గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
ఆ నిశిరాత్రి ప్రపంచమంతా నిద్రలో జోగుతున్నది. నిశాచర పక్షులు రెక్కలు తపతప లాడిస్తూ సంచరిస్తున్నాయి. కీచురాళ్ళు అదే పనిగా తమ రణగొణ సంగీతం వినిపిస్తున్నాయి
ఆరుబయట అనువైన ప్రదేశంలో వైరస్ బృందం సమావేశమయ్యాయి.
చాలాకాలం తర్వాత అనుకోకుండా కలిసిన బంధు -మిత్ర బృందం అలాయ్ బలాయ్ ఇచ్చుకొని ఒకరినొకరు అభిమానంగా నఖశిఖపర్యంతం పరీక్షగా చూసుకుంటున్నారు. అంతలో కోవిద్-19 కేసి చూస్తూ "ఏమోయ్ మస్తు జోష్ మీదున్నావే . దునియా అంతా దున్నేస్తున్నావ్ గద.. ఇందుగలడందు లేనట్లు ఎక్కడ చూసినా అలలు అలలుగా ఎగిసిపడుతున్న నీ సంతతే. మీ తలపులే " అన్నది ఎబోలా.
"మీరు నంగనాచిలా ఉంటారు కానీ .. ఒకటా రెండా... ఎన్నెన్ని సంక్షోభాలు మీ వల్ల.
ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, సాంస్కృతిక సంక్షోభం ఇలా ఎన్నెన్నో సంక్షోభాలు సృష్టించేశావ్..ఘటికురాలివే .. " దీర్ఘం తీసింది మార్స్
"లోకంలో ఎక్కడ చూసినా నీ పాదముద్రలే. నీ గురించిన ఆలోచనలే. గ్లోబంతా గిరగిరా తిరిగేస్తున్నావ్. అదీ..పైసా ఖర్చు లేకుండా' చిన్నగా నవ్వుతూ అన్నది ఇన్ఫ్లూయంజా
కూర్చున్న చోటు నుంచి కొద్దిగా కదులుతూ "చూడడానికి నాజూగ్గా, అందంగా ఉంటావ్. ఎక్కడేస్తే అక్కడ జంతువుల దగ్గర పడుండే సోంబేరువనుకునేవాళ్లం. ఇప్పుడేంటి ..?! నువ్వు నువ్వేనా.. నన్ను మించి పోయావ్ " ఎకసెక్కం గా నవ్వింది హెచ్ ఐ వి
"ఊ.. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, చదువులు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు అన్నీ చట్టుబండలైపోయే.. జనం దగ్గర పైసలు లేవు.
రోగం-రొష్టు, ముసలి-ముతక అందర్నీ తుడిచేస్తున్నావ్.. ఓ యబ్బో..
తమరి మహిమ అంతా ఇంతా కాదుగా .. "అందరి వైపు చూస్తూ అన్నది మార్స్.
మళ్ళీ తానే "ఆసుపత్రుల్లేవు. వైద్యం లేదు. చావుకి బతుక్కి మధ్య వేలాడుతున్న జనం.. ముఖ్యంగా వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, పేద వాళ్ళ త్యాగాలతో వారి సమాధుల వరుసల్లో రాళ్లు ఏరుకు తినే రాక్షసగణం తయారయ్యారు.
ఆ అయినా .. పోయేకాలమొస్తే మనమేం చేస్తాం.. " అన్నది మార్స్
నీ ధాటికి భయపడి సూర్యుడు వణుకుతూ సూర్య మండలంలోనే హోమ్ క్వారైటైన్ లో ఉండి పోయాడట కదా.. అనుకోగా ఆ నోటా ఈ నోటా అనుకోగా విన్నాలే.. నిజమేనా.." కళ్ళు పెద్దవి చేసి అడుగుతున్న ఎబోలా గొంతులో దాచుకుందామన్నా దాగని అసూయ కనిపించింది మిగతా వైరస్ లకు.
నిన్ను కట్టడి చేయడానికి ప్రపంచమంతా కంకణం కట్టుకున్నదట కదా .. ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేయడం అంత సులభమా " దీర్ఘం తీసింది హెచ్ ఐవి
"అవును మరి, బుసలు కొట్టి కాటువేసే సర్పాన్ని ఎవరు మాత్రం ప్రేమగా పెంచుకుంటారు చెప్పండి. కోరలు పీకి పడేస్తారు. పీక నులిమి పాతరేస్తారు గానీ .. " తన వెనుక పుట్టిన దాని కింత పేరుప్రఖ్యాతులు రావడం కంటగింపుగా ఉన్న మార్స్ దీర్ఘం తీసింది.
"ఎందుకర్రా.. దాన్నలా ఆడిపోసుకుంటారు..అది పడగవిప్పి బుసలు కొడుతూ వెంటాడితే లోకమిలా ఉంటుందా .. లాక్ డౌన్ ఎత్తేస్తుందా .. ప్రపంచమంతా ఇప్పటికీ లాక్ డౌన్ లోనే మగ్గిపోయేది కదా ..
జీవావరణం లో అన్ని జీవులతో పాటు, కణజాలం తో పాటు మనమూ ఉన్నాం.
అదంతా ఇప్పుడెందుగ్గానీ .. చాన్నాళ్ల తర్వాత కలిశాం . కాసేపు సరదాగా గడుపుదాం " అప్పటి వరకు అందరి మాటలు విన్న జికా అన్నది.
కొన్ని క్షణాలు జికా వైపు అభిమానంగా చూసి "బంధు మిత్రులంతా నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావడం లేదు" అయోమయంగా అన్నది కోవిద్19 .
ఆ వెంటనే "కాలం నన్ను కౌగలించుకుంది. తనతోపాటు తీసుకు పోతున్నది. ఎటు తీసుకుపోతే ఆటుపోతున్నా అంతే. నేను నిమిత్త మాత్రురాలిని ..
జనమే అనుకున్నా మీరు కూడా నన్ను కేంద్ర బిందువు చేసి ఆడిపోసుకుంటున్నారు" ఉక్రోషంగా మిత్ర బృందం కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నది కోవిద్-19.
మళ్ళీ తానే "ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టినట్లే నేను పుట్టాను. నాకు నేనుగా ఈ పుట్టుక కావాలని కోరుకుని పుట్టలేదుగా..
నా మనుగడ కి అనువైన ఆవాసాలు తెలియక ఎవరి కంట పడకుండా ఇన్నాళ్లు ఎక్కడెక్కడో అనామకంగా పడి ఉన్నానేమో..!
మానవ శరీరంలో నా పునరుత్పత్తికి అనువైన కేంద్రాలున్నాయని తెలిసుకున్నా.
ఈ సృష్టి ధర్మం ప్రకారం జీవమున్న ప్రతి కణం చేసే పని నేనూ చేసుకు పోతున్నా..
అంతే తప్ప స్వార్ధంతో, ఎవరిమీదో కక్షతో, కసితో కోపంతో కాదుగా.. " అదేమన్నా తప్పా అన్నట్లు అందరి వైపు చూస్తూ భుజాలెగరేసి చెప్పింది కరోనా అని పిలుచుకునే కోవిద్ 19.
"రెచ్చిపో బ్రో.. రెచ్చిపో.. ఇంత మంచి తరుణం మళ్ళీ మళ్ళీ వస్తుందా..!
ప్రపంచ రాజ్యాలకు ప్రజల ఆరోగ్యం ఎలాగూ ప్రాధాన్యం కాదు. వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళవి .
యుద్ధాలు .. ఆయుధాలు.. వర్తక వాణిజ్యాలు .. ఎవరి ప్రయోజనాలు వారివి.
హూ.. సామాన్య జనం, ఉంటే ఎంత .. పోతే ఎంత ... ఆఫ్ట్రాల్.. ఏం ఫరక్ పడదులే భాయ్.. విజృంభించడానికి మంచి సమయం ఎంచుకున్నావ్ "అన్నది మార్స్
"కోవిద్ 19 ఎంచుకున్నదనుకుంటున్నారా.. ఉహు లేదు లేదు..
నెత్తుటి కూడు తినే మానవ గణాలు కొన్ని ఉన్నాయి.. ఏమీ ఎరగని పత్తిత్తుల్లా కనిపిస్తాయి కానీ మహా జిత్తులమారులు. తమ పబ్బం గడుపుకునేందుకు తెరవెనుక పావులు కదుపుతుంటాయి . అవే ఒలిచిన పండును మన ముందు పెడతాయి.. మనకి పండగే పండుగ. తిన్నవాళ్లకు తిన్నంతని విజృభించేస్తాం" తన ధోరణిలో అన్నది హెచ్ ఐ వి
"నీలాగా, నా లాగా దీనిది ఉగ్ర తత్త్వం కాదులే. సాధు స్వభావి. దానికది పోయి మానవుడిని కౌగలించుకోదు. తనను కలిసిన వారినొదలదు. తెలిసో తెలియకో మానవులే ఆకాశమార్గం పట్టిచ్చారు. నౌకల్లో మోసుకుపోయారు. సముద్రాలు దాటించారు. ఖండాంతరాలు విస్తరింపజేశారు.." ఎబోలా ను చూస్తున్న మార్స్ అన్నది
"నిజమే..మానవుని నడక, నడతదే తప్పు. మనని మనం ఆట పట్టించుకోవడం, నిందించుకోవడం సరైంది కాదేమో " పెద్దరికంగా అన్నది జికా
"ఇదేమన్నా ఎడ్ల బళ్ళు , గుర్రబ్బగ్గీల కాలమా .. జెట్ యుగంలో ఉన్నాం మరి!
మానవుడు రోదసీలో కెళ్లి వస్తున్నప్పుడు అతనితో మనం ఆ మాత్రం ప్రయాణం చేయలేమా ఏమిటి? ఎక్కడికైనా అలాఅలా వెళ్లిపోగలం" జికా మాటని పట్టించుకోని హెచ్ ఐ వి అన్నది
"అవునవును, కానీ .. జీవితంలో ఎన్నో గెలిచిన వాళ్ళు, అంటువ్యాధుల జాడలేని పూదోటగా మారాయనుకునే దేశాల వాళ్ళు కంటికి కనిపించనంత అతిసూక్ష్మ క్రిమికి బెంబేలెత్తి పోవడం, భయపడిపోవడం, మరణశయ్య నెక్కడం విచిత్రం!" బుగ్గన వేలేసుకుని ఎబోలా .
"అదే నాకు అంతు చిక్కడం లేదు. అసలు నేనెంత వాళ్ళ ముందు .. ఆ.. చెప్పండి.
మానవ మేధ, జ్ఞానం, విజ్ఞానం ముందు మనమెంత? నలుసులో వెయ్యోవంతో, లక్షోవంతో కూడా లేని నేనెంత? నాపై ఇంత ప్రచారమా.. ఎన్ని నిందలో.. మరెన్ని కట్టుకథలో ..
వింటుంటే మొదట్లో బాధేసేది. కానీ ఇప్పుడవన్నీ వింటూ నవ్వుకుంటూ నా పని నేను చేసుకు పోతున్నా.
నాకా స్థితి కల్పించిన రాక్షసగణం మనోగతం అర్థమయింది. ఈ భాగోతంలో మనిషికీ మనిషికీ మధ్య, దేశానికి దేశానికి మధ్య , రాజకీయాలకి రాజకీయులకు మధ్య ,రాజ్యాల భౌగోళిక రాజకీయ ప్రయోజనాల మధ్య , వ్యాపార వాణిజ్య ప్రయోజనాల మధ్య ఎన్ని రకాల సిద్ధాంతాలు .. మరెన్ని ప్రచారాలు .. ఎన్ని అపోహలు , ఎన్ని అపనమ్మకాలు ..
ఏవీ నేను సృష్టించినవి కాదు. నన్నడ్డం పెట్టుకుని కొన్ని గణాలు తెరవెనుక ఆడుతున్న పెద్ద ఆట.
ఆ క్రీడలో భాగమే ఇప్పటి సంక్షోభాలు, విపత్తులు, యుద్ధాలు, దాడులు.. "వివరణ ఇస్తున్నట్లుగా అన్నది సార్స్ కోవిద్ 19
"నీ ప్రతాపాన్ని, ప్రకృతి ప్రకోపాన్ని కూడా మానవుడికి అంటిస్తావేం .." కొంచెం విసుగ్గా అన్నది ఎబోలా
" బ్రో .. ఆ జీవి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడేమైనా జరగొచ్చని అతని అతి తెలివితేటలే కాదు చరిత్ర చెబుతున్నది. చరిత్రలోకి తొంగి చూడండి. వనరులకోసం, సంపద కోసం, స్వార్థం కోసం, అధిపత్యం కోసం జరుగుతున్న దేనని స్పష్టమవుతుంది" నిదానంగా అందరి కేసి చూస్తూ అన్నది కోవిద్ 2
అప్పటివరకూ సరదాగా మాట్లాడుతున్న మిత్ర బృందం ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. కోవిద్ 19 మాటల్లో అంతరార్థం వెతకడానికి ప్రయత్నిస్తున్నారు .
"ఆలోచిస్తే నువ్వన్నది నిజమేననిపిస్తుంది మిత్రమా.. చేతులతో గరళం విరజిమ్మదానికి సిద్ధమవుతూ నాలుక నుంచి తేనెలూరించే మురిపించే మాటలు, చేతలు ఎన్ని చూడడం లేదు" అన్నది జికా
"ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన లేమిని ఆసరా చేసుకుని ఆందోళన సృష్టించారు. ఒక మామూలు వైరస్ ని బూచాడుని చేశారు. భూతద్దంలో చూపారు .
బ్రహ్మాండంగా జేబులు నింపుకుంటున్నారు. ఒకప్పుడు నా విషయంలో జరిగిందదే" హెచ్ ఐవి
"అయ్యో .. ఈ మనుషులు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియలేదంటే నమ్మండి.
మానవులలో కొందరు కొందరిని అంటరాని వారిగా చూస్తూ, అవహేళన చేయడం గురించి చరిత్ర ఎన్నో సాక్ష్యాలు చూపుతుంది. ఇప్పుడు కోవిద్ ఎవరితోనైనా కనిపిస్తే చాలు అలాగే వారిని అంటరానివారిగా చూస్తున్నారు. బంధుమిత్రులు దూరంగా పెడుతున్నారు.
నిన్నటివరకూ ఆత్మీయతానురాగాలు కురిపించిన వాళ్లే అంటరానివారిగా చూడటం భరించలేని కొందరు ప్రాణత్యాగం చేస్తున్నారట." అన్నది ఇన్ఫ్లూయెంజా
"నిజమే.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లికి పాజిటివ్ రాగానే నడిరోడ్డుపై అనాథలా వదిలేసిన ప్రబుద్ధుల్ని చూస్తున్నా.
అంతేనా .. పాపం, ఆయనెంతో మందికి విద్యాబుద్ధులు చెప్పారు . ఇప్పుడు వాళ్లంతా ఆయన శవం ఖననాన్ని అడ్డుకున్నారు
మరొకాయన గొప్ప వైద్యుడు. తుమ్మినా దగ్గినా ప్రజలకు ఉచిత వైద్యం చేసిన మహానుభావుడు నిన్నటివరకూ.. నేడాయన శవాన్ని అక్కడ కాల్చడానికి ఆ ప్రజలంతా వ్యతిరేకమే .
ఊళ్ళ మధ్య ముళ్ళకంపలు, పాజిటివ్ ల వెలి, తోటి మనిషిని అక్కున చేర్చుకోలేనితనం... అయ్యో .. ఏమని చెప్పను .. ఎన్నని చెప్పను .. కొల్లలు కొల్లలుగా కథలుకథలుగా విషయాలు బయటికొస్తున్నాయి. అయ్యయ్యో .. ఏది మానవత్వం..? ఏవీ మానవీయ విలువలు..? మననంటారుగానీ మనకంటే తీవ్రమైన నీచమైన వైరస్ మనిషిలోని స్వార్థం. ఆ జబ్బుతో సహజీవనం చేస్తూ మనను ఆడిపోసుకుంటారు" వాపోయింది హెపటైటిస్.
ఏ మాత్రం వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కూడా వైరస్ జాతులున్నాయి. కొన్ని వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి. మనిషిలో మార్పు వచ్చినట్లు వాటిలో కొద్దోగొప్పో మార్పొచ్చిందేమో.. అయినా తట్టుకుంటూ, కాపాడుకుంటున్న మానవుడు ఇప్పుడెందుకు చిగురుటాకులా వణికిపోతున్నట్లు, రాలిపోతున్నట్లు?
మానవ ప్రవృత్తిలో, ఆహార విహారాలలో మార్పు తెచ్చే కుట్రలు చాపకింద నీరులా సాగించిన రాక్షస మూకకి ఇప్పుడు పండుగగా ఉంది.
పెద్ద పెద్ద కబుర్లు చెప్పే గొప్ప దేశాలన్నీ చతికిలబడి అదృశ్యక్రిమిని ఎదుర్కోలేక పోవడం అభివృద్ధి నమూనా విచిత్రం. కారణం ఎవరు..?
అలక్ష్యం, దాచివేత, దాటవేత, అలసత్వం, అసమర్ధత, నేరపూరిత నిర్లక్ష్యం కనిపించకుండా కళ్ళకు గంతలు కట్టి వైరస్ ని నిందిస్తున్నారు
మెరుగైన ఆరోగ్య సదుపాయాలు సాధించామనుకుంటూ ప్రజా ఆరోగ్య వ్యవస్థల విచ్ఛిన్నం చేసుకున్నారు.
వైద్యం, ఆరోగ్యం లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. జబ్బు పడితే జేబుకు చిల్లే నా యే.. ఐదు నక్షత్రాల వైద్యం, మూడు నక్షత్రాల వైద్యం కొనలేక కొందరు, తప్పని పరిస్థితిలోనో, బతుకుమీద తీపితోనో ఉన్నదంతా ఊడ్చి తర్వాత చిప్పట్టుకుంటున్న వైనం.. కళ్లారా చూస్తున్నా.. అయినా, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు కార్పొరేట్ వైద్యం చుట్టూ తిరుగుతారు . ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారని అనుకుంది వైరస్ మిత్ర బృందం మాటలు మౌనంగా ఆలకిస్తున్న గబ్బిలం
"ఎగిరే పక్షికి వల పన్నినట్టు మన చుట్టూ వలపన్ని మనను మట్టుబెట్టడానికి యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్ డ్రగ్స్, వాక్సిన్స్ కోసం వాటిపై ఆధిపత్యం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఏవేవో కనిపెట్టామంటున్నారు. అయినా అన్ని తట్టుకుని మనం పుట్టుకొస్తూనే ఉన్నాం. మన ఉనికి వల్ల, మనం ప్రాబల్యం చూపడం వల్ల కొంతమంది జనం ఎప్పుడూ ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు.
ప్చ్.. పాపం పుణ్యం ఎరుగని బీదాబిక్కి బలైపోతున్నారు అది వేరే విషయమనుకో.. " అన్నది కోవిద్ 19
"ఇందుగలడందు గలడు అన్నట్లు ఎక్కడ చూసినా నువ్వే, నిరంతరంగా పరివర్తన చెందుతుంటే మేతావులు తయారు చేసుకున్న మందులు పనికిరాకుండా పోతున్నాయి. హహ్హహ్హా ..." గుంపు లోంచి పగలబడి నవ్విందో వైరస్
నిజమేనోయ్ .. మానవులెంతో తెలివిగలవారనుకున్నా.. మనని వల్లకాట్లో కలపడం వాళ్ళకి తెలియక కాదు. బాగా తెలుసు. అయినా పీడకలలుగా కలవరిస్తూనే ఆదమరచి నిద్దురపోతారు.
అప్పుడప్పుడు మొద్దు నిద్దుర లేచి హడావిడి చేస్తారు తప్ప నిజంగా కల్లోలాన్ని ఆపాలని చిత్తశుద్ధితో కాదు." అన్నది మార్స్
" వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయిగా.. అవి తేలాలిగా.." నవ్వింది కోవిడ్ 19
పెరిగిపోతున్న జనాభాని తగ్గించడానికి దేవుడు కోవిద్ ప్రవేశపెట్టాడట..
చప్పట్లు , దివ్వెలు .. మంత్రాలకు చింతకాయలురాలడం ఎప్పుడైనా ఎక్కడైనా చూశామా
పిచ్చిమూక. లోగుట్టు ఎరగక, మనుషుల పాపానికి దేవుడు విధించిన శిక్ష అనే మత గురువులు, ప్రార్థనలతో వైరస్ తరిమికొడతానని ప్రార్థనలు చేసే ఫాస్టర్, రాగి వస్తువులతో నయం చేస్తాననే వైద్యులు, పూజలు, దైవప్రార్థన తో తగ్గిస్తానని పూజారి, ఎండమావుల్లో నీళ్లు తెస్తాననే ముల్లా అందరూ బాధితులై మట్టిలో కలిసిపోతుంది మంత్ర తంత్రాలకు గిరాకీ తగ్గలేదు. మనుషులు ఉన్నపళాన ఎగిరిపోతున్నా, పవిత్ర గంగానదిలో కళేబరాలు ప్రవహిస్తున్నా.. బుద్ది లేని జనం ఎట్లా నమ్ముతున్నారో..
కన్నీళ్లు పోగుపడుతున్నా వాక్సిన్ వేసుకోవడానికి మీనమేషాలు లెక్క బెడుతున్నారు.
మాస్క్ లేకుండా శానిటైజ్ చేసుకోకుండా ఎడం ఎడం లేకుండా తిరుగుతారు.
కుంభమేళా, ఎన్నికల ర్యాలీలు, సభలు, పబ్లిక్ మీటింగులు ఏవీ తగ్గవు. కానీ ప్రాణం అంటే చచ్చేంత భయం. డబల్ స్టాండర్డ్ మనుషులు .. థూ.. అంటూ తుపుక్కున ఊసింది మౌనంగా ఇప్పటివరకు వైరస్ ల మాటలు వింటున్న గబ్బిలం.
అలలు అలలుగా కోవిద్ రాకపోయుంటే జనం వాక్సిన్ తీసుకునే వాళ్ళు కాదేమో.. అనుకుంది నిద్ర లో మెలుకువ వొచ్చి వైరస్ బృందం మాటలు వింటున్న చీమ
"నాది సమదృష్టి . కుల మత, వర్ణ, వర్గ, ప్రాంత, జెండర్ వివక్షతలు నాకు లేవు. నాకు అందరూ ఒకటే. గుళ్లో పూజారి, చర్చి ఫాస్టర్, మసీదులో ముల్లా, దేశ ప్రధాని, ప్రెసిడెంటు ఎవరైనా నాకంతరం తెలియదు. నా దగ్గర కొస్తే.. నా పాత్ర నేను పోషిస్తా. వారు నన్నెదుర్కున్న దాన్నిబట్టే ఫలితాలు.." తనని నిందిస్తున్నారని బాధ మొహం లో కన్పిస్తుండగా కోవిడ్ 19.
మానవులలో ఉన్నన్ని తారతమ్యాలు మరెక్కడైనా ఉన్నాయా ..? వాళ్లలో కుల , మత , వర్గ , వర్ణ , రాజకీయ, ఆర్థిక, ప్రాంతం, జెండర్ ఇలా ఎన్నెన్నో వివక్షలు .. భేదాలు .. గురించి పుట్టెడు విని ఉంది . మందిరాల్లోనో, మసీదుల్లోనో, చర్చిల్లోనో తమ గోడు వెళ్లబోసుకున్న వాళ్ళ ఊసులు ఎన్నో వింటూనే ఉన్నానుగా.. ఈ వైరస్ ల మాటల్లో అతిశయం ఏమి లేదనుకుంది గబ్బిలం .
"కురచ మనుషుల వాదనలకు నువ్వేం బాధపడకు బ్రో.. ఇదేమన్నా ఇప్పటికిప్పుడు ఊడిపడిన ఉత్పాతమా.. నింగి నుంచి నేల రాలిన ఉల్కాపాతమా.. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత" ఊరడిస్తూ అన్నది మార్స్
"మానవ మనుగడకు, అస్తిత్వానికే ప్రమాదం తెస్తూ నెత్తుటి కూటి కోసం కాచుకునే మాయావుల ఇనుప డేగరెక్కల చప్పుడు వినలేదా ..
ఆ మాయావులే కదా మన వ్యాప్తికి కారణమయ్యేది. ఆ మాయావి డేగలే వ్యాధి వ్యాప్తికి కారణమంటూ జాతి, మత దురహంకారాన్ని రెచ్చగొట్టేది. విద్వేష ప్రచారం చేసింది. విషపూరిత వాతావరణం సృష్టించింది" అన్నది జికా
"అవును మిత్రమా, ఆ టక్కు టమారపు గారడీ విద్యలతో సముద్రంలో నీళ్లంతా తోడేసుకుందామని ఆశపడేది. అందుకోసం పావులు కదిపేది ఆ తాంత్రికులే " అన్నది హెచ్ ఐ వి
ఆ ఆశతోనే కదా అభివృద్ధి మంత్రం జపిస్తూ అధిక ఉత్పత్తి పేరుతో అత్యాశతో సహజత్వానికి దూరమయింది. సహజంగా, స్వచ్ఛంగా ప్రకృతి ఇచ్చే వాటిని తీసుకోవడం మానేసి ప్రకృతిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. కృత్రిమత్వాన్ని అలవాటు చేశారు..
సహజంగా తినే వాటిలో, సహజమైన గాలిలో, ఎండలో తిరిగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
ఒళ్ళు కదలకుండా, కండ కరగకుండ కొత్త రుచులు, కొత్త కొత్త సుఖాలతో అంబర మెక్కి ఊరేగుతున్నామనుకుంటున్నారు కానీ అధః పాతాళం లోకి వెళ్తున్నామని తెలుసుకోలేకపోతున్నారు.
పిచ్చి సన్నాసులు. తాను చూస్తున్న మానవజాతిని తలచుకుని జాలిపడింది చీమ .
వైరస్ బృందం మాటలు వింటూ చప్పుడు చేయకుండా చుట్టూ చూసింది. నిశాచరి గబ్బిలం కనిపించింది. నెమ్మదిగా గబ్బిలం చెంతకు బయలుదేరింది చీమ .
"ఎండమావుల్లో నీళ్ళెతుక్కునే వాళ్ళు కొందరయితే నేతి బీరకాయలో నెయ్యి పట్టుకుంటామనేవారు కొందరు .. మనమేం చేస్తాం ..
తన ఇంటిని తానే తగలబెట్టుకుంటూ మనమీద పడి ఏడుస్తున్నాడు .. " వైరస్ మిత్ర బృందం నుంచి మాటలు వినిపిస్తున్నాయి
ఒకపక్క దట్టమైన మేఘంలా కమ్ముకొస్తున్న ముప్పుని కప్పేస్తున్న వ్యాపార, వాణిజ్య విధానాలతో పర్యావరణ విధ్వంసం నిర్విరామంగా జరిగిపోతున్నది. తమ చేతకానితనాన్నో, రాజకీయ ప్రయోజనాలకో, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికో, లాభసాటి వ్యాపారం కోసమో, ఒక మామూలు వైరస్ ని సంక్షోభంగా, పెను విపత్తు గా మార్చేసిన వారిని చూస్తే దుఃఖం గా ఉంది. రేపు తమ గతేంటి.. గొణుక్కుంటూ గబ్బిలాన్ని చేరింది చీమ.
"మిత్రమా.. ఈ దెబ్బతో ప్రపంచం మారిపోతుందా.. కొత్త యుగంలోకి ప్రవేశిస్తుందా.. భవిష్యత్ చిత్ర పటం ఎలా ఉంటుందంటావ్" గబ్బిలాన్ని ప్రశ్నించింది చీమ.
"నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదురా... వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చి కోట్లాది మంది పోయారు. అంతకు ముందు ఇలా చనిపోయి ఉంటారు. అయినా మనిషి బుద్ది మారిందా .. లేదే .. ప్రజాసమస్యల్లోనూ లాభాల వేట తప్ప ప్రజాసంక్షేమం శూన్య మైనప్పుడు, వ్యక్తిగత ప్రయోజనం ప్రాధాన్యం అయినప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి?
శవాల మీద నెత్తుటి పంట పండిద్దామనుకునే క్రూరులున్నారుగా.., వాళ్ళున్నది పిడికెడే. కానీ ప్రపంచ సంపదంతా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ అదుపాజ్ఞల్లోనే , అజమాయిషీలోనే ..
ఆకలి కేకల చీకటి బతుకులకు బాసటై తమకు తోచిన విధంగా సహాయం చేసే వాళ్ళు మానవత్వం ఉన్నవారు పెరగాలి.
అదిగో.. ఆ గుడిలో ఉండే దేవుళ్లు చేయలేని పనులంటే చెడ్డ పనులు కాదు మంచి పనులు చేస్తూ ఆపదలో ఉన్నవారికి ఎంతటి కష్టం లో నైనా తోడు ఉండేవాళ్లు పెరిగినప్పుడు, భరోసా ఇచ్చేవాళ్ళు పెరిగినపుడు మారుతుందేమో ..! " ఆశగా అన్నది గబ్బిలం
ప్రతి ప్రయాణానికి అనివార్య ముగింపు ఉంటుంది అనుకుంటూ చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగు దిశగా కదిలింది చీమ.
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు