్యయనం విస్తృతం అయింది. రోజు చదవడం మానలేదుప్రాథమిక పాఠశాల  పిల్లలకు బోధన చేసే సమయంలో అప్పటికప్పుడు గేయాలు  అల్లేవాడిని. తర్వాత ఉన్నత పాఠశాలలోకి , తెలుగు అధ్యాపకుడిగా  వెళ్ళాను. తెలుగు భాష బోధకుడిగా మంచి అవకాశం కనుక వృత్తిప్రవృత్తి  జమిలి గా సాగిపోయాయి.

సీసాకాలుష్యం అని మద్యపానం మీద రాసిన కవిత విశాలాక్షి పత్రికలో వచ్చింది.  పత్రికలో యండమూరి గారి నవల కూడా వస్తుంది. పత్రిక వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి.  పత్రిక సంపాదకులు ఈతకోట. సుబ్బారావు గారు ఒక రోజు ఫోన్ చేసి , పత్రిక వార్షికోత్సవానికి మీరు తప్పకుండా రావాలి. మీరు ఆశ్చర్యపోయే  సంఘటన  మీకు దొరుకుతుంది అన్నారు. నెల్లూరు టౌన్ హాల్లో సభ. యండమూరి అతిధి గా రావడంతో సభ నిండిపోయింది. ఆయన ప్రసంగం ప్రారంభం లోనే విశాలాక్షి  పత్రికలో పోయిన నెల నేను ఒక కవిత చదివాను. కవిత సీసాకాలుష్యం, కవి సుంకర. గోపాల్ అని ప్రకటించి వారికి నేను గోల్డ్ మెడల్ బహుకరిస్తున్నా, వేదిక మీదకు స్వాగతం అని ప్రకటించారు. ఇది నేను మర్చిపోలేని సంఘటన.   తర్వాత ఆంధ్ర జ్యోతి వివిధ లో వచ్చిన కురుస్తున్నదుఃఖం, ఖాళీ అయిన ఇల్లు,24 గంటలు కవితలకు అద్భుతమైన స్పందన వచ్చిందిప్రముఖ విమర్శకులు జి. లక్ష్మీ నరసయ్య గారు  కవిసంగమంలో నా కవితలపై  సమగ్ర వ్యాసం రాశారు. ఇది కూడా నేను ఊహించని  సంఘట.

దోర్నాదుల సిద్దార్థ: 2004 నుండి  కవిత్వం రాస్తున్న ప్పటికీ ఇంతవరకు కవితాసంపుటి అయితే వేయలేదు. 

చిత్తూరు జిల్లా ఉత్తమ కవిగా వరుసగా మూడు సంవత్సరాలు ఉగాది పురస్కారాన్ని అందుకున్నాను

2014 లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి పురస్కారం

2015లో X - ray పురస్కారం అందుకున్నాను.

NATA వారు మొదటిసారి ప్రారంభించిన అంతర్జాతీయ పురస్కారం మొదటి బహుమతి నేను అనుకున్నాను పోటీలో మన జెండా గురించి వర్ణిస్తూ నేను రాసిన కవితను చంద్రబోస్ గారు సిరాశ్రీ గారు భువన చంద్ర గారు రామజోగయ్య శాస్త్రి గారు మెచ్చుకుంటూ ఏకగ్రీవంగా నన్ను ఎంపిక చేయడం మరచిపోలేని అనుభూతి నా కవిత్వంలో  ఎక్కువగా  తాత్విక ధోరణి కనబడుతుంది మనుషుల మధ్య మనిషి లోపల జరిగే ఘర్షణలను ఎక్కువగా మా కవిత్వంలో కనిపిస్తుంది.

5.         మీ ముగ్గురికి పరిచయం స్నేహం ఎలా జరిగింది?

అంతకు ముందు ఏ మాత్రం పరిచయం లేని మేం ముగ్గురం అనంతపురం జిల్లా బుక్కపట్నం లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకోవడానికి వచ్చి ఒకే గదిలో అద్దెకు దిగాం. ముగ్గురి భావాలు చాలా విషయాల్లో ఒక్కటే విధంగా ఉండేవి. విచిత్రంగా ముగ్గురమూ సాహిత్యం పట్ల అనురక్తి గలవాళ్ళమే. 2002 నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా సాగిపోతున్నది మా స్నేహం. కవిత్వంలోనే కాదు వ్యక్తిగత వృత్తిగత జీవితాల్లోనూ ఒకరికొకరు సాన పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం.

6.         రాధేయ గారితో మీ పరిచయం ఎలా జరిగింది?

ఉపాధ్యాయ శిక్షణ కోసం అనంతపురం జిల్లా బుక్కపట్నం వెళ్లడం జీవితంలో మంచి మలుపు పక్కనే ఉన్న కొత్తచెరువు జూనియర్ కళాశాల లో అధ్యాపకులు గా ఉన్న డాక్టర్. రాధేయ గారి పరిచయం సాహిత్యం వైపు  తీసుకు వెళ్ళింది. అయస్కాంతానికి ఇనుప ముక్కలు అతుక్కున్నట్టు మేము కవిత్వానికి అతుక్కుపోయాం అంటే నమ్మండి. మా చేత వందల పుస్తకాలు చదివించారు. కవిత్వంలో మెళకువలు నేర్పించారు.

 అట్లా ఏది కవిత్వం  కాదో తెలుసుకున్నాముఉమ్మడిశెట్టి అవార్డు సభల్లో మేము పాల్గొనే వాళ్ళముతర్వాత మేము ఆయన పేరు మీద కవితా పురస్కారం కూడా నడుపుతున్నాము. అలా సాహిత్యం వైపు  కదలడం జరిగింది.

7.         రాధేయ కవితా పురస్కారం మరియు  ఉమ్మడిశెట్టి సాహితీ సంస్థతో మీ అనుబంధం చెప్పండి.

రాధేయగారి ఉమ్మడిశెట్టి అవార్డును మొదటినుంచి గమనిస్తూ వస్తున్నాం.  ఆయన నిబద్ధత మమ్మల్ని బాగా ఆకర్షించింది.ఉద్యోగంలో జీవితంలో కాస్త నిలదొక్కుకుని, సాహిత్యరంగంలో కొద్దిగా గుర్తింపు వచ్చాక మేము కూడా కవిత్వానికి ఏమైనా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి గురువుగారి పేరుతోనే అవార్డును స్థాపించి 2010 నుంచి ఇప్పటివరకు నిరాఘాటంగా కొనసాగిస్తున్నాం.

ప్రామాణికంగా అవార్డ్ ప్రకటన  ఉంటుంది.  ప్రలోభాలు ఉండవు. మంచి కవిత  రాసిన కవికే ఇప్పటి వరకు పురస్కారం  అందింది.  ఉమ్మడిశెట్టి సంస్థ తో మాకు 18 సంవత్సరాల అనుబంధం ఉందిపరిచయం కలిగిన దగ్గర నుండి రాధేయ గారితో  కలసి నిర్వహణ లో  పాలు పంచుకొంటూ ఉన్నాము.

8.         మీ ముగ్గురు కలిసి ఇప్పటిదాకా నిర్వహించిన సాహితీ కార్యక్రమాల గురించి, ఒకరికి ఒకరు ఎలా సాహితీ సహకారాన్ని అందించుకున్నారో.. తెలియజేయండి ?

కుటుంబ కార్యక్రమాలు గాని సాహిత్య కార్యక్రమాలు గాని ఒకరినొకరు సంప్రదించకుండా జరిగింది లేదు. ఒకరి అభిప్రాయాలను మిగిలిన వారు గౌరవిస్తాం. దాపరికాలు దబాయింపులు లేకపోవడమే మా విజయ రహస్యం.

మేము ముగ్గురం రాధేయకవితా పురస్కారం నిర్వహిస్తున్న సంగతి తెలుసు. కరోన కాలంలో జూమ్ వేదిక గా నిర్వహించిన సాహిత్యంలో కి  అనే కార్యక్రమం తెలుగు సాహితీ లోకంలో  విశిష్ట మైనది గా గుర్తింపు పొందిందికవులు, రచయితలు సుమారు 50 మంది తమ సాహితీ అంతరంగాన్ని  గొప్పగా ఆవిష్కరించారు.

9.         సాహిత్యంలో మీది నుంచి స్నేహబంధం కదా.  దీని గురించి సాహితీవేత్తలు ఎవరైనా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారా?

ఎంతోమంది మా కవితా స్నేహాన్ని అభినందించారు. వ్యక్తిగతంగానూ సభలలోనూ మమ్మల్ని గురించి గొప్పగా పొగిడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

10.       ముగ్గురు కలిసి ఒక కవిత ఎప్పుడైనా రాసారా?

రాశాం.

మేము ముగ్గురం కలసి రాధేయ గారి సాహిత్యం మీద తీసుకువచ్చిన అభినందన సంచికలో ఒక కవిత రాశాము. బుక్కపట్నం లో ఉన్నప్పుడు శిక్షణా సంస్థ లో చాలా నాటకాలు రాసి, ప్రదర్షించిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పటికీ మా ముగ్గురిలో ఎవరు కవిత రాసినా మిగిలిన వాళ్ళు అందులో లోపాలు సవరణలు చేస్తారు.

11.       ఇప్పుడు వెలువడుతున్న తెలుగు సాహిత్య విమర్శ ఎలా ఉంది ?

పెళ్లూరు సునిల్: పాత పద్ధతుల్ని వదిలేసి కొత్త విధానాల్లో వినూత్నంగా సాగుతోంది. ఎప్పటికప్పుడు సాహిత్య విమర్శ అప్డేట్ అవుతోంది. ఇలా ఉండడమే ఒక ప్రక్రియను కలకాలం నిలుపగలుగుతుంది.

సుంకర గోపాల్:  నేడు తెలుగు సాహిత్య విమర్శ సంధి కాలంలో ఉంది. విమర్శను స్వాగతించే వారి సంఖ్య తక్కువగా ఉంది. పొగడ్త విమర్శకాదు. అలాగే తక్కువ చేయడం విమర్శ కాదు విమర్శకుల సంఖ్య పెరగాలి. రచయితలు సహృదయంతో స్వీకరించాలి.

దోర్నాదుల సిద్దార్థ: ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు విమర్శ ఎక్కువగానే వస్తోంది అనేక రకాల సామాజిక మాధ్యమాలు అంతర్జాల పత్రికలు ఎందుకు ముఖ్య భూమికగా నిలుస్తున్నాయి ఒక తరాన్ని మొత్తం రాచపాళెం గారు లక్ష్మీ నరసయ్య గారు ఇలాంటి విమర్శకులు నడిపిస్తే ఇప్పుడు శ్రీరామ్ లాంటి ఆధునికులు విమర్శలో రాటుదేలుతున్నారు. కానీ కానీ చాలామంది విమర్శ పేరుతో పుస్తక సమీక్షలు కేవలం పొగడ్తలతో నింపి వేయడం బాధాకరం. మంచి విమర్శ మాత్రమే మంచి కవిత్వం రావడానికి దోహదపడుతుంది తప్పులు చూపించకపోతే వాటిని సరిదిద్దకపోతే ఇక విమర్శ ఎందుకు?

12.  రచయితలుగా ప్రస్తుత  సాహిత్యాన్ని   ఎలా అర్థం చేసుకుంటున్నారు?

పెళ్లూరు సునిల్: వెయ్యి చేతులతో చెడుపై యుద్ధం చేస్తున్నా కాళీ మాత లాగా నేటి సాహిత్యాన్ని చూస్తున్నాం.

సుంకర గోపాల్:  కవిత్వం కంటే కథకు మంచి స్పందన ఉంది.  యువతరం  సాహిత్యం వైపు తక్కువగా వస్తున్నారు. పాఠకుల సంఖ్య పెరగాలి.

దోర్నాదుల సిద్దార్థ: ప్రస్తుతం సాహిత్యం  సవ్యమైన దిశలోనే ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఉన్న కవులను మూడు తరాలుగా విభజించవచ్చు శివారెడ్డి లాంటి వారు మొదటి తరం కవులుగా భావిస్తే మాతోపాటు మా వయసున్న అనేకమంది మూడవ తరంగా భావించవచ్చు. పుప్పాల శ్రీరామ్ అనిల్ డాని ,మౌళి,తగుళ్ళ గోపాల్ పల్లెపట్టు నాగరాజు ఇలా ఎంతోమంది వారిదైన శైలితో కవిత్వాన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తున్నారు వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి.   గోపాల్, నాగరాజు ఇలాంటి కవులు లు మట్టి వాసనతో తమ యాసతో కవిత్వాన్ని రాస్తున్నారు.

అనంతపురంలో అక్షరమాలి సురేష్ ముందుండి సాహిత్యాన్ని నడిపిస్తున్నారు.

ప్రస్తుత కవులందరూ పైన ప్రపంచీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది వారు వాదం లో నుంచి మాట్లాడిన అంతర్ముఖం గా ప్రపంచీకరణ ధ్వని స్తోంది.

13.       మీరు సాహిత్యం లోకి రాకముందు, సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?

రాక ముందు సంగతి మాకు తెలియదు గానీ ఇరవై ఏళ్ళ సాహిత్య సహవాసంలో వాతావరణం చాలా మార్పులకు లోనయింది అని మాత్రం చెప్పగలం. కవిత్వం రాసే వాళ్ళు బాగా పెరిగారు. వస్తువైవిధ్యం కనిపిస్తోంది. గొప్ప భావనలు, కొంగొత్త అభివ్యక్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి ఆహ్వానించదగ్గ పరిణామాలు.  వీటితో పాటు కవిత్వంలో కమర్షియలిజం కూడా బాగా పెరిగింది అని చెప్పక తప్పదు.

14.       భవిష్యత్తులో మీ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి?

డాక్టర్ రాధేయ కవితా పురస్కారాన్ని ఇప్పటి లాగే నిజాయితీతో పారదర్శకంగా నిర్వహించడమే మా ప్రణాళిక. మంచి కవిత్వం రాయాలి, అందరితో రాయించాలి.

మేము 20 సంవత్సరాల నుండి కవిత్వం రాస్తున్నాము. కవిత్వం సంకలనం గా తీసుకురావాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అలాగే పాఠశాల, కళాశాల పిల్లలకు  సాహిత్యాన్ని దగ్గర చేయాలి అనే  ఆలోచన ఉంది. దీని కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము.

15.       పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు  గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు?

ఎక్కువగా చదవండి తక్కువగా రాయండి. రాసే ప్రతి మాట మనలోంచి రావాలి మనమై ఉండాలి. ప్రతి కవితలోనూ మనల్ని మనం ఆవిష్కరించుకోగలగాలి. మన బతుకు మూలాల్లో నుంచి , ఉద్యమ తాత్విక కోణాల్లోంచి నిప్పు రాజేసుకోవాలి. వస్తువే కాదు శిల్పం మీదా దృష్టి పెట్టాలి.

గోదావరి పత్రిక లో మంచి అంశాలు వస్తున్నాయ్.  అన్ని ప్రక్రియలుకు చోటు కల్పిస్తున్నారు.

తెలుగు సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ గొప్పగా ఉంది. అన్ని తరాల వారికి చోటు కల్పిస్తున్నారు.

ఇంటర్వ్యూలు

సాహిత్యం అనేది ఒక అణ్వాస్త్రం లాంటిది – గట్టు రాధిక మోహన్ 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు గట్టు రాధిక మోహన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీ సాహిత్య నేపథ్యం గురించి...

నాది ఇంటర్మీడియట్ లో ఎం.పి.సి. గ్రూప్.  సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో...మా కాలేజ్ హాస్టల్లోనే ఉండే నా ఫ్రెండ్ ఒకరు (నేను డే-స్కాలర్ ని) స్టడీ అవర్స్ తో ప్రెషర్ గ ఫీలయినపుడు కొంత రిఫ్రెష్ మెంట్ కోసం కవితలను రాసేది.  రాసినవి ఎవరికో ఒకరికి చదివి వినిపించాలని ఉంటుంది కదా...ఆ ఎవరో ఒకరు నేనయ్యేది.లీజర్ క్లాస్ లలో..తను ముందు రోజు రాసినవన్ని నాకు చదివి వినిపించేది.  అలా...తనవి వింటూ...వింటూ... నేను కూడా చిన్న చిన్నవి మ్యాథ్స్...ఫిజిక్స్...కెమిస్ట్రీ లలోని అప్లికేషన్స్ ని ఫ్రెండ్స్ కి అప్లై చేస్తు రాసేదాన్ని.అవన్నీ ఫ్రెండ్స్ ముందు చదివి వినిపిస్తు కాసేపు నవ్వుకునే వాళ్లం...ఈ విధంగా  రాస్తూ రాస్తూ....ఏదైనా చూసినప్పుడు నా ఫీల్ ని రాయడం అలవాటు చేసుకున్నాను.  ఎప్పుడైతే నా ఫీల్ ని పేపర్ మీద పెట్టినప్పుడు లోలోపలి తెలియని ఏదో పెద్ద బరువు కరిగిపోయినట్టు అనిపించేది. ఇదంతా ఒక రెండేండ్ల వరకే కొనసాగింది.ఆ తర్వాత జాబ్ రావడం... వెంటనే పెండ్లి కావడం వల్ల ఒకవైపు వృత్తి, కుటుంబ బాధ్యతలు ...మరోవైపు  అదనపు విద్యార్హతలను పెంచుకోడానికి చదువుతుండటం వల్ల    (నాకు ఇంటర్మీడియట్ టిటిసి తోనే 19 ఏళ్లకే టీచర్ జాబ్ వచ్చింది.  ఇప్పుడు నా విద్యార్హతలు M.Sc Physics,M.A.Sociology, B.Ed.)

టైం దొరక్కపోయేది కొంతకాలం గ్యాప్ వచ్చింది.  మళ్లీ నేను గర్ల్స్ హైస్కూల్ లో పనిచేస్తున్నప్పుడు ఆ స్కూల్ లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటిని నేనే నిర్వహించేదాన్ని.

నేను నిర్వహించే ప్రోగ్రామ్ పిల్లలకు బోర్ గ అనిపించకుండ ఉండటానికి మధ్య మధ్యలో చిన్న చిన్న కవితలను చెప్పుతుండేదాన్ని...

పిల్లలంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గ...అటెన్షన్ గ ఉండేవాళ్ళు...ఆ విధంగ మళ్ళీ మొదలు పెట్టిన కవితలను రాయడం.

2.       మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు

ఒకరోజు పేపర్ లో (2017 మే నెల అనుకుంట) "దొడ్డి కొమురయ్య ఫౌండేషన్" వాళ్లు కవితా సంకలనం కోసం కవితలకు ఆహ్వానం అనే న్యూస్ చదివిన.  వెంటనే వాళ్లు ఇచ్చిన నంబర్ కి నా దగ్గర ఉన్న కవితను వాట్సప్ చేసిన.వాళ్ల నుండి ఒక రిప్లై వచ్చింది...మీ కవితను స్వీకరిస్తున్నామని.  ఆ తర్వాత పోయెట్రీ వాట్సప్ గ్రూప్ లో ఆడ్ చేసారు. (అప్పటి వరకు నాకు పోయెట్రీ మీద గ్రూప్స్ ఉంటాయని తెలియదు).  వాళ్లే అస్నాల శ్రీనివాస్ గారు మరియు బిల్లా మహేందర్ గారు.  ఆ తర్వాత అప్పుడప్పుడు జరిగే సాహిత్య సభల సమాచారం ఇచ్చేవాళ్లు.

అన్నీటికి కాకపోయినా కొన్నీటికైనా టైం ని కుదుర్చుకొని అటెండ్ అయ్యేదాన్ని.  గ్రూపుల్లో వచ్చే కవిత్వాన్ని బాగా చదువుతూ నేను కూడా ఏదో ఒకటి రాస్తూ ఉండేదాన్ని.

3.       రచనా క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి

నేను 2017 నుండి ఈ సాహిత్యం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టిన.సామాజిక సమస్యలు...

సంఘటనల మీద నా మనసు తీవ్ర వేదనకు గురైనప్పుడు అప్పుడు కలిగే భావోద్వేగాన్నంత పేపర్ మీద పెట్టేదాన్ని...దాన్నే కవిత్వం అనుకునే దాన్ని....తర్వతర్వాత ఇతరుల కవిత్వాన్ని చదవడం అలవాటు చేసుకున్నప్పుడు నా కవిత్వంలో క్రమంగా మార్పు చోటుచేసుకుంది...ఈ సందిగ్ధ సమయంలోనే నా మొదటి కవిత్వ సంపుటి ఆమె తప్పిపోయింది వచ్చింది.  ఇదొక భావ కవిత్వమనే చెప్పుతాను...ఎందుకంటే శిల్పం గురించి అప్పటి వరకు నాకు తెలియదు.  ఆ తర్వాతే సీనియర్ కవుల చర్చనీయాంశాల ద్వారా తెలుసుకున్నాను.  ఎప్పుడైతే కవిత్వం లోతుపాతుల్ని తెలుసుకున్నానో కవిత్వం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకున్నాను.  రాసినదాన్ని ఒకటికి పదిసార్లు చదువుకుంటాను...చదువుతున్న ప్రతీసారి ఏదో ఒక మార్పు జరిగేది.  ఇక ఏ మార్పు లేదనుకున్నప్పుడు ఒక సీనియర్ కవికి చూపెట్టి అభిప్రాయం తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ విధంగ నా కవిత్వంలో బలాన్ని పెంచుకోగలిగాను.

4.       మీరు సాహిత్యం లోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు,రచయితలు, పుస్తకాలు సంస్థల గురించి తెలపండి.

నాకు సాహిత్యానికి ఒక దారి ఉందని చూపెట్టిన వారు బిళ్ల మహేందర్ గారు,అస్నాల శ్రీనివాస్ గారు...ఇక ఆ దారిలో నేను నడుస్తున్నప్పుడు నన్ను ప్రోత్సహించి ఇంకా ముందుకు నడిపించిన వారు కవిసంగమం వ్యవస్థాపకులు కవి యాకూబ్ గారు, కవి సాయంత్రం అడ్మిన్ ముక్కెర సంపత్ కుమార్ గారు.  నన్ను బాగా ప్రభావితం చేసిన వారయితే విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య గారు, పుప్పాల శ్రీ రామ్ గారు,

నారాయణ శర్మ గారు,దర్బశయనం శ్రీనివాసు గారు.  బుక్స్ విషయానికొస్తే శ్రీ శ్రీ గారి 'మహాప్రస్థానం' , తిలక్ గారి 'అమృతం కురిసిన రాత్రి' , శేషేంద్ర శర్మ గారి 'ఆధునిక మహాభారతం' .  అలాగే తెరసం, అరసం, ప్రరవే సంస్థలు ఎంతో ప్రోత్సహించాయి. 

5.       మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?  

నేను సాహిత్యంలోకి రాకముందు ఈ సాహిత్య ప్రపంచం గురించి నాకు ఏమాత్రం తెలియదు.  ఏదో తోచిన నా భావాలను పేపర్ మీద రాసేదాన్ని.ఎప్పుడైతే ఈ వాతావరణంలోకి ప్రవేశించానో...ఇదొక మహా సముద్రమని,  ఓపికున్నంత వరకు సాహిత్యాన్ని తోడుకుంటు పోవచ్చని అర్థమైంది.  సాహిత్యంలోకి ప్రవేశించిన కొత్తలో అన్నిట్లో ఉన్నట్టు ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉండవు...చాలా ప్రశాంతంగా ఉంటుందనుకునేదాన్ని.  కానీ లోతులోకి దిగుతున్నా కొద్ది ఇక్కడ కూడా అంతేనని తెలుసుకున్నాను.  సాధ్యమైనంత వరకు నా మీద ఆ ప్రభావం పడకుండా ఉండటానికి జాగ్రత్త పడుతుంటాను.

6.       మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?  

సాహిత్యం నిర్వచనం తెలియని స్టేజీ నుండి మొదలైన నేను ఈ నాలుగేళ్లలోనే దాని గురించి తెలుసుకుంటూ నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాననే అనుకుంటున్నాను.

7.       కొత్తగా వెలువడుతున్న సాహిత్యం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు?  

మనం ఒకటి రాస్తున్నాము అంటే చదివే వారికి ఏదో ఒక విషయంలో కొంత సమాచారాన్ని ఇచ్చేలాగనో...ఉపయోగపడేలాగనో...

మార్పు తీసుకొచ్చేలాగనో... ఆలోచించేలాగనో కొంతవరకైనా ఉండాలనుకుంటాను.           

8.       భిన్న సాహిత్య ఉద్యమాలు మీ రచనల పై చూపిన ప్రభావం ఏమిటి?

ఇప్పటివరకైతే నా మీద ఎలాంటి ప్రభావం పడలేదు.

9.       మిమ్మల్ని ప్రోత్సహించిన సీనియర్ రచయిత ల గురించి,మీరు ప్రోత్సహించిన యువతరం రచయితల గురించి చెప్పండి.

  నా మొదటి కవిత్వ సంపుటి "ఆమె తప్పిపోయింది" బుక్ ని తీసుకొచ్చే సమయంలో అలాగే నా కవిత్వంలో మొదటిసారి మార్పు చోటుచేసుకున్నది లక్ష్మీ నరసయ్య సార్ మాటల ప్రభావం వల్లనే అని చెప్పుతాను.  కవి యాకూబ్ సార్ అయితే నెమ్మదిగా "అమ్మా...కవిత్వం రాయాలమ్మా...ఈ మధ్య రాయట్లేదంటూ" గుర్తు చేస్తుంటారు. కవిత్వంలోని లోతుపాతుల గురించి పుప్పాల శ్రీ రామ్ సార్...నారాయణ శర్మ సార్, దర్బశయనం సార్ చాలా బాగా చెప్పుతుంటారు. అఫ్సర్ సార్, నారాయణ స్వామి వెంకటయోగి సార్ , సివి సురేష్ సార్ మంచి ప్రోత్సాహ బలాన్ని అందిస్తుంటారు.

తమ్ముడు బండారి రాజ్ కుమార్, వడ్లకొండ దయాకర్ అన్న, కంచెర్ల శ్రీనివాస్ అన్న మంచి మంచి సూచనలు,  సలహాలు ఇస్తుంటారు.  వీళ్లంత ప్రభావం వల్లనే తక్కువ సమయంలో కవిత్వంలో ముందుకెళ్లానని చెప్పగలను.నాపై ఉన్న ఇంతమంచి ప్రభావాన్ని...అనుభవాలను తెలియని మరో నలుగురికి చెప్పాలనుకుంటాను. ఆ ఉద్దేశంతోనే కొత్తగా రాస్తున్న వాళ్లు ఎవరైనా నన్ను అప్రోచ్ అయినప్పుడు సాహిత్యం పట్ల ఎలాంటి విలువలను, ఉద్దేశాలను కల్గియుండాలి...ఎలా నడుచుకోవాలో చెప్పుతాను.  నేను చెప్పిన చాలా మంది కూడా అదే విధంగా ముందుకుపోతున్నారు.

వాళ్లనలా చూసినప్పుడు నాకు చాలా సంతోషం కల్గుతది. సాహిత్య వారధులను పెంచుకోవడం చాలా అవసరం... ఇంకా చెప్పాలంటే మన తెలుగు సాహిత్యానికి చాలా చాలా అవసరం.

10.     సాహిత్యం ద్వారా సమాజానికి మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటి?

సాహిత్య మనేది సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలి.  ప్రజల ఆరాటాలను తెలియజేసేదిగా ఉండాలనేది నా అభిప్రాయం.

11.      సాహిత్యం సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు?

సాహిత్యం అనేది ఒక అణ్వాస్త్రం లాంటిది.

ఎన్నో రాజ్యాలను కూల్చేసిన ఘనత ఈ సాహిత్యానికుంది.  ఉదాహరణకు ...ఎన్నో ఏండ్ల తెలంగాణ ప్రజల ఆరాటం... పోరాటం అయిన తెలంగాణ రాష్ట్ర సాధనలో సాహిత్యం ప్రధాన పాత్ర పోషించడం వల్లనే రాష్ట్ర ఆవిర్భావం జరిగిందనే నిజం అందరికీ తెలిసిన విషయం.

12.      కథ,కవిత, నవల, నాటకం, విమర్శ ప్రక్రియలలో మీకు ఇష్టమైన ప్రక్రియ ఏమిటి?   ఇతర ప్రక్రియల గురించి మీరు ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

నాకు అవన్నీ ఇష్టమే...సాహిత్యం లోని అన్ని భాగాల రుచిని ఆస్వాదించాలనుకుంటాను.

ఇప్పటివరకు నేను ఒక కవిత్వమే కాకుండ సాహిత్యంలోని చాలా ప్రక్రియలలో అడుగుపెట్టాను.  అందులో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నాను.     అవేంటో చెప్పాలంటే...

కవిత్వం రాయడంతో పాటు కవిత్వం మీద సమీక్షలను, కథలను...కథల పుస్తకాలు, నవలల మీద వ్యాసాలను రాస్తున్నాను.

అలాగే లిరిక్స్ రాస్తున్నాను.ఇప్పటి వరకు ఒక అరవై వరకు లిరిక్స్ రాసుకొని పెట్టుకున్నాను.

ఒక రెండు ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రికార్డ్ అయ్యి బయటకొచ్చి చాలా మందికి రీచయినవి.ఇంకా మరో నాలుగు ఒక పేరొందిన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రికార్డు అవుతున్నాయి.ఇవే కాకుండా... ఈ మధ్యనే నేను 'తెలంగాణ గవర్నమెంట్ మరియు ఫర్ ఎవర్ ఫంటాస్టిక్ థియేటర్' వారి ఆధ్వర్యంలో జరిగిన "స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రైటింగ్‌" కోర్సును కంప్లీట్ చేశాను. నాకు ఒక సినిమాకు,  ఒక షార్ట్ ఫిల్మ్ కి స్క్రీన్ ప్లే రాసే అవకాశం కూడా వచ్చింది.ఇప్పుడు అదే పనిలో ఉన్నాను.  నేను దాదాపు అన్నీ సృశిస్తున్నానని గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ...ఇష్టముంటే....దాన్ని ప్రేమిస్తే...

ఎంత హార్డ్ వర్క్ అయినా సులువుగా చేయొచ్చనుకుంటాను.

13.      మీకు బాగా నచ్చిన మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి చెప్పండి...

ఓల్గా గారివి,చలం గారివి, కేశవరెడ్డి గారివి బాగా నచ్చుతాయి. 'పోస్ట్ చెయ్యని ఉత్తరం' మహాత్రయ గారిది చదువుతున్నప్పుడు జీవితంతో ముచ్చట పెట్టినట్టు...

అనుభవాలను గుర్తుచేసుకుంటున్నట్టుగ అనిపిస్తుంది.  ఓల్గా గారి రచనలైతే ఇప్పటి పరిస్థితులకు కూడా వర్తిస్తున్నాయి.  గుంటూరు శేషేంద్ర శర్మ గారి 'ఆధునిక మహాభారతం' చాలా అద్భుతమైన కవిత్వం చాలా ఇష్టపడతాను.అలిశెట్టి గారి కవిత్వం అదొక అక్షర సంపదగా అనిపిస్తది.  అక్షరాల అమరికలోని నైపుణ్యం...ఆ పదాలతో ఏర్పడే లోతైన అర్థాన్ని చూస్తే ‍ ఆశ్చర్యమనిపిస్తది.

14.      మిమ్మల్ని కలవరపెడుతున్న ఆలోచింప చేస్తున్న సామాజిక పరిణామాలు ఏవైనా తెలపండి...

 నన్ను కలవరపెట్టేవి మొదటిది రైతు విషయం... ఆ తర్వాత ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాల విషయం.  రైతు గురించి చెప్పాలంటే...రైతు లేని రాజ్యం...సూర్యుడు లేని ఆకాశం లాంటిదవుతుంది.  రాజుగా బ్రతకాల్సిన రైతు ఆకలి కడుపును పట్టుకొని రోడ్డెక్కుతున్నాడంటే అది ప్రతీ ఒక్కరి అవమానంగా భావించాలి.  అన్ని పదవులకు రాజీనామా ఉన్నట్టే రైతు కూడా తన రైతు పదవికి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి...!?

ఇక మరో విషయానికొస్తే ...అమలు గాని చట్టాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నంత కాలం ఆడవాళ్ల మీద జరిగే అరాచకాలు కొత్తకొత్త పద్దతుల్లో పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఇంటర్వ్యూలు

చదవడం అన్నది నాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఇష్టమైన వ్యసనం – కందిమళ్ళ లక్ష్మి 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు కందిమళ్ళ లక్ష్మి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీ సాహిత్య నేపథ్యం గురించి...

మాది  వ్యవసాయ కుటుంబం.   మా కుటుంబంలో ఎవరు సాహిత్య పరంగా రచనలు చేయలేదు.. పెద్దమ్మ కూతురు, మేనత్త కూతురు వీళ్ళు ఇద్దరు మాత్రం మా ఇంట్లో నవలలు, వారపత్రికల్లో వచ్చే సీరియల్స్ చదివి చర్చించుకునే వాళ్ళు.. వాళ్ళ చర్చ పక్కనుండి వినే నాకు ఆ పుస్తకాలు చదవాలని  అనిపించేది. అలా వాళ్ళ ఇద్దరి వల్ల నాకు చదవడం అనే ఒక అలవాటు  అయ్యిందనే చెప్పాలి. 

మా మేనత్త భర్త మా స్కూల్ లైబ్రరీ టీచర్ గా వుండటం వల్ల సెలవులలో స్కూల్ లైబ్రరీ నుంచి సాహిత్య  పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని చాలా.

నా స్నేహితురాలు వాళ్ళకు ఒక బంకు వుండేది. ఆ బంకు లో నవలలు, పత్రికలు, వివిధ పుస్తకాలు అద్దెకు  ఇచ్చేవాళ్ళు.. నాకు నచ్చిన  పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని. అలా హైస్కూలు నుండే సాహిత్యం పుస్తకాలు చదవడం అలవాటు అయ్యింది. 

చదవడం అన్నది నాకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఇష్టమైన వ్యసనం. 

నాకు స్నేహితులు తక్కువ పుస్తకాలే మంచి నేస్తాలు. 

2.         మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు ?  

నేను రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సాహిత్యంపై నాకుగల ప్రేమే నాతో ఇలా రాయిస్తుందేమో అని అనుకుంటాను. 

ఫేస్ బుక్ లో  కొన్ని సాహిత్య గ్రూపులలో చేరాను. ఆ గ్రూపులలో ఎందరో  రాసినవి చదివే దాన్ని.. అలా చదువుతున్నప్పుడు  నాకు రాయాలనిపించి రాయటం మొదలు పెట్టాను. 

నాకు నచ్చినవి నాకోసం నేను రాసుకునే దాన్ని.

నా రాతకు అభిమానం ఆత్మీయత కల్గిన పాఠకులు దొరికారు  ఫేస్ బుక్ ద్వారా.. పత్రికల ద్వారా..

కవిసంగమం గ్రూపులోనూ నా కవిత్వం ఎంతో ఆత్మీయ ఆదరణ పొందింది. అదేవిధంగా  ఎంతో మంది మంచి  కవులు పరిచయమయ్యారు. 

నా రచనలు  అరుణ తార, గోదావరి, సాహిత్య ప్రస్థానం, రైతువాణి,కొలిమి, నెచ్చెలి,విహంగ,వెలుగు దర్వాజ, తెలుగు వెలుగు, ఇంకా వివిధ  పత్రికలలో ప్రచురితమయ్యాయి. 

అలా నేను  రాసిన వంద కవితలతో 2019లో "రెప్పచాటు రాగం" కవిత్వం పుస్తకం వేసుకున్నాను, కవి, మిత్రుడు 'యశస్వి సతీష్' సహకారంతో..

3.         రచనా క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి ?   

చాలానే ఎదురయ్యాయి మంచి, చెడు రెండూనూ.. వాటన్నిటినీ పాఠంగా  మంచిని తీసుకొని చెడును వదిలేయడం నేర్చుకున్నాను. మరింత రాయాలనే పట్టుదలనుపెంచాయి.                  

4.         మీరు సాహిత్యం లోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు రచయితలు పుస్తకాలు సంస్థల గురించి తెలపండి.

నేను చదివిన ప్రతి పుస్తకం నాపై  ప్రభావం చూపింది.

కథలు రాయాలనే ప్రేరణ కలిగించిన పుస్తకాలు..

ఓల్గా ౼కథా స్రవంతి, అబ్బూరి ఛాయాదేవి ౼తన మార్గం, సత్యవతి కథలు, దర్గామిట్టా కథలు, గోపిని కరుణాకర్ కథలు, మౌని కథలు.

5.         మీరు సాహిత్యం లోకి రాకముందు , సాహిత్యం లోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని భావిస్తున్నారు?    

రాక ముందు నేను ఒక చదవరిని మాత్రమే 

వచ్చిన తర్వాత అంటే.. కొత్త రచనలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి ఎన్నో సాహిత్య పత్రికలు విశాల దృక్పథంతో 

 6.        మీ సాహిత్యం  మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?  

నేనెప్పుడూ ఏ గుర్తింపు కోసం రాయలేదు. నా సంతోషం కోసం.. నేను రాసింది నచ్చి చదివేవారికోసం రాశాను..

2018 డిసెంబర్ 17 ప్రజాశక్తిలో  "కర్నూలు కవనం" శీర్షికలో"హృదయంలో ప్రవహించే జీవనది" లక్ష్మి_కందిమళ్ళ కవిత్వం అనే వ్యాసం వచ్చింది.

2018 నారీ గళాలు జాతీయ స్థాయి కవయిత్రుల కవిసంమ్మళనంలో ప్రశంసా పత్రం ఇచ్చారు. 

2018 కందనవోలు రచయిత్రుల ప్రథమ వార్షికోత్సవం లో.  నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంగమం, కర్నూలు జిల్లా శాఖ  ప్రశంసా పత్రం ఇచ్చారు. 

2019 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన  ఉగాది మహోత్సవం కవిసమ్మేళనంలో  కర్నూలు కలెక్టరు గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం రెండువేల రూపాయల నగదు ఇచ్చారు. 

నేను రాసిన ఎన్నో కవితలు, నా కవిత్వ పుస్తకం కు సాహిత్య విమర్శ గ్రూపులో అబ్దుల్ రాజహుసేన్ మాష్టారు మంచి విశ్లేషణ చేశారు. 

కవిసంగమంలో రాజారాం తుమ్మచెర్ల మాష్టారు నా పుస్తకంపై మంచి విశ్లేషణ చేశారు. తుమ్మచెర్ల మాష్టారు విశ్లేషణ చేశారు అంటే అది ఏ కవికైనా ఒక గొప్ప పురష్కారంతో  సమానం. 

తోటి కవులు, రచయితలు కూడా నా పుస్తకానికి చక్కని  విశ్లేషణలు రాశారు. 

నేను రాసి చదివిన కవితలు  రేడియోలో రెండు సార్లు ప్రసారమయ్యాయి. 

ఇవన్నీ  నాకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చిన  ఒక గుర్తింపు అని అనుకుంటాను. 

7.         కొత్తగా వెలువడుతున్న సాహిత్యం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు?   

ఇలాగే ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.            

8.         భిన్న సాహిత్య ఉద్యమాలు  మీ రచనల పై చూపిన ప్రభావం ఏమిటి?

ఉండొచ్చు, ఉండకపోవచ్చు నేను అంత ఆలోచించలేదు. 

9.         మిమ్మల్ని ప్రోత్సహించిన సీనియర్ రచయిత ల గురించి మీరు ప్రోత్సహించిన యువతరం రచయితల గురించి చెప్పండి.

నన్ను ప్రోత్సహించిన వారిలో సీనియర్, యువతరం రచయితలు వున్నారు. 

కాశీభట్ల వేణుగోపాల్ గారు, వెంకటకృష్ణ అన్న, యశస్వి సతీష్ , ఓల్గా గారు, వాడ్రేవు చినవీరభద్రుడు గారు, వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారు, బొమ్మదేవర నాగకుమారి గారు, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు, పాలగిరి విశ్వప్రసాద్ గారు, అజయ్ వర్మ అల్లూరి, మంజు యనమల అక్క, గోపిని కరుణాకర్ గారు, శిలాలోలిత అక్క, యాఖూబ్ సర్, సిద్దార్థ కట్టా, రాయపాటి శివ,నరేష్కుమార్ సూఫీ,P.B.D.V.ప్రసాద్ గారు, హరికిషన్ సర్, కెంగార మోహన్ గారు, మారుతి పౌరోహిత్యం గారు. ఇంకా ఎంతో మంది తోటి రచయితలు. 

ప్రముఖ కవి, రచయిత గౌరవనీయులు కాశీభట్ల వేణుగోపాల్ గారికి నా రెప్పచాటు రాగం  కవిత్వం పుస్తకం ఇవ్వాలని పోన్ చేసినప్పుడు నా పుస్తకం కోసం ఎదురుచూస్తూ వున్నానని ఆయన అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. ఆయనను కలిసినప్పుడు.. ఆయన ఆదరణ, మాటల్లోని ఆత్మీయత  నేను మరింత రాసేందుకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చాయి.  వారి ప్రోత్సాహం నాకు ఆశీస్సులుగా దొరికడం నా అదృష్టం.

ఇక నా ప్రోత్సాహం విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరి రచనలు  అభిమానంగా,ఇష్టంగా చదువుతుంటాను. 

10.       సాహిత్యం ద్వారా సమాజానికి మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటి?

సాహిత్యం చదివి సమాజం కచ్చితంగా  మారుతుందని అనుకోలేము, ఒకవేళ  ఏ ఒక్కరైనా మారినా సంతోషమే.

11.       సాహిత్యం సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు?

సాహిత్యం తేజోవంతమైనది, తప్పకుండా గొప్ప ప్రభావితం వుంటుంది. నమ్మకం, ఆశ. 

12.కథ కవిత నవల నాటకం విమర్శ ప్రక్రియలలో మీకు ఇష్టమైన ప్రక్రియన ఏమిటిఇతర ప్రక్రియల గురించి మీరు ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

ముందుగా కవిత్వం లోకి వచ్చాను. ఒక కవిత్వం పుస్తకం వేశాకే కథలు రాయడం మొదలుపెట్టాను. కవిత్వం కథలు రెండు ఇష్టమైనవి.. ఇక ఇతర ప్రక్రియ ల గురించి ఎందుకు ఆసక్తి  లేదు అంటే.. నాకు కూడా తెలీదు/ఏమో..

13.       మీకు బాగా నచ్చిన మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి చెప్పండి..

చదివిన ప్రతి పుస్తకం ప్రభావితం చేసిందనే చెబుతాను. 

నచ్చినవి..చలం "గీతాంజలి ",కేశవరెడ్డి "నవల "అతడు అడవిని జయించాడు"

14.       మిమ్మల్ని కలవరపెడుతున్న ఆలోచింప చేస్తున్న సామాజిక పరిణామాలు ఏవైనా తెలపండి.

మానవత్వం కనిపించని సందర్భాలన్నీ  కలవరపెడుతుంటాయి.. అలా కలవరపెట్టే ప్రతి సంధర్భం ఆలోచనల నెలవే కదా..

 

ఇంటర్వ్యూలు

కవితకు నా హృదయంలో ఇచ్చిన స్థానం వేరే ఏదీ ఎప్పటికీ ఆక్రమించలేదు – మల్లిక 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు మల్లిక గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.         మీ రచనా  నేపథ్యం  గురించి...

కథో, కవితో, హైకూనో, కాలమో, ఎది రాసినా, దాన్నంతటా కొత్తదనంతో నింపేయాలన్న నా కోరిక, దానితో పాటు దాన్ని వీలయినంత సరళంగా కుదురుస్తాను. అలా రాసిన ప్రతి కవితను, నేను ఎంతో ప్రేమగా గీసిన ఒక కొత్త ఆర్ట్ తో విడుదల చెయ్యడం, అంతే నా బుజ్జి నేపథ్యం.

2.         మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు ?    

సరిగ్గా నా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో మా ఇంటి ఎదురుగా ఓ బుల్లి పాప పరిచయమయ్యింది. ఆ పిల్ల నన్ను అలరించి నాకు తెలియకుండానే నన్ను సాహిత్యమనే రైలు ఎక్కించి, నా మొదటి కథ రాయించింది. అప్పటినుండి ఆ గాలి స్పర్శ నన్ను ప్రతిసారీ మురిపిస్తూనే ఉంది. అలా మొదలైంది సాహిత్యంలోకి నా ప్రవేశం, ఇప్పుడు సాగుతున్న ప్రయాణం.

3.         రచనా క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి ?

నా పదహారో యేట నా మొదటి రచన చేశాను. అది నా ఆనందాలు మరియు తీపి బాధల కలయికగా విడుదలయ్యింది. నాకు రచించడం అనేది ఒక వరంలా అనిపిస్తుంది. ఎక్కువగా సంతోషమో, బాధో, కోపమో, చిరాకో ఎలా ఉన్నా నా ఫోను తీసుకుని గబగబా దాన్ని నా మనసులో నుండి పోగుచేసి పేపరు మీద పోసేస్తాను. రచనలో ఎంతో మంది ఎన్నో అనుభవాలు ఎదుర్కొని ఉంటారు, అలానే రచనలు నన్ను నా భావోద్వేగాలకు మరింత దగ్గర చేస్తూనే చింతలనుండి దూరం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

4.         మీరు సాహిత్యంలోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన వారి గురించి తెలపండి.

అందరిలాగే నేను సాహిత్యంలోకి రావడానికి వెనుక కూడా ఒక మహా మనిషి ఉన్నారు. ఆమె గొప్పదనం చెప్పడం నాకు వీలు కాక, ఒక కథే రాయాల్సి వచ్చింది. కానీ ఆమెకి అది చూపించేలోపే కొన్ని పరిస్థితుల వల్ల ఆమె నా నుండి దూరమయిపోయారు. ఆమె ఏదో ఒకరోజు నా కథ చదివి నన్ను ఎప్పటికయినా కలుస్తారని ఆశతో, 'భూమిక' అనే ఆ అయిదేళ్ల పిల్లను ఇప్పటికీ నా గుండెల్లో భద్రంగా దాచుకున్నా.

5.         మీ సాహిత్యం మీకు తెచ్చిన గుర్తింపు గురించి ఏమనుకుంటున్నారు?    

సాహిత్యం నాకు తెచ్చిన గుర్తింపు ఎంతో నేను చెప్పలేనేమో గానీ, నేను ఇది మొదలు పెట్టినప్పటినుండి, సాహిత్యాన్ని నేను ఎంత గుర్తించానో చెప్పగలను. నిజానికి సాహిత్యం అనేది అందరికీ తమ ఆసక్తులు, ఆలోచనలు ఇతరులతో పంచుకోగలిగే ఎంతో మంచి ప్లాట్ఫారంగా నేను భావిస్తాను.

6.         కథ కవిత నవల నాటకం విమర్శ ప్రక్రియలలో మీకు ఇష్టమైన ప్రక్రియను ఏమిటి?

దేని గొప్పతనం దానిదే అయినా, కవితకు నా హృదయంలో ఇచ్చిన స్థానం వేరే ఏదీ ఎప్పటికీ ఆక్రమించలేదు. కథ ఒక రాజు, నవల ఒక రాజ్యం, నాటకం ఒక సైన్యం అయినా, విమర్శ ఒక యుద్ధం అయినా, ఆ ప్రపంచంలో, కవిత మాత్రం ఆనందాలతో తుళ్లియాడుతున్న ఒక మామూలు అమ్మాయి. మిగతా ప్రక్రియలన్నీ ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ, వీటన్నిటినీ మించిన అందం ఆనందం ఆమెవి. పెద్ద ఆస్తులులేవీ లేకపోయినా తన చిన్ని లోకంలో తానే ఉంటూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. తనను మొదటి సారి చూసినప్పుడే, నేను తనతో అంతులేని ప్రేమలో పడిపోయాను...

7.         ఇతర ప్రక్రియల గురించి మీరు ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

నాకు అన్ని ప్రక్రియల మీద ఆసక్తి ఉంది, అందుకే కేవలం కవితతో ఆపేయకుండా, కథలు, కాలమ్సు, హైకూలు, అన్నిటిలో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నవల, ఒకటి రాయాలని నాకు ఎంతో ఆశ, ఇంజనీరింగ్ పరీక్షల వల్ల, ఆగాల్సి వస్తోంది, ఇవన్నీ అయిపోగానే, ఏదో ఒకరోజు మొదలుపెట్టాలని అనుకుంటున్నాను...

ఇంటర్వ్యూలు

పురస్కారాల్లో "ఉమ్మడిశెట్టి"ఒక ట్రేడ్ మార్క్ గా ఉండాలనేదే నా ఆశయం – డా రాధేయ

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా రాధేయ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.       "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు" మొదలైన క్రమం గురించి చెప్పండి?

"ఉమ్మడిశెట్టి"మా ఇంటి పేరు.  కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం గ్రామంలో ఓ సామాన్య దిగువ మధ్య తరగతి చేనేత కార్మిక కుటుంబం మాది. మా తల్లి దండ్రులకు నేను నాలుగవ కొడుకుని.మేం అయిదు మంది అన్నదమ్ములం.ఇద్దరు చెల్లెళ్ళు. మొత్తం మా కుటుంబ సభ్యులం  తొమ్మిది మంది.
మా తల్లిదండ్రులు ఉమ్మడిశెట్టి గంగిశెట్టి ,నాగమ్మ గార్లు. ఇద్దరూ చేనేత కార్మికులే. ముఖ్యంగా మా అమ్మ జీవితాంతం ఈ వృత్తిలోనే బతికింది.
నేనూ, మా అన్నలు అమ్మకు పనిలో సాయం చేసే వాళ్ళం.మా నాన్నకు ఆరోగ్యం బాగోలేక మధ్యలోనే మగ్గం మానేశాడని అమ్మ చెప్పింది.
మా నాన్న ఆరోజుల్లో వీధి బడిలో చదువుకున్నాడు, సంస్కారవంతుడు. మంచి లౌకికుడు. పేదరికాన్ని అయినా భరిస్తాడు కానీ ఎవరి దగ్గర చేయి చాచి ఎరుగడు.
పిల్లలందరినీ బాగా చదివించు కోవాలని ఎవరిని ఈ రెక్కల కష్టం లో దించ కూడదని భావించేవాడు. శరీర కష్టం వాళ్లది చదువు కోవలసిన బాధ్యత మాది.

మా అన్నదమ్ములూ, చెల్లెళ్ళు అందరూ చదువు కున్నారు. అందరికీ ఉద్యోగాలు
వచ్చాయి.  ఆ పల్లెటూళ్ళో ఒక పేద చేనేత కార్మిక కుటుంబంలో అందరూ ఇష్టపడి, క్రమశిక్షణతో కష్టపడి చదువు కోవడం, పైగా అందరూ ఉద్యోగస్తులు కావడం మా ఉరిలోనే గాక చుట్టుపట్ల మా కుటుంబమంటే ఎంతో గౌరవం ఏర్పడింది.

కేవలం మా తల్లి కష్టం తోనే ఇంత పెద్ద కుటుంబం బతుకు తెరువు కష్టం కదా.
మా ఊరికి దగ్గర్లో ముద్దనూరు మాకు చిన్న టౌన్. అక్కడ మరొక భాగస్వామిని కలుపుకొని చిన్న బట్టల అంగడి ప్రారంభించాడు నాన్న.

తను రోజు పల్లె నుండి సైకిల్లో ముద్దనూరు వెళ్లి సాయంత్రం దాకా వ్యాపారం చూసుకొని తిరిగి ఇంటికి వచ్చేవాడు. మేమంతా యామవరం లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశాము. ముద్దనూరుకు వెళ్ళి  హై స్కూల్ విద్య పూర్తి చేశాము.

ఈ చేనేత కుటుంబాల్లోచదువు ఉండేది కాదు. వారికి పదేళ్ల వయస్సు రాగానే ప్రతినపిల్లవాన్ని మగ్గంగుంటలో దింపుతారు. ఇక ఆడపిల్లల కైతే పెళ్లికి అర్హత మగ్గం నేర్వడమే.

నాకు బాల్యం నుంచీ ప్రకృతి ఆరాధన చాలా ఇష్టం, తెలుగు భాషన్నా, తెలుగు మాస్టార్లన్నా చాలా చాలా ఇష్టం.రాను రాను నా వయసుతో పాటు తెలుగు కవిత్వం మీద అభిమానమే కాదు, ప్రవేశం కూడా కలిగింది.

మొదట్లో అనుభూతి కవితలు, ప్రేమ కవితలు రాసేవాణ్ణి. 1974 లో శ్రీశ్రీ గారిని చూశాక నా భావజాలంలో కొంత మార్పు అవసరం అనిపించింది అప్పటి నుంచి అభ్యుదయ కవిత్వం రాస్తూ వచ్చాను.

నాకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని ఎంచుకున్నాను నిరుద్యోగిగా ఉన్నప్పుడే నేను "మరోప్రపంచం కోసం" కవితా సంపుటి వేశాను నిరుద్యోగి గానే 79 లో నాకు పెళ్లి అయ్యింది.

నా జీవితంలోకి ఇల్లాలిగా సత్యా దేవి వచ్చింది ఆమె రాకతో నా జీవితం సాహిత్యం మరింతగా వికసించిందని చెప్పవచ్చు తను నాకు మంచి.  ఉత్సాహాన్ని ఇచ్చింది

1982లో నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది ఉద్యోగంతో నేను పేదరికాన్ని జయించానన్న తృప్తి కలిగింది.  తర్వాత కవిగా ఎదుగుతూ వచ్చాను. ఈ క్రమంలో నేను కవిత్వం రాయడమే కాకుండా మంచి కవిత్వం రాసిన కవుల్ని ప్రోత్సహిస్తూ వారిని ఒక అవార్డు పేరుతో గౌరవించాలని నా ఆశయం.  ఈ విషయమే ఒకరోజు శ్రీమతి తో చర్చించాను ఆమె సంతోషంగా అంగీకరించింది. అంతేకాదు మేము  పల్లెటూరిలోనే కాపురం ఉంటూ నిరాడంబరంగా బతకడం మాకుబాగా అలవాటైంది.  తను కూడా ఎంతో పొదుపుగా కుటుంబాన్ని నిర్వహిస్తూనే అవార్డుకు తనవంతు సహకారం అందిస్తూ వచ్చింది.
అలా ఏర్పడిందే మా "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు".  ఒక సామాన్య మధ్యతరగతి  శ్రామిక కుటుంబ ఏర్పాటు చేసుకున్న ఒక పవిత్రమైన అవార్డు మాది.

2.       అవార్డు కోసం కవితా సంపుటాల మధ్య తీవ్రమైన పోటీ ఎప్పుడైనా వచ్చిందా?
అప్పుడు న్యాయనిర్ణేతల అభిప్రాయం ఎలా ఉండేది? ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఎంత వరకు ఉంటుంది?

మొదట్లో అవార్డు పరిశీలన కోసం 3 సం వ్యవధిలో అచ్చయిన కవితా సంపుటాలను ఆహ్వానించే వాణ్ణి.అప్పట్లో 30 సంపుటాలదాకా వచ్చేవి ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు లాగా ఇన్ని పత్రికలులేవు. మొబైల్స్ గానీ, మీడియా గ్రూపులు గానీ లేవు గదా,అన్నీ ఉత్తరాల ద్వారానే జరగాలి.  అప్పుడున్న ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఈనాడు, వార్త, ఉదయం పత్రికలు మా నోటిఫికేషన్ పట్టించుకోలేదు. ఎక్కడో మారుమూల పేజీలో ఓ చిన్న వార్త వేసేవారు. ఆ వార్తను చాలామంది కవులు గమనించే వాళ్లు కాదు. కానీ నేను ప్రతి ఆదివారం లైబ్రరీకి వెళ్లి కొత్త పుస్తకాలను వేసిన కవులను వారి చిరు నామాలను సేకరించుకుని వచ్చేవాణ్ణి.
ప్రతి రోజు స్కూల్ కి వెళ్లేటప్పుడు నా క్యారీ బ్యాగులో 100 పోస్టుకార్డుల ఎప్పటికీ పెట్టుకొని వెళ్లేవాణ్ణి.  మా అవార్డు ప్రకటన సమాచారాన్ని కార్డు మీద రాసి ఆయా కవుల పోస్ట్ చేసేవాణ్ణి. కొత్త కదా, అలా చేస్తే కూడా నాకు అప్పట్లో వందమందికి రాస్తే 30 నుంచి 40 దాకా మాత్రమే వచ్చేవి.  వాటినే మూడు సెట్లు గా చేసి న్యాయనిర్ణేతల పంపేవాణ్ణి. అలా పదేళ్లు వరకు ప్రతియేటా క్రమం తప్పకుండా  కష్టపడి కార్డుల ద్వారా కవులకు సమాచారం చేరవేశాను. పుస్తకాలు అంతగానే అందినట్లు మళ్లీ కవులకు ఉత్తరం రాసే వాణ్ని. అవార్డులు ప్రకటించాక పత్రికలకు సమాచారం ఇస్తూ మళ్లీ ఈ సమాచారాన్ని ఉత్తరం ద్వారా పంపిన కవులందరికీ రాసి పంపేవాడిని.
ఈ పదేళ్లలో నా నిబద్ధతను, తెలుగు సాహిత్య లోకం అంతా గుర్తించింది.అవార్డు విజేతలను కూడా గమనిస్తూ వచ్చింది.అవార్డు ద్వారా మేం ఎలాంటి వివక్షాలేకుండా ఉత్తమ కవిత్వఎంపికలో న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని ప్రకటిస్తూ రావడం, కవిలోకమంతా గమనించింది. గుర్తించింది. తర్వాత వాళ్లే మా అవార్డు ప్రకటన కోసం ఎదురు చూసేవారు.  దీన్ని తెలుగు కవులకు ప్రతిష్టాత్మక పురస్కారంగా గుర్తించి గౌరవిస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడగానే పుస్తకాలు పంపించడం అలవాటు చేసుకున్నారు.  సాహిత్యలోకం గుర్తింపు కోసం, నాకు పది సంవత్సరాలు పట్టింది.
ఆవార్డు కోసం మొదట్లో ప్రతియేటా నగదు బహుమతి వెయ్యి రూపాయలు, షీల్డు, శాలువాతో సన్మానించుకోవాలని మేం నిర్ణయించుకున్నాము.

1988 లో ఈ అవార్డు ను ప్రారంభించక ముందు కుందుర్తి గారు స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ మాత్రమే ఉండేది. ఈ పురస్కారం కూడా కేవలం కవిత్వానికే అంకితమైన అవార్డు. నాకు కుందుర్తి గారితో పరిచయం, సాన్నిహిత్యం కూడా ఉండేది. మా అవార్డు స్థాపనకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి కూడా కారణమే..

మొదటి అవార్డు సభ 1989లో మా మండల కేంద్రమైన ముద్దనూరు లో ఏర్పాటు చేశాం.
తర్వాత్తర్వాత నేను పనిచేస్తున్న ప్రాంతాల్లోనే జరుపుతూ వచ్చాము. ప్రతి ఏటా ఈ అవార్డు ప్రదాన సభలు కోసం మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు పెట్టే వాళ్ళం.

ఈ మొత్తాన్ని మేము మాకొచ్చే జీవితంలోంచి పొదుపు చేసుకొని ఖర్చు పెట్టేవాళ్ళం.సభల నిర్వహణలో ఆడంబరం మాకు ఇష్టం లేదు.అలా చేసుకుంటూ పోతే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందుముందు భారమౌతుందని చాలా జాగ్రత్తగా వ్యవహరించే వాళ్ళం.

ప్రతి పదేళ్లకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చాము. ప్రస్తుతం ఈ విలువ అయిదు వేలు అయింది.సభా ఖర్చులు కూడా బాగా పెరిగి పోయి..ఇప్పుడు ఏడాదికి ఎంత నిరాడంరంగా జరుపుకున్నా ముప్ఫై నుంచీ నలభై వేలు అవుతోంది.

మా పిల్లలు పెరుగుతూ వస్తుంటే మా ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూవచ్చాము. ఆ సంవత్సరం అవార్డు సభ కష్టమయ్యేది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా అవార్డును నడపాలా? అని నిర్వేదం, ప్రసూతి వైరాగ్యం కలిగేది. మళ్లీ అంతలోనే ఉత్సాహం తెచ్చుకొని  ముందుకు పోతూ ఉంటాను.

అవార్డు నిర్వహణ నాకు సంవత్సరంలో ఆరునెలలు ప్రాజెక్ట్ గా భావిస్తుంటాను. ప్రతియేటా నవంబరు లో మా వార్డు నోటిఫికేషన్ వెలువడుతుంది.

జనవరి 31 వరకు పరిశీలన కోసం ఎంట్రీలను స్వీకరిస్తాను.ఫిబ్రవరి నెలంతా జడ్జిమెంట్.ఈ క్రమంలోనే రాయలసీమ తెలంగాణా, ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల నుండి ముగ్గురు సీనియర్ కవులనుగానీ, విమర్శకులను గానీ న్యాయనిర్ణేతలుగా నిర్ణయించుకొని వారి నుండి అనుమతి తీసుకుంటాను.

వచ్చిన ఎంట్రీలను మూడు బండిల్స్ ప్యాక్ చేస్తాను.స్టూడెంట్స్ ఆన్సర్ పేపర్స్ ఎంత జాగ్రత్తగా సెంటర్స్ కు పంపుతారో నేనూ అలాగే న్యాయనిర్ణేతలకు పంపుతాను.ఈ పని అత్యంత గోప్యంగా జరుగుతుంది.

న్యాయనిర్ణేతలు ఎవరు ఉంటారనేది నాకు తప్ప ఎవ్వరికి తెలియదు.  ముందుగా నేను ఎంచుకున్న న్యాయ నిర్ణేతలను ఫోన్ ద్వారా సంప్రదించి అనుమతి తీసుకుంటాను.

మిగిలిన ఇద్దరు ఎవరు అనేవిషయాన్ని కూడా వారికి చెప్పను. అలా ముగ్గురి నుండి విడివిడిగా అనుమతి తీసుకుంటాను.

అవార్డు విజేతను ప్రకటనతోనే ముగ్గురు న్యాయ నిర్ణేతల పేర్లను కూడా ప్రకటించడం ఒక ఆనవాయితీ గా జరుగుతుంది.

ఇదంతా గోప్యంగా రహస్యంగా జరుగుతుంది. Judges ను ప్రాధాన్యత క్రమంలో వారిని మూడు పుస్తకాలను ఎంపిక చేసి, అందులోని ప్రత్యేకత గురించికొన్ని వాక్యాలు రాయమని కోరుతాను.

వారు ముగ్గురూ తొమ్మిది పుస్తకాలను సూచిస్తూ రాసి పంపిస్తారు. అందులో మొదటి స్థానం ఏ పుస్తకానికి వచ్చిందో చూస్తాను.  అలా వచ్చిన పుస్తకాన్ని అవార్డు కోసం ఎంపిక చేస్తాను. స్థానాలు మారినప్పుడు కూడా ఒకే పుస్తకాన్ని ఎంతమంది సూచించారో మళ్ళీ చూస్తాను. అలా చూసి అంచనా వేసి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పుస్తకాన్ని ఎంపిక చేసుకుని అవార్డు విజేతగా ప్రకటిస్తాను.

ఫిబ్రవరి నెల అంతా కూడా జడ్జిమెంట్ కోసం కేటాయించి ఉంటానువారు తమ judgement నాకు పంపే వరకూ వారితో నేను మాట్లాడను.  వారినుంచి రిపోర్ట్ వచ్చాక నిర్ణయాన్ని బట్టి మార్చి మొదటి వారంలో అవార్డు విజేతలను ప్రకటిస్తాను

ఒక వైపు ప్రవేటుగా నా చదువులు, పిల్లల చదువులు, కవిత్వం రాస్తూ పుస్తకాలు వెయ్యడం ఈ ఒక్క జీతంలోనే మాకు చాలా కష్టమయ్యేది.
అయినా సరే..

1982-94 మధ్య కాలం లో, తెలుగు బిఏ లిట్,ఎం.ఏ., చేశాను. 2008లో పిహెచ్,డి, సాధించాను.

2001 నేనెంతగానో ఇష్టపడే తెలుగు లెక్చరర్ గా ప్రమోషన్ పొందాను. నా కార్యరంగం కళాశాలకు మారింది. కడప జిల్లా నుండి ఆనంతపురం జిల్లాకు మారింది.

ఈ కాలం లోనే మేం అనేక ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకుల మధ్య అవార్డును కొనసాగిస్తూనే వచ్చాము.  ఉత్తమ కవిత్వానికి అవార్డు ప్రకటించడంలో ఎక్కడా రాజీపడలేదు. న్యాయ నిర్ణేతల నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తూ వస్తున్నాను.

నాకు కవిత్వమే ప్రధానం. ప్రాంతాలూ, కవులూ కాదు. అలా భావించే వాణ్ణి అయితే నేను 32 మందిలో 15 మంది కవులు తెలంగాణ ప్రాంతం వారికే ఎందుకిస్తాను?. ముగ్గురే రాయల సీమ వారు. మీరొకసారి మా అవార్డు గ్రహీతల లిస్ట్ చూడండి.  ఈ నాటి ప్రసిద్ధ కవులందరూ ఒకనాటి మా అవార్డు విజేతలే.

అవార్డు ఎంపికలో నా పాత్ర ఏమీఉండదు.ముగ్గురు న్యాయ నిర్ణేతల నిర్ణయమే కీలకం.

ఒక్కోసారి న్యాయనిర్ణేతల ప్రాధాన్యతా క్రమం లో కూడా సందిగ్ధత ఏర్పడిన సందర్భాలూ నాకు ఎదురైనాయి.  అప్పుడు నేను స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు అయినా తీసుకొను. ఇలాంటి సందర్భాలు నాకు నాలుగైదు సార్లు ఎదురైంది.

మళ్లీ judges తోనే మాట్లాడి వారి ప్రాధాన్యతను పునః సమీక్షించమని కోరుతాను. మళ్లీ వారు సమయం కోరితే ఇస్తాను.వారి పునః సమీక్ష లో విజేతల్లో స్పష్టత వస్తుంది.

అప్పుడు విజేతను ప్రకటిస్తానే తప్ప,ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కలుగ జేసుకొను. అవార్డు విజేత విషయంలో నా ప్రమేయమంటూ ఉండదు. judges ను ప్రభావితం చెయ్యను. పురస్కారాల్లో "ఉమ్మడిశెట్టి"ఒక ట్రేడ్ మార్క్ గా ఉండాలనేదే నా ఆశయం.

3.       కవిగా మీరు కవులకు అవార్డు ఇవ్వడం పట్ల ఎలాంటి సంతృప్తి కి లోనవుతున్నారు ?

నేను బేసికల్ గా కవిని.కవిత్వ మంటే ప్రాణం.పైగా మేం తరతరాలుగా నిరక్షరాస్యులం. మగ్గమే మా జీవన వేదం.అటువంటి శ్రమజీవుల కడుపున పుట్టాను. ఆ రోజుల్లో వీధి బడిలో అంతో ఇంతో అక్షరజ్ఞానం పొందిన తండ్రికి కొడుకుగా పుట్టడం. నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను.
నా తల్లి దండ్రీ,అన్నదమ్ములు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అందువల్లే నేను నిరుద్యోగి గా ఉన్నప్పుడే రెండు కవితా సంపుతాలు తెచ్చాను.ప్రాచీన,ప్రబంధ, అవధాన సాహిత్యమే రాజ్యమేలే రాయలసీమ గడపలో ధైర్యంగా 23 ఏళ్ల వయసులోనే 'మరోప్రపంచం కోసం' పేరుతో వచన కవిత్వసంపుటి తెచ్చి ప్రాచీన కవిపండితుల ఆగ్రహానికి గురయ్యాను.  అప్పట్లోనే కడప జిల్లాలోని అభ్యుదయ కవులు గజ్జెల మల్లారెడ్డి, వైసివిరెడ్డి, రా రా, సోదుం జయరాం వంటి వారు నా భుజం తట్టి ప్రోత్సహించారు.  తొలి కవితాసంపుటి తోనే కవిగా నా ఉనికిని చాటుకున్నాను.అదే ఉత్సాహం తో మళ్లీ 1981 లో "దివ్యదృష్టి"తెచ్చాను. ఈ పుస్తకానికి రెండు పురస్కారాలు రావడం తో కవి గా సాహిత్యలోకం లో గుర్తింపు వచ్చింది. నిరుద్యోగి గా ఈ రెండు పుస్తకాలు తేవడానికి మా కుటుంబ ప్రోత్సాహమే కారణం. 1982 లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది.
నాకూ, నా కవిత్వానికి, నా కుటుంబానికి ఒక ఆసరా దొరికింది.తర్వాత 84 లో జ్వలనమ్, 87లో తుఫాను ముందటి ప్రశాంతి వచ్చింది.

ఈ దశలో నేను కవిత్వం రాయడమే కాదు, ఉత్తమకవిత్వాన్ని ఎంపికచేసి,  వారిని అవార్డుతో సత్కరించి,ఉత్తేజ పరుస్తూ,ఉత్తమ కవిత్వ నిర్మాణంలో "నేను సైతం" కృషి చేస్తున్న తృప్తి
నాకు మిగిలింది.

4.       అవార్డు ఎంపికలు ఎప్పుడైనా అన్యాయం జరిగింది లేదా న్యాయం జరగలేదు అని మీకెప్పుడైనా  అనిపించిందా?

లేదు లేదు నాకెప్పుడు అలా అనిపించలేదు. నూటికి 95 శాతం అన్యాయమే జరిగింది. కేవలం ఐదు శాతం కొంత అసంతృప్తి అనిపించినా ఎప్పుడూ నూటికి నూరు శాతం న్యాయం జరగక పోవచ్చు నని నా నమ్మకం.

అయితే ఇక్కడ నేనొక మాట చెప్పాలి. కవితా రంగం లోకి అడుగు పెట్టిన కవులు, తొలి కవితా సంపుటితోనే మా అవార్డు విజేతలైన కవులు 17 మంది దాకా వున్నారు.

వారిని చూసి నేనెంతో గర్వంగా చెప్పుకుంటాను.  ఉదాహరణకు 30వ అవార్డు పొందిన శ్రీసుధ మోదుగు,గారిది తొలికవిత్వం"ఆమోహం".

ఇవాళ్టి ప్రామిసింగ్ పోయెట్ గా అందరి అభిమానం పొందుతున్న పుప్పాల శ్రీరామ్ గారి "అద్వంద్వం"తొలి
కవిత్వమే. ఇలా వివరించుకుంటూ పోతే 17 మంది దాకా ఉన్నారు.

మా అవార్డుతర్వాత అదే పుస్తకాలకు మరికొన్ని పురస్కారాలను పొందిన  సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.  అలా తీసుకున్న వాళ్ళు 17 మంది దాకా ఉన్నారు. 88 నుంచీ 2019 వరకు 32 మందికి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ క్రమం లో  ప్రతి అవార్డుకు ముగ్గురు న్యాయనిర్ణేతల చొప్పున ఇప్పటికి 96 మందికి పైగా ప్రసిద్ధ సాహితీవేత్తలు విమర్శకులు కవులు మా అవార్డుకు  జడ్జెస్ గా వ్యవహరించారు. 

వారి నిర్ణయాన్ని కాదని  స్వతంత్రించి ఎప్పుడు నా నిర్ణయాన్ని ప్రకటించుకోలేదు.  అవార్డు పొందిన 33 కావ్యాలలో కేవలం రెండు లేదా మూడు ఇంటి మీద నాకు కొంత అసంతృప్తి ఉంది.  పేర్లు చెప్పను కానీ న్యాయనిర్ణేత నిర్ణయాన్ని బట్టి వాటిని ప్రకటించాల్సి వచ్చింది.
తొలిసారి మా అవార్డు పొందిన వారికి సాహితీ లోకంలో తిరుగే ఉండదనే సెంటిమెంట్ తెలుగు కవుల్లో ఉంది.  వర్తమాన  తెలుగు కవులు మా అవార్డును ప్రతిష్టాత్మక పురస్కారంగా గౌరవిస్తున్నారు.మాకీ సంతృప్తి చాలు.


5.       మీకవితా ప్రస్థానం గురించి,సుదీర్ఘమైన మీ సాహితీ ప్రస్థానం లోమైలు రాళ్ళను గురించి చెప్పండి?

నాకిప్పుడు అరవై ఐదేళ్ల వయసు.  అధ్యాపకుడి గా ముప్ఫై ఐదేళ్లు.  నా సాహితీ ప్రస్థానానికి యాభై ఏళ్ళు. మా అవార్డుకు ముప్పై మూడేళ్లు.  నా జీవితంలో సగభాగం అవార్డులో భాగమైంది.  810 రూ,తో మొదలైన నా ఉద్యోగ జీవితంలో,అవార్డును స్థాపించుకున్నాం.   పైసా,పైసా కూడబెట్టుకొని అవార్డు కోసం వెచ్చించాం. నా కవితా సంపుటాలు వేసుకున్నాం.  1988లో మేం ప్రారంభించిన అవార్డు ప్రతి ఏటా క్రమం తప్పకుండా 2017 నాటికి 30 ఏళ్ళు పూర్తి చేరుకోవడం.

మళ్ళీ 30 మంది కవులను ఆహ్వానించి త్రి దశాబ్ది కవితోత్సవాలను ఒక రోజంతా  నిర్వహించడం ..

అవార్డు పొందిన 30 ఉత్తమ కావ్యాలను  విశ్లేషిస్తూ నేను రాసిన పుస్తకం "మూడు పదులు, ముప్ఫై కావ్యాలు"అదే సభల్లో ఆవిష్కరించడం ముప్ఫై ఏళ్ల నాటికి  దాదాపు పదిహేనులక్షలు అవార్డుకోసం వెచ్చించాం, అయినాబాధ లేదు.
కోట్లవిలువచేసే గౌరవంతో పాటూ "ప్రతిష్టాత్మక పురస్కారం" అన్న కీర్తిని కూడా పొందడం,  ఒక శ్రామిక మధ్యతరగతి కుటుంబం సాధించిన విజయంగామేం భావిస్తున్నాం.

అంతే కాదు ఒక సాధారణ బడిపంతులుగా మొదలైన నా జీవితం తెలుగులో  ఎం.ఏ.,పిహెచ్,డి చేసి, డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు పనిచేసి రిటైర్ కావడం,  2008,09 లో ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్య పుస్తకాన్ని రూపొందించే  ఎడిటోరియల్ కమిటీ లో స్థానం పొందడం,

2003 లో ప్రతియేటా ఆకాశవాణి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే సర్వ భాషాకవిసమ్మేళనం లో తెలుగు కవిగా పాల్గొనడం, బుక్కపట్నం డైట్ ఉపాధ్యాయ శిక్షణార్ధులుగా వచ్చిన  ముగ్గురు యువకులు రెండేళ్లు నా వద్ద కవిత్వ శిక్షణ పొందిన పెళ్ళూరు సునీల్ , సుంకర గోపాలయ్య ,దోర్నాదుల సిద్దార్థ ఈ ముగ్గురూ తెలుగు కవులు గా గుర్తింపు పొందుతూ ఉండడం, వారే నామీద గౌరవం తో "డా. రాధేయ కవితా పురస్కారం" గత పదేళ్లకు పైగా  విజయ వంతం గా నిర్వహిస్తూ ఉండడం,  చేనేత కార్మికుల జీవన విషాదాన్ని చిత్రించిన తొలిసరిగా  దీర్ఘ కావ్యం గా "మగ్గం బతుకు" రాయడం,. ఈ కావ్యం నాకు గొప్ప కీర్తిని సంపాదించి పెట్టడం,  ఈ కావ్యం తెలుగు హిందీ భాషల్లో అనువాదం కావడం , ఈ కావ్యం మీదనే , ఎస్కేయు లో, ఎస్వీయు లోరెండు  ఎం ఫిల్. లు రావడం,  నా సమగ్ర కవిత్వం మీద ఎస్కేయు లో పిహెచ్.,డి చేయడం .. ..ఇవన్నీ నేను సాధించిన మైలు రాళ్లే..


6. సాహితీ విమర్శకుడిగా మీరు చాలా విలువైన పుస్తకాలు రచించారు కదా వాటి గురించి చెప్పండి.

1978 లో కవిగా తొలి కవితా సంపుటి "మరో ప్రపంచం కోసం"  తో నా ప్రస్థానం  మొదలైంది.
తరవాత ప్రతి మూడేళ్ళ వ్యవధిలో ఒక పుస్తకం తెచ్చాను.2009 నాటికీ ఎనిమిది కవితా సంపుటాలు తెచ్చాను.
తర్వాత కవిత్వవిమర్శకుడిగా,విశ్లేషకుడిగా,ఆధునిక కవిత్వం లో వస్తు, వైవిధ్య విశ్లేషణ లో భాగంగా వరుసగా నాలుగు సంపుటాలు తెచ్చాను.
అవి..
కవిత్వం ఓ సామాజిక స్వప్నం..2011
కవిత్వం ఓ సామాజిక సంస్కారం..2012
కవిత్వం ఓ సామాజిక సత్యం..2013
కవిత్వం ఓ సామాజిక చైతన్యం..2015
ఇది సరికొత్త ప్రయోగం..
ఈ నాలుగు సంపుటాల్లో ..విభిన్న వస్తు పరంగా 500 మంది కవులు రాసిన 1200 కవితల్ని , ఉదాహరణలతో విశ్లేషించాను.గతంలో విడి విడి గా కొన్ని వ్యాసాలైతే వచ్చాయి గానీ ఇంత విస్తృతంగా విశ్లేషణ జరగలేదు. మా అవార్డు కు వచ్చిన ప్రతి పుస్తకాన్ని చదవడమే ఈ పుస్తకాలు రాయడానికి దోహద పడ్డాయని చెప్పవచ్చు.
తర్వాత...వర్తమాన సీనియర్ కవుల కవయిత్రుల సమగ్ర కవితా ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ రెండు భాగాలు తెచ్చాను.
అవి...
అవగాహన..2017
వివేచన.......2020
విశ్లేషణ....రావాల్సి ఉంది
ఈ మూడు సంపుటాల్లో  50 దాకా సీనియర్ కవులు,కవయిత్రులు ఉంటారు.

మా అవార్డు పొందిన 30 ఉత్తమ కావ్యాలమీద నేను రాసిన విశ్లేషణాత్మక గ్రంథం..
మూడు పదులు ముప్ఫై కావ్యాలు 2018 లో వచ్చింది.
కవిత్వ విమర్శకుడిగా నేను రాసిన పుస్తకాలు ఇవి.. 

7.       అవార్డు సభలు పెద్ద ఎత్తున. నిర్వహించడం, వెనుక గలమీస్నేహితులు కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి?

మా అవార్డు సభలు భారీగా ఉండవు పెద్ద ఎత్తున జరగవు ఆడంబరంగా జరగవు అవార్డు మీద ఉన్న అభిమానంతో అలా అనుకుంటారు , అంతేకానీ అది వాస్తవం కాదు ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అనగా పదేళ్లు,(దశాబ్ది సభ) ఇరవై ఏళ్ళు,(ద్వి దశాబ్ది) 25ఏళ్లకు( రజతోత్సవం) 30ఏళ్లకు(త్రి దశాబ్ది) ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వచ్చామే తప్ప ఆర్భాటం లేదు. త్రి దశాబ్ది ఉత్సవం మాత్రం ఒకరోజంతా ఒక చరిత్ర గా నిర్వహించాను. ఇందులో ప్రతి పైసా నాజీతం తో, 2013 నుంచీ నా పెన్షన్ తో.
ఇందులో స్నేహితుల,బంధువుల, అన్నదమ్ముల ఆర్థిక సహాయంగానీ నేను ఎవరి నుండీ ఏనాడూ ఆశించలేదు. ఇది కేవలం నా కుటుంబం పక్షాన్నే జరగాలి.అనే ఆశయమే పునాదిగా మా అవార్డు ఏర్పడింది.  దీనికి వెనుకా ముందు నేనూ,మా శ్రీమతి ,మా పిల్లలు తప్ప వేరెవరూ లేరు.
నాకు బతుకు తెరువుకు ఉద్యోగముంది.
ఈ సమాజం రచయితగా నన్ను గుర్తించి గౌరవిస్తోంది.
ఈ సమాజానికి , సాహిత్యానికి, తోటి కవులకు నాకున్నంతలో నాకు చేతనైనంత ఏమైనా చెయ్యాలి.  ఎవరికోసమోఎదురుచూడ కూడదు. ఎవరినుండి ఏమీ ఆశించ కూడదు.
ఇదీ నా ఆశయం.  నా సంకల్పంతోనే మా పురస్కారం నడుస్తోంది.
ఈ నిబద్ధత దాటి వెళ్ళను. భవిష్యత్తులో అనుకోని విపత్కరస్థితిలో మా అవార్డు ఆగిపోయినా సరే. పురస్కారాల్లో ఒక చరిత్ర గానిల్చిపోవాలి.
8.       మీ సాహితీ కుటుంబం చాలా పెద్దది కదా మీకు ఇంత మంది ఆత్మీయులతో అనుబంధం ఎట్లా ఏర్పడింది.?

మా పురస్కారం పొందిన ప్రతి కవినీ కవయిత్రిని మా కుటుంబ సభ్యులుగా, మా ఆడపడుచులుగా మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం.మొదట మేమిద్దరం, మాకు ముగ్గురు,ఇదీ మాకుటుంబం. ఇప్పుడు మా కుటుంబ సభ్యుల సంఖ్య మా అవార్డు గ్రహీతల తో కలిసి 5+33=38 మంది అయ్యారు అంతేకాదు ప్రతి ఏటా మా సభ్యుడు ఒకరు పెరుగుతూనే ఉంటారు వారికి మా గౌరవ మర్యాదలు ఎప్పుడూ ఉంటాయి ఇది ఇది మా దంపతులం చేసుకున్నా నిర్ణయం ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది.ఎందుకంటే అవార్డు ఇచ్చి వదిలేయం, వారిని మర్చిపోలేం, వారితో మా అనుబంధం కొనసాగుతూనే ఉంది.  రోజూ కనీసం ఒకరిద్దరైనా మాతో మాట్లాడుతూనే ఉంటారు.  వారి ఆనందాలే కాదు కష్టాలూ,  కన్నీళ్లూ మాతో
పంచుకుంటూనే ఉంటారు.  ఓ సినీ కవి అన్నట్లు జగమంత కుటుంబం మాది. కవి లోక కుటుంబం మాది.  వారూ అలాగే మమ్మల్ని గౌరవిస్తున్నారు,మేమూ వారిని అంతే ప్రేమిస్తున్నాం.
9.   అవార్డు ప్రక్రియ కు సంబంధించి ఇటీవల 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు' గా మార్చారు కదా ఆ క్రమం గురించి చెప్పండి?

సత్యాదేవి నా భాగ స్వామిని.నేను నిరుద్యోగిగా పేదరికం అనుభవిస్తున్న కాలం లోనే తాను 1979 లో నా భార్యగా నాతో జీవితాన్ని పంచుకొంది. మా ఇంటి నాల్గవ కోడలిగా"ఉమ్మడిశెట్టి సత్యాదేవి" మారింది.

తాను హైస్కూల్ విద్య వరకే చదువుకుంది. సాహిత్యం పట్ల అవగాహన లేదు. కవిత్వమంటే  తెలియదు. అప్పటికే యువకవిగా గుర్తింపు తెచ్చుకున్న నన్ను భర్తగా ప్రేమించినట్లే నా కవిత్వాన్నీ అంతగానే ప్రేమించింది.

నా నిరుద్యోగానికి దిగులు పడలేదు.  మరో మూడేళ్ళ తర్వాత అంటే 1982 లో  నాకు ఉపాధ్యాయునిగా ఉద్యోగ మొచ్చింది. దిగువ మధ్యతరగతి ఇల్లాలి గా నాతో పాటు పల్లె కాపురం చేసింది.

1988 లో కవిత్వానికి మన కుటుంబం పక్షాన ఒక అవార్డు స్థాపించి ప్రతియేటా ఒక కవిని సత్కరించుకుందాం. నా భార్యగా నీ అనుమతి కావాలి ఇస్తావా? అన్నప్పుడు మారు మాట్లాడకుండా సంతోషంగా అంగీకరించింది.

అంతే కాదు, సంసారంలో పొదుపు చేసుకొంటూనే తీరిక సమయంలో మిషన్ కుట్టి కూడా ఆర్థికంగా అవార్డు కోసం శ్రమపడింది. కవులకు ఆతిధ్యం ఇచ్చి నాకు తోడ్పడింది.

అంతే కాదు, నాకు 58 ఏళ్ళు వచ్చేసరికి  అవార్డుకు 25 ఏళ్ళు వచ్చాయి. మా బతుకులోకి కష్టాలూ, కన్నీళ్లూ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, బాధ్యతల మధ్య తాను అనారోగ్యంతో ఎదురీదుతూనే  నాకు సంపూర్ణంగా సహకారం అందిస్తూ వచ్చింది.

జీతంతో పాతి కేళ్లుగా అవార్డు నడిచింది.  ఇకపై పెన్షనే మాకు ఏకైక ఆధారం. తనిప్పుడు కష్టపడ లేదు. అవార్డు రజతోత్సవసభ బాగా నిర్వహించాము. అదే ముగింపు సభ గా భావించి అవార్డు విరమణను ప్రకటించాను. ఊహించని విధంగా తాను సభ ముందుకొచ్చి,నా చేతిలోని మైకు అందుకొని, మా ఆయన చెప్పినట్లు మా కష్టాలెన్ని ఉన్నా,  ఆర్థిక ఇబ్బందులున్నా మా అవార్డును ఇంకా కొంతకాలం కొన సాగిస్తామని నేను ప్రకటిస్తున్నాను.

మా ఆయన ఆనందమే నాకు కావాలి. ఆయనకు సహకరిస్తాను అని సభా ముఖంగా ప్రకటించడం సభ మొత్తాన్ని ఆశ్చర్యంతో, ఆనందంతోముంచెత్తింది.

ఒక సామాన్య ఇల్లాలిగా భర్త ఆశయం తన భర్తకోసం ఇంతగా పరితపించి, త్యాగం చెయ్యడం ముఖ్యంగా మధ్య తరగతి గృహిణుల్లోమనకు కనిపించరు.
ఈమెను నా అదృష్టదేవత గా భావిస్తున్నాను.

అలా మరో ఐదేళ్లు కొనసాగిన మా అవార్డుకు 30 ఏళ్ళునిండాయి..ఈ మధ్యకాలం లో మా శ్రీమతి బెంగుళూరు లో రోడ్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి గెలిచింది. కానీ ఆమె మెమరీ మీద తీవ్ర ప్రభావం చూపింది.

మా చెన్నైలో మా బాబు దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. నేనేమో అనంతపురం లో మా అమ్మాయి దగ్గర ఉండిపోయాను. ఇంతలోనే అవార్డు 30 ఏళ్ల సభ రానే వచ్చింది.

ఏం చేయాలిప్పుడు? ముందుగా అనుకున్న ప్రకారం 30 మంది అవార్డు గ్రహీతల్ని ఆహ్వానించి ఒక రోజంతా ఉత్సవాలు నిర్వహించి అంతటితో ముగిద్దామని నిర్ణయించుకన్నాం.  అందర్నీ పిలిచి ఒక రోజంతా జరపడానికి మా దగ్గర ఆర్థిక వనరులు లేవు.ఇంతకాలం ఒంటి చేత్తో నిర్వహిస్తూ వచ్చాము. ఇంత భారీగా ముగింపు పల్కడం నాకు నచ్చలేదు.

ఏదో 30వ అవార్డు ప్రదానం చేసి, ముగింపు పలకాలని నేనంటే తను ఒప్పుకోలేదు. మన బిడ్డకు పెళ్లి చేశామనుకొని ఈ సారి చేద్ధాం.
మీరు రిటైర్ అయ్యాక కొంత అమౌంట్ బ్యాంక్ లో ఉందికదా. అందులో తీసి ఖర్చుపెట్టండి. ఈ సారికి నాకోసం పెట్టండి. ఇంక మనేద్దాం అనే సరికి నాకు మతి పోయింది.
“ఇదేమిటి సత్యా, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం .ఈ స్థితిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటే ..ఎలా?అన్నాను.

“ఏం పర్వాలేదు. మీరింకేం ఆలోచించవద్దు నా కోసం చెయ్యండి..”అంది
త్యాగానికైనా ఒక హద్దంటూ ఉండాలి.  తనకు మాలిన ధర్మం..సామెతయ్యింది. నాకు లోలోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం భయం భయంగానే ఏర్పాట్లు ప్రారంభించాను.

ఆ రోజు రానే వచ్చింది. సభలు ఉదయం నుండి రాత్రి వరకూ ఏకధాటిగా కొనసాగాయి. మధ్యలో లంచ్ బ్రేక్ తో.

ప్రారంభోత్సవ సభలో తాను ప్రసంగిస్తూ  అవార్డు గ్రహీతలనందరిని మా కుటుంబ సభ్యులు గా సంభోదిస్తూ ఆనందంతో భోరున ఏడ్చింది. మొత్తం సభ అంతా కంటతడి పెట్టించింది.

“ఇంకమేం చేయ్యలేము, మమ్మల్ని క్షమించండి” అంది. ఆయన శిష్యులు ముగ్గురూ పూనుకుంటే మా అవార్డు కొనసాగుతుందని మరోవైపు ఆశాభావాన్ని ప్రకటించింది.

ఆ రోజు అందరూ తన గురించే మాట్లాడుకున్నారు. ఇంత గొప్ప త్యాగమూర్తిని భార్యగా పొందడం నిజంగా మన రాధేయ అదృష్టం అన్నారు.

అలా సభలు ఎంతోవైభవంగా, ఉత్సాహంగా జరిగిపోయాయి.  మరో మూడు నెలలకు హార్ట్ అటాక్ తో తాను నాజీవితంచీ నిష్క్రమించింది. నన్ను ఒంటరిగా మిగిల్చింది.

39 ఏళ్ళు నన్నూ, నా కవిత్వాన్నీ,మా అవార్డును నడిపించి వెళ్లిపోయిన నా సహచరికి నేనేమివ్వగలను మీరే చెప్పండి? నన్ను నడిపిన నా సహచరి ఇకపైన తానే ఓ చరిత్రగా మిగలాలి.
అందుకే...31వ సభ నుంచీ మా అవార్డు 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు' గా తన స్మృతిలో కొనసాగిస్తున్నాను.
ఈ పేరు వెనుక ఇంతటి చరిత్ర ఉంది.
30 ఏళ్ల కవితోత్సవం నిర్వహించాక భవిష్యత్ లో ఈ అవార్డు ఒక ట్రస్ట్ కింద కొన సాగాలని నేను మా శ్రీమతి మరియు కుటుంబ సభ్యులు, మా శిష్యులు డా.పెళ్ళూరు సునీల్, సుంకర గోపాలయ్య, దోర్నాదుల సిద్దార్థ లతో కలిసి "ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్"( రి.నెం.23/2018) పేరుతో రిజిస్ట్రేషన్ చేశాము.


10.     సాహిత్య జీవితంలో మీరు బాగా సంతృప్తికి లోనైన సందర్భం గురించి చెప్పండి?

ప్రతియేటా అవార్డు పేరుతో మేము ప్రమోట్ చేస్తున్న కవులంతాఈనాటి సమాజ ఈ పరిణామానికి ప్రతీకలు గా నిలిచి కవిత్వం రాస్తున్నారు ఈ కవులంతా ప్రజా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నారని పిస్తుంది.

మీరు ఒక్కసారి మా అవార్డు విజేతల లిస్టును పరిశీలించి చూడండి ఈనాడు బాగా కవిత్వం రాస్తూ సాహిత్యంలో గుర్తింపు పొందిన వారంతా ఒకనాటి మా అవార్డు గ్రహీతలు నని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.

వీరంతా మొదటి ప్రయత్నంలోనూ లేదా రెండో ప్రయత్నంలోనూ ప్రయత్నించి మా అవార్డులు పొందిన వారే. వీరి పట్ల నాకెంతో సంతృప్తిగా ఉందని తెలియజేస్తున్నాను.

అందరి పేర్లుఇక్కడ ఉటంకించ లేను గానీ, పాపినేని శివశంకర్ గారైతే నేమి, అఫ్సర్ గారైతే నేమి, నాళేశ్వరంశంకరం గారైతే నేమి, శిఖామణి గారైతే నేమి,దర్భశయనం గారైతే నేమి, కొండేపూడి నిర్మల గారైతే నేమి, ఇలా పేర్లు చెప్పుకుంటూపోతే చాలాపెద్ద లిస్టే ఉంది.


11.        మిమ్ములను విచారానికి గురి చేసిన సాహిత్య సందర్భాల గురించి చెప్పండి?

నేను నా కవిత్వం పట్ల, మా అవార్డు పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నానో అంతే అసంతృప్తికి, విచారానికి గురి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే నాకు మిత్రుల సంఖ్య కంటే అనుకూల శత్రువుల, అసూయాపరుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోంది.

చాలా మంది కవులు పైకి బాగా సాఫ్ట్ గా,కనిపిస్తారు గానీ వాళ్ళ అంతర్ముఖాలు భిన్నంగా ఉంటాయి. నేనెంత నిష్పాక్షి కంగా, నిబద్ధతతో వ్యవహరిస్తున్నా ,నాలో,న్యాయనిర్ణేతల్లో లోపాలు ఆరా తీస్తూనే ఉంటారు.
ఎన్ని సార్లు పాల్గొన్నా మా అవార్డు వారికి రాలేదన్న అసంతృప్తిని ఏదో విధంగా పరోక్షంగా వ్యక్తం చేస్తూ ఉంటారు.

నేను వారి పేర్లను ప్రస్తావించను గానీ  నన్ను బాగా వేదనకు గురిచేసిన వ్యక్తులు, సందర్భాలు చాలా ఉన్నాయి.పైకి చెప్పుకోలేనుఎవరి సంస్కారం వారిది అని సమాధాన పడుతుంటాను.

నేను సీనియర్ కవిని కదా దాదాపు పదేళ్లుగా మీ అవార్డుకు నా పుస్తకాలు పంపిస్తున్నా మీరు నా వైపు చూడడం లేదు? ఎందుకు?

నా మీద ప్రేమ కలగాలంటే నేనేం చేయాలి?  మీకు తెలంగాణ కవులు అంటేనే ఇష్టం, రాయలసీమ కవులను ఎందుకు పట్టించుకోరు? ఎందుకుమీకు ప్రాంతీయ అభిమానం లేదా? మన సీమలో మంచి కవిత్వం లేదా? ఇలా అనేక విమర్శలు నన్ను చుట్టు ముడుతూ ఉంటాయి.

అప్పుడు నాకు బాగా నిరాశ కలుగుతూ ఉంటుంది. అయ్యో నేను ఎందుకు ఈ పురస్కారం పెట్టాను? మంచి మిత్రులంతా అనుకూల శత్రువులు గా మారిపోతున్నారు
ఈ విశ్రాంత జీవితం లో అన్నీ వదిలేసి హాయిగా కవిత్వం రాసుకుంటూ ఉంటే చాలు, ఎందుకు ఈ పురస్కారం పెట్టానుఅని చాలాసార్లు  మథన పడ్డాను.

నా జీవితంలో సగ భాగం ఈ అవార్డు నిర్వహణ తోనే సరిపోయింది. మానసికంగా, ఆర్థికంగా, కూడా నేను చాలా నష్టపోయాను.
అవార్డు అందరూ ఆశిస్తారు కానీ నేను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇస్తాను కదా.
అవార్డు విజేతలను ప్రకటించిన ప్రతిసారీ కనీసం నాకు కనీసం పది మంది శత్రువులను పెరుగుతూ ఉంటారు.

అయితే కాంప్రమైజ్ కావడానికి నాలోని అంతరాత్మ అంగీకరించదు. నిందలైనా  భరిస్తాను గానీ రాజీ పడలేను.
ఆర్థికంగా, శారీరకంగా అలసిపోయినప్పుడు అవార్డు నైనా ఆపేస్తాను గానీ కవిత్వ విలువలకు
అపఖ్యాతి రానివ్వను.

ఈ శత్రు బాధను భరించలేక 25 ఏళ్లకు  విరమణ ప్రకటించాను.  మా శ్రీమతి మరో ఐదేళ్లు చేద్దాం అంది.  30 ఏళ్ళు సభలోనే  విరమణ ప్రకటించాను.   కానీ తాను హఠాత్తుగా నా జీవితంలోంచీ నిష్క్రమించడంతో ఆమె స్మృతిలో కొనసాగిస్తూన్నాను.

మరి ఇలా ఎంతకాలం, నిర్వహించగలనో ఏమో?  మున్ముందు అవార్డే తన భవిష్యత్తును తానే నిర్ణయించుకొంటుంది.   అయితే ఈ అవార్డు ద్వారా నేను పొందిన గౌరవం అటుంచితే..
పొందిన అవమానాలు,నిరసనలుకూడా ఎక్కువే..
35 ఏళ్లపాటు అధ్యాపక రంగంలో ఉండి  గురువుగా పాఠాలు చెప్పి విద్యార్థుల్లో  సాహిత్య స్ఫూర్తి నింపినా, ఏనాడూ ప్రభుత్వ మెప్పు పొందలేని శుద్ధ సాహిత్య జీవిని నేను.

కవిగా ,విమర్శకుడి గా విలువైన పదహారు పుస్తకాలు రాసిన కనీసం  తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుకు నోచుకోలేక పోయిన కవిత్వ ప్రేమికుణ్ణి.  అందుకు బాధలేదు జాలి తప్ప.

అన్ని గుర్తింపుల వెనుకా రాజకీయమే  పనిచేస్తుంది. ఒక్క "ఉమ్మడిశెట్టి" మాత్రమే నూటికి నూట యాభై పాళ్లు ప్రతిభను గుర్తిస్తుంది, గెలిపిస్తుందివిజేతగా ప్రకటిస్తుంది..

12.       కవిత్వ రచనలో యువకవుల ప్రభావం ఎంతవరకు ఉందికొత్తగా రాస్తున్న వాళ్ళలో మహిళల పాత్ర ఎంత వరకు ఉంది?

వర్తమాన తరం లో నలభై శాతం మంది యువకవులు అద్భుతంగా కవిత్వం రాస్తున్నారని మాత్రం చెప్పగలను.  అభివ్యక్తిలో కొత్త కొత్త కోణాల్ని దర్శింప జేస్తున్నారు.

అరవై శాతం మంది గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు.  పూను స్పర్థలు విద్యలందే  వైరములు వాణిజ్య మందే.. అన్నాడు కదా గురజాడ.   అది మర్చి పోయారు ఈ యువకవులు.
వీరికి తక్షణ గుర్తింపుకావాలి. సీనియర్ల కవిత్వం చదివరు. కొత్త కోణాల్ని పట్టుకోలేరు. పైగా చాలా సంస్థలు
వీరికి బాగా ఆశలు కల్పించి ఉదారంగా బిరుదులు, పురస్కారాలు, ప్రశంసా పత్రాలతో ముంచేస్తున్నారు.

చాలామంది ఒక పుస్తకం కూడా రాయక ముందే శ్రీ శ్రీ లు, గురజాడలు, గిడుగులు అయ్యారు.  వీరిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది .

మీరు ఎప్పుడూ గుర్తింపు కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.పైగాఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. కొంతమంది ఒకటి, రెండు పుస్తకాలు వేస్తూనే పేరుకు ముందు డాక్ట"రేట్లు"తగిలించుకుని ప్రచారం పొందడం చూస్తే జాలి కలుగుతూ ఉంటుంది.  యూనివర్సిటీల్లో  ఏళ్ల తరబడి పరిశోధనలు పి,హెచ్,.డి లు చేసినవారుకూడా ఇంత గుర్తింపు కోరుకోరు.

ఒకవేళ నాలాంటి వారు ఎవరైనా యువకవుల కవిత్వం పట్ల ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని సహృదయంతో స్వీకరించ లేరు. పైగా నేనేమో అసూయతో కామెంట్ చేస్తున్నానని, యువకుల్ని ప్రోత్సహించడం మాని నిరుత్సాహ పరుస్తున్నానని బాధ పడిపోతుంటారు.

నా దృష్టిలో కవిత్వం ఇంకా మార్కెట్ కాలేదని నేను నమ్ముతున్నాను కానీ వీరివల్ల ముందు ముందు ఆ ప్రమాదం ఏర్పడుతుందేమో నని నా బాధ.

నిజం చెప్పనా..  మా అవార్డు పొందినవారిలో తొంభై శాతం మంది యువకవులేనని వీరికి తెలియదు కాబోలు.

నాకు యువతరం పట్ల పెద్ద ఆశలున్నాయ్. గొప్పగా రాస్తున్న కవులను చూసి ఎంతగానో గర్వపడు తుంటాను.

శ్రీ శ్రీ అన్నట్లు..
రావోయ్ యువకవీ
సైక్లోన్ లేదా వస్తావో
సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా వస్తావో
రావోయ్ యువకవీ...
నా దృష్టిలో...
ప్రతిభావంతులైన యువతరం
భవిష్యత్తరానికి గొప్ప వాగ్ధానం

యువతరం మహిళా రచయిత్రులు కూడా మంచి థీమ్ ,సరి కొత్త అభివ్యక్తి తో ముందుకొస్తున్నారు
మహిళలు స్త్రీ వాదాన్నే రాయాలి,అనే లక్ష్మణ రేఖ గీసు కోకుండా వినూత్న శైలిని అందిపుచ్చుకుని కవిత్వం రాస్తున్నారు,కథలు రాస్తున్నారు.   అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటు న్నారు, నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం.

13.       విద్యార్యులు కవిత్వం లో చేరువ కావాలంటే వారు ఏం చెయాలి?

వారికంటే ముందు వారికి తరగతి గది లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులుఅధ్యాపకులు వారిలో ముందుగా సాహిత్యంపట్ల అభిరుచి కల్గించాలి.  సాహిత్య ప్రక్రియల పట్ల అవగాహన కల్గించాలి.ఆపైన వారికి కొన్ని కవితా, కథల వస్తువుల నిచ్చి వారిలోని సృజననాత్మకను ప్రోత్సహించి  సరిదిద్దాలి.

ఈ పని ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి లో ఉన్న కవులు రచయితలు పూనుకోవాలి.పాఠ్యపుస్తకాంశాలతో
పాటు కవితలు,కథలు గురించి రచయితల గురించీ పరిచయం చేస్తూ  వారిలో రచనాసక్తిని కలిగించాలి.

నా వరకు నేనెక్కడ పనిచేసినా అక్కడ కవులను తయారు చేశాను.వారు ఆగిపోలేదు.ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు.  వారిలో చాలా మంది తెలుగు పండితులు గా, అధ్యా పకులుగా కొనసాగుతున్నారు.ఈ భాధ్యతను ముఖ్యంగా మన రచయితలు తలకెత్తు కోవాలి.

14.       కవిగా,సాహిత్య విమర్శకుడిగా,అవార్డు స్థాపకుడిగా మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?

నాకు గొప్ప గొప్ప ప్రణాళికలు ఆశయాలు ఏముంటాయి చెప్పండిపేదరికం తో మొదలైన జీవితం నాది సామాన్య ఉపాధ్యాయుడిగా జీవితం గడుపుకుంటూ, కవిత్వం రాసుకుంటూ, పుస్తకాలు వేసుకుంటూ, ఉన్నంతలోనే ,నా శ్రీమతి తోడ్పాటుతో కవిత్వం కోసమే ఒక అవార్డును స్థాపించు కొని ఏ ఆటంకం లేకుండా గత 32 ఏళ్ల పైబడి నిర్వహిస్తూ వస్తున్నాను. ఇప్పుడేమో కేవలం పెన్షన్ తో జీవితాన్ని గడుపుతున్నాను.

నా కంటూ ప్రత్యేకమైన ఆర్థిక వనరులు ఏమీ లేవు ఉన్నంతలో ఏదో కవిత్వం రాసుకుంటూ ఈ అవార్డును కొనసాగిస్తాను.ఇలా ఒంటరిగా ఎంతకాలం కొనసాగించగలనో  భవిష్యత్కాలమే నిర్ణయించాలి.

ఈ అవార్డు ద్వారా భవిష్యత్ తరానికి గొప్ప కవులను పరిచయం చేశానన్న సంతృపి నాకు చాలనుకుంటున్నాను.

ఒక కవిగా గుర్తింపు ఉంది.విమర్శకుడి గా  కొంత పేరుంది. తెలుగు కవులకు "ఉమ్మడిశెట్టి" ఒక ప్రతిష్టాత్మక పురస్కా రం గా గొప్ప పేరుంది.ఇది కొనసాగినంత కాలం నా నిజాయితీ లోనిబద్ధతలో
లోటు రానివ్వను.

15.       ఇంకేమైనా చెప్పండి?

రచయితలకు గానీ,రచయితల్ని గుర్తించే సంస్థలకు గానీ, నిజాయితీ,నిబద్ధత, వ్యక్తిత్వ సంస్కారం అనివార్యం గా ఉండాలి.
ఈ నాడు తెలుగు నాట వందల సంఖ్యలో అవార్డులు,పురస్కారాలు, సంస్థలు ఉన్నాయి. తమ గుర్తింపు కోసంకాకుండా సాహిత్య లోకంలో గుర్తింపును పొందాలి. పారదర్శకంగా ఉండాలి.  చాలా సంస్థలు ..ఇచ్చి పుచ్చుకోవడం లోనూరాజకీయ నేతల అభిమానం కోసమో,పనిచేస్తూ,ప్రచారంలో ముందుంటాయి.

ఇస్తి నమ్మా వాయినం...పుచ్చుకుంటి నమ్మా వాయినం.. అన్నతీరుగా ఉంటాయి...ఈ తీరు మారాలి. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా స్వతంత్రంగా, జవాబుదారీగా నడుచుకోవాలి.

ఈ పురస్కారం, గౌరవం, స్థాపన, నిర్వహణ అంతా వన్ మ్యాన్ ఆర్మీగా  భావించినా నాకు అభ్యంతరం లేదు.  చాలా మంది పెద్దలుసాహితీ వేత్తలు ఈ సంస్థలో గౌరవ సభ్యులుగా ఉంటామనిఅవార్డు బహుమతి మొత్తాన్ని పెంచేందుకు ఆర్థికంగా సపోర్టు ఇస్తామని అందుకు అనుమతించమని కోరారు..నేను వారి అభ్యర్థనను సున్నితంగానే తిరస్కరించాను.  ఒక కవి కుటుంబం మరొక కవిని గుర్తించి గౌరవించే సంస్థ ఇది. నిబద్ధత,నిజాయితీ, అంకిత భావంతో ఈ సంస్థ కోసాగుతుంది అని ధీమాగా ప్రకటిస్తున్నాను.

 

 

{రాధేయ జీవన రేఖలు:

డా.ఉమ్మడిశెట్టి రాధేయ .కవి,విమర్శకులు

01.05.1955 న కడపజిల్లా ముద్దనూరు

మండలం లోని యామవరం గ్రామంలో

ఒక సామాన్య దిగువ మధ్యతరగతి చేనేత కుటుంబంలో జన్మించారు.

వీరి తల్లి దండ్రులు ఉమ్మడిశెట్టి గంగిశెట్టి, శ్రీమతి నాగమ్మ.

తల్లి దండ్రులు ఇరువురూ చేనేతకార్మికులు.

వీరు ఐదు మంది అన్నదమ్ములు,ఇద్దరు చెల్లెండ్రు. అన్నదమ్ముల్లో ఈయన నాలుగవ వారు.

వీరికి బాల్యం నుంచే ప్రకృతి పట్ల,తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ.వాళ్ళ ఊరు కూడా చుట్టూ కొండ కోనల మధ్య  ప్రకృతి రమణీయంగా కన్పిస్తూ ఉండేది.

బాల్యంలో 4వ తరగతి లోనే మాస్టారు చెప్పిన పోతన పద్యాలను మరుసటిరోజే

చక్కటి వాక్శుద్ధితో అప్పజెప్పి శహబాష్ అనిపించుకున్నారు.

హైస్కూల్ స్థాయిలోనే ప్రకృతి గీతాలు,ప్రణయ గీతాలు,అనుభూతి గీతాలు రాసుకునే వారు.

1972 లో అభ్యుదయ భావాలతో రాసిన తొలి కవిత అచ్చయింది.

1978 లో తొలి కవితా సంపుటి మరోప్రపంచం కోసం కవితా సంపుటిని

తెలుగు కవితా ప్రపంచంలో తనదైన ఉనికిని చాటుకున్నారు. అప్పటికే ఆంధ్రదేశంలో సుప్రసిద్దులైన కవులచేత ప్రశంసలు పొందారు.

ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్ల యూనివర్సిటీ చేరి చదువుకోలేక పోయారు.

1982 లో ఉపాధ్యాయ వృత్తి లో చేరిన తర్వాత స్వయం కృషి తో తెలుగు లో ఎం.ఏ., పి,హెచ్,డి చేశారు.

ఉపాధ్యాయుని గా,జూనియర్ లెక్చరర్ గాడిగ్రీకళాశాల తెలుగు అధ్యాపకునిగా,

తెలుగు శాఖాధిపతిగా తెలుగు భాషకు సేవలందించి 2013 లో పదవీవిరమణ చేశారు.ప్రస్తుతం ఆనంతపురం లో స్థిర పడ్డారు.

1988 లో తన ఇంటిపేరు మీద ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ను స్థాపించి గత 33 ఏళ్లుగా,ప్రతి ఏటా క్రమం తప్పకుండా,నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.

ఈ అవార్డు తెలుగు కవులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.ఈ అవార్డు

రావాలని ప్రతి తెలుగు కవి కోరుకుంటాడు.

కవిత్వం రాయడం,కవిత్వం చదవడం,

కవులను గౌరవించడం వీరు తన ఆశయం పెట్టుకున్నారు. }

 

 

ఇంటర్వ్యూలు

పిల్లలకి కథల పుస్తకాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి – మండువ రాధ 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు మండువ రాధ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         రాధ గారూబాలసాహిత్యంలో రాధ మండువ గారు ఒక ప్రత్యేకమైన రచయితగా గుర్తింపు పొందారు. ఇందుకు దారితీసిన పరిస్థితులు, మీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పండి?

మా ఊరి పేరు మండువవారి పాలెం.  ఒంగోలుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న పల్లె.  పట్టణ వాతావరణం మా ఊర్లో చాలా ఎక్కువే.   నా చిన్నతనంలో మా ఊళ్ళో ప్రతి ఇంటికీ ఒక పత్రిక వచ్చేది.  ఒకరి నించి ఒకరు తీసుకుని వాటిని చదివేవారు.  నేను వాటిని చదివేదాన్ని.  నేను పదో తరగతిలో ఉన్నప్పుడు మా ఊరి కోడళ్ళు (మా బంధువులు)  రోజూ స్కూల్ కి ఒంగోలు వెళ్ళే నా చేత నవలలు అద్దెకి తెప్పించుకునేవారు.  అవి నేను బస్ లో వస్తూనే చదివేసేదాన్ని. 

విపరీతంగా రోజుకి రెండు మూడు నవలలు, పత్రికలు చదివిని రోజులు ఉన్నాయి.  అలా నాకు సాహిత్యం పట్ల అభిలాష కలిగింది.  మావారు కూడా చాలా లోతుగా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన మనిషి కనుక తర్వాత నాకున్న చదివే అభిలాషని రాసే విధంగా మార్చుకున్నాను.  చాలానే రాశాను.  వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 

2.         సాహిత్యంలో మీకు తోడ్పాటు అందించిన వారు ఎవరు ?

కథలు రాస్తాను.  పాఠకులకు నచ్చి చదివి అభినందిస్తే ఉత్సాహం కలుగుతుంది.  కాని నేను మాత్రం నా సంతోషం కోసం రాసుకున్నాను/రాస్తున్నాను అంటాను.  ఏదైనా ఓ విషయం గురించి - అది కథైనా, సమీక్ష అయినా, కవిత అయినా రాసిన రోజు నేను ఆనందంగా ఉంటాను.  అందుకే రాస్తానేమో! తోడ్పాటు అంటే మా వారు పిడూరి రాజశేఖర్ చాలా ప్రోత్సాహం ఇస్తారు. 

3.         బాల సాహిత్యంలో వచ్చిన మార్పులు రావాల్సిన మార్పుల గురించి మీరు ఏమనుకుంటున్నారు?

- ఒకప్పుడు మన ఇతిహాసాలు, పురాణాలు, ప్రబంధాల గురించిన సాహిత్యం లేదు.  ఇప్పటికీ కూడా రామాయణ భారత భాగవత కథలు ఉన్నాయేమో కాని ప్రబంధాల గురించిన కథలు లేవనే చెప్పాలి.

- సంప్రదాయ సాహిత్యం మంచిదే కానీ దేశకాలపరిస్థితులకు తగిన కథలు కూడా రావాలి. 

- బాలసాహిత్యానికి బొమ్మలు చాలా అవసరం అని గుర్తించి ప్రచురించే ప్రచురణకర్తలు దొరకడం కష్టంగా ఉంది.   ఆర్టిస్ట్ లని ప్రోత్సహిస్తూ అందమైన బొమ్మలతో కూడిన బాలసాహిత్యం ప్రచురించే దిశగా మార్పు రావాలి.

4.         వర్తమాన సమాజానికి బాలసాహిత్యం ఎందుకు, ఎంతమేరకు అవసరం అని మీరు భావిస్తున్నారు?

ఈ ప్రశ్న కొంచెం మారుద్దాం.  ఎప్పుడైనా బాలసాహిత్యం అవసరమే.  అది ఎన్నో రకాలుగా పిల్లలకి ఉపయోగపడుతుంది.  పిల్లలు కథలు చదవడమే కాదు వారికై వారు కథలు రాయడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి - </