(June,2020)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
‘‘ఒరేయ్ కోదండా... ఆ ధనంజయోళ్లింటికి అట్టా పొయ్ రాగూడదా రా? వారం దినాల్నుండి సెప్పంపిస్తా ఉండారు!’’ పెళ్లో(పెరట్లో) మంచం మింద కూసోనున్న కొడుకుతో అన్నాడు నటేశుడు.
‘‘నేను పోను పో...’’ ముఖం పక్కకు తిప్పుకుంటా అన్నాడు కోదండ.
‘‘అట్టంటే ఎట్రా?... వాళ్లు మన కోసరం ఎన్ని దినాలని ఎదురు సూడాల? పెద్దోళ్లు పిలిస్తే పోకుండా ఉంటం మంచిది కాదురా...’’ అనునయంగా అన్నాడు నటేశుడు.
‘‘నాకట్టాంటి పన్లు సెప్పొద్దని నీకెన్నిమార్లు సెప్పుంటాను.’’ కోపంతో రుసరుసలాడినాడు కోదండ.
‘‘ఒరేయ్! అదేమైనా సెడ్డపనా ఏందిరా, సెప్పొద్దనటానికి? అది మన కులవుర్తిరా!...’’కొడుక్కి నచ్చజెప్పినాడు నటేశుడు.
‘‘అయినా, నేను సెయ్యనంటే సెయ్యనంతే! నాకు పరీచ్చలుండాయ్, సదువుకోవాల.’’మొండిగా బదులిచ్చినాడు కోదండ.
‘‘మళ్లా సదువుకుందువు లేరా. ముందు ఆ పని సేసొచ్చేయ్ పో! ఊళ్లో పెద్ద మనుసులు పిలిస్తే, పొయ్ మన వుర్తి మనం సెయ్యాల్రా. లేకుంటే కట్టు తప్పినోళ్లవుతాం. ఆపైన ఊళ్లో బతకటం చానా కష్టం రా.’’ బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు నటేశుడు.
‘‘అయితే నువ్వే పొయ్యి సెయ్ పో!’’ కోపంగా బదులిచ్చినాడు కోదండ.
‘‘నాకీ మద్దిన సేతులు వొణకతాండాయ్ రా. కత్తి పట్టి సక్రంగా గొరగలేక పోతన్నా. ఈ ఒక్కసారికీ అట్ట పొయ్యొచ్చేయ్‍పోరా!’’
‘‘పో నాయినా నేను పోను! ఆ ధనంజయోళ్ల తాతకి తలంతా పుండ్లే! ఎప్పుడూ రసి కారతా ఉంటాది. ఒగటే గొబ్బు. తల్లో సెయ్యి పెట్టాలంటేనే కడుపులో తిప్పతాది.’’ ముఖాన్ని అసయ్యంగా పెడతా అన్నాడు కోదండ.
‘‘అట్టనుకుంటే ఎట్రా? ఆటినంతా మనం సయించుకోవాల్రా. అదే రా వుర్తి ధరమం అంటే!’’ నచ్చజెప్పినాడు నటేశుడు.
‘‘తలతోటే ఆగడు నాయినా ఆ ముసిలోడు. గెడ్డమూ, సంకా అన్నీ గొరగాల. నేను పోను పో వాళ్లింటికి.’’ మళ్లా మొదటి కొచ్చినాడు కోదండ.
‘‘ఒరేయ్ కోదండా, ఈ ఒక్కసారికి ఎట్టో ఒగట్టా ఆయనకు గొరిగొచ్చేయ్ పోరా. మా నాయినివి గదా. ఇంగమీదట నీకు మన పన్లు జెప్పన్లే, ఇదే కడా! పొయ్యొచ్చే పో నాయినా!!’’ కొడుకును బతిమిలాడతా అన్నాడు నటేశుడు.
తండ్రి మాటలకు అయిష్టంగానే మంచంమింద నుండి లేసినాడు కోదండ.
+ + +
కోదండ డిగ్రీ సెకండ్ ఇయర్ సదవతా ఉండాడు. పేరుకు డిగ్రీనే కానీ, అతనికి సరిగ్గా సదువెక్కలేదు. పదో తరగతిలో రొండుమార్లు తప్పి, ఇంటర్లో ఒకసారి ఫెయిలై, ఎట్టో ఒగట్టా డిగ్రీకొచ్చినాడు. డిగ్రీలోనూ ఫస్ట్ఇయర్లో ఇంగా మూడు పేపర్లు బాకీ ఉండాది.
సదువు సంకనాకి పోయిందని యాష్టపడి, నటేశుడు పట్టుబట్టి కొడుక్కి తమ కులవుర్తి అయిన మంగలి పనిని నేర్పించినాడు. కానీ కోదండకు తమ కులవుర్తిని జెయ్యాలంటే మా సెడ్డ సిరాకు...
ఊళ్లో ఎవురు పిలిసినా వాళ్లింటికెళ్లి తల కత్తిరించాలి, గెడ్డం గొరగాలి, సంక గోకాలి, గోళ్లు తియ్యాలి, గోళ్లల్లోని మట్టినీ సుభ్రం సెయ్యాలి. అంతేగాదు... ఏ ఇంట్లో సావుకార్యం జరిగినా, కార్యం జరిగే సోటికి పొయ్యి, సావింటి దాయాదులకు గెడ్డాలు, మీసాలు తియ్యాలి. వాళ్లకు యాడైనా పొరబాట్న గోక్కపోతే... వాళ్ల ఈసడింపులూ, సులకన సేసి మాట్టాడే మాటలూ పడాలి. ఏకవచన పిలుపులు, బూతులు, కులవుర్తిని ఎగతాలి జేసే ఎత్తిపొడుపు మాటలు... ఈటన్నింటినీ భరించాలి, సగించాలి.
ఆనక వాళ్లేమిస్తే అది తెచ్చి ఇంట్లో ఇయ్యాలి. నోరుతెరిసి ఇదేమని అడిగేందుకు ఈల్లేదు. అందుకే, ఇట్టాంటి పన్లు జెయ్యాలంటే కోదండకు అవమానంగా ఉండాది. ఈ కులంలో ఎందుకు పుట్టామురా బగమంతుడా...అని సణుక్కోని రోజు లేదు.
ఇంతకాలమూ ఈ వుర్తి జేసే తమ కుటుంబరాన్ని ఎట్టో ఒగట్టా లాక్కొచ్చినాడు నాయన.
ఇప్పుడు తనను పూర్తిగా ఈ వుర్తిలోకి దించాలని బలవంతం సేస్తున్నాడు.
తాను ఎళ్లనంటే ఎళ్లనని మొండికేస్తున్నా- బతిమాలో, బామాలో, గెడ్డం పట్టుకునో, ఎట్టో ఒగట్టా తనను ఒప్పించి, పనికి అంపిస్తా ఉండాడు.
ఇంగ దానికి ముగింపు పలకాలనుకుంటున్నాడు కోదండ.
ధనంజయోళ్ల ఇంటికెళ్లి, ఆ ముసిలోడికి గొరుగుతున్నంతసేపూ కోదండ ఆలోసిస్తానే ఉండాడు.
ఇంటికొచ్చినాంక కూడా అతని ఆలోసనలకు అంతులేకుండాపోయింది.
ఇంట్లో ఉంటే, ఊళ్లో పనికి పొమ్మని తొందరపెడతాడు నాయన. ఆయన తర్వాత ఆయన కొడుకుగా తాను...ఈ కుల వుర్తిని కొనసాగించాలని ఆయన కోరిక. సూస్తా ఉంటే తన జీవితాంతరం ఈ పని జేసుకునే బతికేటట్టు ఉండాది పరిస్థితి. ఊరోళ్ల దయా దాచ్చిన్యాలపైన ఆధారపడి బతికే బతుకూ ఒక బతుకేనా? దీన్నుండి ఎట్టాగైనా బయటపడాలని తీవ్రంగా ఆలోసించినాడు కోదండ.
మూదో రోజు ఒక స్థిర నిర్ణయానికొచ్చి...అర్థరేత్రి దాటినాంక ఇంట్లోనుండి పారిపోయినాడు కోదండ.
‘పట్నంలో బాగా సంపాయించి... ఊరికి తిరిగొచ్చి నాయన్నీ, అమ్మనీ, సెల్లినీ అందరినీ పట్నానికి తీసకపోయి ఆడే స్థిరంగా ఉండిపోవాల. తమ కులవుర్తిని పూర్తిగా వొదిలెయ్యాల. ఆ పైన జీవితాంతరం సుఖంగా, హాయిగా బతకాల. అది సూసి తమ బంధుగులూ, ఊళ్లోవాళ్లూ ఆచ్చెర్యపోవాల’... అనుకుంటా సీకట్లో గబగబ పట్నం వేపుకు అడుగులేస్తున్నాడు కోదండ.
+ + +
రాత్రంతా లారీ వోళ్లనూ, జీపు డైవర్లనూ బతిమాలుకుని ఎట్టాగో ప్రయాణించి, పట్నం పొలిమేరల్లోకి సేరుకున్నాడు కోదండ.
మూడు గంటలకు పైగా పాల వేనులో ఇరుక్కుని కూసోవటం వల్ల, ఒళ్లంతా తిమ్మిర్లు పట్టేసుండాది కోదండకు.
కాళ్లూ సేతులూ ఇదిలించి నడక మొదలుపెట్టినాడు.
ఆ సమయానికి ఇంకా సీకట్లు కమ్ముకునే ఉండాయి.
‘ఊరొదిలి పెట్టి ఎన్ని కిలోమీటర్ల దూరం వొచ్చుంటాం?...ఏమో?, చానా దూరమే వొచ్చుంటాం! తాను పట్నానికి వొచ్చుంటానని నాయన ఊహించకపోవచ్చు. ఊహించినా, ఇక్కడ తన జాడ తెలుసుకోటం అంత సులభం కాదు. ఈ జనంలో ఏ మూల తనుంటాడో, ఎవుడు కనిపెట్టగలడు? కనక తన గురించి తెలుసుకోటం తన వాళ్లకు కష్టమే.’ అని అనుకుంటా గబగబ ముందుకు అడుగులేస్తున్నాడు.
అట్టా ఎంతసేపు నడిసుంటాడో తెలీదు.
నడిసి నడిసి బాగా నీరసించి పోయినాడు. దాంతో నిదానంగా నడస్తా ఉండాడు.
క్రమంగా ఆకాశంలో తూరుపు నుండి వెలుగు కనిపించసాగింది. సూర్యుని కిరణాలు మెల్లమెల్లగా భూమిని తాకసాగినాయి. కాకులు కావుకావు మంటున్నాయి.
అక్కడక్కడా ఒగరిద్దరు మనుసుల కదలికలు కనిపిస్తా ఉండాది.
రోడ్డు పక్కగా ఒక పెద్ద తాటితోపు కనిపించింది. ఆ తోపుకు ఎనకవైపు ఏముండాదో తెలియనంత దట్టంగా తాటిసెట్లు పెరిగుండాయి.
ఆడొక సదును బండరాయి కనిపిస్తే, కొంచేపు ఆడ కూసోని పోదామనుకుని, వెళ్లి దానిమీద కూసున్నాడు కోదండ.
కొంచేపటికి ఆ తాటితోపులో సందడి మొదలైంది.
ఐదారుగురు కల్లుగీత కార్మికులు ఆ తాటితోపులోకి అడుగుపెట్టినారు. వాళ్ల ఎనకే మరికొంతమంది మనుసులు వొచ్చినారు.
ఒక్కో కార్మికుడూ ఒక్కో తాటిసెట్టు దగ్గరికెళ్లి, సెట్టును భక్తి పూర్వకంగా సేత్తో తాకి కండ్లకద్దుకున్నాడు.
ఆనక సెట్లెక్కటం మొదలుపెట్టినారు. వాళ్లు అలాగ్గా అట్టా సెట్లెక్కుతుంటే సూడ్డానికి రెండు కండ్లూ సాలటం లేదు. ఎంత పట్టు... ఎంత లాఘవం... పైకెళ్లినోళ్లు నడుము దగ్గరున్న కత్తిని తీసుకుని లేత తాటి వొంబాల్ని తెగ్గోసి, తాడుకు కట్టి కిందికి జారస్తా ఉండారు. కింద ఉండేటోళ్లు వాటిని జాగర్తగా పట్టుకుని, తాడు నుండి వాటిని ఏరుసేసి ఒకపక్కగా కుప్పగా పోస్తా ఉండారు.
ఇంతలో...
అక్కడికి ఒక న్యూస్‍ఛానల్ వాళ్లు కెమెరా, మైక్‍తో ప్రత్యచ్చమయినారు.
రకరకాల కులవుర్తులు సేసుకునే వాళ్ల బతుకుల్ని, జీవన విధానాల్ని, అనుభవాల్ని ఒడిసి పట్టుకునే ప్రెయత్నంలో భాగంగా... తెల్లార్తోనే ఆడికి సేరుకున్నారు వాళ్లు.
ఒక్కో మనిసి దగ్గరికీ పొయ్యి మాట్లాడించేదానికి ప్రెయత్నిస్తున్నారు. అదేదో సూడ్డానికి తమాసాగా అనిపించింది కోదండకు.
లేసి వాళ్ల దగ్గరకు పోయినాడు.
ఒక పాతికేళ్ల యువకుడు విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తున్నాడు...‘‘మా అమ్మానాన్నలు ఈ పని చేస్తూనే నన్ను కష్టపడి చదివించారు. నేను బెంగుళూరులో చదువు పూర్తిచేసి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. ఈ సీజన్లో తాటి ముంజలకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకని మా నాన్నకు సాయంగా ఉందామనీ ఇక్కడికొచ్చాను. మాకు ఈ తోపులో ఇరవై, ఇరవైఐదు తాటిచెట్లున్నాయి. తరతరాలుగా ఇవే మాకు ఆస్తి. వీటి మీద వచ్చేదే మాకు ఆదాయం. తెల్లవార్తో తాటికాయల్ని క్రిందికి దింపుకుని, ఆటోలో మార్కెట్‍కు తీసుకెళ్లో, లేక వీథులు తిరిగో సాయంత్రానికల్లా అమ్ముకొచ్చేస్తాను. నాకు మంచి ఉద్యోగం వచ్చినా వీటిని మాత్రం వదులుకోను. ఇవి మాకు కులదేవతలతో సమానం...’’ అంటూ చెప్పుకుపోతున్నాడు ఆ యువకుడు.
‘‘ఇంతకూ మీరెంత వరకూ చదువుకున్నారు?’’ అడ్డుపడి ప్రశ్నించినాడు విలేఖరి.
‘‘బి.టెక్.’’
ఉలిక్కిపడినాడు కోదండ.
‘ఎంత గొప్ప సదువు! అంత సదువు సదివీ, తాటిసెట్లను మాత్రం వొదులుకోనంటున్నాడే?! ఎందుకట్టాంటి గెట్టి నిర్ణయం తీసుకున్నాడు?...’
ఆలోసిస్తా ఆడనుండి కదిలినాడు కోదండ.
+ +
మద్దేనమైంది!
రోడ్డుకు పక్కనుండే ఇండ్లను సూసుకుంటా నడస్తా ఉండాడు కోదండ.
‘రేపట్నించి ఈ పట్నంలో ఎట్టా బతకాల? బతకాలంటే, ఏదో ఒక పని సెయ్యాల. తనేం పని సెయ్యగలడు? అసలు తనకు ఏమేం పనులొచ్చు?’... ఆలోసనలో పడినాడు.
బాగా ఆలోసిత్తే... ‘తనకు పెద్ద పెద్ద పన్లేమీ తెలియదని తేలింది. కనక, తను ఇప్పుడు సిన్నా సితకా పనుల్నే సెయ్యాల. లేదంటే కూలీ పనికి పోవాల...’ అనుకుంటా ముందుకు నడస్తా ఉండాడు కోదండ.
ఆడొకసోట సెట్టుకింద ఒక సాకలి మనిసి తోపుడు బండిమింద గుడ్డల్ని నీటుగా ఇస్త్రీ జేస్తా ఉండాడు. ఆయన పెండ్లాం ఇంటింటికీ పొయ్యి గుడ్డల్ని ఉడ్డేసుకొస్తా ఉండాది. ‘ఒక దినానికి ఎంత సంపాదిస్తారో వీళ్లు?’ అడిగి తెలుసుకుందామనుకుని... వాళ్లదగ్గరికి పొయ్యి...‘‘మడేలన్నా, ఒక ప్యాంటూ సర్టుకూ ఇస్త్రీ జెయ్యాలంటే ఎంత తీసుకుంటావన్నా...’’ అని సూటిగా అడిగినాడు కోదండ.
ఆ పిలుపుతో సర్రున కోపమొచ్చింది అతనికి.
‘‘ఏమన్నావ్? మడేలా...నా? ఎవుడు మడేలు? నేను మడేల్ని కాను?’’ అన్నాడతను కోపంగా.
‘‘అంటే, అదీ... నువ్వు గుడ్డల్ని ఇస్త్రీ జేస్తా ఉంటే అట్టా అనుకున్నానన్నా...’’ అంటా నసిగినాడు కోదండ.
‘‘ఇస్త్రీ జేస్తే మడేల్నా? నేనేం మడేల్ని కాను. మాది ఏరే కులం. ఐదేండ్ల కిందట టవున్‍క్లబ్ జంక్షన్‍లో మాకు పెద్ద డ్రై క్లీనర్స్ సాపు ఉండే. మొదట్లో అది బాగానే జరిగే. నలుగురు మనుసుల్ని పెట్టుకుని, కరెంట్ ఇస్త్రీ పెట్టెల్తో ఇస్త్రీ జేసి, గుడ్డల్ని మల్లి పువ్వుల్లాగా కవర్లల్లో ఏసి కస్టమర్లకు ఇచ్చేటోణ్ణి. కానీ, రాన్రానూ కస్టమర్లు తగ్గిపోయి సాపు మూతబడే. ‘ఇప్పుడేం జెయ్యాల? ఎట్టా బతకాల?’ అని ఆలోసించి ఈదిన పణ్ణా. ఈ కాలనీ జూసుకుని, ఈ సెట్టుక్రింద సెటిలైనా! ఇండ్లకాడికి మేమే పొయ్యి ఉడుపులు ఉడ్డేసుకొచ్చి ఇస్త్రీ జేసిస్తున్నాం. ఇంట్లో ఐరన్ బాక్సులున్నా ఇస్త్రీ జేసే ఓపిక మనుసుల్లో లేకపోవటంతో... మా అట్టాంటోళ్లు ఇట్టా బతకతా ఉండాం. అంతేగానీ, నేనేం మడేల్ని కాను.’’ అంటా ఒక పెద్ద ఉపన్యాసమే ఇచ్చినాడతను.
నోరు తెరుసుకుని ఆయన మాటల్ని ఇంటా ఉండిపోయినాడు కోదండ. తర్వాత ఆణ్ణించి బయలుదేరినాడు.
ఆచ్చెర్యంగా ఉందతనికి! ‘పట్నంలో... ఎవురెవురో... ఏదేదో కులవుర్తుల్ని జేసుకుని బతికిపోతా ఉండారు. మరి ఆ కులంలోనే పుట్టినోళ్ల గతి ఏమైపోవాల? వాళ్లెట్టా బతకాల?’
ఆలోసిస్తా ముందుకు నడిసినాడు కోదండ.
+ + +
ఆ రోజంతా ఊరు తిరగతా ఉండిపోయినాడు కోదండ.
తెచ్చుకున్న డబ్బుల్లోంచి మద్దేనం భోజనానికి మాత్రం ఖర్సుపెట్టినాడు. ఇంకొంచిం డబ్బు మిగిలుండాది, అంతే!
సాయంకాలమైంది. సీకట్లు కమ్ముకుంటా ఉండాది.
ఈదులు జూసుకుంటా నడస్తా ఉండాడు కోదండ.
గంగమ్మ గుళ్లో నుండి ‘సండోలు’ వాయిస్తున్న శబ్దం, ‘గంట’ కొడుతున్న శబ్దమూ ఇనిపించినాయి.
గుళ్లోకి నడిసినాడు. గర్భగుడి ముందర పరదా ఏసుండారు. అమ్మోరికి అభిసేకం జరిగేటట్టుంది. అభిసేకం జరుగుతున్నంత సేపూ ఆ శబ్దాలు ఇనిపిస్తానే ఉండాయి. కొంచేపటికి పరదాను తొలిగించినారు. అయ్యోరు కర్పూర ఆరతి ఇస్తా ఉంటే... కండ్లు మూసుకుని అమ్మోరిని మొక్కుకున్నాడు కోదండ.
ఆరతిని కండ్లకద్దుకుని, తీర్థం తీసుకుని నోట్లో పోసుకున్నాడు.
ప్రదచ్చిణ జేద్దామని ముందుకెళ్లి కుడివైపుకు తిరగ్గానే... ఆడ కనిపించిన దృశ్యాన్ని సూసి ఆచ్చెర్యపోయినాడు కోదండ.
అక్కడ సండోలు, గంటల శబ్దాలు ఇనిపిస్తా ఉండాయి. కానీ వాటిని వాయించే వాయిద్యగాళ్లే లేరక్కడ. వాటిని ఒక మిషిను వాయిస్తా ఉండాది. కట్టితో సండోలు మీద దెబ్బలేస్తా ఉంది. తాడును పట్టుకోని ఇంగో మిషిను గంట కొడతా ఉంది. మనుసులు లేకనే వాయిద్యాలు మోగతా ఉండటం వింతగా అనిపించింది కోదండకు. ఇంతలో ఒక మనిసి ఆడికొచ్చి, ఆ మిషిను స్విచ్చిను ఆపు జేసినాడు. అంతే! అవి వాయించటం ఆపేసింది.
విసిత్రంగా వాటినే జూస్తా...గుళ్లోనుండి బయటికొచ్చినాడు కోదండ.
‘మనుసులు వాయించాల్సిన వాయిద్యాలను మిషిన్లు వాయిస్తున్నాయ్. ఇట్టా అన్నింటికీ మిషిన్లు వొచ్చేస్తే... ఇంగ మనుసులెట్టా బతకాల? రేపు ఏ క్యాసెట్టునో, సి.డి.నో పెట్టి దేవుడి స్తోత్రాలు, శ్లోకాలు ఇనిపించేలా జేసి... పూజజేసే అయ్యోరును గూడా పక్కన బెట్టినా ఆచ్చెర్యపడాల్సిన పన్లేదు. అట్టాగే... దేవుళ్లకు మర మనుషుల(రోబోలు) ద్వారా అభిషేకాలూ, పూజలూ, హారతులూ సెయ్యిస్తారో? ఏమో? అప్పుడు ఈ కులవుర్తుల మీదే ఆధారపడి బతికే మనుసుల బతుకులు ఎట్టుంటాయ్?’...
ఆలోసిస్తా ముందుకు అడుగులేసినాడు కోదండ.
+ + +
కోదండ పట్నానికొచ్చి రొండు దినాలైంది.
అతని దగ్గరున్న డబ్బంతా ఖర్సయిపోయింది. కానీ అతనికి పనిమాత్రం దొరకలేదు. మనిసి ఊరికి కొత్త కావటంతో ఎవురూ అతనికి పనియ్యలేదు. ఓటల్లో పని దొరికితే అన్నానికి లోటుండదని ఆశించినాడు. కానీ ఏ ఓటల్లోనూ అతనికి పని దొరకలేదు.
రోజూ పని కోసరం ఊరంతా తిరగటం... రేత్రయితే బస్టాండ్లో పడుకోవటం సేస్తున్నాడు.
బతకటానికి తానిప్పుడు ఏం జెయ్యాల్నో అతనికి తెలియటం లేదు.
ఈ రొండురోజుల్లో అతను మెయిన్ బజార్లో ఉండే ‘సూర్య హెయిర్ సై్ట ల్స్’ సాపు ముందునుండి చానాసార్లు తిరిగినాడు. ఆడ ఎప్పుడు జూసినా కస్లమర్లు నిండుగా ఉంటున్నారు.
సివరికి వేరే దారిలేక... అందులో పని సేయటానికే సిద్దపడినాడు కోదండ.
అందుకే ఆ సాపు యజమానిని పని కోసరం అడగాలని నిర్ణయించుకున్నాడు.
ధైర్నంజేసి ‘సూర్య హెయిర్ సై్ట ల్స్’ సాపులోకి అడుగుపెట్టినాడు.
ఆ సాపులో గుండ్రంగా తిరిగే సెయిర్లు నాలుగుండాయ్. ఆ నాలుగు సెయిర్లలోనూ నలుగురు కస్టమర్లు కూర్సోనుండారు. వాళ్లల్లో ఇద్దరు కస్టమర్లు క్రాపు కత్తిరించుకుంటున్నారు. ఒక కస్టమరు గెడ్డం గీయించుకుంటుంటే, ఇంగో కస్టమరు తలకు రంగు ఏయించుకుంటున్నాడు. ఇంగా ముగ్గురు కస్టమర్లు తమ వొంతు కోసరం ఎదురుసూస్తా, ఆ దినం నూస్‍పేపర్ సదవతా కాలచ్చేపం జేస్తా ఉండారు. పని పూర్తయినాంక ప్రెతి కస్టమరూ, ఆడ సోఫాలో కూర్సోనుండే ఒగ పెద్దమనిసికి డబ్బిచ్చి బయటికి పోతాండాడు. ఆ పెద్దమనిసి నల్ల కండ్లద్దాలు పెట్టుకుని, టీసర్టు ఏసుకుని బలిష్ఠంగా ఉండాడు.
నేరుగా అతని ముందుకుపోయి నిలబడినాడు కోదండ.
‘‘నమస్తే అన్నా!...’’ అని పలకరించినాడు.
‘‘కొంచేపు వెయిట్ జెయ్యాల. ఆడ సోఫాలో కూర్చో పో!’’ అన్నాడతను కేర్‍లెస్‍గా.
‘‘అన్నా, నేను కటింగ్ కోసరం రాలేదన్నా....’’ విషయం ఎట్టా సెప్పాల్నో తెలియక నసిగినాడు కోదండ.
‘‘అయితే ఇంక దేనికోసరం వొచ్చినావ్?...’’ సూటిగా కోదండను ప్రెశ్నించినాడతను.
‘‘అన్నా, నేను మీ క్యాస్ట్ మనిసినే. ఈడ పని దొరుకుతుందేమోనని వొస్తిని...’’ అని తల గోక్కుంటా అన్నాడు కోదండ.
‘‘మీ క్యాస్ట్ అంటే?’’ సీరియస్‍గా అడిగినాడతను.
‘‘అదే అన్నా, బార్బర్ క్యాస్ట్!’’
‘‘నాది బార్బర్ క్యాస్ట్ అని నీకెవరు జెప్పినారు?’’ కోపంగా అన్నాడతను.
‘‘అదే అన్నా, ఈడ కటింగ్ అదీ... సేస్తన్నారు. ప్రెతి మనిసీ మీ సేతికే డబ్బిస్తా ఉండాడు. అందుకనీ ఈ అంగడి మీదే అనుకున్నా.’’
‘‘ఈ షాపుకు నేనే ఓనర్ని. అది నిజిమే! కానీ, నువ్వనుకున్నట్టు నేను బార్బర్ క్యాస్ట్కు చెందినవాణ్ణి కాను.’’అన్నాడతను.
‘‘ఆ...’’ అంటా నోరు తెరిసినాడు కోదండ.
‘‘నా పేరు షౌకత్ అలీ. లాభదాయకంగా ఉంటుందని ఈ హెయిర్ స్టయిల్ షాపును తెరిసినాను. ఏడు సమచ్చరాలుగా ఈ షాపును నడపతా ఉండాను. కాలేజీ స్టూడెంట్స్ కోసరమే ఇంత పెద్ద షాపును పెట్టినాను. నాకు తోడుగా నలుగురు మనుషుల్ని పెట్టుకున్నాను. అక్కడ పనిచేస్తున్నారే వాళ్లల్లో ముగ్గురు ఏరే ఏరే క్యాస్ట్లకు చెందినోళ్లు. సన్నగా పొడుగ్గా ఉండాడే జీన్స్ ప్యాంటు ఏసుకుని... ఆడొక్కడే బార్బర్ క్యాస్ట్కు చెందిన మనిషి. అయినా ఈ పని జెయ్యాలంటే పని తెలుసుండాలే కానీ, క్యాస్ట్తో పనేమిటికి?...’’ అన్నాడు ఆ మనిసి.
‘‘మరి నీకొచ్చా అన్నా మా పని?’’ అమాయకంగా అడిగినాడు కోదండ.
‘‘రాకేం. ఎవురైనా పనిలోకి రాకపోతే, అవసరమైతే నేనూ పనిలోకి దిగిపోతా. కస్టమర్ ముఖ్యం. డబ్బు అంతకన్నా ముఖ్యం.’’ నవ్వతా అన్నాడు ఆ మనిసి.
కోదండ ఆచ్చెర్యంగా సూస్తా ఉంటే, ఆ మనిసి తన మాటల్ని కొనసాగించినాడు.
‘‘నువ్వు ‘షేక్ చిన మౌలానా’ పేరు ఎప్పుడైనా వినుండావా?’’
ఆయనెవరో ఇంకో పెద్ద సాపుకు ఓనరై ఉంటాడనుకున్నాడు కోదండ.
‘‘ఆయన ఓ గొప్ప నాదస్వర విద్వాంసుడు. దేశ విదేశాలలో కచేరీలు చేసి, మహా మహా పండితుల చేత శెబాష్ అనిపించుకున్న మనిషి. ఆయన పుట్టింది మా క్యాస్ట్లో. పేరు తెచ్చుకునింది ఇంగో దానిలో. మరి దీనికేమంటావ్?’’ కండ్లెగరేస్తా అన్నాడతను.
అట్టాగా అన్నట్టు తలాడించినాడు కోదండ.
‘‘ఇంతకీ నీకేం గావాల?’’
‘‘అన్నా, నేనూ సేవింగూ, కటింగూ సేయగల్ను. నాకూ ఈడ పనిప్పిస్తే...’’
‘‘చూడూ, ఒళ్లొంచి పనిజేయాల. పనిమీద గెవనం పెట్టాల. నువ్వెంతమందికి పని జేస్తే, అది షేవింగ్ అయితే 10 రూపాయలు, కటింగ్ అయితే 20 రూపాయలు మాత్రమే నీకు ముడుతుంది. ఏ రోజు డబ్బులు ఆ రోజు సాయంత్రమే నీచేతికిచ్చేస్తా. నీ కిష్టమైతే ఇప్పుడే పన్లోకి జేరు, లేకుంటే ఈణ్ణించి కదులు.’’ అంటా నిక్కచ్చిగా సెప్పినాడు ఆ మనిసి.
కోదండ సేతిలో ఇప్పుడు సిల్లిగవ్వ లేదు. మద్దేనానికి కడుపు మాడ్సుకున్నా, రేత్రికి ఏదో ఒగటి తిని కడుపు నింపుకోవాల. అందుకే ఇంగో ఆలోసన ఏదీ లేకుండా పన్లోకి సేరిపోయినాడు.
సాయింత్రం వరకూ నిలికిడి లేకుండా పనిజేసినాడు కోదండ.
ఆ సాయింత్రం సేతికి డబ్బందగానే సాపు నుండి బయటికొచ్చినాడు.
రోడ్డుమింద నడస్తా ఆలోసనలో పడినాడు.
‘నేను అవమానకరమని భావించి వొదిలేయాలనుకున్న పనిని...ఈ మనిసి సొంతం జేసుకుని, నాలుగు సెయిర్లేసి, నలుగురు మనుసుల్ని పెట్టుకుని, కాలుమింద కాలేసుకుని ఎంత ఈజీగా సంపాయిస్తా ఉండాడు. ఎంత గౌరవంగా బతకతా ఉండాడు. ఒక సాయిబే ఈ పని జేసుకుని బతికిపోతా ఉంటే, మంగలి కులంలోనే పుట్టి, పెరిగి, ఆ వుర్తి నేర్సుకున్న నేను... ఇంగెంత గొప్పగా బతకొచ్చు! నాలుగు సెయిర్లు ఏసుకుని, నలుగుర్ని పెట్టుకునే స్తోమత తనకిప్పుడు లేకపోవచ్చును గానీ, ఒక్క సెయిరునైనా ఏర్పాటుజేసుకుని గౌరవంగా బతకలేమా?...
అందుకే ఎంటనే ఊరెళ్లిపోయి, నాయన్నడిగి, ఇల్లును అమ్మి అయినా సరే, ఈ పట్నంలో ఒక సాపును తెరవాల...’ అని ఆలోసిస్తా... గబగబ బస్టాండుకేసి అడుగులేసినాడు కోదండ.
() () ()
Mar 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు