నువ్వు ఉదయాన్నే పచ్చి శ్వాసకై
సముద్రపు ఒడ్డుకు వెళ్ళి ఉంటావు
రెక్కలు విప్పి హాయిగా
నింగిలో గిరికీలు కొడుతున్న పక్షులు
కనపడ్డాయా నీకు
బంధించిన గదుల నుండి
బయటపడ్డాననుకుంటూ
నీకున్న స్వేచ్ఛనే
మరింతగా రుచి చూద్దామనే
ఆరాటం నీది
ఒకసారి చెవినొగ్గి విను
సముద్రం ఘోషిస్తూ
తనదైన భాషలో
నీతో ఒంటరిగా
సంభాషించాలనుకుంటుంది
తన లోపల గుట్టుగా
దాచిన రహస్యాలను
నీకు చూపాలని
ఎంతో ఆరాటపడుతుంది
ఎన్నాళ్ళుగానో
లోపల పోటెత్తుత్తున్న సునామీలతో
పోరాడిన వైనం
నీకు వివరించాలనుకునే
తపన తనది
ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతూ
నీకు చేరువవాలనే ప్రయత్నంలో
తలమునకలౌతున్న తనని చూస్తే
నీకు ఏమనిపిస్తోంది
తనపై నుండి తేలివచ్చే గాలి
తనలోని తడిని తెచ్చి
నీకు పూస్తోంది
గమనించావా అసలు
హోరున నవ్వుతున్నట్టే
అగుపిస్తున్న సముద్రం
నీటి చేతులతో
తీరంపై ఏదో దుఃఖలిపిని రచిస్తూ
మళ్ళీ తనే తుడిపేస్తోంది
అలలను ఒకమారైనా
నువ్వు తిరగేసి ఉంటే
నీకు తెలియని కథ
వివరించి ఉండేది
నువ్వు ఒడ్డు వరకూ
వెళ్ళినట్టే వెళ్ళి
కనీసం కాళ్ళు తడుపుకోకుండా
వచ్చేయడం చూసి
నీకు బాగా దగ్గరకు
వచ్చేసిన సముద్రం
ఒక్కసారిగా వెనక్కి మళ్ళిపోయింది
నిరాశతో గుంభనంగా బిడియంగా
తనలోకి తాను
నీటిపువ్వులా ముడుచుకుపోయింది
ఒక్క క్షణమాగి
నువ్వు సరిగ్గా దృష్టి సారించి ఉంటే
సముద్రపు ముఖంలో
ఆమెను తప్పక
స్పష్టంగా చూసి ఉండేవాడివి
కెరటాల పుటలు తిప్పుతూ
ఆమె మనసును కాస్తైనా
తెలుసుకునే వాడివి కదా
కారే రాణుల్..
రాజ్యముల్ ఏలిరే..వారేరి?!
భారతజాతి నాగరికత సంస్కృతిని
నడిపిన ఆ నారీమణుల
రుధిర పాదముద్రలేవి?
ఊయలనుండి వివక్షలతో కష్టాలతో
కన్నీరు కార్చిన తడి హృదయాలు
అతివిధేయతతో తమ పేగు తెగిన
వెచ్చని రుధిరంతో నిర్విరామంగా
మానవ సమూహాల పంటలను
పండించిన ఆ అతివలేరి…?!
ఆ..సహనం,త్యాగ నిరతి తరతరాలుగా
ప్రవహిస్తూనే ఉంది అతివలలో
అందుకే నేమో ధరణిపై
మానవ సమూహాల పంటలు
పుష్కలంగా పండుతూనే ఉన్నాయి..,
కాలం కని పెంచిన ఆ స్త్రీలు
ఈ సనాతన జాతికి మూలస్థంబాలు
ఆయాకాలపు కష్టాల కొలిమిలో కాలి
రాటుదేలిన వీరనారీమణులు
వారే తరతరాల నాగరికతకు
ప్రతినిధులు తరగని నిధులు
వారి కఠిన జీవితాలు
వ్యక్తిత్వ వికాస పాఠాలు?!!
*******
అధరణ తాపడం చేయబడ్డ చేతులు
ఆ తనువు అణువుల్లోంచి
జాలువారే నమ్రత..భావాల నాన్యత
అనుభూతుల సౌకుమార్యం..మమతల సోయగం
అవ్యక్త సౌందర్య మామెది
ఊపిరి నింపి..జగతినంతా ఎత్తుకు ఆడించిన
బ్రహ్మణి తాను
రోజూవచ్చే తొలి మలి సంధ్య వర్ణాల్ని
సరికొత్తగా పరిచయం చేస్తుందామె
దారమై అనుబంధాల పువ్వుల్ను గుదిగుచ్చే
నేర్పుల ఓర్పుల పల్లకి..మమకారాల పాలకంకి
చూడగలిగితే..నిండుగా ప్రవహించే ఆవేదనలు..
అచ్చాదన లేని ఆ మనసు పరిచే ఉంటుంది
ఆ అభిమానాల సృజన శీలిపై
దాడులు..ఆకృత్యాలు..అల్లరులు
ఆనందాలను లెక్కకట్టుకుంటూ
లోటును పూడ్చుకునే క్రమంలో భంగపడి
అందిపుచ్చుకోలేక
ఆమె అడుగుల్లో..ఆమెను పొందనీక
ఆ మనసుకెన్నిసార్లు సిలువ లేసారో..
లెక్కలెవరు కట్టగలరు..?
ముద్రల్ని మోస్తూన్న
ఆ అడుగుల భారాన్ని ఎవరు తూచారు..?
అదో..ఆచూకీ లేని వెతల ఉనికి..!
ఎన్నో..బలత్కార శిశిరాలను భరించిన
ఆ చెట్టుపై ఎన్ని బంధాల పక్షులు వాలినా..ఇంకా పొదుపుకుంటూనే
కలలు చిగుళ్ళేస్తుంటుంది
సాకాలపు ఫలాలు రాకనే..రాలి నేలపాలౌతుంటాయ్
అపుడపుడూ
ఆ ఆశయాలన్నీ భయం లోయలో పడి
ఆనవాళ్లు కోల్పోతుంటాయి
మళ్ళీ ఆశల బొమ్మల కొలువును
అతి నేర్పుగా పెట్టుకుంటుంది
అలుసుచేసి అగ్గువచేసిన ప్రతిసారీ
వెక్కిళ్ళు పెడుతూ..బద్దలవుతూనే..కట్టుకుంటుంది
గుహలను గృహాలుగా మలచిన
ఆమె వెంటే..నడచిన ఒకనాటి మానవ సమాజం
అంచెలంచెలుగా చేజారిన..ఆ మాతృస్వామికం
ధూషణల తిరస్కారాల ముళ్ళు గుచ్చి గాయం చేస్తున్న
ఆ ఆధిపత్యపు అంపశయ్యపైనే తను
నరుక్కుంటున్న..తాము కూర్చున్న కొమ్మ ఆమేనని
వాళ్ళకింకా తెలియదు
ఊపిరి సలపనీయనీక ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
పరిది పరిమితుల నుంచీ...
కఠిన కచ్చడాల నుంచీ..
ఇనుప కౌగిళ్ళనుంచీ..
తనను తను విముక్తించుకుని..
తన వేదనల అగాధాలను
అంచనా వేసుకోవడం.. ఇపుడిపుడే నేర్చుకుంటోంది
తన జీవన మడిలో..తనకోసం
కాసిన్ని చిరునవ్వుల నారును నాటుకుంటోంది
కాలంతో..
భూగోళంతో కలిసి నడవడమే
అప్డేట్ అవ్వడమంటే..!
ఆకులు రాలాయనో
సాయంసంధ్య ఎదురొచ్చిందనో ముడుచుకోక
తాజాగా చివుర్లను మొళిపించుకోవడం
అవసరమే ఎవరికైనా
రాగంలో రాగమై వర్ణంలో వర్ణమై
అడుగు కలపి సాగితేనే
సరికొత్త కాంతులమై ప్రజ్వలించేది.
పరిణామక్రమాన్ని అంగీకరించిన
ఒకనాటి అగ్నిశకలమే
ప్రాణిని ఆవిష్కరింప చేసిన జీవగ్రహం
తనను తాను
సంస్కరించుకోకుంటే ఇంకేముందీ
పుట్టలు పెరిగి పాకురుపట్టి పోమూ.!?
గొంగళి పురుగు నవీకరించు కుంటేనే
రంగుల సీతాకోకై రెక్కవిచ్చేది
రాగి పాత్రలని రుద్ధి మెరిపించకుంటే
బొగ్గుల మయమే కదా
ఎప్పటికీ ముట్టని మంచిల్లబాయి
మర్లబడి తెర్లయిపోదూ
భూకేంద్రక సిద్ధాంతమే ఇంకా సరియైందంటూ
ఆదిమయుగాల్లోనే జీవిస్తుంటారు కొందరెందుకో
వాడకుంటే మెడదుకూడా
అంతరించిపోతుంది సుమా..!
నవీకరించుకోవడం అంటే..
రంగుల రెక్కలను అతికించుకొని
గాల్లో విహరించమని కాదు.
రంగు వెలిసిపోకుండా నీకు నువ్వు పరిమళించమని
ఒక్క మనుషులకే కాదు
సర్వోపకరణాలకు నవీకరణ ఆవశ్యకమే..!
మానవ సృష్టి మన చరవాణీ
ప్రాధేయపడుతోంది
అప్డేట్ అయ్యేందుకు అనుమతి నియ్యమని.!
ప్రాణం లేని పరికరమే
అదేపనిగా ఆరాటపడుతుంటే
నన్ను నేను నవీకరించుకోవద్దూ.!?
కనులుమూసీ కల కన్నాను
బ్రమలుతొలగీన నేను
ఇప్పుడు కనులుతెరిచి
వాస్తవాలను చూస్తున్నాను
నేను ఆడపిల్లగా
పుట్టీ పెరిగీ నా
ఆడపులిగా పెరగాలనుకుంటున్నాను
ఈ రంగుల ప్రపంచంలో
ఈబ్రమల లోకంలో
మాయల సమూహంలో
నేనిలా వుంటే నామనుగడ సాథ్యమానీ నన్ను నేనే
ప్రశ్నించుకున్నాను
అమ్మ పొట్టలో వూపిరీ
పోసుకుంటున్నప్పుడే
నా జీవన సమరం మొదలు
అల్ట్రా సౌండ్ కోరలకు
చిక్కకుండా
తప్పీంచుకునీ
ఉమ్మనీటీ ని నివాసం చేసుకుని శ్వాసించటం
నేర్చుకునీ
బయటీప్రపంచంలోకీ
వచ్ఛీన బుజ్జీమేకపిల్లనీ
రాజుగారి తోటలోకీ
మేత కోసం వెళ్లగానే
కంచెలుమేస్తున్న చేలనీ
చూసీ అవాక్కయినాను
చెట్టు మీద పండుకు
రాళ్లు దెబ్బలు తగులుతాయని
తెలియక
అమాయకంగా చెట్టునే ఆశ్రయించీన అమాయకురాలనీ
రాజ్యంఏలుతున్న
రాక్షసమూకల
రాజ్యం లో
పహరా లేనీ
ఆసరాలేనీ
మృగాల మథ్య
నేను కుందేలు పిల్లనై
గంతులువేయాలంటే
నేను ఆడపులిలా
కాలుదువ్వాల్సందే
ఉగ్గు పాలు తోకలిపి
ధైర్యం పాలు నింపీన అమ్మ
వొడీనిండా థీమా థీరత్వమే
దివిటీవెలుగులో
నాప్రయాణం సాగీంచాలంటే
నేను నేనుగా నిలబడాలంటే
నేను ఆడపులిగా మారాలి
ఉదయం ఏడైనా పోదు
మనలో లేజీ
కళ్ళముందు ప్రత్యక్షం కాలేజీ
పైగా చేతిలో పుస్తకాల లగేజీ
దాని బరువు మినిమమ్ ఓ కేజీ
పైకి కఠినంగా మా గురూజీ
"లోపల మనసు మాత్రం స్పాంజీ
చేస్తున్నాము కానీ పిజీ
అంతులేని సిలబస్‌తో గజిబిజీ
ఉద్యోగం లేదంటే అవ్వదు మ్యారేజీ
దాంతో పడలేం రాజీ
అందుకే ఎక్కువైన పోటీల రేంజి
ఎలాగైనా తిప్పాలి ఉద్యోగాల పేజీ
లేదంటే దూకాలి ప్రకాశం బ్యారేజీ
మనిషికి డబ్బు
ఎంత ముఖ్యమెా
పరువు అంతే
డబ్బు లేకుంటే
రేపటి రోజు సంపాదిస్తాం
కాని పరువును
సంపాదించలేము మిత్రమా
ప్రాణం పోయిన సరే
పరువు ముఖ్యం అన్నారు
పెద్దలు నిజమే కదా
పరువు లేని చోట
ఒక్కక్షణం ఉండనివ్వదు
నీ మనస్సు
అడ్డదారిలో కోట్లు
సంపాదిస్తే ఏం
పరువు లేనప్పుడు
గాజులా మేడలో
ఉంటే ఏం
పరువు లేనప్పుడు
జేబులో చిల్లిగవ్వ
లేకున్నా సమాజంలో
కొంత పరువు ఉండాలి
మిత్రమా
పరువు లేని బ్రతుకు
ఉంటే ఎంత
పోతే ఎంత
మూతబడని కనురెప్పల కాగితాలపై
ఎన్నెన్నో కథలు కావ్యాలు రాసుకుంటూ ఉంటాను
నిశీధి దేహంపై నీ జ్ఞాపకాల కొవ్వొత్తులు వెలిగిలినపుడు
పట్టెడు దోసిలితో
నా పుట్టెడు దుఃఖాన్ని
పతంగంలా ఎగరేయాలని అనుకుంటాను
అంతటా పరుచుకున్న నలుపులో
నాకు తెలియకనే నేనూ కాలిపోతూ
పొగతెరలానో
పగలు చూడని పొరలానో
సూక్ష్మ తరంగంలానో ఎగిరిపోతాను
అప్పుడు
అంతరిక్షపు వీధుల్లో ఏ మేఘాల కొమ్మలకో
ఉరి వేసుకుని
తెల్లని ధూళి కణమై వేలాడుతూ కనిపిస్తాను
నువ్వెప్పుడైనా తలపైకెత్తినప్పుడు
శ్రీశ్రీ గేయాన్నో
కృష్ణశాస్త్రి గీతాన్నో
చలం భావుకత్వాన్నో
ముద్దగా చుట్టి
నావైపు విసిరికొట్టూ....
వాటితో మాట్లాడుతూ నొప్పి తెలియకుండా మెల్లమెల్లగా మరణిస్తాను!!
ప్రతి మనిషి జీవితంలో విజయం
ప్రతి నిమిషానికి ఇస్తుంది ఎంతో ఆనందం,
కదిలే కాలం లో
విజయ పునాదులు బలం గా వేస్తే
శ్రద్ధ శక్తులు పట్టుదల ప్రహరీలు గా
సంకల్పం దృడ సంకల్పం తో అవుతుంది
విజయ భవనం
ఉత్తేజ శక్తి తో చేస్తే ఏదైనా పట్టవదలక
విజయం పొందేవరకు నిరంతర కృషి తో
తప్పక కాలమే అందిస్తుంది నిజమైన
విజయానందం
నక్షత్ర నివాస స్వప్నములు
గాలి మేడల స్వప్నము లు వీడి
నిజమైన విజయంకోసం అంకిత భావంతో
ప్రణాళిక నియమనిబంధనలు తో పని
ప్రారంభించిన విజయంత తథ్యం
అపజయ తాలూకు ను దాటుకుంటూ
విజయ తాలూకు వెతుక్కుంటూ
కష్టనష్టాలు చవిచుస్తూ
నిలదొక్కుకుని ధృఢ సంకల్పంతో
ముందడుగు అదే విజయపు తొలి అడుగు
అంతులేని ఆనంద సరిహద్దు.
అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా సాగాలన్నావు
పగలు బయట పడాలంటేనే భయం భయం
శాంతి శాంతి అని ప్రభోధించావు
అనునిత్యం అశాంతి అడుగు జాడలలోనే జనం
మైత్రిభావం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నావు
ఒకరికొకరు కొట్టుకు చూవటమే ఇప్పటి నేపధ్యం
ప్రేమైకజీవులుగా బ్రతకాలని పలికావు
స్వార్థపు ప్రేమలో నిత్యం ఓల లాడుతోందీ లోకం
నిజమైన సంతోషం సంతృప్తిలో ఉందన్నావు
సిరితో ఆనందాన్ని కొనుక్కోవాలనే సమాజం నేడిక్కడ
మంచి చెడు ప్రక్క ప్రక్కనే ఎప్పుడూ
దేన్ని పక్కకు తోసెయ్యాలో
దేన్ని మనసున నిలుపు కోవాలో
అర్థం చేసుకుని ముందుకు సాగటమే జీవితం
గాంధేయం ఎప్పటికీ భవితకు మార్గదర్శకమే
ఏది అసలైన నిజమో
చెప్పక తప్పదు ఈ నాటి యువతకు
ఇదే ఎన్నటికీ చెరగని సత్యం !
నీవు లేనిదే క్షణం లేదు
నివురు గప్పిన నిప్పుకైనా
నీలాల దాగున్న జలముకైనా
నిరాడంబరాన్ని నిశ్చలతను
మౌనంగా దార పోసే అమృత బాంఢం నీవు...
ఆకాశ పొరల్ని దాటినా
అంతరంగాన్ని విశ్లేషించినా
అనురాగాన్ని అంకితమిచ్చినా
ఆత్మీయతకు ఆలవాలమై
మమతను పెనవేసే మల్లె పందిరి నీవు...
అవమాన భారాన్ని మోసినా
అర్థశాస్త్రమే తనదైనా
అవరోధాల బాటలో నడిచినా
అమ్మ తనాన్నీ అరువిచ్చే
అలుపెరుగని గుండె చప్పుడు నీవు...
సహనానికే సహస్రనామమై
సామరస్యతను సాధించే సంకేతమై
సౌరభాన్ని వెదజల్లే సృజనియై
సంసార సాగర మథనంలో
సాహోయనే సార్వత్రిక రూపం నీవు
వేకువ సింధూరమై...
వెన్నెలద్దిన జాబిలివై...
విశాల జగతిలో విరిసే మందారమై
మురిపాల పాల వెల్లిలో
కడిగిన ముత్యమంత మనసు నీవు
అడుగడుగునా కన్నీటి కాలువలున్నా
అలవి కానీ ఆటవికమై వెంటాడినా
అత్యాచార చారికలెన్నో వెలివేసినా
అగాధాలనూ దాటేసే
అమలిన ప్రేమలో పండిపోయిన శిఖరమే నీవు
నీవు లేనిదే క్షణం లేదు...
ఓ మహిళా వందనం!!!
************************
పరుల క్షేమమే తపమై
పరాయిగా జీవించే ఒంటరి
సృష్టికి మూలమైనా
అస్థిత్వమెరుగని బాటసారి
తన ఆశలను అదిమిపట్టి
తనవారి ఆశయాలకు ఊపిరిపోసే తపస్వి
అభిరుచులను మరిచి
అలవాట్లను మార్చుకుని
కుటుంబానికై కరిగిపోతున్న క్రొవ్వొత్తి
త్యాగాల వారధిగా
వారసుల అభివృద్దికి
నిరంతరం తొడ్పడే కల్పతరువు
అవమానాలెదురైనా
సహనం కోల్పోని ధీరమేరువు
నిర్లక్ష్యానికి నిరాదరణకు ఆయువుపోసే
నేటి సమాజంలో
కర్తవ్యదీక్షనెత్తుకొని
సాధికారదిశగా సాగుతుతున్న
అలుపెరుగని ప్రవాహం ఆమె
అణచివేతకు ఆజ్యం పోస్తున్న
మగాధిపత్యపు పీఠాన్ని పెకిలిస్తూ
గుర్తింపుతొవ్వ తవ్వుకుంటున్న
సంకల్పగునపం ఆమె
అణువణువునా ఆత్మవిశ్వాసాన్ని ఒంపుకొని
సడలని ధైర్యాన్ని గుండెపొరల్లో నింపుకొని
తీరంచేరే దాక
ఆగని కెరటం ఆమె
మనసు కసుగాయాల
ఊసులు ఇంకెలా ఉంటాయి
మంకెన పూవులా కాక!
ఉనికి పోరాటంలో
ఎరుపెక్కిన మనసుతో
బాధ్యతల బంధీగా
కలల రెక్కలను జీవిత చెరసాల
ఊచలకు కట్టుకొని...
కరిగే క్షణక్షణమూ
నీవేంటని ప్రశ్నిస్తూనే ఉంటుంది
ఏమి చెప్పను....
నాకంటూ నేనుగా
ఏమీ మిగలని అస్థిత్వపు
పూదోటననా
ఒక గ్రీష్మం ఒక శిశరం
ఒక మానని గాయం
అప్పుడపుడూ కురిసే చల్లని వాన కాలం
మారే మనసుల మధ్య తారాడే
అలుపెరుగని రుతురాగం
అలజడి అలల ఆశల మధ్య ఊగిసలాడే
మనసు యుద్ధ గీతం...
రేపటికీ నేటికీ మధ్య మునిమాపు వేళ
నిశ్శబ్దంగా నిష్క్రమించే సూరీడి రెక్కల కెరటం
ఉషస్సులో కన్నీటి చుక్కలా
చెక్కిలిపై వాలుతుందిలే
గెలవాలని తపిస్తూ చీకటి రహదారిలో
నాతో కలిసి నడిచే
గుండె భావోద్వేగాల గుర్తుల నేస్తం....
ఆశకు శ్వాసకూ నడుమ
వేలాడే కలల లాంతరు దీపం
వేకువకూ సాయంసంధ్యలకూ
నడుమ గమ్యం వైపు ఒకసారైనా కదలాలని
నలిగి ఓడే కాంక్షల హృదయం
1.చదువు కొన్న పార్థు చెడ్డబుద్ధితోడ
అడ్డ దార్లు వెదికి అధిక సొత్తు
పొంద ఆశ్రయించె బూటకపు గురుని;
చెప్పెనంత మూర్ఖ చిటుకులతను.
2. వాటియందు ఒకటి వైవాహికమనగ
పెండ్లి యాడె మంచి పిల్ల జూసి;
కట్టుకున్న గౌరి కష్టమేనాడును
పట్టకుండ తిరిగె భర్తగారు.
3.గర్భవతిగ నుండ గంతులేసిన పార్థు
నెలలు నిండు చుండ కలత చెందె
గురుడు చెప్పినట్లు కొమరుడు కలుగునా?
కొడుకు పుట్టితేను కోట్లు తనకు!
4.పిల్లవాడు పుడితె పెరుగును సంపద
పిల్లవాడు కలుగ పెద్ద పేరు;
గుర్తు కొచ్చు కొద్ది గుండెలుప్పొంగెను
ఎదురు చూసె బిడ్డ ఏడ్పు కొరకు
5.అతని ఆశలన్ని అడియాసలాయెను
ఆడపిల్ల పుట్టె, అంత సతిని
పుట్టినింట విడిచి పొసగదు కాపుర
మనగ గాయ పడెను కాంత మనసు!
6.ఊరి పెద్ద లెల్ల ఉపయుక్త మాటలు
ఎన్ని చెప్పి నేమి? ఎద్దు వాడు.
ఆడపిల్ల అన్న అష్ట లక్ష్ములనిన
వినక పోయె నిజము కనకపోయె!
7.అర్ధ మయ్యె సరికి అంతా ముగిసిపోయె
కుళ్ళికుళ్ళి గౌరి కుమిలి పోయె.
బోధపర్చె లక్ష్మి బోసి నవ్వు భవిత
లక్ష్య మెంచు కొనియె లక్ష్మి కొరకు
8.కాయ కష్ట మెరిగి కార్యము సాధించ
బతుకు బండి నడిపె భార్య గౌరి
నక్క జాతి వంటి నరులెందరున్ననూ
నెగ్గుకొచ్చె లక్ష్మిని గెలిపించ
9.ఆడ బతుకునకును అర్థము చెప్పగ
తల్లి మనసు తీర్చ తనయ తలచె
పట్టు బట్టి చదివి పతకాలు సాధింప
అంతరిక్ష యాన మంది వచ్చె
10.దేశమంత మెచ్చు ఆశలపట్టిగా
లక్ష్మి నిలిచె ధరను లక్షణముగ
ఆమెజూచితండ్రి అనుకొనె మనసులో
ఆడపిల్లయనగ అబలకాదు!
11. కన్నబిడ్డ చేరి కౌగిలించిన పార్థు
కండ్లనీరునిలిచె కంఠమొణికె
తప్పుకాయమంచు తనభార్యనూ వేడె
గౌరి మనసు కూడ కరిగెనంత!
భావం:
పార్ధు అనే అతను చదువుకున్న వాడైననూ అజ్ఞానంతో అధిక సొమ్ము సంపాదించటం కోసం మాయ గురువుని నమ్ముతాడు. అతను పెళ్ళి చేసుకుంటే మగపిల్లవాడు పుడితే దశ తిరుగునని చెబుతాడు. అతను గౌరి అనే అమ్మాయిని పెళ్ళాడతాడు కానీ ఆమె బాగోగులు పట్టించుకోడు. గౌరి గర్భం దాల్చిందని తెలిసి ఆకాశమంత పొంగి గరువు చెప్పింది నిజం కాబోతుందని ఆన పడతాడు. కానీ ఆడ పిల్ల పుట్టిందని తెలిసి భార్యా బిడ్డలను పుట్టింట వదిలి వేస్తాడు. పెద్ధలు ఎంత సర్ధి చెప్పినా వినడు. గౌరి మనసు గాయపడి కుమిలి పోతుంది. కానీ పసిబిడ్డ లక్ష్మి నవ్వులు చూసి కర్తవ్యం గుర్తుతెచ్చుకుని ఆడపిల్ల ప్రాముఖ్యతని తెలపటానికి అష్ట కష్టాలు పడి ఆత్మస్థర్యంతో లక్ష్మిని చదివిస్తుంది. తల్లి మనసు గ్రహించిన లక్ష్మి బాగ చదివి అంతరిక్షంలోకి వెళ్ళడానికి అర్హత సాధిస్తుంది. దేశం మొత్తం గర్వ పడేలా చేస్తుంది. అప్పుడు ఆ తల్లి బిడ్డలకు కలిగిన మర్యాద, గౌరవం, సంతోషం చూసి ఆడ పిల్ల వుంటే అష్టలక్ష్ములు వున్నట్లేగా అని తెలుసుకుని తను చేసిన తప్పుకు కుమిలిపోయి క్షమించమని వేడుకుంటాడు. క్షమాగుణం స్ర్తీ సహజమే కదా.
***
ఆమె నది...
గలగలాపారుతూ జీవితంలో
ఎదురయ్యే ఆటుపోట్లకు ఎదురునిల్చి
విజయశిఖరాలను అధిరోహిస్తుంది.
ఆమె నది...
కష్టాలను,కన్నీళ్ళనీ తనలోనే
ఇముడ్చుకొని అందరికి
ప్రశాంతతను అందిస్తుంది.
ఆమె నది...
తనపై ఆధారపడేవారికి
బాసటై నిలుస్తుంది.
తనవారికి కీడుతలపెట్టేవారిని
ఉప్పెనై కబళిస్తుంది.
ఆమె నది...
తన పయనంలో ఎదురయ్యే
ప్రతిబంధకాలను అనుబంధాలుగా
మార్చి నీటిబొట్టులా తనతో
కలుపుకొని పయనిస్తుంది.
నీవేనాడైనా నా మనసు పుస్తకాన్ని
పూర్తిగా చదివావా
చదివితే తెలిసేది
దాని ఆవేదన ఏంటో....
వెళుతూ వెళుతూ ఆగి
ఒక పేజీ అయినా తిప్పావా
తిప్పి చూస్తే తెలిసేది
దాని ఆరాటమేంటో....
ఒక్క క్షణం అందులోని అక్షరం
మీదనైనా నిలిచిందా నీ చూపు
నిలచి చూస్తే తెలిసేది
దాని బాధేంటో.....
పుస్తకం లోని ప్రతిపేజీ
ప్రతి అక్షరం నీకోసం
తహతహలాడుతున్నాయి....
నీతో ఒక సుదీర్ఘ సంభాషణ
జరపాలని తమలోని
సంఘర్షణ నీతో పంచుకోవాలని ....
అందమైన బంధాన్ని
పటిష్టం చేసుకోవాలని
నిశీధి పరదాలను తొలగించి
ఆనంద తీరాలకు చేరాలని....!!
ఆ. వె
వంట యింటి లోన వయసంత గడిపింది
మగని మాటకేమొ మారాడ కుండయు
అత్త మామ లందు నధిక భక్తి కలిగి
నడచు కొనిన దామె నాటి మహిళ
ఆ. వె
మగని తోని పాటు మగువ తెగువచూపి
అన్ని కార్యములకు నంది వచ్చి
అతివ యెపుడు సబలె నబల కాదని తెల్పి
తెగువ చూపు నామె నేటి మహిళ
ఆ. వె
ఉన్న బట్ట తోనె వొళ్ళంత కప్పింది
సిగ్గు బిడియము లతొ శిరసు వంచి
కట్టు బొట్టు లందు కమనీయతయు నింపి
తల్లి దండ్రి కలిమి నాటి మహిళ
ఆ. వె
అంతరిక్షమందు నడుగు పెట్టిన దామె
రాష్ట్ర పతి పదవలంకరించె
క్రీడ లందు నామె కీర్తి గాంచిన దాయె
ఏలికైన దామె నేటి మహిళ
ఆ. వె
పంట పొలము లందు పశుల పాకల యందు
భర్త తోడ తాను భరము మోసె
కాయ కష్ట మందు కలిసి నడచినామె
ధరణి కాభరణము నాటి మహిళ
ఆ. వె
చదువు సంపదందు సరిగ తూగిన దామె
బాధ్యతందు నామె భాగ మాయె
పరుగు పరుగు నామె పనులన్ని చేసియు
సాటి లేని దాయె నేటి మహిళ
అతడు ఆమెను 'అబల' అని తీర్మానించాడు.
ఆమె 'అబల' వలె బ్రతకాలని నిర్దేశించాడు. ఆమె 'అబల' గానే ఉండిపోవాలని శాసించాడు.
ఆ 'అబల' కడుపున పుట్టినా తాను బలవంతుడినేనని గర్వపడ్డాడు.
ఆ 'అబల' ఒడిలోనే పెరిగినా తాను బలహీనుడిని కాదని జబ్బలుచరిచాడు..
'అబల' ముందు అసమర్దతను చూపించలేక అహంకారమనే ముసుగేసుకున్నాడు..
గుండెబలం సరిపోక మేకపోతు గాంభీర్యాన్ని ముఖమంతా పూసుకున్నాడు. సమస్యలు ఎదురైనప్పుడు మద్యాన్ని ఆశ్రయించాడు..
'అబల' ముందు ఓటమిని అంగీకరించలేక నిరంకుశత్వాన్ని అలంకరించుకున్నాడు. బాధ్యతలు పెరిగితే 'అబల' వల్లేనంటూ నిందలు మోపాడు.
సౌఖ్యాలు తగ్గితే 'అబల' తప్పేనంటూ ఆగ్రహించాడు.
గెలిస్తే తనబలం అనుకున్నాడు.
ఓడిపోతే 'అబలే' కారణమన్నాడు.
అణకువ మాటున దాగివున్న 'అబల' ఆత్మబలాన్ని చూసి అసూయ చెందాడు. ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ తనలోని మనోదౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకున్నాడు. చివరికి ఆమె 'అబల' కాదన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆమెకు కన్నీళ్లు మిగిల్చి సంతృప్తి చెందాడు..
మన సరాగాల సయ్యాటను వీక్షించుటకై
నిలువెల్లా కనులతో దోబూచులాడుతోంది రేయి
ఆ సరాగాల మధురిమల జ్ఞాపకాలను
నెమరువేసుకుని పులకించి పోవాలని ఉవ్విళ్లూరుతోంది పగలు.
నీ స్పర్శ కోసం తహతహలాడే
ఈ తనువి తపన ఈ రేయి భరిస్తుందా!
నీ నిర్లక్ష్య వైఖరి ఆనవాళ్ల వేదనని
ఈ పగలు పలకరిస్తుందా!
నా కంటి చెలమ చెక్కిల్లను దాటి నా యదలను తడుపుతూ ఉంటే, తన ఒడిలోకి తీసుకున్న
ఈ రేయి సాక్ష్యం గా నిలిచింది.
నా నిశ్శబ్ద మౌనం నీ నిరాదరణకు ఆనవాళ్ళు
ఈ పడతి పరిమళాల కోరికల సెగలు
నీ నిద్రకు భంగం కలిగించ లేదా!
సిగ్గుతో నీ ఎదుట కూడా పైట జార్చని
ఈ కోమలి కోరిక నీకు కానరాలేదా!
గొంతులోకి ఇంకిపోయిన కన్నీటి చారికలు సముద్రపు నీరే చాలవు అంటున్నాయి
మూడుముళ్ల బంధంతో, పెళ్ళినాటి ప్రమాణాలతో ఇదే! "నా" జీవితం అనుకున్న నాకు
"ఇదేనా?" జీవితం అన్న ప్రశ్న మిగిలిపోయింది.
ఈ ప్రపంచమంతా
మన అస్తిత్వానికి ఆనవాళ్లే
అయినా
అడుగడుగునా
ఎదురయ్యేవి సవాళ్లే
అందరూ అయినవాళ్లే
అయినా
మన అడుగెప్పుడూ
వెనకే ఉండాలని
శాసించేవాళ్లే
సమస్యోదయాన నిలచి
ఓటముల కంటకాలు విరిచి
స్వాభిమాన కందకాలు తొలిచి
స్వయంకృషీ సౌధాలు గెలిచిన
కళాయి లేని అద్దాలం కాకూడదు మనం
అందం ,ఆనందాలకు
అచ్చమైన నిర్వచనాలం
నిప్పులాంటి ఆత్మశక్తి
నివురుగప్పబడిన ఆంజనేయులం
ఎవరూ చేయందించకున్నా
ఎదిగే చూపించే తెగువ
మనకు ఊతకర్ర కావాలి
ఎవరో దించాలని చూసే
మన అభిమానం
అందనంత ఎత్తుకెదిగి
అద్వితీయమై వెలుగొందాలి
ఇది మానవారణ్యం!
బలహీనులపై బలవంతుల జులుం!
అవసరమైతే పీపీలకమై
అత్యవసరమైతే
బెబ్బులిగా మారినపుడే
ఇక్కడ మనుగడ సాగించగలం
మెత్తని మనసు ఒరలో
సుతిమెత్తని పంచ బాణాలకు తోడుగా
ఆగ్నేయాస్త్రాలతో
అంధకార బంధురమైన సమాజాన్ని
గెలిచే అసలు కిటుకు నేర్వాలి మనం!!
...............
JAN 2022
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు