ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
ఆశ ఓ సూర్యోదయం
భూమి చూట్టూరా క్రమ్మిన
చిక్కటి చిమ్మ చీకటి..
రాత్రి మత్తు రెప్పలపై
నిర్వేదపు రెక్కలతో
కాలం జోగుతున్న వేళ
వెన్నలనూ వెలుగునూ
దిగమింగిన గాడాంధకారం
ఓ విలయ లయల నిశీవలయం!
హోరు గాలిలో బ్రహ్మాండమంతటా
శివాలెత్తిన నిరాశ ఝోష!!
రాళ్ళ గుండెలను పిండిచేసి
విరుచుక పడే కడలికెరటాలు
భీభత్సరసాన్ని ఓపాసనబట్టి
విరబోసుకున్న కేశాపాశాలతో
భూమండలాన్ని అలుముకుని
కరాళదంష్ట్రలతో డస్సి
విహ్వల నృత్యములో
విరాజిల్లుతోంది రాత్రి!!!
నిస్తేజంలో ప్రకృతి సమస్తం
నిద్రాణమైనవేళ ల
దేనిని లెక్కచేయని ధిక్కారంతో
ఓ ఒంటరి మిణుగురు
ఒక తుంటరిలా నర్తిస్తూ
నిర్లక్ష్యంగా కాలాన్ని ఈదుతూ
ఓ పతంగంలా ఎగిరింది!!!
అతిలిప్తకాలం తన కాంతిపుంజాల
ఉజ్వల సాంగత్యం పంచి
గాలి అలలపై ముందుకు సాగింది!!!
రాతృలలో కెల్లా భయంకరమైన
గాడాంధకారపు రాత్రి ఒడిలో
ఒంటరిగా నన్ను వీడి వెళ్తూ
తన మిళమిళల వెలుగు రవ్వల
"ఆశ" విత్తనం నా ఎదలో పొదిగింది
చీకటికోరల కాటుకు
తలవాల్చని నేను
మిణుగురుతో ఉన్మిలనమై
తన సదాశయాన్ని తలదాల్చాను!!!
దావానలాలను కార్చిచ్చులను
ఒడి(సి)పట్టి ఎదదాల్చి
ఆటుపోటులనూ, అలజడులనూ
తన అలలజడిలో ప్రకటిస్తూ
అలవాటుగా విర్రవీగుతూ
విరిగిపడ్తున్న సముద్రపు అలలకు
ఎదుట దివిటీలానైనా దీటూగా
ఇసుకలో పాదాలను లంగరువేసి
ప్రాచీరేఖ పైకి చూపు సారించాను!
దిగ్దిగంతాల్లో నిండైన
ఓ అద్భుతం ఆవిష్కృతం!!
వేనవేల వెలుగు రవ్వలు పొదిగిన
కోటిరేకలతో అలలపై తేలుతూ
దిగంత కుడ్యంపై
"ఆశా"సుమమై వికసిస్తూ సౌరకాంతులతో విచ్చుకున్న
ఉదయబాలుడు సూర్యుడు!!!