మ్యూజియం వస్తువు కాదు
గొంగడి ఇప్పటికీ
మా యింట్లో వుంది.
దాన్ని చూసినప్పుడల్లా
గొర్రెల జ్ఞాపకాలు
మృదువుగా గుచ్చుకుంటాయి.
అడవి వాసనలు పరిమళిస్తాయి.
మా తాత సంగతి చెప్తా వినండి
గొంగడిని ఆయుధంగా మలిచి
ఎలుగుబంటిని తరిమికొట్టాడు
ఆనాటి వీరగాథలు
మా గూటిలో వెలిగే దీపకళికలు.
మా వూరి బాలుడు
చనిపోయినప్పుడు
గొంగడిలో చుట్టి
మోసుకెళ్లినట్టు గుర్తు.
చాలా రోజుల దాకా
అతడు మళ్ళీ లేచి వస్తాడని
ఎదురుచూసే వాళ్లం.
గొంగడిని కప్పుకుంటే
చలి భయం భయంగా
బయటనే తిరిగేది.
ఎంత మొండి ఎండైనా
కొంత సాధువైపోయేది.
వానచినుకులు
షవర్ధారల్లా జారిపోయేవి
అన్ని రుతువుల్లో తెరుచుకునే
అసితపుష్పంలా ఉండేది మా గొంగడి.
ఆకాశంలో మేఘాలు
గొంగళ్లలా పరుచుకుంటే
కింద బీరప్పలు ఆడుతున్నట్టు లెక్క.
ఎక్కడ వేసిన గొంగడి అక్కన్నే లేదు
దాని సంతానం
మంచుకొండల్లోని సైనికులను
ఉన్నికవచమై కాపాడుతుంది.
ఇవాళ గొంగడిలో కూర్చొని
వెంట్రుకలు కాదు
ఆత్మీయ ముచ్చట్లను ఏరుకుంటున్నాం.
నల్లని గొంగడిపైన
తెల్లని అంచు
కారుచీకటిలో
కాంతిరేఖలా వుండేది.
కొప్పెర వేసుకునే పెద్దాయన
ఎస్కీమో వేషం కట్టినట్టుగా వుండేది.
గొంగడి
తరం నుండి తరానికి
మొలకలు వారే నారుమడి.
చరిత్ర ఊటలూరే
బతుకుతడి.
‘పిల్లలూ!
గొంగడి పరుస్తున్నాను
రండి! కూర్చోండి!
ఏదీ ఇప్పుడు ఓసారి అనండి
Ba ba black sheep’
" Never ever seek for greatfulness from mankind, you shall always see ungrearfulness. Do what you must do as a solemn duty " --- Ernest Agyemang Yeboah
1.
ఇక్కడంతా ఇంద్రజాలం..
నమ్మకాల కనికట్టు..
కనిపించే మనిషి మాయమై
అంతలోనే కోరల్తో కనిపిస్తాడు.
స్నేహంగా చేయి చాచినవాడు
ఇంకో చేతిని కరవాలంగా దూస్తాడు.
సన్నగా కనిపించని కత్తివాదరకు
గొంతు తెగుతుంది.
తెగినట్టు అనిపించదు.
రక్తం కారుతుంది.
కారినట్టు అనిపించదు.
గుండె గాయమోడుతుంది.
గాయం ఎక్కడా గొంతు విప్పదు.
నీ ముందు ప్రపంచం నవ్వుతుంది.
వెనుక ముఖచిత్రం మారుస్తుంది.
ఎవ్వరెందుకు దగ్గరౌతారో
దూరమౌతారో అంతుపట్టదు.
ఎందుకో ఎలానో ఎవరూ చెప్పరు.
ఏ చిక్కుముడి ఎవరూ విప్పరు.
నీరేదో..పాలేదో చిలక్కొట్టేసరికి
ముప్పాతికపాళ్లు జీవితం జారిపోతుంది.
2.
చిన్న చిన్న విషయాల వెనుక
జీవితం దాక్కుంటుందంటారు..
ఈ ప్రపంచం మన ప్రపంచం కావడం
చిన్న విషయం కాదు.
మాలిమి అయిన ఏనుగు
ఒక్కోసారి క్రూరంగా తిరగబడినట్టు
క్రూరంగా పెడబడుతుంది ప్రపంచం.
పారే నీటి మీద
మంచు గడ్డ కట్టినట్టు
గడ్డ కట్టి వుంటుంది ప్రపంచం.
స్వార్థపు చెక్కు కట్టి వుంటుంది.
అప్పుడు అది
కన్నీటిప్రార్థనలకు కరగదు.
దానికి కన్నీరు కలుషిత పదార్థం.
అవసరమే దాని అత్యవసర లక్షణం.
3.
దయను అడుక్కోవడం
దయనీయం.
భిక్షపాత్రలో
ఒకింత ప్రేమకబళం పడటం
ఒక ఉత్సవం.
ఈ భూమిపొరల్లో అరుదుగా దొరుకుతున్న
మూలకం మానవత్వం.
మనిషి- సాటి మనిషి కష్టంపై
కంపించడం..స్పందించడం
ఇప్పుడు చారిత్రాత్మకం.
4.
మహా మహా మానవ హననాల తర్వాతా
మనిషి కాగడా వెలిగించాడు.
శవాల కుప్పల మీద నిలబడి
శాంతి మంత్ర జైత్రయాత్ర జరిపించాడు.
మళ్లీ మళ్లీ మొదలకంటా నరికేసినా
మళ్లీ ఓం ప్రథమం నుంచి
మొలకలా మొదలయ్యాడు.
అన్ని క్రూరత్వాల్నీ, కుత్సితాల్నీ
ఎదుర్కోవడానికి
ఒకడుంటాడు ఎక్కడో
దీపం పట్టుకొని -
5.
క్రూరత్వం
నీ సహజ గుణం కాదు.
నువ్వేసుకున్న పై ముసుగు.
ఏదీ శాశ్వతం కాదు.
నీ క్రూర నడత కూడా.
క్రూర ప్రపంచమా..
నీ క్రూరత్వంపై నువ్వే
తిరగబడే రోజు
తప్పక వస్తుంది.
ఉత్తరాది భారతంలో
ముసురు పడుతుంది
అది యెడతెర్పిలేకుండా
నెలలతరబడి కురుస్తుంది
యిప్పుడది
ప్రవాహరూపం దాల్చింది
అ ప్రవాహం సంఘీ టిక్రి ఘాజీ
సరిహదులగుండా
సుడులు తిరుగుతూ
టవర్లని కూలుస్తూ
యెన్నో అడ్డుకట్టలని
తొలుచుకొని
అనేక రౌండ్లని ఛేదించుకొని
అలుపెరగని ప్రవాహంగమారింది
కౌటిల్య షాలు
మను మోడిల పాచికలు
అ ప్రవాహాన్ని అపలేకపోతున్నాయి
యిప్పుడది
లక్ష కాలువ(నాగ)లై
రాజధాని వీధుల గుండా
పరేడ్ చేస్తున్నయి
నిజమైన రిపబ్లిక్ ను
ప్రజలకందించడానికి
-
(గణతంత్ర దినోత్సవం నాడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయలని ట్రాక్టలతో పరేడ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలుపుతూ రాసిన కవిత్వం)
ఇపుడు
నా ఇల్లు ఒంటరిది..
గుండె నిండా అలజడి ఉన్నా
గోడలు, కుర్చీలు అన్నీ
వెలవెల పోతున్నాయి
శబ్దాలన్నీ చప్పుడు మరచిపోయి
ఎక్కడికక్కడ మౌనంగా ఉన్నాయి
అదేం చిత్రమో కానీ..
మినుకు మినుకు మనే తారల్లా
వచ్చేవారంతా మెరుస్తున్నారు సరే!
కాకుంటే వేదనల్ని మోసుకొస్తున్నారు
కన్నీళ్ళను ఒంపి వెళ్ళిపోతున్నారు
నాకు తప్పదు కదా!
వారు వెళ్ళాక నా ఓర్పు పరదాతో
మరకు నా మనసుకు అంటకుండా
అంతా శుభ్రం చేసుకుంటూ ఇకపై...
ఎవరూ రానివ్వకూడదు అని
నాకు నేనే ఓదార్చుకుంటున్నాను.
వచ్చినా తలుపులే తెరవకూడదనుకుంటున్నాను..
తెల్లవారితే మళ్ళీ తలుపు తెరవక తప్పదు..
తలుపుకు తడి అంటక తప్పదు అన్నట్లు
మళ్ళీ రేపటి సరికొత్త ప్రయాణం..
మళ్ళీ ఆహ్వానాలు . మళ్ళీ అదే తంతు..!
వచ్చేవారంతా పంచుకునేవారే పాపం!
కాకుంటే ప్రపంచాన్ని పంచుతున్నారంతే!
సమాజంలోని అసాంఘిక సంఘటనల్ని..
కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న కన్నీటి కధల్ని
తెలుసని చెబుతున్నా పరిచయం చేస్తున్నారు
నేనేం చేయగలను..?
ఆ కథన్నింటినీ ఒక దృశ్యకావ్యంగా మార్చి
మళ్ళీ ఆ కథల్ని కనిపించే సమాజానికి అందిస్తున్నాను.
విన్న కథే అని తెలుస్తున్నా పిచ్చి సమాజం..
మరచిపోయి కన్నీరు పెట్టేస్తున్నారు..
ఎందరో చూస్తున్నారు. వింటున్నారు
అరచేతుల్లో దాచుకున్న గుండెను
ఎంతో భారంగా మోస్తున్నారు
సమాజాన్ని తప్పించుకోవానుకుంటూ
ఇంటి గడియలు వేసుకుంటున్నారు..
ఉదయం తులుపులు తెరవక తప్పదు..
ఎవరో రాక తప్పదు..
కాకుంటే ఆ వచ్చేవారేదో
ఒక శుభవార్తను అందిస్తే బావుండు..
ఒక చిరునవ్వును కానుకగా ఇస్తే బావుండు..
అందుకే నా ఎదురుచూపు..
గుండె ఒంటరిదైనా పర్వాలేదు..
ఇల్లు ఒంటరిది కాకూడదు కదా..!!
ఇంటి తలుపుల్లో శూన్యత కనిపించకూడదు కదా ..
నెత్తురోడుతున్న మొక్కకు
పూసిన ఎర్రని గాయంలా
ఉంటుందామె
దిగులు మబ్బేసిన ఆకాశానికి
వేళ్ళాడే గుబులు మేఘంలా
ఉంటుందామె
తుపాను కమ్మేసిన కడలిలో
చిక్కిన విరిగిన పడవలా
ఉంటుందామె
ఉప్పెన ఊడ్చేసిన పంటపొలంలో
కొనఊపిరితో మిగిలిన
వరికంకిలా ఉంటుందామె
ఎలా ఉన్నా
ఎన్ని కల్లోలాలను
సంక్షోభాలను మోస్తున్నా
తన పసిప్రమిదలలో
వెలుగును నింపడానికై
ధైర్యపునీరు తాగుతూ
పిట్టలు వాలిన
పచ్చని చెట్టులా నిలబడుతుందామె
.....................................
పొగతో పగ చిమ్ముతూ,
మబ్బుల్ని చెదరగొట్టి మేడలు కట్టింది.
కొండ పక్కకు ఒత్తిగిల్లే వెలుతురు బాతును
విస్తరణ కత్తి వేటుకు బలి చేస్తూ,
ఏటా చెరువుగట్టు ను తవ్వి తవ్వి నవ్వింది.
అల్లిబిల్లి తీగెల చిట్టి అడవిని
కాస్త కాస్త చప్పరించి చదరాలుగా కోసింది.
ఒద్దన్నా వచ్చిపడే అవసరం నగరం.
పరువు పాచికలాడించి
ఊడిగం చేయించే జూదగృహం.
ఆశల కర్మాగారం లో పుట్టిన కృత్రిమ ఆటబొమ్మ.
తనను సృష్టించిన మనిషినే,
విలాసాల కలలతో స్నేహం చేయించి,
భ్రమల పందేరంలో దేహాన్ని
బేరం పెట్టమంటుంది పట్నం.
పక్క వాడిని తొక్కి మరీ 'పైకి' లేచే
పోటీ పరీక్ష ఇక్కడ చట్ట బద్ధం.
మోసం,మోహం కలనేసిన మలిన వస్త్రం.
ఆకాశాన్ని మోసే ఇరుకు గదుల్లో,
ఏమెరుగనట్టు అడ్డంగా పడుకునే కొండచిలువ
పుట్టిన కొన్నాళ్ళకే తప్పిపోయి
అవినీతికి అమ్ముడు పోయిన ' చీకటి కవల' నగరం.
పల్లె బావుండేది.
"పిన్నీ ,వదినే" , "చంటోడా,నడిపోడా " అంటూ, కూరిమి తో సుఖం,దుఃఖం పంచుకునేది.
ఒక చిన్నారి పురిటి కేక ను పండుగ చేసుకుని,
ఒక మరణాన్ని మదిలో మోసి
మూకుమ్మడి పస్తు పడుకునేది.
అనుబంధం విరబూసే వనం పల్లె.
ఇప్పుడిలా నగరం ఆవలి ఆవరణలో
కుండీలో మరుగుజ్జు మర్రి లా మిగిలింది.
నీ కోసం
పాటుపడతాను
పాట కడతాను.
-----------------------------------
నిన్ను చూసి..
కలం కవితల జల్లై కురిసిపోతుంది
మనసు హరివిల్లై విరిసిపోతుంది.
-----------------------------------
నీ తలపుల వానలో తడుస్తూనే ఉన్నాను
మరి
నీ వలపుల కోనలో ఎప్పుడు విహరిస్తానో?
-----------------------------------
చూపు చురకత్తిలా దూసుకెళుతుంది
కలం విచ్చుకత్తిలా ఎగిసిపోతుంది.
----
గ్లోబును చుట్టి వచ్చే
ముచ్చటున్న యువకుడా...
వెళ్లే దారిలో
దీనంగా కూర్చున్న కాలి
కడుపును చూస్తూ కూర్చోకు..
అలగాని ఆ కడుపునా
నాలుగు మెతుకులు
పడేసి ఉత్త చేతులు దులుపుకోకు..
ఆ ఆకలి కడుపును,
దీనమైన చూపులను
తట్టి చూడు
నీవు చూడాలనుకున్న
ప్రపంచపు అగాధం
కనిపిస్తుంది..
"ఆకలి రాజ్యం"
విసురుతున్న సవాళ్లు
వినిపిస్తాయి..
బ్రతుకు బండి పై
"మృత్యువు"
చేస్తున్న విలయతాండవం కనపడుతుంది..
సముద్రాలు సైతం
సరితుగని "కన్నీళ్లు"
అనునిత్యం ప్రతిధ్వనించే "ఆర్థనాదాలు"
వికసించే మొగ్గలను
సైతం చిదిమేస్తున్న
"వికృత చర్యలు"అన్ని
దర్శనం ఇస్తాయి..
మిస్టర్ రైడర్..
వీటన్నింటినీ చూశాక
ని దిశ ఇవే నిర్ణయిస్తాయి..
చీకటిని పారదోలే సూర్యోదయం వైపు..
- 19/01/2021
పచ్చని పైరులపై
నులివెచ్చని కాంతులతో
బంగారాన్ని అద్దుతూ
ఉదయిస్తున్నాడు
పల్లెల్లో సూర్యుడు
పండు వెన్నెల బద్ధకపు
పొరలకు వీడ్కోలు చెప్తూ
ఒళ్ళు విరుస్తున్నాడు
భానుడు
దుప్పటి సందుల్లోంచి తొంగి చూస్తూ
వెచ్చని స్పర్శను
శరీరానికి అందిస్తూ
పల్లెను తట్టి లేపుతున్నాడు
అరుణుడు
కుంచెకు రంగులు అద్దుతూ
సూర్యోదయ పల్లె అందాలను కాగితంపై భద్ర పరుస్తున్నాడు
ప్రకృతి చిత్రకారుడు
మౌన పోరాటం
మనుగడకై ఆరాటం మౌన పోరాటం...
అలుపెరుగని అలల సవ్వడుల ప్రేమసాగరం ...
రెప్పలమాటున దాగిన సుడిగుండాల కల్లోలం....
సంతోషాల ముసుగు ధరించిన బడబానలం...
కన్నుల వెన్నెల కురిపించే కాంతి సమీరం...
నట్టింట్లో నడయాడే పసుపుకుంకుమల పరాగం...
నందనవనాన్ని తలపించ విరబూసే మల్లెల సుగంధం...
లోకాన్ని లాలించ వర్షించే ఆషాడమేఘం ...
మనసులు మలినాలు కడిగే నిప్పుల వర్షం ....
FEB 2021
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు