ఎట్లాగు జనం !వాడి పారేసిన ఇత్తార్లే
ఒక్కొక్క ఈకె పీకి యిన్ని నూకలు చల్లితే
అన్నీ మర్చిపోయి మహా ప్రసాదం అని బుక్కేటోళ్ళు
భువనవిజయుడా !
నమ్మి నానపోసిన కీలకొండి మాటలకు
తీర్థం వస్తే నువ్వు గుల్లే మేము సలిలే
వాబ్బో! ఏం వాగ్ధాటి
గంగా జలం కంటే పవిత్రమనుకుంటిమీ
అచ్చం శ్రీకృష్ణ దేవరాయల ఆహార్యం
కవిత్రయానికే వంకలు పెట్టే గాత్రం
ఎన్నెన్నో గ్రంథాల గంభీరధ్యాయనం చేసిన
పండితోత్తములు కదా !
మహాసభల మాటలు సుక్కలు సూపెట్టి
పద్యాలు నేర్పించిన పండితులకే గుణపాఠాలు నేర్పినయి
చాణిక్యుడే వుంటే మీ నీతులకు
దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోయ్యేది
ఎందుకు ?మహారాజా
ఏరు దాటినంక తెప్ప తగులబెట్టే వైపు తీరు
భాషాపండితుల కడుపు కొడితే పాపం కదా నాయనా ...
"దేశ భాషలయందు తెలుగు లెస్స "పలికితిరి
తెగులు భాష ఇంగ్లీష్ పీస్ బడులలో
నోరు ఇగిలించి కొడిజివునం తోటి కొట్టుకుంటుంది
ఈ మట్టిని ముట్టుకున్నావా !ప్రభూ
ఎలా !నవ్వుతుందో మీ ప్రతిభను చూసి
ఆ నింగి వంక జర చూడు !దొర
మీ మాటలను ఎంత పరవశించి వింటుందో!
చెట్టు పుట్ట నీరు నిప్పు ప్రకృతంతా
వంగి మీ పాదాలకు ప్రణామం చేస్తున్నాయి
ఆ గడియల కోసం ఎదురు చూస్తున్నాయి
తలావొక్క చెయ్యేసి తమలో కలుపుకోవడానికి
ఇంతకు మునుపు ఆయనది పాయిరాల గుట్టల్ల పచ్చలుపచ్చలైంది అహం
రా దేవా! మాలు దిగి రా !
బడి పంతుల్లు అంటే మీ బానిసలు కాదు
భవిష్యత్తు నిర్మాతలు
వాళ్ళ వుసురు తలుగక ముందే
మాటలు నిలుపుకోను జర మనిషివై మందిలకు రా!