ఈ దేశానికి
నీవెప్పుడు పరాయివే..
నీ చెమట చుక్కలతో
ఈ నేలను సస్య శ్యామలం చేసిన
నీ రెక్కల కష్టంతో
ఈ నేలను సుందరభరితంగా మలచిన
ఈ దేశానికి
నీవెప్పుడు పరాయివె
బతుకుదెరుకై వలసబోయి
అగ్ర రాజ్యపు అధికారంలో భాగమైన కమల
ఈ దేశపు కమలానికి తోటి మొగ్గే
అదే పొట్టకూటి కోసం
ఈ దేశానికి ఎవడైనా వస్తే దురాక్రమణదారుడు
ఇస్లాం ని ఆచరించే అరబ్బు రాజులు
ఈ కమలానికి మిత్ర పుష్పాలే
అదే ఈ గడ్డపై పుట్టిపెరిగి
ఇస్లాం ని ఆచరించే ప్రతి ముస్లిం
ఈ కమలానికి శత్రువే
నీవు ముస్లిం వా
అయితే శత్రువువే
నీవు దళితుడవా
అయితే పరాయివే..
ఈ దేశానికి
నీవెప్పుడూ పరాయివే..
కూర్చుని తింటూ కాలం గడిపితె సాధన ఏమిటి ఇంక
ఎన్నో విధాల చదువులు చదివీ లాభమదేమిటి ఇంక
రాక్షస మూకలు కత్తుల మొనలో రాజ్యం నడిపిరి ఇచట
ప్రాణం పోసిన వీరుల చావుకు అర్ధమదేమిటి ఇంక
ధనమే పాముగ మెదడునుచుట్టీ ఆడిస్తోందీ లోకం
ధర్నాలంటూ జెండాపట్టీ చేసేదేమిటి ఇంక
చిన్నాపెద్దా మత్తుకు తెలియవు ఆడబొమ్మైనా చాలు
విలువల వలువలు ఒలిచేస్తుంటే చెప్పేదేమిటి ఇంక
ఆర్ధిక ప్రగతికి మందుషాపులే మూలంఅంటూ అరచి
మద్యపానమే హానికరమని బోధనలేమిటి ఇంక
అన్యాయాలకు దారులు ఎక్కువ లోకం పోకడ ఉదయ
కళ్ళుమూసుకుని కాలంగడపక మార్గమదేమిటి ఇంక
చీకటే భయపడే
చిమ్మచీకటిలో
గాలికి ఊపిరాడని
శూన్యంలో
వేసవిని తలపించే
వేడిలో
వ్యాధిగ్రస్తమైన అవయవాల
అవస్థతో
అండాసెల్ లో
ఆమరణ దీక్షలో
ప్రో.సాయిబాబా
ప్రశ్నిస్తున్నాడు
విపత్కాలంలో
నిర్మానుష్యంలో
చదువుకొను వార్త
పత్రికడిగితే నేరమా...?
కుటుంబీకులకు మిత్రులకి
రాసిన ఉత్తరాలపై నిషేధమా...?
కనీస వైద్యం అందించరా...?
న్యాయవాదుల కలిపించరా...?
నన్ను జీవచ్చవంగా మార్చి
చిత్రవధ చేస్తున్నారు
ఇదేనా జైళ్ల సంస్కరణా...?
చెప్పు రాజ్యమా
చెప్పు సమాధానమని
ప్రశ్నిస్తున్నాడు
మిత్రులారా...మీకు తెలుసు
తనకు సానుభూతి
అస్సలు నచ్చదు
సంఘీభావంగా
నిలబడమంటున్నాడు
న్యాయమే
నినదించమంటున్నాడు
రాజ్యహింస లేని
సమాజం కోసం
ఉద్యమించమంటున్నాడు
రండి...మిత్రులారా
20.10.2020
( ప్రో.సాయిబాబా రేపు చెయబోతున్న ఆమరణ దీక్షకు సంఘీభావంగా...)
తెలంగాణ జాగల ఆంద్రోళ్ళ పెత్తనం ఎన్నాళ్ళంటూ,
నీళ్లు, నిధులు, నియామకాలు
మా భూములు మాకంటూ,
మా ఉద్యోగాలు మాకంటూ
గొంతెత్తి నినదించినోల్లం
పాణాలకు తెగించి రైలు పట్టాల మీద పన్నోల్లం
ఉడుకుడుకు పాణాలు వోతున్న జై తెలంగాణ అన్నోల్లం.
తెలంగాణ అచ్చేదాక తెగించి కొట్లాడినోల్లం
గోతికాడి నక్కలాగ నక్కి నక్కి దాగినోడు
ఒక్క రోజు దీక్ష చేసి నిమ్మరసం తాగినోడు
విద్యార్థుల ఉద్యమం ముందు
బొక్క బోర్లావడ్డోడు
పీకల్దాక తాగినంక
పిచ్చి పిచ్చి వాగెటోడు
ఫామ్ హౌజ్ ల పన్నడంటే
పగలు రాత్రి తెలువనోడు.
తెలంగాణ యాసతోటి,తెలంగాణ భాషతోటి
అందరికీ ఉచిత విద్యంటూ
దళితుడు ముఖ్యమంత్రి అంటూ
ఇంటికో ఉద్యోగమంటూ
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళంటూ
మోసపూరిత వాగ్దానాలతో
పిట్టల దొర వేశాలతో అధికారంలోకి వచ్చినోడు.
అధికారం నెత్తికెక్కీ ఆరేళ్లు గడిచిపోయే
సోర సోర పోరగాళ్ళు
ఉద్యోగాలిమ్మంటే
పోలీసుల ఉసిగొలిపి
పొట్టు పొట్టు గొట్టిచ్చినోడు
నిరుద్యోగ భృతి అడుగుతే
పని జేసుక బతుకాలంటూ
ఉపాధి సూపియ్ దొర అంటే..
ఉన్న ఉద్యోగాలూ పీకేసినోడు.
అల్లుడత్తే ఏడ పండాలంటూ
డబుల్ బెడ్రూమ్ ఇల్లంటూ
ఉన్నగుడిసే పీకేసినోడు
ఉచిత విద్య అనుకుంటనే
ఉన్న బళ్ళు మూసేసి
బడికిపోయే పోరాగాండ్లకు
బర్లనిస్తా కాయుండ్రని
జీయరుసామి నోట్లెనోరు
బెట్టినోడు.
బడులు మూసి బార్లుదేరిసి
పనిచేసే సత్తువున్న యువతను
మద్యానికి బానిసల జేసి
యేజ్ బారు అయ్యేదాకా
ఉద్యోగాలియ్యకుంటా..
ఆత్మహత్యల పాల్జేస్తివి...
నీ కుటిల నీతి తెలువనోళ్ళు
మళ్లీ నీకు ఓట్లు గుద్ది
గద్దెమీద ఎక్కిస్తే...
మా గోసి గుడ్డ గుంజుకొని
పెనం నుంచి పొయ్యిల నూకి
గాయిదోళ్ల బతుకులకు
గిదే బంగారు తెలంగానంటివి.
యెనుకటి మీ తాతల
రోజులు కావుకొడుక
మీ తలపొగరు దిగేదాకా
దొరతనం కూలేదాకా...
బహుజనులం ఒక్కటయ్యి
బరిగీసి నిలవడుతాం...
నిలవడుతాం,కలబడుతాం
కలేవడుతాం,ఎగవడుతాం
నీ దొరగడీల పెత్తనాన్ని
కూకటేల్లతో పెకిలిస్తం.
జీవ పరిణామ క్రమంలో
అసంపూర్ణంగా
ఉదయించినవాడు
చక్రాల కుర్చీతో
శూన్యన్ని శాషిస్తూన్నాడు
తన మెదడెమి
మిసైల్ కాదు
అణుబాంబు
అంతకంటే కాదు
అయినా
ఎందుకంత భయమో
సూర్యుడు తాకని
'అండ'శయంలో
బంధించారు
మంచు కొండలలో
మనిషి
గడ్డకడుతున్నట్టుగా
క్రమక్రమంగా
కృషించుకపోతున్న
మెదడు పొరలలో
నిక్షిప్తమైన
దృఢసంకల్పం
అతనిది
తన తనువును
తాను కదలించని వాడు
ఆమరణ దీక్షకు
పూనుకున్నాడు
స్వేచ్ఛ గళమై
స్వేచ్ఛ కళమై
వీల్ చైర్ నుండే
విముక్తి పాఠం
నేర్పిస్తున్నాడు
(జైల్లో జి. యన్. సాయిబాబా ఆమరణ దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంలో)
ఈ కళలు చిగురిస్తూ చిగురిస్తూ
కన్న కనులు కనుమరుగవచ్చు
ఈ శ్వాసల సరిగమలు సాగి సాగి
శాశ్వతంగా సమాధి కావచ్చు
ఈ ఆశల హరివిల్లు విరిసి విరిసి
వీగి విరిగిపోవచ్చు
ఈ స్వచ్ఛ స్వేచ్చా అడుగుల గమనం
కదిలి కదిలి కాలంలో శున్యమవచ్చు
ఈ ప్రాణం చలించి జ్వలించి
కాటిలో కాలిపోవచ్చు
డియర్ కామ్రెడ్
నా రేపటి ఆకాంక్ష నీవే
నా రేపటి రూపం నీవే
నా రేపటి పోరాటం నీవే
నా రేపటి స్వేచ్ఛా నీవే
నీ ప్రేమకై
నువు పంచే ప్రేమకై
నీను నా చీకటి ప్రేమలు
ఎదురుచూస్తు ఎదని మలుస్తూ
చూస్తుంటాం కామ్రేడ్
ఎదురు చూస్తుంట్టాం
నిర్భయారణ్య రోదనలో
మరో దిశా నిర్దేశంబిది
తరతరాల దొంతరాలలో
సాగిన కాలమంతా సాగుతున్నదంతా
అబల అలసత్వం నిత్య సత్యం
సబల బలసత్వం ఓ అసత్య వ్రతం
కోమలి జవసత్వం నలిగిన సూక్ష్మమంతా
'నీకు కూతురు పుట్టిందనే' వగచిన స్తోత్రం
చేతి సంచిలో
పసికందును తోసి
ఊరి పొలిమేర దాటించి
కంపచెట్లలో 'ఆడ' ఉనికిని పార వేసిన
కఠిన హృదయాలెన్నో ?
సాక లేననె సాకుతో
పురిటి బిడ్డను 'అమ్మ' విలువ మరచి
పాతిక వేల మూటకు
పట్టణాల్లో బేర సారమాడిన
కంపు హృదయాలెన్నో ?
ప్రసూతి గదిలోన
'పిల్ల' పుట్టెనంటు
తల్లికీ తెలియకుండా
మురికి చెత్త కుండీలో పాల్జేసిన
కర్కశ హృదయాలెన్నో ?
పాలు త్రాగెడి గొంతులో
వడ్ల గింజలనేసి వేధించి
'ఆడ' నవజాత శిశువు
వెచ్చని ఊపిరినాపెడి
కలుషిత హృదయాలెన్నో ?
గొంతు నులిమి,
గొంగళిలో చుట్టి
గుట్టుగా పసి గొడ్డును
రోడ్డు కాల్వల్లో వేసి
కాల్జేయి కడుక్కున్న
మలినత్వపు హృదయాలెన్నో ?
'ఆడపిల్ల' వంటు
అవమాన పరుస్తూ
అమ్మకు తోడుండి
అంట్లు తోమమంటు
బండ చాకిర్లతో బానిసత్వాన్ని
నింపిన కరుణ రసార్థ హృదయాలెన్నో ?
చదువు సందెలందు
తిండి తీర్థమందు
ఆట పాటలందు
అవసరాల దృష్ట్యా
ఆడపిల్లల మీద అదుపాజ్ఞలు
చేయు అమానుష హృదయాలెన్నో ?
మానవతను వీడి
మృగాళ్లుగా కూడి
మందు మత్తు లోన
మగాళ్ళుగా మారి
మానవతిని చెరచే
మాయలమారి హృదయాలెన్నో ?
తల్లిదండ్రులు
అనుంగు బంధువర్గాలు
సహోదరులు
సహధ్యాయులూ
గురువులు - శిష్యులూ
తనూభవుల నేపథ్యంలో
అనాదిగా సాగే మూఢ విశ్వాసాల
నాటక హృదయాలెన్నో?
అమల మానవి జాతి పరిణామ 'దిశ'లో
బంధు రాబందు రెక్కల పరిష్వంగన కవనం
జగాన ఆగని మరణ మృదంగ ఘోషలు
'కానబాలిజం' విషపు కోరల ఆరని కోరికలు
అనువు గాని చోట మానవత్వపు వెతలు
క్షేత్ర స్థాయిలో ఊరేగు కామాంధుల కథలు
కఠిన కర్కశ కబంధ హస్తముల కరచాలనం
పుడమిన మగువల మాతృత్వంపై కరవాలం
(ఉత్తరప్రదేశ్-హాథ్రస్ లో మరో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత స్పందించిన కవిత ఇది
కాలం ముగిసిపోయే వరకు
కలం ఎగిసిపోవాల్సిందే..
********
దృశ్యాల జాతరలో
నా చూపులు తప్పిపోయాయి
********
ఇవ్వాళ్టి ముళ్ళకంపలో
రేపు చిక్కుకుంది
********
ఆలోచనల నొసళ్ళపై
రాలిపడిన ఎడారి చూపులకు
వేడిని తోడిపోసే
నిశ్శబ్దం కావాలిప్పుడు.
*******
పులుపు
ఎంత తీయగా ఉంది
నీ తలపుల్లో తడిశాక..
అల్లంత దూరంలో కనిపిస్తోంది తీరం
తీరం దరిచేరే వారే లేరు
కారణం
కారణాలు వెతుక్కుంటే దారి కనిపించదు
కనిపించని గమ్యం కోసం వెతుకులాటలో
జీవితాంతం నడిచినా
తీరం దరి చేరటం లేదు
నడిచే జీవనగమనంలో
తీరం ఒకటుందని మరిచిపోయాం
తీరానికి చేరాలంటే తీరం దగ్గరే మొదలవ్వాలి
పాపాలతో చేతులు రక్తంలో మునిగి తేలుతున్నాయి
మోసాలకై ఆలోచనలు వేలం వెర్రి లా పరిగెడుతున్నాయి
తీరం గురించి ఆలోచించేది ఎవరు
నువ్వా నేనా ఎవరు
తీరం గురించి ఆలోచించేది ఎవరు
లేరు ఎవరూ లేరు
రారు ఎవరూ రారు
ఆలోచించినా తీరం దరి చేరుటకు రారు
వచ్చే సాహసం చేయరు
చేయరు గాక చేయరు
మెరుగులద్దిన జీవితపు రుచికి మరిగి
తీరం వైపు చూడరు
జీవించి ఉన్నప్పుడే జీవనానికి అర్థం తెలియదు
జీవనంలోని నీతి న్యాయం తెలియదు
ప్రకృతిలా నిశ్శబ్దం తెలియదు
పశువుల్లా విశ్వాసం తెలియదు
అయినా ఉత్తమమైన జన్మ
అర్థం తెలియని అర్థం లేని జన్మ
మానవ జన్మ
అర్థం తెలుసుకుందామని ఆలోచన లేని జన్మ
ఎదురుచూపుల తీరం కై ఎదురుచూడని జన్మ
కాలపు బంతిని ఎగరేసే చేతులకు
ఆత్మవిశ్వాసపు లేపనం రాసి
అవకాశాలను అందిపుచ్చుకుని
చేజారిన ప్రతి సారీ
చేజిక్కించుకునే విన్యాసాలను నేర్పింది
మోడైన శిశిర
కొమ్మల మధ్య కూర్చుని
రేపటి పచ్చదనం..పూలు కాయల కోసం
ఊహల ఊయల లూగడం
చూపింది తనే !
గతుకులకు అతుకులేసుకుని
మైదానంలా పరుచుకోవడం..
పల్లం లోకే కాక..
ఎత్తులకు ప్రవహించే ప్రక్రియను
నేర్పింది తను
ఎద గుమ్మాలకు
తానిచ్చిన ఉత్తేజపు పసుపు రాసి
సర్దుబాట్ల దీపాలను వెలిగించేసుకున్నాక
ఇపుడు సంబరాల మేలా
తీరికైనపుడొచ్చి..
కొన్ని నవ్వులు..గిల్లి కజ్జాలను
కలల తాయిలాలను..తెచ్చి
మనసు నట్టింట్లో..వెదజల్లి పోతుంది
కొత్తగా..నన్ను నేనే
సాదరంగా ఆహ్వానించుకున్న
హరివిల్లు అనుభవాలను..
ఎదచాలని అనుభూతుల నిచ్చింది..ఆ చెలిమి
తానిచ్చిన చిరునవ్వులను
ముస్తాబు చేసుకుని..
తనకోసమే దారి కాసి నేనిపుడు
దవ్వున వినవచ్చిన వేణుగానాన్ని విని, నీకోసం నా అడుగులు బృందావనం వైపు పరుగుదీశాయి...
నా మువ్వల సవ్వడి నీ శ్రవణాలకు చేరినంతనే
నీ వేణు గానం మరింత మధురంగా మారింది....
మోహనరాగం అత్యంత సమ్మోహనంగా వినిపించి
నన్ను వివశురాలిని చేశావు కృష్ణా...!!!
మదిని ఏదో లోకంలో విహరింపజేశావు....
అద్భుతమైన ప్రేమ మాత్రమే నిండిన
ఆ లోకంలో నా కన్నుల నిండా పారవశ్యమే....
మనసు తన్మయమై పరవశంలో ఓలలాడెను....
అది చూసిన నీ కన్నులలో ఓ ఆనందం,
అలవికాని తృప్తి....
కాలాన్నిలా ఆగిపోనివ్వు కృష్ణా కాసేపు....
నా హృదయపు తనివి తీరేదాకా....
నువు తలచుకున్న కానిదేదీ లేదు కదూ...!!!
అదిగో చూడు భాగ్య నగరం
ప్రకృతి సృష్టించిన వరద భీభత్సం
మూసీ నది పోంగిన తరుణం
రోడ్లు మురికి కాలువలా మారిన వైనం
తల నిండా మునిగే నీటి గుండం
బస్తీవాసులపై పడ్డ పెద్ద గండం
అయితేనేం ఉందిలే నష్ట పరిహారం
అని మా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పే పాత గణితం
అది వొంగి వొంగి ఓట్ ఏసినందుకు మాకు ఇచ్చే బహుమానం !
మా నాయినని సూత్తే అనిపిత్తది
రాత మారాలంటే
ఎన్ని "గీత"లు గీయాలో అని!
ఒక్కొక్క కల్లు బొట్టు పడి
కుండ నిండితేనే...
ఇంటిల్లిపాది కడుపు నిండుతది
ప్రకృతి ప్రశాంతంగ ఉంటేనే
మా బతుకుబండి నడుత్తది
వానమొగులు వచ్చిందంటే సాలు
మా నాయిన కళ్లు మత్తడిపోత్తయి
ఈదురుగాలులొచ్చినా సరే...
ఉయ్యాలలూగుకుంట మరీ...
చెరువుకట్టకు మొల్శిన
"ఐఫిల్ టవర్లు" ఎక్కిదిగుతడు
నలభైయేండ్ల సంధి
నాయిన "గీత" గీత్తాండు
ఇంకెన్నడు మారుతది
మారాత..!
నుదుటి రాతను తప్పుబట్టాలో..?
నాయిన గీశే "గీత"ను తప్పుబట్టాలో..?
1
మాటలు
మొలకెత్తక మానవు
పచ్చగా
చిగురించక ఆగవు.
మానుగా అగుపించాలని
కాదు.
ప్రేమగా పలకరించాలని
మాత్రమే.
2
కొందరు కాలికి తగిలే రాళ్లు.
ఏదో ఒక చోట గాయమై బాధిస్తారు
అది మానినా మచ్చగా మిగిలుంటారు
మరికొందరు కంట్లో మెరిసే వాళ్లు.
అందంతో పాటు ఆనందానిస్తారు
విలువగా జీవితమంతా గుర్తుంటారు
3
"నా ప్రేమదేవత కోసం
కొన్ని ఊహలను
ఊసులతో
ముడుపు కట్టాను.
ఓ వరమిచ్చే రోజుకు
మొక్కు తీర్చి
నా పెదవుల పల్లకితో
ఊరేగించాలని."
4
ఎవరి కథలోనైనా
మలుపు ఓ అవకాశమే
అలుపు తీర్చుకోవడానికి
గెలుపు నేర్చుకోవడానికి
జీవితంలో
నిజం అబద్ధమైనప్పుడు
అనుభవం నిజమౌతుంది.
జీవితానికి జీవితాన్ని చూపిస్తుంది.
5
ఒత్తిడిలో
మనిషి శత్రువు
మనసు
ఒంటరిలో
మనసు మిత్రుడు
మనిషి
అల ఈశాన్య రాజ్యంలో ఊహాన్ నగరిలో
జనించెనట జీవం లేని వైరస్, క్రొవ్వుపొరలో!
చేసెనే కరోనా కణ సేన భువిపైన ఆక్రమణం!
పట్టెనే పుడమికి సూర్యచంద్రరహిత సుదీర్ఘ గ్రహణం!
గబ్బిలాలు, పాంగోలిన్ వంటలతో నిండె ప్లేట్లు,
క్రూరమైన, అడ్డగోలు ఆహారపు అలవాట్లు,
దానితోనె ఆరంభం మానవాళికి అగచాట్లు,
క్రమ్మెనంట పృథ్విపై కానరాని కారు చీకట్లు!
కాలేదు ఈ మహమ్మారి చైనాకే పరిమితం,
కలిగించెను కల్లోలం, చూడలేదె అంతక్రితం,
వ్యాపించెను వేగంగా ఆ దేశం ఈ దేశం,
విడువలేదు భూమి మీద ఏ ఒక్క ప్రదేశం!
విశృంఖలమై విజృంభించె కరోనా కణాలు,
ఘడియ ఘడియ నమోదయ్యె లెక్కలేని మరణాలు,
ఖననానికె కష్టాలు, కడతేర్చని ప్రాణాలు,
మరలెన్నడు రాకూడదు ఇటువంటి తరుణాలు!
అన్నిటినీ త్యజించి, సేవించే సిబ్బంది,
తోడుండగ దరికి రాదు ఏ ఒక్కరికి ఇబ్బంది!
'కలిసుంటె కలదు సుఖం' ఆలనాటి నినాదం,
'కలిసుండుట వలదు' అనె ఈనాటి ఈ వేదం!
పరిశుభ్రతే బ్రహ్మాస్త్రం,
మనోబలమే మన శస్త్రం,
చింతించక చితినిపెట్టు,
కరోనారక్కసిని మట్టుబెట్టు!
క్లిష్టమైన ఈ యుద్ధంలో ప్రతిఒక్కరు సైనికులే
కరోనా 'పద్మవ్యూహం' ఛేదించే అర్జునులే,
భస్మమవును త్వరలోనే వైరస్సు కణం కణం,
అదిగో అల్లదిగో మానవులు గెలిచే ఆ క్షణం!
అదిగో అల్లదిగో 'మనమంతా' గెలిచిన క్షణం!
తెలివి అంటే ఏమిటి?
యాభై ఏళ్ళ వయస్సులో
మూడేళ్ళ వయసు ప్రశ్న.
ఎక్కడ వెదికినా
ఎవరిని అడిగినా
ఏదో చెబుతూ ఎక్కడో తిప్పుతారు.
ఒకనాడు
కాలం చేసిన ఒంటరిలో
లోకం నేర్పిన పాఠం.
తెలివి
"మోసాని"కి పర్యయపదమని.
మోసానికి "రహస్యమైన అందం"
తెలివని.
ఓ నా దేశమా !
స్వేఛ్ఛా భారతమా !!
ఇక్కడ,
ధర్మం నాలుగు పాదాలా?ఏమో!
మనుధర్మం మాత్రం
నలభై నాలుగు పాదాలుగా
నల్లత్రాచులై నాలుకలు చాస్తాంది!
ఉన్నవాళ్ళకే న్యాయం
రక్షణ వ్యవస్థ అంతా ఒకేవైపు!
బాధితుడి వైపు గాకుండా
నిందితుడి వైపు నిలబడటం!
ఓ నిర్భర భారతమా!
ఆహా! ఏమి నీ న్యాయం
ఆ 'అ'సమాన వైఖరిని చూసి,
మహదానందం పొందు!
అమ్మాయి గా పుట్టటమే అపరాధం!
అంటరాని వారైతే ఇంకా ఫర్వాలేదు
భరత మాత మంత్రం జపిస్తూ
అమ్మాయిలను అమ్మ గా చూడని
దేశభక్తి ని చూసి,
ఓ నా పవిత్ర దేశమా ఎగిరి గంతేయ్!
ఖైర్లాంజీ ,ఉన్నావా,హత్రాస్---
అంటుడు ముట్టుడు అంటూ
ఊరికి ఆమడ దూరం వెలివేయబడ్డా
ఇక్కడ అంటరాని వాళ్ళందరూ
అత్యాచారానికి అర్హులే అని ధృవపరుస్తూ,
హంతకులకు శ్వేత పత్రం ఇస్తున్న
ఆ చట్టాల చుట్టరికం చూసి
ఓ నా నిర్భయ దేశమా
ఆ గొప్పదనం చూసి గర్వపడు!
నాటి శంభూకుని శిరస్సునుండి
నేటి మనీషా నాలుక దాకా
అసలు నిజం బయట పడకుండా
ఇంకా ఎన్ని అవయవాలు తెగిపడాలో!
ఆ మానభంగ చరిత్ర లు రాయటానికి
ఇంకెంత రక్తం సిర గా మారాలో!
రక్తం మడుగులు ఇంకక ముందే
అబలల బలితర్పణం చేసే ఈ ధరిత్రి లో
రక్తపింజరల వికటాట్టహాసం చూసి
ఓ కర్మదేశమా! వికృతానందం పొందు!
నిర్భయ ఉన్నా భయమేం లేదు
దిశ దశను మార్చలేదు
ఎందరో మనీషా ల ఆయువు మాత్రం
వాయువులో కలిసి పోతూనే ఉంది
ఖండిత తలలు , నాలుకలు
అబలల మర్మావయాలు అతికించబడిన
పచ్చి రక్త మరకల చరిత్రను చూసి
ఓ శాంతిని కోరే నా దేశమా!
చంకలు గుద్దుకుంటూ సంతోషపడు!
ఆవుకు ఇచ్చే గౌరవం
అమ్మకు లేని ఈ నేలలో
మతం పేర,
ఖతువా ఆయేషా అయితేనేం
కులం పేర హత్రాస్ మనీషా అయితేనేం
ఎవరైనా ఇక్కడ ఒక్కటే కదా!
కర్కశంగా తెంపి నలుపబడ్డ పూలే కదా!
మానవత్వం లేని సమాజాన్ని చూసి
మరణమే శరణం అయిన
చెరచబడ్డ నా చెళ్ళెళ్ళ చీరలను
నీ త్రివర్ణ పతాకానికి కట్టి
ఈ ప్రపంచం దశదిశలా ఎగిరేయ్!
ఓ గణతంత్ర దేశమా!
ఆ ఘనతనంతా దండోరావేయి
పంచభూతాలు దద్దరిల్లేటట్లు !
చెలీ....... !
నీ హృదయపు గుడిలో
ఓ నిత్య సేవకుడిలా
నీ చిరునవ్వు ముత్యాల సరాలలో
ఓ అపురూప ముత్యంలా
నీ కన్నుల దీపాల తోరణాలలో
ఓ అద్భుత వెలుగులా
నీ కురుల మబ్బులలో
ఓ అదృశ్య మెరుపులా
నీ కాలి అందెల సవ్వడిలో
ఓ చిరుమువ్వలా
నీ కోపపు ముచ్చెమటలో
ఓ చిన్నారి బింధువులా
నీ నిత్య జలపాతములో
ఓ అలసి పోని జలధారలా
నీలో ఒదగాలని
పరితపిస్తుంటాను....
కానీ....!
నీ కన్నీటి సిరిమల్లెలను
నా దోసిట పట్టాలనీ
నిను ఓదార్చే ప్రయత్నంలో
నా ఈ జీవితము
చిరుప్రాయమనే
వాస్తవాన్ని మరిచాను
ఓ ప్రకృతీ.....
వసంతంలోనే కాదు
శిశిరంలో కూడా సౌందర్యముంది
రాలిపోయే ప్రకృతిలో సైతం
రాగాలు విన్నపుడే
ప్రకృతి హర్షించును
కనులకు కలలను నేర్పేది
తొలివలపుల ప్రాయమే....
నీ చూపులె ఈ జగతికి సూర్యోదయం కావాలి
నీ నవ్వులె నిశి వేళన చంద్రోదయం తేవాలి
స్వార్ధమనే ఊబిలో కూరుకుపొయినది సమాజం
నువు పంచే అనురాగమె ప్రేమోదయం కావాలి
మానవత్వానికి ఇత్తడి విలువైనా లేదు నేడు
నువు చూపే కరుణే స్వర్ణోదయం కావాలి
శృంఖలాలు పడిపొయినవి నీతికీ నిజాయితీకి
నువు చేసే ప్రతిఘటనే స్వేచ్చోదయం తేవాలి
బెదిరిపోక ధైర్యంతో నువ్వు వేసే అడుగులే
ప్రజా ప్రగతి ప్రపంచానికి నవోదయం కావాలి
ఓ..! తల్లి...!!
ఈ మనుధర్మం ఆంక్షలతో
నిన్ను బంధిస్తున్నదా
అన్ని రంగాల్లో ముందుకు
వస్తున్నారని ఆనంద పడక
అప హేళన చేస్తున్నాదా
నిబంధనలు విధించిన ఆ రాతియుగపు
ఆనవాళ్లు ఇంకా నిన్ను వెంటాడుతున్నయా
మనిషిని మనిషిగా చూడలేని ఈ లోకం
నిన్ను ఆడదని చులకనగా చూస్తున్నాదా
సమానత్వాన్ని మరిచి
ఈ సమాజం మానవత్వాన్ని
మట్టి కలుపుతున్నదా
మనిషి తత్వాన్ని వదిలి
నీ వ్యక్తిత్వాన్ని చంపుతున్నాదా
తల్లులారా....! అక్కచెల్లెల రా..!!
కలత చెందకండి
కన్నీరు కార్చకండి
మనోబలంతో ముందడుగేయండి
స్వేచ్ఛకై పోరాడి
మానవధర్మాన్ని చాటి చెప్పండి
తరతరాల చరితను మార్చి
రేపటి తరానికి నాంది పలకండి
చిన్నతనం నుంచే ఆడపిల్లలని
బలహీనతను పెంచి పెద్ద చేస్తున్నారు
కన్నా అమ్మైనా పెంచే నానైనా
తోబుట్టువులైనా బంధుమిత్రులైన
అసమానతలతో
మనిషితనాన్ని గుర్తించకపోతే
ఇకపై సర్దుకోకండి..!
సహించకండి...!!
ఉరుమై ఉరిమి
ఉగ్రరూపం దాల్చండి
పిడికిలి బిగించి
పిడుగై దూకండి
మీ ఉనికిని చాటి
ఉన్నత స్థానాలకు చేరండి
నరం లేని ఈ సమాజ తత్వాన్ని
మీ స్వరంతో సమాధి చేయండి
1
తప్పటడుగులు
నడకనేర్చాయి
తల్లి ఒడి నుంచి
గురువు నీడ చేరి
2
పుస్తకాల నీతులు
నీలో చేరాలా
వారధి గురువే
కాలమెంత మారినా
3
కలుపు చేష్టలకు
కంచె వేసె ఒజ్జ
విజ్ఞాన వృక్షంగా
నీవెదగాలని
4
చదువు నదిలా
పారుతోంది
విధికంకితమైన
గురువు గొప్పతనంతో
5
ఇంటి పనంతా
చేస్తే ఎంత హాయో
బళ్ళె సారు
అభినందన పూలనవ్వుకై
6
విశాల విజ్ఞాన
వీచిక గురువు
చదువు పుప్పొడి
వెదజల్లుతూ
7
భయం గుప్పిట
గురువు బోధన
ఫైసల చదువుతో
విద్యార్థి పెత్తనం
NOV 2020
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు