కథలు

(May,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

కోకిలవాణిని ఎవరికీ గుర్తుండదు
 

తానొక ప్రధానమైన వార్తగా మారుతానని కోకిలవాణి ఏనాడూ అనుకోలేదు. కానీ అదే జరిగింది. ఆ వార్త వెలువడ్డ రోజు సెప్టెంబర్‍ 20, ఆదివారం, 1998. అప్పుడు ఆమె వయస్సు ఇరవైమూడేళ్లు.

          కోకిలవాణిని ఇప్పుడు ఎవరికీ గుర్తుండదు. ఒకవేళ మీరు రోజూ వార్తాపత్రికను తప్పక  చదివేవాళ్లయితే మీ జ్ఞాపకాలలో ఏదో ఒక మూలన ఆమె పేరు ముద్రింపబడి ఉండొచ్చు. కానీ రోజూవారి వార్తలను ఎవరు గుర్తుంచుకుంటున్నారు? అవి రోడ్డు ప్రమాదాలను కూడా ఆసక్తికరమైన సంఘటనలుగా మార్చేస్తున్నాయి. రక్తపు మరకలు లేని వార్తాపత్రికలే లేవు.

          ప్రమాదంలో మరణించిన వాళ్ల ఫోటోలను వార్తాపత్రికలు ఎందుకు అంతంత పెద్దవిగా ప్రచురిస్తున్నాయి? దాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడుతున్నారు. మనిషి, ఒకవేళ హింస యొక్క వికృత రూపాన్ని మనం లోలోపల ఇష్టపడుతున్నామా? కోకిలవాణిని ప్రధాన వార్తగా చేయటానికి మనం కారణం కాదని పక్కకు తప్పుకోవటానికి వీలులేదు. ఆమె మనల్ని నేరస్థులని చెప్పటం లేదు. కానీ ఆమె మనల్ని చూసి భయపడుతోంది. మనల్నందరినీ వదిలి దూరంగా ఉంటోంది.

          ఇవ్వాల్టికీ ఆమె పాదాలు రోడ్డుమీద నడవటానికి భయపడుతున్నాయి. చేతులు తనకు తెలియకనే వణుకుతున్నాయి. ఎవరైనా దగ్గరికి రావటాన్ని చూడగానే కళ్లు గాల్లో ఊగిసలాడే దీపం జ్యోతిలా రెపరెపలాడుతున్నాయి. అంతెందుకు, ఆమెకు నిద్రలో కూడా ప్రశాంతత లేదు. క్రూరమైన కలల వల్ల కెవ్వుమని కేకలు వేస్తోంది.

          ఆమె స్వేచ్ఛగా తిరుగాడిన ప్రపంచం ఒక్కరోజులో ఆమెనుండి దాన్ని లాక్కొని విసిరివేయబడ్డది. స్నేహితురాళ్లు, కుటుంబం, చదువు, ఉద్యోగం...అన్నీ ఆమెనుండి దూరమైపోయాయి. ఆయింటుమెంట్లూ, డజన్ల కొద్దీ మాత్రలూ, వ్రణచికిత్సా ఆమె రోజువారీ లోకమైపోయింది. ఏడ్చి ఏడ్చి నీరసించి ఒరిగిపోయింది. ఎన్నో సందర్భాలలో తనను టాయిలెట్‍ గది మూలలో విసిరి పారేసిన సగం కాలిన అగ్గిపుల్లలా గ్రహించింది.

          ఒక సంభవం అని తేలికగా వార్తాపత్రికలలో వివరించబడ్డ ఆ హృదయ విదారకమైన సంఘటన... ఇలాగే వార్తాపత్రికలలో వివరించటం జరిగింది.

          చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే కోకిలవాణి అన్న 23 ఏళ్ల యువతిమీద దురై అన్న యువకుడు ఆసిడ్‍ పోశాడు. దీనికి సంబంధించి గిండి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

          విచారణలో... దురై అన్న వ్యక్తి కోకిలవాణిని తానుగా ప్రేమిస్తూ వచ్చాడు. కానీ కోకిలవాణి, మహేష్‍ అన్న కాలేజీ స్టూడెంట్‍ను ప్రేమిస్తున్నది.

          తన ప్రేమను అంగీకరించకపోతే ఆసిడ్‍ పోస్తానని కోకిలవాణిని దురై చాలాసార్లు హెచ్చరించాడు. కానీ దురై ప్రేమను ఆమె అంగీకరించలేదు. దాంతో ఆవేశపడ్డ దురై తన స్నేహితులైన హరికృష్ణ, సంజయ్‍ మొదలైనవాళ్లతో కలిసి మాట్లాడుకొని కోకిలవాణి ముఖంలో ఆసిడ్‍ పొయ్యటానికి తంబుచెట్టి వీథిలోని ఒక అంగట్లో ‘సల్ఫ్యూరిక్‍ ఆసిడ్‍’ ను కొన్నాడు. మరుసటిరోజు ఉదయం గిండి రైల్వేస్టేషన్‍కు వెళ్లే దార్లో కోకిలవాణిని అడ్డగించి ఆసిడ్‍ను పోసి దురై తప్పించుకు పారిపోయాడు.

          దాంతో కోకిలవాణి ముఖం కాలిపోయింది. సంఘటన జరిగిన చోటే కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయిన ఆమెను కొందరు ప్రజలు రక్షించి ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. 60 శాతం వరకూ ముఖం కాలిపోయిన ప్రమాదకరమైన స్థితిలో ఆమె చికిత్స పొందుతోంది. దురై మీద పోలీసులు కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నారు.

                                                          ()  ()  ()

         

          పదిహేనేళ్ల వయసులో ప్రేమించటం గురించిన ఊహలు కోకిలవాణిలో మొదలయ్యాయి. పాఠశాల సమయాలలో దాని గురించే ఆమె, స్నేహితులూ రహస్యంగా మాట్లాడుకునేవాళ్లు. ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మంచుగడ్డను అరచేతిలో పట్టుకున్నట్టుగా ఆమె ఒంట్లో ఏదో తెలియని గిలిగింతలు ఏర్పడటం గ్రహించింది.

          రోడ్డుమీద, ప్రయాణంలో, సామూహిక ప్రాంతాలలో కనబడే వయసుమీదున్న యువకులను చూస్తున్నప్పుడల్లా ఇందులో ఎవరు తనను ప్రేమించబోతున్నవాడు అని తహతహలాడేది. ఆమె ప్రేమించటం కోసం తపించింది. ఎవరి ద్వారానో ప్రేమించబడటానికి ఎదురుచూసింది. దాని గురించి తన నోటుపుస్తకంలో ఏవేవో రాతలు రాసిపెట్టేది. కవితలు కూడా రాసేది.

          ఆమెకు దివాకర్‍ అన్న పేరు బాగా నచ్చింది. ఇంతటికీ ఆ పేరుమీద ఉన్నవాళ్లెవరినీ ఆమెకు తెలియదు. కానీ ఎందుకో ఆ పేరంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ పేరుతో ఉన్న ఒక్క వ్యక్తినైనా ప్రేమించగలిగితే ఎంత బాగుంటుందో కదాని కూడా అనిపించేది. కానీ అలా జరుగుతుందా ఏం?

          ఆ పేరుతో తన పేరును జతచేసి దివాకర్‍ కోకిలవాణి అని రహస్యంగా రాసి చూసుకుంటూ మురిసిపోయేది. ఒకరోజు ఆమె స్నేహితురాలు ఇందిర, ‘‘ఎవరే ఆ దివాకర్‍?’’ అని అడిగినప్పుడు... ‘‘పక్కింట్లో ఉన్న కుర్రాడు. అతణ్ణి నేను లవ్‍ చేస్తున్నాను.’’ అని అబద్ధమాడింది.  

          ఆ అబద్ధాన్ని ఇందిర నమ్మటమేకాక  ఆ ప్రేమ ఎలా మొదలయ్యింది, ఎంత కాలంగా జరుగుతోంది అంటూ అడగటం మొదలుపెట్టింది. ఆమె కోసమే కోకిలవాణి ఎన్నెన్నో ఊహించుకుని దివాకర్‍ను గురించి కథలు కథలుగా చెబుతూ ఉండేది.

          వాటిని విన్నప్పటి నుండి ఇందిర కూడా తానెవరినైనా ప్రేమిస్తే బాగుణ్ణు అనుకుంది. కానీ ఎలా ప్రేమించాలి అని భయపడేది. వాళ్లు ట్యూషన్‍ చదువుకోవటానికి వెళ్లే ఇంట్లో ఉన్న మురళీతో ఇందిర జంకుతూ అతణ్ణి ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది. అతను, తానుకూడా ఆమెను ప్రేమిస్తున్నట్టుగా చెప్పి మేడమీది గదికి రమ్మన్నాడు.

          భయమూ, కుతూహలంతో మేడమీదికి వెళ్లిన ఇందిర అరిచి హడలెత్తిపోతూ క్రిందికి దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ‘‘ఏం జరిగిందే?’’ అని కోకిల అడగినా, ఇందిర బదులేమీ చెప్పలేదు. ఏడుస్తూ ఉండిపోయింది. బస్సులో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు,  ‘‘లవ్‍ చేస్తున్నానని చెప్పి కిస్‍ చేసి పెదాల్ని కొరికేశాడే. అసహ్యంగా ఉంది.’’ అని చెబుతూనే కన్నీళ్లు కార్చింది.

          కోకిలవాణికి అమ్మయ్య, మనం ఎవరినీ ప్రేమించలేదని అనుకుంది. మరుసటిరోజంతా ఇందిర లవ్‍ చెయ్యటం తప్పని చెబుతూనే ఉంది. లోలోపల దాన్ని అంగీకరించకపోయినప్పటికీ ఇందిర కోసం తానూ దివాకర్‍ను లవ్‍ చెయ్యటాన్ని మానేశానని చెప్పింది కోకిలవాణి. కానీ మనసులో... బలవంతంగా కిస్‍ చెయ్యని మంచి కుర్రాడిని చూసి లవ్‍ చెయ్యాలన్న ఆశ ఉంటూనే ఉండేది.

                                                          ()  ()  ()

         

          కోకిలవాణి ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు పెద్దమనిషైంది. పదవ తరగతితో చదువును ఆపేసి కొన్ని నెలలు దగ్గరలోనే ఉన్న ఎస్‍.టి.డి. బూత్‍లో పనిచేసింది. అక్కడికొచ్చే యువకులలో ఒక్కడు కూడా ఆమెను పట్టించుకోలేదు. జిడ్డు ముఖంతో, సన్నని శరీరంతో ఉండటం వల్లనే తానెవరికీ నచ్చలేదేమోనని అనుకునేది. ఆమెకు రెండే రెండు మంచి చుడీదార్లు ఉండేవి. దాన్నే మార్చి మార్చి వేసుకుని పనికి వెళ్లేది. జీతం డబ్బుతో పసుపూ చందనమూ కలిసిన టర్మరిక్‍ క్రీమ్‍ కొనుక్కుని ఒళ్లంతా రాసుకునేది. ఫెయిర్‍ అండ్‍ లవ్లీ ని కొని రహస్యంగా ఉపయోగించి చూసుకునేది. పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగి అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించేది. ఎలా చేసినప్పటికీ ఆమెమీద ఎవరికీ ఇష్టం ఏర్పడలేదు.

          ఎస్‍.టి.డి బూత్‍ నడిపే చొక్కనాథన్‍ రోజూ ఆమెను పంపించి సిగరెట్లు తెమ్మనేవాడు. ఆమె ఒక ఆడది అని కూడా పట్టించుకోకుండా ఫోన్లో పచ్చి బూతులు మాట్లాడుతూ ఉండేవాడు. తనను ఒక ఆడదానిగా కూడా అతను చూడటంలేదన్న అక్కసు కోకిలవాణికి చాలానే ఉంది.

          తనను అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎందుకు తనకు మాత్రం మెడ ఎముకలు ఇలా పొడుచుకొచ్చినట్టుంటాయి, దవడ ఇలా ఎందుకు కుంచించుకుపోయి ఉందని ఆత్రంగా వచ్చేది. తనను ఎలాగైనా అందంగా మలుచుకోవాలని కొత్తకొత్తగా వచ్చే సబ్బులు కొని వాడేది. తల వెంట్రుకలను చుట్టగా చుట్టుకునేలా ప్రయత్నించేది. మూడు నెలలు స్పోకెన్‍ ఇంగ్లీషు ట్రైనింగు క్లాసుకు కూడా వెళ్లింది. అయినా ఎవరూ ఆమెను ప్రేమించనే లేదు.

          అయితే ఒకరోజు ఒక కుర్రాడు బైక్‍లో ఒక యువతిని తన వెనక కూర్చోబెట్టుకుని సినిమా థియేటర్‍ వైపు వెళుతుంటే ఆమెకేసి చెయ్యి చూపించి ఏదో  ఎగతాళిగా చెప్పటం చూడగానే అతనిమీద కోపం ముంచుకొచ్చింది.

          ప్రేమించటం మొదలుపెట్టక మునుపే ప్రేమలో ఓడిపోయిన కోపంతో ఆమె రెండుమూడు రోజులు మధ్యాహ్నం భోజనం కూడా తినకుండా విసిరి కొట్టింది. కానీ ఆకలిని ఆమె ప్రేమద్వారా గెలవలేకపోయింది.

          కొన్ని సమయాలలో సముద్రతీరానికి వెళ్లినపుడు ఇంతమంది ఎలా ప్రేమిస్తున్నారాని ఆశ్చర్యపోయేది. సముద్రాన్ని వేడుక చూడ్డంకన్నా ప్రేమికులనే చూస్తూ ఉండిపోయేది. ఆమెకన్నా సుమారుగా ఉన్న ఆడవాళ్లు కూడా ప్రేమిస్తున్నారు. ఎందుకు తనను ఒక్కరుకూడా ప్రేమించటం లేదని అక్కసుగా ఉండేది. దాన్ని తలుచుకుని ఎంతో బాధపడేది. ఎక్కువ జీతం తీసుకునే ఆడదానిగా ఉంటే ప్రేమిస్తారని ఇందిర చెప్పిన మాటల్ని వినటం తట్టుకోలేని ఆవేదనగా అనిపించింది. ప్రేమ మాత్రమే ఆమె జీవితం యొక్క ఒకే ఒక లక్ష్యంలా భావించసాగింది.

          చొక్కనాథన్‍, మాంబలంలో కొత్తగా ప్రారంభించిన జెరాక్స్ అంగడికి ఆమెను మార్పు చేసినపుడు రోజూ ఎలక్ట్రిక్‍ ట్రైన్‍లో వెళ్లి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగానే మహేష్‍ను కలుసుకుంది. రెండు రోజుల్లోనే మాటలతో అలవాటుపడ్డారు.          

           మహేష్‍ ఆమెకన్నా సన్నగా ఉన్నాడు. ఎక్కువగా నీలిరంగు ప్యాంటునే తొడుక్కొని వచ్చేవాడు. ఓరియంట్‍ సెలూన్‍లో పనిచేస్తున్నట్టుగా చెప్పాడు. మహేష్‍ ఆమెకు బాగా నచ్చాడు. రోజూ మహాష్‍ ఆమెకోసం టిఫిన్‍బాక్స్లో ఏదోఒక తినుబండారం తీసుకొచ్చేవాడు. రైల్లో పక్కనే కూర్చున్నప్పటికీ అతని చెయ్యి ఆమె మీద పడకుండా చూసుకునేవాడు. ఆమె మంచినీళ్ల బాటిల్‍ను తీసుకొని తాగుతున్నప్పుడు కూడా దాన్ని దూరంగా పెట్టే తాగేవాడు. అన్నిటికన్నా ఆమె కొత్త దుస్తులో, కొత్త హేర్‍క్లిప్పో ఏది తొడుక్కుని వచ్చినా ఇది నీకు చాలా బాగుందని పొగిడేవాడు. అందుకనే తానొక మంచివాణ్ణి ప్రేమిస్తున్నట్టుగా గొప్పగా భావించుకుంది కోకిలవాణి.

          ఒకరోజు సాయంత్రం మహేష్‍ రాకకోసం మాంబలం రైల్వేస్టేషన్‍ సమీపంలో ఎదురుచూస్తుంటే కాళ్లు నొప్పులుగా         ఉన్నాయని ఒక బైక్‍కు ఆనుకొని నిలబడింది. ఎదురుగా ఉన్న అంగట్లో నుండి ఒకవ్యక్తి ఆమెనే చూడసాగాడు. అతను తనను చూస్తున్నాడని గ్రహించిన మరుక్షణం తన దుపట్టాను సరిచేసుకుని తల వంచుకుంది కోకిలవాణి. ఆ యువకుడు ఒక సిగరెట్‍ను వెలిగించుకుని ఆమెను చూస్తూ పొగ పీల్చసాగాడు. మహేష్‍ రావటం  ఆలస్యమయ్యేకొద్దీ ఆమెలో కోపం అధికం కాసాగింది. అతను సిగరెట్‍ను ఆర్పేసి దగ్గరికొచ్చి నిలబడి... ‘‘ఇది నా బైక్‍. కావాలంటే ఎక్కి కూర్చోవచ్చు. లేదూ ఎక్కడికి వెళ్లాలో చెప్పండి, నేనే తీసుకెళ్లి దిగబెడతాను.’’ అని చెప్పి నవ్వాడు.

          దాన్ని భవ్యంగా అతను చెప్పిన విధం ఆమెకు నవ్వును తెప్పించింది. దాన్ని విన్న ఆ యువకుడు, బైక్‍ తాళాలను తీసి ‘‘మీరే కావాలన్నా నడపండి.’’ అన్నాడు. కోకిలవాణి ‘‘వొద్దు’’ అని తిరస్కరించి నవ్వుతూ పక్కకెళ్లి నిలబడింది. ఆ యువకుడు ఆమెతో ‘‘ఇల్లు ఎక్కడ?’’ అని అడిగాడు. ఆమె బదులివ్వకుండా స్టేషన్‍కేసే చూడసాగింది. అతను తన పాకెట్‍నుండి దువ్వెన తీసి తలను దువ్వుకుంటూ ఒక బబుల్‍గమ్‍ను తీసి ఆమె ముందుకు చాపాడు.

          ఆమె గబగబ రైల్వేస్టేషన్‍ లోపలికి నడవటం మొదలుపెట్టింది. అతను నవ్వటం వినిపించింది. మహేష్‍ వచ్చేంతవరకూ ఆమె తిరిగి చూడలేదు. మహేష్‍తో ఆ యువకుడి గురించి చెప్పాలా వద్దా అన్న సంధిగ్ధంలో పడింది. కానీ చెప్పలేదు.

          రెండురోజుల తర్వాత ఆ బైక్‍ యువకుణ్ణి మళ్లీ రైల్లో చూసింది. అతను కదిలి దగ్గరికొచ్చి నిలబడి ఆమెనే చూస్తూ       ఉన్నాడు. కోకిలవాణి అతణ్ణి ఓరకంటితో చూసినపుడు అతను పెదవిని కొరకటమూ, అరచేతిమీద ఐ లవ్‍ యూ, యువర్స్ దురై అని తన పెన్‍తో రాసి చూపించటమూ, వంకర నవ్వుతో చేతిని ఊపటం లాంటివి చెయ్యసాగాడు.  

          ఒక వారంరోజుల తర్వాత, ఒకరోజు ఉదయం ఆమె రైలు దిగి నడుస్తుంటే దగ్గరికొచ్చి ‘‘నీ కోసమే రోజూ తాంబరం నుండి ఇదే రైల్లో వస్తున్నాను.’’ అన్నాడు. కోకిలవాణి అతనితో మాట్లాడలేదు.

          అతనేమో చాలాకాలం నుండి ఆమెకు పరిచయమున్నవాడిలా దగ్గరికొచ్చి... ‘‘సినిమాకు వెళదామా?’’ అని అడిగాడు. ఆమెకు ఆ మాటలు వినగానే భయం కలిగింది. దాన్ని ప్రదర్శించకుండా... ‘‘నాకు ఇవన్నీ నచ్చవు.’’ అంది.

          దురై నవ్వుతూ... ‘‘అంటే నువ్వు నన్ను లవ్‍ చెయ్యలేదా?’’ అని అడిగాడు. కోకిలవాణి కోపంగా, ‘‘నేనెందుకు నిన్ను లవ్‍ చెయ్యాలి?’’ అని అడిగింది.

          ‘‘అంటే ఆ రోజు మాత్రం నవ్వావు. రోజూ లుక్స్ విసురుతున్నావే, అది ఎందుకు?’’ అన్నాడు దురై.

          ‘‘నేనేమీ నిన్ను లవ్‍ చెయ్యలేదు. నేను మహేష్‍ను లవ్‍ చేస్తున్నాను. గొడవ చెయ్యకుండా వెళ్లిపో.’’ అంది.

          వెంటనే దురై ఆమెను పచ్చి బూతులు తిట్టటమే కాకుండా... ‘‘నువ్వు నన్ను లవ్‍ చేసే తీరాలి. నేను డిసైడ్‍ చేసేశాను.’’ అన్నాడు. అతనికి భయపడి కొన్నాళ్లుగా బస్సులో వెళ్లసాగింది.

          ఒకరోజు మహేష్‍తో, ఒక యువకుడు తనను వెంటబడి తరుముతున్నాడని చెప్పింది. మహేష్‍ కాస్త కలవరపడి, ‘‘నేను మాట్లాడుతాను.’’ అని ఓదార్చాడు. ఆపై రెండురోజుల వరకూ మహేష్‍ను చూడ్డానికే వీలుకాకపోయింది. అతణ్ణి వెతుకుతూ ఓరియంట్‍ సెలూన్‍కు వెళ్లినపుడు మహేష్‍ ముఖంలో దెబ్బలు తిన్న వాపు కనిపించింది.

          మహేష్‍ తల వంచుకుని, ‘‘ఆ రౌడీనాయాలు దురై నన్ను కొట్టాడు కోకిలా. మనిద్దరినీ ఒకటిగా చూస్తే చంపేస్తానని చెప్పాడు. ఏం చెయ్యాలో తెలీటం లేదు. సెలూన్‍ ఓనర్‍ను ఐడియా అడిగాను. లవ్‍ వ్యవహారాలన్నీ తనకు నచ్చవని అంటున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలీటం లేదు. ఒకటే అయోమయంగా ఉంది.’’ అన్నాడు. కోకిలవాణి అక్కడే ఏడ్చింది. మహేష్‍ సెలూన్‍ ఓనర్‍ను అడిగి ఆమెను తీసుకెళ్లి దగ్గరున్న టీ కొట్లో రాగిమాల్ట్ కొనిచ్చి ఎన్నో ధైర్యవచనాల్ని చెప్పి పంపించాడు.

          ఆ తర్వాత మహేష్‍ ఆమెను కలుసుకోవటానికి రాలేదు. కానీ కోకిల ప్రేమను వదలలేకపోయింది. మళ్లీ ఒకనాడు మహేష్‍ను కలుసుకోవటానికి సెలూన్‍కు వెళ్లింది. అప్పుడు సెలూన్‍లో ఎవరూ లేరు. మహేష్‍ మాత్రం ఒంటరిగా కూర్చుని టి.వి. చూస్తున్నాడు. ఆమెను చూడగానే సెలూన్‍ కుర్చీలో కూర్చోమని చెప్పాడు. ఎదుటనున్న అద్దంలో ఆమె ముఖం కనిపించింది. మహేష్‍ నవ్వుతూ నీ వెంట్రుకల్ని కొద్దిగా ట్రిమ్‍ చెయ్యనా అని అడిగాడు.

          కోకిలవాణి కోపంతో అతణ్ణి తిట్టింది. తర్వాత ఆవేశంతో అతణ్ణి కౌగిలించుకుని వెచ్చటి ముద్దిచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపటి వరకూ మాట్లాడుతూ ఉండిపోయారు. ఆరోజు జతగా కలిసి ఇంటికి తిరిగొచ్చారు. కోకిలవాణి మళ్లీ ప్రేమించటం మొదలుపెట్టింది.

          అయితే వాళ్లను జంటగా ఉదయం థియేటర్‍లో చూసిన దురై... ‘‘నేను  మాత్రమే నిన్ను లవ్‍ చేస్తాను. ఇంకెవరు నిన్ను లవ్‍ చేసినా నువ్వు చచ్చినట్టే. నీమీద ఆసిడ్‍ పోస్తాను. చూసుకో.’’ అంటూ కఠినంగా తిట్టాడు. కోకిలవాణికి అది నిజమవుతుందని అప్పుడు తెలియదు.

          అది జరిగిన రెండురోజుల తర్వాత దురై బాగా తాగి ఆమె పనిచేస్తున్న జెరాక్స్ షాపుకొచ్చి... ‘‘నువ్వు నన్ను లవ్‍ చేస్తున్నావా లేదా అని ఇప్పుడే తేలాలి. చెప్పవే.’’ అని బెదిరించాడు. కోకిలవాణి అతనితో మాట్లాడలేదు. అతను అసహ్యంగా అరిచాడు. అతనికి భయపడి కొన్నిరోజులు పనికి కూడా వెళ్లకుండా ఉండిపోయింది. అయితే అతను వదిలిపెట్టలేదు. ఇంటి మందుకొచ్చి నిలబడుతూనే ఉన్నాడు. స్నానాల గదికి పక్కనున్న సందుకు మధ్యలో వచ్చి నిలబడి ఆమెనే చూస్తుండేవాడు. ఆమెకు భయంగానూ తడబాటుగానూ ఉండేది.

                                                          ()  ()  ()

         

          దురై ఆమె మీద ఆసిడ్‍ పొయ్యటానికి ముందురోజు ఉదయం కోకిలవాణి తండ్రికి ఎవరో... ఆమె మహేష్‍ను ప్రేమిస్తోందన్న విషయం గురించి చెప్పారు. అందుకు ఆ తండ్రి తన కాలికి వేసుకున్న చెప్పును తీసి ఆమె ముఖమ్మీద ఎడాపెడా వాయించటంతోపాటు మహేష్‍ కులం పేరు చెప్పి నీచంగా తిట్టటమే కాక, ఆమె తన కూతురన్న విషయాన్ని కూడా మరిచిపోయి అసహ్యంగా పచ్చి బూతులు తిట్టాడు.  

          ఆయనతోపాటు సెల్వం అన్నయ్య కూడా కలిసి... ‘‘వాడు మాత్రమే కాదు నాన్నా, దురై అని ఇంకో కుర్రవాడూ దీని వెనక తిరుగుతున్నాడు. ఒకే సమయంలో ఇద్దరు మొగపిలకాయలతో తిరుగుతోంది.’’ అని మరింత రెచ్చగొట్టాడు.

          నాన్న ఆమె జుట్టు పట్టుకొని లాగి గోడకు ఆనించి, ‘‘తిరగుబోతు లం....’’ అని మళ్లీ తిట్టటం మొదలుపెట్టాడు. అమ్మ ఆయన బలమైన పిడికిట్లో నుండి కోకిలను తప్పించి అన్నం గరిటెతో కాళ్లమీదా, కడుపుమీదా కొట్టింది. కోకిలవాణి ప్రేమకోసమే దెబ్బలు తింటున్నాననుకోవటంతో ఏడ్చి అరిచి గీపెట్టలేదు.

                                                          ()  ()  ()         

          ఆసిడ్‍ పోసిన రోజు ఉదయం దురై ఆమె ముందుకొచ్చి నిలబడగానే, ఎలాగైనా అతనితో జుజ్జగింపుగా మాట్లాడి తాను మహేష్‍ను ప్రేమిస్తున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలని మనసులో అనుకుంది కోకిల.

          అయితే దురై ఒక్కమాట కూడా ఆమెతో మాట్లాడలేదు. మాట్లాడటానికి అవకాశమూ ఇవ్వలేదు. ప్యాంటు ప్యాకెట్‍లో నుండి దువ్వెనను తీస్తున్నట్టుగా చిన్న ప్లాస్టిక్‍ బాటిల్‍ నొకదాన్ని బయటికి తీశాడు. దూరంగా ఎలక్ట్రిక్‍ రైలు వస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. ఆమె రైల్వేస్టేషన్‍ మెట్లకేసి నడవటానికి ముందు ఆమె ముఖమ్మీద ఆసిడ్‍ను పోశాడు.

          భగభగమంటూ దహిస్తున్న నిప్పులో ముఖాన్ని దోపినట్టుగా మండటం ప్రారంభించింది. చెవులు, ముఖము, ముక్కు, చెంపలు అంటూ అన్నీ మాడిపోతున్నట్టుగా తట్టుకోలేని బాధ కలగసాగింది. కోకిలవాణి గట్టిగా కేకలు పెట్టింది. గుంపును చీల్చుకుంటూ దురై పరుగెత్తటం కనిపించింది. తనముందున్న లోకం క్రమంగా మాయమవుతున్నట్టుగా ఆమెకు స్పృహ  తప్పింది.

                                                          ()  ()  ()

         

          కోకిలవాణి ఆరు వారాలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. కుడిపక్కనున్న ముఖం పూర్తిగా మాడిపోయింది. చెవి తమ్మలు కాలిపోవటంతో సగం చెవే మిగిలింది. ఆసిడ్‍ ముఖమ్మీద పడటంతో తల మధ్యభాగం వరకూ ప్రాకిన కారణంగా ఆమె తల వెంట్రుకలు సగం వరకూ కత్తిరించి ఉన్నాయి. ఆమె ముఖాన్ని చూడాలంటే ఆమెవల్లే సహించటానికి వీల్లేకపోయింది.    

          ఆమె ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఆమె తండ్రీ, తల్లీ, బంధువులూ మార్చిమార్చి ఆమెను క్రూరమైన మాటలతో తిడుతూనే ఉన్నారు. కోకిలవాణి మాడిపోయిన ముఖాన్ని చూసిన ఆమె తండ్రి... ‘‘అట్టా ఏంటే నీకు లవ్‍ కావాల్సి వచ్చింది. చచ్చిపోయుంటే శని వదిలిపోయిందని రెండు మునకలేసి ఊరుకునేవాణ్ణి. ఇకమీదట నిన్ను ఎవడే చేసుకుంటాడు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి విడిచిపెట్టాలే...’’ అంటూ తన ముఖంలో తానే చరుచుకుంటూ ఏడ్చాడు.

          ఎందుకు ప్రేమించాలని ఆశపడ్డాం. ప్రేమ అంటే ఇదేనా? దురై ఎందుకిలా తన ముఖంలో ఆసిడ్‍ పోశాడు. ఆమె ఆలోచింకొద్దీ దు:ఖమూ ఆవేదనా పొంగుకు రాసాగాయి.

          ఆమెతోపాటు చదువుకున్న విద్యార్థులు, తెలిసినవాళ్లు, స్నేహితులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదు. ఆసిడ్‍ బాధితురాలి స్నేహితురాలిని అంటూ చెప్పుకోవటానికి ఎవరు ఇష్టపడతారు. మహేష్‍ కూడా ఆమెను చూడ్డానికి రానేలేదు.

          లేడీ డాక్టర్‍ ఆమె ముఖాన్ని తుడుస్తూ... ‘‘నీకు ఎంతమంది లవర్స్ వే’’ అంటూ ఎగతాళిగా అడిగేది. కోకిలవాణి బదులేమీ ఇచ్చేదికాదు. కట్లుకట్టేవాడు ఆమె ముఖంలోని గాయాలకు ఆయింట్‍మెంట్‍ రాస్తూ... ‘‘ఇకమీదట ఒక్క మగపిలగాడు కూడా నీవైపు తిరిగి చూడడు. నువ్వు ఎక్కడికెళ్లాలన్నా వెళ్లొచ్చు. ఏ సమయానికైనా ఇంటికి తిరిగి రావొచ్చు. నిన్ను ఎవరు ఫాలో చేస్తారు.’’ అనేవాడు. కోకిలవాణికి ఆవేశం వచ్చేది. కానీ నోరు తెరిచి మాట్లాడదు. ఇలా అవమానాలపాలై జీవించటానికి బదులుగా నాన్న చెప్పినట్టుగా చచ్చిపోయుండొచ్చు. ఎందుకోసం బ్రతికిపోయాం. మిగిలిన జీవితాన్ని ఎలా గడపబోతున్నాం. ఆ బాధ ఆసిడ్‍ మంటకన్నా ఎక్కువగా ఉండబోతోంది.

                                                          ()  ()  ()

          కోకిలవాణి ఆ కేసు నిమిత్తం ఇరవైఆరుసార్లు కోర్టుకు వెళ్లి రావలసి వచ్చింది. ప్రతిసారీ ఆమె ప్రేమను ఎవరో ఒకరు ఎగతాళి చేసేవాళ్లు. కాలిన ముఖాన్ని చూపించి ఆమె కథను చెప్పి నవ్వేవాళ్లు. విచారణ కోసం మహేష్‍ రావటానికి నిరాకరించటంతోపాటు, తాను ఆమెను ఎన్నడూ ప్రేమించలేదని పోలీసు అధికారుల దగ్గర ప్రమాణపూర్వకమైన వాగ్మూలం ఇచ్చాడు. దురై ఏమో, ఆమె తనను ఎన్నో నెలలు ప్రేమించి చివరకు మోసం చేసినట్టుగా పోలీసుల వద్ద వాగ్మూలం ఇచ్చాడు. కోకిలవాణి తాను ఎవరినీ ప్రేమించలేదనీ, దురై తనను ప్రేమించమని బెదిరించాడని చెప్పింది. వకీలు ఆమె ఎవరితోనైనా శారీరక సుఖాన్ని కలిగి ఉన్నదా, మగ స్నేహితులు ఎంతమంది ఉన్నారని పదేపదే ప్రశ్నించాడు. కోకిలవాణి న్యాయస్థానంలో చాలాసార్లు ఏడ్చింది. అయితే ఎవరూ ఆమెను ఓదార్చలేదు. చివరకు దురై శిక్షింపబడ్డాడు.

                                                          ()  ()  ()

         

          సగం కాలిన ముఖంతో, ఎలకతోకకున్న వెంట్రుకల్లాంటి కొంచెం జుట్టుతో కోకిలవాణి ఇంట్లోనే పడి ఉంది. టి.వి చూడ్డం కూడా లేదు. తలలో పూలు పెట్టుకోవటమో, అద్దంలోకి చూస్తూ తిలకం దిద్దుకోవటమో కూడా చెయ్యటం లేదు. రెండుసార్లు ఆమెకు పెళ్లిమాటలు కొనసాగాయి. అయితే ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. కోకిలవాణి ఒంటరితనాన్ని అలవాటు చేసుకోలేక ఇంట్లో ఉంటూనే పుట్టగొడుగుల్ని పెంచి అమ్మకం మొదలుపెట్టింది. అమ్మానాన్నలు రోజూ  ఆమెను నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనూ ఆమె పాలుపంచుకోవటానికి అనుమతించ బడలేదు. నవ్వును మరిచిపోయిన దానిలా కోకిలవాణి ఒక జీవచ్ఛవంలా బ్రతకసాగింది.

                                                          ()  ()  ()

         

          ఉపాసన అన్న ఒక సేవాసంస్థ ఆమెను తమ సంస్థలో పనికి చేర్చుకున్నప్పుడు ఆమెకు ముప్పైరెండేళ్ల వయసు నడుస్తోంది. అది కళ్లులేని వాళ్లకోసం సేవచేసే సంస్థ. అంధత్వం కలిగినవాళ్లే అక్కడ ఎక్కువమంది పనిచేస్తున్నారు. అందుకని ఎవరూ ఆమెను ఎగతాళి చేస్తారన్న భయంలేకుండా ఆమె పనికి వెళ్లి రావటం మొదలుపెట్టింది. అక్కడున్న గ్రంథాలయంలోని ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చి చదువుతూ ఉండేది.    

          కొన్నిసార్లు ఆమెకు తెలియకనే శారీరక సుఖం గురించి మనసు తహతహలాడేది. అప్పుడు వేళ్లతో ముఖాన్ని తడుముకునేది. కరెంట్‍లో చెయ్యి పెట్టినట్టుగా మనసు వెంటనే ఆ ఆలోచనల నుండి తనను తాను ఖండించుకునేది.

                                                          ()  ()  ()

         

          గత సంవత్సరం ఒకరోజు సముద్రతీరాన యాథృచ్ఛికంగా దురైను చూసింది. అతనికి పెళ్లై పాపకూడాఉన్నట్టుంది. రెండేళ్ల వయస్సున్న ఆ పాప ఒక రంగురంగుల బంతితో ఆడుకుంటోంది. ఇసుకలో కూర్చున్నట్టుగానే దురై భార్యను గమనించింది. మంచి రంగు. ఆరెంజ్‍ కలర్‍ చీర కట్టుకుంది. చేతిలో ఒక హ్యాండ్‍బ్యాగ్‍. మెడలో చాలా నగలు వేసుకుంది. దురై ఫుల్‍హ్యాండ్స్ షర్ట్ ధరించి తలను చక్కగా దువ్వుకొని ఉన్నాడు.

          ఎందుకో దురై భార్య దగ్గరకు వెళ్లి మాట్లాడాలనిపించింది. ఆ పసిపాపను ఒకసారి బుజ్జగిద్దామా అని కూడా అనిపించింది. ఆమె తమనే చూస్తూ ఉండటాన్ని దురై గమనించి భార్యతో ఏదో చెప్పాడు. వాళ్లు పైకి లేచి నిలబడ్డారు.

          తానే కదా దురైమీద కోపమూ అసహ్యమూ కలిగి ఉండాలి. అతనెందుకు తనను చూడగానే లేచి పారిపోతున్నాడు? భయమా, గతకాలపు జ్ఞాపకాలు ఏవీకూడా తనముందుకొచ్చి నిలబడకూడదన్న తడబాటా... అన్న ఆలోచనతో వాళ్లు వెళ్లిపోవటాన్ని కోకిలవాణి చూస్తూ ఉండిపోయింది.

          ఒక మహిళ మీద ఆసిడ్‍ పోసినవాడు అని అతణ్ణి చూసి ఎవరైనా అనగలరా ఏం? అతనికి ఆసిడ్‍ పొయ్యటం అన్నది ఒక సంఘటన. కానీ తనకు? కళ్ల ముందు నుండి దురై మరుగయ్యేంతవరకూ అతణ్ణే చూడసాగింది.

          సముద్రతీరమంతా ప్రేమికులు నిండిపోయి ఉన్నారు. వీళ్లల్లో ఎవరో ఒక స్త్రీకి తనలాగా ముఖం కాలిపోవచ్చు లేదూ హత్య గావించబడనూ వచ్చు. నీచపు మాట, చెంపదెబ్బ, కాలితో తన్నటం, కాల్చటం, హత్య ఇవేనా ప్రేమకు చిహ్నాలు? హింసలోనే ప్రేమ వేళ్లు ఊనుకొని ఉన్నాయా?

          ఆమె కడలి కెరటాలను చూస్తూ ఉంది. చీకటి పడేంతవరకూ ఇంటికి వెళ్లాలనిపించలేదు.

          ప్రపంచం తన చేతిని వదిలిపెట్టి ఎవరూ లేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిన వైనాన్ని గ్రహించిన దానిలా చాలాసేపటి తర్వాత రైల్వేస్టేషన్‍కేసి ఒంటరిగా నడవటం మొదలుపెట్టింది.

          రైలుకోసం ఫ్లాట్‍ఫామ్‍మీద ఎదురుచూస్తుంటే, ఎందుకో తనకు ముప్పైఆరేళ్ల వయస్సు పూర్తయిందని గుర్తుకొచ్చింది.

          రైలు వెళుతుండగా వీచిన సముద్రపు గాలులు మచ్చలు మిగిల్చిన ముఖానికి తగలగానే మనసు తానుగా ప్రేమను గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. వెంటనే మనసులోనుండి ఇన్నేళ్లు గడిచినా మరిచిపోలేని ద్రావకపు మండే స్వభావమూ కాలుతున్న మంటా భయంకరంగా పైకి లేచింది. తనను మీరిన లోలోని బాధను ఆమె తట్టుకోలేకపోయింది.

          కోకిలవాణి పక్కకు తిరిగి చూసింది, ఎదుటి సీటులో ఒక యువతి ఒక యువకుడి ఒళ్లో వాలిపోయి సన్నని గొంతుతో మాట్లాడుతూ ప్రేమిస్తోంది.

          కోకిలవాణి వాళ్లను చూడకుండా బయట కనిపిస్తున్న చీకటినే చూస్తూ వచ్చింది. చీకట్లో ఎగురుతున్న ఒక మిణుగురు పురుగు ఆమె ముఖాన్ని రాసుకుంటూ వెళ్లింది.

          ప్రేమికుల జంట మాట్లాడుతూ నవ్వుకోవటం వినేకొద్దీ కోకిలవాణి తనకు తెలియకనే వెక్కిళ్లు పెట్టసాగింది. తన ప్రేమను ప్రపంచం ఎందుకు అంగీకరించలేకపోయింది? ఎందుకని తనకు ఇంతటి క్రూరమైన శిక్షను వేసింది? అని ఆలోచించి ఆమె ఏడుస్తూ ఉంది. రైలుతో పాటుగా మిణుగురులు ఎగురుతూ వస్తున్నాయి. అవి చీకటికి కళ్లు మొలిచి ఆమె దు:ఖాన్ని చూస్తున్నట్టుగా ఉన్నాయి.

                                                          ()  ()  ()


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు