కథలు

కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

ఎరికలోల్ల కథలు - 3 

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు.

ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా పూలహారాలే.

అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. అని జనం నోర్లు నొక్కుకున్నారు. ఇంకో మాట కూడా అనేశారు .      ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు ఇంత మంది వచ్చిండేది చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ”    

ఎంతో మందిలో కొందరికే ఆ భాగ్యం దక్కుతుంది. ఒకళ్ళ గురించి పదిమంది పదికాలాల బాటూ మంచిగా  చెప్పుకున్నారంటే, అదే వాళ్ళు చేసుకున్నభాగ్యం.అట్లా భాగ్యవంతురాలనిపించుకున్న వాళ్ళల్లో మా అత్త పేరు తప్పకుండా వుంటుంది. ఆమె పేరు కాంతమ్మ.

ఆ పేరు చెప్తే జనాలకు ఆమె ఎవరో  కొంతమంది తెలీదని  చెపుతారు, కానీ  కొళాయి కాంతమ్మ  అంటే మాత్రం, పాతపేటలోనే కాదు, కొత్తపేటలో కూడా జనం ఆమె గురించి కథలు కథలుగా చెప్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే, పెద్ద పెద్ద నాయకులకు లాగా చాలా  మందికి ఆమె ముఖ పరిచయం లేకపోయినా, ఆమె పేరు, ఆమె గురించిన సంగతులన్నీ చెప్పేస్తారు.అదీ ఆమె ప్రత్యేకత.

అట్లాగని ఆయమ్మ పెద్దగా చదువుకునిందని కాదు, పెద్ద  ఉద్యోగం చేసిందనీ కాదు. ఆమె సంపాదించిన ఆస్థిపాస్తులు ఏమీ లేవు. నిజానికి ఆమె ప్రత్యేకత అంటూ   ఏమీ లేదు. అయినా  “  హోల్  ఇలాకాలోనే  ఎరికిలోల్ల కాంతమ్మ  అంటేనే  వుండే గౌరవమే వేరు. ఆయమ్మ సెయ్యి మంచిది, ఆయమ్మ నోరు మంచిది . ఆయమ్మ గుణం మంచిది అని జనం అనటం  వెనకాల ఆమె నిలుపుకున్న పెద్దరికం అలాంటిది. పది మందిని సంపాదించుకున్న ఆమె మంచితనం అలాంటిది .

చిన్న బoకుఅంగడి పెట్టుకుని, ఆ చిన్న బంకులోనే  అన్నీ పొందిగ్గా  అమర్చి పెట్టేసేది. పాతపేటలో అప్పట్లో అంగళ్లు తక్కువ ఉండేవి. పలమనేరు వూరి మధ్యలో నాలుగో నంబరు జాతీయ రహదారి వెడుతుంది. యo.బి.టి. రోడ్డు అంటారు.మద్రాస్, బెంగుళూరు  గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఆ రోడ్డుకు అటు వైపు కొత్తపేట, ఇటు వైపు పాత పేట వుంటాయి. యస్టీ కాలనీ వుండేది పాతపేటలోనే. కాలనీలో జనమే కాదు చుట్టూ పక్కల ఆరేడు వీధుల్లో వాళ్లకి, ఎవరికేం కావాలన్నా, పదో ఇరవయ్యో సరుకు అప్పు కావాలన్నా , ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కొళాయి కాంతమ్మ అంగడే .

రకరకాల  వస్తువులు, ఆకుకూరలు, కూరగాయలు, రోజువారీ, వారంవారీ కంతుల కింద  అప్పులు తీసుకునే వాళ్ళ కోసం , అప్పు జమా నిల్వలు చూపించే పాకెట్ సైజు  లెక్కల పుస్తకాలుబాండు పేపర్లు , రెవిన్యూ స్టాంపులు,స్కూలు పిల్లలకోసం పెన్నులు, పెన్సిళ్ళు, ఆడపిల్లలకు కావాల్సిన సామాగ్రి రకరకాల వస్తువులు ఆ చిన్నఅంగడి లోనే అందంగా అమర్చుకునేది.   ఆ కాలంలో నాల్గో, ఐదో క్లాసు చదివినారంటే ఈ కాలం డిగ్రీ వాళ్ళతో సమానం కదా ఆ చదువు. ఆమెకి లోక జ్ఞానం , జ్ఞాపకశక్తి రెండూ ఎక్కువే. ఏ లెక్క అయినా, ఎంత కాలం అయినా, ఎవురెవరు ఎంతెంత బాకీ వున్నారో ,ఆమె కాగితం , పెన్నూ వాడకుoడానే చెప్పేయగలదు. వినే వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ నోటు పుస్తకాల్లోనో  , క్యాలండర్లోనో ,డైరీలలోనో వాళ్ళు రాసింది ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ  తిప్పించి మళ్ళించి చూసుకునే వాళ్ళు. అన్నీ చూసుకుని ఆయమ్మ చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకునే వాళ్ళు.

వీధి కొళాయి దగ్గర రోజూ జరిగే పంచాయతీలను పెద్దరాయుడి మాదిరి తీర్చేది మా అత్త . కొళాయి దగ్గర ఎవరికీ పెద్దరికాలు లేవు. అక్కడ అందరూ సమానమే. ఒకరు గొప్ప అని కానీ, ఇంకొకరు తక్కువ  అని కానీ  తేడాలు అక్కడ లేవంటే ఆమె దశాబ్దాలుగా అమలు చేసిన  ఆ సమానత్వమే అందుకు కారణం.గలాటాలు,తోపులాటలు మాటల యుద్దాలు లేకుండా , వచ్చే నీళ్ళను సక్రమంగా అందరికీ అందేటట్లు ఆమె చూసేది. కొళాయి దగ్గరికి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కాళ్ళు, చేతులు, మొహాలు కడుక్కుని తల దువ్వుకుని శుభ్రంగా రావాలని పట్టు పట్టింది. ఎరికిలోళ్లు ఎందులోనూ తక్కువ కాదని ఇండ్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని, ఉన్నంతలో శుభ్రతలో కూడా ముందు ఉండాలని ఆమె తనకులపోళ్లకు శతవిధాలా చెప్పుకొచ్చింది. పందులు మేపేవాళ్లయినా సరే అది  వృత్తి వరకే పరిమితం కావాలని, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు పిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు శుభ్రంగా ఉండాలని, శుభ్రత ముఖ్యమని ఆమె ఆ కాలం నుంచే మనుషుల్ని మారుస్తూ వచ్చింది. పిల్లలు ఎవరు ఇంటిదగ్గర కనిపించినా బెత్తం తీసుకొని వాయించేది. ఎందుకు స్కూలుకు పోలేదా అని ఆరా తీసేది. ఆ పిల్లల అమ్మానాన్నలకు చదువు  విలువ గురించి హితబోధలు చేసేది.  కారణం లేకుండా ఒక పూట అయినా పిల్లలు స్కూల్ కు పోకపోతే ఆమె కంటికి కనిపించారంటే ఆమె అసలు ఒప్పుకునేది కాదు. ఆడపిల్లల్ని చదువు మానిపించే ప్రయత్నం చేసినా, చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ప్రయత్నించినా, ఆమె ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేది. వాళ్ళ పైన తిరగబడేది. ఆమెకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ విపరీతంగా కొట్లాడేది. రచ్చ రచ్చ   చేసేది. వాళ్లను బ్రతిమలాడేది, ఏడ్చి మొత్తుకునేది, చేతులు పట్టుకుని అడుక్కునేది. పిల్లల గొంతులు కొయ్యవద్దని భవిష్యత్తు నాశనం చేయొద్దని ఆమె నచ్చచెప్పేది. కొనే శక్తి లేని పిల్లలు ఎంతో మందికి ఆయమ్మ  పలకా బలపాలు, పుస్తకాలు, పెన్సిల్లు, పెన్నులు ఉచితంగా ఇవ్వడం అందరికీ తెలుసు.

ఆడపిల్లలు మొగుడి దగ్గర దెబ్బలు తిని ఏడుస్తా కనిపించినా, ఆమె దగ్గర సలహా కోసం వచ్చినా  ఆమె పూనకం వచ్చినట్లు ఊగిపోయేది.

“  ఆడదనిపైన చెయ్యి చేసుకోవడం కూడా ఒక  మొగతనమేనారా ?ఎంతో మురిపంగా సాకి బిడ్డను ఇచ్చేది మొగోడి  వంశాన్ని నిలబెట్టే దానికి. భార్య అంటే  తల్లి తర్వాత తల్లి మొగోడికి. ఆ బుద్ధి మొగోల్లకి  ఉండల్ల. అత్త కూడా ఆ  మాదిరే తన కోడలిని చూసుకోవల్ల.ఒక  ఆడదానికి ఇంట్లో వుండే  ఆడోల్లు సప్పోర్ట్ ఇస్తే సాలు, ఇంకేమి అవసరం లే ..అప్పుడు ఏ మొగోడి చెయ్యి అయినా  పైకి  లేస్తుందా  ? ” అని వాదించేది.

ఆడోల్లకు చెప్పాల్సింది అడోల్లకి, మొగోల్లకి చెప్పాల్సింది మొగోల్లకి చెప్పేది. కులపోల్ల ఇంటి గలాటాలకి ఆడోల్లు నోర్లు లేనోళ్ళు, గట్టిగా మాట్లాడనోల్లు, మొగోల్లని నిలదీసే ధైర్యం లేనోల్లకి ఆమే ఒక ధైర్యం . వాళ్ళ తరపున ఆయమ్మే పంచాయతీలో మాట్లాడేది, వాదించేది.

నమ్మినోల్లకి ప్రాణం  అయినా ఇస్తారు కానీ , ఎరికిలోల్లు ఎవురికీ నమ్మక ద్రోహం చెయ్యరు. ఎరికిలోల్ల ఇండ్లల్లో పుట్టుక పుట్టినాక ఒక తెగింపు ఉండల్ల బ్రతికేదానికి. మనం కరెక్టుగా వున్నప్పుడు ఏ ఆడదైనా ఏ మొగనాబట్టకైనా భయపడాల్సిన పనేముoడాది ? ”అని ఆడోల్లకి ధైర్యం చెప్పేది.

 

ఆడది వూరికే బోకులు తోమి, ఇల్లు వాకిలి పిల్లల్ని చూసుకుంటాను అంటే కుదిరే కాలం కాదుమ్మే ఇది. ఆడది కూడా ఏదో ఒక పని చెయ్యల్ల. కోళ్ళు పెంచుతారో , పందుల్ని  మేపుతారో, కూలికే పోతారో, ఆవుల్ని పెట్టుకుంటారో, గంపలు ,చేటలు, బుట్టలు అల్లుకుంటారో అది మీ ఇష్టం. మీ కష్టానికి ఓ విలువుండల్ల, మీ సంపాదనకో లెక్క వుండల్లoతే.   ఇదీ ఆమె అభిప్రాయం.

ఆమె ఇప్పుడు లేదు. చనిపోయి ఆరేళ్ళు అవుతోంది. ఎరుకల ఇండ్లల్లో ఎంతో మంది పిల్లల భవిష్యత్తును, ఎంతోమంది ఆడవాళ్ళ సంసారాలను కాపాడిన ఆమె గురించి దీపం పెట్టే ఏ ఇంట్లో అయినా తలుచుకోని వాళ్ళు ఉండరు.

మా నాయనకు వరసకు ఆమె చెల్లులు అవుతుంది. మా నాయనకు స్వంత అక్కా చెల్లెళ్ళు ఉన్నప్పటికీ, ఆ అత్తావాళ్ళకంటే కూడా  మాకు కాంతమ్మ అత్తే   ఎక్కువ. ఎందుకంటే ఆమె మా పట్ల కనపరచిన ఆపేక్ష అలాంటిది. మా అమ్మతో ఆమెకు గల స్నేహం అలాంటిది.  అందుకే  మా అత్త అంటే మాకు చాల ఇష్టం .

 “ ఆ యమ్మకు మనుషులంటే భలే ప్రీతీ నాయినా, మనుషులతో మాట్లాడకుండా వుండలేoదు.దారిలో పొయ్యేవాళ్ళు ఎవరైనా ఆయమ్మను మాట్లాడక పోయినా , ఆయమ్మే నొచ్చుకుని పిలిచి మరీ మాట్లాడేది. ఏం ఎత్తుకుని పోతామబ్బా.. ఉండేది నాలుగు నాల్లె. ఆ నాలుగు నాళ్ళు, నాలుగు నోళ్ళల్లో మంచి అనిపించుకుని పోతే పోలేదా. అంత మాత్రానికి కోపాలు, గొడవలు , అపార్థాలు దేనికి మనుషుల మధ్య ?“ అనేది.

అట్లా అనడటమే కాదు, అట్లానే బ్రతికింది కడదాకా . ఆయమ్మ ఎంత నిఖార్సైన మనిషంటే , ఒక్క ఉదాహరణ చాలు చెప్పటానికి.

ఎంత జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఎట్లాంటి అనారోగ్యం ఎదురైనా సరే ఒక్క పూటంటే ఒక పూట అయినా ఆయమ్మ ఎవరింట్లో ఇంత ముద్ద తిని, చెయ్యి కడిగింది లేదు. చేసుకునే శక్తి వున్నప్పుడు తనే వండుకుని తినింది.కానీ  ఒంట్లో ఆ శక్తి లేకపోతేఎంత సొంత మనుషులైన ఇంట్లో అయినా సరే, ఒక్క పూటైనా ఆమె  అన్నం తినింది లేదoటే ఆయమ్మ పట్టుదల ఏపాటిదో అర్థం అవుతుంది. ఆయమ్మకు ఒకరికి పెట్టడమే తెలుసు కానీ, ఒకరింట్లో తినడం తెలియదు. ఒకరికి ఇవ్వటమే కానీ ఇంకొళ్ల దగ్గర చెయ్యి చాపింది లేదు.

ఆమెకు అరవయ్యేళ్ళు కూడా రాకుండానే పెద్ద జబ్బు చేసింది. నోట్లో పుండు లేచింది. కొడుకులు, కూతుర్లకి ఆయమ్మ అంటే చాల ఇష్టం కదా, చాలామంది డాక్టర్ల వద్ద చూపించారు.పలమనేరు, చిత్తూరు, తిరుపతిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల  వద్దే చూపించారు కానీ , డాక్టర్లు ఆమె బ్రతకదని చెప్పేసినారు.

 

చెప్పకూడదని అనుకున్నారు కానీ, ఆమెకు ఎవరూ  చెప్పకుండానే తన పరిస్థితి అర్థం అయిపోయింది. ముందు  బాగా ఏడ్చింది. ఆమెకు అసలే మనుషులంటే అకారణమైన ప్రేమ కాబట్టి , మనుషుల్ని తలచుకుని తలచుకుని , గుర్తు తెచ్చుకుని మరీ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఒక రాత్రి రెండు పగళ్ళు, తిండీ , నీళ్ళుమాని మరీ ఏడుస్తూ వుండి పోయింది . ఏమవుతుంది  ఈమె? అంత ధైర్యం గల మనిషి ఇట్లా అయిపోయిందే అని పిల్లలు భయపడిపోయారు.

కానీ ఏదో ఒక అధ్బుతం జరిగినట్లు ఆమెకు ఎక్కడినుంచి వచ్చిందో కానీ అంత ధైర్యం ఉన్నట్లుండి ఎక్కడి నుంచో వచ్చేసింది . అదిగో  ఆ మహత్తర క్షణం నుండి ఆమె మారిపోయింది.

అప్పటిదాకా ఆయమ్మతో యెట్లా మాట్లాడాలోఆమెకు ఏం చెప్పి ఎట్లా ఓదార్చాలో అర్థం కాని కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు కోడలికి ఆమెలో వచ్చిన మార్పు ఒక షాక్ లాంటిది  . అంత వరకూ ఆమెకు ఇంట్లో ఏమి కుదిరితే అది తినడటమే అలవాటు. అది సద్దిది కావచ్చు, సంగటి కావచ్చు, చారు, ఊరిబిండి కావచ్చు, పచ్చిపులుసు కావచ్చు.ఆమె చిన్నపటినుండే చాల కష్టాల్లో పెరిగిన మనిషి కదా ఆమెకు అన్నం విలువ, ఆకలి విలువా బాగా తెలుసు.

అప్పట్లో ఆమె చిన్నతనంలో కరువు కాలంలో గంజి తాగి  బ్రతికిన మనిషి.అడవికి వెళ్లి కాయలు పండ్లు, మూలికలు, తేనె  తెచ్చి అమ్మి బ్రతికిన మనిషి.

అత్తా చెట్లు కొట్టడం కూడా పాపమే కదా, తెలిసి నేను ఏ పాపం చేయాలేదురా అబ్బోడా .. అంటా  ఉంటావు కదా ఎప్పుడూ ..అని నేనోసారి మాటవరసకి ఆమెని అడిగేసాను.   

అప్పుడు ఆయమ్మ మొహంలోకి నవ్వు వచ్చింది.

ఎప్పుడూ వక్కాకు వేసుకుని నమిలి నమిలి ఆమె పళ్ళు ఎప్పుడో గారబట్టి పోయాయి.ఆమె నోరు అందుకే ఎప్పుడూ ఎర్రగానే వుంటుంది. వక్కా,ఆకూ లేకుండా ఆమెకు ఒక పూట కూడా గడవదు. ఆమె నడుముకు, ప్రత్యేకంగా టైలర్ ముందు నిలబడి మరి దగ్గరుండి కుట్టించుకున్న గుడ్డ సంచి వేలాడుతూ వుంటుంది ఎప్పుడూ. వక్కాకు తిత్తి అంటారు, దాన్ని నడుముకు ఎప్పుడూ చెక్కుకునే వుండేది. మూడు నాలుగు అరలు ఉండేవి ఆ సంచికి. ఒకదాంట్లో డబ్బు పెట్టుకునేది. ఇంకో దాంట్లో అవసరమైన మాత్రలు, ఇంకోదాంట్లో వక్కా ఆకు సరంజామా. ఆమెకు నైటీలు అలవాటు లేదు కాబట్టి రాత్రి నిద్రలో కూడా  వక్కాకు సంచిని ఆమె నడుముకే అంటిపెట్టుకుని  వుండేది .రకరకాల చీరరంగులకు జోడీ  కుదిరేవిధంగా ఆమె వక్కాకు తిత్తి  రకరకాల రంగుల్లో తయారుగా వుండేవి.

 “ అబ్బోడా నాకు ముందునుంచే పాప భయం ఎక్కువ, మీ తాత చిన్నయ్య మన  ఎరికిలోల్ల ఇండల్లో పుట్టల్సినోడు కాదు కదా, మమ్మల్ని యెట్లా పెంచినాడు అనుకున్యావు? చీమకు కూడా అపకారం సేయ్యకూడదని , పచ్చని చెట్టు  కొడితే మహా పాపం అని రోజూ పాఠo మాదిరి దినామ్మూ చెప్తానే కదా మమ్మల్ని పెంచినాడు.మీకు చెపితే నవ్వుకుంటారు కానీ,మా ఇంట్లోకి తేలు, జర్రి ఎన్నో మార్లు వచ్చింటాయి కానీ   ఒక్కసారి కూడా నేను చంపిన దాన్ని కాదు, పచ్చని మాను కొడితే పాపం అని కదా మా నాయన మాకు నేర్పించినాడు, అడవిలో ఎండుకట్టెలు ఏరుకుని సైకిల్ పైన పెట్టుకుని తోసుకుంటా తెచ్చేదాన్ని రా . సైకిల్ పైన ఫుల్లుగా కట్టెలు పేర్చుకుని తోక్కేది రాదు కదా అప్పట్లో , సైకిల్  తోసుకుంటా వచ్చేసే దాన్ని.మా వయసు మగోల్లకన్నా  నా సైకిల్ పైనే ఎక్కువ కట్టెలు ఉండేవి. ఏంమేం దేంట్లో తక్కువమాకూ మొగోల్లకి ఇంత తేడా ఎందుకని  పోట్లాడే దాన్ని  ? ఆ తర్వాత కాలంలో  సైకిల్ నేర్చుకున్నా కానీ, ఆ తర్వాత తర్వాత వయసు బిడ్డ అని, నన్ను అడవికి పంపడం మాన్పించేసినాడు మా నాయన. ”.

ఆమె చిన్నతనంలోనే అన్ని పనులు, అన్ని విద్యలు నేర్చుకుంది. ఆమెకి చెట్లు ఎక్కడం కాయలు, పండ్లు, చింతాకులాంటివి కోయడం తెలుసు. దోటీతో చింతకాయలు రాల్చడం తెలుసు. చింతపండు కొట్టటం తెలుసు, రకరకాల మూలికావైద్యం తెలుసు. రెండు కాన్పులు అయ్యాక, మంత్రసాని పని కూడా నేర్చుకుంది. ఎవరికి ఏం సహాయం చేసినా ఎప్పుడూ ఆమె డబ్బు తీసుకోదు. మనిషికి మనిషి సాయం కదా అంటుంది.

మా అత్త  చెప్పక పోయినా అవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే. చిన్నప్పటి  నుండి మేం ఆమె గురించి కథలు కథలుగా వింటూ పెరిగిన వాళ్ల మే కదా.

అయినా నాకు మా అత్త నోటివెంట ఆమె చిన్నప్పటి సంగతులు వినటం ఎప్పుడూ ఇష్టంగానే వుంటుంది. ఆమెకు కూడా వాళ్ళ నాయన గురించి, మా నాయన గురించి మా అమ్మ గురించి చెప్పటంలో ఆమె కళ్ళనిండా, గొంతు నిండా  సంతోషం కనిపించేది.ఆమెకు ఎవరికీ లేనంత ఇష్టం మనుషులంటే బంధువులంటే ఎందుకు వుందో మాకు అర్థం అయ్యేది కాదు.

మా  నాయన మాకు నేర్పింది ఒకటే అబ్బోడా ధైర్యంగా బతకడం.  అది చాలు  అబ్బోడా. ధైర్యం ఉంటే చాలు  ఎట్లాగైనా తెగించి బ్రతికేయొచ్చు!  దేంట్లోనూ ఆడోల్లు మొగోల్లకంటే తక్కువేమీ కాదురా, ఎరికిలోల్లల్లోనే కాదు ఏ కులం లో అయినా అంతే .! ఆడోల్లు మగోల్లకన్నా తక్కువేమీ కాదు.!  

ఆ మాట అంటున్నప్పుడు ఆమె  స్థిరత్వం, ఆమె ధైర్యం ఆమె తెగింపు నాకు ఆమె మొహంలో స్పష్టంగా కనిపించేది.

అయినా ఆమె చివరిదినాల్లో ఎందర్ని కలవరించిందో, ఎందుకు కలవరించిందో మాకు సరిగ్గా తెలియదు. ఎంత బాధలో వున్నప్పటికీ ఆయమ్మ నాకు ఈ నొప్పి వుంది, ఇంత కష్టం ఉంది  అని చెప్పిందే లేదు. నోట్లోంచి ఒక్కమాట కానీ అరుపు కానీ, ఏడుపు కానీ బయటకు వచ్చిందే మాకు తెలియదు.

ఆ కాలం లో మొగ పిల్లోల్లని మాత్రమే మీ  నాయిన సదివించినాడు కదత్తా? నీ అన్నతమ్ములు అదే మా  చిన్నాయన పెద్దనాయన వాళ్ళు మాత్రం బాగా  చదువుకుని  ఉద్యోగాలు చేస్తా వుండారు. నీకు మాత్రం చదువు లేకుండా చేసినాడని  మీ నాయన పైన నీకు ఎప్పుడూ బాధ అనిపించలేదా అత్తా, కోపం రాలేదా?  ” అని అడిగినాను.

ఒక్క మాట కూడా వాళ్ళ నాన్నను పడనిచ్చేది కాదు మా అత్త . మా మామయ్య వాల్ల  గురించి కానీ, వాళ్ళ అమ్మ నాయన గురించి కానీ ఎవురేం మాట్లాడినా ఆమె గొమ్మునా  ఊరుకునేది, వాళ్ళ అత్తామామల గురించి కానీ, ఆడబిడ్డల గురించి కానీ ఏనాడూ ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ కలిగినా నోరు తెరిచి ఒక్క  మాటైనా అనకపోవటం , ఇంటికి దూరం వెళ్లిపోయి, తన దారి తాను చూసుకున్న మా మామయ్యను సైతం    ఒక్క మాటైనా అనకపోవడం ఆమె వ్యక్తిత్వం అనుకుంటాను. వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాత్రం ఒక్క మాట కూడా పడనిచ్చేది కాదు.

 “ మా నాయన తప్పేమీ లేదు అబ్బోడా. మా నాయన్ను గానా ఎవరైనా యేమైనా  అంటే వాళ్లకు కండ్లు పోతాయి . మా నాయన ముందే  చెప్పినాడు కానీ నేనే సరిగ్గా సదువుకోలేదు, సరిగ్గా సదువుకొని వుంటే ఏదో ఒక వుద్యోగం గ్యారంటీగా కొట్టేసి వుంటాను . నా జాతకమే మారిపోయి వుండేది. నా  పిల్లోల్లు ఇంకా బాగా సెటిల్ అయిండే  వాళ్ళు. సదువే బ్రతుకు అని మా నాయిన చెప్తానే వున్యాడు కానీ నా బుర్రకే ఎక్కలే .  ఇదీ మా అత్త మాట.

పెండ్లి అయినప్పటి నుంచి ఒక్క రోజైనా  నువ్వు మీ నాయనను తలచుకోకుండా , పొగడకుంటా వుంటావేమో అని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తానే ఉండాను కానీ, ఒక్క పొద్దైనా నీ నోట్లోంచి మీ నాయన మాట రాకుండా ఉన్నింది లేదు కదమ్మే.ఇంతగా ప్రేమించే కూతురు వుండటం మీ నాయన చేసుకున్న పున్నెం. ఇన్నేండ్లు గడచినా నువ్వు మీ నాయన్ని, ఇప్పుడికీ  తలచుకుంటా ఉండావు కానీ, నిన్ను నన్నూ ఇట్లా మన పిలకాయలు తలచుకుoటారంటావా ? మన పిల్లోల్లు రాబోయే కాలంలో ఎట్లుంటారో ఏమో “ ..అనే వాడు మా మామయ్య.

ఒకరిని ఆశించి ఏదైనా చేయడం దరిద్రం.పిల్లలు తమని  చూస్తారని ఏ  తల్లి తండ్రీ పిల్లల్ని  కనరు, పెంచరు . ఎవురి బ్రతుకు వాళ్ళదేబ్బా.. ”. ఇదీ ఆమె జవాబు, ఆమె వ్యక్తిత్వం కూడా!.

మా నాయన  చనిపోయినప్పుడు నేను తమ్ముడు  చాల చిన్న వాళ్ళం. మా అమ్మకు యెట్లా ధైర్యం చెప్పాలో, ఆమెను యెట్లా ఓదార్చాలో  మాకు తెలియదు. అదిగో సరిగ్గా అ సమయంలో మా అత్తే గనుక తోడు లేకుంటే మా అమ్మ ఏమై  పోయి ఉండేదో మాకు తెలియదు.

ఇప్పటికీ ఒక దృశ్యం నా కళ్ళ ముందు అట్లాగే  నిల్చిపోయింది. బహుశా ఆ దృశ్యం నేను బ్రతికి వుండేంత వరకూ  నాతోనే వుండి పోతుందేమో.!

బాగా వర్షం పడుతోంది. మా అమ్మ ఏడుస్తా పడుకుని వుంది. మాది పెంకుటిల్లు. అక్కడక్కడా కారుతోంది.  నేను, మా తమ్ముడు వాన నీళ్ళు  పడేచోటికి  బక్కెట్లు మారుస్తూ వున్నాం. నీళ్ళు నిండగానే రెండు చేతులతో బక్కెట్లు ఎత్తుకుని ఇంటి ముందు పారబోస్తున్నాం. ఆ రోజు మా అమ్మ ఉదయం నుండి అస్సలు ఏమీ తినలేదు. మేం ఎంత చెప్పినా  లేయ్యలేదు, ఏమీ  వండలేదు. హోటల్ నుండి అయినా ఏమైనా తెస్తాను మా అని అడిగినాను కానీ మా అమ్మ వద్దు అనింది.

వర్షం బాగా పెరిగి పోతోంది. చలి ఒక పక్క. అసలే మా ఊరిని పూర్ మెన్స్ ఊటి అంటారు, అంత చలి వుంటుంది  ఇక్కడ. మాకు ఆకలి అవతా  వుంది. నేను, మా తమ్ముడు ఇద్దరూ మగపిల్లలమే అమ్మకు. మగపిల్లమే అయినా మాకు ఇంటిపనులన్నీ  నేర్పించింది మా అమ్మ. చెత్తలు ఊడ్చటం , అంట్లు తోమడం, కల్లాపి చల్లి ముగ్గులు వెయ్యటం,వంట చెయ్యడo, బట్టలు ఉతకడం ఆన్నీ నేర్పింది మా అమ్మ. పని చేసేదాంట్లో  ఆడ పిల్లలు, మొగ పిల్లలు అనే  తేడా వుండకూడదు. మగపిల్లోల్లు పని చేసేదానికి నామోషి పడకుండా వుంటే చాలు, ఆడోల్ల జీవితాలు బాగుపడతాయి అనేదిమా అత్తయ్య అభిప్రాయం. మా అమ్మకు కూడా అదే నమ్మకం.

నిజానికి మా అమ్మకు ఆడపిల్లలంటే చాల ఇష్టం. అందుకే ఆడపిల్లలాగే  నాకు తలదువ్వి, రోజూ జడ వేసేది. మాకు మునిదేవర చేసి తల వెంట్రుకలు  మునీశ్వరుడికి సమర్పించే ఆనవాయితి ఉంది. తెల్లమచ్చ ఒక్కటి కూడా లేని నల్ల మేకపోతు కావాలి, పూజలు చేసి, అందరికి వండి పెట్టాలంటే విందుకు చాలా  డబ్బే అవుతుంది. అది లేక మా మునిదేవర వాయిదా పడుతూ వచ్చింది.ఆ మునిదేవర అయ్యేంత వరకూ తల వెంట్రుకలు  అట్లాగే వుంటాయి. జుట్టు కత్తరించడానికి వీల్లేదు. 

నేను ఉప్మా చేశాను కానీ అమ్మ తినలేదని మేం కూడా తినకుండా అట్లాగే ఉదయం నుండి పస్తు వుండి పోయాం.

అమ్మా నువ్వట్లా వుంటే మేం ఏం కావాలి, నిన్ను చూస్తా వుంటే  మాకు ఏడుపు ఆగడం లేదు , నువ్వు ధైర్యంగా  వుంటేకదా  మేo కూడా ధైర్యంగా వుంటాం, తినమ్మా ... ”  అని అప్పటికే చాలా సార్లు అమ్మను అడుకున్నాం..కానీ ఆమె మా మాట వినలేదు . మంచం పైనుండి లేవడం లేదు.

అంతకు ముందు రోజు రాత్రి కూడా ఆమె సరిగ్గా తినలేదు. కొన్ని సందర్భాలలో  ఆమె చాలా మొండి మనిషి.ఎవ్వరు ఎంత చెప్పినా వినే రకం కాదు.

యెట్లా చెయ్యాలి, ఆమె చేత ఇంత అన్నం తినిపించడం యెట్లా రా నాయనా అని మేం బాధ పడే టైంలో సరిగ్గా మా అత్త, భోరోమని కురుస్తున్న వర్షాన్ని అస్సలేమాత్రం లెక్క చెయ్యకుండా , చీరకొంగు తలపై కప్పుకుని, ఒడి లో రెండు స్టీల్ గిన్నెలు దాచి  పెట్టుకుని చీరకొంగు దాని చుట్టూ కప్పుకుని వర్షంలో తడుస్తా వేగంగా ఇంట్లోపలికి వచ్చింది. అప్పుడు వచ్చిన ఆ వాననీళ్ళ వాసన జీవితాంతం  చాల సందర్భాలలో నన్ను వెన్నాడుతూనే వుంది.అదొక వర్షం వాసనే కాదు, వర్షంలో తడచిన  మనిషి వాసన. పసి బిడ్డలాంటి, కన్నతల్లి లాంటి నిఖార్సైన మనిషి వాసన.!

“  వొదినా లెయ్యమ్మా, వేడి వేడిగా సంగటి, గురుగాకు తెచ్చినాను. అంగడి తలుపు కూడా ముయ్యలేదు. గభాలున తినేయ్యాల్లి. మా తల్లి కదా లేయ్యమ్మా. పిల్లోల్ల మొహాలు సూడు ఎట్లుoడాయో. నువ్వు అన్నమూ నీళ్ళు మానేసినంత మాత్రాన   , పోయిన మా అన్నేమైనా తిరిగొస్తాడా సెప్పు ?  ”

పసిబిడ్డను లేపినట్లు మా అమ్మను లేపి కూర్చోబెట్టింది. బలవంతాన మా అమ్మ చేత నాలుగు ముద్దలు తినిపించింది.

మా అమ్మ ఏమి చెప్పిందో ఏమో కానీ, మా అత్త ఆ రోజు నుండి మూడు నెలలు మా అమ్మకు తోడుగా పడుకునే దానికి, రాత్రి అన్నం తినేసి , మా అమ్మకు సంగటో, ఊరి బిండో, చింతాకు చారో, ఏదో ఒకటి అంత గిన్నెలో తీసుకుని మా ఇంటికి  వచ్చేసేది. అమ్మ  తినేసాక   ఇద్దరూ వక్కా ఆకు నమలుకుంటా, పాత  సంగతులెన్నో మాట్లాడుకుoటా రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటా వుండి పోయే వాళ్ళు. వాళ్ళ బాల్యం వాళ్ళ కష్టాలు వాళ్ల దుఃఖాలు, వాళ్ల ఒంటరితనాలు ఆ కబుర్లు నిండా వినిపించేవి. ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఓదార్చే వాళ్ళు. వాళ్ల తల్లిదండ్రుల్ని గుర్తుతెచ్చుకుని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. 

హరికథలకి , భజనలకి, గుడులకి, సావిత్రి సినిమాలకి వాళ్ళు  ఇద్దరే  వెళ్లి వచ్చే వాళ్ళు. మా నాయన పోయిన దుఖం లోంచి మా అమ్మ బయట పడిందంటే దానికి  ఒకే కారణం మా కాంతమ్మ అత్తే ! 

తనకంటూ ఎప్పుడూ ఏమీ ప్రత్యేకంగా వండుకొని తినే అలవాటు లేని ఆయమ్మ, ఎప్పుడూ సంగటి ముద్దాచెట్నీలు ఊరిబిండి, గొజ్జు, చింతపండు రసంతోనే కాలం గడిపేసిన మా‌ కాంతమ్మ అత్త చివరి రోజుల్లో మాత్రం మనసు మార్చుకుంది. ఆ పది పదిహేను రోజులు ఆమె రాజీపడనే లేదు. తను  జీవితాంతం ఏం తినాలని ఇష్టపడి, ఏం తినకుండా నిరాసక్తంగా ఉండిపోయిందో అవన్నీ  కూతురి దగ్గర అడిగి మరి చేయించుకుని తినింది.

ఒక శుక్రవారం రోజు తలంటు పోసుకుని, ఆమెకు నచ్చిన పసుపు రంగు చీర కట్టుకుంది. కూతురిని చింతాకు వంకాయ పుల్లగూర ఉడుకుడుకు సంగటి చేసి పెట్టమని  అడిగింది . పుష్పమ్మకు వాళ్ళ అమ్మ అంటే ప్రాణం కదా, ఊరంతా తిరిగి ఎక్కడా చింతాకు మార్కెట్లో దొరక్క పోతే, యూనివర్సిటీ దగ్గరకు పోయి, చింతచెట్టు కొమ్మల్ని  దోటితో కిందకు వంచి లేత చింతాకు కోసుకుని వచ్చి లేత వంకాయలు తెచ్చి  వాల్లమ్మ కోరినట్లే చింతాకు, వంకాయ పుల్లగూర , ఉడుకుడుకు సంగటి చేసి పెట్టింది. ఇష్టంగా తినేసి దూరంగా పడేసిన వక్కా ఆకు తిత్తి వెతికి మరీ నడుముకి దోపుకుంది. డాక్టర్లు వద్దంటే ఒక్క మాటతో మానేసిన వక్కా ఆకు ఆరోజు మాత్రం  తెప్పించి వేసుకుంది. చాలా కాలం తర్వాత ఆమె నోరు మళ్లీ ఎర్రగా పండింది. అంత నీరసంలోనూ ఆమెకి ఎక్కడినుంచి అంత ఓపిక వచ్చిందో తెలియదు.

అప్పుడు మా అత్త మా అమ్మనే గుర్తు చేసుకుని కళ్ళ నిండా నీళ్ళు  పెట్టుకుoదని పుష్పమ్మ ఏడుస్తూ ఆ తర్వాత మా అత్త చావు  రోజు ఏడుపుల మధ్య దీర్ఘాలు తీస్తాచెపుతా వుంటే నాకు , మా తమ్ముడికి  కన్నీళ్ళు ఆగనే లేదు.  

మా వదిన జయమ్మ ఈ లోకంలో, ఈ కులంలో ఈ కాలంలో ఉండాల్సిన మనిషే  కాదుమేయ్. అందుకే ఆ దేవుడు ఆయమ్మని తొందరగా పైకి తీసుకుని పోయినాడు. ఆ పిల్లోల్లు ఉత్త అమాయకులు. మంచి తప్ప చెడు తెలియయనోళ్ళు . ఈ మాయదారి  లోకంలో యెట్లా బ్రతకతారో ఏమో. కొంచెం వాళ్ళని  చూస్తా ఉండండి , అట్లాంటి అమాయకపు మనుషుల్ని కాపాడితేనే , దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. ఈ లోకంలో అమ్మా ,నాయన లేనోళ్ళకి చుట్టూరా  ఎంత మంది జనం వున్యా అనాధల కిందే లెక్క. ఆ బాధ  అనుభవించినోల్లకే  తెలుస్తుంది. ఆ బిడ్డలు జాగ్రత్తమేయ్. పైన నా కోసం మా జయమ్మ వక్కాఆకు తిత్తి చేతిలో పెట్టుకుని ఎదురు చూస్తా వుంటుంది. నేను పోయేటప్పుడు గుంతలో వక్కా ఆకుతో బాటూ  ఈ కూడే వేసి, మన్ను వేసేయ్యండిమేయ్. నేను కూడా  పోతాపోతా జయమ్మకి తీసుకుపోవల్ల కదా, ఏంతినిందో  ఎప్పుడు తింనింటుందో? మా వదిన సగం ఆకలి తోనే ఉంటుంది ఎప్పుడూ. వస్తా వస్తా నేను తప్పకుండా ఏదో ఒకటి తనకోసం తెస్తానని నమ్మకంతో ఎదురు చూస్తా వుంటుంది మే...    ”  

అంత స్నేహం, ఇష్టం మా అమ్మంటే .అంతటి అపేక్ష మా అమ్మంటే.ఆమె మాట ప్రకారమే, ఎవరు ఏమనుకున్నా, ఆకూవక్కా, దుగ్గూ సున్నం తో బాటూ, లేత  అరటి ఆకులో ఉడుకుడుకు సంగటి, కూరాకు గుంతలో ఆమెని పూడ్చేటప్పుడు ఆయమ్మ చెప్పినట్లే గుంతలో బద్రంగా  పెట్టేసినారు కాంతమ్మ బిడ్డలు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట నిలబెట్టినారు. అంత ప్రేమ వాళ్లకు ఆయమ్మ అంటే.

బిడ్డలకు  ఆమె పెద్దగా ఆస్తుల్ని ఇచ్చింది లేదు. కానీ, లోకంలో చాలా మంది బిడ్డలకు ఇవ్వలేని ఆస్తిని మాత్రం ఆమె  ఇచ్చి వెళ్ళింది . అదేమిటి అంటారా ? ధైర్యంగా బతికే లక్షణం. మనుషుల్ని ప్రేమించే గుణం.! అంతకు మించి బిడ్డలకు తల్లి తండ్రులు ఇచ్చే ఆస్తి లోకం లో ఇంకేం ఉంటుంది ?

ఆయమ్మ సంపాదిoచుకున్నట్లే ఆయమ్మ బిడ్డలు కూడా చుట్టూ పది మందిని సంపాదించుకున్నారు.ఎరికిలోళ్ళు అనే పేరే లేకుండాఅన్ని కులాలోల్లు వాల్లని సొంత మనుషుల్లా చూసుకుంటారంటే , బంధుత్వాల్ని కలుపుకుని, కులాంతరo చేసుకున్నారంటే , కులాన్ని మించిన మంచిగుణం, మంచితనం, మనిషితనం  వాళ్ళల్లో కనిపించబట్టే అని అందరూ అంటుంటారు.      

ఒక పండగ వచ్చినా, ఒక దేవర వచ్చినా, ఒక గొడవ వచ్చినా, ఏదైనా పంచాయతి  జరిగినా, మా ఇంట్లోనే కాదు, మొత్తం  ఎస్టీకాలనీలోనే  ఇప్పటికీ దేనికో ఒకదానికి ఆయమ్మ పేరు చెప్పుకోకుండా ఉండలేరు.

మా కాంతమ్మత్త చనిపోయినా, మా మాటల్లో, మనస్సులో, జ్ఞాపకాల్లో ఆమె సజీవంగానే వుందిప్పటికీ . మనుషుల మాటల్లో, మనస్సుల్లో, జ్ఞాపకాల్లో   బ్రతికి ఉండటమే కదా అమరత్వం అంటే? !

కథలు

మా కతార్ బాబాయ్

"ఎట్లుందిరా రూమ్, ఫుడ్ గిట్ల? అంతా ఓకేనా?"

చాలా రోజుల తర్వాత అదే మొదటిసారి బాబాయిని నేరుగా కలవడం. అది కూడా వేరే దేశంలో. కొంచెం ఎక్సయిటింగా అనిపించింది.

"హా! ఓకే బాబాయ్. అంతా సెట్. ఒక రూమ్‌లో నలుగురు ఉండాలి. ఫుడ్ కూడా బాగుంది. నేపాల్ వాళ్లకి, మన ఇండియా వాళ్లకి, ఇంకా వేరేవాళ్లకి అందరికీ సపరేట్ ఫుడ్ కౌంటర్లు ఉన్నాయి మెస్‌లో. కూరలు కూడా మంచిగనే ఉన్నాయి. కాకపోతే కొంచెం సప్పగా ఉన్నయంతే!" 

బాబాయ్ కొద్దిగా లావయ్యాడు. కొంచెం రంగు‌ తేలాడు. బొర్ర దిగింది. బహుశా ఆ కార్లో కూచొని రోజంతా డ్రైవింగ్ చేయడం వల్లనేమో!

"మీ కంపెనీ మంచి కంపెనీరా. సెమీ గవర్నమెంట్ కంపెనీ ఈడ! నాకు తెల్సురా మంచిగనే ఉంటాయి మీకు ఫెసిలిటీస్ అన్నీ. అది సరే గానీ, నేను తెమ్మన్నయి అన్నీ తెచ్చినవా మరి?"

నేను వచ్చేటప్పుడు అందర్లాగనే ఇంట్లో పెట్టిన ఊరగాయ, పిండివంటలు తెమ్మని చెప్పిన బాబాయ్, ఇంకోటి కూడా తెమ్మన్నడు. కొత్తగా కొన్న బండ్లకి కట్టే దిష్టి పూసల దండ. మొదటిసారి వస్తున్నా, తెలియని దేశం. దిష్టి గిష్టి అంటే తెలియని ఇక్కడి కస్టమ్ ఆఫీసర్ దాన్ని చూసి ఏంటని అడిగితే ఏం చెప్పాలె? అది ఇంకేదో అనుకుని నాపై కేసు రాస్తే? అవసరమా? అందుకే నేను తేనని చెప్పా.

"అట్ల కాదులే! ఎవరేమనరు. మర్చిపోకుండా తీసుకరా" అని ఫోన్లో నమ్మకంగ చెప్పాడు. ఇప్పుడు నేనది తెచ్చానో, లేదో అని సందేహం బాబాయ్‌కి. సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చినా తనకి ఆ నమ్మకాలు, చాదస్తం పోలే! నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో డ్రైవర్‌గా కతార్‌కి వచ్చి, ఇపుడు తనే సొంతంగా ఒక కార్ కొనుక్కొని ఉబర్‌లో నడుపుకుంటున్నాడు. మేము కూర్చుంది దాంట్లోనే. ఒక మాల్ పార్కింగ్ లాట్‌లో కార్ పార్క్ చేసుకొని మాట్లాడుతున్నం.

"హా! తెచ్చిన బాబాయ్. ఇంకా విప్పలే సామాన్. నావి కూడా కొన్ని ఉన్నయి దాంట్లో. రేపు అన్ని రూమ్‌లో సెట్ జేసుకున్నంక ఇస్తా నీ సామాన్ నీకు" అన్నా.

పొద్దున పది గంటలు కూడా కాలేదు. బయట ఎండ మాత్రం గట్టిగానే కాస్తుంది. కార్లో ఏసీ ఆన్ చేసుకొని కూచున్నం. రోడ్డు మీద కార్లు, పికప్ ట్రక్‌లు, బస్‌లు, ఇంకా పెద్ద పెద్ద ట్రక్‌లు తిరుగుతున్నయ్. అక్కడక్కడా ఒక్కొక్క బైక్ కనిపిస్తుంది. అవి ఫుడ్ డెలివరీ బైక్‌లు. ఇక్కడ జనాలు బైకులు ఎక్కువగా నడపరని విన్న! ఇదిగో ఇప్పుడు చూస్తున్నా నిజంగనే.

"సరే! ఇంకా మరి? ఇంట్ల అంతా మంచిదేనా? ఇంతగనం సదుకున్నావ్. రాకురా వారి ఇటు, ఆన్నే ఏదయినా జేసుకోరా అంటే ఇనక పోతివి. అచ్చినవ్ అట్లిట్ల జేసి. సరే కానీ!ఇంకా మరి?"

బాబాయ్ అలా మాటిమాటికి ఇంకా ఇంకా అనడం నచ్చలేదు. 'ఏంటి బాబాయ్ ఎటైనా పోవాల్నా' అని అడుగుదామనుకున్న. బాగోదేమో అని అడగలే ఇగ.

"హా! ఏం జేద్దం బాబాయ్? ఈ కరోన జెయ్యంగా అందరికీ బాగా కష్టమైతుంది ఇంటికాడ. నేనూ అందరి లెక్కనే కూసున్న ఏం పన్లేక కొన్ని రోజులు. ఇగ ఎన్ని రోజులు కూసుంటమిట్ల? ఏదైతే అదైతదని అచ్చిన ఇటు"

ఇంజినీరింగ్ అయిపోయి నాలుగు సంవత్సరాలవుతున్నా ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించలేకపోయా. ఇప్పటిదాకా చేసినవన్నీ కాంట్రాక్టు బేసిస్‌లోవే. ఇప్పుడంటే ఈ కరోనా ఉంది గానీ ముందు మూడు సంవత్సరాలు ఏం చేశా? ఇప్పుడేమో ఇలా కరోనా పేరు చెప్పుకొని నా అసమర్థతని కప్పి పుచ్చుకుంటున్నా. నన్ను చూస్తే నాకే ఏదోలా అనిపించింది.

"సరేరా కలుద్దాం. మల్ల వెళ్తా ఇగ! నిన్ను ఎక్కడ దించాలె?" అంటూ ఓ 50 రియల్ నా జేబులో పెట్టాడు. ఇండియాల వెయ్యితోటి సమానం అవి.

వద్దు బాబాయ్ అందమనుకున్న. 'వెళ్లిన కొత్తలో మనకు తెలిసిన వాళ్లెవరైనా డబ్బులు ఇస్తే వద్దనకుండా తీస్కో.‌ దేనికైనా ఉపయోగపడతాయి" అని ఇంటిదగ్గర మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వద్దనలేదు. తీసుకున్నా.

" ఓకే బాబాయ్! నన్ను ఆ ఏషియన్ సిటీ గేట్ దగ్గర దింపేయ్"

నాకంటే అప్పుడప్పుడు ఇలా కలవడానికి బాబాయ్ ఉన్నడు. మరి బాబాయ్ వచ్చిన కొత్తల్లో ఎవరైనా వచ్చి కలిసారో లేదో బాబాయిని? ఒక్కడే ఒంటరిగా ఫీల్ అయ్యాడేమో? ఏషియన్ సిటీ గేట్ వచ్చింది. కారు దిగా.

"ఓకే బాబాయ్! ఉంటా మరి కలుద్దాం"

నా ఆలోచనల్లాగే కారు నన్ను దాటుకుని వేగంగా వెళ్తుంది. ఇంటి దగ్గరున్న ఇన్ని రోజుల్లో బాబాయ్‌కి కనీసం ఒక్క సారైనా ఫోన్ చేసింది లేదు. ఎట్లున్నవని అడిగింది లేదు. ఇదిగో ఇప్పుడిలా వస్తున్నా అని ఒక నెల ముందు నుండే స్టార్ట్ చేసిన ఫోన్లు చేయడం. అంతేలే! మనుషులకి ఎవరితోనైనా అవసరమొస్తే తప్ప వాళ్ళు గుర్తురారేమో? నేను కూడా అంతే కదా అనుకున్న. ఇంతలో నా ఫోన్ రింగైంది. అవతల బాబాయే మళ్లీ!

"చేరుకున్నావరా రూమ్‌కి? జాగ్రత్తగా ఉండు. నీకు ఏం అవసరమున్న అడుగు. బాబాయ్ ఏమనుకుంటడో అనుకోకు. సరేనా?"

నేనే గనక బాబాయ్ స్థానంలో ఉంటే నా ఆలోచనలు వేరేలా ఉండేవి. నాలోని ఆవేశాన్నంత సూటిపోటి మాటలతో చల్లార్చుకునేవాణ్ణి. కానీ బాబాయ్ అలా ఆలోచించినట్లు నాకైతే అనిపించలేదు. పెద్దరికం అని దీన్నే అంటారేమో! మా రూమ్ వచ్చింది.

 

కథలు

సమాధి తోట

ప్రతి ఆదివారంలాగే నిన్న కూడా ఇంట్లో చికెన్. ఎప్పుడులా కాకుండా సారి కూర బాగుందనిపించింది. కొంచెం పుల్లగా, కొంచెం ఘాటుగా. మధ్య తినేటప్పుడు నాకు అలవాటైన వంటని తిట్టే గొణుగుడు ప్రోగ్రాం కాకుండా, అమ్మకి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చినా. ఎప్పుడూలేంది మారు అన్నం కూడా పెట్టుకున్నా. అంత నచ్చింది మరి. తిన్న పది నిముషాలకే టీవీ కట్టేసి, ముఖానికి ఆవులింతలు తగిలించుకుంది అమ్మ. లైటు ఆర్పేసి ఇవతలగదిలోకి పాకాను నేను. గచ్చుమీద బొంత, కాళ్ళ దగ్గర ఒక స్పాంజీ దిండు, తలదగ్గర ఇంకో మెత్త. కప్పుకోడానికి రెక్క దుప్పటి. దోమలు ఎక్కువ ఉన్నాయని కిటికీలు వేశా. లైటు తీసేసి ఫోన్ డిస్ప్లే వెలుతురులో పక్క సర్ది పడుకున్నా. నిద్రపోయ్యేముందు వాట్సప్ ఓపెన్ చేశా. చదవకుండా వదిలేసిన గ్రూప్ మెస్సేజులు మాత్రమే కనిపించాయక్కడ. ఒంటరోడినని గుర్తు చేసింది ఫోన్ మళ్లీ.

ఎంత తన్నుకులాడినా నిద్రరావట్లే. కొద్దిసేపయిన తరువాత పొట్టమీద మీద ఎవరో కూర్చున్నట్టు, లోపలికి గుండె అంతా బిగుసుకుపోతున్నట్టు అనిపించింది. గాలి సరిగా ఆడనట్టు, గొంతు ఎండిపోతున్నట్టు, ఇలా. గాలి పీల్చుకోడానికని నోరు తెరిచాను. రెండు నిముషాలు పర్వాలేదనిపించినా మళ్ళీ అదే ఇబ్బంది. గొంతు పట్టేసినట్టు, పీక ఎవరో నులుముతున్నట్టు అనిపించింది. భయం దాచుకుంటూ లేచి కూర్చున్నా. వీపు ఆనుకున్న గోడ కంపిస్తున్నట్టుగా గుండె దడ లోపల. చల్లగవుతున్న పాదాలను చేతులతో అదుముకుని, గోడవార  పడుతున్న సన్నని వెలుతురు దగ్గరికి వెళ్ళా. గదిలో గాలి తక్కువ ఉందేమోనని కిటికీలు తెరిచా. తెరలు తెరలుగా గాలొచ్చి మొహానికి తగిలింది. సారి ఇంకా గట్టిగా నోరు తెరిచా. గాలి నోట్లోకి పొయ్యి, వెంటనే బయటికి వస్తున్నట్టనిపించింది. కిటికీ దగ్గర నుంచున్నా, అంత గాలి బయటనుండి వస్తున్నా, వళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అటు ఇటు వేగంగా నడిచా గదిలో, చీకట్లోనే. ఊపిరాడటం లేదని స్పష్టంగా అర్థమయింది నాకు. కాళ్ళు వణకడం మొదలైంది. నడకలో తత్తర. గొంతు ఎండిపొయ్యి మాట పెగలట్లేదు సరిగా. భయం భయంగా లైటు వేసి అమ్మని లేపా. నా గోలకి గోపిగాడు కూడా లేచాడు. గాలాడటం లేదని సైగ చేశా. మెల్లగా నడిచి గాలి పీల్చుకో సర్దుకుంటుందని చెప్పారిద్దరు. ఎంత నడిచినా లాభం లేదు. నడిచే తొందరలో చావుమీద జడుపు పట్టుకుంది. చేతులు, కాళ్ళు సల్లబడుతున్నాయి. మంచం మీద పడుకోబెట్టారు. గోపి చేతులు రుద్దుతుంటే, అమ్మ కాళ్ళు రుద్దుతుంది. మెల్ల మెల్లగా కాళ్ళనుండి ఒకొక్క శరీరభాగం సల్లబడుతున్నాయి. నేను ఇలా అవుతుందని చెప్పేసరికి గోపిగాడికి కూడా భయం వేసినట్టయ్యింది. మనిషి దిట్టంగా ఉన్నా భయాన్ని మాత్రం లోపల దాచుకోలేడు వాడు. నా మొహంలో చావుని చూసినట్టున్నాడు. అమ్మని లోపలకెళ్లి మంచినీళ్లు తెమ్మన్నాడు. చల్లదనం గుండె దగ్గరికి చేరుకుంది. ఇలా కుదిరేట్టు లేదని మంట వేద్దామని అమ్మతో చెప్పాడు. అమ్మ కన్నీళ్లు దాచుకుంటున్నట్టుంది. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏదో కథల పుస్తకం పేజీలు చింపి మంట వేశారు ముందు గదిలో. మంచం మీద నుండి నన్ను లేపి మంట ముందు కూర్చోబెట్టారు. కూర్చొని కూర్చొని నీరసం ఎక్కువయ్యి కళ్ళు పూర్తిగా మూసుకుపోతున్నాయి. అదిగో అప్పుడే గోపి గాడు 'చొక్కా తీసేద్దాం, వేడి డైరెక్టుగా లోపలికి పోతుంది' అని, నా చొక్కా గుండీలు విప్పాడు. తరువాత అమ్మ ఏడుపు గట్టిగా వినొచ్చి, నా కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తరవాతే నాకు మెలుకువ వచ్చింది. గుండె దడగా ఉంటునట్టు, గాలి సరిగా ఆడటం లేదని చెప్పా డాక్టర్ కి. ఇంకా ఏదో చెప్తుంటే నా మాటలేమి పట్టనట్టు గుండె మీద స్టెతస్కోప్ పెట్టి గట్టిగా అదిమాడు. కళ్ళు నొసలు చిట్లించి శ్రద్ధగా విన్నాడు గుండె చప్పుడిని. కంగారు పడాల్సింది ఏమి లేదని మందుల చిట్టి రాసాడు. అందులో స్ట్రెస్ కి కూడా మాత్రలు రాశానని, అవి వేసుకున్నప్పుడు మొదట్లో తిక్క తిక్కగా ఉండొచ్చని జాగ్రత్త చెప్పాడు.

ఏదీ సరిగా గుర్తుపెట్టుకోలేని నేను మందులు మాత్రం టైంకి తింటున్నా. మందులు వేసుకోవడం మొదలెట్టిన దగ్గరనుండి నాలో రెండు మార్పులొచ్చాయి. ఒకటి- ఎంత లేటుగా పడుకున్నా గంట కొట్టినట్టు తెల్లారుజామున నాలుగ్గంటలకే మెలుకువ రావడం. మరొకటి- గతంలో జరిగిన ఈవెంట్స్ ని తలచుకొని, వర్తమానాన్ని, భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకోవడం. ఒకటి ఫిజికల్ మార్పు, రెండోది మెంటల్.

రోజు రాత్రి అలా జరిగిన దగ్గరనుండి అమ్మ నా మంచం పక్కనే పడుకుంటుంది. నిద్రపోయినా రాత్రుళ్ళు లైట్ ఆర్పడం మానేశారు ఇంట్లో. మా అన్న నా ఫోన్ కి కాల్ చేస్తున్నాడు కొత్తగా. అమ్మకి ఎవరూ లేవకముందే నిద్రలేచి పని చేయడం అలవాటు. కానీ మధ్య నాకు, అమ్మకి కూడా మెలుకువ రాని పొద్దప్పుడే నిద్ర తేలిపోతుంది. మొదటిరోజు అమ్మని లేపి చెప్దామనుకున్నా. కానీ ఇప్పటికే భయపెట్టింది చాలులే అని ఊరుకున్నా. ఇక మంచంలో అటు, ఇటు మెసలడమే తెల్లారేదాక. పెచ్చులూడుతున్న ఇంటి కప్పుని చూస్తూ ఒక రోజు, కిటికీ పక్కున్న నిమ్మచెట్టు మీద నాకు తెలీని పిట్ట అరుపు వింటూ మరొకరోజు గడిపా. మరుసటి రోజు ఏమీ తోచక ఫోన్ ఓపెన్ చేశా. ఎప్పటినుండో చదవాలనుకుంటున్న 'హౌ నాట్ టు ఫియర్ అబౌట్ డెత్' వ్యాసం ఓపెన్ చేశా. అది రెండు పేరాల దగ్గరే ఆగిపోయింది. నేను లోలోపల కూడబలుక్కుంటున్న అక్షరాల శబ్దాలను ఎవరో పక్కన కూర్చుని నా బదులు చదువుతున్నట్టనిపించింది. మొన్నెప్పుడో ఫేస్బుక్ లో ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ కింద నే పెట్టిన కామెంట్ గుర్తొచ్చింది- చావు గురించి తెలుసుకోవడం నాకు భలే సరదా. కానీ మొన్నటి ఎక్స్పీరియన్స్ తో ఒకటి రియలైజ్ అయ్యా. నాకు చావు గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం కాదు, చావంటే చెప్పలేనంత భయం. అది ఒప్పేసుకోలేకే ముసుగేమో!

ఎవరి చావైనా టీవీలో చూసినా, సీరియస్ గా లెక్చర్ వింటున్నప్పుడు ప్రొఫెసర్ చావు గురించి, ఇంకా బుద్ధిస్ట్ లు నమ్మేనైరాత్మావాదంకి సపోర్ట్ గా ఆర్గుమెంట్స్ ప్రెసెంట్ చేసినప్పుడైనా, నా ఆలోచనలన్నీ చావువైపు మళ్లుతాయి. నా చావు వైపు. నన్ను కట్టేసిన బంధాలు, నాకంటుకున్న స్నేహాలు, నాలో భాగమయిన మనుషులు, నా చావుతోనే మాయమవుతారా అని తోచేది. భయమేసేది. ఎంతో కష్టంగా వేరే విషయాల మీదకు నా ఆలోచనలను మళ్లించేవాడిని. అదొక నరకం. దెబ్బ తగిలితే రక్తం ఐనా కనపడుతుంది దాని ఆనవాలుగా. ఆలోచనల హింస మాత్రం ఎప్పటికీ బయటికి కనపడదు. నాకు చావు గురించి ఆలోచనలు ఎక్కువ రావడానికి ఒకానొక కారణం మా నాన్న.

ముందు మా నాన్న ఎలాంటోడో చెప్పాలి. పోనీ మా నాన్న అంటే నా దృష్టిలో ఏంటో మీకు తెలియాలి. ఎవరో తట్టినట్టుగా ఉదయం నాలుగింటికే లేచేవాడు నాన్న. దారంతా తెలిసినోడిలా దోవ తడుముకోకుండా ఇంట్లోంచి బయటకొచ్చి దొడ్లోకి పొయ్యేవాడు. పొగ తాగక నోరంతా పీకుతుందని ఉమ్మేసేవాడు. లుంగీ పైకిదోపి బీడీ వెలిగించేవాడు పొద్దు పొద్దున్నే. అప్పట్లో దొడ్డికి పైకప్పు ఉండేది కాదు. వాన, వెలుతురు, గాలి, అందరూ సమానమే దానికి. ఇష్టమొచ్చినప్పుడు వచ్చి పోతుండేవవి దానిలోపలికి. తెల్లారుజాము చీకట్లో ఎరుప్పచ్చని మిణుగురులా బీడీ వెలుగు. ఇంటికెదురు వేప చెట్టు నీడలో బీడీ ఆరిపోయేదాకా తిరిగేవాడు. గదిలోకి పోతూ, గదిలో ఉన్న నా మంచం దగ్గర ఒక్కోసారి ఆగేవాడు. మునగదీసుకుని పడుకున్న నన్ను పక్కకి జరిపి పడుకోవాలని చూసేవాడు. బీడీ వగరు వాసననో, బంకలా సాగే చర్మమనో, భరించలేని గురకనో చెప్పి, పడుకొనిచ్చేవాడిని కాదు నా దగ్గర ఆయనని. ఒక్కో రాత్రి సోయలేకుండా తాగొచ్చేవాడు. పొద్దున్నే బీడీకని లేచినప్పటికీ ఇంకా మత్తు దిగేది కాదు. అలాంటిరోజుల్లో నా దగ్గరకొచ్చి ముద్దు ఎక్కువ చేసేవాడు. మంచంకోడుని ఒక చేత్తో పట్టుకొని, బలంకొద్దీ నెట్టేవాడిని నా దగ్గర పడుకోవద్దని. నా ఉడుకుమోత్తనం చూసి ఇంకా నవ్వేవాడు. వాసనొస్తున్న నోటితో బుగ్గ మీద ముద్దుపెట్టేవాడు. గడ్డం అచ్చులు నా బుగ్గమీద పడేవి. (నేను ఇంటర్ లోకి వచ్చినప్పటికీ కూడా ముద్దులు ఆగలేదు). మా కుటుంబంలో మా నాన్నకొక్కడికే నిండైన గడ్డం. అమ్మతరపు ముగ్గురు మామయ్యలకి గడ్డిపోచల్లాంటి గడ్డం. వాళ్ళ కొడుకులకి అయితే పెళ్ళీడు వచ్చినా ఇంకా గోదుమ్మీసాలే. మా అన్నకి, నాకు వాళ్ళ పోలికే వచ్చిందనుకుంటా ఒక్క విషయంలో మాత్రం.

అసలు చిన్నప్పుడు మా నాన్నకు నా మీద ఇసుమంత కూడా ప్రేమ లేదని అనుకునేవాడిని. నా కారణాలు నాకున్నాయి మరి. నేను అయిదో తరగతి దాకా మా ఊరి చిన్నబడిలోనే చదువుకున్నా. తరువాత ఆరో తరగతికి పరీక్ష రాస్తే దూరంగా ఎక్కడో హాస్టల్ లో సీట్ వచ్చింది. కొత్త స్కూల్ యూనిఫామ్, పేజీలు నలగని నోటుబుక్కులు, మూడుపూటలా తిండి. నా ఇష్టంతో పనిలేకుండా పంపడానికే సిద్ధమయ్యారు ఇంట్లో వారందరూ. నాకంటూ ఒక ఇష్టం ఉంటుందని నాన్నకి అనిపించలేదు అప్పుడు. దసరా, సంక్రాంతికి వారం వారం రోజులు సెలవులుండేవి. ఉప్పుబిర్రాట, అయిసిరాట, వాలా వాలింకి ఆట, ఇవన్నీ తనివితీరా ఆడుకునేలోపే సెలవులయిపొయ్యేవి. హాస్టల్ కి వెళ్లే రోజు ఏడవని సంవత్సరం లేదు. హాస్టల్ కి పోవాలంటే మా మండలానికి నడిచి, అక్కడనుండి లారీ ఎక్కాలి. మాఊరి నుండి మండలానికి ఆరు కిలోమీటర్లు పైనే. అది కూడా మట్టి రోడ్డు. అడ్డదారిన రైలుపట్టాలెక్కి గేటు దగ్గరికి పోతే మూడు కిలోమీటర్లు తక్కువైద్ది. ఏడో తరగతిలోకి కొత్తగా పోతునప్పుడు, రైలు పట్టాల మీద మా నాన్నకి దొరక్కుండా చాలా దూరం ఉరికినా. వేగంగా పరుగెత్తాలని చెప్పులు తీసేసరికి పగులురాయి దిగబడి రక్తం విరగచిమ్మింది. తొందరలోనే నాన్న నన్ను దొరకబుచ్చుకున్నాడు. దగ్గర్లోనే కాలువ వంతెన ఒకటుండే. హాస్టల్ కి పోకపోతే గొంతుపిసికి కాలువలో నెడతా అని వీపు మీద రెండు దెబ్బలు గట్టిగా కొట్టిండు. ఏమనుకున్నాడో ఏమో గాని కాలువలో దించి దెబ్బ కడిగి, కండువతో కాలు కట్టిండు. దెబ్బతోనే హాస్టల్ కి ఏడ్చుకుంటూ వెళ్ళా. అప్పుడు అనిపించింది నాన్నకి నామీద ఏమాత్రం ఇష్టంలేదని.

కానీ, ఆయన మరీ ప్రేమ తెలియని గరుకు మనిషి కాదని ఒక పిల్లి వల్ల తెలిసొచ్చింది తర్వాతెప్పుడో నాకు. బొందలగడ్డ దగ్గర దొరికింది మాకా పిల్లి. పుట్టి ఎంతో కాలమయినట్టు లేదు. అప్పుడే విచ్చుకుంటున్న చిన్ని చిన్ని కళ్ళు. వళ్ళంతా ఇంకా పూర్తిగా కప్పెయ్యని బూడిదరంగు వెంట్రుకలు. పొట్టమీద అడ్డంగా రెండు మీగడరంగు గీతలు. ఎవరో గోనె బస్తాలో వేసి పారేశారక్కడ. బస్తా తాడువిప్పగానే నాన్న వళ్ళో వాలింది గోల చేసుకుంటూ. అది మొదలు నాన్నని విడిచిపెట్టింది లేదు అది. బ్రతుకులోనూ, చావులోనూ. దానికి లక్ష్మీ అని పేరు పెట్టాడు. కొంత కాలంలోనే నాన్న పళ్ళెంలో నాలుగు మజ్జిగన్నం మెతుకులు, పక్కమీద కొద్దిగా స్థలం, రెంటినీ ఆక్రమించేసింది అది. తను మా ఇంటికి వచ్చిన కొత్తలో నా దగ్గరకి వచ్చేది కాదు. మా ఇంటికొచ్చిన మూడోరోజు కళ్ళుమూసుకొని గాబు దగ్గర నీళ్లు తాగుతుంది. మెత్తగా తల నిమిరాను. అప్పటికింకా బెదురుతనం పోలేదు దానికి. రక్తమొచ్చేలా నా చేతులని గీరింది. నాన్న కూలికిపొయ్యి వచ్చేదాకా వాకిట్లోనే ఎదురుచూసింది. సాయంత్రంపూట ఇంటికిరాగానే నా మీద ఫిర్యాదు చేస్తున్నదానిలా నాన్న కాళ్ళలో తారకలాడింది చాలాసేపు.

అదంతా ఇంటికొచ్చిన కొత్తల్లో. తరవాత నాకు కూడా అలవాటు కావడానికి ఒక సంఘటన కారణమయ్యింది. రోజు మధ్యాహ్నం పిల్లులు పొడిచేవాళ్ళు బాడిశెలు పట్టుకొని మా గూడేనికి వచ్చారు. అప్పుడు అమ్మోళ్ళు మిరపతోటలో కలుపుకి పొయ్యారు. నేను గుడి దగ్గర సిర్రాట ఆడుతున్న. నాతో ఆడుతున్న అమ్మాయి మా పాక దగ్గర నుండి పిల్లి కేకలు వినొస్తున్నాయని చెప్పింది. తీరా చూస్తే మా లక్ష్మీ. పిల్లుల్ని వేటాడేవాళ్ళకి కనపడకూడదనే ప్రయత్నంలో సరుకారు కంపలో చిక్కుకుంది. ఎడం డొక్కకి ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతుంది. నే దగ్గరికెళ్లగానే సంజాయిషీ ఇస్తున్నట్టు తడి చూపు. కంపలోంచి తీసి, పసుపుతో కట్టు కట్టాను. కోళ్లు కప్పేసే తట్ట వెల్లకిలా వేసి, లోపల వెచ్చగా వేపాకులు వేసి పడుకోబెట్టా. సాయంత్రంకల్లా ఉషారుగా తిరిగింది. అప్పటినుండి నన్నూ దగ్గరికి రానిచ్చింది లక్ష్మి.

ఎంతైనా నాన్న దగ్గరే లక్ష్మికి చనువెక్కువ. ఒక్కోసారి లక్ష్మీ అలిగేది. ఎందుకు అలిగేదో ఎవరికీ తెలిసేది కాదు. ఇంట్లో ఎవరు పిలిచినా అన్నం తినడానికి వచ్చేది కాదు. అదే నాన్న సోయలేకుండా సారా తాగొచ్చి "లక్ష్మీ..." అని పిలిచినా, వళ్ళోకి దూకేది క్షణం ఆలస్యం చేయకుండా. కాలితో మొహమంతా తడిమేది. అలా నాన్నని తడుముతుంటే 'తాగుడు మానేయొచ్చుగా' అని బ్రతిమాలుతున్నట్లుండేది అది. పట్టలేనంత ఇష్టం వచ్చినపుడు మాత్రం పొట్ట కనపడేలా వెల్లకిలా పడుకొనేది. దగ్గరికి జరిగి వీపుమీద చెయ్యేసి ముద్దు చేయమని గోముగా కాళ్ళు జాపేది.

లక్ష్మి కడుపుతో ఉన్నప్పుడు నాన్న లోకమంతా దాని జాగ్రత్తలతోనే నిండిపోయింది. పొద్దున పనికి పొయ్యే ముందు దానికి హద్దులు చెప్పి, సాయంత్రం దాకా బయటకెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చేవాడు. లక్ష్మి కూడా నాన్న చెప్పేవన్నీ దానికి అర్థమవుతున్నట్టు చిన్నగా మూలిగేది. మధ్యాహ్నం పూట ఒక గొంతుకి బదులు, మూడు గొంతులు వినపడేసరికి తట్ట దగ్గరికి వెళ్లా. ఇంకా కళ్ళుతెరవని రెండు బుజ్జి ముండలు. ముట్టుకుందామని చెయ్యి పెట్టే లోపే కరుస్తా అన్నట్టు పళ్ళన్ని బయటపెట్టి పొగలు కక్కింది లక్ష్మి. నాటేసి అలసిపొయ్యి ఇంటికొచ్చారు అమ్మ, నాన్న. ఆయన మాట విని లక్ష్మి బయటకొచ్చింది. 'ఉన్నపళంగా వచ్చి నా పిల్లల్ని చూస్తావా? లేదా?' అని ఒకటే అరుపులు. ముట్టుకొని చూసిందాకా ఊపిరాడనీయలేదు నాన్ననప్పుడు.

అలాంటి లక్ష్మి ఇంటికి రావడం మానేసింది. నాన్న చనిపోయిన రోజు నుండి ఇంట్లో లక్ష్మి అలికిడి లేదు. అమ్మకి మాత్రం ఒక రోజు రాత్రి పూట కనిపించిందట. వెలుగు ఆరిపోయిన ఇంట్లో చీకట్లో వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోయిందట. నాన్న సమాధి కడుతున్న మేస్త్రీలకు బొందలగడ్డలో పిల్లి కనిపించిందని చెప్పారు. అది లక్ష్మినేమోనని వెతికా నేను. ఆచూకీ చిక్కలేదు. రోజులు గడిచేకొద్దీ రాత్రిపూట రావడం కూడా మానేసింది. పిల్లలు రోజురోజుకీ బక్కగయ్యాయి. రెండింటిలో ఒకటి ఇంటి ముందు రోడ్ మీద ఆడుకుంటుంటే ట్రాక్టర్ కింద పడి నుజ్జునుజ్జయింది. రక్తం కారిన దాని కనుగుడ్డు ఇప్పటికీ నాకు గుర్తే. దృశ్యం చూసిన వారికెవ్వరికైనా అన్నం సయించదు. మొదటిది చనిపోయిన తరువాత లక్ష్మీ ఒకసారి పగటిపూట ఇంటికి వచ్చింది. లోపలిగదిలో నేను కింద పడుకొని ఉన్నా. నా దగ్గరికి వచ్చి మౌనంగా తల పక్కన చేరింది. దాని బిడ్డని పిలిచింది ఇటు రమ్మని. అది కూడా వచ్చి నా పక్కన పడుకుంది. దాని చూపులో నాకెందుకో జాలి కనిపించింది. అదే చివరిసారిగా లక్ష్మీని చూడటం. మళ్ళీ కనిపించలేదు ఎవరికీమిగిలిన ఇంకొక పిల్లి ముభావంగా ఉండేది. (దానికి పేరు పెట్టడం మర్చిపోయ్యాం. అసలు పేరు పెట్టేవాడు లేడు కదా!). పెడితే తినేది, అంతేకాని నా హక్కు అని పొట్లాడేది కాదు ఎవరిమీదా. అది కూడా వారంరోజులుండి చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది. నాన్న చావుతోనే పిల్లి అరుపులు ఇంట్లోనుండి మాయమయ్యాయి. ఇప్పటికీ రోడ్డుమీద పోతుంటే పిల్లి అరుపు ఎక్కడైనా వినిపిస్తే, బొందలగడ్డలో మా నాన్న ప్రేమని వెతుక్కున్న లక్ష్మినే గుర్తొస్తుంది నాకు.

నాన్న మీద చిన్నప్పుడు అయిష్టత ఏర్పడడానికి పూర్తికారణం నాన్న చేష్టలే కాదు. దానికి ఇంకో కారణం మా పెదనాన్న ప్రేమ కూడా. మా పెదనాన్న కి ఇద్దరు మగ పిలగాళ్ళు, ఒక ఆడపిల్ల. అందరూ నాకంటే పదేళ్లు పైనే పెద్ద. ఇక మా ఇంట్లోనేమో నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. అందరికంటే నేనే చిన్న. మా ఇంట్లో కంటే ఎక్కువుగా నన్ను గారాబం చేసింది మా పెదనాన్న, పెద్దమ్మే. అసలు చిన్నప్పటినుండి నేను వాళ్ళని చెన్నూరమ్మ, చెన్నూరునాన్న అని పిలిచేవాడిని (చెన్నూరు వాళ్ల ఊరి పేరు). నేను హాస్టల్ కి వెళ్లకముందు అన్ని ఎండాకాలం సెలవులూ చెన్నూరులోనే గడిపా. గుంట గోలీలాట, డోకిచ్చులు, టెంకాటా ఆటలాడి ఊరు పిల్లాడినయ్యా. మొహం కడుక్కోగానే ఊర్లో ఇడ్లీల బండికాడకి పొయ్యి చెట్నీ అంతా చొక్కా మీద ఒలికించుకునేవాడిని. అప్పట్లోనే అక్కడ హోటల్ ఉంది, మా ఊర్లో ఇప్పటికి కూడా హోటల్ లేదు మరి. ముంజకాయలు, మామిడికాయలు తినడానికి తెంపే ఉండేది కాదు. వేడికి చెక్కగడ్డలు కాని వేసవి కాలం లేదు నా చిన్నప్పుడు. ఆయనకి కుడి కన్ను గనుపు దగ్గర పులిపిరి ఉండేది. దాన్ని గట్టిగా లాగి నా వంటిమీద అతికించుకోవాలని చూసేవాడిని. చెన్నూరునాన్న తెల్ల పంచె ఉదయం పట్టుకుంటే మళ్ళీ నిద్రపోయినప్పుడే వదిలేవాడిని. వానపడుతుంటే బట్టలు తీయలేదనో, వీపెనకాల చెమటకాయలు గీకలేదనో, పని దగ్గరనుండి ఇంటికొచ్చేలోపు బొచ్చలు రుద్దలేదనో నాన్న విసుక్కున్నప్పుడల్లా చెన్నూరునాన్న గుర్తొచ్చేవాడు నాకు. మా నాన్న చూపించని ప్రేమంతా చెన్నూరునాన్నలో వెతుక్కునేవాడిని.

నాకు చావంటే భయం అని చెప్పా కదా. అసలు అది చెన్నూరునాన్నతోనే మొదలయింది. నేను హాస్టల్ లో జాయినయిన ఏడాది చెన్నూరునాన్నని కాన్సర్ గడ్డ తినేసింది. విషయం నాకెవరూ చెప్పలేదు నేను హాస్టల్ లో ఉన్నప్పుడు. లాస్ట్ పరీక్షలు తరువాత ఇంటికొచ్చిన నాకు అమ్మ చెప్పింది. పెదనాన్న లేని చెన్నూరుని ఊహించుకోలేకపోయాను. అలిగిదాక్కున్న వడ్ల గుమ్ము, ఇద్దరం కూడబలుక్కొని బర్రెదూడలు కట్టేసిన కొబ్బరి చెట్లు, ఉప్పుబస్తా ఎక్కడానికి వీలుగా వంగిఉండే ఇంటిబయట బావిరాయి, వీటన్నింటికి అర్థాలు మారిపోతాయనిపించింది. నాకు మార్పు నచ్చలేదు. నచ్చడం కాదు, మార్పు వస్తే, దానితోపాటు పెదనాన్న కూడా అప్పుడప్పుడు తలచుకునే జ్ఞాపకం అయిపోతాడని భయం వేసింది. అందుకే నేను ఒకటి గట్టిగా అనుకున్నా అప్పుడే, ఊరికి వెళ్లకూడదని. ఇప్పటికి 13 సంవత్సరాలయింది ఊరిని చూసి. అక్కడికెళ్లి పెదనాన్న గుర్తులు కలుషితం చేసుకోవాలని లేదు నాకు. చావంటే నాకున్న భయం చెన్నూరునాన్న చెప్పాపెట్టకుండా కనపడని  రోజు నుండి మొదలయిందనుకుంటా.

నాన్న చనిపోయిన ముందురోజు రాత్రి తాగుడెక్కువైంది ఆయనికి. వీధిలో ఎవరితోనో పరాచికాలాడుతున్నాడు. ఇంటికి రమ్మని ఎంత బ్రతిమలాడినా రాలేదు. నాకు తెలిసి నేను గొంతు పెంచి నాన్నతో మాట్లాడింది అదే మొదటిసారి. అదే చివరిసారి కూడా. రాత్రి ఏదో పనుండి నేను మా ఇంట్లో పడుకోలే. రాత్రి తాలూకా చీకటి మచ్చలు ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయనుకుంటా. నిద్రపట్టక ఐదింటికే ఇంటిబాట పట్టా. చర్చీ మూల తిరుగుతుంటే  శ్రీనుగాడు ఉరుకులాంటి నడకతో నన్ను దాటేసి పొయ్యాడు. "ఆదాం మాయ్యా…" అని గొంతులో అదురు వినపడింది. మా ఇంటి బయటలైటు వేసుంది. అమ్మ ఏడుపు గట్టిగట్టిగా దగ్గరవుతుంది. నాన్న ఇవతలగదిలో కదలకుండా పడున్నాడు, నేను రోజూ మెదిలే మంచంలో, శాశ్వతంగా నిద్రపోతూ. ఏమి జరుగుతుందో ప్రాసెస్ కావడానికి టైం పట్టింది. మా అమ్మ ఏడుపులో నాన్న చివరి క్షణాల దృశ్యం కనపడింది. నాలుగింటికి దొడ్లోకని లేవడం, బీడీ ముట్టించడం, నా మంచం దగ్గరకొచ్చి నాకోసం వెతుక్కోవడం, పక్కమీద నా ఖాళీని పూరించడం, తొలిపొద్దు గుండెనొప్పి నాకు దూరంగా నాన్నని తీసుకెళ్లడం- ఇవన్నీ ఒక్కొక్కటిగా ముద్రపడుతున్నాయి నాలో.

మాటల్లో ఇమడ్చలేనంత శాంతం నాన్న ముఖంలో. చావు గడియ దగ్గరికొచ్చినప్పుడు నవ్వుతున్నట్టు అనిపించాడు. అసలు మంచం మీద నేనుంటే నాన్న ఇప్పుడు నాతోనే ఉండేవాడేమో? ఆలోచన వచ్చినప్పుడల్లా అమ్మ ముఖం చూడటానికి నాకు ధైర్యం చాలేది కాదు. నాన్నని బొందపెట్టిన మరుక్షణం నుండి లక్ష్మీ మా ఇంటికి రావడం మానేసింది. తను ప్రేమించే మనిషి ఇక లేడుగా.

నెలరోజులకి కొంత సర్దుకుంది ఇంట్లో. అమ్మ అప్పుడప్పుడు అంటుంది, నాన్న కల్లోకి వచ్చాడని, ఏదో చెప్పాడని. వెంటనే నా నుంచి బదులు రాదని తెలిసినా ఒక ప్రశ్న ఎప్పుడూ అడుగుతుంది "చిన్నోడానీకు రాడా కల్లోకి నాన్న?" అని. తనకి తెలీదు నాన్నతో పాటే, నాలో సగభాగం చచ్చిపోయిందని రాత్రి. స్పాంజిల దిండు, మంచి నీళ్లు తాగే రాగిబిందె, ముగ్గురం కల్సి దిగిన ఫోటో- ఇవన్నీ నాలోకం నుండి ఎంత బయటపడేద్దామనుకుంటానో, వాటి జ్ఞాపకాల గుర్తులు అంత లోలోపలికి విసురుగా వస్తాయి. బహుశా అప్పుడే చావు దాని ఉనికిని పూర్తిగా నా మీద వలలా కప్పేసింది.

డాక్టర్ ఇచ్చిన మాత్రల పవరు ఎక్కువుగా ఉందేమో, వేసుకోగానే మగత నిద్ర వస్తుంది రోజూ. మందులెందుకో చేదుగా అనిపించాయి ఇవాళ. ఏదో పనిగా వెతుకుతుంటే, టేబుల్ సొరుగులో నాన్న కళ్ళజోడు కనిపించింది. నల్ల ఫ్రేమ్, దానికి ఒక అద్దమే ఉంది. నాన్నతోనే ఇంకొకటి సమాధిలోకి జారుకుంది. అదే పనిగా వెతికితే, పాత ఉత్తరాలు కనిపించాయి. వానకి తడిసి ఎండకెండిన కాగితాలకి అంటుకునే మడతలు ఉత్తరాల నిండా. కొత్త ప్యాంట్ కొనివ్వమని ఒక దాంట్లో, కొబ్బరినూనె అయిపోయిందని మరొక దాంట్లో, క్రిస్మస్ కి ఇంటికి తీసుకుపొమ్మని ఏడుపు ఇంకొక దాంట్లో, కబడ్డీలో మోకాలి చిప్ప కొట్టుకుపోయిందని బాధ మరొక దాంట్లో- అన్నీ నేను రాసిన ఉత్తరాలే. నాన్న రాసినవి ఒక్కటి కూడా లేవు. ఆయన చదువుకుంది అప్పట్లో నాలుగే అయినా, బాగా తెలివుంది. నోటి లెక్కలు బాగా వచ్చు, నాకంటే బాగా. గొలుసు కొట్టు రాత కూడా. ఒకటికి రెండూ సార్లు చదివితే తప్ప అర్థమయ్యేవి కావు ఆయన ఉత్తరాలు అప్పట్లో. అన్నింటిలో ఒకటే రాగం- సరిగా తిను, ఎవరితో గొడవపెట్టుకోకు, బుద్ధిగా చదువుకో. ఉత్తరాలన్నీ నాన్నే దాచి ఉంచాడేమో? నా హాస్టల్ జీవితం, నాన్నతో నేను గడపని బాల్యం, ఉత్తరాల్లో చిక్కుకుంది.

నాలుగు రోజుల నుండి ఆగని వాన. ఇలా ఒకేసారి క్లైమేట్ మారిపోగానే నా తీరు మారిపోతుంది. ఇలాంటి ముసురు వాతావరణం బయట ఉన్నప్పుడు, వెంటనే దిగులు మేఘాలు కమ్ముకుంటాయి లోపల కూడా. ఇద్దరి నాన్నల జ్ఞాపకాలు దరిచేరతాయి. చావు నా రోజువారి జీవితంలో విడదీయలేనంతగా భాగమయిపోయిందని మెల్ల మెల్లగా స్పష్టమవుతుంది నాకిప్పుడు.

 

కథలు

సంఘర్షణ 

వయసులో చిన్నవాడైనా కానీ ఊరిలో సోమయ్య అంటే అందరికీ గౌరవం. పెద్దవారు అయినా కానీ సోమయ్య కనిపిస్తే నమస్కారం పెట్టుతరు. అంతే గౌరవంగా సోమయ్య కూడా ప్రతి నమస్కారం పెట్టి  బాగోగులు అరుసుకుంటాడు. సోమయ్య ఒక పంచముడు. ఊరిలో లో బాగా చదువుకున్న వ్యక్తి సోమయ్య. ఏదో ఒక నౌకరు సంపాదిస్తాడు అనే ఆశాభావం వ్యక్తం చేస‌్తరు అందరూ. సోమయ్య ఎవరితో మాట్లాడిన నవ్వుతూ, ఎదుటి వ్యక్తిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా విలువ ఇస్తూ మాట్లాడటం అలవాటు. అతనితో మాట్లాడిన  వారందరూ మంచి పిల్లగాడు, నిజాయితీపరుడు, అందరి  బాగోగులు కోరేవాడు, ఎవ్వలకు ఏ సమస్య వచ్చినా బాధ  పంచుకునే వాడు.... సోమయ్య తో పరిచయం లేనివారు మాత్రం వాడు మోరు దోపోడు, మాట్లాడుడే రానివాడు, బాగా గర్వం, కోపిష్టి, అనే భావం కూడా ఉన్నది .

సోమయ్యకు ఒంటరిగా గడపడం ఇష్టం. తాను చదువుతున్న కాలంలో సమకాలిన రాజకీయాలు అర్థం చేసుకుని వాటి  లోపాలు  ఇసారించుడు ఇష్టం. ఎక్కువ సమయం పుస్తకాలతో గడపటం ఇష్టం. ఈ  హుందాతనం అంతా తన కొంతమంది  మిత్రులకు మాత్రమే తెలుసు. కానీ సోమయ్యకు ఎక్కడ  రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేదు. కేవలం ఒక్కరు ఇద్దరు నమ్మకమైన  స్నేహితుల దగ్గర తప్ప.

సోమయ్య చిన్నతనంలో తన తండ్రికి ఆరోగ్యం బాగా లేక దావకాన పొంటి తిరిగి బాగా పైసలు ఖర్చుపెట్టిన మనిషి మంచిగా కాలే. చివరికి భారం మొత్తం ఏసు దేవుని మీద ఏసి  క్రిస్టియన్ల కలిసిండ్లు. మందుల పని తనమా.... దేవుని కరుణన తెలువది కాని సోమయ్య తండ్రి మంచిగా అయ్యిండు. అప్పటి నుంచి సోమయ్య కుటుంబం హిందువుల నుండి  క్రిస్టియన్ గా మారిపోయింది. సోమయ్య కూడా బైబిల్ చదువుతు, ప్రార్థనలు చేస్తూ బాగానే భక్తి పెంచుకున్నాడు.

సామాజిక స్పృహ పెరిగిన కొద్దీ దేవుళ్ళ రాజకీయం ఏమిటి "దేవుణ్ణి పుట్టించిన మనిషి ఎలాంటి అవకాశవాది"అనేటువంటి అంతర్గత కుట్రలు గ్రహించడం మొదలుపెట్టాడు. కానీ అవి ఎక్కడ  బహిర్గతం చేసే సాహసం చేయలేదు. ఒకవేళ  ఈ కుట్రలు బహిర్గతం చేస్తే తనకు సమాజం ఎలాంటి గుర్తింపు ఇస్తుందో తెలుసు.

కొక్కిలిపడ్డ తండ్రిని చూసుకుంటా ఉన్న ఎకరం భూమిని సాగు చేసుకుంటూ తమ పరిధిలో జీవిస్తున్నాడు. ఒక నాటి కాలాన పెళ్లి ప్రస్తావన మొదలైంది అప్పటికే అనేక రకాల కారణాలు చూపుతు దాట వేస్తున్నాడు. ఈసారి మాత్రం" కత్తెరల దొరికిన పోక" లెక్క అయింది తప్పించుకునే అవకాశం లేదు. తన మిత్రురాలితో పెళ్లి కుదిరింది ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పెళ్ళి చేసుకోవాలనేది సోమయ్య పంతం నిలిచింది.కాని పెళ్ళి మాత్రం పాస్టర్ గారు చేయాలనే ఇతరుల వాదన కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అనే కోరిక నిలువలేక పోయింది.చర్చి కి పోవాలి బాప్స్మిత్తం తీసుకోవాలి .ఇదంతా సోమయ్య కు నరకంగా ఉన్నది.చర్చిలో కూచుంటే పాస్టర్ చెప్పే ఊకదంపుడు వాక్యాలకు పాములు,తేల్చారు,జెర్రులు పాకినట్టు అయింది. ఇదంతా కేవలం కానుకల కోసం అక్కడకు వచ్చిన వారందరిని గొర్రెల గా ముద్ర వేస్తూ, పాపులు గా నిందిస్తూ తన ప్రసంగం కొనసాగిస్తున్నాడు. సోమయ్య కు బ్రతికుండగానే శరీరానికి నిప్పు పెట్టినట్టు అయింది కానీ అక్కడినుంచి జారు కోవటానికి ఎలాంటి మార్గం కనిపించలేదు. అందరూ కానుకలు సమర్పించుకున్నారు చివరగా  కొంతమంది బైబిల్ లో ఎక్కువ పైసలు పెట్టి పాస్టర్ గారి దృష్టిని ఆకర్షించి ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. సోమయ్యకు ఊపిరి కలవడం లేదు.

పాస్టర్ అమ్మకు సోమయ్య కొత్తగా కనిపించాడు. ఎవరు బాబు నువ్వు  అని ప్రశ్నించింది. నేను ఫలానా వ్యక్తిని అని బదులు ఇచ్చాడు. నీకేనా  పెళ్లి కుదిరింది మరో ప్రశ్న....... ఏం చెప్పలేక తన కిందికి దించుకున్నాడు అనేక రకాల ఆలోచనల తోటి.... నువ్వు నువ్వు బాగా చదువుకున్నావు కదా బాబు  మంచి జ్ఞానవంతునివి కదా చర్చికి ఎందుకు రావడం లేదు వెకిలిగ అడిగింది పాస్టర్ అమ్మ,

చదువుకున్నాను కాబట్టే రాలేక పోతున్నాను అనే బదులు ఇవ్వాలి అనుకున్నాడు కానీ సంస్కారం అడ్డొచ్చే నేను ఇన్ని రోజులు లు ఇక్కడ లేను అక్క అందువల్ల రాలేకపోయాను..... సరే ఇకనుంచి తప్పకుండా రా మరి.... అత్తవా పెళ్లి అయినాక తపిస్తావా,,, ఇంకో ప్రశ్న.

ఒక్కసారి  సోమయ్యకు భూమిని తలకిందులు చేయాలన్నంత కోపం వచ్చింది బాగా మాట్లాడాలి అనుకున్నాడు కానీ కోపం అంతా అనుకొని ఉన్నాడు. సోమయ్యకు పెళ్లి అయి అప్పుడే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. పాస్టర్ అమ్మ అనుమానం నిజం చేయ తలచి చర్చికి పోవటం మానేశాడు. ఎక్కడన్నా అనుకోకుండా కలిసిన కూడా పాస్టర్ అమ్మ అదే పాడటం నువ్వు చర్చికి రా బాబు అని సోమయ్య చిరునవ్వు నవ్వి వస్తా అనడం ఒక ఒక అలవాటుగా మారిపోయింది.

రాను రాను ఊరిలో  మత మార్పిడి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఐతన్నై. ఇది చూసి సోమయ్యకు ఆశ్చర్యంతో కూడిన ఒక ప్రశ్న తలెత్తింది. సరేలే హిందూమతంలో లేని కొంత అనుకూల వాతావరణం ఇందులో ఉంది కాబోలు అందుకే మారుతున్నారు అనుకొని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు.

ఈ కుటుంబాల సంఖ్య పెరుగుతున్నట్టు గానే సోమయ్య మీద  ఒత్తిడి కూడా పెరుగుతుంది చర్చకు రావాలి లేదంటే సైతానుకు లోను అంతం అని సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి సోమయ్య తగిన సమాధానం చెప్పుతు  ఎదుటి వ్యక్తి మారుతాడని ఆశగా చూడడం అలవాటయింది

నాలుగు సంవత్సరాలు గడిచిన సోమయ్యకు ఇంకా పిల్లలు కలగలేదు తాత, అమ్మ  వరుస వాళ్ళు  ద్వంద అర్థాలు వచ్చే విధంగా మాట్లాడటం జరుగుతుంది అయినా సోమయ్యకు ఏమాత్రం బాధగా కనిపించేది కాదు. నా వాళ్లు అనుకునేవాళ్ళు మరియు క్రమం తప్పకుండా చర్చికి పోయేవాళ్ళు కూడా పిల్లలు లేనితనాన్ని ఎత్తిచూపుతూ నువ్వు దేవుడనవు, దయ్యం అనవ్వు నీకు పిల్లలు ఎట్లా పుడతారు. మనం ఒక దాన్ని నమ్ముకుంటే దాన్ని పట్టుకొని ఉండాలి. నువ్వు  అటు హిందువు  అన్నట్టు కాదు ఇటు చర్చికి ఆచ్చినట్టు కాదు ఇగ దేవుడు ఎట్లా కరుణిస్తాడు. అట్లా లగ్గం అయినా వాళ్లకు ఇట్లా పిల్లలు ఐతండ్లు. నీకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కాకపోయే...... ఒక ఐదు వారాలు ఉపవాసం ఉండి దేవుని కుటుంబాల అందరిని పిలిచి ప్రార్థన పెట్టియ్యి . వంట కూడా చేపియ్యి. నీకు  అనుకున్నది జరుగుతది అని ఒక దేవుని బిడ్డ ఉచిత సలహా ఇచ్చిండు.

సోమయ్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కోపాన్ని దిగమింగుకొని ...అంటే చర్చి కి రాకపోతే పిల్లలు పుట్టరా......? దేవుడు అందరివాడు అయినప్పుడు వచ్చిన వాళ్లను, రాని వాళ్లను ఒక తీరుగా చూడాలి కాని గివ్వేం రాజకీయాలు..ఇది కరెక్టు కాదు కదా  అని ప్రశ్నించాడు సోమయ్య...

అది ఇది కాదు రా మనం మందిరానికి పోకపోతే సైతాను అనేది ఎప్పుడెప్పుడూ మనల నాశనం చేయాలని సూతదిర అంటూ బదులిచ్చాడు......

సరే నువ్వు అన్నది నిజం అనుకుందాం చర్చికి అత్త లేను కాబట్టి పిల్లలు అయిత లేరు.... మరి  పాస్టరయ్య ఎప్పటికీ దేవుని సన్నిధిలోనే ఉంటాడు కదా..... దేవుని సేవ  చేసుకుంటాడు కదా మరి  పాస్టర్ కు ఎందుకు పిల్లలు కాలేదు

సోమయ్య.....

నువ్వు గియ్యే ఒకదానికి ఒకటి లింకు పెట్టి మాట్లాడుతావు ఎవ్వరు చెప్పింది వినవు నీ మంకు నీదే పెద్దలు మంచికో చెడుకో చెబుతారు వినాలి అడ్డమైన కొషన్ ఏత్తె ఎట్లా అని గద్దరిచిండు  దేవుని బిడ్డ....

సరేనె నువ్వు మంచో, చెడో చెప్తే ఇంటా కానీ నువ్వు అబద్ధం చెపుతున్నావు ఊహల్ల బతుకు మంటున్నావు అది నాకు  చేతకాదు అంటున్న ఏది ఉన్నా నిజం కావాలి ,నిజాయితీగా బ్రతకాలి, అనేది  నేను బలంగా నమ్ముకున్న అట్లనే బతుకుతా అంతే తప్ప అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని ప్రచారం చేసిందంటే ప్రాణం ఉన్న శవం లెక్క బ్రతుకుడుతోని సమానం. అది నాకు చేతన కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నిన్ను మతం

ఒడిసి పెట్టి నా లెక్క ఉండు మంట లేను కదా నువ్వు నన్ను చర్చికి రమ్మనడానికి.....? నా పిచ్చి నాది, నీ పిచ్చి నీది నన్ను ఈ విషయంలో తిప్పల పెట్టకు నాతోని ఇంకోసారి ఈ మాటలు మాట్లాడకు అని గట్టిగా చెప్పిండు సోమయ్య...

ఏమని తిట్టాలో అర్థం కాక"సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే ఉంటదా లంద తోల్లకు పోతది" నువ్వు కూడా  గసోంటోనివే అని కోపంగా పోయిండు దేవుని బిడ్డ

సోమయ్య అయితే తనకున్న తెలివితోనో, మాటకారి తనంతోనో మూర్ఖపు వాదన నుంచి  తప్పించుకున్నాడు. కానీ సోమయ్య భార్యకు తప్పలేదు. మొగాన్ని చర్చికి తీసుకచ్చుడు తెలవదా.ఇంకెప్పుడు నీ దిక్కు తింపుకుంటవు, అని సోమయ్య తల్లి కోడలి మీద గరం గరం మాట్లాడుడు మొదలు పెట్టింది. ఆడేం అంటే ఆయనకి తగ్గట్టు నువ్వు కూడా తయారైనవా కాదు నా మాట వినడు గద్దరితడు నువ్వు బుధురకిచ్చి చర్చికి తీసుకురా అని చెప్పింది.

కన్న తల్లి మాట  వినని నీ కొడుకులు నా మాట ఇంటాడ అత్తమ్మ..... అయినా " ఆయన"ఏం చెప్పినా అందులో మంచి ఉంటది కాబట్టి నేను ఆయనని ఒత్తిడి చేయా, నిన్నే గద్దరిచ్చిందంటే నన్ను మెచ్చుకుంటడా.....?

 అబ్బో భర్త మీద బాగానే ఉన్నది పిల్లకు ప్రేమ అంటూ ఎటకారంగా  మాట్లాడింది తాను ఏమి చేసేది లేక....

సోమయ్యకు రాను రాను దేవుని గోల ఎక్కువ అయింది. ఒకసారి అయితే తల్లినే స్వయంగా నా కొడుకు తినుడు పండుడు తప్ప దేవుడు అనడు ఏమనడు అని పక్కోలతోని చెప్పంగా విని కళ్ళకు రక్తం వచ్చింది కానీ తల్లి కదా ఏమి అనలేక ఆ మాట గుర్తుకు వచ్చిన ప్రతిసారి మనసు కలి కలి అయితది.

 

చాలా రోజుల తర్వాత సోమయ్య దోస్తులు ఇద్దరూ అనుకోకుండా కలిసిండ్రు. చాలా అలా సంతోషం గా అలాయి బలాయి తీసుకున్నారు. మంచి  చెడులు

ఈసారించు కొన్న తర్వాత కూల్ డ్రింక్స్ తినటానికి కార తీసుకుని ప్రశాంత వాతావరణంలోకి పోయిండ్లు. ఈ ముగ్గురిలో ఎవరికి కూడా ఆల్కహాల్ తాగే అలవాటు లేకపోవడం మూలంగా కూల్డ్రింక్స్ కె పరిమితం అయ్యింది వీరి స్నేహబంధం.

 

నిజానికి సోమయ్య ఇద్దరూ మిత్రులకు కంటే వయసులో చిన్నవాడు కానీ అన్నా అని పిలుస్తారు. చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటారు. ఈ ఇద్దరు మిత్రులలో ఒకరు హిందువు ఇతని పేరు ఈశ్వర్. ఇంకో మిత్రుడు క్రిస్టియన్ ఇతని పేరు ప్రభు.

చాలా రోజుల తరువాత కలవడం మూలంగా  కొంత సమయం దాకా మౌనం రాజ్యమేలింది తర్వాత నిమ్మదిగా మౌనాన్ని దూరం చేస్తూ ఊరిలోని మంచి, చెడులు , పంటలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి వాటితో మొదలైంది కూల్ డ్రింక్ తాగుతూ

ఎవరు ఏం మాట్లాడినా మాటల్లో ఒక  ఆశ మాత్రం కనిపిస్త లేదు. నిరాశ తలెత్తుతుంది. ప్రభు మాత్రం చాలా అలా హుషారుగా ఉంటూ హుషారుగా మాట్లాడుతాడు... సోమయ్య ప్రభువును అన్నా పిల్లలు మంచి ఉన్నారా అనీ అడిగిండు

ఏ అన్న సూపర్ పొద్దుందాక పనిచేసి  ఇంటికి పోతే ఇగ  టైం మొత్తం పిల్లల తోనే బయటికి ఎల్లుడే అయితలేదు. ఎవ్వవలెను కలుసుడు కూడ అయితలేదు. అంటూ చెప్పుకొచ్చాడు. ఈశ్వర బాపు ఏమైంది నువ్వు పిల్లల గురించి దావకాన కు పోతివి కదా ఏమన్నారు డాక్టర్ లు అడిగిండు ప్రభు. ఏముంది బాబు అంతా మంచిగానే ఉంది ఏం సమస్య లేదని అన్నారు.... ఈశ్వర్

 నువ్వు పోతున్నవా లేదా దావఖానకు సోమయ్యను కూడా  మందలి ఇచ్చిండు ప్రభు. ఆ పోయిన అన్న....

ఏమన్నారు మరి.... ప్రభు

ఏమంటారు పరీక్షలు అన్ని చేసిండు ఏం ప్రాబ్లం లేదన్నారు పిల్లలు అయ్యేదాకా మందులు వాడు మరో కొన్ని రోజులు వాడినం బందు చేసినం.... సోమయ్య

ఎందుకు మరి అయ్యేదాక వాడితే అయిపోవు కదా.... ప్రభు

నీకు తెలువనిది  ఏమున్నది అన్నా ఏం చేయాలన్నా పైసలు కావాలె... మనకు లేనిదే అదాయే సోమయ్య బదులిచ్చాడు.

మరి చర్చి కన్నా పోరాదే.... ప్రభు నువ్వు నమ్మవు గాని ఉండబట్టలేక చెప్పుతన్న.

చర్చి కి పోతే పిల్లలు చిత్రం బాపు ఈశ్వర్.

మస్తు మంది కి ఐండ్లు బాపు అందుకే చెపుతున్నా‌.... ప్రభు

"తాయితులకు పిల్లలు అయితే తానెందుకు"అనే సామెత ఉన్నది అన్నా ఈ లోకం మొత్తం లగ్గాలు చేసుకోకుండా చర్చిల పొంట, గుల్ల పొంటా తిరుగుతే అయిపోతది కదా.... ఈ లగ్గాలు గిగాలు ఎందుకే అడిగిండు సోమయ్య. ప్రభుకు కోపం  వచ్చింది నువ్వన్నీ తికమక సమాధానాలు  చెపుతావు ఇక మేము చదువుకోలేదని కదా నీకు నా తెలివి తోని నానోరు మూపితన్నవ్. అన్నడు

అన్నా గట్ల అనుకోకు చదువుకున్న వాళ్ళంతా సంస్కారవంతులు జ్ఞానవంతులు అంటే నేను ఒప్పుకోను. మరి మనకంటే ముందుతరం వారికి ఏ చదువు ఉన్నది వాళ్లు ఎంత సంస్కారవంతులు, మనిషిని ఎంత ఈజీగా పసిగడతారు ఎదుటి వ్యక్తికి ఏం కావాలో ఇట్టే గమనిస్తారు కదా వాళ్ళ కంటే గొప్పోళ్ళ మానే...... సోమయ్య సమాధానానికి ఈశ్వర్ తోడయ్యాడు నిజమే అన్న వాళ్లే చాలా గొప్పోళ్ళు కన్నడు. ప్రభుకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మళ్లీ సోమయ్య కల్పించుకొని అన్నా నేను ఏసుప్రభుకి వ్యతిరేకం కాదు పాస్టర్లు చేసే మోసానికి వ్యతిరేకిని. నిజానికి ఏసుప్రభు ఒక బానిస వ్యవస్థ కోసం నిలబడి అత్యంత క్రూరంగా చంపబడ్డ వ్యక్తి ఇప్పటి మన భాషల చెప్పుకోవాలంటే ఒక ఉద్యమ కారుడిగా ఆయనను చెప్పచ్చు. అట్లా కొట్లాడి ప్రాణం ఇచ్చిన ఆయన పేరు చెప్పుకొని ఈ పాస్టర్లు ఎన్ని సంపాదిస్తున్నారు అన్న, ఎక్కడి దాకా ఎందుకు నువ్వే చెప్పు నువ్వు ఎంత కష్టం చేస్తావు ఇంట్లో ఒక టైంలో బువ్వ ఉండదు మరి  పాస్టరు ఏం పని చేస్తాడు వాళ్లకు కార్లు, బైకులు ఎక్కడన్నా.....

అంటే మేము సేవ చేతనం కాబట్టి దేవుడు మాకు ఇచ్చిండు అంటారా..... అంటే దేవుడు కూడా " కువ్వారం"తో ని సూతడ.... వాళ్లు వాక్యం చెప్పగా చూడు మనలా ఎంత తిడుతరో.... గొర్రెలు, పాపులు అంటారు. ఇంకా ఎన్నో రకాలుగా అంటారు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో చెప్పొచ్చు. చివరకు ఏసునీ కూడా ఏమంటారో చూడు "రాజులకు రాజు" అట ఇది ఎంతవరకు నిజం  అన్న ,,, ఉదాహరణకు ఒకటి చూద్దాం రాజు గుణం ఏంటిది అన్న.... ప్రజల దగ్గర అ దోచుకుంటాడు ఏంటి సాకిరి చేయించుకుంటాడు. ఇతర  కులాల స్త్రీలను లోబరుచుకున్నాడు ....ఒక రాజే ఇట్లా ఉంటే ఈగ  రాజులకు రాజు అని ఆయనని అంటారు .మరి  ఈయన అంత క్రూరంగా ఉన్నాడే.... అమాయకుల కోసం ప్రాణం కల్పించిన ఉద్యమ కారుని రాజులకు రాజు అని వ్యంగంగా తిడితే ఎంతవరకు మంచిదన్న..... ఒకవేళ అ పాస్టరు మీ ఇంటికి ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు వస్తే మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలి లేదంటే  ఆ కుటుంబం దేవుని ప్రేమకు లోబడని కుటుంబమని ముద్ర  వేస్తారు. ఇదంతా మంచి పద్ధతేనా..... ఇన్ని మోసపూరిత కుట్రలు ఉన్న కాడికి ఎట్లా రమ్మంటావే. మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేయాలి..... అసలు కాళ్ళ మీద ఎవలు కూర్చుంటరన్న తప్పు చేసిన వాళ్లను కూర్చో పెడతారు నాకు తెలిసి  నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను చర్చికి రాను... సోమయ్య చాలా చాలా సాదా సీదాగా చెప్పిండు మనుసుల ఉన్నదంత...

ఇది మాత్రం నిజం అన్న నేను కూడా  గమనించిన.... ప్రభు

మరి ఇవన్నీ గమనించి ఎందుకు పోతున్నావు బాపు..... ఈశ్వర్

అన్నా  నువ్వు చర్చికి పోవడం తప్పు అని అంట లేము పో... నీ లెక్క ప్రకారం చూస్తే దేవుడు అనేవాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు ప్రత్యేకంగా చర్చికి పోవాల్సిన అవసరం లేదు కదా.....

అయినా సరే పో కానుకలు వెయ్యకు ఆ పైసలు ఊళ్లే ఎవ్వాలన్నా ఎందుకు లేనోళ్లకు ఇయ్యి పాపం ఒకపూట గడుస్తుంది కదా.... చర్చ్ అనేది మానసిక రోగులు అంటే దయ్యాలు, గియాలు కానీ నమ్మేవాళ్ళకు మాత్రమే మంచిగా పని చేస్తది తప్ప ఒరిగేది ఏమీ లేదు ఇంకోటి చెప్పుతా కళ్ళు తాగద్దు అంబారు తినొద్దు దేవుడు శిక్షిస్తాడు అని చెప్పడం వల్ల  కొంతమంది మారి  కుటుంబాలు కూడా  అయినాయి. ఇది ఒక రకంగా సైకలాజికల్ గా పనిచేస్తుంది ఈ పరంగా మాత్రం నేర్చుకోవచ్చు

ఉదాహరణకు ఇద్దరూ క్రిస్టియన్ వ్యక్తులు ఉన్నారు అనుకో అందులో ఒక వ్యక్తి  చర్చికి ఎప్పుడో ఒకసారి  వస్తాడు. కానీ కళ్ళు తాగుతాడు అంబరు తింటాడు ఎవరికైనా ఆపద వస్తే సహాయం చేస్తాడు. రెండో వ్యక్తికి ఈ తాగుడు తినుడు అలవాటు లేదు క్రమం తప్పకుండా చర్చికి పోతాడు కానుకలు దండిగా సమర్పించుకుంటారు కానీ బొక్కల తనం, కొంచెం తనం, ఎక్కిరేవుల తనం, ఓర్వలేనితనం, కళ్ల మంట తనం ఉంటది. ఇవన్నీ మొదటి వ్యక్తి కి ఉండయి...... వీళ్ల ఇద్దరిలో ఎవరి వల్ల మూడో వ్యక్తికి నష్టమన్న  సోమయ్య అడిగిండు....

ఈశ్వర్ కల్పించుకొని అన్నా మొదటి వ్యక్తి తాగుడు తినుడు వల్ల ఆరోగ్యం పాడైతే వాడే చచ్చిపోతాడు ఈయన వల్ల సమాజానికి ఏ నష్టం లేదు. కానీ నీ రెండో వ్యక్తి వల్ల సమాజానికి చాలా  ఇష్టం ఉన్నది కాబట్టి మొదటి వ్యక్తి నయం అని బదులు ఇచ్చాడు

అట్లా చాలామంది  ఉన్నారు అన్న చర్చికి వచ్చే వాళ్లలో.... ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సమన్వయ సంబంధం ఉండది వాళ్లు ప్రార్థిస్తున్న ప్పుడు ఉన్నంత పశ్చాత్తాప గుణం, ప్రేమ ప్రార్థన అయిపోయి బయటికి రాంగానే మాయమై పోతది రెట్టింపు స్థాయిల కుట్రలు చెరువుని తనాలు..... ఒకటా రెండా మస్తుంటాయి. ఇవన్నీ పాస్టర్లకు తెలువదంటవ....సోమయ్య

అన్ని తెలుసు కానీ ఎత్తి చూపితే ఈయనకు ఉపాధి పోద అన్న.... ఈశ్వర్

ఈ మధ్యల ఒక పెద్ద మనిషి చెప్పిన మాట చెప్పుతా విను" ప్రేమించే వారు ఆశయాలు ముందుకు తీసుకుపోతాడు","ప్రార్థించేవాడు స్వలాభం కోసం పాకులాడుతడు" అని అని చెప్పిన  మాటలకు నేను నేను ఏకీభవిస్తున్నా.... అని చెప్పుకొచ్చిండు సోమయ్య

అన్నా నీ దగ్గర  అన్నీ నచ్చాయి కానీ నువ్వు నువ్వు చర్చికి రాకపోవటం  నువ్వు దేవుని గురించి వ్యతిరేకంగా  మాట్లాడటం కొద్దిగా నీ మీద కోపం తెప్పిస్తుంది.... ప్రభు.

ముగ్గురు మిత్రులు నవ్వుకున్నారు. అన్నా నేను  చర్చికి రాకపోవడం వల్ల జరిగే నష్టం లేదు, రావడం వల్ల వచ్చే లాభం లేదు కానీ  ఏడికి పోయిన నిజాన్ని గమనిస్త ,నాకు అలవాటు అయ్యిందే అని సోమయ్య చెప్పిండు...

చల్లగా ఉన్న కూల్ డ్రింక్స్ ముగ్గురు మిత్రులు మనసులు వేడెక్కిన యి

పక్క ఊరిలో కొత్తగా చర్చి ఒకటి కటిండ్లు ఆ పాస్టరు ఒక నాడు సోమయ్య ఇంటికి వచ్చి మన చర్చికి రా తమ్మి ఒకసారి  మన దగ్గర  కూడా చూడు నచ్చితే రా లేకపోతే రాకు అని చెప్పిండు.

ఇంతకుముందు వీరి  మధ్యల కొన్ని అంశాల మీద చర్చ జరిగింది కాబట్టి  సోమయ్యను అంచనా వేసి ఈ ఆఫర్ ఇచ్చిండు ఉండబట్టలేక పాస్టర్ గారు.....

అయ్యో అదేం లేదు అన్న వస్తా...... నేను కూడా సాక్ష్యం చెప్పేది ఉన్నది సాక్ష్యం చెప్పుడు అయిపోయినాక ఒక పది నిమిషాలు కూడా మాట్లాడాలి అని బదులిచ్చాడు సోమయ్య

రా తమ్ముడు నీది సేవా గుణం మంచి ఆలోచన వచ్చి చెప్పు.... నీకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడే రమ్మంటూ చేయి కలిపి వెళ్ళిపోయాడు పాస్టర్ అయ్యా.....

సోమయ్య మనసులో చిన్నగా నవ్వుకున్నాడు....

 

 

ఈ సంచికలో...                     

MAY 2021

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు