కవితలు

కవితలు

కొడుకా...

కొడుకా...

ఎట్లున్నవో.

మీ అమ్మ

కంటికి పుట్టెడు దారలు కారుతున్నాయి

నీ జాడ కోసం.

 

కొడుకా.. ఓ కొడుకా

కండ్లల్ల నీరూపే మెదులుతుంది

కాళ్ళల్ల చేతుల్లో తిరిగినట్లున్నది

చాత కానీ ముసలి దాన్ని

కండ్లు లేవు

కాళ్ళు లేవు

నువ్వు యాడ ఉన్నవో చూద్దామన్నా.

 

ఏ యమ కింకర్ల చెరలో చేరితో

ఏ చిత్ర హింసల కొలిమిలో

కాగుతున్న వాడివో కొడుకా.!

 

కొడుకా

అవ్వకు చిన్నొడివి

బుద్దులు నేర్చినొడివు

అందరిలో కలుపుగోలుపుతనము ఉన్నోడి

నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు

కన్నీళ్ళ బాటను తెస్తివా కొడుకా

 

ఏ గ్రహణం వెంటాడింది నిన్ను

అమ్మకు కొడుకు యెడ బాటు

చెరసాలనే నీన్ను బందీని చేసేనా

కొడుకా...!!

 

కొడుకా

నీ ప్రేమగల్ల మాటను

నీ రూపును

నేను కన్ను మూసే లోపు చూస్తానా..!?

అవ్వ అన్న పిలుపు

అమ్మమ్మ అనే నీ ఆప్యాయతను

నా గుండెలకు హత్తుకొని

నా కండ్ల నిండా నీ రూపాన్ని

మీ అమ్మతోడు చూసుకొని

మా అమ్మ చెంతకు పోతాను కొడుకా..

 

కొడుకా

రాళ్ళ మీద పూలు పూసే రోజులు రావాలి

మీరు చల్లగ బతుకుండ్రి కొడుకా..

 

(అమ్మమ్మ గంగవ్వ బాధను చూడలేక, అక్రమంగా అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైళ్లలో ఉన్నప్పుడు అమ్మ ములాఖాతుకు వచ్చిన సందర్భంతో (feb 8,2019)పాటు,చివరగా (Feb 17,2022) అమ్మమ్మను చూసి అప్పటి జ్ఞాపకాన్ని ఇప్పటి తల పోతాను కలుపుకొని అమ్మమ్మ మాటనే ఇలా రాసుకున్నది......)

 

 

కవితలు

ధీర..

తనకు ధైర్యం ఉంది..

అందుకే వందలమంది మందగా

హక్కులకు అడ్డుగా వచ్చిన

గొంతెత్తి అరిచింది..

 

ఆధిపత్యం పై

ధీక్కారం ప్రదర్శించింది..

 

అణిచివేత పై

ఆయుధం అయింది..

 

కాషాయోన్మాదాన్ని

కసితీరా దిగ్గొట్టింది..

 

అలుముకున్న చీకటి కి

చివాట్లు పెట్టింది..

 

ఆమె పట్ల సానుభూతి

ప్రకటించడం మన పని కాదు..

 

ఆ ధీర నిరసన లో భాగం కావడం

మన బాధ్యత....

 

"అల్లాహ్ హు అక్బర్" దైవం కోసం

పిలుపుకాదిప్పుడు..

ఫాసిస్ట్ రాజ్యంపై పోరాటం..

 

 

        09/02/2022

(For the Solidarity Of Hijab and Muslim Girls)

 

 

 

 

 

           

           

కవితలు

మరిచిపోకు....

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

కాసిన్ని తెల్ల గులాబీలుంటే తెంపుకురా

యుద్ధంలో మరణించిన మనవారి సమాధులపై ఉంచి

ఓ.. కన్నీటి నివాళినర్పిద్దాం

 

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

నెత్తురంటని మట్టుంటే మూటగట్టుకురా

పోరుకు బలైన ఆత్మీయుల గురుతుగా

ఇంటిముందర ఓ మల్లె మొక్క నాటుదాం

 

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

చెమ్మగిళ్ళని కళ్లేవైనా ఉంటే ఓ ఫోటో తీసుకురా

తనివితీరా నా యదలకద్దుకుని

నీ పడక గదిలో వేలాడదీస్తా

 

సైనికుడా...

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

గాయపడని తెల్లపావురమేదైన ఉంటే పట్టుకురా

యుద్ధంలో అలసిపోయావు కదా!

దానితో ఆడుకుని కాసింత సేదధీరుదువు

 

సైనికుడా...

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

శవాల మధ్యన ఆనంద గీతమాలపించే

ఆత్మీయ గొంతెదైనా ఉంటే రికార్డ్ చేసుకురా

నిదురపోయే వేళ నీకు జోలపాటగా వినిపిస్తా....

 

(రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని నిరసిస్తూ....)

 

 

 

 

 

కవితలు

ఏమని రాయను - మీరెవరంటే...

నా అక్షరాలకు ఆనవాళ్లు

మీరని రాయనా....

నా ఆలోచనలకు ఆదర్శాలు

మీరని రాయనా....

 

తిరగబడేతనమంటేనే తెలియని నాకు

ధిక్కారస్వరాన్నిచ్చి

పోరాటపటిమను నేర్పింది

మీరని రాయనా... !!

రేపటి తరానికి  - ప్రశ్నించేతత్వానికి

వారధులు మీరని రాయనా...

 

ఏమని రాయను

మీరెవరంటే.....!

ఎంతని రాయను

మీరెవరని అడిగితే....!!

 

రెక్కలిరిగిన పక్షులను

గగన విహంగాలను చేసిన

అరుదైన వైద్యులు మీరని రాయనా....

 

రెక్కలిరిచిన రాబందుల మీద

సమర శంఖాలు పూరించేలా

విప్లవాభ్యాసం చేసింది

మీరని రాయనా....!!!

 

ఏమని రాయను

మీరెవరంటే

ఎంతని రాయను

మీరెవరని అడిగితే.....!!!

 

స్వేచ్ఛ నిషిద్ధమైన నేలమీద

నిర్భయంగా పోరాట పిడికెళ్ళెత్తింది

మీరని రాయనా ...!!

 

నవ్వులే నిషిద్ధమైన నేరమీద

నిర్భందాన్నే నవ్వుల్తో తెంచేసింది.

మీరని రాయన.....

 

ఏమని రాయను

మీరెవరంటే

ఎంతని రాయను

మీరెవరని అడిగితే....

 

విప్లవ గురువులైన

వరవరరావు  అభిమాని 

కాశీం సార్ శిష్యుడు  

 

 

కవితలు

యుద్ధం

ప్రపంచ దేశాల

అధికార దాహానికి

రోజుకో దేశం

తన సుందర భసవిష్యత్తును

శిథిలాల్లో దాచుకుని

ప్రపంచ ఆధిపత్యాన్ని

శవాల గుట్టల్లో వెతుకుతూ

ప్రజల నెత్తుటితో

మరణ వాంగ్మూలం

రాస్తున్నది యుద్ధం

కవితలు

ఈ సమాజానికి

ఈ సమాజానికి నువ్వా - నేనా కాదు

నువ్వు నేను కావాలి.

బలం - బలహీనత కాదు

భాద్యత కావాలి.

సొంతం - పంతం కాదు

చెడు పై అంతం కావాలి

My dear comrade

You are a dynamite

Make your path wide and bright

Decide and activate

The power within you

For a better visionary side

And make the country pride.

           

కవితలు

కావాలి  

మతోన్మాదమెంత

మొరిగినా

రవ్వంత బెదరని

చూపులు

కావాలీ లోకానికి

 

నిషేధాజ్ఞలెంత

నీల్గినా

నిన్నుగా నిలబెట్టే

నినాదమే

కావాలీ జగానికి

 

విద్వేషమెంత

రెచ్చినా

భిన్న సంస్కృతుల

ప్రేమించే రాజ్యాంగమే

కావాలీ దేశానికి

 

09.02.2022

 

 

 

 

 

 

 

 

 

 

కవితలు

పల్లె బాలుడి దినచర్య

ఆడుకునే నన్ను పిలిచి

అవ్వ

సద్దిగిన్నింత చేతికిచ్చి పొద్దేక్కుతాంది

అయ్య

ఆకలికి

అలమటిత్తడని

పొలానికి సాగనంపింది

తొవ్వపొంటి

ఆటపాటలతో

పొలం చేరేసరికి

దాహమేసిన జింకపిల్ల

ఏరు కోసం ఎతుకుతున్నట్లు అయ్యా నా వంక చూసి

 కోడెలను దూపకిడిసి

ఆరంఎక్కి  సద్దనారగించి గొడ్లకు ఏలాయే

బిడ్డ

జాగ్రత్త అంటూ

ఇంటికి పయనమవ్వగా

అలసిన నేను

మంచెక్క గానే

అడవి నుంచి వచ్చే

పక్షుల రాగాల

సూర్యోదయ కిరణాల

సెలయేటి సరిగమలు

నన్ను జోల పాడి

 నిద్రపుచ్చాయి

చేను కంచలో శబ్దం

లేచి చూస్తే నిశ్శబ్దం

ఒడ్డు దాటి గొడ్డు చేనులో...

నిద్రలో కల నిజం

మంచదిగి

 గొడ్డును చేను దాటించే సరికి అడవి నుండి గొడ్లడెక్కల శబ్దం సూర్యుడు నిద్ర కోసం

 కొండ చాటు పయనం

బంధించిన ఖైదీకి

బేయిలు వచ్చినట్లు

పాటలతో

 నేను ఇంటికి పయనం

 

కవితలు

ఒకటి  "నేను".....రెండు " నీవు లేని నేను"...

వాడేదో..వాడికేదో ....
లోపల...బయట
ముందు...వెనుక
లోపమో?... శాపమో?
భారమో?..నేరమో?

ఆ రెండు పదాలకే అల్లుకొని
పూత లేయని శబ్దాలకు
చిగురించని తరంగాలకు
చెవులు నోళ్లు తెరుచుకోవడం
అవసరమో?...అగత్యమో?...

పుస్తకంలా...మస్తకంలో
పుట్టుమచ్చలా....మనసుముద్రలో
ఆ పదాల గుర్తులే
కళ్లకు గుచ్చుకునే బాధలు.

వాడేదో......వాడికేమిటో
నేల గిట్టడం లేదు..
నింగి నచ్చడం లేదు..
వానతో మాట్లాడడు
తేమతో కలిసుండడు.

ఆ రెండు పదాలే
ప్రకృతిని శత్రువుగా
తనను మోసగించుకోవడమే
రుచి ముందు
ఆకలి మారిపోయింది
దప్పిక దూరమైనది.

ఆకారం మార్చుకొని
ఆలోచన కొట్టే  దొంగదెబ్బకు
ప్రత్యక్ష సాక్ష్యాలైన
అరుపుల్లేని బాధ
ఆవిరౌతున్న కన్నీరు
సొంత దేహంలో
పరాయిలా తప్పించుకుని
ఎప్పుడూ చివరే ఉంటాయి.
ముందుకొచ్చి కాపాడింది లేదు.

ఎంత లోతుకు మునిగాడో
ఈ మాటల గజఈత ...
ఏ ఒడ్డుకు తేలేనో..
ఏ అర్థం ఎప్పటికో...

ఏ దూరం పిలుపో
ఈ అడుగుల అలసట
ఏ వేళకు ఈ దప్పికను
ఏ గమ్యం తీర్చునో...

దారివ్వండి వాడికి.
కెరలించడం దేనికి?
జరుగుతున్న కాలాన్ని
వాడిలోనే జారనీయండి.

జాలితో మనసుని
చిలికి చిలికి చంపొద్దు
ప్రేమ మనిషిలో
పొగిలి పొగిలి  పారనీయండి.

ప్రశ్నలతో  గుండె తలుపు కొట్టొద్దు
కాలంలోని జుట్టుపట్టుకొని ముంచొద్దు. కసిగా చూడద్దు..
కక్షను నేర్పద్దు..

బయటకు లాగొద్దు
బయటపడేద్దు
చీకటి చిత్తడిలో కూరుకపోతే
వెలుగు వెలికి వెలివేస్తే
ఆ పాపం గొంతులో కట్టడి కాదు.

ముక్కలైన ముఖంలో
ఆనందాలను వెతకొద్దు
ఒక్కడిని చూసి
వెన్నుపోటు పొడవద్దు.

సందుచూపులతో
మర్మాలను మరిగించి
ముఖాలపై పోయొద్దు.
మనసులు మాడ్చద్దో.

వాడేదో
వాడిలోఏదో
ఈ కాలపరీక్ష  వ్రాయలేక
కూరుకుపోతున్నాడు...
తేల్చుకులేకపోతున్నాడు...

జీవితాన్ని మరణిస్తూ
బతుకుతున్నాడు..
బతుకును చంపుకుంటూ
జీవిస్తున్నాడు...

పొందిన ఆ రెండు పదాలకు
అర్థాలను వెతకలేని అనుభవం
చేతకాక చేతులు కట్టుకున్నా

ఆ రెండు పదాలు కింద పడ్డ
చచ్చిపోయిన ఆ నిజమంటే
ఇప్పటికీ ఇష్టమే..

..

 

కవితలు

సూరిగోడు చేదబావిలో

సూరిగోడు చేదబావిలో

 "పాతాళభేరి" వేశాడు

బిందెలు బొక్కెనలు 

చేంతాళ్ళు చానా వచ్చాయి

ఊరూరంతా వుండజేరి 

వారోరి సామాన్లు ఏరుకొని 

ఇండ్లకు పోయినారు 

పరంటన పొద్దుగుంకతావుంది

సూరిగోడి కాలికి 

నా కంచుబిందె తగిలి ఖంగ్మంది

చీకట్లు ముసరతావుండాయి 

యీదరగాలీస్తావుంది

నా పైట గాలికెగిపోయింది 

సూరిగాడు చూపులు 

యాడో చిక్కుకున్నాయి 

క్షణంలో నే పైట సర్దుకున్నా

నా కళ్ళు 

సిగ్గుతో వాలిపోయాయి

మా అమ్మ అరుపుతో

నా గుండె గుభేళ్లంది

కంచు బిందెను ఎత్తుకుంటుంటే

సూరిగోడి వూపిరి వెచ్చగా తగిలింది

వాడెప్పుడూ గొంతిప్పి చెప్పనూలేదు

నేనూ నా గుండెలోని 

మాటను వినిపించనూ లేదు

ఊరిడిచొచ్చి ఎన్నోయేళ్ళు గడిచినా

ఏ పాతాళభేరి వేసి లాగినా

నా గుండెపాతాళంలో 

దాగిన వాడి జ్ఞాపకం 

గుండెసడిని వీడి బయటికి రాదు !

 

 

కవితలు

ఉద్యమ బావుటా

  నేను.. సావిత్రీబాయిని

  స్త్రీ విముక్తి వ్యూహానికి కేంద్ర బిందువును

  సనాతన పిడివాదుల మత మౌఢ్యాన్ని

  ధిక్కరణ పిడికిలితో మట్టికరిపించిన ధీరవనితను

  అసమానతలు మొలిచిన ముళ్ల సంస్కృతిలో

  విద్యయే ఆయుధంగా

  ముందుకురికిన చైతన్య సెగను 

  బాలికల విద్యకై పోరుసల్పి

  విద్యాలయాలు నెలకొల్పిన శారదమ్మను

  భర్త ఒడిలో అఆ లు దిద్దుకున్న తొలి ఆడపిల్లను

  సాటి మగువలకు అక్షరాల అడుగులు నేర్పిన

  ఆదర్శ అధ్యాపకురాలిని

  అంధకార సంకెళ్లను తుంచుకొని

  కులవివక్షపై కన్నెర్ర జేసిన సమరశంఖాన్ని

  అతివలను అణచివేసే అహంకారానికి

  ఎదురుతిరిగిన ఎర్ర కాగడాను

  దురాచారాలను దాటి నడిచిన

  తొలితరం నాయికను

  కట్టుబాట్ల కంచెలను కలంకత్తితో దునుమాడి

  నవశకానికి నాందిపలికిన నవకవితను

  మృగాలను తరిమికొట్టే మనిషి హక్కుల కోసం

  పైకెగసిన ఉద్యమ బావుటాను..!

 

                      *****

( సావిత్రీబాయి ఫూలే..191 వ జయంతి సందర్భంగా ..)

 

   -

 

కవితలు

ఆకలి జోలె

జోలెకు

అటు అతడు

ఇటు నేను..

 

మా ఇద్దరి మధ్య

జోలె పెరు ఆకలి..

 

అల్యూమినియం బిళ్ళ కోసం

ఇద్దరిని దేహీ అంటూ అడిగింది

దేశ భవిష్యత్తు..

 

జోలెకు అటువైపు వ్యక్తి..

ప్రభువు దుఃఖంతో నిండిన

దరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..

ఇటు వైపు నేను..

వస్తే ఛిద్రమైతూ

మన

మద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను..

 

రాం, రహీం,జీసస్

ఎవరచ్చిన అంగట్లో

అర్థకలితో,ఆర్తితో  పోటీపడుతున్న

భవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?

అంతటి ధైర్యం చేస్తారా..?

(కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)

      -

కవితలు

నిర్ణయించుకో

వ్యవస్థ స్త్రీని వ్యర్థంగా చూసిన వేళ

తల్లి జాతికి చెందిన అమ్మాయి కి

నువ్వు రక్షణ గా ఉంటే

మీ అమ్మ కడుపు చల్లగుండ అంటుంది

 

అదే అమ్మాయి కన్నీళ్లకు కారణమైతే

మీ అమ్మ కడుపు కాల అంటుంది

నిర్ణయించుకో మిత్రమా......

వివక్ష చూపి నీచుడివి అవుతావా...?

వివక్షను ఎదిరించడం లో భాగమవుతావా ...?

 నిర్ణయించుకో మిత్రమా.......

 నీకు ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మని ఏ స్థాయిలో ఉంచాలో ...

కవితలు

ప్రశ్న

మన సరాగాల సయ్యాటను వీక్షించుటకై

నిలువెల్లా కనులతో దోబూచులాడుతోంది రేయి

సరాగాల మధురిమల జ్ఞాపకాలను

నెమరువేసుకుని పులకించి పోవాలని ఉవ్విళ్లూరుతోంది  పగలు.

నీ స్పర్శ కోసం తహతహలాడే

తనువి తపన రేయి భరిస్తుందా!

నీ నిర్లక్ష్య వైఖరి ఆనవాళ్ల వేదనని

పగలు పలకరిస్తుందా!

నా కంటి చెలమ చెక్కిల్లను దాటి నా యదలను తడుపుతూ ఉంటే, తన ఒడిలోకి తీసుకున్న

రేయి సాక్ష్యం గా నిలిచింది.

నా నిశ్శబ్ద మౌనం నీ నిరాదరణకు ఆనవాళ్ళు

పడతి పరిమళాల కోరికల సెగలు

నీ నిద్రకు భంగం  కలిగించ లేదా!

సిగ్గుతో నీ ఎదుట కూడా పైట జార్చని

కోమలి కోరిక నీకు కానరాలేదా!

గొంతులోకి ఇంకిపోయిన కన్నీటి చారికలు సముద్రపు నీరే చాలవు అంటున్నాయి

మూడుముళ్ల బంధంతో, పెళ్ళినాటి ప్రమాణాలతో ఇదే! "నా" జీవితం అనుకున్న నాకు

"ఇదేనా?"  జీవితం అన్న ప్రశ్న మిగిలిపోయింది.

 

 

 

కవితలు

దాసోహం

నమ్మలేని
రహస్యం వాళ్ళ తీరు.

మనసులు నిర్మించుకున్న
కలల కోటలో
కిక్కిరిసిన రాత్రులు

సముద్రం సహితం
చూడని లోతును
ప్రేమలో చూసి ...

భరించలేని ఆశ్చర్యాన్ని
భూమితో
పంచుకుంటే...

సహనాన్ని అస్త్రంగా
ప్రయోగించిన
భావఫలితం...

ప్రేమకు దాసోహం
 " మనిషి, మనసు, మనుగడ".

             * * *

 

కవితలు

ఆమెను చూసావా

నువ్వు ఉదయాన్నే పచ్చి శ్వాసకై

సముద్రపు ఒడ్డుకు వెళ్ళి ఉంటావు

 

రెక్కలు విప్పి హాయిగా 

నింగిలో గిరికీలు కొడుతున్న పక్షులు

కనపడ్డాయా నీకు

 

బంధించిన గదుల నుండి

బయటపడ్డాననుకుంటూ 

నీకున్న స్వేచ్ఛనే

మరింతగా  రుచి చూద్దామనే

ఆరాటం నీది

 

ఒకసారి చెవినొగ్గి విను

సముద్రం ఘోషిస్తూ 

తనదైన భాషలో

నీతో ఒంటరిగా

సంభాషించాలనుకుంటుంది

 

తన లోపల గుట్టుగా

దాచిన రహస్యాలను

నీకు చూపాలని

ఎంతో ఆరాటపడుతుంది

 

ఎన్నాళ్ళుగానో  

లోపల పోటెత్తుత్తున్న సునామీలతో

పోరాడిన వైనం

నీకు వివరించాలనుకునే

తపన తనది

 

ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతూ

నీకు చేరువవాలనే ప్రయత్నంలో

తలమునకలౌతున్న తనని చూస్తే

నీకు ఏమనిపిస్తోంది

 

తనపై నుండి తేలివచ్చే గాలి

తనలోని తడిని తెచ్చి

నీకు పూస్తోంది

గమనించావా అసలు

 

హోరున నవ్వుతున్నట్టే

అగుపిస్తున్న సముద్రం

నీటి చేతులతో

తీరంపై ఏదో దుఃఖలిపిని రచిస్తూ

మళ్ళీ తనే తుడిపేస్తోంది 

 

అలలను ఒకమారైనా

నువ్వు తిరగేసి ఉంటే

నీకు తెలియని కథ

వివరించి ఉండేది

 

నువ్వు ఒడ్డు వరకూ

వెళ్ళినట్టే వెళ్ళి

కనీసం కాళ్ళు తడుపుకోకుండా

వచ్చేయడం చూసి

నీకు బాగా దగ్గరకు

వచ్చేసిన సముద్రం

ఒక్కసారిగా వెనక్కి మళ్ళిపోయింది

 

నిరాశతో గుంభనంగా బిడియంగా

తనలోకి తాను

నీటిపువ్వులా ముడుచుకుపోయింది

 

ఒక్క క్షణమాగి

నువ్వు సరిగ్గా దృష్టి సారించి ఉంటే

సముద్రపు ముఖంలో

ఆమెను తప్పక

స్పష్టంగా చూసి ఉండేవాడివి

కెరటాల పుటలు తిప్పుతూ

ఆమె మనసును కాస్తైనా

తెలుసుకునే వాడివి కదా

 

 

 

కవితలు

తరగని నిధులు స్త్రీలు

కారే రాణుల్..

రాజ్యముల్ ఏలిరే..వారేరి?!

భారతజాతి నాగరికత సంస్కృతిని

నడిపిన  నారీమణుల 

రుధిర పాదముద్రలేవి?

 

ఊయలనుండి  వివక్షలతో కష్టాలతో

కన్నీరు కార్చిన తడి హృదయాలు

అతివిధేయతతో తమ పేగు తెగిన

వెచ్చని రుధిరంతో  నిర్విరామంగా

మానవ సమూహాల పంటలను 

పండించిన  అతివలేరి…?!

 

 ..సహనం,త్యాగ నిరతి తరతరాలుగా

ప్రవహిస్తూనే ఉంది అతివలలో

అందుకే నేమో ధరణిపై 

మానవ సమూహాల పంటలు  

పుష్కలంగా పండుతూనే ఉన్నాయి..,

 

కాలం కని పెంచిన  స్త్రీలు

 సనాతన జాతికి మూలస్థంబాలు 

ఆయాకాలపు కష్టాల కొలిమిలో కాలి

రాటుదేలిన వీరనారీమణులు

వారే తరతరాల నాగరికతకు 

ప్రతినిధులు తరగని నిధులు

వారి కఠిన జీవితాలు 

వ్యక్తిత్వ వికాస పాఠాలు?!!

*******

 

 

కవితలు

లెక్కలు

అధరణ తాపడం చేయబడ్డ చేతులు

ఆ తనువు అణువుల్లోంచి 

జాలువారే నమ్రత..భావాల నాన్యత

అనుభూతుల సౌకుమార్యం..మమతల సోయగం

అవ్యక్త సౌందర్య మామెది

 

ఊపిరి నింపి..జగతినంతా ఎత్తుకు ఆడించిన

బ్రహ్మణి తాను

 

రోజూవచ్చే తొలి మలి సంధ్య వర్ణాల్ని

సరికొత్తగా పరిచయం చేస్తుందామె

 

దారమై అనుబంధాల పువ్వుల్ను గుదిగుచ్చే

నేర్పుల ఓర్పుల పల్లకి..మమకారాల పాలకంకి 

 

చూడగలిగితే..నిండుగా ప్రవహించే ఆవేదనలు..

అచ్చాదన లేని ఆ మనసు పరిచే ఉంటుంది

 

ఆ అభిమానాల సృజన శీలిపై

దాడులు..ఆకృత్యాలు..అల్లరులు

 

ఆనందాలను లెక్కకట్టుకుంటూ

లోటును పూడ్చుకునే క్రమంలో భంగపడి 

 

అందిపుచ్చుకోలేక

ఆమె అడుగుల్లో..ఆమెను పొందనీక

ఆ మనసుకెన్నిసార్లు సిలువ లేసారో..

లెక్కలెవరు కట్టగలరు..?

 

ముద్రల్ని మోస్తూన్న

ఆ అడుగుల భారాన్ని ఎవరు తూచారు..?

 

అదో..ఆచూకీ లేని వెతల ఉనికి..!

 

ఎన్నో..బలత్కార శిశిరాలను భరించిన

ఆ చెట్టుపై ఎన్ని బంధాల పక్షులు వాలినా..ఇంకా పొదుపుకుంటూనే

కలలు చిగుళ్ళేస్తుంటుంది

సాకాలపు ఫలాలు రాకనే..రాలి నేలపాలౌతుంటాయ్

 

అపుడపుడూ

ఆ ఆశయాలన్నీ భయం లోయలో పడి

ఆనవాళ్లు కోల్పోతుంటాయి

 

మళ్ళీ ఆశల బొమ్మల కొలువును

అతి నేర్పుగా పెట్టుకుంటుంది

 

అలుసుచేసి అగ్గువచేసిన ప్రతిసారీ

వెక్కిళ్ళు పెడుతూ..బద్దలవుతూనే..కట్టుకుంటుంది

 

గుహలను గృహాలుగా మలచిన

ఆమె వెంటే..నడచిన ఒకనాటి మానవ సమాజం

 

అంచెలంచెలుగా చేజారిన..ఆ మాతృస్వామికం

 

ధూషణల తిరస్కారాల ముళ్ళు గుచ్చి గాయం చేస్తున్న

ఆ ఆధిపత్యపు అంపశయ్యపైనే తను

 

నరుక్కుంటున్న..తాము కూర్చున్న కొమ్మ ఆమేనని

వాళ్ళకింకా తెలియదు

 

ఊపిరి సలపనీయనీక ఉక్కిరిబిక్కిరి చేస్తున్న 

పరిది పరిమితుల నుంచీ...

కఠిన కచ్చడాల నుంచీ..

ఇనుప కౌగిళ్ళనుంచీ..

తనను తను విముక్తించుకుని..

 

తన వేదనల అగాధాలను

అంచనా వేసుకోవడం.. ఇపుడిపుడే నేర్చుకుంటోంది

తన జీవన మడిలో..తనకోసం

కాసిన్ని చిరునవ్వుల నారును నాటుకుంటోంది

 

కవితలు

అవసరమే ఎవరికైనా..!

కాలంతో..
భూగోళంతో కలిసి నడవడమే
అప్డేట్ అవ్వడమంటే..!

ఆకులు రాలాయనో
సాయంసంధ్య ఎదురొచ్చిందనో ముడుచుకోక
తాజాగా చివుర్లను మొళిపించుకోవడం
అవసరమే ఎవరికైనా

రాగంలో రాగమై వర్ణంలో వర్ణమై
అడుగు కలపి సాగితేనే
సరికొత్త కాంతులమై ప్రజ్వలించేది.

పరిణామక్రమాన్ని అంగీకరించిన
ఒకనాటి అగ్నిశకలమే
ప్రాణిని ఆవిష్కరింప చేసిన జీవగ్రహం

తనను తాను
సంస్కరించుకోకుంటే ఇంకేముందీ
పుట్టలు పెరిగి పాకురుపట్టి పోమూ.!?

గొంగళి పురుగు నవీకరించు కుంటేనే
రంగుల సీతాకోకై రెక్కవిచ్చేది
రాగి పాత్రలని  రుద్ధి మెరిపించకుంటే
బొగ్గుల మయమే కదా

ఎప్పటికీ ముట్టని  మంచిల్లబాయి
మర్లబడి తెర్లయిపోదూ
భూకేంద్రక సిద్ధాంతమే ఇంకా సరియైందంటూ
ఆదిమయుగాల్లోనే జీవిస్తుంటారు కొందరెందుకో
వాడకుంటే మెడదుకూడా
అంతరించిపోతుంది సుమా..!

నవీకరించుకోవడం అంటే..
రంగుల రెక్కలను అతికించుకొని
గాల్లో విహరించమని కాదు.
రంగు వెలిసిపోకుండా నీకు నువ్వు పరిమళించమని

ఒక్క మనుషులకే కాదు
సర్వోపకరణాలకు నవీకరణ ఆవశ్యకమే..!
మానవ సృష్టి మన చరవాణీ
ప్రాధేయపడుతోంది
అప్డేట్ అయ్యేందుకు అనుమతి నియ్యమని.!
ప్రాణం లేని పరికరమే
అదేపనిగా ఆరాటపడుతుంటే
నన్ను నేను నవీకరించుకోవద్దూ.!?


 

 

కవితలు

నేను నేనుగా

కనులుమూసీ కల కన్నాను

బ్రమలుతొలగీన నేను

ఇప్పుడు కనులుతెరిచి

వాస్తవాలను చూస్తున్నాను

నేను ఆడపిల్లగా

పుట్టీ పెరిగీ నా

ఆడపులిగా పెరగాలనుకుంటున్నాను

ఈ రంగుల ప్రపంచంలో

ఈబ్రమల లోకంలో

మాయల సమూహంలో

నేనిలా వుంటే నామనుగడ సాథ్యమానీ నన్ను నేనే

ప్రశ్నించుకున్నాను

అమ్మ పొట్టలో వూపిరీ

పోసుకుంటున్నప్పుడే

నా జీవన సమరం మొదలు

అల్ట్రా సౌండ్ కోరలకు

చిక్కకుండా

తప్పీంచుకునీ

ఉమ్మనీటీ ని నివాసం చేసుకుని శ్వాసించటం

నేర్చుకునీ

బయటీప్రపంచంలోకీ

వచ్ఛీన బుజ్జీమేకపిల్లనీ

రాజుగారి తోటలోకీ

మేత కోసం వెళ్లగానే

కంచెలుమేస్తున్న చేలనీ

చూసీ అవాక్కయినాను

చెట్టు మీద పండుకు

రాళ్లు దెబ్బలు తగులుతాయని

తెలియక

అమాయకంగా చెట్టునే ఆశ్రయించీన అమాయకురాలనీ

రాజ్యంఏలుతున్న

రాక్షసమూకల

రాజ్యం లో

పహరా లేనీ

ఆసరాలేనీ

మృగాల మథ్య

నేను కుందేలు పిల్లనై

గంతులువేయాలంటే

నేను ఆడపులిలా

కాలుదువ్వాల్సందే

ఉగ్గు పాలు తోకలిపి

ధైర్యం పాలు నింపీన అమ్మ

వొడీనిండా థీమా థీరత్వమే

దివిటీవెలుగులో

నాప్రయాణం సాగీంచాలంటే

నేను నేనుగా నిలబడాలంటే

నేను ఆడపులిగా మారాలి