కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

శ్రావణసంధ్య

లిఖించుకో మళ్ళీ నీ తల రాతను నువ్వే

స్పృశించుకో  తిరిగి నీ జీవితాన్నీనువ్వే

మన జీవితమంతా సృష్టికర్త

ముందుగా రాసిపెట్టిన కవనమే అయినా

నీకోసం ఒక పుట నిలిచే ఉంటుంది

జ్ఞాపకాల గంధం లో సుమ పరిమళాలు వెదజల్లడానికో

అనుభవాల దారం లో దిష్టిపూసగా మిగలడానికో

ఏదైతేనేం నీ కోసం ఒక పుట ఉందిగా

నీకు రాసుకునే వీలుని ఇచ్చిందిగా

 

రక్తాన్ని మరిగించి ఆలోచనను కరిగించి

ఆవేశాన్ని పొంగించిన యుద్దాన్నే లిఖిస్తావో..

కారణమేదైనా నేను మనుషుల మరణానికి నాశక్తిని ధారబోసా అని పశ్చాత్తాపాన్ని అర్పణ చేస్తావో...

ఏదైతేనేం నీ కోసం ఒక పుట ఉందిగా

నీకు రాసుకునే వీలుని ఇచ్చిందిగా

 

కృతజ్ఞతని బహుమతిగా పొందిన

అమృత క్షణాలే రాస్తావో

అదే కృతజ్ఞతని అంజలిగా ఘటించిన

అద్భుత భావాలే రాస్తావో

ఏదైతేనేం నీకు ఒక పుట ఉందిగా

నీకు రాసుకునే వీలుని ఇచ్చిందిగా

 

మోసపోయిన కన్నీటి చాలులనే

కాగితపుపొలంపై దున్నుతావో

మోసం చెందిన అపరాధపు

జాలునే ప్రవహిస్తావో

గెలుపు కిరీటాలతో అలంకరిస్తావో

నల్లటి ఓటమి సిరాతో నింపుతావో

ఏదైతేనేం నీకు ఒక పుట ఉందిగా

నీకు రాసుకునే వీలుని ఇచ్చిందిగా

 

నీ జీవితానికి నమ్మకం ఇస్తావో

వేరొకరి బతుక్కు భరోసా ఇస్తావో

చిరునవ్వుల వర్ణ చిత్రాలే గీస్తావో

ధైర్యపు కిరణాలే ప్రసరిస్తావో

ఏదైతేనేం నీకు ఒక పుట ఉందిగా

నీకు రాసుకునే వీలుని ఇచ్చిందిగా

 

స్నేహపు రెక్కలు ఇచ్చి ఎగరమంటావో

మానవత్వపు గంధాలతో విరాజిల్లామంటావో

ఏదైతేనేం నీకు ఒక పుట ఉందిగా

నీకు రాసుకునే వీలుని ఇచ్చిందిగా

 

నిన్ను నిన్ను గా చూపించేది

నీకు మనిషితనం, మనసు ధనం అద్దేది

నీ బతుకును జీవితంగా చేసి

ప్రాణ చైతన్య పరిమళాన్నీ సృష్టించేది

ఒకే ఒక్క పుట...

 

ఎలా లిఖిస్తావో లిఖించుకో...

నుదుటి రేఖల కన్నా

చేతి గీతల కన్నా

శ్రామిక హుందాతనమే గొప్పదనే

సత్యంని చాటిచెప్పు...

నీకు రాసుకునే వీలుని ఇచ్చిందిగా


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు