పచ్చని అడవి. చిక్కని అడవిలో పచ్చిక బయలు.
ఆ అడవిలో ఉండే జీవజాలం తప్ప మరో జీవి అక్కడి జీవులకు తెలియదు. ఎప్పుడూ చూడలేదు.
అయితే , ఈ అడవి దాటితే పెద్ద ప్రపంచం ఉందనీ, ఆ ప్రపంచంలో మానవులు ఉంటారనీ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళనీ, వాళ్ళు పక్షుల్లా ఆకాశంలో విహరిస్తారనీ, సముద్రంలో చేపల్లా ప్రయాణిస్తారని, చుక్కల్లో చందమామ దగ్గరకి వెళ్ళి వచ్చారనీ ఏవేవో చాలా విషయాలు చుట్టపు చూపుగా వచ్చిన కాకమ్మ ద్వారా విన్నాయి కొన్ని జంతువులు. అందులో ఒకటి తోడేలు.
అదిగో, అప్పటినుండి ఆ మానవ ప్రపంచం లోకి పోయి అక్కడ వింతలు విశేషాలు పోగేసుకురావాలని తహతహలాడి పోతున్నది తోడేలు.
ఒకరోజు తనతో సమావేశమైన మిత్ర బృందంతో ఎన్నాళ్ళుగానో కంటున్న కల గురించి విప్పి చెప్పింది తోడేలు.
"జరిగేది చెప్పు. అనవసరపు కలలు కనకు. వంటికి మంచిది కాదు " అన్నది రైనో.
"ఆమ్మో .. మానవ లోకంలోకా... బాబోయ్ "భయంభయంగా కళ్ళు టపాటపలాడించింది దుప్పి.
"ఆకాశానికి నిచ్చెన వేద్దామంటే పడి నడ్డివిరగ్గొట్టుకున్నట్టే .. "నవ్వింది నక్క .
"నాకా వయసయిపోతున్నది . కోరిక తీరకుండానే పోతానేమో బెంగగా ఉన్నది" మిత్రుల మాటలు పట్టించుకోని తోడేలు దిగులు పడింది.
మిత్రుడి కోరిక ఆమోదయోగ్యంగా లేదు. ముక్కు మొహం తెలియని మానవ లోకంలోకి వెళ్తుందంట. చుట్టుపక్కలున్న తమ వంటి రాజ్యాల్లోకే ఎప్పుడూ తొంగి చూసే ధైర్యం చేయని తోడేలుకు పోయే కాలం వచ్చిందని మనసులోనే విసుక్కుంది ఏనుగు.
"ఆరు నూరైనా ఈ నెలలో మానవ ప్రపంచంలోకి వెళ్లి తీరాల్సిందే .. మీరెవరైనా నాతో వస్తానంటే సంతోషం. లేకున్నా నేనెళ్ళేది వెళ్ళేదే .. ఆ ప్రపంచం చూడని బతుకు వృధా .. " తనలోతాను అనుకుంటున్నట్లుగా అన్నది తోడేలు.
వయసు మళ్లుతున్న మిత్రుడి కోరికని తీర్చలేమా అన్నట్లుగా మిగతా నలుగురు మిత్రులూ ఒకరినొకరు చూసుకున్నారు.
కొన్ని ఇబ్బందులు, కష్టాలు పడితే పడదాం. పడమటి పొద్దులో ఉన్న మిత్రుడ్ని ఒంటరిగా కొత్త లోకంలోకి పంపడం మంచిది కాదేమోనన్నది దుప్పి.
నిజమే, మిత్రుడి కోరిక తీర్చడం మన ధర్మం అని నక్క, రైనా సిద్దపడ్డాయి. ఏనుగు మాత్రం తన పరిస్థితుల దృష్ట్యా రాలేనని ఖచ్చితంగా చెప్పింది. మీరు వెళ్తే మీ నాలుగు కుటుంబాల మంచి చెడు నేను చూసుకుంటానని మాటిచ్చింది.
గతంలో కాకమ్మ ద్వారా విన్న అనేక విషయాలు మననం చేసుకున్నాయవి. తమ రూపాలతో వెళ్తే వచ్చే ఇబ్బందులను గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించుకున్నాయి. మరో లోకపు జీవితాన్ని ఉన్నతంగా ఊహించుకుంటూ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి.
*** *** ***
ఆకురాలు కాలం అది . కొన్ని చెట్లు ఆకురాలుస్తుంటే కొన్నిమోడు వారిపోయి, మరికొన్నిలేలేత ఆశలతో చిగురిస్తున్నాయి.
నిశ్చలంగా నిశ్చబ్దంగా సాగిపోతున్న అక్కడి జీవితాల్లో ఏదో హడావిడి. ఉత్సవమేదో జరుగుతున్నట్లు సందడి. ఆ నోటా ఈ నోటా విషయం తెలిసిన జీవులెన్నో ఎగుడుదిగుడు కొండ లోంచి చీలికలు చీలికలుగా ఉన్న సన్నని బాటల్లో వచ్చి, పచ్చిక బయలులో సమావేశమయ్యాయి. మరో లోకపు ముచ్చట్లు తెలుసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి . నిన్నమొన్నటి వరకూ తమతో తిరిగిన నలుగురు నేస్తాలు మానవ ప్రపంచంలోకి అడుగు పెట్టి ఏడాది దాటింది. ఈ జీవాలు అసలున్నాయో లేవోననే సందేహంలో సందిగ్ధంలో ఉన్న సమయంలో అవి తమ రాజ్యానికి తిరిగి రావడం ఆ జంతు లోకానికి పండుగ్గా ఉంది. అదీకాక ఆ లోకపు వింతలు విడ్డురాలు, విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలం వాటినక్కడికి రప్పించాయి . ఇప్పుడు వాటి మాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.
తమ యాత్ర పూర్తి చేసుకొచ్చిన మిత్ర బృందం తోడేలు, నక్క , రైనో , దుప్పి రాకతో ఆ ప్రదేశమంతా హర్షధ్వానాలతో మార్మోగింది. అందరి వైపు చూస్తూ చేతులూపుతూ సంతోషంగా పలకరించింది మిత్ర బృందం.
అప్పటివరకూ ఉన్న కలకలం సద్దుమణిగింది. ఆకు రాలితే వినపడేంత నిశ్శబ్దంగా మారిపోయింది ఆ ప్రాంతం. జీవులన్నీ ఊపిరి ఉగ్గబట్టుకుని కూర్చున్నాయి . అక్కడున్న వారంతా సుశిక్షితులైన సైనికుల్లా .. కానీ వాటి శ్వాస నిశ్వాసలు పక్కన ఉన్న వాటికి వినిపిస్తున్నాయి.
ఆ ప్రశాంతతను ఛేదిస్తూ .. "ఆ రోజు మేం బయలుదేరినప్పుడు పలికిన వీడ్కోలు , మీ ఆదరాభిమానాలు మా వెన్నంటే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ.. ఇంత మంది, చిన్నా పెద్దా, పిల్లా పాపా .., మిమ్ములని చూస్తుంటే కడుపు నిండి పోయింది. మాయా మర్మం లేని మనమంతా ఒక్కటేనని రుజువవుతున్నది.
మరో లోకపు లోతుపాతులు తెలుసుకోవాలని స్వచ్ఛమైన హృదయాలన్నీ ఆశపడడం ఆరాటపడడం చూస్తే మహదానందంగా ఉంది. మా అనుభవాలు మీకు ఎలాంటి అనుభూతినిస్తాయో తెలియదు. ఏడాది కాలపు అనుభవాలను, అనుభూతులను కొద్ది మాటల్లో చెప్పడం కష్టమే .. కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాం.
మేము మానవలోకంలో మేమెలా బతికామన్నదానికన్నా, మా నిశిత పరిశీలనలో అక్కడి ప్రజల జీవితమెలా ఉన్నదో, ఆ లోకపు నగ్న స్వభావం గురించి చెప్పాలనుకుంటున్నామన్నది తోడేలు.. సరేనన్నట్టు తలూపింది మిత్ర బృందం.
మన మన్యంలో రకరకాల జంతు జాతులున్నట్టు మానవుల్లోనూ జాతులున్నాయి . అంతేకాదు కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, భాషా భేదాలు ఎన్నో ఉన్నాయి. అంతా బయటకు ఎంతో అందంగా, ఆనందంగా రంగురంగుల్లో కనిపించే సంక్లిష్ట లోకం. స్వార్థ లోకం.
ఒకే జాతి అయినా అంతా ఒకే స్థాయిలో ఉండరు . ఒకే రీతి నడవరు. ఒకే రకం తిండి తినరు . ఒకే రకపు ఇంట్లో ఉండరు . ఒకే రకపు బట్ట కట్టరు. ఎక్కడ చూసినా కులం , మతం , జాతి , అంతస్తుల తేడాలే .. మిరుమిట్లు గొలిపే వెలుతురులో అద్దాల మేడల్లో కొందరుంటే చీకటి గుయ్యారాల్లో ఆకాశమే కప్పుగా మరికొందరు .. ఆకాశ వీధుల్లో విహరించే వాళ్ళు కొందరయితే చీలికలైన కాళ్లతో గమ్యం కేసి ప్రయాణించే వాళ్ళు మరికొందరు ...
ఎవరికివారు తామే గొప్పని విర్రవీగుతారు. ఎవరి అస్తిత్వం వారికి గొప్పదే కావచ్చు. ఎవరి మత నమ్మకాలు , పద్ధతులు వాళ్ళకుండొచ్చు. అవన్నీ వాళ్ళింటికే పరిమితం కావాలి. గడప దాటిన తర్వాత అందరూ సమానమే కదా .. ఈ చిన్న విషయం వీళ్ళకెందుకు అర్ధంకాదో ..గొడవలు పడిచస్తారు. కొట్టుకుంటారు . నరుక్కుంటారు . యుద్ధాలే చేసుకుంటారు . ఏంమనుషులో ఏమో .. నమ్మినవాళ్ల మీదనుంచే తొక్కుకుంటూ పోతుంటారు... " అంటున్న తోడేలు మాటలకు అడ్డొస్తూ .. "అయ్యో .. ఎట్లా .. " చెట్టుమీద బుల్లిపిట్ట సందేహం వెలిబుచ్చింది.
" మనుషులకెనెన్నో నమ్మకాలూ, విశ్వాసాలు. వాటినే పెట్టుబడిగా చేసుకుని మఠాధిపతులు , పాస్టర్లు , ముల్లాలు గొప్పగా బతికేస్తున్నారు. ప్రజల నమ్మకాలను, భక్తిని మార్కెట్ వస్తువులుగా మార్చి వ్యాపారం చేసుకుంటున్నారు . ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.
మనం అన్నది కనిపించక అంతా నేనులే .. మైదాన ప్రాంతాల్లో ఒకచోట కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక నగరం కాదు ఎక్కడికిపో .. అదే తంతు. ఒకనినొకడు దోచుకోవడమే .. కప్పను పాము మింగినట్టు మింగేయడమే..
కులాన్ని, మతాన్ని, రిజర్వేషన్లను అడ్డంపెట్టుకుని చేసే రాజకీయంలో చిన్న పిల్లలకు బిస్కట్ ఇస్తామని ఆశ పెట్టినట్లు రకరకాల పథకాల హామీలు ఆశపెట్టి మనుషులను తమ తిండి కోసం తాము కష్టం చేయలేని సోమరులుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు.
వారి అస్తిత్వాలు ఏవైనా ఆ జనం రెండుగా కనిపించారు. శ్రమ చేసేవారు , ఆలోచన చేసేవాడు. చెమటచుక్క చిందించే, ఉత్పత్తి చేసే శ్రామికులను గుప్పెడు మంది ఆలోచనాపరులు ఎప్పుడూ లొంగదీసుకుని తమ కాళ్ల కింద అట్టే పెట్టుకుంటున్నారు. ఆరోగ్యం నుంచి ఆర్ధికం వరకు, రక్షణ నుంచి సామాజిక భద్రత వరకు అన్ని రంగాల్లో ఆడ మగ వ్యత్యాసాలే .. "కంచుకంఠంతో చెప్పుకుపోతున్న తోడేలు కొద్దిగా ఆగి అందరి వైపు నిశితంగా చూసి ఓ దీర్ఘ శ్వాస విడిచింది.
