చినుకులు పలపలా రాలగానే
చెట్టు వొళ్ళంతా పులకరిస్తుంది
ఆకుల చేతివేళ్లు సంగీతం మీటుతాయి
కొమ్మలు నాట్యం చేస్తాయి
చిగుళ్ళు హాయిగా కళ్ళు తెరుస్తాయి
కొమ్మారెమ్మా రాగమందుకుంటాయి
మొగ్గలు పూల చిందులేస్తాయి
చెట్టు వేళ్లకు నీటి లేఖలు రాస్తుంది
వేళ్ళు ఒళ్ళు విరుచుకొని నిద్ర లేస్తాయి
నీటిని ఆబగా ఒంటి నిండా పీల్చుకుంటాయి
కాండాన్ని తట్టి లేపుతాయి
వయ్యారంగా లేచిన కొమ్మలకు
నీటి పిలుపులు పంపుతాయి
కొమ్మలేమో రెమ్మలకు నీటిని జాలువారుస్తాయి
ఆకులేమో రెమ్మల నుండి
నీటికి ఆహ్వానం పలుకుతాయి
నోళ్లు తెరిచిన హరితం
మత్తుగా ఒక్కో గుక్క వేస్తుంది
సూర్యుడిని ఆహ్వానించి
కిరణాలు వెలుతురు సంతకం చేస్తాయి
చల్లని గాలి తెమ్మెర మెల్లగా చెంత చేరుతుంది సమిష్టిగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి
చెట్టంతా హరితవనం పండుగ అవుతుంది
చిగురు నుండి వేరు వరకు వాయిణాలు పంపుతుంది మొగ్గలు విచ్చుకుని పూల బాసలు చేస్తాయి
రంగు రంగుల రెక్కలు వాలు చూపులతో
తుమ్మెదలను రారమ్మని పిలుచుకుంటాయి మధురమైన మకరందాన్ని పీల్చుతూ ఉంటే
పువ్వు మధురోహల్లో తేలిపోతుంది
పోతూపోతున్న తుమ్మెదకు పుప్పొడి వెల్ల వేస్తుంది వనమంతా పంచుకుంటూ తుమ్మెదలు రాగాలు తీస్తాయి
పువ్వులు కాయలవుతాయి
కాయలు పండ్లవుతాయి
చిలకల గాయాలకు పులకించి పోతాయి
చెట్టు విరగ కాస్తుంది
కొమ్మలు ఒళ్ళొంచుతాయి
రారండహో అంటూ వనానికి చాటింపు వేస్తాయి పక్షులు ఎన్నో గూళ్లు కట్టుకుంటాయి
చీమలు బారులు తీరుతాయి
పురుగు లెన్నో పాక్కుంటూ వస్తాయి
మనుషులు ఆశల పల్లకీ ఎక్కుతారు
జగమంతా చెట్టు చుట్టూ చేరి ఆకలి తీర్చుకుంటుంది
ఎప్పుడు
ఎక్కడ
ఏం జరుగుతుందో
అర్థం కాని పాడు కాలం వచ్చింది.
ఎవరిని
ఎలా
కోల్పోవాల్సి వస్తుందో
తెలియని స్థితి నెలకొంది.
ఇప్పుడు
మనసుకు కొంత హాయి
ప్రశాంతత
మనో ధైర్యం కావాలి.
****
మనుషిని మనిషి
కలవలేని రోజులొచ్చిన
మనసుకు కాసింత
మనోధైర్యం చెప్పే
మానవత్వం ఉన్న
మనిషితనం కావాలి
*****
ఇప్పుడు కాసింత
మనోధైర్యం కావాలి
అమ్మలా
లాలించె
ఆప్యాయత
నాన్నలా
వెన్నుతట్టి లేపే
ధైర్యం
స్నేహితులా
ఏదైనా
కడ దాకా
తోడుంటామని
చెప్పేవాళ్ళు కావాలి.
స్వస్థత సాధించడానికి
ఏలికలకు కనువిప్పు కలిగించే
కదణరంగం ఒకటి నిర్మాణమై ఉండాలి.
(కరోనా రేపిన కల్లోలంలో మనుషులకు కాసింత మనోధైర్యం కావాలని వారికి అండగా ఉన్నదామని.....)
బేపారంతో బత్మనీకచ్చిన బేయిజ్జతుగాళ్ళు
మన కంట్లెనే మన యేలు తోటే...
ఇస్సీ...! నంబకరాలు
తల్లిరొమ్మును గుద్దిన బేయిమానుగొట్టోళ్ళు
తెల్ల బంగారం, నల్ల బంగారం
అస్లీ బంగారమే కాదు, సకులం బాండువలకు బాండువలు
బొత్తిగ తెప్ప దాటిచ్చిన బట్టేబాజ్గాళ్ళు
కుటీర కార్ఖానాల కుంటువడగొట్టి
నకిలీ కొడుకుల దోప్కమే దోప్కం
మన గడ్డ మీదనే మనం పరాయోల్లం.
మన కట్టు, మన బొట్టు, మన జుట్టు
మన బోనం, మన మానం, మన పాణం
తెల్ల రక్కసులకు పరవా నహీ
పుల్లరి పితూరీల పయి
సలసల మసిలిన మజ్ఞారి మజ్జ
పరాయిపీడకులను ఉప్పు పాతరేయంగ
ఉరికొయ్యన ఉయ్యాలలూగిన ఉయ్యాలవాడ
కండ్ల ముందటే కన్నతల్లి వలపోత
పటపట పాలాలేగిన పండ్లు
చిటపొట నిష్కలయి దుంకిన కండ్లు
తుది నెత్తురు బొట్టు వడిసే దనుక
తెల్ల తోడేండ్లను తెగ నరికిన మణికర్ణిక
తంతెలకనంగ ఎట్టిసాకిరిల కట్టు బాంచె బత్కులు
చావలేక బత్కలేక తల్లడం మల్లడమాయే.
మా తాత ముత్తాతల తండ్లాటకు
త్యాగమే దారి దీపమయ్యింది
పదునెక్కిన గోండ్వానా పరగణం
బరిసెలు బరిల నిల్సినయి
విల్లంబులు విహంగాలయినయి
ఉరితాళ్ళను పేనిస వెయ్యి ఊడల మర్రి
దోపిడీదారుల్ని మార్చడమే కాదు
దోపిడీ నుండి విముక్తం కల్పించాలన్న
భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్గురుల బలిదానం
చిలచిలా నెత్తురు చిల్లి భాసిల్లినా
ముల్లును ముల్లుతోనే తీయాలన్న అల్లూరి ఆశయం.
మావా నాటే మావా గావ్
గొంతు పల్గొట్టుకొన్న జల్, జంగల్, జమీన్లు
కొదమ సింగపు కొట్లాట
ఆదివాసీల ఆత్మ గౌరవ పతాక.
బ్రిటీష్ రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్ దాడులు
దొడ్డి కొమురయ్య దుడ్డుకర్ర మోతలు
చాకలి ఐలమ్మ రోకలిబండ పోటులు
షోయబ్ ఉల్లాఖాన్ ఆజాది రాతలు
షేక్ బందగీ ఖానూనుకై లడాయి
మహ్మదాపూర్ల మారుమోగిన గుట్టలు
భూమి కోసం భుక్తి కోసం
వెట్టి చాకిరి విముక్తి కోసం
సాగిన రైతాంగ సాయుధ సమరం
ఇసిరెలు పసిరెలు మర్లవడ్డయి
అతారెలు పతారెలు తిరగవడ్డయి
గడీలు గజగజ వనికినయి
బూసాములు బుజబుజ వోసుకున్నరు
ఊరూవాడా కో... అంటే కో... అన్నయి
రజాకార్లను తరిమికొట్టినయి
నిజాం పాలనకు గోరీ కట్టినయి.
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
తెలంగాణ అమరవీరులకు జోహార్లు!
యంత్రస్పర్శ
పెదవులకు తాళాలు బిగించి
తాళంచెవులను
జేబులో వేసుకుని పారిపోతోంది
అటు చూడకండి
చూసినా చూసీ చూడనట్టే
మీ చీకటిగుహలలో దూరి
ముసుగుతన్ని గుర్రుపెట్టండి
పసిపిల్లాడి చేతులలో
పాలసీసా లాగేసి
నోటి నిండా
అర్జంటుగా టెక్నాలజీని కుక్కండి
లేకపోతే వాడు రేప్పొద్దున్న
ఏ నదినీ ఈదలేడు
అయ్యో అలా వెనకపడి ఉన్నారేమిటి
అందరినీ అనుసరిస్తూ
పరుగుపందెంలో పాల్గొని
ప్రపంచపు అంచులపై
అడుగిడాలని లేదూ
అదేమిటి
చెట్టునూ కొమ్మలపై పిట్టలనూ
అమాయకత్వంతో
తదేకంగా చూస్తున్నారు
అరచేతిలోని జానెడు గాజుపలకకు
చూపులను వేళ్ళాడదీసి
మునివేళ్ళతో ప్రయాణించి
తడిలేని తీరాలని
తాకాలని లేదూ
సముద్రాలూ నదులూ
పర్వతాలూ ఆకాశాలూ
అన్నిటినీ మీ గుప్పెట్లో బంధించి
లోకాన్ని జయిస్తూ
మురవాలి కదా
మీరింకా
పాతచింతకాయ పచ్చడిలా మిగిలితే
ఆదిమానవుడంటూ
వింత జంతువంటూ
జూలో బంధించేస్తారు జాగ్రత్త
మీలోని పూలతనాన్ని
మనిషితనాన్ని పాతేసి
త్వరగా మరబొమ్మ బట్టలు తొడుక్కుని
కన్నీళ్ళకూ ఆనందభాష్పాలకూ
ఒకే కవళికలను
ముఖమంతా పౌడరులా పూసుకోండి
నరనరాలలో రక్తాన్ని తోడేసి
సిగ్నళ్ళూ ఫైవ్ జీ లూ
సెలైన్ లా ఎక్కించుకోండి
మీరు పూర్తిగా
యంత్రస్పర్శతో వికసించాకే
మీకిక్కడ మనుగడ దొరుకుతుంది
మీ జీవితం
లేటెస్ట్ గా మెరుస్తుంది
ప్రాణ త్యాగమే
మన సమస్యకు పరిష్కారమా?
సమస్యకు దీటుగా
సమీక్షించు ఎదురించు
హక్కుల కోసం పోరాడు
పరిష్కార మార్గం వైపు
బాటలు వేయ్...
తల్లిదండ్రుల కడుపు కోత మిగిల్చి
స్నేహితుల చెలిమిని వీడి
ఏమి సాధించావ్ మిత్రమా...
చరిత్రను సృష్టించాలి తప్ప
చరిత్రలో తనువు చాలించి ఆగిపోకూడదు
నీలా...
ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైజం ఉండాలి
చెడును విమర్శించే ధోరణి ఉండాలి
కానీ,
విమర్శనకు ఆకాశంలో నిచ్చెనేసి నిరాశవాదిగా
నీ ఆశయాలను విస్మరించి
ప్రాణ త్యాగం చేసే వైనం ఉండకూడదు
మహా అయితే చార్ దిన్ కి దునియా హై
దునియా మే దునియా దారి సీఖో
జీవితంలో జీవించు
సచ్చి సాధించేది
ఏది లేదు మిత్రమా...
నిరాశ నిస్పృహలే మిగులుతాయి
బ్రతికి జీవించూ
తల్లిదండ్రుల ఆశలకు నీవే ఆయువు అవుతావు
నిరాడంబరమైన జీవితంలో
గుండె ధైర్యంతో
ఆలోచన వివేచన శక్తితో
సహనం పాటిస్తూ
సౌమ్య హృదయంతో
జీవితంలో ముందుకెళ్లాలి మిత్రమా....
కన్న తల్లిదండ్రుల కలలకు కడుపుకోత మిగల్చకు
ఓ నిరుద్యోగి బలిదానాలు వద్దు
బ్రతుకు బాటలో ప్రయాణం చేద్దాం
నేటి సంఘటన
నా హృదయాన్ని కదిలించింది
నా గుండె బరువెక్కింది
జాలువారే కన్నీటి చుక్క
సిరా చుక్కై
నా మనసులోని భావాలను
నోట పలికించి
కలంతో కదిలించింది
సునీల్ నాయక్ కి జోహార్లు చెప్తూ
ఈ సందేశం నా మిత్రులకు అంకితం...
చెలికి చేదు అనుభవం
మదికి మాలిన్యం, తనువుకు తూటా ను
కానుకనిచ్చానే ప్రియా,
ఈ బీడు భూముల్లో బంగారు పంటలకై నా నెత్తుటి ధారల సాక్షిగా
స్వేచ్ఛ ను ఆశించడమే తృప్తినిస్తుంది మంధరా, మరుజన్మలో నా చివరి, ఆకరి మజిలీవి నీవే సఖీ,
మరు జన్మలో నైనా మన బంధం ఈ జాతి స్వేచ్చాయుదం లో బంధికాకుడదనీ ఆశిస్తూ నీ ఆనంద్...
మరుగున పడిన మన బానిస సంకెళ్లను బద్దలు కొడుతూ
మన భారత భవిష్యత్తే తన సంతానమని బలి తీసుకున్న యువ వీరులెందరికో ఈ స్వేచ్ఛాయుత భారత వందనం...
వందేమాతరం... వందేమాతరం.....
అర్థరాత్రి గానీ రాని నిద్రలు
నిద్ర పట్టే ముందు ఎన్నెన్నో ఆలోచనలు
ఆ అర్థ రాత్రి వినిపించే నిశబ్ద కీర్తనలు
నేర్పెను జీవిత పాఠాలు
ఆ పాఠాల యాదిలో గడిచెను ఎన్నో రాత్రులు
మళ్ళీ మళ్ళీ కనుల ముందు నర్తిస్తున్న నగ్న గమ్యాలు
అలుపురాని ఆలోచనలు అలసిపోని ప్రయత్నాలు
వస్తున్నారు వస్తున్నారు
మన ఓట్లాడిగే పాలకులు
భద్రం ఓటరన్నా
భద్రం జర
ఓట్లకోసం
పాట్లు పడతారు
ఓటు వేసినాక
పంగనామం పెడతారు
మందు ఆశ
చూపుతారు
మతిలేకుండా
చేస్తారు
డబ్బు ఆశ
చూపుతారు
డౌటులేకుండా
గెలుస్తారు
సమస్యలన్ని
పరిష్కారిస్తా మంటారు
గెలిచాక మీరే మా
సమస్యాంటారు
నాయకులు
అవుతారు
న్యాయం లేకుండా చేస్తారు
అభివృద్ధి చేస్తా
అంటారు
గెలిచాక
అవినీతిలో ముందు ఉంటారు
భద్రం ఓటరన్నా జర భద్రమే....
చెట్టమ్మ నీకు వేలవందనాలమ్మ
నువ్వులేకపోతే ఈ మనుగడేలేదమ్మ
ప్రతి ఒక జీవికి ఊరిపోస్తావ్
నిండునూరేండ్లు మము సల్లంగజుస్తావ్
ఆకలైతే పండ్లనిచ్చి కడుపు నింపుతవ్
కనుమూస్తే నీ కట్టలే పాడేకందిస్తావ్
కొమ్మలే ఊయాలై ఊపుతుంటవ్
ఎండల్లో నీడనిచ్చి కాపాడుతవ్
ఎన్నో పక్షుల నివసంకై ఇళ్లతివి
తనువంత ఔషధ గుణంగలిగితివి
వాన చినుకుని నెలపైకి తీసుకొచ్చి
మొలకెత్తు విత్తనాలకు పురుడుపొస్తివి
నీ తనువంత త్యాగంజేసి ఎన్నో ఇసిరేలానందిస్తివి
మా అవసరాలకు ప్రాణ త్యాగం చేస్తివి
ఎండిపోయి చిగురిస్తూ
మానవాళికి ప్రేరణకల్పిస్తివి
నీవు లేకపోతే ఈ జగతేలేదు
నీ రుణమెట్ల తీరునోయమ్మ
మాకు బ్రతుకునిచ్చే ఓ మహా వృక్షమా
రెండు కాళ్ళ జంతువుగా చేసి
ఊరికి దూరంగా నెట్టబడ్డ
వెలివాడలో నుంచి ఉదయించిన
ధిక్కార పతాకం నీవు
కలం నిండా ప్రేమతో పాటు
త్యాగాల రక్తాన్ని నింపుకొని
నీలాకాశంలో మెరిసిన
ఎర్రని నక్షత్రానివి నీవు
పీల్చే గాలి త్రాగే నీరు నిషిద్దమైన చోట
శత్రువు మీద దాని సాహిత్యం మీద
సముద్రంలోని కెరటం వలే
విరుచుకుపడిన అక్షర బాణం నీవు
పొత్తికడుపు వెన్నెముకకు అతికి
వెలివాడలోనున్న మూగజీవుల వెతల్ని
ఏటికి ఎదురీదుతున్న జీవన పోరాటాన్ని
అడవి బాట పట్టించిన ధీరుడవు నీవు
నీవు ఒరిగిన పొద్దున
వాడలో పొయ్యి వెలగకుండా దుఃఖించింది
కలం సిరా బదులు రక్తాన్ని స్రవించింది
పోరు నినాదాలతో ధరణి కంపించి ధ్వనించింది
మా గుండెకు తాకిన నీ కవిత్వం
మమ్మల్ని పోరు దారుల్లో నడిపించే యవ్వన శక్తి
నీకు నివాళిగా మేమేమివ్వగలం
యుద్దక్షేత్రంలో ప్రాణాలు తప్ప!
రచనా కాలం. 17-05-2020
కుతకుతలాడుతున్న
రక్తాన్ని ఏరై పారించనా
పీడిత ప్రజల విముక్తి కొరకై
ఎరుపెక్కిన కనులతో
గుర్రుగా చూడనా
గుండాగిరి ఇక నడవదని
పిడికిలి బిగించి
ముందుకు సాగనా
నిరంకుశత్వాన్ని
కూకటి వేళ్ళతో పెకిలించ
పోరాట పటిమనందించనా
భవిష్యత్తు తరాలకు మార్గదర్శకుడినై
దిక్కులు పిక్కటిల్లేలా
గొంతెత్తి గర్జించనా
జరుగుతున్న అన్యాయాలపై
భగ భగ మండే సూర్యడినై
మల మల మాడ్చనా
అమాయకుల ఆక్రందనలకి కారణమయ్యేవాల్లని
అక్షరాలను ఆయుధాలుగా మార్చనా అజ్ఞానాందకారాన్ని తొలగించ
నిలదీయనా నిరభ్యంతరంగా
నిర్లక్ష్యాన్ని మరలా పునరావృతం కాకుడదనెలా
పోరాడనా భీకరంగా
శ్రామికుల చెమట చుక్కనై
అగ్ని ఖీలనై దహించనా
దోపిడి దారులను
తెరిపించనా మూసుకుపోయిన
కనులు జరుగుతున్న మోసాలు
చూడటానికి
సమరశంఖాన్ని పూరించనా
అసమర్థ పాలకులను గద్దెదించ
ఏకం చేయనా
నా దేశ పౌరులను స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎవడబ్బ సొత్తు కాదని
అసమానతలను పెంచి పోషించేటోడి కుత్తిక కోద్దామనీ
సమానత్వపు పరిమళాలు అందరం రుచి చూద్దామని
అవినీతి రహిత భారతావనిని మరలా నిర్మించుకుందామని....!
"రాత్రి కావాలి" నాకు
వీధుల్ని తోసుకొని ఊరిను నెట్టేసి,
పొలిమేర దాటి పొలాలు తిరుగుతుంటే..
చీకటి చెవిపట్టి ఇంటికి చేర్చింది.
దీపం వెక్కిరిస్తూ లోపలికి పిలిస్తే
మంచం ఉరిమిచూస్తూ సర్దుకుంది.
* * *
"రాత్రి కావాలి" నాకు
మళ్ళీ అదే ప్రశ్న వీధిలోకి నెట్టుకొస్తుంటే
తట్టుకోలేక కళ్ళు
లోపల నుండి బయటకు చూశాయి.
"చుట్టూ రాత్రే...
మనసే ఖాళీ."అని తెలిసి
నిద్రను కౌగించుకొని పడుకున్నా..
* * *
JUL 2021
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు