ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారన్నది లెర్నింగయితే
ఎక్కడ దేవతలు నివసిస్తారో అక్కడ స్త్రీలు చెరచబడతారన్నది అన్ లెర్నింగ్!
మానవసేవే మాధవసేవ అన్నది లెర్నింగయితే
మనిషిని తోటి మనిషే రాక్షసుడి
కన్నా హీనంగా హింసిస్తూ దేవుడి పేరుమీద దోచుకుంటున్నాడన్నది అన్ లెర్నింగ్!
మనుషులందరూ సమానమేనన్నది అందరం నమ్మే లెర్నింగయితే
తరతరాలుగా సమానత్వం సమాధానం కోసం ఎదురుచూస్తున్నదని తెలుసుకోవడమే అన్ లెర్నింగ్!
ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళన్నది లెర్నింగయితే
అదే ప్రజాస్వామ్యంలో ప్రజలను జోకర్లుగా మారుస్తున్నారని గ్రహించడమే అన్ లెర్నింగ్!
ధర్మాన్ని నువ్వు నడిపిస్తే ధర్మం నిన్ను నడిపిస్తుందన్నది లెర్నింగయితే
అదే ధర్మం కాళ్ళు తెగి నడివీధిలో అనాథై కుంటుతున్నదని తెలుసుకోవడమే అన్ లెర్నింగ్!
భిన్నత్వంలో ఏకత్వం మన బలమన్నది లెర్నింగయితే
మతం ప్రాతిపదికన, కులం ప్రాతిపదికన సమాజాన్ని ఛిద్రం చేయడం నాయకులకు వరం అని గ్రహించడమే అన్ లెర్నింగ్!
రైతే దేశానికి వెన్నుముక అన్నది లెర్నింగ్ అయితే వెన్నెముక లేని వాడే నేటి రైతు అని తెలుసుకోవడమే అన్ లెర్నింగ్!
పుస్తకాల్లో ప్రతి అట్టమీద అంటరానితనం, అస్పృశ్యత నేరమని చదువుకోవడం లెర్నింగయితే
రోజురోజుకూ పెరిగిపోతున్న కులవివక్ష కుత్తుక కోయడానికి కొత్త కత్తులు అవసరమని తెలుసుకోవడమే అన్ లెర్నింగ్!
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రశ్నిస్తే బుల్లెట్ల వర్షాన్ని ఎదుర్కోవాల్సుంటుందన్నది లెర్నింగయితే
శరీరమంతా వందల బుల్లెట్లతో జల్లెడ పట్టినా
చైతన్య ప్రవాహాలను ఆపలేరని...
నినదించే గొంతులు వేలల్లో, లక్షల్లో పుట్టుకొస్తాయని అర్థమయ్యేలా చెప్పడమే అన్ లెర్నింగ్!
"Finally we have to unlearn everything what we have learnt so far..!"