కవితలు

కవితలు

చేయాల్సింది సమీక్షే ...

చేయవలసింది

ఉత్సవం కాదు

చేయాల్సిందిప్పుడు

సమీక్ష...

 

గతానికైన

గాయాన్ని

వర్తమాన

శిక్షని

భవిష్యత్

బాధని

 

సవివరంగా

చేయాల్సిన

సమీక్ష

 

అజ్ఞాన తాయత్తు కట్టి

జోగిని బసివిని మాతంగుల జేసీ

దేవుని కుతి దీర్చమంటూ

అందాల ఆటబొమ్మల జేసీ

కార్పొరేటోడికి తాకట్టుపెడుతూ

రంగు రంగుల ముగ్గుల్లో

విషపు పొగల

క్లబ్బుల్లో పబ్బుల్లో

ఉక్కు గొలుసులతో

బంధించి

ఉత్సవానికి పిలుస్తారు

 

మీరు వెళ్ళకండి...

మహిళ బతుకు కాదది

 

అవనియంత పరిచి

ఆకాశమంత పొగిడి

పాతాలానికేసి తొక్కుతారు

జర పైలం....

 

కొత్తగా పుట్టింది కాదిది

మనువాద పితృస్వామ్యం

నీపై చేసిన ఆధిపత్యం

కత్తుల్తో చర్మమొలిచినట్టు

హక్కులన్నీ ఒక్కటొక్కటిగా

కాల్చేసింది పూడ్చేసింది

 

కట్టు కథలు కుట్ర కథలు

రోత పురాణాలు

పతివ్రత మంత్రమేసి

పరువును ఆపాదించి

గడప దాటకుండా

సూదిమొనల గీత గీసింది

 

బాల్యంలో

తండ్రి దగ్గర

యవ్వనంలో

భర్త దగ్గర

వృద్ధాప్యంలో

కొడుకు దగ్గర

బ్రతుకంతా

మగాడి బ్రతుకు కిందాని

ఆదేశించింది

 

కన్యాశుల్కం

సతీ సహగమనం

వితంతు విహహ రద్దు

దాసీ వ్యవస్థ

ఒక్కటి కాదు లెక్క లేనన్ని

దురాచారాలు...

తీసిన ప్రాణాలు

ఏ మట్టిని తాకినా చెప్తాయి

 

తరాల కాలగమనం జరిగింది

ప్రాణమొక్కటే మిగిలినప్పుడు

పోరాటమే సరైంది...

ఎందరో వీరవనితల పోరు ఫలితం

ప్రపంచ స్వేచ్ఛా పోరాటం...

నియంతల పాలననణిచి

శ్రమ దోపిడి లేని

ఎట్లాంటి భేదాలే లేని

అందరూ సమానంగా బ్రతికే

ప్రజా స్వపరిపాలనకోసం

త్యాగాలు కోకొల్లలు

 

మహిళా ప్రత్యేక చట్టాలు

చుట్టూ రక్షణ వ్యవస్థ

శాస్త్ర సాంకేతిక వృద్ధి

అన్నీ రంగాల్లో భాగస్వామ్యం

 

 అయినా ఏం మారింది

 

పట్ట పగలే పసిపిల్ల మొదలు

పండు ముసలి పై అత్యాచారాలు

అక్షరాస్యత ఎంతున్న

మనువు మూర్ఖత్వం తలకెక్కిచేసే

గృహ హింస వరకట్న వేధింపులు

వేల సంవత్సరాల ....

దురాచార పర్వమింకా వేటాడబట్టే

 

ఎంత చెప్పినా

ఒడువని దుఃఖమిది

ఆడజాతిని అమాంతంగా

అంతంచేసే కుట్రలు

పురుషాధిపత్యం అణిచేసిన

బ్రతుకులు ఏమని చెప్పగలం?

 

తల్లీ... జర పైలం

ఉత్సవం కాదిప్పుడు

చేయాల్సింది

సమీక్ష...

శ్రామిక మహిళా

పోరాట చరిత్ర సమీక్ష...

స్త్రీ పురుష సమానతకు

చేయాల్సిన సమీక్ష

 

 

కవితలు

పోయెట్రీ టైమ్ – 10

నే రాసుకున్నాను మహాకావ్యం

నీ జ్ఞాపకాల సిరాతో..

   ------

నీ ఊహల్లో నేనుంటే చాలు..

ఇక నా ఆనందానికి అవధులు లేవు

స్వర్గలోకాల సంతోషాల నిధులు నన్ను దాటిపోవు.

    ------

నీ కన్నుల గూటిలో వెన్నెలదివ్వెల వెలుగులెన్నో?

నీ కమ్మని గొంతులో ఝుమ్మని తుమ్మెద రాగాలెన్నో?

    ------

నిలబడి చూడు నీలోని నీవు తెలుస్తావు

కలబడి చూడు ఈ లోకం లోతు చూస్తావు.

   ------

అనురాగ జలపాతమై నా ఎదలో దూకుతావా?

అనుబంధ సుమగీతమై నాలోన పలుకుతావా?

 

 

కవితలు

ఆ ఇల్లు

అమ్మ నాకు చేదు నచ్చదని
మాటలన్నీ తేనెలో ముంచి
తియ్యగా అందించేది

కాళ్ళు నొప్పెడతాయని
భుజాల పల్లకి ఎక్కించి
ఊరేగించేవారు నాన్న

నా కళ్ళలో కాస్త నీరొస్తే
వారి కనులు జలపాతాలయి
కిందకు దూకేవి

నేను సీతాకోకై ఇల్లంతా
కలదిరుగుతుంటే
ఆ రంగులన్నీ గుండెలకద్దుకుని
కేరింతలు కొట్టేవారు

నా రెక్కలకు స్వేచ్ఛనిచ్చి
పావురంలా ఎగరేస్తూ
ముద్దు చేసి మురిసి పోయేవారు

నాకు నలతగా ఉంటే
కలత దుప్పటి చుట్టేసుకుని
నీరసపడి నలిగిపోయేవారు

చదువు సంధ్యలతో పాటు
చక్కని వ్యక్తిత్వాన్ని అందించి
ఆనందపుటంచులు తాకి
తెగ పొంగిపోయారు

నన్నొక ఆశాదీపాన్ని చేసి
ఇల్లంతా వెలిగించి మైమరచిపోయారు

కానీ ఇక్కడంతా
చీకటి చేదుతో నిండిపోయి
మనసంతా
ముళ్ళగాయాలతో రక్తమోడుతూ
బాధతో ప్రవహిస్తున్నా
ఇక అదే నీ ఇల్లంటూ
నిర్దయగా
వదలి పోయారెందుకు? 

కవితలు

శబ్దించడమే ఇష్టం

పచ్చని జీవన చిత్రాన్ని

గీసుకున్న ప్రతిసారీ

నువ్వు నలగగొడుతుంటే

నీ అడుగుల పీఠం కదిలేలా..

అతను డప్పుకొడతాడు

 

ఆకలిని కెలకడమంటే

అదో సరదా నీకు

వెక్కిపడ్తున్న జీవనాలంటే

వెక్కిరింత నీకు

 

పొదివి పట్టుకున్న 

పట్టెడు బతుకుదెరువులను

పదే పదే లాక్కుని

బతుకులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిలించిన

 

నీ అహంకార అణువణువునా

అదురు పుట్టేలా.. 

శబ్దించడమంటే అతని కిష్టం

 

అనాదిగా..అలవాటుగా..

పగులగొట్టి బడిన

ఆత్మాభిమానపు ముక్కల్ని 

ఆర్ద్రంగా మూటగట్టుకుని

పొంగుతున్న ఆవేశాకాశాన్ని

డప్పుగా చేసుకొని

దిక్కులన్నీ తోడుతెచ్చుకుని

విశ్వమంతా వినిపించడమే అతనికెంతో ఇష్టం

 

 

 

కవితలు

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి...

అలలు ఎగసి ఎగసి

ముందుకు పడితే

చూసే కంటికి ఆహ్లాదం

అదే అల తిరిగి వెనక్కెళ్లి

రెట్టింపు వేగంతో ముందుకొస్తే

అది అంతానికి ఆరంభం...

 

జీవితం అనేది

రైలు ప్రయాణం లాంటిది

అది ఒకడి కోసం ఆగదు

ఒక్కడున్నాడని ఆగదు...

 

ఆకలేసి, కేకలేసి

ఏమిచేయక చేయి చాచే

ఇంతలోనే చెంపమీద

రెప్పపాటు నెప్పిపుట్టే

జాలిలేదు, దయలేదు

మనిషికసలు విలువే లేదు,

మార్చవయ్యా మనిషిని మాయమయ్యేలోపల...

 

నడిసంద్రాన మనిషి

జాడేలేని ప్రదేశమా,లేక

చుట్టూ వంద మందితో

నిండిన సమాజమా

ఎవ్వరికెవ్వరు ఏమీ అవరు రామా!

ఇలాగే ముందుకు సాగి పోదామా?

ప్రశ్నించే గొంతులు మాయమైతే

సమాధానం ఇచ్చేదెవ్వడు...

 

 ఇది కాదా రాజరికానికి

 ప్రత్యక్ష ఉదాహరణ

ప్రశ్నించిన వాడిపై

తప్పని దండన...

 

ఇది మారాలి...

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి...

 

కవితలు

కృంగి కృశించి పోయిన నడక నేర్పిన పాఠం

కృంగి కృశించి పోయిన నడక నేర్పిన పాఠం

నాటకమే నా జీవితమనిన వేశా

నడవలేనీ అందెల చెంతకు చేరెనా ఈ

నిండు జాబిలి వెలుగులు

నివ్వెర పోయిన కలువలు

జాలువారిన చిరు జల్లులు

జగడమే పోరు వారిన పాదపు స్పర్శనాళాలు

జీవనమే జగడమని ఓర్చుకున్నా పరువాలు

 

జాలి లేని బాటసారి పాదం నైతి

ఓర్పు లేని కాలి అందెల నైతి

 

పసిడి పండిన నేల ధూళి నా బంధువైన వేళా

పరుగులు తీసీన పసిడి పతకపు గెలుపులలోనా

 

బరువునైతి, బంధువునైతి

బాధ్యతనైతి నీ భరోసానైతి

 

కవితలు

రోదనలు...

మినుకు మిణుకుల

మెరుపులు

ఉడికి ఉడకని

కూడులు !

 

కంటతడి ఆరని

రోదనలు

విలపిస్తె తీరని

బాధలు !

 

మరవని జ్ఞాపకాలు

కైనీడలై వెంటాడే

చిహ్నాలు !

 

గుడిసెలోని గుడ్డి దీపం

గాయాలతో మూలిగే

వృధ్యాప్యం !

 

కాటికి ఎరుకైన బంధం

తోడును వీడటమే ధర్మం

దుర్భరమైన జీవితం

ఎందుకింత నరకం !

 

పాప పుణ్యాల క్షేత్రం

ఎరుక లేదు ఎవ్వరికి

వాస్తవం !!

 

                            

కవితలు

అంటరాని ఆయుధం

నేనో ఆత్మగౌరవ పోరాటాన్ని

ఏ చరిత్రా నన్ను చూపించని

ఏ చరిత్రా నన్ను ఎత్తుకోని

అంటరాని ఆయుధాన్ని

నేను ఇప్పుడు మీకు

తెలియక పోవచ్చు

కానీ....

ఒక్కసారి చరిత్ర తలుపులు

తీసి చూడండి

బానిసత్వపు బందనాలను

కాల్చుతున్న బందూకునై

కనబడతాను

ఎల్లలుగా ఎగిసిపడ్డ

రక్తపు టేరులనుంచి

పిడికిలెత్తిన ఫిరంగినై

కదిలిన ఓ ధిక్కార స్వరాన్నై

వినిపిస్తాను

నీ కంటూ మనసుంటే

రా.....

చుట్టూ కంచెలను

పటా పంచలు చెసి

ఒకసారి మనసారా

నన్ను హద్దుకో...

 

కవితలు

మనసును వేలం వేసినా....

ఆ ఒక్క చూపు
నాలో పెట్టిన పుటానికి
సెగలు తొడిగిన అర్ధాలను
రవ్వలు రువ్విన బంధాన్ని
మనసు మిరుమిట్లగొల్పిన వింతల్ని
మడతేసి ఎంత అడుక్కినెట్టినా....

నాలుక నడివీధిలో
పరుష పదజాలపు పలకల కింద
చీకటితో అర్థాన్ని పూడ్చి సమాధి చేసినా..

నిర్లలక్ష్యపు నిప్పులలో
ఆశను కాల్చి మసిచేసినా
కసిగా కళ్ళు దృశ్యాలను
కసిరి నేలకేసికొట్టినా...

ఆ ఒకే ఒక్క చూపు
రక్తాన్ని ఏతమేసి తోడటం మానలేదు...
ఎర్రగా తడిసి ఏ జ్ఞాపకం ఆరడంలేదు.
ప్రతి అనుభవం అర్దరాత్రి చీకటిని ఉదయస్తుంది.

ప్రవహించే మాటల్లో తేలాడే
ఊహలు గురిచూడటం మానలేదు.
ప్రసరించే భావాల్లో పారాడే
ఊసులు గుచ్చుకోవడం ఆగలేదు.

వెచ్చని శ్వాసనాళంలో
పచ్చని ధ్యాస దారులలో
మనసును ఒడిసిపట్టి
వడగొట్టిన భావాలని ప్రశ్నలుగా
బతుకును వెలకట్టి సంధిస్తే....

జీవితమంతా తాకట్టు పెట్టి
మనసును వేలం వేసినా
తీరని బాకీలా బంధంలో
తరగని వడ్డీలా అనుబంధానికి
లోపల కొలువైయున్న నీ ప్రేమకు బానిసనై ఋణపడే ఉన్నాను


 

కవితలు

మెరుపులు

        1

తనువులు వెరైన

పురుడోసుకున్న గర్భగుడొక్కటే

అమ్మబంధమైన అవనిన 

తోబుట్టువు అనుబంధమొక్కటే

           2    

బాల్యాన తోడుండెను

తొలి నేస్తమై

పేగుబంధమే పంచుకునేను

రక్త సంబంధమై

           3

కలిమిలేముల లోన

అర్డంగి తోడుండును

నీవే తన

జగమై బ్రతికేను

          4

కన్నవారిని నీకై

విడిచిన త్యాగము

ఎన్నడూ వీడని

ఏడడుగుల బంధము

           5

అడజన్మను ఎత్తటమే

అమ్మాయి పాపమా

తనూ అమ్మే

తెలుసుకోలేని లోకమా

           6

చట్టాలెన్ని తెచ్చిన

మారేటి పరిస్థితులెన్నడో

ఆడవాళ్లకు రక్షనిచ్చిన

కాలము ఏనాడో

 

 

 

ఈ సంచికలో...                     

APR 2021

ఇతర పత్రికలు