కథలు

(April,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

డప్పోడు

‘‘చంద్రక్కా తయారైనవా? యాల్లయితాంది’ అంటూ కోటేశం కేకేసిండు.

చంద్రమ్మ గబగబ అన్నము సద్దికట్టుకుంటుంటే కోటేశం కేక వినపడ్డది.  ‘‘అయిపోయింది తమ్మి వస్తున్నా’’ అంటూ బదులు పలికి కొడుకును ఉద్దేశించి ‘‘బిడ్డా అన్నము వండి పెట్టిన,  కూర కూడా అక్కడే ఉంది,  మంచిగ తిని బడికి పో’’ అంటూ మరోసారి హెచ్చరించింది.

చంద్రమ్మ కొడుకు సుధీర్ కు ఎనిమిదేండ్లు.  పండ్లు తోముకుంటూ ‘అ అ’ అంటూ బదులిచ్చిండు.

కొడుకును చూసి చంద్రమ్మ మనసు తరుక్కుపోయింది.  సరిగా తిండి తినక బక్క చిక్కినట్టు అన్పించి మనసు చివుక్కుమన్నది.  ఇంటి పట్టున ఉండి వాడి ఆలనాపాలన చూసుకునే అవకాశము లేకుండా పోయింది కదా?  అనే దిగులు కమ్మింది.  ఆ ఆలోచన రాగానే ఆమే భర్త రాయలింగు గుర్తుకు వచ్చి మనసంతా భారమై పోయింది,  అప్రయత్నంగానే ఆమె దఋష్టి గోడకున్న మేకుకు తగిలించిన డప్పు మీదికి మళ్లింది.  కళ్ళలో నీళ్ళూరినాయి. 

ఆలోచనలను బలవంతంగా మళ్ళించుకొని గబగబ రోడ్డు మీదికి వచ్చింది.  అప్పటికే చాలా మంది కూలీలు కాడికి పోడటానికి బయలుదేరుతున్నారు.

విచారం కమ్మిన చంద్రమ్మ ముఖం చూసి కోటేశం ‘‘ ఏం అక్కా, ప్రాణము బాగా లేదా? అంత ఎట్టనో ఉన్నవు?’’ అంటూ అడిగిండు.

‘‘అదేం లేదు తమ్మి బాగానే ఉన్నా’’ అంటే దాట వేసింది.

కోటేశంకు ఆ సమాధానం సంతృప్తి  ఇచ్చినట్టు లేదు. ‘‘రాయలింగు బావే ఉంటే నీకు ఈ బాదుండేది కాదు కదా’’ అన్నాడు యధాలాపంగా.

ఆ మాట చంద్రమ్మను మరింత గాయ పరిచింది.  ఆమె ఆలోచనలు భర్త రాయలింగును చుట్టుముట్టినవి. తన బ్రతుకెందుకు ఇంత అర్దాంతరంగా ఆగమై పోయింది.  తను ఏ పాపం చేసానని ఇన్ని కష్టాలు.  ‘‘తనను ఎంతగా ప్రేమించేవాడు....తనకేదన్నా అయితే ఎంతగా విలవిలలాడేవాడు.  సుధీర్‍ కడుపులో పడ్డ కానుంచి యాడాది పిల్లవాడు అయ్యేదాక ఇంట్లో కూడా తనతో ఏ పని చేయనిచ్చేవాడు కాదు.  ఇంట్లో అన్ని పనుల్లో వేలు పెట్టి ఎంత హంగామా చేసేవాడు.’’

ఎంత మెత్తటి హృదయమతనిది.  వాడ కట్టున ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరి కంటే ముందుండే వాడు. దాంతో అతను అందరి నోట్లో నాలుక అయిపోయిండు.  దానికి తోడు అతను డప్పు వాయిస్తుంటే ఎంతటి వాళ్ళయినా తలలు ఊపవలసిందే.

మొదటిసారి ఎప్పుడు అతన్ని చూసింది తమ ఊరైన కొత్తపేటలో బద్ది పోషమ్మ జాతరప్పుడు భజన గీతాలు పాడుకుంటూ ఊరేగింపు బయలుదేరినప్పుడు అతని డప్పు చప్పుడు అందర్ని ఆకర్షించినట్టే ఆమెను ఆకర్షించింది.

డప్పు వాయిస్తూ అతను సమస్త లోకాన్ని మరిచిపోయేవాడు.  అతని సర్వశక్తులు ఎడమ చేతిలో ఒదిపి పట్టుకున్నా డప్పులో ఇమిడిపోయినట్టుగా, కుడి చేతి వేళ్ళు  లయబద్దంగా నిలువు గుడ్లు వేసుకొని తన్మయత్వంతో అందరు మునిగిపోయేవాళ్ళు.

ఎలా అచ్చింది ఆ అద్భుత నైపుణ్యం.

పెండ్లి చూపుల్లో మొదటిసారిగా అతన్ని చూసినప్పుడు అద్భుత కళాకారుడు తన వాడు కాబోతున్నందుకు ఎంత తన్మయత్వము చెందింది.

ఊళ్ళో బ్రతుకు ఎల్లక పట్నం రావడం బ్రతుకు తెరువు కోసము ఇద్దరు ఉప్పరి కూలీలుగా మారడం జరిగిపోయింది,  సుధీర్‍ కడుపులో పడ్డ తరువాత బలవంతంగా రాయలింగు, చంద్రమ్మకు కూలి మాన్పించిండు.  నేను ఉన్నాను కదా ? ఇప్పుడు నీ పనల్లా పుట్టబోయే బిడ్డను చూసుకోవడమే అంటూ ఎంతో మురిపంగా నవ్వేవాడు.

అలా కూలీ పని మానుకున్న చంద్రమ్మ భర్త అర్ధంతరంగా జరిగిపోయే సరికి బ్రతుకు దెరువు కోసం మళ్ళి కూలీ పని తప్పలేదు.

ఆ రోజు అతను చనిపోవటానికి ముందు రోజు రైల్వే స్టేషన్‍కు వెళ్ళే రోడ్డు మీద తీవ్రమైన గాయాలతో స్పృహలేని స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు వేలాది జనం మధ్య దూరిపోయి అతన్ని ఆ స్థితిలో చూసి స్పృహ  తప్పి పడిపోయింది.

ఊరేగింపుగా కదిలిన జనం...కొన ఊపిరితో ఉన్న అతన్ని హాస్పిటల్లో జాయిన్‍ చేసారు.  కాని ఫలితం దక్కలేదు.  మరునాడు అతను శాశ్వతంగా ఈ లోకం విడిచిపోయిండు.

ఎందుకు జరిగింది.  ఎలా జరిగింది ఇప్పటికీ అర్థం కాకుండా పోయింది.  హంతకులు ఎవరు ఇంతవరకు పట్టుపడలేదు.  ప్రజా కళాకారుని హత్యపై న్యాయవిచారణ జరుపాలని ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించగా నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టుగా పోలీసులు విచారణ ఆరంభించినా....మూడేండ్లుగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది.

‘‘అసలు హంతకులే వాళ్ళు అయినప్పుడు ఇక విచారణ ఏముంటుంది?’’ అన్నారు కొందరు.

రాయలింగు పట్నం వచ్చి కూలీ పనికి వచ్చిన కోత్తలోనే బిల్డింగు పనులు చేసే కూలీలు జీతాల పెంపుదలకై జరిగిన సమ్మె సందర్భంలో జరిగిన మీటింగులో సంఘపొల్లు  పాడిన పాటలకు డప్పు వాయించటంతో అతను మరోసారి అందరి దఋష్టిలో పడ్డాడు.

అలా మొదలయిన అతని ప్రస్థానం  మళ్ళీ  వెనక్కి తిరిగి చూడలేదు.

సంఘపోల్ల మీటింగు ఎక్కడ జరిగిన రాయలింగు తప్పకుండా అక్కడ హాజరు కావాల్సిందే.  మీటింగు ఆరంభమైనప్పుడు మొదలు మీటింగు చివరి వరకు మనిషిలో ఏ విధమైన విసుగు కాని అలిష్ట కాని కనిపించేది కాదు.  ఏదో అభూత శక్తి ఆవరించినట్టుగా పాటకు అనుగుణంగా అతని చేతులు ఆడేవి.

సంఘం మీటింగు అంటే పీడిత తాడిత జనం తండోపతండాలుగా వచ్చేవాళ్ళు.  వాళ్ళ  పాటలు ఈటల్లా చొచ్చుకపోయేవి.  సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని దోపిడీని చీల్చి చెండాడి. దోపిడీ అంతము చేయటానికి నడుము బిగించాలనే సందేశముతోనే ప్రతిపాట ముగిసేది.

సహజంగానే వాళ్ళ  పాటలు, దోపిడీదారులకు కంటగింపు కల్గించేవి.  హోరెత్తే జనం పోరుకు ఆ పాటలు వంతపాడేవి.  వారిని కార్యోన్ముఖులను చేసేవి.  ఈ పరిణామం సహజంగానే పాలక వర్గాలకు మింగుడు పడలేదు.  తమ దోపిడీని, అన్యాయాన్ని ప్రశ్నించేవారిని, వాటికి వ్యతిరేకంగా పోరాడేవారిని అణిచివేయాలని చూసినట్టుగానే, ఆ పోరాటానికి ఊతాన్నిచ్చే, నైతిక మద్దతును ప్రకటించే కళాకారులన్నా పాలకవర్గాలకు కంటగింపుగానే మారింది.

కళాకారులపై అక్రమ అరెస్టు చిత్ర హింసలు, భౌతిక దాడులు నిత్యకఋత్యమైన చోట  సహజంగానే రాయలింగుకు కష్టాల పరంపర మొదలయింది.

మొదటిసారిగా ఇంటిమీద దాడి జరిగినప్పుడు, ఎంతగా హైరాన పడ్డది అటు తరువాత అటువంటి సంఘటనలు జీవితంలో భాగమై పోయింది.  అయినా అతనిలో మార్పేమి రాలేదు.  సరికదా మరింత పట్టుదలతో ఇదంగా మామూలే అన్న ధోరణిలో అతనుండేవాడు.

‘‘ఎందుకు భయపడటము.  భయపడటానికి మనకు మిగిలిందేమిటీ చస్తామనే కదా.... అసలు మనల్ని బ్రతకనిస్తున్నది ఎక్కడ’’ అనేవాడు  ఏదౌతుందోనని భయపడిందో అదే జరిగింది.

‘‘అక్కా జాగ్రత్తగా నడువు పడిపోతావు’’ అంటూ కోటేశం జబ్బ పట్టి ప్రక్కకు లాగిండు.  లేకుంటే మురికి కాల్వలోకి పడిపోయేది.

మెయిన్‍ బజార్లో కాస్త ఖాళీగున్న చోట వేలాది మంది కూలీలు జమైండ్లు.  అందులో కొద్దిమందికే కూలీ దొరుకుతుంది.  మిగితతా వాళ్ళు ఉస్సురోమంటూ  తిరిగి పోవాల్సి వస్తుంది.  మనుషుల స్థానములో మిషన్లు వచ్చిన తరువాత పనులు కరువై పోయినవి.  దాంతో పనుల కోసము కూలీల మధ్య పోటీ పెరిగింది.  ముసలి ముతక కూలీలకు కూలీ దొరకటం కష్టమై పోయింది.  కంట్రాక్టర్లు నజరుగా కనిపించే వారిని యువకులను ఏరుకొని మాత్రమే పనులకు పిలుస్తున్నారు.  ఈ పోటీవల్ల, పనుల లేమి వల్ల వారితోని గతంలో కంటే ఎక్కువ గొడ్డు చాకిరి చేయించుకుంటాండ్లు.  అయినా మారుమాట మాట్లడని పరిస్థితి  వచ్చింది.

చంద్రమ్మ ముందుకొస్తుంటే ‘‘గా ఆడామే ఎందుకు?’’అంటూ కంట్రాక్టరు అడ్డుచెప్పిండు.

‘‘లేదు సారు మంచిగ పన్జెస్తది’’ మేస్త్రీ రాజీరు కంట్రాక్టరుకు సర్దిచెప్పిండు.

కంట్రాక్టరు అయిష్టంగా తలూపిండు,

రాయలింగు, రాజీరు చాలా ఏండ్లు కలిసి పనిచేసిండ్లు.  రాయలింగు పట్ట తోటి కార్మికులకు ప్రేమ ఆరాధన భావముండేది.  ఆ అభిమానమే చంద్రమ్మకు ఇంకా పని దొరికేలా చేస్తుంది.

రోజు కూలీ దొరకక తిండికి కటకటలాడుతూ పిల్లలకు కూడా కడుపు నిండా పెట్టలేని కూలీలు నిస్సహాయంగా విలవిలలాడుతున్నారు.

‘‘అక్కా సామాన్లు పట్టుకొని మనోళ్ళతోని పో’’ రాజీరు అనునయంగా అన్నాడు.  కాస్త ఆలస్యం అయితే కంట్రాక్టరు మనసు ఎక్కడ మారుతుందో ఏమోనని ఆయన భయం ఆయనది.

తట్టా చుట్ట బట్ట పట్టుకొని కూలీల గుంపులో కలిసింది.  కంట్రాక్టరు వాళ్ళందర్ని తోలుకొని మార్కెటు రోడ్డులో నిర్మిస్తున్న కొత్త అపార్టుమెంటుకు స్లాబింగు జరుగుతుంది.  కూలీలందర్ని అక్కడికి తరలించిండ్లు.

స్లాబింగు పనంటే నిముషం రికాము లేకుండా కూలీలు యంత్రల్లా పని చేయాలి.  క్షణం అలస్యం అయితే కంట్రాక్టరు కాదు తోటి కూలే చిర్రుబుర్రులాడే స్థితి.

పని ముసిగే సమయానికి ప్రాణం ఉతికి ఆరేసినట్టు అయిపోతది.  ప్రాణమంతా సొడసొడలు అయిపోతది.

పనైపోగానే చంద్రమ్మకు ఇంటిమీద జ్యాస పోయింది,  ‘‘పొల్లగాడు ఎట్లున్నడో ఏమో, తిన్నడో తినలేదో...’’ తల్లిప్రాణం తల్లడిల్లగా ఏగిరంగా ఇంటి దారి పట్టింది.

ఇంటిరి సమీపిస్తున్న కొద్దీ లీలగా డప్పుమోత.  తానేం కలకనటం లేదు కదా!  అచ్చంగా ఆయన వ్రేళ్ళు  డప్పు మీద కదలాడినప్పుడు వచ్చే హృద్యమైన చప్పుడు? అంతా భ్రాంతా? ఒకటి రెండు సార్లు చెవులు రిక్కించింది.  నిజమే అబద్ద కాదు అది తానుండే గుడిసే నుండి వస్తున్నట్టుగా వినిపించింది.  అయినా నమ్మకం కల్గటం లేదు.  తాను నిజంగా కల కంటున్నదేమో? కాళ్ళు అప్రయత్నంగానే ఇంటి వైపు పరుగు పెడుతున్నాయి,  గుండే గొంతుకలోనతరట్లాడే ఆవేదనలు.

గుడిసె ముందు అరుగు కొసన అచ్చంగా ఆయన కూచున్నట్టుగానే కూచున్న కొడుకు సుధీర్‍ చేతిలో చిలకొయ్యలు ఆయన గుర్తుగా వ్రేలాడే డప్పు దాని మీద సుతిమెత్తగా కదలాడే చిన్న చేతులు.

అది చూసే సరికి ఒక్కసారిగా ఆమె మనసులో భయం, ఆనందం కలగలిసి పోయింది.  అప్రయత్నంగానే కళ్ళలో నీళ్ళు ఉబికాయి.

వారసత్వంగా కొడుక్కి  అచ్చిన కళ గురించిన ఆనందమో లేక కళ ప్రజల కోసమే అని నమ్మిన ఆయన వారసత్వము కొడుక్కి అబ్బకుండా పోతుందా అన్న ఆందోళనో కాని ఆమె కండ్ల వెంట ధారాపాతంగా కన్నీళ్ళు  ఉబికసాగాయి.

అమ్మను చూసిన సుధీర్   కొడ్తున్న డప్పు ఆపి అచ్చంగా ఆయన  చూసినట్టుగా నిర్మలంగా కండ్లు చికిలించి చిర్నవ్వు చిందిస్తున్న కొడుకును ఆబగా రెండు చేతులతో ఎత్తుకొని గుండెలకు అదుముకొన్నది.

ఆమె కండ్లు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.

అది దు:ఖమో ఆనందమో ఆమెకు కూడా అర్థం  కాని స్థితిలో....


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు