కథలు

(February,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

రేగు పండ్లు

మధ్యాహ్నం ఎండ చిటపటలాడిస్తుంది. భరింపరాని ఉక్కపోతగా ఉంది. కరెంటు కోత వల్ల ఫ్యాన్లు లేక ఊపిరి ఆడకుండా ఉంది. రాత్రి బదిలీ వచ్చినా ఉక్కపోతకు నిద్రాభంగమైంది. పగలు సరిగా నిదురపోకుంటే రాత్రి బదిలీలో పడే అవస్థ పగవాడికి కూడా వద్దనిపిస్తుంది. అగో అటువంటి వేళప్పుడు బజార్లో రేగు పండ్లోరేగుపండ్లో" అంటు వేస్తున్న కేక వినిపించింది.

రేగుపండ్లు పేరు వినేసరికి ఎందుకో చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చినవి. దాదాపు పదేండ్ల  వయసప్పుడు కావచ్చు. పక్కింటోల్ల రేగు చెట్టు మీద రేగు పండ్ల కోసం గుట్టు చప్పుడు కాకుండ ఇంటోల్ల కంట్ల పడకుంట గోడ దున్కిపోయి రాళ్ళతో రేగుపండ్లు కొట్టుకొని తినటము ఎంతో ఆనందముగా ఉండేది. పక్కింట్లో ఉండే ముసలాయన కంట్ల బడితే బండ బూతులే కాదు, ఒక్కొక్కసారి బడితె పూజ కూడా జరిగేది. అయినా అదేం పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ మేం రేగుపండ్ల కోసము దొంగతనము చేస్తుండే వాళ్ళము. ఒకటి రెండు రేగుపండ్ల కోసము నా జట్టు వాళ్ళతో తన్నులకు దిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.

చిన్ననాటి కొన్ని సంఘటనలు, అనుభూతులు మనసులో ఎక్కడో నిక్షిప్తమైపోయి, అవకాశము వచ్చినప్పుడు పురివిప్పుతాయి. ఇప్పుడు నా పరిస్థితి సరిగా అలాగే ఉంది. ఇంట్లో పిల్లలు లేరు. ఎండకాలము సెలవులు తప్పితే పిల్లలకు రెస్టు ఉండదని వారం పది రోజులు అమ్మమ్మ గారింటికి వెళ్తాము అంటు పిల్లలు పోరు చేసారు. ఈ సాకుతోనైనా తల్లిగారింటికి పోవచ్చునని మా ఆవిడ సై అంది. ఫలితంగా వారం రోజుల నుండి డ్యూటి వంటా వార్పులతో సతమతమైతాంది. అందులోను మూడు షిప్టులుగా తిర్గె బాయి పనితోని తిండి, నిద్ర, విశ్రాంతికి నిర్ణీత సమయమంటూ ఉండదు. దాంతో ప్రాణం ఉతికి అరేసినట్టుగా తల్లడం మల్లడం అయిపోతాంది. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడం పేర కంపినోడు చేపట్టిన చర్యల వల్ల అటు పనిలోనే కాదు బయట కూడా ప్రాణానికి సుఖం లేకుండా పోయింది.
    
 
ఇంత వరదాక దూరంగా వని ఇంచిన కేక , ఇప్పుడు కాస్త మా ఇంటి ముందే విన్పించే సరికి, అంత వరదాక అణిచి పెట్టుకున్న కోరిక చెలరేగి అప్రయత్నంగానే ఓ రేగు పండ్లమ్మా " అంటు పిలిచాను. నా పిలుపు విని ముందుకుపోతున్నదల్లా ఆగి వెనక్కి చూసింది. అప్పుడే ఆమెను పరీక్షగా చూసాను. అరువైడెబ్బయి ఏండ్ల మనిషిలా ఉంది. ఎప్పుడు ఊళ్లు తిరిగి అమ్మెటామే లెక్క కన్పించలేదు.
  

 “ఏమమ్మా రేగు పండ్లు అమ్మేది నువ్వేనాఅన్నాను అనుమానంగా.
 

"అవు బిడ్డాఅంటు దగ్గరికి వచ్చింది. బాగా అలిసిపోయినట్లుగా నీరసంగా కనిపించింది . ఎందుకో ఆమెను చూస్తే జాలివేస్తుంది. బాగా బ్రతికిన దానిలా కన్పిస్తున్నది. ఈ పనికి అలవాటు లేని దానిలా కన్పించింది.
    
ఇంత ఎండలో బయల్దేరినవు అమ్మా" అన్నాను.
ఏం చేయాలి బిడ్డ తప్పుద్దా " అంటూ మా ఇంటి ముందున్న వేప చెట్టు నీడ కాడికి నడిచింది. ఎంతో ఆయాసంగా నెత్తిమీదున్న గంపను దించుకున్నది .
      
ఆ గంపలో సగం వరకు రేగు పండ్లున్నాయి . . . అవేమంతా నజరుగా కన్పించటము లేదుగాని, సగమన్ని పచ్చిగాను , మట్టి కొట్టుక పోయినట్టుగా చిన్నగా వున్నాయి. మరి సగం కాస్త వో తీరుగా ఉన్నాయి. పండ్లేమి బాగా లేవు కదా అన్నా వాటికేసి చూస్తూ.

" ఏం చేయాలి బిడ్డా మనుష్యులకే బ్రతకలేని రోజులు వచ్చినాయి. ఇంక చెట్టు పుట్ట సంగతేమి చెప్పాలి " అంది.  ఆమె మాటలు నాలో ఆసక్తిని రేపాయి.
“ఆ,  అదేందమ్మా అలా అంటావు "
   
ఏం చెప్పాలి బిడ్డా . . ఊళ్ళె బాయిలు ఎండిపోయి తాగేందుకు నీళ్ళు దొరకక నానా బాధలు పడ్తున్నాం ఇంకా చెట్లు ఎట్లా బ్రతుకుతాయ్ " అంది.
  
 
నేనేమి బదులు పలుక లేదు.
   
 
ఆమె  మళ్ళీ  అంది " ఒకప్పుడు ఇంతింత కాయలు కాసేది అంది చెయ్యెత్తి చూయిస్తూ ఊరి మీద పిల్లలంతా మా చెట్టు క్రిందే మూగేటోళ్ళు. గీ రేగు పండ్లు అమ్ముకొని బ్రతికే రోజులు వాస్తయను కోలే ఆమె ఎర్రటి ముడతలు పడ్డ మొఖంలో ఏదో విచారం బాధ తొణికిసలాడింది.
    
నిజమే వయస్సు మళ్ళీ  పోయి సరిగా నడువలేని స్థితిలో ఎర్రటి ఎండలో రేగుపండ్లు అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి ఎవరికైనా బాధకరమే .
    
ఏం కొమురయ్య బావా రేగుపండ్లు కొనుక్కుతింటున్నావా " అంటు లింగయ్య పండ్లికిలించుకుంటు వచ్చిండు.

ఆ ఆ " అన్నా బదులుగా నవ్వుతూ . .

పొరగానివి అయిపోయినావు అంటు దగ్గరకి వచ్చి, పండ్లు అమ్మె ఆమెను చూసి ఆ ప్రయత్నంగానే ఆయన మొఖంలో విచారం కమ్ముకొన్నది.

సుశీలక్కా నువ్వు రేగుపండ్లు అమ్ముతున్నావా " అంటూ ఆశ్చర్యపోతూ  నోరెల్ల బెట్టిండు . . .

" ఎవరు లింగయ్యా" అంటు ఆమె లింగయ్యను పరీక్షగా చూసింది. అవునక్కా నేనే మీ దగ్గర పాలేరుగా పనిచేసిన లింగయ్యను" అంటూ కాళ్ళ మీద గెంతుక కూచున్నాడు "బావా ఎట్లున్నడక్కా" కోడలు భర్త చనిపోయిండట కదా! దానికి పొల్లగాండ్లు అని విన్నా ఎక్కడుంటాండ్లు" అంటు ఆత్రంగా అడిగిండు.

" బావకు చాతనయితలేదు.. మంచాల పడ్డాడు సరస్వతి, పిల్లలు నా దగ్గరే ఉంటాండ్లు" అంది ఆమె నిర్లిప్తంగా.

"ఎటువంటి దానవు ఎట్లయి పోయినావు అక్క" లింగయ్య గొంతులో విచారం కమ్ముకొంది.. కండ్లు తడారినాయి.

ఏం చేస్తాము తమ్మి కాని రోజులు వచ్చినయి ఆమె మొఖంలో అదే నిర్లిప్తత"...

అక్కన్నే ఉంటున్నాము. ఇంటి దాక రా రాధక్కా పిల్లల్ని చూస్తువు" అన్నాడు.

మళ్లోసారి వచ్చినప్పుడు కలుస్తా తమ్మి ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటికాడ సరస్వతి పిల్లలు ఎదురు చూస్తుండ్లు కావచ్చు" అంది.

వాళ్ళ మాటలు ఆసక్తిగా వింటూనే గంపలో నుండి కొన్ని పండ్లు ఏరుకొని, డబ్బులిచ్చాను. ఆమె గంప మళ్లీ నెత్తిన ఎత్తుకుంది.

"అక్క ఇంటి దాక రారాదే " అంటూ లింగయ్య మరోసారి ప్రాధేయపడ్డాడు.

ఆమె అదే సమాధానం ఇచ్చి ముందుకు కదిలింది.

లింగయ్య కండ్లలో నీళ్ళూరటము చూసి ఆమె నీకు ఇదివరకే తెలుసా" అన్నాను.

లింగయ్య గొంతు విచారంతో వణికింది. సుశీలక్కది మవూరే వాళ్ళింట్ల బాయి పనికి రాక ముందు పదేండ్లు పాలేరుగా పనిచేసిన, ఉరుకుల పోటీలల్ల బాయి పని దొరికినంక పాలేరు పని బందు పెట్టిన పాలేరు అన్నట్టె కాని సుశీలక్క నన్ను ఎప్పుడు పాలేరు లెక్కన చూడలే వాళ్ళ ఇంట్ల మనిషిని చూసినట్టు చూసింది. భూమి జాగషాన ఉండేజ . . పది ఎకరాల మాగాణి ఆరు ఎకరాల కుష్కి. వకీలు పెల్లి వాగు క్రింది రెండు పంటలు అలకగా వచ్చేది. ఒక్కతే బిడ్డను బాయి పని చేసే పొల్లగాన్ని చూసి పెండ్లి చేసిండ్లు వోడలు బండ్లు అయితాయి. బండ్లు వోడలు అయితాయి అంటారు చూడు గట్లయింది. ఒక్కగానొక్క బిడ్డ బాయిల ప్రమాదం జరిగి చనిపోయిండు. " విచారంతో లింగయ్య గొంతు పెకలలేదు మళ్ళీ తేరుకొని.
     
ఊళ్ళెకు బొగ్గు బాయిలు వచ్చినంక భూములు పోయినయి. భూముల్ల నీళ్ళింకిపోయినయి. వకీలు పల్లె వాగు పోయింది. ఊరు ఊరంతా వల్లకాడై పోయింది. చాలా  మంది ఎటో ఎటో బతక పోయిండ్లు. భూములు పోయి పంటలు పోయి, బ్రతుకు తెరువుపోయి కాళ్ళు చేతులు సక్కంగ ఉన్నోళ్ళే అడుక్కతినే రోజులు వచ్చినయి. ఇంక సుశీలక్క గురించేమి చెప్పాలిబాధతో అతని గొంతు వణికింది.
    

ఎందుకిట్లా అయితాందో ఏ మహామ్మారి పిట్ట పీడిస్తున్నదో అర్థం కాదు. ఊళ్ళెకు పోతే క్షణం ఉండ బుద్ధి కావటం లేదు.  ఊరు చుట్టూ ఉండే చింత తోపులు పోయినయి. వాటి మీద కిలకిలలాడే రామ చిలుకలు లేవు పచ్చ పచ్చని పంట పొలాలు లేవు. వాటి మధ్య పకపకలాడే పొల్లగాండ్లు లేరు. ఎక్కడ ఆకలితో నకనకలాడే మొఖాలు ఎండిపోయిన డొంకలు... కంతలు తేలిన పోరగాండ్లు... మట్టి దిబ్బలు.. బొగ్గు దుమ్ము'..
    

జీవితంలో అతి ముఖ్యమైంది ఏదో పొగొట్టుకున్నవాడి లెక్కన బాధతో అతని గొంతుపూడుక పోయింది. అతని కండ్లు వర్షిస్తున్నాయి..

నేను లింగమూర్తి మొఖంలోకి చూడలేక తలదించుకున్నాను.


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు