కథలు

కథలు

ఆంతర్యంలో అమ్మ

భర్తశ్యామ్వచ్చే వరకూ కాస్త టెన్షన్...

ఆలోచిస్తూ సోఫాలో జారిగిలబడి తలను వెనక్కి వాల్చింది రమణి.

ఈ రోజు అమ్మ మరీ, మరీ గుర్తుకు వస్తోంది.

కొన్ని విషయాలు మనసును కలచి వేస్తున్నాయి. అమ్మా తానూ... ఎలావుండేవి ఆరోజులు? అమ్మతో పోట్లాడితే సంతోషం అప్పుడు...నెమ్మదిగా జ్ఞాపకాల పుటలు కదలసాగాయి ...

*****.

“ఈ సారి బర్త్ డే కి నేను నా ఫ్రెండ్స్ ని హోటల్ కి తీసుకెడతా. నీవు ఎలాగూ ఇంట్లో పార్టీ వద్దు అంటావు కదా.

నీ చూపులకు దూరంగా ఎంజాయ్ చేస్తాను..నేనేమీ చిన్న పిల్లను కాను” అంటూన్న కూతురు రమణి ని ఒక్క సారి చూసింది సరస్వతి.

“నేను నిన్నేమీ అడగటం లేదు. నాన్నగారు వచ్చేవరకూ కాచుకుని మరీ అడిగి ఒప్పిస్తాను..”ఛాలెంజ్ గా ఒక్క చూపు చూసింది రమణి తల్లి వైపు. ఇంకేమైనా సమాధానం చెప్పినా గొడవ తప్పదు అని నెమ్మదిగా లోపలికి నడిచింది సరస్వతి..అమ్మ అలా మౌనంగా వెళ్ళటం తోఏదో సాధించినట్టు ఫీల్ అయ్యింది రమణి.

అసలు ఇలాటి విషయాలు నాన్నదాకా పోవాల్సింది కాదు ఎన్నాళ్ళు  భరించినా అమ్మ మారటం లేదు. నాన్న ది బిజినెస్ కాబట్టి ఇంటికి రావటం ఆలస్యం కావటం మామూలే. పొద్దున కూడా కాలేజీకి వెళ్ళే సమయానికి ఆయన వున్నా కూర్చుని మాట్లాడే టైమే వుండేదికాదు. అలా అని అమ్మ మరీ చెడ్డదేమీ కాదు. ఏది  కావాలన్నా దాన్ని పూర్వా పరాలు ఆలోచించి నచ్చ చెప్పేది.  మొన్న కూడా బర్త్ డే డ్రస్ కూడా అంతే. కాలేజీలో అందరూ గ్రాండ్గా వున్న డ్రస్సులే కొంటారు అని చెప్పినా తను మాత్రం అలా కొననివ్వదు ఎందుకో.డబ్బులకేమీ తక్కువ లేదు. నాన్న బిజినెస్ బాగుంది. దేనికీ తక్కువ చేయక్కరలేదు....అసలు నాన్న అమ్మను  ఏమీ అనకుండా ఎందుకు వుండేవారు? ఇంట్లో ఏమి జరుగుతోందో పట్టించుకొక అంతా అమ్మ మీద వదలటం ఏమిటీ? ఆమె కాలేజీ చదువుకూడా లేదు. ఆమె పెత్తనం ఏమిటి? ఇలాటి ఆలోచనలతో వున్నప్పుడు రమణి కి అమ్మ తో మాట్లాడడం కూడా ఇష్టం వుండేది కాదు. చాలా విషయాల్లో అమ్మను ఎదురించేది అయినా అమ్మ సమాధానం చెప్పేది కాదు. అది మరీ వొళ్ళు మండేది.

ఒకరోజు బాగా అమ్మను ఎదురించి మాట్లాడాక నాన్నకు చెప్పాలనే రాత్రి మేలుకుని నాన్నకోసం ఎదురు చూసింది. అన్నం కూడా వొద్దని అంటే అమ్మ ఏమీ అనక పోయినా నాన్న రాగానే ముగ్గురికీ కంచాలు పెట్టి డిన్నర్ రెడీ చేసింది.

నాన్న రాగానే “అదేమిటి, రమణి కూడా తినలేదా ఇంతవరకూ “ ఆశ్చర్యపోయారు. “మీరు పిలవండి” అని అమ్మ చెబితే “రమణీ, ఎందుకురా ఇంతసేపు తినలేదు.. రా.. భోంచేద్దాం”అంటే తప్పని సరి కూర్చుంది.

నాన్న అడిగిన వాటికి అమ్మ ముఖ౦ చూడకుండా  సమాదానం చెబుతోంటే

“ఏమిటీ ?అమ్మ మీద అలకా?” అని నవ్వి“భోంచేశాక నాదగ్గరికి రా కాస్సేపు” అన్న నాన్నని ప్రేమగా చూసింది రమణి. తన మూడ్ ను క్షణం లో గ్రహించిన నాన్నతో అన్నీ మాట్లాడాలనే అనిపించింది చాలా.. డైనింగ్ టేబల్ దగ్గర అమ్మ మౌనంగానే వుంది. ‘ఇలా వుంటూనే నాన్నని బుట్టలో వేసుకుని ఆడిస్తోంది’అనుకుంది కసి గా.

అమ్మ వంటింట్లో అన్నీ సర్డుతో౦టే  గబ గబా బాల్కనీ లో సిగరెట్టు కాలుస్తూ వున్న నాన్న దగ్గరికి వెళ్ళింది.

అక్కడే వున్న  కేన్ చైర్ లో కూర్చుంటూ “రమణీ, ఎలావుందిరా చదువు? అమ్మ చూసుకుంటుందనే భరోసా తో మీతో స్పెండ్ చేసే సమయం లేకపోయినా ఫీల్  అవను .. చెప్పు ఏదైనా చెప్పాలా?” లాలనగా అడుగుతున్న నాన్న దగ్గరగా కుర్చీ లాక్కొని ఆయన చేతిలో చేయి వేస్తూ

“నీవు ఇలా అడుగుతూంటే ఎంతబాగుందో నాన్నా.. ఎప్పుడు ఏది మాట్లాడాలన్నా అమ్మ తోనే చెప్పడం,తను చెప్పినట్టు మీరు వినడం తోనే సరిపోతుంది. పైగా చిన్నప్పటి లాగా కాకుండా మీరు మరీ బిజీ అయిపోవడం నచ్చలేదు నాన్నా” మనసులో మాట ఇలా చెప్పడం ఎంతబాగుందో రమణి కి.

“అవున్రా  నాకూ అలాగే వుంది.. ఇంతకు మునుపు కంపెనీ ఎలా పైకి రావాలని తాపత్రయం, ఇప్పుడు బాగా నడుస్తోంటే ఇంకొద్దిరోజులు ఇలా నిలుపుకుంటే కొంచెం రిలాక్స్ అవవచ్చని ఉద్దేశ్యం. అయినా ఏమి చేసినా నిన్ను బాగా సెటిల్ చేసి మేమూ హాయిగా వుండాలనే కదరా.. దేనికైనా ఇంట్లో మీ అమ్మ సహకారం తోనే ఇదంతా..”అంటూన్న నాన్నని చూసి తాను చెప్పాలన్నది చెబితే బాగుంటుందా అని ఒక క్షణం ఆగింది.

కానీఈ రోజు ఏమైనా చెప్పాల్సిందే అనిపించి “నాన్నా, మీకు ఎలా చెప్పాలో తెలియక పోయినా ...” రమణి మాట పూర్తి కాకనే

“చెప్పరా.. నా దగ్గర దాయడమెందుకు ?” అన్నారాయన

“నాన్నా నేను చిన్నగా వున్నప్పుడు మీరు ఇంట్లోనే వుండే వాళ్ళు. ఇప్పుడు ఏది కావాలన్నా అమ్మ చెప్పినట్టు వినాల్సిందే.. నాకూ వయసు పెరుగుతోంది. కోరికలు వుంటాయి ఏది కోరినా అమ్మ వెంటనే వినదు. ఆఖరికి నా బర్త్ డే కి మంచి డ్రెస్ కావాలన్నా, పార్టీ చేసుకుంటానన్నా ఒప్పించడం కష్టమే. అది చాలా ఫీల్ అవుతోంది.ఎప్పుడూ నాకు ఒక్కటే ప్రశ్నఇంట్లో ఏమి జరుగుతోందో పట్టించుకొక మీరు అంతా అమ్మ మీద వదలటం ఏమిటీ? అసలు ఆమె కాలేజీ చదువుకూడా లేదు. ఆమె పెత్తనం ఏమిటి? అనిపిస్తుంది...” కాస్త అర్థం చేసుకోండి అన్న భావం తో చూసింది

“రమణీ, నిజమే  ఎదుగుతున్న నీకు వచ్చే ఆలోచనను నేను అర్థం చేసుకోగలను. నాకు టైమే దొరకక పోవడం ఒక కారణం అయినా ఈ రోజు మంచి అవకాశం ఇచ్చావు. అమ్మకు నేను ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నానే కదా.. చాలా చెప్పాలి రా.. నీవు చిన్నగా వున్నప్పుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నా ఊద్యోగం పోయింది అమ్మ దైర్యం చెప్పింది. కొన్ని రోజులు ఇల్లుగడవక పక్కనే వున్న చిన్నప్రైవేటు స్కూల్ లో తన టెన్త్ క్లాస్ చదువుతోనే పిల్లలకు చదువు చెప్పేది. అప్పుడే నేను ఇంట్లో వున్నాను.ఒక రెండు నెలల్లో ఇలాగే గడవదని తెలిసి పోయింది.నాకు వెంటనే ఉద్యోగం దొరికే ఛాన్స్ లేదు. ఇరువైపు కుటుంబాలకూ తెలియకూడదని నిర్ణయించుకున్నాక తన కున్న కొద్ది బంగారాన్ని, పుస్తేల తాడుతో సహా నాచేతిలో పెట్టి అమ్మించి౦ది. అమ్మ సలహాతో నాకు ముందు ఉద్యోగం లో వున్న ఎక్స్పీరియన్స్ తో చిన్నగా ఒక ఏజెన్సీ  గా మొదలు పెట్టాను. ఎదగడానికి టైమ్ పట్టింది. అప్పుడు ఇంటి గురి౦చి  నేను ఆలోచించకుండా.. అన్నీ ఖర్చులు పొదుపు గా చేయడం కాకుండా నీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకో సాగింది. తనకు చదువు లేదు అన్నావు కదా.. చదువు నేర్పేదానికంటే ఎక్కువ జీవితాన్ని చదివింది. చదువుకున్న వారికంటే ఎంతో మెరుగ్గా పని చేసేది. ఆమె ద్వారా కష్ట సమయంలో కూడా నిరాశ పడకుండా ఎలా ముందుకు పోవాలో తెలుసుకున్నాను. నీకు తెలియదుఅమ్మ ప్రైవేటుగా బి. ఎ కూడా పాసయింది.ఏ అవసరానికైనా చదువు సర్టిఫికెట్ చేతిలో వుండాలని చెబుతుంది.

నీకు ఇన్ని విషయాలు ఎందుకు వివరిస్తున్నానంటే అమ్మ మనస్తత్వం తెలుసుకోవాలి ఎందుకంటే  తనకు తానుగా ఏదీ చెప్పదు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించే కదా నీవు ఏమి చదివితే బాగుంటుందో నాతో డిస్కస్ చేసింది. ఇంట్లో ఏమి చేయాలన్నా మాకు ఒక ప్లాను వుంటుంది. ఒకటే ధ్యేయం...మాలాగా నీకు ఎప్పుడూ కష్టకాలం రాకూడదు. ఒకవేళ వచ్చినా ధైర్యం గా ఎదుర్కునేలా నిన్ను పెంచాలని. అంతే.

నీ క్షేమమే కాదు, మేము కూడా జీవితాంతం ప్రశాంతం గా వుండాలని... కానీ ఇప్పుడనిపిస్తోంది కొన్ని విషయాలలో మీకూ ఫ్రీడం ఇవ్వాలని, అమ్మ మాత్రం ‘టీనేజీ దాటాక తనే అన్నీ అర్థం చేసుకుంటుంది అనిఅనేది నీ మీద అంత నమ్మకం.. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు. రేపటినుండీ గమనిస్తే తెలుస్తుంది ..” అని నాన్న అన్నాక రమణిమనసును కప్పుకున్న ఒక తెర పైకి లేచినా అమ్మనుఅర్థం చేసుకోవాలి  చూద్దాం అనుకుంటూ“గుడ్ నైట్ నాన్నా” అని చెప్పి తనరూముకు వెడుతూ అమ్మా, నాన్నల బెడ్ రూమ్ వైపు ఒకసారి చూసింది.

హాయిగా నిద్రపోతూంది అమ్మ!అంత నిశ్చింత ఎలా ???

*****

“రమణీ, ఇక్కడే పడుకున్నావా?” అంటూ లోనికి వచ్చిన శ్యామ్ ని చూస్తూ గతానికి తెర వేసి

“ఏదైనా కుదిరిందా ? మీ ఫ్రెండ్స్ ఏమమన్నారు?” అనడిగింది  ఆతృతగా

“ఒక విధంగా ముగ్గురు ఏకగ్రీవంగా ఒకే ఐడియాకి వచ్చాము. పెట్టబడి కష్టం అని శ్రీకాంత్ తప్పుకున్నాడు. నీతో కలిసి నలుగురం.ఒక్కొక్కరికీ ఎంత పడుతుందని డిసైడ్ చేయాలి. “

“పెట్టుబడి పరవాలేదు అనినేను చెప్పాను కదా.. నాకు అమ్మా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా నగలు కూడా వున్నాయి. ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి. తప్పకుండా సక్సస్ చూస్తాము.”

“నీ దైర్యమే నాకు శ్రీరామ రక్ష.”అని శ్యామ్ రమణిని దగ్గరికి తీసుకున్నాడు.

పాండమిక్ వల్ల ఇద్దరి ఉద్యోగాలూ ఒకే నెలలో పోవటం జరిగింది. రమణి కంటే ఎక్కువ డీలా పడిపోయాడు శ్యామ్. కానీ రమణి ప్రతి క్షణం అతనికి దైర్యం చెబుతూ ఒక స్టార్ట్ అప్ కంపెనీ పెట్టడానికి ప్రోత్సహించింది. కష్ట కాలం లోనే మనం నిలబడాలి అన్నది చేసి చూపుతోంది.

ఆ రాత్రి “నీలాటి దైర్యస్థురాలు నాకు భార్య గా దొరకడం ఎంత అదృష్టమో..” అంటూన్న శ్యామ్ ఎదమీద తలవాల్చి ‘థాంక్ యు అమ్మా..’ అనుకుంది అమ్మను తలచుకుంటూ.

*******                                                                 

 

 

 

 

కథలు

ఏడడుగులు

          "సునీతా! రేపు సెకండ్ సాటర్డే నీకు సెలవే కదా .ఓ సారి ఇంటికి వస్తావా ?" సుజాతక్క ఫోన్ చేసింది . 
    "షాపింగా అక్కా? " అక్క కూతురు సుప్రజ పెళ్లి కుదిరింది. దాదాపు షాపింగంతా చేసేసాము. అయినా అక్కకు కంగారే ఇంకా ఏమన్నా మర్చిపోయామేమో అని.
      "ఏమిటో సునీతా! అసలు కథే  కంచికి పోయేటట్లు ఉంది. నాకు బావకు ఏం చేయాలో తోచడం లేదు" సుజాతక్క బాధగా అంది.
  " ఏమిటక్కా? ఏం జరిగింది ?" ఆతృతగా అడిగాను "పెళ్ళికొడుకు తరపున ఏదైనా " నాకెలా అడగాలో కూడా తోచలేదు.
  " లేదు.  సుప్రజ ఈ పెళ్ళి ఇష్టం లేదంటోంది. ఆ అబ్బాయి ఫోన్ చేసినా తీయడం లేదట.  అతను నాకు ఫోన్ చేసి అడిగాడు 'సుప్రజ బాగానే ఉంది కదా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా ' అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మామూలు జలుబు, జ్వరం వచ్చినా కరోనా వచ్చిందేమోనని మనం భయపడ్డమే కాదు ..ఎవరికన్నా చెప్పాలన్నా భయంగా ఉంది. ఎవరి భయాలు వారివి కదా! 'అదేం లేదు పని ఎక్కువైనట్లుంది నేను చెప్తాలే' అని అబ్బాయికి సర్ది చెప్పాననుకో."
  " మరి సుప్రజ ని అడిగావా ఎందుకు మాట్లాడలేదో?" అడిగాను.
"ఆ ..ఆ ..అప్పుడే కదా చెప్పిందా మాట.!"
" ఏ మాట ?"
"అదే ! తనకీ పెళ్లి ఇష్టం లేదని ."
" ఇష్టం లేదందా? నిజమా?"
"అవును" అదిరి పడ్డాను అక్క జవాబుకు
" నీలాగే నేనూ కంగారు పడిపోయాను.  కుదరక.. కుదరక కుదిరిన సంబంధం. మంచి కుటుంబం.ముఖ్యంగా అబ్బాయి చాలా బాగున్నాడు కదా."
"సుప్రజ చాలా అదృష్టవంతురాలు అని మనమంతా కూడా అనుకొన్నాం కదా. సుప్రజ కూడా సంతోషంగానే ఉంది. ఇద్దరూ ఇష్టపడ్డాకే కదా నిశ్చితార్థం చేశాము. ఇప్పుడు హఠాత్తుగా ఇష్టం లేదు అనడం ఏమిటి?" నాకు అయోమయంగా అనిపించింది.
" అదే మాకూ అర్థం కావడం లేదు. ఇంకా పట్టుమని 20 రోజులు లేదు ముహూర్తానికి. పత్రికలు  ప్రింట్ చేసి అందరికీ పంచడం లేదు. పిలవటం లేదు. మన కుటుంబాల వరకే కదా!  అయినా పిలిచినా ఎవరూ రావడం లేదు లే. పిలవటం మా బాధ్యత రాకుండా ఉండటం మీ బాధ్యత అన్నట్లుగా ఉంది ఇప్పుడు. ఇదివరకులా సకుటుంబ సపరివారంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించండి అనే రోజులు పోయాయి..."  సుజాతక్క మాట్లాడుతూనే ఉంది.  
      "నిశ్చితార్థం అయ్యాక ..,ముహూర్తం దగ్గర పడ్డాక వద్దంటే ఏదో బలీయమైన కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలి కదక్కా!"
  " అది తెలుసుకుంటావనే నిన్ను రమ్మంటున్నది. ఇష్టం లేదు అన్న మాట తప్ప ఇంకేం చెప్పడం లేదు. తిట్టి.. కొట్టి అడగటానికి అది చిన్న పిల్ల కాదు కదా! నీతోనే కదా అది  మనసు విప్పి మాట్లాడేది .అందుకే నువ్వే వచ్చి అడుగు."
   "సరే ! అక్కా! రేపు ఉదయం వస్తాను."
" వంట... గింటా అంటూ కూర్చోకు. రఘు.. పిల్లలు కూడా వచ్చేయండి .నేను రమ్మన్నానని చెప్పు రఘుకు.  ఉంటాను మరి " సుజాతక్క ఫోన్ పెట్టేసింది.
    నేను ఆలోచనలో పడ్డాను. సుప్రజ చాలా మంచి అమ్మాయి. చిన్నపుడు చురుగ్గా..  చదువులో ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ ఉండేది. తర్వాత రాను రాను స్తబ్దుగా తయారయింది. చదువులో కూడా వెనకబడిపోయింది. అది చూసి సుజాతక్క భయపడిపోయింది.
"ఎందుకిలా అవుతోంది తెలియటం లేదు. కనీసం టెన్త్ పాస్ అవుతుందా అనిపిస్తోంది నాకు. ఎంత చెప్పినా వినడం లేదు. ఏమీ చెప్పదు. నువ్వు రా సునీతా! " సుజాత అక్క చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించి.. ఆత్రపడి.. ఆరాట పడిపోతుంది.ఆమె గుండె బరువు తగ్గించుకోవడానికి, ఆమె సమస్యలు పరిష్కరించడానికి.. నా తెలివితేటలు. ఓర్పు ..నేర్పు పనిచేస్తాయని ఆమె ప్రగాఢ విశ్వాసం .
అక్క బాధ పడితే.. ఏడిస్తే నేను తట్టుకోలేను. అక్క నాకు అమ్మతో సమానం. నేను ,అక్క, తమ్ముడు ..మేము ముగ్గురం సంతానం అమ్మకు. తమ్ముడు పుట్టాక  అమ్మ ఆరోగ్యం పాడైంది .యుట్రస్ క్యాన్సర్ తో అమ్మ చనిపోయింది .మగ బిడ్డ కావాలని.. నా తర్వాత.. అమ్మ గర్భవతి కావడం ..స్కానింగ్ చేయించడం.. కడుపులో వున్నది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించడం.. ఒక్కోసారి  బలహీనమైన గర్భాశయం వల్ల కూడా అబార్షన్లు కావడం వల్లనే ..అమ్మకు యుట్రస్ క్యాన్సర్ వచ్చిందట. తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు పూర్తి బెడ్ రెస్ట్ ఉండాలి అనడంతో పదేళ్ల వయసు నుండే ఇంట్లో పనులు.. నా పెంపకం కూడా అక్క మీద పడ్డాయి. నానమ్మ ఉన్నా కూడా ఎక్కువ కష్టపడింది అక్కే!  పాపం అందుకే పదోక్లాస్ కూడా చదువుకోలేక పోయింది. కానీ అక్కకు చదువు అంటే చాలా ఇష్టం . ఆ ఇష్టమే నన్ను ..తమ్ముణ్ణి ఉన్నత చదువులు చదివించింది పట్టుబట్టి. మరి తన కూతురు చదవకపోతే అక్కకు ఎంత బాధగా ఉంటుంది?
   నేను వెంటనే వెళ్లి సుప్రజ తో మాట్లాడాను. నిర్లిప్తంగా మన్ను తిన్న పాములా ఎందుకు తయారయిందో ..
నెమ్మది..నెమ్మదిగా రాబట్టాను.సుప్రజ తెల్లగా అందంగా బొద్దుగా ఉంటుంది .బొద్దుగా ఉండటమే ఇప్పుడు సమస్య అయిపోయింది. క్లాస్ లో ..స్కూల్లో.. ట్యూషన్ లో.. పిల్లలు, స్నేహితులు కూడా ఎగతాళి చేస్తుంటారట లావుగా వుందని.. ఏవేవో నిక్ నేమ్స్ తో పిలుస్తారట! అది తట్టుకోలేక పోతుంది. అందుకే చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతోంది.  క్లవర్ గర్ల్ అని పేరు పడ్డ అమ్మాయి డల్ అయిపోతే ...మార్కుల శాతం పడిపోతుంటే టీచర్స్ బాధపడి.. వాళ్ళూ  తిట్టడం మొదలు పెట్టారు. ఇక ఇంట్లో అక్క ఆవేశపు అరుపులు ! ఇన్ని ఒత్తిళ్లను  సుప్రజ భరించలేకపోతోంది.
   " ఇలా ఉండటం నా తప్పా మమ్మీ ?"  నా ఒళ్ళో తల దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది సుప్రజ.  అక్కను 'అమ్మఅని నన్ను 'మమ్మీఅని పిలుస్తుంది.
  సుప్రజ ఏడుపు చూసి నాకు కడుపులో దేవినట్లయింది. ఒక్కతే కూతురు అని అక్క సుప్రజను  బాగా గారాబం చేసింది.  చిన్నప్పటి నుంచి.. వద్దు వద్దు అంటున్నా బలవంతంగా తినిపించేది. స్వీట్స్ బాగా అలవాటు చేసింది.
  "స్వీట్స్ వద్దు. బరువు పెరగడం తప్ప శక్తి రాదు. పండ్లు కూరగాయలు అలవాటు చేయ" మని నేను ..బావ చెబుతూనే ఉండేవాళ్ళం. అక్క వినేది కాదు.
"అయ్యో!  బిడ్డకు మీ ఇద్దరి దిష్టే తగిలేట్టు ఉంది." అని మమ్మల్ని కోప్పడేది.
    చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దొస్తారు. నిజమే కానీ పెద్దయ్యాక లావుగా ఉంటే ఇదిగో ఇలాగే మిగతా వాళ్ల హేళనకు గురి అవుతారు. డిప్రెస్ అవుతారు. చదువు సంధ్యలు అటకెక్కి..  ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో కూరుకుపోయి ..దేనికి పనికిరాకుండా పోతారు. ఇక్కడే చెక్ పెట్టాలి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము.వయసుకు తగ్గట్టు  ఎత్తు, బరువు ఉండాలి అన్నారు. తినే తిండికి తగ్గట్లు ఎక్సర్సైజులు చేయాలన్నారు. బలం ఇవ్వని ..బరువు పెంచే ఫాస్ట్ ఫుడ్.. స్వీట్స్ పట్ల నియంత్రణనిగ్రహం కలిగి ఉండాలన్నారు.
  పాపం డాక్టర్  చెప్పినట్లే నడుచుకొంది సుప్రజ. అయినా బరువు ఎక్కువగా తగ్గలేదు. మళ్ళీ డాక్టర్ కు చూపించాము. థైరాయి, టెస్ట్ వల్ల తెలిసింది తనకు హైపోథైరాయిడిజం ఉందని.. దీనివల్ల కూడా బరువు పెరుగుతారని. చికిత్స చేయించాము ..కానీ పూర్తిగా తగ్గలేదు.  నేను ఎక్కడో చదివాను.. తమలో ఉన్న బలహీనతను , లోపాన్నిఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నూ  చేయించాలంటే తమలో ఉన్న ఏదో ఒక టాలెంట్ కు మెరుగు పెట్టుకొని రాణించాలని ..గుర్తింపు తెచ్చుకోవాలని. ఒక రచయిత స్వయంగా చెప్పారు తను పొట్టి గా ఉన్నాను అన్న  ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి రచయితగా మంచి గుర్తింపు కోసం.. విరివిగా రాశానని.
   అలా బ్రెయిన్  వాష్ ..కౌన్సిలింగ్... నాకు తోచినవి, తెలిసినవి ,చదివినవి, విన్నవి.. మెల్లమెల్లగా చెప్తూ సుప్రజ దృష్టిని చదువు వైపు మళ్ళించాను. తెలివైన అమ్మాయి కాబట్టి పదో తరగతి లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. అది నా వల్లే  అని  అక్కకు నమ్మకం.
     "అది చదివి.. ర్యాంకు తెచ్చుకుంటే నన్ను మెచ్చుకోవడం ఏమిటి?"  అని నేను అన్నా ఒప్పుకోదు.
   "నువ్వు మాటల మరాఠివి. నీ మాటలతో  మాయోమంత్రమో  వేస్తావు. చిన్నప్పుడు కూడా మొహం అమాయకంగా పెట్టేసుకుని... నాన్నను, అక్కను  ఏమార్చి నువ్వు చేసే అల్లరి పనులు నా మీదకు నెట్టేసి నాకు తిట్లు, దెబ్బలు తినిపించేదానవు కాదూ!"  తమ్ముడు సునీల్ నవ్వుతూనే దెప్పిపొడిచాడు మా బాల్యం గుర్తుచేసుకుంటూ.
    మేము ముగ్గురమూ  సిటీలోనే ఉండటం మూలాన అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భం కల్పించుకుని  కలుసుకుంటుంటాము. ఎక్కువగా అక్క వాళ్ళ ఇంటికే వెళ్తాము. అక్క దగ్గరకు వెళితే పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ మాకు.  నానమ్మ చనిపోయాక నాన్నను బలవంతంగా తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంచుకుంది. అక్క, బావ.. ఇద్దరూ నాన్నను చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఈ మధ్యన కాలం చేశారు .
  సుప్రజ  తన బాడీ షేమింగ్ గురించి పట్టించుకోకుండా చదువు మీదే దృష్టి పెట్టడంతో ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకొని బీటెక్ చదివి క్యాంపస్ సెలక్షన్స్ లోనే మంచి ప్యాకేజీ తో పేరున్న కంపెనీలో జాబ్ తెచ్చుకుంది.
తన తెలివైన పర్ఫార్మెన్స్ తో త్వరలోనే టీం లీడర్ కూడా అయింది. అందం , మంచి ఉద్యోగం , జీతం.. ఎన్ని ఉన్నా ..లావుగా ఉందన్న ఒకే కారణంతో చాలా సంబంధాలు  కుదరకపోవడం ..అక్కా బావలను చాలా కుంగదీసింది.
  సుప్రజ లోలోపల బాధపడిందేమో కానీ... పైకి ఏమి పట్టించుకోనట్లే ఉండేది.
నాకు ఫోన్ చేసి  "  పెళ్లి జీవితంలో ఒక భాగమే కానీ.. పెళ్లే జీవితం కాదని అమ్మకు చెప్పు.  అయినా ఇక లోకంలో అబ్బాయిలే లేనట్లు ..నేను ముసలి దానిని  అయిపోయినట్లు.. నాకిక   పెళ్లే కాదన్నట్లు తెగ బాధపడిపోతూ ఉంది. "  అనేది ఏదైనా సంబంధం తప్పిపోయినప్పుడు...తల్లి బాధ చూడలేక నన్ను వచ్చి అక్కను ఓదార్చమనేది. అలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు సంబంధం కుదిరి నిశ్చితార్థం అయ్యేదాకా కూడా మాకు నమ్మకమే . నిశ్చితార్ధం జరిగాక చాలా ఆనందించాము . కానీ ఇప్పుడు సుప్రజ పెళ్ళి వద్దనడం.. మాకు మింగుడు పడడం లేదు. సుప్రజతో మాట్లాడితే గాని అసలు విషయం తెలియదు. ఆ రాత్రి ఆలోచనలతో నిద్ర పట్టలేదు.
    " హాయ్ మమ్మీ ! ఇవాళో.. రేపో వస్తావని అనుకుంటూనే ఉన్నాను."  నేను తన గదిలోకి వెళ్ళగానే లాప్టాప్ లో ఏదో టైపు చేసుకుంటూ అంది సుప్రజ.
     నాకు ఎందుకో  చురుక్కుమన్పించింది. తమాయించుకుని అన్నాను.
    "పెళ్లి  దగ్గర పడింది.  ఇంకా ఏవన్నా పెండింగ్ పనులుంటే చేయాలి కదా! మరి రాకుండా ఎలా ఉంటాను?"
   " అబ్బా!  మమ్మీ...  చల్లకొచ్చి ముంత దాయడం అంటే ఇదే కదా! " సుప్రజ నవ్వింది. తను  పుస్తకాలు బాగా చదువుతుంది .ఇంగ్లీషు ,తెలుగు కూడా!
  "చల్ల ..ముంతా.. రెండూ దాచుకునేంత సమయం మనకు లేదు కదా సుప్రజాఅసలు సమస్య ఏమిటి?"  నేను సూటిగా రంగంలోకి దిగిపోయాను.
"పరిష్కారం అయిపోయిందిలే మమ్మీ!  ఓకే ! " ఎంతో నిర్లక్ష్యంగా అంది సుప్రజ. నేను నివ్వెరపోయాను.
   "సుప్రజా!  పెళ్లి అనేది నీ ఒక్కదానికే సంబంధించిన విషయం కాదు.  రెండు కుటుంబాలకు ..పరువు ప్రతిష్ట లకు సంబంధించిందని మర్చి పోతున్నావు."  నేను కాస్త తీవ్రంగా అన్నాను.
   "అంటే ? వాట్ డు యు మీన్ ? పరువు ప్రతిష్ట కోసం నా జీవితం పణం  పెట్టమంటారా? "  సుప్రజ ఉద్రేకంగా అంది.
" అలా ఎలా  అంటాను ? కానీ ..నువ్వు సరేనంటేనే కదా సంబంధం ఖాయపరిచింది. నిశ్చితార్థం జరిగింది."  నేను..నా స్వరాన్ని మెత్త పరిచాను.
  " నిజమే! కానీ ఇప్పుడు కాదంటున్నాను  కదా ! నేనేమన్నా చిన్న పాపనా? కాదు కదా!  నేను బాగా ఆలోచించే తీసుకున్న నిర్ణయం ఇది."
"కావచ్చు. కానీ ..దానికి కారణం తెలియాలి కదా! ముందు  మాకు తెలిస్తే కదా వాళ్లకు చెప్పడానికి? నిశ్చితార్థం అయ్యాక ..పెళ్లి క్యాన్సిల్ అంటే...."
"అయితే ఏంటట అసలే.. నేను కొబ్బరి బొండం..  పూరి.. పీపా .. బోండా...గుమ్మడి పండు ... లా ఇంత లావున వున్నాను కదా! నాకు పెళ్లి కుదరడమే  చా..లా గొప్ప విషయం . అందులోనూ.. అబ్బాయి అందగాడు.  అయినా సరే నన్ను పెళ్ళి చేసుకుంటున్నాడు.  సో ... ఒకవేళ ..అతనేమన్నా అన్నా గాని పట్టించుకోకూడదు. సర్దుకుపోవాలి. అని  నాకే నచ్చ చెప్తారు కానీ నా బాధ మీరు అర్థం చేసుకుంటారా? అందుకే నేను మీకు ఎవరికీ చెప్పలేదు. నేనే నిర్ణయం తీసుకున్నాను."  మొహం, కళ్ళు కోపంతోనోబాధతోనో  ఎర్ర పడిపోయాయి.
"మీరు ఎవరితోనూ మాట్లాడాల్సిన పని లేదు. ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. నేను ఇప్పుడే అతనికి మెయిల్  పెట్టేసాను. ఈ విషయం ఇంతటితో ముగిసిపోయింది. అంతే!"  గంభీరంగా మరి తిరుగే లేనట్లు స్పష్టంగా చెప్పింది సుప్రజ.
నేను నిర్ఘాంతపోయాను. హఠాత్తుగా సుప్రజ నా ఒడిలో తల పెట్టుకొని ఏడవటం మొదలెట్టింది. తను ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది.  ఓదార్పుగా తన తల  నిమురుతూ ఉండిపోయాను. కాసేపయ్యాక తేరుకొని లేచి కూర్చుంది. లాప్టాప్ నా ముందు పెట్టి తను పెట్టిన మెయిల్ నాకు చూపుతూ చెప్పింది.
  " అతనికి నచ్చింది ..నేనునా వ్యక్తిత్వం కాదు మమ్మీ.  నా ఉద్యోగం , హోదాజీతంనా వెనక ఉన్న ఆస్తి. అంతే!  అది నిశ్చితార్థం అయ్యాక అతని మాటలు, ప్రవర్తన చెప్పాయి. నిశ్చితార్థం అయ్యాక ఆడపిల్ల ..ఆమె తల్లిదండ్రులు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోరు అన్న ధీమాతో ఉన్నారు.థాంక్ గాడ్ !  పెళ్లికి ముందే అతను తన అసలు రూపాన్ని చూపాడు. తనేదో చాలా పెద్ద త్యాగం చేస్తున్నట్లు మాట్లాడేవాడు. మేమిద్దరం ఉన్నప్పుడే కాదు తన ఫ్రెండ్స్ ముందర కూడా బాడీ షేమింగ్ మాటల ఈటెలు గుచ్చుతూనే ఉన్నాడు. చివరకు... డన్లప్ బెడ్  అని కూడా... ఛీ ! ఛీ! వద్దు మమ్మీ ! కొంచెం కూడా అతడికి సంస్కారం లేదు ..కానీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అతను నాకొద్దు గాడ్ ! పెళ్లికి ముందే తెలియటం.. రియల్లీ ఐ యాం లక్కీ! "  సుప్రజ రిలీఫ్ గా, ఆనందంగా, దృఢంగా చెప్పింది.
    మెయిల్ చూశాను. చదివాక ..నా పెదవుల మీద చిరునవ్వు విచ్చుకుంది అప్రయత్నంగా. నా చేయి సుప్రజ భుజాన్ని మెచ్చుకోలుగా పట్టుకొంది గట్టిగా, గర్వంగా.
    "మన పెళ్లి ఒప్పందాన్ని నేను రద్దు చేసుకుంటున్నాను. ఎందుకంటే ..జీవితంలో.. నా వేదనలోను, వేడుకలోనూ తోడునీడగా.. అడుగడుగు అండదండగా.. కలసి నడిచే ఒక జీవన సహచరుడ్ని కోరుకుంటున్నాను కానీ అనుక్షణం నన్ను బాడీ షేమింగ్ కు గురి చేసి ..పైశాచిక ఆనందం పొందే ఒక శాడిస్టు ను కాదు.   మీకు తెలుసో లేదో.. బాడీషేమింగ్ ,(శరీర అవయవాల్ని కామెంట్ చేయటం)కలరిజం  (శరీర వర్ణాన్ని కామెంట్ చేయటం) చట్టరీత్యా నేరాలు. అలా చేసిన వారిపై కేసు కూడా పెట్టొచ్చు. ఇటీవలే ఓ నటి  తన శరీర రంగు గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వారిపై కేసు పెట్టింది కూడా!  సో భద్రం గురూ!  మీకు తప్పకుండా పెళ్లి అవుతుంది.  పాపం ఆ అమ్మాయిని దేవుడే కాపాడాలి. గుడ్ బై ఫరెవర్ !"
 

                 -------------***---------
      
                                
                               

కథలు

తప్పటడుగులు

ప్రతి గురువారం మల్లంపల్లి ఊర్లో అంగడి(సంత) . ఆ ఊర్లో పనిచేసే టీచర్లందరూ అప్పుడప్పుడు అంగడిలో తమకు  కావలసిన సరుకులు కొనుక్కునే వాళ్ళు .

 

 అక్కడే కూరగాయలు కొంటున్న సుమనకు  ,నమస్తే మేడం అన్న మాట వినిపించగానే తలెత్తి చూసింది సుమన .

 

ఎక్కడో చూసినట్టుందేకాని

 గుర్తు పట్టలేదు సుమన.

"నన్ను గుర్తు పట్టలేదా మేడం . అవునులెండి మేము ఎందుకు మీకు గుర్తుంటాం

నేను మేడం రమ్యను . ములుగులో మీ స్టూడెంట్ ని"

అన్నది రమ్య .

 

"అవునా ఏంటి ఇక్కడ  చదువు మానేసావా ?"

అన్నది సుమన.

 

ఒకవైపు బజ్జీ లేస్తూ, మరొకవైపు కాయగూరలమ్ముతూ  ,పది చేతులతో పని చేస్తున్నట్లు కనపడుతోంది రమ్య .

 

అప్పుడే అటుగా వచ్చిన అతనితో "నువ్వు ఇక్కడ కూర్చొని కూరగాయలమ్ము , నేను బజ్జీలు వేస్తానంటూ" వెళుతూ , రండి మేడం ఇక్కడ కూర్చోండని కుర్చీ చూపించింది. వేడివేడిగా వేసిన బజ్జీలు ప్లేట్ లో పెట్టి అందించింది.

" రమ్య గురించి ఆలోచిస్తూనే ఇప్పుడా! వద్దమ్మా! నేను ఈటైంలో ఏమీ తిననమ్మా " అన్నది సుమన.

 

"అవును మేడం జీవితంలో మర్చిపోయే అలవాట్లా మీవి. స్ట్రిక్టు గావుండే మీరు విద్యార్థులందరికీ ఎప్పుడు గుర్తే , సాయంకాలం బ్రష్ వేయనిది ఏమీతీసుకోరు కదా! అన్నది  "రమ్య .

 

ఏమి కొనకుండా దర్జాగాఅంగట్లో (సంత) కుర్చీలో  కూర్చుని ముచ్చటపెడుతున్న సుమన దగ్గరకు వచ్చిన టీచర్లు "మేముందరం కొనవలసినవి కొనుక్కున్నాం  . మీరేమీ కొనలేదా "అన్నారు టీచర్లు .

 

ఇక వెళ్దామా అన్నారందరు.

 "ఈ అమ్మాయి రమ్య ములుగులో నాస్టుడెంటని పరిచయం చేసింది" సుమన.

 

అందరికి నమస్కారం చేసింది రమ్య .  "నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే లంచ్ లోబజ్జీలు తెప్పించుకునే వాళ్ళమన్నది రోహిణి ". ఆమెకు చిరుతిళ్ళంటే చాలా ఇష్టం .

 

"మీరు ఇప్పుడు ఏ ఊర్లో చేస్తున్నారు  మేడం .వీళ్ళందరూ టీచర్లేనా" అన్నది రమ్య .

 

"అవునమ్మా !నేను ఇప్పుడు ఈ వూరు  మల్లం పెళ్లి లోనే పనిచేస్తున్న గురువారం ఇక్కడ అంగడి కదా అందరంఅప్పుడప్పుడు కావలసినవి కొనుక్కుంటా మన్నది "సుమన.

 

 "మీరు ఎప్పుడు నాకు కనపడలేదు మేడమ్ .దాదాపు రెండు సంవత్సరాల నుండి ఇక్కడే గురువారం బజ్జీలు ,కూరగాయలమ్ముతున్నానన్నది" రమ్య .

 

ఇందాక వచ్చినతన్ని పిలిచి ఇతడు నా భర్తంటూ అందరికీ పరిచయం చేసింది . అతను అందరికీ నమస్కరించాడు .చాలా సౌమ్యుని లా కనిపించాడు. సుమనకు . ప్రశ్నార్థకంగా చూస్తున్న సుమనతో "ఇంకా పిల్లలు లేరు మేడం "అన్నది రమ్య.

 

సరే రమ్య నీ కాళ్ల మీద నువ్వు నిలబడి సంపాదించుకుంటున్నావు చాలా సంతోషం , ఇంకా ఎదగాలి నువ్వంటు ఒక పచ్చనోటు ఆమె చేతిలో పెట్టబోయింది .  ఇప్పటికే మీ రుణం తీర్చుకోలేనిది. మీ మంచి మాటలు వినిపించుకోలేక పోయానన్నది .ఆమె కన్నుల్లో సన్నటి నీటి పొర.

 అందరూ తినండంటూ , మిరపకాయ బజ్జీలు మసాల చల్లి  టీచర్లకందరికీ ఇచ్చింది రమ్య. రమ్య చాలా బాగున్నాయమ్మాఅంటూ టీచర్లు అందరు మెచ్చుకొన్నారు.

 

"కొంచెం ఉప్పుఇస్తా మీరు కూడా మొహం కడుక్కొని తినుమని బ్రతిమాలింది" రమ్య.

 

బలేదానివే రమ్యా ! నాకు ఏమి వద్దు అనగానే, సరే ఇంటికి తీసుకు వెళ్ళండన్నది రమ్య కాదనలేకపోయింది సుమన.

 

 

సాయంత్రం నాలుగైందంటె  మొహం కడుక్కోనిది మంచినీళ్ళు కూడా తాగదు సుమన.

 ఇంటికి వెళ్ళిన తర్వాతనే అన్ని అని ,ఆమెను దగ్గరగా చూసిన వారందరికీ ఆ విషయం తెలుసు. ఏదో ఒకటి కొనుక్కొని తింటూనే ఉంటారు కొందరు టీచర్లు .

 

వస్తామమ్మా రమ్య .జాగ్రత్తని టీచర్లందరూ బస్సెక్కారు.

 

 నేను కూడా చదువుకుంటే అలా వెళ్ళే దాన్నేమో అని వెళ్ళిన బస్సు వంక చూస్తూ పనిలో  పడింది రమ్య.

 

మంచి జీవితాన్ని పాడు చేసుకున్నదనుకున్నది సుమన.

 

 ములుగు హాస్టల్ లో ఉండి చదువుకునేది రమ్య. అప్పుడు ఎనిమిదవ తరగతి నుండి తమ్మిదవ తరగతి వచ్చింది. చదువుకంటే  ఇతర విషయాల మీద ఎక్కువగా మక్కువని గ్రహించింది సుమన.

 

క్లాస్ టీచర్ గా సుమన చాలా స్ట్రిక్ట్ గా ఉండేది .ఆ పక్కనే బాయ్స్ స్కూలు కూడా ఉండేది. ఇంటర్వెల్ కాగానే బయటకు వెళ్లిపోయేవారు ఆడపిల్లలు. వాష్ రూమ్స్ ఉండేవికావు. ఉపాధ్యాయులూ ఇబ్బందిపడేవారు .ఒకటే వాష్ రూం ఉండేది . అటెండర్ కు డబ్బులిచ్చి నీళ్లు పెట్టించుకుని శుభ్రం చేయించుకునేవారు టీచర్లు .

 

అప్పుడప్పుడూ "బాయ్స్ " స్కూల్ నుండి ఒక రిద్దరు పిల్లలు  క్లాసురూముల దగ్గర తచ్చాడుతుండేవారు .వారిని అటెండర్ బెదిరించి పంపేది .

 

ఉన్న టైంలో కొంత నీతి బోధ చేసి తమ పాఠాలు  చెప్పుకునేవారు కొందరైతే , పిల్లల ప్రవర్తనను డేగ కళ్ళతో చూసే వారు కొందరు .అందులో మొదటి వ్యక్తి సుమన.

 

అటెండర్ లక్ష్మిని ఇంటర్వెల్  కాగానే బయటనే నిలబడమనేది సుమన.   పిల్లలు ఎటు వెళ్తున్నారో కనిపెట్టి చూడమనేది. ఒకటి రెండు సార్లు రమ్య ఇంటర్వెల్ కాగానే మల్లీ స్కూలుకు రాలేదు. ఇలా ఐతే పిల్లులు చెడిపోతారని, పిల్లల గురించి ఆలోచించాలని ,ప్రతి క్లాసులో అటెండెన్స్  తీసుకొని క్లాస్ టీచర్ కుఇచ్చేవారు  .అలా  బయటికి వెళ్లి ఎప్పుడు వచ్చిందో చెప్పి ఎక్కడికెళ్లావ్ అంటూ అందరిని ఆరాతీసేవారు సుమన, మిగతా క్లాసు టీచర్లు.

 

పెరుగుతున్న వయసు తప్పటడుగులు వేస్తే కష్టమని మంచి చెడుల గురించి క్లాస్ కు ముందు ఐదు నిమిషాలు నీతి వాక్యాలు చెప్పేవారు టీచర్లు.

 

ఎంత చెప్పినా వినని పిల్లలకు  హెచ్ ఎంతో పాటు  ఓ నలుగురు టీచర్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు.

ఒక రోజు తమ స్కూల్ లో రమ్య ,బాయ్ స్కూల్ లో టెన్త్ క్లాస్ అబ్బాయి  ప్రకాష్ అన్న రవి తో వెళ్ళిపోయిందని  తెలిసి టీచర్లందరూ బాధపడ్డారు. అప్పుడు వెళ్లిపోయిన రమ్య ఇన్ని సంవత్సరాలకు  కనిపించిందనుకుంటు ఆలోచనలోవున్న సుమనతో మేడం ఇంకా ఏమాలోచిస్తున్నారు మన స్టేజీ వచ్చింది దిగండన్నారు టీచర్లు .

 

స్కూలుకు వస్తుంటె కొన్నిరోజులవరకు రమ్య  గురించి ఆలోచనలే వెంటాడేవి సుమనను .చాలా రోజులవరకు మళ్ళీ రమ్య కనిపించలేదు .ఆమెగురించి ఆలోచనలు  మరుగు పడుతున్న వేళ  ఒకరోజు సరాసరి స్కూల్ కె వచ్చింది రమ్య .

 

"నమస్తే మేడం. మీతో కొంచెం సేపు మాట్లాడాలని వచ్చానన్నది" రమ్య.

 

"సరే అమ్మ ఇంటర్ వెల్ తరువాత నాకు లీజరుంది అప్పుడు మాట్లాడుకుందామన్నది" సుమన.

 

"చెప్పమ్మ రమ్య ,ఏం కావాలన్నది "సుమన .

ఏమీలేదు మేడం మీరు ఇక్కడే పనిచేస్తున్నారని  తెలియదు. తెలిస్తే మిమ్మల్ని కలిసే దాన్ని"  అన్నది రమ్య .

 

 "ఆ రోజుల్లో మీరు అలా చెప్తుంటే మీ మీద నాకు చాలా కోపం వచ్చేది . మీరు చెప్పేవన్ని మా మంచికని నాకు తరువాత అర్థమైందన్నది" రమ్య .

 

"అసలేం జరిగిందన్నది " సుమన.

 

హాస్టల్ కు అప్పుడప్పుడు మా కోసం రవి వచ్చేవాడు కాసేపు చెట్టు కింద కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయేవాడు. డిగ్రీ చదివి ఆపేసానని చెప్పాడు. అప్పుడప్పుడు నాకొరకు తెచ్చే బహుమతులు చూసి సంబర పడేదాన్ని .

 

 కొన్నిరోజుల తర్వాత నాతో వస్తే పెళ్లి చేసుకుంటానన్నాడు. మాది చాలా పేద కుటుంబం. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఇంటికి పోతే తినడానికి కూడా ఉండేది కాదు.

 ఇంటికి పోగానే అమ్మ నాన్న  నన్ను కూలికి తీసుకు పోయేవారు . చెల్లెల్లు మాఊర్లోనే చదువుకునే వాళ్ళు. అతను చెప్పిన మాటలు  నమ్మి వెళ్తానంటే కీర్తన వద్దని చెప్పింది. మీకు చెప్తానని బెదిరించింది .ఐనా వినక బడి లో  పుస్తకాలుపెట్టి వెళ్ళిపోయాము .నా దగ్గర ఎక్కవ డబ్బులు ఏమి లేవు . యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంటానని నన్ను తీసుకు వెళ్ళాడు రవి .రెండు మూడు రోజులు హోటల్ లో ఉన్నాము. ఇది తెలుసుకున్న మా వాళ్ళంతా మన దగ్గర వున్న గుళ్ళన్నీ వెతికారట. ఎర్రగట్టు గుట్ట , కీసర గుట్ట యాదగిరిగుట్టదగ్గర  వెతకడం మొదలుపెట్టారట . ఈ విషయం రవికి తెలిసిందేమో నన్ను  అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. లాడ్జి వాళ్ళు అతను రూం కాళీ చేసాడని ,నన్ను బయటకుపంపి లాక్ వేసుకున్నారు. నాకు ఏం చేయాలో తోచక గుడి దగ్గర కూర్చున్నాను.  నన్ను మా పెద్దమ్మ కొడుకు గుర్తుపట్టి ఇంటికి తీసుకొచ్చాడు .పంచాయితీ పెట్టి మా బావకిచ్చిపెళ్లి చేశారు .మా బావకు చిన్నప్పుడే ఫిట్స్ వచ్చాయట.మందులిప్పిస్తున్నాము. ఏదైనా చెప్తే చేస్తాడు లేదా లేదు. అందుకే అతన్ని నా వెంటే తీసుకొని వస్తాను . ఇంకా మందులు వాడాలంటున్నారన్నది " రమ్య.

 

ఇప్పటికైనా మంచి జీవితంలో కాలు పెట్టావు అన్నదిసుమన.

 

 మేడం ఇక నన్ను మళ్ళీ బడికి పంపలేదు .వెంట ఒక మనిషి కాపలాగా ఉండే వాడు. నేను ఎక్కడికైనా వెళ్తాననో ఏమో, కొన్నాళ్ల తర్వాత నేను ఎక్కడికి పోను నన్ను వెంబడించకని చెప్పాను. మా పెళ్లై ఇప్పుడు నాలుగేళ్లయింది .  నాకు చదువుకోవాలని వుంది. కానిఎలాగో తెలియటం లేదు. ఇద్దరం కూలీ ,నాలీ చేసుకుంటూ, గురువారం మాత్రం ఇక్కడ కూరగాయలమ్ముతూ , బజ్జీలమ్ముతుంటాను మేడం అన్నది రమ్య.

 

మీ టీచర్లందరికీ బాగా చదివే పిల్లలు గుర్తుంటారు. మాలాంటి వాళ్ళు గుర్తు ఉండరు అన్నది రమ్య.

 

 "అది నిజమే కాని రమ్య తప్పటడుగు వేసే వాళ్ళని కాపాడుకుంటేనే మాకు తృప్తి. బాగా చదివే వాళ్ళ కన్నా చదువు నేర్పితే నేర్చుకున్నవాళ్ళకుమేము, మాకువాళ్ళుఎక్కువగా గుర్తుంటారు .బాగా చదివే పిల్లలతోపాటు  మిగతావాళ్ళు చదవాలన్నదే మాఆశ అన్నది " సుమన.

 

"అది సరే నీకు చదువుకోవాలనుకుంటున్నావు కదా !నేను ఇక్కడే ఉన్నాను కనుక టెన్త్ ప్రైవేటు కట్టిస్తా .మేము ఇచ్చిన నోట్సు చదువుకో డౌట్స్ ఉంటే మా దగ్గరకు రా !టీచర్లందరు నీకు సహాయం చేస్తారన్నది  సుమన.

  "సరేమేడం మీరు చెప్పినట్లు విని చదువుకుంటానన్నది " రమ్య .

 

 "నేను ఏ ఊర్లో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ చేయూతనిస్తూ నే ఉంటానని మీ అందరికీ  తెలుసు కదా అన్నది "సుమన.

 

రమ్య !ఇప్పటికైనా,

 అడ్డదారులు వెతుక్కోకుండా మంచి పేరు తెచ్చుకొమ్మన్నది సుమన .

 

"నా తప్పు నేను తెలుసుకున్న ఇక ఎప్పుడూ పొరపాటు చేయను మేడం "అన్నది రమ్య

 

"మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని రమ్య భుజం తట్టింది" సుమన.

 

 

 

 

 

కథలు

అమ్మదనం

సన్నగా కురుస్తున్న చినుకులు కాస్త సమయంలోనే హోరందుకోగానే అడుగు ముందేయలేక పక్కనే వున్నబస్టాప్ షెల్టర్ లో  నిలబడింది హిమజ.

ఏమిటే ఏదైనా విశేషమా... పెళ్ళై ఏడాది కావస్తోందిగా  అంటూ దీర్ఘం తీస్తూ వెనుకనుండి ఓ యాభైయేళ్ళ మహిళ ఓ అమ్మాయిని అడుగుతుంటే...

తననే అడిగారనుకుని ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూడగానే ఆ అమ్మాయి సిగ్గు పడుతూ
ఏమీ లేదు పిన్ని అంటూ మందిలో అలా అడక్కూడదనే  యోచన కూడా లేదని కళ్ళతోనే సైగ చేస్తూ పక్కకు తిరిగి నిలుచుకుంది  ఆ అమ్మాయి.

ఈ మాటల తూటాలకు అలవాటు పడిపోయి చాలా యేళ్ళైంది తనకు. ఇప్పుడూ ఎవరిని అడిగినా తననే అడుగుతున్నారనే భావన తనను వదిలి ఇంకా వెళ్ళలేదు కాబోలనుకుంది మనసులో.

వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో అడుగులో అడుగు వేస్తూ రెండు వీధులకావల వున్న ఇంటికి నడుస్తూ

మది గదిలో సాలె గూడులా అల్లుకుపోయిన కొన్ని చేదు జ్ఞాపకాలు మరిన్ని తీపి నిజాలు మనసును కుదిపేస్తున్నాయి.

"ఏమిటే హిమా ... ఇంకా నీళ్ళోసుకోలేదటే"

హమ్మో ..మా కాలంలో ఐతే నలుగురు బిడ్డల్నేసుకుని  వీధిలో తిరిగేవాళ్ళం.. పక్కింటి బామ్మ మాటలు రోజూ రోజాలా పుష్పించాల్సిందే ఆమె నోటిలోంచి.

పెళ్ళై ఏడాది కావొస్తోంది విశేషమేమి లేదా నీ కోడలు... ధీర్ఘ ఉపన్యాసాలు... ఉపనిషత్తులు నూరిపోసే తంతులు ప్రతిరోజూ.. చెవిలో పడాల్సిందే.

చుట్టపు చూపులు కాదు అవి చురచుర కోసే కత్తుల మాటలు గుండెను కోసి పచ్చని కాపురాల మధ్య చిచ్చు రగిలించేవి.

ఏ ముఖం పెట్టుకుని వస్తారో ఓ మందో మాకో తినిపించి  ఓ బిడ్డను కనిపించే యోగ్యత లేదు గానీ మా కూతురంటూ ఎగేసుకుని రావటమే  కన్నవారిని అనే  ఎగతాళి ఈటెలు ఇనుప చువ్వల కంటే ఘనంగా గుండెలో దిగబడేవే రోజూ.

ఇదిగో... ఈ ఫోటో చూడరా లక్షణంగా వుంది పెళ్ళైన ఆర్నెల్లకే నాకో మనవణ్ణో మనవరాల్నో కని చేతిలో పెడుతుంది రెండో పెళ్ళైనా మాకేం అభ్యంతరం లేదని ఎన్ని సంబంధాలొస్తున్నాయో  వెనుకనుండి దెప్పి పొడుపులు ఆకలి పేగులను ఎప్పుడూ చీల్చుతూనే వుండేవి.

ఎన్ని మాటలు మనసును గుచ్చినా మనసుపడిన భర్త  మాత్రం ఏనాడూ ఒక్క మాట కూడా అనకుండా
గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు.అదే నాకు కొండంత అండగా కనపడిన రాయి రప్ప చెట్టు చేమ
గుడి గోపురం చర్చి మసీదు అన్నీ చుట్టాను.

హోమియో ,అలోపతి, ఆయుర్వేదం,నాటు వైద్యం,ఆకు పసర్లు......ఎవరు ఏమి చెప్పినా అన్ని మందులు వాడాను నా కడుపున ఓ కాయ కాయదా అనే ఆరాటం అమ్మ అని పిలుపించుకోవాలనే ఆవేదనతో. ఏ దేవుడికి నాపై కనికరం లేదనిపించేది. పిచ్చిగా నాలో నేనే ఏడ్చుకునేదాన్ని మౌనంగా మాటలు రాని ఒంటరినైపోయాను. నా పరిస్థితి చూసిన ఓ మిత్రురాలు డాక్టర్ దగ్గరకు నువ్వొక్కటే వెళితే ప్రయోజనం లేదు ఇద్దరూ వెళ్ళి తగిన పరిక్షలు చేసుకోవాలని చెప్పింది.

పిల్లలు పుట్టకపోతే ఎప్పుడు ఆడవాళ్ళనే తప్పుగా చూసి గొడ్రాలిగా ముద్ర వేస్తారు. కానీ మగవారిలో కూడా లోపం వుండచ్చేమో ఇద్దరూ కలిసి వెళ్ళండంటూ సలహా ఇచ్చింది.

ఈ కాలంలో ఇది మామూలుగా తీసుకోవచ్చు . కానీ ఆ కాలంలో సందేహంతో అడిగినా అది వారి అహం మీద దెబ్బగా భావిస్తారు.ఆస్పత్రికి తనతో రమ్మని అడగాలి

అదే ఆలోచనతో రెండు రోజులు గడిపి చివరికి ధైర్యం చేసి తనపై వున్న ప్రేమతో తన మాట కాదనరనే నమ్మకంతో అడిగితే సరేనన్నారు.

హమ్మయ్య... ఆ రోజు ఎంత సంతోషం నా మాటకు విలువిచ్చి నాతో ఆస్పత్రికి వస్తాననడం.

రెండు రోజులు ఇద్దరికీ  వైద్య పరీక్షలు చేసి నాలో ఎలాంటి లోపమూ లేదు గర్భసంచి ఆరోగ్యంగా వుందని.

కానీ మీ వారిలోనే లోపం వుంది తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.  భూమి  నిట్టనిలువునా చీల్చినట్టయింది నాకు. ఈ విషయం మరింత బాధ కలిగించింది. ఎప్పటికైనా అమ్మను కాలేకపోతానా అనే ఆశతో ఆరేళ్ళు గడిపాను కానీ ఇప్పుడు ఎప్పటికీ కాననే విషయాన్ని జీర్ణించుకోలేక పోయాను.

ఇంట్లో పదేపదే పిల్లల ప్రస్తావన వచ్చినప్పుడు నన్నుతిడుతున్నపుడూ నాలో ఏ లోపమూ లేదని గొంతెత్తి గట్టిగా చెప్పాలనిపించేది. ఆడది ఎంతటి అవమానాన్నైనా భరించగలదు. మగవాడు భరించలేడు.
తనను ఎవరైనా పల్లెత్తు మాటన్నా తట్టుకునే శక్తి నాకుండేది కాదు.. అందుకే ఎప్పటికీ తన లోపాన్ని ఎవరికీ చెప్పాలనిపించలేదు. దగ్గరి బంధువుల పిల్లలెవరినైనా దత్తత తీసుకుందామనుకున్నాతల్లి పిల్లలను వేరుచేసిన పాపమెందుకు మనకని వారించాడు భర్త. అనాథ పిల్లలను చేరదీస్తామంటె అత్తమామలు కులగోత్రాలు లేనివారిని గడపలో కాలు పెట్టనీయ్యనని శాపనార్థాలతో విసిగి వేసారి పోయిన హృదయానికి లేపనంగా   భర్త సుదర్శన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడవడంతో ,మధ్యలో ఆగిపోయిన నా చదువును మళ్ళీ మొదలు పెట్టమన్నాడు. ఇప్పటికే ఆలస్యమైంది సమయం వృధా చేయక  ఇక పిల్లల గురించి ఆలోచించక వేరే ధ్యాసలో వుంటే నీ ఆరోగ్యానికి మేలని ప్రైవేటుగా డిగ్రీ  పూర్తి చేయించి బీఈడీ చదివించాడు. తన ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంతోనే టీచరుగా ఎంపికవడం నా జీవితంలో మరో అధ్యాయానికి నాంది పలికింది.

పెళ్ళైన ఏడు సంవత్సరాల వరకు పడిన కష్టాన్నంతా మరచిపోయి మల్లె పొదను అల్లుకోడానికి ఆరంభించాను.

ఆ ప్రారంభంలోనే ఉపాధ్యాయురాలిగా అడుగు పెట్టిన పాఠశాలలోని పిల్లల్ని   దగ్గరకు తీసి ఒడిలో కూర్చో పెట్టుకుని అక్షరాలు దిద్దిస్తుంటే అమ్మతనం పొంగుకు వచ్చింది.నాచుట్టూ చేరి వారి చిట్టి చేతులు ఆడిస్తూ మాటలు చెప్తుంటే మైమరచిపోయేదాన్ని.

బడిలో వున్నంత సేపు వారే లోకంగా గడిపేస్తూ ఇంటికి వచ్చినా ఆ పిల్లల ధ్యాసలో నిమగ్నమయ్యేదాన్ని.

ఆటలు పాటలు పాఠాలు అన్నీ టీచరమ్మగా కాక అమ్మగా నేర్పించాను. పిల్లలు కూడా అంతే ఆప్యాయంగా అభిమానంతో వుండేవాళ్ళు.

చక్కగా అన్నీ నేర్చుకుని చక్కని చుక్కల్లా అన్నిట్లో మెరిసిపోతే... మీకు ఎవరు నేర్పారు ఇవన్నీ అంటే మా అమ్మ నేర్పించారని  చెప్పేవాళ్ళు.

ఆ క్షణంలో నాకే పిల్లలుంటే ఒకరో ఇద్దరిచేతో అమ్మా అని పిలిపించుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొన్ని వందల మందికి అమ్మనయ్యానని గొప్పగా ఫీలవుతున్నా.

దేవుడు ఒకటి దూరం చేసినా మరొక రూపంలో దగ్గర చేశాడు కదా అనే భావన మనసులో మెదులుతూనే వుంటుంది.

నా ధోరణి చూసి కొంతమంది నవ్వుకున్నా....

ఎగతాళి చేసినా...

అమాయకంగా ఏమీ ఎరుగని చిరునవ్వులు చిందించే పసి హృదయాలను నా గుండెకు హత్తుకున్నప్పుడల్లా

నా గుండె మరింత ఆశగా వారి కలలను పండించే దిశగా అడుగేయమని చెబుతోంటుంది నా మనసు. అదే ధ్యాసలో పాతికేళ్ళు గడిచిపోయాయి.

ఇక అమ్మ అనే పిలుపుకు ఈ రోజుతో ఆఖరి రోజని గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగి జారి చెంపలపై వాలిపోయాయి.

పదుగురిని ఉన్నతంగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయ వృత్తిని విడిచి పెట్టి పదవీ విరమణ చేసి ప్రశాంతంగా ఇంట్లో వుండమని చెప్తున్నారు అందరూ. ఒక నిర్లిప్తత పెదవులపై దొర్లుతూ

నాకు ప్రశాంతత అంటే నా పిల్లలతో గడపటమే కదా వారి అల్లరిని భరిస్తూ వారి ఆటలను ప్రొత్సహిస్తూ వారి భవిష్యత్తుకు వారధిగా వుండటమే కదా నాకు సంతోషం.ఆ సంతోష సంద్రం నుండి నన్ను నేను వెలివేసుకుని మళ్ళీ  ఒంటరినై గొడ్రాలిగా మిగిలిపోతానా...

ఏమో మాటలు ఈటెలు మళ్ళీ గునపంలా గుచ్చుతున్నాయి... అబ్బా అంటూ నడుస్తున్నదల్లా గుండెలు అదుముకుంటూ  అలాగే కుప్పకూలిపోయింది హిమజ.

నాలుగ్గంటలు ఎలా గడిచాయో తెలీదు

మాగన్నుతో మెల్లగా కళ్ళు తెరిచిన హిమజ చుట్టూ చూసి తనెక్కడుందో తెలుసుకోడానికి క్షణం పట్టింది

కింద పడటమే తెలుసు తర్వాత అని ఆలోచిస్తుంటె

భర్త సుదర్శన్ తలుపు తీసుకుని లోపలికి వస్తూ

అమ్మకేం కాలేదు మీరేం గాభరా పడకండి అంతా మీరనుకున్నట్లే యథావిధిగా జరుగుతుందంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే కళ్ళు తెరిచిన హిమజను చూసి ....

ఫోన్ కట్ చేసి

హిమా అంటూ దగ్గరగా వెళ్ళి

తన కళ్ళతోనే ఏమైందంటూ అడిగేసరికి

హిమ కళ్ళలోంచి నీళ్ళు ధారా పాతంగా వస్తుండటంతో

మాటలు పెగలక ముఖం పక్కకు తిప్పుకుంది

హిమా .. ఇటు చూడు అంటు తన రెండు చేతులతో ముఖం పక్కకు తిప్పి తన కళ్ళలోకే  చూసి

ఏంటి చిన్న పిల్లలా కన్నీళ్ళు పెట్టుకుంటూ 

నీకేమైనా ఐతే నేనేమైపోవాలి ... నిన్నే అమ్మగా ఆరాధిస్తున్న నీ పిల్లలేమైపోవాలి చెప్పు అంటుండగా సుదర్శన్ ..

ఇంకా ఎక్కడి పిల్లలు ఈరోజుతో నా ఉద్యోగానికి ఆఖరి రోజు కదా ఇక అమ్మా అని ఎవరు పిలుస్తారు 

నాకెక్కడున్నారు పిల్లలంటూ హిమ కళ్ళు తుడుచుకుంటూ ఒక్కోపదాన్ని ఒత్తి పలుకుతూ అంటుండగా...

ఐతే మేము మీ పిల్లలం కామా అమ్మా అంటూ

ఓ పదిమంది యువకులు గదిలోకి వచ్చారు

వారిని చూడగానే హిమకు అంతవరకు అనుభవించిన బాధ కనుమరుగై ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది

మధు ,కిరణ్ ,రోహిత్ మీరెప్పుడొచ్చార్రా అంటూ రెండు చేతులు వారికోసం చాచి దగ్గరకు రమ్మంది.

అందరూ హిమకు దగ్గరగా వెళ్ళి నిల్చుని

ఈ అమ్మను వదిలి పిల్లలుండగలరా చెప్పమ్మా అంటూ మధు హిమజ పక్కనే కూర్చుని తన చేయి తీసుకుని ఈ చేయితో అక్షరాలు దిద్దించారు.. మరి ఆ చేయిని ఇప్పుడు వదిలి మేమెక్కడికి వెళతాం అమ్మా అంటూ బుజ్జగింపుగా అనేసరికి...

ఒరేయ్ మధు, నువ్వొక్కడే కాదురా అమ్మ కొడుకు మేము కూడా అని కిరణ్ ,రోహిత్ ,రాజేష్ ,జగదీష్  ఒకేసారి మధు భుజం పట్టుకు ఊపుతూ అనే సరికి

హిమజ కళ్ళలో ఆనంద పువ్వులు విరిశాయి.

ఆ దృశ్యం చూస్తున్న సుదర్శన్ గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

పదినిమిషాలు ఆ గదంతా నవ్వుల పరిమళంతో నిండిపోగానే హిమజ మనసులోని కలతంతా కలలా చెదిరిపోయినట్టనిపించింది.

ఏదో ఆలోచిస్తున్నట్టు హిమజ

అవును మధు నువ్వు నిన్న బాంబేలో వున్నానని ఫోన్లో  చెప్పావు కదా.. ఇక్కడికి ఎప్పుడొచ్చావు

కిరణ్ నువ్వు వైజాగ్ వెళుతున్నానని చెప్పి వెళ్ళావు కదా

రాజేష్ ,జగదీష్ ని అనుమానంగా చూస్తూ మీరు రామాపురంలో  కదా వుండేది

ఎప్పుడొచ్చారు మీరంతా అంటూ అందరినీ చూస్తూ ఒక్క సారిగా ప్రశ్నలేసింది

అమ్మా... అది అంటుండగా మధు

కిరణ్ ష్ అని సైగ చేయగానే..

సుదర్శన్ ముందుకు వచ్చి వారెంతగానో అభిమానించే అమ్మకు ఏమైనా ఐతే ఎక్కడున్నా రెక్కలు కట్టుకువాలిపోరూ అన్నాడు నవ్వుతూ.

ఐనా నాకేమైందని అంతగా కంగారు పడిపోయి

పిల్లలను కంగారు పెట్టారంటూ  చిరు కోపంగా విరుచుకుపడి   భర్తపై...

నాకు తలతిరిగి కిందపడటమే తెలుసు ,తర్వాత ఇంటికి ఎలా వచ్చానంటూ అనుమానంగా అడిగింది హిమజ.

ఊరంతా నీ పిల్లలే కదా హిమా....

ఆ పిల్లలే నిన్ను నాకు దూరం కాకుండా ఆదుకున్నారు.

మన వీధి చివర్లో వున్న టీ కొట్టులో పనిచేస్తున్న బాలు ,జోసెఫ్ ఇద్దరూ క్రింద పడ్డ నిన్ను చూసి అక్కడే హోటల్లో టేబుల్ పై పడుకోపెట్టి  నా దగ్గరకు పరిగెత్తి వచ్చి చెప్పారు. నేను అక్కడికి వచ్చేలోపు టీ కోసం వచ్చిన ఇంకో అబ్బాయి నిన్ను చూసి ఇక్కడున్నావేంటని తన కార్ లో ఆస్పత్రికి తీసికెళ్ళి అడ్మిట్ చేసి డాక్టర్ కు చూపించాడు. ఆ డాక్టర్ కూడా నీ బిడ్డే మరి అమ్మను కాపాడుకోలేడా క్షణంలో నీకు అన్ని పరీక్షలు చేసి

మానసికంగా ఒత్తిడి ఎక్కువైనందు వలన ఇలా అయ్యుంటది మరేం ఫరవాలేదని కాసేపు విశ్రాంతి తీసుకుంటే మామూలైపోతారని

నాకు ఫోన్ చేసి నేను అక్కడికి చేరుకునేంత వరకు  జాగ్రత్తగా చూసుకున్నాడు.

ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాం అన్నాడు సుదర్శన్ .

భర్త ఎంతగా తనకోసం ఆందోళనతో  తల్లడిల్లాడో తన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది హిమజకు.

హిమా రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుదాం అంటూ

అందరూ గదిలో నుండి బయటకు వచ్చారు.

రేయ్ కిరణ్ నువ్వు ఇక్కడే వుండు సార్ కు ఏ అవసరం వచ్చినా చూసుకో....

రేపు ఉదయం పది గంటలకల్లా అమ్మను తీసుకుని ఫంక్షన్ హాల్ కి వచ్చేయండి నేను అక్కడ ఏర్పాట్లు చూసుకుంటాను రాఘవ ఒక్కడే వున్నాడక్కడ అంటూ మధు చెప్పి బయలుదేరుతుంటే

మధు అని పిలిచాడు ...  సుదర్శన్

మధు వెనక్కు తిరిగి చెప్పండి సార్ అంటూ రెండు అడుగులు ముందుకు వచ్చాడు

సుదర్శన్ మౌనంగా వుండటం చూసి

సార్.... అన్నాడు

కిరణ్ రాజేష్ లు  తదేకంగా మధునే చూస్తున్నారు

సుదర్శన్ మధు చేయి పట్టుకుని సార్ కాదు

నాన్న అని పిలువండి అని అందరినీ దగ్గరగా తీసి గుండెలకు హత్తుకున్నాడు.

తన కళ్ళు చెమ్మగిల్లడంతో మాటలు రాలేదు

మధుకు.

మాకు పిల్లలు పుట్టరన్న దిగులుతో తనెక్కడ నాకు దూరమవుతుందోనని చదువు పై శ్రద్ధ పెట్టించి హిమజను

టీచర్ని చేశాను.. తను టీచర్ గానే కాకుండా  మీ అందరి మనసులను గెలుచుకుని అమ్మైంది . కానీ నేను నాన్న కాలేకపోయాను అంటూ కళ్ళనిండా నీళ్ళతో సుదర్శన్  మాట తడబడుతూ అంటుంటే

సార్ ,అంత మాట అనకండి మీరు మాకు తండ్రి కంటె గొప్పవారు. తల్లి దండ్రులను కోల్పోయి చదువు సంధ్యలు  లేక అనాథగా వీధుల్లో తిరుగుతుంటే అంత అన్నం పెట్టించి బడిలో చేర్పించింది మీరు అలాంటి మీరు మాకు తండ్రి కంటె ఇంకా గొప్ప స్థానంలోనే వున్నారు సార్  ,

తనను పక్కనే సోపాలో కూర్చోబెడుతూ

సార్మేమంతా మీరు పెంచిన పిల్లలమే

తల్లిదండ్రులని చూసుకోవడం పిల్లల బాధ్యత

మీరలా ఒంటరిగా వున్నామని మరెప్పుడూ అనకండంటూ తన చేతిలో భరోసాగా చేయి వేసాడు మధు.

సుదర్శన్ కు ఇప్పుడు మనసు తృప్తిగా అనిపించింది.





ఉదయం పదిగంటలు హిమజ రెడీ అయ్యావా పద పదమంటూ తొందర చేశాడు సుదర్శన్

ఏంటో మీ అవసరం.. ఎక్కడికో చెప్పరు

తిరిగి ఎప్పుడొస్తామో చెప్పరు.. మీకు తోడు కిరణ్ వాడి అర్జంట్ కి జెట్ విమానాన్ని నేను కాళ్ళకు కట్టుకోవాల్సిందే అంటూ హిమజ చెప్పులకోసం వెతుకుతుంటే సుదర్శన్ ఎదురుగా నిలుచుని హిమజనే చూస్తూ

ముదురు ఆకుపచ్చ రంగుపై సన్నగా లేత గులాబి రంగు బార్డర్ వున్న ధర్మవరం పట్టుచీర కట్టుకుని

నుదిటిపై ఎర్రటి మధురకుంకుమ దిద్దుకుని

చేతిలో ఎప్పుడూ నిండుగా వుండే మట్టి గాజులతో లక్ష్మీ దేవిలా వున్నావు హిమా... నా దిష్టే తగలుతుందేమో నీకు అన్నాడు కొంటెగా చూస్తూ...

ఆ... మరే ఇప్పుడు మీరు నాకు దిష్టి పెట్టాల్సిన సమయం పదండి మరి అనగానే వారిద్దరి సంభాషణకు కిరణ్ నవ్వుకుంటూ అమ్మా రండి అంటూ కార్ స్ట్రాట్ చేశాడు.

పదినిమిషాల్లో ఓ ఫంక్షన్ హాల్ ముందు ఆగింది కారు

హిమా దిగు ఇక్కడే ఫంక్షన్ అంటు తను దాగి డోర్ తీశాడు

హిమజ కారు దిగి  బయట చూడగానే పెద్ద హోర్డింగ్ పై తన ఫోటోతో పదవీ విరమణ శుభాకాంక్షలు

అమ్మకు అంటూ కొంత మంది పేర్లు.

ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిల్చుంది హిమజ.

మధు ,రాజేష్ హిమ దగ్గరగా వచ్చి అమ్మా లోపలికి రండి అంటూ స్వాగత తోరణాలతో ఇద్దరినీ ఆహ్వానించారు.

హిమజ లోపల చూడగానే నమ్మలేనట్లుగా వుంది తనకు

అమ్మా అంటూ అందరూ ఒక్కసారిగా తన చుట్టూ చేరారు

అందరూ తనకు దగ్గరైన వారే తన దగ్గర అక్షరాలు దిద్ది చదువు నేర్చుకున్నవారే.

హిమజ నోటి వెంట మాటలు రావడం లేదు

వారందరినీ అలా చూస్తూ వుంటె తన కళ్ళు ఇంకా నమ్మలేకపోతావుంది.సుదర్శన్ కు ప్రతి ఒక్కరినీ చూపిస్తూ వారి గురించి చెప్పుకుపోతోంది.

అందరినీ  పలకరించి కూర్చున్న హిమజకు ఎదురుగా రాఘవ ,రోహిణి కనపడ్డారు.

సుదర్శన్ వారిని చూపించి హిమా , ఈరోజు నీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ ఇక్కడకు వచ్చారంటె దానికి కారణం వాళ్ళిద్దరే అని చెప్పాడు.

రాఘవ రోహిణి మధు ముగ్గరూ హిమజను ,సుదర్శన్ ను స్టేజిపైకి తీసుకెళ్ళారు.

వేదికపైకి జిల్లా విద్యాశాఖ అధికారులు , హిమజతో పనిచేసిన ఎంతో మంది ఉపాధ్యాయఉపాధ్యాయినిలను అందరినీ ఆహ్వానించారు.

వేదికపై మధు మాట్లాడుతూ వందల మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయినిగానే కాకుండా  ప్రేమను పంచి

నైతిక విలువలతో విద్య నేర్పించిన మానవతా మూర్తి

మా జీవితాలలో వెలుగు నింపిన మహోన్నతమైన

వ్యక్తికి మేము ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. అందుకే తన దగ్గర అక్షరాలు దిద్దించుకుని ఆమె ప్రేమకు పాత్రులైన విద్యార్థులందరినీ పదవీ విరమణ మహోత్సవానికి ఆహ్వానించి

అమ్మ ఆశీస్సులు పొందాలని భావించామన్నాడు.

రాఘవ మైక్ తీసుకుని హిమజ దగ్గరకు వచ్చి ఆమె పాదాలను మొక్కి పైకి లేచి

అందరికీ నమస్కారం చేస్తూ

ఓ వీధి రౌడి కొడుకుగా ముద్ర పడినా ,నన్ను చదివించాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని  తల్లి దండ్రులున్న నేను వారిలానే పదేళ్ళు పెరిగాను.

చిన్న దొంగతనాలు చేసేవాణ్ణి . అలా దొంగగా పట్టబడ్డాను ఈ అమ్మకు.  ఎందుకూ పనికిరాని రాయిగా దొరికిన నన్ను రత్నంగా మార్చి ఈరోజు ఓ పెద్ద కంపెనీకి సీఈవోగా ఎదిగే సంస్కారాన్ని నేర్పించింది అమ్మ

అంటూ తన కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తుంటే ఇక మాట్లాడలేకపోయాడు రాఘవ.

హిమజకు ఎంతో ఇష్టమైన రోహిణి మాట్లాడుతూ

ఎనిమిదేళ్ళ వయసులో ఊరి చివర పాడుపడిన ఇంట్లో ఎవరో అత్యాచారం చేసి కొన ఊపిరి తో వదిలి వెళ్ళిపోతే

అమ్మనాన్న కనీసం నా దగ్గరకు  కూడా వచ్చి చూడలేదు, ఆ ఊరి బడిలోనే పనిచేస్తున్న ఈ టీచరమ్మకు విషయం తెలిసి  ఆస్పత్రికి తీసుకెళ్ళి నన్ను బతికించి నాకు బతుకు నిచ్చింది ఈరోజు నాలా బలవుతున్న ఎంతోమంది ఆడపిల్లలకు అండగా అడ్వకేట్ గా న్యాయం కోసం పోరాడేలా చేస్తోంది అమ్మ ఇచ్చిన స్ఫూర్తి మంత్రం.

ఇక్కడున్న ప్రతి విద్యార్థికి ఇలాంటి కథలే కానీ ఆ కథలో టీచరమ్మగా పరిచయమై అమ్మగా మాకు ప్రేమను పంచి  మార్గదర్శకురాలైంది.

అలాంటి అమ్మ కు రిటైర్మెంట్ ఎక్కడుంది

అందుకే మాలాంటి పిల్లల కోసం "హిమజ ఛారిటీ హోమ్ "ను ఏర్పాటు చేస్తూ అమ్మకు కానుకగా ఇస్తున్నామని

వేదికపై అందరూ చూస్తుండగా  రాఘవ ,రోహిణి ,మంజుల ,కిరణ్ ,మధులు

హిమజ సుదర్శన్ కు ఛారిటీ హోమ్ కు  సంబంధించిన డాక్యుమెంట్సును చేతికందించారు.

హిమజకు ఇదంతా కలలా వుంది...

తను నేర్పింది నాలుగక్షరాలే కానీ నాలుగు కాలాలు గుర్తుండిపోయేలా నిత్యం  భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ వారి పురోగమనానికి నాంది వాక్యం పలికింది.నీతి నిజాయితీలే మనల్ని మన బతుకుల్ని తీర్చిదిద్దుతుందనే మాటకు కట్టుబడి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగిన తన విద్యార్థుల్ని తన బిడ్డలుగా చూసి దేవుడిచ్చిన మాతృత్వంతో

గర్వపడుతున్నానని , తల్లిగా ఇంతకంటె ఇంకేం కావాలని

సంతోషంతో ఆనంద భాష్పాలతో ఉక్కిరిబిక్కిరై

నా వృత్తికి పదవీ విరమణ చేయగలను కానీ నాలోని అమ్మదనం నా శ్వాస చివరి వరకు వుంటుందని

తన్మయమై మాట ఇచ్చింది.

భర్త సుదర్శన్ తనకు భరోసాగా హిమజనే చూస్తున్నాడు

ప్రాగణంలోని విద్యార్థులందరి కరతాళ ధ్వనుల మధ్య  హిమజ హిమాలయ పర్వతమైంది.

************


 

 

కథలు

సాధికారికత

ఎడతెరిపిలేని వర్షం,ఆగకుండా గంట నుంచీ కురుస్తోంది. వేడివేడిగా వేసిన ఉల్లిపాయ పకొడీ తింటూ,మధ్య మధ్యలో వేడి వేడి టీ గొంతులోకి జారుతుంటే 'ఆహా!ఎంత హాయిగా ఉందో.                     పనిచెయ్యటానికి లక్ష్మి ఈ పూట ఇంకేం వస్తుంది.డుమ్మా కొట్టటం ఖాయం' అని స్వగతంలో అనుకోగానే మెరుపులా మెరిసిన యోచనతో కథకు సబ్జెక్ట్ దొరికిందని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది శ్యామల.

తను రాయబోయే కథకు "సాధికారికత" అనే పేరు అయితే సరిగ్గా సరిపోతుందని అనుకుంది. అనుకోవటమే తడవుగా కథను రాయటం ప్రారంభించింది శ్యామల. 

బాగా తలనొప్పి, ఒళ్ళునొప్పులుతో బాధపడుతూ లేవలేక పడుకునే వున్న శ్యామల బలవంతంగా కళ్ళు విప్పి పక్కనే ఉన్న సెల్ చేతిలోకి తీసుకుంది. 

"అమ్మో! అప్పుడే ఎనిమిదిన్నర అయ్యిందా" మంచం దిగుతూ అనుకుంది. 

హాల్లో న్యూస్ పేపర్ చదువుతున్న భర్త వంక చూస్తూ, "బాగా ఎండెక్కింది అయినా లేపలేదేమిటండీ. అవునూ,లక్ష్మి ఇంకా రాలేదా" అంది బ్రష్ చేసుకోవటానికి పెరట్లోకి వెడుతూ ఆగి. 

"లేదు శ్యామలా, ఫోన్ చేసింది. నీకు చేస్తే నువ్వు ఫోను లిఫ్ట్ చెయ్యలేదట. నాకు చేసింది. నీకు ఒంట్లో బాగుండలేదు పడుకున్నావని చెప్పాను. కాస్త లేటుగా వస్తా అయ్యగారూ అమ్మగారికి చెప్పమన్నది.నువ్వు మొహం కడుక్కురా హార్లిక్స్ కలిపి ఇస్తాను. కాస్త రిలాక్స్ అవుదువుగాని" అన్నాడు కిచెన్ వైపు వెడుతూ రామం. 

 'ప్చ్! నాకు బాగోలేని రోజే తను ఇలా చేస్తుంది. అదేమంటే కారణం రెడీగా ఉంటుంది ' స్వగతంలో అనుకుంటూ పైటకొంగుతో ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన భార్యకు పాలగ్లాసు అందిస్తూ

" సినిమా పాటల సుప్రసిద్ధ రచయిత భువన చంద్ర గారితో ముఖాముఖి కార్యక్రమం నీ కథల గ్రూపులో జరిగిందని పొద్దుటి నుంచీ తీరిక కుదరలేదనీ రాత్రంతా వింటూ లేటుగా పడుకున్నావుగా. పోనీలే పాపం పడుకోనీ అని లేపలేదు" భార్య పక్కన సోఫాలో కూర్చుంటూ అన్నాడు రామం. 

నిజంగా, అర్థం చేసుకునే మీలాంటి భర్త దొరకటం నా పూర్వ జన్మ సుకృతమండీ" అంది గ్లాసు టీపాయ్ మీద పెట్టి భర్త వంక ప్రేమగా చూస్తూ శ్యామల. 

    "ఎప్పుడు చూసినా కథలు, కవితలు రాసుకుంటూనో ,లేదంటే ఇలాగే ఏదో ఒకటి వింటూనో ప్రతి రోజూ అర్థరాత్రి ఒంటిగంట దాకా మేలుకుంటావు. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవదా చెప్పు. అదేమంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే నాకు ఆలోచనలు వస్తాయి . వెంటనే రాయకపోతే మళ్ళీ ముడిపడదు అంటావు" అన్నాడు పాలు తాగటం పూర్తవటం చూసి లేకపోతే రాణి గారు అలక వహిస్తారని.      

"సందు దొరికింది కదా అని బాగానే యుటిలైజ్ చేసుకుంటున్నారు. అమ్మో! మీరేం తక్కువ వారు కాదు ,సమయం కోసం కాచుక్కూర్చుంటారు " వాదన పెరుగుతుందని స్నానానికి వెడుతున్నానంటూ లేచింది. 

"తమరు మాత్రం తెలివిగా మాట అంటించి ఏమీ ఎరగన్నట్టు వెళ్ళటంలా ఎంతైనా రచయిత్రివిగా ఆమాత్రం తెలివి ఉంటుందిలే" కవ్వింపుగా నవ్వాడు రామం. 

గంజి పెట్టిన కాటన్ తెల్లచీరపై ఆకుపచ్చ రంగు లో రామచిలుకలు అంచు ఉన్న చీరలో మల్లెపువ్వులా మెరిసిపోతూ కిచెన్లోకి వచ్చిన శ్యామల బియ్యం కడగబోతున్న భర్తను చూసి , గబగబ చేతిలో నుంచి గిన్నెను లాక్కుని "చాలు చాల్లేండీ సంబరం, ఎవరయినా చూస్తే నవ్విపోతారు.అసలే మీకు మొదటి నుంచీ అలవాటు లేదు. 'చావు తరువాత లావు దుఃఖం'అన్నట్లు ఈ వయసులో మీరు చెయ్యి కాల్చుకోవటం నేను  కాలు మీద కాలు వేసుకుని దర్జాగా భర్తతో పనులు చేయించటం అవసరమా, పోనీ నేను పూర్తిగా లేవలేకపోతే తప్పదు మీకు. అయినా గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే బడలిక తీరింది" అని వంట చెయ్యటానికి ఉపక్రమించింది శ్యామల.  

రామం టీవీలో వార్తలు చూస్తూ హాల్లో కూర్చున్నాడు.

ఇంతలో ఎప్పుడు వచ్చిందో "ఇలా ఇవ్వండి అమ్మగారు నేను తరిగిపెడతా"పనిమనిషి లక్ష్మి చేతిలోంచి కూరలు తీసుకుంది తరగటానికి . పేరుకు పనిమనిషే గాని కడిగిన ముత్యంలా శుభ్రంగా ఉంటుంది . స్నానం చేసి చక్కగా రెడీ అయి వస్తుంది. సీజన్ బట్టి మల్లె , కనకాంబరం, కాగడా మల్లె, ఏదో ఒక పూలమాల తురమందే అసలు బయటికి రాదు . ఇంట్లో పిల్లలా కలిసి పోయింది. లేటుగా వచ్చి విసిగిస్తుందనే గానీ వస్తే మాత్రం పనులన్నీ చకచక చిటికెలో సర్ది పెట్టేస్తుంది . ఆలోచనలో వుండగానే దొండకాయలు, ఉల్లి, పచ్చిమిర్చి తరిగి ఇచ్చింది. 

"అమ్మా , మీరు రాసే కవితలు హృదయానికి భలే హత్తుకుంటాయి . కథలు కూడా జీవితంలోకి తొంగి చూసినట్లు చాలా బాగా రాస్తారు.మీకు ఆలోచనలు ఎలా  వస్తాయమ్మా" అంది లక్ష్మి శ్యామల వంక అభిమానంగా చూస్తూ. 

"అవునా, ఏదో నీ అభిమానం అంతే. సరేలే గానీ నీ కథ రాయనా " ఏమంటావు అన్నట్లు చూసింది లక్ష్మి వంక శ్యామల. 

"మా పేదోళ్ళ జీవితాలలో ఏముంటాయమ్మా! కష్టాలూ, కన్నీళ్ళు తప్ప" నిట్టూర్చింది లక్ష్మి. 

"సరేలే,నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నాగా. అదే రాస్తాలే"సముదాయింపుగా అంది శ్యామల. 

"అది సరేగానీ, ఆలస్యంగా వచ్చావేమిటి లక్ష్మీ" అడిగింది శ్యామల. 

"మన ఊళ్ళో పాపారావుగారి అమ్మాయి సుధ పెళ్ళి కుదిరింది. పెళ్ళికూతురికి  ప్రభుత్వం తరుఫు నుంచీ ముప్పై అయిదు వేలు ఇస్తారమ్మా . త్వరలో లక్ష చేస్తాము అంటున్నారు. డబ్బులు వస్తాయని పెళ్ళి కానుకకి అప్లై చేశారమ్మా. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుల వివరాలు తీసుకుని మొన్ననే పంపించాను. ఈ రోజు ఉదయం పెళ్ళి జరిగింది. పెళ్ళి ఫొటోలు తీయటానికి వెళ్ళాను. అందుకే ఆలస్యం అయ్యింది. ఒక పెళ్ళికి అయిదు వందలు వస్తాయమ్మా . ఇంకా పాత వాటికి కూడా ఇరవై వేలు దాకా రావాలి.మా ఆయనకు కూడా సరిగా జీతం రావటంలేదు. కరోనా వలన స్కూలు మూసేశారు కదమ్మా.వారానికి ఒకసారి రమ్మంటున్నారు. రెండువేలే ఇస్తున్నారు. ఇల్లు గడవటం కూడా కష్టంగా వుంటోంది. మీరయితే మంచిగా అర్థం చేసుకుంటారు. ఆమధ్య నాకు  పదివేలు బదులిచ్చారు కూడా. అప్పులు ఎలా తీర్చాలోనమ్మా" తన గోడు వెళ్ళబోసుకుంది లక్ష్మి. 

"అవునులే లక్ష్మీ ,ఏది ఏమైనా ఈ 'కళ్యాణమిత్ర' ఉద్యోగం వచ్చాక వెనకా ముందుగా వస్తున్నావనుకుంటే, మాస్కులు కుట్టటం మొదలుపెట్టాక పూర్తిగా ఎగనామం పెడుతున్నావు.చూడబోతే పూర్తిగా మానేసేటట్లు ఉన్నావు"అంది శ్యామల కొంచెం కోపం నటిస్తూ. 

ఏం చెయ్యనమ్మా, ఇక్కడ పని చేసుకుని వెళ్ళాక, ఇంట్లో పని కూడా చేసుకుని రోజుకి వందనుంచీ నూట యాభై దాకా మాస్కులు కుడుతున్నాను. ఒక మాస్కు కుడితే మూడు రూపాయలు చొప్పున రోజుకి కనీసం మూడు వందలు ఇస్తారమ్మా. మీరు కూడా కాస్త నన్ను అర్థం చేసుకోండమ్మా. చెయ్యలేకపోతే మానేస్తాను అంతే గానీ ,మీ ఇల్లు మాత్రం మానను. అంది లక్ష్మి. 

మధ్య నువ్వు కలెక్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ కూడా అందుకున్నావుగా. త్వరలో నీకు పరమనెంట్ అవుతుందిలే . మీ కష్టాలు తీరతాయి" అంది శ్యామల. 

"అసలు పని చెయ్యటం మొదలు పెట్టిందే మీ ఇంట్లో కదమ్మా. మా ఆయన ఎవరి ఇంటికి పనికి పంపడు. ఏదో మనింటికి అంటే మాట్లాడడమ్మా అంతే. మీది మంచి మనసు, మీ నోటి చలవన పర్మనెంట్ అయితే అదే పదివేలు అమ్మా" అంది ముక్తాయింపుగా లక్ష్మి. 

"పది ఏసీల కన్నా చల్లనైనది మంచి మనసు" అని భువనచంద్రగారు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.శ్యామలకు లక్ష్మి మాటలు వింటుంటే. 

పని పూర్తవగానే 'వెళ్ళొస్తానమ్మా' అని చెప్పి వెళ్తున్న లక్ష్మి నడకలో ఒక ధీమా తన కాళ్ళమీద తనే నిలబడే మహిళా సాధికారికతకు ప్రత్యక్ష సాక్ష్యంలా.తోటి వారికి తానూ ఆదర్శం అయ్యేలా.....

    

ఈ సంచికలో...                     

JAN 2022

ఇతర పత్రికలు