కవితలు

కవితలు

సెప్టెంబర్-17

విద్రోహమే విద్రోహమే

ముమ్మాటికీ విద్రోహమే

చారిత్రక సత్యమిది

తెలంగాణకి ద్రోహమే

నెహ్రూ పాలనలో పటేలు సైన్యాలు నరహంతక నైజాముల మారణహోమపు ఘట్టం....

 

భూమి భుక్తి విముక్తికై

సాగే సాయుధ పోరునణిచి

ఆపరేషన్ పోలో తో

పటేల్ సైన్యాలు నైజాం రాజకార్లు

ప్రజలపైన విరుచుకపడి

మాన ప్రాణాలనే తీసి

ఊచకోత కోసిన రోజది

 

మతోన్మాదుల్లారా....

మీకు విమోచన సంబరాలా?

 

ఎర్ర మందారాలు పంచిన

పది లక్షల ఎకరాలను

తిరిగి దొరలకు అప్పజెప్పి

జనాల వెట్టికి నెట్టి

అధికార దాహంతో

నిజాంకు భరణమిచ్చి సాగనంపి

స్వతంత్ర తెలంగాణ ఆత్మగౌరాన్ని చంపి

దురాక్రమంగా యూనియన్లో కలిపిన దినమిది

 

అగ్రకులోన్మాదుల్లారా...

మీకు విలీన సంబరాలా?

 

విద్రోహమే విద్రోహమే

ముమ్మాటికీ విద్రోహమే

చారిత్రక సత్యమిది

తెలంగాణకి ద్రోహమే

నెహ్రూ పాలనలో పటేలు సైన్యాలు నరహంతక నైజాముల మారణహోమపు ఘట్టం....

 

 

కవితలు

మట్టి పొరలకింద

చుట్టూ..
పలుగు పారల గాయాలశబ్దం
నాగలికర్రుల ఎక్కిళ్ళ అలికిడి

మట్టిని తవ్వే చేతులు
మట్టిని దున్నే పాదాలు
వొళ్ళంతా మట్టివాసనతో పరిమళిస్తున్న సమూహాలు
కళ్ళలో మట్టికొట్టిపోతుంటే
కళ్ళుమూసుకుని ఎంతకాలముంటాయి?

మట్టి పగిలి
మట్టి పిగిలి
మట్టిపై ద్రోహపన్నాగాల్ని
మట్టిగలిపేయడమే చరిత్రపాఠం గదా!
మట్టితో పెట్టుకుంటే
మట్టిగరిచిపోవడమే!

మట్టే బువ్వై
మట్టే నవ్వై
మట్టికి సాగిలిపడి పట్టంగట్టే రోజులు
మట్టిపొరలకింద మొలకెత్తుతున్న
మట్టిమొలకల భాష
మక్కిపోయిన మురికిచెవులకు వినిపించదంతే!

మనుషులంతా
మట్టినితొడుక్కుని తిరుగాడే మట్టికువ్వలు
మట్టివేళ్ళతో చిగురించే మట్టిబొమ్మలు

శతకోటి కుట్రల
శత్రు వలయాల నడుమ
గుండెనిండా మట్టి వాసన పీల్చు
మనిషిగానైనా మిగుల్తావు!

**              ***               **
 

 

 

కవితలు

రైతన్న

తెల తెల వారంగనే

కాడేడ్లను కట్టుకొని

భూమిపై వాలిపోతావు

చెట్టు పుట్టను

చదునుచేసి

నాగలితో సాల్లు పెడ్తావు

మడులు మడులుగా జేసి

గింజె గంజెను జల్లి

నారోలే జెస్తావు

మోకాళు లోతులో

నడుమంత వంచి

వరి చేనును మోలిపిస్తావు

నీ కష్టమంత కన్నీరై వర్షిస్తే

గింజ గింజలుగ మారే

వాటిని రాశులోలే పోగుజేసి

దేశానికే మెతుకునిచ్చి

నీవు అన్న దాతవైనావు

ఓ రైతన్న

70 ఎండ్ల స్వాతంత్రంలో

నీవు నిలుచున్న చోటు

నీది కాకుండా చేసే

కార్పోరేట్ డేగలు

నిన్ను తరుమబట్టే

వెళ్ళను జోప్పించి

వేర్లను పుట్టించిన వాడివి

ఎన్నో కరువు కాటకాలను

ఎదుర్కున్నోడివి

పోరు కొత్తేమి కాదు నీకు

కర్రు నాగలితో

డేగ రెక్కలను విరిచివెయ్

కాయలు కాసిన

నీ చేతులతో

కలుపు కమలాన్ని పికివెయ్

ఓ రైతన్న

పికివెయీ

 (పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా బిల్ పాస్ చేయడాన్ని నిరసిస్తూ

కవితలు

జ్ణాపకాల పేటిక

ఇల్లంటే 

ఇటుక గోడలూ, గదులూ తలుపులూ

వాటి రంగులూ ...ఇవేనా?

గోడల పైనున్న రంగురంగుల బొమ్మల మొహాలపై

విరసిన నవ్వుల కిలకిలలు

కళ్ళల్లో మెరుస్తున్న కాంతుల చమక్కులూ కావా ?!

గదుల్లో విశ్రమిస్తున్న కనురెప్పల పైన 

నిశ్చలంగా నిలచి ఉన్న ప్రశాంతత కాదా?

ఆ కనుపాప తలుపుల వెనుక 

నిర్భయంగా కదలాడే తలపుల మెరుపు కలలు కావా?

 

ఇంటిని కోట్ల లెక్కల్లో, ఫీట్ల లెక్కల్లో, ఫ్లోర్ల  లెక్కల్లో కొలుస్తారా?

కోటానుకోట్ల గుర్తుల పునాదులు పోసి

 ఆకాశమంత ఎత్తుకి ఎగసి దూసుకెళ్ళే స్మృతుల  స్థంభాలు వేసి,

తీపి చేదు జ్ఞాపకాల్ని గుట్టలుగుట్టలుగా పోసిన కప్పుతో

త్రికరణసుద్ధితో కట్టుకున్న ఇంటిని ఏ లెక్కన కొలుస్తారు?

 

 ఓ ఆడపిల్ల పెళ్ళిచేసుకొని

 అత్తారింటికి వెళుతూ

తనతో ఏం తీసుకెళ్ళాలనుకుంటుంది ??

 అత్తగారికిచ్చే కట్నం డబ్బులా

 లేక అమ్మ ప్రేమగా తన చేత్తో చేసిచ్చిన కాటుక డబ్బానా ?

 లక్షా యాభైవేల ఆడపడుచు లాంఛనమా

 లేక అక్కని విసిగించి, వేదించి, సవాలక్ష ప్రశ్నలు వేసి,

  దానిదగ్గర సంపాదించిన టైటాను వాచీ నా ?

 మామగారికి చదివించిన మారుతీ కారా

  నాన్న నాకు కొడుకైనా కూతురైనా నువ్వే తల్లీఅని  

  తల నిమిరి తనకోసం కొనుక్కున్న స్కూటీనా ?

 తీయని సారెలు మోసుకెళుతుందా

 అన్నదమ్ముల ఆత్మీయతల్నీ

 పుట్టినింట మరువపు సుగంధాల్నీ 

 మరువకుండా గుండెలనిండా నింపుకెళుతుందా ?

 

ఒక విద్యార్ధి ...పై చదువులకోసం

అయిన వాళ్ళని వదిలి పరాయి దేశం తీరాల్ని తాకినా,

 

ఓ రైతన్న....అప్పులు తీర్చలేక ,గత్యంతరం లేక

 బ్రతకలేక, చావలేక, కూలిపనికి పట్నం పోవాల్సొచ్చినా,

 

ఓ ఉద్యోగి ... బ్రతుకు తెరువు కోసం 

పెళ్ళాం పిల్లల్ని విడిచి వేరే ఊరు వలస వెళ్ళాల్సివచ్చినా ,

 

ఒక సైనికుడు ....దేశ రక్షణకై , జన సంరక్షణకై ,

బలికావడానికి , సరిహద్దుకి యుద్థానికి దూసుకుపోయినా,

 

విద్యాధర్మమైతేనేం, విధి వైపరీత్యమైతేనేం...

కార్యాచరణకైతేనేం, కర్తవ్యనిర్వహణకైతేనేం...

 

తన ఇంటినీ, తన ప్రేమల పొదరింటినీ,

తన చిన్నతనాన్నీ , తన గతాన్నీ

తన గూటినీ, తన వారినీ ,

తన భూమినీ, తన నేల తల్లినీ ,

తన ధర్మాన్నీ , తన దేశాన్నీ ,

వదిలి వెళ్ళాల్సిందే కదా !!

 

 అలా ఇంటిని వదిలి వెళ్ళడమంటే..

 దాని భౌతిక కాయాన్ని వెదిలెళ్ళడం కాదు,

 నువ్వు జీవం పోసి ప్రేమతో పెంచుకున్న

 పంచుకున్న జ్ఞ్యప్తుల పంజరాన్ని వదిలెళ్ళడం,

 నువ్వక్కడ నేర్చుకున్న పాఠాలని,

 తీపీ చేదు అనుభవాలని, అనుభూతులని

  మూట కట్టుకొని పోవడం,

 నీ ఆత్మనీ, పంచుకున్న ఆత్మీయతనీ ,కలబోసి ,

  ఒక అమూల్యమైన జ్ఞ్యాపికగా మార్చి

  దాన్ని జాగ్రత్తగా సర్దుకొని

  ప్రేమతో చుట్టి , హృదయపేటికలో ప్యాక్ చేసి..

 నీ వెంటబెట్టుకొని వెళ్ళడం...

 

 ఆ తరువాత 

 ఎన్ని రెక్కలొచ్చినా , ఎంత ఎత్తుకి ఎదిగినా

 ఏ దేశమేగినా, ఎందుకాలిడినా,....

 దాన్ని భద్రంగా నీ మనసు పొరల్లో

 హృదయపు అంతరాంతరాల్లో , దాచుకోవడం..

 నీకు ఉనికినిచ్చిన

 నువ్వు ఉరుకునందుకోడానికి దన్నునిచ్చిన 

 నీ వేర్లనీ, నీ మూలాన్నీ, మర్చిపోకుండా ఉండడం !!

 మనిషిగా నిలిచి ఉండడం !!

                                    

 

కవితలు

తరాల చరితలో...

పల్లవి:-

తరాల చరితలు చూసిన గానీ జరగలేదు ఏ న్యాయం

ఆడ బతుకు అన్యాయం

యుగాలు ఎన్ని గడిచిన గాని వనితకు తీరని శోకం మగ గర్వాందులదాపాపం.

పురుషులు చేసిన పుణ్యమేమిటో

మహిళలు చేసిన పాపమేమిటో

ఇరువురి కలయిక కాల గర్భాన కానరాని ఆ మర్మమేమిటొ

                       "తరాల చరితలో"

 

1):-

విద్య వైద్య సాహిత్య సేవలలో వెల్లువల్లే వెలుగొందే స్త్రీలు

భార్యగా బాధ్యత వచ్చే నాటికి

ఇంటికెందుకో అంటిల్లాయేను....(2)కో

మగని మాటకే లోబడి ఆడది

బానిసగాయెను....(2)

కష్టాల కాలానికెదురుగ తాను బతుకు బండినే లాగుతున్నది          

                       "తరాల చరితలో"

2):-

పుట్టగానే చంపేసే తీరు

ఎదుగుతుంటే ఆ నిందలే వేరు

ఆదిపత్యుల చేతికి చిక్కగా

అతి వేదనతో అంగలార్చేను ...(2)కో

పతి మాత్రం పాపిష్టి వాడైన

దైవము కంటే మిన్ననుకున్న

భోగ దేహిగా చూస్త ఉన్నరు

చదువుల తల్లని కొలుస్తున్నరు

                       "తరాల చరితలో"

3):-                                                 

కన్యాశుల్కం రోజులేడా

వరకట్న సంప్రదాయమెవడు  తెచ్చెను

విధవ అయితే ఏ గౌరవమొందని

వింత ఆచారమెవడు పెట్టెను

అవని వదిలి ఆకాశ పయనాలు

చేసి ఘనతలే పొందిన

అన్నిట తానై ఉంటున్నా

అబలగ ఎందుకు మారిందో 

                       "తరాల చరితలో"

4):-                                   

గడియారంలో సెకను ముళ్లులా

అలసటెరుగక పనులు చేసిన

గంట కోసారి కదిలే ముళ్లుకు

ఆ గర్వ మెందుకు...

కన్న తండ్రి తన సొంత అన్నలే

కామంతో కాటేస్తే ....

ఉరి తీయని నిర్భయ చట్టాలెందుకు

మగ కామాంధులు మారనప్పుడు

                       "తరాల చరితలో"

కవితలు

పొయెట్రీ టైమ్ - 5

పిరదౌసి తన ఎద తీసి

షాయరీగా రాయగానే

పూలన్నీ పులకింతలే..

శిలలన్నీ చిగురింతలే..

********

రోజులు గడిచినా

బూజు పట్టని

నజ్రులిస్లాం నగుమా నజరానా

గాలి తరగల్లో తాజాతాజాగా..

********

జ్వాలలాగా రగిలి రగిలి

కవిత్వమై మండుతాను

*********

ఆమె కురుల సంకెళ్ళతో

గాలిని బంధించింది

అయినా

తన ప్రేమను శ్వాసగా

నాకు అందించింది.

********

లూయి ఆరగాన్ లాగా కాను నేను

నిర్భయంగా నా కవితను వినిపిస్తాను.

 

కవితలు

మనం ఎటు వైపు...?

అద్దాల మెడలు ఒక  వైపు..

ఆకలితో కూడుకున్న పిల్లల ఆర్తనాదాలు ఒక వైపు..

అందాల పోటీలు ఒక వైపు..

ఆకలి మంటలు ఒక వైపు...

ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకునే పెట్టుబడిదారులు ఒక వైపు...

పడుకోవడానికి 'అరుగు' కూడా లేని నిరుపేద జనం ఒక వైపు...

AC కార్లలో తిరిగే

బడా బాబులు ఒక వైపు..

చేతి నిండా పని లేని

'నిరుద్యోగం' ఒక వైపు...

మతత్వం ఒక వైపు...

మానవత్వం ఒక వైపు...

మట్టి మనుషులపై

దాడులు ఒక వైపు...

దాచేస్తే దాగని నిజాలు ఒక వైపు...

ధనం ఒక వైపు..దారిద్ర్యం ఒక వైపు...

ప్రశ్నించే ప్రజలు ఒక వైపు..

ప్రశ్నను సహించలేని పాలకులు ఒక వైపు..

ఇప్పుడు సమాజాన్ని చదువుతున్న విద్యార్థులు గా మనం ఎటు వైపు...?

ప్రపంచం అంత దోపిడీతో కూడుకున్న సమయంలో మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న...

కవితలు

మా ఊరి చెరువు!?

మా ఊరు మధ్యలో

స్వేచ్చంగా స్పటికంలా

చెరువు ఒకటి

అందర్రికి ప్రాణంలా ఉండేది!

చుట్టూ ప్రక్కల గ్రామాలకు

'హోస్ట్లా ఉండేది.

చెరువు గట్టున

తాత ముత్తాతల నాటి

వేప చెట్టొకటి ఒక మూలాన

మరో మూలాన మర్రి చెట్టు ఒకటుండేది

నేలను ముద్దెట్టుకునే ఊడలతో!

చిన్న పిల్లలే కాదు

పెద్దమ్మాయిలు కూడా

రెండు జడలతో  రెండు చేతుల్లో

మర్రి ఊడలను పట్టుకొని

లంగా లెగురేసుకుంటూ గాలిలో

ఒయ్యారాలు పోతూ ఊగుతూంటే

తెలిసి తెలియని మా వయస్సే అయినా ...

వేప చెట్టెక్కి గుబురు మండల

 కొమ్మల మధ్యకండ్లప్పగించి

 ఈలలు కొడుతూంటే

అమ్మాయిల కండ్ల  బెదురు

మాలో ఓ విధమైన ఆనందం!

అదో పసందైన సంగీతం మాకు!

ఓ వైపు గట్టు మీద

బొంగరాలు ఆడుతూ మేము

మరో వైపు చెమ్మ చెక్కలు

తొక్కుడు బిళ్లలాడుతూ

అమ్మాయిలు మరో వైపు

వారి జడలు గాలిలో

నృత్యం చేస్తూంటే  నాగు పాములా

చూడా ముచ్చటగా ఉండేది!

కాలం గడుస్తూండేది

ఏలాంటి జంకు గొంకు లేకుండా!

ఉన్నట్టుండి పెనుభూతంలా...!?

మా చెరువు గట్టుకే ఆనుకొని

ఫ్యాక్టరీ ఒకటి వెలిసింది

విష వాయువులు

విష పదార్ధాలు

మేము ప్రేమించే చెరువులో

మైల చేయ సాగాయి

సంజీవనిగా ఉన్నమా చెరువు

తన స్వచ్చమైన నీళ్లు

మాకు  తాగనీయకుండా 

తన కడుపులో పెరుగుతూన్న 

విషం పుండు

నలు మూలలా వ్యాపిస్తూండగా...

ఎన్నో ఆర్జీలు గొడవలు

నినదాలు మేము చేసిన

పట్టించుకునే నాధుడు 

కరువైపోయాడు!?  

మా కనుల ముందే

మా అమ్మ-నాన్నలు

ప్రాణాలు వీడుస్తున్నట్లు

మా చెరువు కనుమరుగైంది!?

             ***

కవితలు

ప్రజా గుండె గొంతుకలు

ఏ మనిషికైనా గుండె ఉంటే సరిపోతుందా !

ఆ గుండె నిండా ధైర్యముండాలి.

ధైర్యముంటే సరిపోతుందా !

దానికి కాస్తా దాతృత్వం ఉండాలి.

అది దాహమన్నోడికి దప్పిక తీర్చాలి,

ఆపదలున్నోడికి హస్తమందించాలి.

ఈ దేశానికి

అలాంటి గుండె ఉన్న మనుషులు కావాలి.

అదిగో...

భూమి కోసం, భుక్తి కోసం

ఈ నేలతల్లి విముక్తి కోసం

వాళ్ళు భూమిపుత్రులతో కలిసి పోరాడుతున్నారు.

అడవితల్లి గుండెల్లో గూడు

కట్టుకున్న మనుషుల మధ్య

రేయింబవళ్లు శ్రామిస్తూ

వాగులు,వంకలు,సెలయేర్లు దాటి,

రేపటి సూర్యోదయం కోసం

నేడు పోరాడుతూ హస్తమిస్తున్నారు.

 

ఆలాంటి మనుషుల కోసం

రాజ్యం ఇనుపబూట్లతో

ఆకు ఆకునూ గాలిస్తుంది,

మర తుపాకులతో మానవ

మృగమై వేటాడుతొంది.

 

వేటకుక్కల అరుపులకు,

తోడేళ్ళ బెదిరింపులకు

జడుసుకునే గుండెలా అవి,

మృత్యువును సైతం గేలిచేస్తూ

సమసమాజ స్తాపనకోసం

విప్లవ గీతం ఆలపించే

ప్రజా గుండె గొంతుకలు.

 

 

 

కవితలు

కనుక్కోండి....

ఆకలైతే కాదు

నన్ను చంపింది

పస్తులుoడి ఆకలితో

అలమటించిన

దినములెన్నో...

 

పేదరికం కాదు

నన్ను వల్లకాటికి చేర్చింది

అయితే..

ఇన్నేళ్ల నుండి దానితోనే కదా

సావాసం చేస్తున్నది

 

కరోనాకా

నేను బలిఅయినది?

కాదు కాదు... అసలే కాదు

దేనికి నేను బలి అయిందో

 తెలియదా మీకు?

 

ఇంటికి చేరుతానని

ఇంటికి దీపమైతానని

నన్ను నడిపించిన ఆశ

విగతజీవిగా మారి

కన్నవారికి మిగిల్చిన నిరాశ

 

కారకులెవరో కనుక్కోండని

ప్రశ్నగా మారి వెళుతున్న...

 

 

 

కవితలు

చిన్ని కవితలు  ఐదు

1

మందలో మంద

మందలో మంద

అందులో నేనొక్కడినీ నా బొంద

ఏదో బతికేస్తున్నాను మీ ముందర

ఏదేమైనా అన్యాయంపై గొంతు పెగలదు నా బొంద

నాకు కావాల్సింది బడా బాబుల అండ

రోజు మూడు పూటలా అన్నం కుండ

మందలో మంద

బురద రాజకీయాలే నా మొహం నిండా

అయినా కడిగేసుకుంటాను సిగ్గు లేకుండా

మందలో మంద

ఎవడు ఎటుపోతే ఏంటి నా బొంద

నా ఏడ్పు నేను ఏడుస్తా ముండ

మందలో మంద

పెంట కుప్పపైన నా కొంప

అయినా సరే కొడతాను అత్తరు నా దేహం నిండా

గుంజకు ఏలాడేదే నా స్వాభిమానం అంట

ఛీ సిగ్గులేకుండా

మంద వెనుక తిరగేస్తాను ఊరినిండా

మందలో మంద నా బొంద

నేను చచ్చాక పాతేస్తారు పెద్ద బండ

దానిపైన మెరిసిపోతుంది పూల దండ !

2

ఎన్నాళ్ళు

 

ఎన్నాళ్ళు ఏడుద్దాం ?

ఎన్నాళ్ళు బరిద్దాం ?

ఎన్నాళ్ళు సహిద్దాం ?

అలవాటై పోయింది

కన్నీళ్ళను దాచిపెట్టు

మరో మగువకోసం

మన ఆవేశాలు కోపాలు

ఫేసబుక్ పోస్ట్లకి వాట్సప్ స్టేటస్లకే పరిమితం

ఏం చేస్తాం ? ఏం చేయగలం ?

ఇంకెన్నాళ్లకు కలుగుతుందో

మానవ మృగాలకు విచక్షణం

ఇంకెన్నేళ్లకు కళ్ళు తెరుస్తుందో ప్రభుత్వం

3

పరదా లేని బ్రతుకులు

 

పరదా లేని బ్రతుకులు

గంజి కూడు మెతుకులు

ఎండి పోయిన గొంతులు

పాపం వరుణ దేవుడు కరుణించాడు

కష్టజీవి కుటీరాన్న వడగళ్ల వాన కురిసింది

పై కప్పు రంధ్రం కులాయిగా మారే

నీరంతా సంద్రంగా చేరే

వరద అనే బురదలో ఇళ్లనే గొడుగు కొట్టుపోయే !

4

మీనింగ్ లెస్ !

పేదోడి ఆత్మహత్య

పేపర్ వాడికి యూజ్ లెస్

గొప్పోడి ఆత్మహత్య

ప్రభుత్వానికి ప్రైజ్ లెస్

నిరుద్యోగం నిటారుగా

ఆకాశానికి నిచ్చెన వేసింది

కదిలే కాళ్ళను చచ్చుబడేలా చేసింది

కరోనా మై హూ నా అంటూ అందరిని కౌగలించింది

రూపాయి రూపాన్ని కాల్చింది

రేపటి ప్రగతిని పీల్చింది

బ్రతికే తీరుని మార్చింది

బ్రతుకులను రోడ్డుకు ఈడ్చింది

ఇలాంటివి మీడియాకి

అటెన్షన్ లెస్

అలాంటి మీడియా నా దృష్టిలో మీనింగ్ లెస్ !

5

ఆడపిల్ల

తనో ఆడపిల్ల

వీధుల్లో అంగడిబొమ్మ

తన గుండె గుప్పిట్లో

తన ఒళ్ళు వెయ్యి కళ్ళల్లో

తను నడిచే దారి ఈలలతో

తనపై చేసే దాడి మాటలతో చేతులతో కత్తులతో

నిత్యం రోజు చస్తూ బ్రతికే తాను

ఒకరికి అమ్మ

ఒకరికి భార్య

ఒకరికి అక్క

ఒకరికి చెల్లి

ఒకరికి స్నేహితురాలు

మనలాగే తనో సాటి మనిషి

 

 

కవితలు

ఏమని తెలుపను...!!

నడిరాతిరి నిశీధిలో

తట్టి లేపి కలవరపరిచే

కవిత్వమా...ఆగని పోరాటమై

అక్షరాలు సంధించి ఏం శోధించి

సాధించ ఆవహించావు

 

జ్ఞానాన్ని అమ్మే

ఈ అజ్ఞాన లోకంలో

విజ్ఞానాన్ని పంచ మంటావా

పైసల కోసం దిగజారిన

విద్యావ్యవస్థల

తీరు వల్ల

ప్రజలు పడుతున్న

అవస్థలు

చూడ తలచితివా

ముక్కుపచ్చలారని

పసి మనసుల

స్వేచ్ఛను నాలుగు

గోడల మధ్య

పాతరేసే

ఈ విద్యా విధానాన్ని

తిలకింప తలిచావా

జ్ఞానాన్ని కొంటున్న

దౌర్భాగ్య దృశ్యాన్ని

దర్శింప చేయమంటావా

విద్య నేర్వని వాడు వింత పశువైతే

విద్య నమ్మేవాడు ఏమవుతడో

ఏ అక్షరాల కలబోతతో

ఈ వలపోత వినిపించ మంటావు

 

పండించే రైతుకే

కూడులేని

ఆ ఆకలికేకలు

వినగలుగుతావా

తరతరాల పంటలు

తీర్చలేని కష్టాలు

ఆత్మహత్యలకు

దారి తీస్తే

ఆ దృశ్యాలు చూడగలుగుతావా

వరదల్లో

నారు పొలం

నీటమునిగితె

రైతన్న గుండె

పగిలిన

ఆ బాధ భరించగలుగుతావా

పంట పోయి

మొడైనా

ఆ జీవితాల

ముందు నన్ను

ఎట్ల మోకరిల్ల మంటావు

అనావృష్టికి

ఎండిన బతుకులు

అతివృష్టి

ముంచిన బతుకులు

ఏ పదాల అల్లికతో

ఈ పసిడి రైతుల గోడు వినిపించమంటావు

 

 

కవితలు

గజల్.. 

జల్లులుగా ప్రేమపూలు..వర్షిస్తేనే కవిత్వం..! 

మరణానికి శాశనమే..లిఖిస్తేనే కవిత్వం..! 

 

మార్పునుకోరే వారే..కవులే సరెలే నిజమే.. 

సత్యం తెలుసుకునిత్యం..రమిస్తేనే కవిత్వం..! 

 

అక్షరాల జలపాతం..పుట్టిల్లే మౌనము కద.. 

అంతరంగ వాహిని నిను..వరిస్తేనే కవిత్వం..! 

 

బాధలుతీర్చే ముచ్చట..అనుభవాన అందేనా.. 

పరావైఖరీ సంగతి..ధ్వనిస్తేనే కవిత్వం..! 

 

విప్లవశంఖం హృదయం..కావాలోయ్ ప్రియనేస్తం..

విశ్వకల్యాణ ఖడ్గం..ధరిస్తేనే కవిత్వం..! 

 

త్యాగధనులు ఎవరోయీ..కవులుగాక మాధవుడా.. 

అమాయికతకు అద్దంలా..నిలిస్తేనే కవిత్వం..!

 

కవితలు

ఓ  అవ్వ  బాపు 

చందమామ వెలుగులో మా అవ్వ నవ్వులు

మెడలో నల్లపూసల దండ  నెర్రలు వాసిన పాదాలు

 అయినా చేరుగని  చిరునవ్వు

నేనెప్పుడు  రాయాలనుకునే  అక్షరాలు ఇవి

 

ఇకపై రాస్తా ఈ అక్షరాలను  మా అవ్వ కన్నీటి నవ్వుల్లో నుంచి రాస్తా

 

అది మూడు సెంట్ల జాగా కాదు అక్షరాల మూడెకరాల భూమి

  సాగుచేసి  నన్ను   చదివిస్తున్న

అవ్వ  బాపు  మీ కష్టం  నేను రాసే ఈ 

 అక్షరం

నాకు నచ్చిన నాలుగు బట్టల జతలు

జబ్బల కు నచ్చిన  బడి సంచి

కాసుల వేట లో   మీరు

ర్యాంకుల  వేట లో నేను

అయినా చేరుగని  చిరునవ్వు

మీరు ఇచ్చిన గుర్తులు ఎన్నడు మర్చిపోను  ఓ  అవ్వ  బాపు

కవితలు

భగత్ సింగ్

భగత్ సింగ్ భయానికి భగ్గుమన్న బ్రిటిష్ సామ్రాజ్యం

తెల్ల దొరల ను గడ గడ వణికించిన పంజాబ్ సింహం

కవితలు

కొత్తగా..

గెలుపు వెంటాడుతునే ఉంది

నేను ఓటమి అంచుల చెంత నిలిచిన ప్రతిసారి 

తనను గెలవగల శక్తిని సమీకరించు కోమంటూ ..

 

సహాయం పరిహశిస్తుంది 

నిస్సహాయంగా నలుగురి వైపు 

నే చూసిన ప్రతిసారీ 

సహాయం చేయగల వయసులో 

సహాయం కోసం యాచిస్తుంటే..,

 

వెలుగు వెక్కిరిస్తుంది 

చీకట్లో మగ్గిపోతూ జీవితంలో వెలుగులు 

నిండేది ఎప్పుడో..

అనే ఆశావాదంతో ఎదురు చూస్తుంటే

కర్తవ్య ముకుడనై ముందుకు సాగలేని 

నన్ను చూసి..

చీకటిని జయించి విజయం చేపట్టమంటూ .

 

అంతరాత్మ తట్టి వెళుతుంది

నాతోడు ఎవ్వరు లేరు అనే ఆలోచనల 

భావాల నుండి.

నీకు నీవే ప్రేరణ కావలంటూ..

నాలోని ఆవేశాన్ని ఆలోచనలు గా మలచుకోమంటూ..

 

దూరంగా ధన దాహానికి కుల వివక్షకు

అన్నెం పున్నెం ఎరుగని ఓ అబల బలవుతుంది

చూస్తున్న నా చూపుల్లో చిన్న మార్చు..

యాచించే చేతి పిండికిలి బిగుసుకుంది..

నిస్సహాయంగా చూసే చూపులు లేవు ఇప్పుడు 

చైతన్య బావుటా అందుకుని ముందుకు సాగే 

తెగువ ధైర్యం తప్ప..

 

కొత్త ప్రపంచం స్వాగతిస్తుంది..

నాలోని మార్పును చూస్తూ..విజయం నీదేనంటూ

 

 

కవితలు

బతుకుపయనం

పుట్టినూరిడిచి పొట్టచేతవట్టుకొని

పాతగుడ్డల ముల్లె పైలంగనెత్తినెత్తుకొని

ఖాళీచేతుల బుగులుబాప

చేయిసంచి తలిగేసుకొని

కనిపించిన దారివెంట

కనిపించని తీరాలకు సాగే

గమ్యమెరుగని బాటసారులు వలసజీవులు!

 

అంతస్తులెరుగక నకనకలాడే ఆకలికి

కడుపులో పేగులు

ఎడతెరిపిలేకుండా

చేస్తున్న సంగీతవిభావరి నాప

పిడికెడు మెతుకులకు

వెతుకులాడే ఊరపిచుక బతుకులు

బతుకుబాటలొ దాకిన దెబ్బలకు

నొక్కులువోయిన గంజులు

కాకిబలగపు ఆకలిదీర్చలేని

అడుగంటిన గంజినీళ్లు

అలిసినతనువు నడుమాల్సుకుంటే

కునుకురాని కుక్కిమంచం

అయినా రాత్రంతా దోమలతో

మూసినకనులతో ముష్టియుద్ధంజేసి

కొనఊపిరితో సత్తువంత కూడగట్టుకొని

ఉదయాన్నే కైకిలి వెదుకుతు

చౌరస్తాల్ల ఎదురుచూస్తూ ఎండుచాపలయ్యే కూలీలు!

 

ఆకలిదీర్చే దారిలేక

చేద్దామంటే పనుల్లేక

రోడ్లపక్క తలదాచుకోలేక

పసికందుల వసివాడ్చలేక

సంపాదించిందేమిలేక

బాధ్యతల బరువులు మోస్తూ

కష్టాలవడగండ్లకు నెత్తిబొప్పిగట్టినా

గమ్యంజేర్చే దారిగానరాకున్నా

ఉన్నఊరుజేర పయనం సాగించే పాదచారులు!

 

మొలిచినరెక్కలతో దిక్కులకెగిరిపోయినా

రెక్కలుడిగి వెనుదిరిగినా

అందరినీ ఆదరించే పెద్దదిక్కు పల్లెటూరు

సంపదలు పట్నపుదారులు జూపుతే

సంబంధాలు పల్లెదారులు తెరిచి

అలసిన దేహాల బడలికబాపే

మలయమారుత వీవెనవుతుంది!

మానవత మంగళారతులు పడుతుంది!

 

 

కవితలు

నీరాజనం!

పీడిత తాడిత ప్రజానీకానికి

ప్రాతినిధ్యం

పాలకుల నిరంకుశత్వాన్ని

ప్రశ్నించిన ధిక్కారస్వరం

ఆర్తులు దీనులు  దరిద్రనారాయణులు

బాధాసర్పదష్టుల గాధల

గొడవే తన గొడవగా చెప్పుకున్న

సామాజిక సంఘర్షణాత్మక భావ విప్లవకారుడు

తెలంగాణా నిగళాలు తెగద్రొక్క

అక్షరాస్త్రాలను కురిపిస్తూ

కవితలల్లిన కమనీయ కవిశిఖామణి

మనిషిని మనిషి మన్నించుకోలేనంత పతనమైనజాతికి

మనిషితనాన్ని ప్రబోధింప చూసిన మనీషి

కలాన్ని తన బలంగా

గళాన్ని ఆయుధంగా చేసుకున్న

మహోద్యమకారుడు

నిరాడంబరంగా జీవిస్తూ

నిబద్ధతతో ప్రజాసంక్షేమానికై

పరితపించిన సాహితీకారుడు

పుట్టుక చావు తప్పితే

మిగిలిన బ్రతుకునంతా

తెలంగాణా ప్రజా సమస్యల

పోరాటానికే అర్పించిన సమరయోధుడు

త్యాగశీలతే ప్రతిరూపమైన

అరుదైన వ్యక్తిత్వ ప్రకాశకుడు

జీవనగీతను అందించి

తుది విజయం మనదిగా

నినదించిన నికార్సయిన ప్రజాకవి కాళోజీ!

నీకిదే మా నీరాజనం!

 

కవితలు

చెలియా...!

లలిత రాగమున అరుదెంచి లాలించావు

వసంత కాలములా ఏతెంచి బంధించావు

హిందోళమున ఆందోళనలను పోషించావు

శిశిరములా జీవన గమనాన్ని శాసించావు!

 

నడకకు నర్తించెనే పురివిప్పి ఒళ్ళు నెమలి

నడవడిక శోధించెనే ఆ వందల కళ్ళు వొదిలి

అతిశయాన నిర్ఘాంతపోయానే నీళ్లు నమిలి

బిగుసుకునిపోయి రానన్నవి కాళ్ళు కదిలి!

 

వడివడిగా వాడితివి వడిసెలతో కొడితివి

ఎదసడినే మార్చితివి తపనలనే రేపితివి

పెళపెళమనే ఉరుములని ఉరిగా విసిరితివి

తళతళమనే మెరుపులని దూరం చేసితివి!

 

అంగరాజునంతమొందించె అంజలికాస్త్రము

అంగాంగముల అంతు చూసె అబలాస్త్రము!

నువు తోడుండ కదిలె జగన్నాథ రథచక్రాలు

నను ఒంటరి చేయ ఆగుతున్న కాలచక్రాలు!

 

మధురమైన భావనలు నాలో నింపుకున్నా

మధుమేహము బహుమతిగా తెచ్చుకున్నా

కూటి ముందు సూది మందు కుచ్చుతున్నా

పూట పూట నీ జ్ఞాపకాలనే నే భుజిస్తున్నా!

 

మరలిరావనే సత్యముతో వేసావు శిక్షలు

తిరిగొస్తావనే స్వప్నాన్ని కంటున్న అక్షువులు

సత్యాలు స్వప్నాలు కావాలనే నా ఆకాంక్షలు

స్వప్నాలు సత్యాలు కావని చూపె నీ ఆంక్షలు

 

కన్నీళ్ళతో చెప్పనా వేరే కళ్లు చూసుకోమని

నా కలలను వేరే కనుపాపలని కనమని

నా బరువులు మరో భుజాలని మోయమని

నా బాధలు నా బదులుగా భరించమని!

 

కనులు మూసిన కలలొస్తాయని

నీ తలపులు కలవరిస్తాయని

కంటి సుడులు నిను ముంచేస్తాయని

కలల అలలు నిను మింగేస్తాయని!

 

కిటకిట తలుపులు మూసేస్తున్నా

తడిబారిన ఎద మోసేస్తున్నా

కనుపాపలకిక సెలవిస్తున్నా

చెలియ చెలిమికై విలపిస్తున్నా!

 

కవితలు

గొడ్రాలైంది....

నీవు
గుర్తొచ్చిన నిశిరాత్రి
తోపులాట..
తొక్కిసలాట
చీకటి తోడుకోక....
నిద్ర తోడు రాక.....
పూత వేయని కలతో
గొడ్రాలైంది రాత్రి.
ఉదయానే కన్నీటిబొట్లను
ఒడిసిపట్టిన కాగితం
కవితను ప్రసవించి
నీకే
బహుమతి చేసింది.


 

కవితలు

వాన చినుకులు   

స్వాగతాంజలి

మేఘమావరించెను

ఆర్ధ్రతా స్పర్శ

 

గొడుగు మీద

వర్షపు చినుకులు

దరువులెన్నో

 

టపటపలు

చినుకుల నర్తనం

సూరుసుక్కలు

 

వాన జల్లులు

తుంపర తుంపరగా

అల్లరి చేష్ట

 

చెట్టూ పుట్టతో

వర్షం మాట్లాడుతోంది

విను మౌనంగా

 

నీటి కుండలు

అలుగెళ్ళి పోయాయి

జలధరించి

 

మంచీ మర్యాద

వరుణ దేవోభవ

వన సమూహం

 

కవితలు

ప్రేమతరంగం

ఏ గాలి మోసుకొచ్చిన గానానివో

నీవు..నన్నిలా చేరావు....

ఏ పూల తోటలోని పరిమళానివో మరి....

వర్ణించనలవి కాని అనుభూతినందించావు....

ఏ కొమ్మ మీది కోయిలవో మరి నీవు

నా పెరటిలోన  కమ్మగా కూశావు ....

నా మానసమందేదో మౌన వీణను మీటి

అనురాగ రాగాలు పలికించావు....

వెన్నెల బొమ్మవో....

వన్నెల కొమ్మవో....

కన్నుల చెమ్మవో....

మరి...ఎవరివో..నీవెవరివో....

 

కవితలు

పద్యసుధా మంజరి

సీ. ఈశ్వరుడే సెలవిచ్చెను ఏనాడొ

     నరులు సర్వము సమమని నీతి

 ఐననూ నీచమమైన వర్ణపరపు

     కలహములెందుకు మనల మనకు

  సూతులుయను నెపమును మోపి జనులందు

     చెడుగ వివక్షతను చూపుటేల

  గ్రామమునడుగుబెట్టర్హులు గాదంటు

     ఎల్లకవతలకు ఏల నరుల

ఆ. కాలవలెను యీ సకల కులాచారముల్

    యన్ని అగ్నిలోన సమిధ రీతి

    ఆ తరుణమునే నిజప్రగతి కలుగున్

    యీ జగత్తుకు ఘన కీర్తి తోడ !!

 

తే. సాటివారిలోన మనము గాంచవలసి

    నది సుగుణములే గాని వర్ణాన్ని కాదు

    తనువు సితముగుండుట గాదు అందమంటె

    మనసు యుండవలెను సితవన్నెలోన !!

 

తే.  తనువుకక్కర్లేదే పరిమళము గూడ

     కాని మనసుకుండవలెను మంచితనము

     మరియు మానవత్వము యను పరిమళాలు

     హృదయ సంస్కారమె నిజమకుటము మనకు

 

తే. గేళి చేయుట సరిగాదు ఎదుటివారి

    మేనినందునేదో లోపమున్న కార

    ణముగ యెవరి తనువు గూడ వారి స్వంత

    నిర్ణయము కాదుగా అది ఈశ్వరేచ్ఛ ..!!

 

 

 

కవితలు

ఎందుకిలా

చల్లని కుటుంబం మాది

అల్లారు ముద్దుగా తిరుగాడే కన్నబిడ్డలు

ఆప్యాయంగా చూచుకొనే అత్తమామలు

మంచి భర్త, మంచి వుద్యోగం, మంచి సంపాదన

సవ్యంగా సాగుతోంది సంసారం

చల్లగా సాగే సెలయేరులో కల కలం

వ్యసనాలకు బానిసయ్యారు వారు

ప్రశాంతత కరువైంది

వయసుడిగిన అత్తమామల కొరకు

పసి పిల్లల కొరకు

ఉన్న వుద్యోగం వద్దనుకున్నాను

ఇపుడు నా రాబడి పోయింది

వారి రాబడీ తగ్గింది

ఆర్ధికంగానూ కష్టాలు మొదలయ్యాయి

వినడం లేదు తల్లిదండ్రులు చెప్పినా

మారడం లేదు బిడ్డల కొరకైనా

తన ఎదుటే అత్త మామలు

కన్న బిడ్డలు కష్టపడుతుంటే

చలనం లేని బొమ్మలా ఎలా చూస్తుండగలను

చక్కటి సంసారాన్ని నాశనం చేస్తున్న వారికి

ఇంకెవరు చెప్పాలి, ఎలా చెప్పాలి

మా కష్టాలకు అంతం లేదా

వారు మారేందుకు మార్గమే లేదా.

         ****

ఈ సంచికలో...                     

OCT 2020

ఇతర పత్రికలు