పొధ్ధాటి కల్లు వాసన కమ్మగా వోత్తాన, ఏ పుర్గు పుట్రో అచ్చి కుడ్తదన్న భయంతో, సలిని కప్పుకున్న శీకట్ని సూత్తు ఒక్కడే కంకిశేను కాడ వన్కుతూ కూసోని ఎదుర్సూత్త ఉండు జోసఫ్. సెకను ముల్లుల తన గుండె సప్పుడు ఒక్కటే కల్వరింత, పూర్ణ ఎప్పుడొత్తదా అని. ఈ ఎదురుసూపులు కొత్తేం కాదు, అయ్న ఆళ్ళు కల్శిన ప్రతిసారి ఒక కొత్త కలలా ఉంటది. సుట్టు శీకట్లో ఈదర గాలులు ఉక్కిరిబిక్కిరి సెత్తుంటే, డిశంబర్ నెలలో అచ్చె తూర్పు దిక్కు సుక్కలోలే, అంత సీకట్లో కుతం ఎన్నెల ఎల్తురొలే వొత్తాన పూర్ణను సూత్తు జోసెఫ్ "ఏమైంది ఇంతశేపైంది, ఇగ రావేమో అనుకున్న" అని అన్నడు. తన మాటల్ని పట్కోకుండా పూర్ణ అచ్చి జోసెఫ్ పక్కపొంటి కూసోని తన కొంగును ఇద్దర్కి కప్పుకుంటూ కండ్లల్ల నీల్లు నింపుకొని జోసెఫ్ని అల్లుకపోయింది.
పూర్ణ సుట్టూరా శేతులు పోనిచ్చి తనకి ఇంకా దగ్గర్గా లాక్కొని, "ఏమైంది" అని అడ్గిండు జోసెఫ్.
"మా మామ శెట్టుమించెలి జారిండే" అని తన లోపలున్న బాధనన్సుకుంటు సమ్దానమిచ్చింది పూర్ణ.
అవునా..! అసలు ఏమైంది నర్సి బాబాయ్కి అని అచ్చెరంతో మల్ల అడ్గిండు జోసెఫ్.
"సాయింకాలం మామ శెట్టెక్కి కల్లు లొట్టి దించ్తుంటే మోకు జారిందట, ఐతే ఎంబటే తాటిశెట్టును కర్సుక పట్టిన కుతం జర్ర జర్ర జారిపడి, మామ చాత్పొంటి, కొంకుల్పొంటి మల్ల జబ్బలపొంటి తాటిపేడ్లు గీర్కపోయి ఎర్రగా ఐంది అని ఏడ్తూ జెప్పింది.
తన శంపలపొంటి కార్తున్న నీల్లను తుడ్సుకుంటా జోసెఫ్ మరింత్గా పూర్ణను అముల్కొని తన నొసల్పై ముద్దునిత్తు, "ఇప్పుడైతే మంచిగనైతే ఉండు కద అని అన్నడు.
"హ కానీ, మా అవ్వ సచ్చిన్కానుండి నన్ను దెచ్చుకొని బిడ్డలెక్క సాత్తాండు, కన్నబిడ్డ అమ్ముల్ని గూడట్ల జూశ్కోలే. అయిన మా మామ శెట్లెక్కితే గాని మాయిల్లు గడ్వదు. అద్గాక రికాం లేకుండా ఏ పని దొర్కితే ఆ పన్కిబోతడు. అట్లాంటిది మావోనికేమన్నైతే ఏంగాను మా బత్కు" అని బదులిచ్చింది పూర్ణ.
జోసెఫ్ ఒక్కశార్గ పూర్ణలోని బాధను మర్శెలా గట్టిగా అముల్కొని పూర్ణ వొల్లంత తడ్ముతూ, ముద్దుల్తో తడ్పేశాడు. ఎచ్చగా జోసెఫ్ శేతులు తాకేసరికి పూర్ణ వొల్లంత అదిరి, తన ఆలోచలన్లన్ని దెంకపోయాయి. ఆ రాత్రిలో ఏకమయ్యి ఇద్దరు కల్శి మరో కొత్త కల కన్నరు. సూట్టురా ఎన్నో ఇసపు పురుగులు పూశున్న, ఆ కంకిశేను చీకట్లను మిన్గురేల్గులు శీర్తుంటే, ఊపిరి తీశ్నట్లైతున్న సలిలో ఈదర గాడ్పులు గూడ ఎచ్చగా అనిపిత్తాంది యిద్దరికిప్పుడు. ఆ కలయ్క రేపిన ఆయితో పూర్ణ "బావ మనం మన కులాల్ని కాదని కల్తానం కద, రేపీళ్ళు మనల్ని ఒప్పుకుంటరంటవా" ? అని అడ్గింది.
"అస్సలు ఒప్పుకోరే"
"మరి ఏం జేద్దామే, నేనైతే నిన్ను ఒదిలి బత్కలేను బావ, ఎటైనబోయి బత్కుదామా"
"నాగ్గుత అట్లనే అనిపిత్తాంది గానీ, మా ముసల్లోలను సూత్తనే బయమేత్తాంది. మా అవ్వాయ్య లేకున్నా నన్ను ఇంతటోన్ని జేశిర్రు, నే ఏటన్నబోతే ఆళ్ళేం గావలే అని గొంతులో గుట్కెత్తు జోసెఫ్ మొఖం మాడ్చిండు.
పూర్ణ, మాడ్చిన జోసెఫ్ మొఖాన్ని శేతుల్తో తుడ్తూ తన చెంపల్పొంటి ముద్దిచ్చి, "కొన్ని దినాలెలే మల్ల ఇటే అద్దాం.
సరే మరి నేన్బోనా అచ్చి చాలా సేపైతంది" అని అన్నది.
"సరే మంచపో"
*
ఊళ్లే పొద్దెక్కగానే పనారాటంతో ఎక్కడోళ్ళు అక్కడ్కి బోయిండ్రు. అట్లనే గొర్లను కొట్టుకుంటూ బాషి, జోసెఫ్ని ఎంబడెట్టుకొని ఊర్దాటి శాన దూరమచ్చిండ్రు. నెత్తి మీద ఎండ సుర్రుమంటు ఎన్ను తాక్తుంటే జోసెఫ్ శిరాక్తో "ఏమే బాషన్న మంచ పన్నోన్ని ఈ ఎండల తిప్పబడ్తివి".
"ఏమ్రా అయ్సు పొరడు పొద్దెక్కేదాక పంటర్రా" అని ఎక్కిరిచ్చిండు బాషి.
"గదంత గాద్గాని గిప్పుడు నీ గొర్లతోబాటు నన్నెంద్కు దోల్కచ్చినవో గద్జెప్పు" అని మల్ల గదే శిరాక్తో అన్నడు జోసెఫ్.
"ఉచ్చాగ్దార , జేప్పెదాక ఇనవ్ ఇటిను మొదాలు, మీ అయ్య నేను సొంత అన్నదమ్ముల్లెక్క ఊళ్లే తిరిగేటోళ్లం, తాగేటోళ్లం. కానీ, మీవోడు కొత్వాల్ దొరోడి బాయి పన్కిబోయి సచ్చిన్కానుండి నాకు నిమ్మలం లేద్రా. ఆరోజు మస్త్ లొల్లి జెశ్నగనీ, ఆడి దొరతనం ముందు నేచెల్లలేద్రా" అంటు కండ్లకత్తాన నీల్లను తుడ్శుకుంటూ "ఐతే ఇయ్యాల కోన్ని కోశ్నరా, మీ అయ్యకు పెట్టలేన్గా, కనీసం నీకైనా ఇంత పెడ్దామని దిస్కచ్చినరా" అని సద్దిని జూపిత్తు అన్నడు.
బాషి మాటల్కి జోసెఫ్ కత్తాన బాధనన్సుకుంటు, "ఊకోయే బాషన్న బోయినోళ్లు మల్లాత్తర" అని సమ్దాయిత్తు "సరే దిందాంబ" అంటూ పక్కనే ఉన్న తుమ్మశెట్టు కిందకు దిస్కపోయిండు.
యిద్దరి నెత్తికున్న తువ్వాల్నిప్పి తన శెమట మోకాన్ని తుడ్తుంటే అత్తాన వేడి గాడ్పులు కుతం దాక్గానే ఒళ్ళంతా ఆయిగనిపించి ఎన్కకు ఒర్గి కండ్లు ముస్కుండ్రు. గప్పుడు జోసెఫ్ పక్కకి బాషి దిర్గుతూ "అరె చిన్న ఒక పాట పాడ్రాదురా" అని అడ్గిండు.
"నీకెట్ల ఎర్కనే నే పాడ్తని" మూశున్న కండ్లను తెర్తు అడ్గిండు జోసెఫ్.
"ఎహే నాకెంద్కు దెల్వదురా ఆరోజు మీ కిస్మస్ పండ్గరోజు బీరు సాయిబోళ్ల యింటి కాడ స్టేజేశి అది.., అది,
దాన్నేమంటార్రా" ?
"అదానే, గిటార్".
ఆ అదే దాన్ని వాయించ్కుంటా స్టేజి మీద నువ్వు పాడ్తాంటే సిన్మాలా హీరో లెక్క కొట్టినవ్ పో" అని మస్త్ సంబ్రపడ్డాడు బాషి.
ఒర్గినోడు లేశి సకులం ముకులం పెట్కొని "అవునానే అన్న" అని అడ్గిండు జోసెఫ్.
"అవున్రా, ఆ మీటింగ్ నడ్తాంటే మొత్తం ఆడపొరగాళ్ల కండ్లల్లా మొత్తం నువ్వే మెదిలినవ్. అది జూశి ఊళ్లే ఎంత మంది కుల్లుక సచ్చిండ్రో" అని అంటూ "నాకోసం ఓ పాట పాడ్రా" అని మల్ల అడ్గిండు బాషి.
ముశి ముశి నవ్వుకుంటా "సరే అన్నం దిన్నంక పాడ్తలే" అని జోసఫ్ లేశి ఎంటదెచ్చుకున్న బాటిల్ నీల్లతో శేతులు కడ్కుండ్రు ఇద్దరు.
*
"అరే జోసెఫ్ గిప్పుడన్న పాడ్రా" అని బాషి అయిపోయ్న సద్ది డబ్బను డొల్లేక్క కోడ్తుంటే "జీవనదిని నా హృదయములో" అంటూ ప్రభువు పాటనెత్తుకుండు జోసెఫ్.
ఇంతకు మున్పు డోలు కొట్టిన అన్భవంతో బాషి మార్శి మార్శి కొడ్తుంటే, జోసెఫ్ పాటలు మార్సుకుంటబోతూ యిద్దరు పాటల్లో మునిగిబోయిండ్రు.
"దెలికుండానే శాన సేపయ్తాంది, ఇగబోదాంబ" అని లేశి గొర్లను మల్లెశిర్రు యిద్దరు. ఎన్నో ముచ్చట్లు ఎట్టుకుంటూ, నవ్వుకుంటా, చూశేటోళ్లకు ఒక్కింట్లోల్ల లెక్కకొడ్తు బోతావుంటే, శేరువు కట్ట మీద పోడ ఎండ సొగసుకు శెమట సుక్కలద్దినట్లు ఈపంత మెర్తుంటే కట్టెల మోపెత్తుకొని, పిల్లకాలువంకోలే నడుమంకను తిప్పుతూ నడ్తాంది పూర్ణ.
ఆళ్ల మాటలిని పూర్ణ ఎన్కకు ఒక్కశార్గ తిర్గి జోసెఫ్ని జూత్తు ఓ నవ్వు నవ్వి ముంద్కుబోతుంటే, జోసెఫ్, పూర్ణ కండ్లాంకలను, నడుమంకను జూశి తన కాళ్ళ అడుగుల్కి వంకలు పడ్డాయి. ఇందంత జూత్తాన బాషి "ఏడిదాకచ్చిందిరా మీ కత" అని అడ్గిండు.
జోసెఫ్ అదిర్బడి పూర్ణ మత్తులోంచి బయటకత్తు "నీకెట్ల దెల్సునే" అని అచ్చెరంతో మల్లదిర్గి అడ్గిండు.
బాషి పక్కకు బోతున్న గొర్లను మర్రెత్తు "నాకు బోనాలప్పుడే దెల్సుర వారి, మా పండుగల్కి నేనెప్పుడు పిల్శిన రానోడివి, ఆరోజు ఆపోరి చిల్కల బోనమెత్తుకొని వొత్తాంటే ఎన్కేన్క నువ్వు ఎగిరేగిరి జూశినప్పుడే సమజైంది నాకు" అని జేప్పిండు.
బాషి మాటల్కి జోసెఫ్ శిగ్గుపడుతూ, నవ్వుకుంటా బాషిని హత్తుకుండు. ఎంబటే "భయంగల్ల కోడాట బదాట్ల గుడ్డెట్టినట్టు, శేశిందంత శేశి గిప్పుడు శిగ్గుపడ్తానవారా" అని నవ్వుకుంటా అండు బాషి.
"అద్గాదే బాషన్న అసలు ముచ్చట, మా పెళ్లి ఐతదా ? అని బయమైతందే" అని నవ్వుతున్న మోకాన్ని మాడ్శి జెప్పిండు జోసెఫ్.
"నీకేందక్కువరా, మంచ సదువ్కున్నావ్, రేపో మాపో నౌకరైతది. వాళ్ళోళ్ళు ఒప్పుకోకపోతెం మీరే ఏటన్నబోయి పెళ్లి జేసుకోనచ్చి, పోలీస్ స్టేషన్లో కూసొండ్రి" అని సలయిచ్చిండు బాషి.
బాషి మాట్లాడుతాంటే గమ్మునుండి సోచాయిత్తు నడ్త ఉండు జోసెఫ్. పర్తితి బాష్కి సమజై జోసెఫ్ కాడ్కిబోయి ఎన్కనుంచి ఎన్నుమీద నేనున్న అన్నట్లు రెండు దెబ్బలేశి "బోయి ఆ పిల్లతో ఏమన్నా మాట్లాడుబో" అని ముంద్కు దోశిండు బాషి.
గొర్లను దాట్కుంటూ జోసెఫ్, పూర్ణ కాడ్కి రాంగానే పూర్ణ ఒక్కశార్గ అదిర్పడి "అబ్బా..! నువ్వుబోయే బావ ఎవల్లన్న జూత్తరు" అని బయంతో అన్నది.
"అద్గాదే నే జెప్పేదీను" అని ఏదో జెప్పబోయిండు జోసెఫ్.
"జెప్పేదేంలే, చీకటైనాక కల్దాం గాని మొదలూ ఈన్నుంచిబో" అని ముంద్కు దన్న దన్న బోయింది పూర్ణ.
బాషి ఆళ్ళిద్దరిని సూత్తు "అరేయ్ గిట్ల బయపడ్తే, రేపు మీ రెండు కులాల పెద్దమనుషుల్ని ఎట్ల ఎదుర్కుంటరు, మీ పెళ్లెట్ల జేసుకుంటరు" అని నవ్వుతుండు.
"అట్లేం లేదే, ఆళ్ల మామ సూత్తడన్న భయం తప్ప, నేనంటే మస్త్ ఇష్టమే ఆ పిల్లకి, నాగోసం ఏమైన జేత్తది" అని అన్నడు జోసెఫ్.
"సరే ఊకే గదె సోయిలుండకు, ఎట్లాయ్యేది గట్లనైతది గాని ఇగ నువ్వు ఇంటికిబో పొద్దుబోయింది" అని జోసెఫ్ ధైర్నం జెప్పుతూ పంపిండు బాషి.
మాపటెండ కుంకుమ్బుసుకోని సన్నగా ఒంటిమీద పడ్తాంటే, రూమల్సుట్టుకొని ఇంటికెళ్తున్నా జోసెఫ్ని జూత్తు "ఈ పొరగాళ్ళు కులాలు కాదన్న కలలా బత్కుతాళ్ళు, రేపీల్లా ముచ్చట ఊళ్లే తెల్తే ఎంత పెద్దలొల్లయింతదో" అని బాషి మెదడ్ల దిర్గుతూ, ఏమైనగాన్ని గానీ పొరగాన్కి ఏం గాకుండా కాపాడ్కోవాలే" అని మన్సుల అన్కుంటూ గొర్లను ఇంటికి తోల్కబోయిండు.
*
జోసెఫ్ ఇంటికచ్చి గోలెంకాడ కాల్శేతులు కడ్కోని ఇంట్ల అడ్గెట్టెశరికి, సలికాలం పొద్దునచ్చె పొగమబ్బులా ఇల్లంత సుట్టపోగతో నిండుంది. "ఓ ముసల్లచ్చి, నువ్వన్న నీ మొగన్కి జెప్పాల్సిందిబోయి, ఇద్దరు కల్శి గుప్పు గుప్పుమంటూ సుట్టతాగుతాల్లా? ఇగ సూడు ఇల్లంత మీ సుట్టపోగతో అసలేం అవుపడ్తలే" అని మొత్తుకుండు.
ఇద్దరు ముసలోళ్లు ముశి ముశి నవ్వుకుంటా "ఇట్రారా అయ్యా" అని శేతుల్శాశి జోసెఫ్ని పిల్శింది లచ్చి.
జోసెఫ్, లచ్చి కాడ్కి రాంగానే తన రెండు శేతుల్తో జోసెఫ్ మోకాన్ని దీస్కొని ముద్దునిత్తు "అరయ్య నీ అవ్వయ్యలు కాలం జేశినాక నిన్నే కండ్లల్లబెట్టుకోన్ని బతుక్తున్నంరాయ్యా" అని నీల్లు దెచ్చుకుంది.
"ఇగ ఊకొయే అవ్వ, ఏదో సుట్టవాసోనోచ్చి అన్న మల్లగిట్ల ఏడ్వకు" అని అన్నడు జోసెఫ్.
"సరే బిడ్డ ఏడ్వనుగాని సుట్ట ఆరిపోయ్నట్టుంది, ఇంత నుప్పు దెచ్చియ్యారయ్యా" అడ్గింది లచ్చి.
"దోశ్ బో, మీరు మారారే ఇగ" అంటూ జోసెఫ్ బయటిక్తాంటే "అరే పిలగా నీగోసమని వట్టితున్కల కూర అండిన్రాయ్యా ఎటుబోతనవ్, ఇంతదింద్వురా" అని పిల్శింది లచ్చి.
"దెహె బో మీ సుట్టపొగ బోయేదాక నే తిన" అన్కుంటూ యింటి ముందు కూసుండు జోసెఫ్.
సాటింపు జెప్పే పెద్దమనిషి కట్టన్న సైకిల్ మీద జోసెఫ్ కాడ్కి ఆగమాగం వొత్తాంటే "ఏమే పెద్దయ్య ఇట్గిట్ల బాట పట్టినవ్ ఏమన్నా అయింద ఏంది" అని అడ్గిండు జోసెఫ్.
"అవునాయ్య కొత్వాల్ సారోత్తండట, మన నాల్గువాడల పెద్దమనుషుల్ని, జనాల్ని, అందర్ని గిన్నెశెట్టు కాడ్కి రమ్మన్నరు. అందరు ఆన్నే ఉన్నరు, మిగిలినోళ్ళకు జెప్పుకుంటా నీదాకచ్చిన ఆడ్కిబా" అని అన్నడు కట్టన్న.
"సరే వత్తనబాయే" అని జోసెఫ్ జెప్పగానే కట్టన్న ఆడ్నుండి బోయిండు.
"కొత్వాల్ దొరంటే ఈ సుట్టుపక్కల ఆయిన్ను కాదని ఏ పనిగాదు, ఏ కాంట్రాక్ట్ ఐన అయినే పట్టాలి, ఏ ఇక్కటోచ్చినా అయినే తీర్వాలి. ఊళ్లేగూడ ఏ కులన్కి పెద్దమన్శి ఎవడున్న పెద్దరికమైతే కొత్వాల్దె. ఆయిన్ను కాదని ఏ కులపొడు ఏపని జెయ్యడు, కాదన్నోన్ని జూశిన దాకల్లేవు గూడ. ఒకేలుంటే ఆడి సంగతేందో జెప్పేదాక ఊకోడు. అందేందోగాని కొత్వాల్ ఇన్నిజెత్తున్న ఒక్క కేసుగూడ కాలేదు. అయిన అచ్చిన ప్రతాఫీసర్లు, పోలిసొళ్ళు కొత్వాలిచ్చే దావత్లా మున్గుంతాంటే ఎట్లా ఐతది. అసోటోండు మా వాడక్తాండంటే ఏదో పెద్దపనే ఉంటది" అని మన్సుల అన్కుంటూ గిన్నెశెట్టు కాడ్కి నడ్తాండు జోసెఫ్.
*
గిన్నెశెట్టుకాడ అందరూ కొత్వాల్ కోసం ఎదురుజూత్తాల్లు. ఆ గుంపులోంచి రమేష్ గిన్నెశెట్టు గద్దెకాడ్కిబోయి నిలబడ్డాడు. "అసల్కి కొత్వాల్ దొర ఎందుకు పిల్శిండు" అని నాల్గు వాడల మంది అంత ఆడ ఈడ మోపై ముచ్చట్లు యెట్కుంటాళ్లు. రమేష్ ఆ ముచ్చట్లన్నింటిని బంజేత్తు ఒక్కశార్గా "దోశ్ మనకు పని లేదన్కున్నాడు ? మనమచ్చి గింతసేపైతున్న రాడేమే ఈ దొర అనేటోడు" అని అన్నడు.
"ఏంరో దొరను గట్ల అంటన్నావ్, నీ లెక్కనార ఆయిన్కి వంద పనులుంటయ్" అని గద్దెమీద కూసున్న పెద్దమన్శి లేశి అన్నడు.
"ఓ పెద్దమన్శి ఎవన్కే దొర, మీగావచ్చు మాగాద్, అయిన మాకుతం మస్త్ పనులున్న ఒదిలి పెట్టుకొనచ్చినం" అని రమేష్ మాట్లాడ్తుంటనే కొత్వాల్ కార్ అచ్చాగింది.
గిన్నెశెట్టుకాడ్కి కొత్వాల్ తన మన్శులతో దిగ్గానే వయిస్సుబడ్డొల్లేమో లేశి దండలేడితే, నడీడుల్లోలేమో అట్లనే నిలబడి సూత్తున్నరు. ఐతే ఎంబటే పెద్దమన్శి కట్టన్న తన నెత్తికున్న రూమల్దీశి, ఉరుక్కుంటబోయి కూర్చి తెచ్చేశిండు.
గప్పుడే జోసెఫ్ గుంపులోకచ్చి సూత్తాండు ఏంటాని, తనకేం సమజ్గాక గద్దెమించెలి దిగ్తున్న రమేష్కి సైగ జేశిండు. "ఏమో దేల్వదు" అని జబ్బలేగరేసుకుంటు మల్ల సైగ జేశిండు.
గమ్మునున్న వాతవర్ణాన్ని పలగ్గొడుతున్నట్లు కొత్వాల్ "ఇగో అందరూ ఇటినండి, పైనున్న సర్కారోళ్లతోని, పార్టోళ్లతోని కొట్లాడి మరి తీస్కచ్చిన, ఇంకో మున్నెల్లోచ్చె ఎన్నికల్లో మీదాంట్లోనే ఒకడు మనఊర్కి సర్పంచ్" అని మాట్లాడ్తుండగా కింద మంది గట్టిగా సప్పట్లు కొట్టారు.
"ఆగండి ఆగండి, ముందు నే జెప్పేది ఇనుర్రి" అని కొత్వాల్ జనాలనాపుతూ, "ఐతే రేపు గ్రామస్థాయి ఎన్నికల మీద పార్టీ మీటింగుంది. దానికోసం MLA సారత్తండు, దీన్కోసం ఒక ఇరవై డప్పుల్దెచ్చిన, అవేవలు గొడితే వాళ్ళకే, ఒకపక్క డప్పులు నడ్తాంటే ఇంకోపక్క ఆడోళ్ళు కోలాటాలెయ్యలే, ఎశ్నందుకు రెండొందలు, మీటింగ్కుచ్చిన ఒక్కో మన్శికి వందరూపాల సోప్పున ఇత్తం. మీగోసం కొట్లాడి మరింత జేశినందుకైనా మీ అందర్రావలె" అని మందిని నాన్పుతూ మాట్లాడ్తుంటే,
"ఎహే ఆపే అన్న, ఏం జేశినవ్ నువ్వేదో బగు జేశినట్టచ్చి మాట్లాడ్తానవ్" అని కిందున్న మందిలోంచి అన్నడు రమేష్.
అక్కడ మొత్తం నిసబ్దం అల్ముకుంది. రమేష్ మాటల్కి ఏమైతదాని అమ్మలక్కాలందరు సూత్తాండ్రు. కొత్వాల్ నింపాదిగా కూసుంటు "ఏంరా రమేశ్గా, నీయన్ని తండ్లబడె మాటలేనరా, నేనేం జెశిన్నో మీ పెద్దమన్శుల్ని అడ్గుర, అదికుతం శాతకాకపోతే, మీరు శెర్వుశికం కాడ దున్నుతారే ఆ భూమ్లేవరిచ్చిండ్రో దెల్సుకోర" అంటూ గుర్రుగా సూత్తు దొరమధంతో అండు.
ఆడమోపైన మందిలో కొందరు రమేష్ని సూత్తు నవ్వుతాంటే ఏం మాట్లాడాలో ఆన్కి అర్ధంగాలే. పెద్దమన్శుల్లో ఒకలు లేశి "మాట్లాడేటోన్ని మాట్లాడనియ్యకుంటా నడిమిట్ల నీ లోల్లేందిరా" అని కోపంతో కొత్వాల్కు వత్తాస్ బల్కిండు.
రమేష్కి మొకం లేకుండ బోయిందాడ. మొత్తం గమనిత్తాన జోసెఫ్ "దెహే మీకేమన్న సమజైతాంద ఐనా మనలందర్ని ఎడ్డిగుద్దోళ్లను జేత్తాండు. ఆ శెర్వుశికం భూమ్లన్ని అసైండ్ భూమ్లు, అవేం ఆళ్ళ అయ్యా జాగిరేంగాదు" అంటూ రమేష్కి వంత బల్కిండు.
కొత్వాల్కి జోసెఫ్ మాటలన్ని తన్నినట్లై, కోపంతోని "ఏంరా కట్టయ్య నేనేం జెశిన్నో మీకు దెల్వదార, గిప్పుడు ప్రతోడ్కి నే జెప్పల్లారా" అని ఎగేశిండు.
"దొశ్ పోరగ, ఏం దెల్సురవారి నీకు, నిన్నమొన్న మొల్శినోన్వి బగు దెల్సినట్లాత్తనవ్, నడువ్ ఈన్నుంచి" అని దొర మెప్పుబొందనికి గద్దెమించెలి లేశి అన్నడో పెద్దమన్శి.
గిన్నెశెట్టు మీద పిట్టల సప్పుళ్ళు తప్ప ఏం ఇనబడనంత నిసబ్దంగుంది వాతావర్ణం. ఏమైతదాని మందిలో ఉచ్చిలు పెర్గుతుంటే, నే జెశ్నా ఇకమాతు పనిజేశిందన్నట్లు ముశి ముశి నవ్వుతుండు కొత్వాల్.
"అవ్ నాకేం దెల్సు, ఐనగాని, ఇంకెవలన్నగాని ఇంత ఇత్తె లొట్టల బోసుడుదప్ప" అని పెద్దమన్శి అన్న మాటల్కి ఎదుర్గుల్లిచ్చినట్లు మాట్లాడిండు జోసెఫ్.
ఆడైతున్నా యవ్వరాన్కి అమ్మలక్కాలందరు నవ్వుతూ సూత్తాంటే, పెద్దమన్శికి ఇజ్జత్ బోయినట్లై, ఇగ కోపంతో "ఏం రా ఏమన్నావ్" అని జోసెఫ్ మీద్కి ఉరికిండు.
ఒక్కశార్గ ఆడోళ్ళందరూ జోసెఫ్ కాడ్కి అమంతామచ్చి "ఏమయ్యా గిదేనా నీ పెద్దమన్శితనం, ఏమో పొరన్మీకీ బాగా ఉరికత్తానవ్" అని మన్శికో మాట అందుకున్నారు.
"మరి ఆడన్నది" మంచిగున్నదా ?
"మరి మీరు ఎవ్వల్కాడ ఏం దీస్కోకుండా, ఊకనే పంచాయితిలు జేశిర్ర ?" అని ఏంగాకుండా జోసెఫ్ని పట్టుకుంటు అన్నది.
పక్కనున్న రమేష్ ఈ లోల్లంత ముదురుతదేమోనని "ఓ ఆగే పెద్దమన్శి, ఎందుకంత ఆగమైతనవ్, మీతో లొల్లి పెట్టుకోనికేం ఉండలే ఈడ. ఒక్కశారి జోసెఫ్ గాన్ని మాట్లాడనియ్యి మీకే తెల్తది" అని మద్యలచ్చిండు.
పెద్దమన్శి అందరి మాటల్కి ఎన్కకు బోగానే "అరేయ్ నువ్వుబోయి మాట్లాడురా" అని జోసెఫ్ని రమేష్ ముంద్కు నెట్టగానే, జనంలో శానమంది కుతం మాట్లాడమని కోరిర్రు.
జోసెఫ్ ఛాతినిండా గాలి పీల్సుకొని, గిన్నెశెట్టు కాడ్కి బోతావుంటే కొత్వాల్కి ఎక్కడ్లేని కోపంతో సూత్తు పక్కకి జరిగిండు, ముందు కూసున్న పెద్దమన్శులు లేశి నిలబడ్డరు. నిసబ్దం సింగరించుకొని కూసున్నట్లు వాతావర్ణం అముల్కొని గద్దెమించెలి దిక్కుజూపే మోషేలెక్క జోసెఫ్ అగుపడ్తాంటే, అందరూ కండ్లు మిట్కలెయ్యకుండా సూత్తవుండ్రు.
*
తన పనులన్ని ఒడగొట్టుకొని జోసెఫ్ కోసం కంకిశేనుకాడ కూసోనుంది పూర్ణ. సుట్టు శీకట్లు కమ్ముకొనత్తాన ఈదర జోసెఫ్ కౌగిలోలే తన ఊపిరి ఆపేత్తానయ్. కంకిశేనంత పురుగుల మోతల సప్పుళ్ళున్న, పూర్ణకింతైన భయం లేదు, ఉన్నదల్లా ఎదుర్జూపే జోసెఫ్ ఎప్పుడోత్తడని.
పూర్ణ తన్వంత ఎచ్చగా కోరుకుంటుంటే, తన కొంగును తానే హత్తుకుంటూ, జోసెఫ్ శేతులు తాక్తున్నట్లుగా తల్సుకుంటా, "ఇంక రాడేంది" అని తనలో తానే మాట్లాడ్తాంది.
తన మెడోంపులపోంటి కార్తున్న శెమట సుక్కలు చెక్కలగుల జేత్తాంటే, మొదటిశార్గా ఆళ్ళు మాట్లాడ్కున్న ప్రేమ మాటలు గుర్తు జేత్తానయ్.
"బావ, నేనంటే ఎందుకంత ఇష్టం" అని పూర్ణ అడుగంగానే, జోసఫ్ తన దగ్గరగచ్చి, తన నడుంమీద శేతులేసి గుంజుకొని, ఒకరి మొసలు ఒకరికి తాక్తుంటే "ఎండిన ఎముకలకు యెహోవా జీవం పోశినట్లు, నువ్వు నాలో ప్రేమకు ప్రాణం పోశావ్" అని పోలికెడ్తూ ఇచ్చిన ముద్దును తల్సుకుంటా, పంటికింద పెదవిని నల్పుతా నవ్వుతాంది. ఆళ్ళు జేశ్నయన్ని కలల గుర్తుకత్తంటే ఒకింత ఆయిగున్న, మరోదిక్కు కల్వర పెడ్తాంది.
"అసలు ఏంది ఇది, ఎందుకిన్ని కులాలు? ఎంచక్క మన్సులందర్కి ఒక్కటే కులముంటే మస్తుండుగా, గప్పుడు మమ్మల్ని ఆపేటోళ్లే ఉండరు. అయ్యా దేవుడా, మమ్ము కల్పినోడివే ఏ లొల్లిలేకుండా మా పెళ్లి అయ్యేట్టు చూడు దేవా, ఐన ఎంబటే ఎములాడ కచ్చి నీ మొక్కు తీర్సుకుంటా" అని కోర్కుంది.
"ఈ మన్శికి ఏం ఆయే, నా మీద సోయి ఉందా? ఇంక రాడేంది" అని సూట్టురా సూత్తు అక్కడ్నుండి లేశి, మబ్బుల మీద ఎన్నెల అలిగినట్లుగా, పూర్ణ అలిగి ఎల్లింది.
*
సల్ల సలేడుతున్న, దోమలచ్చి శిట్ట శిట్ట కుడుతున్నా జనం ఓపిగ్గా జోసెఫ్ మాటల్ని ఇంటాళ్లు.
"జూశిర్రా శీకట్కాంగానే ఎవలం, ఎవల్కి అవ్పడ్తలేం. అస్సల్ గిప్పుడే గాదు ఎప్పటికుతం, మన వాడలు ఈళ్ళకి ఊరిలెక్క అవ్పడవ్. లైట్లు లేవ్, కాలువల్ లేవ్, రోడ్లు లేవ్. వర్షమత్తె సాలు వర్దంతా ఇండ్లల్ల కత్తంటే, ఊళ్లే కుక్కల్లెక్క బుర్దలో ఒకళ్లకోకళ్ళం నీల్లాత్తనయని కొట్లాడ్కుంది మర్శిర్రా. గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తం, మాగోసం డప్పుల్ కోట్టుండ్రి, కోలటాల్లేయ్యండ్రి అంటే ఎంబటే పోనికి గింతన్న ఇజ్జత్ ఉండాలే మనకి. ఆడెవాడోత్తే మన అమ్మలక్కలేందుకు ఆన్ముందు ఆడాలే, అంతగనం కావాలంటే ఆళ్ళ ఇండ్లళ్ళున్న ఆడోళ్లతో ఎయించుకోవచ్చుగా, మనమెందుకేయ్యలే" అని జోసెఫ్ అందర్కి జెప్తుంటే, కొత్వాల్తో అచ్చిన మన్శి కిరణ్ మధ్యలచ్చి ఆపిండు.
"ఏంరా, చిన్న పొరన్వని అని సూత్తాంటే, శానెక్కువ మాట్లాడ్తున్నావ్, ఊకనే ఎత్తాల్ల పైశల్ దీస్కుంటలే"?
ఆన్మాటల్కి జోసెఫ్కి బగ్గ కోపమచ్చి"ఇగో జూశిర్రా, ఆళ్ళేం అంటుర్రో. గిప్పుడా పైశల్గోసం, ఆళ్ళు ఆడమందల్లా ఆడితే, మనకి ఇలువుంటాద? అసలు ఊరంత సర్పేశి కడిగినట్లుంటే, ఆ కడిగిన నీళ్ళన్ని మావాడల కత్తనయ్యని ఎన్నిసార్లు గ్రామపంచాయత్కి బోయి జెప్పిన, మాకేదన్న పన్జేయండ్రని ఎంత మొత్తుకున్నా మొకం జూశినోడ్లేడు గాని, గిప్పుడచ్చి సర్పంచ్ జేత్తడట, ఆ సర్పంచ్ ఎవ్వడో గాని ఈ కొత్వాల్ శేప్పులు తుడ్శెటోడే అత్తడుగాని, ఏరేటోడు రాడు. అందుకే జెప్తనా మన్మందరం ఒక్కట్గావలే, మన బత్కులు ఎవ్వడ్ మార్వడు, మనమే మార్సుకోవాలే. గి దొరనేటోన్తోనేం లేకుండా మన సర్పంచ్ని మనమే ఎన్నుకోవాలి. ఇంకో ముచ్చట రేపీళ్లు పెట్టె మీటింగ్కు నేనైతే ఆళ్లిచ్చే పైశల్కోసం అసల్కేబోను. మీరు బోతాంటే నేనాప. కానీ, ఒకటి మాత్రం జెప్తున్న ఇనుండ్రి నాకు అన్నం లేక ఆకలితో సత్తమాయే గాని, నేను ఆత్మగౌరవంతో బత్కుత" అని గట్టిగా ఓర్రుకుంటూ మాట్లాడిండు.
ఒక్కశార్గా కటిక శీకట్లో సుక్కలు మెర్శినట్లు, జనాల మొఖాళ్ళు మెర్శినయ్. ఆ మెరుపంత ఒళ్ళంతా పాకినట్లు అయ్సు పొరగాళ్ళంతా ఈలలెత్తుంటే, అమ్మలక్కాల సప్పట్లతో వాడంత మోగినయ్. ఆ సప్పట్లన్ని కొత్వాల్కి సావు డప్పులెక్క ఇనబడ్తున్నాయి. ఒక్క నిమిసం గూడ ఆడుండలేకబోయిండు. ఒక్కమారు మాట్లాడకుండా గద్దెమించెలి దిగి కారెక్కిండు.
పెద్ద మన్శులందరు కొత్వాల్కాడ్కి బోయి "ఏమైందొర" అని అడిగిర్రు.
"ఏమైంది ఏంద్రా, మీ కాడ్కత్తే గిదార మీర్జేశే మర్యాద. ఇగ మీ ఇష్టం, మీసావు మీర్సావండి. ఇగో ఇవైతే దీస్కోండి, రేపచ్చేటోళ్లయితే రండి" అని పైశలకట్టిచ్చి కార్లబోయిండు.
రమేష్ ఉర్కుంటబోయి జోసెఫ్నెత్తుకొని "అరేయ్ మొదటిసార్రా కొత్వాల్కి మొఖం లేకుండా జేశినవ్" అన్కుంటూ ఎగుర్తుండు. వాడంత అరుపుల కేకలతో జోసఫ్ సూట్టుర పొగయ్యారు ఏదో సాధించాం అని.
"మా అయ్యనే ఎంత బాజెప్పినవ్" అని ముసలోళ్లందరు దగ్గర్కత్తాంటే, జోసెఫ్ ధన్న ధన్న రమేష్ భుజాలమించేలి దిగి కుక్కను కొడితే ఉరికినట్లు ఒగ ఉరుకుడు ఉరుకుతాండు పూర్ణ గుర్తచ్చి. వాడంత ఏం పట్టిందీ పొరనికన్నట్లు జూత్తాండ్లు.
జోసెఫ్ కంకిశేను కాడ్కచ్చి మొత్తం జూశిండు. పూర్ణ ఏడ అవ్పడక బోయేసర్కి, ఎల్లిపోయిందేమోనని జూశి జూశి అన్నుంచి ఎల్లిపోయిండు.
*
పొద్దు పొద్దుగాల్నే గద్దెకాడ కొత్వాలిచ్చిన కొత్త డప్పులు, కోలలు దెచ్చిపెట్టిర్రు పెద్దమన్శులు. "మీటింగ్కు టైం అయితాంది. మంది ఒత్తరా రారా? ఏందో దెల్సుకొబో" అని కట్టయ్యను మత్లావ్ దెల్సుకోనికి తోలిర్రు.
కట్టయ్య నాల్గు వాడలు దిర్గచ్చి "ఒక్కొక్కడు గడ్డ మీద కూసోనున్నరు. ఏడ ఏర్పడతలేదు ఆళ్లకు. ఆడోళ్ళు, మొగోళ్ల కాన్నుంచి ఒక్కలు ఒచ్చేట్టు అవ్పడ్తలే" అని పెద్దమన్శులతో అన్నడు.
"రాకబోతే రాకబోనియ్, చిన్న పొరన్ని బట్టుకొని ఏతుల్ జేత్తా ల్లు. మనమన్నా బోదాంబా" అని పెద్దమన్శులు డప్పులందుకున్నరు.
మీటింగ్కు కావాల్సిన పనుల్ని కొత్వాల్ ఆగమాగమవుకుంటా, అన్ని తానై జూసుకుంటుండు. ఎట్లైన ఎమ్మెల్యే మెప్పుబొంది, ఈశారి పార్టీలో గట్టి పదవి దీస్కోవాలని మస్త్ ఆశతో ఉండు.
"అరేయ్ కిరణ్గా, నిన్న అంత అయ్యిందిగా డప్పుల్లోళ్ళు ఒత్తరంటవ" అని అన్మానంతో అడ్గిండు కొత్వాల్.
"ఎందుకు రార్ సార్, పైశల్ పార్దెంగింతే ఎవ్వడైన వోత్తడు. దాంట్లో మావోళ్ళు ముందుటరు" అని గట్టి నమ్మకంతో అన్నడు కిరణ్.
అంతలోనే నల్గురు పెద్దమన్శులు మిగిల్న డప్పులతో, కోలలతో ఒత్తవుండ్రు. ఆళ్ళను జూశి కొత్వాల్ "ఏంరా కట్టయ్య గి నల్గురచ్చి ఎవ్వన్ని బాద్నం జేద్దాంమని ఒత్తాల్లురా, గింతన్నన్నా గుద్ద శిగ్గుడాలే రానీకి" అని కోపంతో అర్శిండు.
"సారు తప్పయింది. ఆ పోరని మాటల్కి ఇంట్లకేళి ఒక్క పుర్గు గూడ బయటక్రాలే. ఈ ఒక్కశారి క్షమించండి దొర, ఇంకోశారి ఇట్ల కానీయం" అని కొత్వాల్కి దండం బెట్టిర్రు పెద్దమన్శులు.
"అరేయ్ మీరీన్నుంచి బోండ్రా, నాక్కసలే మాటల్ సక్కగ రావ్" అని కొత్వాల్ తిడుతుంటే, పక్కనున్న కిరణ్ పెద్దమన్శులను పక్కక్ దిస్కచ్చి "మీరైతే ఆడుండ్రి నే జెప్తా సార్కి" అని అన్నడు.
"కిరణ్గా ఎంత పనైందిరా, ఎమ్మెల్యే కాడ ఇజ్జత్ పోతదిరా నాది. ఆ లంబిడికొడుకులు ఎంత పన్జేశిర్రా" అని మొత్తుకుంటుండు.
"ఊకోండి సార్ గ పొరగాళ్ళు మళ్ళేం జెప్పి జనాలను రానియ్యకుండా జేశిర్రో, ముందైతే ఎట్లనో గట్ల ఈ మీటింగ్ ఒడగొట్టుకుందాం" అని కొత్వాల్ని సందాయించాడు కిరణ్.
కొత్వాల్ కొంచెం నిమ్మలపడి "అవ్ రా ముందైతే ఈ మీటింగ్ కానీయ్. ఆళ్ళ సంగతి తర్వాత జెప్పుదాం. అదేట్లుండాలంటే ఇంకోశారి కొత్వాల్ పేరు ఎత్తాలంటే కింద్కేలి సమర్కారలే, నా కొడుకుల్కి" అని సుర్కంటిన పిల్లిలెక్క అటిఇటు దిర్గుతుండు.
"ఎటుబోతర్ సార్, దొరుకుతర్ ఆళ్ళు గప్పుడు జెప్పుదాం. ముందైతే గి పని చూద్దాం" అని కొత్వాల్ని దిస్కోబోయిండు కిరణ్.
*
"కూలికి బోయేదాన్ని శేన్లకు గుంజుకచ్చి, ఏంది నువ్వు లే నామించేలి" అని కసుర్కుంది పూర్ణ.
"అబ్బా కోపమత్తందా?"
"హ రాక, నువ్వు రాగానే ఎంబడేసుకొని ముద్దులిత్తనుకున్నవా? నిన్న రాత్రంతా నీగోసం ఎంతశేపు జూశిన్నో దెల్సా" అని పక్కకి దిర్గింది పూర్ణ.
"నేనొచ్చిన్నే గానీ, నేనొచ్చేశర్కి నువ్వు బోయినవ్" అంటూ జోసెఫ్ తన శేతుల్లోకి పూర్ణ శంపలను దీస్కొని పెదాలను అందుకోబోతుండగా మొకం పక్కకి దిప్పుకున్నది.
పూర్ణను జోసెఫ్ బుజ్జగిత్తాంటే,
"ఎవల్లుళ్ళ ఆడ" అని శేను లోపల్కచ్చి పిల్శిండు కావాల్కాశే స్వామి.
ఆ మాటతోని పూర్ణజోసెఫ్ లిద్దరు అదిరిపడ్డారు. ఆళ్ళు ఎన్కకు దిర్గి జూడగానే స్వామి కట్టేబట్టుకొని రానే వొచ్చిండు.
"గిల్లకచ్చి మీర్జేశే పనులు గివ్వ? మీ సంగతి జెప్తాగు"
పూర్ణ వన్కిబోతాంది. జోసెఫ్కేమో ఏం మాట్లాడాలో సమజైతలేదు. ఐన ఎట్లనో గట్ల ధైర్నం దెచ్చుకొని "పూర్ణ నువ్విన్నుంచి బో, నే జూశుకుంటా" అన్నడు.
పూర్ణ పోవడాన్కి లేవగానే "ఓ పోరి ఎటుబోయేది. ఊళ్లేందరచ్చే దాక ఎటుబోయేదిలేదు" అంటూ బెదిరిక్జిండు స్వామి.
"అన్న నీకు దండం పెడ్తా బోనియ్" అని బతిలాడుకుంటూ పూర్ణకు బొమ్మని సైగ జేశిండు జోసెఫ్.
ఎంబటే పూర్ణ ఉర్కుడు అందుకుంది. అది జూశి పూర్ణ ఎన్క స్వామి ఉర్కబోతుంటే, స్వామి గల్ల బట్టుకొని గుంజగానే బోర్లబొక్కలబడ్డాడు. జోసెఫ్ గూడ ఆన్నుంచి తప్పించుకబోయిండు.
స్వామి తేరుకొని లేశి జూశేశర్కి ఇద్దరు కనబల్లె "ఈళ్ళ సంగతి గిట్ల గాదు, ఊళ్ళే జెప్తా" అన్కుంటూ ఊళ్లేకు నడ్శిండు.
*
ఊరి పని దీరాగ, సూరీడు ఎర్ర మందారంలా మెర్తాంటే, స్వామి శేయబట్టి ఊరంతా పూర్ణజోసెఫ్ల యవ్వారం తెల్శింది.
పూర్ణకింకా అదురుపోలేదు. భయం భయంగానే నడ్తాంది ఇంటికి. ఆళ్ళ భాగ్యత్త పూర్ణను జూశి "రామ్మ తల్లి, కూలికని బోయి నువ్వు జేశే నిర్వాకమిద? మీ మామైతే తాళ్ళల్లా నుంచి రానియ్, నీ సంగతి జెప్తా" అని సదువుతుంది.
పూర్ణ ఏడ్తూ కాల్శేతులు కడ్కోకుండానే మంచంలా పడింది. కండ్లల్ల నుంచి నీళ్లు ధారలు అట్టకట్టినయ్. తన శంపలు నావర్పట్టికి అతుక్కబోయి మస్కనిద్రలకు బోయింది.
నర్సయ్య ఎప్పుడచ్చిండో తెలీదు. నిద్రమబ్బులోనున్న పూర్ణకు కొంచెం కొంచెం ఆళ్ళ అత్తమామలు మాట్లాడ్కుంటున్న మాటల్ ఇనబడ్తున్న, ఏం దెల్వనట్లు అట్లే పడ్కుంది.
"జూశినవా, మేనకోడలని నెత్తిమీదేట్టుకుంటే ఎంత పన్జేశింది. మల్ల ఏం ఎర్గనట్లు ఎట్ల పన్నదో జూడు" అని పూర్ణని భాగ్య లేపబోయింది.
"ఏయ్ ఆగావే. లే నడ్వు ఈన్నుంచి, పన్నదాన్ని లేపుతానవ్. అది చిన్న పోరి దానికేం దెల్సు. వాడే దీనికేదో మందు బెట్టివుంటడు" అని కొప్పాడ్డాడు నర్సయ్య.
"గిట్లనే ఎన్కేసుకుంటరా, ఏదో ఒకరోజు మనల్ని బదాట్ల నిలబెడ్తది" అని కసుర్కుంటా బోయింది భాగ్య.
పూర్ణ పక్కపొంటి మంచం మీద నర్సయ్య కూసోని నెత్తికున్న తువ్వాల దీశి, పూర్ణ కాళ్లకున్న దుబ్బను తూడ్తు "బిడ్డ లేరా" అని లేప్తుండు.
పూర్ణ కండ్లు ముసుకున్న మెల్కతోనే ఉంది. ఏమైతే అదే అయితదని ధైర్నం దెచ్చుకొని "నన్ను సంపినమాయే గానీ, నే వాన్నే పెళ్లి జేశుకుంటని మామకు జెప్తా" అని లేశింది.
"ఏమైంది బిడ్డ? కంకిశేను ఏంది? ఎవడెవ్వడోచ్చి ఏదేదో జెప్తున్నరు" అని మన్సుల మాట అడ్గిండు.
"మామ నేనే ఎప్పుడో జెప్పుదాం అనుకున్నానే, నాకు జోసెఫ్ అంటే శాన ఇష్టమే. మా పెళ్లి జెయ్యి మామ నీకు దండం పెడతా" అని నర్సయ్య రెండు శేతుల్బట్టుకొని వేడ్కుంది.
నర్సయ్యకి కోపమత్తాన అన్సుకొని "కుదరదు బిడ్డ, కులాన్ని కాదని మనం ఈ ఊళ్ళ సక్కగా ఉండలేం. వాన్ని మర్వు బిడ్డ మన మంచికే జెప్తున్న" అని పూర్ణ తల నిముర్తూ జెప్పిండు.
నర్సయ్య మాటల్కి పూర్ణకింకా ఏడ్పు ఎక్కువై "ఆడు మంచోడే మామ, నన్ను నీ లెక్కనే బా జూశ్కుంటడు" అని అంది.
నర్సయ్య నిమ్మలంగా పూర్ణను నొప్పియకుండా, "ఇక్కడ కావాల్సింది గుణం కాదు బిడ్డ కులం. నీకు జెప్పిన సమాజ్గాదు. నా మాటీను అంతకన్న మంచోన్ని నీకు జేత్తా" అని సమ్దాయించిండు.
పూర్ణ ఏం మాట్లాడ్కుండా మంచంలా కూసోనుంది. నర్సయ్య అక్కన్నుంచి బయటికత్తు పొరగాళ్లందరిని పిల్శిండు.
"అరేయ్ జోసెఫ్ గాడెక్కడున్న ఎతకండ్ర" అని కేకెశిండు. దాంతో గౌండ్లోళ్ల పొరగాళ్లంతా ఒక్కాడికచ్చి ఎతకనీకి బోయిర్రు.
పూర్ణకి ఆళ్ళ మామ మాటల్కి, ఏదో అన్పించి ఎట్లైనా జోసెఫ్ని కల్వలన్కుంది.
పోరగాళ్ళు ఊరంతా ఏ వాడ ఒదిలిబెట్టకుండా ఎత్కుతాళ్ళు. ఏడా జూశిన జోసెఫైతే అవ్పల్లె. ఎట్లయిన దొర్కబట్టాలని కంటికి కున్కు లేకుండా దిర్గుతాళ్ళు.
ఇదే అదునన్కొని కొత్వాల్, కిరన్ని పిల్శి "అరేయ్ నా మాటగా గౌండ్లోళ్ల పెద్దమన్శులకి జెప్పురా. ఆడు దొర్కకబోతే గాజులేశుకోని దిర్గమను" అని అన్నడు.
"సరే సార్" అని కిరణ్ బోతుంటే, మల్లాపి కొన్ని పైశల కట్టనిత్తు "ఆళ్లకు శాతగాకపోతే, నువ్వన్న వాన్నేయ్ రా"
కిరణ్ మారు మాట్లాడ్కుండా కొత్వాల్ మోకాన జూత్తాండు.
"ఏమిరా అట్ల జూత్తానవ్. మీ కులపోడని జూత్తానవా, ఒగాల అదైతే, రేపాడు నీ సర్పంచ్ సీట్ని శింపుతడు. నువ్వైతే ఈ పని కానీయ్, నిన్ను సర్పంచ్గా నే జేత్తా" అని రెచ్చగొట్టిండు.
సర్పంచ్ జేత్తానేశరికి మస్త్ సంబ్రమయ్, ఇగేమి ఆలోశించకుండా పైశల కట్టందుకొని గౌండ్లోళ్ల కాడ్కి ఉర్కిండు కిరణ్.
ఇగ ఊళ్లే నాకెదురు లేదనుకుంటూ నింపాదిగా ముశి ముశి నవ్వుకుంటా కుర్చీలో కూసున్నడు కొత్వాల్.
*
నర్సయ్య ఊరంతా ఎతికి ఎతికి గొల్ల బాషన్న ఇంటిదాకచ్చి తల్పు కొడ్తుండు.
"ఎవలయ" అని అడ్కుంటూ తలుపు దీశిండు బాషి.
"ఏం నర్సయ్య గింత శీకట్ల, గిటు బాటబట్టినవ్. ఏమన్నా పన ఏంది" అని దెల్సుకోనికి అడ్గిండు.
"జోసెఫ్గాడు గావలే బాషి. వాడీటు ఒచ్చిండా? ఒత్తె ఏడున్నడో జెప్పు".
"ఆడేడున్నడో, ఎటుబోయిండో నాకెట్ల దెల్తది. దీనిగోసం గి శీకట్లచ్చి అడుగుతానవా? ఏదన్నుంటే రేపొద్దుగాల మాట్లాడుదాంగాని నువ్వుబో."
"నీక్దెల్సు బాషి, ఆడేడున్నడో ఆనికి జెప్పు. ఇంకోశారి నా మేనకోడల్ జోల్కి ఒచ్చిండో, సంపి బొందబెడతానని"
"ఏంరా నర్సిగా బెదిరిత్తనావ? నా ముంగట ఆడి మీద శెయ్యి ఏయ్, గొడ్డలి శిప్ప మర్రేశి సంపుతా బిడ్డ. ఆని జోల్కత్తె నడువ్ ఈన్నుంచి" అని బెదిరిచ్చిండు బాషి.
"బోతన్న, గానీ మా జోల్కత్తె నే అదే పన్జేత్తా జూడు" అన్కుంటూ మర్రిబోయిండు నర్సయ్య.
ఆళ్ళు బోగానే తల్పేసుకొని మంచంలా ఒరిగిండు బాషి.
"ఎంత పనాయే, పోరనికి ముందున్నుంచే జెప్తున్న జాగ్రత్తరాని, గిప్పుడు గి లొల్లి ఏడిదాక బోతదో" అని ఆలోచిత్తాంటేనే మల్లేవరో తల్పు కొట్టిన సప్పుడైంది.
"దెహే నీయమ్మ మల్ల ఎవల్రా" అని శికాక్తో తల్పు దీయగానే ఎదుర్గా పూర్ణ.
ఎడ్శి ఎడ్శి మొకమంత వాడిపోయిన పూర్ణను జూశి ఎంబటే ఇంట్లకు గుంజి తల్పేశి "ఏమైంది బిడ్డ గిప్పుడచ్చినవ్, ఎవలు జూడలేగా" అని అడ్గిండు.
"అన్న నే జోసెఫ్ని జూడాలే. వాడికేమయ్యిందో" నని ఎడ్తాంది.
"వాడు ఈడ లేడు బిడ్డ, ఏడున్నడో నాక్దెల్వదు" అని ఊకోబెడ్తుండు.
"అట్ల అనకే అన్న, నీక్దెల్వకుంటా వాడేట్బోడు. మా మామ మాటలు ఇంట ఉంటే భయమేత్తాంది. జర కల్పియన్న" అని దండం బెట్టింది.
ఏం జెయ్యాలో బాషికేం సమాజ్గాలే, ఈ పిల్లతోబాటు ఎవరన్న ఒచ్చిర్రాని బయట సూట్టురా జూశిండు. ఎవర్రాలే అని అన్కున్నకానే పూర్ణను దీస్కొని గొర్లమంద కాడ్కి బోయిండు.
"లోపల్కి బోయి జూడుబో బిడ్డ"
గొర్లమందను దాటుకుంటా పూర్ణ బోయేశర్కి, గొర్లమధ్యల గొంగడి గప్పుకొని జోసెఫ్ పడుకొని ఉండు.
జోసెఫ్ని అట్ల జూశేశర్కి పూర్ణకి ఏడ్పు ఎక్కువై ఎంబటేబోయి తనని అముల్కొని "నావల్లనే నీకీ గతచ్చెనే బావ, ఎవ్వల్ లేనట్టుగా గొర్లల్ల పన్నవానే బావ" అని ఎక్కి ఎక్కి ఏడ్తూ జోసెఫ్ మొకమంత ముద్దులు పెట్టింది.
"లే బావ లే, మనం ఈడ అద్దు. ఈడ ఇట్లనే ఉంటే మనల్ని బతకనియ్యరు, ఎటైనా బోదాంబా" అన్కుంటూ జోసెఫ్ని లేపింది.
"ఎట్బోతమే, ఏడ్కని బోతం. ఏడ్కిబోయిన ఇదే బత్కు, ఆడ్కెడికో బోతే నా కులమేమన్నా మార్తదా పూర్ణ. ఏది ఏమైనా ఈన్నే ఉండి కొట్లాడుదాం."
"అద్దు ఈడ అద్దె అద్దు. మా మామను జూత్తనే భయమేత్తాంది నాకు" మంకు బట్టుకుంది పూర్ణ.
అంత గమనిత్తున్న బాషి ఆళ్ళ దగ్గర్కత్తు "అవ్ రా జోసెఫ్, ఈ రాత్రి ఏమైతదో కుతం తెల్వదు. మీరేటన్న బోయి ఎట్లనోగట్ల పెళ్లి జేశ్కోని రండ్రి, గప్పుడు నే జూశ్కుంటా" అని సలయిచ్చిండు.
"ఎటుబోనే ఏడికనిబోను, మల్లోకటి శేతిలో రూపాయిబిళ్ళ గూడ లేదు" అని అంటుండగానే బాషన్న పైశల్ దీశి జోసెఫ్శేతిలో బెట్టిండు.
జోసఫ్ గమ్మునవుండి, నోరు మెదపలేదు. కండ్లపొంటి వాటంతటవే నీళ్లు కార్తానయ్.
"ఊకోరా పిచ్చోడ నే లేనారా నీకు" అని జోసెఫ్ ఎన్నుమీద భరోసాగా రెండు దెబ్బలేశిండు బాషి.
జోసెఫ్ నీళ్లు తుడ్శుకుంటు "నీకు బాకి పడ్తనే అన్న"
"సరే సరేగాని ముందు ఈన్నుంచి ఎల్లుండ్రి" అని తోల్తుంటే జోసెఫచ్చి బాషిని కౌగిలించుకున్నడు.
"అరేయ్ జోసెఫ్, నిన్ను నమ్మత్తాన పిల్లకు ఏ కట్టం రాకుండా జూశ్కోరా" అని ఇద్దర్నిబంపిండు బాషి.
*
ఊరంతా దిర్గి దిర్గి నర్సయ్య ఇంటికచ్చేశర్కి, ఆడ జనాలంత మోపైండ్రు. భాగ్య గద్మల గూసోని సాపిత్తాంది.
"ఏమైందే, ఎవలో సచ్చినట్లు జేత్తానవ్" అని ఆగమాగంగా అడిగిండు నర్సయ్య.
"కోడల్ కోడలిని మీదేశ్కుంటే, మన కొంప కూల్శి ఆ మాదిగొన్తోని లేశ్పోయిందిరయ్య" అని ఉన్నముచ్చట జెప్పింది భాగ్య.
మా మాటకు నర్సయ్య దట్టుకోలేక బోయిండు. ఒక్కశారిగా ఒళ్ళుదిర్గి కూలబడ్డాడు. ఎంబటే ఆడున్నోళ్లు అందుకొని నీళ్లు దాపిచ్చిర్రు.
కిరణ్, గౌండ్లోళ్ల పెద్దమన్శులందరు కల్శి కొత్వాల్ జెప్పింది జేయడానికి, ఆళ్ళు అనుకున్న ముచ్చట జెప్పనీకి నర్సయ్య కాడ్కచ్చి "జూడు నర్సయ్య, గిట్ల కూలబడితే గాదు ముచ్చట లేశి ఏదొకటి జెయ్యి లేకపోతే మేమేదొకటి జెయ్యల్శి ఒత్తది. అదెట్లంటే నువ్వు గిప్పుడు ఎక్కే శెట్లు బంద్బెట్టి, వేరేటొళ్ళకిత్తం. నిన్ను కులంలకేలి ఎలెత్తం. ఆళ్ళు గన్క పెళ్లి జేశ్కొనత్తే, ఇదే జరుగుద్ది జాగ్రత్త" అని పెద్దమన్శులు నర్సయ్యను భయబెట్టిర్రు.
నర్సయ్యకింకింత ఆగమాగమయ్యిండు. ఒక్కశారిగా తలకాయలో పుర్గు దిర్గినట్లై, ఎంబటే లేశి గుంజకున్న ముస్తాద్లోంచి కత్తి దీశిండు.
"నాతోని ఎవ్వదత్తడో రండ్రి. ఇయ్యలా వాన్ని సంపి, నా కోడల్ని దెచ్చుకుంటా" అని అన్నడు.
పోరగాల్లు, కిరణ్ మల్ల ఆనితోనచ్చిన మన్శులు తలో కట్టె బట్టుకొని గుంపులు గుంపులుగా బోయిర్రు. ఏడబడితే ఆడ అటు నర్సాయ్యోళ్ళు, ఇటు కిరణోళ్లు ఎంత దిర్గిన పూర్ణజోసెఫ్లిద్దరు కనబల్లేదు.
ఇగ కిరణ్కి ఆళ్ళ మన్శులకి మోసచ్చి, కెనాల్ బ్రిడ్జ్ కాడ కూసున్నరు.
"ఎందన్నా, ఎంత ఎతికిన దొర్కుతలేరు" అని గుంపులోంచి ఒకడు అంటున్న, కిరణ్ దేకకుండా ఏదో కదుల్తుందని కెనాల్ కట్టకేలి జాత్తాండు.
"అరేయ్ నాకే కనబడ్తాంద? ఓశారి అటు జూడుండ్ర, ఆడేదో ఉంది" అని జూపిచ్చిండు కిరణ్.
"అవ్ అన్న మాకు కనబడుతాంది"
"సరే బోయి చూద్దాంబా" అని కొంచెం ఆళ్ళు ముందుకుబోగానే పూర్ణజోసెఫ్లిద్దరు నడ్సుకుంటబోతాళ్ళు.
అదిజూశి కిరణోళ్లందరు ఎంబటే ఆగి, నిమ్మలంగా అడ్గులేశి, ఒక్కశారిగా ఆళ్ళ మీద్కి దుంకిళ్ళు.
ఏదో సప్పుడు అయితందని జోసెఫ్ ఎన్కకు దిర్గానే, కిరణోళ్ళు ఆళ్ళ మీదకు ఉర్కిరాడం జూశి, ఎంబటే పూర్ణ శెయ్యి బట్టుకొని ఉర్కబోతుంటే లంగదట్టి ఇద్దరు బోర్లబొక్కల బడ్డారు.
పూర్ణజోసెఫ్లిద్దర్ని సుట్టు ముట్టిర్రు.
"అరేయ్ ఈ పోరిని దీస్కబోయి, నర్సన్నను దీస్కరాబోండిరా" మోసబోసుకుంటా అన్నడు కిరణ్.
జోసెఫ్ని అన్గబట్టి పూర్ణను గొర్ర గొర్ర గుంజుకబోతుంటే కాళ్లడిత్తు అర్తాంది.
"అన్న అన్న మీకు దండం బెడతా, మమ్మల్ని వదిలేయండన్న" అని కిరణ్ కాళ్ళు బట్టుకొని బతిలాడుతుండు జోసెఫ్.
కిరణ్ నవ్వుకుంటా జోసెఫ్ని మోకాళ్ళ మీద కూసోబెట్టి, ఆళ్ళు ఎంట దెచ్చుకున్న కట్టెలతో యిపరితంగా కొట్టిర్రు.
"నువ్వు ఊరిని మార్తావ్రా? దొరకెదురత్తవరా? నీ మోకాన్కి ఈ పోరి గావాళ్లరా? అని సదువుతూ జోసెఫ్ మొకం మీద ఉమ్మేశి, జోసెఫ్ బట్టలు శింపి పారేశిర్రు.
ఆ బర్వాతన జోసెఫ్ రక్తంతో తానం జేశినట్లు అగుపడుతుండు. కనీసం నోట్లకేలి మాటెల్లక సోయిలేకుండా బడ్డాడు. తన రెండు కాళ్ళను ఎడంజేశి మధ్యలో ఒకలు తర్వాత ఒకలు వీడు బతికితే మమ్మల్ని బతకనియ్యడన్నట్లు పిచ్చల్శితికి బోయేట్లు తన్నుత్తుండ్రు. నొప్పిని భరించలేక జోసెఫ్ ఒగ ఒర్రుడు ఒర్రుకుంటా శేతితో భూమిని కొడుతుండు.
అట్నుంచి నర్సయ్య కత్తి బట్టుకొని ఉర్కతాండు. ఆళ్ళు జోసెఫ్ని లేపి తలకాయ బట్టుకోని "అన్న ఏయ్ అన్న నర్కు ఈన్ని" అని రెచ్చగొడుతుండ్రు.
నర్సయ్య కత్తి లేపిండు. ఒక్కశారిగా మెడ దాకచ్చి, ఆగిపోయి ఆలోచిత్తాండు.
"ఏమైందన్న ఏమైంది. నర్కు వాన్ని నర్కు" అని అందరూ అర్తాళ్ళు.
"సంపలేను నే సంపలేను" అని కత్తిని విసిరిగొట్టిండు నర్సయ్య.
అందరు, "ఏంది ఏం జేత్తాండు" అని జూత్తాళ్ళు
"నీకేమన్న తెల్తాంద, శాతకానోన్లెక్క జేత్తానవ్" అని పెద్దమన్శోకడు అనగానే,
"తెల్తాంది అంత తెల్తాంది. నేను ఈ కూని జెయ్యలేను అట్లాని కులాన్ని కాదనలేను. వీన్ని సంపితేనే కులంలో ఉంటాన? నా కోడల్ నాకాన్నే ఉంది, గిప్పుడు వీన్నెందుకు సంపాలి. నేను సంపను. ఇది నా సమస్య నే జూశుకుంటా, మీర్ బోండ్రి ఈన్నుంచి" అని బాధపడుతూ అందర్ని బతిలాడిండు.
"ఛీ వీడబ్బా గిట్ల జేశిండేంది, కొత్వాల్కేం జెప్పలే" అని కిరణ్ అనుకుంటుంటే, పొరగాళ్ళు మల్ల పెద్దమన్శులు ఎల్లిబోయిండ్రు.
నర్సయ్య నెత్తికున్న తువ్వాలను దీశి బర్వాతనున్న జోసెఫ్ నడుంకి గట్టి కూసోబెట్టిండు. జోసఫ్కు సోయి ఉండి లేనట్టుండు. ఒళ్ళంతా రక్తం ధారలు అట్టు గట్టినయ్. నర్సయ్య ఆడి అవస్థ జూడలేక,
"అరే నాయ్న, నా మాటీనురా. నిన్ను జూత్తాంటే నాకు బాధైతాందిరా, అట్లని నా కోడల్నీకు ఇచ్చి పెళ్లిజేయలేను. శాన చిన్నోళ్ళంరా మేము. కులాన్ని కాదని బత్కలేము. బత్దేరువుండదు నా ఇంట్లొళ్ళందరం బదాట్ల బడ్తాం. నావోళ్ళ మధ్య ఏం కానోన్లెక్క బతకాలే. నీకు దండం బెడ్తా, మమ్మల్ని వదిలేయ్రా" అని బతిలాడుకుంటుండు.
నర్సయ్య మాటల్కి జోసెఫ్ ఓపిక దెచ్చుకొని నిమ్మలంగా కండ్లు దెర్శి "నాయిన మేం ప్రేమించుకున్నమే, మీరే మమ్మల్ని ఒదిలెయ్యండ్రి. నీకు పుణ్యముంటది" అని అన్నడు.
పట్టరాని కోపంతో జోసెఫ్ ఎదురుబొచ్చె మీద నర్సయ్య "లంజోడక ఇనవరా" అని ఒక్క తన్ను తన్నగానే ఎల్లెలకల బడ్డాడు. ఎన్కకు దిర్గకుండా నర్సయ్య, జోసెఫ్ని ఆన్నే ఒదిలేశి బోయిండు.
జోసెఫ్ నిమ్మలంగా లేశి తన నడుముకున్న తువ్వాలను సదురుకుంటు, ఒంట్లో నుంచి రక్తం కార్తున్న ఓపిక దెచ్చుకొని ఒక్కో అడుగేశుకుంటు నడ్తాండు.
నర్సయ్య బోయింది జూశి కిరణ్ ఎవలకు కనబడకుండా జోసెఫ్ ఎన్కకచ్చి ఎన్నులోకి నర్సయ్య విసిరిగొట్టిన కత్తి దించిండు.ఏమైందోని దేరుకునే లోపు తన్ను తన్నెశరికి జోసెఫ్ కెనాల్ కట్ట మించేలి జర్ర జర్ర జారుకుంటా వారి మల్లల్లా బడ్డాడు.
జోసెఫ్ నెత్తురుతో వరిశేను తడ్తాంటే లేవలేకబోయిండు. కండ్లు దెలేశి, ఆకాశంలోనున్న సగం ఎన్నెలను జూత్తు పూర్ణ నవ్వోలే గుర్తచ్చి పెదాల చిరునవ్వుతో, "ఈ ఎన్నెల నీ నవ్వులా ఉన్న ఇప్పుడెంత ఎడ్తానవో" అని అన్కుంటు,
"తండ్రి, సమాప్తమైనది.
దేవా, హతుడనై నా జీవాత్మ నన్నొదిలెల్లు సమయాన నీ దరికి నన్ను చేర్చుకోనుము.
ఆమెన్."
మధ్యాహ్నం ఒంటిగంటకు ఎగ్మూర్ స్టేషన్ లో బయలుదేరిన రైలు చిదంబరం చేరేటప్పటికి సాయంత్రం అయిదు గంటలయ్యింది. ఇంకా ఉక్కగా ఉంది వాతావరణం. చరణ్ బాగా అలిసిపోయాడు. అంతకు ముందురోజే సర్కార్ ఎక్సప్రెస్స్ కు భీమవరం లో బయలుదేరి ఈరోజు ఉదయానికి మద్రాస్ చేరుకొని, బయట భోజనం చేసి ఎగ్గుమూర్ స్టేషన్ కు చేరి, మరల ఇక్కడికి చేరేటప్పటికి ఈ సమయం పట్టింది. దగ్గరలోనే ఉన్న హోటల్ రూము కు చేరుకొని, కొంతసేపు రెస్ట్ తీసుకొని భోజనం కోసం బయలుదేరాడు. కొద్ది దూరం లోనే కనిపించిన భోజన హోటల్ లో ఓటేబుల్ వద్ద కూర్చుని బేరర్ తో "ఓ మీల్స్" అన్నాడు. బేరర్ ఆశ్చర్యగా చూస్తూ "సాయంత్రం భోజనాలు ఉండవ్! టిఫిన్స్ మాత్రమే " అన్నాడు. అదేంటి? ఆని షాక్ నుంచి తెరుకొంటూ, అటూ ఇటూ చూస్తే అందరూ టిఫిన్స్ తింటున్నారు. ఆశ్చర్యం నుంచి తెరుకొని ఓ ప్లేట్ ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాడు. ఫోన్ లో ఎంక్వయిరీ చేస్తే, తమిళనాడు అంతా సాయంత్రం భోజనాలు ఉండవని తెలిసింది. అరే ఇంత చిన్న విషయం తనకు తెలియలేదే ఆని ఆశ్చర్యపోయాడు.
చరణ్ భీమవరం లో సెటిల్ అయ్యాడు. దగ్గరలో వున్న స్వంత గ్రామం లో చేపల చెరువులు లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. బి ఎస్ సి డిగ్రీ భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీ లో చేసిన తరువాత హైదరాబాద్ లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ లో జాబ్, ఇంకొన్ని జాబులు చేసి చివరకు మరల భీమవరం చేరాడు. ఇప్పుడు మరల పీజీ చేయాలనిపించింది. అన్నామలై యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న సైకాలజీ దూరవిద్య ప్రోగ్రామ్ లో చేరాడు. వ్రాత పరీక్ష విజయవాడ లో రాయొచ్చు. కానీ ప్రాక్టీకల్స్, చిదంబరం లోని యూనివర్సిటీ క్యాంపస్ లోనే వారం రోజులు చేయాలి. ఇక తప్పదు కాబట్టి అక్కడకు చేరుకొన్నాడు.
మద్రాస్ కొన్ని సార్లు వచ్చినా, తమిళనాడు రాష్ట్రం లో లోపలి ప్రాంతాలు తెలియదు. అంతా కొత్తగా వింతగా అనిపిస్తోంది. బజారు కు వెళ్లాలంటే కొంచెం దూరం నడవాలి ఇక చేసేది లేక రూముకు తిరిగి వచ్చేసాడు.
ఉదయమే ఆటోలో యూనివర్సిటీ క్యాంపస్ కు చేరుకొన్నాడు. ఓ హాల్ లో సమావేశం. చాలా మంది వచ్చారు. అరవై మంది ఉంటారేమో. ఎక్కువ మంది టీచర్లే ఆని తెలిసింది. తెలుగు వాళ్ళు అయిదు అరుగురే ఉంటారేమో. అయిదు రోజులు ప్రాక్టికల్స్ చేయాలి. ఆరవ రోజు పరీక్ష. రిజల్ట్స్ వెంటనే యిస్తారు. లెక్చరర్ ఒకాయన ఈ విషయాలన్నీ వివరంగా చెబుతున్నాడు. అందరినీ, ముగ్గురు చొప్పున ఓ గ్రూపుగా విడదీశారు. ఇన్స్ట్రక్టర్ చెప్పిన విధంగా ప్రయోగాలు చేయాలి. ఫలితాలను టేబుల్ రూపం లో రికార్డ్ చేయాలి. చరణ్ టీమ్ మెంబర్స్ గా శాంతాదేవి, ఆదిత్యరావులు వచ్చారు. పరిచయాలు అయ్యాయి. ఇద్దరూ అతని కంటే పెద్దవాళ్లే. శాంతాదేవి బెంగళూరు లో రిజర్వ్ బ్యాంక్ లో ఆఫీసర్, మరో రెండు సంవత్సరాలలో రిటైర్ అవ్వబోతున్నారట. పెద్ద వయస్సు అయినా, కొంచెం మేకప్, పెదాలకు లిప్స్టిక్, కళ్ళకు ఎక్కువ కాటుక, పెద్ద బొట్టు, నేత చీర, ఏదో వయసున్న బెంగాలీ మేడం లా విచిత్రం గా కనిపిస్తోంది ఆవిడ. ఆదిత్యారావు పెద్ద ఎత్తు ఏమీ కాదు. టక్ చేసుకొని చురుకుగా కనిపిస్తున్నాడు. ధర్మపురి జిల్లా ఎస్ పి గా చేస్తున్నాడట. సెలవు పెట్టి ఈ కోర్సు పూర్తి చేయాలని వచ్చాడు. చరణ్ తన ప్రొఫైల్ వాళ్లకు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు.
ప్రయోగాలు ప్రారంభించారు. మొదట వెర్బల్ తో జరిగాయి. మొదట కొన్ని విడి విడి అక్షరాలను చూపించారు. తరువాత వాటిని రాయమన్నారు. చాలా తప్పులు వచ్చాయి. రెండోసారి కొన్ని విడి విడి పదాలు యిచ్చారు. ఈసారి కొన్ని తప్పులు తగ్గాయి. మూడోసారి, ఓ పేరా చూపించారు , ఈసారి తప్పులు చాలా తగ్గిపోయాయి. ఇవన్నీ ఆపేరా లోనివే ఆని తెలిసాక ఆశ్చర్యం వేసింది చరణ్ కి . అనుబంధం వున్న పదాలు ఎలా గుర్తుంటాయో తెలిసోచ్చింది. ఇలా మరికొన్ని ప్రయోగాలు జరిగాయి. చాలా మంది, సైకాలజీ క్లాసు విద్యార్థులు తను వున్న హోటల్ లోనే వుంటున్నారు. ఇప్పుడు పరిచయం అయ్యారు. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు శాంతాదేవి, ఆదిత్య రావు గార్లు కలిశారు. అయన తాతలది విజయనగరం అట. నేరస్థుల మనస్తత్వం తెలుసుకోవడానికే సైకాలజీ చదువుతున్నట్లు చెప్పారు. కొంచెం ముక్త సరిగానే మాట్లాడు తున్నారు. బహుశా అయన లెవవెల్ కి తాము సరిపోమేమో ఆని అనిపించింది చరణ్ కు. శాంతా దేవి గారు చెబుతూ, తనకి వున్న మానసిక సమస్యల గురించి తెలుసుకోవడానికే ఈ కోర్సు లో చేరానని చెప్పారు.
ఆ రోజు మధ్యాహ్నం ఓ ప్రయోగం చేశారు.
ఓ పెన్ లాంటి పరికరాన్ని, ఓ బోర్డు మీద వున్న గాడిలో నడిపించాలి. పక్కగోడలకు తగిలితే 'కీ'.. ఆని శబ్దం వస్తుంది. ఇలా పదిసార్లు చేసి ఎన్నిసార్లు సౌండ్ చేసిందో రికార్డు చేయాలి. ఇప్పుడు ఒక అద్దాన్ని అడ్డుగా పెట్టుకొని, ఆ అద్దం లో చూస్తూ చెయ్యాలి. ఇది చాలా కష్టం గా ఉంటుంది. రివర్స్ లో అలోచించి పెన్ ను ముందుకు నడపాలి. చరణ్ కు కష్టం మైయ్యింది. నెమ్మదిగా చేయగాలిగాడు. ఇప్పుడు శాంతాదేవి వంతు వచ్చింది. రివర్స్ లో పెన్ నడిపించలేక చేతులు వణికాయి. చెమటలు పట్టాయి. చివరకు కళ్ళు తిరిగి పడిపోయింది. మొఖం పై నీళ్లు చల్లి నెమ్మదిగా లేపి కూర్చోబెట్టారు.
సాయంత్రం చరణ్ రూముకు చేరాకా కొద్ది సేపటికే ఆవిడ వచ్చింది. నాకు ఇలా జరిగిందేమిటి? ఆని ఆందోళనగా ప్రశ్నించింది. మనస్సు లో పడిన బలమైన ముద్రల వల్ల ఇలా జరిగింది. ముందు చేసిన ప్రయోగం వల్ల ఓ అలవాటు వచ్చింది. ఇప్పుడు రివర్స్ లో ఆలోచించడానికి మనస్సు అంగీకరించలేదు, పాత అలవాటు నుండి బయిట పడలేకపోయింది.అందుకే మీకు ఈ ఇబ్బంది వచ్చింది ఆని కూల్ గా చెప్పాడు చరణ్. ఆమెకు ఏమీ అర్ధం కానట్లు మొఖం పెట్టింది. చీకటి పడే వేళ వాళ్లిద్దరూ డిన్నర్ చేయడానికి బయలుదేరారు. ఆమె మాట్లాడుతోంది.. "బళ్లారి జిల్లాలో చిన్న గ్రామం నుంచి వచ్చాను.
నాన్న టీచర్. నాకు కొంచెం కొంచెం తెలుగు కూడా వచ్చు. స్కూల్ అయ్యాకా, డిగ్రీ, పీజీ కూడా బెంగళూరు లోనే. ఫస్ట్ ఎటెమ్ట్ లోనే రిజెర్వ్ బ్యాంకు లో జాబ్ వచ్చింది. అతను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లో ఇంజనీర్. నాన్న చూసిన సంబంధమే. ఎందుకో మా ఇద్దరికీ పోసగలేదు. అతను మూడీగా ప్రవరిత్తించేవాడు. తనో పెద్ద ఆధ్యాత్మిక వాదిగా పోజు పెట్టేవాడు. నాకు ఒక కొడుకు, ఇప్పుడు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ తీసుకోమంటే, ఎన్విరాంన్మెంటల్ సైన్స్ తీసుకొన్నాడు. సరిగ్గా చదవడు. జూలాయి గా తిరుగుతాడు. వీళ్లిద్దరితో వేగలేక చస్తున్నా. ఆఫీస్ లో నేను పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా. స్టాఫ్ అందరూ గౌరవిస్తారు, కానీ ఇంటి దగ్గర అసలు విలువలేదు.ముగ్గురువీ మూడు త్రోవలు.ఈ మధ్య నాకు ఫిట్స్ కూడా వస్తున్నాయ్.".. ఆమె ఆపకుండా మాట్లాడింది. కళ్ళ చుట్టూ నల్లటి వాలయాలు కనిపిస్తున్నాయి. కళ్ళలోతడి. చరణ్ మోనంగా ఉండిపోయాడు. " కానీ నాకు కొడుకంటే పిచ్చి ప్రేమ. తనను వదిలి ఉండలేను. తనకు కూడా ఇష్టమే, బయిట పడడు. జన్మ పునర్జన్మలపైన చాలా పుస్తకాలు చదివాను, వీరేష్ నాకు ఎప్పుడూ కొడుకుగా పుట్టాలని కోరుకుంటానని చేప్పింది. హోటల్ కు చేరుకొన్నాక కూడా మరల రూమ్ కి వచ్చి మాట్లాడుతూనే వుంది. " నాకు దేముడంటే నమ్మకమని, అమ్మవారిని నిరంతరం పూజిస్తానని" అంది. ఓ నిమిషం ఆగి "మరి మీసంగతేమిటి?" ఆని అడిగింది. చరణ్ కొంచెం విసుగ్గా ఉన్నాడు. "దేముడు, దెయ్యం, పునర్జన్మ, ఆత్మలపైన నమ్మకం లేదు.. ఈ ప్రపంచం కోట్ల సంవత్సరాల పరిణామం ద్వారా తయారైయ్యిందని నా నమ్మకం. ఫ్రాయిడ్ మనస్తత్వ పరిశోధనల పై నమ్మకం కలుగుతోంది. కలల గురించి అయన విపులంగా చర్చించాడు. మీరు థియరీ మెటీరియల్ లో చదివే వుంటారు " అన్నాడు. ఆమె హతాసురాలయ్యింది. కొంచెం నిస్పృహ చెందింది. "ఏదో విశ్వాత్మే ఈ సృష్టిని నడిపిస్తోంది ఆని నేను నమ్ముతాను." ఆని కొంచెం అనుమానంగా చరణ్ వంక చూస్తూ అంది. "మీరు ఏమీ అనుకోకపోతే, నా అభిప్రాయాలు నాకున్నాయి. సైకాలజీ ఓ సైంటిఫిక్ థియరీ. అది ఇంకా అభివృద్ధి చెందుతోంది. చదివేటప్పుడు దాన్నే అనుమానిస్తే మనం సరిగా అర్ధం చేసుకోలేము. దేముడి గురించి చర్చ చాలా పెద్దది. తరువాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. రేపు కలుద్దాం " అన్నాడు చరణ్. పాపం కొంచెం ఇబ్బంది పడి వెళ్ళిపోయింది. అతనికి ఎప్పటికో నిద్ర పట్టింది.
తరువాత రోజు మరో ప్రయోగం. ఇది కూడా మనస్సు పై అలవాట్లు కలగచేసే ముద్రలను నిరూపించిదే. చరణ్ కు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ పదినిమిషాలలో అయిన అలవాట్లే మనస్సు పై ముద్ర వేస్తే, చిన్నప్పటినుంచి ఎన్ని అలవాట్లు? ఎన్ని ముద్రలు వేస్తాయోకదా!, మనిషి స్వేచ్చగా, శాస్త్రీయంగా ఆలోచించే అవకాశం దొరుకుతుందా? ఆని అనుకొన్నాడు. "ఏమి ఆలోచిస్తున్నారు?" ఆని అడిగింది శాంతాదేవి. అతను చెప్పాడు. ఆమె కొంచెం సేపు మౌనంగా వుంది. "సైన్స్, టెక్నాలజీలు మనిషికి నాగరికత నేర్పొచ్చునేమోగానీ, మానసిక తృప్తిని ఇవ్వలేవు, పైగా కోరికలు పెంచుతాయి. ఇది మరింత ప్రమాదం " అంది ఆవిడ. చరణ్ కు కొంచెం భావవేశం కలిగింది. గట్టిగా వాదించాలనుకున్నాడు. ఆవిడ అమాయక మొఖాన్ని చూసి జాలి కలిగింది. తన ప్రతాపాన్నంతా ఆవిడ పైనా చూపించడం భావ్యం కాదనిపించింది. "సరే ఈవిషయం తరువాత చర్చిద్దాం " అనుకొని ఇద్దరూ హోటల్ కు చేరుకొన్నారు. మధ్యలో చరణ్ అన్నాడు, "నేను వేరే తెలుగు ఫ్రెండ్ తో బయట కు వెళ్ళొస్తాను, మీరు డిన్నర్ కి నాకోసం ఎదురు చూడకండి " ఆని చెప్పాడు. " సరే నేను కూడా నా కొడుకు వీరేష్ తో మాట్లాడాలి " అంది ఆవిడ. అసాయంత్రం చరణ్, అతని ఫ్రెండ్ చిదంబరేశ్వర ఆలయానికి వెళ్లారు. గుడిచుట్టూ వున్న రెండు ప్రాకారాలు, గాలి గోపురాలు, గుడిలోని పురాతన శిల్పాలు, అద్భుతంగా తోచాయి. నటరాజస్వామి, శివకామి ఆమ్మ వారి దర్శనాలు పూర్తి చేసుకొని, ఆలయ వీధుల్లో తిరిగారు. అయ్యో శాంతదేవి గార్ని కూడా తీసుకు రావాల్సిందే ఆని అనిపించింది చరణ్ కు.
ఈరోజైనా నాన్ విజిటీరియన్ భోజనం దొరుకుతుందేమోనని ఎంక్వయిరీ చేశారు. అందరూ ఒక సందు వైపుకు చూపించారు. అది ఒక పాత మండువా లోగిలి. జనం కిట కిట లాడుతున్నారు. ఓ మూల ఓ బెంచీ దొరికింది. ఏది ఎక్కువగా తింటున్నారో తెలుసుకొని అదే ఆర్డర్ ఇచ్చారు. మలబార్ పరాట, పిట్ట వేపుడు.. రుచి చూస్తే స్వర్గం కనిపించింది. జన్మ ధన్యమైయ్యిందిరా బాబూ అనుకొన్నారు వాళ్ళు.
రూమ్ కి వచ్చి పడుకున్నాక,
నిద్రలో కల..కారులో వచ్చి అమ్మవారి దేవాలయం ముందు దిగింది శాంతాదేవి. టిప్ టాప్ గా తయారైయ్యింది. నల్లద్దాల కళ్ళజోడు. పెద్ద ఎర్రని బొట్టు. వెనకాల సెక్రటరీ లాగా చరణ్.
పూజారి ఆవిడకు నమస్కారాలు చేస్తూ, గోత్ర నామాలతో పూజ చేసాడు." వీడిపేరున కూడా పూజ చేయండి "అంది స్టైలు గా. అతనికి కోపంగా ఉంది కానీ ఏమీ అనలేక పోతున్నాడు. కారు దగ్గరకు తిరిగి వెలుతుంటే ఆమె కాలు బెణికి వెల్లకిలా పడింది. అతనికీ కడుపుబ్బ నవ్వొచ్చింది. ఆమె కొరకొరా చూసింది. పట్టుచీర వెనుక పక్క అంతా మట్టయ్యింది. తను మసి ముసి గా నవ్వుకొంటూ ఆమె లేవడానికి చేయి సాయం చేసాడు... కల చెదిరింది.
ఎప్పుడో అర్ధ రాత్రి తలుపు కొట్టిన చప్పుడు. తెరిచే టప్పటికి, ఎదురుగా నైటీ లో శాంతాదేవి. అచ్చం కాళికా మాతలా వుంది. కళ్ళు ఎర్రబాడ్డాయి. జుట్టు విడిపోయి వుంది. "రండి కూర్చోండి.." ఆని చరణ్ మంచం పై కూర్చుండిపోయాడు ఆవలిస్తూ. ఆమె సీరియస్ గా ఉంది. "చదువుకున్నోళ్ళందరూ హేతువాదులో నాస్తికులో అవ్వాలా " ఆని అడిగింది. "ఆలా ఏమిలేదు ఎవరి ఇష్టం వాళ్ళది" అన్నాడు కూల్ గా. "దేముడు లేడు, పునర్జన్మ లేదు, ఈజన్మ లోని ప్రేమలు, అనుబంధాలు ఇక్కడితో సరి అంటున్నారుకదా, మరి నా కొడుకు వీరేష్ తో బంధం ఈజన్మతో సరా? వచ్చే జన్మలో ఏమౌతామో చెప్పండి, లేకపోతే తప్పు ఒప్పుకోండి " ఆని గట్టిగా అడిగింది ఆవిడ. ఆమె చరణ్ వైపు తీవ్రంగా చూస్తోంది. ఇప్పుడు రాత్రి వేళ ఈ గొడవ అవసరమా ఆని అనిపించింది చరణ్ కు. "ఏమో ఎవరి ఆలోచనలు వారివి. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది." అన్నాడు చరణ్ నెమ్మదిగా. ఆమె కొంచెం చల్లబడింది "అలారండి దారికి, తెలిసీ తెలియని విషయాలను పట్టుకొని వాదించకండి. ఈ ప్రాక్టికల్స్ కు వచ్చినప్పుడే అర్ధమయ్యింది, ఇదంతా ఓ ట్రాష్ ఆని, రేపు నా కొడుకును రమ్మన్నాను. కారు లో వెళ్ళిపోతా!" అంది సీరియస్ గా. ఇంకా రెండు రోజులే వుంది. పరీక్షలు పూర్తిచేసి వెళ్లొచ్చు కదా " అన్నాడు చరణ్. "అక్కర్లేదు! ఈ చెత్త నేర్చుకోవడానికి ఇంత దూరం రావడమే దండగ, రేపు బ్రేక్ఫాస్ట్ సమయం లో కలుద్దాం. " అంటూ వెళ్ళిపోయింది. కొద్ది క్షణాల్లో నిద్రలోనికి జారుకున్నాడు చరణ్.
ఉదయం ఎనిమిది గంటలకే తలుపు కొట్టింది ఆవిడ. వీరేష్ ని పరిచయం చేసింది. ఎత్తుగా అందంగా వున్నాడు. గిరజాలజుట్టు.. పాలకరించాడు చరణ్. " ఓ పదినిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను లాబీలో వైయిట్ చేయండి." ఆని చెప్పాడు. కొద్దిసేపటికి ఫోన్ నంబర్స్, ఇమెయిల్ అడ్రస్లు మార్పిడి చేసుకొని వాళ్ళు వెళ్లి పోయారు.
ఈ రెండురోజులు చరణ్ కు భారంగా గడిచింది. మొదట తలనెప్పి తగ్గిందిరా బాబూ అనుకొన్నాడు. కానీ తరువాత, పాపం ఆమె అమాయకురాలు ఎలాబతుకుతుందో ఆని దిగులు పడ్డాడు. ఆలోచించే కొలదీ ఏదో అర్ధమౌతున్నట్లు అనిపించింది. అప్పుడే తనపైన కూడా ఏవో ముద్రల ప్రభావం పడుతున్నాయేమోనని అనిపించింది.
భీమవరం వెళ్లిన రెండు నెలలకు శాంతాదేవి నుంచి ఇమెయిల్ వచ్చింది.. "తిరిగి వెళ్లిన కొద్దిరోజులకే ఆయనతో గొడవయ్యింది. బహుశా అతనికి నేను ఉద్యోగం చేయడం, వ్యక్తిత్వం నిలుపుకోవడం ఇష్టం లేదు అనుకొంటున్నాను. ఇప్పుడు విడిగా ఉంటున్నాం. పాపం వీరేష్ బాగా డిస్ట్రబ్ అయ్యాడు. ఓరోజు పార్టీ కి వెళ్లి లేటుగా వచ్చాడు. తాగాడనుకుంట. ఉదయాన్నే తిడితే, రెండురోజులు కనిపించలేదు. అదికూడా తప్పేనా! నా కొడుకు కూడా దూరమైతే, నేను బతకలేను. జీవితం బోరింగ్ గా ఇబ్బందిగా వుంది. నా రిటైర్డ్ లైఫ్ ఎలావుంటుందో ఆలోచిస్తే భయంగా ఉంది. మీరు, మీవాదనలు గుర్తుకువచ్చాయి. ఆలోచిస్తే కొంచెం నిజం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. మీతో కొంచెం అతిగా ప్రవర్తించనేమో అనిపించింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఐ యామ్ సారి! మీరు మీకుటుంబం క్షేమం గా ఉండాలని కోరుకొంటూ సెలవ్.. శాంతాదేవి.
ఏదో తెలియని బాధ అతన్ని ఆవరించింది.
మరో ఆరు నెలలకు కాల్.." నేను వీరేష్ అంకుల్, అమ్మకు ఓ నెల క్రితం అనారోగ్యం చేసింది. కొన్ని రోజులు హస్పెటల్ లో ఉంచాము. తరువాత ఫిట్స్ ఎక్కువయ్యాయి. ఎప్పుడూ మందులపైనే ఉండేది. దేముడనేవాడు ఉంటే తనలా నమ్మే వాళ్ళు కష్టాల్లో ఉంటే ఎందుకు ఉద్దరించడు? ఆని అడిగేది. చరణ్ చెప్పినట్లు దేముడే లేకపోతే పక్కదారి పట్టిన ఈ సమాజాన్ని ఎవరు దారిలో పెడతారు? ఆని ప్రశ్నించేది. తనకు మేము ఎలా సమాధానం చెప్పాలో తెలిసేదికాదు. మనస్సులో ఏదో మదన పడేది. మూడు రోజులక్రితం ఫిట్స్ ఎక్కువగా వస్తే మరల హస్పెటల్ లో చేర్పించాము. ఒక రోజు కోమాలో వుండి నిన్ననే చనిపోయింది". ఆని చెబుతూ చాలాసేపు ఏడ్చాడు. చరణ్ కొంతసేపు సముదాయించాడు ఫోన్ లోనే. మరో పది రోజులు తరువాత చరణ్ ఫోన్ చేసి వీరేష్ తో మాట్లాడాడు.
" అమ్మను నువ్వూ, మీ నాన్నగారు కూడా సరిగా అర్ధం చేసుకోలేదేమో అనిపిస్తోంది. ఆమె మీ ఇద్దరినీ ఎంతో ప్రేమించింది. కానీ మీరు ఆమెకు ప్రేమను అందించలేకపోయారు. దీనివల్లే ఆమె డిప్రెషన్ కు గురై మానసిక అనారోగ్యానికి గురైయ్యింది. ఇప్పుడైనా మేల్కొని మీ పద్ధతులను సరిచేసుకోవాలి, లేకపోతే మీ భవిషత్తు కూడా దెబ్బతినొచ్చు " ఆని చెప్పాడు. "అవును అంకుల్ మావల్ల అమ్మ ఎంతో నలిగి పోయింది ఆని ఇప్పుడు బాధ కలుగుతోంది " అన్నాడు వీరేష్.
పాపం శాంతాదేవికి అన్నీ ఉన్నా జీవితం ఇలా ముగిసి పోయిందేమిటి? ఆని నిట్టూర్చాడు చరణ్.
కాలం గడిచే కొలదీ శాంతాదేవి, వీరేష్, అన్నామలై యూనివరసిటీ, సైకాలజీ క్లాసు, చరణ్ స్మృతి లో మసకబారి పోతున్నాయి.
పొధ్ధాటి కల్లు వాసన కమ్మగా వోత్తాన, ఏ పుర్గు పుట్రో అచ్చి కుడ్తదన్న భయంతో, సలిని కప్పుకున్న శీకట్ని సూత్తు ఒక్కడే కంకిశేను కాడ వన్కుతూ కూసోని ఎదుర్సూత్త ఉండు జోసఫ్. సెకను ముల్లుల తన గుండె సప్పుడు ఒక్కటే కల్వరింత, పూర్ణ ఎప్పుడొత్తదా అని. ఈ ఎదురుసూపులు కొత్తేం కాదు, అయ్న ఆళ్ళు కల్శిన ప్రతిసారి ఒక కొత్త కలలా ఉంటది. సుట్టు శీకట్లో ఈదర గాలులు ఉక్కిరిబిక్కిరి సెత్తుంటే, డిశంబర్ నెలలో అచ్చె తూర్పు దిక్కు సుక్కలోలే, అంత సీకట్లో కుతం ఎన్నెల ఎల్తురొలే వొత్తాన పూర్ణను సూత్తు జోసెఫ్ "ఏమైంది ఇంతశేపైంది, ఇగ రావేమో అనుకున్న" అని అన్నడు. తన మాటల్ని పట్కోకుండా పూర్ణ అచ్చి జోసెఫ్ పక్కపొంటి కూసోని తన కొంగును ఇద్దర్కి కప్పుకుంటూ కండ్లల్ల నీల్లు నింపుకొని జోసెఫ్ని అల్లుకపోయింది.
పూర్ణ సుట్టూరా శేతులు పోనిచ్చి తనకి ఇంకా దగ్గర్గా లాక్కొని, "ఏమైంది" అని అడ్గిండు జోసెఫ్.
"మా మామ శెట్టుమించెలి జారిండే" అని తన లోపలున్న బాధనన్సుకుంటు సమ్దానమిచ్చింది పూర్ణ.
అవునా..! అసలు ఏమైంది నర్సి బాబాయ్కి అని అచ్చెరంతో మల్ల అడ్గిండు జోసెఫ్.
"సాయింకాలం మామ శెట్టెక్కి కల్లు లొట్టి దించ్తుంటే మోకు జారిందట, ఐతే ఎంబటే తాటిశెట్టును కర్సుక పట్టిన కుతం జర్ర జర్ర జారిపడి, మామ చాత్పొంటి, కొంకుల్పొంటి మల్ల జబ్బలపొంటి తాటిపేడ్లు గీర్కపోయి ఎర్రగా ఐంది అని ఏడ్తూ జెప్పింది.
తన శంపలపొంటి కార్తున్న నీల్లను తుడ్సుకుంటా జోసెఫ్ మరింత్గా పూర్ణను అముల్కొని తన నొసల్పై ముద్దునిత్తు, "ఇప్పుడైతే మంచిగనైతే ఉండు కద అని అన్నడు.
"హ కానీ, మా అవ్వ సచ్చిన్కానుండి నన్ను దెచ్చుకొని బిడ్డలెక్క సాత్తాండు, కన్నబిడ్డ అమ్ముల్ని గూడట్ల జూశ్కోలే. అయిన మా మామ శెట్లెక్కితే గాని మాయిల్లు గడ్వదు. అద్గాక రికాం లేకుండా ఏ పని దొర్కితే ఆ పన్కిబోతడు. అట్లాంటిది మావోనికేమన్నైతే ఏంగాను మా బత్కు" అని బదులిచ్చింది పూర్ణ.
జోసెఫ్ ఒక్కశార్గ పూర్ణలోని బాధను మర్శెలా గట్టిగా అముల్కొని పూర్ణ వొల్లంత తడ్ముతూ, ముద్దుల్తో తడ్పేశాడు. ఎచ్చగా జోసెఫ్ శేతులు తాకేసరికి పూర్ణ వొల్లంత అదిరి, తన ఆలోచలన్లన్ని దెంకపోయాయి. ఆ రాత్రిలో ఏకమయ్యి ఇద్దరు కల్శి మరో కొత్త కల కన్నరు. సూట్టురా ఎన్నో ఇసపు పురుగులు పూశున్న, ఆ కంకిశేను చీకట్లను మిన్గురేల్గులు శీర్తుంటే, ఊపిరి తీశ్నట్లైతున్న సలిలో ఈదర గాడ్పులు గూడ ఎచ్చగా అనిపిత్తాంది యిద్దరికిప్పుడు. ఆ కలయ్క రేపిన ఆయితో పూర్ణ "బావ మనం మన కులాల్ని కాదని కల్తానం కద, రేపీళ్ళు మనల్ని ఒప్పుకుంటరంటవా" ? అని అడ్గింది.
"అస్సలు ఒప్పుకోరే"
"మరి ఏం జేద్దామే, నేనైతే నిన్ను ఒదిలి బత్కలేను బావ, ఎటైనబోయి బత్కుదామా"
"నాగ్గుత అట్లనే అనిపిత్తాంది గానీ, మా ముసల్లోలను సూత్తనే బయమేత్తాంది. మా అవ్వాయ్య లేకున్నా నన్ను ఇంతటోన్ని జేశిర్రు, నే ఏటన్నబోతే ఆళ్ళేం గావలే అని గొంతులో గుట్కెత్తు జోసెఫ్ మొఖం మాడ్చిండు.
పూర్ణ, మాడ్చిన జోసెఫ్ మొఖాన్ని శేతుల్తో తుడ్తూ తన చెంపల్పొంటి ముద్దిచ్చి, "కొన్ని దినాలెలే మల్ల ఇటే అద్దాం.
సరే మరి నేన్బోనా అచ్చి చాలా సేపైతంది" అని అన్నది.
"సరే మంచపో"
*
ఊళ్లే పొద్దెక్కగానే పనారాటంతో ఎక్కడోళ్ళు అక్కడ్కి బోయిండ్రు. అట్లనే గొర్లను కొట్టుకుంటూ బాషి, జోసెఫ్ని ఎంబడెట్టుకొని ఊర్దాటి శాన దూరమచ్చిండ్రు. నెత్తి మీద ఎండ సుర్రుమంటు ఎన్ను తాక్తుంటే జోసెఫ్ శిరాక్తో "ఏమే బాషన్న మంచ పన్నోన్ని ఈ ఎండల తిప్పబడ్తివి".
"ఏమ్రా అయ్సు పొరడు పొద్దెక్కేదాక పంటర్రా" అని ఎక్కిరిచ్చిండు బాషి.
"గదంత గాద్గాని గిప్పుడు నీ గొర్లతోబాటు నన్నెంద్కు దోల్కచ్చినవో గద్జెప్పు" అని మల్ల గదే శిరాక్తో అన్నడు జోసెఫ్.
"ఉచ్చాగ్దార , జేప్పెదాక ఇనవ్ ఇటిను మొదాలు, మీ అయ్య నేను సొంత అన్నదమ్ముల్లెక్క ఊళ్లే తిరిగేటోళ్లం, తాగేటోళ్లం. కానీ, మీవోడు కొత్వాల్ దొరోడి బాయి పన్కిబోయి సచ్చిన్కానుండి నాకు నిమ్మలం లేద్రా. ఆరోజు మస్త్ లొల్లి జెశ్నగనీ, ఆడి దొరతనం ముందు నేచెల్లలేద్రా" అంటు కండ్లకత్తాన నీల్లను తుడ్శుకుంటూ "ఐతే ఇయ్యాల కోన్ని కోశ్నరా, మీ అయ్యకు పెట్టలేన్గా, కనీసం నీకైనా ఇంత పెడ్దామని దిస్కచ్చినరా" అని సద్దిని జూపిత్తు అన్నడు.
బాషి మాటల్కి జోసెఫ్ కత్తాన బాధనన్సుకుంటు, "ఊకోయే బాషన్న బోయినోళ్లు మల్లాత్తర" అని సమ్దాయిత్తు "సరే దిందాంబ" అంటూ పక్కనే ఉన్న తుమ్మశెట్టు కిందకు దిస్కపోయిండు.
యిద్దరి నెత్తికున్న తువ్వాల్నిప్పి తన శెమట మోకాన్ని తుడ్తుంటే అత్తాన వేడి గాడ్పులు కుతం దాక్గానే ఒళ్ళంతా ఆయిగనిపించి ఎన్కకు ఒర్గి కండ్లు ముస్కుండ్రు. గప్పుడు జోసెఫ్ పక్కకి బాషి దిర్గుతూ "అరె చిన్న ఒక పాట పాడ్రాదురా" అని అడ్గిండు.
"నీకెట్ల ఎర్కనే నే పాడ్తని" మూశున్న కండ్లను తెర్తు అడ్గిండు జోసెఫ్.
"ఎహే నాకెంద్కు దెల్వదురా ఆరోజు మీ కిస్మస్ పండ్గరోజు బీరు సాయిబోళ్ల యింటి కాడ స్టేజేశి అది.., అది,
దాన్నేమంటార్రా" ?
"అదానే, గిటార్".
ఆ అదే దాన్ని వాయించ్కుంటా స్టేజి మీద నువ్వు పాడ్తాంటే సిన్మాలా హీరో లెక్క కొట్టినవ్ పో" అని మస్త్ సంబ్రపడ్డాడు బాషి.
ఒర్గినోడు లేశి సకులం ముకులం పెట్కొని "అవునానే అన్న" అని అడ్గిండు జోసెఫ్.
"అవున్రా, ఆ మీటింగ్ నడ్తాంటే మొత్తం ఆడపొరగాళ్ల కండ్లల్లా మొత్తం నువ్వే మెదిలినవ్. అది జూశి ఊళ్లే ఎంత మంది కుల్లుక సచ్చిండ్రో" అని అంటూ "నాకోసం ఓ పాట పాడ్రా" అని మల్ల అడ్గిండు బాషి.
ముశి ముశి నవ్వుకుంటా "సరే అన్నం దిన్నంక పాడ్తలే" అని జోసఫ్ లేశి ఎంటదెచ్చుకున్న బాటిల్ నీల్లతో శేతులు కడ్కుండ్రు ఇద్దరు.
*
"అరే జోసెఫ్ గిప్పుడన్న పాడ్రా" అని బాషి అయిపోయ్న సద్ది డబ్బను డొల్లేక్క కోడ్తుంటే "జీవనదిని నా హృదయములో" అంటూ ప్రభువు పాటనెత్తుకుండు జోసెఫ్.
ఇంతకు మున్పు డోలు కొట్టిన అన్భవంతో బాషి మార్శి మార్శి కొడ్తుంటే, జోసెఫ్ పాటలు మార్సుకుంటబోతూ యిద్దరు పాటల్లో మునిగిబోయిండ్రు.
"దెలికుండానే శాన సేపయ్తాంది, ఇగబోదాంబ" అని లేశి గొర్లను మల్లెశిర్రు యిద్దరు. ఎన్నో ముచ్చట్లు ఎట్టుకుంటూ, నవ్వుకుంటా, చూశేటోళ్లకు ఒక్కింట్లోల్ల లెక్కకొడ్తు బోతావుంటే, శేరువు కట్ట మీద పోడ ఎండ సొగసుకు శెమట సుక్కలద్దినట్లు ఈపంత మెర్తుంటే కట్టెల మోపెత్తుకొని, పిల్లకాలువంకోలే నడుమంకను తిప్పుతూ నడ్తాంది పూర్ణ.
ఆళ్ల మాటలిని పూర్ణ ఎన్కకు ఒక్కశార్గ తిర్గి జోసెఫ్ని జూత్తు ఓ నవ్వు నవ్వి ముంద్కుబోతుంటే, జోసెఫ్, పూర్ణ కండ్లాంకలను, నడుమంకను జూశి తన కాళ్ళ అడుగుల్కి వంకలు పడ్డాయి. ఇందంత జూత్తాన బాషి "ఏడిదాకచ్చిందిరా మీ కత" అని అడ్గిండు.
జోసెఫ్ అదిర్బడి పూర్ణ మత్తులోంచి బయటకత్తు "నీకెట్ల దెల్సునే" అని అచ్చెరంతో మల్లదిర్గి అడ్గిండు.
బాషి పక్కకు బోతున్న గొర్లను మర్రెత్తు "నాకు బోనాలప్పుడే దెల్సుర వారి, మా పండుగల్కి నేనెప్పుడు పిల్శిన రానోడివి, ఆరోజు ఆపోరి చిల్కల బోనమెత్తుకొని వొత్తాంటే ఎన్కేన్క నువ్వు ఎగిరేగిరి జూశినప్పుడే సమజైంది నాకు" అని జేప్పిండు.
బాషి మాటల్కి జోసెఫ్ శిగ్గుపడుతూ, నవ్వుకుంటా బాషిని హత్తుకుండు. ఎంబటే "భయంగల్ల కోడాట బదాట్ల గుడ్డెట్టినట్టు, శేశిందంత శేశి గిప్పుడు శిగ్గుపడ్తానవారా" అని నవ్వుకుంటా అండు బాషి.
"అద్గాదే బాషన్న అసలు ముచ్చట, మా పెళ్లి ఐతదా ? అని బయమైతందే" అని నవ్వుతున్న మోకాన్ని మాడ్శి జెప్పిండు జోసెఫ్.
"నీకేందక్కువరా, మంచ సదువ్కున్నావ్, రేపో మాపో నౌకరైతది. వాళ్ళోళ్ళు ఒప్పుకోకపోతెం మీరే ఏటన్నబోయి పెళ్లి జేసుకోనచ్చి, పోలీస్ స్టేషన్లో కూసొండ్రి" అని సలయిచ్చిండు బాషి.
బాషి మాట్లాడుతాంటే గమ్మునుండి సోచాయిత్తు నడ్త ఉండు జోసెఫ్. పర్తితి బాష్కి సమజై జోసెఫ్ కాడ్కిబోయి ఎన్కనుంచి ఎన్నుమీద నేనున్న అన్నట్లు రెండు దెబ్బలేశి "బోయి ఆ పిల్లతో ఏమన్నా మాట్లాడుబో" అని ముంద్కు దోశిండు బాషి.
గొర్లను దాట్కుంటూ జోసెఫ్, పూర్ణ కాడ్కి రాంగానే పూర్ణ ఒక్కశార్గ అదిర్పడి "అబ్బా..! నువ్వుబోయే బావ ఎవల్లన్న జూత్తరు" అని బయంతో అన్నది.
"అద్గాదే నే జెప్పేదీను" అని ఏదో జెప్పబోయిండు జోసెఫ్.
"జెప్పేదేంలే, చీకటైనాక కల్దాం గాని మొదలూ ఈన్నుంచిబో" అని ముంద్కు దన్న దన్న బోయింది పూర్ణ.
బాషి ఆళ్ళిద్దరిని సూత్తు "అరేయ్ గిట్ల బయపడ్తే, రేపు మీ రెండు కులాల పెద్దమనుషుల్ని ఎట్ల ఎదుర్కుంటరు, మీ పెళ్లెట్ల జేసుకుంటరు" అని నవ్వుతుండు.
"అట్లేం లేదే, ఆళ్ల మామ సూత్తడన్న భయం తప్ప, నేనంటే మస్త్ ఇష్టమే ఆ పిల్లకి, నాగోసం ఏమైన జేత్తది" అని అన్నడు జోసెఫ్.
"సరే ఊకే గదె సోయిలుండకు, ఎట్లాయ్యేది గట్లనైతది గాని ఇగ నువ్వు ఇంటికిబో పొద్దుబోయింది" అని జోసెఫ్ ధైర్నం జెప్పుతూ పంపిండు బాషి.
మాపటెండ కుంకుమ్బుసుకోని సన్నగా ఒంటిమీద పడ్తాంటే, రూమల్సుట్టుకొని ఇంటికెళ్తున్నా జోసెఫ్ని జూత్తు "ఈ పొరగాళ్ళు కులాలు కాదన్న కలలా బత్కుతాళ్ళు, రేపీల్లా ముచ్చట ఊళ్లే తెల్తే ఎంత పెద్దలొల్లయింతదో" అని బాషి మెదడ్ల దిర్గుతూ, ఏమైనగాన్ని గానీ పొరగాన్కి ఏం గాకుండా కాపాడ్కోవాలే" అని మన్సుల అన్కుంటూ గొర్లను ఇంటికి తోల్కబోయిండు.
*
జోసెఫ్ ఇంటికచ్చి గోలెంకాడ కాల్శేతులు కడ్కోని ఇంట్ల అడ్గెట్టెశరికి, సలికాలం పొద్దునచ్చె పొగమబ్బులా ఇల్లంత సుట్టపోగతో నిండుంది. "ఓ ముసల్లచ్చి, నువ్వన్న నీ మొగన్కి జెప్పాల్సిందిబోయి, ఇద్దరు కల్శి గుప్పు గుప్పుమంటూ సుట్టతాగుతాల్లా? ఇగ సూడు ఇల్లంత మీ సుట్టపోగతో అసలేం అవుపడ్తలే" అని మొత్తుకుండు.
ఇద్దరు ముసలోళ్లు ముశి ముశి నవ్వుకుంటా "ఇట్రారా అయ్యా" అని శేతుల్శాశి జోసెఫ్ని పిల్శింది లచ్చి.
జోసెఫ్, లచ్చి కాడ్కి రాంగానే తన రెండు శేతుల్తో జోసెఫ్ మోకాన్ని దీస్కొని ముద్దునిత్తు "అరయ్య నీ అవ్వయ్యలు కాలం జేశినాక నిన్నే కండ్లల్లబెట్టుకోన్ని బతుక్తున్నంరాయ్యా" అని నీల్లు దెచ్చుకుంది.
"ఇగ ఊకొయే అవ్వ, ఏదో సుట్టవాసోనోచ్చి అన్న మల్లగిట్ల ఏడ్వకు" అని అన్నడు జోసెఫ్.
"సరే బిడ్డ ఏడ్వనుగాని సుట్ట ఆరిపోయ్నట్టుంది, ఇంత నుప్పు దెచ్చియ్యారయ్యా" అడ్గింది లచ్చి.
"దోశ్ బో, మీరు మారారే ఇగ" అంటూ జోసెఫ్ బయటిక్తాంటే "అరే పిలగా నీగోసమని వట్టితున్కల కూర అండిన్రాయ్యా ఎటుబోతనవ్, ఇంతదింద్వురా" అని పిల్శింది లచ్చి.
"దెహె బో మీ సుట్టపొగ బోయేదాక నే తిన" అన్కుంటూ యింటి ముందు కూసుండు జోసెఫ్.
సాటింపు జెప్పే పెద్దమనిషి కట్టన్న సైకిల్ మీద జోసెఫ్ కాడ్కి ఆగమాగం వొత్తాంటే "ఏమే పెద్దయ్య ఇట్గిట్ల బాట పట్టినవ్ ఏమన్నా అయింద ఏంది" అని అడ్గిండు జోసెఫ్.
"అవునాయ్య కొత్వాల్ సారోత్తండట, మన నాల్గువాడల పెద్దమనుషుల్ని, జనాల్ని, అందర్ని గిన్నెశెట్టు కాడ్కి రమ్మన్నరు. అందరు ఆన్నే ఉన్నరు, మిగిలినోళ్ళకు జెప్పుకుంటా నీదాకచ్చిన ఆడ్కిబా" అని అన్నడు కట్టన్న.
"సరే వత్తనబాయే" అని జోసెఫ్ జెప్పగానే కట్టన్న ఆడ్నుండి బోయిండు.
"కొత్వాల్ దొరంటే ఈ సుట్టుపక్కల ఆయిన్ను కాదని ఏ పనిగాదు, ఏ కాంట్రాక్ట్ ఐన అయినే పట్టాలి, ఏ ఇక్కటోచ్చినా అయినే తీర్వాలి. ఊళ్లేగూడ ఏ కులన్కి పెద్దమన్శి ఎవడున్న పెద్దరికమైతే కొత్వాల్దె. ఆయిన్ను కాదని ఏ కులపొడు ఏపని జెయ్యడు, కాదన్నోన్ని జూశిన దాకల్లేవు గూడ. ఒకేలుంటే ఆడి సంగతేందో జెప్పేదాక ఊకోడు. అందేందోగాని కొత్వాల్ ఇన్నిజెత్తున్న ఒక్క కేసుగూడ కాలేదు. అయిన అచ్చిన ప్రతాఫీసర్లు, పోలిసొళ్ళు కొత్వాలిచ్చే దావత్లా మున్గుంతాంటే ఎట్లా ఐతది. అసోటోండు మా వాడక్తాండంటే ఏదో పెద్దపనే ఉంటది" అని మన్సుల అన్కుంటూ గిన్నెశెట్టు కాడ్కి నడ్తాండు జోసెఫ్.
*
(ఇంకా ఉంది)
ముగ్గురు బిడ్డల తల్లయినా శారదమ్మ అలా కనబడదు. నాజూగ్గా,సన్నగా,తెల్లగా ఉంటుంది శంకర్రావు గారు శారదమ్మ భర్త. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి ఆరు నెలల కిందట పదవీ విరమణ పొందారు. ఛామనచాయ సన్నగా పొడుగ్గా ఉంటారు.
పెళ్లయిన నాటి నుంచి ఆ భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు రాలేదంటే.... నమ్మకం వారి మధ్య ఎంత గట్టి బంధాన్ని వేసిందోమరి!
పిల్లలు ముగ్గురూ ఉద్యోగాల్లో స్థిరపడడంతో ఏడేళ్ళ క్రితం కొడుకులకీ, నాలుగేళ్ల కిందట కూతురికి. పెళ్లిళ్లు చేశారు. పిల్లలంతా 24 గంటల్లోపే ఇల్లు చేరుకునేంత దగ్గర్లోనే ఉన్నారు. సంవత్సరంలో మూడు సార్లు పెద్ద పండక్కి, దీపావళికి,ఉగాదికి అంతా వచ్చి వెళ్తుంటారు.పిల్లలకి తండ్రంటే గౌరవం, భయం. తల్లంటే అభిమానం.
*** ***** ****--
వాట్సాప్ లో ఉదయం వచ్చిన ఆ ఇన్విటేషన్ గురించే పిల్లలు ముగ్గురూ మాట్లాడుకున్నారు. ఆ ఇన్విటేషన్ సుమ నుండే వచ్చింది. తనిప్పుడు అమెరికాలో ఉంటోంది. శారదమ్మ దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకునేది. రెండేళ్లకిందట వచ్చినపుడు శారదమ్మను కలిసింది. అంతే తెలుసు పిల్లలకి. శారదమ్మ కు. సుమకు మధ్య ఏం జరిగిందో వాళ్లకి
తెలీదు.
******
అందరూ ఇంటికొచ్చేసరికి శారదమ్మ వంటలన్నీ
సిద్ధం చేసింది. అందరూ తయారయ్యే లోగానే ఆమె గది లోకి వెళ్లి పోయింది. హడావుడి పడుతూనే అందరూ మొబైల్లో జూములో కలిశారు. అమెరికాలో చికాగో నుంచి సభ ప్రారంభమైంది. తెలుగు వాళ్ళందరూ ఒక్కక్కరూ వచ్చి, శారదమ్మను ప్రేమగా పలకరిస్తున్నారు.సుమ కార్యక్రమం మొదలు పెట్టింది.
"ఈరోజు చాలా సంతోషంగా వుంది. అంతర్జాల వేదిక మీద నా చిన్ననాటి గురువు ఋణం తీర్చుకుంటున్నందుకు.అమ్మ చాలా గొప్పవారు. సంగీతమే కాదు. ఇంటి వైద్యమూ బాగా తెల్సినవారు. కరోనా కష్టకాలంలో ఒకరింటి కొకరు వెళ్లలేని వేదనాభరిత సమయంలో ఒంటరితనం ఎంతగానో బాధించేది. అప్పుడే జూమ్ సమావేశాల్లో కల్సు కునే వాళ్ళం. ఆ సమయంలోనే, భారతీయత, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు, ఇత్యాది వన్నీ పిల్లలకు నేర్పించడానికిది అనువైన కాలం అనుకున్నాం. అప్పుడు నాకు అమ్మ గుర్తుకు వచ్చారు. అమ్మని అడగటం, ఆమె సరే అనడంతో పాటలు, కధలు కీర్తనలు ఒకటేమిటి రోజూ ఆమె చెప్పినవన్నీ ఆసక్తి గా నేర్చుకున్నారు పిల్లలు. ఆవిడ మాటలకి పెద్దలం కూడా ఫిదా అయిపోయేవాళ్ళం. అమ్మ తండ్రి గొప్ప ఆయుర్వేద వైద్యులు. ఆమె మా చిన్న చిన్న అనారోగ్యాలెన్నింటికో వంటింటి వైద్యం చెప్పేవారు. అవి చాలా మంచి ఫలితాన్నిచ్చేవి మాకు. దాంతో అమ్మ చెప్పేవన్నీ "అమ్మ ---వంటిల్లు "పేరుతో పుస్తకంగా తెచ్చాను. ఆమె పాడే పాటలు, చెప్పేకథలు మంచి విషయాలు ఇంకా ఆమె జీవితానుభవాలు రికార్డ్ చేసి యూ ట్యూబ్ లో పెట్టాను.ఆమె కిక్కడ చాలా మంది
ఫాలో వర్స్ వున్నారు. నా గురువుకిదే నే నిచ్చుకుంటున్న కానుక ". అంటూ ముగించింది సుమ. అందరి మాటలూ అయ్యాక అమ్మ స్పందన అడిగారు.
"నిజంగా ఇలాంటి ఓ క్షణం వస్తుందని నేనెనాడూ అనుకోలేదు. చిన్ననాడే అమ్మ నుంచీ సంగీతం, నాన్న నుంచీ ఇంటి వైద్య, అబ్బింది నాకు. పిల్లల భాద్యత ల తో అవి ఏటిలోని ఇసక లా కదలకుండా పడి వున్నాయి. మనవలకి అమ్మమ్మ కథలు అవసరం లేదిపుడు. పిల్లలకు అమ్మ చెప్పే అనుభవాలు ఓ చాదస్తం. హాని చేయని వంటింటి వైద్యం ఒక్క మాత్ర..
ముందు ఓడిపోతుంది.అలాంటిది ఈరోజు ఇంత మంది
మనవలకి నా విద్యలునేర్పే అవకాశం, నా అనుభవాలు నెమరేసుకునే అవకాశం రావడం నా అదృష్టం గా భావిస్తాను. పరాయి దేశం లో బ్రతుకుతూ కూడా భారతీయతను, తెలుగు భాష ను, కాపాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నా కెంతో ఆనందంగా వుంది. శారదమ్మ సందేశం తో సభ ముగిసింది.
""పిల్లలందరూ భోంచేసి పడుకోండి రేపు మాట్లాడుదాం "తండ్రి ఆదేశం తో అందరూ పడుకున్నారు. ఆరాత్రి అమ్మ పట్ల వాళ్ళకున్న తేలిక భావాల చీకట్లు తొలగి ఉదయం తో పాటు వాళ్ళ హృదయాలూ వెలిగాయి. సుమ అమ్మ పాట యూట్యూబ్ లో పెట్టి పంపింది. ఉదయాన్నే సూర్య కిరణాలు తనువును తాకుతుంటే, అమ్మ సంగీత స్వరాలు వాళ్ళ చెవిని చేరుకున్నాయి."ఎంత బాగా పాడావమ్మా నువ్వు "ఘుమ ఘుమ లాడే కాఫీ పిల్లల
కందిస్తున్న ఆమె పెదాలపై చిరునవ్వు."మీ అమ్మ మీ ఉయ్యాలనాడు పాడే పాట లేరా ఇవి. సుమ శంఖం లో పోసిందతే. శంఖం లో పోస్తేనేకదా తీర్ధ మయ్యేది నవ్వుతూ అన్నాడు తండ్రి.
ఏ దేశ మేగినా ఎందుకాలిడినా పొగడారా నీ తల్లి భూమి భారతిని. యూ ట్యూబ్ లో శారదమ్మ పాట ఎందరికో కర్తవ్యాన్ని భోదిస్తూ....
భర్తశ్యామ్వచ్చే వరకూ కాస్త టెన్షన్...
ఆలోచిస్తూ సోఫాలో జారిగిలబడి తలను వెనక్కి వాల్చింది రమణి.
ఈ రోజు అమ్మ మరీ, మరీ గుర్తుకు వస్తోంది.
కొన్ని విషయాలు మనసును కలచి వేస్తున్నాయి. అమ్మా తానూ... ఎలావుండేవి ఆరోజులు? అమ్మతో పోట్లాడితే సంతోషం అప్పుడు...నెమ్మదిగా జ్ఞాపకాల పుటలు కదలసాగాయి ...
*****.
“ఈ సారి బర్త్ డే కి నేను నా ఫ్రెండ్స్ ని హోటల్ కి తీసుకెడతా. నీవు ఎలాగూ ఇంట్లో పార్టీ వద్దు అంటావు కదా.
నీ చూపులకు దూరంగా ఎంజాయ్ చేస్తాను..నేనేమీ చిన్న పిల్లను కాను” అంటూన్న కూతురు రమణి ని ఒక్క సారి చూసింది సరస్వతి.
“నేను నిన్నేమీ అడగటం లేదు. నాన్నగారు వచ్చేవరకూ కాచుకుని మరీ అడిగి ఒప్పిస్తాను..”ఛాలెంజ్ గా ఒక్క చూపు చూసింది రమణి తల్లి వైపు. ఇంకేమైనా సమాధానం చెప్పినా గొడవ తప్పదు అని నెమ్మదిగా లోపలికి నడిచింది సరస్వతి..అమ్మ అలా మౌనంగా వెళ్ళటం తోఏదో సాధించినట్టు ఫీల్ అయ్యింది రమణి.
అసలు ఇలాటి విషయాలు నాన్నదాకా పోవాల్సింది కాదు ఎన్నాళ్ళు భరించినా అమ్మ మారటం లేదు. నాన్న ది బిజినెస్ కాబట్టి ఇంటికి రావటం ఆలస్యం కావటం మామూలే. పొద్దున కూడా కాలేజీకి వెళ్ళే సమయానికి ఆయన వున్నా కూర్చుని మాట్లాడే టైమే వుండేదికాదు. అలా అని అమ్మ మరీ చెడ్డదేమీ కాదు. ఏది కావాలన్నా దాన్ని పూర్వా పరాలు ఆలోచించి నచ్చ చెప్పేది. మొన్న కూడా బర్త్ డే డ్రస్ కూడా అంతే. కాలేజీలో అందరూ గ్రాండ్గా వున్న డ్రస్సులే కొంటారు అని చెప్పినా తను మాత్రం అలా కొననివ్వదు ఎందుకో.డబ్బులకేమీ తక్కువ లేదు. నాన్న బిజినెస్ బాగుంది. దేనికీ తక్కువ చేయక్కరలేదు....అసలు నాన్న అమ్మను ఏమీ అనకుండా ఎందుకు వుండేవారు? ఇంట్లో ఏమి జరుగుతోందో పట్టించుకొక అంతా అమ్మ మీద వదలటం ఏమిటీ? ఆమె కాలేజీ చదువుకూడా లేదు. ఆమె పెత్తనం ఏమిటి? ఇలాటి ఆలోచనలతో వున్నప్పుడు రమణి కి అమ్మ తో మాట్లాడడం కూడా ఇష్టం వుండేది కాదు. చాలా విషయాల్లో అమ్మను ఎదురించేది అయినా అమ్మ సమాధానం చెప్పేది కాదు. అది మరీ వొళ్ళు మండేది.
ఒకరోజు బాగా అమ్మను ఎదురించి మాట్లాడాక నాన్నకు చెప్పాలనే రాత్రి మేలుకుని నాన్నకోసం ఎదురు చూసింది. అన్నం కూడా వొద్దని అంటే అమ్మ ఏమీ అనక పోయినా నాన్న రాగానే ముగ్గురికీ కంచాలు పెట్టి డిన్నర్ రెడీ చేసింది.
నాన్న రాగానే “అదేమిటి, రమణి కూడా తినలేదా ఇంతవరకూ “ ఆశ్చర్యపోయారు. “మీరు పిలవండి” అని అమ్మ చెబితే “రమణీ, ఎందుకురా ఇంతసేపు తినలేదు.. రా.. భోంచేద్దాం”అంటే తప్పని సరి కూర్చుంది.
నాన్న అడిగిన వాటికి అమ్మ ముఖ౦ చూడకుండా సమాదానం చెబుతోంటే
“ఏమిటీ ?అమ్మ మీద అలకా?” అని నవ్వి“భోంచేశాక నాదగ్గరికి రా కాస్సేపు” అన్న నాన్నని ప్రేమగా చూసింది రమణి. తన మూడ్ ను క్షణం లో గ్రహించిన నాన్నతో అన్నీ మాట్లాడాలనే అనిపించింది చాలా.. డైనింగ్ టేబల్ దగ్గర అమ్మ మౌనంగానే వుంది. ‘ఇలా వుంటూనే నాన్నని బుట్టలో వేసుకుని ఆడిస్తోంది’అనుకుంది కసి గా.
అమ్మ వంటింట్లో అన్నీ సర్డుతో౦టే గబ గబా బాల్కనీ లో సిగరెట్టు కాలుస్తూ వున్న నాన్న దగ్గరికి వెళ్ళింది.
అక్కడే వున్న కేన్ చైర్ లో కూర్చుంటూ “రమణీ, ఎలావుందిరా చదువు? అమ్మ చూసుకుంటుందనే భరోసా తో మీతో స్పెండ్ చేసే సమయం లేకపోయినా ఫీల్ అవను .. చెప్పు ఏదైనా చెప్పాలా?” లాలనగా అడుగుతున్న నాన్న దగ్గరగా కుర్చీ లాక్కొని ఆయన చేతిలో చేయి వేస్తూ
“నీవు ఇలా అడుగుతూంటే ఎంతబాగుందో నాన్నా.. ఎప్పుడు ఏది మాట్లాడాలన్నా అమ్మ తోనే చెప్పడం,తను చెప్పినట్టు మీరు వినడం తోనే సరిపోతుంది. పైగా చిన్నప్పటి లాగా కాకుండా మీరు మరీ బిజీ అయిపోవడం నచ్చలేదు నాన్నా” మనసులో మాట ఇలా చెప్పడం ఎంతబాగుందో రమణి కి.
“అవున్రా నాకూ అలాగే వుంది.. ఇంతకు మునుపు కంపెనీ ఎలా పైకి రావాలని తాపత్రయం, ఇప్పుడు బాగా నడుస్తోంటే ఇంకొద్దిరోజులు ఇలా నిలుపుకుంటే కొంచెం రిలాక్స్ అవవచ్చని ఉద్దేశ్యం. అయినా ఏమి చేసినా నిన్ను బాగా సెటిల్ చేసి మేమూ హాయిగా వుండాలనే కదరా.. దేనికైనా ఇంట్లో మీ అమ్మ సహకారం తోనే ఇదంతా..”అంటూన్న నాన్నని చూసి తాను చెప్పాలన్నది చెబితే బాగుంటుందా అని ఒక క్షణం ఆగింది.
కానీఈ రోజు ఏమైనా చెప్పాల్సిందే అనిపించి “నాన్నా, మీకు ఎలా చెప్పాలో తెలియక పోయినా ...” రమణి మాట పూర్తి కాకనే
“చెప్పరా.. నా దగ్గర దాయడమెందుకు ?” అన్నారాయన
“నాన్నా నేను చిన్నగా వున్నప్పుడు మీరు ఇంట్లోనే వుండే వాళ్ళు. ఇప్పుడు ఏది కావాలన్నా అమ్మ చెప్పినట్టు వినాల్సిందే.. నాకూ వయసు పెరుగుతోంది. కోరికలు వుంటాయి ఏది కోరినా అమ్మ వెంటనే వినదు. ఆఖరికి నా బర్త్ డే కి మంచి డ్రెస్ కావాలన్నా, పార్టీ చేసుకుంటానన్నా ఒప్పించడం కష్టమే. అది చాలా ఫీల్ అవుతోంది.ఎప్పుడూ నాకు ఒక్కటే ప్రశ్నఇంట్లో ఏమి జరుగుతోందో పట్టించుకొక మీరు అంతా అమ్మ మీద వదలటం ఏమిటీ? అసలు ఆమె కాలేజీ చదువుకూడా లేదు. ఆమె పెత్తనం ఏమిటి? అనిపిస్తుంది...” కాస్త అర్థం చేసుకోండి అన్న భావం తో చూసింది
“రమణీ, నిజమే ఎదుగుతున్న నీకు వచ్చే ఆలోచనను నేను అర్థం చేసుకోగలను. నాకు టైమే దొరకక పోవడం ఒక కారణం అయినా ఈ రోజు మంచి అవకాశం ఇచ్చావు. అమ్మకు నేను ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నానే కదా.. చాలా చెప్పాలి రా.. నీవు చిన్నగా వున్నప్పుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నా ఊద్యోగం పోయింది అమ్మ దైర్యం చెప్పింది. కొన్ని రోజులు ఇల్లుగడవక పక్కనే వున్న చిన్నప్రైవేటు స్కూల్ లో తన టెన్త్ క్లాస్ చదువుతోనే పిల్లలకు చదువు చెప్పేది. అప్పుడే నేను ఇంట్లో వున్నాను.ఒక రెండు నెలల్లో ఇలాగే గడవదని తెలిసి పోయింది.నాకు వెంటనే ఉద్యోగం దొరికే ఛాన్స్ లేదు. ఇరువైపు కుటుంబాలకూ తెలియకూడదని నిర్ణయించుకున్నాక తన కున్న కొద్ది బంగారాన్ని, పుస్తేల తాడుతో సహా నాచేతిలో పెట్టి అమ్మించి౦ది. అమ్మ సలహాతో నాకు ముందు ఉద్యోగం లో వున్న ఎక్స్పీరియన్స్ తో చిన్నగా ఒక ఏజెన్సీ గా మొదలు పెట్టాను. ఎదగడానికి టైమ్ పట్టింది. అప్పుడు ఇంటి గురి౦చి నేను ఆలోచించకుండా.. అన్నీ ఖర్చులు పొదుపు గా చేయడం కాకుండా నీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకో సాగింది. తనకు చదువు లేదు అన్నావు కదా.. చదువు నేర్పేదానికంటే ఎక్కువ జీవితాన్ని చదివింది. చదువుకున్న వారికంటే ఎంతో మెరుగ్గా పని చేసేది. ఆమె ద్వారా కష్ట సమయంలో కూడా నిరాశ పడకుండా ఎలా ముందుకు పోవాలో తెలుసుకున్నాను. నీకు తెలియదుఅమ్మ ప్రైవేటుగా బి. ఎ కూడా పాసయింది.ఏ అవసరానికైనా చదువు సర్టిఫికెట్ చేతిలో వుండాలని చెబుతుంది.
నీకు ఇన్ని విషయాలు ఎందుకు వివరిస్తున్నానంటే అమ్మ మనస్తత్వం తెలుసుకోవాలి ఎందుకంటే తనకు తానుగా ఏదీ చెప్పదు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించే కదా నీవు ఏమి చదివితే బాగుంటుందో నాతో డిస్కస్ చేసింది. ఇంట్లో ఏమి చేయాలన్నా మాకు ఒక ప్లాను వుంటుంది. ఒకటే ధ్యేయం...మాలాగా నీకు ఎప్పుడూ కష్టకాలం రాకూడదు. ఒకవేళ వచ్చినా ధైర్యం గా ఎదుర్కునేలా నిన్ను పెంచాలని. అంతే.
నీ క్షేమమే కాదు, మేము కూడా జీవితాంతం ప్రశాంతం గా వుండాలని... కానీ ఇప్పుడనిపిస్తోంది కొన్ని విషయాలలో మీకూ ఫ్రీడం ఇవ్వాలని, అమ్మ మాత్రం ‘టీనేజీ దాటాక తనే అన్నీ అర్థం చేసుకుంటుంది అనిఅనేది నీ మీద అంత నమ్మకం.. కాబట్టి ఎక్కువగా ఆలోచించకు. రేపటినుండీ గమనిస్తే తెలుస్తుంది ..” అని నాన్న అన్నాక రమణిమనసును కప్పుకున్న ఒక తెర పైకి లేచినా అమ్మనుఅర్థం చేసుకోవాలి చూద్దాం అనుకుంటూ“గుడ్ నైట్ నాన్నా” అని చెప్పి తనరూముకు వెడుతూ అమ్మా, నాన్నల బెడ్ రూమ్ వైపు ఒకసారి చూసింది.
హాయిగా నిద్రపోతూంది అమ్మ!అంత నిశ్చింత ఎలా ???
*****
“రమణీ, ఇక్కడే పడుకున్నావా?” అంటూ లోనికి వచ్చిన శ్యామ్ ని చూస్తూ గతానికి తెర వేసి
“ఏదైనా కుదిరిందా ? మీ ఫ్రెండ్స్ ఏమమన్నారు?” అనడిగింది ఆతృతగా
“ఒక విధంగా ముగ్గురు ఏకగ్రీవంగా ఒకే ఐడియాకి వచ్చాము. పెట్టబడి కష్టం అని శ్రీకాంత్ తప్పుకున్నాడు. నీతో కలిసి నలుగురం.ఒక్కొక్కరికీ ఎంత పడుతుందని డిసైడ్ చేయాలి. “
“పెట్టుబడి పరవాలేదు అనినేను చెప్పాను కదా.. నాకు అమ్మా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కాకుండా నగలు కూడా వున్నాయి. ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి. తప్పకుండా సక్సస్ చూస్తాము.”
“నీ దైర్యమే నాకు శ్రీరామ రక్ష.”అని శ్యామ్ రమణిని దగ్గరికి తీసుకున్నాడు.
పాండమిక్ వల్ల ఇద్దరి ఉద్యోగాలూ ఒకే నెలలో పోవటం జరిగింది. రమణి కంటే ఎక్కువ డీలా పడిపోయాడు శ్యామ్. కానీ రమణి ప్రతి క్షణం అతనికి దైర్యం చెబుతూ ఒక స్టార్ట్ అప్ కంపెనీ పెట్టడానికి ప్రోత్సహించింది. కష్ట కాలం లోనే మనం నిలబడాలి అన్నది చేసి చూపుతోంది.
ఆ రాత్రి “నీలాటి దైర్యస్థురాలు నాకు భార్య గా దొరకడం ఎంత అదృష్టమో..” అంటూన్న శ్యామ్ ఎదమీద తలవాల్చి ‘థాంక్ యు అమ్మా..’ అనుకుంది అమ్మను తలచుకుంటూ.
*******
"సునీతా! రేపు సెకండ్ సాటర్డే నీకు సెలవే కదా .ఓ సారి ఇంటికి వస్తావా ?" సుజాతక్క ఫోన్ చేసింది .
"షాపింగా అక్కా? " అక్క కూతురు సుప్రజ పెళ్లి కుదిరింది. దాదాపు షాపింగంతా చేసేసాము. అయినా అక్కకు కంగారే ఇంకా ఏమన్నా మర్చిపోయామేమో అని.
"ఏమిటో సునీతా! అసలు కథే కంచికి పోయేటట్లు ఉంది. నాకు బావకు ఏం చేయాలో తోచడం లేదు" సుజాతక్క బాధగా అంది.
" ఏమిటక్కా? ఏం జరిగింది ?" ఆతృతగా అడిగాను "పెళ్ళికొడుకు తరపున ఏదైనా " నాకెలా అడగాలో కూడా తోచలేదు.
" లేదు. సుప్రజ ఈ పెళ్ళి ఇష్టం లేదంటోంది. ఆ అబ్బాయి ఫోన్ చేసినా తీయడం లేదట. అతను నాకు ఫోన్ చేసి అడిగాడు 'సుప్రజ బాగానే ఉంది కదా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా ' అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మామూలు జలుబు, జ్వరం వచ్చినా కరోనా వచ్చిందేమోనని మనం భయపడ్డమే కాదు ..ఎవరికన్నా చెప్పాలన్నా భయంగా ఉంది. ఎవరి భయాలు వారివి కదా! 'అదేం లేదు పని ఎక్కువైనట్లుంది నేను చెప్తాలే' అని అబ్బాయికి సర్ది చెప్పాననుకో."
" మరి సుప్రజ ని అడిగావా ఎందుకు మాట్లాడలేదో?" అడిగాను.
"ఆ ..ఆ ..అప్పుడే కదా చెప్పిందా మాట.!"
" ఏ మాట ?"
"అదే ! తనకీ పెళ్లి ఇష్టం లేదని ."
" ఇష్టం లేదందా? నిజమా?"
"అవును" అదిరి పడ్డాను అక్క జవాబుకు
" నీలాగే నేనూ కంగారు పడిపోయాను. కుదరక.. కుదరక కుదిరిన సంబంధం. మంచి కుటుంబం.ముఖ్యంగా అబ్బాయి చాలా బాగున్నాడు కదా."
"సుప్రజ చాలా అదృష్టవంతురాలు అని మనమంతా కూడా అనుకొన్నాం కదా. సుప్రజ కూడా సంతోషంగానే ఉంది. ఇద్దరూ ఇష్టపడ్డాకే కదా నిశ్చితార్థం చేశాము. ఇప్పుడు హఠాత్తుగా ఇష్టం లేదు అనడం ఏమిటి?" నాకు అయోమయంగా అనిపించింది.
" అదే మాకూ అర్థం కావడం లేదు. ఇంకా పట్టుమని 20 రోజులు లేదు ముహూర్తానికి. పత్రికలు ప్రింట్ చేసి అందరికీ పంచడం లేదు. పిలవటం లేదు. మన కుటుంబాల వరకే కదా! అయినా పిలిచినా ఎవరూ రావడం లేదు లే. పిలవటం మా బాధ్యత రాకుండా ఉండటం మీ బాధ్యత అన్నట్లుగా ఉంది ఇప్పుడు. ఇదివరకులా సకుటుంబ సపరివారంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించండి అనే రోజులు పోయాయి..." సుజాతక్క మాట్లాడుతూనే ఉంది.
"నిశ్చితార్థం అయ్యాక ..,ముహూర్తం దగ్గర పడ్డాక వద్దంటే ఏదో బలీయమైన కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలి కదక్కా!"
" అది తెలుసుకుంటావనే నిన్ను రమ్మంటున్నది. ఇష్టం లేదు అన్న మాట తప్ప ఇంకేం చెప్పడం లేదు. తిట్టి.. కొట్టి అడగటానికి అది చిన్న పిల్ల కాదు కదా! నీతోనే కదా అది మనసు విప్పి మాట్లాడేది .అందుకే నువ్వే వచ్చి అడుగు."
"సరే ! అక్కా! రేపు ఉదయం వస్తాను."
" వంట... గింటా అంటూ కూర్చోకు. రఘు.. పిల్లలు కూడా వచ్చేయండి .నేను రమ్మన్నానని చెప్పు రఘుకు. ఉంటాను మరి " సుజాతక్క ఫోన్ పెట్టేసింది.
నేను ఆలోచనలో పడ్డాను. సుప్రజ చాలా మంచి అమ్మాయి. చిన్నపుడు చురుగ్గా.. చదువులో ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ ఉండేది. తర్వాత రాను రాను స్తబ్దుగా తయారయింది. చదువులో కూడా వెనకబడిపోయింది. అది చూసి సుజాతక్క భయపడిపోయింది.
"ఎందుకిలా అవుతోంది తెలియటం లేదు. కనీసం టెన్త్ పాస్ అవుతుందా అనిపిస్తోంది నాకు. ఎంత చెప్పినా వినడం లేదు. ఏమీ చెప్పదు. నువ్వు రా సునీతా! " సుజాత అక్క చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించి.. ఆత్రపడి.. ఆరాట పడిపోతుంది.ఆమె గుండె బరువు తగ్గించుకోవడానికి, ఆమె సమస్యలు పరిష్కరించడానికి.. నా తెలివితేటలు. ఓర్పు ..నేర్పు పనిచేస్తాయని ఆమె ప్రగాఢ విశ్వాసం .
అక్క బాధ పడితే.. ఏడిస్తే నేను తట్టుకోలేను. అక్క నాకు అమ్మతో సమానం. నేను ,అక్క, తమ్ముడు ..మేము ముగ్గురం సంతానం అమ్మకు. తమ్ముడు పుట్టాక అమ్మ ఆరోగ్యం పాడైంది .యుట్రస్ క్యాన్సర్ తో అమ్మ చనిపోయింది .మగ బిడ్డ కావాలని.. నా తర్వాత.. అమ్మ గర్భవతి కావడం ..స్కానింగ్ చేయించడం.. కడుపులో వున్నది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించడం.. ఒక్కోసారి బలహీనమైన గర్భాశయం వల్ల కూడా అబార్షన్లు కావడం వల్లనే ..అమ్మకు యుట్రస్ క్యాన్సర్ వచ్చిందట. తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు పూర్తి బెడ్ రెస్ట్ ఉండాలి అనడంతో పదేళ్ల వయసు నుండే ఇంట్లో పనులు.. నా పెంపకం కూడా అక్క మీద పడ్డాయి. నానమ్మ ఉన్నా కూడా ఎక్కువ కష్టపడింది అక్కే! పాపం అందుకే పదోక్లాస్ కూడా చదువుకోలేక పోయింది. కానీ అక్కకు చదువు అంటే చాలా ఇష్టం . ఆ ఇష్టమే నన్ను ..తమ్ముణ్ణి ఉన్నత చదువులు చదివించింది పట్టుబట్టి. మరి తన కూతురు చదవకపోతే అక్కకు ఎంత బాధగా ఉంటుంది?
నేను వెంటనే వెళ్లి సుప్రజ తో మాట్లాడాను. నిర్లిప్తంగా మన్ను తిన్న పాములా ఎందుకు తయారయిందో ..
నెమ్మది..నెమ్మదిగా రాబట్టాను.సుప్రజ తెల్లగా అందంగా బొద్దుగా ఉంటుంది .బొద్దుగా ఉండటమే ఇప్పుడు సమస్య అయిపోయింది. క్లాస్ లో ..స్కూల్లో.. ట్యూషన్ లో.. పిల్లలు, స్నేహితులు కూడా ఎగతాళి చేస్తుంటారట లావుగా వుందని.. ఏవేవో నిక్ నేమ్స్ తో పిలుస్తారట! అది తట్టుకోలేక పోతుంది. అందుకే చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతోంది. క్లవర్ గర్ల్ అని పేరు పడ్డ అమ్మాయి డల్ అయిపోతే ...మార్కుల శాతం పడిపోతుంటే టీచర్స్ బాధపడి.. వాళ్ళూ తిట్టడం మొదలు పెట్టారు. ఇక ఇంట్లో అక్క ఆవేశపు అరుపులు ! ఇన్ని ఒత్తిళ్లను సుప్రజ భరించలేకపోతోంది.
" ఇలా ఉండటం నా తప్పా మమ్మీ ?" నా ఒళ్ళో తల దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది సుప్రజ. అక్కను 'అమ్మ' అని నన్ను 'మమ్మీ' అని పిలుస్తుంది.
సుప్రజ ఏడుపు చూసి నాకు కడుపులో దేవినట్లయింది. ఒక్కతే కూతురు అని అక్క సుప్రజను బాగా గారాబం చేసింది. చిన్నప్పటి నుంచి.. వద్దు వద్దు అంటున్నా బలవంతంగా తినిపించేది. స్వీట్స్ బాగా అలవాటు చేసింది.
"స్వీట్స్ వద్దు. బరువు పెరగడం తప్ప శక్తి రాదు. పండ్లు కూరగాయలు అలవాటు చేయ" మని నేను ..బావ చెబుతూనే ఉండేవాళ్ళం. అక్క వినేది కాదు.
"అయ్యో! బిడ్డకు మీ ఇద్దరి దిష్టే తగిలేట్టు ఉంది." అని మమ్మల్ని కోప్పడేది.
చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దొస్తారు. నిజమే కానీ పెద్దయ్యాక లావుగా ఉంటే ఇదిగో ఇలాగే మిగతా వాళ్ల హేళనకు గురి అవుతారు. డిప్రెస్ అవుతారు. చదువు సంధ్యలు అటకెక్కి.. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో కూరుకుపోయి ..దేనికి పనికిరాకుండా పోతారు. ఇక్కడే చెక్ పెట్టాలి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము.వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు ఉండాలి అన్నారు. తినే తిండికి తగ్గట్లు ఎక్సర్సైజులు చేయాలన్నారు. బలం ఇవ్వని ..బరువు పెంచే ఫాస్ట్ ఫుడ్.. స్వీట్స్ పట్ల నియంత్రణ, నిగ్రహం కలిగి ఉండాలన్నారు.
పాపం డాక్టర్ చెప్పినట్లే నడుచుకొంది సుప్రజ. అయినా బరువు ఎక్కువగా తగ్గలేదు. మళ్ళీ డాక్టర్ కు చూపించాము. థైరాయి, టెస్ట్ వల్ల తెలిసింది తనకు హైపోథైరాయిడిజం ఉందని.. దీనివల్ల కూడా బరువు పెరుగుతారని. చికిత్స చేయించాము ..కానీ పూర్తిగా తగ్గలేదు. నేను ఎక్కడో చదివాను.. తమలో ఉన్న బలహీనతను , లోపాన్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నూ చేయించాలంటే తమలో ఉన్న ఏదో ఒక టాలెంట్ కు మెరుగు పెట్టుకొని రాణించాలని ..గుర్తింపు తెచ్చుకోవాలని. ఒక రచయిత స్వయంగా చెప్పారు తను పొట్టి గా ఉన్నాను అన్న ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి రచయితగా మంచి గుర్తింపు కోసం.. విరివిగా రాశానని.
అలా బ్రెయిన్ వాష్ ..కౌన్సిలింగ్... నాకు తోచినవి, తెలిసినవి ,చదివినవి, విన్నవి.. మెల్లమెల్లగా చెప్తూ సుప్రజ దృష్టిని చదువు వైపు మళ్ళించాను. తెలివైన అమ్మాయి కాబట్టి పదో తరగతి లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. అది నా వల్లే అని అక్కకు నమ్మకం.
"అది చదివి.. ర్యాంకు తెచ్చుకుంటే నన్ను మెచ్చుకోవడం ఏమిటి?" అని నేను అన్నా ఒప్పుకోదు.
"నువ్వు మాటల మరాఠివి. నీ మాటలతో మాయో, మంత్రమో వేస్తావు. చిన్నప్పుడు కూడా మొహం అమాయకంగా పెట్టేసుకుని... నాన్నను, అక్కను ఏమార్చి నువ్వు చేసే అల్లరి పనులు నా మీదకు నెట్టేసి నాకు తిట్లు, దెబ్బలు తినిపించేదానవు కాదూ!" తమ్ముడు సునీల్ నవ్వుతూనే దెప్పిపొడిచాడు మా బాల్యం గుర్తుచేసుకుంటూ.
మేము ముగ్గురమూ సిటీలోనే ఉండటం మూలాన అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భం కల్పించుకుని కలుసుకుంటుంటాము. ఎక్కువగా అక్క వాళ్ళ ఇంటికే వెళ్తాము. అక్క దగ్గరకు వెళితే పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ మాకు. నానమ్మ చనిపోయాక నాన్నను బలవంతంగా తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంచుకుంది. అక్క, బావ.. ఇద్దరూ నాన్నను చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఈ మధ్యన కాలం చేశారు .
సుప్రజ తన బాడీ షేమింగ్ గురించి పట్టించుకోకుండా చదువు మీదే దృష్టి పెట్టడంతో ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకొని బీటెక్ చదివి క్యాంపస్ సెలక్షన్స్ లోనే మంచి ప్యాకేజీ తో పేరున్న కంపెనీలో జాబ్ తెచ్చుకుంది.
తన తెలివైన పర్ఫార్మెన్స్ తో త్వరలోనే టీం లీడర్ కూడా అయింది. అందం , మంచి ఉద్యోగం , జీతం.. ఎన్ని ఉన్నా ..లావుగా ఉందన్న ఒకే కారణంతో చాలా సంబంధాలు కుదరకపోవడం ..అక్కా బావలను చాలా కుంగదీసింది.
సుప్రజ లోలోపల బాధపడిందేమో కానీ... పైకి ఏమి పట్టించుకోనట్లే ఉండేది.
నాకు ఫోన్ చేసి " పెళ్లి జీవితంలో ఒక భాగమే కానీ.. పెళ్లే జీవితం కాదని అమ్మకు చెప్పు. అయినా ఇక లోకంలో అబ్బాయిలే లేనట్లు ..నేను ముసలి దానిని అయిపోయినట్లు.. నాకిక పెళ్లే కాదన్నట్లు తెగ బాధపడిపోతూ ఉంది. " అనేది ఏదైనా సంబంధం తప్పిపోయినప్పుడు...తల్లి బాధ చూడలేక నన్ను వచ్చి అక్కను ఓదార్చమనేది. అలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు సంబంధం కుదిరి నిశ్చితార్థం అయ్యేదాకా కూడా మాకు నమ్మకమే . నిశ్చితార్ధం జరిగాక చాలా ఆనందించాము . కానీ ఇప్పుడు సుప్రజ పెళ్ళి వద్దనడం.. మాకు మింగుడు పడడం లేదు. సుప్రజతో మాట్లాడితే గాని అసలు విషయం తెలియదు. ఆ రాత్రి ఆలోచనలతో నిద్ర పట్టలేదు.
" హాయ్ మమ్మీ ! ఇవాళో.. రేపో వస్తావని అనుకుంటూనే ఉన్నాను." నేను తన గదిలోకి వెళ్ళగానే లాప్టాప్ లో ఏదో టైపు చేసుకుంటూ అంది సుప్రజ.
నాకు ఎందుకో చురుక్కుమన్పించింది. తమాయించుకుని అన్నాను.
"పెళ్లి దగ్గర పడింది. ఇంకా ఏవన్నా పెండింగ్ పనులుంటే చేయాలి కదా! మరి రాకుండా ఎలా ఉంటాను?"
" అబ్బా! మమ్మీ... చల్లకొచ్చి ముంత దాయడం అంటే ఇదే కదా! " సుప్రజ నవ్వింది. తను పుస్తకాలు బాగా చదువుతుంది .ఇంగ్లీషు ,తెలుగు కూడా!
"చల్ల ..ముంతా.. రెండూ దాచుకునేంత సమయం మనకు లేదు కదా సుప్రజా? అసలు సమస్య ఏమిటి?" నేను సూటిగా రంగంలోకి దిగిపోయాను.
"పరిష్కారం అయిపోయిందిలే మమ్మీ! ఓకే ! " ఎంతో నిర్లక్ష్యంగా అంది సుప్రజ. నేను నివ్వెరపోయాను.
"సుప్రజా! పెళ్లి అనేది నీ ఒక్కదానికే సంబంధించిన విషయం కాదు. రెండు కుటుంబాలకు ..పరువు ప్రతిష్ట లకు సంబంధించిందని మర్చి పోతున్నావు." నేను కాస్త తీవ్రంగా అన్నాను.
"అంటే ? వాట్ డు యు మీన్ ? పరువు ప్రతిష్ట కోసం నా జీవితం పణం పెట్టమంటారా? " సుప్రజ ఉద్రేకంగా అంది.
" అలా ఎలా అంటాను ? కానీ ..నువ్వు సరేనంటేనే కదా సంబంధం ఖాయపరిచింది. నిశ్చితార్థం జరిగింది." నేను..నా స్వరాన్ని మెత్త పరిచాను.
" నిజమే! కానీ ఇప్పుడు కాదంటున్నాను కదా ! నేనేమన్నా చిన్న పాపనా? కాదు కదా! నేను బాగా ఆలోచించే తీసుకున్న నిర్ణయం ఇది."
"కావచ్చు. కానీ ..దానికి కారణం తెలియాలి కదా! ముందు మాకు తెలిస్తే కదా వాళ్లకు చెప్పడానికి? నిశ్చితార్థం అయ్యాక ..పెళ్లి క్యాన్సిల్ అంటే...."
"అయితే ఏంటట ? అసలే.. నేను కొబ్బరి బొండం.. పూరి.. పీపా .. బోండా...గుమ్మడి పండు ... లా ఇంత లావున వున్నాను కదా! నాకు పెళ్లి కుదరడమే చా..లా గొప్ప విషయం . అందులోనూ.. అబ్బాయి అందగాడు. అయినా సరే నన్ను పెళ్ళి చేసుకుంటున్నాడు. సో ... ఒకవేళ ..అతనేమన్నా అన్నా గాని పట్టించుకోకూడదు. సర్దుకుపోవాలి. అని నాకే నచ్చ చెప్తారు కానీ నా బాధ మీరు అర్థం చేసుకుంటారా? అందుకే నేను మీకు ఎవరికీ చెప్పలేదు. నేనే నిర్ణయం తీసుకున్నాను." మొహం, కళ్ళు కోపంతోనో, బాధతోనో ఎర్ర పడిపోయాయి.
"మీరు ఎవరితోనూ మాట్లాడాల్సిన పని లేదు. ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. నేను ఇప్పుడే అతనికి మెయిల్ పెట్టేసాను. ఈ విషయం ఇంతటితో ముగిసిపోయింది. అంతే!" గంభీరంగా మరి తిరుగే లేనట్లు స్పష్టంగా చెప్పింది సుప్రజ.
నేను నిర్ఘాంతపోయాను. హఠాత్తుగా సుప్రజ నా ఒడిలో తల పెట్టుకొని ఏడవటం మొదలెట్టింది. తను ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఓదార్పుగా తన తల నిమురుతూ ఉండిపోయాను. కాసేపయ్యాక తేరుకొని లేచి కూర్చుంది. లాప్టాప్ నా ముందు పెట్టి తను పెట్టిన మెయిల్ నాకు చూపుతూ చెప్పింది.
" అతనికి నచ్చింది ..నేను, నా వ్యక్తిత్వం కాదు మమ్మీ. నా ఉద్యోగం , హోదా, జీతం, నా వెనక ఉన్న ఆస్తి. అంతే! అది నిశ్చితార్థం అయ్యాక అతని మాటలు, ప్రవర్తన చెప్పాయి. నిశ్చితార్థం అయ్యాక ఆడపిల్ల ..ఆమె తల్లిదండ్రులు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోరు అన్న ధీమాతో ఉన్నారు.థాంక్ గాడ్ ! పెళ్లికి ముందే అతను తన అసలు రూపాన్ని చూపాడు. తనేదో చాలా పెద్ద త్యాగం చేస్తున్నట్లు మాట్లాడేవాడు. మేమిద్దరం ఉన్నప్పుడే కాదు తన ఫ్రెండ్స్ ముందర కూడా బాడీ షేమింగ్ మాటల ఈటెలు గుచ్చుతూనే ఉన్నాడు. చివరకు... డన్లప్ బెడ్ అని కూడా... ఛీ ! ఛీ! వద్దు మమ్మీ ! కొంచెం కూడా అతడికి సంస్కారం లేదు ..కానీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అతను నాకొద్దు గాడ్ ! పెళ్లికి ముందే తెలియటం.. రియల్లీ ఐ యాం లక్కీ! " సుప్రజ రిలీఫ్ గా, ఆనందంగా, దృఢంగా చెప్పింది.
మెయిల్ చూశాను. చదివాక ..నా పెదవుల మీద చిరునవ్వు విచ్చుకుంది అప్రయత్నంగా. నా చేయి సుప్రజ భుజాన్ని మెచ్చుకోలుగా పట్టుకొంది గట్టిగా, గర్వంగా.
"మన పెళ్లి ఒప్పందాన్ని నేను రద్దు చేసుకుంటున్నాను. ఎందుకంటే ..జీవితంలో.. నా వేదనలోను, వేడుకలోనూ తోడునీడగా.. అడుగడుగు అండదండగా.. కలసి నడిచే ఒక జీవన సహచరుడ్ని కోరుకుంటున్నాను కానీ అనుక్షణం నన్ను బాడీ షేమింగ్ కు గురి చేసి ..పైశాచిక ఆనందం పొందే ఒక శాడిస్టు ను కాదు. మీకు తెలుసో లేదో.. బాడీషేమింగ్ ,(శరీర అవయవాల్ని కామెంట్ చేయటం), కలరిజం (శరీర వర్ణాన్ని కామెంట్ చేయటం) చట్టరీత్యా నేరాలు. అలా చేసిన వారిపై కేసు కూడా పెట్టొచ్చు. ఇటీవలే ఓ నటి తన శరీర రంగు గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వారిపై కేసు పెట్టింది కూడా! సో భద్రం గురూ! మీకు తప్పకుండా పెళ్లి అవుతుంది. పాపం ఆ అమ్మాయిని దేవుడే కాపాడాలి. గుడ్ బై ఫరెవర్ !"
-------------***---------
ప్రతి గురువారం మల్లంపల్లి ఊర్లో అంగడి(సంత) . ఆ ఊర్లో పనిచేసే టీచర్లందరూ అప్పుడప్పుడు అంగడిలో తమకు కావలసిన సరుకులు కొనుక్కునే వాళ్ళు .
అక్కడే కూరగాయలు కొంటున్న సుమనకు ,నమస్తే మేడం అన్న మాట వినిపించగానే తలెత్తి చూసింది సుమన .
ఎక్కడో చూసినట్టుందేకాని
గుర్తు పట్టలేదు సుమన.
"నన్ను గుర్తు పట్టలేదా మేడం . అవునులెండి మేము ఎందుకు మీకు గుర్తుంటాం
నేను మేడం రమ్యను . ములుగులో మీ స్టూడెంట్ ని"
అన్నది రమ్య .
"అవునా ఏంటి ఇక్కడ చదువు మానేసావా ?"
అన్నది సుమన.
ఒకవైపు బజ్జీ లేస్తూ, మరొకవైపు కాయగూరలమ్ముతూ ,పది చేతులతో పని చేస్తున్నట్లు కనపడుతోంది రమ్య .
అప్పుడే అటుగా వచ్చిన అతనితో "నువ్వు ఇక్కడ కూర్చొని కూరగాయలమ్ము , నేను బజ్జీలు వేస్తానంటూ" వెళుతూ , రండి మేడం ఇక్కడ కూర్చోండని కుర్చీ చూపించింది. వేడివేడిగా వేసిన బజ్జీలు ప్లేట్ లో పెట్టి అందించింది.
" రమ్య గురించి ఆలోచిస్తూనే ఇప్పుడా! వద్దమ్మా! నేను ఈటైంలో ఏమీ తిననమ్మా " అన్నది సుమన.
"అవును మేడం జీవితంలో మర్చిపోయే అలవాట్లా మీవి. స్ట్రిక్టు గావుండే మీరు విద్యార్థులందరికీ ఎప్పుడు గుర్తే , సాయంకాలం బ్రష్ వేయనిది ఏమీతీసుకోరు కదా! అన్నది "రమ్య .
ఏమి కొనకుండా దర్జాగాఅంగట్లో (సంత) కుర్చీలో కూర్చుని ముచ్చటపెడుతున్న సుమన దగ్గరకు వచ్చిన టీచర్లు "మేముందరం కొనవలసినవి కొనుక్కున్నాం . మీరేమీ కొనలేదా "అన్నారు టీచర్లు .
ఇక వెళ్దామా అన్నారందరు.
"ఈ అమ్మాయి రమ్య ములుగులో నాస్టుడెంటని పరిచయం చేసింది" సుమన.
అందరికి నమస్కారం చేసింది రమ్య . "నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే లంచ్ లోబజ్జీలు తెప్పించుకునే వాళ్ళమన్నది రోహిణి ". ఆమెకు చిరుతిళ్ళంటే చాలా ఇష్టం .
"మీరు ఇప్పుడు ఏ ఊర్లో చేస్తున్నారు మేడం .వీళ్ళందరూ టీచర్లేనా" అన్నది రమ్య .
"అవునమ్మా !నేను ఇప్పుడు ఈ వూరు మల్లం పెళ్లి లోనే పనిచేస్తున్న గురువారం ఇక్కడ అంగడి కదా అందరంఅప్పుడప్పుడు కావలసినవి కొనుక్కుంటా మన్నది "సుమన.
"మీరు ఎప్పుడు నాకు కనపడలేదు మేడమ్ .దాదాపు రెండు సంవత్సరాల నుండి ఇక్కడే గురువారం బజ్జీలు ,కూరగాయలమ్ముతున్నానన్నది" రమ్య .
ఇందాక వచ్చినతన్ని పిలిచి ఇతడు నా భర్తంటూ అందరికీ పరిచయం చేసింది . అతను అందరికీ నమస్కరించాడు .చాలా సౌమ్యుని లా కనిపించాడు. సుమనకు . ప్రశ్నార్థకంగా చూస్తున్న సుమనతో "ఇంకా పిల్లలు లేరు మేడం "అన్నది రమ్య.
సరే రమ్య నీ కాళ్ల మీద నువ్వు నిలబడి సంపాదించుకుంటున్నావు చాలా సంతోషం , ఇంకా ఎదగాలి నువ్వంటు ఒక పచ్చనోటు ఆమె చేతిలో పెట్టబోయింది . ఇప్పటికే మీ రుణం తీర్చుకోలేనిది. మీ మంచి మాటలు వినిపించుకోలేక పోయానన్నది .ఆమె కన్నుల్లో సన్నటి నీటి పొర.
అందరూ తినండంటూ , మిరపకాయ బజ్జీలు మసాల చల్లి టీచర్లకందరికీ ఇచ్చింది రమ్య. రమ్య చాలా బాగున్నాయమ్మాఅంటూ టీచర్లు అందరు మెచ్చుకొన్నారు.
"కొంచెం ఉప్పుఇస్తా మీరు కూడా మొహం కడుక్కొని తినుమని బ్రతిమాలింది" రమ్య.
బలేదానివే రమ్యా ! నాకు ఏమి వద్దు అనగానే, సరే ఇంటికి తీసుకు వెళ్ళండన్నది రమ్య కాదనలేకపోయింది సుమన.
సాయంత్రం నాలుగైందంటె మొహం కడుక్కోనిది మంచినీళ్ళు కూడా తాగదు సుమన.
ఇంటికి వెళ్ళిన తర్వాతనే అన్ని అని ,ఆమెను దగ్గరగా చూసిన వారందరికీ ఆ విషయం తెలుసు. ఏదో ఒకటి కొనుక్కొని తింటూనే ఉంటారు కొందరు టీచర్లు .
వస్తామమ్మా రమ్య .జాగ్రత్తని టీచర్లందరూ బస్సెక్కారు.
నేను కూడా చదువుకుంటే అలా వెళ్ళే దాన్నేమో అని వెళ్ళిన బస్సు వంక చూస్తూ పనిలో పడింది రమ్య.
మంచి జీవితాన్ని పాడు చేసుకున్నదనుకున్నది సుమన.
ములుగు హాస్టల్ లో ఉండి చదువుకునేది రమ్య. అప్పుడు ఎనిమిదవ తరగతి నుండి తమ్మిదవ తరగతి వచ్చింది. చదువుకంటే ఇతర విషయాల మీద ఎక్కువగా మక్కువని గ్రహించింది సుమన.
క్లాస్ టీచర్ గా సుమన చాలా స్ట్రిక్ట్ గా ఉండేది .ఆ పక్కనే బాయ్స్ స్కూలు కూడా ఉండేది. ఇంటర్వెల్ కాగానే బయటకు వెళ్లిపోయేవారు ఆడపిల్లలు. వాష్ రూమ్స్ ఉండేవికావు. ఉపాధ్యాయులూ ఇబ్బందిపడేవారు .ఒకటే వాష్ రూం ఉండేది . అటెండర్ కు డబ్బులిచ్చి నీళ్లు పెట్టించుకుని శుభ్రం చేయించుకునేవారు టీచర్లు .
అప్పుడప్పుడూ "బాయ్స్ " స్కూల్ నుండి ఒక రిద్దరు పిల్లలు క్లాసురూముల దగ్గర తచ్చాడుతుండేవారు .వారిని అటెండర్ బెదిరించి పంపేది .
ఉన్న టైంలో కొంత నీతి బోధ చేసి తమ పాఠాలు చెప్పుకునేవారు కొందరైతే , పిల్లల ప్రవర్తనను డేగ కళ్ళతో చూసే వారు కొందరు .అందులో మొదటి వ్యక్తి సుమన.
అటెండర్ లక్ష్మిని ఇంటర్వెల్ కాగానే బయటనే నిలబడమనేది సుమన. పిల్లలు ఎటు వెళ్తున్నారో కనిపెట్టి చూడమనేది. ఒకటి రెండు సార్లు రమ్య ఇంటర్వెల్ కాగానే మల్లీ స్కూలుకు రాలేదు. ఇలా ఐతే పిల్లులు చెడిపోతారని, పిల్లల గురించి ఆలోచించాలని ,ప్రతి క్లాసులో అటెండెన్స్ తీసుకొని క్లాస్ టీచర్ కుఇచ్చేవారు .అలా బయటికి వెళ్లి ఎప్పుడు వచ్చిందో చెప్పి ఎక్కడికెళ్లావ్ అంటూ అందరిని ఆరాతీసేవారు సుమన, మిగతా క్లాసు టీచర్లు.
పెరుగుతున్న వయసు తప్పటడుగులు వేస్తే కష్టమని మంచి చెడుల గురించి క్లాస్ కు ముందు ఐదు నిమిషాలు నీతి వాక్యాలు చెప్పేవారు టీచర్లు.
ఎంత చెప్పినా వినని పిల్లలకు హెచ్ ఎంతో పాటు ఓ నలుగురు టీచర్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు.
ఒక రోజు తమ స్కూల్ లో రమ్య ,బాయ్ స్కూల్ లో టెన్త్ క్లాస్ అబ్బాయి ప్రకాష్ అన్న రవి తో వెళ్ళిపోయిందని తెలిసి టీచర్లందరూ బాధపడ్డారు. అప్పుడు వెళ్లిపోయిన రమ్య ఇన్ని సంవత్సరాలకు కనిపించిందనుకుంటు ఆలోచనలోవున్న సుమనతో మేడం ఇంకా ఏమాలోచిస్తున్నారు మన స్టేజీ వచ్చింది దిగండన్నారు టీచర్లు .
స్కూలుకు వస్తుంటె కొన్నిరోజులవరకు రమ్య గురించి ఆలోచనలే వెంటాడేవి సుమనను .చాలా రోజులవరకు మళ్ళీ రమ్య కనిపించలేదు .ఆమెగురించి ఆలోచనలు మరుగు పడుతున్న వేళ ఒకరోజు సరాసరి స్కూల్ కె వచ్చింది రమ్య .
"నమస్తే మేడం. మీతో కొంచెం సేపు మాట్లాడాలని వచ్చానన్నది" రమ్య.
"సరే అమ్మ ఇంటర్ వెల్ తరువాత నాకు లీజరుంది అప్పుడు మాట్లాడుకుందామన్నది" సుమన.
"చెప్పమ్మ రమ్య ,ఏం కావాలన్నది "సుమన .
ఏమీలేదు మేడం మీరు ఇక్కడే పనిచేస్తున్నారని తెలియదు. తెలిస్తే మిమ్మల్ని కలిసే దాన్ని" అన్నది రమ్య .
"ఆ రోజుల్లో మీరు అలా చెప్తుంటే మీ మీద నాకు చాలా కోపం వచ్చేది . మీరు చెప్పేవన్ని మా మంచికని నాకు తరువాత అర్థమైందన్నది" రమ్య .
"అసలేం జరిగిందన్నది " సుమన.
హాస్టల్ కు అప్పుడప్పుడు మా కోసం రవి వచ్చేవాడు కాసేపు చెట్టు కింద కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయేవాడు. డిగ్రీ చదివి ఆపేసానని చెప్పాడు. అప్పుడప్పుడు నాకొరకు తెచ్చే బహుమతులు చూసి సంబర పడేదాన్ని .
కొన్నిరోజుల తర్వాత నాతో వస్తే పెళ్లి చేసుకుంటానన్నాడు. మాది చాలా పేద కుటుంబం. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఇంటికి పోతే తినడానికి కూడా ఉండేది కాదు.
ఇంటికి పోగానే అమ్మ నాన్న నన్ను కూలికి తీసుకు పోయేవారు . చెల్లెల్లు మాఊర్లోనే చదువుకునే వాళ్ళు. అతను చెప్పిన మాటలు నమ్మి వెళ్తానంటే కీర్తన వద్దని చెప్పింది. మీకు చెప్తానని బెదిరించింది .ఐనా వినక బడి లో పుస్తకాలుపెట్టి వెళ్ళిపోయాము .నా దగ్గర ఎక్కవ డబ్బులు ఏమి లేవు . యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంటానని నన్ను తీసుకు వెళ్ళాడు రవి .రెండు మూడు రోజులు హోటల్ లో ఉన్నాము. ఇది తెలుసుకున్న మా వాళ్ళంతా మన దగ్గర వున్న గుళ్ళన్నీ వెతికారట. ఎర్రగట్టు గుట్ట , కీసర గుట్ట యాదగిరిగుట్టదగ్గర వెతకడం మొదలుపెట్టారట . ఈ విషయం రవికి తెలిసిందేమో నన్ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. లాడ్జి వాళ్ళు అతను రూం కాళీ చేసాడని ,నన్ను బయటకుపంపి లాక్ వేసుకున్నారు. నాకు ఏం చేయాలో తోచక గుడి దగ్గర కూర్చున్నాను. నన్ను మా పెద్దమ్మ కొడుకు గుర్తుపట్టి ఇంటికి తీసుకొచ్చాడు .పంచాయితీ పెట్టి మా బావకిచ్చిపెళ్లి చేశారు .మా బావకు చిన్నప్పుడే ఫిట్స్ వచ్చాయట.మందులిప్పిస్తున్నాము. ఏదైనా చెప్తే చేస్తాడు లేదా లేదు. అందుకే అతన్ని నా వెంటే తీసుకొని వస్తాను . ఇంకా మందులు వాడాలంటున్నారన్నది " రమ్య.
ఇప్పటికైనా మంచి జీవితంలో కాలు పెట్టావు అన్నదిసుమన.
మేడం ఇక నన్ను మళ్ళీ బడికి పంపలేదు .వెంట ఒక మనిషి కాపలాగా ఉండే వాడు. నేను ఎక్కడికైనా వెళ్తాననో ఏమో, కొన్నాళ్ల తర్వాత నేను ఎక్కడికి పోను నన్ను వెంబడించకని చెప్పాను. మా పెళ్లై ఇప్పుడు నాలుగేళ్లయింది . నాకు చదువుకోవాలని వుంది. కానిఎలాగో తెలియటం లేదు. ఇద్దరం కూలీ ,నాలీ చేసుకుంటూ, గురువారం మాత్రం ఇక్కడ కూరగాయలమ్ముతూ , బజ్జీలమ్ముతుంటాను మేడం అన్నది రమ్య.
మీ టీచర్లందరికీ బాగా చదివే పిల్లలు గుర్తుంటారు. మాలాంటి వాళ్ళు గుర్తు ఉండరు అన్నది రమ్య.
"అది నిజమే కాని రమ్య తప్పటడుగు వేసే వాళ్ళని కాపాడుకుంటేనే మాకు తృప్తి. బాగా చదివే వాళ్ళ కన్నా చదువు నేర్పితే నేర్చుకున్నవాళ్ళకుమేము, మాకువాళ్ళుఎక్కువగా గుర్తుంటారు .బాగా చదివే పిల్లలతోపాటు మిగతావాళ్ళు చదవాలన్నదే మాఆశ అన్నది " సుమన.
"అది సరే నీకు చదువుకోవాలనుకుంటున్నావు కదా !, నేను ఇక్కడే ఉన్నాను కనుక టెన్త్ ప్రైవేటు కట్టిస్తా .మేము ఇచ్చిన నోట్సు చదువుకో డౌట్స్ ఉంటే మా దగ్గరకు రా !టీచర్లందరు నీకు సహాయం చేస్తారన్నది సుమన.
"సరేమేడం మీరు చెప్పినట్లు విని చదువుకుంటానన్నది " రమ్య .
"నేను ఏ ఊర్లో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ చేయూతనిస్తూ నే ఉంటానని మీ అందరికీ తెలుసు కదా అన్నది "సుమన.
రమ్య !ఇప్పటికైనా,
అడ్డదారులు వెతుక్కోకుండా మంచి పేరు తెచ్చుకొమ్మన్నది సుమన .
"నా తప్పు నేను తెలుసుకున్న ఇక ఎప్పుడూ పొరపాటు చేయను మేడం "అన్నది రమ్య
"మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని రమ్య భుజం తట్టింది" సుమన.
సన్నగా కురుస్తున్న చినుకులు కాస్త సమయంలోనే హోరందుకోగానే అడుగు ముందేయలేక పక్కనే వున్నబస్టాప్ షెల్టర్ లో నిలబడింది హిమజ.
ఏమిటే ఏదైనా విశేషమా... పెళ్ళై ఏడాది కావస్తోందిగా అంటూ దీర్ఘం తీస్తూ వెనుకనుండి ఓ యాభైయేళ్ళ మహిళ ఓ అమ్మాయిని అడుగుతుంటే...
తననే అడిగారనుకుని ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూడగానే ఆ అమ్మాయి సిగ్గు పడుతూ
“ఏమీ లేదు పిన్ని” అంటూ మందిలో అలా అడక్కూడదనే యోచన కూడా లేదని కళ్ళతోనే సైగ చేస్తూ పక్కకు తిరిగి నిలుచుకుంది ఆ అమ్మాయి.
ఈ మాటల తూటాలకు అలవాటు పడిపోయి చాలా యేళ్ళైంది తనకు. ఇప్పుడూ ఎవరిని అడిగినా తననే అడుగుతున్నారనే భావన తనను వదిలి ఇంకా వెళ్ళలేదు కాబోలనుకుంది మనసులో.
వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో అడుగులో అడుగు వేస్తూ రెండు వీధులకావల వున్న ఇంటికి నడుస్తూ
మది గదిలో సాలె గూడులా అల్లుకుపోయిన కొన్ని చేదు జ్ఞాపకాలు మరిన్ని తీపి నిజాలు మనసును కుదిపేస్తున్నాయి.
"ఏమిటే హిమా ... ఇంకా నీళ్ళోసుకోలేదటే"
హమ్మో ..మా కాలంలో ఐతే నలుగురు బిడ్డల్నేసుకుని వీధిలో తిరిగేవాళ్ళం.. పక్కింటి బామ్మ మాటలు రోజూ రోజాలా పుష్పించాల్సిందే ఆమె నోటిలోంచి.
పెళ్ళై ఏడాది కావొస్తోంది విశేషమేమి లేదా నీ కోడలు... ధీర్ఘ ఉపన్యాసాలు... ఉపనిషత్తులు నూరిపోసే తంతులు ప్రతిరోజూ.. చెవిలో పడాల్సిందే.
చుట్టపు చూపులు కాదు అవి చురచుర కోసే కత్తుల మాటలు గుండెను కోసి పచ్చని కాపురాల మధ్య చిచ్చు రగిలించేవి.
ఏ ముఖం పెట్టుకుని వస్తారో ఓ మందో మాకో తినిపించి ఓ బిడ్డను కనిపించే యోగ్యత లేదు గానీ మా కూతురంటూ ఎగేసుకుని రావటమే కన్నవారిని అనే ఎగతాళి ఈటెలు ఇనుప చువ్వల కంటే ఘనంగా గుండెలో దిగబడేవే రోజూ.
ఇదిగో... ఈ ఫోటో చూడరా లక్షణంగా వుంది పెళ్ళైన ఆర్నెల్లకే నాకో మనవణ్ణో మనవరాల్నో కని చేతిలో పెడుతుంది రెండో పెళ్ళైనా మాకేం అభ్యంతరం లేదని ఎన్ని సంబంధాలొస్తున్నాయో వెనుకనుండి దెప్పి పొడుపులు ఆకలి పేగులను ఎప్పుడూ చీల్చుతూనే వుండేవి.
ఎన్ని మాటలు మనసును గుచ్చినా మనసుపడిన భర్త మాత్రం ఏనాడూ ఒక్క మాట కూడా అనకుండా
గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు.అదే నాకు కొండంత అండగా కనపడిన రాయి రప్ప చెట్టు చేమ
గుడి గోపురం చర్చి మసీదు అన్నీ చుట్టాను.
హోమియో ,అలోపతి, ఆయుర్వేదం,నాటు వైద్యం,ఆకు పసర్లు......ఎవరు ఏమి చెప్పినా అన్ని మందులు వాడాను నా కడుపున ఓ కాయ కాయదా అనే ఆరాటం అమ్మ అని పిలుపించుకోవాలనే ఆవేదనతో. ఏ దేవుడికి నాపై కనికరం లేదనిపించేది. పిచ్చిగా నాలో నేనే ఏడ్చుకునేదాన్ని మౌనంగా మాటలు రాని ఒంటరినైపోయాను. నా పరిస్థితి చూసిన ఓ మిత్రురాలు డాక్టర్ దగ్గరకు నువ్వొక్కటే వెళితే ప్రయోజనం లేదు ఇద్దరూ వెళ్ళి తగిన పరిక్షలు చేసుకోవాలని చెప్పింది.
పిల్లలు పుట్టకపోతే ఎప్పుడు ఆడవాళ్ళనే తప్పుగా చూసి గొడ్రాలిగా ముద్ర వేస్తారు. కానీ మగవారిలో కూడా లోపం వుండచ్చేమో ఇద్దరూ కలిసి వెళ్ళండంటూ సలహా ఇచ్చింది.
ఈ కాలంలో ఇది మామూలుగా తీసుకోవచ్చు . కానీ ఆ కాలంలో సందేహంతో అడిగినా అది వారి అహం మీద దెబ్బగా భావిస్తారు.ఆస్పత్రికి తనతో రమ్మని అడగాలి
అదే ఆలోచనతో రెండు రోజులు గడిపి చివరికి ధైర్యం చేసి తనపై వున్న ప్రేమతో తన మాట కాదనరనే నమ్మకంతో అడిగితే సరేనన్నారు.
హమ్మయ్య... ఆ రోజు ఎంత సంతోషం నా మాటకు విలువిచ్చి నాతో ఆస్పత్రికి వస్తాననడం.
రెండు రోజులు ఇద్దరికీ వైద్య పరీక్షలు చేసి నాలో ఎలాంటి లోపమూ లేదు గర్భసంచి ఆరోగ్యంగా వుందని.
కానీ మీ వారిలోనే లోపం వుంది తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. భూమి నిట్టనిలువునా చీల్చినట్టయింది నాకు. ఈ విషయం మరింత బాధ కలిగించింది. ఎప్పటికైనా అమ్మను కాలేకపోతానా అనే ఆశతో ఆరేళ్ళు గడిపాను కానీ ఇప్పుడు ఎప్పటికీ కాననే విషయాన్ని జీర్ణించుకోలేక పోయాను.
ఇంట్లో పదేపదే పిల్లల ప్రస్తావన వచ్చినప్పుడు నన్నుతిడుతున్నపుడూ నాలో ఏ లోపమూ లేదని గొంతెత్తి గట్టిగా చెప్పాలనిపించేది. ఆడది ఎంతటి అవమానాన్నైనా భరించగలదు. మగవాడు భరించలేడు.
తనను ఎవరైనా పల్లెత్తు మాటన్నా తట్టుకునే శక్తి నాకుండేది కాదు.. అందుకే ఎప్పటికీ తన లోపాన్ని ఎవరికీ చెప్పాలనిపించలేదు. దగ్గరి బంధువుల పిల్లలెవరినైనా దత్తత తీసుకుందామనుకున్నాతల్లి పిల్లలను వేరుచేసిన పాపమెందుకు మనకని వారించాడు భర్త. అనాథ పిల్లలను చేరదీస్తామంటె అత్తమామలు కులగోత్రాలు లేనివారిని గడపలో కాలు పెట్టనీయ్యనని శాపనార్థాలతో విసిగి వేసారి పోయిన హృదయానికి లేపనంగా భర్త సుదర్శన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడవడంతో ,మధ్యలో ఆగిపోయిన నా చదువును మళ్ళీ మొదలు పెట్టమన్నాడు. ఇప్పటికే ఆలస్యమైంది సమయం వృధా చేయక ఇక పిల్లల గురించి ఆలోచించక వేరే ధ్యాసలో వుంటే నీ ఆరోగ్యానికి మేలని ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేయించి బీఈడీ చదివించాడు. తన ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంతోనే టీచరుగా ఎంపికవడం నా జీవితంలో మరో అధ్యాయానికి నాంది పలికింది.
పెళ్ళైన ఏడు సంవత్సరాల వరకు పడిన కష్టాన్నంతా మరచిపోయి మల్లె పొదను అల్లుకోడానికి ఆరంభించాను.
ఆ ప్రారంభంలోనే ఉపాధ్యాయురాలిగా అడుగు పెట్టిన పాఠశాలలోని పిల్లల్ని దగ్గరకు తీసి ఒడిలో కూర్చో పెట్టుకుని అక్షరాలు దిద్దిస్తుంటే అమ్మతనం పొంగుకు వచ్చింది.నాచుట్టూ చేరి వారి చిట్టి చేతులు ఆడిస్తూ మాటలు చెప్తుంటే మైమరచిపోయేదాన్ని.
బడిలో వున్నంత సేపు వారే లోకంగా గడిపేస్తూ ఇంటికి వచ్చినా ఆ పిల్లల ధ్యాసలో నిమగ్నమయ్యేదాన్ని.
ఆటలు పాటలు పాఠాలు అన్నీ టీచరమ్మగా కాక అమ్మగా నేర్పించాను. పిల్లలు కూడా అంతే ఆప్యాయంగా అభిమానంతో వుండేవాళ్ళు.
చక్కగా అన్నీ నేర్చుకుని చక్కని చుక్కల్లా అన్నిట్లో మెరిసిపోతే... మీకు ఎవరు నేర్పారు ఇవన్నీ అంటే మా అమ్మ నేర్పించారని చెప్పేవాళ్ళు.
ఆ క్షణంలో నాకే పిల్లలుంటే ఒకరో ఇద్దరిచేతో అమ్మా అని పిలిపించుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొన్ని వందల మందికి అమ్మనయ్యానని గొప్పగా ఫీలవుతున్నా.
దేవుడు ఒకటి దూరం చేసినా మరొక రూపంలో దగ్గర చేశాడు కదా అనే భావన మనసులో మెదులుతూనే వుంటుంది.
నా ధోరణి చూసి కొంతమంది నవ్వుకున్నా....
ఎగతాళి చేసినా...
అమాయకంగా ఏమీ ఎరుగని చిరునవ్వులు చిందించే పసి హృదయాలను నా గుండెకు హత్తుకున్నప్పుడల్లా
నా గుండె మరింత ఆశగా వారి కలలను పండించే దిశగా అడుగేయమని చెబుతోంటుంది నా మనసు. అదే ధ్యాసలో పాతికేళ్ళు గడిచిపోయాయి.
ఇక అమ్మ అనే పిలుపుకు ఈ రోజుతో ఆఖరి రోజని గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగి జారి చెంపలపై వాలిపోయాయి.
పదుగురిని ఉన్నతంగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయ వృత్తిని విడిచి పెట్టి పదవీ విరమణ చేసి ప్రశాంతంగా ఇంట్లో వుండమని చెప్తున్నారు అందరూ. ఒక నిర్లిప్తత పెదవులపై దొర్లుతూ
నాకు ప్రశాంతత అంటే నా పిల్లలతో గడపటమే కదా వారి అల్లరిని భరిస్తూ వారి ఆటలను ప్రొత్సహిస్తూ వారి భవిష్యత్తుకు వారధిగా వుండటమే కదా నాకు సంతోషం.ఆ సంతోష సంద్రం నుండి నన్ను నేను వెలివేసుకుని మళ్ళీ ఒంటరినై గొడ్రాలిగా మిగిలిపోతానా...
ఏమో మాటలు ఈటెలు మళ్ళీ గునపంలా గుచ్చుతున్నాయి... అబ్బా అంటూ నడుస్తున్నదల్లా గుండెలు అదుముకుంటూ అలాగే కుప్పకూలిపోయింది హిమజ.
నాలుగ్గంటలు ఎలా గడిచాయో తెలీదు
మాగన్నుతో మెల్లగా కళ్ళు తెరిచిన హిమజ చుట్టూ చూసి తనెక్కడుందో తెలుసుకోడానికి క్షణం పట్టింది
కింద పడటమే తెలుసు తర్వాత అని ఆలోచిస్తుంటె
భర్త సుదర్శన్ తలుపు తీసుకుని లోపలికి వస్తూ
అమ్మకేం కాలేదు మీరేం గాభరా పడకండి అంతా మీరనుకున్నట్లే యథావిధిగా జరుగుతుందంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే కళ్ళు తెరిచిన హిమజను చూసి ....
ఫోన్ కట్ చేసి
హిమా అంటూ దగ్గరగా వెళ్ళి
తన కళ్ళతోనే ఏమైందంటూ అడిగేసరికి
హిమ కళ్ళలోంచి నీళ్ళు ధారా పాతంగా వస్తుండటంతో
మాటలు పెగలక ముఖం పక్కకు తిప్పుకుంది
హిమా .. ఇటు చూడు అంటు తన రెండు చేతులతో ముఖం పక్కకు తిప్పి తన కళ్ళలోకే చూసి
ఏంటి చిన్న పిల్లలా కన్నీళ్ళు పెట్టుకుంటూ
నీకేమైనా ఐతే నేనేమైపోవాలి ... నిన్నే అమ్మగా ఆరాధిస్తున్న నీ పిల్లలేమైపోవాలి చెప్పు అంటుండగా సుదర్శన్ ..
ఇంకా ఎక్కడి పిల్లలు ఈరోజుతో నా ఉద్యోగానికి ఆఖరి రోజు కదా ఇక అమ్మా అని ఎవరు పిలుస్తారు
నాకెక్కడున్నారు పిల్లలంటూ హిమ కళ్ళు తుడుచుకుంటూ ఒక్కోపదాన్ని ఒత్తి పలుకుతూ అంటుండగా...
ఐతే మేము మీ పిల్లలం కామా అమ్మా అంటూ
ఓ పదిమంది యువకులు గదిలోకి వచ్చారు
వారిని చూడగానే హిమకు అంతవరకు అనుభవించిన బాధ కనుమరుగై ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది
మధు ,కిరణ్ ,రోహిత్ మీరెప్పుడొచ్చార్రా అంటూ రెండు చేతులు వారికోసం చాచి దగ్గరకు రమ్మంది.
అందరూ హిమకు దగ్గరగా వెళ్ళి నిల్చుని
ఈ అమ్మను వదిలి పిల్లలుండగలరా చెప్పమ్మా అంటూ మధు హిమజ పక్కనే కూర్చుని తన చేయి తీసుకుని ఈ చేయితో అక్షరాలు దిద్దించారు.. మరి ఆ చేయిని ఇప్పుడు వదిలి మేమెక్కడికి వెళతాం అమ్మా అంటూ బుజ్జగింపుగా అనేసరికి...
ఒరేయ్ మధు, నువ్వొక్కడే కాదురా అమ్మ కొడుకు మేము కూడా అని కిరణ్ ,రోహిత్ ,రాజేష్ ,జగదీష్ ఒకేసారి మధు భుజం పట్టుకు ఊపుతూ అనే సరికి
హిమజ కళ్ళలో ఆనంద పువ్వులు విరిశాయి.
ఆ దృశ్యం చూస్తున్న సుదర్శన్ గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
పదినిమిషాలు ఆ గదంతా నవ్వుల పరిమళంతో నిండిపోగానే హిమజ మనసులోని కలతంతా కలలా చెదిరిపోయినట్టనిపించింది.
ఏదో ఆలోచిస్తున్నట్టు హిమజ
అవును మధు నువ్వు నిన్న బాంబేలో వున్నానని ఫోన్లో చెప్పావు కదా.. ఇక్కడికి ఎప్పుడొచ్చావు
కిరణ్ నువ్వు వైజాగ్ వెళుతున్నానని చెప్పి వెళ్ళావు కదా
రాజేష్ ,జగదీష్ ని అనుమానంగా చూస్తూ మీరు రామాపురంలో కదా వుండేది
ఎప్పుడొచ్చారు మీరంతా అంటూ అందరినీ చూస్తూ ఒక్క సారిగా ప్రశ్నలేసింది
అమ్మా... అది అంటుండగా మధు
కిరణ్ ష్ అని సైగ చేయగానే..
సుదర్శన్ ముందుకు వచ్చి వారెంతగానో అభిమానించే అమ్మకు ఏమైనా ఐతే ఎక్కడున్నా రెక్కలు కట్టుకువాలిపోరూ అన్నాడు నవ్వుతూ.
ఐనా నాకేమైందని అంతగా కంగారు పడిపోయి
పిల్లలను కంగారు పెట్టారంటూ చిరు కోపంగా విరుచుకుపడి భర్తపై...
నాకు తలతిరిగి కిందపడటమే తెలుసు ,తర్వాత ఇంటికి ఎలా వచ్చానంటూ అనుమానంగా అడిగింది హిమజ.
ఊరంతా నీ పిల్లలే కదా హిమా....
ఆ పిల్లలే నిన్ను నాకు దూరం కాకుండా ఆదుకున్నారు.
మన వీధి చివర్లో వున్న టీ కొట్టులో పనిచేస్తున్న బాలు ,జోసెఫ్ ఇద్దరూ క్రింద పడ్డ నిన్ను చూసి అక్కడే హోటల్లో టేబుల్ పై పడుకోపెట్టి నా దగ్గరకు పరిగెత్తి వచ్చి చెప్పారు. నేను అక్కడికి వచ్చేలోపు టీ కోసం వచ్చిన ఇంకో అబ్బాయి నిన్ను చూసి ఇక్కడున్నావేంటని తన కార్ లో ఆస్పత్రికి తీసికెళ్ళి అడ్మిట్ చేసి డాక్టర్ కు చూపించాడు. ఆ డాక్టర్ కూడా నీ బిడ్డే మరి అమ్మను కాపాడుకోలేడా క్షణంలో నీకు అన్ని పరీక్షలు చేసి
మానసికంగా ఒత్తిడి ఎక్కువైనందు వలన ఇలా అయ్యుంటది మరేం ఫరవాలేదని కాసేపు విశ్రాంతి తీసుకుంటే మామూలైపోతారని
నాకు ఫోన్ చేసి నేను అక్కడికి చేరుకునేంత వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు.
ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాం అన్నాడు సుదర్శన్ .
భర్త ఎంతగా తనకోసం ఆందోళనతో తల్లడిల్లాడో తన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది హిమజకు.
హిమా రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుదాం అంటూ
అందరూ గదిలో నుండి బయటకు వచ్చారు.
రేయ్ కిరణ్ నువ్వు ఇక్కడే వుండు సార్ కు ఏ అవసరం వచ్చినా చూసుకో....
రేపు ఉదయం పది గంటలకల్లా అమ్మను తీసుకుని ఫంక్షన్ హాల్ కి వచ్చేయండి నేను అక్కడ ఏర్పాట్లు చూసుకుంటాను రాఘవ ఒక్కడే వున్నాడక్కడ అంటూ మధు చెప్పి బయలుదేరుతుంటే
మధు అని పిలిచాడు ... సుదర్శన్
మధు వెనక్కు తిరిగి చెప్పండి సార్ అంటూ రెండు అడుగులు ముందుకు వచ్చాడు
సుదర్శన్ మౌనంగా వుండటం చూసి
సార్.... అన్నాడు
కిరణ్ రాజేష్ లు తదేకంగా మధునే చూస్తున్నారు
సుదర్శన్ మధు చేయి పట్టుకుని సార్ కాదు
నాన్న అని పిలువండి అని అందరినీ దగ్గరగా తీసి గుండెలకు హత్తుకున్నాడు.
తన కళ్ళు చెమ్మగిల్లడంతో మాటలు రాలేదు
మధుకు.
మాకు పిల్లలు పుట్టరన్న దిగులుతో తనెక్కడ నాకు దూరమవుతుందోనని చదువు పై శ్రద్ధ పెట్టించి హిమజను
టీచర్ని చేశాను.. తను టీచర్ గానే కాకుండా మీ అందరి మనసులను గెలుచుకుని అమ్మైంది . కానీ నేను నాన్న కాలేకపోయాను అంటూ కళ్ళనిండా నీళ్ళతో సుదర్శన్ మాట తడబడుతూ అంటుంటే
సార్ ,అంత మాట అనకండి మీరు మాకు తండ్రి కంటె గొప్పవారు. తల్లి దండ్రులను కోల్పోయి చదువు సంధ్యలు లేక అనాథగా వీధుల్లో తిరుగుతుంటే అంత అన్నం పెట్టించి బడిలో చేర్పించింది మీరు అలాంటి మీరు మాకు తండ్రి కంటె ఇంకా గొప్ప స్థానంలోనే వున్నారు సార్ ,
తనను పక్కనే సోపాలో కూర్చోబెడుతూ
సార్, మేమంతా మీరు పెంచిన పిల్లలమే
తల్లిదండ్రులని చూసుకోవడం పిల్లల బాధ్యత
మీరలా ఒంటరిగా వున్నామని మరెప్పుడూ అనకండంటూ తన చేతిలో భరోసాగా చేయి వేసాడు మధు.
సుదర్శన్ కు ఇప్పుడు మనసు తృప్తిగా అనిపించింది.
ఉదయం పదిగంటలు హిమజ రెడీ అయ్యావా పద పదమంటూ తొందర చేశాడు సుదర్శన్
ఏంటో మీ అవసరం.. ఎక్కడికో చెప్పరు
తిరిగి ఎప్పుడొస్తామో చెప్పరు.. మీకు తోడు కిరణ్ వాడి అర్జంట్ కి జెట్ విమానాన్ని నేను కాళ్ళకు కట్టుకోవాల్సిందే అంటూ హిమజ చెప్పులకోసం వెతుకుతుంటే సుదర్శన్ ఎదురుగా నిలుచుని హిమజనే చూస్తూ
ముదురు ఆకుపచ్చ రంగుపై సన్నగా లేత గులాబి రంగు బార్డర్ వున్న ధర్మవరం పట్టుచీర కట్టుకుని
నుదిటిపై ఎర్రటి మధురకుంకుమ దిద్దుకుని
చేతిలో ఎప్పుడూ నిండుగా వుండే మట్టి గాజులతో లక్ష్మీ దేవిలా వున్నావు హిమా... నా దిష్టే తగలుతుందేమో నీకు అన్నాడు కొంటెగా చూస్తూ...
ఆ... మరే ఇప్పుడు మీరు నాకు దిష్టి పెట్టాల్సిన సమయం పదండి మరి అనగానే వారిద్దరి సంభాషణకు కిరణ్ నవ్వుకుంటూ అమ్మా రండి అంటూ కార్ స్ట్రాట్ చేశాడు.
పదినిమిషాల్లో ఓ ఫంక్షన్ హాల్ ముందు ఆగింది కారు
హిమా దిగు ఇక్కడే ఫంక్షన్ అంటు తను దాగి డోర్ తీశాడు
హిమజ కారు దిగి బయట చూడగానే పెద్ద హోర్డింగ్ పై తన ఫోటోతో పదవీ విరమణ శుభాకాంక్షలు
అమ్మకు అంటూ కొంత మంది పేర్లు.
ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిల్చుంది హిమజ.
మధు ,రాజేష్ హిమ దగ్గరగా వచ్చి అమ్మా లోపలికి రండి అంటూ స్వాగత తోరణాలతో ఇద్దరినీ ఆహ్వానించారు.
హిమజ లోపల చూడగానే నమ్మలేనట్లుగా వుంది తనకు
అమ్మా అంటూ అందరూ ఒక్కసారిగా తన చుట్టూ చేరారు
అందరూ తనకు దగ్గరైన వారే తన దగ్గర అక్షరాలు దిద్ది చదువు నేర్చుకున్నవారే.
హిమజ నోటి వెంట మాటలు రావడం లేదు
వారందరినీ అలా చూస్తూ వుంటె తన కళ్ళు ఇంకా నమ్మలేకపోతావుంది.సుదర్శన్ కు ప్రతి ఒక్కరినీ చూపిస్తూ వారి గురించి చెప్పుకుపోతోంది.
అందరినీ పలకరించి కూర్చున్న హిమజకు ఎదురుగా రాఘవ ,రోహిణి కనపడ్డారు.
సుదర్శన్ వారిని చూపించి హిమా , ఈరోజు నీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ ఇక్కడకు వచ్చారంటె దానికి కారణం వాళ్ళిద్దరే అని చెప్పాడు.
రాఘవ రోహిణి మధు ముగ్గరూ హిమజను ,సుదర్శన్ ను స్టేజిపైకి తీసుకెళ్ళారు.
వేదికపైకి జిల్లా విద్యాశాఖ అధికారులు , హిమజతో పనిచేసిన ఎంతో మంది ఉపాధ్యాయఉపాధ్యాయినిలను అందరినీ ఆహ్వానించారు.
వేదికపై మధు మాట్లాడుతూ వందల మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయినిగానే కాకుండా ప్రేమను పంచి
నైతిక విలువలతో విద్య నేర్పించిన మానవతా మూర్తి
మా జీవితాలలో వెలుగు నింపిన మహోన్నతమైన
వ్యక్తికి మేము ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. అందుకే తన దగ్గర అక్షరాలు దిద్దించుకుని ఆమె ప్రేమకు పాత్రులైన విద్యార్థులందరినీ పదవీ విరమణ మహోత్సవానికి ఆహ్వానించి
అమ్మ ఆశీస్సులు పొందాలని భావించామన్నాడు.
రాఘవ మైక్ తీసుకుని హిమజ దగ్గరకు వచ్చి ఆమె పాదాలను మొక్కి పైకి లేచి
అందరికీ నమస్కారం చేస్తూ
ఓ వీధి రౌడి కొడుకుగా ముద్ర పడినా ,నన్ను చదివించాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని తల్లి దండ్రులున్న నేను వారిలానే పదేళ్ళు పెరిగాను.
చిన్న దొంగతనాలు చేసేవాణ్ణి . అలా దొంగగా పట్టబడ్డాను ఈ అమ్మకు. ఎందుకూ పనికిరాని రాయిగా దొరికిన నన్ను రత్నంగా మార్చి ఈరోజు ఓ పెద్ద కంపెనీకి సీఈవోగా ఎదిగే సంస్కారాన్ని నేర్పించింది అమ్మ
అంటూ తన కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తుంటే ఇక మాట్లాడలేకపోయాడు రాఘవ.
హిమజకు ఎంతో ఇష్టమైన రోహిణి మాట్లాడుతూ
ఎనిమిదేళ్ళ వయసులో ఊరి చివర పాడుపడిన ఇంట్లో ఎవరో అత్యాచారం చేసి కొన ఊపిరి తో వదిలి వెళ్ళిపోతే
అమ్మనాన్న కనీసం నా దగ్గరకు కూడా వచ్చి చూడలేదు, ఆ ఊరి బడిలోనే పనిచేస్తున్న ఈ టీచరమ్మకు విషయం తెలిసి ఆస్పత్రికి తీసుకెళ్ళి నన్ను బతికించి నాకు బతుకు నిచ్చింది ఈరోజు నాలా బలవుతున్న ఎంతోమంది ఆడపిల్లలకు అండగా అడ్వకేట్ గా న్యాయం కోసం పోరాడేలా చేస్తోంది అమ్మ ఇచ్చిన స్ఫూర్తి మంత్రం.
ఇక్కడున్న ప్రతి విద్యార్థికి ఇలాంటి కథలే కానీ ఆ కథలో టీచరమ్మగా పరిచయమై అమ్మగా మాకు ప్రేమను పంచి మార్గదర్శకురాలైంది.
అలాంటి అమ్మ కు రిటైర్మెంట్ ఎక్కడుంది
అందుకే మాలాంటి పిల్లల కోసం "హిమజ ఛారిటీ హోమ్ "ను ఏర్పాటు చేస్తూ అమ్మకు కానుకగా ఇస్తున్నామని
వేదికపై అందరూ చూస్తుండగా రాఘవ ,రోహిణి ,మంజుల ,కిరణ్ ,మధులు
హిమజ సుదర్శన్ కు ఛారిటీ హోమ్ కు సంబంధించిన డాక్యుమెంట్సును చేతికందించారు.
హిమజకు ఇదంతా కలలా వుంది...
తను నేర్పింది నాలుగక్షరాలే కానీ నాలుగు కాలాలు గుర్తుండిపోయేలా నిత్యం భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ వారి పురోగమనానికి నాంది వాక్యం పలికింది.నీతి నిజాయితీలే మనల్ని మన బతుకుల్ని తీర్చిదిద్దుతుందనే మాటకు కట్టుబడి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగిన తన విద్యార్థుల్ని తన బిడ్డలుగా చూసి దేవుడిచ్చిన మాతృత్వంతో
గర్వపడుతున్నానని , తల్లిగా ఇంతకంటె ఇంకేం కావాలని
సంతోషంతో ఆనంద భాష్పాలతో ఉక్కిరిబిక్కిరై
నా వృత్తికి పదవీ విరమణ చేయగలను కానీ నాలోని అమ్మదనం నా శ్వాస చివరి వరకు వుంటుందని
తన్మయమై మాట ఇచ్చింది.
భర్త సుదర్శన్ తనకు భరోసాగా హిమజనే చూస్తున్నాడు
ప్రాగణంలోని విద్యార్థులందరి కరతాళ ధ్వనుల మధ్య హిమజ హిమాలయ పర్వతమైంది.
************
ఎడతెరిపిలేని వర్షం,ఆగకుండా గంట నుంచీ కురుస్తోంది. వేడివేడిగా వేసిన ఉల్లిపాయ పకొడీ తింటూ,మధ్య మధ్యలో వేడి వేడి టీ గొంతులోకి జారుతుంటే 'ఆహా!ఎంత హాయిగా ఉందో. పనిచెయ్యటానికి లక్ష్మి ఈ పూట ఇంకేం వస్తుంది.డుమ్మా కొట్టటం ఖాయం' అని స్వగతంలో అనుకోగానే మెరుపులా మెరిసిన యోచనతో కథకు సబ్జెక్ట్ దొరికిందని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది శ్యామల.
తను రాయబోయే కథకు "సాధికారికత" అనే పేరు అయితే సరిగ్గా సరిపోతుందని అనుకుంది. అనుకోవటమే తడవుగా కథను రాయటం ప్రారంభించింది శ్యామల.
బాగా తలనొప్పి, ఒళ్ళునొప్పులుతో బాధపడుతూ లేవలేక పడుకునే వున్న శ్యామల బలవంతంగా కళ్ళు విప్పి పక్కనే ఉన్న సెల్ చేతిలోకి తీసుకుంది.
"అమ్మో! అప్పుడే ఎనిమిదిన్నర అయ్యిందా" మంచం దిగుతూ అనుకుంది.
హాల్లో న్యూస్ పేపర్ చదువుతున్న భర్త వంక చూస్తూ, "బాగా ఎండెక్కింది అయినా లేపలేదేమిటండీ. అవునూ,లక్ష్మి ఇంకా రాలేదా" అంది బ్రష్ చేసుకోవటానికి పెరట్లోకి వెడుతూ ఆగి.
"లేదు శ్యామలా, ఫోన్ చేసింది. నీకు చేస్తే నువ్వు ఫోను లిఫ్ట్ చెయ్యలేదట. నాకు చేసింది. నీకు ఒంట్లో బాగుండలేదు పడుకున్నావని చెప్పాను. కాస్త లేటుగా వస్తా అయ్యగారూ అమ్మగారికి చెప్పమన్నది.నువ్వు మొహం కడుక్కురా హార్లిక్స్ కలిపి ఇస్తాను. కాస్త రిలాక్స్ అవుదువుగాని" అన్నాడు కిచెన్ వైపు వెడుతూ రామం.
'ప్చ్! నాకు బాగోలేని రోజే తను ఇలా చేస్తుంది. అదేమంటే కారణం రెడీగా ఉంటుంది ' స్వగతంలో అనుకుంటూ పైటకొంగుతో ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన భార్యకు పాలగ్లాసు అందిస్తూ,
" సినిమా పాటల సుప్రసిద్ధ రచయిత భువన చంద్ర గారితో ముఖాముఖి కార్యక్రమం నీ కథల గ్రూపులో జరిగిందని పొద్దుటి నుంచీ తీరిక కుదరలేదనీ రాత్రంతా వింటూ లేటుగా పడుకున్నావుగా. పోనీలే పాపం పడుకోనీ అని లేపలేదు" భార్య పక్కన సోఫాలో కూర్చుంటూ అన్నాడు రామం.
నిజంగా, అర్థం చేసుకునే మీలాంటి భర్త దొరకటం నా పూర్వ జన్మ సుకృతమండీ" అంది గ్లాసు టీపాయ్ మీద పెట్టి భర్త వంక ప్రేమగా చూస్తూ శ్యామల.
"ఎప్పుడు చూసినా కథలు, కవితలు రాసుకుంటూనో ,లేదంటే ఇలాగే ఏదో ఒకటి వింటూనో ప్రతి రోజూ అర్థరాత్రి ఒంటిగంట దాకా మేలుకుంటావు. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవదా చెప్పు. అదేమంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే నాకు ఆలోచనలు వస్తాయి . వెంటనే రాయకపోతే మళ్ళీ ముడిపడదు అంటావు" అన్నాడు పాలు తాగటం పూర్తవటం చూసి లేకపోతే రాణి గారు అలక వహిస్తారని.
"సందు దొరికింది కదా అని బాగానే యుటిలైజ్ చేసుకుంటున్నారు. అమ్మో! మీరేం తక్కువ వారు కాదు ,సమయం కోసం కాచుక్కూర్చుంటారు " వాదన పెరుగుతుందని స్నానానికి వెడుతున్నానంటూ లేచింది.
"తమరు మాత్రం తెలివిగా మాట అంటించి ఏమీ ఎరగన్నట్టు వెళ్ళటంలా ఎంతైనా రచయిత్రివిగా ఆమాత్రం తెలివి ఉంటుందిలే" కవ్వింపుగా నవ్వాడు రామం.
గంజి పెట్టిన కాటన్ తెల్లచీరపై ఆకుపచ్చ రంగు లో రామచిలుకలు అంచు ఉన్న చీరలో మల్లెపువ్వులా మెరిసిపోతూ కిచెన్లోకి వచ్చిన శ్యామల బియ్యం కడగబోతున్న భర్తను చూసి , గబగబ చేతిలో నుంచి గిన్నెను లాక్కుని "చాలు చాల్లేండీ సంబరం, ఎవరయినా చూస్తే నవ్విపోతారు.అసలే మీకు మొదటి నుంచీ అలవాటు లేదు. 'చావు తరువాత లావు దుఃఖం'అన్నట్లు ఈ వయసులో మీరు చెయ్యి కాల్చుకోవటం నేను కాలు మీద కాలు వేసుకుని దర్జాగా భర్తతో పనులు చేయించటం అవసరమా, పోనీ నేను పూర్తిగా లేవలేకపోతే తప్పదు మీకు. అయినా గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే బడలిక తీరింది" అని వంట చెయ్యటానికి ఉపక్రమించింది శ్యామల.
రామం టీవీలో వార్తలు చూస్తూ హాల్లో కూర్చున్నాడు.
ఇంతలో ఎప్పుడు వచ్చిందో "ఇలా ఇవ్వండి అమ్మగారు నేను తరిగిపెడతా"పనిమనిషి లక్ష్మి చేతిలోంచి కూరలు తీసుకుంది తరగటానికి . పేరుకు పనిమనిషే గాని కడిగిన ముత్యంలా శుభ్రంగా ఉంటుంది . స్నానం చేసి చక్కగా రెడీ అయి వస్తుంది. సీజన్ బట్టి మల్లె , కనకాంబరం, కాగడా మల్లె, ఏదో ఒక పూలమాల తురమందే అసలు బయటికి రాదు . ఇంట్లో పిల్లలా కలిసి పోయింది. లేటుగా వచ్చి విసిగిస్తుందనే గానీ వస్తే మాత్రం పనులన్నీ చకచక చిటికెలో సర్ది పెట్టేస్తుంది . ఆలోచనలో వుండగానే దొండకాయలు, ఉల్లి, పచ్చిమిర్చి తరిగి ఇచ్చింది.
"అమ్మా , మీరు రాసే కవితలు హృదయానికి భలే హత్తుకుంటాయి . కథలు కూడా జీవితంలోకి తొంగి చూసినట్లు చాలా బాగా రాస్తారు.మీకు ఆలోచనలు ఎలా వస్తాయమ్మా" అంది లక్ష్మి శ్యామల వంక అభిమానంగా చూస్తూ.
"అవునా, ఏదో నీ అభిమానం అంతే. సరేలే గానీ నీ కథ రాయనా " ఏమంటావు అన్నట్లు చూసింది లక్ష్మి వంక శ్యామల.
"మా పేదోళ్ళ జీవితాలలో ఏముంటాయమ్మా! కష్టాలూ, కన్నీళ్ళు తప్ప" నిట్టూర్చింది లక్ష్మి.
"సరేలే,నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నాగా. అదే రాస్తాలే"సముదాయింపుగా అంది శ్యామల.
"అది సరేగానీ, ఆలస్యంగా వచ్చావేమిటి లక్ష్మీ" అడిగింది శ్యామల.
"మన ఊళ్ళో పాపారావుగారి అమ్మాయి సుధ పెళ్ళి కుదిరింది. పెళ్ళికూతురికి ప్రభుత్వం తరుఫు నుంచీ ముప్పై అయిదు వేలు ఇస్తారమ్మా . త్వరలో లక్ష చేస్తాము అంటున్నారు. డబ్బులు వస్తాయని పెళ్ళి కానుకకి అప్లై చేశారమ్మా. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుల వివరాలు తీసుకుని మొన్ననే పంపించాను. ఈ రోజు ఉదయం పెళ్ళి జరిగింది. పెళ్ళి ఫొటోలు తీయటానికి వెళ్ళాను. అందుకే ఆలస్యం అయ్యింది. ఒక పెళ్ళికి అయిదు వందలు వస్తాయమ్మా . ఇంకా పాత వాటికి కూడా ఇరవై వేలు దాకా రావాలి.మా ఆయనకు కూడా సరిగా జీతం రావటంలేదు. కరోనా వలన స్కూలు మూసేశారు కదమ్మా.వారానికి ఒకసారి రమ్మంటున్నారు. రెండువేలే ఇస్తున్నారు. ఇల్లు గడవటం కూడా కష్టంగా వుంటోంది. మీరయితే మంచిగా అర్థం చేసుకుంటారు. ఆమధ్య నాకు పదివేలు బదులిచ్చారు కూడా. అప్పులు ఎలా తీర్చాలోనమ్మా" తన గోడు వెళ్ళబోసుకుంది లక్ష్మి.
"అవునులే లక్ష్మీ ,ఏది ఏమైనా ఈ 'కళ్యాణమిత్ర' ఉద్యోగం వచ్చాక వెనకా ముందుగా వస్తున్నావనుకుంటే, మాస్కులు కుట్టటం మొదలుపెట్టాక పూర్తిగా ఎగనామం పెడుతున్నావు.చూడబోతే పూర్తిగా మానేసేటట్లు ఉన్నావు"అంది శ్యామల కొంచెం కోపం నటిస్తూ.
ఏం చెయ్యనమ్మా, ఇక్కడ పని చేసుకుని వెళ్ళాక, ఇంట్లో పని కూడా చేసుకుని రోజుకి వందనుంచీ నూట యాభై దాకా మాస్కులు కుడుతున్నాను. ఒక మాస్కు కుడితే మూడు రూపాయలు చొప్పున రోజుకి కనీసం మూడు వందలు ఇస్తారమ్మా. మీరు కూడా కాస్త నన్ను అర్థం చేసుకోండమ్మా. చెయ్యలేకపోతే మానేస్తాను అంతే గానీ ,మీ ఇల్లు మాత్రం మానను. అంది లక్ష్మి.
ఆ మధ్య నువ్వు కలెక్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ కూడా అందుకున్నావుగా. త్వరలో నీకు పరమనెంట్ అవుతుందిలే . మీ కష్టాలు తీరతాయి" అంది శ్యామల.
"అసలు పని చెయ్యటం మొదలు పెట్టిందే మీ ఇంట్లో కదమ్మా. మా ఆయన ఎవరి ఇంటికి పనికి పంపడు. ఏదో మనింటికి అంటే మాట్లాడడమ్మా అంతే. మీది మంచి మనసు, మీ నోటి చలవన పర్మనెంట్ అయితే అదే పదివేలు అమ్మా" అంది ముక్తాయింపుగా లక్ష్మి.
"పది ఏసీల కన్నా చల్లనైనది మంచి మనసు" అని భువనచంద్రగారు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.శ్యామలకు లక్ష్మి మాటలు వింటుంటే.
పని పూర్తవగానే 'వెళ్ళొస్తానమ్మా' అని చెప్పి వెళ్తున్న లక్ష్మి నడకలో ఒక ధీమా తన కాళ్ళమీద తనే నిలబడే మహిళా సాధికారికతకు ప్రత్యక్ష సాక్ష్యంలా.తోటి వారికి తానూ ఆదర్శం అయ్యేలా.....
పెదమామ కిషన్ చనిపోయాడని ఫోన్ వచ్చింది. ఆ మాట వినగానే "పెద్దబాపూ ఎంతపని జేస్తివే? అప్పుడే నీకు అవుసు మూడినాదే" అంటూ మంజుల గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఎనిమిది, పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు అమ్మ ఏడుస్తోందని వాళ్లు కూడా శోకం పెట్టారు. వాళ్లను చూస్తూ రఘు, రామ్ పైకి కన్నీళ్లు కనిపించకుండా బాధను అదుముకుంటున్నారు. రామ్ భార్య సుజిత కూడా పసివాణ్ణి ఎత్తుకుని తోడి కోడలు పక్కన చేరి ఓదార్చుతోంది. ఇల్లంతా ఏడుపులతో గొల్లుమంటోంది. సుజిత పక్కనే కూర్చున్న ఐదేళ్ల కుమార్తె లలీ ఏమీ అర్థం కాక అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తోంది. ఇంట్లోని ఏడుపుల చప్పుడు వాడకట్టు అంతా వ్యాపించింది. దీంతో ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఏమైందంటూ వచ్చి ప్రశ్నిస్తున్నారు. "మా పెద్దమామ కాలంజేశిండు" అని వాళ్లకు రఘు సమాధానం చెప్పిండు. "ఊకో బిడ్డా.. కిషన్‌కు అప్పుడే నూరేండ్లు నిండినయా.. నా కండ్లముంగటి పోరగాడు. లారీ నడిపిచ్చి నడిపిచ్చి కిడ్నీలు ఫెయిల్ చేసుకున్నడు. శిన్న బిడ్డె లగ్గమన్న సూడకపాయె పోరడు" అంటూ మంజులను హత్తుకుని శోకం పెట్టి ఏడుస్తోంది మేదరి నర్సమ్మ. ఆమెను మరింత గట్టిగా పట్టుకుని మంజుల వలవలా ఏడుస్తోంది. తన కొంగుతో మంజుల కన్నీళ్లు తుడుస్తూ "ఊకోయె పోరీ.. ఎప్పటికున్న ఎవలమైన పోవల్శిందే" అంది. తొంభై ఏళ్లుంటాయి నర్సమ్మకు. తన పెద్దకొడుకు, కిషన్ ఒకటే తోటోల్లు అనేది. "బతకవోయిన ఊర్లనే సందం జేశెటట్టున్నరు గదా" వెక్కుతూ అడిగింది రఘును చూస్తూ. అవునన్నట్టు తలూపాడు రఘు.
"ఈడ మాయిముంతను ఇడ్సవెట్టి పోయి బతకవోయిన జాగలనే ఇంత ఇల్లు కట్టుకున్నడు గదా.. ఆడనే బొందవెడ్తరు. కనీ సూశినవా మీ అవ్వ సచ్చి యాడాది తిర్గకుంటనే వీడు పాయె. ఏం సూశిర్రని పోరగాండ్లు అప్పుడే నూరేండ్లు నిండినయి" అంటూ మళ్లీ ఏడుపందుకుంది నర్సమ్మ. గోపాల్ పేట్ నుంచి ఎల్లారెడ్డికి పోవాలిప్పుడు. రామ్ ఫోన్‌లో కిరాయికి ఉమ్నీ మాట్లాడుతున్నాడు. సాయంత్రం సందం అని చెప్పారు. అరగంట జర్నీ కాబట్టి బయలుదేరాల్సిందే. పది నిమిషాల్లోనే ఉమ్నీ వచ్చి ఇంటి ముందు ఆగింది. అందరూ అవే అవతారాల్లో వెళ్లి ఉమ్నీలో కూర్చున్నారు. ఉమ్నీ కదిలింది.
* * *
పసితనంలోనే నాన్నను పోగొట్టుకున్న రఘు, రామ్‌లకు పెద్దమామ కిషనే తండ్రి అంతటి ప్రేమను పంచాడు. ఏ పండగ వచ్చినా వాళ్ల పిల్లలకు సరిగ్గా తమకూ కొత్తబట్టలు తెచ్చేవాడు. తన చెల్లెలు భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి కూలీనాలీ చేస్తూ అష్టకష్టాలు పడుతోందని పెద్దన్నగా కిషన్ అండగా నిలిచాడు. చెల్లెలి పిల్లలు బాధ్యతను కూడా తీసుకున్నాడు. చదువులు, పుస్తకాలు, బియ్యం, ఉప్పూకారం ఇలా సకలం కిషనే సమకూర్చాడు. జీవితం అనే సినిమాలో రఘు, రామ్ చూసిన మొట్ట మొదటి హీరో కిషన్. యుక్త వయసులో ఉండగా కిషన్ మెలితిప్పిన మీసాలతో ముఖంలో రోషం ఉట్టిపడేది కానీ, కొండంత ప్రేమ మయుడు, సముద్రమంత విశాల హృదయం కలవాడు. లారీ డ్రైవర్‌గా కిషన్‌కు ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో మంచి పేరు ఉంది. లారీ డ్రైవర్ అనగానే బీడీలు తాగుతారని, మద్యంలో జోగుతారని, ట్రిప్పుకు వెళ్లిన చోటల్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని ఒక ప్రచారం ఉంది. కానీ కిషన్ ఒక్క దురలవాటులేని నికార్సయిన మనిషి. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండో అమ్మాయి సరిత మినహా అందరి పెళ్లిళ్లు చేశాడు. ఎల్లారెడ్డి టౌన్ కావడంతో తన లారీ పని అక్కడ బాగా సాగడం, పిల్లల చదువూ బాగుండటంతో అక్కడే సెటిల్ అయిపోయారు. గోపాల్ పేట్‌లో ఉన్న ఇల్లును చెల్లెలి కోసం వదిలేశాడు.
ఎలాంటి అనారోగ్యం లేని కిషన్‌కు ఊరికే కూర్చుని రాత్రింబవళ్లు డ్రెవింగ్ చేసి చేసి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పులు కొంత కాలానికే ఎక్కువయ్యాయి. మోకాలి చిప్పలు అరిగి పోయాయని డాక్టర్లు మందులు ఇస్తే వాడుతున్నాడు. అయినా తగ్గకుండా మోకాళ్ల నొప్పులు కిషన్‌ని బాగా బాధించాయి. అప్పటికి కొడుకులిద్దరూ పెద్దవారై ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా మరొకరు నాన్న సంపాదించిన రెండు లారీల మెయింటెయినెన్స్ చూసుకుంటున్నారు. ఇంతలో కరోనా సోకింది కిషన్‌కు. ఎలాగోలా దానిని ఎదుర్కుని నిలిచాడు కానీ రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో చాలా నీరసించి పోయాడు. వైద్యానికి శరీరం సహకరించకుండా అయిపోయింది. బాడీ సహకరిస్తే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేద్దామని వైద్యులు చెప్పారు. ఇంతలో కోమాలోకి వెళ్లిపోయి వారం వ్యవధిలోనే కిషన్ తన 60వ ఏట ఈ ప్రపంచాన్ని వీడాడు. అంతకుముందు ఏడాది తన చెల్లెలు రఘు, రామ్‌ల అమ్మ లలిత రోడ్డుప్రమాదంలో చనిపోయింది.
* * *
పడుకున్నాడేమో అన్నట్టుంది మామయ్య మృతదేహం. "పెద్ద బాపూ" అని శవం మీద పడి లబోదిబోమంటోంది మంజుల. కిషన్ తలాపున సరిత కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. రఘు, రామ్ మామయ్యను అలా చూసి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. అక్కడే నిల్చుని మౌనంగా రోదిస్తున్న మామ కొడుకులు సురేష్, మధులను చెరొకరు పట్టుకుని ఏడ్చేస్తున్నారు. ఒక శిఖరం నేలకొరిగినట్టు శాశ్వత నిద్రలోకి జారుకున్న మామను చూస్తుంటే రఘు దుఖ్ఖం ఇంకా కట్టలు తెంచుకుంటోంది. చుట్టాలు, బంధువులతో ఇల్లంతా కిక్కిరిసి పోయింది. ఏడుపులు పెడబొబ్బలతో వాడకట్టు అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కిషన్ తమ్ముడు, మంజుల నాన్న పండరి, ఆయన భార్య.. వదినను ఓదారుస్తూ ఆమె పక్కన కూర్చున్నారు. మరోపక్క కిషన్ చిన్న చెల్లెలు సరోజ కూర్చుని బాధ పడుతోంది. రఘుకు మామయ్యతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుని మరింత ఏడ్చేస్తున్నాడు. ఆఖరి నీళ్లు పోసి కడసారి అందరూ కిషన్ ముఖం చూసి సాయంత్రానికి అంత్యక్రియలు ముగించారు. మామకు చివరగా గుప్పెడు మన్ను సమర్పిస్తున్న రఘు ఆలోచనలన్నీ సరిత గురించే సాగుతున్నాయి.
* * *
చీకటి పడుతోంది ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. మంజుల, సుజిత పిల్లలను తీసుకుని వెళ్లి తాము వచ్చిన ఉమ్నీలో కూర్చున్నారు. వెనకాలే రామ్ కూడా వచ్చేశాడు. రఘు సురేష్‌కు వెళ్తున్నానని చెబుతూ భుజం నిమిరాడు. ఆ చర్యకు భావోద్వేగంతో సురేష్ రఘును గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. "పోయిండు బాపు. మనకు రేపటినుంచి మంచీ చెడ్డా చెప్పే పెద్ద దిక్కు పాయె బావా" అంటున్న సురేష్ కళ్లు ఏరుధారలు అయ్యాయి. రఘు కూడా దుఖ్ఖాన్ని ఆపుకోలేకపోయాడు. వాళ్లని చూసి మధు కూడా వచ్చి పట్టుకుని ఏడుస్తున్నాడు. అక్కడికి వచ్చిన పండరి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. "ఊకోండ్రి బేటా అందరం పోయెటోళ్లమే. ఎవరు ఈడ ఎల్లకాలం ఉండనీకి రాలే. ఎనకా ముందు పోయెటోళ్లం" అంటున్న చిన్న మామ మాట విని రఘు తనని తాను సంభాళించుకుని, సురేష్, మధులను ఓదార్చ సాగాడు. ఇంతలో రఘు చూపు వేరే గదిలో నిల్చుని తననే తీక్షణంగా చూస్తున్న సరిత మీద పడింది. ఆమెను చూడగానే రఘు షాక్ అవుతూ మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. సరిత రెప్ప కూడా కొట్టకుండా తననే చూస్తోంది. ఏడ్చి ఏడ్చి సరిత ముఖం అంతా పీక్కుపోయినట్టుగా అయింది.
ఆ కళ్లలో తన మీద వీసమెత్తు కూడా తరగని ఆరాధనా భావం. తనను గుండెలకు హత్తుకుని ఇన్నేళ్లుగా తన మనసులో పేరుకున్న భారాన్నంతా చెప్పేసుకుని బోరున విలపించాలని.. తనకోసమే దశాబ్దాలుగా ఎదురు చూసీ చూసీ అలసిపోయిన కళ్లలా.. ఆమె కళ్లను చదవగలిగే ఏకైక వ్యక్తి రఘు మాత్రమే. సరిత తనకు ఏదో చెప్పాలనుకుంటోందనేది రఘుకు ద్యోతకమైంది. మరదలే కదా అని చనువుగా వెళ్లి మాట్లాడలేడు. వారి మధ్య ఇప్పుడు ఓ పెట్టని కోట లాంటి మౌనం నిలుచుంది. అది ఎప్పుడు కట్టలు తెంచుకుంటుందో తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఇద్దరు. రఘు అటు ఇటు ఎవరైనా చూస్తారని చూపులు మరల్చుతూ సరితను మార్చి మార్చి చూస్తున్నాడు. కానీ సరిత మాత్రం అలాగే ఉంది. తనిప్పుడు పెళ్లి అయి ఇద్దరు పిల్లల తండ్రి. పదేళ్లు గడిచిపోయింది సరితను తన మనసులోంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు గానీ, తియ్యలేక విఫలం అవుతున్నాడు. తన మనో ఫలకం మీద పచ్చబొట్టులా ముద్రించుకుపోయింది సరిత పేరు, రూపం. ఇంతలో బాపూ అని తన కూతురు చేయి పట్టుకుని పిలిచింది. "మమ్మీ రమ్మంటున్నది బాపూ. పా పోదాం" అంది. "ఆఆ.. పోదాం బేటా" అంటున్న అతని కళ్లు సరిత వైపే లాగుతున్నాయి. అప్రయత్నంగానే కళ్లు వాటికవే సరిత మీద కేంద్రీకృతం అయ్యాయి. సరిత ముఖంలో రంగులు మారుతున్నాయి. దుఖ్ఖం దేవుతుంటే కరువైన కన్నీళ్లు ఆమెకు అరువు వచ్చాయి. టపటపా కన్నీళ్లు రాల్చుతూ తన ఊబకాయం వైపు చూసుకుంటూ, తనని తానే అసహ్యించుకుంటూ ముఖం తిప్పుకుని లోపలి గదిలోకి విసురుగా వెళ్లిపోయింది. ఆ చర్యకు రఘు మనసు చివుక్కుమంది. లాగిపెట్టి చెంప ఛెళ్లుమనింపించారెవరో అన్నట్టైంది.
తన జీవితం ఏంటి? శాసించడానికి నువ్వెవరు? తన జీవితం గురించి ఆలోచించే నాన్న వెళ్లిపోయాడు.. రేపటినుంచి తానేంటి? అమ్మ కూడా ఏదో ఒకరోజు పోవాల్సిందే.. అందరి పెళ్లిళ్లు అయిపోయి పిల్లలున్నారు. తన బతుకింక వారి పంచ మీద బల్లేనా??? అన్న ప్రశ్నలు సరిత గొంతులోంచి విన్నట్టుగానే ఉంది రఘుకు. కాళ్లకింద నేల కంపించినట్టు అయింది. ఇంతలో "బాపూ బాపూ" అంటూ చేయి ఊపుతున్న కూతురి వైపు చూశాడు. అంతే తన భావం మారిపోయింది. కూతురి వైపు ప్రేమగా చూస్తూ "పా బేటా" అని నడుస్తున్నాడు. సురేష్, మధులకు, చిన్న మామకు వెళ్తున్నానని చెప్పి భారంగా కదిలాడు రఘు.. బాధ్యతల గుండెను ప్రేమ తొలుస్తుండగా. ఉమ్నీ వచ్చేలోపు రఘు ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. కూతురి చేయిని గట్టిగా పట్టుకుని మరో చేత్తో వేళ్ల మీద తనలోతాను ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. కూతురు కూడా తన చేయిని గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తోంది. అయినా మనసు పందిరి గుంజరు పుచ్చు పురుగు తొలిచినట్టు తొలుస్తోంది. ఉమ్నీలో కూర్చోబోతూ ఆగిపోయాడు. ఏదో గట్టి నిర్ణయం తీసుకున్నట్టు స్వరం పెంచుతూ "రామ్ నువ్వు దిగు ఓసారి" అన్నాడు స్థిరంగా. అందరూ షాక్ అయ్యారు. మంజులను చూస్తూ "మంజుల మీరు బైలెల్లుర్రి. నేను తమ్ముడు పెయింట్ డబ్బాలకు ఆర్డర్ ఇచ్చి వస్తం. వారం తర్వాత మనూర్ల ఎంపీటీసీ ఇంటికి పెయింట్ చేశేది గుత్తకు పట్టుకున్నం గదా.. ఆ కలర్లు ఉన్నాయో లేదో అరుసుకొని వస్తం సరేనా. మల్ల ఈ ఎల్లరెడ్డిల గూడ ఓ ఆర్డర్ వచ్చింది. అది గూడ ఫైనల్ జేసుకుని బయానా తీసుకొని వస్తం" అంటున్న రఘు గొంతులో గాబరాను మంజుల కనిపెట్టింది. తన మూడ్ బాధలో ఉండటంతో మరేం మాట్లాడకుండా సరేనని తలూపింది.
ఉమ్నీ కదిలింది. పిల్లలకు బై చెప్పారు ఇద్దరూ. రామ్‌కు రఘు ప్రవర్తనలో మార్పును చూసి ఏదో అనుమానంగా ఉంది. "ఏందన్నా.. గిప్పుడు మనకు ఆర్డర్లు ఉన్నయని వదినకు అవద్దం ఎందుకు చెప్పినవు?" భృకుటి ముడివేస్తూ అన్నాడు రామ్. "అంత ఖుల్లంఖుల్ల చెప్తగనీ పా గా గోపాలస్వామి గుడి తంతెల కాడ కూసుండి మాట్లాడుదాం" అంటూ తమ్ముడి చేయి పట్టుకుని గుడి వైపు కదిలాడు రామ్. మామ ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే రఘులోకి పాజిటివ్ వైబ్స్ వచ్చేశాయి. రావి చెట్టు గాలి రివ్వున వీస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. రామ్‌కు ఏం అర్థం కావడం లేదు. రఘు కూడా ఎలా చెప్పాలా అని కాసేపు తటపటాయించాడు. కాసేపు మౌనం. తర్వాత రఘు తననితాను సిద్ధం చేసుకుని పూడుకుపోతున్న గొంతును సవరించుకుంటూ "నేను సరితను రెండో పెండ్లి చేసుకుందాం అనుకుంటున్న తమ్మీ " అన్నాడు మరో మాటకు ఆస్కారం లేకుండా. ఒక్కసారిగా ఆ మాట వినగానే రామ్ షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బివసాగాడు. "అన్న నిజమా నువ్వు చెప్పేది?" అన్నాడు. "అవున్రా.. మనకు తండ్రి లేని లోటును మరిపిచ్చిన మామకు ఎంతో కొంత చెయ్యల్నని ఈ నిర్ణయం తీసుకున్న" అంటున్న రఘు భుజాలు తడుతూ "శభాష్ అన్నా.. లేటుగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నవు. నువ్వీ పని చేస్తే అమ్మ, మామల ఆత్మలు మస్తు ఖుష్ అయితయి" అనునయంగా అన్నాడు రామ్. "చిన్నప్పటినుంచి సరితకు, నాకు పెండ్లి జేస్తమని అమ్మ, మామ మాట ఇచ్చిపుచ్చుకున్నరు. కానీ ఆ మాట మీద నిలవడలేకపోయిర్రు. ఊర్ల పెద్దల నసలైన ఆ ఇల్లును పోనియ్యద్దని అమ్మ జిద్దు వట్టింది. అప్పుడు మామ పెద్దబిడ్డె లగ్గాన్కి పైసల్లేక ఇల్లు అమ్మల్శిన పరిస్థితి. ఇల్లు అమ్మద్దని అమ్మ అమ్ముతనని మామ మాట మాట పెంచుకున్నరు. నువ్వు ఒకింటికి పోయిందానివి ముండమోశి అచ్చి అన్ల మాలాస్క దినాలె ఉన్నవు. నువ్వు ఎల్లు ఇగ ఆ ఇంట్లకెల్లి అని మనలను బయటకు పంపి మామ ఇల్లు అమ్ముకునే. బయిటోనికి ఎందుకు మనమే కొంటమని మామకు జెప్పినా ఇనక ఇల్లు అమ్ముకునే. అప్పుడు మనం వేరే ఇల్లు కట్టుకుంటిమి. అగో గా ఇల్లు ఆళ్లిద్దరు అన్నాచెల్లెళ్ల నడుమ ఆరని చిచ్చు వెట్టె" గతాన్ని చెబుతున్న రఘు ముఖంలోకి చూస్తూ అవునన్నట్టు తలూపుతున్నాడు రామ్.
ఈసారి రామ్ అందుకుంటూ.. "ఇల్లు పొడగొట్టిండని అమ్మ మంకుపట్టు వట్టె. నాలుగేండ్లు వాళ్లకు మనకు మాటల్లేవు. నీకు, సరితకు లగ్గం అనే మాటను గూడ తీశి గట్టు మీద పెట్టేశిండ్రు. తప్పు అయింది నన్ను మన్నించి నా బిడ్డెను నీ కొడుకుకు చేస్కో అని మామ ఎంత బతిలిమిలాడినా అమ్మ మచ్చంవోయిన ఇనకపాయె. జిద్దుతోని చిన్న మామ బిడ్డె మంజులను నీకు చేస్కచ్చింది. పాపం సరిత అందరి నడుమల బలిపశువు అయింది" విచారిస్తూ అన్నాడు రామ్. "అవున్రా చిన్నప్పటి సంది ఆడుకునే జాగల, పెద్దగైనంక ఏ ఫంక్షన్ల కలిసినా మేమిద్దరం ఆలుమగలమే అనుకున్నం. ఒకరి మనసుల ఒకోళ్లను దేవుండ్ల లెక్క పూజించుకున్నం. కనీ అమ్మ మాటను జవదాటుడు ఇష్టంలేక మనసు సంపుకొని మంజుల మెడల పుస్తెలతాడు కట్టిన. పిల్లలు పుట్టి వాళ్లల్ల పడి సరితను యాదిమరుస్తున్న. కనీ సరిత ఇంకా నన్ను తన మనసులకెల్లి తీశెయ్యలేదుర. మామ గూడ పంతానికి పోయి బయిటి సంబంధాలు సూశిండు గనీ పిల్ల దొడ్డుగ ఉందని ఎవరు మెచ్చకపాయె. వచ్చినోళ్లంత గదే పేరు పెట్టిర్రు. రోజులు గడిచిన కొద్ది పిల్ల ముదిరిందని ముక్కు ఇరిశిర్రు. ఇప్పుడు నేనే ముప్ఫై ఐదేండ్లకు అచ్చిన. సరిత నాకన్న యాడాదే శిన్నది. మీదికెల్లి ఈ వయసుల రెండో పెండ్లి సంబంధాలు వస్తుంటే మామ మెచ్చకపోయె. నా బిడ్డెను ముసలోల్లకు ఎందుకిస్త అనుకున్నడు. ఇట్ల ఈల్లకు నచ్చుతే వాళ్లకు నచ్చకపోవుడు వాళ్లకు నచ్చితే వీళ్లకు నచ్చకపోవుడుతోని పదిహేనేండ్లు ఇట్ల ఎల్లిపోయినయి" దీర్ఘశ్వాస వదులుతూ అన్నాడు రఘు.
"మ్యారేజ్ బ్యూరోలల్ల గూడ పెట్టిర్రు గదా?" సంశయించాడు రామ్. "అక్కడ గూడ పిల్ల తొంబై ఐదు కిలోల బరువుందని, ఎనిమిదో తరగతే సదివిందని చాలా సంబంధాలు రిజెక్ట్ అయినయి. ఎందుకో సరితకు సదువు అబ్బకపాయె. పాపం సరిత బరువు తగ్గనీకి ఒక్కపూటనే అన్నం తిని కడుపు సంపుకున్నది. పొద్దుగాల్ల ఇన్ని ఓట్స్, మధ్యాహ్నం అన్నం, రాత్రి జొన్న రొట్టెలు తిన్నా మోటుతనం పోకపాయె. మన కాన్‌దాన్ల ఎవరికి అట్ల అంబటి పెయి లేకపాయె. మామ సరిత గురించే బగ్గ పికర్ జేశిండు. తనకన్న చిన్నోళ్లయి అందరి పెండ్లీలు అయి పిల్లలు పుట్టి పెద్దగ గూడ కావట్టె. పాపం ఆడివిల్ల తన నెత్తి మీద అక్షింతలు పడ్తలేవని ఎంత రంది వెట్టకుందో. ఇంట్లకెల్లి కాలు బయటవెట్టదాయె. ఇంకా ఈ పిల్లకు పెండ్లి అయితలేదని, పెండ్లి అయ్యే యోగం లేనట్టుందని లోకం సూటిపోటి మాటలతోని పొడుస్తరని ఇంట్ల కాలు బయటవెడ్తలేదు" రఘు గొంతులో జీర. "అవును అన్న. ఆడివిల్లలు బయటకు చెప్పుకోక లోపటలోపట నవుస్తరు. కొనజాలకు సరిత నీకే రాశిపెట్టినట్టుంది" అంటున్న తమ్ముడి ముఖంలోకి చూస్తున్న రఘు ముఖం చిన్నగా విచ్చుకుంది. జీవితంలో ఏదో సాధిస్తున్నాననే భావం ప్రస్ఫుటమౌతుంది.
"నాకెందుకో ఇయ్యాల్ల మామ మొకం లాస్టుసారి జూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిచ్చిందిర. మనకు ఎంతో జేశిన మామ రుణం తీర్చుకోవాలని మన్ను వోసుకుంట నిర్ణయించుకున్న. అప్పుడేదో మాట పట్టింపులకు పోయిర్రు గనీ అమ్మ ఎన్కశీరి మా విషయంల తప్పు జేస్తినని మస్తు కుదెవడ్డది. కనీ, అప్పటికే నా లగ్గం అయిపాయె. తప్పు దిద్దుకునే ఛాన్స్ లేదని అమ్మ బాధవడె. ఇయ్యాల్ల కోపాలు రేపు ఉండయి. కోపంల ఏ నిర్ణయం తీసుకోవద్దని గిందుకే అంటరుగావచ్చు. మామ గూడ నన్ను అల్లునిగ పొందకపోతినని శాన బాధవడ్డడు. కనీ ఏం జేస్తం అంత మన కర్మ అంతే" ముభావంగా అన్నాడు. "పెద్దలు జేశిన తప్పును పిల్లలమైన మనం దిద్దుబాటు జెయ్యలంటవ్?" రామ్ ప్రశ్నకు అవునన్నట్టు తలూపాడు రఘు. "తప్పు అనద్దురా.. అది మన పెద్దమనుషుల పొరపాటు అంతే. దాన్ని మనం దిద్దాలంతే" అంటున్న రఘును ఓ మహానుభావుడిని చూస్తున్నట్టు చూస్తున్నాడు రామ్. ఇంతలో ఓ అనుమానం కలిగింది. "అన్నా అంత మంచిగానే ఉంది గానీ.. సరిత మనసుల ఏముందో తెల్సుకోకుంట మనకు మనం ఇట్ల ఏకపక్ష నిర్ణయం తీసుకునుడు కరెక్ట్ కాదేమో. ఇన్నేండ్లు గడిశిపోయినయి గావట్టి తనకు నిన్ను రెండో పెండ్లి చేసుకునుడు ఇష్టమో లేదో తెల్సుకోవాలి. మల్ల ఏ ఆడది గూడ తనకు కాబోయే మొగుడు సెకెండ్ హ్యాండ్ ఉండాల్నని కోరుకోదు" అన్నాడు రామ్. "అవును అది కరెక్టే. కనీ సరిత మనసుల నేను ఇంకా ఉన్నరా. తన కండ్ల నిండ నేనే ఉన్నరా" గుండెల్లో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ అన్నాడు రఘు. రామ్ మళ్లీ అందుకుంటూ "అన్నా నాకు ఇంకో అనుమానం ఎందంటే.. ఈ పెండ్లికి సరిత ఒప్పుకునుడు ఒకెత్తు అయితే వదిన ఒప్పుకునుడు మరొక ఎత్తు. తన భర్తను ఇతర స్త్రీతో పంచుకోవుడు ఏ భార్యా ఒప్పుకోదు. భర్త చేశే పనిల న్యాయం ఉన్నా ఒప్పుకోదు. అండ్ ఇంకో ప్రాక్టికల్ సమస్య ఏందంటే రెండో పెండ్లి చేసుకున్నంత ఈజీ గాదు రెండు ఫ్యామిలీలను లీడ్ జేసుడు. పిల్లలు, ఖర్చులతోని అదనపు భారం పెరుగుతది. మనం మిడిల్ క్లాసోళ్లం. మల్ల ఇల్లు అన్నజాగల చిన్న చిన్న గడ్‌బడ్‌లు జరుగుతుంటయి. అవి పెద్దగ గూడ కావచ్చు. పైగా ఒక భార్య ఉండంగ ఇంకో పెండ్లి జేసుకునుడు చట్టం దృష్టిల తప్పు అయితది. ఇవన్నీ నేను ముందుగాల్లనే ఎందుకు చెప్తున్ననంటే కీడెంచి మేలెంచాలని మన పెద్దమనుషుల ఊకెనే అనలేదు గదా. మీదికెల్లి ఈ లోకం గూడ శితాం పేర్లు పెడ్తది. అంకుల్ వయసుల రెండో పెండ్లి చేసుకున్నడేంది అని ఎక్కిరిస్తరు. నువ్వెందుకు రెండో పెండ్లి చేసుకుంటున్నవో ఈ లోకానికి తెల్వది గదా. ఇంకో సమస్య ఏందంటే సరితోళ్ల అన్నదమ్ములు, మన పెద్దత్తమ్మ ఇట్ల అందరు ఒప్పుకోవాలె. ఎంత సుట్టీర్కం అయినా ఒప్పుకుంటరని నాకు నమ్మకం లేదన్న" కుండబద్దలు కొట్టినట్టుగా అన్నాడు రామ్. తమ్ముడి మాటలు విని ఆలోచనలో పడ్డాడు రఘు. గందరగోళంగా మారింది అతని మస్తిష్కం.
మళ్లీ మౌనం ఆవహించింది వారి మధ్య. గాలి తెరలుతెరలుగా వీస్తోంది. వారి మనసుల్లో అంతులేని ప్రశ్నలు. కాసేపటి తర్వాత రఘు మాట్లాడుతూ "నువ్వు అన్నయన్ని సైమాటలే. కనీ ఇప్పుడు మనముంగట ఉన్నది ఒకటే తొవ్వ. వేరే సంబంధాలను మనం లెంకి తెచ్చినా వాళ్లు మస్తు ఈర్నాలు తీస్తరు. ఇప్పటికే ఎంతోమంది ఎన్నో పేర్లు పెట్టి సరిత మనసును పొడిశిర్రు. ఆడజన్మల ఇన్ని లోపాలా అని అనుకునేటంత దిగజారింది మన పురుష సమాజం. ఏజుబారు అయిందని ఎవరు చేసుకోరు గూడ. ఇయ్యల్ల రేపు ల్యాత పిల్లలు కావాలంటున్నరు. వాన్ది కర్రె బుడుసు మొకం అయినా అప్సరస కావాలనుకుంటడు. సరిత ఆ స్టేజ్ దాటిపోయింది. గందుకే ఏదేమైనా అందర్ని ఒప్పిచ్చి సరితను నాదాన్ని చేసుకుంటనని నాకు కాన్ఫిడెన్స్‌గ ఉందిరా. నాపేరు మీదనే ఉండిపోయింది గావట్టి ఆల్శమైనా సరే నాదాన్ని చేసుకుంట. నా ప్రేమను పొందుత. మా ఇద్దర్కి అయితేనే జోడి కుదురుతది. ముసలోనికి ఇచ్చిర్రు అని ఎవ్వరు అనరు. ఎందుకంటే ఇద్దర్కి యాడాది వయసే ఓర్పాటాయె" అంటూ అప్పటికప్పుడు ఏదో తోచినవాడిలా టక్కున తన ఫోన్ తీసి పిన్ని నంబర్‌కు ఫోన్ చేశాడు రఘు. "గోపాలస్వామి గుడి దెగ్గర్కి ఒక్కదానివే రా పిన్ని ఎవరికి చెప్పకుంట" అని చెప్పి కట్ చేశాడు. అన్నట్టుగానే పిన్ని సరోజ అరగంట వ్యవధిలోనే వచ్చింది. మెట్లు ఎక్కడం వల్ల దమ్ము ఎగబీలుస్తోంది సరోజ. వరుసకు పిన్నే అయినా సరోజ రఘు కన్నా ఓ పదేళ్లు పెద్దది. కిషన్, పండరి, రఘు వాళ్లమ్మ లలిత తర్వాత చివరగా పుట్టిందామె. రఘు సరోజకి పదేళ్ల వయసు తేడా ఉంటుంది. రఘు పక్కన సరోజను చూస్తే ఎవరైనా అక్క అనుకుంటారు గానీ పిన్ని అనుకోరు. ఇద్దరు అన్నదమ్ములను చూసి ఆమె షాక్ అయింది. "ఏమైందిరా పోరగాండ్లు మీరు గోపాల్ పేట్ పోయిర్రేమో అనుకున్న. సరే గానీ, ముచ్చటేందో చెప్పు. నువ్వు అట్టిగనే నన్ను పిల్వవని తెలుసులే" అంది సరోజ. రఘు ఇందాక రామ్ ముందు చెప్పిందంతా పిన్నికి వివరించి చెప్పేశాడు. అంతా విన్నాక పిన్ని ముఖంలో ఆనందం. "అరే మాకన్న చిన్నోనివి ఎంత సక్కగ ఆలోచించినవుర. పాపం సరిత లగ్గం ఇగ ఈ జన్మకు కాదనుకున్నం గనీ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నవుర బేటా. పెద్దన్న సచ్చిపాయె.. రేపటి దినం వదిన గూడ వోయేదె. ఒకోల్ల ఎన్క ఒకోళ్లం అందరం పోయెటోళ్లమే. ఇంట్ల పెద్దమనుషులు పోయినంక ఆ పోరి బతుకు అర్వంద్రం అయితదని పెద్దన్న మస్తు పికర్ జేశిండు. సరిత పికరే అన్నకు మాలాసుండె. రేపటికి లగ్గాలు జేస్కున్న అన్నలు చెల్లె అని మంచిగ జూస్తుండచ్చు గనీ.." అంటూ ముఖానికి కొంగు అడ్డం పెట్టుకుని వెక్కసాగింది సరోజ. రఘు, రామ్ ఆమెను ఓదార్చసాగారు.
"ఏ ఆడివిల్ల బతుకైనా చేసుకున్న మొగోనితోనే శింగారం ఉంటది. ఇంటిమీద బెలుగు లెక్కట ఉంటే ఎప్పుడో ఒగనాటిక వదిన ఒగ మాట అంటది. అగో మీ అమ్మను అనలేదా అన్న. ఇంట్ల కెల్లి ఎల్లుమనలే. అక్క గా ఒక్క మాటకాడనే మనసు ఇరగొట్టుకొని సరితను కోడలిగ చేసుకోకపాయె. మొగోని బతుకైనా పెండ్లాం ఉంటేనే మంచిగుంటది. తనకొక మొగోడు, పిల్లలు, ఇల్లు ఉండాలని ఏ ఆడదైన కోరుకుంటది. కనీ బేటా నువ్వు మంచిగ ఆలోశించినవురా. నేను ముంగట నడిశి అందర్ని ఒప్పిచ్చి మీ లగ్గం జేస్త. మంజులను, మా వదినెను అందర్ని ఒప్పిస్త సరేనా" ధీమాగా చెప్పింది సరోజ. ఆమె ఇచ్చిన భరోసాతో వాళ్ల మనసులో ఉన్న గందరగోళం అంతా ఎగిరిపోయింది. మనసులు నిర్మలంగా మారాయి.
* * *
కిషన్ పెద్ద కర్మ రోజున చుట్టాలు బంధువులు అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయాక సరోజ ఈ విషయాన్ని ఇంటి సభ్యుల ముందు ప్రస్తావించింది. తొలుత సురేష్, మధులు తిరస్కరించారు. సరోజ వారికి అర్థం అయ్యే రీతిలో సముదాయించగా ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇక తానే మధ్యవర్తిత్వం తీసుకుని గోపాల్ పేట్ వచ్చి మంజుల ముందు కూడా చెప్పింది. ఆ మాట విని మంజుల కుప్పకూలిపోయింది. ఇక అప్పటినుంచి తను ఎలాంటి సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉండసాగింది. నిర్ణయం తీసుకోవడానికి తనకు కొంత సమయం ఇవ్వాలనుకుంది సరోజ. మంజుల పిల్లలతోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఇక రఘునైతే కొన్ని రోజులు శతృవు కన్నా హీనంగా చూసింది. పిల్లలను తీసుకుని విడిగా నిద్రపోతోంది. తోడికోడలితోనూ ఏదైనా అవసరం ఉంటే తప్ప ఏం మాట్లాడటంలేదు. ఇంట్లో వసపిట్టలా ఉండే మంజుల తీరు నచ్చక రఘు మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ, దగ్గరికెళ్లినప్పుడల్లా గిన్నెలు కింద పారేస్తూ తనతో మాట్లాడొద్దని నిరసన తెలుపుతోంది. దీంతో రఘు ఆమెను మాట్లాడించి ఎందుకు ఇబ్బంది పెట్టాలని మిన్నకుండిపోయాడు. రాత్రుళ్లు నిద్రపట్టక అదే విషయమై మంజుల దీర్ఘంగా ఆలోచించడం రఘు దృష్టిని దాటిపోలేదు. రఘుకు, సరితకు పెళ్లి చేస్తారని తను చిన్నప్పటినుంచి విన్నది. తానే వారి మధ్యలోకి వచ్చానని చాలాసార్లు అనుకుంది. కానీ ఇప్పుడు జీవితాలు మారిపోయాయి. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతోంది తను. మరోవైపు ఇప్పుడీ విషయంలో మంజుల ఒప్పుకోకపోతే ఏం చేయలేమని రఘు అవే ఆలోచనలతో తన పని చూసుకుంటున్నాడు. అలా మూణ్ణెల్ల కాలం గడిచిపోయింది.
* * *
ఆ రోజు రఘు సరితకు ఫోన్ చేశాడు. సరిత ఫోన్ ఎత్తి "హలో బావా" అంది. ఓ గదిలో గడియ పెట్టుకుని చిన్నగా మాట్లాడుతోంది సరిత. తన పెళ్లి అయ్యాక సరితతో మాటలు లేవు రఘుకు. ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు దూరం నుంచే చిన్నగా పలకరించడం అంతే. ఇన్నేళ్లకు రెండో పెళ్లి ప్రస్తావనతో మాట్లాడుతుంటే రఘులో ఏదో అలజడి రేగుతోంది. "ఎలా ఉన్నావ్" అన్నాడు. ఆ ప్రశ్నకు సరిత నుంచి సమాధానం లేదు. కాసేపు మౌనం. "నాకు అనిపిచ్చింది నిర్ణయించుకుని ఇతరుల మీద రుద్దుడు కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఇది జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి. నీకు ఇష్టమైతేనే మన పెండ్లి. మల్ల ఇక్కడ గూడ మీ చెల్లె మంజుల ఒప్పుకోవుడు గూడా ఇంపార్టెంట్" నిదానంగా అన్నాడు రఘు. "నాకు నువ్వంటే మాటలల్ల చెప్పలేనంత ప్రేమ బావా. మన పెద్దోళ్లు మనిద్దరికి పేరు పెట్టినప్పటి సందే నువ్వూ నేను మొగుడు పెండ్లామే అనుకున్న. కనీ విధి ఎంత పని జేశింది సూడు. నువ్వు మంచిగ మంజులను మనువాడినవు, పిల్లలను కన్నవు, నన్ను మరిచిపోయినవు. కనీ నా కర్మనో ఏందోగనీ.. నాకు ఒక్క సంబంధం కాయంగాకపాయె. నాగ్గూడ లగ్గమై మొగోడు, పిల్లలు ఉండుంటే నేను గూడ నిన్ను మర్శిపోద్దునేమో. కనీ ఎక్కడా.. దినాం నిన్ను యాజ్జేస్కుంట కుమిలిపోతున్న. నేనిట్ల ఎందుకు దొడ్డుగైన్నో తెల్వది. నా మోటుతనం సూశి ఎవరు మెచ్చకపాయె. థూ ఏం బతుకని సచ్చిపోదామని గూడ అనుకున్న గనీ ధైర్నం సాలలేదు బావా. నాకంటే చిన్నోళ్లయి పెండ్లీలై పిల్లలు, సంసారం అని ముద్దుగ ఉంటున్నరు. నా తలరాతనే ఆ భగవంతుడు ఎందుకిట్ల రాశిండో అర్థంకాదు" అంటున్న సరిత కళ్లు ఏరుధారలయ్యయి.
రఘు కళ్లు కూడా చెమర్చాయి. తనను ఎలా ఓదార్చాలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. "నన్ను క్షమించు సరితా.. ఆనాడు నేను మా అమ్మకు ఎదురు మాట్లాడి నిన్నే పెండ్లి జేసుకుంటనని గట్టిగ మాట్లాడేదుండె. కనీ అమ్మను నొప్పియ్యద్దని నిన్ను జీవితకాలం నొప్పిచ్చిన సరితా. నన్ను క్షమించు. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుకుందాం అనుకుంటున్న" బావురుమన్నాడు రఘు. "ఊకో బావా ఏడ్వకు. నువ్వు తప్పు దిద్దుకుంటనని అంటున్నవు గనీ.. మంజులకు నేను అన్యాయం జేశినట్టు అయితది. అది నా కాక బిడ్డె. నా సొంతశెల్లె కన్నా ఎక్కువ. వద్దు బావా నాకోసం పెండ్లాం పిల్లలకు అన్యాయం చెయ్యద్దు. నేను సరోజ అత్త ముంగట ఇదే మాట చెప్పిన" అంది. ఇంతలో బయటి నుంచి "సరితా" అమ్మ పిలిచింది. "ఆ వస్తున్నా అమ్మా.. బావా ఫోన్ పెట్టేస్తున్న. తర్వాత మాట్లాడుత" అంటూ ఫోన్ కట్ చేసింది సరిత. రఘు తల దించుకుని కుమిలిపోతున్నాడు. మనసు కకావికలం అవుతోంది. అటు మంజుల, ఇటు సరితలు నిత్యం మనసులో మౌనయుద్ధం చేసుకుంటున్నారు.
* * *
రెండో పెళ్లి కాబట్టి ఆడంబరాలకు పోకుండా అతికొద్ది మంది సమక్షంలో రామాలయంలో పెళ్లి జరుగుతోంది. పంతులు మంత్రోచ్ఛారణ చేస్తుంటే సరిత మనసులో తెలియని ఆనందం వెల్లి విరుస్తోంది. సరిత పక్కనే మంజుల ఉండి అన్నీ ఏర్పాట్లు చూసుకుంటోంది. రఘు మార్చి మార్చి సరితను, మంజులను చూస్తున్నాడు. మంజుల ఈ జన్మకు ఒప్పుకోదు అనుకున్నాడు గానీ, ఒప్పుకుంది. మనసులో మంజులకు ఎన్నో థాంక్స్‌లు చెప్పుకుంటున్నాడు. అటు నుంచి చూస్తే సరితకు మంజుల చెల్లెలు అవుతుంది. ఇప్పుడు కొత్త వరసలో సవతి (అక్క) అవుతోంది. అందుకే పెళ్లి బాధ్యత అంతా తానే తీసుకుంది. రఘు మెడలో మూడు ముళ్లు వేస్తుంటే సరిత ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ తాళిబొట్టును చేత్తో తాకుతూ ఆనందభాష్పాలు కారుస్తోంది. అరుంధతి నక్షత్రం చూడటానికి దంపతులిద్దరూ తల పైకెత్తారు. ఆకాశం నుంచి అన్నాచెల్లెలు (కిషన్, లలిత) ఆనందంతో శతమానంభవతి అని దీవిస్తున్నట్టు ఇద్దరికీ కనిపిస్తున్నారు. "మా అన్నాచెల్లెళ్ల పంతానికి మీరు మంచి ముగింపు ఇచ్చిరు" అంటున్నట్టుగా వినిపిస్తోంది వారికి.
----------+++++++++/////
(ఎరికిలోల్ల కథలు – 7)
ఆదివారం ఉదయాన్నే చావు కబురు.ఉడుకోడు చనిపోయాడు.ఊరు ఉలిక్కిపడింది. అసలు పేరు ఎరుకల రామచంద్రుడు అయినా గవర్నమెంటు లెక్కల్లోనే ఆ పేరు. అందరూ పలికేది మాత్రం ఉడుకోడు అనే.
చాలామందికి తెలిసినవాడు, కావాల్సినవాడు, పదికాలాల్లో పదిమందికీ మంచి చేసినవాడు.డెబ్బైఐదేళ్ళు దాటివుంటుంది వయసు. ఎడమచేతికి ఆరువేళ్ళు అతడికి.యస్టీకాలనీ ఎగువ వీధిలో చివరి ఇల్లు. గుడిసెలో రాత్రి పడుకున్న వాడు పడుకున్నట్లే పోయాడు. నిద్రమధ్యలోనే ప్రాణం పోయినట్లు వుంది. హాస్పిటల్ కు పోనే పోను అని మొండికేసిన వాడు, జన్మంతా ఒక్కసారైనా ఇంజెక్షన్ వేసుకోని వాడు, డాక్టర్ను చూసే పనిలేకుండానే చివరిదినాలు గడిపేసాడు.
చావుకబురు ఇండ్లు, వీధులు, ఊర్లు దాటే పనిలో వుంది.
అసలే పెద్దచావు. పెద్ద కులాల వాళ్ళు , సాటికులాల వాళ్ళు, కింద కులాల వాళ్ళు, పెద్దవాళ్ళు, నడివయసు వాళ్ళు , ఆడవాళ్ళు, మగవాళ్ళు , వీధిలోని వాళ్ళు, ఊరిలోని వాళ్ళు, చుట్టుపక్కల ఊరి వాళ్ళు, మున్సిపాలిటి మనుషులు, టీచర్లు , ఎవరెవరో ఉద్యోగస్తులు,ఇంకాఎవరెవరో వస్తున్నారు, దండలు వేసేసి దండాలు పెట్టేసి పోతున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుoటున్నారు. ఫోన్లు, వాట్సాప్ లు, మెసెంజర్ లు , ఫేస్ బుక్ లో ఆయన ఫోటోలు ఏవేవో సమూహాల్లోకి వెళ్లి అక్కడినుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి.ఆయన ఫోటో కింద నలుగురూ నాలుగు మాటలు రాసినట్లున్నారు.చూస్తూ ఉండగానే గంటల వ్యవధిలో చాలామంది వచ్చేసారు. కాలనీలో మనుషులకి అదొక పెద్ద పండుగలాగా జతరలాగా వుంది.
కాలనీలో ఆయనకు అందరూ బంధువులే కానీ ఆయనకంటూ ఒక కుటుంబం లేదు.పెళ్లి అయిందో లేదో ఈ కాలం వాళ్లకి సరిగా తెలియదు కానీ పిల్లలు అయితే లేరు.తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడో దేశాంతరం వెళ్ళిపోయి ఆయన ఒక్కడే ఇక్కడే మిగిలిపోయాడని అంటారు. పెళ్లి అయిందని భార్య ఎవరితోనో లేచిపోయిందని కొందరు...లేదు, అతడే ఆమెకు నచ్చిన వాడితో ఆమె ఇష్ట ప్రకారం పంపించేసాడని కొందరు అంటూ ఉంటారు.
అంత్యక్రియలు ఏ పద్దతిలో ఎలా చెయ్యాలో , ఎవరెవరు ఏమేం చెయ్యాలో కొందరు ముసలివాళ్ళు చెపుతున్నారు.వాళ్ళ మాటలకు కొందరు నడివయసు వాళ్ళు మౌనంగా తలలూపుతూ వుంటే, ఇంకొందరు రకరకాల సందేహాలు అడిగి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. కొందరు యువకులు బ్యానర్లు కట్టాలని , ట్రాక్టర్లో ఊరేగింపు జరపాలని మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళు గుంపులో వున్నారు కానీ, నోర్లు తెరవడం లేదు. వక్కాఆకు నములుతూ తలలు నిలువుగా, అడ్డంగా అటూ ఇటూ ఆడిస్తున్నారు.
“ఎట్లో ఇప్పుడు కరోనా భయం తగ్గింది . అయినా దూరాభారం వచ్చిపొయ్యే వాళ్ళు ఎవరుoడారు? ఎక్కువగా రారులే. ఈ పక్క చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, వి,కోట రామాపురం వాళ్ళు ,ఆ పక్క అరవదేశం నుంచి వానియంబాడి వాళ్ళు, ఆలంగాయం వాళ్ళు, ఆ పక్కనే అంబూరు వాళ్ళు.. అంతే కదా అందరూవచ్చేస్తార్లే సాయంత్రానికి.”
“ కులం మొత్తం తెలిసినోడు. అందరికీ కావాల్సినోడు, మనజనం చాలా మంది వస్తార్లే. బయటనుంచి అన్నాలటయానికి సరస్వతి హోటల్లో ఆర్డర్ చెప్పేయండి. దూరంగా ఆ పక్క వీధిలో ఒక చోట పెట్టేస్తే తినే వాళ్ళు తినేసి పోతారు. ”
వరసలతో సంబంధం లేకుండా కాలనీలో ఎవరు చనిపోయినా, బయట ఊర్ల నుండి వచ్చేవాళ్ళ కోసం అందరూ కలసి మధ్యాహ్నంఒక పూట భోజనాలు తెప్పించేయడం- ఈ మధ్య వచ్చిన కొత్త కట్టుబాటు అది.అన్నం పెట్టడానికి వరుసలేంది అని వాదించినవాడు ఉడుకోడే.!
బాధల్లో వున్నప్పుడు భోజనాల ఏర్పాటు ఇబ్బంది ఉండరాదని, ఉన్నవాళ్ళు పెట్టగలిగినా లేనివాళ్ళు చావులప్పుడు భోజనాలకి ఇబ్బంది పడకూడదని, అన్ని రకాలుగా అలోచించి, ఇక్కడున్న వాళ్లకు, బయటినుంచి వచ్చే వాళ్లకు ఇబ్బంది ఉండకూడదని అట్లా ఏర్పాటు అలవాటు చేసింది కూడా ఆ పెద్దాయనే. ఆఉడుకోడే.!
“మూడుదాకా రాహుకాలం కదా .మూడునుంచి మొదులు పెడితే నాలుగున్నరకు అంతా అయిపోతుంది. బయటినుంచి వచ్చినోళ్ళుమళ్ళిoకా ఎవురి తావులు వాళ్ళు చేరుకోవల్ల కదా.. ”
అంతా సిద్దం చేస్తున్నారు. ముందు షామియాన వద్దు అనుకున్నారు కానీ, వచ్చే జనం అంతకంతకు పెరిగిపోతావుంటే షామియానా వెయ్యక తప్పింది కాదు. ముందు కుర్చీలు అవసరం లేదు అనుకున్నారు, కానీ నూరుకుర్చీలు కూడా చాలలేదు. పొలీసు సైరన్ వినిపించే సరికి కాలనీలో అప్పటిదాకా అక్కడకి ఇప్పుడే కడులుదామా వద్దా అని తటపటాయిస్తున్న జనం మొత్తం గుంపులు గుంపులుగా వచ్చేశారు.
ఎండ పెరిగిపోతున్నా చమటలు కారిపోతున్నా ఉక్కపోస్తున్నా జనం కదలడంలేదు. ఎవరు తెప్పిస్తున్నారో ఎవరు తెస్తున్నారో అక్కడ ఉంటున్న వాళ్లకి తెలియడం లేదు కానీ బ్యానర్లు వచ్చేసాయి. ముఖ్యమైన కూడళ్ళలో కట్టేశారు. మైక్ సెట్ వచ్చింది, సంచుల నిండా మంచి నీళ్ళ ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు , ప్లాస్టిక్ గ్లాసులు వచ్చాయి.గుడిసె నుండి వీధి మొదలుదాకా రెడ్కార్పెట్ వేసారు.మైక్ ముందు నిలబడి నివాళి చెప్పడమో, ఆ పెద్దయన గురించి నలుగురూ మాట్లాడటం , కాలనీ మొత్తం ఇంటింటా వినపడుతోంది. ఆ కాలనీలో ఇదంతా కొత్త వ్యవహారం.అంతకు ముందు ఎప్పుడూ ఎవరికీ ఇలా జరగలేదు. అందరికీ విచిత్రంగానే వుంది.
ముందు పోలీసులు తర్వాతనాయకులు , ప్రజాప్రతినిధులు వచ్చారు. పొలీసు అధికారి పెద్దదండ వేసి మౌనంగా వెళ్ళిపోయాడు, నాయకుడు కూడా కాస్సేపు మౌనం పాటించాడు కానీ మాట్లాడక తప్పలేదు. ఆయన అందుకు సిద్దపడే వచ్చినట్లుంది.పెద్దగా ఎవరూ బ్రతిమలాడకుండానే, గబగబా మైక్ అందుకున్నాడు.
“ నేను ఎంతోమందిని చూసాను. అందరూ నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినవాళ్ళే కానీ మీకు ఏం సప్పోర్ట్ కావాలో చెప్పు , మంచికి నేను ఎప్పుడూ ముందు వుంటాను అని నేను రాజకీయాల్లోకి రాకముందే నాకు ధైర్నం చెప్పిన మంచి మనిషి మేనపాటి రామచంద్రుడు . ఎంతమంది కింద కులాల వాళ్ళు బడికి పోలేని స్థితిలో అయన వద్ద చదువుకుని బాగుపడినారో లెక్కే లేదు. గవర్నమెంటుటీచర్ కాకపోయినా, అంతకన్నా ఎక్కువే కష్టపడినాడు కదా?ఆయనకి కులం మతం జాతి, నాది నీది అనే బేధమే లేదని నాకన్నా ఇక్కడ వుండే వాళ్ళకే తెలుసు. అయన శిష్యులు ఎంత మంది ఆయన్ను నీకు ఏం కావాలని అడిగినా అయన ఏ పొద్దూ నాకు ఇది కావాలని చెప్పింది లేదు. స్కూల్లోపిల్లోల్లకి పుస్తకాలు పెన్నులు బ్యాగులు బట్టలు అడిగినాడే కానీ , స్కూల్లో టేబుళ్లు బెంచీలు, కుర్చీలు అడిగినాడే కానీ ఇంకొకటి అడిగినోడు కాదు.” నాయకుడి ఆవేదన.
“ పేదోల్లు సార్, ఇండ్లకు పట్టాలు లేవు అని అర్జీలు ఆయనే రాసి మాతో బాటూ ఎన్నిసార్లు యoఆర్ఓ వద్దకి తిరిగినాడో లెక్కే లేదు. ఈ కాలనీ ఇండ్లు సాంక్షన్ అయ్యేదానికి మూలం కూడా ఆయప్పే కదా.పిడుగు పడి మండీపేటలో గొర్రెలు చనిపోయినా ముందుగా కదిలేది ఆయనే. కరెంటు షాక్ కొట్టి ఎరుకల వెంకట్రాముడికి కాళ్ళు చేతులు కాలిపోయినా ఆదుకోవడానికి ముందుకొచ్చి సరుకులు తెప్పించి ఇచ్చేది ఆయనే.అంత ఎందుకు? ఆడోల్లు డ్వాక్రా గ్రూపుల్లో కరెక్టుగా లోన్లు కట్టకుండా వుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి అడిగేది కూడా ఈ పెద్ద మనిషినే కదా. నచ్చ చెపుతాడో, భయపెడతాడో, అధికారుల వల్ల కానిది, నాయకుల వల్ల కానిది చేసి చూపిస్తాడు. ” కౌన్సిలర్ సుబ్రమణ్యం.
షామియానా చాలడం లేదు. కాలనీలో అన్ని వీధుల్లో జనం.. జనం.. జనం. ఆ కాలని పుట్టినప్పటి నుంచిఎప్పుడూ ఆ కాలనీ అంత మంది జనాల్ని ఎప్పుడూ చూడనే లేదు. జనం ఎండను ఉక్కపోతను పట్టించుకునే స్థితిలో లేరు.మాటలన్నీ ఉడుకోడి గురించే. ఆలోచనలన్నీ అతడి గురించే.
దారులన్నీ యస్టీ కాలనీ వైపే.ఒక్క మాటలో చెప్పాలంటేఆ రోజు ఉడుకోడిదే.!. ఎండ ఎంత మాత్రం వాళ్ళని భయపెట్టడం లేదు. వాళ్ళలో హుషారు తగ్గడం లేదు. ఏదో కదలిక, ఏదో చైతన్యం, వాళ్ళు ఎందుకో ఉడుగ్గా ఉన్నట్లున్నారు.ఉడుకుడుగ్గా ఉన్నట్లున్నారు.అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి.రహదారి కూడళ్ళలో ఇంకా అక్కడక్కడా ఊరంతా బ్యానర్లు గాలికి అటూ ఇటూ కదులుతూ చప్పుడు చేస్తున్నాయి.
“ పలక కొట్టేవాళ్ళు దుడ్లు వద్దు అనేసిరి. గుంత తవ్వినోల్లు దుడ్లు వొద్దు అనేసిరి. సావు సరుకులకోసం పోతే ఉడుకాయప్పకే కదా అని ఫ్రీగా ఇచ్చినారు. కొత్త పంచె టవలు కూడా ఫ్రీనే. ఊరంతా తెలిసిపోయింది కదా చావు ఎవరిదీ అని. ఇంకో ఇచిత్రం తెలుసునా..”వక్కాకు ఎంగిలి దూరంగా రోడ్డు పక్కకు వెళ్లి సైడు కాలువలో ఉమిసి వచ్చాడు.
“ అటో వాళ్ళ గురించేనా.. ? ” వంగిపోయిన నడుము ఆడమనిషి కిసుక్కున నవ్వింది.
“నా కొడుక్కూడా ఆటో డ్రైవరే కదా వాడు చెప్పినాడులే. యూనియన్ మొత్తం ఒకే మాట అంట. ”
“ ఇచిత్రం కాక పోతే బస్టాండుముందు వుండే ఆటోస్టాండు వాళ్ళు అందరూ గట్టిగా అనుకున్యారంట. సావుకు వోచ్చినోల్ల కాడ ఎవరిదగ్గరా రూపాయి కూడా తీసుకోకూడదని. ”
“ అదే న్యాయం కదా నాయనా . యూనియన్ యెట్లా ఉండాలో చెప్పి మనోళ్ళకే కాదు, ఎంతో మందికి సబ్సిడీ లోన్లు తెప్పించినాడు. వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబెట్టడమే కాదు , చేతిలో పదిరూపాయలు పడితే చెయ్యికి నవ్వ రాకూదడురా కన్నా ... అని ఎంత బాగా వాళ్ళ మైండు సెట్టు మొత్తం మార్చినాడoటే, చాల మంది సారాయి తాగకుండా ఉండరంటే అదంతా ఈ ఉడుకోడి పుణ్యమే కదా నాయనా .ఎన్నితూర్లు వీధి గలటాలప్పుడు పెద్దమనిషిగా పోలీసు స్టేషన్కి పోయింటాడు?. ”
కాలనీలో కుక్కలు కొన్ని అటూ ఇటూ దిక్కు తోచనట్లు పరుగెడుతున్నాయి. బోరిoగు చప్పుడు రోద పెడుతోంది. కొన్ని ఇండ్లల్లోంచి వస్తున్న రకరకాల టీవిల చప్పుడు , కుక్కల అరుపులు,వీటి మధ్యలోనే ఒంటి కాలి బోయకొండప్ప సారాయి మత్తులో పడుతున్న పాట వికారాన్ని తెప్పిస్తోంది.
ఉడుకోడి గుడిసె ముందు లైటు వెలుగుతూనే ఉంది. ఎవరూ దాన్నే ఆర్పే పని చెయ్యలేదు. లోపల ఎవరో పెట్టిన దీపం గాలికి అటూ ఇటూ కదులుతోంది. గుడిసె ముందు కొయ్యమంచం పైన వుంది ఉడుకోడి శవం.
దాని పక్కనే రాతి బండలు.అక్కడకి వచ్చే వాళ్లకి అవే కుర్చీలు, బెంచీలు.దానిపైన కావాటి మునస్వామి,ఎరుకల నరసింహుడు, నాగరాజు, కుయ్యప్ప, కపాలి , మేనపాటి గోవిందస్వామి కూర్చుని వున్నారు. కొందరి చేతుల్లో బీడిలు వెలుగుతున్నాయి. వాళ్ళకు కొంచెం ఎడంగా డిగ్రీ చదివే ఆడపిల్లలు ఆ కాలనీ వాళ్ళే పార్వతి, భూమిక నిలబడి పూలహారాలు మంచం చుట్టూ పొందిగ్గా పేరుస్తున్నారు.
వీధికాలువలో దొడ్డికి కూర్చోవడానికి వచ్చిన చిన్నపిల్లాడు ఒకడు వీళ్ళని చూసి బిత్తర పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పరుగున వెళ్ళిపోయాడు.క్షణాల్లో వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని మళ్ళీ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మఅలివేలమ్మ ఉడుకోడి గుడిసె ముందు నిలుచున్న వాళ్ళని, కూర్చున్న వాళ్ళని అదేపనిగా చూస్తా మొహం ఎందుకో తిప్పి వంకరగా మాట్లాడింది.
“ నువ్వు ఆ పక్క పోరా..వూరికే వూరికే మనుషుల్ని, శవాల్ని చూసి భయపడితే ఎట్లా? సైలెంట్ గా నీ పని నువ్వు చూసుకోవల్ల.”
నరసింహుడికి ఆ మాటతో కోపం వచ్చేసింది. గభాలున మంచం దిగి వీధిలోకి వచ్చిఅలివేలమ్మ పైకి గొంతు ఎత్తి గలాటాకి వెళ్ళిపొయినాడు.
“ ఏమ్మే నీమొగుడు కడుపాత్రం దేశాంతరం పోతా ఉంటాడు, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు యాడికి పోతాడో వాడికే తెలిదు.ఉండేది ఒక్కదానివి.ఇంట్లో నీకు తోడు ఉండేది ఆ పిల్లోడు ఒక్కడే. ఇప్పుడు వాన్ని ఆ పక్కకు దూరంగాతీసుకోని పోయిరాలేవా.. బుద్ధి ఉందా లేదా నీకు ? దినామ్మూ కొంచెం ఆ ఉడుకోడ్ని.. ముసలాయన కదా కొంచెం చూసుకోమ్మే అని చెపితే ఇంటివా?ఆఖరి దినాల్లో కొంచెంకూడూనీళ్ళు ఆయప్ప మొహాన పోసి వుంటే బావుండేది కదమ్మే. అడిగినోల్లకి అడగనోల్లకి అందరికీ ఆయప్ప అన్నీ చేస్తాడు కానీ, ఆయప్ప నోరు తెరిసి ఎవుర్ని చిన్న సహాయం కూడా అడిగే రకం కాదని అందరికీ తెల్సు కదా ? ”
చీరకొంగు నడుముకు బిగించి కట్టుకుంటూ వక్కాకు ఎంగిలి ఉమిసి ఇoత లావు నోరు వేసుకుని, చేతులు తిప్పతా అలివేలమ్మ నేరుగా గొడవలోకే దిగేసింది.
“నువ్వు ఒప్పుకుంటే కాగితం బాండు రాసి ఇచ్చేయి మామా.నీ ఖాళీ జాగా మాకు ఇచ్చేయి అంటే ఒప్పుకోలేదు నువ్వు పోయినంకకాలనీలో ఈ గుడిసె లో మేం ఇల్లు కట్టుకుంటాం. బదులుగా రోజూ మూడు పూటలా తిండి పెడతాం మామా.. అని చెప్పినా కదా. నా మాటకి ఒప్పుకున్యాడా ఆ మొండి మనిషి ? పస్తులైనా వుంటాను, నా జాగాలో ఎరికిల పిల్లోల్లు చదువుకునేదానికి షెడ్ కట్టల్ల, నా జాగా అమ్మను, ఇంకెవరికి ఈను అంటాడు.అట్లాంటి వానికి నేను ఎందుకు....?” ఆయాసం వల్ల ఆగింది కానీ అప్పటికే ఆమె భారీ శరీరంలో ఆవేశం వళ్ళ ప్రకంపనలు మొదలయ్యాయి.గొంతు కూడా వణుకుతోంది.మనిషి నిలువెల్లా ఊగిపోతోంది.
“ అప్పుడికీ ఎన్నోతూర్లు చెప్పి చూసినా. అప్పుడప్పుడు గంజి నీల్లు టీలు ఇస్తానే కదా ఉండా కదా. ఆయప్ప అందరికీ ధర్మాత్ముడే కావచ్చు, కానీ నాకు మాత్రం దుర్మార్గపు ముండా కొడుకే.. అట్లాంటి వానికి నేను ఎందుకు తిండి పెట్టల్ల అని? ”
ఆమె మాటలకి చుట్టుపక్కల వుండే వాళ్ళు కూడా ఇండ్ల లోంచి బయటకు వచ్చేసి, చుట్టూ నిలబడి ఆసక్తిగా వింటుండి పోయారు.
“ ముందు నుంచి ఆయప్ప చెప్తానే వుండాడుకదాఅలివేలమ్మా.. కాలనీలో గుడి కట్టేటప్పుడు కూడా ఎంత గొడవ చేసినాడో నీకు తెలిదా? గుడి ఎందుకురా ఎరికిలి నా కొడుకులారా ? ఇంకెన్ని గుడులు కడతార్రా ? ఇంకెంత మంది దేవుళ్ళని మొక్కుతార్రా అని గట్టి గట్టిగా అందురని అరిసేసినాడు కదా? అప్పుడే మర్చి పోతివా ? మా పిల్లోల్లు కొంత మంది ఆ ఉడుకోనికే సప్పోర్టు చేసి గుడి వద్దు లైబ్రరీనే కట్టల్ల, పుస్తకాలు పెట్టల్ల, ఈ పిలకాయలంతా సదూకోవళ్ళ అని తెగేసి చెప్పినారు కదా. ఆ పొద్దు మన పిల్లోల్లు గుడి వద్దని అడ్డం తిరిగిన రోజే ఎంత గొడవ అయిందో ఊరంతా ఇచిత్రంగా కాలనీ గురించి కతలు కతలు చెప్పుకున్యారు కదా. ” దగ్గుతెర అడ్డురావడంతో ఆరిపోయిన బీడీముక్క పారేసి , క్షణం ఆగి గొంతు సవరించుకున్నాడు నరసింహుడు .
“ ఆ పొద్దే చెప్పెసినాడు కదా. ఆయన ప్రాణం పోయినంక ఆ సగం కూలిపోయిండే కాలనీ ఇల్లు , యీ గుడిసె మొత్తం కలిపి ఎప్పటికన్నా ఇక్కడ లైబ్రరీ కట్టల్ల అని, దాన్నిండా మన పిలకాయలు పెద్ద పెద్ద పరిక్షలు రాసేదానికి పుస్తకాలు ఉండల్ల అని పెద్దఆశ కదా ఆయప్పకి. ”అన్నాడు కపాలి.
ఆ మాటలేవి నచ్చనట్లు అలివేలమ్మ మొహం తిప్పుతా “ ఓహోహో.. మన ఎరికిల పిల్లోల్లు సదివి.. ఇంకచూడల్లా సంబడం ” అని తేలిగ్గా మాట్లాడే సరికి , అప్పటిదాకా చేతులు నలుపుకుంటా నోరు మెదపకుoడా మౌనంగా నిలబడి చూస్తూ వున్న ఆ ఇద్దరు అమ్మాయిలలో ఉడుకు వచ్చేసింది. అంత కోపం అంత ఆవేశం అంత దూకుడు యెట్లా వచ్చాయో తెలియదు కానీ వాళ్ళ గొంతుల్లోంచి మాటలు దూసుకు వచ్చేస్తున్నాయి.
“ మేం ఇంకా పందులు తోలుకుంటా గాడిదలు మేపుకుంటా , ఇంటికాడ బోకులు తోముకుండా ఉండల్లా అనే నీ కోరిక. థూ... మనకి సిగ్గువుండల్ల అత్తా. పది మందిలో తల ఎత్తుకుని బతికే పనులు చెయ్యాల్ల,కానీ మేం ఇంతే. ఇట్లే పుట్టినాం, ఇట్లే చస్తాం అంటే ఎవరు మారస్తారు మన బ్రతుకులు.అందుకే అత్తా ఆ తాత చెప్తా వున్యాడు కదా .దేశానికి ఒక్క అంబేద్కర్ చాలడు. ఒక్కో కాలనికీ ఒక్కో ఊరికీ ఒక్కో ఇంటికి ఒక్కో అంబేద్కర్ కావల్ల అని , మీకే అర్థం కాలేదు ఆ తాత చెప్పేది. ఒక్క మాట అడగతా చెప్పు. ఈ తాతే అడ్డం పడకుండా వుంటే, మొండిగా ఊరoదర్నీ ఎదిరిoచి నిలబడకుండా వుంటే మన లింగాపురం భూములు మనచేతుల్లో ఉండేవా? మన కాళ్ళు మన భూముల్లో నడిచేవా? మన భూములకు పొయ్యేదానికి మనకో ఓనిమి ఉందంటే అది ఆ తాత వల్లే కదా ? ” భూమిక.
ఎన్నేళ్ళ కథ అది. ఎంత పెద్ద కథ.ప్రభుత్వం యస్సీ యస్టీ లకు భూములు ఇచ్చిన తర్వాత ఎందరు ఎరుకల వాళ్ళు రైతులుగా మారినారో, చివరికి ఎందరుఎరుకల వాళ్ళు రైతులుగా మిగిలినారో చెప్పే కథ.ఎరుకల వాళ్ళు వాళ్ళ భూములకి వాళ్ళు పోలేకుండా లింగాపురం లో ఓనిమి (దారి ) లేకుండా పెద్దోళ్ళు యెట్లా మాయo చేసారో చెప్పే కథ.ఒకసాదా సీదా మామూలు మనిషి పెద్దోల్ల అన్యాయాన్ని ఒప్పుకోకుండా తిరగబడి ఎదిరించి నిలబడితే ఉడుకుడుగ్గా మాట్లాడితే, ఆ మనిషిని జైలుకు పంపిన కథ. సాటి కులమోల్లకోసం జైలుకు వెళ్లి ప్రభుత్వ టిచర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉన్నత విద్యావంతుడైన,ఒక గిరిజన ఉపాధ్యాయుడి కథ.ప్రభుత్వఉద్యోగం పోయినా జీతం లేకుండానే కొన్ని సంవత్సరాలపాటూ ఎంతో మంది పేద పిల్లలకి మంచీ చెడు చెప్పి, పాఠాలు నేర్పి, ప్రయోజకుల్ని చేసిన ఒక సృజనకారుడి కథ.
***
“ బిరిన్నే చెప్పండి మీ భూములు అమ్ముతారా? అమ్మరా ?” పెద్ద కులపోల్ల గొంతులు ఎప్పుడూ పెద్దవిగానే వుంటాయి. ఆ వూర్లో అప్పటిదాకా ఎప్పుడూ ఆ గొంతులకు అడ్డం చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఆ రోజు మాత్రంలింగాపురం లో ఒక విచిత్రం జరిగింది.
ఎరుకల కులంలో పుట్టి , ఊరు దాటి, జిల్లా దాటి హాస్టల్లో చదువుకుని టీచర్ ఉద్యోగంలో కొత్తగా చేరిన ఎరుకల రామచంద్రుడు ఆ నిముషం గొంతు విప్పాడు. గుండె విప్పాడు.
“ ఏం మీరు కొనాలంటే మాత్రం మేం మా భూములు చవగ్గా ఇవ్వాల్నా ? మీరు అమ్మాలంటే మాత్రం రేట్లు ఆకాశం లో ఉండల్నా? తక్కువ జాతోల్ల భుములకు రేట్లు తక్కువ అంటారా? ఇదేమి న్యాయం? మా పక్కన మీ భూములు వుండచ్చు . ఎంత మాత్రం తప్పు లేదంటారు. అదే మా భూములు మీ పక్కలో వుంటే మాత్రం అది మీకు తక్కువనా? ఏమన్నా ? కులాన్ని బట్టి భూమి రేటు కూడా మారుతుందా ? మట్టికి కూడా కులం ఉందoటారా అన్నా ? ఇదెక్కడి న్యాయం ? ”
ఉడుకురక్తం కదా అనుకున్నారు అందరూ.
పెద్దవాళ్ళు కోపంతో ఉడికిపోయారు.ఎరుకల వాళ్ళు అంతకంటే ఎక్కువగానే ఆవేశంతో ఉడికిపోయారు.
అంత ఉడుకుడుగ్గా మాట్లాడాడు రామచంద్రుడు.
“ నువ్వు ఉండరా అబ్బోడా .... నీది ఉడుకు నెత్తురు. తొందర పడొద్దు”కులపెద్ద నాగయ్య అడ్డు వచ్చేశాడు.
“ ఎరికిలోడు సేద్యం ఒక్కటే నేర్చుకుంటే సాలదు మామా , పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల, బ్రతకాలంటే కరువుతోనే కాదు, మొండి మేఘాలతోనే కాదు, మొండి మనుషులతో, పెద్ద కులమోళ్ళతో పోరాటాలు చెయ్యడం నేర్చుకోవల్ల. పందుల్ని మేపే వాళ్ళకు , ఊరూరా తిరిగి గాడిదలపైన ఉప్పు అమ్మి , ఎర్రమన్ను, ముగ్గుపిండి అమ్మిబ్రతికే వాళ్లకు,అడవుల్లో బ్రతికే వాళ్లకు,ఎండకు వానకి పురుగూ పుట్రకిభయపడని వాళ్లకి ఇంకొకరు నేర్పించల్లనా? బ్రతికేదానికి వయసుతో పనేముంది మామా ? ఏ వయసోడికైనా బ్రతకాలంటే నెత్తురు ఉడుగ్గానే ఉండల్ల. అసలు మనిషి అనే వాడు ఎప్పుడూ ఉడుకుడుగ్గానే ఉండల్ల.” కుండబద్దలు కొట్టినట్లు తెగేసి చెప్పేశాడు రామచంద్రుడు.అతడు అట్లాగే బ్రతికాడు. జీవితకాలం మొత్తం ఉడుకుడుగ్గానే బ్రతికాడు. ఎక్కడా ఎవరిముందు తల దిoచిన వాడు కాదు. పెద్దోల్ల కుట్రలకి పొలీసుకేసులకి ఉద్యోగం పోయినా వెనకడుగు వేసినవాడు కాదు.
నెలలు కష్టపడి రాళ్ళు తేలిన నేలలో అడవిలాగా పెరిగిపోయిన మొక్కల్నిమొత్తం పీకిపారేసి, బండరాళ్ళు పగలగొట్టి, , రాళ్ళు ఏరి, నేల చదును చేసి సాగుకు అనుకూలంగా మార్చిన తర్వాత ఆ భూముల రూపమే మారిపోయింది. ఎందుకూ పనికి రాదనుకున్న కొండనేల, బండనేల, ఆ భూములపైన కన్ను పడిన తర్వాత జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఊరి పెద్దోళ్ళకు కంటి నిండా నిద్ర లేకుండా పోయింది. ఆ పొలాలను ఎట్లాగైనా చవగ్గా కొనేయ్యాలని విఫల ప్రయత్నo చేశారు.
ఊర్లోంచి ఆ పొలాలకి వెళ్ళే దారి ఉన్నట్లుండి ప్రభుత్వ రికార్డుల్లోంచి మాయమైపోయింది.
ఆ దారికి ఒక చరిత్ర వుంది.
అది ఆ ఊరి రక్తచరిత్రలో ఒక భాగం.చెరువు దాటి , పెద్దోల్ల పొలాలు దాటి, వాగు దాటి వంక దాటినా తర్వాతా , కొండల్లో గుట్టల్లో , పిచ్చి మొక్కల మధ్య గవర్నమెంటు ఎరుకల వాళ్ళు బాగుపడాలని ప్రభుత్వం ఇచ్చిన పొలం అది.ఆ రాళ్ళల్లో ఆ బండ రాళ్ళల్లో, ఆ దుమ్ములో, ధూళిలో, ముండ్ల చెట్లల్లో, పాముల పొదల్లో , విషపు పురుగుల మధ్య కొన్ని సంవత్సరాలు ఎరుకల వాళ్ళు మనుషుల్లాగా కాక, యంత్రాల్లాగా పని చేస్తే ఆ నేల అంత మాత్రం చదును అయ్యింది.ఎరువులు తోలినారు, ఎద్దులని తోలినారు, గంపల కొద్ది రాళ్ళు మోసినారు, ఒళ్లంతా రక్త గాయాలే. ముందుతరం వాళ్ళ రక్తంతో చమటతో తడచిననేల అది.ఆ పొలాలకి వెళ్ళే దారి కోసం యుద్దాలే జరిగాయి, తలకాయలు పగిలాయి.పోలీసు కేసులు అయ్యాయి.
ఎన్నో పంచాయితీలు, రాజకీయాలు నడిచాయి.చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కు, మదనపల్లి సబ్ కలెక్టర్ వద్దకు వెళ్లి అర్జీలు ఇచ్చి వచ్చారు.ఆ అర్జిలన్నీ తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చాయి. కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా వుండిన ఆ డొంక దారి రెవిన్యూ రికార్డుల్లోంచి ఎందుకు యెట్లా మాయమైoదో తెలియదు. దారి మూసి వేసిన రైతుల్ని గట్టిగా అడిగితే వాళ్ళు మొహాలు చూపకుండా కనపడకుండా పోయారు.
ఆ రోజు పెద్ద గొడవ అయింది.వీఆర్వో ను అడిగితే ముందు నోరు తెరవలేదు. అది దారి కాదు , అక్కడ దారే లేదు అనేశాడు. అందరూ ఎంత మాట్లాడినా , ఎంత బ్రతిమలాడినా దిగి రాలేదు ఆయన.
“ఓపిక లేదా నీకు?. ఇంత తొందర పెడితే ఎలా ? మేం కూడా మనుషులే కదా మాకేమన్నా నాలుగు చేతులున్నాయా? “ మొహం చిట్లించేశాడు. అవలింతను ఆపుకునే ప్రయత్నం కానీ, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకునే పని కానీ చెయ్యకుండా మొహం అంతా పెద్దది అయ్యేలా నోరంతా తెరిచి పెద్ద చప్పుడుతో ఆవులించాడు వీఆర్వో రంగారెడ్డి . సన్నగా వున్నాడు కానీ అతడి గొంతు చాలా కరుగ్గా వుంది, మాట కటినంగా వుంది.నోట్లోంచి సిగెరట్ పొగతో ఇంకేదో కలసి మొత్తానికి వెగటు వాసన వస్తోంది.
మొహం పక్కకు తిప్పుకుంటే ఏమనుకుంటాడో అని సందేహిస్తూనే , ఒక అడుగు వెనక్కు వచ్చి, ఊడి పోయిన అతడి చొక్కా గుండిల వైపు, ఉబ్బి పోయిన అతడి కడుపు వైపు చూస్తూ మెల్లగా ఇంకోసారి మెత్తగానే అడిగాడు ఎరుకల రామచంద్రుడు.
“ దారి కోసం జనం అల్లల్లాడతా వుండారు సార్, కొన్నేండ్లు వానల కోసం ఎదురు చూసినాం సార్ .ఇంకోన్నెండ్లు పట్టాలకోసం చూసినాం సార్. మా బావులన్నీ పూడిపోయక, రాళ్ళు తేలిపోయిన బావుల్లో పాములు పురుగు పుట్రా ఇన్నెండ్లూ వుoడి పోయినాయి సార్, ఇప్పుడైనా వానలు పడినాకే ఇంత మాత్రం నీళ్ళువచ్చి మా బావులు కళకళ్ళాడతా వుండాయి సార్, ఇప్పుడు గానా మాకు మా పొలాలకి పొయ్యేదానికి దారి వదల్లేదంటే మొత్తం మా పొలాలు అన్నీ మళ్ళీ బీడు పడిపోతాయి సార్, మా బ్రతుకులు మళ్ళీ పందుల పాలు అవతాయి సార్.మీరు మా పరిస్థితి అర్థం చేసుకోండి..ప్లీజ్ ”
“ఊర్లో పందులు వుంటే ఊర్లో వుండే వాళ్లoదర్కీ వ్యాధులు వస్తాయి అంటారు సార్, నిజమే. పందులతో బాటూ మమ్మల్ని కూడా వూర్లోంచి వేలేస్తామని దండారా కొట్టి చెప్తావుండారు, బావుంది సార్, మీరు అందరూ ఎప్పుడూ బావుండల్ల. మేమే చెడిపోవల్ల. అంతే కదా సార్. మేం అడవుల్లోకి పోకూడదు, వెదుర్లు కొట్టకూడదు, చెట్లు కొట్టకూడదు, మేకలు తోలుకుని అడవిలోపలికి పోకూడదు అంటారు.అప్పుడు అడవులనుండి తరిమేస్తిరి, ఇప్పుడు సేద్యం చేసైనా పొట్ట పోసుకుందాం అనుకుంటే అదీ కాకుండా చేస్తా ఉండారు . ఇప్పుడు సేద్యం నుండి కూడా తరిమేస్తేఇంకా మేం యెట్లా బ్రతకాలని మీరంతా అనుకుంటా వుండారు? మీరు మాత్రం బ్రతికితే సాల్నా ? తక్కువ కులం లో పుట్టినామని ఇంత అలుసా సార్ మేమంటే ?”
“ ఏయ్ ఒక్కసారి చెపితే అర్థం కాదా మీకు ?మీ పొలాలకు ముందునుంచే ఎక్కడా దారి లేదు. రికార్డుల్లో ఎక్కడా మీ పొలాలకు దారి వున్నట్లు ఎక్కడా ఆధారాలే లేవు. లేని దారిని ఇప్పుడు మీరు అడగతావుండారు.ఇదేమి న్యాయం?మల్లింకా గట్టిగా ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే మాత్రం కిందకులాలంటే అంత చులకనా మీకు అని నిలదీస్తారు.మీదే తప్పు. అసలు తప్పంతా మీదే.పెద్దోల్ల పొలాల్లోకి పోకండి. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మీపై కేసు పెట్టకుండా మాటల్లోనే హెచ్చరిస్తా వుండారు. మీరంతా బాగుపడాలనే కదా, పైకి రావాలనే కదా యస్సీ యస్టీలకు ఇంత నేల చూపిస్తుంది ప్రభుత్వం.ఇంత మాత్రం కొండలో గుట్టలో ఏదో ఒక భూమి ఇచ్చేదే గొప్ప, ఇంకా దారికూడా కావాలంటే యెట్లా? ”
“ రాళ్ళూ రప్పలు ఉండే చోట కొండ తవ్వి సేద్యం చేసుకోవాల్నా మేం ? దారి లేకుండానే భూములిస్తే మేo ఏమైనా గాల్లో ఎగిరి పోయి సేద్యం చేసుకోవల్నా ? ఎందుకు పనికి రాని భూముల్ని యా మూల్లోనో మాకు ఇస్తానే వుంటారు. కింద కులాలోల్లు యాడికి పోయ్యేదీ లేదు, సేద్యం చేసుకునేదీ లేదు. కింద వుండే వాళ్ళు కిందనే ఉండిపోతాo. అయినా ఏంది సార్ అంత అన్యాయంగా మాట్లాడతా వుండారు ?ఇన్నెండ్లూ మా పొలాలకి దారి లేదంటే, మేమంతా గాల్లోకి పొయ్యి సేద్యం చేసినామా ఇన్నేండ్లు ? ”
మాటా మాటా పెరిగింది. ఉడుకోడు ఊరుకోలేదు.
ఆఖరికి ఉడుకోడు పెద్దగా గలాటా చేస్తే వీఆర్వో అడ్డం తిరిగేశాడు.
“ పోనీలే... అని మర్యాద ఇస్తా వుంటే ఏందిరా ఎదురు మాట్లాడేది నేరిస్తా వుండారు? మాలోల్లు మాదిగోల్లే అనుకుంటే, ఇప్పుడు తిరగబడి మాట్లడేదానికి ఎరికిలోల్లు కూడా తయారవతా వుండారు.ఏం తెలుసురా మీకు? చట్టం తెలుసా , గవర్నమెంటు అంటే తెలుసా ? అధికారులంటే అంత అలుసా మీకు? నాతో జాగ్రత్తగా ఉండండి. ముందుగానే చెప్తా ఉండా. నాకు తిక్క రేగిందంటే కేసులు పెట్టి మీకు భవిష్యత్తే లేకుండా చేసేస్తాను బద్రం.. ” అది అతడి ఒక్కడి మాటే కాదు. పెద్దోల్ల మాట కూడా అదే. వాళ్ళ మాటలే అతడి నోటి వెంట...
వాళ్ళ బెదిరింపులకు ఉడుకోడు అస్సలు లొంగలేదు. వీఆర్వో మొత్తానికి అంతా తారుమారు చేసేశాడు. అది డొంకదారి కాదని, దొంగదారి అని తేల్చేశాడు.మారింది మార్చింది ఒక్క అక్షరాన్నే. కానీ మారింది పాడయింది..ఎన్నో జీవితాలు.కొంతకాలం వరకూ ఆ పొలాలు కొన్ని బీడుగానే ఉండిపోయాయి.కొన్ని పెద్దోల్ల బలవంతాన ఆ దారిలేక, వేరే దారీ..లేక తక్కువ ధరలకే అమ్మకానికి వెళ్ళాయి.కొన్ని పొలాలు చేతులు మారాయి.ఇంకొన్ని పొలాలు వాళ్ళు చేసిన అప్పులకీ వడ్డీలకీ పెద్దోళ్ళ వద్దకే తాకట్టులోకి వెళ్ళిపోయాయి.
“ ఇదొక పనికిమాలిన రూలు. మన గవర్మెంటు వస్తానే దీనెబ్బా.. ఎదవ రూలు మార్చి పడేద్దాం అన్నా. అదేంది.. యస్సీయస్టీ ల డికేటి భూముల్ని వేరే కులాలోల్లు కొనకూడదoటే యెట్లా కుదురుతుంది? రిజిస్ట్రేషన్ చేసేది లేదంటే ఎట్లా ? ” పెద్దోల్ల బాధలు పెద్దోల్లవి.
తొంభైతొమ్మిది సంవత్సరాలకు లీజుకు పత్రాలు రాసుకున్నారు కొందరు. బాండుపేపర్ పైన అగ్రిమెంట్ చేసుకుని అమ్మకాలు జరుపుకున్నారు కొందరు. ఇచ్చిన సొమ్ముకు ఎక్కువగా బాండ్ పేపర్లో తెలివిగా సంతకాలు తీసుకున్న పెద్దోళ్ళు కొందరు. తాము ఇచ్చిన దానికన్నా తక్కువకే అతి తెలివిగా బాండు పేపర్ రాసుకున్నపెద్దోళ్ళుఇంకొందరు .
నాగయ్య అడగనే అడిగేశాడు ” ఎందుకురా మన పొలాలు అమ్మకానికి పెడతారు. ఈ భూములు మళ్ళీ కొనాలంటే జీవితాంతం మన బ్రతుకులన్నీ కలిపినా సాలవు.అందరం కలసే భూములు సాగు చేసుకుందాం .అందరూ ఒక్క మాట మీదే నిలబడదాం. ” ఆ మాటలు ఎవరూ పట్టించు కోలేదు. ఆయనంటే గౌరవం ఉన్న వాళ్ళు మాత్రం ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
“ పెద్దాయనా నువ్వు సెప్పేది వినేడానికి బాగానే వుంది. రైతుల్ని చూడు.ఉండేవాడు బాగానే వుండాడు. వుండే రైతుకు వాన వచ్చినా ఒక్కటే, రాకపోయినా ఒక్కటే, ఎందుకంటే ఉండేవానికి పది రకాల సంపాదనలు వుంటే అందులో సేద్యం ఒక్కటి మాత్రమే. జరుగుబాటు లేని రైతును సూడు. వానికి వానొస్తేనే సేద్యం వుంటుంది. వానొస్తేనే బ్రతుకు వుంటుంది, వాళ్ళ ఇంట్లో వానొస్తేనే పండగలు అయినా దేవరలు అయినా టయానికి జరగతాయి.టయానికి వానలు లేవు అంటే అదును తప్పేది వానోక్కటే కాదు. మొత్తం రైతు బ్రతుకే అదుపు తప్పుతుంది. వాళ్ళ పరిస్థితే అట్లా వుంటే ఇంక మనం ఎంత? మన బ్రతుకులెంత ? ”అనేసారు.
“ అయినా మనకు వేట తెలుసు, జీవాల్ని మేపడం తెలుసు,అడవులు తెలుసు, తేనే,మూలికలు ఆకు పసుర్లు తెలుసు. అడవులు, ఊర్లు,వీధులు తిరిగి తిరిగి బ్రతకడమే తెలుసు.వెదుర్లు చీల్చి దబ్బలు, బుట్టలు అల్లడం తెలుసు, మనం మానంగా బ్రతికే బ్రతుకు వదిలేసి,ఇప్పుడు మడక కట్టు, దుక్కి దున్ను, విత్తనాలు ఎయ్యి, కలుపు తియ్యి అంటే అదంతా కుదిరే పనేనా ?అయినా సేద్యం పనులకి కూలికి పోయ్యేదానికే మనకు అలవాటు కానీ ఇప్పుడు నువ్వే రైతువి, నువ్వే సేద్యం చెయ్యల్ల అంటే ఎరికిలోడికి గుoడె జారి పోతా వుండాదిరా అబ్బోడా.నీకు ఎన్ని తూర్లు చెప్పినా అర్థమే గావడం ల్యా... మార్చల్ల అంటావు, మారల్లఅంటావు,ఇదంతా అయ్యే పనే అంటావా? ”నాగయ్య ఎంత చెప్పినా ఉడుకోడు వినలేదు. అప్పుడు మొదలు పెట్టిన పోరాటాన్ని ఆపనే లేదు.
***
ఉడుకోడు జీవితకాలం అట్లాంటిపోరాటాలు చేస్తూనే ఉండిపోయాడు.ఎప్పుడూ ఎక్కడా చల్లబడలేదు.
వయసు మళ్ళినా ముసలితనం వచ్చినా, చూపు మందగించినా, వినికిడి శక్తి తగ్గినా, కీళ్ళనొప్పులు సతాయించినా అతడిలో పట్టు తగ్గలేదు.ఇప్పటికీ అతడు ముసలివాడు కాలేదు, ముసలివాడని ఎవరి దగ్గరా అనిపించుకోలేదు. మార్పు కోసమే అతడి పోరాటం.అన్యాయాన్ని ఎదిరించడమే అతడి జీవన విధానం.
ఆ ఊరికి పంచాయతి కేంద్రం ముందు నుండీ చాలా దగ్గర. తర్వాత అది మండలకేంద్రం అయింది, మున్సిపాలిటీ అయింది. పొలాలకు మనుషులు దూరమయ్యాక , కొత్త కొత్త పనులకు, కొత్త ఉపాధులకు వాళ్ళు అలవాటు పడ్డాక టౌన్ లో కాలనీ ఇండ్లు మంజూరు అయ్యాక వాళ్ళ స్థావరాలు మారాయి.ఉపాధులు మారాయి. కొన్నేoడ్లకు పందులు వూరికి దూరం గా ఉండాలనే ఆంక్షలు వచ్చాక, కొందరు పందుల తో బాటూ ఆ ఊరు వదిలిపెట్టేసారు.
ఉన్న అప్పులకి తోడు ఇంకా అప్పులు చేసి కొoదరు, గవర్నమెంటు ద్వారా బావులు తవ్వుకొని కొందరు, బోర్లు వేసుకుని కొందరు మాత్రం వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. ఎంత లోతుకు వెళ్లి వేసినా వాటిల్లో ఫెయిల్ అయిన బోర్లే ఎక్కువ. బోర్ ఫెయిల్ అయినా బ్యాంకు అప్పులు వడ్డీలు కట్టాల్సిందే అని బ్యాంకులు తెగేసి చెప్పినప్పుడు, ఆ అప్పులు తీర్చేదానికి మిగిలిన పందుల్ని, మేకల్ని , ఆవుల్ని అమ్ముకున్నవాళ్ళు కొoదరు.ఇన్ని బాధలూ పడిన తర్వాతా కూడా ఆ పొలాలకి వెళ్లి వచ్చేదానికి దారి లేదంటే వాళ్లకు ఏడుపే వచ్చింది. అట్లా ఏడ్చుకున్న వాళ్ళు ఎందరో. అటూ వ్యవసాయమూ చెయ్యలేక,ఇటు కులవృత్తులు చెయ్యలేని పరిస్థితిలో...అయోమయంలో వుండిపోయారు.. చాలా కాలం.
ఇప్పుడు వాళ్ళ వద్ద పందులు లేవు, ఆవులు వున్నాయి.
వాళ్ళ పిల్లలు వూరు దాటి హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో మాత్రం ఇండ్లకు వస్తారు. అప్పుడైనా వాళ్ళు ఎక్కువ మాట్లాడేది, ఎక్కవ సేపు వుండేది ఉడుకోడి వద్దే. చిన్నప్పటి నుండి వాళ్లకు అక్షరాలు నేర్పి,చదువుతో బాటూ మంచీ,చెడు చెప్పిందీ ఆయనే, బాగా చదవాలనే తపన కలిగించిoదీ ఆయనే. వాళ్ళల్లో కొందరు మైక్ ముందు నిలబడి కొత్త బాషలో కొత్తగా మాట్లాడుతూ వుంటే కాలనీ వాళ్లకి ఆశ్చర్యంగానే ఉంది.
“ మనం ఎప్పుడూ వెనక అడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంత కాలం ఈ వెనుకబాటుతనం.ఇంకెంత కాలం ఈ కుల రాజకీయాలు ? ప్రతి ఇంట్లో దేవుడి ఫోటోలు కాదు వుండాల్సింది, మంచి పుస్తకాలు ఉండల్ల.మనలో ఏ ఒక్కడూ తక్కువ చదివే దానికి లేదు.ఎరికిలోల్లు అందరూ ఎక్కువే చదవల్ల. ఉడుకాయన పోటీపరీక్షలకి పుస్తకాలు కావాలని మా సీనియర్లకి చెప్పినాడు, ఉద్యోగాలు వచ్చినోళ్ళంతా పుస్తకాలు కొనిస్తామన్నారు.గుడి బదులు లైబ్రరీ కడితే చాలు. అందరూ ముందుకు వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే కానిది ఏముంది ? ” ఉడుగ్గానే ఉన్నాయి ఆ మాటలు.
అప్పుడు వచ్చింది భూమిక మైక్ ముందుకు.” అన్నా మొన్న కూడా ఉడుకాయన ఆ ఓనిమి గురించే... ఆ దారి గురించే బాధ పడినాడు. ఏదో ఒకటి చేసి ఆ సమస్య పరిష్కరించాలి. అప్పుడే ఆయనకు శాంతి. ”
అప్పుడు చాలాకాలం తర్వాత మళ్ళీ ఆ దారి గురించి మాటలు మంతనాలు మొదలయ్యాయి.గవర్నమెంటు మారినప్పుడల్లా ఆ దారి కూడా తన రూపు రేఖలు మార్చుకుంటుంది. మనిషి నడవడానికి మాత్రమే కుదిరే దారి అప్పుడు మాత్రం విశాలమవుతుంది!అంత వరకూ అడ్డుగా వుండిన రైతులు అప్పుడు మాత్రం దారి వదలతారు,అప్పుడుఆ దారిగుండా ఎద్దుల బండ్లు పోతాయి. ట్రాక్టర్లు పోతాయి, జేసిబిలు పోతాయి. ఆ కాలం లోనే ఎరుకలవాళ్ళు బోర్లు వేసుకోవాలన్నా , కలుపు తీయాలన్నా , నేల చదును చేసుకోవాలన్నా కుదురుతుంది.
ఇదేండ్ల తర్వాత ప్రభుత్వం మారితే దారి కూడా మారిపోతుంది. ఒక్కోసారి ఆ దారి కాలిబాట లాగా కుంచించుకు పోతుంది. అప్పుడు ఇక ఎద్దుల బండ్లు పోలేవు.ట్రాక్టర్లు , జేసిబిలు పోలేవు. సైకిళ్ళు పోవచ్చు, నడచి పోవచ్చు అంతే, అంతకు మించి పోవడానికి కుదరదు. అదే లింగాపురం రాజకీయం.
పరుగులాటి నడకతో కొందరు అప్పుడే బస్సు దిగి వచ్చారు కాలనీ లోకి.
“ఎవరికి ఏం కావాలన్నా ఉడుకోడి వద్దకే కదబ్బా అందరూ వస్తారు. గవర్నమెంటులో ఏ పని యెట్లా చెయ్యాలో ,చేయించుకోవాలో, పని కాక పోతే ఎవుర్ని కలవాలో, యెట్లా కంప్లైంటు చెయ్యాలో ఆయనే కదా నేర్పించేది. యస్టీ కార్పోరేషన్లో ఎంత మందికి ఎన్నెన్ని లోన్లు తీపిచ్చినాడో లెక్కేలే . మనోళ్ళవద్ద ఏ ఆఫీసర్ అయినా లంచాలు అడగల్ల అంటేనే భయపడి పోతారంటే వాళ్లకి ఉడుకోడు అంటే వుండే భయమే కదా కారణం.పద పదా .. చివరి చూపు చూసి ఆయనకో దండం పెట్టుకుని రావల్లనే కదా ఇంతదూరం వచ్చిండేది. బిరిన్నే పదా ..”
ఇప్పుడు మైక్ ముందుకు పార్వతి వచ్చి నిలబడి చుట్టూ చూసింది.
పార్వతి పొడవుగా వుంటుంది. వాళ్ళ నాన్నకు అక్కడపొలం వుంది. కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది కానీ యస్ఐ కావాలని పోటీ పరిక్షలకు చదువుకుంటోంది. ఆమె తల తిప్పుతూ అక్కడ గుమిగూడిన వారిని చూస్తూ మాట్లాడుతోంది...
“ఒక్కటే మాట. అంబేద్కర్ చెప్పినాడో , ఇంకొకాయన చెప్పినాడో ఉడుకాయన చెప్పినాడో ఒక్కటే మాట..” ఎడమ చెయ్యి పైకి ఎత్తి మిగతా నాలుగువేళ్ళు మడచి పెట్టుకుని చూపుడు వేలు మాత్రం పైకి ఎత్తి చుట్టూ చూపిస్తూ అంటోంది...
“అస్సలు ఈ కులం ఎవడికి పుట్టింది? మన భూమి అనేది మన ఆత్మగౌరవం. ఎవరు ఏం చేసినా సరే మన భూములు అమ్మడానికి లేదు. మందు, బిర్యానీ,డబ్బులేకుండా ముందు ఓటేద్దాం.అప్పుడు వాళ్ళే దారికొస్తారు.
మనది దొంగదారి అంటారా వాళ్ళు.. చూద్దాం..దాన్ని మళ్ళీ డొంక దారి చేసుకుందాం.ఇది మన దారి.. రహదారి.ఏమంటారు ? అన్నతమ్ముల్లారా , అక్క చెల్లల్లారా.. ఏమంటారు? ”
“అంతే అంతే.. “ జనం ఉడుగ్గా ఉన్నట్లున్నారు.
మనుషులు వడివడిగా నడుస్తున్నారు.అక్కడ ఎండవల్లో, ఎందువల్లో వేడి సెగ కొడుతోంది.గాలిలోనే కాదు,మనుషుల నుండీ కూడా ఏదో వేడి సెగ మొదలయ్యింది.అక్కడి వాతావరణం ఉడుకెక్కిపోయింది.అక్కడున్న వాళ్ళు అందరూ ఉడుకెత్తి పోతున్నారు.
పలకల చప్పుడు ఎక్కువైంది. చప్పట్లు, ఈలలు, నినాదాలు, అరుపులు, ఏడ్పుల మధ్య ఉడుకోడి శవం పైకి లేచింది.
@@@
"ఇప్పుడు షాపింగ్ అని నా వీకెండ్ వేస్ట్ చేయకమ్మా"
"చెప్పేది విను. నీ వీకెండ్ ఏమీ వేస్ట్ అవ్వదు. ఇక్కడే హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో నల్గొండ జిల్లాలోనే పోచంపల్లి. 40 కిలోమీటర్లు ఏమో అంతే. మధ్యాహ్నానికి వచ్చేద్దాం"
"సరే పద, రానంటే ఊరుకోవు కదా" అని గొణుకున్నాను
సిటీ దాటి కాస్త దూరం వెళ్ళాక, ఎడమ చేతి వైపు 'భూదాన్ పోచంపల్లి' అని బోర్డు కనిపించింది. అక్కడ లెఫ్ట్ తీసుకుని కాస్త లోపలికి వెళ్ళాక ఒక మెయిన్ రోడ్డు, దానికి రెండువైపులా చిన్న చిన్న గల్లీలు. గల్లీకి రెండువైపులా పెంకుటిళ్లు. ప్రతి ఇంటి ముందు ఒక అరుగు, వసారాలో మగ్గం పనికి సంబంధించిన ఏదో ఒకటి కనిపించింది అక్కడ.
కార్ ఇంక ఆ గల్లీలో వెళ్ళేటట్టు లేదని తెలిసి, పక్కన పార్క్ చేసి, చీరలు ఎక్కడ కొనాలా అని వరుసగా చూసుకుంటూ వెళ్ళాం నేను, అమ్మ. ఒక ఇంటి దగ్గర నిలువు పేకల మగ్గంపై నేసిన నలుపూ తెలుపు రంగు చీర కనబడింది.
"అది బాగుంది, తీసుకో" అన్నాను .
"నలుపూ తెలుపు కాంబినేషన్‍లో ఏది చూసినా అదే ఫైనల్ అంటావు. ఇంకా చూద్దాం ఉండు" అంది అమ్మ.
వసారాలో ఒకతను రంగులద్దే పనిలో ఉన్నాడు. ఇదే కదా రంగు అని ఒక పెద్దాయన్ని అడుగుతున్నాడు.
"పసుపు రంగు తగ్గియ్. చీర కన్నా పెళ్లికూతురు ఎక్కువ మెరిస్తే బాగుంటది."
"అంచుకి కొండలు కాదు, కమలం వెయ్. కమలం విరబుయ్యాలె. ఆకులు రెపరెపలాడాలె. అట్లుండాలె. కొంగు రంగు మూర మూరకి మారాల. అది డిజైను" అని మగ్గం మీద కూర్చున్న ఇంకొక అతనితో చెప్తున్నాడు.
ఇంతలో మమ్మల్ని చూసి, "రా బిడ్డా రా, పోచంపల్లి చీరలు మస్త్ ఫేమస్ మాకాడ. ఓ నాల్గు చీరలు పట్కవోదువుతీయి" అని లోపలికి తీసుకువెళ్లాడు.
మూడు గదుల ఇల్లు అది. వంటింటి నుండి గిన్నెల చప్పుడు వినబడింది. కొత్త కోడలు అనుకుంటా, మెడలో పసుపు తాడు ఆమె మేని రంగుతో పోటీ పడుతోంది. చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి పెద్దావిడ పక్కన కూర్చుంది. ఆసు పోయడం నేర్చుకుంటోంది. కాసేపటి తర్వాత "నెయ్యి బువ్వ బిడ్డా" అని పెద్దావిడ కోడలికి చెప్పి లోపలికి వెళ్ళింది.
"నెయ్యి బువ్వ ఏంటి? అప్పుడే భోజనం వేళ అయ్యిందా?" అనుకున్నాను చేతికున్న గడియారం వంక చూస్తూ.
"సూడు బిడ్డా. గీ చీరలకి పాత బస్టాండ్ల మా పట్కరోల్ల దుక్నంల మంచి గాజులు పట్కవోదు, మస్త్ ఉంటై, లచ్మి దేవి లెక్క." అని చీరలు పట్టుకొచ్చి మా ముందు పెట్టాడు ఆ పెద్దాయన.
ఆయన ప్రతి డిజైన్, ప్రతి రంగు తీసి చూపించి, భుజంపై వేసుకుని, అటు ఇటు తిప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన కొడుకు వాటిని తిరిగి మడతలు పెడుతున్నాడు.
"ఇది ఇక్కత్ నేత బిడ్డా. మన బతుకుల్లో అంకాలున్నట్టే ఇందులో కూడా చానా ఉంటై. ఇవి రెడీ కావడానికే మస్త్ టైం పడ్తది. జీవితం లెక్కనే చిక్కులు చిక్కులుగా ఉంటది పట్టు దారం. ఒక్కో సమస్య తీర్చి ముందుకు పోయినట్టే ఒక్కో పోగును రాట్నంపై వడుకుతం. వడికిన పట్టు కండెలకు సుట్టి, ఆడ నుండి దారమంతా ఆసు పోస్తం. అగో అట్ల" అని కోడలు వైపు చూపించిండు. "ఆసుకు రంగు అద్దకముందే డిజైన్లు వేస్తం. మస్తుంటయి ఆ డిజైన్లు. నెమళ్ళ నాట్యం, చిలుకల నవ్వులు కానొస్తయి ఈ ఇక్కత్ నేతల. డిజైన్లు ఆసుపై వేస్కొని, మిగిలిన ఆసుకు రబ్బర్లు చుట్టేస్తం. అచ్చం మనం జీవితంల దేని మీద మనసుపెట్టాల్నో దాని మీదనే పెట్టి, మిగతాది ఇడ్సినట్టు. వేడి చేసిన రంగునీటిలో రంగులద్ది, అది ఆరినంక రబ్బర్లు విప్పి వార్పు పరుస్తరు, దాన్ని మగ్గంపై నేస్తరు. మగ్గం నేసేటప్పుడు చేనేత కార్మికుడి చేతులు, కాళ్లు పని చేయాల్సిందే. ఏ ఒక్కటి ఆగినా చీర రాదు."
ఇంత ఉంటదా ఒక చీర వెనక కష్టం అన్నట్టు ఆ పెద్దాయన్ని చూస్తూ కూర్చున్నాను. అమ్మ ఓ నాలుగు చీరలు సెలెక్ట్ చేసుకుని బిల్లు కట్టింది. మళ్ళీ కావాలంటే తప్పకరండి అని చెప్పి, ఫోన్ నెంబర్ ఇచ్చి గుమ్మం వరకు వచ్చి సాగనంపాడు పెద్దాయన.
రెండు వారాల తర్వాత, 'మండే బ్లూస్' అని ఫ్యాన్సీగా చెప్పుకునే ఓ సోమవారం. పది గంటల సమయంలో నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర క్యాబ్ దిగాను. సెక్యూరిటీ చెక్ దగ్గర బ్యాగ్ పెట్టి లోపలికి వెళ్తూ గ్లాస్ డోర్ అద్దంలో నేను కట్టుకున్న చీరని మరోసారి చూసుకున్నాను. మీటింగ్‍కి ఈ చేనేత చీర ఏంటని అమ్మని పదిసార్లు తక్కువ అడిగుండను. పెద్ద పెద్ద కంపెనీల నుండి సీనియర్ లీడర్స్, ఫారిన్ డిగ్నిటరీస్, ఎన్‌జిఓ నుండి ప్రతినిధులు, అందులోనూ ఆడవారు వస్తున్నప్పుడు కాస్త కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలంటే చీర సరైన డ్రెస్ కోడ్ అని నచ్చజెప్పింది.
'అన్ని ఫ్యాన్సీ చీరలు ఉంటే ఈ ఓల్డ్ మోడల్ చీర ఇచ్చింది అమ్మ.. ఏముంది ఇందులో? జ్యామితి పుస్తకంలో బొమ్మల్లా చీర అంచులో కొండలు, కమలాలు. ఎలా దీన్ని క్యారీ చేయడం?' అని ఆలోచనలో పడ్డాను.
వెనుక నుండి సంయుక్త వచ్చి భుజం తట్టగానే ఆలోచనల్లో నుండి బయటపడి తిరిగి చూసాను.
"ఏంటే, నువ్వేనా? ఆఫీస్‍కి సూట్ అంటేనే చిరాకు పడేదానివి, ఇవ్వాళ ఏకంగా చీర, అది కూడా ఇక్కత్.. అద్దిరిపోయింది లుక్.."
"థాంక్యూ.."
"వెల్కమ్ వెల్కమ్, సరే పద, మనం వెళ్ళాల్సింది ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ రూమ్‍కి"
అప్పటికే లాబీలో హై టీ నడుస్తోంది.
"లూజ్ హెయిర్ మీద ఈ ఇక్కత్ చీర భలే ఉంది" అని తెలిసినావిడ షేక్ హ్యాండ్ ఇస్తూ మెచ్చుకుంది. ఆవిడ మాటలకి అప్పటివరకు పడ్డ టెన్షన్ కాస్త తగ్గింది.
లోపలికి వెళ్ళగానే ఒక ఫారిన్ డెలిగేట్ ఎదురొచ్చి తన కంపెనీ బ్రోచర్ ఇచ్చింది. "ఓహ్! ఐ లైక్ యువర్ స్టైల్. ది సారీ అండ్ ది సిల్వర్ జ్యువలరీ, జస్ట్ బ్యూటిఫుల్" అని చీర కొంగు చేతిలోకి తీసుకుని బట్టని సవరతీసింది. మనసు ఇంకా తేలిక పడినట్టు అయ్యింది.
ఒకావిడ ప్రోగ్రాం గురించి చెప్తూ, "ఇక పరిచయాలకు వస్తే, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ, ఇవ్వాళ మీరు వేసుకున్న డ్రెస్ గురించి లేక తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ గురించి, ఇక వేరే ఏదైనా సరే ఏమైనా స్పెషల్ ఉంటే మాట్లాడండి" అని చెప్పి ముందు వరుసలో కూర్చున్నావిడకి మైక్ అందించింది.
పరిచయాల పేరుతో వాతావరణం ఫ్రెండ్లీ గా అయేటట్టు, ఒకరినొకరు బాగా తెలుసుకోవచ్చని ఆవిడ ఉద్దేశం. ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ పక్కన పెట్టిన బ్యాగ్‍ని చూసాను. టీవీ యాడ్‍లో కరీనా కపూర్ ఆ బ్యాగ్ పట్టుకుని భలే స్టైల్‍గా నడిచిందని అమ్మ నాలుగు తిట్టినా, మూడు వేలు పోసి ఇనార్బిట్ మాల్‍లో కొన్నట్టు గుర్తు. అందులో ఏమీ స్పెషల్ కనిపించలేదు. ఇక చీర. ఇది అమ్మ చీర, అది కాక ఇందులో స్పెషల్ ఏముంది? తన కోసం, మేనత్తల కోసం ఇలాంటి చీరలు కొనడానికి వీకెండ్ పాడు చేసి మరీ పోచంపల్లి తీసుకెళ్లింది ఆ రోజు. ఆ చీరని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలీని అనుభూతి కలిగింది. ఎందుకో ఇక్కత్ ప్రక్రియ గురించి జీవితంతో పోల్చి ఆ పెద్దాయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి.
అంతే, ఆయన పూనుకున్నట్టు అనిపించింది. మైక్ నా చేతికి రాగానే..
"ఐ యామ్ వేరింగ్ ఇక్కత్ ఫ్రొం భూదాన్ పోచంపల్లి. ఇట్ ఈజ్ సిల్క్ సిటీ అఫ్ ఇండియా. ఎప్పుడో 1953లో మొదలయ్యింది ఈ కళ.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతన్నలు నిలువు - పేకల కలబోత ఈ ఇక్కత్. 2005లో పోచంపల్లి చీరకు భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంటలెక్చుయల్ రైట్స్ ప్రొటెక్షన్ లభించింది. ఈ రోజు నేను కట్టుకుంది కూడా అక్కడ చీరే. నేను ఈ ట్రెడిషనల్ చీరని మోడరన్ క్రొషే టాప్‍తో మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను, టు గివ్ ఇట్ ఎ ట్రెండీ లుక్" అని ఆ పెద్దాయన నుండి మాట అందుకుని చెప్పినట్టు, గడ గడ మైక్‍లో చెప్పేసాను. జోరున చప్పట్లు వర్షం కురిసింది. ఆ రోజు ఆ పెద్దాయన అమ్మకి ఈ కళ గురించి చెప్తూ, మధ్య మధ్యలో నన్ను చూస్తూ ఉన్నాడు. నీకు కూడా చెప్తున్నా విను, అనే అర్థం కనపడింది ఆ చూపులో. ఇది తెలీకపోతే ఇవ్వాళ ఏం చెప్పేదాన్ని?
ఇక సంతోషం పట్టలేక మీటింగ్ అయ్యాక బయటకి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికని ఫోన్ చేశాను.
అటు వైపు నుండి, "హలో.. ఎవరు? బాపు లేరు మేడం. కోవిడ్ వచ్చి పోయిండు మేడం" అని ఆ అబ్బాయి గొంతు పూడుకుపోయింది.
"ఇప్పుడు మీ కుటుంబానికి ఎట్ల?" అని అడిగాను.
"నెయ్యి బువ్వ మేడం"
"నెయ్యి బువ్వ అంటే?"
"నేస్తేనే బువ్వ మేడం… మా బాపు నేర్పిందే"
“ దీన్ని టీ అంటారా ? ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది.
పైకి గట్టిగానే అంటున్నట్లున్నా ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి, కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ గొంతులో ఏదో మొహమాటం, బెరుకు.
నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని బెరుగ్గా “ స్టీల్ గ్లాస్ లోనే టీ ఇవ్వు రెడ్డీ , వేడిగా వుంటుంది అని ఎన్నోసార్లు చెప్పింటా. అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ .. ” అంటున్నాడు నంగి నంగిగా.
గల్లాపెట్టె వద్ద నింపాదిగా కుర్చుని విసనకర్రతో విసురుకుంటున్న హోటలు ఓనరమ్మ వక్కాకు కసాబిసా నములుతూ కొరకొరా చూసింది మొగిలప్ప వైపు. ఆపక్క ఆ కుర్రాడేమో అస్సలు మొగిలప్ప మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. వినడం వరకూ అయితే విన్నాడు కానీ అసలేమీ , విననట్లు, మొగిలప్ప మాటలకు ఎలాంటి స్పందనా లేనట్లు మా చేతుల్లోకి పేపర్ కప్పులు పెట్టేసి తలతిప్పుకుని , ఏదో పాట పాడుకుంటూ , బాయిలర్ లో బొగ్గులు కలబెట్టుకుంటూ ఉండిపోయాడు.
మొగిలప్ప అనింది నిజమే.ఆ టీ టీ లాగా లేదు. టీ వేడిగా లేదు, అట్లాగని చల్లగానూ లేదు, ఎటొచ్చీ నాకు కావలసినంత వేడిగా మాత్రం లేదు.ఆ టీ లో రుచీ లేదు,ఏమీ లేదు. మొగిలప్ప ఏదో అనబోయి, బస్తాoడులోకి వెడుతున్న బస్ డ్రైవర్ వేసిన హారన్ సౌండుకి ఆగిపోయాడు.
బస్తాoడు పక్కనే టీ హోటల్. ఎంత మాత్రం రద్దీగా లేదు.
ఎండా ధాటికి జనం ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయినట్లున్నారు. రోడ్డు పైన రద్దీ అంతగా లేదు. బస్టాండు కూడా దాదాపు నిర్మానుష్యంగానే వుంది.దుఖానాలు అన్నీ నీరసంగా కనిపిస్తున్నాయి.బస్సులు కూడా అయిష్టంగా బద్దకంగా కదులుతున్నాయి.
అయినా ఎండను ఎంత మాత్రం లేక్కచేసే అలవాటు లేని వాళ్ళు, లేదా ఎండలకు బాగా అలవాటు పడినవాళ్ళు మాత్రం ఎండను పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు హడావిడిగా వున్నారు. రెండు చక్రాల లాగుడుబండి లాగే ఇబ్రహీం ముసలితనాన్ని లెక్క చెయ్యకుండా నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ సరుకుల బండిని లాక్కుపోతున్నాడు. బజారు వీధి సందుల్లోకి ఆటోలు, లారీలు వెళ్ళలేవు.బస్టాండులో కానీ, లారీ పార్సిల్ ఆఫీసుల వద్దనుండి సరుకులు షాపుల్లోకి పోవల్లటే ఎడ్లబండి పురుషోత్తం అయినా లాగుడుబండి ఇబ్రహీం అయినా కదాల్సిందే. లేదంటే ఆ సరుకులు రోడ్డు దాటి, ఇరుకైన బజారు వీధుల్లోకి పోలేవు. హంగూ ఆర్భాటాలు కొత్తగా ఎన్ని వచ్చినా వూరు మొత్తం మారిపోయినా , వూరి నడిబొడ్లో ఇప్పటికీ మారంది మూడే. ఆ ఎడ్లబండీ, ఆ లాగుడుబండి, బస్టాండు ముఖద్వారం వద్ద ప్రశాంతంగా నిలుచుని ఒక చెయ్యి పైకి ఎత్తి నవ్వుతూ అభివాదం తెలిపే నెహ్రూ విగ్రహం.
టీ పూర్తయ్యే లోగా సెల్లు రింగ్ అయింది . ఈరోజుకు ఒకే నెంబర్ నుండి వచ్చిన పదహారో కాల్.
అవతల వైపు మా పిన్నమ్మ “ పూజ సామన్లు అన్నీ తీసుకున్నారు కదా చిన్నోడా ?”
ఆ ప్రశ్నకు జవాబు చెప్పేలోగా ఆమె కొనసాగించింది..” మొగిలప్ప నీతో బాటే వున్నాడు కదా. వాడికేమీ తెలియదు. నువ్వే బద్రంగా చూసుకోవల్ల. ఎలాగైనా సరే నా కొడుకు పొలీసు కావల్ల అంతే ..వాడికి అన్నీ భయాలే. నువ్వు చెప్పినావనే హైదరాబాదుకు కోచింగు కోసం పంపినా. మా పొలీసు మునిరత్నం అన్న కూడా ఈ రోజు మునిదేవరకు వస్తా వుండాడు కదా. వాడితో కూడా మాట్లాడిపించల్ల.నువ్వేం చెప్తావో నువ్వేం చెపుతావో, నేర్పుతావో నా కొడుకు మాత్రం పొలీసు కావలసిందే. అయినా మొగిలప్పకి నువ్వంటే బాగా గురి. నీ మాట బాగా వింటాడు చిన్నోడా . నువ్వేం చెప్తావో నువ్వేం చెపుతావో, నేర్పుతావో నా కొడుకు మాత్రం పొలీసు కావలసిందే. ”
ఆమె ఆగదు, మనమే ఎక్కడో చోట ఆమెను ఆపాలి. “ పిన్నమ్మా నేను మాట్లాడతాలే. నువ్వు బాధ పడొద్దు.” అని చెప్పి ఆమె సమాధానం కోసం ఆగకుండా సెల్ కట్ చేసేశాను.అంత సేపూ మొగిలప్ప నా వైపే చూస్తూ వున్నాడు.వాడి మొహం నిండా నవ్వు. వాడికి మొత్తం అర్థం అయిపోయింది.
మా పిన్నమ్మ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చెయ్యకపోయినా మాటలు బయటకే స్పష్టంగా వినిపిస్తాయి. ఆమె గొంతు అంతే. ఎదురుగా నిలబడి నేరుగా మాట్లాడినప్పుడు చూడాలి, చుట్టుపక్కల వీధి మొత్తo అందరికీ వినిపిస్తూ వుంటుంది. దీనికి పూర్తిగా వ్యతిరేఖం మా చిన్నాయన. గొంతు బాగా తగ్గించి మెల్లగా, నింపాదిగా మాట్లాడటం ఆయనకు ముందునుండీ వచ్చిన అలవాటు. కొత్తవాళ్ళు అయన మాట్లాడేది కనుక విన్నారంటే , ఆయనేదో చెప్పకూడని పరమ భయంకరమైన రహస్యం ఏమిటో చెపుతున్నట్లు పొరబడతారు.
“ చిన్నప్పుడు ఆటలోనే దొంగా పొలీసు అడుకోవల్ల. అంతే కానీ ఎరికిలోడు ఏంది.. పొలీసు కావడం ఏంది ?మనోల్లంటే ఆ డిపర్మెంటు లో మర్యాద యాడ వుంటుంది? ’’ మా చిన్నాయన ఎప్పుడూ మా పిన్నమ్మ ఆశలపై నీళ్ళు చల్లే మాటే అది. మా పిన్నమ్మకు ఆ మాటలు అస్సలు నచ్చదు. ఎట్లాగైనా వాళ్ళ కొడుకు మొగిలప్పను పోలీసు చెయ్యాలనేది మా పిన్నమ్మకు ఎన్నో ఏళ్ళ కోరిక.
” పోయి పోయి ఆ పోలీసు మునిరత్నం గురిoచి చెప్తా ఉండాది సూడు. ఏ కాలం లోనో ఆయప్ప ఉద్యోగం పోగొట్టుకున్యాడు.పొలీసు ఉద్యోగం మనకులానికి అచ్చిరాదురా అని మీ నాయన ఎంత చెప్పినా, ఆమాట మీ తమ్ముడు ఏనాడైనా వినింటే కదా. ఆయన మాటలు విని ఇంకేదైనా వేరే ఉద్యోగంలో చేరింటే ఈ పాటికి మంచి పొజిషన్లో వుండేవాడు కదా. సంపాదించే రాత రాసి వుంటే కదా . తలపైన రాత బాగాలేనోల్లే కడాకి తలలు చెడుపుకుంటారు. “ మా చిన్నాయన మాటలు ఇంకా పూర్తి కాకముందే, వక్కాకు తుపుక్కన ఉమిసి, మా పిన్నమ్మ అయన మాటలకు గబాలున అడ్డం వచ్చేస్తాది.
“ మా అన్నకి ఇప్పుడేం తక్కువా అని ?ఎట్లైనా మా అన్న డ్యూటీ లో వున్నింటే ఇప్పుడు ఇన్స్పెక్టరు ర్యాంకు కదా. వాని టైం బాగాలేక వాడు బంగారం లాంటి ఉద్యోగాన్ని వద్దనుకుని అట్లా వచ్చేసినాడు కానీ, వాడి మోహంలో వుండే కళ ఈ ఇలాకాలో కానీ, మనోల్లల్లో కానీ ఎవరికీ వుందో సెప్పబ్బా? ఆ దిష్టే తగిలి వుంటుంది. అందుకే కడాకి యెట్లా కాకుండా అయిపోయినాడు మా మునిరత్నం అన్న. ”
“ పొలీసు కావడం అంటే మాటలనుకున్నావా? మన ఇండ్లల్లో యాడ జరుగుతుంది. ఆ మునిరత్నం ఒక్కడే కదా పోలీసు, ఆయప్ప కూడా ఇప్పుడు ఉద్యోగంలో లేడు. ” ఇదీ మా చిన్నాయన గోవిందయ్య వాదన.
“ మా అన్న ఏమన్నా కాని పని చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడా?ఎంతో పద్దతిగానో కదా ఉద్యోగం చేసినాడు. ఒంటినిండా భయంతోనే కదా నడచుకున్యాడు. వాడ్ని గానా ఏమన్నా ఒక్కమాట అన్నావంటే బావుండదు. ఒక్క మాట అడ్డంగా మాట్లాడినా నేను వూర్కోను ముందే సెప్తా ఉండాను. ” మొహం తిప్పుకుంటూ కళ్ళు తిప్పుతూ, చేతులు చూపిస్తూ పెద్ద గొంతుతో మా పిన్నమ్మ అలివేలమ్మ అట్లా మా చిన్నాయనను చాలాసార్లు భయపెట్టడం నాకు బాగా గుర్తు వుంది.
అప్పటిదాకా ఎంత సేపు ఏమేం మాట్లాడినా, అట్లా మా పిన్నమ్మ కోపంతో విరుచుకు పడేసరికి మా చిన్నాయన మెత్తగా అయిపోయేవాడు. పైకి ఏమి మాట్లాడే వాడు కాదు కానీ, అక్కడినుండి బయటకు వచ్చి మెల్లగా గొనుక్కునే వాడు.ఇదంతా ఎప్పుడూ ఉండేదే ! అయితీ ఈరోజు ప్రత్యేకం ఏమిటి అంటే చాలా కాలంగా నేను వింటూ వుండిన ఆ పొలీసు మునిరత్నం అనే పెద్దమనిషిని ఈరోజు కలవబోవటమే.
హైదరాబాదు నుండి కోచింగ్ పూర్తి చేసుకుని నెలప్పుడు ఇంటికి వచ్చాడు మొగిలప్ప. బాగా చదువుతానని వాడికి నేనంటే చాలా ఇష్టం. గ్రూప్ వన్ ఇంటర్వ్యూ లో పోయినా పట్టు విడవకుండ గ్రూప్ టూ జాబ్ కు సెలెక్ట్ అయ్యానని నేనంటే మంచి గౌరవం కూడా.
“ అన్నా పరసువేది చదివినావా , సీక్రెట్ చదివినావా, జోనాధన్ లివింగ్ స్టన్ సీగల్ చదివినావా ? నువ్వు ఏం చదివినావో చెప్పు, నేనూ నీలాగే కాంపిటిషన్ పరిక్షలు పాస్ అయిపోయి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయి ఉద్యోగం సంపాదిoచల్ల. మా నాయనను, అమ్మను అడవిలోకి పోనీకుండా , కంపా గోడూ తెచ్చే పనిలేకుండా, పందుల్ని మేపే పని చెయ్యనీకుండా బాగా చుసుకోవల్ల అన్నా. ఎట్లాగైనా గవర్నమెంటు జాబ్ కొట్టాల్ల అన్నా. నువ్వు చెప్పు యెట్లా చదవాలో,నీ టెక్నిక్ ఏందో చెప్పన్నా.” ఇట్లాగే మాట్లాడతాడు ఎప్పుడూ మొగిలప్ప. నేను నవ్వేసే వాడిని.
“ పుస్తకాలు చదివితేనే పరిక్షలు పాస్ అయ్యేట్లుంటే , కొన్ని లక్షల మందికి ఈ పాటికి పెద్ద పెద్ద ఉద్యోగాలే వచ్చి వొడిలో వాలిపోయి ఉండల్ల.కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు. అధ్యయనం ముఖ్యం, సూక్ష్మ పరిశీలన ముఖ్యం, పుస్తకం మనలో ఇంకి పోవల్ల.నేను పక్కాగా నా నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకుంటా.ఇంతకు ముందు నాలాగా పరిక్షలు రాసి పాస్ అయిన వాళ్ళని కలసి వాళ్ళ అనుభవాలు తెలుసుకునే వాడ్ని.మనం ఎవ్వరిలా కావాలని అనుకుంటామో, అలాంటి వాళ్ళని కలసి వాళ్ళు యెట్లా ఈ ఉద్యోగాన్ని ఇష్టపడేవాల్లో, వాళ్ళు యెట్లా సక్సెస్ అయ్యారో తెలుసుకునే వాడ్ని. వాళ్ళ అనుభవాలతో మనకు ఎన్నో మెళకువలు నేర్పుతారు.” అని నేను చెప్పిన మాటల్ని అతడు బాగా గుర్తుపెట్టుకున్నాడు.
చుట్టుపక్కల ఇండ్లల్లోంచి యస్టీ కాలని పిల్లల్ని కొందర్ని గుంపుగా చేర్చి సాయంత్రాలు గుడిసె ముందు నిలబెట్టి పందుల షెడ్ వైపు చెయ్యి చూపిస్తా మొగిలప్ప క్లాస్ చెపుతుంటాడు. మొదట్లో ఒక్క మాట అంటాడు ” ఈ జీవితం మారల్ల, బ్రతుకులు బాగు పడల్ల అంటే చదువొక్కటే మార్గం. “ అప్పుడప్పుడూ నేను కొంచెం దూరంగా నిలబడి అతడి మాటల్ని ఆసక్తిగా వింటూ వుంటాను.
“నిద్రపోతే వచ్చేది కాదు కల అంటే .మీకు నిద్ర లేకుండా రాకుండా చేసేదే మీ అసలైన కల. మీ కలల్ని ముందుగా మీరు చూడగలగాలి .నిద్రలేవగానే రోజూ అద్దం లో మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఎప్పుడైతే మీ మొహం బదులు మీ లక్ష్యం, మీ భవిష్యత్తు మీకు కనపడతాయో.. ఆప్పుడు మీరు మీ లక్ష్యానికి చేరువలో వున్నారని అర్థం. మీకు కార్ కావాలి అంటే మీరు దాన్ని ముందుగానే ఊహించాలి. ఏరకం కారుఏ మోడల్ కొనాలో స్పష్టత వుండాలి. అదే మాదిరి మీరు ఏ ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళను కలవాలి. ఆ ఉద్యోగం గురించి ముందుగా తెలుసుకోవాలి. మీ వాళ్ళల్లో అంటే మీ బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ మీరు కోరుకునే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడండి, నేరుగా వాళ్ళను కలవండి. ఉత్తుత్తి బంధుత్వాలు, పరిచయాలు, స్నేహితాలు వేరు. వాళ్ళ వృత్తిలో వాళ్ళ అనుభవాలు మీకు స్ఫూర్తి కలిగిస్తాయి.మీ కలలు త్వరగా సులభంగా నెరవేరుతాయి.” హైదరాబాద్ లో పోటీ పరిక్షల శిక్షణా కేంద్రం లో ఎప్పుడూ వినే మాటలే అతడిలో బలంగా జీర్ణించుకుని పోయాయి. మొత్తానికి అతడి కల పొలీసు కావడం.
అందుకే ఎప్పుడూ పొలీసు మునిరత్నం పేరు కలవరించేవాడు. మన బంధువుల్లో ఒక్క పోలీసు ఉన్నాడు కదన్నా. ఎట్లాగైనా ఆయన్ని కలవాల్సిందే అనేవాడు. ఇప్పుడు అతడికి ఉద్యోగం లేదంట కదా . వేరే వాళ్ళను కలుద్దాం లే అని నేను చెప్పినా, “ అది కాదన్నా, మనోడైతే మనకు అన్నీ చెప్తాడు కదా అని అనేవాడు.
“ ఏం లేదన్నా. ఆయన ఎందుకు ఉద్యోగం మానేసాడో అదికూడా తెలుసుకోవల్ల కదా..ఎంతో కష్టపడితే వచ్చిన ఉద్యోగాన్నే వదులుకున్నాడు అంటే ఏందో బలమైన కారణమే వుంటుంది కదా. అది తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఎవర్ని అడిగినా ఏదేదో చెప్తావుండారు, గానీ ఆయన్నే నేరుగా అడిగేస్తే అసలు కథ ఏందో ఆయనే చెప్పేస్తాడు కదా “ అనేవాడు. ఆ పోలీసు మునిరత్నం గురించి అస్సలు ఏం జరిగిందో ఎవరికి తెలీదు. పొలీసు కావాలని అనుకునే వాడ్ని కదా..అయన పోలీసు ఉద్యోగం ఎందుకు వద్దనుకున్నాడో, ఎందుకు వదులుకున్నాడో.. తెలుసుకోవాలని మొగిలప్పకే కాదు నాకూ వుంది. అయితే ఇన్నేళ్ళకు ఈరోజే ఆ అవకాశం వచ్చింది. బజారుకు వెళ్లి ఇంట్లోవాళ్ళు చెప్పిన పూజ సామాన్లు , పూలు, పండ్లు తెస్తూ మధ్యలో బస్టాండు వద్ద ఆగి, టీ తాగుతూ మరోసారి ఇవే విషయాలు మాట్లాడుకున్నాం.
అక్కడే వార్తలు అక్కడక్కడా చదువుతా, కొన్ని వార్తలు వదిలేసి , దినపత్రికలని అక్కడే పడేసి, టీ తాగడం అయ్యాక అక్కడినుండి కదిలాం.
అప్పటికి సమయం సరిగ్గా పన్నెండు గంటలు.
ముందు మా ఇల్లు చేరి అమ్మ అడిగిన వస్తువుల్ని అమ్మకు అప్పకు అప్పగించాక మా చిన్నాయన వాళ్ళ ఇంటివైపు నడిచాం. యస్టీ కాలనీలో దుర్గమ్మ గుడి ముందు కోలాహలంగా వుంది. గుడికి దగ్గరే మా చిన్నాయన వాళ్ళ ఇల్లు. లౌడ్ స్పీకర్ లోంచి అమ్మ వారి శ్లోకాలు, పాటలు పెద్ద సౌండ్ తో వినిపిస్తున్నాయి. పిన్నమ్మ మేం తెచ్చిన పూజ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటా వుంటే, మా చిన్నాయన మెల్లగా నోరు విప్పినాడు.
“ సూస్తావుండు. ఈ దినం సూడు.. మొత్తం జాతర మాదిరి జనం ఉడ్డ చేరిపోతారు. యాడేడ వుండే వాళ్ళో దూరాభారం అని సూడకుండా వచ్చేస్తారు సూడు.నువ్వు ఎప్పుడూ అడగాతా ఉంటావే, పొలీసు మునిరత్నం ఎవురు ఎవురు అని, ఈ దినం సూపిస్తాలే. మొగిలప్ప డౌట్లు అన్నీ తీరిపోతాయి ఈ దినం ” అన్నాడు మా చిన్నాయన నవ్వుతా తన సహజ ధోరణిలో. ఈ సారి ఎందుకో ఆయన మాటలు ఎంత చిన్నగా మాట్లాడినా, అంత సౌండ్ లోనూ నాకు స్పష్టoగానే వినిపించాయి. అదే ఆశ్చర్యం.
ఆ మాట అనగానే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.ఎన్నాళ్ళ నుండో అడుగుతున్నాను, కానీ నాకు ఆ మునిరత్నం అనే అయనను కలుద్దామంటే ఇప్పటిదాకా కుదరటమే లేదు.ఎప్పుడైనా పండగలు దేవరలు, చావులు, పుట్టిన రోజులు, పెళ్ళిళ్ళు ఇలా అనేక సందర్భాల్లో బంధువులు అనే వాళ్ళు కలవడం మామూలే కానీ , అయన మా వూరు వచ్చినప్పుడు నేను హాస్టల్లో , లేదా నేను వచ్చిన సందర్భాల్లో అయన రాకుండా పోవడమో, నా చదువులు , పరిక్షలు, డిగ్రీ అయ్యాక గ్రూప్స్ కి కోచిoగ్ కోసం నేను హైదరాబాద్ లో మూడేళ్ళకు పైగా ఉండిపోవడంతో నాకు ఆయన్ను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చిన్నప్పుడు, మధ్య మధ్యలో కొన్ని సార్లు ఆయన్ను చూసాను కానీ, అంతగా నేను పట్టించుకుంది లేదు.
నాకంటే ఎక్కువ ఉత్సాహం , కుతూహలం మొగిలప్పలో కనిపిస్తున్నాయి.
“పోలీసు మునిరత్నం అన్న పేరు ఒక్కటే కాదు నాయనా , ఇంకా ముందు ముందు పోలీసు మొగిలప్ప అనే పేరు కూడా మన ఎరికిలోల్లు చెప్పుకోవల్ల. ఈ ఇలకలో మనోల్లల్లో పోలీసు అనే వాడు లేదు అని ఎవ్వరూ అనుకునే పనే లేకుండా చేస్తాను , చూస్తా వుండు, మాటంటే మాటే. ” మొగిలప్ప గొంతులో అప్పటిదాకా లేని స్పష్టత నాకు ఆశ్చర్యం కలిగించలేదు.ఆ మార్పు నేను ఊహిస్తున్నదే. ప్రతి ఒక్కడికీ లోపల ఏదో సాధించాలి అనే తపన వుంటుంది,కొందరికి అది ఎప్పుడోసారి గబుక్కున వెలుగుతుంది. కొందరికి ఎవరో ఒకళ్ళు అగ్నిలాగా దాన్ని వెలిగించే సందర్భాలు కొన్ని వుంటాయి.
నింపాదిగా అతడి వైపు చూశాను. మంచి పొడగరి, ధీశాలి గా కనిపిస్తాడు మొగిలప్ప. కురచగా జుట్టు కత్తరించుకుని, పోలీసు క్రాప్ తో ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. అతడి కళ్ళల్లో వెలుతురు అతడు తప్పకుండా అనుకున్నది సాధిస్తాడు అనే నమ్మకాన్ని నమ్మకంగా చెపుతోంది.
మునిదేవర పండగ ఇంకా మొదలు కాక ముందే పొలీసు మునిరత్నం నేరుగా గుడి ముందుకు వచ్చేసాడు. మనోళ్ళు అందురూ ఉడ్డ చేరినప్పుడైనా, వినిపించాల్సింది దేవుడి పాటలు కాదుకదా అని క్యాసెట్టు మార్పించేసినాడు. ఆయనకి అడ్డు చెప్పే వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. కులనిర్మూలన పాటలు, అంబేద్కర్ పాటలు యస్టీ కాలనీలో ..ఒళ్ళు జలదరించింది నాకైతే.. ! కొన్ని క్యాసెట్లు గుడికి తెచ్చినానని చెపుతూ గుడి పనులు చూసే ప్రకాష్ కి అందించాడు.మనిషిలో వయసు తెలియడం లేదు, చురుగ్గా ఉత్సాహంగా వున్నాడు. అదే అతడి ప్రత్యేకతేమో అనిపించింది నాకు .
కుశల ప్రశ్నలు అయ్యాక మా చిన్నాయన వాల్ల ఇంట్లో అందరం మాటలకు దిగేసినాం.ఉండ బట్టలేక మొగిలప్ప అడగనే అడిగేసినాడు . పోలీసు ఉద్యోగం గురించి, డ్యూటీ గురించి, సాధక బాధకాల గురించి చెప్పుకొచ్చాడు ఆయన.
“ ఏ తప్పు చెయ్యని, మనోల్లని తప్పుడు కేసు లేకుండా పోరాడి వాళ్లకి న్యాయం అయితే చేసినా కానీ నాపైన పెద్ద కులపోల్లకి, పై ఆఫిసర్లకి మంట మొదులైపోయింది. ఏందేందో డ్యూటీ లు వేసి, ఎక్కడెక్కడో తిప్పతా వున్యారులే. మనకి ఇది సెట్టు కాదని తేల్చుకున్యాక, మనకులపోల్లకే న్యాయం చెయ్యలేమని తెలుసుకున్యాక గట్టిగా ఎదురు తిరిగినాలే.” అని క్షణం ఆగి కొనసాగించాడు.
“మన ఎరుకల కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకుంటానా? ఎరుకలోడు అయితే దొంగే అంటావా? ఎవడ్రా దొంగా.. దొంగ నాకొడకా అని యస్ ఐ చొక్కా పట్టుకునేస్తి. ఉద్యోగం అయితే పొయ్యింది కానీ నా పేరులోంచి పోలీస్ అనే మాటను పికేదానికి ఎవడి తరం కాలే. ఇదంతా చెప్పేది నిన్ను భయ పెట్టాలని కాదు. అన్నిటికి సిద్దపడి ఉద్యోగం లో చేరల్ల అని హెచ్చరించేడానికి మాత్రమే . మన కులం గురించి చెప్పకుండా ఉండలేం. కులాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎవరి కులం వాళ్లకు గొప్ప. ఎప్పుడో ఎవరో ఏ కాలం లోనో దొంగతనాలు చేసినారని మొత్తం మన జాతినే దొంగలంటే యెట్లా ఒప్పుకుంటాం ?ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం. ఉద్యోగం వల్ల వచ్చేదే గౌరవం కాదు. తలపైన టోపీ పోయినా పర్వాలేదు కానీ తల దించుకునే ఖర్మ నాకు వద్దు అనుకున్నాను. పోయిన ఉద్యోగం గురించి నాకు ఎప్పుడూ బాధ లేదు.నేల తల్లిని నమ్మినాను. మట్టికి కులం లేదు, మలినం తెలీదు . నా బ్రతుకేందో నేనే సొంతంగా బ్రతకతా ఉండాను. రోజoతా సెల్యూట్ కొట్టేది మానేసి ఇప్పుడు నేలతల్లికి దండం పెట్టుకుండా ఉండాను..”
అయన మాట తీరు స్పష్టంగా వుంది. ప్రశాంతంగా చూస్తూ మెల్లగా మాట్లాడుతున్నాడు.ఎక్కడా తడబాటు లేదు, మొహమాటం కానీ , జరిగిపోయినదాని గురించి బాధ కానీ అతడి మోహంలో కానీ, మాటల్లో కానీ, గొంతులో కానీ కనిపించడం లేదు.
మునిదేవర పూర్తి అయ్యింది, మధ్యాహ్నం ఆకలి వేళ. వడ్డనకి ఎవ్వరూ ముందుకు రావడం లేదు, మొహమాట పడుతున్నట్లు వున్నారు.మునిదేవర చేసిన ఇంటి వాళ్ళు కొందరు అటూ ఇటూ తారాడుతున్నారు.
ఎండ భీకరంగా వుంది.అందరికీ ఆకలి వేస్తా వుంది. ఇంకా భోజనాలకు పిలుపు రాలేదు. ఏ నిముషంలో అయినా పిలువు రావచ్చు అనే ఆశతో జనం భోజనాల బల్లల వద్ద షామియానా కింద ఆకలి మొహాలతో ఆశగా ఎదురు చూపులు చూస్తూ వున్నారు.
పోలీస్ మునిరత్నం మొహమాటం లేకుండా భోజనాల బల్ల వద్దకు నడిచాడు, మమ్మల్ని కూడా రమ్మన్నట్టు సైగ చేయడం తో మేం కూడా మొహమాట పడుతూనే అతడితో బాటూ ముందుకు నడిచాo.
“ ఈ బెరుకూ మొహమాటాలే కద చిన్నోడా .. కొంపలు ముంచేది.నువ్వు ఏమైనా చెప్పు.. మనోళ్ళకు ఎక్కడికి పోయినా మొహమాటాలు బెరుకూ ఎక్కువే. ధైర్యం తక్కువ. టకా అని ముందుకు దూసుకు పోలేరు. కొంచెం ఎదిగినోల్లని చూస్తే మనోళ్ళే అయినా సరే, మనోళ్ళు ముందుకు పోలేరు. మనోల్లే మనోళ్ళతో కలవలేరు. కొంత మంది కొంచెం పైకి వచ్చినాక ఎరికిలోల్లు అనికూడా చెప్పుకోరు. థూ..కులం పేరు కూడా మార్చి చెప్పుకుంటారు బడాయికి .అట్లాంటి వాళ్ళని కులo లోంచే వెలివేయల్ల చిన్నోడా. రా.... రా... తిoడికాడ మొహమాటం వుండకూడదు ” ఆ మాటలు వింటూ అప్పటిదాకా అతడు భోజనాల కోసం వెడుతున్నాడని అనుకున్నాం కానీ, అతడు నేరుగా వడ్డనలోకి దిగిపోయాడు. మమ్మల్ని చూసి ఇంకో నలుగురు కుర్రాళ్ళు ముందుకు వచ్చారు.
“ చూడండి ముసలివాళ్ళు, చిన్న పిల్లోల్లు, ఆడోల్లు పని చేసి చేసీ బాగా ఆకలిపైన వుండారు. ఎండకు గాలికి ఇంకా ఆకలి పెరకతా వుంటుంది కడుపులో. ముందు వాళ్ళని కూర్చో మని చెప్పండి. ” అంటూనే చురుగ్గా అతడు కదిలాడు. నిముషాల్లో అక్కడ అంతా సద్దుమనిగింది. కుర్చీలు కొన్ని దూరంగా వేయించడం, చేతులు కడుక్కోవడానికి దూరంగా బకెట్ నిండా ఉప్పునీళ్ళు తెప్పించడం, తినేసిన ఆకులు, ప్లాస్టిక్ గ్లాసులు పడేయటానికి వెదురు గంపలు పెట్టించడం అంతా చకచకా జరిగిపోయింది.గంటన్నరలో భోజనాలు ముగిసాయి. ఆఖరి బంతిలో మేం కూర్చునే సరికి మాకు వడ్డించడానికి చాలామంది పోటీ పడ్డారు.
అప్పుడు అక్కడ ఎలాంటి మొహమాటాలు లేవు.వాళ్ళు ఎవరో, మాకు వరసకి ఏమవుతారో కూడా నిజానికి మాకు తెలియదు. సందడిగా మనుషులు కొందరు ముందుకు వచ్చారు అంతే.!. మనుషులు మనుషుల పట్ల యెట్లా ఎందుకు స్పందిస్తారో అప్పుడు అర్థం అయ్యింది నాకు.
అయన బయలుదేరుతున్నపుడు బస్టాండు వరకూ నేను, మొగిలప్ప తోడుగా వెళ్ళినప్పుడు, అయన మేం వద్దంటున్నా వినకుండా టీ హోటల్ కు తీసుకు వెళ్ళినాం. టీ హోటలు ఓనరమ్మ విసనకర్రతో మొహానికి అడ్డంగా విసురుకుంటూ ఉంది. మేం కాస్సేపు నిలబడి చూసాం కానీ, టీ వేసే కుర్రాడు భోజనానికి వెళ్లి ఇంకా వచ్చినట్లు లేదు. చెక్క బెంచి పైన కూర్చుని, అప్పటిదాకా అతడ్ని అడగలనుకుని, అడగలేక పోయిన ప్రశ్నని బయటకు తీసాం.
“ మీరు ఎందుకు పోలీసు ఉద్యోగం వదులుకున్నారు మామా ? ”
ఆయన మా నుండి ఈ ప్రశ్న వస్తుందని ముందుగానే ఊహించినట్లు ఉన్నాడు. మా వైపు చూస్తూ చిన్నగా నవ్వినాడు. హోటల్ ఆమె వైపు, రోడ్డు వైపు, బస్టాండు లోకి పోతున్న ఆటో వైపు , రోడ్డుకు అటు వైపుగా నిలుచుని అదే పనిగా తోక ఊపుతున్న కుక్కని చూసాడు.మళ్ళీ మా వైపు తల తిప్పి చూస్తా అదే మాదిరి మెల్లగా పైకి కనపడీ, కనపడకుండా నవ్వినాడు.
“ వానలో మోబ్బులో ఆరోజు రాత్రి కదా నాకు ప్రాణం పోయినంత బాధయ్యింది. స్టేషన్ లో డ్యూటీ లో వుండినప్పుడు మనిషి ఎట్లా వుండల్లో తెలుసా...?” అని క్షణం ఆగి మా వైపు తేరిపారా చూసాడు, చూసి అతడే ఎంత మాత్రం ఆలస్యం లేకుండా జవాబు చెప్పేసాడు.
” ఎట్లుండాలో తెలుసునా? మనిషి మనిషిగా మాత్రం వుండ కూడదు.మనిషి పోలీసులాగే ఉండల్ల. రాయిలాగా గట్టిగా నిలబడల్ల. కళ్ళ ముందర అన్యాయమే జరిగినా చూస్తూ నెమ్మదిగా గుడ్దోని మాదిరి ఉండల్ల, ఏడుపులు ఎంత మాత్రం వినిపించనంతగా చెవులు మూసుకోవల్ల చిన్నోడా.. కొత్తగా ఉద్యోగంలో చేరినా కదా. అప్పుడు నాకు అదంతా తెలీదు. ఆ గొంతు ఎక్కడో తెలిసినట్లే అనిపించింది. ఆ మొహం సరిగ్గా కనపడలేదు కానీ ఎక్కడో బాగా చూసినట్లే అనిపించింది. మా హెడ్డు అప్పటికే నన్ను దూరంగా లాగతానే వున్యాడు కానీ నాకే అర్థం కాలేదు....” అని కాస్సేపు ఆగిన్నాడు.
బహుశా ఆయన కళ్ళల్లో కన్నీల్లు ఇమిరి పోయినట్లున్నాయి. మొహంలో మార్పు కనిపించింది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఈ లోగా చాయ్ వచ్చింది. “ఇంకొంచెం డికాషన్ వేసి ఆకు మార్చి స్ట్రాంగ్ గా ఇవ్వు బాబు” అని మాత్రం అన్నాడు.ఆ గొంతు లోని స్థిరత్వo , అజ్ఞాపిస్తున్నట్లు వచ్చిన ఆ మాటల తీవ్రతకి ఆ హోటలు కుర్రాడు మాత్రమే కాదు , మేం కూడా ఉలిక్కిపడ్డాం.కొన్ని క్షణాల్లోనే అయన తన దుఖపు జ్ఞాపకాల్లోంచి తేరుకోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది కానీ, అట్లా ఆయన తనను తాను అట్లా సర్దుకోవటానికి ఎన్ని ఏండ్లు ఎన్ని విధాలుగా తనను తానూ సర్దుకుని ఉంటాడో అని అనిపించింది.
ఏమనుకున్నాడో ఏమో, ఆ టీ హోటలు కుర్రాడు మా గ్లాసులు కూడా మౌనంగా వెనక్కి తీసేసుకున్నాడు. ఏమీ మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు.
పోలీసు మునిరత్నం ఇప్పుడు పోలీసు కాదు.అయినా పోలీసు క్రాప్ అట్లాగే మైంటైన్ చేస్తున్నాడు.ఆయన ఇప్పుడు పొలీసు ఉద్యోగంలో లేక పోవచ్చు. కానీ ఆ గొంతులో ఏదో వుంది. అది కేవలం అధికారానికి సంభందించింది కాదు.కొంచెం ప్రేమా, కొంచెం మార్దవం, కొంచెం అనునయం, ధైర్యం, తెగింపు,నిలదీసి ప్రశ్నించే నిక్కచ్చితనం, అన్నీ కలసిపోయిన గొంతు అది.ఒక్క మాటలో చెప్పాలంటే అతడి గొంతులో, మాటలో ఏదో క్లారిటీ వుంది.
ఈ సారి గ్లాసులు మారాయి.
ముందు మాకు ఇచ్చిన ప్లాస్టిక్ కప్పులో పేపర్ కప్పులో కావు.
వాటి బదులు స్టీలు గ్లాసులు వచ్చాయి.
టీ ముందులాగా నీళ్ళు నీళ్ళుగా లేదు. చిక్కగా వుంది. స్ట్రాంగ్ గా వుంది. టీ టీ లాగే వుంది.రంగు రుచి చిక్కదనం..పరిమళం అన్నీ ఉన్నాయి.
“ చాలసార్లు చెప్పినా విల్లు వినలే.ఇప్పుడు సూడు.. దీన్ని కదా టీ అంటారు.” అన్నాడు మొగిలప్ప కళ్ళ నిండా నవ్వుతూ టీ ని ఇష్టంగా, సంతోషంగా చప్పరిస్తూ...
“ అవునవును ఇది కదా టీ...” అన్నాను నేను కూడా నవ్వుతూ.
హోటల్ ఓనర్ వైపు చూశాం. ఆమె కళ్ళు కొంచెం పెద్దవి చేసి మమ్మల్నే చూస్తా వుంది. ఆమె కళ్ళల్లో విస్మయం,భయం, కంగారు.
“మార్పును చూసి తట్టుకోవడం ఎవరికైనా వెంటనే కష్టమే.!కొంచెం టైం పడుతుందిలే ..” అంటున్నాడు మా పోలీసు కాని పోలీసు మామయ్య మునిరత్నం.ఇంకో మాట కూడా అన్నాడు మొగిలప్ప భుజం పైన చెయ్యి వేసి..
“ముందు నువ్వు ఒకటే నేర్చుకోవల్ల పిల్లోడా . ఏదైనా సాధించాలి అనుకునే ఎరుకలవాడి జీవితంలో భయంవుండకూడదు...ముందు మనిషనే వాడు భయాన్ని నరికేయ్యాల్ల. నువ్వు ఏదైనా కల గంటే ముందు నువ్వు దేనికీ భయపడొద్దు . ధైర్యంగా వుండు. అదే అన్నిజబ్బులకి మందు “.
అప్పుడు చాలా కాలం తర్వాత మొదటిసారి నాకు ఇంకో టీ తాగాలనిపించింది. వాళ్ళిద్దరి వైపు చూసాను, వేడి వేడిగా అందరికంటే ముందు ఖాలీ అయిన నా టీ కప్పు వైపు చూస్తా నవ్వుతున్నారు ఇద్దరూ.
ఇబ్రహీం రోడ్డు దాటుతున్నాడు. ముసలితనాన్ని లెక్క చెయ్యకుండా అదే నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ,ఎండని, చలిని పట్టించుకోనట్లు,దేనితో సంభందమే లేనట్లు, దృష్టి మొత్తం వెడుతున్న దారి మీదే నిలిపి ఇబ్రహీం ఏకాగ్రతతో సరుకుల బండిని లాక్కుపోతున్నాడు
” బాబూ ఇంకో స్ట్రాంగ్ టీ.. వేడిగా చిక్కగా.. ”
ఉన్నట్టుండి తాను ఎవరూలేని ఒంటరివాణ్ణని గ్రహించటానికి వీలైంది. నిదానంగా లేచి మేడమీది గదిలో నుండి బయటికొచ్చి వరండాలో నిలబడి ఎదురుగా వ్యాపించి వున్న మామిడి చెట్టును చూశాడు. గుత్తులు గుత్తులుగా కాయలు నిండివున్నాయి. ఆరేడు ఉడుతలు... అవి తమకోసమే వున్నాయన్న హక్కుతో ఆ కొమ్మలలో ఇటు అటు పరుగెడుతున్నాయి. చాలారోజులుగా గమనించకుండా వున్న ఆ చెట్టు నిండుదనం అతనిని ఆశ్చర్యపరిచింది.
మేడమీది గదులలోనూ, కింది కార్యాలయంలోనూ తక్కువంటే ముప్పైమంది పని చేస్తున్నప్పటికీ, ఏ శబ్దమూ లేక వుడుతల శబ్దాన్ని ఇవ్వాళ మాత్రం ఒంటరిగా వినటానికి వీలైంది.
ఇలాంటి ఒక ఏకాంతం ఏర్పడి చాలా కాలమైంది. కీర్తిప్రతిష్ఠల్ని పట్టుకొని మింగే మొదటి అంశం ఈ ఏకాంతమే. అది తనకు చిన్నవయసులోనే లభించటం అదృష్టంగానూ, దురదృష్టంగానూ చెప్పుకోవచ్చు. ఈ మేడమీది గది నుండి దిగి వెళ్లి, కారు అద్దం గుండా మాత్రమే చూసే ఆ మూలనున్న టీకొట్లో నిలబడి ఒక టీ తాగటానికి తనవల్ల వీలవుతుందా?
గుంపు చేరిపోయి, ట్రాఫిక్ ఆగిపోయి, పోలీసులు రాకుండా అక్కణ్ణించి మళ్లీ రెండు నిమిషాల నడకలో అధిగమించి తన కార్యాలయానికి చేరుకోలేని కీర్తిప్రతిష్ట అది. గత పదీ ఇరవై ఏళ్లలో మరింకే తమిళ నటుడూ ఎంతగా పోటీ పడినప్పటికీ తానున్న స్థాయిలో సగం కూడా చేరుకోలేకపోయారు.
ఇప్పుడు ఒక చిరునవ్వు తననూ అధిగమించి పూయటం అంతరాత్మ ఆస్వాదించింది.
తన అలవాటైన దినచర్యల నుండి ఇవ్వాళైనా దూరం కావాలన్న మనిషి భావనను మౌనంగా అంగీకరించాడు.
తన సొంత గ్రామంలోని పెంకుటిల్లు, దాని వెనకున్న పెరడూ, దానికి మధ్యనున్న తులసికోట, తమ ఇంటి రాత్రి భోజనమూ అన్నీ గుర్తుకొచ్చాయి.
ఇప్పుడే గమనించాడు, ఆరేడు కావు పదీ ఇరవైకి పైగానే ఉడుతలు ఆ చెట్టు కొమ్మల్లో అంతా వ్యాపించి వుండటాన్ని. ఒకప్పుడు తమ ఇల్లూ ఇలాగే ఉన్నది. అది తమందరినీ బయటికి పంపించే కదా తాళం పెట్టుకుంది. తర్వాత ఒక ప్రదర్శన వస్తువైంది. ఈ చెట్టు పచ్చదనం కోల్పోయి చెట్టు ఎండిపోతే, ఈ ఉడుతలూ ఇక్కణ్ణిండి వెళ్లిపోతాయి. దూరమై ఎక్కడెక్కడికో వెళ్లి అతుక్కుపోతాయి. బంధాలూ స్నేహమూ వాటి ఎడబాటూ, కనుమరుగైపోవటం కూడా ఈ కీర్తిప్రతిష్ఠల ముందు ఏమీ లేనిదైపోతుంది.
కాసేపటి క్రితం మెరిసిన చిర్నవ్వు మాయమై ఇంకేదో మనసును తొలుస్తోంది. బర్మా టేకుతో చేసిన తమ ఇంటి డైనింగ్ టేబుల్ గుర్తుకొస్తోంది. ఒక దినాన్ని పూర్తిచెయ్యటం కోసం ఒక్కొక్క దినమూ జరిగే కోలాహలాన్ని స్వీకరించిన మంటపం అది.
ఎప్పుడూ అక్కే సంభాషణల్ని ప్రారంభించేది. మాటల దొంతర అగ్గిపుల్లల్లా ఎప్పుడూ ఆమె వద్దే వుండేవి. లోతుగా ఆలోచిస్తే అవి సంభాషణలు కావు. కథలు. కథలు కూడా కావు. ఒకే ఒకరి జీవితంలోనుండి తొలిచి వెలికి తీసిన చేదుమాత్రలు. ఎందుకీమె చేదును ఇంతగా ఆస్వాదిస్తుంది.
ఆ ఇంటి డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీల్లో అక్క మాససికమైన ఆర్.కె.వి కీ ఒక చోటుంది. చెప్పాలంటే అక్క తన ఆదర్శ రచయితకు వేసిన సింహాసనం చుట్టూ వాళ్లందరూ వున్నారు.
అక్కడ జరిగేదంతా వినోదంగా వుంటుంది. అన్నం, భోజనం బల్లమీదికి రావటానికి మునుపే అవ్వాళ అక్క కథ చెప్పటం కొన్నిసార్లు పూర్తయ్యేది. వడ్డించిన భోజనం నోటికి అందించటం మరిచిపోయి మాటలు విరిసేవి. భోజనం చివరలోనూ వివాదం ప్రారంభమయ్యేది. చిరు చిరు గొడవలు లేక రాత్రి నిద్ర వుంటుందా?
పగటిపూట ఆర్.కె.వి. కథలు చదవటమూ, సాయంత్రం దాకా వాటి గురించే చర్చించే అక్కకు రాత్రి భోజనం రణస్థలమే. తన మేథస్సు ఈ వివాదాల ద్వారా పదును తేలటం ఆమె గ్రహించి ఒక్కో రాత్రికోసమూ ఎదురుచూసేది.
నాన్న, అన్నా, ఎప్పుడూ ఆమె మాటలను వ్యతిరేకించేవాళ్లుగానూ, వదినా, అతనూ దాన్ని మౌనంగా భద్రపరుచుకునే వాళ్లుగానూ వున్నారు. వదినె మౌనం ఎవరివల్లా కొలవటానికి వీలుకాదు.
అప్పటివరకూ వున్న మొత్తం తర్కాన్నీ చెదరగొట్టేందుకు ఆమెకు ఒక వాక్యం కాదు, ఒక్క మాట చాలు. ఆమె ప్రదర్శించే ప్రశాంతత అందరినీ ఎప్పుడూ ఒక రకమైన అప్రమత్తతలోనే వుంచుతుంది.
అతనికి చదవటంపై ధ్యాస పెట్టలేని కాలం అది. వినటం, చూడటం, దృశ్యీకరించటం. ఇది వరుస మారి మారి వస్తూ వెళుతుండేవి.
అయితే, ఒక ముగింపుకు వచ్చేశాడు. ఈ ముఖం తెలియని ఆర్.కె.వి ఎప్పుడూ ఈ ఇంటి డైనింగ్‍హాల్లో కూర్చుని వివాదాల సంకెళ్లను తెంపేసేవాడు. అది స్వేచ్ఛగా పరుగులు తీసేవి. అవి కొలిక్కి రావటానికి ముందు రాత్రి తనలో అందరినీ పొదుపుకునేది. ఇది తీరని వ్యాధిలాగా వ్యాపించింది. చెన్నైకు వచ్చి, మొదటి ఆరేడు సినిమాలలోనే తారాస్థాయికి వెళ్లి, క్షణకాల ఏకాంతానికీ తపించిన ఒక వర్షాకాల రాత్రిపూట, సినిమా షూటింగ్ రద్దయ్యి ఇదేవిధంగా జీవించిన ఒక ఏకాంతంలోనే ఆర్.కె.వి యొక్క మొదటి కథను అతను చదివాడు. ఆ సంపుటిని పూర్తి చేయటానికి అతనికి యేడాది సరిపోలేదు. ఇప్పుడు వివాదాలను మొదలుపెట్టేందుకు అక్క అవసరం లేదతనికి. అతను మాత్రమే చాలు. నాన్న, అన్నా తననుండి ఎంత దూరంలో నిలబడ్డారో కొలవటానికి వీలైందీ అప్పుడే.
అక్క ప్రతిరోజూ ఆరోజుటికి తగ్గ అగ్గిపుల్లల్ని ఈ దాచిన దానిలో నుండే వెలిగించేటట్టుంది. వదినె తన మౌనంతో వాటిని మనసులోనే అంగీకరిస్తున్నట్టుంది.
ఈ నిదానంలో, ఉడుతల ఉత్సాహంలో, ఒక పండిన మామిడికాయ రాలిన శబ్దంలో అన్నీ అర్థమవుతున్నాయి.
జీవితం తనను మాత్రమే ఎందుకు ప్రారంభంలోనే తారాస్థాయికి తీసుకెళ్లి దింపి, మిగతా వాళ్లందరినీ వంగి చూసేలా చేసింది? పిచ్చిపట్టి చదివిన అక్కను ఏది దాన్ని విదిలించి పడేసేలా చేసింది? విని పెరిగిన నన్ను ఏది చదవటానికి ప్రేరేపించింది? అన్నీ ఎప్పుడూ మార్పుకు లోనయ్యేవే.
ఇప్పుడు శబ్దం చేస్తూ నవ్వటానికి వీలైంది.
నలభై ఏళ్లుగా చూడటానికి ఇష్టపడని ఆర్.కె.వి. ని ఇవ్వాళ చూడాలని ఇదిగో ఈ ఎవరూలేని ఈ తరుణం అతనిని ముందుకు నెడుతున్నది. ఆయనతో మాట్లాడటానికి, విమర్శించటానికి, గొడవపడ్డానికి, ఇప్పటివరకూ అడ్డుపడ్డ కాలం పరుగులు పగిలి చెదిరిపోతున్నాయి. ఆ జ్ఞాపకాల అంతంలో టి.నగర్‍లోని జగదీశ్వరన్ వీథిలో కాస్త లోపలగా వున్న ఆ ఇంటి ముందు అతని రేంజ్ రోవర్ కారు ఆగింది.
దారంతా అతని ఎన్నో హావభావాలతో వున్న పెద్ద పెద్ద బ్యానర్లు అతనిని ఇంకా పారవశ్యానికి లోను చేసింది.
కార్లో నుండి దిగి ఆ వీధిని చూశాడు. ప్రజలు తమ తమ దినచర్యలలో మునిగిపోయి వున్నారు. ఒక్కరూ తనను గమనించలేదని కదలగానే ఎక్కణ్ణించో నలుగురైదుగురు పరుగెత్తుకొచ్చి కరచాలనం చేశారు. ఎదురింటి నుండి ఒక స్త్రీ నలిగిన చుడీదార్‍తో ఒక ఆటోగ్రాఫ్ కోరుతూ నిలబడింది. అంతా ఒక్క క్షణమే. వెంటనే ఆ ఇంటికి పక్కనే వున్న మేడమెట్లపై నడుస్తున్నాడు. తన షూల శబ్దం ప్రత్యేకంగా వినిపించటం గ్రహించాడు. ఇది ‘తాను’ అన్న గొప్పతనానికి చిహ్నం. నన్ను ‘గమనించు, నన్ను గుమిగూడు’ అన్న ప్రాబల్యపు ఆహ్వానం. ఆగి తన షూలను విప్పేశాడు. ఒక్కక్షణం వాటిని అక్కణ్ణించి అలాగే విసిరేద్దామనిపించింది. అయితే వీలుకాలేదు.
మెట్ల పక్కగా వాటిని వేరుగా పెట్టాడు. తనవాటితో పోల్చటానికి వీలుకాని ఇరవైకి పైగా చెప్పులు అక్కడున్నాయి. వాటిని బట్టి లోపలున్న వాళ్లను అంచనా వెయ్యటానికి ప్రయత్నిస్తున్న తన అజ్ఞానానికి తనకే వాంతి వచ్చేలా అనిపించింది.
నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించాడు. అది మేడమీద కొబ్బరాకులతో కట్టిన ఒక కొట్టం. ఒక సౌకర్యవంతమైన కుర్చీలో ఆర్.కె.వి కూర్చొని వుండగా ఆయనకు ఎదురుగా కొందరు కూర్చొని కనిపించారు.
ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించాడు. ఈ వినయం తన జీవితంలోనే మొదటిసారి.
ఆయనలోని అలక్ష్యాన్ని గమనించాడు. లేదూ తనముందు ఇప్పటివరకూ కొనసాగిన వంగొని వుండే స్థితికి ఇది మొదటిసారి వ్యతిరేకం.
‘‘కూర్చోండి.’’ అని ఎదురుగా వున్న ఒక పాత కుర్చీని చూపించారు.
ఆయన ముందు వ్యాపించి వున్న మౌనంలో మాటలన్నీ కుమ్మరించి వున్నాయి. అందులో ఒక్కమాట కూడా అతనివల్ల ధైర్యంగా తాకటానికి వీలుకాలేకపోయింది. చాలాసేపటి తపన తర్వాత, ‘‘మీరెందుకు ఇప్పుడు ఏమీ రాయటం లేదు?’’ వరుసగా పేర్చిన మాటలు చెమర్చాయి.
‘‘రాసిందే ఎక్కువని ఇప్పుడనిపిస్తోంది.’’
సన్నని చిరునవ్వు ఒకటి పూచేలా చేశాడు.
‘‘నేను మీ కథలను విని పెరిగినవాణ్ణి.’’
ఆయన ఇప్పుడే అతణ్ణి ముఖాముఖి చూశారు. చూపులు చాలా దగ్గరగా వున్నాయి.
‘‘పెరిగాకే చదవటం మొదలుపెట్టాను.’’
‘‘ఎవరు పెరిగాక?’’
మౌనాన్ని ఇద్దరూ ఆశ్రయించారు.
‘‘మీరు మీ గాయత్రిని ఒక రోల్‍మోడల్‍గా చేసి సమాజం ముందు నిలబెడుతున్నారు. అది నాకు సమంజసమనిపించటం లేదు. కేవలం సంచలనాల కోసం కావాలనే సృష్టించారు. గాయత్రి మునుపటిలా లేదు.’’
అతను మాట్లాడుతూ వున్నాడు. ఆయన అతనిని అధిగమించి తన చూపులతో దూరంగా వున్న ఒకరి దగ్గర ఆగారు. అతనూ ఆగకుండా ఆయన ముందు గుమ్మరించసాగాడు. చాలు అని భావించగానే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ‘‘రాసిన వాటిని గురించి మాట్లాడటమన్నది, శవం వెంట్రుకలను దువ్వటం లాంటిది. అది నాకెప్పుడూ ఇష్టం వుండదు.’’
‘‘మీరు రాసిన వాటికి మీరు బాధ్యులు కారా?’’
‘‘అది అచ్చుకుపోయిన వెంటనే నేను దాన్నుండి నన్ను ఖండించుకుంటాను. తర్వాత అది నీలాంటి పాఠకుడి బాధ్యత.’’
‘‘అయితే సమాజానికి సాహిత్యంపట్ల భాగస్వామ్యమెంత?’’
‘‘వీటికంతా సమాధానం నా దగ్గర లేదు.’’
ఈ మాటలలో ఎన్నో ఏళ్ల విసుగుంది.
‘‘సరే, మీ కథలు ఒక సామాన్య మానవుణ్ణి ఏం చెయ్యగలుగుతుందని భావిస్తున్నారు?’’
‘‘ఒక్క బొచ్చూ చెయ్యదని అనుకుంటున్నాను.’’ అని, తన ఎడమచేతిపై పెరిగి వాలిన వెంట్రుకలను పక్కకు తోశాడు.
‘‘అయితే ఎందుకు సార్ రాస్తున్నారు?’’
‘‘ఎందుకో రాస్తున్నాను. నిన్ను ఎవరు చదవమన్నారు? అంతటితో ఆగకుండా రాసినవాణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఇలా రెచ్చగొట్టటం అనాగరికం.’’
అతను నిశ్చేష్ఠుడయ్యాడు. ఇంకా మిగిలి వున్న మాటలూ లోలోపలే అణిగారిపోయాయి.
గాజు గ్లాసులలో అందరికీ టీ వచ్చింది. ఆయన ఒకదాన్ని తీసుకొని అతనికీ ఇవ్వమని చెయ్యి చూపించారు.
టీ తీసుకొచ్చిన పిల్లవాడి వెనకే ఎంతో హుందాగానూ, గంభీరంగానూ వున్న ఇంకొక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు.
‘‘రండి బి.ఎస్!’’ అని ఎంతో ఆప్యాయంగా ఆయనను ఆహ్వానించి, తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇతనిని చూసి ఆయన ఒకింత కూడా ఆశ్చర్యపోయినట్టుగా అనిపించలేదు. అయితే అతను లేచి నిలబడ్డాడు.
‘‘ఈయన నా నలభైఏళ్ల మిత్రుడు. పేరు బి.ఎస్.’’
ఆ మిత్రుడు ఎంతో హుందాగా కరచాలనం చేశాడు.
‘‘మీరు మాట్లాడుతూ వుండండి.’’ అని దూరంగా వున్న ఇంకో కుర్చీ దగ్గరికెళ్లాడు. జరుగుతున్నదంతా ఇంతకుమునుపు అతను చూడనటువంటివి.
‘‘నాకు తమిళనాడంతా రెండువేలకు పైగానే సామాజిక సేవా సంస్థలున్నాయి.’’
‘‘అభిమాన సంఘాలా?’’ అలక్ష్యానికి చిహ్నంగా మాటలు వెలువడ్డాయి.
‘‘మరో దారి లేదు. నేనూ వాటిని అలాగే స్వీకరించాల్సి వచ్చింది. అయితే వాటిని నేను వృద్ధి చెయ్యటానికీ, ఇంకా పై స్థాయికి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తున్నాను.’’
‘‘చెయ్యండి.’’అలక్ష్యం కొనసాగింది.
‘‘వాళ్లు చదువుతారా, సమాజానికి ఏదైనా చెయ్యదగినవారేనా?’’
‘‘ఔను!’’
‘‘మంచిది.’’
‘‘అందుకు మీ సాయం కావాలి.’’
‘‘నేనేం చెయ్యగలనని మీరనుకుంటున్నారు.’’
‘‘ఏం లేదు, ఏం లేదు. మేం నడిపే ప్రాంతీయ మహానాడులో మీరొచ్చి మాట్లాడాలి!’’
‘‘సారీ. ఇలా అభిమాన సంఘాలకంతా వచ్చి మాట్లాడి నా సమయాన్ని వృథా చేసుకోవటం నాకిష్టం లేదు.’’
‘‘లేదు. మీరు అలా పక్కన పెట్టేయకండి. అభిమాన సంఘాలంటే అంత కేవలమైంది ఏం కాదు. అందులోనూ చదువుకున్న వాళ్లు, సృష్టికర్తలూ, డాక్టర్లు, శాస్త్రవేత్తలూ అందరూ వున్నారు.’’
‘‘వాళ్ల ముందు నేనేం మాట్లాడతాను. నేను ఎనిమిదో తరగతి కూడా దాటలేదు.’’
సంభాషణలోని తీవ్రతను గట్టిగా పట్టుకొని పైకెగబ్రాకాడు.
‘‘మీరిలా నిరాకరిస్తే నేనెలా సార్ వాళ్లను పై స్థాయికి తీసుకెళ్లేది. అలాగే అక్కడే వొదిలేస్తే...’’ అని కాస్త గొంతును పెంచాడు.
అతనే ఊహించని ఒక తరుణంలో, ‘‘వస్తాను, ఏ రోజుటికి?’’ అని అడిగారు.
‘‘మీరు ఎప్పుడు చెబితే ఆ రోజు.’’ అని పరవశించాడు.
‘‘డిసెంబర్ 11 భారతియార్ పుట్టినతేదీకి, ఏ చోట్లో?’’
‘‘నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను సార్. చాలా ధన్యవాదాలు.’’ అని చేతులు జోడించి లేచినవాణ్ణి మళ్లీ చెయ్యి చూపించి కూర్చోమని చెప్పారు.
ఇప్పుడు అందరి చుట్టూ తిరుగుతూ వున్న ఆ పైపు(గంజాయి పైపు) మూడవసారి అతని దగ్గరకొచ్చింది. గాఢంగా ఒకసారి లోపలికి పీల్చి ఇచ్చినదాన్ని ఆనందంగా తీసుకునేందుకు రెండు చేతులు చాచి ఎదురుచూస్తున్నాయి.
ఇతను సెలవుతీసుకున్నప్పుడు ఆ గదిలోని ఒకవ్యక్తి పాడటం మొదలుపెట్టాడు. దానికి బాక్‍గ్రౌండ్‍గా అక్కడ అలుముకున్న చిరు పొగమేఘాలు కమ్ముకుని కనిపించాయి.
‘ఉదయించటమూ లేదు అస్తమించటమూ లేదు ప్రకాశించే సూర్యుడు
పెరిగేది లేదు తరిగేది లేదు పరిహసించే చంద్రుడు
జీవితం ఒక రూపం, క్షణంలో ఎన్నో మార్పులు
చదివిందీ లేదు, పరీక్షలూ లేవు నా జాతకం
స్వశక్తి వుంది, ఇంకే బలమూ లేదు కవితా జీవితం’
మెట్లు దిగుతుంటే అతని పెదాలపై ‘కవితా జీవితం...’ అని గొణుగుతూ వున్నాడు.
() () ()
అదొక ప్రవైటు పాఠశాల యొక్క విశాలమైన మైదానం. వేదిక అలంకరణలో ప్రతీచోటా ప్రత్యేక శ్రద్ధా, దృష్టీ పెట్టటం జరిగింది. అతని పదిరోజుల సినిమా చిత్రీకరణ పూర్తిగా రద్దైయింది. కొన్ని కోట్లు పక్కకు మళ్లాయి. అన్నింటిలోనూ తుది నిర్ణయం అతనిదిగానే వున్నది, వేదికమీద మూడు కుర్చీలు మాత్రమే వుండాలనేంత వరకూ.
ఒకటి ఆయనకు, ఇంకొకటి తనకు, మూడవది సేవాసంస్థ ప్రాంతీయ అధ్యక్షునికి.
‘‘కారు పంపించనా సార్?’’
‘‘వద్దు. సరిగ్గా ఆరున్నరకు స్నేహితునితో కలిసి కార్లో వచ్చేస్తాను.’’
అలాగే ఆరు ముప్పైఐదు నిమిషాలకు ఆ కారు మైదానంలోకి నిదానంగా ప్రవేశించింది.
వేదిక పక్క నుండి పరుగుపెట్టి కారు ముందరి తలుపు తెరిచి ఆయనకు కరచాలనం చేసి, అక్కడే ఒక శాలువను కప్పి, గొప్ప కోలాహలం మధ్య ఆయనను గంభీరంగా వెంటబెట్టుకొని వచ్చాడు. వందలకొద్దీ కెమెరాలు పోటీలు పడి మెరిశాయి.
వేదికమీద నిలబడి నమస్కరించారు. పక్కన నిలబడి అతను అందరినీ కూర్చోమన్నట్టుగా చేత్తో సైగచేశాడు. కాస్త కూడా విరామం లేకుండా అధ్యక్షుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.
‘‘మన కథానాయకుడు ఎంత గొప్పవారో చూడండి. ఆయనే కీర్తిప్రతిష్ఠలు తారాస్థాయిలో వున్న ఒక నటుడు. అయితే తన ఆదర్శ రచయితను మనకోసం ఆహ్వానించి ఆయన ఒక సేవకుడిలా దీనికోసం శ్రమించి...’’ మాటలు తడబడసాగాయి. ఇదివరకే విన్న హితవచనాలకు బలం చేకూరి, మొత్తం గుంపు నిశ్శబ్దాన్ని పాటించింది.
ఈల శబ్దమైనా, అదెక్కణ్ణించి వచ్చిందో తెలిపేటంత నిశ్శబ్దం అది.
ఆర్.కె.వి. తన కాలిమీద కాలు వేసుకొని ఆ కుర్చీలో వెనక్కు ఆనుకొని కూర్చొని వున్నారు. పకనే ముఖంలో ఆనందమూ, పారవశ్యమూ కలగలిసిన అతనున్నాడు.
‘‘కాలును తియ్యరా.’’ అని ఒక ఆవేశపూరితమైన గొంతు గుంపులో నుండి వచ్చింది.
మాటలు తెగి పడ్డాయి. ఆదుర్దాగా లేచి అతను మైక్ ముందు నిలబడ్డాడు. ఆయన ఆ గొంతు వినవచ్చిన దిశగా చూస్తూ, తన చేతిని వుంచుకొని కాళ్లను దూరం పెట్టుకున్నారు. అన్నీ జరిగి పూర్తికావటానికి ఒకట్రెండు నిమిషాలు కూడా కాలేదు. ఎంతో ఆదుర్దాతో అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘‘ఏది జరగకూడదని నేను భావించానో అదే జరిగిపోయింది. అభిమాన సంఘాలంటే అది థర్డ్ రేట్ మనుషుల గుంపు అని ఆయన మొండిగా రావటానికి నిరాకరించారు. నేనే ఆయనను బలవంతం పెట్టి పిలుచుకొచ్చాను. మేమంతేరా అని మీరు నిరూపించేశారు.
అయ్యో, నేను విని, చదివి, పెరిగిన ఒక జెయింట్‍ను ఇలా అవమానించేశారు కదరా. ఇంకో ఐదు నిమిషాలలో అలా అరిచిన వ్యక్తి ఈ వేదిక మీదికి రావాలి. మీ అందరి ముందూ సార్ కాళ్లమీదపడి క్షమాపణ అడగాలి. అప్పుడే ఈ కార్యక్రమం కొనసాగుతుంది.’’ అని మాట్లాడుతుండగా వేదికమీద నుండి వచ్చిన చిన్న కదలికను విని వెనక్కు తిరిగాడు.
నలిగిన తెల్ల చొక్కాతో ఒక వ్యక్తిని నేలమీద కూర్చోపెట్టి వున్నారు. పెదవి చివరన సన్నని రక్త రేఖ కనిపించింది. కొట్టినట్టున్నారు. అతని చుట్టూ ఆరేడుమంది నిలబడి వున్నారు.
‘‘ముందు మీరందరూ కిందికి దిగండి.’’
‘‘ఆయనను అవమానించిన ఆ వ్యక్తి ఇప్పుడు ఈ సభలోనే ఉన్నాడు. ఇప్పుడు మనందరి ముందూ...’’
అతను మాట్లాడుతూ వుండగానే, కింద కూర్చొని వున్నవాడు దూకి ఆయన ముందు టీపాయ్‍మీదున్న హ్యాండ్‍మైక్‍ను తీసుకున్నాడు. అది జారి క్రిందపడింది. అనవసరంగా అతని చేతులూ మాటలూ వణికాయి.
‘‘ఆయన మా వాడు, ఆయన మా వాడు.’’
మత్తులో అతను గొంతెత్తి అరిచాడు. మొత్తం సభను లోబరుచుకునేంతగా అతని గొంతు ప్రతిధ్వనించింది. అతను టీపాయ్‍మీద తలను వాల్చి, వేదిక యొక్క నేలమీద దాదాపు ఒక వలయంలా మెలి తిరిగి విచిత్రంగా కూర్చొని వున్నాడు. తన రెండు సన్నని కాళ్లను పక్కకు పెట్టుకొని వున్నాడు.
అతను ఇంకా ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నంతలో వేదికమీద నిలబడ్డవాడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించి ఆయనకేసి తిరిగి చూశాడు. ఆయన ఎంతో స్వాభావికంగా కాలిమీద కాలు వేసుకొని మునుపటికన్నా గాంభీర్యంగా కూర్చొని వున్నారు.
() () ()
ఆ నిశిరాత్రి ప్రపంచమంతా నిద్రలో జోగుతున్నది. నిశాచర పక్షులు రెక్కలు తపతప లాడిస్తూ సంచరిస్తున్నాయి. కీచురాళ్ళు అదే పనిగా తమ రణగొణ సంగీతం వినిపిస్తున్నాయి
ఆరుబయట అనువైన ప్రదేశంలో వైరస్ బృందం సమావేశమయ్యాయి.
చాలాకాలం తర్వాత అనుకోకుండా కలిసిన బంధు -మిత్ర బృందం అలాయ్ బలాయ్ ఇచ్చుకొని ఒకరినొకరు అభిమానంగా నఖశిఖపర్యంతం పరీక్షగా చూసుకుంటున్నారు. అంతలో కోవిద్-19 కేసి చూస్తూ "ఏమోయ్ మస్తు జోష్ మీదున్నావే . దునియా అంతా దున్నేస్తున్నావ్ గద.. ఇందుగలడందు లేనట్లు ఎక్కడ చూసినా అలలు అలలుగా ఎగిసిపడుతున్న నీ సంతతే. మీ తలపులే " అన్నది ఎబోలా.
"మీరు నంగనాచిలా ఉంటారు కానీ .. ఒకటా రెండా... ఎన్నెన్ని సంక్షోభాలు మీ వల్ల.
ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, సాంస్కృతిక సంక్షోభం ఇలా ఎన్నెన్నో సంక్షోభాలు సృష్టించేశావ్..ఘటికురాలివే .. " దీర్ఘం తీసింది మార్స్
"లోకంలో ఎక్కడ చూసినా నీ పాదముద్రలే. నీ గురించిన ఆలోచనలే. గ్లోబంతా గిరగిరా తిరిగేస్తున్నావ్. అదీ..పైసా ఖర్చు లేకుండా' చిన్నగా నవ్వుతూ అన్నది ఇన్ఫ్లూయంజా
కూర్చున్న చోటు నుంచి కొద్దిగా కదులుతూ "చూడడానికి నాజూగ్గా, అందంగా ఉంటావ్. ఎక్కడేస్తే అక్కడ జంతువుల దగ్గర పడుండే సోంబేరువనుకునేవాళ్లం. ఇప్పుడేంటి ..?! నువ్వు నువ్వేనా.. నన్ను మించి పోయావ్ " ఎకసెక్కం గా నవ్వింది హెచ్ ఐ వి
"ఊ.. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, చదువులు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు అన్నీ చట్టుబండలైపోయే.. జనం దగ్గర పైసలు లేవు.
రోగం-రొష్టు, ముసలి-ముతక అందర్నీ తుడిచేస్తున్నావ్.. ఓ యబ్బో..
తమరి మహిమ అంతా ఇంతా కాదుగా .. "అందరి వైపు చూస్తూ అన్నది మార్స్.
మళ్ళీ తానే "ఆసుపత్రుల్లేవు. వైద్యం లేదు. చావుకి బతుక్కి మధ్య వేలాడుతున్న జనం.. ముఖ్యంగా వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, పేద వాళ్ళ త్యాగాలతో వారి సమాధుల వరుసల్లో రాళ్లు ఏరుకు తినే రాక్షసగణం తయారయ్యారు.
ఆ అయినా .. పోయేకాలమొస్తే మనమేం చేస్తాం.. " అన్నది మార్స్
నీ ధాటికి భయపడి సూర్యుడు వణుకుతూ సూర్య మండలంలోనే హోమ్ క్వారైటైన్ లో ఉండి పోయాడట కదా.. అనుకోగా ఆ నోటా ఈ నోటా అనుకోగా విన్నాలే.. నిజమేనా.." కళ్ళు పెద్దవి చేసి అడుగుతున్న ఎబోలా గొంతులో దాచుకుందామన్నా దాగని అసూయ కనిపించింది మిగతా వైరస్ లకు.
నిన్ను కట్టడి చేయడానికి ప్రపంచమంతా కంకణం కట్టుకున్నదట కదా .. ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేయడం అంత సులభమా " దీర్ఘం తీసింది హెచ్ ఐవి
"అవును మరి, బుసలు కొట్టి కాటువేసే సర్పాన్ని ఎవరు మాత్రం ప్రేమగా పెంచుకుంటారు చెప్పండి. కోరలు పీకి పడేస్తారు. పీక నులిమి పాతరేస్తారు గానీ .. " తన వెనుక పుట్టిన దాని కింత పేరుప్రఖ్యాతులు రావడం కంటగింపుగా ఉన్న మార్స్ దీర్ఘం తీసింది.
"ఎందుకర్రా.. దాన్నలా ఆడిపోసుకుంటారు..అది పడగవిప్పి బుసలు కొడుతూ వెంటాడితే లోకమిలా ఉంటుందా .. లాక్ డౌన్ ఎత్తేస్తుందా .. ప్రపంచమంతా ఇప్పటికీ లాక్ డౌన్ లోనే మగ్గిపోయేది కదా ..
జీవావరణం లో అన్ని జీవులతో పాటు, కణజాలం తో పాటు మనమూ ఉన్నాం.
అదంతా ఇప్పుడెందుగ్గానీ .. చాన్నాళ్ల తర్వాత కలిశాం . కాసేపు సరదాగా గడుపుదాం " అప్పటి వరకు అందరి మాటలు విన్న జికా అన్నది.
కొన్ని క్షణాలు జికా వైపు అభిమానంగా చూసి "బంధు మిత్రులంతా నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావడం లేదు" అయోమయంగా అన్నది కోవిద్19 .
ఆ వెంటనే "కాలం నన్ను కౌగలించుకుంది. తనతోపాటు తీసుకు పోతున్నది. ఎటు తీసుకుపోతే ఆటుపోతున్నా అంతే. నేను నిమిత్త మాత్రురాలిని ..
జనమే అనుకున్నా మీరు కూడా నన్ను కేంద్ర బిందువు చేసి ఆడిపోసుకుంటున్నారు" ఉక్రోషంగా మిత్ర బృందం కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నది కోవిద్-19.
మళ్ళీ తానే "ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టినట్లే నేను పుట్టాను. నాకు నేనుగా ఈ పుట్టుక కావాలని కోరుకుని పుట్టలేదుగా..
నా మనుగడ కి అనువైన ఆవాసాలు తెలియక ఎవరి కంట పడకుండా ఇన్నాళ్లు ఎక్కడెక్కడో అనామకంగా పడి ఉన్నానేమో..!
మానవ శరీరంలో నా పునరుత్పత్తికి అనువైన కేంద్రాలున్నాయని తెలిసుకున్నా.
ఈ సృష్టి ధర్మం ప్రకారం జీవమున్న ప్రతి కణం చేసే పని నేనూ చేసుకు పోతున్నా..
అంతే తప్ప స్వార్ధంతో, ఎవరిమీదో కక్షతో, కసితో కోపంతో కాదుగా.. " అదేమన్నా తప్పా అన్నట్లు అందరి వైపు చూస్తూ భుజాలెగరేసి చెప్పింది కరోనా అని పిలుచుకునే కోవిద్ 19.
"రెచ్చిపో బ్రో.. రెచ్చిపో.. ఇంత మంచి తరుణం మళ్ళీ మళ్ళీ వస్తుందా..!
ప్రపంచ రాజ్యాలకు ప్రజల ఆరోగ్యం ఎలాగూ ప్రాధాన్యం కాదు. వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళవి .
యుద్ధాలు .. ఆయుధాలు.. వర్తక వాణిజ్యాలు .. ఎవరి ప్రయోజనాలు వారివి.
హూ.. సామాన్య జనం, ఉంటే ఎంత .. పోతే ఎంత ... ఆఫ్ట్రాల్.. ఏం ఫరక్ పడదులే భాయ్.. విజృంభించడానికి మంచి సమయం ఎంచుకున్నావ్ "అన్నది మార్స్
"కోవిద్ 19 ఎంచుకున్నదనుకుంటున్నారా.. ఉహు లేదు లేదు..
నెత్తుటి కూడు తినే మానవ గణాలు కొన్ని ఉన్నాయి.. ఏమీ ఎరగని పత్తిత్తుల్లా కనిపిస్తాయి కానీ మహా జిత్తులమారులు. తమ పబ్బం గడుపుకునేందుకు తెరవెనుక పావులు కదుపుతుంటాయి . అవే ఒలిచిన పండును మన ముందు పెడతాయి.. మనకి పండగే పండుగ. తిన్నవాళ్లకు తిన్నంతని విజృభించేస్తాం" తన ధోరణిలో అన్నది హెచ్ ఐ వి
"నీలాగా, నా లాగా దీనిది ఉగ్ర తత్త్వం కాదులే. సాధు స్వభావి. దానికది పోయి మానవుడిని కౌగలించుకోదు. తనను కలిసిన వారినొదలదు. తెలిసో తెలియకో మానవులే ఆకాశమార్గం పట్టిచ్చారు. నౌకల్లో మోసుకుపోయారు. సముద్రాలు దాటించారు. ఖండాంతరాలు విస్తరింపజేశారు.." ఎబోలా ను చూస్తున్న మార్స్ అన్నది
"నిజమే..మానవుని నడక, నడతదే తప్పు. మనని మనం ఆట పట్టించుకోవడం, నిందించుకోవడం సరైంది కాదేమో " పెద్దరికంగా అన్నది జికా
"ఇదేమన్నా ఎడ్ల బళ్ళు , గుర్రబ్బగ్గీల కాలమా .. జెట్ యుగంలో ఉన్నాం మరి!
మానవుడు రోదసీలో కెళ్లి వస్తున్నప్పుడు అతనితో మనం ఆ మాత్రం ప్రయాణం చేయలేమా ఏమిటి? ఎక్కడికైనా అలాఅలా వెళ్లిపోగలం" జికా మాటని పట్టించుకోని హెచ్ ఐ వి అన్నది
"అవునవును, కానీ .. జీవితంలో ఎన్నో గెలిచిన వాళ్ళు, అంటువ్యాధుల జాడలేని పూదోటగా మారాయనుకునే దేశాల వాళ్ళు కంటికి కనిపించనంత అతిసూక్ష్మ క్రిమికి బెంబేలెత్తి పోవడం, భయపడిపోవడం, మరణశయ్య నెక్కడం విచిత్రం!" బుగ్గన వేలేసుకుని ఎబోలా .
"అదే నాకు అంతు చిక్కడం లేదు. అసలు నేనెంత వాళ్ళ ముందు .. ఆ.. చెప్పండి.
మానవ మేధ, జ్ఞానం, విజ్ఞానం ముందు మనమెంత? నలుసులో వెయ్యోవంతో, లక్షోవంతో కూడా లేని నేనెంత? నాపై ఇంత ప్రచారమా.. ఎన్ని నిందలో.. మరెన్ని కట్టుకథలో ..
వింటుంటే మొదట్లో బాధేసేది. కానీ ఇప్పుడవన్నీ వింటూ నవ్వుకుంటూ నా పని నేను చేసుకు పోతున్నా.
నాకా స్థితి కల్పించిన రాక్షసగణం మనోగతం అర్థమయింది. ఈ భాగోతంలో మనిషికీ మనిషికీ మధ్య, దేశానికి దేశానికి మధ్య , రాజకీయాలకి రాజకీయులకు మధ్య ,రాజ్యాల భౌగోళిక రాజకీయ ప్రయోజనాల మధ్య , వ్యాపార వాణిజ్య ప్రయోజనాల మధ్య ఎన్ని రకాల సిద్ధాంతాలు .. మరెన్ని ప్రచారాలు .. ఎన్ని అపోహలు , ఎన్ని అపనమ్మకాలు ..
ఏవీ నేను సృష్టించినవి కాదు. నన్నడ్డం పెట్టుకుని కొన్ని గణాలు తెరవెనుక ఆడుతున్న పెద్ద ఆట.
ఆ క్రీడలో భాగమే ఇప్పటి సంక్షోభాలు, విపత్తులు, యుద్ధాలు, దాడులు.. "వివరణ ఇస్తున్నట్లుగా అన్నది సార్స్ కోవిద్ 19
"నీ ప్రతాపాన్ని, ప్రకృతి ప్రకోపాన్ని కూడా మానవుడికి అంటిస్తావేం .." కొంచెం విసుగ్గా అన్నది ఎబోలా
" బ్రో .. ఆ జీవి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడేమైనా జరగొచ్చని అతని అతి తెలివితేటలే కాదు చరిత్ర చెబుతున్నది. చరిత్రలోకి తొంగి చూడండి. వనరులకోసం, సంపద కోసం, స్వార్థం కోసం, అధిపత్యం కోసం జరుగుతున్న దేనని స్పష్టమవుతుంది" నిదానంగా అందరి కేసి చూస్తూ అన్నది కోవిద్ 2
అప్పటివరకూ సరదాగా మాట్లాడుతున్న మిత్ర బృందం ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. కోవిద్ 19 మాటల్లో అంతరార్థం వెతకడానికి ప్రయత్నిస్తున్నారు .
"ఆలోచిస్తే నువ్వన్నది నిజమేననిపిస్తుంది మిత్రమా.. చేతులతో గరళం విరజిమ్మదానికి సిద్ధమవుతూ నాలుక నుంచి తేనెలూరించే మురిపించే మాటలు, చేతలు ఎన్ని చూడడం లేదు" అన్నది జికా
"ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన లేమిని ఆసరా చేసుకుని ఆందోళన సృష్టించారు. ఒక మామూలు వైరస్ ని బూచాడుని చేశారు. భూతద్దంలో చూపారు .
బ్రహ్మాండంగా జేబులు నింపుకుంటున్నారు. ఒకప్పుడు నా విషయంలో జరిగిందదే" హెచ్ ఐవి
"అయ్యో .. ఈ మనుషులు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియలేదంటే నమ్మండి.
మానవులలో కొందరు కొందరిని అంటరాని వారిగా చూస్తూ, అవహేళన చేయడం గురించి చరిత్ర ఎన్నో సాక్ష్యాలు చూపుతుంది. ఇప్పుడు కోవిద్ ఎవరితోనైనా కనిపిస్తే చాలు అలాగే వారిని అంటరానివారిగా చూస్తున్నారు. బంధుమిత్రులు దూరంగా పెడుతున్నారు.
నిన్నటివరకూ ఆత్మీయతానురాగాలు కురిపించిన వాళ్లే అంటరానివారిగా చూడటం భరించలేని కొందరు ప్రాణత్యాగం చేస్తున్నారట." అన్నది ఇన్ఫ్లూయెంజా
"నిజమే.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లికి పాజిటివ్ రాగానే నడిరోడ్డుపై అనాథలా వదిలేసిన ప్రబుద్ధుల్ని చూస్తున్నా.
అంతేనా .. పాపం, ఆయనెంతో మందికి విద్యాబుద్ధులు చెప్పారు . ఇప్పుడు వాళ్లంతా ఆయన శవం ఖననాన్ని అడ్డుకున్నారు
మరొకాయన గొప్ప వైద్యుడు. తుమ్మినా దగ్గినా ప్రజలకు ఉచిత వైద్యం చేసిన మహానుభావుడు నిన్నటివరకూ.. నేడాయన శవాన్ని అక్కడ కాల్చడానికి ఆ ప్రజలంతా వ్యతిరేకమే .
ఊళ్ళ మధ్య ముళ్ళకంపలు, పాజిటివ్ ల వెలి, తోటి మనిషిని అక్కున చేర్చుకోలేనితనం... అయ్యో .. ఏమని చెప్పను .. ఎన్నని చెప్పను .. కొల్లలు కొల్లలుగా కథలుకథలుగా విషయాలు బయటికొస్తున్నాయి. అయ్యయ్యో .. ఏది మానవత్వం..? ఏవీ మానవీయ విలువలు..? మననంటారుగానీ మనకంటే తీవ్రమైన నీచమైన వైరస్ మనిషిలోని స్వార్థం. ఆ జబ్బుతో సహజీవనం చేస్తూ మనను ఆడిపోసుకుంటారు" వాపోయింది హెపటైటిస్.
ఏ మాత్రం వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కూడా వైరస్ జాతులున్నాయి. కొన్ని వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి. మనిషిలో మార్పు వచ్చినట్లు వాటిలో కొద్దోగొప్పో మార్పొచ్చిందేమో.. అయినా తట్టుకుంటూ, కాపాడుకుంటున్న మానవుడు ఇప్పుడెందుకు చిగురుటాకులా వణికిపోతున్నట్లు, రాలిపోతున్నట్లు?
మానవ ప్రవృత్తిలో, ఆహార విహారాలలో మార్పు తెచ్చే కుట్రలు చాపకింద నీరులా సాగించిన రాక్షస మూకకి ఇప్పుడు పండుగగా ఉంది.
పెద్ద పెద్ద కబుర్లు చెప్పే గొప్ప దేశాలన్నీ చతికిలబడి అదృశ్యక్రిమిని ఎదుర్కోలేక పోవడం అభివృద్ధి నమూనా విచిత్రం. కారణం ఎవరు..?
అలక్ష్యం, దాచివేత, దాటవేత, అలసత్వం, అసమర్ధత, నేరపూరిత నిర్లక్ష్యం కనిపించకుండా కళ్ళకు గంతలు కట్టి వైరస్ ని నిందిస్తున్నారు
మెరుగైన ఆరోగ్య సదుపాయాలు సాధించామనుకుంటూ ప్రజా ఆరోగ్య వ్యవస్థల విచ్ఛిన్నం చేసుకున్నారు.
వైద్యం, ఆరోగ్యం లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. జబ్బు పడితే జేబుకు చిల్లే నా యే.. ఐదు నక్షత్రాల వైద్యం, మూడు నక్షత్రాల వైద్యం కొనలేక కొందరు, తప్పని పరిస్థితిలోనో, బతుకుమీద తీపితోనో ఉన్నదంతా ఊడ్చి తర్వాత చిప్పట్టుకుంటున్న వైనం.. కళ్లారా చూస్తున్నా.. అయినా, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు కార్పొరేట్ వైద్యం చుట్టూ తిరుగుతారు . ఇళ్ళు