కథలు

(May,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

మా కతార్ బాబాయ్

"ఎట్లుందిరా రూమ్, ఫుడ్ గిట్ల? అంతా ఓకేనా?"

చాలా రోజుల తర్వాత అదే మొదటిసారి బాబాయిని నేరుగా కలవడం. అది కూడా వేరే దేశంలో. కొంచెం ఎక్సయిటింగా అనిపించింది.

"హా! ఓకే బాబాయ్. అంతా సెట్. ఒక రూమ్‌లో నలుగురు ఉండాలి. ఫుడ్ కూడా బాగుంది. నేపాల్ వాళ్లకి, మన ఇండియా వాళ్లకి, ఇంకా వేరేవాళ్లకి అందరికీ సపరేట్ ఫుడ్ కౌంటర్లు ఉన్నాయి మెస్‌లో. కూరలు కూడా మంచిగనే ఉన్నాయి. కాకపోతే కొంచెం సప్పగా ఉన్నయంతే!" 

బాబాయ్ కొద్దిగా లావయ్యాడు. కొంచెం రంగు‌ తేలాడు. బొర్ర దిగింది. బహుశా ఆ కార్లో కూచొని రోజంతా డ్రైవింగ్ చేయడం వల్లనేమో!

"మీ కంపెనీ మంచి కంపెనీరా. సెమీ గవర్నమెంట్ కంపెనీ ఈడ! నాకు తెల్సురా మంచిగనే ఉంటాయి మీకు ఫెసిలిటీస్ అన్నీ. అది సరే గానీ, నేను తెమ్మన్నయి అన్నీ తెచ్చినవా మరి?"

నేను వచ్చేటప్పుడు అందర్లాగనే ఇంట్లో పెట్టిన ఊరగాయ, పిండివంటలు తెమ్మని చెప్పిన బాబాయ్, ఇంకోటి కూడా తెమ్మన్నడు. కొత్తగా కొన్న బండ్లకి కట్టే దిష్టి పూసల దండ. మొదటిసారి వస్తున్నా, తెలియని దేశం. దిష్టి గిష్టి అంటే తెలియని ఇక్కడి కస్టమ్ ఆఫీసర్ దాన్ని చూసి ఏంటని అడిగితే ఏం చెప్పాలె? అది ఇంకేదో అనుకుని నాపై కేసు రాస్తే? అవసరమా? అందుకే నేను తేనని చెప్పా.

"అట్ల కాదులే! ఎవరేమనరు. మర్చిపోకుండా తీసుకరా" అని ఫోన్లో నమ్మకంగ చెప్పాడు. ఇప్పుడు నేనది తెచ్చానో, లేదో అని సందేహం బాబాయ్‌కి. సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చినా తనకి ఆ నమ్మకాలు, చాదస్తం పోలే! నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో డ్రైవర్‌గా కతార్‌కి వచ్చి, ఇపుడు తనే సొంతంగా ఒక కార్ కొనుక్కొని ఉబర్‌లో నడుపుకుంటున్నాడు. మేము కూర్చుంది దాంట్లోనే. ఒక మాల్ పార్కింగ్ లాట్‌లో కార్ పార్క్ చేసుకొని మాట్లాడుతున్నం.

"హా! తెచ్చిన బాబాయ్. ఇంకా విప్పలే సామాన్. నావి కూడా కొన్ని ఉన్నయి దాంట్లో. రేపు అన్ని రూమ్‌లో సెట్ జేసుకున్నంక ఇస్తా నీ సామాన్ నీకు" అన్నా.

పొద్దున పది గంటలు కూడా కాలేదు. బయట ఎండ మాత్రం గట్టిగానే కాస్తుంది. కార్లో ఏసీ ఆన్ చేసుకొని కూచున్నం. రోడ్డు మీద కార్లు, పికప్ ట్రక్‌లు, బస్‌లు, ఇంకా పెద్ద పెద్ద ట్రక్‌లు తిరుగుతున్నయ్. అక్కడక్కడా ఒక్కొక్క బైక్ కనిపిస్తుంది. అవి ఫుడ్ డెలివరీ బైక్‌లు. ఇక్కడ జనాలు బైకులు ఎక్కువగా నడపరని విన్న! ఇదిగో ఇప్పుడు చూస్తున్నా నిజంగనే.

"సరే! ఇంకా మరి? ఇంట్ల అంతా మంచిదేనా? ఇంతగనం సదుకున్నావ్. రాకురా వారి ఇటు, ఆన్నే ఏదయినా జేసుకోరా అంటే ఇనక పోతివి. అచ్చినవ్ అట్లిట్ల జేసి. సరే కానీ!ఇంకా మరి?"

బాబాయ్ అలా మాటిమాటికి ఇంకా ఇంకా అనడం నచ్చలేదు. 'ఏంటి బాబాయ్ ఎటైనా పోవాల్నా' అని అడుగుదామనుకున్న. బాగోదేమో అని అడగలే ఇగ.

"హా! ఏం జేద్దం బాబాయ్? ఈ కరోన జెయ్యంగా అందరికీ బాగా కష్టమైతుంది ఇంటికాడ. నేనూ అందరి లెక్కనే కూసున్న ఏం పన్లేక కొన్ని రోజులు. ఇగ ఎన్ని రోజులు కూసుంటమిట్ల? ఏదైతే అదైతదని అచ్చిన ఇటు"

ఇంజినీరింగ్ అయిపోయి నాలుగు సంవత్సరాలవుతున్నా ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించలేకపోయా. ఇప్పటిదాకా చేసినవన్నీ కాంట్రాక్టు బేసిస్‌లోవే. ఇప్పుడంటే ఈ కరోనా ఉంది గానీ ముందు మూడు సంవత్సరాలు ఏం చేశా? ఇప్పుడేమో ఇలా కరోనా పేరు చెప్పుకొని నా అసమర్థతని కప్పి పుచ్చుకుంటున్నా. నన్ను చూస్తే నాకే ఏదోలా అనిపించింది.

"సరేరా కలుద్దాం. మల్ల వెళ్తా ఇగ! నిన్ను ఎక్కడ దించాలె?" అంటూ ఓ 50 రియల్ నా జేబులో పెట్టాడు. ఇండియాల వెయ్యితోటి సమానం అవి.

వద్దు బాబాయ్ అందమనుకున్న. 'వెళ్లిన కొత్తలో మనకు తెలిసిన వాళ్లెవరైనా డబ్బులు ఇస్తే వద్దనకుండా తీస్కో.‌ దేనికైనా ఉపయోగపడతాయి" అని ఇంటిదగ్గర మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వద్దనలేదు. తీసుకున్నా.

" ఓకే బాబాయ్! నన్ను ఆ ఏషియన్ సిటీ గేట్ దగ్గర దింపేయ్"

నాకంటే అప్పుడప్పుడు ఇలా కలవడానికి బాబాయ్ ఉన్నడు. మరి బాబాయ్ వచ్చిన కొత్తల్లో ఎవరైనా వచ్చి కలిసారో లేదో బాబాయిని? ఒక్కడే ఒంటరిగా ఫీల్ అయ్యాడేమో? ఏషియన్ సిటీ గేట్ వచ్చింది. కారు దిగా.

"ఓకే బాబాయ్! ఉంటా మరి కలుద్దాం"

నా ఆలోచనల్లాగే కారు నన్ను దాటుకుని వేగంగా వెళ్తుంది. ఇంటి దగ్గరున్న ఇన్ని రోజుల్లో బాబాయ్‌కి కనీసం ఒక్క సారైనా ఫోన్ చేసింది లేదు. ఎట్లున్నవని అడిగింది లేదు. ఇదిగో ఇప్పుడిలా వస్తున్నా అని ఒక నెల ముందు నుండే స్టార్ట్ చేసిన ఫోన్లు చేయడం. అంతేలే! మనుషులకి ఎవరితోనైనా అవసరమొస్తే తప్ప వాళ్ళు గుర్తురారేమో? నేను కూడా అంతే కదా అనుకున్న. ఇంతలో నా ఫోన్ రింగైంది. అవతల బాబాయే మళ్లీ!

"చేరుకున్నావరా రూమ్‌కి? జాగ్రత్తగా ఉండు. నీకు ఏం అవసరమున్న అడుగు. బాబాయ్ ఏమనుకుంటడో అనుకోకు. సరేనా?"

నేనే గనక బాబాయ్ స్థానంలో ఉంటే నా ఆలోచనలు వేరేలా ఉండేవి. నాలోని ఆవేశాన్నంత సూటిపోటి మాటలతో చల్లార్చుకునేవాణ్ణి. కానీ బాబాయ్ అలా ఆలోచించినట్లు నాకైతే అనిపించలేదు. పెద్దరికం అని దీన్నే అంటారేమో! మా రూమ్ వచ్చింది.

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు