కవితలు

కవితలు

కోపమాధుర్యం

ఒక్కోసారి కోపం కూడా

చాలా బావుంటుంది

బావుండటమంటే?

ముద్దుగా మురిపెంగా

మనసు కొమ్మపై అలకపిట్ట వాలినంత

ముచ్చటగా ఉంటుంది.!

 

అనురాగపు నదిపొంగి

మదివొడ్డును గారంగా కౌగిలించుకున్నట్టు

 

అప్పుడప్పుడు

అమ్మో నాన్నో..

అన్నీ వదులుకుని

గుండెకుటీరపుగడపలో ముక్కర్రలానో

ఇంటి నట్టింట దీపంలానో వెలిగే తను...

విల్లులాంటి కనుబొమ్మలు సంధించి

కోపంగ చూడటం చాలా అందంగా ఉంటుంది

 

పంతాలు నెగ్గే కోపం పనికిరాదు కానీ

జీవన వనాన వసంతాలు పూయించే

కోపాల కుహూ కుహూ కూసితీరాలి..!

 

కోపం ఎంత మధురమైనదో.!?

కోపం ఎంత వెచ్చనైనదో.!?

కోపం మధురాతి మధురమైనది

ఒకరుకోసం ఒకరు

తడితడిగా వెచ్చపరుచుకునేంత స్వఛ్చమైనది.!

 

ఇద్దరిమధ్య

వొట్టి ప్రేమ మాత్రమే ఏం బావుంటుంది

చలి సాయంత్రపు వేళ చల్లారిన కాఫీలా

కోపతాపాలు లేకుండా బతుక్కి రుచెలా వస్తాది.?

కోపతాపాలు లేకుండా జీవితమెలా గుబాళిస్తాది.?

 

గడ్డిపరకంత కోపమే మొలవకుండా

బతుకు సాగుచేస్తున్నావంటే

ఎదలోపల ఏదో ఎడారి పిలిస్తున్నట్టే.!?

 

ఎప్పుడో ఒకసారన్నా

పిడికెడు మాటల మరమరాలకు

చిటికెడు కోపపుకారం కలిపి చూడాలి

 

రుసరుసల సంగీతం అనంతరం

ఓదార్పుల హృది గీతి అనంతరం

ప్రేమ సముద్రమొకటి

మనసు తీరాన్ని ముద్దాడుతూ

శతాబ్దాలకు ఇంకని చెలిమిపాతంలా..

చెవిలో ఇల్లుకట్టుకున్న మోహాన్ని తాగి చూడాలి..!

 

ఇప్పటికీ

ఆవగింజంత చిటపటలైనా పేలకపోతే..!

యీ సాయంత్రం నువ్వైనా

రవ్వంత కోపాన్నిగీటి చూడు..!

**                      **                          **

30/11/2021.

(తన కోపాన్ని తనకోసం ఇష్టంగా భద్రపరుస్తూ..)

 

కవితలు

పంట పొలంలో ప్రసంగం 

పంట పొలం నట్టనడుమ

ధాన్యపు కంకులతో

ఎగిరే పక్షులతో

గెంతులేసే జంతువులతో

ఉద్యమ గానం చేస్తున్న కోయిలమ్మ పాటల మధ్య

చెంగు చెంగున మార్చ్ పాస్ట్ చేస్తున్న జింక పిల్లల అడుగుల సవ్వడి మధ్య

ఆ బాలుడి ప్రసంగం

బహుశా...

అది పర్యావరణ రక్షణకై కావచ్చు

అది రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన రూపం కావచ్చు

అది సాగు నీరుకై కావచ్చు

అది గిట్టుబాటు ధర కోసం కావచ్చు

అది దున్నేవారికే భూమికై కావచ్చు

అంతిమంగా భూమి భుక్తి విముక్తి కోసమూ కావచ్చు

 

                                 12-10-2021

కవితలు

పరిమళం కోల్పోయిన కేవడో 

పగిలిన నా రవిక అద్దం చెప్పింది.. 

ధ్వంసం అయిన నా చరిత్రను..

 

ఏడు తీర్లా దారంతో ఎదపై పోదిమినా

రవిక(కాళ్ళీ) యదకు దూరమైంది..

 

తెల్లని గాజుల(బలీయ)కు కట్టిన నల్లని దారం

నరుడి దృష్టిని దూరం చేస్తాయనుకున్నా..

కానీ, తెల్ల గాజులే నా నుండి దూరం అయినాయి..

 

చెవులను తాకే కెంపైనా ఊసులు చెప్పే టోప్లీ  

శృతి చేయని వీణలా మూగబోయింది..

 

 మోముకి దిష్ఠి చుక్కలా.. ముక్కపై పోదిమిన అర్థ చంద్రాకారం మాయమై అమావాస్య చీకట్లను మిగిల్చాయి..

 

మెడను అలుముకున్న నక్షత్రహారాలను

వేటాగాడొకడు అపహరించి

నన్ను అమ్ముకునే వస్తువును చేశాడు..

 

అయినా....

నేను వస్తువును కాదు కాదా!

వనంలో ఒంటరిగా నాట్యమాడే 

మయూరం నా తోబుట్టువే!

 

అలా ఉన్నాననేగా వేటగాడు

నా రూపాన్ని దోచుకేళ్ళీంది

దోచుకెళ్ళని.... ఈసృష్టిలో తరగనంత సౌందర్యం

జీవనాడుల్లో పదిలంగా దాచుకున్నాను..

 

రేపటి కోసం వసంత కోకిల గానమై వస్తాను!

వాకిట్లో సింగిడి పూల మొగ్గనై పలకరిస్తాను!!

కవితలు

నీ కోసం నేను 

పంచ భూతాలు ఎంత నిజమో

నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది అంతే నిజం

 

ఎంతగా అంటే...

 

ఆకాశంలోనే నీలిరంగును కలంలో సిరాగా  పోసి

లోకంలోని చెట్లను కాగితాలు చేసి

అక్షరాలుగా రాసినా కూడా చాలనంతా..

 

ఎప్పటివరకు....?

ఆకాశం భూమి కలిసినంత వరకు

సూర్యుడు వెలుగును పూర్తిగా కోల్పోనంత వరకు

నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను

 

రైతు తొలకరి కోసం ఎదిరి చూస్తున్నట్లు

నీ కోసం నేను....

కవితలు

ఒకరే......

ఒకరుంటారు జీవితంలో
సజీవంగా
మనసును మోస్తూ ...

ఒకరే ఉంటారు బతుకులో
రహస్యంగా
మనసును ఆరాధిస్తూ

 

ఇతర పత్రికలు