" అన్నా .. ఏమైనా వాళ్ళు మనకంటే తెలివిగల వాళ్ళు.." అంటున్న రైనో ని "ఆహా .. ఏమిటో అంత గొప్ప తెలివితేటలు .. " తానే తెలివైనదాన్ననుకునే నక్కపిల్ల ప్రశ్నించింది.
"ఒకప్పుడు మనలాగే అడవుల్లో బతికిన మనిషి తన తెలివితేటలతో పక్షిలా ఆకాశంలో ఎగరడానికీ విమానాలు , చేపలా నీళ్లలో ప్రయాణానికి ఓడలు, ఆకాశంలో చుక్కల్లా కనిపించే గ్రహాలను, చందమామను చేరే రోదసీ నౌకలు ఇలా లెక్కలేనన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు" అన్నది రైనో
"ఓ అవునా .. ఇంకేం చేశారు .. చెప్పు మిత్రమా .. చెప్పు " తల్లి గర్భం నుండి వచ్చిన శిశువు లా ఉత్సుకతతో చూస్తూ మిడత.
"తల్లి గర్భంలోంచి పుట్టే మనిషి మరమనిషిని తాయారు చేసి తాను చేసే పనులన్నీ దానితో చేయిస్తున్నాడు. అది ఊహకందడం లేదు కదూ .. కానీ అది నిజం. అంతేకాదు , మనం ఇక్కడుండి మన పొరుగు రాజ్యంలోనున్న మనవాళ్లతో మాట్లాడగలమా..? చూడగలమా .. లేదు. కానీ, వాళ్ళు ఇక్కడుండి ఎక్కడెక్కడో ఉనోళ్లను చూస్తారు. ఇక్కడ ఉన్నట్లు మాట్లాడుకుంటారు .. ." చెప్తున్న రైనో మాటలకు అడ్డు వస్తూ .. "ఏమిటేమిటి మళ్ళీ చెప్పు " అన్నది చిరుత.
"అవునన్నా, వాళ్ళ చేతిలో ఇమిడిపోయే ఫోన్ లున్నాయి. నేను నీతో మాట్లాడాలంటే నీ దగ్గరకొచ్చి మాట్లాడాలి. కానీ వాళ్ళు రాకుండా ఎక్కడివాళ్ళక్కడుండి చూసుకుంటూ మాట్లాడుకుంటారు.. " వివరించింది రైనో.
"అవును నిజమే, చేతుల్లో మొబైల్ ఫోన్లకు బందీలైపోయారు మానవులు. అవి అందరి దగ్గరా లేవు గాని చాలామంది దగ్గర కనిపిస్తాయి. మొదట్లో వింతగా ఆశ్చర్యంగా ఉండేది. అబ్బురంగా తోచేది . పోనుపోనూ విసుగొచ్చేసిందనుకోండి. మనిషి జీవితం, వారి ఆలోచనలు వారి చేతిలో నుండి టెక్నాలజీ చేతుల్లోకి పోతున్నట్లనిపించింది. సోషల్ మీడియా.. అతనికి తెలియకుండానే కండిషనింగ్ చేస్తున్నది. ఇంటర్నెట్ పెను తుఫానులా మనుషుల్ని తూర్పార పడుతున్నది. ఊకలాగా గాలికి కొట్టుకుపోతున్నాడు మనిషి. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే.. మనిషి ఒంటరే.. ఆ మానవ సంబంధాల నిండా బోలు.." విచారపు గొంతుతో నక్క.
"అవునవును మన తెలివి మనని ముందుకు నడిపించాలి. మొద్దుశుంఠల్నిచేసి వెనక్కి నడిపిస్తే ఎలా .. " గొంతు సవరించుకుంటూ ఎలుగుబంటి.
"వాళ్ళ సంగతొదిలెయ్ .. ఏ చావు చస్తారో చావనిద్దాం .. అటు ఇటూ చేసి మన మనుగడకే ముప్పు తెచ్చేస్తున్నారు కదా .. నింగి , నేల , నీరు , నిప్పు , వాయువు అన్నీ తన సొంత ఆస్తి అనుకుంటున్నాడు మానవుడు. నిన్నమొన్నటి వరకూ దట్టంగున్న దండకారణ్యాలు తరిగిపోతున్నాయి. అక్కడి జీవరాశులు నిరాశ్రయులైపోతున్నయి" దిగులుతో దుప్పి.
దూరంగానున్న జలపాతపు సవ్వడిని గాలి మోసుకొస్తుండగా "మీరేం చెబుతున్నారో నాకైతే ఒక్క ముక్క అర్ధంకాలే.. " తలగోక్కుంటున్న అడవి పంది.
" నీకర్థమయ్యేటట్లు మరోసారి చెబుతాలే .. "అని అందరివంకా పరిశీలనగా చూస్తూ " ప్రకృతిని తన చేతుల్లోకి తీసుకున్నానని విర్రవీగుతున్నాడు కానీ, తన అహంకారానికి , తీరని దాహానికి , స్వార్ధానికి ఈ ప్రకృతిలోని సమస్త జీవజాలం తో పాటు అనాదిగా తానభివృద్దిచేసుకొస్తున్న సంస్కృతి, జ్ఞానం-విజ్ఞానంతో పాటు తాను కూడా ధ్వంసమైపోతున్నాని, నాశనమైపోతన్నాని అతనికి ఎందుకర్ధం కావడం లేదో... ప్రకృతితో పర్యావరణంతో వికృతమైన ఆట లాడుతున్నాడు " అన్నది దుప్పి.
అసహనంగా కదిలాయి పులి , సింహం , మరికొన్ని జంతువులు. " అంటే .. మనం సమిధలమా.. అట్లెట్ల .. ?" కోతి చిందులేసింది.
" మన కాళ్ళ కింద అతనికి అవసరమయ్యే తరగని ఖనిజ సంపద ఉన్నది. అతని కన్ను దీనిపై ఉన్నది. రేపోమాపో మనమంతా మన తావులొదిలి తలో దిక్కు వలస పోవాల్సిందే " హెచ్చరించింది నక్క.
" నిజమే నేస్తమా .. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతిలో భాగంగా మనమున్నాం . స్వచ్ఛంగా, స్వేచ్ఛగా సంచరిస్తాం. మానవ నివాసాలలో నాకు ఊపిరి సలప లేదంటే నమ్మండి . అంతా కాలుష్యం. వాయు కాలుష్యం, జల కాలుష్యం , శబ్ద కాలుష్యం .. మానవ ప్రవృత్తి లోనే కాలుష్యం .. తినే తిండి, పీల్చే గాలి , చూసే చూపు, మాట్లాడే మాట అన్నీ కలుషితం .. వాళ్లకు సృష్టి పట్ల , ప్రకృతి పట్ల భవిష్యత్తు పట్ల గౌరవం లేదు " అన్నది తోడేలు.
"ప్రకృతి విరుద్ధంగా సాగే నడక, నడత వల్ల కొత్తకొత్త రోగాలొస్తున్నాయక్కడ. ఉన్న పుట్టెడు రోగాలకు తోడు కంటికి అగుపించని క్రిమి వారిని అతలాకుతలం చేస్తున్నది . మనిషితనం మరచిన మనిషికి హెచ్చరికలు జారీ చేస్తున్నది . మేము వెళ్ళినప్పుడు కళకళలాడిన లోకం, తళతళ లాడిన మనుషులు ఇప్పుడు వెలవెల బోతూ పెద్ద సంక్షోభంలో .. " అన్నది రైనో.
"ఆ అదృశ్య క్రిమిని దుమ్మెత్తిపోస్తున్నారు " అన్నది దుప్పి.
"ఆ క్రిముల పుట్టుకకు కారణం వాళ్ళే. వ్యాప్తికి కారణం ఆ మనుషులే. వాటి పేరుతో ప్రజల రక్తం తాగేది వాళ్ళే. ప్రజలని కాపాడటానికి ఏవిటేమిటో చేసేస్తున్నాం, చాలా కష్టపడి పోతున్నామని షో చేసేది వాళ్లే. ఈ క్రమంలో బలహీనులంతా లోకం నుండి సెలవు తీసుకుని పోతుంటే మిగిలిన వారి ప్రాణ భయాన్ని సొమ్ము చేసుకుంటూ చికిత్స రూపంలో , వాక్సిన్ ల రూపంలో కొల్లగొట్టేస్తున్నారు " తోడేలు.
"నన్ను నిందిస్తారు కానీ అక్కడందరూ గుంట నక్కలే. మిత్ర సంబంధాలు శత్రు సంబంధాలుగా , శత్రు సంబంధాలు మిత్ర సంబంధాలుగా మారిపోతాయి. అక్కడ సంబంధాలన్నీ అర్ధంతోనో, అధికారంతోనో, అహంతోనో ముడిపడినవే. కష్టమొకడిది. సుఖం మరొకరిది. సొమ్మొకడిది . సోకొకడిది. ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులకు సమాన హక్కు ఉన్నదన్న జ్ఞానం లేదు. అంతా తమదే నన్న పోకడలతో నాశనం పట్టిస్తున్నారు " అన్నది నక్క.
"మనలో మనకు వచ్చే గొడవలు, దాడులు ఆ పూట కడుపు నింపు కోవడానికే కానీ తరతరాల తరగని సంపద పోగెయ్యడానిక్కాదు" గంభీరంగా అన్నది మధ్యలో అందుకున్న పులి.
మానవ అభివృద్ధి దీపాల వెలుగులో నిప్పురవ్వలు రాజుకుని తమ అడవినంతా కాల్చేస్తాయేమోనన్న భయంతో .. తమ కాళ్లకింద నేలనంతా పెకిలిస్తాయేమోనన్న అనుమానంతో .. మసక మసకగా కనిపిస్తున్న భవిష్యత్ చిత్రపటం మదిలో చిత్రిస్తూ కొన్ని జీవులు. వాటి ఆలోచనల్ని భగ్నం చేస్తూ
"విచిత్రమేమంటే, అదే లోకంలో గుండె తడి ఆరని మనుషులు ఆకాశంలో చుక్కల్లా సేవ తీరుస్తారు. అడవి పుత్రులకు సేవ చేస్తారు. మర్చిపోయిన మానవత్వాన్ని తట్టి లేపుతుంటారు. మనసును కదిలిస్తూ మానవీయ బంధాలను గుర్తు చేస్తుంటారు. మనిషి మూలాలను తడిమి చూస్తుంటారు. అపారమైన ప్రేమ అందిస్తుంటారు . ఏపుగా పెరిగిన రాచపుండుకు చికిత్స చేస్తుంటారు.
ముక్కలు ముక్కలవుతున్న మానవ సంబంధాలకు మాటువేసి అతికించే ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటివారి నుంచి తీసుకోవడం కన్నా ఎదుటివారికి ఇవ్వడానికి ఇష్టపడతారు . తమ చుట్టూ ఉన్న నలుగురినీ సంతోషపెట్టడానికి యత్నిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తగలబడుతున్న మానవ ప్రపంచాన్ని కొత్త తోవలో ఆవిష్కరించడానికి తపన పడుతుంటారు. జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ప్రేమిస్తారు" వెలుగుతున్న మొహంతో అందరి వంకా చూస్తూ అన్నది తోడేలు.
ఆకాశంలో తమ నెత్తి మీదుగా ఎగురుతున్న లోహవిహంగం కేసి చూస్తూ
స్వార్ధం పడగ నీడ నుండి కాపాడేది, బతికించేది ఆకుపచ్చని మనసులే .. వారితో కలిసి అడుగేయాలి "చెట్టుమీద చిలుక పలికింది.
ఆకుపచ్చని కలగంటూ వెనుదిరిగాయి ఆ జీవులన్నీ.
"రాప్పా... శంకరూ, ఏమి ఇయ్యాలదంకా ఉన్యావు? తొందరగానే వస్తావు అనుకుంటిమే?" అప్పుడే హాస్టల్ నుండి వస్తావున్న శంకరుని అడిగినాడు శీనా మామ.
"తొందరగానే బయలుదేరితిమి కానీ గండిలో ఆంజనేయసామి గుడి కాడ కొంచేపు ఉంటిమి మామా! అదీ గాక ఈ పొద్దు శనివారం గదా, తిరపతి నుండి పసాదం వచ్చింటే తెస్తి" అనుకుంట ఇంట్లోకొచ్చి బ్యాగు పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేకి పొయినాడు శంకరు.
శంకరు పులివెందుల్లో చదువుకుంటాండాడు. దసరాకి సెలవలిచ్చినారని ఇంటికొచ్చినాడు. శ్రీనివాసులు శంకరుకి మామయితాడు. శంకరోళ్ళ ఇంటి పక్కనే ఇల్లు.
"నాయన యాడున్నాడు మా?" అడిగినాడు శంకరు టవ్వాలతో మొహం తుడ్సుకుంట.
"పొద్దున పోయినాడురా మీ నాయిన, ఇంగా రాలా" చెప్పింది కామాక్షి.
కామాక్షి శంకరు వాళ్ళమ్మ. నాయన పేరు ఆదెప్ప.
"ఏంపా అల్లుడూ, కుచ్చో ఇట్ల. మాట్లాడుదాము" అన్యాడు శీనా మామ.
"చెప్పు మామా, ఏం విశేషాలు?"
"ఏముంటాయిబ్బా, ఈడ కొత్తగా ? అవే అప్పులే, అవే కతలే. మా సంగతి ఇడ్సిపెట్టు. నువ్ చెప్పు, ఎట్లుంది సదువు?"
"సదువుకేమైంది. బానే సదువుతాన్నా మామా..."
"సదువుకుంటేనే రొంత బాగుపడేది ఇప్పట్లో ఇంగ. సేద్యం చేస్కోనికి నీళ్ళుండవు. సదువుకుంటే ఉజ్జోగమొస్తే ఎట్లోగట్ల బతకొచ్చు."
"నీకేంలే మామా... సేద్యం ఇడ్సిపెట్టి షాపు పెట్టుకున్యావ్."
"ఇడ్సిపెట్టకపొతే యాడప్పా... సమచ్చరాలు గడిసేకొద్దీ అప్పులు పెరుగుతానే పోయినాయి గానీ తగ్గలా. షాపు పెట్టుకున్యా. రోంత మేలు."
"మా నాయనగ్గుడక చెప్పచ్చు గదా మామా? ఎప్పుడు సూడు సేను కోసం అప్పులు చేస్తానే ఉంటాడు. రోంత గూడ భయమే ఉండదు అప్పుల గురించి. అప్పులిచ్చేటోళ్ళు కూడా అట్లనే ఇస్తారు నాయనకి."
"ఎందుకీయరుప్పా, పదెకరాలుండాయి గదా ఆ దైర్నంతో ఇస్తారు. వాళ్ళేం ఊరికెనే ఇస్తాన్నారా..?"
"అది గూడ నిజమేలే..."
"మీ నాయన మొండోడు. ఎట్ల తిరిగి అప్పు తీర్చేస్తాడు. అందుకే అప్పు పుడ్తాది యాడైనా..."
"అది సరే గానీ మామా, నీకోటి తెలుసునా?"
"ఏందిప్పా..?"
"మన తుక్కు నీళ్ళకి బోర్ ఎయ్యల్లంటే ఎన్నడుగులు ఏస్తారు?"
"భూమిని బట్టి ఉంటాది. కొన్ని సాట్ల ఏడొందల అడుగులు, కొన్ని సాట్ల తొమ్మిదొందల అడుగులు. వెయ్యి దాటి గూడ ఏస్నారు సానా మంది."
"కాలేజీలో మా క్లాస్ మేటొకడు. వాంది గోదావరి జిల్లా. ఇట్ల నీళ్ళ గురించి మాట్లాడుకుంట అడిగితి. వాళ్ళ తుక్కు అస్సలు బోర్లేసేదే తక్కువంట. ఒక్యాళ యేసినా పదహైదు, ఇరవై అడుగులకే నీళ్ళు పడ్తాయంట."
"ఏందిరా నువ్ చెప్పేది? నిజమేనా?"
"నిజంగా మామా... అది గూడ వాళ్ళేసేది మిషన్ తో కాదంట. మనుషులే చేతుల్తో ఏస్తారంట."
"చేతుల్తోనే నీళ్ళు పడేంత ఉంటాయా వాళ్ళకి? ఈడ మనం కిందా మీదా పడి బోరేసినా నీళ్ళు పడటం ల్యా గదరా..."
"నాగ్గుడక నమ్మబుద్ది కాలా మామా... కానీ నిజమేనంట"."
ఇట్ల శంకరు, శీనా మామ మాట్లాడుకుంట ఉండంగ కామాక్షి వచ్చి కుచ్చుంది.
శంకరు శీనా మామతో "అవు మామా... బోరేస్తే ఎంత కర్చయితాది మనకి?"
"ఏసిన్నే అడుగుల్ని బట్టి ఉంటాదిరా. మూడొందల అడుగుల దాకా ఇంత, అది దాటితే ఇంత అని."
"అట్ల గూడ ఉంటాదా మామా?"
"అవుప్పా. మళ్ళ బోరేసేటప్పుడు రాయి అడ్డం పడిందనుకో అప్పుడు రేటింగా పెరుగుతాది. అయినా ఇయన్నీ నాకన్నా మీ నాయనకి బాగా తెలుసు. ఆర్నెళ్ళకోసారి ఏపిస్తాడు కదా..?"
అప్పుడు కామాక్షి "వచ్చిండే తిప్పలంతా అదే. నీళ్ళు పడటం ల్యా అని తెల్సినా ఏపిస్తానే ఉండాడు ఆ మనిషి. ఆ మొండితనమేందో గానీ, వస్తాండే దుడ్లన్నీ మళ్ళ ఆ బోర్లకే కర్చు పెడ్తాడు" అంది.
"బావ ఇనడులే క్కా. ఆ మనిషికి బోరేసేది జూదమాడినట్లు అయిపోయింది."
"అంటే ఏంది మామా?" శంకరు ప్రశ్న.
"చేతిలో డబ్బులుంటే ఒక్కోరికి ఒక్కోటి చేయబుద్దయితాది. కొంతమంది జూదమాడ్తారు. కొంతమంది పోరాని కొంపలకి పోతారు. ఇంకొంతమంది తాగుతారు. అట్ల మీ నాయనకి బోరెయ్యాలనిపిస్తాది."
"ఉన్నే కాలవ నీళ్ళు సాల్లే. ఆ నీళ్ళతోనే సేను తడిసిన కాడికి పండిచ్చుకోని సగం అమ్ముకోని సగం తిందాం అని చెప్పినారా, నా మాట వింటే గదా?" కామాక్షి బాధ.
"అయినా బోరేమీ ఊరికెనే పొద్దుపోక ఏపీలా కదు మా, నీళ్ళు పడి పదెకరాలు తడిస్తే ఎంత మేలని? అందుకే చేస్తాండాడులే నాయన."
"ఏం చేస్తాడో ఏమో. బోరేసి నీళ్ళు పడినాయని భోజనాలు పెట్టిస్తాడు. నీళ్ళు పడకపోతే ఇంటికొచ్చి నీళ్ళు తాగి అట్లే పనుకుంటాడు. మళ్ళా కొన్నిరోజులకి యాదో చిన్న పంటవి డబ్బులొస్తానే మళ్ళ బోరేసేకి పిలిపిస్తాడు. ఇదే కతే జరుగుతాంది."
శంకరు ఏం మాట్లాడలా.
"ఈసారి డబ్బులొస్తానే నువ్విప్పిచ్చుకో అడిగి. ల్యాప్ ట్యాపో ఏందో కావల్లని అడిగినావ్ కదా సదువుకున్నేకి. అది కొనుక్కో." అని చెప్తా ఉండంగ ఆదెప్ప ఇంట్లో కొస్తూ "రేప్పొద్దున తొందరగ లేయల్ల. అందరం సేను కాటికి పోయే పనుంది. బోరేపిస్తాన్నా..." అని జెప్పి లోపలికి పొయినాడు.
కామాక్షి ఆయన్ని అట్లా చూసి, తిరిగి శంకరుని చూసి బయటికి కనపడని కన్నీటి చుక్కల్ని కొంగుతో తుడుసుకుంది.
APR 2021
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు