కథలు

(March,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

చిలకలు 

వాన వస్తుంది అనుకుంటా. తూనీగలు గుంపులుగా ఎగిరి గుసగుసలు చెప్పుకుంటున్నట్టు దగ్గరగా కూడుతుంటే వాన వస్తుందని మా అమ్మమ్మ చెప్పింది. ఒక్కోసారి ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు తన భయం దాచుకుని, నాకు ధైర్యం ఇవ్వడం కోసం "అర్జునా, పార్ధా "అని అర్జునుడి పది పేర్లు గడ గడా చదివేస్తుంది. 

ఆకాశం నల్ల మబ్బేసుకోగానే మొదలైంది నాలో ఆత్రం, అది స్కూలు వదిలే సమయం అయితే నాకు తిట్లు ఏ కోశానా తప్పవు. స్కూల్ నుంచి ఇంటికి హాయిగా తడుచుకుంటూ వెళ్ళాలి అనిపించింది. తెల్ల యూనిఫామ్‌ ఎందుకు పెట్టారో బడిలో. ఇంటికి వెళ్లే లోపు తడిచి ఎర్రగా చేయడంలో ఆరిందా. ఇంట్లో అల్లరి చేస్తున్నానని అమ్మమ్మ దగ్గర పెట్టి చదివిస్తున్నారు. అమ్మమ్మ నాకు కాపలాయో నేను అమ్మమ్మకు కాపలాయో.

దూరంగా ఆకాశంలో నా బొట్టుబిళ్లంత నల్లమబ్బు. అది నుదురంతయ్యి, నా పొడవాటి జుట్టు కొసంతయ్యి, నా కాలి మడమ అంత సాగి... బాబోయ్‌.. తొందరగా ఇల్లు చేరాలి.. లేకుంటే వానలో తడిచిపోతాను. ఈ వాన ఏదో పొద్దున పడుంటే స్కూల్ కి సెలవు వచ్చేది. ఎనిమిదో క్లాసు బి సెక్షన్‌లో మొత్తం ఎనిమిది మంది అమ్మాయిలు. నాతో వచ్చేది మా ఆల్ ఇండియా రేడియో, సౌజన్య ఒక్కతే. దీనికి తెలీని వార్త లేదు, చెప్పని కబుర్లు లేవు. ఇవాళ అది డుమ్మా. రోజూ మూడు కిలోమీటర్లు ఉండే స్కూల్‌ని ఆరు సినిమా మాటలతో నడిచేస్తాం. ఇవాళ అడుగులు సాగందే. ఏదో బోరు సినిమా చూస్తున్నట్టు.

ఇంకో వీధి దాటితే మా ఇల్లు. ఇంతలో వనజక్క ఇంటి ముందు షామియానా.

'ఓ... చిలకలు' అనుకున్నా సంబరంగా.

కాని అటువైపు వెళ్లడానికి లేకుండా వీధి మొదల్లో నాలుగు తాటి దుంగల్ని అడ్డుగా పడేశారు. ఒక పెద్దాయన భుజాన గళ్ళటి టవలు వేసుకుని రేకు కుర్చీలో కూచుని ఉన్నాడు బండ్లు, సైకిళ్లు రానీకుండా అనుకుంటా.

'ఇటు నుంచి కాదు అమ్మాయ్‌.. అటు నుంచి వెళ్లు' అన్నాడు. ఇంకో వీధి నుంచి మా ఇల్లు కొంచెం దూరమే. కాని చిలకల కోసం పరిగెత్తా.

ఇంటికెళ్లే సరికి అమ్మమ్మ లక్ష్మికి కుడుత్తొట్టిలో తౌడు కలుపుతోంది. గొడ్ల సావడి గేటు తీయగానే ఆ చప్పుడుకి నేను అని తెలిసినా లేచి చూసింది.

'త్వరగా రావచ్చు కదా. నా చేత్తో పెట్టేదాన్ని. ఇప్పుడు చూడు నువ్వూ ఆకలికి ఆగవు, ఇదీ ఆగదు' అంది మోచేతి వరకు చేతులు అందులో ముంచుతూ.

'ఖోఖో ఆడుకున్నాము' అన్నాను.

'సర్లే. ఆ జల్లెడ షెల్ఫులో బూంది పెట్టాను.  కాళ్ళు చేతులు కడుక్కొని తిను' అంది.

'చిలకలు ఎక్కడ పెట్టావు?'

'చిలకలు లేవు... ఎలకలు లేవు... వెళ్లి బూంది తిను'

'వనజక్క ఇంటి ముందు షామియానా వేశారుగా'

'వేస్తే? ప్రతిసారీ మనకు చిలకలు పంపాలని ఉందా? ఇంట్లోకి పో.' అంది.

అమ్మమ్మ అంత విసురుగా ఎప్పుడూ మాట్లాడదు. బెదిరి ఇంట్లోకి వచ్చి వంటింట్లోకి నడిచా.

జల్లెడ షెల్ఫు వంటింట్లో ఉంటుంది. అది ఒక చిన్న చెక్క జాలీ అల్మారా. ఫ్రిడ్జ్‌ లేని కాలంలో అదే ఫ్రిజ్జు అమ్మమ్మకు. చద్దన్నం, పిండి వంటలు ఇందులో పెట్టేది. దాని తలుపులకి చిన్న గొళ్ళెం ఉండేది. ఒక్కోసారి సరిగ్గా పట్టేది కాదు. ఒక పుల్లో లేక కొప్పు పిన్నో అందులో దూర్చేది. తెరిచి బూంది తిసుకున్నా. స్టీలు గిన్నెలో వేసుకొని బొక్కుతున్నానుగాని చిలకలు ఏమయ్యాయి చెప్మా అనేదే ఆలోచనా.

నేను ఐదో క్లాసులో ఉండగా వనజక్క ఇంటి ముందు షామియానా వేశారు. ఇంటికి వచ్చి చిలకలు, తాంబూలం ఇచ్చి శుభవార్త చెప్పారు. వనజక్క పెద్దమనిషి అయ్యిందంట. ఏడో క్లాసులో ఉండగా వనజక్క ఇంటి ముందు మళ్లీ షామియానా వేశారు. చిలకలు, తాంబూలం తెచ్చి శుభవార్త చెప్పారు. వనజక్క పెళ్లట. మొన్న ఆరునెలల పరీక్షలప్పుడు మళ్లీ షామియానా వేశారు. వనజక్క సీమంతం అట. ఈసారి చిలకలు చాలా ఇచ్చారు.

తియ్యగా ఉండే ఆ చిలకలు నాకు చాలా ఇష్టం. ఊళ్లో చాలా ఇళ్ల ముందు షామియానాలు వేసి ఫంక్షన్లు చేసేవారు. కాని వనజక్క వాళ్ల ఇంట్లోనే ఎప్పుడు షామియానా వేసినా చిలకలు ఇచ్చి మరీ పిలుపులు పిలిచేవారు. 

'ఎప్పుడూ ఇవే ఎందుకు ఇస్తారు?' అని అడిగాను ఒకసారి అమ్మమ్మను ఆ చిలకలు తింటూ.

'ఇంట్లో మంచి జరుగుతుంటే ఆ కబురును తీపితో చెబుతారులే' అంది అమ్మమ్మ.

ఒక్కోసారి చిలకలు వెగటు పుట్టి వదిలేసేదాన్ని. ఇంక తినను అని అమ్మమ్మ తేల్చుకుని మిగతావి పప్పు గుత్తితో దంచి పంచదార కింద వాడేసేది. 

'మరి? ఏమనుకున్నావు మా అమ్మంటే? ఆ తరం తెలివి, పొదుపు అలా ఉండేది మరి. మీలా తట్ట తగలేసి పేలాలు వేయించడం కాదు' అని మా అమ్మ ఆ తర్వాతి రోజుల్లో అనేది.

అమ్మమ్మ నన్ను గట్టిగానే పెంచింది. 

'అంత గట్టిగా రిబ్బన్‌ కట్టినా జడలు ఎందుకు కట్టినవి కట్టినట్టు ఉండట్లేదు? రోజూ ఎందుకు బడి నుండి వచ్చేసరికి మొత్తం ఊడిపోతున్నాయి?' అని వీపు విమానం మోత మోగించి, చిలకలు పెట్టలేదు ఒకరోజు నాకు. కొట్టినందుకు కాక చిలకలు పెట్టనందుకు నాకు ఎక్కువ బాధ వేసింది.

బూంది తినడం పూర్తి చేసి గ్లాసెడు నీళ్లు తాగేశాను. ఇప్పుడు ఆకాశం పూర్తిగా మూసుకుంది. ఇంక ఇప్పుడో మరునిమిషమో వాన కురిసేస్తుంది. 

అమ్మమ్మ పనులు ముగించుకుని లోపలికి వచ్చింది.

'నేను వనజక్క ఇంటికి వెళ్ళొస్తా. తాత, చిన్నమామ వచ్చే వేళయ్యింది. వేడి నీళ్ళకి కాగు కింద మంట పెంచి, రెండో పొయ్యి మీద ఎసరు పెట్టు, అరగంటలో వస్తా' అని హడావిడిగా బయల్దేరింది.

'నేను కూడా వస్తా ఫంక్షన్‌ కి' అని అమ్మమ్మ చీర కొంగు అంచు పట్టుకున్నా.

నా మాట పూర్తి అయ్యే లోపు, 'వద్దు. ఇది ఫంక్షన్‌ కాదు. పిల్లలు రాకూడదు. భయపడతారు' అని వెళ్ళిపోయింది.

ఆ రాత్రి చాలా వాన కురిసింది. తాత, మామ వచ్చే సరికి కరెంటు పోయింది. లాంతరు వెలుగులో భోజనం వడ్డిస్తూనే చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. "నెలలు నిండిన  వనజక్క హాస్పిటల్లో చాలాసేపు ఇబ్బంది పడిందట. పుట్టిన బిడ్డ కూడా అమ్మ మాట్లాడటం లేదని తనూ మాట్లాడలేదు" అని ఆ మరుసటి రోజు స్కూల్ కి వెళ్తూ సౌజన్య చెప్పింది.

అందుకని షామియానా వేశారట.

నేను ఈనాటి వరకూ మళ్లీ చిలకలు తినలేదు.


ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు