కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఇప్పుడే తెలిసింది

అమాయికంగా తిరిగేవాన్ని

లోకం

అధఃపాతాళానికి

తొక్కేస్తుందని

నిజాన్ని

బట్టబయలు చేసేవాడి తలను

నిర్దాక్షిణ్యంగా

చెక్కేస్తుందని

 

నిజాయితీ మకుటాన్ని

ధరించినవాడి వెలను

నోట్లకట్టలతో లెక్కేస్తుందని

ఇప్పుడే తెలిసింది

నాకిప్పుడిప్పుడే తెలిసింది

 

తెల్లని చిరునవ్వుల చాటున

విషం మరుగుతుంటుందని

చల్లని మాటల మాటున

ఈటెలు పొంచి ఉంటాయని

ఎదుటివాడి ఉన్నతిని చూసి

ఈర్ష్యాదాహం పెరుగుతుంటుందని

ఘల్లుమనే

అందెలరవళిలో సైతం

నరరూపసర్పాల

బుసబుసలు వినిపిస్తుంటాయని

ఇప్పుడే తెలిసింది

నాకిప్పుడిప్పుడే తెలిసింది.

 

నా పునీత భారతజనని

కీర్తికిరీటాన్ని కబళించే

కిరాతకుల దురాగతాల్ని

అంతమొందించడానికి

ప్రతివాడూ

నరనరాల్లో

వైప్లవ్యగీతాల్ని

పలికించాలని

అణువణువులో

రక్తారుణ కాంతిధారల్ని

ప్రసరించాలని

పిరికితనం విసర్జించాలని

కరకుదనం సముపార్జించాలని

చండప్రచండుడై

ప్రతిఘటించాలని

అల్లూరినే

అధిగమించాలని

 

దుర్జనులను నిర్జించాలని

పర్జన్యంలా గర్జించాలని

ఇప్పుడే తెలిసింది

నాకిప్పుడిప్పుడే తెలిసింది.

 

 

  


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు