కథలు

కథలు

ఆయమ్మ అంతే! ఆమె ఒక   మదర్ తెరీసా!

ఎరికిలోల్ల  కతలు -02

 మా నాయన చెమటలు కార్చుకుంటా, గసపోసుకుంటా , సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. సరిగ్గా ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి “  జయమ్మక్కా... ఏమి చెప్పేది ఇట్లా అయిపోయిందే ..ఇప్పుడు నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మా యమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే  వుంటాయి. ఆ మూడూ కలిపి  ఆ యమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం చిన్నప్పుడు ఎప్పుడూ చూడనే లేదు. మా నాయన రూపాయి రూపాయి కూడబెట్టి పదేండ్లకు  అప్పుడు ఒకటి, అప్పుడు ఒకటి  అని కష్టపడి చేపించిన సొత్తు అది.

మా ఇంట్లో ఏ గ్లాసు చూసినా, ఏ ప్లేట్ చూసినా, మంచం, టేబుల్ చూసినా, మేము చదువుకోవడాని రాసుకోవడానికి చేయించిన ఆ కాలం కరణాలు, వి ఏ ఓ లు వాడే చెక్క డస్కులు చూసినా.. మాకు మా నాన్న చెమటా , రక్తమే.. గుర్తుకు వస్తాయి ఎప్పటికీ. మేము తినే ప్రతి అన్నంముద్ద పైన అయన చెమట, రక్తం వుంటాయి అనేది మా అమ్మ. ఒక్క మెతుకు అన్నం కూడా వృధా కాకూడదని అంటుంది.  అందుకే  ఇప్పటికి మేము తినే ప్రతి అన్నం ముద్దకూ ముందు మా అమ్మా  నాయనా గుర్తుకు రాకుండా వుండరు.   

మా  యస్టీ కాలని లోనే అదెందుకో తెలియదు కానీ  ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది మా అమ్మే.. జయమ్మే..! అట్లా అని మేము ఏమీ వుండే వాళ్ళం ఏమీ కాదు. మా నాయన ఒక్కడే చిన్న జీతగాడు.   ఇల్లు మొత్తానికి మా నాయన జీతమే ఆధారం. అందునా మా నాయనకు జీతం చాల తక్కువ. లంచాలు , మామూల్లు  తెసుకునే మనిషి కాదు. ఆయన జీతం ఇంటికి చాలేది కాదు. అయన ఆరోగ్యం బాగా లేక, చిత్తూరు, బెంగళూరు, వేలూరు సి యమ సి., తిరుపతి రకరకాల   ఆసుపత్రులకు తిరగడం, మందులు కొనడానికి అప్పులు చేయడం  మెడికల్ లీవులు అన్ని వాడేసి, జీతం లేని సెలవులు వాడి,మొత్తం మీద సంవత్సరం అంతా వెతికి చూసినా అప్పులు  లేని నెలే  లేదు మాకు.క్యాలండర్  నిండా అప్పులతో, వడ్డీ లెక్కలతో, నిండిపోయేది. మేo ఎప్పుడూ పాత  క్యాలెండర్లు పడేసింది లేదు. మా అమ్మ అందమైన చేతిరాతతో, ఎన్నో అంకెలు, సంఖ్యల తో క్యాలెండర్లు నిండిపోయేవి. ఎక్కడా ఖాళీ అనే మాటే వుండదు.   ఇంటి వద్ద నాకు, మా తమ్ముడికి ఐదో తరగతి వరకూ రోజూ అమ్మే కదా  ట్యూషన్ చెప్పేది. మాకు ఆ క్యాలండర్ లోనే లెక్కలు నేర్పేది. మాకున్న అప్పులు వడ్డీ బకాయిలతోనే  లెక్కలు నేర్చుకున్నాం. మా అప్పులే మాకు ఎక్కాలు,  లెక్కలు నేర్పింది. అట్లా చాలా కష్టాలతోనే మా బాల్యం గడచింది.

ఫారెస్ట్ డిపార్టుమెంటు లో  ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం టార్గెట్ వుంటుంది. అడవిలోకి వెళ్లి మేత మేసే పశువులపైన పన్ను వుంటుంది. అడవి నుండి కట్టెలు తెచ్చి అమ్మే వాళ్ళ నుండి అపరాధం వసూలు చేసి గవర్నమెంట్ కు కట్టాలి. ఆ నెల వచ్చిందటే చాలు మా అమ్మ మొహంలో కళ తప్పిపోయేది. ఎందుకంటే ఆ నెల మా నాయన జీతo తీసుకుని ఆయనకు ఆఫీసర్లు  ఇచ్చిన టార్గెట్  ప్రకారం తను వసూలు చేసి ఉండాల్సిన  మొత్తం అపరాధo కింద  జీతం  మొత్తం ప్రభుత్వానికే  కట్టేసే వాడు.

 “ మేయ్ జయా.. ఈనెల ఇంకా జీతం రాలేదు. లేట్ అవుతుంది, ఎట్లో నువ్వే ఈనెల  సర్డుకోవల్ల  ” అనే వాడు కుశాలగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ. మళ్ళీ ఆయనే అసలు విషయం చెప్పేసి తప్పు చేసిన వాడిలా మా అమ్మ ముందు తల వంచుకునేసే వాడు. చేత్తో బీడీ ని అదే పనిగా నలుపుతూ వుండి పోతాడు కానీ, ఆ రోజంతా మా అమ్మ మొహం చూసే వాడు కాదు.   ఆయనకి కానీ మా అమ్మకి కానీ అపద్దాలు చెప్పేది తెలియదు.మాకు ఎప్పుడూ వాళ్ళు అపద్దాలు చెప్పింది లేదు. మాకు అపద్దాలు చెప్పే అలవాటూ అందుకే రాలేదు.   

           ఒక నెల జీతం రాకపోతే అప్పో సప్పో చేసి ఇల్లు గడుస్తుంది కానీ , ఆరునెలలు పడుతుంది ఆ అప్పు వడ్డీ అంతా తీరి సరిగ్గా కుదురుకోవడానికి. “  ఏం చేసేదమ్మా  ఖర్మ..అందర్లాగా కాదు, మా ఆయన పదకొండు నెలల జీతగాడు” అని మాత్రం అనేది. మా నాయనకు అమ్మ చేతుల్లో జీతం  డబ్బు పెట్టేయడమే తెలుసు. అంతా అమ్మే చూసుకునేది.  మా నాయన చాలా అమాయకుడని, టీ, బీడీ తాగడం తప్ప ఆయనకు ఇంకేమి తెలియదని మేం చిన్నప్పుడు అమాయకంగా అనుకునే వాళ్ళం.  

అయితే మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ఎప్పుడైనా సరే ఆయన వచ్చే సమయానికి ఇంట్లో మా అమ్మ ఉందంటేనే ఆయన ఇంట్లోపలకి వస్తాడు. మా అమ్మ ఇంట్లో లేదంటే, ఇంటి బయటే అరుగు పైన కూర్చునేస్తాడు. నేను, మా తమ్ముడు ఇద్దరం  ట్యూషన్ కి వెళ్లి ఉంటే, ఇంటి బయట మా అమ్మ చిలుకు(గొళ్ళెం ) పెట్టి వెళ్లి ఉంటుంది. చుట్టూ పక్కల ఇండ్లకు వెళ్ళినప్పుడు  ఆమె ఇంటికి ఎప్పుడూ తాళం వెయ్యదు. ఆమెకు తాళంవేసి వెళ్లే అలవాటు లేదు. ఎస్టీ కాలనీలో  మా బంధువుల ఇండ్లన్నీ పక్క పక్క లోనే, కొంచెం ముందూ వెనకా ఉంటాయి. వాళ్ల ఇళ్లకు వెళ్లి రావాలంటే తాళం వేసి  వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని మా అమ్మ అనుకుంటుంది.

ఎక్కడికి వెడుతుందో ముందుగా చెప్పి వెళ్ళే అలవాటు ఆమెకు లేదు.

ఆమె లేకుండా ఇంట్లోపలకి వచ్చే అలవాటు మా నాయనకు లేదు.

ఇంటికి రాగానే కూర్చున్నంత సేపు ఆయన ఇంటి బయటే కూర్చుంటాడు. మూడో నాలుగో బీడీలు ఊది పారేస్తాడు. అప్పటికే ఆయన బాగా అలసిపోయి ఉంటాడు. అడవిలో తిరిగివచ్చినా, చెక్ పోస్టులో డ్యూటీ చేసి వచ్చినా , అటవీశాఖ ఉద్యోగిగా ఆయనకు శారీరక శ్రమ ఎక్కువ. అందునా డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన నేరుగా బస్సు ఎక్కి ఇంటికి చేరడు. బస్సు చార్జీలు పెట్టడం ఆయనకు నచ్చదు కదా, లారీ లోనే ప్రయాణం చేసి వస్తాడు. ఆ మిగిలిన డబ్బులకి ఏ పండో , స్వీటో ఏదో ఒకటి మాకోసం తెస్తాడు కదా. ఖాకి బట్టలు వేసుకుని ఫారెస్ట్ చెక్ పోస్టులో ఆయన చేయి ఊపితే చాలు, ఏ లారీ  అయినా ఆగిపోవాల్సిందే. ఆయన లారీలో చాలా దూరం ప్రయాణించటం వల్ల, బస్టాండ్ వద్ద లారీ దిగిన తర్వాత  ఆయన బరువైన  బ్యాగ్ మోసుకుంటూ చాలా అలసిపోయి చెమటలు కక్కుకుంటూ ఇంటికి వస్తాడు.అప్పటికే అయన బాగా అలసిపోయివుంటాడు.

వయసు కూడా ఎక్కువ కాబట్టి, దగ్గు, ఆయాసం, ఉబ్బసం వల్ల  అయన అప్పటికే గసపోస్తా ఉంటాడు.ఎంత దూరం వెళ్ళినా, ఎంత రాత్రయినా ఇల్లు చేరిపోతాడు. ఆయనకు ఉద్యోగం ఇల్లు, భార్య పిల్లలు తప్ప ఇంకో లోకం తెలియదు.అయన ప్రాణాలన్నీ మా పైనే ఉండేవి .ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా, ఇంకా ఈయన పని అయిపోయిందిలే అని అందరూ అనేసి, తల ఊపేసినా  కూడా  ఎట్లో మళ్ళీ మాకోసమే అన్నట్లు  బ్రతికేసే వాడు. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇల్లు చేరిపోయేవాడు.

ఇల్లు,భార్య,పిల్లలు అంటే ఆయనకు అంత ఇష్టం . శారీరకంగా ఎంత బలహీనుడైనా భార్యా, పిల్లల్ని  ప్రేమించడంలో ఆయన్ను మించిన బలశాలి మాకు తెలిసిన లోకం లో ఇంకెవరూ లేరేమో?!        

అంత అలసిపోయి వచ్చిన వాడికి ఇంటి ముందుకు రాగానే, తలుపులు మూసి ఉండటం గొళ్ళెం పెట్టి ఉండటం  చూడగానే ఆయనకు  ప్రాణం ఉస్సురు మంటుంది. ఎక్కడలేని నీరసం ముంచుకు వస్తుంది. విపరీతంగా కోపం వస్తుంది. మా నాయనకు అట్లా ఇంటికి ఆమె తాళం వేయకుండా వెళ్లడం అస్సలు నచ్చదు.ఆయన వచ్చే సమయానికి మా అమ్మ ఇంట్లో లేకపోవడంతో ఎప్పుడు పెద్ద గొడవ మొదలవుతుంది. తను ఇంటికి వచ్చే సమయానికి, మా అమ్మ ఇంట్లో లేకపోవడం, ఆయనకు కోపం వచ్చే సవాలక్ష కారణాలలో ముఖ్యమైనది.ఆయనకు అసలే కోపం ఎక్కువ. ముక్కు మీదే వుంటుంది కోపం.

మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది." నీ కేమబ్బా.. ఊరికే ఊరికేనే కోపం వచ్చేస్తుంది.అయినా చీమ చిటుక్కుమన్నా కోపం వచ్చే ఇలాంటి ఆగింతం మొగవాడ్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మొగుడు ఇంట్లో కూలి డబ్బులు అస్సలు ఇయ్యడమే లేదంటే , పిలకాయలు ఆయమ్మ పస్తులు ఉండారంటే, పిల్లోల్లకి వయసైపోతా వుంటే కూడా ఇంకా మునిదేవర చెయ్యలేదని పెద్ద గొడవ అయిపోయింది లే.  ఆ కతేందో  మాట్లాడదామని మా ఆడబిడ్డ పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయింటిని అది కూడా తప్పేనా..." అని దీర్ఘాలు తీస్తుంది.

 

చాలాసార్లు నెమ్మదిగానే తన గైర్హాజరికి  మెత్తగానే జవాబు చెపుతుంది కానీ, ఒక్కోసారి మా అమ్మకు కూడా కోపం వచ్చేస్తుంది. “ ఇప్పుడు ఏమైందని  అంత ఆగింతం  చేస్తా ఉండావు? ఇంట్లో లబ్బి ఏమైనా పెట్టిండావా? బంగారం ఉందా? వెండి ఉందా? దుడ్లు ఉండాయా? ముడ్డి చుట్టూరా ముప్ఫయి ఆరు అప్పులు పెట్టుకొని బతకతా ఉంటే ఎవురో వస్తారంట.ఈడుండే సత్తు సామాన్ల కోసం..".

ఆమె కోపంగా చెప్పినాముక్కు చీదతా చెప్పినా, కరుగ్గా చెప్పినా, ఏడుపు గొంతుతో చెప్పినా మా నాయనకి ఆమె ఎప్పుడు ఏం చెప్పినా నచ్చేది కాదు.కానీ ఆమెకు బదులు చెప్పేవాడు కాదు.ఆయన కోపం ఎంత తీవ్రంగా వున్నా సరే , ఆమెకు కోపం వచ్చినప్పుడు అయన పూర్తిగా తగ్గి పోయేవాడు. అట్లా అయన తగ్గిపోవడమే వాల్లిద్దరి అన్యోన్యతకి కారణమేమో .

"మొగోడు అన్యంక చిలుకు తీసి తలుపు తోసి లోపలికి పోయి, బ్యాగు పడేసి, గుడ్డలు మార్చుకుని పంచ కట్టుకోవడం కూడా  తెలీదా ఇంత పెద్ద మొగోనికి? నేను పక్కలోనే వుండి ఏం చెయ్యాలంట? ప్యాంటు విప్పి పంచ కట్టించాలా ?" ఆమె ఎదురుదాడి ప్రారంభిస్తుంది. మా అమ్మ గొంతు పెద్దదయ్యేకొద్దీ మా నాయన గొంతు మెత్తగా మారిపోతుంది. ఆమెకి నిజంగా కోపం వచ్చిన అన్ని  సందర్భాలలో , ఆయన తప్పు వున్నా, లేక పోయినా ఆయన పూర్తిగా తగ్గిపోతాడు.అది మా అందరికీ బాగా తెలుసు.

" మేయ్ జయా.. టీ పెట్టు.." అని మాట మార్చేస్తాడు.

ఆ గొంతులో విన్నపం ఉంటుంది. బ్రతిమాలడం ఉంటుంది. ప్రాధేయ పడటం ఉంటుంది. అభ్యర్థన ఉంటుంది.అన్నిటికీమించి అప్పడా గొంతు ఎంతో తియ్యగా వుంటుంది. ఆ మాటల నిండా ఎంతో  ప్రేమ వుంటుంది. మా నాయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు అనే మాట అది ఒక్కటే.ఆ టీ కూడా చాల వేడిగా పొగలు పోతూ వుండాలి. ముందుగా బాగా  వేడి నీళ్ళతో గ్లాసు నింపాలి.గ్లాసు వేడెక్కాలి..ఆ టీగ్లాసు పట్టుకుంటే చేతివేళ్ళకు వేడి అoటుకోవాలి. టీ చప్పరిస్తే నాలుక చురుక్కుమనాలి. అప్పుడే దాని “టీ..” అంటాడు  మా నాయన.అదీ  టీ అంటే !    

 

ఒకోసారి మా అమ్మ చుట్టుపక్కల ఇండ్లలో కాకుండా కొంచెం దూరం వెళ్లి ఉంటుంది. ఎస్టీ కాలనీలో పందులు మేపే వాళ్ళు ఉన్నారు. బాతులు మేపే వాళ్ళూ ఉన్నారు. ఎర్రమన్ను ముగ్గుపిండి అమ్మే వాళ్ళు ఉన్నారు. వెదురు దబ్బలు  చీల్చి,  చేటలు గంపలు తట్టలు బుట్టలు అల్లిక చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు.

మా అమ్మ వాళ్ళ నాన్న  చిన్నయ్య  అటవీశాఖ లో ఉద్యోగి. 

మా నాయన  వాల్ల నాయనేమో  గాడిదలు మేపే వాడు. అదీ తేడా.!

అడవి నుండి ఎండు కట్టెలు గాడిదల పైన తీసుకొని వచ్చి, ఊర్లో అమ్మడం  మా నాయన వాళ్ళ నాయనకు వృత్తిగా ఉండేది. ఆయనకు పందుల వ్యాపారం కూడా ఉండేది.అయన అస్సలు ఏమీ చదువుకోని వాడు. ఎట్లో ఒగట్లా కష్టపడి  మా నాయన  చదివినాడు కాబట్టి, అప్పట్లో ఫారెస్ట్ గార్డ్ గా ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో ఆయనకి గాడిదలు కాసే పని తప్పోయింది. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఆ చిన్న ఉద్యోగమే లేక పోయి వుంటే మూడేండ్లు మా అమ్మ కోసం ఎన్నిసార్లు  అయన చుట్టూ  తిరిగినా, మా అమ్మను మా నాయనకు  ఇచ్చి మా చిన్నయ్య తాత పెండ్లి చేసి వుండే వాడే  కాదు.అందుకేనేమో మా నాయనకు అడవులు తిరిగే ఆ పని ఎంత కష్టం అనిపించినా, అస్సలు తను చెయ్యలేని పరిస్థితి లో వున్నా సరే ఆ ఉద్యోగం అంటే అంత ఇష్టం.డ్యూటీ నుండి ఇంట్లోపలికి వచ్చి, ఆ బట్టలు తీసి దండెం కు తగిలించాక ఆ గుడ్డలకు అయన రెండు చేతులతో దేవుడ్ని మొక్కినట్లు  మొక్కుకునే వాడు.  ఆ ఖాఖీ బట్టలంటే అంత గౌరవం ఆయనకి .

మామూలుగా స్కూల్లో సరిగ్గా చదవని పిల్లలని  టీచర్లు తిడతా వుంటారు. “ ఏమ్రా ..సరిగ్గా స్కూలుకు రాకపోతే చదువు ఎట్లా వస్తుంది మీకు ? సరిగ్గా సడువుకోక పోతే గాడిదలు కాసే దానికి తప్ప ఇంకా దేనికి మీరు పనికి రాకుండా పోతారు” అని . మా కాలనీలో వుండే పిలకాయలకి మాత్రం  భలే నవ్వు వస్తూ వుంటుంది...ఆ మాటలు వింటా వుంటే .. అయినా అట్లా గాడిదలు కాసే పనో , పందుల్ని కాసే పనో హీనమైనదనో, నీచమైన పని అనో ఎందుకు పిల్లోల్లకి చిన్నపాటి నుండే అయ్యవోర్లు అట్లా తప్పుగా చెపుతారో మాకు అర్థం అయ్యేది కాదు.మాకైతే గాడిదలు గొప్పే, పందులూ గొప్పే.మా ఎరికిలోల్ల ఇండ్లల్లో పందులూ గాడిదలు మాతో బాటే కదా వుంటాయి.మాకు వాటిని తక్కువగా చూడటం మాకు  అస్సలు చేత కాదు.  

ఎందుకంటే  మాఎరికిలోల్లల్లో పందులు మేపినా, గాడిదలు కాసినా, ఉప్పు అమ్మినా, వెదురు బుట్టలు డబ్బాలు, తడికలు అమ్మినా, అడవికి  పోయి ఎండుకట్టెలు కొట్టుకొచ్చి ఊర్లోకి మోసుకొచ్చి అమ్మినా, ఎర్రమన్ను, ముగ్గు పిండి అమ్మినా , పెద్దోల్ల ఇండ్లల్లో ఇంటి పని చేసినా, కూలికి పోయినా ఏం చేసినా మా బ్రతుకేదో మేం బ్రతకడమే మాకు తెలుసు. కష్టపడి సంపాదించడమే తెలుసు కానీ, ఎవురి సొత్తుకు పోవడం కానీ, ఇంకొకళ్ళ సొత్తు వూరికే ఆశించడం కానీ మాకు తెలియదు. గాడిదలు కాసినా, పందులు మేపినా ఆ జీవాల్ని ఎంత గొప్పగా, గౌరవంగా, ఇష్టంగా మా ఇండ్లల్లో  మనుషుల మాదిరే అన్నాతమ్ముల మాదిరే, అక్క చెల్లెళ్ళ మాదిరే చూస్తాం తప్ప, అవేవో జంతువులని కానీ , మనుషుల కంటే చాల తక్కువైనవనే భావన కానీ మాకు అస్సలు  వుండదు. మాతో బాటే అవీ ...

ఎందుకంటే మాకు పంది పిల్లలతో ఆడుకోవడం తెలుసు. గాడిద పిల్లల్ని చాకడమూ  తెలుసు. పై కులమోల్లు గొప్ప గొప్పోళ్ళు  అని అంటా వుంటారు కానీ,  ఎందులో ఎవురేం గొప్పో మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. కులం అంటే తెలీదు, కానీ మా ఎరుకల  కులం ఎందుకో చాల తక్కువైనదని మాత్రం బాగా తెలుసు. మేం దడాలున ఎవరి ఇంట్లోపలికి పోకూడదని తెలుసు.

అదేందో తెలియదు కానీ మా కాలని పిల్లోల్లని   ఇంట్లో వుండే వాళ్ళు, స్కూల్లో అయివోర్లు, చిన్నా పెద్దా అందరూ కలసి ఎందుకు అంత భయపెడతారో అప్పట్లో  తెలియదు. ఆఖరికి దొడ్డికి పోవల్లంటే కూడా మిగతా జనాలు పొయ్యే కాడికి మా కులం వాళ్ళు పోకూడదని అంటే, మా మల మూత్రాదులకి కూడా అంటూ, మైల ఉంటాయని తెలియదు.వాళ్ళది  వేరు, మాది వేరు అని అమాయంగా అనుకునే వాళ్ళం చిన్నప్పుడు.

ఇట్లా నిత్యం భయాలతో , అడగడుగునా ఆంక్షలతో పెరిగే ఎరికిల పిల్లోల్లు  యెట్లా చదువు కుంటారో, యెట్లా బాగు పడతారో చెప్పే వాళ్ళు ఎవరు ? ఇప్పటికీ కులం అడిగి , చెప్పి చెప్పంగానే మొహం చిట్లించే వాళ్ళని ఎంత మందిని చూడలేదు ? అయితే మాకు కులాన్ని దాచి పెట్టుకుని అపద్దం చెప్పడం మాకు తెలియదు. ఎవరు మొఖాలు మాడ్చుకున్నా సరే, మా కులం ఏమిటో బెరుకు లేకుండా చెప్పాలని మా నాయన చెప్పేవాడు.  దేనికీ భయపడ కూడదని మా అమ్మ చెప్పేది.

మా అమ్మ ఎప్పుడూ ఒకమాట అంటా వుండేది.. సంపాల్సి వస్తే ముందు.. భయాన్ని సంపెయ్యల్ల,అప్పుడే ఎట్లాంటి  మనిషైనా  బాగు పడతాడని చాల సార్లు అనేది. చిన్నప్పటి నుండి నాకు ఆ మాటలు బలంగా గుర్తుoడి పోయాయి.   అందుకే నాకు ఎవురన్నా  , ఏదేమైనా ఎప్పుడూ  భయమే అనిపించదు.వుండేది వున్నేట్లుగా నిజాయితిగా పచ్చిగా  ధైర్యం గా మాట్లాడతాను అంటే , చిన్నప్పుడు నేర్చిన ఆ  చదువు కానీ , ఆ ధైర్యం కానీ  అంతా  మాయమ్మ పెట్టిన భిక్షే !     

 

ఎవరైనా ఏదైనా మాట సాయమో, చేతి సాయమో అడిగితే, మా అమ్మ వెనకా ముందు ఆలోచించేది కాదు. మనిషి  సహాయం అవసరమైతే ఇంట్లో కట్టెల పొయ్యి పైన  బియ్యం పాత్రలో పొంగు వస్తా ఉంటే కూడా సరే,  ఇంకోపక్క పప్పు చారు ఎనపాల్సి వుండినా సరే.. దాన్నట్లా చూసుకోండిరా అని చెప్పి ఆమె వెళ్ళిపోయేది. మేము లేకపోతే మండుతున్న కట్టెల పైన నీళ్ళు జల్లి ఉన్నఫలంగా వంట పనులు ఎక్కడికి అక్కడ అట్లాగే వదిలేసి  ఇంటికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయేది.

ఈ పందులు మేపే వాళ్ళు, కాలనీలో కొంచెం దూరంగా ఉంటారని చెప్పినా కదా, అక్కడ ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే ఆమె అటు వెళ్లిందంటే రావడానికి చాలా సమయమే పట్టేది.మేము ట్యూషన్ నుంచి వచ్చి ఆకలితో, ఏడుపు ముఖాలతో నిలబడితే మా నాయనకు మా అమ్మ పైన విపరీతంగా కోపం వచ్చేసేది.

" చిన్న పిల్లలని కూడా చూడకుండా యాడికి పోయినావు మే.. బుద్ధుందా నీకు? అట్లా చూడు ఆ పిలకాయల మొహాలు ఎట్లా వాడిపోయిండాయో.."అని కసిరే వాడు.

 

"ఏముండాది  ఆ పక్క కాంతమ్మని వాళ్ళ ఇంటాయన కొట్టి చంపేస్తా ఉంటే అడికి పోయినా. ఆ నా బట్ట కి ఎన్నిసార్లు చెప్పేది ఆడదాన్ని కొట్టద్ధురా..అని. మిడిమాళం పట్టినోడు.. ఆ పాప ఓ..అని ఏడస్తావుంటే యాడ వాని చేతుల్లో చచ్చిపోతుందో అని పోయినా.. తప్పా?"

   

        ఇంకేo అంటాడు మా నాయన ?

ఆయన నోట్లోంచి వచ్చే మాటలకు, ఆయన కోపానికి ఆమె అనే  ఒక్క మాట అడ్డుకట్ట వేసేస్తుంది .ఆయన కోపం మొత్తం ఒక్క క్షణంలో మాయమైపోతుంది.

 “ అయ్యో పోనీలే పాపం. నువ్వు సరిగ్గా టయానికి పోయినావు కాబట్టే ఆయమ్మకి దెబ్బలు తప్పోయి వుంటాయి. నాలుగు దెబ్బలైనా తగ్గి వుంటాయి లే . ఏదో ఒకటి  మంచే జరిగిందిలేమ్మే . సరేలే ముందు ఈ  పిల్లోల్ల కత చూడు ఇప్పుడైనా  పాపం  ” అని మా వైపు తిరిగి మా ముఖాల  వైపే చూస్తూ మెల్లగా అనేవాడు గణేష్ బీడీనో, అశోకా  బీడీనో ముట్టిoచుకుంటా . ఆ మాట అంటా అట్లాగే  ఇంట్లోంచి బయటకు కదిలే వాడు. ఇంట్లో బీడిలు తాగకూడదని నాలుగో తరగతి చదివేటప్పుడు నేను గొడవ చేసినాను కాబట్టి. నేను నా  జడ విప్పే వాడ్ని అయన మాటలు వింటా , ఆయన్నే చూస్తా.మొగ పిల్లోడికి జడ ఏమిటి అంటారా ?  

మా అమ్మకు ఆడ బిడ్డలు అంటే చాలా ఇష్టం కదా . అందుకే మా అమ్మ తమ్ముడి కూతుర్ని, అన్న కూతుర్లని, చెల్లెలు కూతుర్లను   ముదిగారంగా చూసుకునేది. అయితే మా అమ్మకు ఇద్దరూ మొగ బిడ్డలే కాబట్టి నాకు జడలు వేసేది. నేను స్కూలుకు రెండు జడలతో వెళ్ళే వాడిని. మునిదేవర జరగటం, మునీశ్వరుడికి తల వెంట్రుకలు ఇవ్వడం డబ్బు సర్దుబాటు కాకపోవడం  వల్ల చాల ఆలస్యం అయింది.

ఎరుకల కుటుంభాల్లో డబ్బు వున్నా లేక పోయినా అప్పో సప్పో చేసి అయినా ఆడంబరం గా జరిపించే వేడుకల్లో మునిదేవర ముఖ్యమైనది.   మునిదేవర జరిగి  గుండు కొట్టిన తర్వాతనే  నాకు క్రాఫు కు అనుమతి వచ్చేది. ఆ రోజు గొడవ కూడా మా అత్తవాల్ల ఇంట్లో వాళ్ళ పిల్లోడికి మునిదేవర యెట్లా చేయల్ల అనే దాని గురించే అంట. డబ్బు లేదని, అప్పు పుట్టలేదని మా మామ అంటే మా అత్త ఒప్పుకోలేదంట. పిల్లోడికి టయానికి మునిదేవర కూడా చెయ్యలేక పోతే నువ్వేం  మొగోడివి అనేసిందంట. దాంతో మా మామకి కోపం వచ్చి మా అత్తను ఇష్టం వచ్చినట్లు కొట్టేసినాడంట. సరిగ్గా టయానికి మా అత్త వచ్చి అమ్మను తీసుకు పొయ్యింది కాబట్టి ఆ యమ్మకి దెబ్బలు తప్పోయిన మాట నిజమే  అని అన్నo తినేటప్పుడు మా అమ్మే  మా నాయనకు చెప్పింది.

నవ్వుతా నవ్వుతానే మా నాయన ఒక మాట అడిగినాడు మా అమ్మ కల్లా చూస్తా చూస్తా ..“ జయా  ఉద్యోగం చేస్తా వుండే నాకే దేవర చెయ్యాలంటే ఆలోచిస్తా ఉండాదా. ఆ రమనయ్యకి యెట్లా కుదురుతుందిమే  ”

అప్పుడైనా అసలు కథ చేపుతుందేమో అని ఒక్క క్షణం ఎదురు  చూసాడు కానీ,  మా అమ్మ తెలివిగా బదులు చెప్పేసింది. “ ఏముండాది ఎవురో ఒకరు మనసు పెట్టి ముందుపడి ఆదుకుంటే అయిపోతుందిలే. దేవుడి పనికి దేవుడే వస్తాడా యాడన్నా ?”.తల వంచుకునే వడ్డించింది, తల వంచుకునే అన్నం తింది. తల వంచుకునే మాట్లాడుతుంటే  చిన్నపిల్లోల్లం మాకే అర్థం అయి పోయింది, ఇంక మా నాయనకు అర్థం కాకుండా ఉంటుందా ?

చూసి, చూసీ అడగనే అడిగేసాడు.

“ ఏమ్మే జయా.. కొత్త పెండ్లి కూతురి మాదిరి తల వంచుకునే వుండావు. సిగ్గు పడతా నా  మొహం కల్లా  చూడకుండానే మాట్లాడతా ఉండావే? ఏమైంది నీకీ పొద్దు ? ”

ఆమె అప్పటికీ తల పైకి ఎత్తదు.మా నాయన మొహం కల్లా చూడదు.అయినా అమ్మ అపద్దం చెప్పదు కదా, నిజమే చెపుతుంది. ఆయమ్మకు ధైర్యం చాలా  ఎక్కువ కదా.భయమే ఉండదు కదా! . ఏం జరిగిందో చెప్పేస్తుంది.

“ వాళ్ళు పందులు అమ్మేదానికి ఇంకా టైం పడుతుంది కదా. అందుకే.. నా కమ్మలు ఇచ్చేసి వచ్చినా. కుదవపెట్టి మునిదేవర చేపించేయమంటి. ఏమిప్పుడు ?   ” అని  క్షణం  ఆగి  “ ఊ.... ” అంటుంది ప్రశ్నార్థకంగా.

అప్పుడు  మా నాయనకు కోపం రాదు.బాధ కలగదు.ఆయన మొహం మామూలుగానే వుంటుంది. ఏ మార్పూ వుండదు.

 నాకు చెప్పకుండా చేసినావే అని కానీ, నాకు ముందుగా చెప్పల్ల కదా అని కానీ, నన్ను అడగల్ల కదా అని కానీ అనే  మాట అస్సలు రాదు ఆయన నోట్లోనుంచి.

ఏం మాట్లాడకుండా “  మీ అమ్మ ఒక  మదర్ తెరిస్సా.. లేరా  ” అని మా కళ్ళా ఒక చూపు చూసి నవ్వుతా బీడీ కట్ట అగ్గిపెట్టె ఎత్తుకుని , మా ఇంటి ముందు  వుండే నెల్లికాయల చెట్టు దగ్గరకి వెళ్ళిపోతాడు. అదిగో కరెక్టుగా  మా నాయన ఇంట్లోంచి బయటకు పోయిన ఐదారు   క్షణాల తర్వాత మా అమ్మ తల పైకి ఎత్తి, వక్కా ఆకుతో గార పట్టిన  ఎత్తు పళ్ళు కనిపించేలా  నవ్వుతా  మా వైపు చూస్తుంది.

ఎందుకో తెలియదు కానీ జయమ్మ  మొహం లోకి అప్పుడు   ఏదో వింత వెలుతురు  వచ్చి వుంటుంది.

ఎందుకో అప్పుడు మా అమ్మ మాకు కొత్తగా అనిపించేది.ఎందుకో అంతకు  ముందుకన్నా  అప్పుడు మా అమ్మమాకు  చాలా  అందంగా కనిపించేది .

 

     

 

కథలు

కొన్ని ప్రేమలంతే!

ఐదు సెకన్లు.. ఐదంటే ఐదే సెకన్లలో జరిగిందది! పొయ్యి మీద టీ గిన్నె మరుగుతూనే ఉంది. హాల్లో టీవీ శబ్దం చిన్నగా వినిపిస్తోంది. ఎప్పుడొచ్చాడో చూడలేదు. వెనక్కి తిరగ్గానే టక్కున నా పెదాల మీద ముద్దు పెట్టాడు. నా వంక చూడకుండా హాల్లోకి వెళ్లిపోయాడు. గొంతులోంచి చిన్న శబ్దం కూడా రాలేదు. మెదడులో మాత్రం ఏదో గుచ్చినట్లు అనిపించింది. అతను వెళ్లిపోయాక ఆ నిశ్శబ్దం భరించడం కష్టమైంది. ఎందుకు? ఎందుకు చేశాడిలా?

నిమిషం తరువాత టీ కప్పు తీసుకుని హాల్లోకి వెళ్లాను. అతని ముఖంలో నవ్వు, బాధ, పశ్చాత్తాపం.. ఏమీ కనిపించలేదు. అసలేమీ జరగనట్టే టీవీ చూస్తూ ఉన్నాడు. వేడి వేడి టీ అతని ముఖం మీద పోయాలనిపించింది. అంత పనీ చేసేదాన్నే! ఏదో గుర్తొచ్చి ఆగిపోయాను. కళ్లలోంచి దుఃఖం పొంగుకొస్తోంది‌. ఎవరూ చూడకుండా ఏడవాలనిపిస్తుంది. అతను మాత్రం హాయిగా నేనిచ్చిన టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు. ఏంటి? ఏమీ జరగలేదా? ఆ ముద్దు?

"అత్తమ్మ ఎలా ఉంది?"

"ఏమో!"

"ఊర్నుంచి రాలేదా నువ్వు?"

"బెంగళూరు నుంచి.. మళ్లీ సాయంత్రం వెళ్లిపోవాలి."

అక్కడ ఉండబుద్ధి కాలేదు. పక్కన గదిలో అత్తయ్య పడుకుంది. తను గానీ లేచి ఆ క్షణంలో చూసి ఉంటే? అమ్మో! మామూలు గొడవ జరిగేది కాదు. ఇద్దర్నీ నమిలేలా చూసి, తనని తిట్టి, వీలైతే కొట్టి బయటకు గెంటేసేది. ఆ తర్వాత నన్ను మాత్రం వదులుతుందా? చూడకపోవడం మేలైంది. ఛీ! ఏంటిలా ఆలోచిస్తున్నాను? జరిగింది ఎవరూ చూడకపోతే చాలా? అయినా ఇతనేంటి ఇంత హాయిగా ఉన్నాడు. అసలెందుకు వచ్చాడు?

"అతనెప్పుడొస్తాడు?"

ఏమో! ఎవరికి తెలుసు? ఆఫీసు ఐదింటికే అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్‌ని కలిసి కాసేపు బాతాఖానీ కొట్టి, గంటసేపు ట్రాఫిక్‌తో అల్లాడి ఏడు.. ఏడున్నరకు ఇంటికి చేరతాడు. అంతసేపూ కాపాడుకున్న ఉత్సాహం, ఓపిక ఇంటికి రాగానే మాయమవుతాయి. ఉసూరుమంటూ సోఫాలోనో, బెడ్రూంలో మంచం మీదే వాలిపోతాడు. మళ్లీ ఎనిమిదిన్నరకి భోజనానికి లేస్తాడు. రోజూ జరిగేదిదే!

"సాయంత్రం.."

"ఆఫీసు దూరమా?

"ఊ.."

ఏదన్నా పరుషంగా మాట్లాడి తనని బాధపెట్టాలని అనిపిస్తోంది. ఎందుకొచ్చావ్ ఇక్కడికి? ఏం పని నాతో? ఇన్నాళ్ల తర్వాత వచ్చి ఏం సాధిద్దామని? అని చొక్కా పట్టుకుని అడగాలని అనిపిస్తూ ఉంది. ఆ కోరికను బలవంతంగా అణుచుకున్నాను. మూడేళ్ల తర్వాత అతణ్ణి చూసిన ఆనందం నిమిషాల్లోనే మాయమై, కోపం పెరిగిపోతోంది. తను మాత్రం మాములుగా ఉన్నాడు. అత్తారింట్లో నేనేమీ అనలేనన్న ధీమాతో నన్నలా..!

పెళ్లయిన రెండు నెలల తర్వాత ఇంటికి అత్తమ్మ వచ్చింది. తను మా అత్తయ్యతో మాట్లాడుతూ ఉండగా బావ సంగతి వచ్చింది. "మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? పెళ్లిలో కన్పించలేదే" అని అత్తయ్య అడగ్గానే అత్తమ్మ ముఖం మారిపోయింది. అది బయటికి కనిపించనీయకుండా "బెంగళూరులో ఉద్యోగం. కొత్తగా చేరాడు. రావాలని చాలా అనుకున్నాడు. ఆఫీసులో లీవు దొరకలేదు" అని సర్దిచెప్పింది. అలాగా అని మా అత్తయ్య ఊరుకుంది కానీ, అది అబద్ధమని నాకు తెలుసు. లీవు దొరికినా బావ రాడు.

చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే పెరిగాం. చుట్టాలందరికీ మేమంటే మొగుడు పెళ్ళాలన్న ఆలోచనే ఉండేది. స్కూల్లో కూడా ఫ్రెండ్స్ 'మీ బావ.‌. మీ బావ' అని ఆటపట్టించేవారు. మరి ఆ వాతావరణం వల్లనో, ఏమో నాకూ మేం భార్యాభర్తలం అన్నట్టే అనిపించేది. తనతో కలిసి మెలిసి ఉన్నా ఎవరూ కాదనేవారు కాదు. నాన్న మాత్రం కోప్పడేవాడు. ఆయన మనసులో ఏముందో తెలిసేది కాదు. "బావమరదల్లేగా!" అని అమ్మ అంటే 'అయితే ఏంటి?' అన్నట్టు కొరకొర చూసేవాడు.

ఆ సాయంత్రం అత్తమ్మతో కలిసి బజారుకు వెళ్తుంటే చెప్పింది. "వాడు చాలా బాధపడుతున్నాడే! ఏం చేస్తాం? తలరాత. రోజూ ఫోన్ చేసి నీ గురించి అడుగుతాడు. తప్పు చేశానమ్మా అంటూ ఒకోసారి బాధపడతాడు. పోతే పోయిందిలే ఎక్కడో చోట సుఖంగా ఉండనీ దాన్ని అంటాడు. లోపల ఎంత బాధుందో తెలియదు" అత్తమ్మ మాటలకు ఏడుపొచ్చింది. కళ్లు తుడుచుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ తను మా ఇంటికి రాలేదు. నేను ఊరెళ్లినప్పుడు పలకరించడం తప్ప వాళ్లింటి సంగతులేవీ తెలియదు. బావ ఫోన్ నెంబర్ మారింది. కొత్తది తీసుకొని తనతో మాట్లాడాలన్న ఆసక్తి పోయింది. బావ ఊరికి రావడం మానేశాడు. మూడేళ్లు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. ఇవాళ మళ్లీ కనిపించాడు.

నాన్నకు తెలియకుండా బావతో సినిమాకో, గుడికో వెళ్లడం తప్ప అంతకు మించి మా మధ్య జరిగిందేదీ లేదు. ప్రేమ, విరహం లాంటి మాటలు కూడా ఎప్పుడూ మా మధ్య రాలేదు. నేను ఇంటర్ పూర్తయ్యే నాటికి బావ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాడు. అతని తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. వాళ్ల బాధ్యత తనదే! నన్ను పెళ్లి చేసుకుంటాననీ, నాతోనే జీవితం పంచుకుంటాననీ మాటలేమీ ఇవ్వలేదు. కానీ తనకో ఉద్యోగం దొరికితే నాకేదో మేలు జరుగుతుందనిపించి, ఎదురు చూస్తూ ఉన్నా. రానే వచ్చింది. తన ఉద్యోగం కాదు, నాకు​ పెళ్లి సంబంధం.

"అప్పుడే పెళ్లేంటి? ఇంకా చదువుకోవాలని ఉంది" అని నాన్నకు చెప్పేంత ధైర్యం లేదు. అమ్మతో చెప్పినా తను నాన్నను ఒప్ఫించగలుగుతుందన్న నమ్మకం లేదు. బావ ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. నేను​ ఇంట్లో లేనప్పుడు అత్తమ్మ రావడం నాన్నతో ఏవో మాట్లాడటం తెలుసు. బావతో నాకు​ పెళ్లి చేయమని అడిగేందుకు తను నా బావ అన్న ఒక్క కారణమే ఉంది. వద్దు అనేందుకు నాన్న దగ్గర చాలా కారణాలున్నాయి. 'మంచి సంబంధం. ఆడబిడ్డలు​ లేరు. ఒకడే కొడుకు. గవర్నమెంట్ ఉద్యోగం. ఇంతకంటే ఏం కావాలి?' నాన్న చెప్పే ఈ కారణాలు​ కాదని ఎవరు మాత్రం ఏం చెప్తారు? సరిగ్గా నా పెళ్లికి వారం రోజుల ముందు బావకి బెంగళూరులో ఉద్యోగం వచ్చిందన్న​ విషయం తెలిసింది. శుభలేఖలు పంచేశాక ఇంక పెళ్లిని అడ్డుకునేదెవరు? అప్పుడైనా బావ ఏదైనా చేస్తాడేమో, పెళ్లి ఆగిపోతుందేమో అనిపించింది. ఊహూ..! తనసలు మా ఇంటి ఛాయలకు కూడా రాలేదు. మరి నన్ను ప్రేమించలేదా? అదొక్కటి తెలుసుకోవాలని చాలా అనుకున్నా. కుదరలేదు.

"వెళ్లొస్తాను మరి!"

ఏమని చెప్పాలి? ఉండమనాలా? ముద్దెందుకు పెట్టావ్ అని అడగాలా? అసలు నన్ను ప్రేమించావా, లేదా అని నిలదీయాలా? ఇన్నాళ్లు రాకుండా ఇప్పుడెందుకు వచ్చి నా మనసులో చిచ్చు పెట్టావ్ అని అరవాలా?

తను లేచి బయటకు అడుగులేశాడు. వెనకాలే నేనూ వెళ్లాను. గేటు దాటాక నా వంక చూసి 'సారీ' అన్నాడు. "దేనికి?" కోపంతో అడిగాను. "అన్నింటికీ.." వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. ఇక ఎప్పటికీ ఇటు వైపు రాన్నన్న నిశ్చయమేదో అతని నడకలో కనిపించింది.

ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను. వదిలెళ్లిన జ్ఞాపకంలా అతను తాగిన కాఫీ కప్పు టీపాయ్ మీద ఉంది. ఎందుకొచ్చాడన్న ప్రశ్నకు సమాధానం దొరికింది​. కొన్ని ప్రేమలంతే అనుకుంటూ కప్పు తీసుకుని వంటింట్లోకి​ వెళ్లాను.

 

కథలు

ఈటి నోటిముసర పెరికిందెవరు?  

                  మా ఊర్లో మంగళారం మంగళారం సంత జరుగుతుంది. వారమంతా కస్టం చేసి సంపాయించిన డబ్బులకి సంతకు పోయి సరుకులు తెచ్చుకుంటేనే కూర్లకు యసనముండదు. అయినా కాలం మారి డైలి మార్కెట్లు, రైతుబజార్లు,సూపర్ మార్కెట్లు ఎన్నొచ్చినా మాకుమటుకు సంత ఒగ తిరనాల్లాంటిది. మాచేతిలో  దుడ్లున్ని కాడికి ఎక్కడో ఓ సోట మాసొమ్ముకు తగ్గ బేరం వుండనే వుంటుంది . బేరగాలు దగ్గర గోజాడి, గోజాడి మనం అడిగిన రేట్లకు వాల్లు సరుకు అమ్మితే ఆ ఆనందం, ఆ బింకం బలేవుంటుంది. ఇంగ మాఊర్లో వారంవారం కచ్చితంగ సంత చేసే వాల్ను సావుకార్లు అంటారు.            

                ఈ మంగళారం నేను ఇంటి సరుకులు సగలం తెద్దామని మూడునూర్లు దీసుకుని సంతకు పోతి. సరుకులన్నీ దీసుకోని ఆ  సంచిని  చేత్తోనే మోస్కోని బస్టాండికి  వచ్చేసరికి చేతులు ఎర్రగా కమిలి పొయినాయి.భుజానగాని నెత్తినగాని పెట్టుకుంటే ఎంతబరువైన మోయచ్చు. కాలం మారె. నెత్తినగాని పెట్టుకుంటే యాడ మొరుటోల్లు అనుకుంటారేమోనన్నజంకు.సంచి నాకాళ్ళకు ఆనిచ్చుకొని నేను నిలబడితి. ఆడ నాకుబాగా జతగత్తె,మాఊరి ఆడబిడ్డ కమల కూడా బస్సుకోసం బస్టాండ్ లోవుంది. నేనుదాని పక్కకు చూసి నగతా అంచుకుపోయి కమలా బాగుండావా అంటి.అది మూతిముడ్సుకొని తలకాయి పక్కకు తిప్పుకుండే. మల్లా నేనే మాట్లాడిస్తి. అదివుండుకోని "మ్మేయ్ నేను నీతో మాట్లాన్ను,నాకొడుకు పెండ్లికి నీ ఇంటికొచ్చిసెబితే కూడా నువు రాలా.నేనంటే నీకు లెక్క జమలేదు. నీబిడ్ల పెన్నిండ్లకు కూడా నేనురాను" అని బాదపడే. నే నుండుకోని "మ్మేయ్ మాపరిస్థితి బాగలేదు. నేను డేటు అయింటి. ఆపొద్దుటికి నాకు రెండుదినాలు. నామొగుడు మడికాడ కోతులకి కావిలుండాడు. మడికాడ గెడిసేపు కూడ యామారేదానికిలేదు. నోటికొచ్చిన పంటపోతుంది అని దానికి నచ్చజెప్తి.  ఆటికీ అది సరిగా మాట్లల్లా, ఆయాలకే దాని బస్సొచ్చే.అదిఎక్కిపాయ.నేనూ మాఊరుబస్సుకి ఇంటికి వొచ్చేస్తి. 

               ఇంటికి వస్తానే కమలన్నమాటలు నామొగినితో చెబితి. నామొగుడుండుకోని "ఈడ  కోతులతో గెడి సేపుకూడా నిమ్మలం లేదే , పొద్దుపుట్టి  పొద్దుగుంకి  పొద్దుమసికిలు పడేవరకు కావిలుండల్ల.యామారి నామంటే పచ్చికాయి, పాలకాయి, చెట్లుతోసహా పెరికేస్తాయి.ఏమిచేసేది. అందరితోను నిస్టూరం కట్టుకోనే పనై పోయింది. ఈ కోతులతో ఒగపెండ్లికి పోలేము, ఒగసావుకిపోలేము, ఎవరికన్నా  ఆప్తి అంటేపోలేము. గోతికాడనక్కేగతం కాస్కో నుండే పనైపోతాంది అనే"

                అవును నామొగుడు చెప్పింది నిజం.ఇబుడు కోతులతో ఏగుతున్నాం . కోతుల గొడవ ఒకటేనా మాకు.  పంట చేస్తే దానికి ఎన్ని ఆసించు  కొని  ఉంటాయో ! మా యట్ల చిన్న సేద్య గాళ్ళు అరకవ నీళ్లకు మడి నాటితే మల్లల్లో ఎలకలు.  మాకు వాటితో  రంపు చిన్నది కాదు. నీకే కాదు ఈ భూమిలో మాకూ అక్కుంది అని దౌరుజన్యంగా మేము మడి నాటతున్నబుడే మా కంటే ముందుగానే గెనాల్లో వాటి ఇండ్లు కట్టుకునే దానికోసం బొక్కలు లోడుకుంటా ఉంటాయి..గదులు గదులుగా లోడతాయి. మేము నాట్లు పెట్టే గుందికి  అవి ఇండ్ల పని మొదలు పెడతాయి అవిటి కట్టడం లో యాడన్న డ్యామేజీ అయి బొక్కలు పడితే మా మల్లోని నీల్లన్నీఎలిపోతాయి. అబుడు చూసి ఆబొక్క తొక్కిపూడ్సల్ల.  మడి ఎన్నులు ఇడిసేటబుడు వొరికర్ల మొదల్లు  తీయగ ఉంటాయని వాటిని కొరకతాయి.

                 గింజలు అట్ల ముదరతానే ఆ వడ్ల  గొలకల్ని  నోటితో కొరికి  ఎత్తకపోయి వాటి బొక్కల్లో పెట్టుకుంటాయి. పొదుపు అనేది ఎట్లా చేయాలా అనే విషయం ఎలకల దగ్గరే నేర్చుకోవల్ల .మల్ల సంవత్సరం వరకు తిండికి బయం లేకుండా వొడ్ల గొలకలు ఎత్తి పెట్టుకుంటాయి.బీదోల్ల పైకి షావుకార్లు దౌర్జన్యం చేసినట్లు మేము వాటి బొక్కలు కనుక్కొని దౌర్జన్యంగా  తవ్వి పగలగొట్టి చూస్తే అవి ఎత్తి పెట్టిన దాన్యంగింజలు కనబడతాయి. ఆ బొక్కల్లో  పాములు దూరి వాట్ని సంపితే  తప్ప వాటి తిండికి ముప్పు రాదు. అవి ఎత్తి పెట్టిన తిండి గింజలు సంవత్సరం తర్వాత చూసినా  సెడి ఉండవు అంత బాగుంటాయి.                            వొకబుడు  ఇర్లోల్లు ఎలుకల్ను బట్టేవాళ్ళు .ఎలకల్ని పట్టే బుట్టల్లో  గింజలేసి వాటిని మల్లో పెడతారు. ఆ గింజల కోసం ఎలకలొచ్చి ఆ బుట్టలో పడి ఇరుక్కు పోతాయి. ఒక ఎలక్కి ముప్పైరూపాయలు ఈయల్ల. అది ఒక పని.మల్ల ఊదర పెట్టేది.బొక్క లో పొగ పెడితే ఆ పొగకు ఊపిరాడక బయటకొచ్చేస్తాయి.అట్ల  పట్టుకొని సంపేది. అట్లా పంటను మేము ఎలకల నుండి  ఎంత కాపాడినా  అవిటి  వాటా అవి దోసుకుంటానే  ఉంటాయి. 

             ఇవిటి  గొడవ ఇట్లుంటే పందులువొగ పక్క.  ఇవి సానా తెలివైనవి. పొగులు రావు.సరిగ్గా నడి జామకాడ వస్తాయి. ఇవి పంట లో పన్నాయంటే, పెద్దలంటారు చూడు పంది పొల్లినట్లుపొల్లాడి  దొర్లతా ఉండావు అంటారే అట్లా చిత్త, చిత్తగా తొక్కేసి తినేసి పొల్లాడి ఎలి పోతాయి. అవి రాకుండా మడి సుట్టూ కమ్మి కట్టల్ల.  గుడ్డ తిరుకులు సుట్టు కట్టల్ల.  బెదుర్లు పెట్టల్ల.దానికోసం  మనిషిబొమ్మ చేసి నిలబెట్టేది. ఇప్పుడు ఇంగా కాలం మారి పులి ఎట్లా ఉంటే అట్లా బొమ్మలు సిక్కతా  ఉండాయి కదా ఆ  పులి బొమ్మ తెచ్చి నిలబెట్టేది. దానికి పులి అరుపు గాండ్రించిన ట్లు అలారం పెట్టేది, డప్పులు కొట్టేది.  ఇట్లా వాటిని  బెదర కొడతాము . 

               ఇంగా గువ్వలు, పక్షులు అవి ఎంత సుకుమారంగా సున్నితంగా ఉంటాయో అవిటి పనితనం కూడా అట్లే ఉంటుంది, " ఒక కథ ఉంది వొక  రాజుని శని దేవుడు ఎంటాడతా ఉంటాడు. అన్నీ పోగొట్టుకోని తిండి దొరక్క  ఆకిలికి అలమటిస్తా  ఉంటే  ఒగ గువ్వల గుంపు వచ్చి కుసుందంట ముందర. వాటినన్న తిందామని వొంటి  మింద ఉన్న ఒగేఒగ పంచి గుడ్డ ఇప్పి వాటిపైన ఏస్తే అవి ఓగే కట్టుగా ఆ పంచిగుడ్డతో సహా ఎగిరిపోతాయంట. బిత్తల తో నిలబడి ఆకులు కట్టుకునే స్తితివచ్చే ఆ రాజుకి.  అట్లా పంట వొడుపుకువచ్చినబుడు యామారినామంటే యాబై , నూరుగువ్వలు గుంపులు గుంపులుగా వచ్చి పొట్టు కూడ రాల్సకుండా  నోటితో సున్నితంగా బీముగింజలు తినేసి ఊదేస్తాయి. ఇవి పొద్దన  సాయంత్రం వస్తాయి. ఎండ పొద్దు లో రావు.  అవి వచ్చే టైముకు దేవునికి మెరివిని తిరిగినట్లు అన్నంతినే గిన్ని చిన్నకట్టి ఎత్తుకొని డాంగ డాంగ మంటూ కొట్టుకుంటూ వూడ్ వూడ్ మని  అరసల్ల.  ఎంత చేసినా వాటి వాటా వాటికి పోతుంది. వీటినన్నిటిని జయించి ముందుకు పోతే దేవుడు కూడా పగ పడతాడు. వాన పడక పంటలు ఎండిపోతాయి లేదంటే వానపడి మునిగి పోతాయి. ఇవన్నీ కనికిరించి పంట ఇల్లు చేరి మా సట్లో పడే వరకు మాకు పురిటి నొప్పులే.

               సరే ఇవిటి గొడవంటే ముందు నుంచీ అలవాటయ్యింది .కానీ ఇప్పుడు కొత్తగా కోతుల బెడద వచ్చి పడింది.

             మేము పది కుంటల్లో టమాటల పంట ఏసినాము. మాభూములు సుటకారం పెద్దపెద్ద మాండ్లు ఉండాయి. కోతులు మా మాండ్లుని వాటికి స్తావరాలు చేస్కునాయి. ఎంతదేశం తిరిగినా కూడ సాయంత్రానికి ఇండ్లకు ఒచ్చినట్లు మాండ్ల మిందకు ఒచ్చేస్తాయి. అది ఒగటి, రెండుకాదు, గుంపులుగుంపులు వొస్తాయి. ఒగొగ గుంపుకి యాభై కోతులుంటాయి. ఒగగుంపు పోతే ఇంగో గుంపు వస్తాయి. ఒగ గెడివి యామారినా మా పంటంతా పెరికి  నేలమట్టం చేసేస్తాయి.  అనే వుండ్ల "ఒగకోతి వనమంతా చెడిసనంటారే" అట్లా ఈ కోతుల రావిడి ఎక్కువై ఈటి గురించి మాఇంట్లో ఎన్నోదినాలు రంపు లాడుకున్నాము. నేను కోతుల కాడికి పోతే వాట్నినేను తోల్లేను. అవి నామిందకు ఎగరబారతాయి. నేను పోను బయిపడి . నామొగినికి  యాస్ట అయినబుడు గాని, ఏదైనా పని పన్నబుడుగాని, ఇంట్లో పిల్లోల్లని లేక  నన్నుగాని పొమ్మంటే మేము పోకపోతే ఆయనకి బలే కోపం వస్తుంది. మడికాడికి పోతే మాటాడే దిక్కులేకుండా ఊరికే కుసోవల్లంటే బేజారయేది. అందుకే మేము పోమనేది.మాకు జైలుసిచ్చి అయిపోయింది ఆడ . వాటిని తరమల్లని మేము చేయని పనిలేదు. టపాసులు కాల్సేది, డప్పులు కొట్టేది, అగ్గి పెట్టేది ఇట్ల ఏమిజేసినా  అవికొమ్మలపైకి పొయ్యి అవి కుసున్న కొమ్మను ఊపతా ఆటినుండి మమ్మల్నే కండ్లతోను, పొండ్లుతోను బెదిరిస్తాయి. మేముతెగబడి కొట్టేదానికి దేవుడనే బయము. 

              మొన్న నామొగుడు కాంచేపు పనుందని పంటకాడ లేకుండా యామారినాడు. ఈసందులో కోతులు జొరబడి కాయల్నిపెరికి,అన్నీపీకి పీకి నేలపాలు చేస్నాయి. పెరికిన కాయని తినేస్తే పర్వా లేదు అట్లకాదు కాసింత కొరికేది అది పారేసి ఇంగొగకాయ కొరికేది. అది చూసి నామొగుడు కోపంపట్ట లేక కట్టి ఇసిరేసినాడు. ఒగకోతి తలకాయికి తగిలింది.మిగతావన్నీతప్పించుకున్నాయి. ఆ కోతి ఆన్నేపడిపోయింది. ఆ పడిపోయిన కోతిని చూసి నామొగినికి బాదేసింది. అదరాబదర పరిగెత్తి పోయి ఏట్లో నుండి బక్కిట్టుతో నీల్లు ముంచకచ్చి దానికి తాపినాడు. అయినా అది కదల్లేదు.దాని మెడంతా రక్తం కారతాఉంది.  ఓరే ఇదేమొ చచ్చేట్టిగావుంది కోతిని చంపితే కోటిపాపాలు అంటారు. "ఇవిటి దిక్కుఆర్నాని! పంట తినేసి పోతే పోనీ ఈ కర్మయాల అనుకోని దిగులుపడిపోయినాడు.ఆ కోతికి దెబ్బతగిలే కుందికి  మిగిలిన కోతులన్నీ మాండ్లెక్కేసి అరస్తా దానికల్లా చూసుకోనుండాయంట. అన్నీయాడ నామింద ఎగరబారతాయోనని ఇంటికొచ్చి జరిగింది మాకుచెప్పి అన్నం ఎత్తుకొని బొయ్యి ఆ కోతికి పెట్టినాడు. అది తినిండ్ల. ఆ యన్నాన్ని మిగిలిన కోతులు తిన్నాయి.సాయంత్రం మల్లా అన్నం ఎత్తకపోయి పెట్టినాడు. అబ్బుడు అదికొంచం అన్నం తిని తెపుర్లుకునింది. ఆ కోతి లేసి తిరుగులాడేంతవరకు మిగిలిలిన  కోతులు ఒగ పొగులు రేయి మేత నీల్లు లేకుండా దాని సుటకారం కావిలున్నాయి.ఆమర్సునాడు అన్నీఊర్లోకి వొచ్చేసినాయి. 

                  ఊర్లో మద్యానం మూడుగంట్లు అయ్యింటుంది. గెట్టిగ అరుపులు ఇనపడే . నేను ఈది లోకి పోయి నిలబడితి.  ఊర్లోని ఆడోల్లంతా  కట్లెత్తుకొని కోతుల్ని తరమతావుండారు. వీల్లజతకి మొగోల్లు కుక్కలు కూడా ! నేను వాల్లగుంపులో నిలడితి. మా వొదిన ఉండుకోని"మాఇంట్లో కోన్ని పొదగ బెట్టింటే ఆ పొదిగినకోడి మేతకుపోయింటే ఆ గుడ్లు ఎత్తకచ్చి తినేసె. ఇల్లంతా గుడ్లు పగలగొట్టేసినాయి. రేపోమాపో పిల్లలు ఇడగతయి ఆ గుడ్లు.  ఆ పొలుసు వాసన  పోవలంటే నేనుఎంతసేపు కడగల్లో. ఈటిని దేవుల్లంటారే దేవుల్లు అయితే గుడ్లు తింటాయా అనే"

                ఇంగోయమ్మ "మాఇంట్లోకూర,అన్నం తినేసి సామాండ్లన్నీ పీకేసినాయి.నా మనవరాలు చిన్నబిడ్డ.ఇంట్లోవుంటే ఆ బిడ్డ మిందకు ఎగరబారింటే బయంతో జరం వొచ్చేసింది. మాతమ్ముడు తలుపుతెర్సుకోని పనుకోనుంటే సడిసప్పుడు లేకుండ ఇంట్లోకి పోయి సామాండ్లన్నీ పీకతా వుండాయంట. వాడులేసిఅరిస్తే  అట్లే జొరబడి వానికాలు కర్సింది. వాడు మనూరి  రెండుగంట్ల బస్సుకు గవర్నమెంట్ ఆసుపత్రికి బాయె " అనే.

                ఇగ మాఆడబిడ్డ వాల్లది పూరిల్లు. పైకప్పడం పేరికేసి ఇంట్లోకి జొరబన్నాయి. ఇంట్లోవున్నఉప్పునుండి నూన్డ్లు, మసాలడబ్బాలు, సామాండ్లు మెత్తం నేలపాలు చేసేసినాయి. అదిఇంటి కొచ్చిచూసి బోరున ఏడిసింది. ఊరందరి ఇల్లలో జరిగిన దానికంటే మా ఆడబిడ్డలచ్చిమికి జరిగిందానికే అందరు బాద పడినారు. ఎందుకంటే  దాని మొగినికి కాలు అవుటు. దాని రెక్కల కస్టంతోనే ముగ్గురు బిడ్డల్ని, సంసారాన్నినెట్టు కొస్తా వుంది. ఈ నస్టం పూడాలంటే దానికి రెన్నెల్లు పడుతుంది.

                మా చిన్నబుడు ఊర్లోకి  కోతులాడించేవాళ్లు వస్తావుండ్రి. ఆ కోతికి నిక్కర చొక్కాయి తొడిగి సోకుజేసి ఆ కోతిని బుజాన ఎక్కిచ్చుకొని చేతిలో పొడువాటి కట్టితో ఇంటింటికీ పొయ్యేది. అమ్మా సీతమ్మఅత్తింట్లోలు ఎట్లాంటోల్లుఅంటే అది అలిగేది.తలకాయికిందికి వాలేసేది. పుట్టినింటోలు అంటే అది నగేది సలాంకొట్టేది. పిల్లాగుంతలు ఆడేది.పిల్లోలమంతా ఆ కోతులోడు ఊరు దాటకున్నంత  వరకు ఆయప్ప యనకాలే  పోయేది.  కోతి చేస్టలకు పగలబడి నగేది. కోతిని జూస్తే అంత అపురూపంగా ఉండేది.చూడక చూడక కోతిని చూసే వాళ్ళం.అట్లుండేది అబుడు. ఇబుడు సుమారు పదేండ్లయ్య, ఊర్లమింద కోతులనెత్తుకొని వచ్చి.

               మాయమ్మ వాల్ల అన్న వుండ్యా. ఆ యప్పకు బిడ్లు లేరు. ఆలు మొగుడు ఇద్దరూ మన్సుల్ని నమ్మరు.వాల్ల బిడ్లేగతం మూడునాలుగు కుక్కలు,మేకలు యాబై, పిల్లులు ఐదారు ఉన్నాయి. అవి ఇల్లంతా తిరిగేది అరిసేది.చిన్నబిడ్లేగతం వాల్ల కాళ్ల  సుటకారం తిరిగి కాళ్ల కు అడ్డం పడేవి. కొత్తోల్లు ఎవురన్నావాల్ల ఇంటికి పోతే వాట్నిచూసి చీకొట్టుకొనేది. వాల్లు తినేగిన్నెలోవాటికి అన్నం పెట్టేది. అదీ  మించితే వాటికి తినిపిస్తా అదేచేత్తో వాళ్లుతినేది. నేను ఏంది మామా ఈ సంత అంటే "అయ్యోమ్మ అట్లనద్దు దేవుడు ఈ బూమ్మింద పుట్టిన జీవికల్లా దాని నోటి ముసర దానికి ఏసే ఉండాడు. వాటికి ముసర లేకుండ సేయగూడదు" అనేవాడు.

                మా యన్నఉండుకోని ఈ కోతుల్ని చూస్తే బాదేస్తుంది.  అవి మాత్రం ఏమి చేస్తయి. పొలింమింద యాడేగాని మేతలేదు. అడువులు పలసబారి పొయినాయి.వాన్లులేక,నీల్లు లేక, తిండి దొరక్క అవి ఊర్లమింద బడ్డాయి. పెద్దలు అనేవుండారు 'దేనినోటి కూడన్నాపెరికేస్తే అవి మననోటికూడు పెరికేస్తయి' అని అదియిదే అనే. నిజమే ఈ కోతుల  దెబ్బకి భయపడి సానామంది సేద్యాలు చేయకుండా బూములు బీల్లు పెట్టుకోనుండారు.

               అయినా మేము చేసిన తప్పేమి? మేము సెట్లు కొట్టలేదు, మేము ప్యాక్టరీలు కట్టలేదు, మేము రోడ్ల మీద పెద్ద పెద్ద పొగ బండ్లు నడప లేదు, మేము సెరువులు సదరం చేసి బిల్డింగులు లేపలేదుదేశమంతా ఎడతెరపు లేకుండా కరెంటు తీగలు నాట లేదు. మేము చేసిందల్లా ఆ బూమిని  దున్ని నాలుగు రకాల తిండి గింజలు పండించి నలగరి  కడుపులు నింపడం ఒకటే.

               మాకు దెల్సి  మేము దేని నోటి ముసరా పెరక లేదు."నీ కులానికి నాసాడు అంటే తలా గెంటెడు అన్నట్లు" మనిషి చేసేపనులకి బూమి మీద పుట్టిన సాటిమనిసులతోపాటు నోరులేనిజీవాలు కూడా పలితం అనుబవించాల్సిందేనా ?

 అర్థాలు

ముసర = నోటికాడికి పొయ్యేది ఏదైనా,నోటికి మెత్తుకునేది

మసికిలు = చీకటి

పొలుసు వాసన = నీసువాసన

బెదుర్లు  = బెదిరింపు

గుడ్డ తిరుకులు = గుడ్డ పేలికలు
కాలుఅవుటు= కాలు అవిటి

బిడ్లేగతం = బిడ్ల మాదిరిగా  

మెరివిని తిరిగినట్లు=ఉరేగింపులాగా చుట్టూ తిరిగేది  

 

**************************************************

 
 

 

   
     
           

 

కథలు

ఆత్మాభిమానం 

పొద్దునే ఆరుగంటలకే మెలుకువ వచ్చింది శమంతకి.మెలుకువ రాగానే ఈ రోజు శ్రీధర్ వస్తున్నాడన్న విషయం గుర్తుకు వచ్చి ఆనందంతో పులకించిపోయింది.

"అబ్బా! శ్రీధర్ ని చూసి అప్పుడే ఆర్నెలవుతుంది.ఇన్నాళ్లు చూడకుండా ఎలా ఉండగలిగింది? అతనిక్కడ ఉన్నన్నాళ్ళు తనకిక పండుగే.ఏడింటికల్లా హైదరాబాదు వచ్చేస్తాడు.తనింటికి కనీసం పదికల్లా రావచ్చు.ఈ లోపల తను రెడీ అయిపోవాలి"అనుకొని చెంగున మంచం దిగి బాత్రూం కి వెళ్ళింది.

శ్రీధర్,శమంత ఐదవ క్లాసు నుంచి ఒకే స్కూల్లో చదివారు.12 వ క్లాసు తర్వాత శ్రీధర్ మంచి మార్కులతో ఆల్ ఇండియా టెస్ట్ లో కూడా మంచి ర్యాంకు తెచ్చుకొని ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళాడు. శమంత కూడా మంచి మార్కులతో పాసై హైదరాబాదులోని ఆడపిల్లల కాలేజీలో బి.ఏ పొలిటికల్ సైన్స్ ఆనర్స్ చేస్తున్నది.ఆమె ఇప్పుడు బి.ఏ ఫైనల్ పరీక్షలు రాసి సీటు వస్తే హైదరాబాద్ యూనివర్సిటీ లో ఎమ్.ఏ చేయాలన్న ఆలోచనలో ఉంది.

శమంతకి స్కూల్లో ఉన్నప్పుడు కూడా శ్రీధర్ అంటే ఇష్టంగా ఉండేది.నెమ్మదిగా ఉండి, మృదువుగా మాట్లాడే శ్రీధర్ స్వభావం ఆమెకెంతో నచ్చేది. యుక్తవయస్సు రాగానే ఆ ఇష్టం నెమ్మదిగా ప్రేమ లోకి మారింది. శ్రీధర్ కి కూడా ఆమె అంటే ఎంతో అభిమానం.అమాయకంగా చురుగ్గా ఉండే శమంత అతనికి స్కూలు రోజుల నుంచి ప్రియ స్నేహితురాలు.ఆ తర్వాత ప్రియురాలు.

 రోజూ బద్ధకంగా పదిసార్లు చెప్పించుకొని తాత్సారం చేసే శమంత ఈరోజు హడావిడిగా తయారై హాల్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చూసి నవ్వుకుంది శారద.ఆమెకి తెలుసు  శ్రీధర్ అంటే కూతురికి ఎంత ఇష్టమో.

శమంతా హాల్లో సోఫాలు శుభ్రం చేసింది.కుషన్స్ ఒకటికి పది సార్లు సర్దింది.పూలు తీసుకొచ్చి వాజుల్లో అమర్చింది.ఎదురుతెన్నులు చూస్తూ గడియారం వంక పదేపదే చూడసాగింది.శ్రీధర్ ఎంతకీ రాలేదు.అతని సెల్ కి ఫోన్ లు చేస్తుంటే స్విచాఫ్ వస్తున్నది.

ఈలోగా భోజనం టైం అయింది. తల్లి బలవంతం మీద భోజనం అయిందనిపించింది.ఆ తరువాత సోఫాలో చాలా సేపు ఎదురు చూస్తూ గడిపింది.చివరికి విసుగనిపించి అక్కడే పడుకుంది. ఐదింటికి కాలింగ్ బెల్ మ్రోగ్గా ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది.

 ఎదురుగా చిరునవ్వుతో శ్రీధర్. అతన్ని చూడగానే అన్నీ మర్చిపోయి నవ్వింది.ఇద్దరు ఒకరినొకరు గాడంగా చూసుకుంటూ నిలబడిపోయారు. లేత నీలం రంగు షెల్వార్ కమీజ్ లో అతనికి దేవతలా కనిపించింది. ఇంకా ఎత్తు పెరిగి దృఢంగా తయారైన శ్రీధర్ ని శమంత తనివితీరా చూడ సాగింది.చివరకి శమంత తేరుకొని తెచ్చుకున్న కోపంతో.

 "పొద్దుననగా వచ్చి ఇప్పుడా రావడం? నీకోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను తెలుసా? నీ సెల్ ఉదయం నుంచి స్విచాఫ్ వస్తున్నదేందుకు?" అంది.

 "సారీ శమంతా! తొందరగానే వద్దామనుకున్నాను.డాడీ కారు సర్వీసింగ్ కి ఇయ్యమన్నారు. అక్కడికి వెళ్తే అనుకోకుండా ఒక ఫ్రెండ్ కలిశాడు.దాంతో ఆలస్యం అయింది.సెల్ కి ఛార్జింగ్ పెట్టడానికి ఈరోజు టైమే కుదరలేదు.ఇంతకీ నన్ను లోపలికి రానిస్తావా?" అన్నాడు.

శమంత దారి ఇచ్చింది.ఇద్దరూ కూర్చున్నాక శమంత నాన్ స్టాప్ గా కబుర్లు చెప్పసాగింది.తన చదువు, స్నేహితురాండ్రు,ఎమ్.ఏ లో చేరే విషయం,వీటన్నిటినీ గురించి శ్రీధర్ చెవిన వేయాలనే ఆత్రంతో చెప్తున్నది.కొంచెం సేపటికి ఆపి

 "నువ్వు ఏమీ మాట్లాడటం లేదు" అంది.

" నువ్వు మాట్లాడనిస్తేగా" అన్నాడు నవ్వుతూ.

ఇంతలో శారద ఇద్దరికీ కాఫీ,టిఫిన్ లిచ్చి శ్రీధర్ విశేషాలు అడిగి తెలుసుకుంది.కొంచెం సేపు కూర్చొని లోపలికెళ్ళింది.

ఇద్దరు కాఫీ,టిఫిన్లు పూర్తి చేశారు.కాసేపు శ్రీధర్ తన కాలేజీ విషయాలు,ఫ్రెండ్స్ కబుర్లు,పూనా విశేషాలు చెప్పి "అలా పార్క్ కి వెల్లోద్దామా?" అని అడిగాడు.

 శమంత ఉత్సాహంగా "అలాగే అమ్మకి చెప్పోస్తాను ఉండు" అంది.

 ఇద్దరూ కాలనీకి కొంచెం దూరంగా ఉన్న పార్క్ కి దారి తీశారు.పెద్ద పెద్ద చెట్లతో, రకరకాల పూల మొక్కలతో అందంగా ఉంది పార్కు.జనం ఎక్కువగా లేరు.ఒక మూలగా ఉన్న బెంచి మీద కూర్చున్నారిద్దరు.కొంచెంసేపు మామూలు మాటల తర్వాత

" మూడు సంవత్సరాలు గిర్రున తిరిగి పోయాయి.నాలుగో సంవత్సరంలో నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చేది, ఎక్కడ పోస్టింగ్ అయ్యేది తెలిసిపోతుంది" అన్నాడు శ్రీధర్.

"నువ్విక పైకి చదవ్వా? ఉద్యోగంలో చేరి పోతావా?' అడిగింది శమంత.

 "అవును. నువ్వు లేకుండా ఇక ఎక్కువ రోజులు ఉండలేను శమంతా.ఉద్యోగం వస్తే, పెళ్లి చేసుకుని నిన్ను తీసుకెళ్తాను" అన్నాడు.

 "మరి నా చదువు?" అంది గాభరాగా శమంత.

"అవును కదూ! మర్చిపోయాను. పెళ్లయిన తర్వాత కూడా నువ్వు చదువుకో! నీ చదువు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వద్దువుగానీ" అన్నాడు.

 "మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా?కులాల ప్రసక్తి తీసుకురారు కదా?"అంది శమంత అతని చేతిని తన గుప్పిట్లోకి తీసుకుంటూ దిగులుగా.

 "వాళ్లని ఒప్పించే బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడకు.నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నిన్ను చేసుకుంటానని ఇంట్లో చెప్తాను" అన్నాడు.

పార్కులో చీకటి పడింది.చుట్టు పక్కల ఎవరూ లేకుండా చూసి శమంతని ముద్దుపెట్టుకున్నాడు శ్రీధర్.

 అతనికి స్కూల్లో చదివేటప్పుడు శమంత తన పుట్టినరోజు నాడు దాచుకున్న పాకెట్ మనీ తో గిఫ్ట్ లు  కొనివ్వడం,ఒకసారి తనకి శిక్ష తప్పించడానికి చెయ్యని తప్పుని తనమీద వేసుకుని తెలుగు టీచర్ తో తిట్లు తినడం గుర్తుకు వచ్చి మనసు ఆర్ద్రతతో నిండిపోగా శమంతను తన ఒడిలోకి లాక్కున్నాడు.అలా చాలా సేపు గడిచిపోయింది. చివరికి శ్రీధర్ తెలివి తెచ్చుకొని

 "ఇక వెళ్దాం పద. చాలా టైమ్ అయింది" అన్నాడు.

 శమంత అయిష్టంగా లేచింది. ఇద్దరు కొంచెం దూరంగా నడుస్తూ కాలనీ చేరుకున్నారు.శమంతని ఇంటి దగ్గర దించి బై చెప్పి ఆ వీధి చివరి లోనే ఉన్నా తన ఇంటికి దారి తీసాడు శ్రీధర్.

శ్రీధర్ ఉన్న నెలరోజులు గిర్రున తిరిగి పోయాయి.ఎన్నో ఊసులాడుకున్నారు.ఊహల్లో విహరించారు.ఇంట్లో వాళ్ళకి తెలియకుండా షికార్లు చేశారు. సినిమాల కి వెళ్లారు.చివరికి శ్రీధర్ వెళ్లే రోజు వచ్చింది.శమంత కళ్ళనీళ్ళు పెట్టుకుంది.ఇంకో సంవత్సరం ఓపిక పట్టమని ఓదార్చాడు.

శమంత తండ్రి మురళీధర్, శ్రీధర్ తండ్రి సూర్యప్రకాష్ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు.ఇద్దరూ స్నేహంగా ఉంటారు.శారద,శ్రీధర్ తల్లి సుమిత్ర కిట్టి మెంబర్లు.మంచి స్నేహితులు.రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉన్నాయి.శ్రీధర్,శమంతల విషయం శమంత తల్లిదండ్రులు చూచాయగా గ్రహించారు.శ్రీధర్ తల్లిదండ్రులకి విషయం తెలుసా అన్నదే ఇంకా తేలని విషయం. ఎందుకంటే శ్రీధర్ శమంత ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు.శమంత మాత్రం శ్రీధర్ ఇంటికి ఎంతో అవసరం అయితే తప్ప వెళ్ళేది కాదు.

ఆ తర్వాత శమంత ఎమ్.ఏ లో చేరింది.శ్రీధర్ తో ఫోన్ల ద్వారా టచ్లో ఉంది.శ్రీధర్ కి ఫైనలియర్ అవ్వడం మూలానా,క్యాంపస్ ఇంటర్వ్యూల మూలాన ఇంటికి రావడం కుదరలేదు. శ్రీధర్ కి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ఢిల్లీలో మొదటి పోస్టింగ్ అని సుమిత్ర శారదకి చెప్పింది.శ్రీధర్ కూడా శమంతకా విషయం చెప్పాడు.

ఇంకో మూడు నెలల్లో శ్రీధర్ తిరిగి వస్తాడనగా శమంతకి అతని నుంచి ఫోన్లు రావడం ఆగిపోయింది.శమంత ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీధర్ సెల్ స్విచాఫ్ వచ్చేది.శమంత దిగులు పడింది. శ్రీధర్ ఎందుకు ఫోను చేయడం లేదో ఆమెకు అర్థం కావడం లేదు. అతనెప్పుడూ వస్తాడా అని వేయికళ్ళతో ఎదురు చూడసాగింది.

ఒకరోజు ఈ యూనివర్సిటీ నుంచి నాలుగింటికి ఇంటికి రాగానే తల్లి కాఫీ ఇస్తూ

 "శ్రీధర్ వచ్చి నాలుగు రోజులు అయిందట! నీకు తెలుసా?" అంది.

శమంత నిర్ఘాంతపోయింది."తనకు కనీసం కబురు కూడా చేయలేదేంటి  శ్రీధర్?" అని మదన పడసాగింది.

శ్రీధర్ ప్రవర్తన శమంత లో తెలియని భయాన్ని కలిగించాయి. తెరవెనుక ఏదో జరుగుతుంది అదేమిటో ఆమె ఊహించలేకపోయింది.ఇంకో రెండు రోజులు శ్రీధర్ తన ఇంటికి వస్తాడని ఎదురు చూసింది. రాకపోయేసరికి ధైర్యం చేసి అతని ఇంటికి వెళ్లింది.

ఆ రోజు ఆదివారం.సూర్యప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు.శమంత పలకరించి, "లోపల ఉష ఉందమ్మా! వెళ్ళు!" అని ఒక వైపు ఉన్న బెడ్రూమ్ చూపించాడు.శమంత లోపలికెళ్ళింది. శ్రీధర్ చెల్లెలు ఉష ఏదో పుస్తకం చదువుకుంటున్నది.శమంతని చూసి లేచి నవ్వుతూ పలకరించి కూర్చోమంది. ఉషా నెల్లూరులో మెడిసన్ రెండవ సంవత్సరం చదువుతుంది. నిన్ననే హైదరాబాద్ వచ్చినట్లు మాటల్లో చెప్పింది. కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఇక ఆపుకోలేక

" శ్రీధర్ వచ్చాడటగా! కనబడడేం?" అంది ఆత్రుత కనబడకుండా.

"అన్నయ్య,అమ్మ విజయవాడ వెళ్లారు.అన్నయ్య కి సంబంధం వచ్చింది.అమ్మాయి ని చూడటానికి వెళ్లారు.డాడీ ఆఫీస్ పనుల వలన వెళ్లలేకపోయారు.సంబంధం తెచ్చిన అరుణ ఆంటీ అమ్మతో, అన్నయ్య తో కూడా వెళ్లారు" అంది.

శమంత తల గిర్రున తిరిగింది. దిక్కుతోచలేదు.క్షణాల్లో మనిషి డీలా పడిపోయింది.తలపట్టుకు కూర్చుంది.

ఉష కంగారు పడింది.

 "ఏమిటి అలా ఉన్నావు" అని అడిగింది.

శమంత కి ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియలేదు. ఉషా వ్యవహారం చూస్తే ఆమెకేమీ తెలిసినట్టు లేదు. ఇక అక్కడ ఆమెకు ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు.

"ఏం లేదు ఉషా! సడన్గా తలనొప్పి మొదలైంది.ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని వడివడిగా లేచి బయటకొచ్చేసింది.

ఇంటికొచ్చిందేగాని మనస్సు మనస్సులో లేదు.తల్లి పలకరిస్తున్న వినకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మంచం మీద పడి ఏడవసాగింది. ఒక గంట తర్వాత తల్లి వచ్చి తలుపు కొట్టింది.లేచి తలుపు తీసింది.మొహం ఉబ్బిపోయి,కళ్లెర్రగా ఉన్న కూతురుని చూసి ఏదో జరిగిందని గ్రహించింది శారద.అనునయించగా వెక్కిళ్ల మధ్య జరిగింది చెప్పింది. శ్రీధర్ ప్రవర్తనలో వచ్చిన మార్పుని,తనకి మధ్య ఫోను చేయకపోవడాన్ని గురించి కూడా చెప్పింది.

ఈ సారి ఆశ్చర్యపోవడం శారద వంతయింది.సుమిత్ర తనకీ విషయం మాట మాత్రమైనా చెప్పకపోవడం విచిత్రంగా అనిపించింది.అసలు విషయం తెలుసుకుంటానని శమంతని ఓదార్చింది.మురళీధర్ ఇంటికి రాగానే విషయం చెప్పింది.ఆయన కూడా ఆశ్చర్యపడి  "సూర్యప్రకాష్ అన్ని విషయాలు నాతో చెప్తాడు.ఈ విషయం ఎందుకని చెప్పలేదు?" అన్నాడు.

ఆయన శారద ఇద్దరూ ఎంతో సేపు ఆలోచించి సుమిత్ర,శ్రీధర్ ఊరు నుంచి రాగానే వెళ్లి మాట్లాడదామన్న నిర్ణయానికొచ్చారు.రెండు రోజుల తర్వాత శ్రీధర్,సుమిత్ర వచ్చినట్లు తెలిసింది.శారద మురళీధర్ ఆ రోజు సాయంత్రం శ్రీధర్ ఇంటికెళ్లారు.వాళ్ళు వచ్చేవరకు ముళ్ల మీదున్నట్లు గడిపింది శమంత.ఒక గంట తర్వాత వాళ్ళిద్దరూ ముఖాలు వేలాడేసుకుని వచ్చారు.శమంతకి జరిగింది చెప్పారు.

వీళ్ళు వెళ్లగానే సుమిత్ర మొదట్లో కొంచెం గాబరా పడి సర్దుకుంది. కొంచెంసేపు మామూలుగా మాట్లాడుకున్నారు.సంభాషణల్లో కేవలం సుమిత్ర పాలుపంచుకుంది. సూర్య ప్రకాష్,శ్రీధర్ ముభావంగా కూర్చున్నారు.కాసేపటికి సుమిత్ర నవ్వుతూ  "శ్రీధర్ పెళ్లి కుదిరింది.విజయవాడ అమ్మాయి. పేరు లావణ్య. మా వాళ్లే. వచ్చే నెల మూడవ తారీఖున విజయవాడలో పెళ్లి. మీరందరూ తప్పకుండా రావాలి" అంది.

 "అదేమిటి సుమిత్ర? చిన్నప్పటి నుంచీ శమంత,శ్రీధర్ కలిసి పెరిగారు.కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు.ఒకరినొకరు కూడా ఇష్టపడుతున్నారని కూడా నేను అనుకుంటున్నాను.అయినా ఇంత హఠాత్తుగా వెళ్లి పెళ్లి కాయం చేసుకోవచ్చారెందుకు? మాట మాత్రమైనా మాకు చెప్పలేదు ఎందుకని?శ్రీధర్ చదువయ్యాక మేమే మిమ్మల్ని అడుగుదామనుకున్నాం" అంది శారద.

దానికి సుమిత్ర వాళ్ళిద్దరూ "క్లాస్ మేట్స్,ఫ్రెండ్స్. అంతే!అయినా వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుందని మీరెలా అనుకున్నారు.మన కులాలు వేరు కదా.నేను బతికుండగా ఇది జరగని పని. వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు.వాళ్ళకి విషయాలు తెలియవు.శమంతకి సర్ది చెప్పాల్సింది పోయి రాయబారానికి వచ్చారా" అంది అక్కసుగా.

 శారదకేం మాట్లాడాలో తెలియలేదు.శ్రీధర్ వంక చూసి "శమంత నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఇలా చేసావేం శ్రీధర్?" అంది బాధగా.

శ్రీధర్ ఏమి చెప్పలేనట్లుగా తలవంచుకున్నాడు.దానిని బట్టే గ్రహించుకుని శారద ఇక లాభం లేదని భర్తతోపాటు బయటకి వచ్చేసింది.

ఆ తర్వాత ఆ రెండిళ్ళ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. సుమిత్ర,శారదలు కలుసుకోవడం మాట్లాడుకోవడం మానేశారు.శ్రీధర్ పెళ్లి కార్డు కూడా ఉష ద్వారా పంపించారు.

 శమంతా హృదయానికి లోతైన గాయం తగిలింది.ఆమె ప్రపంచం అస్తవ్యస్తమైంది.శ్రీధర్ మీద ఆగ్రహంతో ఉడికి పోయింది.

 "అతన్ని ఎంత గుడ్డిగా నమ్మింది. చిన్నప్పటినుంచి అతనితోనే జీవితం అనుకుంది.పెళ్ళికి ఒప్పుకునే ముందు కనీసం తనకు క్షమాపణ చెబుతూ ఉత్తరమయినా రాయొచ్చుగా? అసలు ఏమీ పట్టనట్లు మౌనంగా అన్నిటికీ రాజీపడి పిరికితనం చూపించాడు. తల్లిదండ్రులనెదిరించి తనని చేసుకోవచ్చుగా?ఆ మాత్రం ధైర్యం లేదా? ఎన్ని ప్రమాణాలు చేశాడు? తను అనుకుంటూనే ఉంది కులాల ప్రసక్తి వస్తుందని, ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను కదా అని ఎంత నమ్మకంగా చెప్పాడు?" అనుకొని విలవిలలాడింది.

తల్లిదండ్రులు ఎంతో ఓదార్చారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకముందు జీవితాన్ని గురించి ఆలోచించమన్నారు.కానీ శమంత కృంగిపోయింది.నిద్రాహారాలు మాని విలపించింది.

కాలం ఎవరికోసం ఆగదు.మూడో తారీకు వచ్చింది.వెళ్లిపోయింది కూడా.ఇరుగుపొరుగుల ద్వారా శ్రీధర్ పెళ్లి అయిపోయినట్లు, లావణ్య తో సహా ఇంటికి వచ్చినట్లు తెలిసింది.రెండు రోజుల తర్వాత హనీమూన్కి కేరళ వెళ్తున్నట్లు కూడా తెలిసింది. శ్రీధర్ కి ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి శమంతని చేసుకుంటానని చెప్పాడని,తల్లి కులాల ప్రసక్తి తెచ్చి ససేమిరా అన్నదని,శ్రీధర్ మాట వినకపోతే తన శవాన్ని చూడాల్సి వస్తుందని,శమంతతో ఇక ఎటువంటి సంపర్కం పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చిందని,లావణ్య పెద్ద కట్నంతో లాంచనాలతో వచ్చిందని సుమిత్ర శారద ఇద్దరితో స్నేహంగా ఉండే సౌజన్య ద్వారా విషయాలు తెలిశాయి.

నెమ్మదిగా శమంతా కొంత తేరుకుంది."తనకి వీసమంతైనా విలువ ఇవ్వని శ్రీధర్ ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి.అది అనుకున్నంత తేలిక కాకపోయినా తప్పదు మరి!" అనుకుంది.

 శ్రీధర్ లావణ్య హనీమూన్ నుంచి వచ్చారని తెలిసింది. ఆ నెల 15వ తారీఖున లావణ్య పుట్టిన రోజు గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారని చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచారని కూడా తెలిసింది.

15వ తారీకు రానే వచ్చింది.శ్రీధర్ ఇంటిని రంగురంగుల పూలతో అలంకరించారు. బయట షామియనా వేశారు.సాయంత్రం అయింది.అతిథులు రావడం మొదలైంది.

ఉదయం నుంచి రెస్ట్ లెస్ గా గడిపిన శమంత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు లేచి నైటీ తీసేసి డ్రెస్ వేసుకుంది.తల్లికి ఇప్పుడే వస్తానని చెప్పి, ఎక్కడికని అడుగుతున్న వినిపించుకోకుండా, బయటకి వచ్చి వడివడిగా శ్రీధర్ ఇంటి వైపు వెళ్ళింది.గేటు తీసుకొని హాల్లోకి వచ్చింది.హాల్లో లావణ్య అప్పుడే కేక్ కట్ చేసింది. చుట్టూ ఉన్నఅందరూ "హ్యాపీ బర్త్డే టూ యు" అని పాడారు శ్రీధర్ తో సహా. చిన్న కేకు ముక్క శ్రీధర్ ఆమె నోట్లో పెట్టాడు.ఆమె కూడా అతని నోట్లో పెట్టింది. ఇద్దరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. హఠాత్తుగా శ్రీధర్ దృష్టి వాళ్ళిద్దరినీ చూస్తున్నట్లు ఉన్న శమంత మీదకు మళ్ళింది.నిశ్చేష్టుడై ఆమె వంకే చూడసాగాడు.నెమ్మదిగా అందరి దృష్టి ఆమె మీదకు మళ్ళింది.

శమంత శ్రీధర్ వంక సూటిగా చూస్తూ మాట్లాడ సాగింది. "శ్రీధర్ చాలా సంతోషంగా ఉన్నావే? చిన్ననాటి స్నేహితురాలిని, నీ ప్రియసఖిని నన్ను మర్చిపోయావా? తల్లి బెదిరింపులకు లొంగి పోయావా? లేక లావణ్య కట్నానికి దాసోహం అన్నావా? అందంలో నా కాలి గోటికి కూడా సరిపోని లావణ్య ధన మోహంలో అతిలోక సుందరిలా కనబడుతున్నదా? హనీమూన్ కి వెళ్లొచ్చావ్. రేపు లావణ్య తో సహా ఢిల్లీ వెళ్తున్నావు. కొత్త జీవితం ప్రారంభించబోతున్నావ్. ఇక ఈ పాత ప్రేయసిని పూర్తిగా మర్చిపోతావ్. అవునా? నా ఇక నా సంగతి.నాకు చిల్లిగవ్వ విలువ కూడా ఇవ్వని నీ కోసం జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావా? నెవర్. నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. బాగా చదువుకుంటాను. మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడుతా. నేనంటే ఇష్టపడేవాడిని, నన్ను నన్నుగా అభిమానించి విలువనిచ్చి గౌరవించే వాడిని పెళ్లి చేసుకుంటాను.ఇక నీ కోసం ఒక్క కన్నీటిబొట్టు కూడా వ్యర్థం చెయ్యను.ఆఖరిగా నా కోరిక ఒకటి తీర్చుకుంటాను.అంతేకాదు నీకు జీవితాంతం గుర్తు ఉండే బహుమతి కూడా ఇచ్చి వెళతాను. అని వేగంగా శ్రీధర్ దగ్గరికెళ్ళి తనకు ఉన్న శక్తినంతా కూడదీసుకుని చెంప చెల్లుమనిపించింది. ఇక ఎవరి వంక చూడకుండా వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోయింది.

 ఏం జరిగిందో అర్థం కాక పోయినా ఇంటికి వచ్చిన కూతురు ముఖంలో కనపడిన ప్రశాంతత, ఏదో నిర్ణయానికి వచ్చిన నిశ్చింత చూసి శారద దీర్ఘంగా నిట్టూర్చింది.

 

కథలు

 మార్పు మనతోనే 

(మలిశెట్టి  సీతారాం స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ )

సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది.

పగలంతా ప్రచండ ప్రతాపం చూపించిన భానుడు మెల్లగా పడమటింటికి జారుకుంటున్నాడు.

నేను పొద్దున్న మిద్దె పైన వేసిన వడియాలు తీసి పెట్టి, శ్రీవారు వచ్చే టైం అయింది అనుకుంటూ కిందకు దిగి వచ్చాను.

అప్పుడే స్కూల్ నుండి వచ్చిన చిన్నూ బ్యాగు లోపల పెట్టి, డ్రెస్ కూడా మార్చుకోకుండా టీవీ ముందు కూర్చుని వాడికిష్టమైన కార్టూన్ ఛానెల్ పెట్టుకుని చూస్తున్నాడు.

చిన్నూ! లే! వెళ్లి డ్రెస్ మార్చుకొని మొహం కడుగు. టీవీ  తర్వాత చూద్దువు గానీ....చెప్పాను వాడితో.

కాసేపు అమ్మా!గారంగా అడిగాడు వాడు.

కుదరదు వెళ్లుమరో సారి గట్టిగా చెప్పేసరికి లేచి లోపలికెళ్ళాడు వాడు.

గబా గబా డ్రెస్ మార్చి, మొహం కడిగాడనిపించాడు.

ఆయన వచ్చేలోగా తినడానికి ఏదైనా చేద్దామని, కింద కూర్చుని ఉల్లిపాయలు తరుగుతున్న నా మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ   “ అమ్మా! ఐ వాంట్ ఏమన్నా...అన్నాడు గోముగా. 

వాడు అడిగే పద్ధతికి నవ్వొచ్చింది. ముద్దుగా వాడి బుగ్గలు పుణికి, ముందు రోజు చేసిన జంతికలు ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చాను. అవి పట్టుకెళ్ళి టీవీ ముందు కూర్చున్నాడు. 

రోజు ఐదున్నర లోపు వచ్చేసే మా వారు ఆ రోజు ఆరవుతున్నా రాలేదెందుకో....

మరో అరగంట గడిచాక వచ్చారు. బాగా అలసిపోయినట్టున్నారు. కొంచెం చిరాగ్గా కనిపించారు. రాగానే టీవీ చూస్తున్న చిన్నూ కనిపించేసరికి అతడి చిరాకు కోపంగా మారిపోయింది. 

ఎప్పుడూ టీవీ చూస్తూనే ఉంటాడు వెధవ. హోం వర్క్ చేసావా?” అడిగాడు అదే కోపంలో.... తను బజార్లో కొనుక్కొచ్చిన అరటిపళ్ళ కవర్ నా చేతిలో పెడుతూ.

బిక్కమొఖం వేసాడు చిన్నూ. వచ్చినప్పటి నుండి టీవీ చూడటమే సరిపోయింది.ఇక హోం వర్క్ ఎప్పుడు చేసాడు?

ఏంటి సుజా! వాడిని చదువుకోమని చెప్పకుండా నువ్వు ఏం చేస్తున్నావ్? వాడిని నెత్తికి ఎక్కించుకుని పనికిరాకుండా చేస్తున్నావ్?” నా మీద ధుమ ధుమలాడారు.

నేను మెల్లగా వాడికి లోపలికి వెళ్ళమన్నట్టు సైగ చేసాను.

వాడు గప్ చుప్ గా వెళ్లి పుస్తకాలు ముందేసుకున్నాడు.  వాడు చదువుతున్నది ఏడో క్లాసే అయినా చదువులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆయనకు నచ్చదు. అలాగని చిన్నూ మొద్దబ్బాయి ఏం కాదు. క్లాసులో మొదటి ముగ్గురిలోనే ఉంటాడు. అయినా సరే.. వాడి చేతిలో ఎప్పుడూ పుస్తకం లేకుంటే వాళ్ళ నాన్న అరుస్తూనే ఉంటారు.

తను ఫ్రెష్ అయి రాగానే కాఫీ అందించాను.                                                                                           “లాభం లేదు సుజా! వీడు ఇక్కడ ఉంటే చదవడు. ఎప్పుడూ టీవీ లేదా ఆటలు. నెక్స్ట్ ఇయర్ వీడిని హాస్టల్ లో వేసేయ్యాలి. మంచి ఐఐటి కోచింగ్ సెంటర్ చూసి చేరిస్తే ఇంటర్ లో మంచి మార్కులు,ఐఐటి లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందిఅన్నాడు కాఫీ తాగుతూ.

ఇప్పటి నుండి హాస్టల్ ఎందుకు? వాడు అసలు ఉండగలడో...  లేదో...ఇక్కడ బాగానే చదువుతున్నాడు కదా!అన్నాను మెల్లగా.

నువ్వు వాడిని ఇలా ముద్దు చేసి ఇప్పటికే చాలా పాడు చేసావ్.. ఏం...వీడోక్కడేనా? మా కొలీగ్స్ చాలా మంది ఇప్పటికే వాళ్ళ పిల్లలను హాస్టల్ లో పెట్టేశారు. మన వాడు ఇప్పటికే వెనుక పడ్డాడని నేను అనుకుంటుంటే....నువ్వు ఇంకేం చెప్పకు. ఈ సారి వాడిని హాస్టల్ లో వేయాల్సిందే..అతడి గొంతులో ఖచ్చితత్వం నన్ను మరి మాట్లాడనివ్వలేదు.

చదువుల పేరుతో పిల్లల్ని ఇలా రాపాడించేయడం, ఆడుతూ పాడుతూ గడపాల్సిన వారి బాల్యాన్ని హరించేయడం  నాకు అసలు ఇష్టం ఉండదు. కాని ఆ మాట అంటే అందరూ నన్ను పిచ్చిదానిలా చూడటం నేను ఎరుగుదును. అందుకే నోరు మెదపలేదు. 

పడుకోబోయేముందు మరో సారి చిన్నూను హాస్టల్ లో చేర్చే విషయంలో తను స్థిర నిర్ణయమే తీసుకున్నట్టు మా ఇద్దరినీ మరో సారి హెచ్చరించాడు.

ప్రతి సారిలా ఆయన హాస్టల్ అనడం...నేను వాడింకా చిన్నపిల్లాడని వాయిదా వెయ్యడం ...ఈ సారి జరగలేదు. ఆయన   నిర్ణయం గట్టిగానే తీసేసుకున్నారు. మాకు రెండొందల కిలోమీటర్ల దూరంలో ఓ కార్పొరేట్ స్కూల్ లో ఫీజు కూడా కట్టేసి సీట్ బుక్ చేసేసారు. చేసేదేం లేక చిన్నూ గాడిని నేనే కాస్త మానసికం గా సమాయత్తం చెయ్యసాగాను. అక్కడ ఇంకా మంచి టీచర్లు ఉంటారు.బాగా చదువు చెప్తారు. నువ్వు బాగా చదువుకోవాలని కదా..డాడి అంత ఫీజు కట్టారు. నువ్వు బాగా చదివి పేద్ద ఉద్యోగం తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా... ఇలాంటి మాటలతో  వాడి బుర్రని రోజూ కాస్త శుధ్ధి చేసాను.

నిండా పన్నెండేళ్ళు కూడా లేని పసివాడు. ఏ చిన్న పని చేసుకోవడం చేతగాని వాడు. వాడిని అలా పంపడానికి నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ వాళ్ళ నాన్నకు ఎదురుచేప్పే సాహసం చేయలేక పోయాను. ఎప్పుడూ అమ్మా అమ్మా అని నా చుట్టూ తిరిగే వాడిని వదిలి నేను ఉండగలనా...ఏమో వాడు వెళితే గాని తెలీదు. నేను చెప్పింది వాడికి ఏం అర్థమయ్యిందో తెలీదు కానీ హాస్టల్ లో చేరడానికి ఒప్పుకున్నాడు.

ఆ రోజు వాడిని హాస్టల్లో చేర్చడానికి వెళ్ళాం. ఏ నేరం చేయని బాలఖైదీలు అక్కడ చాలామందే ఉన్నారు.  చదువుల పందేరంలో  పిల్లలు పందెం కోళ్ళుగా  మారిన ఈ కాలంలో పుట్టడం వాళ్ళు చేసిన పాపం. తల్లి తండ్రులే ఆ జైలు శిక్షవిధించే జడ్జీలు అవడం మరో దారుణం.

కొంతమంది పిల్లలు తల్లి తండ్రులు వెళ్లిపోతుంటే ఏడుస్తున్నారు. మరికొంతమంది ఏవేవో కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది నిర్లిప్తంగా చూస్తున్నారు. మరికొంత మంది పిల్లలు అక్కడికి వచ్చిన పెద్దవారి దగ్గర, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి కాసేపు ఫోన్ ఇవ్వమని బతిమాలుకుంటున్నారు. ఆ సందట్లో పిల్లలు పారిపోకుండా అక్కడక్కడా వార్డెన్లు అనబడే జైలర్లు కాపలా కాస్తున్నారు. అలాంటిచోట నా చిన్నుని వదిలి వెళ్ళడానికి నాకు మనస్కరించడం లేదు. ఆయన కూడా ఆ వాతావరణం చూసి కాస్త మెత్తపడ్డ మాట నిజమే కానీ అంతలోనే తను కట్టేసిన లక్ష రూపాయల ఫీజు గుర్తొచ్చినట్టుంది.  ఇదంతా వాడి భవిష్యత్ కోసమే కదా..... అని తనను తాను, నన్ను కూడా సమాధానపర్చారు. చిన్నూకి మరి కొన్ని బుద్ధి మాటలు చెప్పి వాడిని అక్కడే వదిలి ఇంటికి తిరిగొచ్చేసాం.

ఆ రోజు రాత్రి కాలేజీ నుండి ఫోన్. కొత్తగా చేరిన పిల్లలకు మాత్రం మాట్లాడటానికి అనుమతి ఇచ్చారట. 

ఎలా ఉన్నావ్ చిన్నూ!..తిన్నావా!ఆత్రుతగా అడిగాను. వాడిని వదిలి కొన్ని గంటలే అయినా ఎన్నో యుగాలు అయినట్టుంది నాకు.

నాకిక్కడ ఏం బాలేదమ్మా! నువ్వు గుర్తొస్తున్నావ్...వాడి కంఠం లో ఏడుపు.

నాకు గుండె మెలిపెట్టినట్టు అయింది. తమాయించుకున్నాను.

కొత్త చోటు కదా నాన్నా! రెండు రోజులు పోతే అలవాటు అవుతుంది. ఎవరినైనా ఫ్రెండ్స్ చేసుకో.. మేము మళ్ళీ వచ్చే ఆదివారం వస్తాంగా ...నీకు వచ్చేటపుడు ఏం కావాలో చెప్పు. అవన్నీ తీసుకొస్తా...నా గొంతులో జీర వాడు గుర్తించకుండా జాగ్రత్త పడ్డాను.

నాకేం వద్దు....నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను...” 

అలా అనకూడదు నాన్నా! నీ కోసమేగా ....నువ్వు బాగా చదువుకోవాలనేగా ....అనునయించాను.

వాళ్ళ నాన్న కూడా కాసేపు బుజ్జగించారు. చివరకు టైం అయిపోయిందని వాళ్ళు ఫోన్ పెట్టేశారు.

నాది ఎంత రాతి గుండె! నువ్వు గుర్తొస్తున్నావమ్మా అని వాడు ఏడుస్తుంటే పరుగున వెళ్లి వాడిని తెచ్చుకోకుండా ఇంకా ఇక్కడే ఇంత నిబ్బరంగా ఉన్నాను.....తల్లికి, పిల్లలకు ఇంత వేదన కలిగించే ఈ చదువులు అవసరమా...అనిపించింది.

ఇక నాకు తిండి కూడా సహించలేదు. నిద్ర పట్టలేదు....అలా భారంగా నాలుగు రోజులు గడిచాయి.

  రోజు మావారు ఆఫీస్ కు వెళ్లి పోయాక మనసును కాస్త మళ్లిద్దామని టీవీ ఆన్ చేసాను. నా కర్మకొద్దీ ఒక ఛానల్ లోతారే జమీన్ పర్సినిమా వస్తోంది. సరిగ్గా నేనున్న మానసిక స్థితికి అద్దం పడుతున్నట్టు  ఆ సినిమా లో కూడా ఇలాగే చిన్న పిల్లాడిని హాస్టల్ లో చేర్చి వస్తున్నపుడు బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తోంది.

అమ్మా! నేనెపుడు నీకు చెప్పలేదు...కాని నాకు చీకటంటే చాలా భయం...నీకెపుడు చూపలేదు కానీ నువ్వంటే నాకెంతో ప్రేమ..నీకన్నీ తెలుసుగా అమ్మా....నీకు నా పిలుపు వినిపించనంత  దూరంగా నన్ను వదిలేయకమ్మా ........నేను మరీ అంత చెడ్డ వాడినా అమ్మా....”  ఆ పాటలో ఒక్కొక్క వాక్యం శూలమై గుండెల్లో దిగుతూ ఉంటే  నా కనులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. టీవీ లో ఆ కుర్రాడు మాయమై నా చిన్నుగాడు కనిపిస్తున్నాడు. పాటలో తర్వాతి వాక్యం నా గుండెని నిట్టనిలువునాచీల్చింది. క్యా ఇత్నా బురా......మేరీ మా...... నా గుండె నిజంగానే పగిలి ముక్కలయింది. ఇక నా వల్ల కాలేదు. టీవీ కట్టేసాను. సాయంత్రం ఆయన వచ్చేసరికి ఏడ్చి ఏడ్చి వాచిపోయిన నా ముఖం  చూసి కంగారు పడ్డారు.

ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్?” ఆందోళనగా అడిగారు.

చిన్నూ లేకుండా ఉండలేక పోతున్నానండి. ప్రతి క్షణం వాడే గుర్తొస్తున్నాడు.మళ్ళీ నా కళ్ళలో నీళ్ళూరాయి.

నువ్విలా అయిపోతావని నేను ఊహించనే లేదు. నాకు మాత్రం వాడి మీద ప్రేమ లేదంటావా..ఈ పోటి ప్రపంచం లో వాడు ఎక్కడ వెనుక పడతాడో అనే తాపత్రయం నాకు ఉండదా...ఇప్పుడు వాడు అక్కడ అడ్జస్ట్ అయిపోయే సమయానికి నువ్విలా అయిపోవటం ఏం బాగాలేదు.ఆయన గొంతులో కాస్త బాధ, కాస్త కోపం....

తను ఏం చెప్పినా నాకు ఎక్కటం లేదు. వాడి దృష్టిలో నేను చెడ్డ తల్లిని ఎప్పటికీ అవలేను.వాడెలా చదివినా సరే... చదవకున్నా పర్లేదు...వాడిని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ప్రతి క్షణం నువ్వు గుర్తొస్తున్నావమ్మా అని వాడన్న మాటే చెవుల్లో  వినిపిస్తోంది.అన్నాను. 

సరే! ఈ ఆదివారం వెళదాం. వాడు పూర్తి ఇష్టంతో అక్కడే ఉండిపోతానంటే ఉండనివ్వు. దాన్ని నువ్వు చెడగొట్టకు. అలా కాకుండా వాడు వచ్చేస్తానంటే తీసుకొచ్చేద్దాం. ముందు నువ్వు ఆ ఏడుపు ఆపెయ్యి. నేను చూడలేను.అనునయించారు నన్ను.

ఆదివారం ఇద్దరం వెళ్ళాం. మమ్మల్ని చూసి పరుగెత్తుకుంటూ వస్తాడనుకున్నా....దూరం నుండి మమ్మల్ని చూసి నెమ్మదిగా వచ్చాడు. మనిషిలో గానీ, నడక లో గానీ ఉత్సాహమే లేదు. అన్ని రోజుల తర్వాత మమ్మల్ని చూసిన ఆనందo కూడా  లేదు వాడి ముఖంలో.

ఎలా ఉన్నావ్ చిన్నూ!వాడిని దగ్గరకు తీసుకుని అడిగాను.

మౌనంగా తల ఊపాడు. నేను తీసుకెళ్ళిన వాడికి ఇష్టమైన తినుబండారాలు ఇచ్చాను. కనీసం అవి ఏమిటో అని కూడా తెరిచి చూడలేదు. ఏమడిగినా ఆ...ఊ...అని తల ఊపుతున్నాడు గాని పన్నెత్తి మాట్లాడటం లేదు. 

ఇక్కడ ఎలా ఉంది నాన్నా! నీకు బాగో లేకుంటే చెప్పు...నాతో వచ్చేద్దువు గానీ....అడిగాను.

వద్దు అన్నట్టు తల ఊపాడు.

ఒక మాటకు పది మాటలు మాటలాడే కబుర్ల పోగు వాడు. వాడి మౌనం నన్నెంతో బాధ పెడుతోంది.

మాట్లాడు నాన్నా! నా మీద కోపమా!

వాడు పెదవి విప్పాడు.ఇక్కడే ఉంటాలేమ్మా! నాన్న ఫీజు అంతా కట్టేసాడుగా...నేను వచ్చేస్తే వాళ్ళు వెనక్కి ఇవ్వరుట....ఇక్కడ బాగానే ఉందిలే

వాళ్ళ నాన్న కట్టిన ఫీజు వృధా అవుతుందని అక్కడే ఉండిపోవడానికి సిద్ధం అయ్యాడన్న మాట. అలాంటి పిచ్చిసన్నాసి ని వదిలి నేనెలా ఉండటం? ఆయన సైగ చేశారు ఇక ఎక్కువ వాడిని కదపకు అని.

తిరిగి ఇద్దరం ఇల్లు చేరాం. కానీ ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయాను. చిన్నూ ఇంట్లో ఉన్నపుడు ఎప్పుడూ లొడలొడా మాట్లాడుతూ ఉండేవాడు. బంధువులు ఎవరు వచ్చినా చక్కగా కబుర్లు చెప్పేవాడు. మిగతా పిల్లల్లా ఫోన్ తోనో... కంప్యూటర్ గేమ్స్ తోనో ఉండిపోకుండా అందరితో బాగా కలిసి పోతాడని అందరూ వాడిని మెచ్చుకునేవారు. వారం రోజుల్లోనే వాడి కళ్ళలో ఎంత నిర్లిప్తత....ఎంతో చనువుగా ఉండే నాతో కూడా అపరిచితుడిలా ఉండిపోవడం.....ఇవన్నీ చూస్తుంటే చదువు అయిపోయే సరికి మాతో అసలు ఏదైనా అనుబంధం మిగిలి ఉంటుందా అని అనుమానం కలుగుతోంది.

ఈ పసివయసులో పెద్దల్ని ఎదిరించలేని నిస్సహాయత లోంచి రేపు ఎవరి మాట వినని మొండివాడు తయారు కావచ్చు. ఆ నిర్లిప్తత లోంచి తల్లిదండ్రులయందు దయలేని పుత్రులు పుట్టుకురావచ్చు. లేక మనమెవరం గుర్తించలేని ఒక అసాంఘిక శక్తి గా కూడా మారవచ్చు.ఇవేవీ కాక చదువుల ఒత్తిడి తట్టుకోలేక తమ జీవితాలను తామే అంతం చేసుకోవచ్చు.        పసి హృదయాలు ప్రేమాభిమానాల మధ్య ఎదగాలి కాని అభద్రత, ఆందోళనల మధ్య  కాదు.  ప్రేమ రాహిత్యంతో తయారైన యువత ఆ ఇంటికే కాదు....  సమాజానికి కూడా చేటే.                                         

అందరూ చేసే తప్పు నేను చేయదలుచుకోలేదు. మనసులో గట్టి నిర్ణయం తీసుకుని, వాడిని ఇంటికి తీసుకొచ్చేయమని మావారిని  మళ్ళీ అడిగాను.

వాడు ఉంటానంటే మధ్యన నీ గొడవ ఏమిటి?” విసుగ్గా అన్నారు మా వారు.

వాడు ఎందుకు ఉంటానంటున్నాడో మీరు వినలేదా? మీ కట్టిన డబ్బు వృధా అవుతుందని అన్నాడే గాని వాడికి కూడా ఇష్టం లేదు. మీకు వాడి కంటే డబ్బు ఎక్కువా.... అదంతా నాకు తెలీదు. వాడిని ఇక్కడికి తీసుకొచ్చేయండి..మొట్ట మొదటి సారిగా ఆయన నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాను.

నీకు ఏమైనా పిచ్చా? లక్ష రూపాయల ఫీజు కట్టాను. కాలేజీ వాడు ఒక దమ్మిడి కూడా వెనక్కి ఇవ్వడు. ఇక్కడ చేర్చాలంటే మళ్ళీ ఫీజు కట్టాలి. ఇదంతా నా వల్ల కాదు...ఆయన కూడా ఖరాఖండిగా చెప్పారు.

నేను ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయాను. కాసేపు ఏడ్చి ఊరుకుంటుందని ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ తను ఊహించినట్టు జరగలేదు. వారం రోజులైనా నేను నా పట్టు విడువలేదు.

 నా నిరాహార దీక్షలకి,మౌన వ్రతాలకు ఆయనకు దిగి రాక తప్పలేదు. మా పెళ్లి అయిన ఇన్నేళ్ళలో నేనిలా దేని కోసమైనా గొడవ చేయడం ఆయన చూడలేదు. చిన్నూ మీద చూపిన కఠినత్వం నా మీద చూపలేకపోయారు. ఆ పై ఆదివారం ఆయన ఒక్కడే వెళ్లి చిన్నూ ని తీసుకొచ్చేసారు. 

ఎలా అఘోరిస్తారో మీ ఇష్టం. వాడి భవిష్యత్ ను తీర్చి దిద్దుకుంటావో ....నాశనం చేస్తావో నువ్వే  తేల్చుకో.”  ఆ జైలు  నుండి వాడిని తీసుకు రావడం ఆయనకు కూడా లోలోపల సంతోషం కలిగించినా పైకి కోపాన్ని ప్రదర్శించారు నా మీద. బంధువులు, స్నేహితులు కొంతమంది నేను చాలా తెలివితక్కువ పని చేసానని విమర్శించారు. నేను దేన్నీ లెక్క చేయలేదు. చిన్నూ మునుపటిలా మారడానికి మరో వారం రోజులు పట్టింది.

మూడేళ్ళు గడిచిపోయాయి. పదో క్లాసు మంచి మార్కులతోనే పాసయ్యాడు.  వాడికి మార్కులు తక్కువ వచ్చినపుడు దానికి నేనే కారణం అని అరవటం....ఎక్కువ వచ్చినపుడు లోలోపల మురిసిపోవడం.....ఇదీ మా ఆయన గారి తంతు.

వాడి చదువు విషయం లో నేనెప్పుడూ బలవంత పెట్టక పోయినా చదువుకోవడం వలన ఎవరెవరు ఏమేం సాధించారు అనే ప్రేరణాత్మక విషయాలు వాడికి అప్పుడప్పుడు నూరిపోస్తుండే దాన్ని.చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే అని ప్రోత్సహించే దాన్ని. ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయాలని నేర్పేదాన్ని. తన కంటే చిన్నవారి పట్ల ప్రేమతోనూ పెద్దవారి పట్ల గౌరవంగానూ మెలగాలని చెప్పేదాన్ని. వాడు మంచి విద్యార్థిగా కంటే మంచి వ్యక్తిగా రూపు దిద్దుకోవాలని  నా తాపత్రయం. అంతేకాదు వాళ్ళ నాన్నగారు వాడిని చదువుకోమని చెప్పడంలో కూడా వాడి ఉన్నతి గురించి ఆకాంక్షే గానీ వాడి మీద ప్రేమ లేకపోవడం కాదు అని తనకు అర్థమయ్యేలా చెప్పడం లో కూడా సఫలీకృతురాలిని అయ్యాను.

ఇంటర్ లో చేర్చాలని అన్నపుడు కూడా మళ్ళీ హాస్టల్ అని చెప్పి చేతులు కాల్చుకోవటం ఎందుకని మా ఊర్లోనే ఓ కాలేజీ లో చేర్చారు వాళ్ళ నాన్న. వాడి మిగిలిన స్నేహితులు అంతా తలో దిక్కున కార్పోరేట్ కాలేజిల్లో చేరారు. 

ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి రిజల్ట్ వచ్చిన రోజు.....

చిన్నూకి ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. టౌన్ లోనూ, కార్పొరేట్ కాలేజీల్లో చదివిన వాడి స్నేహితులందరి కంటే కూడా మంచి రాంక్ వచ్చింది. వాడి కాలేజీలో ఇంతకుముందు వచ్చిన రాంకులలో కూడా వాడిదే బెస్ట్. కాలేజీ వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి వాడిని కాలేజీకి రమ్మనడంతో  చిన్నూ తయారై కాలేజికి వెళ్ళాడు. సాయంత్రం వాళ్ళ నాన్న వచ్చే సమయానికి లోకల్ న్యూస్ ఛానెల్ లో చిన్నూ గాడి  ఇంటర్వ్యూ వస్తోంది. కాలేజీ పేరు, చిన్నూ గాడి పేరు వినగానే పరుగున వంటింట్లోంచి వచ్చాను.  పసివాడు కెమెరాలను,మైకుల ను చూసి భయపడతాడనుకున్నా.... నా కళ్ళకు వాడెప్పుడు పసివాడే మరి. నన్ను ఆశ్చర్యపరుస్తూ మైకు తీసుకుని చక్కగా మాట్లాడాడు.

నా విజయానికి కారణమైన మా అమ్మా నాన్నలకు నా ధన్యవాదాలు. సాధారణ కాలేజీలో కూడా బాగా చదవగలనని నన్ను నమ్మిన మా అమ్మ, ఆమె నమ్మకాన్ని నమ్మి లక్ష రూపాయల ఫీజు కూడా వదులుకుని ఇక్కడ చేర్చిన మా నాన్న, నాకు చదువు చెప్పిన నా గురువులు.....అన్ని వేళల తోడ్పాటు అందించిన కళాశాల యాజమాన్యం అందరికీ నా కృతజ్ఞతలు. నిర్భంధంగా కాకుండా స్వేచ్చగా చదువుకోనిస్తే అందరూ నాలాగే  అద్భుతాలు సాధించగలరు.అని ముగించాడు. వాడికి చదువు చెప్పిన గురువులు వాడెంత బుద్ధిమంతుడో అంటూ ఆకాశానికి ఎత్తారు. టీవీ లో  చూస్తున్న నాకు ఆనందభాష్పాలతో  కళ్ళు చెమర్చడంతో బొమ్మలు మసకబారాయి. వీడెప్పుడూ నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు వెధవ అని మనసులో ప్రేమగా వాడిని తిట్టుకున్నా.

బయట అన్ని రకాల పళ్ళను పక్వానికి రాక ముందే చెట్టునుండి వేరు చేసి కార్బైడ్ వేసి మాగపెడుతున్నారని....అలా చేయడం వల్ల అవి రుచి పచి లేకుండా పోతున్నాయని,ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయని మనమే గగ్గోలు పెడుతుంటాం. మరి పిల్లల విషయం లో మనం ఏం చేస్తున్నాం? పన్నెండో తరగతి లో చదవాల్సిన విషయాలు ఆరో తరగతి లోనే చదివించేయాలనుకుంటున్నాం. పాతికేళ్లలో సాధించాల్సినవి టీనేజ్ లో సాధించడం లేదని బాధ పడుతున్నాం. వెరసి వారిని కూడా రుచి పచి లేని పళ్ళ లాగే... ప్రేమ, పాశం లేని మరబొమ్మలుగా తయారు చేస్తున్నాం. సమాజానికి చేటు తెస్తున్నాం. మరి మార్పు మనతోనే మొదలు పెడదామా........

 

ఈ సంచికలో...                     

FEB 2021

ఇతర పత్రికలు