కథలు

(January,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

తేడా చూపు

పొద్దు పొడిసి బారెడెక్కింది. సుక్క పొంటెకు  మోట కట్టినోళ్ళు, నీళ్ళు దంగినాక, పొలం దిగింది  చూసుకొని, ఎడ్లను ఇడిసి వరిగడ్డకు కట్టేసి  ఇంటికి చేరుకొంటున్నారు.  యాతంకు పోయిన వాళ్ళు నీళ్ళు ఓడగొట్టి, గడ్డకెక్కి  నీళ్ళు పట్టిన  పొలాన్ని చూసుకొంటున్నారు. గూడేసేటోల్లు  గుండ్రాతి  తేలినంక అలిసిపోయి ఒడ్డెక్కి ఇంటి దారి పట్టిండ్రు.

మస్కుల లేసిన వాడ ఆడవాళ్ళు, పెండ  నీళ్ళు బకెట్ల కలుపుకొని అలుకు చల్లి ముత్యాల  ముగ్గులు పెడుతున్నరు. పాచి పని అయిన వాళ్ళు పొయి మీద ఎసర్లు పెట్టిండ్రు.   పొయి మీద ఎసులల్ల  గుటుక తుకతుక ఉడుకుతంది.

పువ్వుల మీదికి సీతాకోకచిలుకలు వచ్చి వాలినట్టు,  రంగురంగుల వస్త్ర ధారణతోని పిల్లలు. రెండు వరుసల్లో  నిలబడి వాడకు వస్తున్నరు. ఆ వరుస భూమి మీద నడుస్తున్న సింగిడి తీరుంది. అంతా ఒకే మాట, ఒకే  ఆట.... ‘వందేమాతరం’, భారత మాతకు జై , మహాత్మ గాంధీకి జై,  జవహర్ లాల్ కు జై అని ఒకరంటే  మిగతా  పిల్లలు అంటున్నరు. పిల్లలు ప్రభాత భేరితోని వాడను పలకరించ వచ్చినట్టుంది. పిల్లలను నియంత్రించే పంతుళ్ళు,  వాళ్ళ చేతుల్లో  వాయిలి  బరిగెలు.

" ఎత్తండీ ఎత్తండీ స్వాతంత్యపు జండా

  ఎత్త వోయి ఎత్తు ఎత్తు ఆకాశంనిండా”  పాటలకు,  నినాదాలకు దిక్కులు మారుమోగుతున్నయి. వాడ ఉలికిపడింది.
అది చెబ్బీస్ జనవరి రోజు . పిల్లలను చూసి నాకు ఉత్సాహం కట్టలు తెంచుకున్నది.  ఒక  ఉన్మాదం ఆవహిస్తే  సోయి దప్పినట్లు , ఆ పిల్లల బారుల నేను  నడుస్తున్న. మెల్లమెల్లగా వాళ్ళు ఇచ్చే నినాదాలు అర్థం చేసుకొని, గొంతు కలుపుతున్న.

నాలుగు పానాదులు తిరిగే  వరకు బడి  రానే వచ్చింది .
అక్కడ జండా ఎగురవేసి వందనం చేసిండ్రు . ఏవేవో మాట్లాడిండ్రు.  చివరకు చప్రాసి  ‘బరివాత  భామ’ అనుకుంట వచ్చి నాకు  కొబ్బరి బెల్లం పెట్టిండు . అది రెండు చేతుల్లో  తీసుకొని తిన్న.
అప్పటి నుండి ఆ పిల్లల్లో  నేను  కూడా ఉండాలనుకొన్న.  బడికి పోవాలనే కోర్కె  పుట్టింది.  పల్క  పట్టుకొని బడికి పాయిన.  అది శిశుతరగతి.   దానికి సారు భాస్కరరావు.   ఆ  రోజుల్లో  బడి చెప్పే  పంతులు బడి ఉన్న ఊళ్ళేనే ఉండెటోళ్ళు.  భాస్కరరావుకు కూడా అట్లనే చెర్లపల్లెల ఉంటుండు. మంచి చమత్కారి.  సంధ్యావళిని సందెలవడి అని చమత్కరించెటోడు.
ఆ తరగతిలో యాబైమంది పిల్లలుంటరు.  అందరూ  భాస్కరరావు అంటే గజగజ వణికిపోతరు.  ఎప్పుడు కొడుతడో ఎప్పుడు  మెచ్చుకుంటడో  ఎవరికి అర్థం కాదు.
నేను పొద్దున చెప్పిన అక్షరాలు దిద్దుకొని మధ్యాహ్నం  అప్పజెప్పుతున్న.  మధ్యాహ్నం పెట్టిచ్చిన అక్షరాలను సాయంత్రం అప్పజెప్పుతున్న.  

గుణింతాలు అయినంక బాలశిక్ష.  ‘అమ్మా , ఆవు’ తోని మొదలైతది.  నల్లబల్ల మీద అమ్మ ఆవు బొమ్మ వేసి వాటి కింద అమ్మ  అవు అని రాసి ఒక్కొక్కరితోని చెప్పించేవాడు సారు.  అట్లా  అందరికి    గుణింతాలతో   సహ నోటికి వచ్చేది.

 ఒక రోజు బడి చుట్టి అయింది అని ఎవరో అంటే అందరం దీ!   అని    అరుస్తూ   బయటకు వచ్చినం.  అప్పుడు భాస్కరరావు సారు పెద్దసారు దగ్గర ఉన్నడు.  అల్లరి విని వచ్చి అందాని పశువులను కొట్టినట్టు చింత బరిగెతోని కొట్టిండు.  ఆ దెబ్బలకు కొందరికి  పెయి మీద దద్దులు తేలినయి.  ఆ దద్దులను  పునికి చూసుకుంట సారు ఏడ్చిండు. మేమందరం ఏడ్చినం.

*  *   *   *   *

మేమంతా ఏడవ తరగతి చదువుతున్నం. బడికి ఎవరో పెద్దసారు వచ్చిండు . ఆయనకు అందరు భయపడుతున్నరు. మా క్లాసుకు వచ్చి కూచున్నడు.  బోర్డు మీద లెక్క వేసి అందరిని తీయమన్నడు.  తీసిన వాళ్ళ నోటు బుక్ చూసి రైట్ గుర్తు వేసిండు. ఎన్నో ప్రశ్నలు అడిగిండు.  చెప్పిన వాళ్ళను మెచ్చుకున్నడు . మినిష్టర్ అంటే అర్థం చెప్పమని అడిగిండు.  నేను వెంటనే తడబడకుండ మంత్రి అని సమాధానం చెప్పిన.  నాకు సారు ఒక పెన్ను  బహుమతి ఇచ్చిండు.  తనిఖీ సవ్యంగా సాగినందుకు అందరు ఊపిరి పీల్చుకున్నరు. తెల్లవారి క్లాసుల నన్ను నిలబెట్టి భాస్కరరావు సారు “కమ్మరోడు  మంత్రి,  కుమ్మరోడు మంత్రి, చాకలోడు  మంత్రి, శాలోడు మంత్రి , మాదిగోడు  మంత్రి,  మాలోడు మంత్రి” అన్నడు. ఆ మాటలు సారు ఎందుకన్నడో ఎవరికి అర్ధంకాలేదు

*  *   *   *   *

నేను దేవేందర్  మంచి స్నేహితులం.   బడికి పోయింది మొదలు ఇంటికి వచ్చిదాకా  కలిసి ఉండేటోళ్ళం.  ఓనగాయలు,  జామ పండ్లు , రేగి పండ్లు తినుకుంటూ బడి చుట్టూ దానికి  దగ్గర ఉన్న గుడి చుట్టూ ఆడుకునేటోళ్ళం .  ఒకరోజు దేవేందర్ ను, నన్నుసారు ఇంటికి పిలిసిండు.  అమ్మకు పైసలు లేవట ఇద్దరు పోయి ఇచ్చి రావాలె అన్నడు.  దేవేందర్ చేతిలో పైసలు పెట్టి అమ్మకు ఇయ్యమని ఒక ఉత్తరం ఇచ్చిండు . దేవేందర్ నేను కలిసి చెందోళికి బయలుదేరినం.  ఆడుకుంటూ పాడుకుంటూ కాలిబాటల వెంట, కచ్చురాల తొవ్వల వెంట, ఒడ్ల  మీది కెల్లి మల్లె చెందోళి చేరే వరకు ఒంటి గంటయింది.  పోయే వరకు అమ్మమా కొరకు చూస్తుంది.  దేవేందర్ ఇంట్లకు పోయి ఫైసలు, ఉత్తరం చేతికిచ్చిండు. అమ్మ ఉత్తరం చదువుకున్నది.  ఆయనకు ఇంట్ల అన్నం పెట్టింది.  నాకు వాకిట్ల పెట్టింది. ఆకలి  దంచి కొడుతుంది.  విస్తర్లోని ని అన్నం  మొత్తం తిన్న.   నీళ్ళు తాగుటానికి  దొడ్డికి  పోయే చెంబుల నీళ్ళు పెట్టింది.  ఆ ముంత పెయి అంతా మురికి పట్టి ఉన్నది.  ఎక్కిల్లు వస్తున్నయి, నీళ్ళు తాగుదామంటే  తిన్న తిండి  బయట పడేటట్టు ఉంది.  ఏదో విధంగా ఎక్కిల్లను ఆపుకొని దేవెందర్, నేను బయలుదేరినం. తొవ్వల వాగుల చెలిమె  చల్లుకొని కడుపు నిండ నీళ్ళు తాగిన.   చల్లని చెలమెల నీళ్ళు తాగినంక ప్రాణం నిమ్మలమయింది. ముచ్చట్లల్ల పడి ఊరు చేరింది తెల్వలేదు.   సారు ఇంటికి పోయినం. లోపలి  ఇంట్లకు పోయి ఆడ జరిగినదంతా దేవేందర్ సారుకు చెప్పిండు.  అనుకున్నది అనుకున్నట్టు జరిగినందుకు సారు ఊపిరి పీల్చుకొన్నడు.  సారు పని చేసిన సంతోషంతోని నేను ఇంటి దారి పట్టిన. ఈ తేడా చూపులెందుకని  ఆలోచిస్తూ.


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు