కవితలు

కవితలు

పోరుగాలి

అదే పనిగా 

కొట్టుకొంటోంది కిటికీ

పదేపదే 

వచ్చి పోయే గాలికి

        *

ఎక్కడదీగాలి?

ఎందుకింతలా యీ గాలి?

సంకెళ్లు తెంపుకున్న సమూహాల

పిడికెళ్లు పైకెత్తిన హోరు మోసుకుంటూ

చెట్లను

గుట్టలను

సచ్చుగా మొద్దునిద్రలో పడుండనీక

వొకటే పోరు గాలి

         *

చెరువుల వీపులపై సత్యవాక్యాలను రాస్తూ

దారుల చెవుల్లో పోరు రహస్యాలను పాడుతూ

అలలు అలలుగా కదిలి

ఎడతెరపి లేకుండా ఇంటిని చుట్టుముట్టిన గాలి

           *

అంతా పొరుగాలియేరు పారుతున్న బొమ్మ

చుట్టూ పొరుగాలివాగు సాగుతున్న చెమ్మ

           *

కిటికీలు

తలుపులు

గుండెల గోడల ఇళ్లు

అదే పనిగా కొట్టుకుంటున్నాయి

ఊరిలో

గాలి పోరులో..!

 

**      **      **

కవితలు

నాకన్నా...

నా వాళ్ళకోసం

హక్కులని అడిగితే

నేను దేశద్రోహినైతే నక్సలైటునైతే

నాకంటే పెద్ద దేశద్రోహులు

నాకంటే పెద్ద నక్సలైట్

మరెవ్వరూ లేరు

నా వాళ్ళకోసం చేసే

పోరాటంలో

నేను ప్రాణాలు కోల్పోతే

అది నా పిచ్చితనమే అని

మీరంటే నాకంటే పెద్ద

పిచ్చివాడు మరెవ్వరూ లేడు

అందరూ నావాల్లే

అనుకోవటం స్వార్ధమే అయితే

నాకన్నా పెద్ద

స్వార్ధపరుడు మరెవ్వరూ లేరు

 

కవితలు

 కవిత వ్రాస్తాను....

నాలుగు గోడల మధ్యలో
ఒక సోఫా చూస్తుండగా
రెండు కుర్చీలు దగ్గరగా
రెండు కప్పులు కాఫీ వాసనతో
నాలుగు కళ్ళు ఒక చూపుతో...
రెండు మనసులు ఒకే తలపుతో....
మెరిసే మాటలకు రూపం తెచ్చే
ఆ రోజుకు కాళ్లకు మ్రొక్కుతూ
నీలో  నన్ను చూసుకుంటా
నాలో నిన్ను చూపుకుంటా
ఒక మల్లె తోడుగా
ఒక క్షణం నీడగా
ఓ తీపి జ్ఞాపకాన్ని
మనసు కాగితంపై
కవితగా వ్రాసి ఇస్తాను
జీవితాంతం గుర్తుండేలా...

 

కవితలు

ఇదో స్వతంత్ర భారతం

ఇక్కడ రైతులు స్వతంత్రగా ఆత్మహత్యలు చేసుకోవచ్చు....

ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావచ్చు...!!!

ఇక్కడ ఉద్యోగాలు లేక, నిరుద్యోగులు స్వతంత్రంగా ఆత్మహత్యలు చేసుకోవచ్చు....

ప్రభుత్వాలు ఎలక్షన్లకోసం, ఉద్యోగాలు ఆపుకోవచ్చు...ఓట్లకోసం!!!

ఇక్కడ అణగారిన వర్గపు స్త్రీలను,స్వతంత్రంగా చరచవచ్చు...

అధికార వర్గాలు, చరిచిన వాళ్ళని కాపాడుకోవచ్చు...!!!

ఇక్కడ పేదవాళ్ళు స్వతంత్రంగా ఆకలి చావులు చావొచ్చు...

అధికారులు మాత్రం, సమావేశాల్లో చాయ్, బిస్కట్లకోసం కోట్లు ఖర్చు చెయ్యవచ్చు..!!!

పేదవాడు తప్పు చేస్తే వెంటనే,స్వతంత్రగా శిక్షించవచ్చు...

అదే పెద్దవాడు తప్పుచేస్తే...ఆ శిక్షలను ఎన్ని సంవత్సరాలైన వాయిదా వేయవచ్చు...!!!

ఇక్కడ ఆకలికోసం ప్రశ్నించిన వాణ్ణి నక్సలైట్ అనొచ్చు... అధికార దాహంకోసం ప్రశ్నించినవాన్ని నాయకుడు అనొచ్చు...!!!

మతఅణిచివేతని ఎదురించినవాన్ని,మాంత్రికుడని కొట్టి చంపొచ్చు...

మతఘర్షణలు సృష్టించినవాన్ని, బాబాలని పూజించవచ్చు...!!!

పేదవాడు ధనం దాచుకుంటే,

జైల్లో వెయ్యొచ్చు...

పెద్దవాడు దాచుకుంటే,వాన్ని విదేశాల్లో దాయావచ్చు...!!!

చివరిగా ఈ స్వతంత్ర భారతం...పేదవాడి చావులకి, పెద్దవాడి కాపాలకి తప్ప, స్వేచ్ఛ సమానత్వం కోసం కాదు... కాలేదు.. కాబోదు...!!!

 

కవితలు

సునామీ

నువ్వు...

బీటువారిన నా ఎద భూమిపై

చిగురించిన ఆశల ఆయువువి,

రాటుదేలిన మది చీకటిలో

మెరిసిన చిరు వెలుగువి 

 

నువ్వు....

అలసిన నా అంతరంగ తీరాన

ఎగసిన హాయి తరంగానివి

నిర్మేఘ నయనాకాశంలో

వెలసిన రంగుల హరివిల్లువి

 

నువ్వు.....

అరవిరిసిన మనోవిరిని

వికసింపిన విరిజల్లువి,

కనుమరుగైన నాలోని కవిని

నిదురలేపి , నెనరు చేసి

పలుకులిచ్చిపదునుచేసి

వరుణించికరుణించి

 మట్టిబొమ్మకి జీవం పోసిన

ప్రాణ నాదానివి

నా ప్రణవ వేదానివి !!

 

నువ్వు ....

కాగితంపై నే నాటిన కలం

నే పట్టని కత్తీఖడ్గం

పట్టిన పలకాబలపం

ఎత్తిన చిహ్నంబావుటా

అద్దిన అంకెదిద్దిన అక్షరం

నా ఆవేశంఆవేదనల 

అల్పపీడనం వల్ల

కలిగిన భావోద్వేగంతో

పదఝరి తుఫాను లా

కమ్మేస్తూ... 

నా అజ్ఞానాంధకార విల్లుని

చీల్చుకుంటూ ...

సెకనుకి వేలమైళ్ళు,

శిక్షాబాణంలా 

పై పై కి దూసుకొస్తున్న

నా కవితాన్వేషణా తరంగ

మహాసముద్ర సు-నామీ !!

 

 

   +65 98533934

 

కవితలు

కొన్నికలలు కావాలి

కులం మతం రెండుకళ్ళయి

అభివృద్ధి అంధకారం లో

అణుబాంబులు అణ్వాస్త్రాల కంటే

భయంకరమైన యుద్ధం

ఆకలితో చేస్తున్నది

చౌకగా లభించే

ఈ దేశప్రజల చావులతో

నీకోసం ఎడవడానికి

ఖరీదైన కన్నీళ్ళు కావాలి

పాలకుల అధికార మార్కెట్లో

అమ్మకనికిఉన్న నిన్ను చూస్తుంటే

స్వాతంత్ర సమరయోధులు కన్న

కలలు కావాలి

ఈ దేశానికి కొన్ని కన్నీళ్ళు కావాలి

 

 

కవితలు

నాకు కనబడు

ఇప్పుడు

నీ పేరు

నిషేధించిన పదం

 

కరడుగట్టిన

ఈ పితృస్వామ్యంలో

"రమ్య"రాగాలకు నోచుకోనిది

నీ గొంతుక

 

రక్తం ఏరులై ప్రవహించగా

శిలువెత్తిన క్రీస్తువలే

పడుతూ లేస్తూ

గాయాలెన్నయినా భరిస్తూ

అవమానాలను దిగమింగేది

నీ కుత్తుక

 

నువ్వు

నేనొక మనిషిని

మనుషుల్లో మనిషిని

ప్రత్యేకంగా కనిపిస్తానేమో చూడమంటూ

కాళ్లను నెర్రదన్ని

కూడలిలో నించోడమే

చేసిన నేరమూ

 

సమానత్వాన్ని సాధించే

రణనినాదంలో

కట్టుబాట్ల కంచెను తెంచి

మహిళ ఘనతను

ఇలకు తెలిపిన వీర వనితగా

నాకు కనబడు

ఈ విశ్వానికి వినబడేలా

అరుస్తూ

నీ పేరును వినిపిస్తాను

 

        -

కవితలు

స్పందనలో ఎందుకీ వివక్ష? 

పంద్రాగస్టు సాక్షిగా

ఒక వైపు భారతీయ పతాకం

నింగిలో రెపరెపలాడుతుంది!

మరో వైపు నెత్తికెక్కిన కామ కత్తిపోట్లకు

నవ భారతి ప్రాణం గాలిలో కలిసిపోయింది!!

అందరూ చూస్తుండగానే

శరీరమంతా కత్తిపోట్లతో రక్తసిక్తమైంది

చిందిన నెత్తురుతో రోడ్డంతా ఎరుపెక్కింది!!!

 

చీమ కాటుకే తల్లడిల్లే సున్నితమైన దేహం

కామ కత్తిపోట్లకు ఎంత వేదన పడిందో!

ఎదలో... గొంతులో... కడుపులో...

గాయాల - రక్తపుధారల మధ్య

బ్రతకాలనే ఆశ ఎంత సంఘర్షణ పడిందో!!

 

నేరస్తులు ఎవరు?

నేరానికి దారి తీసిన ఆధిపత్య సంస్కృతి ఎవడిది?

నేరాన్ని నిరసించని

నేరాన్ని ప్రశ్నించని

నేరాన్ని ధిక్కరించని

సభ్యసమాజం నేరస్తురాలు కాకుండా ఉంటుందా?

 

స్పందనలో ఎందుకీ వివక్ష?

ఈ రోజు వీధిలో పడగ విప్పిన కామ నాగు

రేపొద్దున మన ఇంట్లోకి రాకుండా ఉంటుందా?                             

(గుంటూరు లో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య కి నివాళిగా)

                                     17-08-2021

ఈ సంచికలో...                     

SEP 2021

ఇతర పత్రికలు