(March,2020)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
మీ...టూ...
అది హైదరాబాదులో ఉన్న యూనివర్సిటీ లేడీస్ హస్టల్ రెండవ అంతస్థులోని ఒక రూములో సమీర, స్వాతి ఉంటున్నారు. సమీర చరిత్ర విభాగంలోనూ, స్వాతి రసాయనశాస్త్ర విభాగంలోను పి.హెచ్.డి చేస్తున్నారు. ఇద్దరూ ప్రియ స్నేహితులు. ఒకరంటే ఒకరికి విపరీతమైన గౌరవం, అభిమానం. స్వతంత్ర భావాలు గల యువతులు కూడా. స్టడీ టేబుల్ ముందు కూర్చుని చదువుకుంటున్న సమీర ఉలిక్కిపడింది. చేతికి ఉన్న వాచీలో టైము చూసింది. రాత్రి పదిగంటలవుతుంది.
‘‘అరే! స్వాతి ఇంకా రాలేదేంటి? ఈ రోజు లాబ్ నుంచి రావటం ఆలస్యం అవుతుంది. నాకోసం డిన్నర్ మెస్ నుంచి తీసిపెట్టు అంది. కానీ ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు. ఒకసారి ఫోను చేసి చూస్తాను’’ అనుకుని మొబైల్ తీసుకుని స్వాతికి ఫోను చేసింది. రింగ్ అవుతుంది కానీ స్వాతి ఎత్తలేదు.
‘‘దారిలో ఉందేమొ? వచ్చేస్తుందిలే!’’ అనుకుని సమాధానపరుచుకుంది. మరో అరగంట గడిచింది. ఇంకోసారి ఫోను చేసి చూసింది. సమాధానం లేదు. పదకొండయింది.
‘‘ఇక లాభం లేదు. నేనే లాబ్‌కి వెళ్ళి దాన్ని తీసుకొస్తాను’’ అనుకుని బయలుదేర బోయింది.
ఇంతలో తలుపు దబదబ కొట్టినట్లనిపించి లేచి చటుక్కున తలుపు తీసింది. పెనుతుఫానులా స్వాతి లోపలికి వచ్చి తన మంచంమీద బోర్లాపడుకుని వెక్కివెక్కి ఏడవ సాగింది. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయి నిబడింది సమీర. తర్వాత తెలివి తెచ్చుకుని తలుపు వేసి స్వాతి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని వీపుమీద చెయ్యివేసింది.
‘‘ఏమయింది స్వాతి? ఇంటి దగ్గరనుంచి ఏమయినా ఫోను వచ్చిందా?
స్వాతి దు:ఖం ఇంకా ఉదృతం అయింది. కొంచెంసేపు ఏడ్చి నెమ్మదిగా వీపు మీద నిమురుతూ ‘‘నాతో చెప్పు ఏమయిందో. నీకు కొంత ఉపశమనంగా ఉంటుంది’’ అంది సమీర.
స్వాతి లేచి ఎర్రగా ఉబ్బిపోయిన కళ్ళని తుడుచుకుంటూ వాడంత నీచుడని నేను కలలో కూడా అనుకోలేదు. ఒక్కదాన్ని ఉన్న సమయం చూసి, కాపేసి, నన్ను లోబరుచుకోవాలని చూస్తాడా అంది.
సమీరకు అర్థం కాలేదు. ‘‘ఏమయిందో వివరంగా చెప్పు ప్లీజ్!’’ అంది.
స్వాతి నిస్సహయంగా సమీర వంక చూసింది. ‘‘ఉండు! కొంచెం మంచినీళ్లు తాగు’’ అని గ్లాసందించింది సమీర. స్వాతి మంచినీళ్లు తాగి, కొంచెం తేరుకుని చెప్పసాగింది.
ఈ మధ్య స్వాతి ల్యాబ్ వర్క్ వీయినంత త్వరగా పూర్తిచేసి థీసిస్ రాయాలనుకుంది. అందుకని ఆ రోజు ఉదయం లాబ్‌లో పనిచేస్తూ, మధ్యలో లంచ్ బ్రేక్‌లో తప్ప లేవనేలేదు. ఎంతకీ తెమలని పనిని టైముకూడా చూసుకోకుండా చేస్తున్నది. లాబ్‌లో పనిచేస్తూ అందరూ ఎప్పుడో వెళ్లిపోయారు. ఆ సంగతి కూడా పట్టించుకోకుండా తంటాలు పడుతుంటే, ఇంతలో ఎవరో తన భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నట్లనిపించింది. ఉలిక్కిపడి చూస్తే లాబ్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్. కోపంగా తోసెయ్యబోతే మరింత గట్టిగా పట్టుకుంటూ ‘‘నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎన్నోరోజులా నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఈ రోజు నా పంట పండింది. లాబ్‌లో ఎవరు లేరు, మనిద్దరమే! నీ అందాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాలో కలసిపో! నీకు స్వర్గం చూసిస్తాను. లాబ్ తలుపు వేసేసాను’’ అన్నాడు తమకంగా. ఈ పరిణామానికి నివ్వెరపోయింది స్వాతి.
ఒక చెత్తో స్వాతిని మరింత హత్తుకుంటూ, మరోచేత్తో ఆమె శరీరాంగాలను తాకరాని చోట తాకసాగాడు. స్వాతి ఊపిరి బిగబట్టుకొని ఆరవసాగింది. ల్యాబ్‌లోని పరికరాలు చిందరవందర అవసాగాయి. తన ఉక్కుపట్టుతో స్వాతిని పక్కగదిలోకి లాక్కెళ్లాడు. ఇక సర్వశక్తులూ హరించి పోతాయనుకున్న సమయంలో ఎదురు బల్ల మీద ఒక ఇనపకడ్డీ కనిపించింది. స్వాతి లేని బలం తెచ్చుకొని అతన్ని ఒక్క తోపు తోసి, ఆ ఇనుపకడ్డీని చేతిలోకి తీసుకుంది. దూరంగా ‘‘ముందుకి అడుగువేస్తే దెబ్బ పడుతుందని’’ అతన్ని బెదిరిస్తూ తలుపు దగ్గరికి జరగసాగింది. ఈ సారి విస్తుపోవడం కిరణ్ వంతయింది. దొరికిన ఈ అవకాశం వదులుకోవడం ఇష్టంలేక నెమ్మదిగా అడుగులేస్తూ స్వాతి వైపుకి రాసాగాడు. అది గమనించి స్వాతి చటుక్కున తలుపు తీసి బయటికి వెళ్లి గడియ వేసింది. లోపల కిరణ్ తలుపు బాదసాగాడు. ఇక ఒక్క నిముషంకూడా ఆలస్యం చెయ్యకుండా తన బ్యాగ్ తీసుకుని ల్యాబ్ తలుపు తీసుకొని బయటికి పరుగెత్తింది.
స్వాతి చెప్పింది విని ‘‘ఎవరీ కిరణ్‌కుమార్? ఎప్పుడు వాడి గురించి చెప్పలేదే?’’ అంది సమీర.
‘‘కిరణ్‌కుమార్ లాబ్ అసిస్టెంట్. సుమారు 45 ఏళ్లుంటాయి. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. యూనివర్సిటీ కాంపస్‌లోనే ఉంటాడు. కనబడినప్పుడు బాగానే మాట్లాడేవాడు. మంచివాడు అనుకున్నాను. మనస్సులో ఇంత కుళ్ళు పెట్టుకున్నాడని ఈ రోజే తెలిసింది. ఛీ! ఛీ! వళ్లంతా ముట్టుకుని మైలపరచాడు. మంటల్లో దూకాలనిపిస్తూంది అని మళ్లీ ఏడ్వటం మొదలు పెట్టింది స్వాతి.
‘‘ఏడవకు! ధైర్యం తెచ్చుకో! ముందేం చెయ్యాలో ఆలోచిద్దాం. ఆ నీచుడికి తగిన గుణపాఠం చెప్పాలి. నీ జీవితంలోనే కాదు నా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. సరే! అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లేచి ముఖం కడుక్కుని అన్నం తిను” అంది సమీర.
‘‘నాకిప్పుడు అన్నం తినానిపించడంలేదు. ఆకలి వచ్చిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలో త్వరగా చెప్పు’’ అంది స్వాతి ఉద్వేగంగా. సమీర స్వాతిని సమాధానపరచి కొంచెం మజ్జిగ తాగేలా చేసి ఆ తర్వాత ఏం చెయ్యాలో చెప్పసాగింది.
‘‘నువ్వు జరిగిన సంఘటనని యధాతధంగా రసాయనశాస్త్ర విభాగానికి హెడ్ అయిన మధుసూధన్ గారికి ఉత్తర రూపంలో వ్రాయి. ఆఖరులో కిరణ్‌కుమార్‌కి తగిన శిక్ష విధించాలని, అతన్ని క్షమించి వదిలేస్తే ముందు ముందు కూడా ఇలాగే ప్రవర్తించవచ్చని, ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోతుందని వ్రాయి. నేను లిఖిత రూపంలో ఎందుకు ఫిర్యాదు చెయ్యమంటున్నానంటే ముఖాముఖి చెప్పడం కంటే రాయడం సులువని. రేపు ఇద్దరం కలిసి మధుసూధన్ గారిని కలుద్దాం’’ అంది.
సమీరని వాటేసుకుని కళ్లనీళ్లు పెట్టుకుంది స్వాతి ‘‘నిన్ను నాకు ధైర్యంగా ఉంది. నీ సపోర్ట్ నాకిప్పుడెంతో అవసరం. నువ్వు లేకపోతే నేనేం అయిపోయేదాన్ని?’’ అంది ఏడుపు గొంతుతో...
స్వాతిని మరింత ఓదార్చి, ధైర్యంచెప్పి ఒక నిద్ర మాత్ర ఇచ్చి పడుకోబెట్టింది సమీర. మరునాడు ఇద్దరు కలిసి ఉత్తరాన్ని ఎలా రాయలో చర్చించుకుని రాశారు. పదింటికి మధు సూధన్గారిని కలిసి ఉత్తరం అందజేశారు. ఆయన ఈ సంఘటనకి ఎంతో చలించి, బాధతో ఏ విభాగంలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఇక ముందు జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను. కిరణ్‌కుమార్‌కి తగిన శిక్షపడేలా చూస్తాను’’ అన్నారు.
లాబ్‌లో పనిచేసే కొంత మందిని పిలిచి మాట్లాడారాయన. కిరణ్‌కుమార్ గదిలో ఉన్నట్లు లాబ్‌లోని పరికరాలు చిందరవందర అయినట్లు, ప్రొద్దున్నే వచ్చిన ఇంకో లాబ్ అసిస్టెంట్ తలుపు తీస్తేనే కిరణ్‌కుమార్ బయటికి వచ్చినట్లు అప్పటికే అందరికి తెలిసిపోయింది.
‘‘సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకేం ఫర్వాలేదు. అతను తప్పించుకోలేడు. మీరిక నిశ్చింతగా ఉండండమ్మా!’’ అని ఆయన వాళ్లని ఓదార్చి పంపించారు.
ఇద్దరు హస్టల్ గదికి వచ్చారు. ఇక రోజు ఇద్దరికి వర్క్ చెయ్యాలని అనిపించలేదు. మధుసూధన్ గారి ఓదార్పు వాళ్లకెంతో ధైర్యానిచ్చింది. స్వాతి మళ్లీ మామూలు మనిషయింది. గదిలోనే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. స్వాతికి హఠాత్తుగా గుర్తుకొచ్చాయి నిన్న రాత్రి సమీర చెప్పిన మాటలు.
‘‘సమీరా! నీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి అన్నావు. నాకు చెప్పవూ! అసలింతవరకు నాకెందుకు చెప్పలేదు” అని ప్రశ్నించింది.
‘‘అవును నా మనస్సులోనే దాచుకుని మదన పడ్తున్నాను. ఈ రోజు నీకు చెప్పాలని అనిపిస్తుంది. ఈ యూనివర్సిటీలోనే అవి జరిగాయి. మొదటిది ఎమ్.ఏ మొదటి సంవత్సరంలో ఉండగా, రెండవది పి.హెచ్.డి. రెండవ సంవత్సరంలో చెప్తాను. విను.
* * * * * * *
సమీర ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఎమ్.ఏలో చేరింది. చరిత్ర చదవడం అంటే ఆమెకెంతో ఇష్టం. పి.హెచ్.డి. చేసి, ఉద్యోగం, సంపాదించుకుని, చరిత్ర పాఠాలు చెప్పుకుంటూ జీవించాలని కోరుకుంది. క్లాసు ఎప్పుడు మిస్ అవ్వకుండా, ల్బెబ్రరీలో శ్రద్దగా చదువుకుంటూ ఉండేది. చరిత్ర విభాగంలో ఒక పేపరు చెప్పే ప్రొఫెసర్ నారాయణగారు బాగా దగ్గరయ్యారు. వీలున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లడం, చర్చలు జరపడం, ఏమన్న సందేహలుంటే తీర్చుకోవడం చేసేది. ఆయన తన తండ్రికంటే బహుశ ఏడెనిమిదేళ్లు చిన్నకావచ్చు. ఆయన్ని ఎంతో గౌరవభావంతో చూసేది. చరిత్రపట్ల ఆయనకున్న ఆసక్తి, తెలివి ఆమెని ఆశ్చర్యపరిచేవి. ఆయన కూడా కాంపస్‌లో ఉన్న ప్రొఫెసర్ క్వార్టర్స్‌లో ఉండేవాడు.
ఒక రోజు సమీర లైబ్రరీనుండి ఎనిమిదింటికి హాస్టల్‌కి పోయే దారిలో నారాయణగారు కనపడ్డారు. పిచ్చాపాటి మాట తర్వాత ఆయన ‘‘సమీరా! రేపు రాత్రి డిన్నర్‌కి మా ఇంటికిరా! ఇంకా చాలా విషయాలు చర్చిద్దాం !’’ అన్నారు.
‘‘అలాగే సర్. ఎన్నింటికి రానూ?’’ అన్నారు.
‘‘ఎనిమిదిన్నరకి రా!’’ అన్నారాయన. సరేనని సెలవు తీసుకుంది.
మరుసటి రోజు ఎనిమిదిన్నరకల్లా ఆయనింటికి వెళ్లింది. కాలింగ్ బెల్ నొక్కింది. ఆయనే వచ్చి తలుపు తీశారు. లోపల డ్రాయింగ్ రూమ్‌కు వెళ్లి కూర్చుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆయన తప్ప ఎవరు ఉన్నట్లు లేదు.
‘‘మేడమ్ గారు లేరాండి?’’ అని అడిగింది.
‘‘లేరు. ఆమె, పిల్లలు ఊరెళ్లారు. పదిరోజుల వరకు రారు’’ అన్నారాయన.
‘‘వాళ్లు లేనప్పుడు తననొక్క దాన్ని డిన్నర్‌కి పిలవడం ఏమిటి?” అన్న ఆలోచన వచ్చినా, అనవసరంగా అనుమానపడ్తున్నానేమో ? ఆయన చాలా మంచివారు అని సమాధాన పడింది.
‘‘ముందు భోం చేద్దాం’’ అని ఆయన అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దసాగారు. సమీర కూడా లేచి సహాయం చేసింది.
‘‘వంటమనిషికి చెప్పి నీకోసం మంచి వంటకాలు చేయించాను తెలుసా?’’ అన్నారు. సమీర కృతజ్ఞతా పుర్వకంగా నవ్వింది.
కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు భోంచేశారు. మళ్లీ పాత్రలన్నీ వంటింట్లో పెట్టడానికి సహాయం చేసింది. ఆఖరిలో డైనింగ్ టేబుల్ కుర్చీలు సర్దసాగింది.
ఆమెనే గమనిస్తున్న ఆయన హఠాత్తుగా దగ్గరికి వచ్చి, ‘‘నువ్వెంత అందంగా ఉంటావో నీకు తెలుసా? ఏది ఒక సారి ముద్దు పెట్టుకోనివ్వు’’ అని ఆమెని గట్టిగా పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు.
రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనకి ఆమె బిక్క చచ్చిపోయి ‘‘సర్, సర్, ఏమిటిది? ప్లీజ్ వదలండి’’ అంది.
‘‘వదడానికే పిలిచానా నిన్ను?’’ అని ఆమె ముఖం మీదికి ఒంగాడాయన.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ‘‘ఛ! ఇప్పుడెవరొచ్చారు?’’ ఆమెని వదలలేక వదిలి తలుపు తీయడానికి డ్రాయింగ్ రూములోకి వెళ్లారు. వచ్చింది ఆయన దగ్గర పి.హెచ్.డి చేసే విద్యార్థి అని అర్థం అయింది సమీరకు. వాళ్లిద్దరూ ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. బిగుసుకుపోయిన సమీర తేరుకుంది. ఒక్కసారిగా వాస్తవం గుర్తుకొచ్చింది. ఆ అవకాశాన్ని వదులుకోకుండా పరుగులాంటి నడకతో డ్రాయింగ్ రూములో వాళ్లిద్దర్ని దాటుకుని తలుపు తీసుకుని బయటపడింది. ఇక వెనక్కి చూడకుండా వాయువేగంతో హస్టల్రూమ్లో పడింది. వేగంగా కొట్టుకుంటున్న గుండె నెమ్మది పడేవరకు కూర్చుండి పోయింది.
‘‘ఎంత పని జరిగింది?! ఆ స్టూడెంట్ భగవంతుడిలా రాకపోతే ఏమయ్యేది? ముద్దుతో ఆగేదా ఆయన వ్యవహరం? ఇంకా చొరవ తీసుకునుంటే? అసలు తనకి బుద్దిలేదు. పిలవంగానే వెళ్లడమేనా? ఇక జన్మలో ఎవరినీ నమ్మకూడదు’’ అనుకుంది.
సమీర ఆ సంఘటనని మనస్సులోనే దాచుకుని చాలా రోజులు బాధపడిరది. ఆ తర్వాత నారాయణగారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఎక్కడైనా అనుకోకుండా కనపడితే ముఖం తిప్పుకుని వెళ్లి పోయేది. అదృష్టవశాత్తూ కోర్సు చివరిలో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత పరీక్షలొచ్చాయి. ఆయన పేపరు బాగానే వ్రాసింది. అయిన మిగతా పేపర్స్‌లో మంచి మార్కులొచ్చాయి గాని, ఆయన పేపర్లో బొటాబొటిగా పాస్ అయింది. ‘‘పోనీలే ఇంతటితో పీడవదిలిపోయింది” అని తనని తాను ఓదార్చుకుంది.
సమీర మంచి మార్కుతో ఎమ్.ఏ. పాసయింది. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరాలు ఎమ్.ఫిల్ చేసి చివరికి పి.హెచ్.డిలో జాయిన్ అయింది. ఆమె రెండో సంవత్సరంలో ఉండగా ఎమ్.ఏలో చేరిన చాలా మంది జూనియర్స్తో పరిచయం అయింది. వారిలో అవినాశ్ అనే అతనితో ఎక్కువ స్నేహం ఏర్పడింది. అతనికి కూడా చరిత్ర చదవడం అంటే ఎంతో ఆసక్తి. ఎమ్.ఏ అయిన తర్వాత కాంపిటెటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్లకుండ పి.హెచ్.డి చెయ్యాలని, సమీరే తనకు ఆదర్శం అని అంటూ ఉండేవారు. తన జూనియర్ అయిన అతనికి సమీర సహాయం చేస్తూ ఉండేది.
ఒక రోజు ఆమె, ఆమె సహా విదార్థి కరుణ సినిమా చూసి హస్టల్‌కి వెడుతుంటే దారిలో అవినాశ్ కలిశాడు. మాట్లాడుకుంటూ వెడుతుంటే ముందుగా అవినాశ్ ఉండే హస్టల్ వచ్చింది. అవినాశ్ వాళ్లిద్దర్ని కాఫీకి ఆహ్వనించాడు. తను చాలా బాగా కాఫీ చేస్తానని అందరూ అతన్ని తెగ మెచ్చుకుంటారిని, రుచి చూసి చెప్పాలని ఇద్దర్ని బవంత పెటాడు. అవినాశ్ కాఫి పెడుతుంటే కరుణకి ఫోను వచ్చింది. ఫోనులో మాట్లాడిన తర్వాత కరుణ కంగారు పడిరది. ‘‘ఏమయిందని?’’ అడిగితే నాకు టెలిగ్రామ్ వచ్చిందట ఇంటిదగ్గరనుంచి! నా సెల్‌కి ఫోను చెయ్యకుండా టెలిగ్రామ్ పంపించడం ఏమిటి? నేను వెడతాను. నువ్వు కాఫీ తాగేసిరా! అని హడావిడిగా వెళ్లిపోయింది.
అవినాశ్ ఇచ్చిన కాఫీ కబుర్లు చెప్పుకుంటూ పూర్తి చేశారు. ఆ తర్వాత అవినాశ్ తన ఫోటో ఆ్బమ్ చూపించాడు. తను చూస్తుంటే, ఫోటోల్లోని తన కుటుంబ సభ్యులని, స్నేహితులని పరిచయం చెయ్యాలన్న నెపంతో పక్కకి వచ్చి కూర్చొని చెప్పసాగాడు. అతను అంత దగ్గరగా కూర్చోవడం నచ్చలేదు. ఇక తొందరగా పోదామనుకుని ఆల్బమ్‌ని త్వరగా తిప్పసాగింది. ఇంతలో హఠాత్తుగా తన ఒడిలోని ఆల్బమ్‌ని పక్కకి పెట్టి, తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అవినాశ్. సమీర ‘‘వద్దు ! వద్దు ’’ అంటున్నా వినిపించుకోకుండా ‘‘నువ్వంటే నాకెంతో ఇష్టం సమీరా! నీకు కూడా నేనంటే ఇష్టమేగా? అందుకే నాకెంతో సహాయం చేస్తున్నావ్ ఐ లవ్ యు’’ అని ఇంకా దగ్గరికి లాక్కోబోయాడు. సమీరకి జుగప్స కలిగి ఒక ఊపుతో అతన్ని తోసి లేచి నిబడింది.
అవినాశ్! నీ పరిధిలో నువ్వుండు! నీ సీనియర్ని అన్నా కూడా నీకు గుర్తుకు రాలేదా? అడుగు ముందుకు వేస్తే పెద్గగా అరచి గొడవ చేస్తాను. మర్యాదగా నన్ను పోనివ్వు’’ అని తలుపు దగ్గరికి వెళ్లి, ఒక్కసారి వెనక్కి తిరిగి నిప్పులు గక్కే కళ్లతో ‘‘ఐ హేట్ యు’’ అని విసురుగా తలుపు తీసుకుని వెళ్లి పోయింది.
ఆ సంఘటన జరిగిన చాలా రోజుల వరకు సమీర మనిషి కాలేక పోయింది. ఎవరికీ చెప్పకుండా తన మనస్సులోనే దాచుకుని వ్యధపడిరది. ఆ తర్వాత అవినాశ్‌తో మాట్లాడలేదు. ఒకటి రెండు సార్లు అవినాశ్ ‘సారీ’ చెప్పబోతే వినిపించుకోనట్లు వెళ్లిపోయింది. అతని మొఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. సంవత్సరం తర్వాత అతను ఎమ్.ఏ. పూర్తి చేసి పి.హెచ్.డి. చెయ్యడానికి అమెరికా వెళ్లాడని తెలుసుకుని ‘‘అమ్మయ్య! ఇక ఆ దరిద్రపు ముఖం కనబడదని’’ ఊపిరి పీల్చుకుంది.
* * * * * * *
సమీర చెప్పడం ముగించగానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆర్ధ్రతతో ‘‘ఇన్నాళ్ళు నీ మనస్సులోనే దాచుకుని బాధపడ్డావా? నా కెందుకు చెప్పలేదు? ధైర్యం చేసి వాళ్ళిద్దరి గుట్టు బయటపెట్టలేక పోయావా?” అంది స్వాతి.
‘‘ధైర్యం చెయ్యలేక పోయాను. అదే నేను చేసిన తప్పు! మనం ఇలా ఉండబట్టే, ఇటువంటి సంఘటనలు జరగడం ఎక్కువయింది. నీ విషయంలో మాత్రం మనం మెదలకుండా ఉండొద్దు! ఆ కిరణ్‌కు శిక్ష పడేంత వరకు వదలొద్దు!’’ అంది సమీర.
కొన్ని రోజు గడిచాయి.
ఒక రోజు లాబ్ నుంచి దిగులుగా వచ్చింది స్వాతి “ ఏమయింది” అని అడిగింది సమీర.
‘‘ఆ కిరణ్ గాడు యథాలాపంగానే లాబ్‌కి వస్తున్నాడు. వాడిమీద ఏ చర్య తీసుకున్నట్లు అనిపించడంలేదు. ఎవరూ లేకుండా చూసి వెకిలిగా నవ్వి, కన్నుగొడుతున్నాడు. దుగుల్బాజి వెధవ! ఇన్నాళ్లు ఓపిక పట్టాను. ఇక లాభంలేదు. ఇంకోసారి మధుసూధన్ గారిని కలుద్దాం పద’’ అంది స్వాతి.
సరేనంది సమీర. మరునాడు ఇద్దరూ మధుసూధన్ గారిని కలిశారు. ఆయన బాధగా ‘‘అమ్మా! నేనెన్నో విధాలుగా ప్రయత్నించాను. వాడు డీన్ ప్రభాకర్‌రావు గారి బంధువట! ఆయన ద్వారానే ఈ ఉద్యోగంలో చేరాడట! ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పిద్దాం! పిల్లలు గలవాడిని ఉద్యోగం నుంచి తీసివెయ్యడం ధర్మం కాదు అంటున్నాడాయన’’ అన్నారు.
ముఖాలు చిన్న బుచ్చుకుని, నిస్సహాయంగా హస్టల్‌కి తిరిగి వచ్చారు. గదిలోకి వచ్చిందగ్గరి నుంచి సమీర మౌనంగా దీర్ఘాలోచనలో పడట్టు కూర్చుంది.
కాసేపటికి ‘‘స్వాతి! మనం ఒక పని చేద్దాం, నా ఫ్రెండ్ అన్నయ్య జర్నలిస్టు. చాలా మంచి ఆశయాలు కలవాడట! ఎవరికి అన్యాయం జరిగినా సహించడట! అతన్ని కలిస్తే ప్రయోజనం ఉండోచ్చు’’ అంది.
స్వాతి ముందు సందేహించినా, తర్వాత ఒప్పుకుంది. ఇద్దరు చిత్ర ద్వారా ఆమె అన్నయ్య సూర్యాని కుసుకున్నారు. అతను ఒక ప్రముఖ దిన పత్రికలో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. వీళ్లు చెప్పిందంతా విని కొన్ని ప్రశ్నలడిగి వాళ్లిచ్చిన సమాధానతో సంతృప్తి పడి, ‘‘మీరు నిరాశ పడొద్దు. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేవరకు నేను మీకు సహాయం చేస్తాను. ముందు వార్త మా దిన పత్రికలో వచ్చేలా చూస్తాను’’ అన్నాడు.
మరునాడు ప్రముఖ దిన పత్రికలో అన్ని వివరాలతో ఈ వార్త చదివి యూనివర్సిటీ విద్యార్థులు కోపంతో ఉడికి పోయారు. కిరణ్‌కుమార్‌ని ఉద్యోగంనుంచి తీసేసేలా చూడాని అందరూ పట్టు పట్టారు. క్లాసుకి పోకుండా ఊరేగింపు, ధర్నాలు చెయ్యడం మొదయింది. ఆడపిల్లలు వేరుగా వైస్చాన్సర్ని కలుసుకుని న్యాయం జరగాలని అర్జీపెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థలను సమర్థిస్తూ యూనివర్సిటీ వార్తలు అన్ని ప్రముఖ దిన పత్రికల్లో ప్రచురణమవసాగాయి.
విద్యార్థు పట్టువిడవకుండా ఆందోళన కొనసాగించడం యూనివర్సిటీ అధికాయి ఏ చర్యా తీసుకోవడం లేదన్న పత్రిక అభియోగం చూసి వైస్చాన్సర్, డీన్‌ని కలుసుకుని కిరణ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చెయ్యవలిసిందిగా కోరారు. ఆ మరునాడు కిరణ్‌కుమార్ ఉద్యోగం నుంచి డిస్మిస్ చెయ్యబడ్డాడు. వీలయినంత త్వరలో తన క్వార్టరు ఖాళీ చెయ్యమన్న ఆర్డర్ కూడా పాస్ అయింది. విద్యార్థు తమ ఆందోళన విరమించారు. సమీర, స్వాతి ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. తమకి న్యాయం జరిగిందని తృప్తిపడ్డారు. మరునాడు తమకెంతో అండగా నిబడిన సూర్యకి ధన్యావాదాలు చెప్పుకున్నారు.
Jan 2021
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు