కథలు

(March,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

స్ఫూర్తి 

        లేఖిని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. లోపల సాగర మధనమే జరుగుతోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆమె ఆశించినట్లు ఉండకపోవడమే కారణమని మనసు బల్లగుద్ది చెబుతోంది.

ఈ వాతావరణాన్ని మార్చలేమా అన్నదే అనుక్షణం ఆమెను వేధిస్తున్న ప్రశ్న. అది ఉషోదయంతో ప్రారంభమై అరుణోదయంతో కూడా ముగియటం లేదు. రెప్ప మూత పడే వరకు ఆమె అలా సతమతమవుతూనే ఉంటుంది. అది ఆమె భరించలేకపోతోంది. ఏం చెయ్యాలి ? ఏం చెయ్యాలి అన్న ఆలోచనే ఆమెను నిలువనివ్వటం లేదు. అన్యమనస్కంగానే పనుల్లో పడింది. కాలం మనకోసం    ఆగదుగా!

 

                                            *             *           *          

 

ఎల్.ఐ.సి ఆఫీస్ లో అడుగు పెట్టింది లేఖ. అందులో ఆమె క్లర్కుగా పని చేస్తోంది. లోపలికి రాగానే తోటి ఉద్యోగి "హాయ్! లేఖా!గుడ్ మార్నింగ్" అంది. 

 అప్పటిదాకా ఏదైతే కాసేపు పక్కకు పెడదామని ప్రయత్నిస్తోందో అదే ఆలోచన ఆమె కళ్ళ ముందు మళ్లీ ప్రత్యక్షమైంది.

"శుభోదయం" అని హాయిగా మధురమైన తెలుగులో పలకరించుకోవలసింది పోయి ఈ గుడ్ మార్నింగ్ లు ఏమిటో..మనసు మూగబోయింది.

చిన్న చిరునవ్వును సమాధానంగా ఇచ్చి తన సీట్లో కూర్చుంది.

 

ఒక గంట తర్వాత మేనేజర్ లోపలికి రమ్మని పిలిచారు .ఏమిటా అని లోపలికి వెళితే ప్రమోషన్ వచ్చిందని శుభవార్త చెప్పారు.     ఆనందాన్ని అనుభవించే లోపే శుభాకాంక్షలు తెలుపటానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చేతులు ముందుకు జాపారు ఆయన.   

 

మళ్ళీ తనే వెనక్కు తీసుకున్నారు మీకు షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇష్టం ఉండదు కదా అని.             

 

"అభినందనలు" అన్నారాయన.

"కృతజ్ఞతలు  సార్ !"అని చెప్పి బయటకు వచ్చింది.

.           

 

ఇంతలో మేనేజర్ బదిలీ అవడంతో ఆ స్థానంలో కొత్తగా చేరటానికి వేరే ఆయన రావటంతో మళ్లీ సందడి మొదలైంది.

ఆమెలో ఘర్షణ కూడా. ఎందుకంటే అక్కడ మళ్లీ షేక్ హ్యాండ్ లు ప్రత్యక్షమయ్యాయి.

అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అంతటివారు మన నమస్కారం లో భారతదేశం సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడుతుంది అని ప్రశంసిస్తుంటే మనమేమిటో ఇలా.. మనసు మూగగా  రోదించడం ప్రారంభించింది.         

 

ఇంతలో తన వంతు రావడంతో రెండు చేతులు జోడించింది. "నమస్కారం !"అంటూ  ఆయన ముందుకు చాచిన చేతిని వెనక్కు తీసుకుని "నమస్కారం!"" అంటూ రెండు చేతులు జోడించారు. 

ఆయన కళ్ళల్లో ఈ వింత ఏమిటి అన్న ప్రశ్న ఆమె గమనించి కూడా పట్టించుకోలేదు.

ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఆ ఇద్దరు మేనేజర్లు మధ్య ఓ అరగంట చర్చనీయాంశం అవుతుంది.     పాత చింతకాయ పచ్చడి అని తనను వెలాకోళం చేసుకుంటారు. అయినా ఏమీ అనిపించదు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఒకరికి ఒకరు గమనించుకుంటూ విరుపులు విరిచేస్తారు. అది మామూలే అయినా ఆమె తన పద్ధతి మార్చుకోదు.వాళ్లే మారాలి .వారిలోనే మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది పడి లేచే కెరటంలా .ఎప్పటికైనా తను ఆశించిన తీరం చేరక పోతానా అనే మనోధైర్యంతో ముందుకు సాగుతూనే!

 

                                                        *          *            *                             

 

       

కాఫీ పెడదామని వంటింట్లోకి నడిచింది లేఖ.     

 

కాస్త సమయం దొరికితే టీ.వీ ముందు వాలిపోతాడు భర్త 'భరద్వాజ్ '.

 

ఎప్పుడూ అలా టీ.వీ చూడటం నచ్చదు. అయినా భార్యాభర్తలు కలిసి కలకాలం ఉండాలని సర్దుకుపోతుంది. కాఫీ తాగే ఆ కాసేపు అతనికి కంపెనీ ఇస్తూ ఉంటుంది. ఏదో ఈమధ్య వచ్చిన సినిమా  లాగుంది. అతను చూస్తున్నాడు.

కొత్తగా పెళ్ళైన జంట ఏదో గొడవ పడి 'నువ్వు వర్జిన్  వా?' అని అడిగే స్థాయిలో కొట్టేసుకుంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులను అద్దం పడుతున్నా లేఖ మనసు రోదిస్తూనే ఉంది. 

సమాజం ఇలా మారిపోయింది ఏమిటని?

శీలానికి ఎంతో విలువ ఇచ్చే వాళ్ళం. ఇప్పుడు అది ఎక్కడా కనిపించడం లేదు.

ఇద్దరి పోట్లాట తారాస్థాయికి వెళ్ళిపోతోంది. 

"నాతో ప్రేమ వ్యవహారం నడుపుతూనే మరొకరితో మాటలు కలపలేదా?" హీరో ప్రశ్న.

"పెళ్లి చూపుల్లో మీరు పది మందిని సెలెక్ట్ చేసుకోగా లేనిది మాకు ఎంచుకునే హక్కు లేదా?" అని హీరోయిన్ ఎదురు ప్రశ్న.

   ఇదయితే  కొంత ఫరవాలేదు. నిశ్చయ తాంబూలాలు అయ్యాక కూడా సంబంధం వదిలేసుకుని మరో మంచి సంబంధం వచ్చింది అని ఎలాంటి బిడియం లేకుండా ఈమధ్య వేరే పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. జీవితాంతం అనుభవించేది. ఇలాంటి వాటిలో  మొఖమాట పడితే ఎలా అన్నది వారి సమాధానం.

మాట మీద నిలబడటం ఎప్పుడో మానేశారు.

తన ఆలోచనల్లో తను ఉండగానే  హీరో ఆమెను పొమ్మనటం  హీరోయిన్  పెట్టి సర్దుకుని వెళ్లిపోవడం జరిగిపోయింది.      

ఈమధ్య సినిమాలన్నీ బ్రేకప్ నేపథ్యమే !

భరద్వాజ్ మాత్రం చాలా సంతోషంగా సినిమాని ఆస్వాదిస్తున్నాడు.

ఏవో రెండు మాటలు మాట్లాడి పక్క గదిలోకి వెళ్ళిపోయింది లేఖ. 

ఆ ఖాళీ కప్పులను కడిగేసి వంటింట్లో బోర్లించేసింది.     

 

ఇంతలో 'ఆంటీ 'అంటూ పక్కింటి దీప్తి వచ్చింది.

" రా !లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం "అంటూ పెరట్లోకి తీసుకు వెళ్ళింది.     

 

ఆమె గోడు వినిపించుకొనే ఏకైక వ్యక్తి .ఇద్దరి భావాలు ఒక్కటే కావటంతో వాళ్ళిద్దరూ తొందరగా దగ్గర అయిపోయారు .

"ఏమిటి ?నాతో ఏమైనా పని ఉందా ?"అని అడిగింది.

"ఈయన క్యాంపుకు వెళ్లారు. పక్క పోర్షన్లో ఉండే కామేష్ ప్రవర్తన ఏమీ బాగోలేదు. వాళ్ళావిడ లేనప్పుడు ఫోన్ చేస్తాడు. టిఫిన్ తిన్నావా అని అడుగుతాడు. అంతటితో ఆగకుండా టిఫిన్ తినడానికి వాళ్ళింట్లోకి రమ్మంటాడు. ఆవిడ లేనప్పుడు అలా పిలవచ్చా? మగవాళ్ళంతా ఇలా తయారవుతున్నారు ఏమిటి ఆంటీ ?సంసారం గుట్టుగా చేసుకుంటున్నా మనతో అలా ప్రవర్తించటం తప్పు కాదా? విదేశాలులోలా  ఆడవారితో వారిలా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మనం మన దేశంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోంది. రాత్రికి నేను అక్కడ ఉండలేను. కొత్తగా రావడం వలన ఇక్కడ నాకు తెలిసిన వారు కూడా ఎవరూ లేరు మీరు తప్ప.

చివరి మాటలు అంటుంటే ఆమె గొంతు గద్గద మయ్యింది.

లేఖ ఆమె దగ్గర చేరి "భయపడే వాళ్ళనే లోకం మరీ భయపెడుతుంది .ఎదురు తిరిగితే తోక ముడుస్తుంది అని గుర్తుంచుకో దీప్తీ "అంది.

మా  ఇంటికి వస్తానని అడగాలా? వచ్చేస్తున్నాను అని చెప్పవచ్చు .నీకా హక్కు ఈ అమ్మ దగ్గర ఎప్పటికీ ఉంటుందని గుర్తుంచుకో."

 

"అంకుల్ కి ఇబ్బంది ఏమో?"

 

"ఏమీ లేదు .అలాంటి ఆలోచనలు ఏవీ రానీయకు."

 

"సరే ఆంటీ "

"ఆ ఆంటీ అనే పిలుపు మార్చు. బిచ్చగాడి దగ్గర్నుంచి అందరూ ఆంటీలు ..అంకుల్ అనే. చచ్చిపోతున్నాను వినలేక. అలాగే నువ్వు కూడా పిలుస్తున్నావ్.  బాగా అలవాటైపోయింది అందరికీ.   

 

"నిజమే అమ్మా!ప్రతిసారి అలా పిలవాలని వస్తాను . మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికే అలా పిలిచేస్తున్నాను.  

"పక్కనున్న నిన్నే మార్చలేక పోతే ఇక నేను ఎవరిని మార్చగలను? నువ్వే చెప్పు."     

 

"లేదు .లేదమ్మా .పిలుస్తానుగా."        

 "ఎన్నాళ్లకు?"

" క్షమించమ్మా"

" సరే రాత్రికి బోలెడు కబుర్లు 

 చెప్పుకుందాం. వచ్చేసేయ్."

"అలాగే. రాత్రి నిద్రపోకపోతే రేపు ఆఫీసులో మీకు నిద్ర వస్తుంది. మీ మేనేజర్ క్లాస్ పీకుతారు."

"అంత లేదులే" అని నవ్వేసింది లేఖ.  వెళ్ళిపోతున్న దీప్తిని చూసి లేఖ పక్కన చేరాడు భరద్వాజ్.   

 

"ఏమిటి కాసిన్ని కబుర్లు మా మీద ఒలకబోస్తావా ?"అంటూ.   

 

"టీ.వీ గారిని వదిలితే కదా కబుర్లు ..కాకరకాయలు.."   

 

"ఇప్పుడు అదే పని చేసి వస్తున్నాను ."

"ఎవరు నమ్ముతారు ?అక్కడ ప్రకటనలు  వస్తూ ఉండి ఉంటాయి.  విరామాన్ని మీరు  ఇలా   ఉపయోగించుకుంటున్నారు." 

 

  "నిజమే లేఖా!ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. కాస్త రిలాక్స్ 

 

అవుదామని అలా దాని ముందు కూర్చుంటాను.కానీ అందులో చూసేవి నాకేమీ నచ్చని నీకు తెలుసు ."

"అదే మరి .నచ్చనివి చూడటం ఎందుకు ?కాలాన్ని వృధా చేయడం తప్ప."

తన ఒళ్లో  పడుకున్న అతని వుంగరాల జుట్టుని సవరిస్తూ.   "నువ్వు అలా చేస్తుంటే స్వర్గంలో ఉన్నట్లు ఉంటుందోయ్."

" ఏం కావాలి ఏంటి? ఆకాశానికి ఎత్తేస్తున్నారు."

 

"ఇద్దరు బంగారాలను ఇచ్చావు.ఇంక నాకేం కావాలి?" అన్నాడు ఆమెకు కన్నుకొడుతూ.

" సిగ్గు లేదు .వాళ్ళకి పెళ్లి చేస్తే మనవళ్ళు వచ్చే వయసు."

" నీ దగ్గర నాకు సిగ్గు  ఎందుకోయ్?"

" చాల్లే ఊరుకోండి .ఎవరైనా వింటే నవ్విపోతారు."

" ఇక్కడ ఎవరు లేరు లేవోయ్.సందు దొరికితే అందరూ  ఫారిన్ పరిగెత్తే వారే." అంటూ  చమత్కరించాడు.

"మనమున్నాముగా"

"ఒకళ్లు అనుకుంటే ఏం సరిపోతుంది? అందరూ అనుకుంటేనే సమాజంలో మార్పు వస్తుంది."

"ఎందుకోయ్ అలా నిరాశ పడతావు ? ప్రతి వాళ్ళు ఇంజనీరు, డాక్టర్ అని చదువుతుంటుంటే మనం మన అబ్బాయిని ఉపాధ్యాయుడిని చేశాం .దానితో వేల మంది శిష్యులు బాగు పడే అవకాశాన్ని మన చేతుల్లోకి తీసుకున్నాం.అంతకన్నా  ఇంకేం కావాలి?"

" ఏమో! అంత చిన్నగా సరిపెట్టుకునే మనస్తత్వం కాదు నాది . పబ్  లని , డేటింగ్ లని మనది కాని సంస్కృతి వైపు మొగ్గు చూపుతూ యువత పెడదారి పడుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? వాటిని బాన్ చేయాలిగా."

 "ఎంత పిచ్చి దానివి లేఖా! మద్యం త్రాగటం హానికరం అని ఒక పక్క అడ్వర్ టైజ్మెంట్ ఇస్తూనే బ్రాందీ తయారు చేస్తారు. వాటిని అమ్ముకోవటానికి లైసెన్స్ లు ఇస్తారు .ఇక అలాంటివి అమల్లోకి ఎలా వస్తాయి? ``

 

"హు(! డబ్బు దాని వల్లే వస్తుందట. దేశ ప్రజల క్షేమం కంటే డబ్బే ముఖ్యం అయిపోతోంది ప్రభుత్వానికి." 

 

"మరి ఇప్పుడు మనుషులు భూమిలా డబ్బు చుట్టూనే  ప్రదక్షిణ చేస్తున్నారు. అందులో సందేహమే లేదు."

"డబ్బుతో ఏమైనా కొనుక్కోవచ్చు కానీ మనశ్శాంతిని కొనుక్కోలేరు." 

 

 "అది ఎవరికి వాళ్లు అర్థం చేసుకోవాలి లేఖా!"

" అదే ..ఎందుకు అర్థం అవ్వటం లేదు అనేదే నా బాధ. ఇదొక్కటేనా? అన్ని విషయాల్లోనూ అంతే. మన చీర కట్టుకోవాలని ,మనం చేసుకునే విధంగా పెళ్లిళ్లు చేసుకోవాలని ,మనలా కలకాలం జంటలుగా నిలవాలని ముచ్చటపడి మనదేశానికి విదేశీయులు రావటానికి మొగ్గు చూపుతుంటే మనమేమో విలువైన మన సంప్రదాయాలకు త్రిలోదకాలిచ్చి అటు పరుగుపెడుతున్నాం. ఇది తప్పని మనకు తెలియదా?"

"ఎందుకు తెలియదు లేఖా! అందరికి అన్నీ తెలుసు. మనిషి సుఖం చూసుకుంటున్నాడు. అసలైన ఆత్మ శాంతి మనలోనే ఉంది అని, భగవంతుడు మనలోనే ఉన్నాడని ,అది సందర్శించుకునే సమయం ప్రతి మనిషి ఇవ్వాలనే విషయం కూడా మరిచి పరిగెడుతున్నాడు.

 

ధ్యానంలో ఉన్న విలువ ఎందరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది."

" ఇందులో కాస్త చైతన్యం వచ్చింది లెండి. ఇప్పుడు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపుతున్నారు యోగా, వ్యాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతలో కొంత ఆనందమే ."

"అవును లేఖా! అది శుభపరిణామమే .చుట్టుప్రక్కల వారిలో నీవాళ్ళేగా  ఆ చైతన్యం వచ్చింది "

"అవును . ఎవరో ఒకరు పూనుకోవాలిగా . అన్నట్లు దీప్తి నిద్రపోవటానికి మన ఇంటికి వస్తానంది. ఇలా కబుర్లలో పడితే ఆలస్యమవుతుంది. తొందరగా వంట  చేసేసుకుని తను వచ్చేటప్పటికి భోజన కార్యక్రమాలు ముగిస్తే సరిపోతుంది. తను అడగగానే ఒప్పేసుకున్నాను. మీకు చెప్పేంత సమయం కూడా లేదు."

లేఖా!  నిర్ణయం నువ్వు తీసుకున్నా నేను తీసుకున్నా ఒకటే. ఒకరికి అంగీకారమైతే మరొకరు ఒప్పుకుంటాంగా. దానికి ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి? ఎప్పుడూ చేస్తున్నదదేగా!"

" అవునులెండి" అన్నట్టు కళ్ళతోనే ప్రశంసించింది అతన్ని.

దీప్తి ఎప్పుడూ అంటుంది హక్కులకోసం పోట్లాడుకోకుండా ఒకరికి కొకరు స్నేహితుల్లా మెలిగే మీరిద్దరూ అంటే నాకిష్టం .  మీలా అందరు దంపతులు ఉండగలిగితే ఎంత బాగుంటుందని."

అది గుర్తొచ్చి ఆమె పెదాల మీద నవ్వు విరబూసింది.   

 

"ఏమిటోయ్!నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు .మాకూ కాస్త పంచవచ్చుగా."

 "ఆ(! ఏం లేదు .దీప్తి మాటలు గుర్తు వచ్చి."

" అదే ఏమిటని ?"

"ఒకరినొకరు  మనం గౌరవించుకుంటామని, భావాలను అర్థం చేసుకుంటామని"

"ఓ(! ఇదేనా? నేను తరగాల్సినవి రేపటి  కూరకు  ఇచ్చేసేయ్ .గబగబా తరిగిచ్చేస్తాను." అంటూ లుంగీని పైకి మడిచాడు యుద్ధరంగానికి వెళ్లే  సైనికుడిలా."

 అది చూసి లేఖ నవ్వుకుంది.

              *          *         *

 

"అమ్మా !"అంటూ దీప్తి లోపలికి వచ్చింది.

రా!దీప్తీ! ఒక్కదానివి ఏం చేసుకుంటావు .మాతో తినెయ్యమంటే వద్దన్నావు.  ఒక్కోసారి నా మాట వినవు.నాకు భలే కోపం వస్తుంది "

"పొద్దున్నే రెండు పూటలకు వండేశాను.`` 

 

"సరే !నీకు పలుచటి దుప్పటి కావాలా ?మందపుదా ?"

"పలచటిదే ఇవ్వండి. వర్షాకాలం అయినా ఎండాకాలంలా ఉంది .పచ్చటి చెట్లను నరికి మన గాలిని మనమే దూరం చేసుకుంటున్నాం."

" అవునురా. పర్యావరణం గురించి ఎంత చెబుతున్నా పట్టించుకునే వారే కరువవుతున్నారు. మొక్కలు పెంచటంలో సరైన శ్రద్ధ వహించడం లేదు . అది ఎంత ప్రమాదమో తెలిసినా నిర్లక్ష్యం చేయటం వింతగానే అనిపిస్తుంది."

ఇద్దరూ బెడ్ మీదకు చేరారు.

 

"అమ్మా!మీ అబ్బాయి ఆర్మీ కదా! బాగున్నారా?"

"నిక్షేపంగా  ఉన్నాడు. దేశద్రోహులును మన వైపు కన్నెత్తి చూడకుండా పహారా కాస్తూ."

" బిడ్డను సైనికుడిగా పంపటమంటే త్యాగమే కదా!" "అలాంటి పెద్ద మాటలు నాకు తెలియదు .కొన్ని లక్షలు కోట్ల మందిని కాపాడటానికి నా బిడ్డ సమాధి అయితేనేం?ఇక్కడున్న వారంతా బాగుంటారుగా అనుకుంటాను నేను. రక్షణ కోసం  ఎందరో తల్లులు తమ బిడ్డలును మన దేశానికి ఇవ్వాల్సిందే. అది మన బాధ్యత, కర్తవ్యం కూడా."

" మీ భావాలు అన్నీ బాగుంటాయి అమ్మా!"

"ఇది నాకేం పరిమితం కాదు దీప్తి. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావు కదా. నీ బిడ్డలనూ అలా పెంచు. అంతే కాకుండా ఆడ, మగ వేరు కాదని,సమమేనని, అన్నింటా ఒకరికొకరు సహకరించుకోవాలి అనే ఒక్క విషయం మన ముందు తరానికి  రుచి చూపించగలిగితే మన సమాజం రూపురేఖలే మారిపోతాయి .మనం కోరుకుంటున్నట్లుగా మన చుట్టూ ఉన్న ప్రపంచం కనిపిస్తుంది."

" నిజమేనమ్మా!"

 అలా కబుర్లతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో వాళ్ళిద్దరికే తెలియదు.

                                                 

                            *                   *                          *     

                        

 " మొత్తానికి వాళ్ళవిడతోనే కామేష్ కి  చెక్ పెట్టించావుగా"నవ్వుతూ అన్నాడు భరద్వాజ.

"మరీ!మీ మగవాళ్లకు అలాగే బుద్ధి  చెప్పాలి"

"నన్నెందుకోయ్ అతనితోకలుపుతావు.నేనుశ్రీరామచంద్రుణ్ణి.  ఏమైనా నిన్ను మెచ్చుకోవాలోయ్. నీలా ప్రతీ గృహిణీ  సమాజం కోసం ఇలా ఆలోచిస్తే ఎంత  బాగుంటుంది?``

"
సమాజం అంటే ఎవరు మనమే కదా!ఒకరికి కష్టమొచ్చినప్పుడు మరొకరు సహాయం చేస్తే చాలు.గట్టిగా ప్రయత్నిస్తే అందరిలోనూ ఈ మార్పు     తీసుకురావచ్చు.  ఎప్పుడూ  నేను అదే పనిలో ఉంటాను"

"నేనూ నీకు తోడుగానే!"

 కిలకిలా నవ్వుకున్నారు ఆ దంపతులు.

 

                                                  సమాప్తం 

 


   


  

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు