కథలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నక్క-తోక 

రాత్రంతా ఒక్కటే  కుక్కల మొరుగుడు. ఒక సక్కిన నిదుర పట్టిన పాపాన పోలే. భౌ భౌమని మొరుగుడుకు చెవులు గడెలుపడ్డై కాని మొరిగె కుక్కల నోరు బొంగు పోలే. అదేం సిత్రమో కాని మమ్ముల ఎప్పుడు చూసిన మొరగని కుక్కలు కొత్త మొకాలు కొత్త ఆకారాలు చూసినప్పుడు మాత్రం రికాం లేకుంట మొరుగుతై. అవ్విటికి కూడా తెలుసు మా వోల్లు ఎవలు మందోల్లు ఎవలని. కుక్కల మొరుగుడు చుక్కల మెరుపుల మధ్య కష్టంగానే తెల్లారింది. నిదుర సరిగా లేక కళ్లు మంట మండుతున్నయి. పానం సొలిగినట్టు అయితంది. పానంల ఎట్లున్న తప్పదన్నట్ట్టు మొక్కి చీపురుపట్టి బర్కు బర్కు మని సప్పుడు రాంగ ఊడుత్తండ్లు  అలుకులేని పొక్కిలి ఆకిలల్ల. ఎటుదిక్కు చూసినా ఒక్క మగ పురుగు కనిపిత్తలేదు. నిన్న మసుకు పడంగా  కలో గంజో తాగి పత్తా లేకుండ పోయిండ్లు. ఊరంత నిమ్మలంగానే ఉన్నట్టుగా ఉన్నది. కాని మొత్తం మన ఆధీనంల లేకుంట ఉన్నది. మచ్చల మచ్చల బట్టలు, బారెడు బారెడు తుపాకులతోని గిచ్చుతే రక్తం కారే పొల్లగాండ్లతో ఊరు ఊరుంత కుయ్యిమనకుంట  ఉన్నది. ఎక్కడనో ఒక్క కాడ కుక్క మొరుగుతూనే ఉంది. దాని మొరుగుడు ఏవో సంకేతాలు అందిస్తున్నది. ఊల్లె ఏం జరుగుతుందో ఎవలనన్న అడుగుదాం అనుకుంటే మనకెంత తెలుసో అల్లకు కూడా అంతే తెలుసు. కాని ఏదో జరుగుతుందని మాత్రం అందరికి ఎరికె. బారెడు తుపాకి ఒక్కటి బుజాన పెట్టుకొని ఇద్దరు రంగు, రూపం నడుక మనది కాని మిలిటిరి పోలీసులతోని మాదిగ వాడకు అచ్చిండ్లు లోకల్‍ పోలీసు. అచ్చిరాంగానే బూతుల వర్షం కురిపిస్తూ ఆడుకునే పోరన్ని చెంప మీదకెల్లి పెడెల్‍మని సరిసిండు. ఆ దెబ్బకు మిరుగులు రాలినై. కండ్లకు చెక్కరచింది. లబోదిబోమని మొత్తుకుంట ఇంట్లకు ఉరికిండు. కొట్టుడాపి మొగ పురుగు లేని మాదిగ ఆడోల్లను నోటికచ్చిన తిట్లు తిడుతూ... ఏ లం... కాన పెద్ద మాదిగోడెవ్వడే అని చాలా సౌమ్యంగా అడిగిండు. మొక్కి, చీపురు చేతులపట్టుకోని తిడుతున్న పోలీసులకు గౌరవిస్తూ దండం పెట్టింది మాదిగ నడీడు మనిషి. ‘‘ఎవ్వడెవ్వడె పెద్ద మాదిగ లం...కొడుకులు ఉన్నరా? దెంకపోయిండ్ల? ఈ నవ్వల కుక్కల్‍దెం....’’అంటూ ఇంక తిట్టబోయిన పోలీసుకు ‘‘ఇగో గీ ఇంటాయన, గా యింటాయిన బాంచెన్‍’’ అని సూపించింది. చూపటమే ఆలస్యంగా అటువైపుగా నడక సాగించాడు తెలుగు పోలీసు. మిటిటిరి పోలీసులు మాత్రం చూపులతోనే కండకండాలుగా కొరుక్కతింటం అన్నట్టుగా సూత్తండ్లు నడీడు మాదిగ స్త్రీని. అది గమనించి  ఆ మాదిగ మహిళ పక్కనే ఉన్న కుక్కను ‘‘అడీ, ఈ కుక్కలకు గత్తరు రాను’’ అని మొరం తేలిన వాకిల్లోని ఒక్క రాయిని తీసి కుక్కను కొట్టి గుడిసెలకు పోయింది.

                ‘‘అరేయ్‍ లం...కొడుక ఎవ్వడెవ్వడుర పెద్ద మాదిగలు’’.

                ‘‘అయ్యా! బాంచెన్‍ నేనుమా అన్న కొడుకు’’

                ‘‘సరె నడువుండ్లి అమీన్‍ సాబ్‍ ఊరుసాటింపు చెయ్యిమన్నడు. పాయి చెయ్యుండ్లి. నిన్న సావుకారి సేండ్ల ఏరుకచ్చిన మిరుపకాయలు, పల్లికాయలు అనుమండ్ల కాడికి తీసుకు రమ్మని ఊరంత సాటింపు చెయ్యిపోండ్లిర. జెప్పన నడువుండ్లి’’ అనంగనే  బిరాన లేసి, తోలు డప్పు సంకన ఏసుకొని అయిదు గుడిసెల అవుతల ఉన్న తోటి పెద్ద మాదిగ బక్కయ్య దగ్గరకు పోయిండు ఎంకయ్య. వరుసకు కొడుకే, కాని వయసుల ఎంకయ్య కంటే బక్కయ్య పెద్దవాడు. వరుస పెట్టి పిలుత్తడు సిన్నాయిన్న అని. అప్పుడప్పుడు తిట్టుడు కూడా తిడుతడు. ఇది వాల్ల ఇద్దరి మధ్యల మాములే. బక్కయ్య బక్కగా ఉండటం వల్ల బక్కయ్య అనే పేరు పెట్టారు. ‘‘అరేయ్‍ బక్కా, అమీన్‍సాబ్‍, ఊరు సాటింపు చెయ్యిమన్నడు. నడువురా’’ అనంగానే అతన్ని ‘‘ఆగుర నాయిన్న’’ అని ఎంకయ్య ఎంట నడిసిండు బక్కయ్య. ఇగపోతే వీళ్లిద్దరిని తోటి మాదిగలు, ఊరంతా ముద్దుగా పిలుసుకునే మారు పేర్లు కూడా ఉన్నాయి.  బక్కయ్యను నక్క అని, ఎంకయ్యను తోక  అని పిలుస్తారు. ఎక్కడ పంచాయితీ జరిగినా ఏ కులస్థులైన చివరకు ఊరి దొర అయినా ఈల్లు ఇద్దరు లేనిది పంచాయితీ చేసిన పాపాన పోలేదు అంటే వీల్ల ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పంచాయితీ జరుగుతున్నంత సేపు నిమ్మలంగ ఇని బాగ ఇసారించి మాట్లాడెటోడు బక్కయ్య. తప్పు ఎవ్వలది ఉన్న కరాకండిగ చెప్పేవాడు. ఈ బక్కయ్యను అనుసరిస్తూ ఏప్పటికి తనవెంట పోవటం వల్లన ఎంకయ్యకు తోక అని పేరు పెట్టారు తోక ప్రియులంత. ఎంకయ్య సింగరేణి నౌకరుసేసి అల్లునికి పెట్టిచ్చి అచ్చిండు. కొంచెం తెల్లబట్టలు ఏసుకోని ఆడ ఆడ ఇంగిలీసు పదాలు మాట్లాడి బాగా తెలిసినోని లెక్క బడాయిలు కొడుతూ అబాసు పాలవడం సర్వసాధారణం అయ్యింది. ఇంట్ల తిండికి లేకున్నా, మసిలెక్క ఉన్న బట్టలు ఏసుకున్నా, పండగలకో పబ్బానికో అప్పాలు అడుక్కతిన్నా గాని బక్కయ్య లాలూచితనం ఎరుగడు. ఎంకయ్య కొద్దిగ లాబం జరుగుతది అనుకుంటే మసిపూసి మారేడుకాయ చేద్దామని సూసే స్వభావం కలవాడని ఊరి జనమంతా చెవులు కొరుక్కుంటరు. బక్కయ్యకు మనిషి మాట్లాడే మాటల వెనకాల ఆంతర్యం తెలుసు. రేపు ఏం జరుగబోతుందో ఊహించగలిగే వాడు. ఎంకయ్య పెడితే పెండ్లి కోరుతడు లేకపోతే సావు కోరుతడు. చివరకు దొరది తప్పు దొరికిన దండం బాంచెన్‍ ఎటు సూసిన కొద్దిగ మీ దిక్కే....అని గునుగుతూ ‘‘ఇగ మీకు తెలువనిది ఏమున్నది, మీకింద ఎంతటోల్లం, మీరు్ల  సేసి ఉండవలిసింది కాదు’’ అంటూ తప్పు ఎత్తి సూపే నేర్పు గలవాడు.

                నిశబ్దంగా ఉన్న ఊరిలో ఒక్కసారిగ చిర్రెచిటికెనతోటి దనదన వాయిస్తూ ‘‘నిన్న సావుకారి తోటల ఏరుకచ్చిన మిరుపకాయలు, పల్లికాయలు పట్టుకోని అనుమండ్ల గద్దెకాడికి రావాలని అమీన్‍సాబ్‍ చెప్పిండో హో....’’ డడడడ..... డాంటక్క టక్క టక్క డాంటక్కటక్క టక్క...అని ఊరిలో ఉన్న కమ్మరి, కుమ్మరి, కాపు, తెనుగు, నాతకని, మాల, బెస్త, మేదరి వాడలంత తిరిగి ఊరు సాటింపు సేసిండ్లు. చిర్రె సిటికెన బ్వుసేతెల పుర్రచెయి జబ్బకు దప్పు ఏసుకోని తిరిగి రాంగ ‘‘అరేయ్‍ ఎంకటిగా ఇగో గీ పెరండ్ల వడి ఇంటికి పోదాంపద..’’ బక్కయ్య అన్నడు.

                ‘‘ఇంటికెందుకుర, అమీన్‍ సాబ్‍కు కలువద్దా....కలుద్దాం పా. మనం గింత పనిసేసినం సర్కారుకు కలువకుంటే ఎట్ల? కలిసే పోదాం...’’ ఎంకయ్య.....

                ఓరి తోకోడ ‘‘తల్లి సన్ను కోసెటోడు పోలీసోడు. గాడికి పోయి కలుద్దామంటవేందిర ఏతుల లం...కొడుక. ఇనుర జెర్ర నా మట ఇనుర’’.

                ‘‘నీయవ్వ నువ్వో మనిషివారా? సర్కారుకు కలువకపోతే మనల గురించి ఏమనుకుంటడుర... కలువాలే’’ అని అనుమాండ్ల కాడికి దారితీసిండు ఇంటికి పోయే దారిడిసి.

                ‘‘ఇనుర...

                అద్దుర...

                నీ దయర, మన ఇండ్లదాక అచ్చినం కదరా. పోదాం పారా. ఇంటికాడ కూడ ఉండద్దుర, ఆని కంట్లె పడద్దుర, ఎటన్న పోదాంపార’’ లొట్టిమీద కాకిలెక్క ఒర్రిన ఇనలే. ఎంకయ్య చెయ్యి పట్టుకోని ఎంబడి తీసుక పోయిండు అనుమండ్లకాడికి ఉబ్బెచ్చులకు పులినోట్లే తలుకాయ పెట్టిపోయినట్టు.

                మూల తిరిగి దొర ఇంటికాడికి రాంగానే కందికట్టె కొట్టినట్టు సప్పుడయితంది. అడుగు ముందుకు పడ్డకొద్ది చెవులకు ఇనికిడి దగ్గర అయితంది అవ్వ, అయ్యఇవే రెండు మాటలు ఇనపడుతన్నయి. అప్పటికే దొరికినోన్ని దొరికినట్టు తీసుకచ్చి విశాలంగా ఉన్న అనుమండ్ల గద్దె మీద బోర్లబొక్కల పండబెట్టి పిర్రల మీదికెల్లి ఒక్కటే దంచుడు. రెండు, మూడు దెబ్బలు దాక ఒర్రి తరువాత తిమ్మిరెక్కి ఏం ఏర్పడక ఒర్రుడు ఆగిపోతంది అనుమంతుడు సూడంగనే. ఎర్ర గొర్రెలెక్క ఉన్న కొంత మంది మిలిటిరి పోలీసులు మంటపెట్టి పల్లి కాయలు కాలుసుకొని ఆవురావురు మన్నట్టు బుక్కుతాండ్లు. ఇదంతా గమనించిన బక్కయ్యకు ఏం జరుగబోతుందో కండ్ల ముందట కనిపిత్తంది. అవ్వన్ని ఏం పట్టనట్టు ఎంకయ్య మాత్రం అమీన్‍ సాబ్‍ దగ్గరకు పోయి సెప్పులు ఇడిసి మాల మాదిగ సబ్బండ వర్ణాలకు సాటింపు సేసినం బాంచెన్‍ అని దండం బెట్టిండు అతి వినయంగా.

                ‘అందరైండ్రు కదరా ఈన్ని పండబెట్టుండ్లి లంజకొడుకునుఅని ఎంకయ్యను సూపించిండు అమీన్‍ సాబ్‍. సుపటమే తరువాయ్‍ ఎంకయ్యను గద్దెమీద పండబెట్టి చేతుల మీద, కాళ్ళమీద ఇద్దరు పోలీసులు నిలవడ్డరు. ఇంకో పోలీసు కట్టెవట్టి పిర్రల మీదికెల్లి ఇయ్యర మయ్యర కొట్టుతాంటే అవ్వ, అయ్యఅని కొంత సేపు మొత్తుకున్నడు. తరువాత  అరుపులు బందయినయి. ఇదంతా కండ్ల రిండ సూసిన బక్కయ్య ఎంకని పని అయింది తరువాత నేనేఅని ఎట్లనన్న ఈ గండం నుంచి బైటపడాలని ఇకమతుసేసి దొర గడికి ఆనుకొని కూసొని మోకాళ్ళ మధ్యల తలకాయ పెట్టి కంగు, కంగు మని ఒక్కటే దగ్గుడు. బుక్కెడు, బుక్కెడు ఊంచుకుంట అచ్చిపోయే పానాలు సేసి తేలగండ్లు సేసిండు. కొంత సేపటిదాక ఏం జరిగిందో గద్దెమీద పోలీసుల కాళ్ళ కింద ఉన్న ఎంకయ్యకు, గొడకానుకొని పాణం కాపాడుకోను విశ్వప్రయత్నం చేసిన బక్కయ్యకు తెలువలేదు. దెబ్బ మీద దెబ్బ తలుగడం వల్ల తిమ్మిరెక్కి ఏం జరుగనట్టే నడిసిండు ఎంకయ్య, సోలుక్కుంట, కిందమీద సేసుకుంటు బక్కయ్య, ఇద్దరు కలిసి ఇంటిమొకం బట్టిండ్లు. ఎవ్వల ఇంటికాల్లు పోయిండ్లు.

                వ్యానుల పల్లికాయ, మిరుపకాయ లోడు సేసుకోని, జీబులల్ల పోలీసులు ఊరు దాటిండ్లు. మాపటల్లకు కుక్కల  మొరుగుడు  బందైంది. బిక్కుబిక్కు మంటూ అరసేతిల పాణం పెట్టుకోని ఇండ్లల్లకు సేరుకున్నరు మొగోల్లంత.

                తిమ్మిరి తక్కో అయిన కొద్ది ఎంకయ్యకు కూసోవత్తలేతు. పిర్రలు జలుపుతున్నయి. అప్పటిదాక మానం బోతదని చెప్పని బాధనంతా నొప్పి ఎక్కువ అయినకొద్దీ ఇగ లాబంలేదని భార్యను పిలిసి జరిగిందంతా సెప్పుకున్నడు. ఉన్నట్టుండి ఒక్కసారి లబొదిబో అని ఏడుపు...ఏం జరిగిందాఅని అందరు ఇంటిముందట జమగూడిండ్లు బక్కయ్యతో సహ. నా ముండకొడుకును పోలీసులు కొట్టిండ్లాట బాంచెన్‍. ఆని సేతులు కాలిపోను. ఆడు నాషడంగాను. ఆని మీద మన్ను పొయ్యఅని ఏడ్తుత్తంది ఏం చేసేది లేక భార్య. కాళ్ళ మీద కూసున్న బక్కయ్య కలిపించుకొని ఇన్నవార, లం....కొడుక అద్దుర అంటే పోదామంటివి. ఏమైందిర? ఆరి బక్కోడ, నన్ను కొట్టుడు సూసి కంగుకంగుమని దగ్గుకుంట గుడ్లు కిందమీద జేసుకుంట దొర గోడకు ఒరిగినవర  నక్క లం...కొడుక. నేను నీ లెక్కన్నార.. ఎంకయ్య’.

                ‘‘మరేం సెయ్యి మంటవ్‍ర, నేను సెప్పుతే ఇనక పోతివి. ఆడు పోలీసు బట్టలేసుకుంటే తల్లి సన్ను కొసుటానికి ఎనుక ముందాడడు. ఆని నౌకరసోంటిదన్న. నువు ఇన్నవుర. ఏతులకు అమీన్‍ సాబ్‍ను కలుదాం అన్నవ్‍. ఏమయిందిర పండబెట్టి పిర్రలు పలుగకొట్టిండు’’.

                ‘‘ఆవ్‍ బక్కులు ఇద్దరు పోయిండ్లు కదా. నా మొగన్ని ఒక్కన్నే కొట్టిండు నిన్నెందుకు కొట్టలే’’ అని సేతులు ఆడిస్తూ  బక్కయ్య మీదికి అరిచింది ఎంకయ్య భార్య. మధ్యల కలిపించుకొని ‘‘ఆని తోని నేను కూడ దెబ్బలు తినల్నానే  సిన్నవ్వ. నేను ఎంత మంచిగ సెప్పిన ఇనలే. నేనేం చెయ్యాలే. ఆడు ఏతులకు పోయి పాణం మీదికి తెచ్చుకున్నడు’’ అని ఉన్నది ఉన్నట్టు సెప్పిండు తన తప్పులేదని బక్కయ్య.

                ఇక్కడ జరిగిందంతా అచ్చిన జనాలు సూసుకుంట అయ్యో పాపం అని కొందరంటే, అబ్బా ఈని ఏతులతనం ఇంక పొనిచ్చుకోలే అని ముసిముసి నవ్వేటోల్లు కొంతమంది. నీలగిరాకు, ఆయిలాకు ఏసి మసల మలస కాగబట్టి తానం పోసిండ్లు. ఇరువై రోజులదాక ఎంకయ్యకు ఏరుగ కూసోరాలే. పోలీసులు కొట్టిన దానికంటే బక్కయ్య పాణం కాపాడుకొవటానికి సేసిన ఇకమతు ఇమిడిచ్చుకోలేక పోతాండు ఎంకయ్య.

                ఈ సంఘటన ఎప్పుడు మాట్లాడుకున్న అబ్బ నీకు నక్క అని ఎవ్వలు పెట్టిండ్లో కాని మంచి ఇకమతుతోని బైటపడ్డవే. ఈ తోకొనికి ఉబ్బెచ్చులతనం బోదే, అచ్చినోల్లందరికి గోసి జరిపి పిర్రలు సుపిత్తె ఎర్రగా ఆసినైఅంటూ యువకులంతా పగలబడి నవ్వేటోల్లు.