సముద్రాల్లోంచి మండుటెండల్లో
నీళ్ళు ఆవిరై పైకి వెళ్లి
కరిమబ్బులై మళ్లీ కిందికి దిగొచ్చి
దాహంతో బీటల నోళ్లు తెరిచిన
భూమిని తడిపే
వాననీళ్ళుగా రావడం ఆర్ద్రమైన అనువాదం
అందమో అనాకారితనమో
ఏదైతేనేం అద్దంలో కనిపించే
ప్రతిబింబం అదో రకం అనువాదం
మన మనస్సుల్లో వూపిరి పోసుకుంటున్న
ఆలోచనలన్నీ ఏదో విధంగా
మాటలుగా బయటకు రావడమూ
రాతలుగా రూపుదిద్దుకోవడమూ అనువాదమే
పయనించి పయనించి అలసి సొలసి
బాటసారి శయనించి కాసేపు సేదదీరే
చెట్టుకు నీడ ఓ గొప్ప అనువాదం
రచయితలు రాసిన నవరసభరిత కథలన్నీ
వీక్షకులు మహదానందంతో చూసే
చలనచిత్రాలుగా మారడమూ అనువాదమే
కళ్ళకు కెమేరా అనువాదం
ఫోటో మనకు స్థావరమైన ఛాయానువాదం
వీడియో జంగమ సజీవ భ్రమానువాదం
పిల్లలు పెద్దల సృజనానువాదం
శిష్యులు గురువుల జ్ఞానానువాదం
చిన్నదే కావచ్చు చమురు దీపమో విద్యుత్ దీపమో
సూర్యునికి అనువాదం కదా!
గొంతుకు-
పియానో, పిల్లనగ్రోవి వంటి వాద్యపరికరాలన్నీ
అపురూప గానానువాదాలు
మూత్ర పిండాలు పూర్తిగా పాడైపోయిన రోగికి
జరుగుతున్న డయాలసిస్ అత్యంత దయానువాదం
అంతా అనువాదమయం
ఈ జగమంతా అనువాదమయం
సూర్యుని ఎండకు
చంద్రుని వెన్నెల ఎంత చల్లని అనువాదం!
అమ్మ ప్రేమకు
బిడ్డ నోట చనుబాల ధార ఎంత కమ్మని అనువాదం!!
ఘనీభవించినచోట
ధ్వనిభవిస్తున్నది
ఎముకలు కొరికే చలిలో
జైకిసానంటూ నినదిస్తూ
ఇనుప చువ్వలపై నిలబడి
రక్తాన్ని ధారపోస్తున్నాడు
ఈ దేశం
మట్టి మనుషులను
తట్టి లేపడంకోసం
నివ్వురు గప్పిన
నిప్పును రాజేస్తున్నాడు
నీ భూమిలోంచి
నిన్ను తరిమేసి
'బనిసగా'
మార్చడంకోసం
అంబానీ అదానీలు
వస్తున్నారు
కాషాపు కమలం
కార్పోరేట్లకి
కవచాలుగా
నిలబడింది
నువ్వొక్కసారి
రైతంగ పోరాటలను
నెమరు వేసుకో
జైత్రయాత్రల చరిత్రను
తిరగదోడు
ఇప్పుడు
దేశ రాజధానిలో
నాగల్లు తిరగబడ్డాయి
అవి భారికేడ్లను
బద్దల్ కొడుతూ
రణ రంగాన్ని
నడిపిస్తున్నాయి
అక్కడ రైతు
'జబ్ తక్ కానున్
వాపస్ నహీలెతే
తబ్ తక్ హమ్ లడేంగే
హమ్ మర్జయేంగే
లేకిన్ వాపస్ నహీజయేంగే'
(చట్టం ఉపసంహరిచుకునే వరకు మేము పోరాడుతాము
మేము మరణిస్తాం కాని వెనక్కి వెళ్లం)
అంటూ
గర్జీస్తున్నాడు
మేము షాహిదిలం
బనిసలం కామంటూ
తిరుగుబాటు చేస్తున్నాడు
(ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టల రద్దుకై ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా)
నిట్ట నిలువుగా నీడ మెదిలితే
నా కన్నా! నువ్వొచ్చావనుకున్నా.
నిను కన్న నా బిడ్డ పేగుకే తెగులొచ్చిందో ?
కోసి,తీసేసి, కరెంట్ పెడతారంట !
మూణ్ణెల్లు పారిన ఎర్ర కాలువలో
జబ్బు ఎదురీది వచ్చింది కామోసు.
కళ్ళు బైర్లు కమ్మితే,నీ మీది బెంగనుకునేను.
కాళ్ళు పీకితే,వయసు మీరిన నిస్సత్తొనుకునేను.
నోరెండిపోతుంటే వేసంగి లెమ్మని పొద్దు పుచ్చాను.
ముప్పు ముంచి మీ అయ్య చేతులు
నన్ను మోసేదాక కానుకోలేదురా!
వెన్ను మంచానికి ఆన్చి,
చేతి ముడుతలు సవరించి,
ఏ తల్లి కన్న బిడ్డ దయనో
ఎర్రగా నరం లోకి ఎక్కించిన వేళ
చెరుపు మరుపుల సందున
నీ పిలుపు 'అమ్మా' అని సోకినట్టై,
ఆశ కనురెప్పలు దాటి పొంగి,
కాలు చెయ్యాడనీదు.
అప్పుడెపుడో దూరాభారం పోయిన కొడుకా!
ఈడ ఎటు చూసినా నాలాటి అమ్మలే.
ఇంటి ముంగిట కళ్ళాపి జల్లింది మొదలు,
రోజూ ఏటి నీరు,ఇంటి బరువు మోసినోళ్ళమే.
ఎన్ని పేనాల రాక,ఎన్ని పేనాల పోక చూస్తిమో,
ఇప్పుడిక మా బతుకు గతుకుల లెక్క తేలాలి!
ఆడోళ్ళ వార్డులో ఈ ఆఖరి చూపు
ఒంటిరెక్క తలుపు కిర్రుమన్నన్ని సార్లు,
గుండె దరువును మోగిస్తూనే ఉంటుంది .
ఎవరి బిడ్డ పలకరింపు కు ఒచ్చినా,
మా అందరి ఆశలూ ఎగదోసిన దీపంలా ఎలిగిపోతాయి.
మీ నాన్న కండువాలో ఇంకిపోయే
వెచ్చని కన్నీటి చుక్కగానైనా
ఒకసారి వచ్చి పోరా!
(గైనిక్ వార్డ్ గోడల కన్నీటి చారికలు)
నిన్నటి కాలగర్భంలో
ఈరోజు ప్రసవిస్తుంది
రేపటి సూర్యులను..
------
నీ నవ్వుల నింగిలో నేను జాబిల్లిని.
నీ కన్నుల వెన్నెలకై ఆరాటపడే చకోరాన్ని.
-----
కిటికీ పక్కన
కూర్చుంటే చాలు
క్షణాల్లో కావ్యాన్నైపోతాను.
-----
ఆకలి ఇంట్లో
చీకటి
తన నీడను వెచ్చగా పరుచుకుంది
కడుపుతో పాటు
గుండె కూడా మండిపోతుంది
నిప్పురవ్వలా...
చీకటిని జయించాలని..
గలగల పారతున్న మానేరు వాగు తలాపున..
అది ఊరి జనం గొంతు తడ్పే అమృత జలం..
రైతులకు ఆయువునిచ్చే పంట నీరు..
ఊరూరా నిర్మాణం అయ్యే ఇల్లు..
అది అక్రమార్కుల కాసుల పంట..
అడవిలో దాగిన అందమైన నయన గుళ్ళు...
ఆ దారి ఎంతో బయమైన అహల్లాధన్ని ఇచ్చు..
మరో పక్క ఉట చెలిమి కుమ్మం మాటు..
అది అందరి వేటల చేపల నిలయం...
అలానే వస్తె బొమ్మారం అవత ఇవతల వాగుల అందం..
దాని కింది పక్క ఉంటుంది కమ్మరి కుంట..
అది అనుకొని ఉంటుంది హరిజనుల ఇంట...
కుంభంపల్లి,గట్టుపల్లి,సాలపల్లి,కొయ్యూరు అలంకారాలు గా..
చుట్టూ నీటి వాగులే నా పల్లె ఎల్లలు..
భోగ్గుల వాగు, మానెరు వాగు, ఇవతల అవతల వాగులు.
నా పల్లె సింగారాలు...
కోయకుంట అడివిలో కొలువైన నాగులమ్మ తల్లి.
తొలి ఓడి బియ్యం నా పల్లె అయిత సత్తమ్మ ఇంటినుడే మొదలు జాతర..
అదోక అందమైన జాతర..
మేడారం ముందచే పండుగ...
చిన్న పెద్ద గమగూడి ప్రకృతిలో మమేకమైన జన జాతర ...
ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి
వచ్చి కొలిచే భక్తుల కొంగు బంగారం ..
గిరిజన దేవత నాగులమ్మ జాతర..
అలా నే కొంచం ముందుకెళ్తే తడి అరని రక్తపు మరకలు...
అవి నల్ల అధిరెడ్డి, శీలం నరేష్ ఏర్రం సంతోష్ అన్నలను యాధి జేస్తాయి..
ప్రకృతి తన ఒడిలో దాచిన అరుణ తారలు..
వేరే ఊరి వాళ్లకు స్వగతం పలికే కొయ్యూరు...
అక్కడినుండి ఉరికస్తుంటే పచ్చని పంటలు మధ్య నడిచే పైర గాలి సవ్వడులు...
అలా వస్తుంటే కుడి పక్కన చుట్టూ ప్రహరితో..
నా ఊరి చదువుల గుడి..
ఎందరినో జీవితం లో ఉత్తీర్ణులు చేసిన ..
చల్లని చెట్ల మధ్య నిలయం ..
ఇది ముఖ్యంగా పేదల దర్యం..
బ్రతుకులు మార్చే ప్రాంగణం...
అలా కొంచం ముందుకస్తే ఉంటుంది ..
ఊరి ఉమ్మడి ఆస్తి ఊరా చెరువు..
ఇది అందరి రైతుల గుండె దైర్యం..
ఇది నా పల్లె జీవన ఆధారం....
అందరి ఆహారం చేపల పంటల నిలయం ..
నా ఉరా చెరువు కట్ట మైసమ్మ రక్షణ ..
దానిని అనుకొని ఉంటుంది..
చుట్టూ నీళ్లతో
కొలను మధ్య న కోవెలాల..
బ్రాహ్మణుడు దూరం పెట్టిన బహుజనుల దేవాలయం...
ముత్యాలమ్మ గుడి..
ఊరు వాడను ఏకం చేసే బోనాల జాతర ఇక్కడ ఎంతో మధురం ..
దాన్ని దాటుకొని వస్తె ఉంటుంది..
గ్రామ అభివృద్ది అధికారాలను దశ దిశ నిర్దేశించే..
నిలయం గ్రామ సచివాలయం...
ఇది ఎంతో మంది నాయకులను తయారు చేసిన కర్మ గారం..
ఇక్కడి నుండే జిల్లా నాయకులు అయ్యి ప్రకాష్ స్తున్నారు.......
రాష్ట్ర మంత్రులు ముఖ్య మంతులు ఆశినులు అయిన ప్రాంతం నా గ్రామ సచివాలయం...
ఇక న పల్లె చరిత్ర చూస్తే ...
ఎమర్జెన్సీ లో పి. వి గారికి ఆశ్రయం ఇచ్చింది ..
నా పల్లె నుండే ఎమ్మెల్యే గా
నామినేషన్ వేశారు.
గెలిచారు సీఎం, పీఎం అయ్యారు..
చరిత్ర లికించని అక్షర సత్యం ...
పటేల్ పట్వారీ నుడి ప్రజసమ్యం లోకి..
అడుగిదిగి
మొదటి సర్పంచ్ బొమ్మ ఈరమల్లు..
ప్రజల సంక్షేమమే పని చేసే నాయకులు..
అలనాటి నక్సల్ బరి పిలుపుతో..
ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగరేసిన వీరుల కన్నది నా పల్లె...
అక్రమాలకు అన్యాయాలకు ఎదురుగా ..
సమ సమాజ నిర్మాణమే దేయంగా..
పేదవారి పట్టెడు అన్నం పెట్టడమే లక్ష్యంగా...
ఆయుధాలు పట్టినా ముగ్గురు అమర వీరుల
తన ఒడిలో పదిలంగా దాచుకుంది..
ఒకరు తూర్పున ఒకరు దక్షణాన ఇంకొకరు పడమరణ ఎర్రని మల్లెలు అయి అస్తమిస్తే..
మోదుగు మొక్క మొదట్లో జొలడి నిద్ర పుచ్చి మోదుగ పువ్వల వికసంపి చేసింది..
పల్లె తన ఒడిలో నిద్ర పుచింది...
వారు....
కా.అయిత మొడ్డిరెడ్డి, కా. సకినాల సమ్మయ్య, కా. అడుప సమ్మన్న లను యధి మరవదు పల్లె..
అలాంటి రక్తపు మరకలతో బయటచ్చిన కవి గా రచయితగా ..
పేదలకోసం పని చేసే ఉత్తమ ఉపాధ్యాయుడు అయిత తిరుపతి రెడ్డికి జన్మ నిచ్చింది...
అంజెనాయ దేవాలయం కోసం తమ భూమిని
దానం చేసిన పుల్లయ్య పంతులు...
వినాయక చవితి వస్తె ఊరేగే కన్నుల పండుగ..
నా పల్లె గుడి జాతర..
ఉరిలోపల కొలువైన అంజేనేయ దేవాలయాలు ఊరి బయట
గ్రామ రక్షణగా చుట్టూ...
పోషమ్మ , కట్ట మైసమ్మ, మధనప్ పోసమ్మల నిలయాలు...
గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేసే గ్రామ ..
పాలక అధికార వర్గం..
అవినీతిని ప్రశ్నించే యువత...
అన్ని చూసిన అనుభవం కలిగిన పెద్దమనుషులు...
అన్నిటికీ మించి ఆపదలో ఆధుకునే వాట్సాప్ గ్రూప్..
అందులో సహాయానికి స్పందన వర్ణనాతీతం...
విప్లవాలు పూయించిన ఎర్రని మందార వనం...
నేడు పచ్చని పైరుల నడుమ సేదతీరు నందన వనం..
ఇదే నా పల్లె ఆస్తి...
నాకు జన్మించిన నా మాతృ మూర్తి...
నా పల్లె వల్లెంకుంట....
పల్లవి:
పూటకో పువ్వు రాలినట్టుగా మట్టి బిడ్డ ఘోర మరణం
చేరదీసి బాధ బాపే వాడు లేక అన్నదాత కంట శోకం. (2)
వెళుతుండో వెళుతుం డో
పొలము కొడుకులను సెలక బిడ్డలను
కండ్ల జూసుకుంటనాదలను
జేసీ వెళుతుండో
అయ్యో.......
చరణం 1:-
వడ్డీకి దెచ్చినప్పు పంట నిలపక పాయె
పరువే ఉరి తాడై పురుగు మందు తో ప్రాణాలు తీసే
పంట చేతికి వస్తె గిట్టు బాటు ధరలు జాడ లేక
ధీర బోయిన గుండె ముక్కలయ్యి నేల కొరిగే
(పంట) సచ్చినంకనే నష్ట పరిహారము -2
ఉన్నప్పుడు జెయ్యరే సాయము
వెళుతుండో వెళుతుం డో
పొలము కొడుకులను సెలక బిడ్డలను
కండ్ల జూసుకుంటనాదలను
జేసీ వెళుతుండో
అయ్యో.......
చరణం 2:-
ఆశలే పెట్టి నాడు గెలిసి గోసలే పెట్టే
సూడు
రైతుల ప్రాణాలతోటి ఆటలే .. ఆడే నేడు
రైతిళ్లలో తిండి లేక
వాళ్ళ కళ్ళలో నీళ్ళింకి పాయే
ఒక్క పూట తిండి గూడ లేక
ఎన్ని గోసలో వాళ్ళ బతుకులో
(పంట) సచ్చినంకనే నష్ట పరిహారము
ఉన్నప్పుడు జెయ్య రే సాయమంటు
వెళుతుండో వెళుతుండో.....
పొలము కొడుకులను సెలక బిడ్డలను
కండ్ల జూసుకుంటనాదలను
జేసీ వెళుతుండో
అయ్యో.......
నిల్చున్న చోటనే నిన్ను
కూల్చివేస్తుంది
గుండె పోటులా...
జాగురుకతతో ఉండటమే మందు
క్రమ క్రమంగా నిన్ను
క్షీణింప చేస్తుంది
ఎయిడ్స్ లా...
నివారణ ఒక్కటే మందు
మనుషులకు నిన్ను
దూరం చేస్తుంది
కరోనాలా...
రాకుండా చూసుకోవడమే మందు
అప్పుడప్పుడూ
అంటురోగంలా మొదలై
మహమ్మారిగా మారి
మనస్తత్వాలను
సూక్ష్మ ధర్శినిలో చూపించి
కారణాలను కనుక్కునే క్రమంలో
రూపాలను మార్చుకుంటూ
మందేదో కనుక్కోలేకుండా
సంక్లిష్టంగా మారుతుంది
నీలోని విశాల, సహృదయతే
రోగ నిరోధక శక్తని తెలుపుతుంది
దాని పేరే "అహం".
ఆకాశం తాకే అద్దాల హంగుల మేడలు
మచ్చుకకైనా కానరాని పచ్చిక జాడలు
మట్టిని మాయంచేసె కాంక్రీటు కాడులు
జనసముద్రములలో కరువైన తోడులు!
జలాశయాన్ని జారిన ప్రవాహాల హోరా!
కూడళ్ల గీతలు దాటిన వాహనాల జోరా!
అకస్మాత్తుగా పయనం స్తంభించిన పౌరా
ఖరీదైన కాలం ఖర్చాయె! ఔరా! ఔరౌరా!
దారులలో కదిలే కృత్రిమ నక్షత్ర నదులు
పీల్చటానికి పుష్కలం కాలుష్య పొగలు
పెరిగే పాదరసంతోడు అనావృష్టి దిగులు
నేల చీల్చుకుని నింగికెగిసే నగర నగలు!
ఎండిన ఎడారిలో కుండపోతలు పోసి
మురిసె బోసిపోయిన అలనాటి మూసీ
కదలనీయక దారులు దారుణంగా మూసి
ప్రకృతి ప్రళయానికి వణికెను పట్టణవాసి
కడలిని కనులెదుట తలపింపు నదులు
కదిలించె అకట! సకల నగర పునాదులు
జలము అవనిలోనికి ఇంకుట బదులు
జనుల ఆవాసాలను మింగుట మొదలు!
విరగ నవ్వుచుండె విరిగిన మాకో మానో
క్రమక్రమంగా ఆక్రమణకు గురైన కొలనో
క్రమశిక్షణ నికరముగా లోపించుటవలనో
ముంగిట ఘంటిక మ్రోగించెనా ఎల్ నినో
ఈ చిక్కునకు బాధ్యులము నువ్వో నేనో!
సుతలంపై పెరుగుతున్న ఒత్తిడి భారమా
భూతలంపై పంచభూతాల ప్రతీకారమా
ఏతలంపై ఎగసిపడునో కార్యరూపమా
రాతల మార్పునకు కాంతిని చూపుమా!
పారాహుషార్ పలికెను పర్యావరణము
ఈ రణమునకు మనమే కదా కారణము
హద్దులలో ఒదిగుండుటొక్కటే శరణము
పద్దులు మీరిన తప్పదు సంస్కరణము!
మనోశాస్త్రాలను
యంత్రరూపంలోకి తెస్తే
మానవరక్తంలో విషం విరిగి
రంగు మార్చుకున్న రక్తం
ఒక్కక్కోరిలో ఒకోరకంగా
ఒక్కరికి ఒక్క ముఖాన్నే
బొడ్డుతాడుతో అనుసంధానం చేసి,
ప్రేమామృతాన్నిఇంధనంగా స్రవించి
మనసు మరబొమ్మలా
మనిషిని నడిపిస్తుంది.
అవిశ్రాంతంగా
మెదడులో గూడు కట్టుకున్న
ఊహాలకు రెక్కలు మొలిచి
మనసు సంకేతాలను
సాంకేతికంగా గౌరవిస్తూ,
ప్రతి అనుభవాన్ని అద్ధంగా మార్చి
మరకల్ని తుడిచే
అదృశ్య హస్తమొకటి
తప్పటడుగులు లేని దారిలో
స్వచ్ఛగా నడిపించాలని
ఓ చిరునామాతో
చిరుస్వాగతం పలుకుతుంది.
అడుగు వేస్తే అనుమానాల అడుసు.
కునుకు తీస్తే భీకరమైన కల.
కురుకుపోతున్న భావోద్రిక్త వేళలో వేలాడుతున్న భావాలకు
వాలిపడే మాటకు
రాలిపడే అర్ధాలు
గాజుపెంకుల్లా గుచ్చుకొంటే...
దూరమైన మనిషే
ఒంటరిలో దగ్గరైన నరకం.
ఎండమావిగా నమ్మకంతో
నడి రాతిరి వడగాల్పుల
సెగలు కమ్మే ఆలోచనకు
మనసు చాపలా ముడుచుకొని
చింతల్ని తలచుకొని
చీకటిని కప్పుకొని
వెలుగు గువ్వను కంటి ఇంటి దరిదాపుల్లో వాలకుండాక పారద్రోలిన
ప్రతి పలుకులోని అంతర్ధాల కింద
నలిగిన మనిషికి నిద్ర దూరమైనా
నిజాలు దగ్గరయ్యాయి.
కలలు రాకపోయినా
కపటాలు తెలిసాయి.
అంగుళం వదలకుండా
మనసును ఆక్రమించి
ఆక్రందనకు గురి చేసే కళ తెలిసిన
ఓ విద్యాలయం ఒంటరితనం.
గతాన్ని తవ్విపోసికొద్ది రాసులుగా
బయటపడే నిజాలు
గుట్టలుగా పేరుకుపోయి
మనిషిలోని అహాన్ని సమాధి చేస్తుంటే
జీవితం నల్ల కలువ.
మెల్లగా ముడుచుకొని
తెలుసుకొనే తెల్లని పొద్దులో
హృదయంలో మృదుకదలికకు
మాటలు నేర్పే తల్లిదనం సహనం.
ఆకారణ అసందర్భ వేళలో
నిరాదరణ నిప్పులా
నీడను హరించి
ఒక్క క్షణం
పిడుగులా నడినెత్తిన తాకింది.
వణికిన వర్తమానం
కాలిన ఒంటితో
ఒంటి కాలి పరుగుతో
ఒంటరిగా ఓటమి ఒడిని చేరి
రేపు ఉదయాన్ని శాసించే
ఓ కిరణమై ఎలా మెలాగాలో
ఓ పుంజమై ఎలా మెదలాలో
ఆ రాతిరి రేపటికి గురిపెట్టిన
బాణంగా మార్చి
ఓటమి ప్రేమతో కౌగిలించుకొని
నేర్పిన విలువిద్య ఆత్మస్థైర్యం.
తాకడానికి వీలుకాని జ్ఞానాన్ని,
పుస్తకలోకి నడచివెళ్లలేని సోమరితనానికి
చేరదీసుకోలేని విజ్ఞానం
ద్రావక రూపంలో
మెదడు పొరల్లో విస్తరించి
కళ్ళకు మెరుపులు పూస్తున్నాయి.
నాలుక నడక నేర్చుకుంది.
మనిషిలో మరో మనిషి విడివడి
అనుభవ భావజాలంతో
శుభ్రపడిన మనసులోని ప్రతి పొర
సూక్ష్మ ప్రశ్నలకు స్పందించే
శుభసమయంలో
మనిషి వేసి ప్రతి అడుగు శబ్దం ప్రపంచానికి ఓ శుభసంకల్పమే.
...
కాలం కఠినమైనదే...
కనికరం లేక కష్టపెడుతుంది
కాయ కష్టం చేసే కర్మశీలురని
మాటు గాసి కాటు వేస్తున్న
కాలం,కఠినమైనదే...
పచ్చటి పంటపొలాలపై
పగబట్టిన తుఫానై
కృషీవలుర ఉసురు తీస్తున్న
కాలం కఠినమైనదే...
తల్లిలాంటి పల్లెనొదలి
పొట్టకూటికై పట్నం వస్తే
కరోన కోరలతో విషం చిమ్మే
కాలం కఠినమైనదే...
పూట గడిపే పట్టణంపై
పెను తుఫానై ప్రవహించిన
కాలం,కఠిన మైనదే...
చక్కని కుటుంబానికై
చిక్కుల్ని మోస్తున్న
చిరుద్యోగుల కలల్ని,
కళల్ని కబలిస్తున్న
కాలం,కఠినమైనదే...
భావి తరానికి భరోసనిచ్చే
బాలుర పాఠాల్ని,
బాటల్ని బలిగొంటున్న
కాలం,కఠినమైనదే...
గమ్యానికి గీతలు గీసి
గురిని నేర్పే గురువుల
గుండెలని గాయపరిచే-
కాలం కఠినమైనదే...
.........................
(దినానికి వెలుగు-చీకటిలా
నాణానికి బొమ్మా-బొరుసులా
కాలం కమ్మనైనది
అందుకేనేమో
'కాలాన్ని నిద్రపోనివ్వను'
అంటూ
మా గురువు
గోపిగారి బాటలో
గమ్యాన్ని చేరేలా
ధైర్యానికి దారులు వేస్తూ
కాలాన్ని వెంటాడుదాం
కాలంతో పయనిద్దాం)
-
తను అస్తమించని సూర్యుడు
నిరంతరం జ్వలించే సూర్యుడు
కులం అర్ధం లేని పదం
అని తన కలంతో ఖండించిన వీరుడు
తను తిరుగుబాటుదారుడు
మాటే ఆయుధంగా
సమానత్వమే ధ్యేయంగా
అంటరానితనం అణిచివేత కార్యాలను
సమాధి చేసే దిశగా పయనించిన నెలబాలుడు
మతం హితం కాదని
జననం నుంచి పుట్టే ధర్మం
జన ఆరాధన పొందలేదని
జనియించిన వాడి పుట్టు పూర్వతరాలే అసమానతగా
అడ్డ గోలుగా అడ్డ గోడగా పెరిగే సమాజంలో
సామాజిక నడవడికతోనే నేల మట్టం చేయగలమని
ఎలుగెత్తి చాటి చెప్పిన గొప్ప తత్వ వేత్త
తను తిరుగుబాటు దారుడు
జననీ నుంచి పుట్టిన జన్మ
జన్మాంతం స్వేచ్ఛ కోరుతుందని అది దాన్ని హక్కు
ఆ హక్కు కోసం తన మరణాంతం వరకు పోరాడిన వీరుడు !
నీ కోసం ఈ రోజు ఒక రోజు
నవోదయాన్ని ప్రభవిస్తుంది
ఆ రోజు నిను చుట్టిన కుళ్ళు బూజు
విజయాదిత్యుని ప్రచండ ప్రకాశంలో
ముప్పై కుప్పలుగా రాలిపోతుంది
కుళ్ళును నల్లగ అల్లిన
కపట కుటిల జటిల సాలీడులే
చమత్కార చీమిడి ముక్కులతో
నీ విజయరుక్కుల స్పర్శకై
ఆరాటపోరాటాలు చేస్తాయి
అవి నీ యశః వాహినికి
స్వయం చోదకులౌతాయి
మనస్సు మానవతతో సాగనీ ఓ సోదరా!
జయోషస్సులన్ని నీలోనే జనిస్తాయి కదరా..
తుంటరి వేషాలేలరా నా రూపసీ!!
గోధూళి వేళ ఓ గోవర్థనా!! నీ జత గూడిన
సమయం రమణీయం, కాదా అది కడు కమనీయం....
భాషకందని భావమేదో అనుభూతి ఆయెను....
బరువుగా మైమరపుగా....
మాటలతో, పాటలతో, కురిసిన చిరునవ్వులతో
తడిసెను నా తనువంతా ఓ తాపసీ!!
హిమ సమీరమై చల్లగా మనసుని తాకావు....
మేనంతా మెలిపెట్టెను మలయమారుతరాగం....
అనురాగ రాగమై హృదయ వీణను మీటావు....
మది అంతా నింపేశావు మమకారపు మధువుతో....
JAN 2021
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు