కథలు

(March,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నాలాగ ఎందరో .. 

పసితనం వీడి యుక్తవయస్సు రాక ముందే  ఆటా పాటాకు దూరమయిన పిల్ల.

స్నేహితురాళ్ళు ఆడుతుంటే చూసి చప్పట్లు కొట్టడమే తప్ప తాను కొట్టించుకోవడం తెలియని పిల్ల.  తన లోని  కోరికల్నిలోనే ఇగుర్చుకున్న పిల్ల. 

ముది వయసుకు దగ్గరవుతున్న సమయంలో హర్షధ్వానాల మధ్య అభినందనలు  అందుకుంటూ .. తీవ్రమైన ఉద్వేగానికి లోనయింది ఆమె. 

100 మీ , 200 మీ, 400మీటర్ల పరుగులో మొదటి బహుమతి 

డిస్క్ త్రో మొదటి బహుమతి, షాట్ ఫుట్ ద్వితీయ బహుమతి, జావలిన్ త్రో మొదటి బహుమతి అని తన పేరు పిలిచినప్పుడల్లా మనసు  దూదిపింజలా తేలిపోతున్నది.  

ఇక్కడ మైక్ లో ప్రకటిస్తున్న మాటలు నాలో అనంతమైన శక్తి నింపిన మిత్రకి చేరితే ఎంత బాగుంటుంది .. మనసులో థాంక్స్ చెప్పుకుంటూ అనుకున్నది ఆమె. 

 నిజంగా నాలో అంత సామర్ధ్యం ఉన్నదా .. తన కంటే చాలా ముందు నుంచీ ఉన్న వారిని వెనక్కి తోసేసి తను ముందు  నిలిచిందా ..  ఆశ్చర్యపోయింది ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ.  

అంతలోనే నేను  నేనేనా.. అన్న సందేహం కలుగుతున్నది ఆమెలో.  కాలు భూమి మీద ఆగడం లేదు. మనసు ఆనందంతో పక్షిలా గిరికీలు కొడుతున్నది. 

ఆమెలో ఒక్కో గెలుపు మరో గెలుపుకి ఉత్సాహాన్నిస్తూ ఉత్ప్రేరకంగా మారుతున్నది.   

సరిగ్గా అదే సమయంలో 55 - 59 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లో అట్లెటిక్స్ ఛాంపియన్ గా  పూర్ణిమ అంటూ ఆమె పేరు ప్రకటించారు . 

కలలోనైనా ఊహించని బహుమతి.  ఒకదాని వెంట ఒకటి తన  ఖాతాలో జమవుతూ.. విడ్డురంగా అనిపిస్తున్నది. 

మహిళల వెటరన్ స్పోర్ట్స్లో ఉవ్వెత్తున ఎగుస్తున్న కెరటం పూర్ణిమ అంటున్నారెవరో .. 

నిజ్జంగా తనలో అంత శక్తి ఉన్నదా .. అయితే, ఇన్నాళ్లు ఏమైంది  ..?  రకరకాల ఆలోచనలు పోటెత్తుతుండగా  ఉద్వేగంతో  వెళ్లి ఛాంపియన్ షిప్ షీల్డ్  అందుకోవడానికి వెళ్ళింది. 

 జీవితపు పరుగులో తన ప్రమేయం లేకుండానే పరుగులు పెట్టిందిన్నాళ్ళూ .., కాలం ఆడించే ఆటలో ఎన్నెన్నో ఆటంకాలు, ఉచ్చులు , ప్రమాదాలు దాటుకు వచ్చి అలసిపోయింది.  ఇక నడవ లేక డీలా పడిపోయింది .   ముందుకు సాగలేనని నిస్సత్తువతో కూలబడిపోయిన స్థితి నుండి .. కొత్త శక్తి నింపుకుంటూ పరుగు పెట్టింది. 

శరీరం మనసు ధ్యాసంతా దాని మీదే పెట్టి ఆడింది .  అందరితో పోటీలలో పోటీ పడుతున్నందుకే ఉప్పొంగిపోయింది. 

అలాంటిది, తనే విజేతగా నిలవడం.. సంభ్రమాశ్చర్యం ఆమెలో .. 

హర్షధ్వానాల మధ్య అభినందనలు అందుకుంటూనే.. తన ఈ స్థితికి కారణమైన మిత్రని పదే పదే తలచుకొంటున్నది.   

అంబరాన్ని అంటే సంబరాన్ని అందించడానికి కారకురాలైన మిత్రకి ఈ విషయం తెలియజేయాలని ఆమె మనసు తహతహలాడుతున్నది. 

ఫోన్ చేయబోతుంటే ఓ  మీడియా ప్రతినిధి పలుకరించింది .  మేడం .. మీతో మాట్లాడాలి అంటూ .. 

ఆ వెనకే మరి కొందరు వచ్చి చేరారు

నాతోనా .. అంటుండగానే.. 

"పరుగు పందెం లో మీ టైమింగ్ రికార్డ్.   ఎలా సాధించగలిగారు" అడిగారొకరు. 

 "అవునా .. అదంతా నాకు తెలియదు. పోటీ కదా.. .  ఇతరులతో పోటీపడి నాకు చేతనయినంత పరిగెత్తానంతే. 

చిన్నప్పుడు  చెంగు చెంగున లేడి పిల్లలా పరుగులు పెడతానని అనేది మా నాయనమ్మ బహుశా ఇప్పుడూ అలాగే పరుగు పెట్టానేమో .. చిన్నగా నవ్వుతూ చెప్పింది పూర్ణిమ.  

ఓ చిన్నప్పటినుండీ పరుగుల రాణి అన్నమాట అన్నదామె . 

లేదండి, నేను పరుగు పందెంలో పాల్గొంటానంటే ససేమిరా  ఒప్పుకునేది కాదు మా నాన్నమ్మ. ఆడ పిల్లవు కాదూ .. అని తిట్టి పోసేది. ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం మా ఇంట్లో ఎవరికీ లేదారోజుల్లో. ' వెలుగుతున్న మొహంలో సన్నటి నవ్వు రేఖలు.  

అంటే.. ఇప్పుడు ఈ వయసులో  మీ కోరిక తీర్చుకుంటున్నారా ..

నిజానికి కోరిక తీర్చుకోవడం కోసమో, బహుమతులు అందుకోవడం కోసమో నేను పరుగులు ప్రారంభించలేదు . అది నా లక్ష్యం కాదు. 

మానసిక. శారీరక ఆరోగ్యం మెరుగు పరుచుకోవడం కోసం నడక ప్రారంభించాను.  అందులోంచి పరుగులోకి వెళ్ళాను .  అనుకోకుండా పోటీలో పాల్గొన్నానంతే...  

అంతే, ఏంటి మేడం? ఇన్ని బంగారు పతాకలందుకుని. ఇంతకీ కోచింగ్ ఎన్నాళ్ళ నుండి తీసుకుంటున్నారు?  జర్నలిస్ట్ ప్రశ్న. 

కోచింగ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. 

ఈ మధ్యనే అంటే రెండు నెలల నుండి వారానికి రెండు రోజులు మాత్రమే ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా.  

త్రోస్  వేరే వాళ్లు ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నేనూ నేర్చుకున్నా.  పదిహేను రోజులయింది ప్రాక్టీస్ మొదలు పెట్టి. 

ఆశ్చర్యంగా ఉందే .. ఇంత తక్కువ వ్యవధిలో  ఆత్మవిశ్వాసంతో పోటీకి రావడం అన్నది మొదట పలకరించిన జర్నలిస్ట్. 

అసలు ఈ రోజు నేను మీ ముందు ఉన్నానంటే కారణం నేను కాదు నా గురువు.  తనే నన్ను తిరిగి మనిషిగా నిలబెట్టి మీ ముందు ఉంచింది . తాను లేకపోతే ఇప్పటి నేను లేను. 

నిజానికి నాలోని ఆత్మవిశ్వాసం కొట్టుకుపోయింది . దుఃఖంనిర్లిప్తత, నిస్సహాయత, బద్దకం మేటలువేసుకు పోయింది. 

అటువంటి తరుణంలో .. 

Crying , Trying ఈ రెండు పదాలు ఒకేలా ఉన్న రెండు పదాలు.  మీకు తెలుసు కదా .. 

రెండింటికీ ఒకే ఒక అక్షరం తేడా .

కానీ అవి మనమీద మన జీవితాల మీద చూపే ప్రభావం అంతా ఇంతా కాదు.  

మొదటిది మన ఆత్మవిశ్వాసాన్ని అతలాకుతలం చేసి కుంగదీసి శిథిలం చేసుకు పోతుంది . 

మరొకటి మనలో కొత్త శక్తులు  తట్టి లేపి నూతనోత్సాహంతో ముందుకు నడిపిస్తుంది . జీవితం పట్ల ఆశ కలిగిస్తుంది.  

ఏది ఎంచుకుంటావో.. నీ ఇష్టం . 

అది ఏదైనా నీ చేతుల్లోనే, చేతలలోనే..  

నీ జీవితానికి కర్త, కర్మ,  క్రియ అన్నీ నీవేనని మర్చిపోవద్దని  నా గురువు ఉద్బోధ.

ఓ.. రియల్లీఎవరా గురువు .. ఏ సందర్భంలో ..? పూర్ణిమ మొహంలోని వెలుగు చూస్తూ  ఉత్సాహంగా  ప్రశ్నించింది యువ జర్నలిస్ట్ 

నా గురువంటే... 

నాకంటే ఓ పాతికేళ్ళు వెనక ఈ భూమ్మీదకి వచ్చిన వ్యక్తి .  నా ఆప్తమిత్రురాలు,  నా పేగు తెంచుకు పుట్టిన నా కూతురు అని ఆగి అందరి మెహాల్లోని భావాల్ని చదవడంలో నిమగ్ననైంది పూర్ణిమ. 

అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. 

ముందు తేరుకున్న జర్నలిస్టు నోరు తెరిచిఅంటే .. మీ అమ్మాయా .. ఆమె మీ గురువా .. ఆశ్చర్యంగా అడిగారు 

అవును, మీరు విన్నది నిజమే.. 

మా అమ్మాయే

ఏం .. కడుపున పుట్టిన పిల్లలు గురువు కాకూడదా ..  స్థానంలో ఉండకూడదా ..మిత్రురాలు కాకూడదా ..  అంత ఆశ్చర్యపోతున్నారు. 

చిన్నగా నవ్వుతూ,  నా కూతురే, పోస్ట్ మోనోపాజ్ సమయంలో వచ్చిన  డిప్రెషన్ ఛాయలను గమనించింది. రోజు రోజుకి నాలో బలహీనమవుతున్న ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపింది. 

దుర్భలమవుతున్న మనసుని గట్టిపరిచే విధంగా వ్యవహరించింది.  

మరింతగా ఆ ఊబిలోకి పోకుండా నేనేం చేయగలనో నాకు తెలిపింది , ఏం చేయాలో  సూచనలు , సలహాలు ఇస్తూ నాకు అండగా నిలబడింది .  నాకు గురువైంది . అమ్మకు అమ్మై కాపాడుకుంది- చెబుతున్నది  పూర్ణిమ కంఠం గద్గదమవుతుండగా 

క్వయిట్ ఇంటరెస్టింగ్ .. 

అసలు ఎలా ఈ మార్గం ఎంచుకున్నారో వివరంగా చెప్పగలరా .. నిండా పాతికేళ్లు లేని ఔత్సాహిక జర్నలిస్ట్.  కొందరు వెళ్లిపోయారు. నలుగురు యువ మహిళా జర్నలిస్ట్ లు మాత్రం పూర్ణిమ చెప్పేది వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

***                       *** 

అమ్మా.. నువ్వు నువ్వేనా .. 

నువ్వసలు మా అమ్మవేనా అన్న సందేహం వస్తోంది . నిన్ను చూస్తే చాలా కోపం వస్తోంది . బాధ కలుగుతోంది అన్నదో రోజు నా కూతురు మిత్ర 

ఈ మాటలు అనడం అది మొదటిసారి కాదు.  ఇది రెండో సారో .. మూడో సారో .. సరిగ్గా గుర్తులేదు.     

ఎందుకో అంత సందేహం .. మరెందుకో నాపై కోపం , ఆపై బాధ అని నవ్వుతూ అడిగనైతే అడిగానుకానీ, దాని గొంతులో సీరియస్ నెస్  ధ్వనించిందన్న గమనింపులోకొచ్చి  అకస్మాత్తుగా ఇట్లా అంటున్నదేంటి అని ఆలోచనలో పడిపోయాను

దానికి నాపై అంత కంప్లయింట్స్ ఏమున్నాయి.. అసలు ఏముంటాయి .. ఏమో .. ఆలోచనలో నేను. 

 ప్రతిసారి నా  మాటల్ని తేలిగ్గా తీసేసి తెలివిగా టాపిక్ మార్చేస్తావ్ ..  అక్కడితో అసలు విషయం ఆగిపోతుందని నిష్టురంగా అన్నది మిత్ర .

అసలేంటే నీ బాధ .. ఊ .. చెప్పు వింటానన్నాను . తెచ్చిపెట్టుకున్న విసుగు ప్రదర్శిస్తూ 

నేను నవ్వులాటగా అనట్లేదమ్మా... నిజ్జంగానే చెప్తున్నా .. నువ్వు నమ్ము నమ్మకపో .. 

నువ్వు మాత్రం ఇది వరకటి మా అమ్మలా లేవు. 

నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్న అమ్మలా లేవు  అంటున్న ఆమె మాటల్ని తుంచేస్తూ .. .  

నీ పిచ్చి గానీ .. ఎలా ఉంటారే ... ఎలా ఉంటారు ? మారతారుగా .. నువ్వున్నావా చిన్నప్పటిలాగే .. మారలేదూ .. నేనూ అంతే .. అన్నాను విసుగ్గా. 

ఊహూ అలా కాదు . ఈ మార్పు అది కాదు. నేను ఎదుగుతున్నాను. నువ్వు అట్లాకాదు .. ఎట్లా  చెప్పాలో తెలియక కొద్దిగా ఆగింది .  తర్వాత, నువ్వెంత ఉత్సాహంగా ఉండే దానివి. ఎంత చురుకుగా ఉండేదానివి.   ఎన్ని పనులు చకచకా చేసేదానివి. అవన్నీ నాకు తెలియనివా .. 

మన ఇంటి చుట్టూ  ఉన్న ఆడవాళ్ళకి నిన్ను చూస్తే ఆశ్చర్యం . ఆఫీసు ఇల్లు , నానమ్మ తాతయ్య ల పనులు, మా పనులు చేసేదానివి.  మాకు అందమైన బట్టలు కుట్టేదానివి, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ చేసేదానివి. మా చదువు సంధ్య చూసేదానివి.  వాకిట్లో ముగ్గులేస్తే నువ్వే .. అన్ని పనుల్లో నువ్వే .. విసుగు, విరామం లేకుండా .. మొఖం మీద నవ్వు చెదరనీకుండా..

ఇంటి పట్టునే ఉన్నవాళ్ళు చేయని పనులెన్నో నువ్వు ఉద్యోగం చేస్తూ చేసేదానివి. 

 వాళ్ళు ఒకరోజు బయటికి వెళ్లి వస్తే తలనొప్పి అని మంచమెక్కేవారు. 

నువ్వేమో గిరగిరా తిరిగివచ్చి కూడా అన్ని పనులూ శుభ్రంగా చేసేదానివి. అందరిలో మా అమ్మ చాలా గొప్పగా అనిపించేది. 

నువ్వు ఇప్పుడలా ఉన్నావా .. లేవు. చాలా మారిపోయావుచాలా డల్ గా ఉంటున్నావు అనేది నా బిడ్డ. 

కాలం మారుతున్నట్టే వయసు పెరగడంలా .. వృద్యాప్యంలోకి రావడంలా .. నచ్చచెబుతున్న ధోరణిలో చెప్పేదాన్ని నేను. 

అదిగో .. అదే..  అదే నాకు నచ్చడం లేదు. 

ఆ మాటలే అస్సలు నచ్చట్లేదు. 

ఎంత .. ఆ .. నీ వయసు ఎంతనీ .. ? 

నిండా అరవై లేవు. దానికింకో మూడేళ్ళ సమయం ఉంది.  అప్పుడే ముస్సలైపోయావా .. మూడుకాళ్ల ముసలమ్మవైనట్లు మాట్లాడుతున్నావ్ అని తగవులాడేది. 

నిన్నటి నిన్ను చూసి, నీ పనితనం, నేర్పరితనం చూసి అన్నిట్లో ముందుగా ఉండే నిన్ను చూసి ఎంతో మంది అమ్మలు అసూయ పడడం, అలా తాము లేకపోయినందుకు, చదువు లేకపోయినందుకు, ఉద్యోగం చేయలేక పోయినందుకు బాధ పడడం చూశాఆర్ధిక స్స్వాతంత్య్రం, భావ స్వాతంత్య్రం  లేవని  బెంగపడే  వాళ్ళను  చూసా. 

నిన్ను చూసి అసూయ పడేవాళ్ళను చూశా

అలాంటిది, ఇప్పుడు వాళ్ళలో నీ వయసు వాళ్ళు, నీ కన్నా పెద్ద వాళ్ళు తమ జీవితాన్ని తాము కోరుకున్న విధంగా మార్చుకుంటుంటే.. నువ్వేమో వెనక్కి అని సణిగేది

విజయలక్ష్మి వాళ్ళమ్మ  నీకూ తెలుసుగా .. ఎప్పుడో పదో తరగతితో  చదువు మానేసిందిఇప్పుడు, విజ్జి యూకే లో ఉంది కదా .. అక్కడికి వెళ్తే ఇబ్బంది కాకూడదని  ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు.  

మాలతి వాళ్ళమ్మ మొన్న మొన్న స్కూల్ లో తెలుగు టీచర్ గా చేరిందిఇట్లా తనకి నచ్చిన వ్యాపకాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

తెలుసా .. అంటూ నా వెన్ను తట్టే ప్రయత్నం చేసేది. 

నువ్వు  నీ జీవితాన్ని నీ చేతినించి వదిలేశావ్. నిన్ను నువ్వు చేజార్చుకుంటున్నావ్.  అదేనమ్మా నా బాధ అని విలవిల లాడేది

అబ్బా ఏదో లేవే.. ఇలా అలవాటు పోయింది..  నన్నిట్లా బతకనీ .. నా ప్రాణం తినకు.. 

నా ఆరోగ్య సమస్యలు నీకు తెలియనివా చెప్పు అని విసుగు ప్రదర్శించేదాన్ని 

ఆ .. అదే చెబుతున్నానమ్మా.. అసలు తప్పంతా నీ దగ్గరే ఉంది  అని ఎత్తి పొడిచేది.

 

ఆ .. ఏమంటున్నావ్ .. నా దగ్గరా ..  నేనేం చేశానని అని అరిచే నన్ను పట్టించుకునేది కాదు. అవునమ్మా ..  నీలోనే ఉంది. అందుకే నువ్వంటే నాకు నచ్చనిది . నిక్కచ్చిగా చెప్పేయడం మొదలు పెట్టింది

అదేంటని నాలో కోపం బుసబుస పొంగేది .  మాట్లాడ్డం మానేసేదాన్ని. 

అమ్మా ప్లీజ్ .. నా మాట వినమ్మా .. 

మీ అమ్మ వాళ్ళింట్లో నువ్వు చేయలేని పనులు  కొన్ని పెళ్లయ్యాక చేశావ్.  

 నాన్న కుటుంబ విషయాలు పట్టించుకోకపోయినా  పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డావ్.   

ఎటువంటి సహకారం లేకుండానే కుటంబ బాధ్యతల్ని మోస్తూనే చదువుకున్నావ్ . ఉద్యోగంలో చేరావు. ఇంటాబయట పని ఒత్తిడి, పిల్లల, అత్తమామల ఆలన పాలన, బంధుమిత్రుల మర్యాదలు అన్నీ నువ్వే.. వేధింపులు , సాధింపులు, నిందలు , నిష్టూరాలు , ఆరళ్ళు అగచాట్లు అన్నీ నీకే .. అవమానాల అగ్నిప్రవేశాలు నీకే .. 

కంటి చివర చిట్లే నీటి చుక్కల్ని ఘనీభవింపచేస్తూ గండశిలలా మారిపోయావ్.  అలసిన మొఖంలోని పెదవులపై నవ్వులు అద్దుకుంటూ కాళ్ళకి చక్రాలు కట్టుకుని, చేతులతో అష్టావధానం చేశావ్.  

ఎందుకలా చేయగలిగావ్ .. 

భవిష్యత్ పై నీకున్న ఆశ, నమ్మకంపనిపట్ల ఉన్న నిబద్దతనీ మీద నీకున్నవిశ్వాసం నిన్ను ముందుకు నడిపించింది. 

కానీ నీకోసం నువ్వు చేయాలనుకున్నవి, నీ బాధ్యతల బందిఖానాలోంచి బయటికి వచ్చి ఆలోచించలేక వాటి పీక నొక్కేశావ్ .. 

నువ్వేం చేసినా అవన్నీ కుటుంబం కోసం చేశావ్ . నీ చుట్టూ అల్లుకుపోయిన జీవితాల కోసం ఆరాటపడ్డావ్.  నీకోసం నువ్వేం చేసుకోలేదు.  మా అందరికీ చేసిన పనుల్లోనే తృప్తిని వెతుక్కున్నావ్. 

ఇప్పుడు అందరం ఎవరి దారి వాళ్ళం చూసుకున్నాం. నువ్వు పెంచిన ఆ  పిల్లలూ ఎదిగి వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళున్నారు. 

ఇప్పుడు నువ్వు ఒంటరివయ్యావు. ఆ ఒంటరితనంలోంచి  వచ్చిన సమస్యలే నీవి. 

దానికి తోడు శరీరం మనస్సుతో నీ హార్మోన్స్ ఆడుకోవడం మొదలు పెట్టాయి .  వాటిని అదుపులో పెట్టగల శక్తి నీకు మాత్రమే ఉందమ్మా ..  

చెబితే పట్టించుకోవు.  నిన్ను నువ్వు కోల్పోతుంటే నాకు చాలా బాధగా ఉంది. 

మాకు ఎవరికీ ఏ కష్టం వచ్చినా నీదైనట్లు బాధపడతావ్.  మాకు అన్నీ అయి సేవలందిస్తావ్.  

నీలో  గూడుకట్టుకున్న ఒంటరితనం నాకు తెల్సున్నది . కానీ, పోగొట్టడానికి మేమెవరం దగ్గరలో లేం. 

నువ్వు ని ప్రపంచంలోంచి బయటకు రాకుండా మా గురించి ఆలోచిస్తూ ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తెచ్చుకుంటున్నావ్. 

నీకు నువ్వే ఏవో సాకులు చెప్పుకుంటూ సోమరిగా కాలం వేళ్ళ బుచ్చుతున్నావ్.  మరింత బలహీనంగా మారుతున్నావ్.  

 నువ్వు మానసికంగా దృఢంగా మారితే నువ్వెంత చురుగ్గా ఉంటావో నాకు తెలుసు. 

నీతో నువ్వు పోరాటం చెయ్యి. నీకోసం నువ్వు ఆలోచించు. ఏం చేస్తే నీ మనసు చెంగు చెంగున పరిగెడుతుందో ఆలోచించు.  ఏం చేస్తే నీ మొఖం అరవిరిసిన మందారంలా నవ్వుతుందో ఆలోచించు. ఏం చేస్తే ..  గాలిలో తేలిపోతుంటావో  ఆలోచించు. ఏం చూస్తే నీ కళ్ళు పరవశిస్తాయో ఆలోచించు .. 

ఉత్సాహం ఉరకలేస్తుందో చూడు.  మేమెవరం లేని నీదైన ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించు అని సుతి మెత్తగా చెప్పేది.  

మాట్లాడ్డం మానేస్తే మెసేజ్ లు పెట్టేది. 

నేను వాటిని గురించి ఆలోచించడం లేదనీఆ ప్రయత్నం చేయడంలేనీ కోప్పడేది.  

నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకో. నీకు నువ్వు పని కల్పించుకో. అది ఏదైనా సరే .. నీకు ఏది నచ్చితే అది.  నువ్వు సంతోషంగా చేయగలిగే పని ఏదైనా నువ్వే ఎంచుకో .. ఎంత సేపు చేయగలవో అదీ నువ్వే చూసుకో .. నాకందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇది చెయ్యి అని నాకు నచ్చినవి నీమీద రుద్దలేను. నీకు నచ్చిన నీ ఆసక్తులలోకి వెళ్లమంటున్నా.  నువ్వు చెయ్యాలనుకుని చేయలేని పనులు చెయ్యి. నీకు తీరని కోరికలు ఏమున్నాయో వాటిని తీర్చుకొమ్మంటున్నా.  పెన్షన్ లేని ఉద్యోగం చేసిన నీకు ఇప్పుడు చేతిలో డబ్బులు లేవని తెలుసు. వీ కంటూ నయాపైసా లేదనీ తెలుసు. నీ మొహమాటమూ తెల్సు. 

నీ కోసం కొంత డబ్బు నీ ఖాతాలోకి ట్రాన్సఫర్ చేసాను. అది నీ అవసరాలకు వాడుకో అంటూ మిత్ర పదేపదే చెప్పేది. 

నా ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి తెలిసీ ఎప్పుడూ ఏదో ఒక క్లాస్ పీకుతుంటుంది అని లోనే తిట్టుకునేదాన్ని.  కూతురికి పెట్టాలి కానీ దాని దగ్గర తీసుకోవాలా అని అసహనం, కోపం, విసుగు మరింత పెరిగేవి. ఒక్కోసారి మా ఆయన మీద విరుచుకుపడేదాన్ని. 

తన మాట వినడం లేదని మిత్రకి చాలా బాధ కలిగినట్లుంది.  నాకు ఫోన్ చేయొద్దు. నువ్వు చేసినా నేను మాట్లాడను. 

నీకోసం కొత్త ప్రపంచం ఎదురు చూస్తున్నది.  ఆ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాతే, నీకు నచ్చిన పని ఏదైనా చేసిన తర్వాతే నీతో మాట్లాడేది అని మెసేజ్ చేసి మాటలు మానేసింది.

ఇన్నాళ్లూ బతిమాలింది. బాధపడింది. కోప్పడింది. ఏంచేసినా నేను మారడం లేదని చివరి అస్త్రంగా మాటలు మానేసింది. దాని పట్టుదల గురించి నాకు తెల్సు.  అది మాట్లాడక పోతే లోకమంతా శూన్యంగా ఉంటుంది నాకు.  నా ఏకైక నేస్తం అదేగా ..    

అది నా గురించి ఎక్కువ ఆలోచించి నన్ను ఇబ్బంది పెడుతున్నదని మొదట అనుకునేదాన్ని. 

సావధానంగా ఆలోచించడం మొదలు పెట్టాను. 

నిజమే .. 

నేను ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ తీరిక అందని ద్రాక్ష పండే. పుల్లవిరుపు మాటలూ, నోటితో మాట్లాడుతూ నెసటితో వెక్కిరింతలు ఉన్నప్పటికీ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా  ఆరోగ్యంగానే ఉండేదాన్ని. ఆర్ధిక సమస్యలూ లేవు. జీవితంలో వచ్చిన సవాళ్ళను ఎదుర్కొన్నాను. ధైర్యంగానే పరిష్కరించుకున్నాను.  అప్పుడు తీరికగా, హాయిగా, రికామీగా ఉండడం నాకొక లగ్జరీ. 

ఇంటిపట్టున ఉండి జీవితాన్ని షాపింగ్ లు, కిట్టీపార్టీలు, పేరంటాలు ఇలా రకరకాలుగా నలుగురూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న జీవితం పట్ల ఓ ఆకర్షణ.  

నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అయిపోవడంతో కొత్త ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళలేదు. కారణం వాళ్ళలా  నేనూ ఎంజాయ్ చేద్దామనే.  కొంత కాలం రెస్టు తీసుకుందాం అనుకున్నా.  

ఆ వెసులు బాటుతో నాలుగు రకాల సమూహాలతో కలయికలు సందడిగానే, సరదాగానే ఉంది.  కానీ రాను రాను తెలియని అసహనం మొదలయింది. 

నా తీరిక సమయం వినోదాన్ని, ఆనందాన్ని ఇవ్వక పోగా అసంతృప్తిని తెచ్చిపెట్టాయి. , 

షాపింగ్ లు, కిట్టీ పార్టీలు వగైరా వగైరా లేవీ తృప్తి నివ్వలేదు.  చీరలు, నగలు, ఒకరిపై ఒకరు పోటీపడుతూ ఇల్లు, ఒళ్ళు అలంకరణ  కిట్టీ పార్టీలు, పేరంటాలుడాబుసరి మాటలు .., ఎత్తి పొడుచుకోవడాలు, లేదంటే సినిమాలు ..   ఆ వాతావరణంలో ఇమడలేనని అర్ధమైపోయింది. 

స్వేచ్ఛ సమానత్వం పేరుతో పబ్ లు, పార్టీల్లో తాగడంపేకాట ఆడడం చేయలేకపోయా.  

భక్తి పేరుతో పూజలు పునస్కారాల పేరుతో జరిగే ఆడంబరం,  గుళ్ళు, దేవుళ్ళు, తీర్ధయాత్రల లోకంలోనూ కలవలేనని అర్ధమై పోయింది. 

ఆ సమూహాల్లో డొల్లతనాన్ని, హిపోక్రసీని  తట్టుకోలేకపోయాను. నేను కోరుకున్నది అదేదీ కాదని తేలిపోయింది. 

లోపం వాళ్లలో ఉన్నదో నాలో ఉన్నదో అర్థంకాలేదు. నాలోనే  ఏదో లోపం ఉన్నదేమో.. సందేహం .  నలుగురితో నారాయణ అనలేనితనం నాది  కదా ...  ఇంట్లోనే ఉండిపోవడం మొదలు పెట్టా.  

ఇంట్లోనే ఉంటున్నాను కదా .. ఎక్కువైన అనుకోని అతిథులు. పెరిగిన పనులు, తరిగిన ఓపిక, తీరిక. 

నేననుకున్నది ఏంటి ? జరుగుతున్నది ఏంటి ఎందుకిలా జరుగుతున్నది అని నాపై నాకే చిరాకు, కోపం, విసుగు. నీరసం. బతుకు మీద వైరాగ్యం. 

 

మళ్లీ ఉద్యోగంలో చేరదామా అనుకుంటూనే కొంత కాలయాపన...

ఈ వయసులో నాకెవరిస్తారులే అని నాకునేను చెప్పుకున్నాను.  సమర్ధించుకున్నాను.  మభ్యపెట్టుకున్నాను. 

ఏదో అసంతృప్తి నన్ను ముంచెత్తుతున్నది.  అనాసక్తంగా మారిపోయాను. 

నలుగురిలోకి వెళ్లడం తగ్గిపోయింది.    ఇంట్లోంచి బయటకు కదలాలంటే బట్టలు మార్చుకోవాలి. అదీ చేయాలనిపించేది కాదు.  జీవితం శూన్యంగా కనిపిస్తున్నది. 

 రిటైర్ మెంట్ ప్లాన్స్ ఏమీ చేయని జీవితం నన్ను ఆందోళన పరచడం మొదలెట్టింది.   

ఉన్నంతలో పిల్లల్ని కోరిన చదువులు చదివించగలిగాం.  మా పిల్లలతో పాటు ఆపదలో ఉన్న కొంతమంది పిల్లలకి చదువు అందించడంతో పాటు మా చేతనయిన సాయం చేస్తూ వచ్చాము . మా కోసం మేం ఏమీ చేసుకోలేదు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుందాం అనుకునే సమయంలో ఆర్ధికంగా కోలుకొని దెబ్బతగలడం చాలా కుంగదీసింది డెమోనిటైజేషన్ ..  ఆ వెంటనే వచ్చిన జిఎస్ టి మా వారి వ్యాపారంలో ఒడిదుడుకులు .. తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన సమయంలో ఇరవై నాలుగుగంటలూ ఇంట్లోనే ఉండడం మరింత కుంగదీసింది.  

అదే సమయంలో పక్కింటి అతను హఠాత్తుగా గుండెపోటుతో పోవడం శవాన్ని ఇంటికి రానీయని ఇంటివాళ్లు ..ఆ సంఘటన చాలా కదిలించింది. 

రేపటి మా పరిస్థితిని అద్దంలో చూపింది.  

ఇప్పుడు మీతో నవ్వుతూ ఇలా చెప్పగలుగుతున్నాను కానీ అప్పుడు నాలో వచ్చే వ్యతిరేక ఆలోచనలు పంచుకునే అవకాశం లేదు ,పిల్లలు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా .. 

మా ఆయన తన పనుల వత్తిడిలో..  చతికిల పడిన వ్యాపారాన్ని నిలబెట్టుకునే  ప్రయత్నంలో తలమునకలై...  

స్వీడన్ లో ఉన్న కొడుక్కి ఈ విషయాలేమి పట్టవు.  

మిత్ర చెప్పినా ఎవరికీ కావలసినట్లు వాళ్ళుంటారు.  అమ్మకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటుంది . అది అమ్మ ఇష్టం . తనకి ఎందులో ఆనందం ఉంటే అదే చేయనీ .. 

నువ్వెందుకు అమ్మపై అంత వత్తిడి తెస్తావ్. అని వాడి వాదన.  

మగపిల్లవాడు, అందునా దూరంగా ఉన్నాడు. అమ్మ మానసిక పరిస్థితి పసికట్టలేకపోయాడు.. అర్ధం చేసుకోలేక పోయాడు.  

దూరంలో ఉన్నప్పటికీ మిత్ర అర్ధం చేసుకుని నా పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నది . కానీ అది స్వీకరించే స్థితిలో నేను లేను.  

నాకు తెలియకుండానే నాలో పోగుపడుతున్న నిరాసక్తత. నిర్లిప్తత .  ప్రవహించడం ఆగిపోయాను.  నిలువ ఉంటే ఏమవుతుంది. మురిగి కంపు కొడుతుంది.  నా విషయంలోనూ అదే జరిగింది. 

నేను విసుక్కున్నా, కోపగించుకున్నా నా కూతురు నన్ను ప్రక్షాళన చెయ్యాలని, ప్రవహింప చేయాలనీ తన ప్రయత్నం మానలేదు. 

నన్ను నన్నుగా నిలబెట్టాలని ఆమె తాపత్రయం.  

నా మానాన నన్ను ఉండనీయకుండా ఇదొకటి నా వెనకాల పడింది. నేను చెప్పింది నువ్వు వినాలా .. నువ్వు చెప్పింది నేను వినాలా ? అంటూ మాట్లాడ్డం తగ్గించేశాను. 

అయినా అది వినలేదు.  వెంటబడింది. ఇన్నాళ్లు నువ్వు చెప్పింది నేను విన్నా. ఇప్పుడు నువ్వు నేను చెప్పింది వినాలి అనేది. 

ఇక్కడ చూడు ఆడవాళ్లు ఎలా తిరగేస్తుంటారో అని అక్కడి బామ్మల గురించి చెప్పేది .  వీడియో కాల్ చేసి చూపించేది. 

అది అమెరికా. ఇది ఇండియా అంటూ కొట్టి పారేసేదాన్ని. 

అమెరికా అయినా, ఇండియా అయినా అమ్మ అమ్మేగా. అమ్మ ఆరోగ్యం బిడ్డకి ముఖ్యమేగా .. అని అనేది. 

నీకేమన్నా పిచ్చా .. నాకేమయింది. నేనిప్పుడు బాగానే ఉన్నాగా .. ఎందుకింత సతాయిస్తావ్  అని ఎగిరిపడే దాన్ని. 

తనూ ఒక్కోసారి విసుక్కునేది. ఒక్కోసారి ఓపికగా చెప్పేది.    

ఇండియాలో కూడా పరిస్థితులు మారాయమ్మా. మీ నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ లాగే నువ్వు ఎందుకుండాలి? ఆ కాలం కాదిది.  నిన్ను నువ్వు శోధించుకుంటూ ఎదగడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని ఉపయోగించుకో.. 

మా అమ్మ లాగా ఉండాలి. నువ్వు నువ్వుగా ఉండాలి అంటూ ఎంతో ఓపికగా ఓ తల్లి బిడ్డకు చెప్పినట్టుగా చెప్పేది. 

వాళ్ళ నాన్నకి ఏమి చెప్పిందో .. మా అయన డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు . ఏవో మందులు ఇచ్చారు . కానీ ఆందోళన.  భయం. దూరాన ఉన్న పిల్లలగురించి ఆలోచించి బెంగ పెట్టుకుంటావ్ గానీ నా గురించి ఆలోచించడంలేదని మా ఆయన ఫిర్యాదు. 

ఒకరోజు ఒక లింక్ పంపింది. లేడి లా పరిగెడతావా .. అంటూ.   అది మహిళల స్పోర్ట్స్ క్లబ్ ది  

మిత్ర దూరాన ఉన్నది. రావాలంటే వీసా సమస్యలు ఉన్నాయి.  కానీ దాని మనసంతా అమ్మ మీదే.  దాని జీవితాన్ని వదిలేసి ఈ అమ్మ గురించి ఆలోచిస్తూన్నది. 

దానికోసమైనా  చూసి రావాలనుకున్నా.

అంతలోనే, అయినా .. ఈ వయసులో నాకు ఆటలేంటి ? ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకోడానికి కాకపొతే.. ఎక్కడైనా పడిపోతే .. ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు  ?  దానికి మతి లేకపోతే నాకుండాలి కదా అనుకున్నాను. 

ఇంటికి దగ్గరలోనే ఉన్నది కదా .. సర్లే .. ఒకసారి వెళ్లి చూసి వస్తే వచ్చిన నష్టం ఏంటని దుర్బలమైన మనస్సుకు నచ్చ చెప్పుకున్నాను.  

వెళ్లి వచ్చి ఏదో ఒకటి చెప్పి దాని గోల వదుల్చుకుందామని అయిష్టంగానే స్పోర్ట్స్ క్లబ్ కి వెళ్లాను. 

నేను వెళ్లేసరికి నా కంటే చాలా పెద్ద వాళ్ళు తల పండిన వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు.  వాళ్ళనలా వింతగా చూశాను. 

కొందరు ట్రాక్ లో రన్నింగ్ చేస్తున్నారు . మరో ప్లేసులో సైక్లింగ్ చేస్తున్నారు.  వాకింగ్ చేస్తున్నారు. టెన్నిస్ ఆడుతున్నారు. చాలా చలాకీగా ఆడుతూ ఛలోక్తులేస్తూ నాకు బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుతున్నారు . నాకు చాలా ఆశ్చర్యమేసింది. 

మొదటి పరిచయంతోనే నన్ను వాళ్లలో కలిపేసుకున్నారు.  వయసు ఒక సమస్య కాదని వాళ్ళ చలాకీతనాన్ని చూస్తే అర్ధమైంది. అక్కడ నేను చూసిన దృశ్యాలు నాకెంతో  స్ఫూర్తినిచ్చాయి.  

ముఖ్యంగా 70 ఏళ్ల బామ్మ గారు ఈత కొట్టడం నన్ను చకితురాల్ని చేసింది.  

అక్కడి పరిచయాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నన్ను నేను మలుచుకుంటున్నాను. 

 

ఏమి నేర్చుకున్నారు మేడంశ్రద్దగా వింటున్న ఆ నలుగురిలో  ఓ జర్నలిస్ట్ అడిగింది 

పెద్దవాళ్ళయ్యామని గంటల కొద్దీ కూర్చొని ఉండడం వల్ల ఇతరులపై ఆధారపడడం మొదలవుతుందని తెలుసుకున్నాను. 

మన శరీర కదలికల్ని ఎంత తగ్గిస్తే అంత త్వరగా వ్హాధుల పాలవుమని. మనం ఎంత చలాకీగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని అర్ధమయింది. 

ఏదో ఒక వ్యాపకం అది ఎంత చిన్నదైనా సరే ఉండడం మనిషికి చాలా శక్తినిస్తుంది. వేదన తగ్గిస్తుంది. ఇదంతా నేను ప్రాక్టికల్ గా అనుభవించినదే చెబుతున్నాను. 

ఇవన్నీ నాకూతురు చెప్పినప్పుడు అంతగా పట్టించుకోలేదు. కొట్టి పడేశాను.  కానీ నా కంటే పెద్దవాళ్ళని అక్కడ చూశాక, వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాలు చూశాక రియలైజ్ అయ్యాను.  

ఇప్పుడు నన్ను నేను, నేను చేస్తున్న పనిని నేను ప్రేమిస్తున్నాను. గౌరవిస్తున్నాను. పటిష్టం చేసుకుంటున్నాను. 

ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా?  మీ తోటి మహిళలకి మీరేం చెప్పదలచుకున్నారు?  మరో జర్నలిస్ట్ ప్రశ్న. 

నిన్నటి నాలాగా ఎందరో ..  కానీ, నేనిప్పుడు అందరిలా కాదు. 

కొందరిలా ..  

మళ్ళీ జీవితం మొదలైనట్లున్నది . సామజిక జీవితంలో మార్పులొచ్చాయి. కొత్త కొత్త మనుషుల్ని కలుస్తున్నా. 

చాలా కొత్త అనుభవాలతో వచ్చే ఉత్సాహం  కొత్త శక్తిని, సామర్ధ్యాన్ని, సంతోషాన్ని  ఇచ్చింది.  అన్నింటి కంటే ముఖ్యంగా నన్ను నేను కొలుచుకునే అవగాహననిచ్చింది. 

దారి మళ్ళిన నాకు, నా ప్రయాణంలో నన్ను నేను ఎలా మలచుకోవాలో  మెరుగుపరుచుకోవాలో,  స్పష్టత వచ్చింది.   

నా జీవితానికొక లక్ష్యం ఇచ్చింది.  ఇవన్నీ ఎమోషనల్ ఫిట్ నెస్ తో ఉండడం వల్లే  సాధ్యమయింది . 

ఆత్మవిశ్వాసం మనిషికి దివ్యౌషధమని అనుభవపూర్వకంగా  చెబుతున్నా .. 

అయితే, మానసిక ఆరోగ్యం సరిగాలేదని గుర్తించేదెవరు?  మెరుగుపరచుకునే అవకాశం, అండ ఎందరికి ఉంటుంది అనే ప్రశ్న నన్ను తొలుస్తున్నది. 

 

ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నా మదిలో రూపొందిన ఆలోచన ఇది మీతో పంచుకుంటున్నా .. 

మనం శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకున్నంతగా మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోము. కానీఅది చాలా అవసరం.  దాని గురించిన అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నాలాగా ఎందరో పిల్లలు, పెద్దలు మానసిక సమస్యల్లో ఉన్నారు. 

మన బడులు, కుటుంబాలు ఏవీ ఆ దిశగా ఆలోచించడం లేదు.  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెడితే బాగుంటుందని నా అభిప్రాయం.

మార్చి ఎనిమిదో తేదీన నుండి అరవై రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా.   

మానసిక ఆరోగ్యం పట్ల మనలో ఉన్న నమ్మకాల్ని పోగొట్టే విధంగా కార్యక్రమం రూపొందించుకుని, స్థానిక బడులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, సామజిక కార్యకర్తలు అందరినీ కలుస్తూ ముందుకు సాగాలని అవగాహన కలిగించాలని ఆలోచన. 

ఎలా .. ఎక్కడినుండి అని అడగకండి.  త్వరలో  నా కార్యాచరణ విషయాలూ ప్రకటిస్తా అని ముగించింది పూర్ణిమ.

 

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు